Pages

16/03/2015

A little Poland in India

అప్రస్తుతమైన విషయాల గురించి ప్రపంచంతో పాటూ వెర్రెక్కిపోకుండా అపుడపుడూ దూరదర్శన్ అనే టెలివిజన్ చానల్ ను శృతించి చూడడం నాకో  ఓ వెర్రి అలవాటు.  బీ.బీ.సీ నాలుగు చానళ్ళూ, ఐ టీవీ, చానెల్ ఫోర్ లాంటి విదేశీ చానళ్ళ డాక్యుమెంటరీ ల తో సాటి రాదగ్గ మంచి డాక్యుమెంటరీ ని చూసే భాగ్యం కలిగిందీ సారి.  నాకు సాధారణం గా యుద్ధ గాధలు ఇష్టం. రెండు ప్రపంచ యుద్ధాల గాధలతో వెలువడిన చిత్రాలూ, నాజీ దురాగతాల చిత్రాలూ, అత్యంత హేయమైన యుద్ధ పరిణామాలని తెలిపే చిత్రాలూ ఇష్టం. అసలు ఎప్పుడో ఇంగ్లీషు చదవడం తో కుస్తీ పడే బాల్యంలో రీడర్స్ డైజెస్ట్ లో (తెచ్చిచ్చి చదవడం అనే మంచి అలవాటు ను కలిగించిన నాన్నగారికి ధన్యవాదాలు) చదివిన ఆన్నీ ఫ్రాంక్ డైరీ ఆఫ్ అ లిటిల్ గార్ల్.. దగ్గర్నించీ కూడా హాలో కాస్ట్ కి సంబంధించిన సినిమాలూ, కధలూ ఇష్టపడడం మొదలైంది.  దానికో కారణం ఉంది.


భయంకరమైన ఆడ్వెర్సిటీ మీద మనిషి చేసే ప్రతి ప్రయత్నమూ, బ్రతకడానికి, మనిషిలా మానవత్వంతో బ్రతకడానికీ చేసే ప్రతి పోరాటమూ అత్భుతమే. ఆ వ్యధాభరిత జీవితాల్లో వెలుగు రేఖల్లా పొడసూపే ఓ చెంచాడు కరుణా, చిటికెడు దైవత్వమూ చదివి తీరవలసిందే.    జెర్మన్ ఘెట్టోలలో చనిపోయిన లక్షలాది యూదులు, ముఖ్యంగా పోలండు ప్రజలు.  హిట్లర్ ఆక్రమణలలో నిర్దాక్షిణ్య మరణాలకు గురి అయిన తరాలు.  ఇన్ని హాలో కాస్ట్ కధల్లోనూ, మన దేశం లోనూ ఒక షిండ్లర్ ఉన్నాడని తెలియని వాళ్ళే ఎక్కువ. ఈ డాక్యుమెంటరీ చూసేదాకా నా పరిస్థితీ ఇంతే.  చూసాక మాత్రం, మన దిక్కుమాలిన దేశం, దిక్కుమాలిన రేపులూ, రాజకీయాలూ, అవినీతీ అని మొహం మాడ్చుకునే పరిస్థితి నుంచి కొంచెం ఊపిరి తీసుకోబుద్ధి ఐంది. 

ఓ మనసున్న మారాజు దాదాపు 1000 మంది పోలిష్ అనాధల్ని యుద్ధ సమయంలో అక్కున చేర్చుకున్నాడు. ఆయనే గుజరాత్ రాష్త్రానికి చెందిన నవా నగర్ రాజు జాం సాహెబ్ దిగ్విజయ్ సింగ్ జీ రంజిత్ సింగ్ జీ జడేజా.   ఆయన కొన్నాళ్ళు బ్రిటీష్ ఆర్మీ లో కూడా పని చేశారు. పదవీ విరమణ చేసాక కూడా గౌరవ పదోన్నతులు పొంది లెఫ్టినంట్ జెనరల్ దాకా ఎదిగిన రాజు.   కారణం లేదా, అందుకు దారితీసిన సందర్భం ఏమో సరిగ్గా తెలియలేదు గానీ,  ఆ సమయంలో పోలండ్లోనూ, యూ.ఎస్.ఎస్.ఆర్ (నేటి రష్యా) లోనూ జైళ్ళకు తరలించబడ్డ వెయ్యి మంది పిల్లని పోలిష్ రెడ్ క్రాస్ ఈ రాజు గారి చెంత ఉంచడం జరిగింది. 1942-48 మధ్య కాలంలో ఓ వైపు తన రాజ్యం బ్రిటీష్ వారి ఆధీనంలో ఉండగా, బ్రిటీష్ సైన్యం యుద్ధం లో ఉండగా, భారత దేశంలో జోరుగా స్వతంత్ర పోరాట వీచికలు వీస్తూ ఉన్న సమయంలో తన స్వంత భద్రత కన్నా ఎక్కువగా ఆ అనాధ పిల్లల గురించే ఆలోచించిన జాం సాహెబ్ గురించే ఈ డాక్యుమెంటరీ.  అప్పట్లో ఆయన ఆశ్రయాన్ని పొందిన పిల్లలలో ఇపుడు మిగిలిన వయో వృద్ధులైన వాళ్ళ జ్ఞాపకాలు, పోలండు లో రాజా వారి పేర్న ఉన్న స్కూలూ, రోడ్డూ అన్నీ మనిషి కి లేని అవధులూ, కారుణ్యం కన్నా మించిన పెన్నిధీ ఏవీ లేవని తెలియ జెప్పేందుకు పోలండూ, ఇండియా సమ్యుక్తంగా తీసిన డాక్యుమెంటరీ ఇది. 


మనిషి కారుణ్యానికి లేని అవధుల్ని కళ్ళకి కట్టినట్టు చూపిస్తుంది. ఆకలితో, తల్లిదండ్రులూ, ఇతర సోదర సోదరీ మణుల ఆచూకీ తెలియని దుర్భర పరిస్థుతులతో, ఏ ఘ్ట్టో లోనో, గాస్ చాంబర్ లోనో కడ తేరగల బ్రతుకుల్ని, ఆదుకుని, సాకి, వాళ్ళలో ఆత్మ విశ్వాసాన్ని నింపుతూ, పోలిష్ జెండా నీడలో, తమ అష్తిత్వాన్ని మర్చిపోకుండా పెంచి, కడకు, యుద్ధానంతరం, తమ తమ స్వస్థలాలకు లేదా కుటుంబాల దగ్గరికీ పంపించిన మహా రాజా అంటే వాళ్ళకి ఎంతో గౌరవం. అభిమానం. ఈ మహారాజు గురించి పోలండు లో ఎన్నో పుస్తకాలు వెలువడ్డాయి.
డాక్యుమెంటరీ నిర్మాణం గురిచి ఇండియా వచ్చి, నవనగర్ ప్యాలెస్ లో అడుగు పెట్టిన సర్వైవర్ ఆ పాలెస్ ఎంత పెద్దదో, అందులో తామెంత స్వేచ్చగా తిరిగే వాళ్ళమో, ఎంత తరచుగా తప్పిపోయే వాళ్ళమో చెప్తూంటే, భలే అనిపించింది.  


ఈ పిల్లల కోసం బాలా చడీ అనే కాంప్ ని నిర్మించారు జాం సాహెబ్. అక్కడ వీళ్ళు వేరే దేశంలో ఉన్నామనే భావన కలగనీయకుండా, పోలిష్ కార్యక్రమాలు నిర్వహిస్తూ, పోలిష్ జెండా ఎగురవేయటం, పిల్లలకి తాము అనాధలం కామనే భావన కలిగించడం కోసం రాజా వారి ప్రసంగాలూ అదే దిశ లో ఉండేలా చూడటం వగైరాలన్నీ జరిగాయి. ఈ కాంపు మూసేసేటపుడు, చివరికి తమ తమ వార్ని కలిసేందుకు వెళిపోవాల్సిన పిల్లలు కూడా చాలా బాధపడ్డారంట. ఆ రోజుల్లో వాళ్ళకి ఆ ఆదరాభిమానాల్ని వొదలడం, ఈలోగా ఏర్పడిన స్నేహితుల్ని వొదులుకోవడం, కష్టమైందిట.  ఈ బాలా చడీ ఇప్పుడు సైనిక్ స్కూల్ గా రూపాంతరం చెందింది.


ఎక్కడి పోలండ్, ఎక్కడి గుజరాత్. ఎప్పటిదీ లింకు ? ఏమిటీ సంబంధం. వాళ్ళని మన మహారాజు ఆదరించడమేంటి. వాళ్ళు ఆ ఇండియన్ కనెక్షన్ ని ఎంత గాఢంగా అభిమానించడమేంటి. మన కర్మ సిద్ధాంతం ప్రకారం... ఎవరికి ఎవరు ఋణపడి ఉన్నారో అనిపిస్తుంది. అయితే అప్పటి గాధని ఇంత చక్కగా మన ముందు పరిచిన డైరక్టర్ అను రాధ చాలా ప్రశంసనీయమైన పనితనాన్ని చూపెట్టారు. ఈ డాక్యుమెంటరీ ని మళ్ళీ ఎక్కడ చూడ్డమో నాకు తెలియదు గానీ, తీసిన వాళ్ళ అనుపానులు మాత్రం ఇవి.

http://aakaarfilms.com/


లింకులు :

http://newdelhi.mfa.gov.pl/en/news/good_maharaja_saves_polish_children___premiere_of_a_little_poland_in_india_in_new_delhi;jsessionid=A6A8EEBD502F3978A62F42449C9E01CC.cmsap2p
 

http://lafayette.org.uk/naw8562a.html

17/12/2014

ఎల్లాప్రగడ సుబ్బారావు (పుస్తక పరిచయం)

1994 లో గుజరాత్ లో ప్లేగ్ మహమ్మారి విజృంభించినపుడు ఎపుడో నలభయి ఏళ్ళనాడు మన తెలుగాయన ఎల్లాప్రగడ సుబ్బారావు కనిపెట్టిన టెట్రాసైక్లిన్  కాప్స్యూళ్ళని నాలుగు రోజుల్లో అయిదులక్షల దాకా ఉచితంగా వీధుల్లో పంచిపెట్టారు. ప్లేగు ఎంత వేగంగా వ్యాప్తి చెందిందో, అంతే వేగంగా పారిపోయింది. 

అదెప్పుడో ఈ సుబ్బారావు కనిపెట్టిన మందునే, ఫైలేరియా కి, Q ఫీవరు కీ, కండ్లకలక కీ, కొన్ని రకాల గుండె సంబంధ వ్యాధులకూ, కేన్సరు కూ, టీ.బీ. కీ వాడుతున్నాం. తల్లి కడుపులో రూపుదిద్దుకుంటున్న పిల్లల వెన్నుపూస సరిగ్గా ఎటువంటి సమస్యలూ లేకుండా పుట్టడానికీ, రక్తహీనత కూ, మనసు వ్యాధులకూ, సంతాన సాఫల్యానికీ వాడే ఫోలిక్ యాసిడ్ సుబ్బారావుగారు ఏనాడో కనిపెట్టినదే.

ఎక్కడో భీమవరంలో పుట్టి, రక రకాల వ్యాధులకు, తండ్రినీ, సోదరులనీ, కన్న కొడుకునీ కోల్పోయి, తల్లి పట్టుదలతో చదివి, మామగారు/భార్య ఇచ్చిన సొమ్ముతో అమెరికా యాత్ర  చేపట్టిన సేవా తత్పరుడూ,  జిజ్ఞాసి ఈ సుబ్బారావు. తన ఆప్తులను కబళించిన అన్ని రోగాలకూ మందులు కనుక్కొన అగణిత జీవ శాస్త్రవేత్త.   ఈ మహానుభావుని జీవిత చరిత్ర  A Life in Quest of Panacia కి పురాణపండ రంగనాధ్ గారు చేసిన సరళ అనువాదం ఈ 'ఎల్లాప్రగడ సుబ్బారావు' .ఆయన  బాల్యం, కుటుంబ నేపధ్యం, చదువూ, బాధలూ, వివాహం ఇలా ఒడిదుడుకుల మధ్య ఒక జాతీయ వాది చేసిన ప్రయాణం, అమెరికా లో ముగిసి, మానవాళి మనుగడ కి ఓ కొత్త అధ్యాయానికి తెరతీస్తుంది.  ఒకప్పుడు చిన్న చిన్న వ్యాధుల బారిన పడి, ప్రాణాలు పోగొట్టుకొనే నిస్సహాయతకు వ్యతిరేకంగా, రోగకారక క్రిములపై యుద్ధాన్ని ప్రకటించిన యోధుడు సుబ్బారావు.  ఆయనకి పెన్సిలిన్ కనిపెట్టిన ఫ్లెమింగ్ అంత పేరు రాకపోవచ్చు.  సొంత దేశం లో పెద్దగా గుర్తింపు దొరకక పోవచ్చు. కానీ ఒక లక్ష్యం కోసం పరితపించి, అవమానాల్నీ, అభిమానానీ ఒకేలా పరిగణించి, అర్జునుళ్ళా దూసుకుపోయి, ఆదర్శవంతమైన జీవితం గడిపిన ఈ శాస్త్రవేత్త గురించి తెలుసుకోవడం ఓ అత్భుత అనుభవం. ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు. శతకోటి వందనాలు. 

ఎంత ప్రతిభా వ్యుత్పత్తులున్నప్పటికీ, మన మేధ పరదేశపు బాట పట్టడానికి బోల్డన్ని కారణాలు.  వలస పాలన లో మగ్గుతున్న మన దేశస్థులకు, విదేశీ చదువు అంటే కేవలం ఇంగ్లండే లక్ష్యం గా వుండే కాలంలో, అమెరికా బాటపట్టిన బహుదూరపు బాటసారి.  25 ఏళ్ళ పాటు, వర్ణ వివక్షనూ, ఒంటరితనాన్నీ అనుభవిస్తూ, చనిపోయే వరకూ అమెరికాలోనే ఉన్నా, జీవ శాస్త్రంలో అసమానమైన విజయాలను సాధించినా, అత్భుత ఆవిష్కరణలు చసినా, అమెరికా పౌరసత్వం పొందలేకపోయాడు. 

ఆయన చేసిన పరిశోధనల గొప్పతనం, ఆయన మరణానంతరం ప్రపంచానికి తెలిసింది. ఇప్పటికీ, కేన్సర్ కి ఇచ్చే కీమోథెరపీ లో చికిత్స లో సుబ్బారావు మందులే వాడుతున్నాం.  ఇప్పటి ఫైసర్ (Pfizer), ఒకప్పటి లెడర్లీ లో పనిచేసిన సుబ్బారావు రెండో ప్రపంచ యుద్ధ కాలంలో సైనికుల ప్రాణాల్ని కాపాడ్డానికి ఎక్కువ పెన్సిలిన్ ని ఉత్పత్తి చేసి, రెడ్ క్రాస్ కి సరఫరా చేయగలగడంలో ప్రధాన భూమిక నిర్వర్తించాడు.  తన అన్ని ఆవిష్కరణల కూ తనొక్కడి కే పేరు దొరకాలని ఏనాడూ కోరుకోలేదు. పేటెంటుకో, పేరుకో ఆయన ఆశించి ఉన్నట్టయితే, తన విజయాలకు గానూ ఎంతో ప్రఖ్యాతి చెంది ఉండేవాడు.

యువకుడి గా ఉన్నపుడు, మద్రాసు హిందూ కాలేజీ లో ఇంటరు చదివి, రామకృష్ణ మిషన్ లో సన్యాసి గా చేరాలని ప్రయత్నించి, తల్లి ఒప్పుకోకపోవడంతో విఫలం అయ్యాడు. సేవ చెయ్యాలనే అతని తపనను చూసిన మిషన్ సన్యాసులు ఆయన్ని వైద్య శాస్త్రం అభ్యసిస్తే, ఎందరో రోగులకు సేవ చేయగలవు, మిషన్ లోనూ సేవలందించగలవు అని నచ్చచెప్పడంతో వైద్యం లో చేరాడు. జాతీయోద్యమ ప్రభావంతో ఖద్దరు ఏప్రాన్ నే ధరించి, బ్రిటీషు ప్రిన్సిపాలు కోపానికి గురి అయి పూర్తి ఎం.బీ.బీ.ఎస్ కాకుండా, అంత కన్నా చిన్నదైన ఎల్.ఎం.ఎస్ డిగ్రీ మాత్రమే పొందగలుగుతాడు.

ఆయుర్వేదం అంటే, ఆసక్తి, తనకు తాను స్వయంగా తీవ్రంగా జబ్బుపడినపుడు దాన్ని నయం చేసిన లక్ష్మీపతి అనే ఆయుర్వేద వైద్యుని వల్ల కలుగుతుంది. ఆయుర్వేదపు ప్రాధమిక సూత్రమైన 'వాత, పిత్త, కఫ' దోషాల గురంచి క్షుణ్ణంగా అభ్యసించి, తన వైద్య విద్య ముగియగానే ఈ లక్ష్మీపతి గారి ఆయుర్వేద కళాశాల లో అధ్యాపకునిగా చేరాడు.   అప్పుడే భారత దేశానికి వచ్చిన ఒక అమెరికన్ శావేత్త ఇచ్చిన ప్రేరణతో హార్వర్డు లో డిప్లొమా చెయ్యడానికి ప్రణాళికలు ఏర్పరచుకున్నాక, కాకినాడ లో ఓ సేవా సంస్థ చదువుకి ఆర్ధిక సహాయాన్ని కొంత అందివ్వగా, పిల్లనిచ్చిన మామగారి ఆర్ధిక సహాయంతో 1922 లో బోస్టన్ చేరుకున్నడాయన.

హార్వర్డు లో చదువూ, ఉద్యోగం, వివక్షా, బీదరికం, స్నేహితులూ, భార్య తో లేఖల ద్వారా అనుబంధం, అపుడే ఆయన భార్య స్వదేశంలో మొగపిల్లవాణ్ణి కనగా ఆ శిశువు తొమ్మిది నెల్లకే వ్యాధి బారిన పడి కనుమూయడం, హార్వర్డు రాజకీయాలూ ఇత్యాది ఒడిదుడుకుల మధ్య లెడెర్లీ లో జీవ రసాయన శాస్త్రవేత్త గా ఉద్యోగం లో చేరి, మానవాళి కి రక రకాల సూక్ష్మ జీవుల ద్వారా ఎదురయ్యే వ్యాధుల్ని ఎదుర్కొనే వివిధ రకాలైన ఔషధాల్ని తయారుచేసి, తన జీవన పర్యంతం, పరిశోధన లోనే గడిపాడు.

తన వ్యక్తిగత జీవితాన్ని, తల్లినీ, భార్యనూ, స్నేహితుల్నీ అన్నిట్నీ వొదిలి, ఒంటరిగానే జీవించాడు.  ఒకవేళ అర్ధాంతరంగా ఆయన హృదయ సంబంధ వ్యాధితో మరణించకపోయి ఉండినట్టయితే, కేన్సరు కి తిరుగులేని దివ్యౌషధం తప్పకుండా తయారయి ఉండేది. ఆయన్ని తీర్చిదిద్దిన తల్లి వ్యక్తిత్వమూ, మౌనంగా, ఎంతో అభిమానంగా అతని కి వెన్నుదన్నుగా నిలిచిన భార్య వ్యక్తిత్వమూ చదువుతున్నపుడు, వీళ్ళు చేసిన త్యాగ ఫలితం ఎందరో అనుభవిస్తున్నామిపుడు కదూ అనిపిస్తూంటుంది.


ఇపుడైతే డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా - ఆంటీ బయోటిక్ ఔషధాల విచ్చల విడి వాడకం, అజ్ఞానం, ఔషధ పరిశ్రమల లాభార్జనా లక్ష్యాలూ ఈ గొప్ప ఆవిష్కరణలకు మసి పులిమే ప్రయత్నం చెయ్యొచ్చు. కానీ చావే శరణ్యం గా ఉన్న ఎన్నో మహమ్మారి వ్యాధులను  అదుపు చేయ గలిగిన ఔషధులను కనిపెట్టిన సుబ్బారావు చిరస్మరణీయుడు.  ఆయన మరణించిన ఎన్నో ఏళ్ళకు మన వైద్య ప్రపంచమూ, మేధా సమాజమూ ఆయన్ని స్మరిస్తూ ఎన్నో కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉండగా మన ప్రభుత్వం కూడా ఒక స్మారక పోస్టల్ స్టాంపు ని ముద్రించింది.

ఈ 'జీవిత చరిత్ర'  పాఠకులకు ఒక అందివొచ్చిన అవకాశం.  పూర్వ కాలపు విలువలూ, ఆ రోజుల్నాటి సైన్సు ఆవిష్కరణలూ, పద్ధతులూ, విజ్ఞానం, కృషీ, పట్టుదలా, పోటీ తత్వం, అమెరికను సమాజపు వర్ణనలూ ఆద్యంతం కట్టిపడేసినట్టు రచించిన ఈ ఆత్మ కధ అధ్భుతంగా ఉందని చెప్పొచ్చు.  సైన్సు గురించి ఏ మాత్రం ఆసక్తి ఉన్నా తప్పక చేత పుచ్చుకోవచ్చు.

ఈ పుస్తకాన్ని చదువుతున్నపుడు పూర్తి నిమగ్నతతో, ఉద్విగ్నంగా చదివింపజేసిన రచియిత్రి రాజీ నరసిమ్హన్ అభినందనీయురాలు.  సైన్సు గురించి, పరిశోధనల గురించీ ఆసక్తి కరంగా రచించిన (లేదా అనువదించిన) పురాణపండ రంగనాధ్ గారు ఒక చక్కని పుస్తకాన్ని తెలుగు పాఠకులకు అందుబాటులోకి తెచ్చి మంచి పని చేసారు. లేకపోతే ఈ మహానుభావుణ్ణి గురించి తెలుసుకోవడం ఇంత ఆసక్తినీ, గౌరవాన్ని రేకెత్తించేవి కావేమో. ఎంతో కాలానికి నన్ను కీబోర్డు దాకా లాక్కొచ్చి తప్పకుండా పరిచయం చెయ్యాలన్న కోరిక నాలో కలిగించిన ఈ చిన్ని పుస్తకం ఈ బుక్ ఫెయిర్ లో దొరికితే కొనుక్కోండి.


    

22/11/2013

నాకు నచ్చిన వీడియో!

ఈ మధ్య మా అమ్మాయి తో కలిసి టీవీ చూస్తున్నపుడు డిస్నీ చానెల్లో ప్రసారమైన పాట. అబ్బ ఎంత బావుందో! పాట బర్ఫీ లోనిది. పిల్లల ఫంక్షన్ల లో స్కూల్ ఫంక్షన్ల లోనూ డాన్స్ వేసేందుకు భలే బావుంది.