Pages

23/07/2008

కధా స్రవంతి

ప్రతి సోమవారం, డీ.డీ సప్తగిరి చానల్లోసాయంత్రం 8 గంటలకు 'కధా స్రవంతి' అని ఒక మంచి ప్రోగ్రాం ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమంలో తెలుగు సాహిత్యంలో అజరామరులు అయిన గొప్ప రచయితల, రచయిత్రుల కధలు కొన్నిటిని ఎంచుకుని, వేరే వేరే ఎపిసోడ్లుగా ధారావాహికంగా ప్రసారం చేస్తున్నారు. ఈ వారం శ్రీ త్రిపురనేని గోపీచంద్ గారు రాసిన 'ధర్మ వడ్డీ' అనే కధ ను ప్రసారం చేసారు.


అనుకోకుండా శ్రుతించి, ఈ కార్యక్రమం చూసాకా, నాకు ఈ కార్యక్రమ దర్శక నిర్మాతల మీదా, దూరదర్శన్ మీదా చాలా గౌరవం పెరిగింది. ఎందుకంటే, ఈ కధను చక్కగా బుల్లి తెరకనుగుణంగా మలిచి, ఒక పల్లె లో చిత్రీకరించి, గుండెకు హత్తుకునేలా చక్కగా తీసారు.


ఈ కధ ఎప్పట్లోనో, ధర్మవడ్డీ అనే ఒక అప్పు ఇచ్చే పద్ధతి గురించి శ్రీ గోపీచంద్ రాసినది. అప్పట్లో బాంకులు లేవు. అప్పు ఇవ్వటానికి గ్రామంలోనే ఎవరో వడ్డీ వ్యాపారం చేసేవారు. ఇష్టం వచ్చిన లెక్కలతో వడ్డీ పాపంలా పెరుగుతూ.. అసలు కన్నా మించిపోయి, అప్పు తీసుకున్న వాళ్ళ బ్రతుకులు చిందర వందర చేసే ఈ పద్ధతి మీద ప్రభుత్వానికి గానీ, సమాజానికి గానీ ఎటువంటి అదుపు లేని పరిస్థితుల్లోంచీ ఈ కధ పుట్టుకొచ్చింది.


ఈ కధ లో మన Protagonist - సూరయ్య (/సూరన్న) ఒక వడ్డీ వ్యాపారంలోకి దూకిన మోతుబరి. ఇతని తండ్రి 100 ఎకరాల మాగాణికి యజమాని గా ఉండి, చేతికి ఎముక లేనట్టు దాన ధర్మాలు చేసి, తను పోయేవేళకి కొడుక్కి కేవలం నాలుగు ఎకరాలు మాత్రం విడిచి పోతాడు. అందుకే సూరన్నకు దాన ధర్మాలు అంటే చిరాకు. అతనికున్న ఒక్కగానొక్క కూతురు పెళ్ళి చేసాడు. ఆ రోజుల్లో వడ్డీ వ్యాపారం అంటే.. ఎందరో పేదల ఇళ్ళు గుల్ల చేసి, పెళ్ళాల పుస్తెలు తెంచి, గొడ్డూ, గోదా పొట్టన పెట్టుకునే వ్యాపారం అనీ.. పాపం అనీ ఒక సెంటిమెంట్ వ్యాప్తి లో ఉండేది. అయినా సూరన్న, తన ఆస్తి ని ఇబ్బడి ముబ్బడి చేద్దామని ఉన్న పొలం అమ్మి, ఆ డబ్బు తో ఊర్లో వడ్డీ వ్యాపారం మొదలు పెట్టాడు.


అయితే, ఈ వ్యాపారం కారణంగా.. వసూళ్ళలో అతని నిక్కచ్చితనం, కౄరత్వం వల్ల గ్రామంలోనే అతనికి శత్రువులు తయారయ్యారు. ఇంతలో అతని దగ్గర రెండొందలు అప్పు తీసుకున్న ఒకానొకడు, వడ్డీ ఇవ్వనంటూ తిరగబడతాడు. ఎక్కువ మాటాడితే, అసలు కూడా ఇవ్వనని పట్టు బట్టాడు. ఇది అన్యాయం! సూరన్న కూడా ఆర్ధిక ఇబ్బందుల లో ఉన్నాడు. అతని చేతి లో డబ్బు అంతా వ్యాపారం మీద అప్పులు ఇవ్వబట్టి.. అంతా బయటే ఉంది. ఈ ఎదురుతిరగటం ఎక్కువ అయ్యాకా, సూరన్న డబ్బు అతనికి వాపసు రావట్లేదు. సూరన్న కోర్టుకు వెళ్తానని భీష్మించుకున్నా, పట్టించుకున్న నాధుడు లేడు.

సూరన్న ఈ బాధలో, దుగ్ధ లో పట్నానికి వెళ్ళి లాయరు తో మాట్లాడతాడు. అప్పు తీర్చని వాని మీద కేసు వేసి, వకీలు కి ఒక యాభయి సమర్పించుకుని, రాత్రి పూట ఇంటికి వస్తున్న అతన్ని దారి కాసి, అతని ప్రతివాది (అప్పు తీర్చని వ్యక్తి), మరికొందరు యువకులతో దాడి చేసి, డబ్బు దోచి, తీవ్రంగా కొట్టి పడేస్తారు. సూరన్న ఇంటికి ఎలాగో చేరతాడు. బయట అతనికి రక్షణ లేదు.

ఇలా సూరన్న ఊరివారి వ్యతిరేకత ఊబిలో చిక్కుకుపోయాకా, అతని అల్లుడు కూడా.. ఇంక ఆస్తి రాదని గ్రహించి, కూతుర్ని ఇంటికి పంపేస్తాడు. సూరన్న వడ్డీ వ్యాపారాన్ని ఆదినుంచీ వ్యతిరేకిస్తున్న అతని భార్య కూడా అతనిని ఆ వ్యాపారం పాపం అనీ.. ఎంతగానో నచ్చ చెప్పినా, సూరన్న మాత్రం డబ్బు - డబ్బే లోకం అనే గట్టిగా వాదిస్తున్నడు. ఇలాంటి పరిస్తితుల్లో ఏడుస్తూ ఇంటికి వచ్చిన కూతుర్ని అల్లుడింటికి పంపే ఉపాయం లేక, చేతిలో చిల్లిగవ్వ లేక, నిశ్చేష్టుడై, చెరువు గట్టున కూర్చుండిపోతాడు.

ఈలోగా, కూతురు కూడా ఒంటరిగా పొలంలో రోదిస్తుండగా.. ఊరి యువకులే కొందరు దుండగులు, సూరన్న మీద కసి తో ఆ పిల్ల మీద అత్యాచారం చేస్తారు. ఆ పిల్ల పాపం ఇంటికి తిరిగి వచ్చి, పెరటి బావిలో దూకి చనిపోతుంది. అప్పుడు విషయం తెలిసి పరిగెట్టుకుంటూ ఇంటికి వచ్చిన సూరన్న కళ్ళ ముందే, కోపావేశంతో అతని భార్య నిప్పంటించుకుని, సూరన్న ఎంత బతిమలాడినా వినకుండా ఆత్మ హత్య చేసుకుంటుంది.

ఈ అకస్మాత్తు సంఘటనలూ, అతని మనసుకు తగిలిన తీవ్ర గాయాల కారణంగా సూరన్న పిచ్చివాడైపోతాడు. అతని ఇల్లు అప్పు కింద ఇంకెవరో రాయించుకుని, అతను రోడ్డు మీద పడతాడు. రోడ్డు మీద రాళ్ళను ఒక మూటలో కట్టి, తెలిసిన వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి, ఆ రాళ్ళనే డబ్బు గా అప్పు ఇచ్చి, మళ్ళీ, ఆ రాళ్ళనే, లెక్క పెట్టుకుని, మరిన్ని రాళ్ళనే వడ్డీ (ధర్మ వడ్డీ) గా వసూలు చేసుకుంటూ.. చాలా దీన స్థితిలో బ్రతుకుతూ ఉంటాడు. ఈ కధ చూసిన తరువాత, సూరన్న పరిస్థితి మీద ఎంత జాలి కలిగిందంటే, ఇటువంటి నిజ సంఘటన జరిగి, నేను ఆపలేని నష్టం జరిగిందే అని చాలా బాధ కలిగింది.

ఈలోగా, సూరన్న కూడా ఊర్లోని పిల్లలు పిచ్చి వాడంటూ రాళ్ళతో కొట్టి తరుముతూ ఉంటే, తన ఇంటికే వెళ్ళి, తన కూతురు చనిపోయిన బావిలోనే ఒక్క గెంతు గెంతి చనిపోతాడు. అతని శవాన్ని బయటికి తీసాకా.. ఊరివారంతా అతని జీవితాన్ని తలచుకుని చాలా బాధ పడతారు.

ఈ కధ లో తండి విచ్చలవిడి దానధర్మాల వల్ల విసిగి, డబ్బు మీద ఒక అభద్రతాభావాన్ని పెంచుకున్న సూరన్న అమాయకత్వం - ఆఖరికి డబ్బు చేతే నాశనం అయిన అతని జీవితం, ఆడబ్బు (రాళ్ళూ -రప్పలే) చేతే తరమి కొట్టబడి అతను చనిపోవటం చాలా సింబాలిక్ గా రాసారు రచయిత. ఇందులో సూరన్న మీద కోపం రాదు. తన మీద ప్రజల్లో కలిగిన వ్యతిరేకతను అర్ధం చేసుకున్నా, డబ్బు మీది అభద్రత తోనే, తన వైఖరిని మార్చుకోలేకపోయిన సూరన్న ని చూసి జాలి కలుగుతుంది.


ఈ కధ, ఇద్దరు స్నేహితులు చెప్పుకున్న కధ. టీవీ లో నేను చూసిన ఒక మంచి కార్యక్రమం. వచ్చే సోమవారం కోసం తప్పకుండా ఎదురు చూస్తాను. ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు సప్తగిరి చానెల్ని అభినందించాలి.

అయితే, ఒక కధ చదివితే వచ్చే ఆనందాన్ని టీవీ ధారావాహిక ఇవ్వక పోవచ్చు. కానీ మనం చదవకుండా మిస్ అయిన మంచి కధలు ఇంత హాయిగా నాటక రూపంలో దొరుకుతుంటే.. చూసేందుకు సమస్య ఏముంది ?

11 comments:

Anonymous said...

Hmm..interesting!.
ఇది చదువుతుంటే తట్టింది. మన దగ్గర Book Review/Q&A with authors లాంటి, programs ఏమైనా వస్తున్నాయండి, ఏ చానల్ లో అయినా?

ఇక్కడ ఒక అద్రుష్టం ఏంటంటే, CSPAN (no commmercials/ads) channel లో ప్రతి వారాంతం, 48 గంటలు(శని, ఆది) పూర్తిగా "Non-Fiction Only" book reviews, interviews with authors, Public Q&A with them etc., ప్రసారమవుతాయి. Almost every topic మీద రాసిన popular/critically acclaimed పుస్తకం కవర్ చేస్తారు. కొన్ని గొప్ప, గొప్పవి పరిచయాలు అవుతాయి మనకు ఒక్కోసారి.

నేను వీలయినంత వరకు మిస్ అవకుండా చూసే program అది.

Thanks for introudcing about a book that I did not read.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

చాలా చక్కగా పరిచయం చెసారు సుజాత గారు.ఈ కధాంశంతో కొంగర జగ్గయ్య ప్రధానపాత్రధారిగా,తెలంగాణా నేపధ్యంలో ఒక సినిమా ఇదే పేరుతో వచ్చింది.దొరికితే చూడండి

అశ్విన్ బూదరాజు said...

సప్తగిరి కి మంచి ఆదరణే లభిస్తున్నదన్నమాట ఈ సారి నేను ఓ లుక్ వేస్తా

MURALI said...

కధ చదివితే అతనిలోని అమాయకత్వం కంటే సమాజంలోని కౄరత్వం కనిపిస్తుంది నాకు.

కొత్త పాళీ said...

దూరదర్శన్ ఇలాంటి మంచి పనులు చేస్తున్నందుకు సంతోషం. రికార్డు చేసే పరికరం ఉన్న మన బ్లాగర్లు ఎవరన్నా దీన్ని రికార్డు చేసి ఉంచితే, ఆ తరవాత నాకో కాపీ ఇవ్వగలిగితే చాలా సంతోషిస్తా.

సుజాత గారు .. తప్పులెన్నటం ఉద్దేశం కాదు, సరి చేసినందుకు అన్యధా భావించరని చెబుతున్నాను .. కధ కాదు, కథ. protoganist కాదు protagonist.

ప్రతాప్ said...

అర్రేర్రే..
ఈ మధ్య DD చాల ఫేమస్ అయిపొయింది. ఇందుకే అన్నమాట. అందుకే జనాలు DD ఛానల్ కూడా చూస్తున్నారన్నమాట.
ఇది ఉన్నమాటే అని మీరు చెప్పారుగా ఇక నేను కూడా చూడటం మొదలెట్టేస్తాను.

sujata said...

Thanks everybody

kotta palee garu..

Thanks once again. Meeru nannu ippatiki chala sarlu kapaderu. spellingo / padamo edo okati tappu chesestoo untanu. sarididdinanduku nenu happy. meeru nannu eppudoo correct cheyyandi. lekapote ilaa blunderlu chestoone untanu.

sujata said...

మురళి.. నాకు కూడా వీళ్ళ కౄరత్వం మీద అసహ్యం వేసింది. ముఖ్యంగా సూరన్న కూతుర్ని వారు తరమటం.. చూసి, చాలా బాధ కలిగింది. తరవాత, వాళ్ళ కోపానికి కారణం..ఈ ధర్మవడ్డీ వ్యాపారం చేసి ప్రజల పట్ల అన్యాయంగా ప్రవర్తించిన సూరన్న వైఖరి అని సర్ది చెప్పుకున్నాను. ఎవరిది తప్పు అనుకునే కన్నా, సూరన్న కేవలం నోటి దురుసుతో, పెడసరంతో, అప్పు, వడ్డీలు వసూలు చేసుకొవడానికి ఎంచుకున్న విధానాల వల్ల ఆఖరికి అతనికి ఊర్లో సానుభూతి అన్నదే లేకపోవటం + దానికి తగ్గట్టే, అతనిని దెబ్బతీసో, తుదముట్టించో అప్పు ఎగవెయ్యటానికి చూసిన మనుషుల స్వార్ధం, రెండూ కలిసి కట్టుగా ఈ పరిస్థితుల సృష్టి లో - సరిగ్గా ఎస్టాబ్లిష్ అయ్యాయనుకుంటాను.

sujata said...

CSPAN - ఈ చానల్ ఇండియాలో వస్తుందా.. మామూలు కేబుల్ ప్రసారాలలో వస్తుందా లేదా 'డైరెక్ట్ టు హోం' పద్ధతుల్లో వస్తుందా..? నేను ఈ పేరు వినటం ఇదే మొదటిసారి. మిగిలిన ప్రొవైడెర్లు (టాటా స్కై) వారు భక్తీ, సంస్కృతి చానెళ్ళు ఇవ్వరని ఆ పద్దతులు వీటో అయిపోయయి ఇంట్లో! మంచి రచనలు టీ.వీ లో అంటే, నా లిమిటెడ్ వ్యూయెర్ షిప్ అనుభవం ప్రకారం, ది హిస్టరీ చానెల్లో సోమ, మంగళ వారాల్లో ప్రసారమయ్యే జంబో మూవీ చూడొచ్చు. వీటిల్లో, ప్రధానంగా హిచ్ కాక్ సినిమాలూ, పాత కాలం నాటి డిటెక్టివ్ సినిమాలూ చూడొచ్చు. కానీ అవి కూడా నాకు తెలిసి చాలా స్టిమ్యులేటివ్ గా ఉంటాయి. మిగతా చానెళ్ళ సంగతి నాకు తెలియదు. నేను టీవీ విషయంలో ప్రస్తుతం 'భక్తి ' బాధితురాలిని.

బొల్లోజు బాబా said...

that is gopichand.
ఒక ప్రశ్నను కానీ సమస్యను కానీ అంతు చూడకుండా వదలడు. (పరిష్కారం మామూలుగానే విషాదాంతాలు గా ఉంటాయి.)
మంచి కధను పరిచయం చేసారు. ధన్యవాదాలు.

బొల్లోజు బాబా

cbrao said...

ఈ "ధర్మ వడ్డీ' సమీక్ష చదువుతుంటే, దూరదర్శన్ లో చూస్తున్నట్లుగా ఉంది. దృశ్యరూపానికి మాటలతో ప్రాణం వచ్చింది.