Pages

07/11/2017

పాండోరాస్ బాక్స్



పాండోరా అనగానే నగలని తల్చుకుని ఆనందించే అమ్మలు, అమ్మాయిలకి క్షమాపణలతో మొదలుపెడుతున్నాను.

ఈ కథ గ్రీక్ మైథాలజీ లోనిది. మా అమ్మాయి కథల పుస్తకం లో చదివి, నాకు చాలా నచ్చి, ఇక్కడ చెప్తున్నాను.  (From : Rapunzel and other stories by Miles Kelly)


సృష్టి మొదలయిన కొత్తల్లో, ఇదంతా చాలా ఆనందకరమైన ప్రాంతం. వెలుతురూ, నవ్వులతో కళ కళ లాడేది ప్రపంచం అంతా.  అసలు ఎవ్వరికీ బాధ, కోపం, దుఃఖం, ఈర్ష్యా, అసూయ ఇలాంటి పదాలే తెలీదు. అలాంటి భావన ఎలా వుంటుందో కూడా ఎవరికీ తెలీదు.  ప్రతీ  రోజూ సూర్యుడు ప్రకాశించేవాడు. దేవుళ్ళు / దేవతలు  స్వర్గం నుండీ భూమ్మీదకి వచ్చి ఈ లోక వాసులతో కబుర్లూ కాకరకాయలూ చెప్తూ కలిసి మెలిసి వుండేవాళ్ళు.

ఒక సారి ఓ మధ్యాహ్నం పూట ఎపిమెథియస్ అనే ఓ మనిషీ, ఆయన భార్య పాండోరా,  వాళ్ళింటి బయట పూతోట లో తోటపని చేసుకుంటూ ఉన్నప్పుడు, వాళ్ళు మెర్క్యురీ దేవత  రావడం చూస్తారు.  ఆ మెర్క్యురీ ఒక పెద్ద చెక్క భోషాణం పెట్టె ని భుజాన వేసుకుని నడుస్తున్నాడు. పెట్టె బరువుతో అతని నడుమొంగిపోయింది. పాండోరా వెంటనే పరిగెట్టి ఈ దేవత కి సేద తీర్చేందుకని ఒక డ్రింక్ తెచ్చివ్వడానికి ఇంట్లోకి వెళ్ళింది. ఎపీమెథెయస్  మెర్క్యురీ భుజాన్నించి ఆ బరువైన పెట్టెని కిందకు దించడానికి సాయం పడతాడు.  ఆ పెట్టె బంగారు తాళ్ళతో గాట్టి గా కట్టేసి, దాన్నిండా విచిత్రమైన ఆకారాలు చెక్కి చాలా దృఢంగా వుంటుంది. 

"మీరు నాకో సాయం చేస్తారా?!"  అని అడుగుతాడు మెర్క్యురీ వీళ్ళని.  "చాలా ఎండగా వుంది.. ఈ పెట్టె కూడా చాలా బరువుగా ఉంది. మీ దగ్గర ఈ పెట్టె ని కాస్త వదిలి వెళ్ళనా ? "  అని ప్రాధేయపూర్వకంగా అడుగుతాడు మెర్క్యురీ !   "అయ్యో! తప్పకుండా !" - అని వీళ్ళు ఒప్పుకుంటారు.   దేవుడూ, ఈ మనుషులూ కల్సి చెరో దిక్కునా పట్టి, ఆ పెట్టెను ఇంట్లోకి చేరేస్తారు.   "దీన్ని ఎవ్వరూ తెరవకూడదు.. చూడకూడదు. ఈ పెట్టె ని జాగ్రత్త గా చూస్కోండి. ఎవ్వరూ, ఎట్టి పరిస్థితి లోనూ ఈ పెట్టె ను తెరవకూడదు. నేను తరవాత వచ్చి తీస్కెళ్ళే దాకా" - అని ఎంతో ఆత్రుత తో, ఎంతో ఇది గా చెప్తాడు మెర్క్యురీ.  

దంపతులిద్దరూ.. "అదేంభాగ్యం.. ఎవ్వరూ తెరవరు లెండి "  అని హామీ ఇచ్చి, దేవత కి వీడ్కోలిస్తారు.   అయితే ఇలా మెర్క్యురీ వెళ్ళగానే, పాండోరా కి ఎవరో వీళ్ళ పేర్లు గుసగుస గా పిలుస్తున్నట్టు అనిపిస్తుంది.  ఈవిడ చెప్పిన ఆ పిలుపుల సంగతి, మొదట,  భర్త నమ్మడు. కొట్టి పారేస్తాడు.  కానీ ఇద్దరూ మళ్ళీ చెవులు నిక్కించి ఆ శబ్దాల్ని వింటారు.   మొదట కాసేపు పిట్టల కువ కువలే వినిపిస్తాయి. ఆ తరవాత కాసేపటికి ఎవరో తమ పేర్లను పిలుస్తున్నట్టు ఇద్దరికీ వినిపిస్తుంది. ఇది 'మన మితృల పిలుపే - నేను చూసొస్తాన'ని చెప్పి, భర్త ఇంటి బయటకు వెళ్తాడు.  పాండోరా ఒక్కతే ఆ గదిలో వుంటుంది.  భర్త బయటకు వెళ్ళగానేఅ ఆ పెట్టె లోంచీ "పాండోరా",  "పాండోరా"  అని దీనమైన  పిలుపులు వినిపిస్తూంటాయి. అవి ఆ పెట్టె లోంచీ వస్తున్నట్టు ఈమె కు అర్ధం అవుతుంది.

పెట్టెకి చెవిని ఆనించి వింటుంది.  "మమ్మల్ని రక్షించు పాండోరా.. మేము ఈ చీకటి పెట్టె లో బందీలం ! " అంటూ ఎవరో   వేడుకోలుగా, చాలా దీనంగా, హీన స్వరంతో  ప్రార్ధిస్తున్నట్టు ఆమెకు వినిపిస్తుంది.  పాండోరా తుళ్ళి పడి - ఆశ్చర్యం తో, ఏమి చెయ్యాలో తోచక స్థంబించిపోతుంది.   మెర్క్యురీ ఏమో - ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టె ను తెరవద్దని అన్నాడు. ఇక్కడ చూస్తే, పెట్టె లో ఎవరో ఉన్నారు. ఎలా ఏమి చెయ్యడం ఇప్పుడు ?

భయభ్రాంతురాలై -  పెట్టె లో చిక్కుకుపోయిన ఎవర్నో రక్షిద్దామనే మంచి భావన తో, పాండోరా మొత్తానికి ఆ బంగారు తాళ్ళను బలవంతంగా విప్పి, పెట్టె ను తెరుస్తుంది.  పెట్టె ను తెరవగానే తను చేసిన తప్పు తెలుసుకుంటుంది పాండోరా.  ఆ పెట్టె నిండా "ఈ లోకం లోని చెడు" అంతా నిండి వుంటుంది. అవన్నీ వేలాది  నల్లని  తుమ్మెదల్లాంటి  కీటకాల రూపంలో  బిల బిల లాడుతూ ఉంటాయి. పెట్టె తెరవగానే అవన్నీ ఒక్క పెట్టున బయటికి ఎగురుతూ వస్తాయి.  అవన్నీ ఈ లోకంలో మనుషుల్ని కుట్టి, బాధించి ,   బాధ, నొప్పి, చింత, నైరాశ్యం లాంటి "చెడు" ని అవి ఎటు వెళ్తే అటు వ్యాపింపచేయడానికి సిద్ధంగా వుంటాయి. అన్నీ పాండోరా చర్మాన్నంతా ఆక్రమించేసి, కుట్టి,  హింసిస్తూ, ఆనందంగా తమ  తమ రెక్కలు కొట్టుకుంటాయి.  పాండోరా కి మొదటి సారిగా బాధ అనుభవం లోకి వస్తుంది.  వెంటనే పెట్టె మూత ని మూసేస్తుంది ఆమె.


బయట ఉన్న ఎపీమెథెయస్ భార్య కేకలు విని పరిగెత్తుకుంటూ లోపలికి వస్తాడు.  ఈ పురుగులు కిటికీ లోంచీ బైటికి వెళ్ళిపోయే ముందు అతన్ని కూడా కుట్టి బాధిస్తాయి.     జరిగిన ఘోర తప్పిదాన్ని చూసి,  ఎపీమెథియస్ భార్య మీద పట్ట రాని కోపం తో కేకలేస్తాడు.  పాండోరా కూడా అతని మీద కేకలేస్తుంది.   వీళ్ళిద్దరూ అలా దెబ్బలాడుకుంటూండే సరికీ, "నన్ను బైటికి రానివ్వండి"   అని ఒక పెద్ద స్వరం వినిపిస్తుంది.  ఆ స్వరం పెట్టె లోంచీ వస్తుంది.

"భయపడకండి!  నన్ను బైటికి రానివ్వండి!! నేను మీకు సాయం చేస్తాను!"   అంటుంది ఆ స్వరం.  పాండోరా కళ్ళు పెద్దవి చేసి, భర్తని "ఏమి చేద్దాం?" అని అడుగుతుంది. 

"ఇంకేమి చేస్తాం ? చేసిందంతా చేసేవు కదా .. వెళ్ళి పెట్టె తెరువు !"   అని గొణుక్కుంటాడు ఎపీమెథియస్.  పాండోరా ఎలాగో ధైర్యం చేసి, కళ్ళు గాట్టి గా మూసుకుని  మెర్క్యురీ పెట్టె ను తెరుస్తుంది.  ఆ నల్లని లోతైన పెట్టె అడుగు నుంచీ  ఒక తెల్లని ప్రకాశవంతమైన సీతాకోక చిలుక బయటకి వస్తుంది. అది తన సున్నితమైన రెక్కల తో పాండోరా, ఎపీమెథియస్ ల గాయాల్ని స్పృశించి మాపుతుంది.




ఆ పెట్టె లోంచీ చెడు ని బయటకి రానిచ్చినందుకు, మెర్క్యురీ కి ఇచ్చిన మాట ని తప్పినందుకు బాధ తో బిక్క చచ్చిపోయిన పాండోరా, ఎపీమెథియస్ లు ఇద్దరూ ఆ సీతా కోక చిలుక ప్రేమాస్పద స్పర్శ కు కదిలిపోయి, వెక్కి వెక్కి ఏడుస్తారు. ఆ సీతాకోక చిలుక పేరు "ఆశ" !  (Hope)   ఆశ కూడా వీళ్ళింట్లోంచీ కిటికీ గుండా బయటకి  చెడు వెనకే, ఎగిరిపోతుంది.   అదృష్టవశాతూ.. మనతోపాటూ మన లోకంలో  ఆ ఆశ ఎప్పటికీ   ఉండిపోయింది.

ఎంత బావుంది కదా కథ. ఎన్ని కష్టాలొచ్చినా, ఎంత బాధ కలిగినా మనని కలిపి ఉంచేది ఆశ మాత్రమే కదా. దాన్ని కాపాడుకున్నంత వరకూ, మనకు ఎటువంటి  గాయాలు (మానసికమైనవి), బాధలూ బాధించవు.   అదీ ఈ కథ చెప్పే నీతి.


* * *

Other Stories in this book are :

The Fairy Cow

Paddy Corcoran's Wife

The Three Wishes

The Mermaid of Zennor

Rapunzel

The Fairy Blackstick
 

26/10/2017

Elmer The Patchwork Elephant by David McKee

ఒక్కోసారి సంభాషణ లు ఎటు వైపు నుండీ ఎటు తిరుగుతాయో తెలీదు. ఒక దాని వెంట ఒకటి ప్రస్తావన లు వస్తూ.. అంతూ పొంతూ లేకుండా కబుర్లు చెప్పుకునే తీరిక ఎవరికీ లేదు!    కానీ కబుర్లంటూ ఉండకపోవు కదా. నేను చెప్పే కథ లు వినే ఏకాకి శ్రోత మా అమ్మాయి.  మేమీమధ్య కబుర్లు విశేషాలూ మాటాడుకుంటూ ఒక ఏనుగు బొమ్మ గురించి  మాట్లాడుతూ ఎల్మర్ కథ ని చెప్పుకున్నాం.  ఎప్పుడో చిన్నప్పుడు అనగా మూడేళ్ళ వయసులో తను ఈ రంగు రంగుల ఎల్మర్ కథ ని చదివింది (అంటే నేను చదివి వినిపించాను)  ఇప్పుడీ మధ్య ఏనుగుల బొమ్మ ఒక దాన్ని చూసి, ఏనుగు కథ ల మాట వచ్చింది.  ఈ ఎల్మర్ కథ (లు) ఎంతో బావుంటాయి. తెలుగు లో ఈ ఎల్మర్ కథని చెప్తే ఎలా వుంటుందో చూడాలని నాకనిపించింది.

ఎల్మర్ ఒక పాచ్ వర్క్ ఏనుగు. అది ఇలా వుంటుందన్నమాట.  పాచ్ వర్క్ అంటే తెలుసా ?  రంగు రంగుల నలు చదరాలు కలిపి బొంత లాగా కుట్టే ఒక సాంప్రదాయం చలి దేశాల్లో ఉంది. వీట్ని క్విల్ట్ లాగా కుట్టుకుని గానీ, బట్టలు కుట్టుకోవడానికి గానీ తయారు చేసుకుంటారు.  సో ఈ ఎల్మర్ ఇలా వుంటాడు.


హ్మ్మ్.. ఇప్పుడు ఈ ఎల్మరుడు  ఇలా రంగు రంగుల తో వున్నాడు. వీడిది నిజమైన ఏనుగులుండే నలుపెక్కిన ఊదా రంగు వొంటి రంగు  కాదు.  కానీ ఈ రంగు రంగుల ఎల్మర్ చాలా ఆశావాది, చాలా పరోపకారి, చాలా మంచి వాడు, ఎప్పుడు సరదాగా హాయిగా వుంటూంటాడు.  ఎల్మర్ అంటే  మిగిలిన ఏనుగులందరికీ చాలా ఇష్టం.  ఎల్మర్ కీ మిగిలిన అందరు ఏనుగులూ, ఇతర జంతువులూ, పులులూ, సింహాలూ, జిరాఫీ లూ, కోతులూ, మొసళ్ళూ ఆఖరికి చేపలూ, పిట్టలూ కూడా చాలా ఇష్టం, అందరీ వీడికి స్నేహితులే. ఎప్పుడూ ఒక్కడూ చక చకా తన స్నేహితులతో కలుస్తూ తిరుగుతూ, హాయిగా సంతోషంగా వుంటూ ఉంటాడు.

ఓ సారి ఎల్మర్ కి తను మిగిలిన ఏనుగుల కన్నా డిఫరెంట్ (తేడా!) అని స్పృహ వస్తుంది.   'అయ్యో 'నేను ఎందుకు ఇలా వున్నాను ? (With Patchwork and all ?!)   మిగిలిన వాళ్ళ లా లేనూ.. వాళ్ళలో నేనూ ఒకడిలా కలిసిపోవాలీ అంటే నా వొంటికి ఊదా రంగు వేసుకోవాలి' అనుకుంటాడు. తీరా ఊదా రంగు వేసుకుని, తన రంగు రంగుల చర్మాన్ని దాచుకుని మిగిలిన ఏనుగుల దగ్గరికి వెళితే అవి వీణ్ణి గుర్తు పట్టవు. గుర్తు పట్టక పోగా ఎవడో కొత్త వాడు వచ్చాడని దూరం పెడతాయి. ఎల్మర్ కి బాధ అనిపిస్తుంది. నేను వీళ్ళలో కల్సిపోవడానికి వస్తే ఇలా దూరం పెడతారేంటబ్బా అనుకుంటాడు. కానీ అదృష్టవశాతూ వర్షం కురిసి, వాడి వొంటి మీద పెయింట్ పోయి, అసలు (రంగు) రంగులు బయటపడతాయి.





అప్పుడు ఏనుగుల్లో పెద్ద వాళ్ళు - " అరే నువ్వా ఎల్మర్ ? ఇలా ఎందుకు మేక్ అప్ వేసుకున్నావ్ ?" అని అడుగుతాయి.  వీడు కారణం చెప్పేసరికీ నవ్వి ఓ నాలుగు చీవాట్లు కూడా వేస్తాయి.  "పిచ్చి ఎల్మర్... నువ్వు మాకన్న కొంచెం డిఫరెంట్ గా ఉన్నావు సరే. అదే నీ స్పెషాలిటీ. నీ యూనిక్ నెస్ ని కోల్పోయి అందరి లో ఒకడి లా తయారవడానికి ఎందుకు ప్రయత్నిస్తావు ? నీ రంగు రంగుల పాచ్ వర్క్ తో నువ్వు ఎంత ముద్దు గా వుంటావో తెలుసా ? నువ్వు మా స్వీట్ హార్ట్ వి.  నువ్వు మాకు ఎంతో ఎక్కువ. ఇంకెప్పుడూ ఇలా 'గుంపు లో గోవింద' అయ్యేందుకు ప్రయత్నించకూ".. అని గుణ పాఠం చెప్తాయి.


ఇంకోసారి  అడవి లో పెద్ద గాలీ వానా వస్తాయి.   వాన వెలిసేసరికీ ఏనుగులన్నీ గుహ లో రెస్ట్ తీసుకుంటుండగా కొన్ని చిన్ని చిన్ని నీలి పిట్టలు ఎగురుకుంటూ వచ్చి ఎల్మర్ ని రమ్మంటాయి.  "ఎల్మర్! చూడు! ఒక రెయిన్ బో వచ్చింది. కానీ దాన్లో రంగులు లేవు"  అని కంగారు గా చెప్తాయి. ఎల్మర్ వచ్చి ఆకాశం లోకి చూస్తాడు. దూరాన రెయిన్ బో కనిపిస్తుంది. కానీ దాన్లో రంగులు ఏవీ వుండవు. వొట్టి తెల్లని ఇంద్ర ధనువు అది. వీళ్ళందరూ  అయ్యో ఇప్పుడెలా అనుకుంటారు.

ఎల్మర్ పరోపకారి పాపన్న కదా.   "పోన్లెండి - నా దగ్గర బోలెడు రంగులు ఉన్నాయి కదా. నేను ఈ రెయిన్ బో కి నా రంగులు ఇస్తాను. కానీ ఆ రెయిన్ బో మొదలు ఎక్కడుందో వెతకాలి. దాన్ని తాకి కదా నా రంగులు ఇవ్వాలి.  . అక్కడికి వెళ్ళి నా రంగులు ఇస్తానూ" అంటాడు. అడవి అడవంతా రెయిన్ బో 'తుది',  'మొదలు' లను వెతుకుతారు. కొన్ని మొసళ్ళేమో ఎల్మర్ కి ఆ రెయిన్ బో, జల పాతం వెనక ఉందని చెప్తాయి.  వెంటనే ఎల్మర్ జల పాతం దగ్గరికెళ్ళి, నీళ్ళ కింద నుండీ లోపలికి వెళ్ళిపోతాడు.   తెల్లని జల ధారల వెనక్కి వెళ్ళిపోయిన ఎల్మర్ ఎంతకీ మరి బయటికి రాడూ, కనిపించడూనూ.

అడవి జంతువులు అన్నీ బయట నుంచుని భయ భ్రాంతులై చూస్తుంటాయి.  అలా వాళ్ళు చూస్తుండగానే రెయిన్ బో లో కి ఏడు రంగులూ మెల్లగా వచ్చేసి, రంగుల రెయిన్ బో చక్కగా ఆకాశంలో మెరుస్తూ కనిపిస్తుంది.  'తన రంగులన్నీ ఇచ్చేసి, ఎల్మర్ మామూలు ఏనుగు లాగా నల్లగా అయిపోతుందేమో.. ఎల్మర్ ఎంత త్యాగం చేసిందీ'   అని అన్ని జంతువులూ బాధ పడతాయి. కానీ ఎల్మర్ ఆ జల ధారల తెరల మాటు నుండీ బయటకి వచ్చాకా, ఎల్మర్ రంగులు ఇంకా కాంతి వంతంగా మెరుస్తూ, దాని పాచ్ వర్క్ చర్మం భద్రంగా వుంటుంది.





దీని అర్ధం ఏమిటీ అని అందరూ అడిగితే,  అందరికన్నా పెద్దదయిన సింహం.. "మన దుఃఖాన్ని పంచుకుంటే అది తగ్గుతుంది, అదే సుఖాన్ని, ఆనందాన్నీ అందరితో పంచుకుంటే అది రెట్టింపవుతుందీ... అందుకే ఎల్మర్ రంగులు పోలేదు. పైగా ప్రకాశిస్తున్నాయి "  అని హితవు చెప్తుంది. [Elmer and the Rainbow]



ఇలాంటి ఎల్మర్ కథలు పిల్లల కోసం ఎంతో మనో రంజకంగా బ్రిటిష్ రచైత David McKee, 1989 లో రాయడం మొదలు పెట్టారు.  పుస్తక రూపం లో నైతే మొత్తం 34 కథలు.   ప్రస్తుతం ఏనిమేటెడ్ వీడియోలు యూట్యూబ్ లో బోలెడు.     టెలివిజన్ సిరీస్ కోసం ఇతర రచయితల్ని కూడా కలుపుకున్నారు.  ఏనుగులు ఎంతో శక్తివంతమైన, తెలివైన జంతువులు. అమాయకమైనవి కూడా.   పిల్లలకి ఎందుకో ఏనుగు అంటే భలే ఇష్టం.  కథ ల్లో అయితే మరీనూ. అందుకే ఈ కథలు మన లో ని పిల్లలకి కూడా భలే నచ్చుతాయి.


మొత్తానికి ఎల్మర్ కథ ని నా బ్లాగ్ లో చెప్పేసి, ఇంకో నలుగురు వాళ్ళ పిల్లలకీ ఈ ఎల్మర్ కథ లు,  ఈ రంగు రంగుల ఆశావహమైన,  అమాయకమైన కథలు చెప్తారని నా ఆశ పడతాను.  ఒక మంచి కథ ని చదివినంత ఆనందం,  కళ్ళింత చేసుకుని, రంగు రంగుల పుస్తకం లో కి దూరి, ఆ అత్భుత ప్రపంచాన్ని ఆశ్చర్యంగా చూస్తూ, మన నోటి నుండీ వచ్చే ఒక్కో వాక్యమూ ఎంతో అపురూపంగా వినే పిల్లలకి ఈ కథ చెప్పడం, భలే ఆనందకరం. ఈ తృప్తి కి ఏదీ సాటి రాదు.  అదీ ఎల్మర్ కథ.


Notes :

Elmer Story Books -

https://www.waterstones.com/booklist/319791/elmer-the-elephant



David McKee  

Views :  https://www.theguardian.com/lifeandstyle/2014/jul/12/25-years-elmer-elephant-david-mckee


 

16/09/2017

పథేర్ పాంచాలీ - బిభూతి భూషణ్ బందోపాధ్యాయ్

పథేర్ పాంచాలీ - బిభూతి భూషణ్ బందోపాధ్యాయ్ (1894-1950)
అనువాదం : మద్దిపట్ట్ల సూరి (1920-1995)



కొన్ని పుస్తకాలకి గొప్ప చరిత్ర వుంటుంది. ఎప్పుడో చిన్నప్పటి పథేర్ పాంచాలి. సత్యజిత్ రేయ్ సినిమా గానే తెలుసు. టీవీలో ఎప్పుడో చూసిన చిన్న బిట్  - వానల్లో బురదల్లో పల్లెలో పడుతూ లేస్తూ నడుస్తూ వస్తున్న పెద్ద మనిషిని ఇద్దరు చిన్న పిల్లలు నవ్వుతూ గమనిస్తున్న దృశ్యమే మనసులో ముద్రించుకుపోయింది. అత్భుతమైన సినిమా అనీ, సత్యజిత్ రే దానికి ప్రాణం పోసాడనీ వినడమే. ఎప్పుడూ దాని పూర్తి పాఠం చదవలేదు.  ఇన్నాళ్ళకిన్నాళ్ళకి ఈ "అజరామర పథగీతం"  ఇంత చక్కని తెలుగులో దొరికితే చదవకుండా వొదులుకోగలగడమే ?!  దీన్ని తెలుగులో అత్భుతంగా, రస రమ్యంగా అనువదించినది శ్రీ మద్దిపట్ల సూరి.   బెంగాలీ నవలల పట్ల తెలుగు వాళ్ళకున్న క్రేజ్ తెలిసినదే. శ్రీ సూరి మంచి మంచి బెంగాలీ క్లాసిక్ లను తెలుగు లో కి అనువదించారు. ఈ అనువాదాన్ని ఈయన కాకుండా ఎవరన్నా చేసి వుంటే ఆ పుస్తకం ఇంత బావుండేదా అని  అనిపించింది. కాబట్టి  అనువాదకునికి నమస్కరించి, ఇది మొదలు పెట్టాలి న్యాయంగా.

చాలా రోజులకి గుండెల్లో ఇంకిపోయిన చెమ్మని బయటకు తీసుకొచ్చిన ఇద్దరు చిన్న పిల్లల కథ ఇది.  పథేర్ అంటే పథం. మార్గం. పాంచాలీలనేవి తరతరాలుగా సంప్రదాయ కథాగానానికి ఉపయోగిస్తుండే బెంగాలీ గీతాలు. అందుకే సత్యజిత్ రే తన చిత్రానికి 'సాంగ్ ఆఫ్ ద లిటిల్ రోడ్' అనే ఉప శీర్షిక జోడించారు.  దుర్గ, అపూర్ లు అక్కా తమ్ముళ్ళు. నిశ్ఛింది పురంలో హరిహర రాయ్ గారి పిల్లలు. హరి రాయ్ భార్య సర్వ జయ.  హరి హరుడికి వరుసకు అక్కగారైన ఇందిరమ్మ అనే వృద్ధురాలు వీళ్ళతోనే ఆ ఇంట్లోనే ఉంటూండేది.  ఆవిణ్ణి, సర్వ జయ నూ బీదరికం నిర్దాక్షిణ్యంగా విడదీసేస్తుంది. ఈ మౌసీమా ని ఎంతగానో ప్రేమించిన చిన్నారి దుర్గ తల్లికీ, ఇందిరమ్మ కూ  మధ్య నలిగిపోతూ.. వాళ్ళ అస్థిత్వ పోరాటం లో - ఇందిరమ్మ ఇల్లు విడిచి పోవడమూ, తిండికి మొహం వాచి, ఎండ దెబ్బ కి మరణించడమూ చూసి ఎక్కువ దెబ్బ తిన్న పిల్ల.  అత్యంత బీదరికంలో బ్రతుకు వెళ్ళదీస్తున్న సర్వ జయకూ పిల్లలల తో పాటూ ఆ ముసలావిణ్ణి సాకడం కష్టమైపోతుంది.  ఇందిరమ్మ జీవితాన్నీ మరణాన్నీ చదివే సరికే పాఠకుడు ఎప్పుడు ఈ బ్రతుకుల్లో వెలుతురొస్తుందా అని నిస్పృహ లో కూరుకుపోతాడు. 

హరి హరుడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణీకం తప్ప ఇతర పనులెరుగని పండితుడు. అతని కొడుకు అపూర్ !  అపూ అక్క దుర్గ వెంటే ఎప్పుడూ. తండ్రి పౌరోహిత్యపు పనుల వేటలో, ప్రవచనాల పనుల వేటలో నెలల తరబడి ఇల్లు విడిచి వెళ్ళినప్పుడు తల్లికి మిగిల్న తోడు వీళ్ళిద్దరే. వీళ్ళు ఊరు నాలుగు చెరగులా తిరుగుతూ, వంటకి ఫలమో, పుష్పమో, కట్టెలో, ఎక్కడో పడిపోయిన  కొబ్బరి కాయలో, ఏ చెరువులోనో దొరికిన చేపల్నో ఇంటికి పట్టుకొస్తూంటారు.  ఈ పిల్లల కళ్ళ నిండా లేమే.  అపూ కి తల్లి ఉడకేసే ఆ నీళ్ళ లాంటి అన్నమూ పరమాన్నమే. దుర్గ కాస్త పెద్దది.  ఇల్లు గడవడం కోసం పక్క వాకిళ్ళలో దొంగతనానికీ వెరవదు.  సర్వ జయ కి ఈ పిల్లల భవిష్యత్తు గురించి విపరీతమైన బెంగ. తిండికే గడవని తాము దుర్గ పెళ్ళెలా చెయ్యడమా.. అపూర్ ని ఎలా చదివించడమా అని బెంగ.

ఇన్ని బాధల్లో పదకొండూ పన్నెండేళ్ళ పిల్ల  దుర్గ ని ఇష్టపడిన ఒక డబ్బున్న యువకుడు సర్వజయలో ఎంతో ఆశ కలిగిస్తాడు.  దుర్గ కూడా తనకి పెళ్ళయితే, ఇంట్లో బాధలు కాస్తన్నా తీరుతాయి కదా అని ఆశిస్తుంది. కానీ కుటుంబ తగాదాల్లో, ఆ సంబంధం తప్పి, వెలుగు రాబోతున్న జీవితాలు ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టు మూలపడతాయి.  ఆ రోజుల్లో బెంగాల్ పల్లెల్లో, ఎందరో ప్రజలు మలేరియా తో చనిపోతారు. దుర్గ కూడా వొళ్ళెరగని జ్వరంలో - రోజుల తరబడి ముసురు పట్టిన రోజుల్లో, తన మీద చూరు నుండీ ధారగా నీరు కారుతున్నా కదల లేనంత జ్వరంతో ప్రాణాలు విడుస్తుంది.   దుర్గ పోయిన విషయం తెలీని తండ్రి  కొన్నాళ్ళ తరవాత, పట్నం నుంచీ తీసుకొచ్చిన బహుమానం కళ్ళలో నీళ్ళు తెప్పిస్తుంది. 

చిన్న పిల్ల దుర్గ లేకుండా అక్కడ ఉండడం కష్టమయ్యి  కాశీ లో ఏదో ఒక పని దొరకకపోదని కాశీకి వలస వెళ్తుంది కుటుంబం.  అక్కడకి వెళ్ళేందుకు జీవితం లో మొదటిసారి రైలెక్కిన అపూర్, దుర్గ రైలెక్కలేదని, దుర్గ ని ఆ ఊర్లో వొదిలేసి పోతున్నామనీ బావురుమనడం  చదివి, ఎంతో బాధ కలిగిస్తుంది. కాశీకి వెళ్ళినా వాళ్ళ పరిస్థితి ఏమాత్రం మెరుగు పడకపోగా హరి మరణం, సర్వజయ బ్రతుకు గడవడం కోసం  ఒక జమీందారింట్లో  వంటలక్క గా చేరడం, అపూర్ అక్కడ వాతావరణంలో ఇమడలేక, తీవ్ర అవమానానికి గురయి,  మళ్ళీ నిశ్చిందిపురానికి వెళ్ళిపోవాలని ఇద్దరూ నిర్ణయించుకోవడం... ఇదే ఈ పథం.


ఈ కధ లో అత్యంత నిరాశా పూర్వక జీవితం లో కూడా ఎక్కడో ఏదో మంచి జరగకపోదా అన్న ఆశ ఎలా మనుషుల్ని నడిపిస్తుందో చూస్తాం.  నిశ్చిందిపురం ఆ పిల్లల దృష్టిలో స్వర్గం.  అందమైన తోట. ఆ అందాన్ని వొదులుకుని పట్నాల్లో ఇరుకు ఇళ్ళలో ఎలా గడిపారో అపూ వాళ్ళు అనిపించేంత సౌందర్యం.   హరి హరుడి కూలడానికి సిద్ధంగా ఉన్న ఇంటి చుట్టు పక్కల  ఎలా వుంటుందంటే : :

వాళ్ళ ఇంటి కిటికీ కి కొంచెం అవతలగా చుట్టూ ముదురుగోడ. ఆ గోడని ఆనుకుని అవతల అంతా ఒకటే అడవి.  ఆ కిటికీ దగ్గర కూర్చుంటే చాలు - నీలి సముద్రపు అలల్లాగా భాండీర, శాఖోటక వృక్షాల చివళ్ళు ఆ చెట్లనీ ఈ చెట్లనీ వ్రేళ్ళాడే రక రకాల తీగలు, ఏళ్ళ తరబడి ఉన్న వెదురు చెట్లు, వయో భారం వల్లా ప్రక్కనున్న కర్ణికార, 'వన చాల్ తా' చెట్ల మీదికి ఒరిగిపోతూ ఉండటం, వాటికింద వెలుతురు తక్కువగా ఉండే చోట కాటుక పిట్టలు గంతులు వేస్తూ ఉండటం కనిపిస్తూ ఉంటుంది. 

వాళ్ళ ఇంటి పక్కన ఆ అడవి ఇటు నీలిమైదానం వరకూ, అటు ఏటి గట్టునకు వ్యాపించి ఉంటుంది.  అపూ వాళ్ళకది ఎంత తిరిగినా తిరగనట్లే వుంటుంది.  అపూ అక్కతో కలిసి, ఆ అడవిలో చాలా దూరం తిరిగాడు.  కానీ ఆ అడవి ఎక్కడ ఆఖరయిందో తెలియలేదు వాడికి  - ఈ అడవి, దాని శ్యామలత్వం లోని నూతన స్పర్శ వాడి మనస్సుని, వాళ్ళ అక్క మనస్సునూ పులకరింపజేస్తుంటాయి. పుట్టినప్పట్నించీ సుపరిచితమైందీ అడవి వాళ్ళకి.

క్షణక్షణమూ ఏదో తెలియని ఆనందంతో వాళ్ళ పిపాసు హృదయాల్ని అపూర్వ విచిత్రరసానుభూతితో నింపివేస్తూ ఉంటుంది.  వర్షానికి నిగనిగలాడుతూ పచ్చగా వున్న చెట్ల పొదల మీదికి కరంజ పుష్పాల పసుపుపచ్చని చివుళ్ళు,  అస్తమయపు నీడలో పెద్ద అడవి ఉమ్మెత్త కొమ్మ మీద మెల్లిగా అటూ ఇటూ ఉడుత ఒకటి తిరుగుతుండడం, కావలసినన్ని ఫలపుష్పాలు, అన్నిటికంటె దట్టంగా అడవికి దగ్గరగా వున్న పొదలమీది కొమ్మ కొమ్మనీ ఏవో తెలియని పిట్టలు వ్రాలి ఉండడం  -  అలాంటప్పుడు వాడి మనసుకు కలిగే అపూర్వ గంభీరానందాన్ని ఎవరికీ వర్ణించి చెప్పలేడు వాడు! అదేదో స్వప్నం, ఇంద్రజాలం.  నాలుగువైపులా పక్షులు మధురంగా రోదన చేస్తూ ఉంటాయి, జల జల పూర్లు రాలుతూంటాయి. సంజె నీడలు మరింత దట్టంగా అలముకుంటూ వుంటాయి.  

దుర్గ పోయాక ఆ ఇంట్లో, ఆ ఊర్లోనూ ఉండలేక  వెళ్ళిపోతున్నప్పుడు అపూ హృదయాక్రోశం.. నిశ్చిందిపురానికి ఎంతో దూరాన ఉన్న రైల్వే స్టేషన్ లో రైలు స్టేషన్ ని దాటేస్తున్నప్పుడు చాలా రోజుల క్రితం తానూ అక్క దుర్గా కలిసి తప్పిపోయిన ఆవుదూడ ను వెతుక్కుంటూ, రైలు చూడ్డానికి వచ్చిన రోజు గుర్తొస్తుంది అపూర్ కి.  ఊరి చివర పెద్ద జామచెట్టు క్రింద తనూ, అక్కా ఇంత ముఖంచేసుకుని తమ రైలుబండినే చూస్తున్నట్టు అనిపిస్తుంది.

అక్కను ఎవరూ వెళ్ళి తీసుకుని రాలేదు. అందరూ విడిచిపెట్టేసారు.  అక్క చచ్చిపోయినా, తామిద్దరూ కలిసి ఆడుకునే వెదురుతోపులో, మామిడిచెట్ల నీడలో, నిశ్చిందిపురంలోని కూలిపోయేట్లున్న కొంపలో - అక్క స్నేహ స్పర్శ తనకెప్పుడూ సోకుతూనే ఉండేది. కానీ ఇవళే అక్కతో శాశ్వతంగా తెగతెంపులయిపోతున్నాయి నిజానికి ! 

అక్కను ఇహ ఎవరూ ప్రేమించడంలేదు. అమ్మా లేదు, ఎవరూ లేరు, అక్కను విడిచిపెట్టి వస్తున్నందుకు ఎవ్వరికీ విచారమే కలగలేదు.

తర్వాత జీవితంలో వినీలకుంతల సాగర మేఖల అయిన పృధివితో వాడికి, ఘనిష్ట పరిచయం ఏర్పడింది.  కానీ వాడికి శరీరం ఝల్లుమన్నప్పుడు, సముద్రయానంలో ఓడ డెక్ మీద నుంచి వినీలాకాశపు నూతన రూపం కంటపడుతున్నప్పుడు, ద్రాక్షాకుంజవేష్టితమైన ఏ నీలపర్వత సానువో - సముద్రంలో విలీనమౌతున్నట్లుండీ దిగంత ప్రాంతం నుండి   సుదూరంగా పోయి పోయి లీలగా కంపిస్తున్నప్పుడు, దూరం నంచీ భాసాభాసంగా కనిపించే చెలియలికట్ట - ప్రతిభాశాలియైన స్వరకర్త సృజించిన   మధుర స్వరంలాగా మధురాలాపనను వినిపింపజేస్తున్నప్పుడు - అలాంటి సమయాల్లో యెప్పుడూ వానకురుస్తున్న ఒక రాత్రివేళ ఓ పాత చీకటి కొంప లో రోగంతో మంచంలో పడిన ఓ పల్లెటూరి పేదపిల్ల 'అపూ! నయమయి లేచాక నాకొక రోజున ఎప్పుడైనా రైలు చూపిస్తావా ?' అని అడగడం వాడి మనసు లో ప్రతిధ్వనిస్తూనే వుంటుంది.

అన్నిటా ఓడాక సర్వజయ తో నిశ్చిందిపురానికి తిరిగి వెళ్ళిపోయేలా మాటాడాక అపూ "భగవాన్  నువ్వు మమ్మల్ని నిశ్చిందిపురానికి వెళ్ళేట్ట్లు చెయ్యి. లేకపోతే  బ్రతకలేను. నీ పాదాలు పట్టుకుంటాను" అని గుజగుజలాడాక,


పథ దేవత ప్రసన్నంగా నవ్వి ఓయి వెర్రివాడా, మీ ఊరిలోని వెదురుతోపుతో కాని, బందిపోటయిన వీరురాయ్ వటవృక్షం దగ్గరగాని, 'ధల్ చిత్' కాల్వరేవు దగ్గర గానీ నా పథం అంతమయిపోదు.  మీ 'సోనాడాంగా' మైదానాన్ని, ఇచ్చామతి నదిని దాటి, పద్మాలతో నిండివుండే మధుఖాలి తటాకం పక్కనుంచి పోయి, వేత్రవతి రేవును దాటి, సూటిగా, కేవలం సూటిగా - దేశాన్ని వదిలి దేశాంతరాల వైపు సూర్యోదయాన్ని విడిచి, సూర్యాస్తమయం వైపు, పరిచితములైన పరిధులన్నీ అధిగమించి, అపరిచితములైన పరిధులవైపు సాగి పోతున్నదీ పథం.


దివారాత్రాల్నీ, జనన మరణాల్నీ, మాసాల్నీ, సంవత్సరాల్నీ, మన్వంతరాల్నీ, మహా యుగాల్నీ దాటిపోతూనే వుంటుంది.  మీ జీవిత స్వప్నాలు కుక్క గొడుగుల్లా గుంపులు గుంపులుగా తలలెత్తుతాయి

నా వంశం అంతటితోనూ ముగియదు, పోతూనే వుంటుంది - పోతూనే వుంటుంది - ముందుకు సాగిపోతూనే వుంటుంది.

నిదా అనిర్వాణ వీణానిక్వాణం అనంతాకాశంలో అనంతకాలం ప్రతిధ్వనిస్తూనే వుంటుంది. 

ఈ విచిత్ర ఆనందయాత్రా తిలకాన్ని నీ నుదుట ధరింపజేసి, నిన్ను గృహవిముక్తుణ్ణి చేసి తీసుకువచ్చాను.

"పద, ముందుకు పద.." అంది. (అంటుంది. )


అపూర్స్ ట్రైలొజీ  బిభూతి భూషణుడు రాసిన ఈ పథేర్ పాంచాలీ, అపరాజితో ల ని ఆధారంగా తీసిన మూడు సత్యజిత్ రే సినిమాలు.  మొదటిది ఈ "పథేర్ పాంచాలీ".  అపూ జీవన పథం లో ఎందరో పిల్లలు కలుస్తారు.. చుట్తు పక్కల వాళ్ళ పిల్లలు, కజిన్లు, స్నేహితులు,  తమ కంటే బీదవాళ్ళ పిల్లలు,  దుర్గ స్నేహితులు, తన స్నేహితులు,    ఆ పిల్లల ఆనందాలు,  వాళ్ళలో బీద పిల్లల, అనాధ ఆడపిల్ల ల కష్టాలు చదివి గుండె తరుక్కుపోతుంది.  అయినా కష్టాలనుభవిస్తున్న పిల్లలకి అవేవీ పట్టనే పట్టనట్టుంటారు. అంత అమాయకత్వం!

అపూ లో తండ్రి వారసత్వం గా వచ్చిన చదువూ, చదువు పట్ల ఇష్టం, వాడి బాల్యం, కష్టాలు, చిన చిన్న ఆనందాలు, ఇవన్నీ ఇంతే భాషా సౌందర్యంతో చదువుతున్నప్పుడు మనసు కదలకుండా వుండటం చాలా కష్టం.   ముఖ్యంగా   ఈ అనువాదకుడే  "అపరాజితుడి కథ" ని కూడా అనువదించారంట.   ఈ ఒక్క పుస్తకానికే గుండె పట్టేసి, కొన్ని పుస్తకాల్ని ముగించాక కొన్ని రోజుల వరకూ మనసుల్లోంచీ పోని ఓ తృప్తికరమైన భావన  కలిగి, ఓ లాంటి తన్మయత్వంతో మునిగిపోతుంటే, "అపరాజితుడి కథ" ని చదవడానికి మానసికంగా చాలా శక్తి ని సమీకరించుకోవాల్సొచ్చేటట్టుంది. !  ఆ అనుభూతిని పంచుకుంటూంటే ఎంతో ఆనందం. దీన్ని పరిచయం చెయ్యడానికి ఆ అనుభూతే పనికొచ్చింది.  అందుకే పుస్తకంలోని లైన్లు యధాతథంగా కోట్ చేసాను పైన. 


అంత అత్భుతమైన నిశ్చిందిపురం నుంచీ భరించలేని బీదరికం తరిమేసినా, తల్లి ఒడికి చేరే పిల్లల్లా మళ్ళీ సొంత గూటికి ఒక వేళ వాళ్ళు చేరుకుంటే, ఆ   అపూ, సర్వజయల మిగిల్న కథ ని చదవాలన్న కోరికతో - ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని ఓర్చుకోవడానికి కావలసిన ధైర్యం, మనో నిశ్చయం వీళ్ళని ఎలా నడిపించిదో చదివి, చాలా ఆనందంతో, దుఃఖం తో,  ఈ అత్భుత పుస్తక పరిచయాన్ని ముగించేస్తున్నాను.

* * *

మొదట పుస్తకం. నెట్ లో ప్రచురించబడింది.

03/09/2017

అంపశయ్య - Nawin



అంపశయ్య మొదటి సారి 1969 లో విడుదలయ్యింది. రచయిత  నవీన్ మొదటి నవల, ఆయన పేరునే అంపశయ్య నవీన్ గా మార్చేసింది. ఫేమస్ వర్క్ ఆఫ్ అ ఫేమస్ రైటర్.  కేంద్ర సాహిత్య ఎకాడమీ ఎవార్డును  గెలుచుకున్న తెలుగు నవల. ఈ మధ్యనే దీని పదకొండో ప్రచురణ (2015) తరవాత  పుస్తకం కొనుక్కోవడానికి కుదిరింది.   మొదలు పెట్టాకా ముగించేవరకూ  ఆలోచనా స్రవంతి లో  ఇక  కొట్టుకుపోవడమే. దీన్నేదో ఛైతన్య స్రవంతి అంటారంట. ఇదో ప్రయోగం అంట.  అలాగా అనుకుంటూ - ఆ ప్రయోగం లో మనమూ కాస్త చెయ్యి వేయడానికి వెళ్ళామా దొరికిపోయామే.  కేవలం రవీంద్ర అనే యువకుడి ఆలోచనలే - వాదనలే - దూకుడే - మొత్తం ఒక భావి నిరుద్యోగి - భావి ఫెయిల్యూర్ -  కాబోయే ఆత్మ హంతకుడి కధ.  ఏవేవో తప్పులు ఒకదాని వెంబడి ఒకటి చేస్తూనే పోతూ, వాటిని ఆపలేక, నిస్సహాయత అనే ఊబిలోకి కూరుకుపోతుండే మానసిక రోగి లాంటి మనిషి రవీంద్ర.  ఇదంతా అతని ఆలోచనా స్రవంతి. భావాల పరంపర.  అతని ఆలోచనలే భాష్యాన్ని చెప్తాయి. ఫ్లాష్ బాక్ ని కూడా.


ఒక రోజు లో జరిగే కధ అంట... హిమజ్వాల లా జ్వలించే ఆలోచనలేనంట అంటూ ముందుకు సాగిపోయామా - వికృతమైన పరిస్థితులు, విచిత్రమైన బూతులు. ఇంగ్లీషు సినిమాలు, తారలు, యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ రొచ్చు అంతా చదవాల్సొస్తుంది.    ఆడపిల్లలు ఎలా చదువుతారో ఈ పుస్తకాన్ని అని కొందరన్నారు.    ఈ బూతులు - ఈ సెక్స్ వర్ణనలు, కాలేజీ కుర్రాళ్ళ ప్రగల్భాలు, అన్నీ ప్రయోగాలేనా ? ఈ ప్రయోగం అసలు మంచిదేనా ? తమ తో పాటూ చదువుకునే ఆడపిల్లల గురించి ఇంత అసహ్యంగా మాటాడుకునే కుర్రాళ్ళే తమ ఇళ్ళలో చెల్లెళ్ళనీ, పెళ్ళాలనీ కాలేజీ గుమ్మాలు ఎక్కించనిది. ఒక వేళ వాళ్ళు చదువుకున్నా, ఉద్యోగాలు చేసినా - తమ ఇష్టాల మీద పెళ్ళాడదలచుకున్నా పరువు హత్యలు చేసేది - అని కోపం కూడా వస్తుంది కొన్ని పాత్రల్ని చూస్తే.   అయినా ఈ పుస్తకం 60 ల కాలం నాటిది. కొత్త దేశం, కొత్త విశ్వ విద్యాలయాలు, పాతదే అయిన పేదరికం, పురాతనమైనదే అయిన వర్ణ వ్యవస్థ, అంతకంటే ఎక్కువ గా మన రక్తాల్లో ఇంకిపోయిన భూస్వామిత్వం, బానిసత్వం, కొత్తగా కొమ్ము విదిలిస్తున్న ఆశే లేని నిరుద్యోగం.  అందుకేనేమో - ఈ ప్రయోగాలు మంచివి. మనుషులు ఇలా ఎందుకు ఆలోచిస్తారు, ఎందుకు ప్రవర్తిస్తారు అని ఆలోచించగలిగేలా చేస్తాయి ఈ ప్రయోగాలు.


60 లలో ఉస్మానియా యూనివర్సిటీ లో పీజీ చెయ్యడానికి వరంగల్ నుంచీ వచ్చి చేరిన ఒక బ్రైట్ స్టూడెంట్ హీరో  రవీంద్ర.  కానీ యూనివర్సిటీ రాజకీయాలూ, నగరపు ఆకర్షణలు,  సినిమాల వ్యామోహం  మధ్యా, అంతదాకా ఉర్దూలోనే బోధన సాగించి ఈ మధ్యే ఆంగ్లం లోకి దూకిన ప్రొఫెసర్ల పాఠాలు తలకెక్కక,   చదువు నుండీ పారిపోవడానికీ, పాడైపోవడం వైపు పయనించే 'సిటీ ' పోకళ్ళు తెలియని 'ఊరి' వాడు.   అరవైలలోనే కాలేజీ లో, యూనివర్సిటీలో చదివే అమ్మాయిలు, వాళ్ళ శరీరాలు, ప్రేమలూ, వర్ణనలు,  లావెటర్లీల్లో బూతు సందేశాలు, హాస్టల్లో రక రకాల మనుషులు, రవీంద్ర ని అదో లా చూసే (గే ) గుర్నాధం, రవి చూసిన సినిమాలు, అప్పట్లో వియత్నాం యుద్ధం గురించి, నెహ్రూ విధానాల గురించి కాలేజీ కుర్రాళ్ళ వాదనలు, వాళ్ళు వాడే ఇంగ్లీషూ, ప్రతీ కేరక్టరునూ రచయిత పరిచయం చేసిన తీరూ అవీ చాలా బావున్నాయి. ప్రతీ దానికీ ఓ కనెక్షన్. 


రవి ఆలోచనల్లో, అతను చూసే పీడ కలల్లో, అతని నైరాశ్యంలో, అతను ఊర్లో తల్లి నీ తండ్రినీ, చెల్లెల్నీ తల్చుకుంటూ బాధపడే తీరులో తాను ఎందుకూ పనికిరాకుండా తయారు కావడం గురించి, పరిక్షల గురించి విపరీతంగా భయపడుతూనే, అస్సలు చదవలేక తీవ్ర నిస్పృహ లో ఉంటూనే, కాలేజీ బ్యూటీ కిరణ్మయి కోసం వెంపర్లాడిపోతూ, ఆమె ను తను పొందడం అనేది సాధ్యం కాదని తెలుసుకుంటూనే, చాలా ప్రాక్టికల్ గా ఉండే ఆ అమ్మాయి వెంట ఎడారి లో ఒయాసిస్ లో పరిగెట్టినట్టు పరిగెట్టేస్తూ, రవి!  మూడు నెల్లు గా మెస్ బిల్ కట్టకపోవడం వల్ల తింటానికి తిండి లేక, మల మల మాడిపోతూ కూడా పలాయన వాదం వైపు, గుర్నాధం దగ్గర చేసిన అయిదు రూపాయల అప్పుతో పరిగెట్టేస్తూండే రవి!


ఈ రవి కధ  ఇది. దీన్లో ఉస్మానియా లో పిల్లలు మాటాడుకునే ఆంధ్రా తెలంగాణా వేర్పాటు వాద సంభాషణలున్నాయి. రవి హృదయం ఎంత గొప్పదో - "మనం యూనివర్సిటీ విద్యార్ధులం అర్రా.. ఇలా సంకుచిత భావాలేంటి మనకి - ఈ నేల మనది (రవి తెలంగాణా అబ్బాయి) అనుకోవడం ఎంత మూర్ఖత్వం? ఈ దేశం మనది రా" అంటాడు.  తన ముందరే అత్యంత అసహ్యంగా అమ్మాయిలను కామెంట్ చేసే సహ విద్యార్ధుల ని చూసి చిన్నబుచ్చుకుంటాడు.  వీళ్ళా నా స్నేహితులు అని నిరాశ పడిపోతాడు.  నవల ముగిసే సరికీ తనని ఆప్యాయంగా అభిమానంతో చూసే గుర్నాధాన్ని విపరీతంగా అసహ్యించుకునే మనిషి కూడా "మనిషి" లా మారతాడు. పాపం దేవుడు వాణ్ణలా చేసాడు. దానిలో వాడిదేం తప్పు అని జాలిపడతాడు. 


ఆకలి చంపేసిన విచక్షణ నుంచీ,  ఇతరుల మానవత్వపు ఓదార్పు పొందడం వల్ల మానసికంగా పరిపక్వం చెందాకా,  పరిణితుడై,,తన సహచరుల్లో దోషాల్నీ, ఒప్పుల్నీ సమానంగా స్వీకరిస్తాడు. "వరంగల్ లో అమాయకపు, నిర్మలమైన స్టూడెంటు జీవితానికీ, హైదరాబాద్ లో ఒకడి గొంతు ఇంకోడు కోసేసుకునే cut throat కాంపిటీషన్ కీ, సామ్యమే లేదంటూ, నీ జీవితం, నీ చదువు మీద దృష్టి పెట్టు - భయపడవు బాగుపడతావు. నీ మీద ఆశలు పెట్టుకున్న నీ కుటుంబం కోసం " అంటూ  కాలేజీ రోజుల్నాటి ఫేవరెట్ లెక్చరర్ చెప్పిన   హితవు విని, ఇంక పరీక్షలు రాబోతున్నాయి కాబట్టి ఎలా అన్నా బాగా చదివి మంచి మార్కులు సంపాయించుకోవాలన్న ఆశావహ దృక్పధానికి ప్రయాణించే దాకా మనని తనతో పాటూ ప్రయాణింపచేసేసే రవి. ఎంత బావుంటాడో. తన బలాలూ, బలహీనతలతో పాటూ.


రవి మనసులో కొన్నేళ్ళుగా ఆరని గాయం రత్తి - వాళ్ళ ఊళ్ళో ఉండే బీద అమ్మాయి. ఆ అమ్మాయి కధ చాలా బాధ పెట్టేస్తుంది. ఆ అమ్మాయి నిస్సహాయత కి తానూ కారణం అనే స్పృహ, ఆమె మరణం తరవాత ఈ కుర్రాడిలో కలిగిన గిల్త్, మానవత్వం వర్ణనాతీతం. సహాధ్యాయి ఒకడు ఒక బిచ్చగత్తె నగ్నత ని ఫోటో తీసి చూపించినప్పుడు - వెళ్ళగక్కేసిన ఆక్రోశం,  రత్తి మీద తనకున్న ఆప్యాయత, ప్రేమ, సాంఘిక కట్టుబాట్లు, తన మీద తనలో పేరుకుపోయిన న్యూనత,  మానసిక సంఘర్షణ - గ్రేవ్ దాకా తీసుకుపోతానేమో అన్న రత్తి సీక్రెట్ ని, గిల్ట్ నీ స్నేహితునితో పంచుకున్నాక మనసు విచ్చుకుని, దాన్లోకి వెలుగు ప్రసరించడం మొదలవుతుంది. . ఇవన్నీ చదివాక ఈ అబ్బాయి అసలు సిసలు అబ్బాయి కదా అనిపిస్తుంది. మానవత్వం నశించినవాడు మనిషే కాదు గాబట్టి.


రచనా కాలం గడిచి ఇన్నేళ్ళయినా, ఇప్పటికీ ఎందరో తెలివైన, ఆదర్శవాద విద్యార్ధుల డిప్రెషన్లకి, ఒత్తిళ్ళకీ మానసిక దౌర్బల్యాలకీ అద్దంపట్టే రచన.  ఇన్నాళ్ళ తరవాత కూడా విద్యార్ధుల ఉద్యోగాల మార్కెట్ లో చెల్లని కాణీల్లాంటి విలువలూ, ఆదర్శాలూ ఇప్పటికీ ఈవ్ టీజింగ్ కి ఆడపిల్లలు గురవ్వటాలూ, ఇప్పటికీ పిల్లల చదువు కోసం తల్లితండ్రులు కొవ్వొత్తుల్లా కాలిపోవడాలు, అన్నీ ఇప్పటికీ అవే దృశ్యాలు.

ఏదేమైనా Cruel life కి కాస్తంత సహాయం చేసిన స్నేహ హస్తాల గొప్పతనం, మంచితనం చక్కగా కళ్ళకి కట్టేసారిందులో. సముద్రంలో నీటిబొట్టంత కరుణ కూడా దొరక్కపోయి కదా జరిగేవి ఈ ఆత్మహత్యలు.   నిరాశా నిస్పృహలలో కూరుకుపోయి ఆత్మహత్యే శరణ్యం అనుకుని, అమ్మో! నేను ఆత్మహత్య చేసుకుంటే మా అమ్మ గుండె పగిలి చచ్చిపోదూ అని భయపడిపోయే వెర్రి కొడుకు, దారులన్నీ మూసుకుపోయి, మానసికంగా ఓడిపోయిన విద్యార్ధికి,   దొరికిన ఆలంబన అతని స్నేహితులు.   వాళ్ళు అనాలోచితంగానూ, ఆలోచించుకునీ చేసిన చిన్న చిన్న పన్లు, చేసిన మాట సాయాలూ.. వీడి మంచితనాన్ని గౌరవించే చిన్ని చిన్ని gestures ;    అవి ఎంత గొప్ప Transformation  తీసుకొస్తాయో జీవితంలో - ఒక్క ధాటి గా చదివించేస్తుందీ అంపశయ్య!


ఆకల్తో అలమటించేస్తున్నప్పుడు రోడ్డు వార హోటళ్ళలో బిర్యానీ తినే వాళ్ళ ప్లేట్లు లాక్కుందామా అని చూసే మనిషి, మెస్ బిల్లు డ్యూ కట్టకపోతే హాల్ టికట్ ఎలా వస్తుందా అని భయపడే మనిషి. మూడొందల కోసం తండ్రి ఎవరి కాళ్ళు ఎలా పట్టుంటాడో తెలీక భవిష్యత్తు పట్ల బిక్క మొహంతో చూసే మనిషి,  నకనకలాగే ఆకలితో,  ఆఖరికి వరంగల్ రోజుల్నాటి లెక్చరర్ గారింటికి వెళ్ళి వాళ్ళిచ్చిన బోర్న్ వీటా తాగి, బలం పుంజుకుని, ఆయనిచ్చిన ప్రోత్సాహంతో హాస్టల్ కు చేరి చదువుకు ఉపక్రమించేదాకా  ఇప్పుడో అప్పుడో ఆత్మహత్య చేసుకోబోయిన మనిషి. కానీ ఈ చిన్న సంఘటన అతని దృక్పధం లో మార్పు తీస్కొస్తుంది.   అంతవరకూ వివిధ లోపాలతో తన చుట్టూ చేరే స్నేహితుల, హాస్టల్ మేట్ల పట్ల అతని ఆలోచనల్లో మార్పు రావడం,  అందరూ కలిసి రవిని తీవ్రంగా భయపెట్టేస్తూండే కాంపస్ రౌడీ రెడ్డి గాంగు ని ఎదుర్కోవడం - అన్నీ కేవలం ఒక విద్యార్ధి జీవితంలో ఒక్క రోజులో కలిగిన మార్పు.  ఆశ్చర్యం.


ఒక డిప్రెస్డ్ వ్యక్తి కి తన మీద, తన ఖర్చుల మీద, నోటి మీద అదుపు లేని ఫక్తు నెగెటివ్ వ్యక్తి ఆలోచన పరంపరల్లో పచ్చి బూతులతో - సాటి విద్యార్ధినుల దగ్గర్నించీ స్త్రీ లంటే కలిగే అంతు లేని సెక్సు ఆలోచనల్లో - తోటి విద్యార్ధినుల పట్ల వాళ్ళ కుండే అమూల్య అభిప్రాయాలూ (ఈమె అందమైనదో కాదో ఇంకా నిర్ణయించుకోలేదు - తరహా)  ఇవన్నీ విసుగ్గా వికృతంగా అనిపించినా ఒక్క ఔట్బర్స్ట్ తరవాత రవీంద్ర అసలు మనసు బయటపడి  - అతని మానవత్వం బయటపడి, అతనిలో కాస్త పాసిటివ్ దృక్పధం కనిపించాకా, హమ్మయ్య అనిపిస్తుంది.   అంతవరకూ ఆలోచనల, పరిస్థితుల అంపశయ్య పై చాలా బాధనీ, వ్యధనీ అనుభవించిన రవీంద్ర - మెల్లగా తనని తాను రక్షించుకోగలడు అన్న నమ్మకం కలిగాకా పాఠకుడిలో కాస్త ప్రశాంతత కలుగుతుంది.



తెలుగులో మెదడు ని స్టిమ్యులైజ్ చేసే రచనలు - కేవలం కొన్ని ఆలోచనల ప్రకటన గా జరిగే రచనలు ఎన్నున్నాయో నాకు తెలీదు.  ఈ అంపశయ్య మాత్రం గొప్ప రోలర్ కోస్టర్ రైడ్.  రచయిత మిగిలిన రచనలు కూడా ప్రయత్నించాలనిపించేంత బావుంది.


***

First appeared in pustakam.net,  http://pustakam.net/?p=19809

ఈ పుస్తకాన్ని తెలుగులో "కాంపస్ అంపశయ్య" అనే పూర్తి నిడివి సినిమా గా తీసారు.

ఇంకా... అంపశయ్య - పూర్తిగా తెలుగులో ఉండదు. అన్ని పాత్రలూ ఇంగ్లీష్ లో కూడా మాట్లాడుతూ, పోట్లాడుతూ, ఆలోచిస్తూ ఉంటాయి.  అది కూడా మంచి భాష లో. 

12/08/2017

The Ministry of Utmost Happiness - Arundhati Roy



ఏ భేషజాలూ లేకుండా నిజమే చెప్పాలంటే, ఓ 200 పేజీల దాకా... దీనిలో "హాపీనెస్"   అనేది మచ్చుకన్నా లేదే అని నట్టుతూ.. కధ తప్ప చెత్త అంతా ఉందని విసుక్కుంటూ కూడా, వొదల్లేక చదివాను.  వొదల్లేకపోవడానికి సాహితీ స్పృహ, ఇది విడిచిపెట్టేయదగ్గ పుస్తకం కాదు అనే భావన, వగైరాల  కన్నా, మానవత్వం ముందు నించుని తోవ చూపించడం వల్లే, మిగిల్న పుస్తకం అంతా చదవగలిగాను.  ఈ కధ అంతా మనిషిలో లోపించిన  మానవత్వం గురించే.  అసలు దీన్లో కధ ఏమీ లేదు. ఎప్పటిదో పాత కధ.  రెండు మూడు - నుంచీ - ఓ ముప్ఫయ్ అరవై దాకా పాత్రలు ! ప్రతీ పాత్ర దీ ఓ విషాద గాధ.  


దిల్లీ నేపధ్యం. అత్యంత బీదరికం లో మగ్గిపోతున్న అంజుం అనే హిజ్రా మనసు కధ మొదటి భాగం అంతా. అంజుం స్మశానంలో మనకి పరిచయం అవుతుంది.  

She lived in the graveyard like a tree.  At dawn she saw the crows off and welcomed the bats home. At dusk she did the opposite. When she first moved in, she endured months of casual cruelty like a tree would - without flinching.  When people called her names - clown without a circus, queen without a palace - she let the hurt blow through her branches like a breeze and used the music of her rustling leaves as balm to ease the pain. 

పాత దిల్లీ లో ముస్లింలు ఎక్కువ గా ఉండే షాజహాన్ బాద్ లో ఓ చీకటి వేళ ఆఫ్తాబ్ గా పుట్టింది అంజుం. చీకట్లో ప్రసవం చేసిన మంత్ర సాని మగ పిల్లాడు పుట్టాడని ప్రకటించగానే అంతా ఆనందిస్తారు. కానీ తల్లికి ఆఫ్తాబ్ స్త్రీ, పురుషుడూ ఇద్దరూనూ అని మర్నాడు తెలుస్తుంది.  వెంటనే మాతృ సహజమమైన భయం తో ఆ విషయాన్ని దాచి,  దర్గాల చుట్టూ, తన కుమారుడి (!) కోసం వేలాది మొక్కులు మొక్కుతూ, అయిదేళ్ళ వరకూ కొడుకు లానే పెంచుతుంది తల్లి. కానీ పిల్లాడు బడిలో కి వెళ్ళే సమయానికి, మొదటి సారిగా తండ్రికి ఆఫ్తాబ్ విషయం చెప్పాల్సొస్తుంది.  తమకి పుట్టిన బాబు పరిస్థితి ఇదీ అని తెలుసుకున్న తండ్రి హతాశుడయిపోతాడు.  డాక్టర్ల చుట్టూ ప్రదక్షిణలూ,  అవమానాలూ, క్లేశాల అధ్య ఆఫ్తాబ్ పెద్ద వాడవుతున్నాడు. అతని శరీరానికీ, మనసుకీ పొంతన కుదరక, విపరీతమైన మానసిక సంఘర్షణ తో బాధపడుతూ చివరికి తాముండే చోటికి దగ్గర్లోనే హిజ్రాలుండే ఖ్వాబ్ గంజ్ - కు చేరి, అక్కడే తన జీవితాన్ని,  అంజుం గా మారి గడుపుతాడు.  ఈ అంజుం చిన్నతనం లో హిందుస్తానీ సంగీతం నేర్చుకుని గొంతు మారాకా - వివిధ శస్త్ర చికిత్సలూ, నాటు వైద్యాల వల్ల గొంతు లో స్థిరత్వం పోయి, పాడడమే వొదిలేయాలిసి వస్తుంది. 


అంజుం బ్రతుకంతా హిజ్రా గా - దిల్లీ లో వివిధ శుభకార్యాల లో పాల్గొని, ఆశీర్వాదాలు ఇవ్వడం లోనూ, గాన బజానాల లోనూ, పాత దిల్లీ ని చూడడానికొచ్చే విదేశీయులు భారతీయ హిజ్రాల గురించి నిర్మించే డాక్యుమెంటరీల లో మెరవడంలోనూ, వివిధ పత్రికల లో ఇంటర్వ్యూలూ, ఫోటోలూ దిగడం తోనూ ఉపాధి ని పొందుతూ - ఒక రకంగా హాయిగా - జీవిస్తుంది.   కానీ హిజ్రాల లో ఉన్న మానవత్వం - "తల్లి" తనాలు ఓ మెట్టు పెద్దవే.   జమా మసీదులో ఓ పసిపాప ని ఎవరో వొదిలేసి వెళ్ళిపోతే, తప్పిపోయిన పిల్లేమో అని తన వాళ్ళ కోసం వెతికి, ఆఖర్న ఆ పాప ఎవరో వదిలించు కునేందుకు వదిలి పెట్టిన పాప అని గ్రహించి, అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురే అంజుం లోకం. 


సాధారణ కుటుంబం లో ఇమడలేక, తనంతట తానే ఇల్లొదిలి బయటికి వచ్చిన అంజుం కి తన కుటుంబ సభ్యుల ప్రేమాదరాలకు ఎన్నడూ లోటు లేదు.  చాలా మంది హిజ్రాల లాగా ఈమె ను తల్లి దండ్రులే విడిచిపెట్టేయలేదు.  ఖ్వాబ్ గంజ్ చేరిన కొన్నాళ్ళ వరకూ, అంజుం కి తల్లి వేడిగా భోజనం వండి కారియర్ పంపేది. నెమ్మదిగా తన కాళ్ళ మీద తాను నిలబడగలిగే వరకూ అంజుం కి అన్నదమ్ముల, అక్క చెల్లెళ్ళ ప్రేమ దొరికింది. అందుకే, పరిస్థితులు విపరీతంగా దిగజారి ఖ్వాబ్ గంజ్ వొదిలేసే పరిస్తితులొచ్చిన  సమయానికి చనిపోయిన తన కుటుంబ సభ్యుల సమాధుల దగ్గరకే వచ్చి ఆ సమాధుల  మధ్య కొత్త జీవితాన్ని మొదలుపెడుతుంది. ఇక్కడ ఆమె లోకం, పరిధీ విస్తృతమయ్యి, తననంత తాను బ్రతుకుతూ, మరి నలుగుర్ని చేరదీసి పెంచగలిగే ధైర్యం, తోడూ, స్థిరత్వం కలుగుతాయి.  అంజుం ధైర్య శాలి. కరుణామయి. ఎన్నో భయాలు, బెంగల మధ్య, జీవితాన్ని వెతుక్కున్న మంచి మనిషి.  

ఈ లంకె ను అక్కడల్లా వొదిలి, కశ్మీర్ లో ఓ ముగ్గురు స్నేహితుల కధ ని మొదలు పెడుతుంది రచయిత్రి. వాళ్ళు ముగ్గురూ, నాగా, మూసా, బిప్లవ్ -  దిల్లీ లో ఆర్కిటెక్చర్ చదువుతారు. వీళ్ళ క్లాస్ మేట్ - కేరళ కుట్టి - తిలోత్తమ. ఈ నలుగురిదీ కాలేజీ స్నేహమే. వీళ్ళలో నాగా, బిప్లవ్ లు మరీ చిన్ననాటి స్నేహితులు. ముగ్గురు అబ్బాయిలకీ తిలోత్తమ అంటే ఇష్టం. పిల్ల నల్లగా ఉన్నా కళ గా, పైగా చాలా అందంగా పొడవైన జుత్తు తో తిలో ముగ్గురి మనసుల్నీ  గెలిచేస్తుంది. కానీ తిలో ఎవ్వరితోనూ పెద్దగా కలిసి మెలిసి తిరిగే రకం కాదు. ఆమెకు తండ్రి లేడు. తల్లి పెంపుడు తల్లి కాదు, నిజమైన తల్లే అని అపవాదు ఉంది. ఏదేమైనా తిలో ది చాలా స్వంతంత్ర వ్యక్తిత్వం.  కశ్మీర్ కు చెందిన మూసా ది కూడా అదే తీరు. అతనూ అంతర్ముఖుడు.  కాలేజీ ముగిసాకా, మళ్ళీ కధా కాలానికి వివిధ విచిత్రమైన సంఘటనల తరవాత కలుసుకుంటారు.  నలుగురి జీవితం, చిక్కగా అల్లుకుని, పెనవేసుకుపోతుంది.  ఈ భాగం అంతా చాలా హృద్యంగా, తెలివిగా, వేదన తో, సౌందర్యం తో - నింపేసింది రచయిత్రి. అసలు కాశ్మీర్ ని చర్చించడానికి ఎంత రీసెర్చ్ అవసరమో అంతా చేసి, లొసుగుల తో పాటూ, అక్కడ జరిగే అన్యాయాల్ని, మనం రోజూ చూసే రాళ్ళు రువ్వే కాశ్మీర్ ని, పెల్లెట్ లు ప్రయోగించే  సైన్యాన్నీ పక్క పక్కనే పెట్టి చూపిస్తుంది. 

బిప్లవ్ అమితంగా ఆరాధించిన తిలో, ఆఖరికి నాగా ని వివాహం చేసుకుని 20 ఏళ్ళ కి తను ఏమి చేస్తున్నదీ అర్ధం కాక, అతన్ని విడిచి అంజుం ని చేరుకోవడమే ఈ కధ - దీని వెనుక తిలో, మూసాల ప్రేమ కథ, తొలో అందమయిన జుత్తు ని కత్తిరించిన కశ్మీరీ పోలీసు, మరణించిన అమాయకులూ, ఇవన్నీ చాలా కదిలిస్తాయి.  ఒక్కో చోట చాలా బోర్ అనిపించినా,  నరేంద్ర మోదీ ని విపరీతంగా విమర్శించి - గుజరాత్ కా లల్లా గా ఆ పాత్ర ని పిలుస్తూ, గుజరాత్ అల్లర్లనీ, ఇప్పటి ఉద్వేగంగా మన్ కీ బాత్ చదివే లల్లా నీ, తూర్పారబెట్టినా అది అరుంధతీ రాయ్ కే చెల్లు. నిర్మొహమాటంగా, నిర్భయంగా మనం ప్రభుత్వానికి కట్టబెట్టిన సామ్రాజ్యాధికారం - ఎదురులేని తనానికీ, ఆరిస్ట్రోక్రసీ కీ ఎలా దారి తీస్తూందో ఒక మేధావి గా, ఆలోచించే వ్యక్తి గా చాలా వ్యాఖ్యానాలు చేస్తుంది. కొన్ని వీటిల్లో చాలా అతి గా అనవసరంగా, బోరింగ్ గా అనిపిస్తాయి. వీట్లో - ఒక తెలుగు మహిళా నక్సలైట్ రాసిన ఉత్తరం, దిల్లీ లో ధర్నాల, నిరసన ల రొటీన్, అంజుం పిల్లని పెంచే విధానం, నాగా, తిలో ల వివాహ జీవితం, కశ్మీర్ లో అమ్రీక్ సింగ్ అనే సిక్కు పోలీసు దురాగతాల, దుశ్చర్య ల వర్ణన, విపరీతం - మరీ - అనిపిస్తాయి. కానీ అవి వాస్తవానికి దూరం కాదు. ఏ కష్టాలూ ఎరక్కుండా మీడియా చెప్పిందే నిజమని నమ్మే మామూలు ప్రజల కి - నిజాలు కనిపించవు. కానీ కొన్ని పరిస్థితులు సత్యదూరాలు కావు. మేల్కొలుపులు.  

ఈ పుస్తకం రాయడానికి రచయిత్రి కి సుమారుగా 11 ఏళ్ళు పట్టింది. 1980 ల లో సిక్కు ల ఊచకోత దగ్గరినించీ, మేధా పాట్కర్ ఆందోళనలూ, దేశాన్ని ఓ కుదుపు కుదిపిన రెండో స్వాతంత్రోద్యమం - అన్నా హజారే రాం లీలా మైదానం లో సాగించిన ఉద్యమం, కేజ్రీవాల్ పుట్టుకా, పతనం, (నవల లో అగర్వాల్)  ప్రతీ నేతా తాలూకు వితండ వాదనా పటిమ, ఇలా కొన్నేళ్ళ కధా వస్తువు లు - ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎక్కువ గా జరుగుతున్న  గోరక్షణ పేరుతో జరుగుతున్నసామూహిక హత్యలూ - అలా ఎన్నేళ్ళ నుండో అతి మామూలుగా జరిగిపోతున్న సంఘటనలు ఇవి.  ఇదంతా మన దేశం గురించి, ప్రస్తుత, పాత కాలపు ఎమర్జెన్సీ నుండీ జరిగిన అరాచకాల గురించీ పెద్ద చర్చ - చర్చ అని కూడా అనకూడదు - రేపు ఏంటి అంటూ గతాన్ని మర్చిపోయే ప్రజలకి ఒక రిమైండర్.  అత్భుతం - నచ్చిందీ అనలేము - బోరింగ్ - అనలేము.  ఏదో ఆత్మ వుందీ పుస్తకం లో. 

ఆ ఆత్మ అంతా - ఎపిటాప్ లది. కధంతా పంచదార గుళికల్లాంటి కవితలు - వందల ఏళ్ళ నాటి సూఫీ కవితలు - ఉర్దూ కవితలు - ఇవే అందం.   మచ్చుకి :-


Le saans bhi ahista ki nazuk hai bahut kaam
Afaq ki iss kargah-e-shishagari ka 

Breathe, gently here, for with fragility all is fraught, 
Here, in this workshop of the world, where wares of glass are wrought 


కశ్మీర్ గురించి మాత్రం ఓ నిజం - మనందరికీ తెలిసిన నిజమే గానీ, కొంచెం ఎక్కువ నిజం :-

The inbuilt idiocy, this idea of jihad, has seeped into Kashmir from Pakistan and Afghanistan.  Now, twenty-five years down the line, I think, to our advantage, we have eight or nine versions of 'True'  Islam battling it out in Kashmir.  Each has its own stable of Mullahs and Moulanas.  Some of the most radical among them - those who preach against the idea of nationalism and in favour of the great Islamic Ummah - are actually on our payroll.  One of them was recently blown up outside his mosque by a bicycle bomb.  He wont be hard to replace.   The only thing that keeps Kashmir from self-destructing like Pakistan and Afghanistan is good old petit bourgeois capitalism.  For all their religiosity, Kashmiris are great businessmen.  And all businessmen eventually, one way or another, have a stake in the status quo - or what we call the "Peace Process", which, by the way, is an entirely different kind of business opportunity from peace itself. 


కాశ్మీర్ గురించీ, హిజ్రాల జీవితం గురించీ, ఏదీ దాయకుండా, భయపడకుండా - కాసిన్ని అతిశయోక్తుల తో రాసినా - కొన్ని థియరీ లు మాత్రం నిజంగా ప్రసంశించే విధంగా చక్కగా వివరించడం లో  మాత్రం చాలా చక్కని ప్రతిభ కనబరిచిందీవిడ.   అన్యాయాలూ, మానవ హక్కుల ఉల్లంఘనా - వీటన్నిటి మధ్యా - ఇస్లాం అనే మాట మీద తమ లో తామే కొట్టేసుకుని లేదా భద్రతా దళాలతో ఎదురు కాల్పుల్లో  ఈ తీవ్రవాదులు భారత్ లో కి చొరబడిన ఆర్నెల్లకల్లా  చనిపోయే విషయాన్ని - నవ్వుతూ చెప్పేస్తారు.   హిజ్రాలూ, వాళ్ళ వ్యవస్థా, నక్సలిజం లో మహిళా కామ్రేడ్ల దుస్థితీ, వాళ్ళ కర్తవ్య దీక్ష, తీవ్రవాదుల భావోద్వేగాలూ, వాళ్ళని రక్షించే ప్రజల  defiance,  వీటన్నిటి మధ్యా మన కధ ఇది. మన దేశం కధ.    అంజుం ఉండే స్మశానం  లో   కొన్ని సమాధులకి కధ లుంటాయి.  ఈ సమాధుల చుట్టూ అల్లుకున్న కధల పుస్తకం చదవచ్చు.  అందుకే కవర్ కూడా ఒక సమాధి - దాని మీద ఓ చిన్న పూవు.  చావు లో సౌందర్యాన్ని విప్పి చెప్పే వర్ణనలు. దాల్ లేక్ నుంచీ దర్గాల వరకూ, ఉర్దూ కవితల మాధుర్యాన్నీ, చనిపోయిన పిల్లల సమాధుల మీద చిన్ని చిన్ని రాతల్నీ - అన్నిట్నీ ఎంతో నిబద్ధత తో సేకరించి,  విస్తారంగా రాసిన కధ ఈ Ministry of Utmost Happiness.  (ఈ పేరు వెనక కూడా ఒక చారిత్రాత్మక కధ ఉంటుంది. అది మాత్రం చదివి తీరాల్సిందే)

 అరుంధతీ రాయ్ అతిశయోక్తుల్లో మన దేశ వినాశన ప్రస్తావన కూడా వస్తుంది. కశ్మీర్ వాది ఒకడు మన దేశం ఏదో ఓ నాటికి సమాధి కావల్సిందే అంటాడు. పెద్ద పెద్ద సామ్రాజ్యాలే నేల మట్టం అయినప్పుడు మన లాంటి చిన్న దేశం ఒక లెక్కా.. ఇలానే స్వయంకృతాపరాధాల్ని పునరావృతం చేస్తూంటే - నీ పరిస్థితి కూడా ఇంతే అని చెప్పబోయేటట్టుండే ఈ ప్రస్తావన మరీ అతి గా అనిపిస్తుంది.  కానీ ఇదొ మంచి ప్రయత్నం అని చెప్పడానికి సందేహించక్కర్లేదు.  


* * *

First published in pustakam.net. 



09/08/2017

The portrait of a Lady - Kushwant Singh




మా నాయనమ్మ అందరి నాయనమ్మ ల లానే ఒక ముసలావిడ.  నాకు తను తెలిసిన ఇరవయ్యేళ్ళుగా ఆమె ముడుతలు పడిన చర్మంతో వృద్ధు గానే వుండేది. జనం ఆమె వయసులో చాలా అందంగా ఉండేదనీ, ఆమె కు ఒక భర్త కూడా వుండేవాడనీ అంటూంటారు. కానీ అది ఇపుడు నమ్మడం కష్టం.  మా తాత గారి ఫోటో పెద్ద చెక్క ఫ్రేము లో కట్టినది, మా ఇంటి చావిట్లో వేలాడుతూండేది.  ఆయన పెద్ద తల పాగా, వొదులుగా వుండే బట్టలూ వేసుకుని ఉంటాడందులో.  ఆయన పొడవైన తెల్లని గడ్డం, అతని చాతీని దాదాపూ కప్పేసి, ఓ వందేళ్ళ వృద్ధుడిలాగా కనిపిస్తారు ఆ ఫోటో లో. ఆయన్ని చూస్తే భార్యా పిల్లలూ  ఉండే తరహా మనిషి లా కనిపించరు. కేవలం బోలెడు మంది మనవలే ఉన్న వాడిలా కనిపిస్తారు.  మా నాయనమ్మ ఒకప్పుడు యవ్వనంగా, అందంగా ఉండేది అన్న ఆలోచనే చాలా అసహ్యంగా అనిపిస్తుంది.  ఆమె తాను చిన్నప్పుడు ఆడిన ఆటల గురించీ అదీ ఎప్పుడూ చెప్తూండేది.  వాటిని మేము నాయనమ్మ చెప్పే మిగిల్న ప్రవక్తల కధల్లానే వినేవాళ్ళం.

తను  పొట్టిగా, లావుగా, ఎప్పుడూ,కొంచెం ముందుకి వొంగి ఉండేది. తన ముఖం నిండా ముడుతలూ, గీతలూ చెదురు ముదురుగా గీసినట్టుండేవి. తను ఎప్పుడూ చూడడానికి ఇలానే ఉండేదని మా మనసుల్లో ఒక స్థిర చిత్రం ముద్రించుకుపోయింది.    ఆవిడని ఇంకో విధంగా ఊహించుకోగలిగే ఆలోచనే మాకు లేదు.   తను ఎప్పుడూ ఇలానే వృద్ధు రాలి లానే వుండేది. ఎంత వృద్ధురాలంటే ఇరవయ్యేళ్ళు గా ఆమె అంతే వృద్ధురాలి లా ఉండటమే మాకు తెలుసు. ఆమె లో చక్కతనం కన్నా అందం ఎక్కువ.   తను బాలెన్స్ కోసం వొంగిన తన నడుము మీద ఒక చెయ్యి వేసుకుని, తెల్లని బట్టల్లో, ఇల్లంతా కుంటుతూ నడుస్తూ ఉండేది.  ఇంకో చెయ్యి ఎప్పుడూ జప మాల ని పట్టుకుని, ఒక్కో పూసనీ తిప్పుతూ ఉండేది.  తన వెండి జుత్తు, తన మొహాన్నంతటినీ అలల్లా తాకుతూ ఎగురుతూ ఉండేది. తన పెదవులు ఎప్పుడూ ఏదో వినబడని ప్రార్ధనని పలుకుతూ ఉండేవి. అవును తను అందమైన మనిషి.  చలి కాలంలో తెల్లగా పర్వతాల మీద పరచుకున్న మంచులా దిగంతాల వరకూ విస్తరించుకున్న ప్రశాంత లహరి లా ఒక శ్వాసించే శాంతి, తృప్తీ మా నాయనమ్మ.

నాయనమ్మా, నేనూ మంచి స్నేహితులం.  చిన్నతనంలో నన్ను మా తల్లిదండృలు ఆమె దగ్గర విడిచిపెట్టి నగరంలో ఉన్నన్నాళ్ళూ మేము ఒకర్నొకరం అంటిపెట్టుకునే వుండేవాళ్ళం.  తను నన్ను పొద్దున్నే నిద్ర లేపి, తయారు చేసి స్కూల్ కి పంపేది.  తన ప్రభాత  కీర్తనల్ని ఒకే రాగంలో పాడుతూ నా స్నానపానాదులు ముగించేది. అలా ఆమె ముఖతః కీర్తనల్ని నేర్చుకుంటానేమో అని తన ఆశ !  కానీ  ఆమె గొంతు నాకు నచ్చినా, ఆ కీర్తనల ని నేర్చుకునే  సదుద్దేశ్యం నాకుండేది కాదు.

అప్పుడు తను అప్పుడే కడిగిన పలకా, పచ్చని బలపం, మట్టి తో చేసిన సిరా బుడ్డీ, ఒక వెదురు పెన్నూ సిద్ధంగా ఒక కట్ట గా కట్టి, నా చేతికి ఇచ్చేది.  ఒక మందమయిన పాచి చపాతీ నిండా వెన్నా, చక్కెరా కలిపి రాసిస్తే అది తిని, స్కూల్ కి బయలుదేరేవాళ్ళం.  ఆమె తనతో ఒక కట్ట గా కొన్ని చపాతీలని ఊరిలో వీధి కుక్కల కోసం తెచ్చేది. 

నాయనమ్మ ఎప్పుడూ నాతో పాటూ స్కూల్ కి వచ్చేది. ఎందుకంటే స్కూల్ ఒక ప్రార్ధనాలయానికి అనుబంధంగా వుండేది. పూజారి రోజూ నాకు అక్షరాలూ, ప్రభాత కీర్తనా నేర్పించేవారు. పిల్లలందరూ వరండా అంచులెమ్మడి, చతురస్రాకారంలో కూర్చుని కీర్తన, అక్షరమాలా వల్లె వేస్తూంటే, నాయనమ్మ మాత్రం ఆలయంలో కూర్చుని గ్రంధ పఠనం చేసేది. మా ఇద్దరి చదువూ ముగిసాకా, ఇద్దరం ఇంటిబాట పట్టేవాళ్ళం. అప్పుడు మాకు తోడుగా వీధి కుక్కలూ వచ్చేవి. వాటి కోసం మేము వేసే చపాతీల కోసం,  వాటిల్లో అవి అరచుకుంటూ, గొణుక్కుంటూ, మా వెంటే ఇంటి దాకా వచ్చేవి.

మా తల్లిదండృలు నగరంలో సుఖంగా స్థిరపడ్డాకా, మేమూ నగరానికి వెళ్ళాం.  నాయనమ్మ కీ నాకూ ఉన్న స్నేహం లో ఇదో పెద్ద మలుపు.  మేమిద్దరం ఒకే గదిలో ఉంటున్నప్పటికీ, నాయనమ్మ ఇక్కడ నాతో స్కూలికి వచ్చేది కాదు. నేను ఇంగ్లీషు స్కూల్ లో చేరాను. బస్ లో వెళ్ళేవాడిని. వీధుల్లో కుక్కలు ఊరి లో అన్ని వుండేవి కావు కాబట్టి, నాయనమ్మ ఇంటి ఆవరణ లో  వాలే పక్షులకీ, పిచ్చుకలకీ ఆహారం పెట్టడానికే తనను పరిమితం చేసుకుంది. 

ఏళ్ళు గడిచే కొద్దీ మేమిద్దరం ఒకరినొకరు చూసుకునేదే తగ్గిపోయింది.  కొన్నాళ్ళ వరకూ ఆమె నన్ను పొద్దున్నే లేపి స్కూల్ కి తయారు చేసేది. నేను స్కూల్ నుండీ వచ్చాకా ఆరోజు టీచర్ స్కూల్ లో ఏమి చెప్పారో ఎంతో ఆసక్తి గా అడిగేది. నేనూ ఆమె కు ఇంగ్లీష్ పదాలూ, కొత్త కొత్త సంగతులూ, గురుత్వాకర్షణ శక్తీ, ఆర్కెమెడీస్ సూత్రాలు లేదా చుట్టుపక్కల ప్రపంచం గురించి చెప్పే వాణ్ణి. ఇదంతా విని ఆమె చాలా సంతోషించేది. కానీ ఇంగ్లీష్ స్కూల్లో చెప్పే ఈ విషయాలన్నీ నిజమని మాత్రం నమ్మేది కాదు.  ఈ స్కూల్లో దేవుడి గురించీ, ధార్మికత గురించీ ఏమీ చెప్పట్లేదని బాధపడేది.  ఒక రోజు నేను సంగీత పాఠాల్లో చేరబోతున్నట్టు చెప్పాను నాయనమ్మ కు. అది విని తను చాలా బాధపడింది.  ఆవిడ దృష్టి లో సంగీతానికీ అశ్లీల స్నేహాలకూ సంబంధం వుంది. అది కేవలం బిచ్చగాళ్ళకూ, వేశ్యలకూ సంబంధించిన విద్య అని ఆమె ఉద్దేశ్యం.   మర్యాదస్తులకు సంగీతం ఏమిటన్నది ఆమె అభ్యంతరం.  ఇలా నా సంగీత పాఠాల అనంతరం, నాతో మాటలు బాగా తగ్గించేసింది నాయనమ్మ.

నేను కాలేజీ కి వెళ్ళాకా, నాదీ అంటూ ఒక గది దొరికింది ఇంట్లో.  ఒకే గదీ అని నాకూ నాయనమ్మ కూ  ఉన్న బంధం కూడా తెగిపోయింది.   తన ఒంటరితనంతో నాయనమ్మ వెంటనే రాజీ పడిపోయింది.  చాలా అరదుగానే తన రాట్నాన్ని విడిచిపెట్టి , ఎవరితోనైనా మాటాడేది. పొద్దుట్నించీ పొద్దు పోయేదాకా ఆ రాట్నం వొడుకుతూ, పెదవులతో ఏవో ప్రార్ధనలు చేస్తూ ఒంటరిగానే కాలం గడిపేసేది.  ఒక్క మధ్యాహ్నాలు మాత్రం వరండాలో తీరిగ్గా కూచుని, ఆవరణలో వాలే పిచ్చుకలకు రొట్టెల్ని చిన్న చిన్న ముక్కలుగా తుంపి వెదచల్లుతూ గడిపేసేది. ఆ సమయంలో నాయనమ్మ చుట్టూ వాలే పక్షుల హడావిడీ, వాటి కిచ కిచలూ, గోలా చూసి తీరాల్సిందే.  కొన్ని పిచ్చుకలు వచ్చి ఆవిడ కాళ్ళ మీదా, భుజాల మీదా వాలేవి.  కొన్ని తల మీద కూడా.  ఆవిడ నవ్వుతూ ఉండేది గానీ ఎప్పుడూ ఆ పక్షుల్ని అదిలించలేదు.  ఈ మధ్యాహ్నపు అరగంట సమయమూ.. చాలా సంతోషకరమైన సమయం నాయనమ్మకు.


నేను విదేశాల్లో చదువుకుంటానని నిర్ణయించుకున్నాకా, నాయనమ్మ చాలా బాధపడుతుందని ఖచ్చితంగా అనుకున్నాను.  నేను అయిదేళ్ళ పాటూ ఇంటికి దూరంగా ఉండబోతున్నాను. తన వయసు రీత్యా ఈ మధ్య కాలంలో నాయనమ్మ కాలం చెయ్యదని నమ్మకం లేదు.  కానీ నాయనమ్మ అస్సలు సెంటిమెంటల్ గా ప్రవర్తించలేదు. తను నన్ను సగర్వంగా సాగనంపింది. రైల్వే స్టేషన్ లో అందరితో పాటూ వచ్చి వీడ్కోలు ఇచ్చింది.  తన పెదవులు ఏవో ప్రార్ధన ని పలుకుతున్నాయి, చేతులు జప మాల ని తిప్పుతున్నాయి అప్పుడు ఆవిడ నన్ను దగ్గరకు తీసుకుని నుదిటి మీద మౌనంగా పెట్టుకున్న ముద్దు - ఆ చెమ్మా, ఆ స్పర్శా, ఇదే ఆఖరుది, మళ్ళీ ఈ స్పర్శ దొరుకుతుందా అని చాలా భయపడ్డాను.   ఇదే మా ఇద్దరి మధ్యా ఆఖరి భౌతికమైన స్పర్శ అని అనిపించింది.


కానీ అలాంటిదేమీ జరగలేదు. అయిదేళ్ళయ్యాకా, నేను విదేశాల నుండీ తిరిగొచ్చాకా నాయనమ్మ నన్ను స్టేషన్ లో నే కలుసుకుంది. నా  చేతిని తన చేతుల్లో అదుముకుని నా పక్కన కూర్చుందన్న మాటే గానీ నాతో కబుర్లు చెప్పే తీరిక తనకి లేదు. తన పెదవులు ఏవో కీర్తన ని జపిస్తున్నాయి.  నేను వొచ్చిన మొదటి రోజు కూడా  ఆ మధ్యాహ్నం పక్షుల భోజన సమయం మాత్రమే నాయనమ్మ ఆనందకరమైన సమయం.   ఆ పక్షుల భోజనాన్ని మాత్రం మరిచిపోలేదు తను.   వాటిని తీరిగ్గా, మురిపెంగా తిడుతూ, ప్రేమగా తిండి పెట్టింది నాయనమ్మ. అవే నాకు మిగిలిన అపురూప క్షణాలు.

ఆ రోజు సాయంత్రం నుండీ ఆమె లో మార్పు కనపడింది. ఆ పూట తను ఎటువంటి ప్రార్ధన, కీర్తనా అదీ చెయ్యలేదు.  ఇరుగు పొరుగు అమ్మలక్కలందరినీ పిలిపించుకుని ఒక పాత ఢోలక్ తీయించి పాట పాడ్డం మొదలు పెట్టింది.  తన సాగిన సన్నని వెళ్ళతో ఢోలక్ ని గంటల తరబడి వాయిస్తూ ఇంటికి తిరిగొచ్చిన వీరుల స్వాగత గీతాలు పాడింది.  అతి గా అలిసిపోతావు వొద్దూ అని మేమెంత వారించినా, ఆపలేదు.  అదే ఆఖరు.  నేను నాయనమ్మ ప్రార్ధన అంటూ చెయ్యకుండా వుండడం చూడటం.

మరుసటి రోజు పొద్దున్న కల్లా ఆమెకు సుస్తీ చేసింది.  చిన్న జ్వరం.   డాక్టరు అదే మెల్లగా తగ్గి పోతుందని చెప్పారు. అయితే  నాయనమ్మ కు మాత్రం అది తగ్గిపోతుందని నమ్మకం లేదు.  ఇక తనను   మృత్యువు సమీపించిందని మాతో అంది.   ఇక చావుకు కొద్ది గంటల సమయమే ఉంది కాబట్టి మాతో మాటలాడి సమయం వృధా చెయ్యకుండా ఉండేందుకు మేము ఎంత వారిస్తున్నా వినకుండా జప మాల తీసుకుని ప్రార్ధన మొదలుపెట్టింది.  కాసేపటికి మాకు అనుమానమే రాక మునుపే ఆమె పెదవుల కదలిక ఆగిపోయింది.   జీవం లేని వేళ్ళ నుండీ జప మాల జారిపోయింది.    మాకు ఆమె చనిపోయిందని తెలిసేటప్పటికీ,  ఆమె మొహం నిండా  ఎంతో ప్రశాంతత పరచుకుంది.

ఆమెను శాస్త్ర  ప్రకారం మంచం మీద నుండీ దించి, నేల మీద పడుకోబెట్టి  ఒక ఎర్రని వస్త్రంతో కప్పాము.  కాసేపు ఏడుపులూ అవీ అయ్యాక తనని అలా ఒంటరిగా విడిచిపెట్టి అంతిమ సంస్కారపు ఏర్పాట్లలో మునిగిపోయాము.

సాయంకాలం నాయనమ్మ గదిలోకి తన శరీరాన్ని అంతిమ సంస్కారం కోసం తీసుకెళ్ళేందుకు వచ్చాం.  అదో మరిచిపోలేని దృశ్యం.  అప్పటికి సూర్యాస్తమయం అవుతూంది. వరండా అంతా బంగారపు అగ్ని అంటుకున్నట్టు పల్చని వెలుతురు.  నాయనమ్మ గది లో ఆమె దేహం, ఆ ఎర్రని వస్త్రంలో చుట్టబడి నేల మీద వుంది.  గది లో నేల మీదా, వసారాలోనూ, ఆవరణ అంతటా వందలాది పిచ్చుకలూ, చిన్నా పెద్దా పక్షులూ - నిశ్శబ్దంగా - ఎటువంటి కువ కువలూ లేకుండా ఆమె చుట్టు పక్కలంతా వాలి ఉన్నాయి. మేము నడవడానికి ఖాళీ నే లేకుండా.

ఆ పక్షుల ని చూసి మేమంతా జాలిపడ్డాం. మా అమ్మ వాటికోసం కొన్ని రొట్టెలు తెచ్చి, వాట్ని చిన్ని చిన్ని ముక్కలు గా తుంపి వేసారు. కానీ ఆ  పిచ్చుకలు వాటిని గమనించనే లేదు.  నాయనమ్మ శరీరాన్ని మేము తీసుకువెళ్ళిపోయేదాకా వుండి అవి మౌనంగా ఎగిరి వెళ్ళిపోయాయి.  మరుసటి రోజు పని వాడు వచ్చి ఆవరణ నిండా ఉన్న రొట్టె ముక్కల్ని తుడిచి శుభ్రం చేసాడు. 



 "The Portrait of a Lady" by Kushwant Singh, Novelist, Columnist and Historian of the Sikhs.

* * *







30/07/2017

కొల్లాయిగట్టితేనేమి? - మహీధర రామమోహనరావు

 కొల్లాయిగట్టితేనేమి  ఒక చారిత్రక నవల - ఒక ఆదర్శవాది జీవితం గురించి ఒక కధ.  భారత స్వాతంత్ర్య చరిత్ర లో తెలుగు వాళ్ళ పాత్ర -  గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, వీరేశలింగం లాంటి ఆదర్శ వాదుల కధ.  స్వాతంత్ర్యోద్యమం గురించి ఆ రోజుల్లోనే సమాజం చీలి వుండడం గురించి కూడా నిర్భయంగా చర్చించిన నవల.



మామూలుగా చరిత్ర అంటే రాజులు, రాణులూ, రాజకీయాలూ, సామ్రాజ్యాలూ,  యుద్ధాలూ వరకే తెలుసు. కొ.కొ. చదువు చదివాకా, స్వాతంత్ర ఉద్యమమ కాలం నాటి తెలుగు సమాజం కూడా కాస్త తెలుస్తుంది. ఈ కొల్లాయి గట్టితేనేమి లో చాలా విషయాలు, చరిత్రా, తెలుగు సాంఘిక జీవనం, కులం పట్టింపులు, ఆచారాలూ, అనాచారాలు, ముఖ్యంగా కులం, అస్పృస్యతా, దాన్ని కూడా సమయానుకూలంగా మార్చుకోవడం,  ఒకరి మీదొకరు ఆధారపడే సమాజంలో  మార్పు కోసం ఇరు వర్గాలూ కాంక్షించడం, విరోధించడం, మడీ, మైలా, అంటూ, సొంటూ, విచిత్రమైన మూఢ నమ్మకాలు - అన్నీ దేన్నీ వొదలకుండా  అన్నిటి గురించీ చర్చించారు.

పాత్రలు ఏవీ ఏకపక్షంగా ఉండకుండా, అసలు వాటి కంట్రోల్ లో లేని సంఘటనల్లో జీవితం కొట్టుకు పోతుంటే, ఎవరి నమ్మకాలూ, ఆదర్శాలూ, పట్టింపులూ, వీటి చుట్టూ పరిభ్రమిస్తూనే, జీవితం కంట్రోల్ లోకి వస్తుంటారు. వీటిల్లో అన్నిట్లో ఉత్తమ వ్యక్తిత్వం హీరో రామచంద్ర ది. మొండివాడు రాజు కన్న బలవంతుడు అనో మాట ఉంది.   జాతీయోద్యమం ఉధృతమవుతున్న రోజుల్లో రాజమండ్రి కాలేజీ నుంచీ ఇంగిలీషు చదువు బహిష్కరిస్తాడు.  విదేశీ వస్త్ర దహనం లో తనకున్న బట్టలన్నీ కాల్చి, వంద అప్పు చేసి, ఖద్దరు వస్త్రాలు కొనుక్కుంటాడు.  అప్పటికే పెళ్ళి అయి వుంటుంది.  భార్య కాపరానికి వచ్చే వయసు లో లేదు. మామ గారు సర్కిలిన్స్పెక్టరు.  చదివి కలెక్టరు అవుతాడేమో అనుకున్న అల్లుడు ఇలా చదువు మానేసి ఇంటికి రావడం ఆయనకు నచ్చదు. అదీ ఆయన రాజోద్యోగి. అల్లుడు రాజ ద్రోహి. ఎలా పొంతన కుదురుతుంది ?  కుటిలుడు, ముక్కోపి అయిన మామ కీ, ఆదర్శవాది, శాంత స్వభావి, మానవత్వం ఉన్నవాడూ అయిన అల్లునికీ జరిగే ఘర్షణే మిగతా అంతా.

చదువు మానేసి వచ్చిన రామ నాధం స్ఫురద్రూపి, సద్బ్రాహ్మణుడు.  తల్లి తండ్రీ చినతనం లోనే చనిపోగా పిన్నీ బాబాయిల పెంపకంలో పెరిగిన వాడు. అతని పెద్ద తండ్రి రెండో భార్య గా ఒక తక్కువ కులపు స్త్రీ ని పెళ్ళాడి, ఆమెను విడిగా ఉంచుతూ, ఒక కొడుకుని కంటాడు. ఆ అబ్బాయి వెంకట రమణ - అంతఃసంఘర్షణ ని  చక్కగా ప్రకటించడం రచయిత మానవత్వాన్ని చెప్తుంది.

అసలు తెల్ల వాడొచ్చి దేశానికి మంచిదే జరిగిందనీ, వాళ్ళ మూలంగానే మనకి చదువులూ, రైళ్ళూ, ఆస్పత్రులు, అభివృద్ధీ - ముఖ్యంగా వాళ్ళకి ఈ అస్పృస్యత పట్టింపులు లేవు.  సమాజంలో అస్పృస్యుల కు కూడా చదువ్కోవడానికీ, ఉద్యోగం చేసుకోవడానికీ అవకాశం దొరుకుతుంది. పాత దేశపు పద్ధతుల్లో అయితే మరి ఇలాంటివేవీ ఉండవు. అభివృద్ధి మాటే లేదు అనే వాదనా వుండేది.  అంతరాంతరాల్లో బ్రాహ్మణులూ, అగ్ర వర్ణీకులూ కాని వాళ్ళకైతే అలానే అనిపించేది. ఇప్పుడు ఈ మార్పుల్ని జీర్ణించుకోలేని వాళ్ళే ఈ ఉద్యమం లేవనెత్తినట్టు వారు భావించారు.

నవల లో కధా కాలం - 1919-20 నాటిది. అప్పుడే జలియన్ వాలా బాగ్ సంఘటన జరిగింది. దేశం లో ఉద్యమపు కార్చిచ్చు అంటుకుంది. కానీ కధా స్థలి - ముంగండ అనే ఓ చిన్న అగ్రహారం.   ఓ మారుమూల పల్లె. రాజమండ్రి నుండీ ఒక పగలూ ఒక రాత్రీ పడవలో అంచె ప్రయాణం చేస్తే గానీ చేరలేని ఊరిలో  గాంధీ ఎవరో తెలీని వాళ్ళూ ఉన్నరప్పటికి. గాంధీ మాట అంటేనే పడని వాళ్ళూ ఉన్నారు. గాంధీ పుణ్యాత్ముడనే వాళ్ళూ ఉన్నారు. ఆ వూర్లో అబ్బాయి రామనాధం. చిన్నప్పట్నించీ బ్రాహ్మణపు అలవాట్లూ... జంధ్యం, సంధ్య వార్చడం అవీ ఉన్నా కొద్దో గొప్పో ప్రశ్నించే మనస్తత్వం ఉన్నవాడు. చక్కగా పెళ్ళయి, హోదాలో మామగారిని మించిపోయేంత చదూకుంటాడూ, కలెక్టరు అవుతాడూ అనుకునీసరికీ ఉద్యమం లో చేరి, కాలేజీ మానేసి వస్తాడు.  అందరూ ఈ పిచ్చి పని ని వ్యతిరేకించేవాళ్ళే.  సభా ముఖంగా అతను కాలేజీ మానేయడం గురించి విని, గొప్పగా అభినందించిన కాలేజీ కుర్రాళ్ళే ఆఖరికి ఆ రాత్రే అతని చుట్టూ చేరి, అదెంత పిచ్చి నిర్ణయమో చెప్పడానికి ప్రయత్నించేసరికీ రామనాధానికి ముందున్నది చాలా పెద్ద యుద్ధమే అని తోస్తుంది.  అతనితో పాటూ మానేసిన మిగిలిన నలుగురూ తిరిగి కాలేజీ లో చేరతారు. రామనాధం మాత్రం చేరడు.

కాలేజీ వదిలేసి ఊరొచ్చేసే తోవలో పడవ లో సహ ప్రయాణికురాలు స్వరాజ్యం - ఇంగ్లీష్ చదువులు చదూతుందని మొగుడొదిలేసిన 20 ఏళ్ళ అమ్మయి.  తండ్రి వీరేశలింగం పంతులు స్నేహితుడు.  స్త్రీ కి విద్యే ఆభరణం అని నమ్మి, ఆ రోజుల్లో నే వియ్యంకులు ఎంత వద్దన్నా వినకుండా కూతుర్ని ఇంగ్లీషు చదివిస్తున్నాడు.  ఆ స్వరాజ్యం మాట విని.. అదేంటండీ.. గాంధీ గారు ఇంగ్లీషు చదువు వొదిలేయమంటుంటే మీరు జీవితాన్నే కాదనుకుని చదువుతున్నారేంటీ అని అడుగుతాడు రామనాధం.  ఈ ప్రశ్నలూ, వాటి జవాబులూ, మనిషి కాలంతో పాటూ ఎన్నో సార్లు మారతాడు. ఒకే లా వుండడు.   అతని అభిప్రాయాలు కూడా మారతాయి. మారాలి కూడా అన్నట్టు ఉంటాయి.

రామ నాధానికి  ముంగండ తిరిగొచ్చాకా, విపరీతమైన తిరస్కారమూ, అత్భుతమైన ఆదరణా ఏమీ లభించవు. పెంచిన బాబయ్య, అమ్మ (పిన్ని) ఇద్దరూ పెద్దగా ఆక్షేపించకపోయినా మీ మామగారేమంటారో ఆలోచించుకోలేక పోయావా అని మందలిస్తారు. దానికి రామనాధం తన ఆదర్శాన్నే జవాబు గా చూపిస్తాడు.  అయితే బలవంతంగా అతనికి 15 వ ఏటే వొద్దన్న పెళ్ళి చేసిన బాబాయి మాత్రం అతని జీవితాన్ని గాడిన పెట్టే ప్రయత్నాలు మొదలెడతాడు. అమ్మాయి కాపరానికొస్తే అబ్బాయి దార్లోకి వస్తాడని, ఊరిని ఉద్ధరించే కార్యక్రమాలు వొదిలి పెట్టి భార్యా పిల్లల కోసం ఉద్యోగాన్వేషణార్ధం మళ్ళా చదువు గాడిలో పెడతాడనీ ఆశిస్తాడు.  అతని భార్యని కాపరానికి తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. పిల్ల వయసు రీత్యా రామనాధం దానికి నిరాకరిస్తాడు.  దాంతో పెద్దల అసహనం ఒక్క మాట పెరుగుతుంది.  కుటుంబాలు దూరమవుతాయి, అతని పెళ్ళి పూర్తిగా అస్థవ్యస్థమవుతుంది. రోజులు గడుస్తున్నాయి.

గ్రామంలో అతని జీవితానికి ఒక దిక్సూచి ఏమీ లేకుండా పోతుంది. ఈ లోపు పొరుగు గ్రామపు పిల్లే కావడం వల్ల స్వరాజ్యం తో స్నేహం చిగురించిస్తుంది. తన భవిష్యత్తు భార్య తోనే అనుకున్న రామనాధం,  తన మూలంగా పాడైపోతున్న వైవాహిక జీవితంలో,  భార్య తప్పేముందని భావించిన రామ నాధం తన ఆదర్శాలనీ, కలల్నీ తన ఖద్దరు జీవితాన్నీ భార్య అంగీకరిస్తుందో లేదో తెలుసుకుందామని ఆమెను కలవడానికి మామగారింటికి వెళ్ళి, అక్కడ అనుకోకుండా జరిగిన సంఘటనలో మామ గారి చేత దెబ్బలు తిని, జైలు పాలవుతాడు.  జైల్లో నానా హింసా భరించి, పురుగుల అన్నం తిని,  విడుదలయ్యి ఇంటికొచ్చాకా,  ఇంట్లో అతనికి పట్టింపుల బ్రాహ్మణత్వం ఎదురవుతుంది. జైలుకెళ్ళొచ్చినందుకు ప్రాయశ్చిత్తం చేసుకోమంటే నిరాకరించి, తోటలో గుడిసె వేస్కొని కొత్త జీవితం మొదలుపెడతాడు. ఇక్కడ వుండగా చెరువు లో నీళ్ళను ఆ ఊరి అస్పృస్యులను తాకనివ్వకపోవడం చూసి, బాధపడి, కొన్నాళ్ళు వాళ్ళకి నీళ్ళు తోడి పోసి, వాళ్ళకి శాస్వత ప్రాతిపదిక న తన తోత లో బావి నీళ్ళని వాడుకోనిచ్చి,  కుల బహిష్కృతుడవుతాడు.

ఆఖరికి అతను ఈ ఉద్యమ బాట లోనే నడిచి, తన మేనల్లుళ్ళకి, ఊర్లో కొత్త తరానికి ఆదర్శం గా నిలిచి,  ఖద్దరు ప్రచార బాధ్యత ని తల కెత్తుకుని ఖద్దరు ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించడం, గాంధీ గారు దాన్ని చూడడానికి ఆ కుగ్రామానికి రావడం తో నవల ముగుస్తుంది.  ఆ సంఘటనలు మానవ ప్రయత్నం తోనే జరిగి దైవికంగా జరిగినట్టు అనిపించేలా చెయ్యబడడం కూడా అర్ధం కానంత అమాయకుడు రామచంద్రం.  కానీ ఒక మాట నమ్మాక మాత్రం వెను తిరిగే లక్షణం లేదతనిలో.  ఎంత కష్టం వచ్చినా గానీ ఎదురు నిలుస్తాడు. ఇలాంటి ఎందరో రామచంద్రాలు పోరాడితే నే మన సమాజంలోనూ,  భవిష్యత్తు లోనూ మార్పులొచ్చాయి. ఎంత చిన్న స్థాయిలో ఎంత కొంచెంగా మొదలు పెట్టినా కానీ ఆ లక్షణాన్ని నిలుపుకున్నాడు కనకనే ఆ విజయం సాధించాడు అని చెప్పినట్టుంటుంది.

నవల ముగిసే నాటికి, వివాహం విఫలమైన రామ నాధం, స్వరాజ్యం, పెళ్ళి చేసుకుంటారు.  అతని జాతీయోద్యమపు జీవితం ఎందరో మహనీయుల్ని అతని స్నేహితులను చేస్తుంది. దువ్వూరు సుబ్బమ్మ తో రామనాధం సాన్నిహిత్యం, సుబ్బమ్మ అందర్నీ ఎగదోస్తుందని ముంగుండ లో అమ్మ లు ఆవిణ్ణి ఆడిపోసుకోవడం అవీ బావుంటాయి. తమ తమ జీవితాల్ని ప్రభావితం చేస్తున్న గాంధీ కూడా వాళ్ళకి అయిష్టుడే. కానే అదే గాంధీ వాళ్ళ ఊరికి వస్తే మాత్రం, అంతవరకూ అస్పృస్యులతో రాక్షసంగా ప్రవర్తించినవాళ్ళే - దాన్ని రూపుమాపడానికి ప్రయత్నించిన మహాత్మునికి బ్రహ్మరధం పడతారు.



ఈ నవల లో ప్రతీ పాత్ర కి ఎంతో కొంత ప్రాధాన్యత ఉంటుంది.  ఏవీ అనవసరమైనవి కావు. ప్రతీ పాత్ర ప్రవర్తన వెనకా ఒక విశ్లేషణ ఉంటుంది. అవి ఎంత సహజంగా, నమ్మదగ్గవి గా ఉంటాయో, ప్రతీ పాత్రా - అది విలన్ పాత్రన్నా సరే,  కాస్తయినా అర్ధం చేసుకోగలిగితె ఎంత బావుంటుందో అనిపిస్తుంది.  రావణ బ్రహ్మ భయంకరమైన విలన్ నే అయినా ఆయన ఆదర్శాలూ - ఆయన కారణాలూ ఎవరైనా విడమరచి చెప్పినప్పుడు అరే - ఈ వాదన కూడా భలే బావుందే అనిపిస్తుంది.   రామనాధం మామ గారు - ఇందులో విలన్!!   తాననుకున్నట్టుగా జరగక పోతే ఏ మనిషైనా ఎలా ప్రవర్తిస్తాడో అతనికే తెలీదు.  కాబట్టి ఈ నవల్లో ఈ విలన్ ని కూడా పెద్ద విమర్శించడానికి ఉండదు.  రామ నాధం ఎంత న్యాయం గా ప్రవర్తించినా, ఈ మంకుపట్టు కఠినత్వం, క్రూరత్వాల మామ గారు, కూతురి జీవితం అల్ల కల్లోలమైనా సరే - తాననుకున్నదే జరగాలని భీష్మించుకునే రకం. దానికి విరుగుడు ఉండదు.   అలాంటతను తన భార్య స్వరాజ్యాన్ని అవమానిస్తే, రామనధం ఆయన దగ్గరకి స్వరాజ్యాన్ని తీస్కెళ్ళి - మీకు తెలీదు గాబట్టి చెప్తున్నాను. ఈమె నా భార్య అని పరిచయం చేస్తాడు.

ఆ రోజుల్లో తెలుగు నేల లో జీవితం, పల్లె లో ప్రయాణాలూ,  జాతీయోద్యమం లో పాల్గొన్న ప్రముఖులూ, వాళ్ళ కు ఎదురైన మంచీ చెడ్డా అనుభవాలూ, వాళ్ళ తో పాటూ వాళ్ళ కుటుంబాలు అనుభవించిన సంఘర్షణా - ఈ నవల్లో బాగా చర్చించారు.  ఎందరో హిందూ మతానికి మచ్చ అయిన అంటరాని తనాన్ని, కుల మాత్సర్యాన్నీ  అసహ్యించుకుని బ్రహ్మ సమాజం బాట పట్టారు. ఎందరో చదువుకున్న వాళ్ళూ, చదువుకోలేక పోయిన వాళ్ళూ మార్పు ని కోరుకున్నారు. అది సాంఘిక మార్పు. మొదట మనం మారి, గ్రామాన్ని మార్చి, సమాజాన్ని గాడి లో పెట్టి - అప్పుడు దేశానికి స్వాతంత్రం కోరదాం అనే ధోరణి ఎక్కువ గా కనిపిస్తుంది.

గాంధీ లాంటి ఒక మహాత్ముడు ఈ  కొత్త వేవ్ ని ఒడిసి పట్టి, ప్రజలందర్నీ ఒక తాటికి తెచ్చి, దేశాన్ని స్వాతంత్ర ఉద్యమం వైపుకు నడిపించి, గెలిపించాడు. ఆయన్ని ఆరాధించిన దేశ ప్రజల ప్రేమ, గాంధీ మాటంటే, నోరెత్తకుండా పాటించే అభిమానం ఏ కొల్లాయి తో నైతే సాధించుకున్నాడో ఆ కొల్లాయి, ఈ నవల వచ్చిన కొన్నాళ్ళ తరువాతే ఆయన ధరించడం మొదలు పెట్టాడంట.  ఈ కొల్లాయిగట్టితేనేమి కి కొనసాగింపుగా, దేశం కోపం, జ్వాలా తోరణం రాసారు మహీధర రామమోహనరావు గారు. అవి ఎక్కడ దొరుకుతాయో తెలీదు గానీ ఈ పుస్తకం మాత్రం కినిగె లో ఉచితంగా దొరుకుతుంది. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ 1965, 1978 తరవాత జూలై 2015 లో ఓ వెయ్యి కాపీలు వేసింది.  ఇదీ కధ.

First published in pustakam.net.

08/07/2017

Tempest - AVM Cecil Parker

ఒక్కోసారి నేను రాసే చిన్న చిన్న కధనాలూ, అనుభవాలూ చదివిన పాఠకుల స్పందన లోంచీ మరిన్ని కొత్త కబుర్లు పుట్టుకొస్తాయి. ఇదీ అలాంటిదే. నేను మా కాలంలో టెంపెస్ట్ నడిపిన అనుభవాల్ని ఈ మధ్యే పంచుకున్న తరవాత,  భారతీయ మూలాలున్న కెనడా పౌరుడొకరు నాకు ఈ మెయిల్ రాసారు.  తానెపుడూ కలవనే లేక పోయిన తన తాతయ్య, భారతీయ వాయు సేన లోనే పని చేస్తూ,  టెంపెస్ట్ ప్రమాదంలోనే మరణించడాన్ని ఆయన ప్రస్తావించారు.    ఈ పాఠకుడు చెప్పిన అతని తాతయ్య  పేరు విన్నాకా ఆయన వాయు సేన లో నా సీనియర్ 'ఫలానా' అని గుర్తొచ్చింది.   1953 లో పూనే లో టెంపెస్ట్ ను నడుపుతూ, ప్రమాదవశాత్తూ ఇంజన్ ఫెయిలయిన సంఘటన లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. 

                                                                         టెంపెస్ట్ విమానం లో ఒక రకం 


టెంపెస్ట్ టూ ఎ (Tempest II A)  - RIAF/IAF  (రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ / ఇండియన్ ఏర్ ఫోర్స్) లో 1946 - 53 దాకా తన సేవలందించింది.  మొట్ట మొదటి స్వాతంత్రోత్సవ వేడుకల్లో మొత్తం 12 టెంపెస్ట్ విమానాల్లో ఎర్ర కోట మీద భారతీయ వాయు సేన ఫ్లై పాస్ట్ (Flypast) నిర్వహించింది.  అప్పట్లో ఫ్లై పాస్ట్ దేశానికెంతో గర్వకారణమైన క్షణాలని పదిలం చేసే వేడుక.  ఈ 12 విమానాల శ్రేణి కి అప్పటికి స్కాడ్రన్ లీడర్  (ఇప్పుడు అయిదు నక్షత్రాల రారాజు, మార్షల్ ఆఫ్ ద ఏర్ ఫోర్స్) అర్జన్ సింగ్, DFC,  నేతృత్వం వహించారు.

ఈ విమానం మన వాయుసేన ఏర్పడిన కొత్తల్లోనిది.  1948-49 కాష్మీర్ యుద్ధంలో పదాతి దళాల దూకుడు కు సాయంగా, (offensive support)  విరివిగా వాడబడింది.  బరువైన, శక్తివంతమైన, ఇంకా నడపడం చాలా కష్టంగా ఉండే ఈ టెంపెస్ట్,   ఒక ఇంజెన్, ఒకే సీట్,  పిస్టన్ ఇంజన్ ఉన్న ఆఖరి విమానాల్లో ఒకటి.   ఏదయితేనేం - టెంపెస్ట్ అప్పట్లో వాయు సేనకు పెద్ద దిక్కు.  కొత్తగా వైమానిక దళం లో చేరే యువ పైలట్లకు, 1952 చివర్లో వీటిల్లోనే శిక్షణ లభించేది.

అయితే జెట్ ఇంజన్ల ప్రవేశం మొదలయ్యాకా, కొత్త విమానాల కీ, ఈ పాత విమానాలకీ పొంతన ఏర్పరుస్తూ కూడా శిక్షణ ఇచ్చేవాళ్ళు.  హార్వార్డ్ ట్రైనర్ కీ, టెంపెస్ట్ కీ ఉన్న తేడాల్ని అధిగమించడానికి కనీసం నాలుగు సార్టీలు స్పిట్ ఫైర్ ఎం కె నైన్ [Spitfire MK IX] (స్పిట్ ఫైర్ లో ట్రైనింగ్ శ్రేణి విమానం)  ఎగరాల్సొచ్చేది.  టెంపెస్ట్ టూ ఎ లో ఉండే సెంటారస్ ఇంజన్, కనెక్టింగ్ రాడ్ వైఫల్యం వల్ల తరచూ ఇబ్బంది పెట్టేది.


                                                                                         Spitfire MK IX 


టెంపెస్ట్ కన్వర్షన్ మధ్యలో ఇంజన్ వైఫల్యం చెందిన సంఘటన లో నా కోర్స్ మేట్ ఒకడు విమానాన్ని బలవంతంగా దించాల్సి వచ్చింది (force landing).  ఈ సంఘటన జరిగిన సరిగ్గా ఒక వారం తరవాత, టెంపెస్ట్ లో ఎగురుతూన్న నేను కూడా, నా విమానం ఇంజన్ ఫెయిల్ అయి, కూలబోతోన్న తరుణం లో,  అదృష్టవశాత్తూ పారాషూట్ సాయంతో బయటపడగలిగాను.    ఇది జరిగిన కొద్ది రోజులకే,  మా ఇద్దరికీ దక్కినంత అదృష్టం దొరకక,  మా ఇంకో కోర్స్ మేట్, ఒక నావికదళ పైలట్, టెంపెస్ట్ తో పాటూ నేల కూలి  ప్రమాదంలో మరణించాడు.

ఆ తరవాత పూణే లోనూ, బారక్పూర్ లో పదవ స్క్వాడ్రన్ లోనూ ఇలానే టెంపెస్ట్ ప్రమాదాలు జరగడం, పైలట్ల దుర్మరణం చెందడం, ఎక్కువగా జరగడం తో  తరవాత ఈ టెంపెస్ట్ ల ను వైమానిక దళం నుంచీ తప్పించారు.  క్షణాల వ్యవధి లో జరిగే ఈ విమాన ప్రమాదాల్లో  పారాషూట్ ని వాడనే వాడకుండా పైలట్లు మరణించడం అత్యంత విషాదకరం.   ఈ ప్రమాదాల లో ఆఖరి సమయాలలో ఎమర్జెన్సీ తలుపులు తెరుచుకోకుండా ఏవో అవరోధాలు కలిగినట్టు, డిసైన్ లో లోపాలున్నట్టు, నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం, టెంపెస్ట్ ల వాడకాన్ని నిలిపివేసింది.  టెంపెస్ట్   విమానం  గ్రౌండ్ కావడం వల్ల మా ట్రైనింగ్ ప్రోగ్రాం వాంపైర్ (Vampire) జెట్లున్న స్క్వాడ్రన్ ల కు తరలిపోయింది.

రిటైర్ అయ్యాకా కొన్నేళ్ళ క్రితం కాటర్పిల్లర్ క్లబ్ (Caterpillar Club) లో భారతీయ సభ్యత్వం కోసం  రీసెర్చ్ చేస్తున్నప్పుడు నా కోరికపై భారతీయ వాయుసేన పూర్తి విమానాల సేఫ్టీ డేటాను పంపించింది.  ఫ్లైట్ సేఫ్టీ డేటా అప్పటి దాకా జరిగిన విమానాల ప్రమాదాల గురించి సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది. ప్రమాదాలు ఎప్పుడు ఎక్కడ ఎందుకు జరిగాయో,  మరణాల్నీ, బెయిల్ ఔట్ లనీ అన్నిట్నీ సాధికారంగా తెలుసుకోవచ్చు.  అయితే  దీన్లో టెంపెస్ట్ పై సమాచారం చాలా అసంపూర్ణంగా ఉన్నట్టు అనిపించింది.

ఈ అధికారిక డాటా ప్రకారం చూస్తే, నేను ఒక్కణ్ణే టెంపెస్ట్ నుండీ పారాషూట్ ద్వారా తప్పించుకున్నట్టు ఉన్నాను.   మిగిలిన టెంపెస్ట్ ప్రమాదాల్లో పైలట్లు కూడా విమానంతో పాటూ, తలుపులు తెరుచుకోక, పారాషూట్ వాడే అవకాశం కూడా లేకుండా మరణించారు.  అయితే నాకున్న సమాచారం ప్రకారం, ఇంకో పైలట్ వింగ్ కమాండర్ సిడ్నీ నరోన్ హా, మహా వీర్ చక్ర,  [Wg Cdr Sydney Noronha, MVC]  కాశ్మీర్ లో టెంపెస్ట్ ప్రమాదం నుండీ పారాషూట్ ద్వారా ప్రాణాలతో తప్పించుకున్నారు.  దీన్ని బట్టి,  ఆ రోజుల్లో ప్రమాద వివరాల క్రోడీకరణ శాస్త్రీయంగా జరగలేదన్న సంగతి నాకర్ధం అయింది.

అందుకే నా పై అధికారులూ, సీనియర్లూ అయిన కొందరి అనుభవజ్ఞులయిన పైలట్లని పారాషూట్ బెయిల్ ఔట్ ల గురించి ఏమన్నా సమాచారం ఉందేమో చెప్తారా అని సంప్రదించాను.  నా ఉత్తరాలకు వచ్చిన స్పందన ల లో మార్షల్ ఆఫ్ ద ఏర్ ఫోర్స్ అర్జన్ సింగ్, డీ ఎఫ్ సీ ఇచ్చిన సమాధానం అత్భుతం గా అనిపించింది.  ఆయన మన వాయు సేన ప్రముఖుడు.    బ్రిటీష్ ఇండియా  లోనే వాయుసేన లో పైలట్ గా చేరారు. ఆయన ట్రైనింగ్  బ్రిటన్ లో క్రాన్వెల్ (RAF College, Cranwell, 1938) లో జరిగింది.   రెండో ప్రపంచ యుద్ధంలో ఆయన చేసిన పరాక్రమ ప్రదర్శన కు ఆయనకు అతి చిన్న వయసులోనే, 1994 లో,  డీ ఎఫ్ సీ (DFC - Distinguished Flying Cross (UK) ) లభించింది.  ఈ పద్మ విభూషణుడిని 2002 లో భారతీయ వాయు సేన,  "మార్షల్ ఆఫ్ ద  ఏర్ ఫోర్స్" (Marshal of the Air Force) స్థాయికి ప్రమోట్ చేసి, తన గౌరవాన్ని చాటుకుంది.  ఫీల్డ్ మార్షల్ మానెక్ షా మరణానంతరం,   జీవించి ఉన్న అయిదు నక్షత్రాల రాంక్ ఉన్న ఏకైక భారతీయ సైన్యాధికారి ఈయనే.   ఇండో పాక్ యుద్ధం లో  పాల్గొన్న ఆయన,  కేవల 45 ఏళ్ళకే వాయుసైన్యాధ్యక్షుడు అయ్యారు.  ఆయన విలువలకీ ఆదర్శాలకీ ఈ ఉత్తరం అద్ధం పట్టింది.

ఆయన సమాధానం చూడండి :

"మీ ఉత్తరానికి సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నందుకు చింతిస్తున్నాను.  నేను ఏనాడూ పారాషూట్ వాడలేదు. కనీసం ప్రాక్టీస్ సమయంలో కూడా!   క్రాన్ వెల్ లో నియమాలు ఎంత కట్టు దిట్టంగా వుండేవంటే, మాకు ఒకే ఒక విషయం నూరిపోసారు. అది "మనం జీవితం లో ఒక్క సారే తప్పు చేస్తాం"  ఈ తప్పు మీదే మన జీవితం ఆధారపడి ఉన్నప్పుడు,  మేము ఈ 'చివరాఖరి మార్గాన్ని"  (బెయిల్ ఔట్) ని ఎంచుకునేందుకు సాహసించేవాళ్ళం కాదు.  మా దృష్టి విమానాన్ని సరి అయిన పద్ధతి లో నే నడపడం, దించడం  మీదే వుండేది.  మధ్యేమార్గం మాకు తెలియనే తెలియదు.  ఇప్పుడు ఆధునిక ఎగిరే యంత్రాలలో  ఎజెక్షన్ సాంకేతికత పెరిగిన తరవాత ఈ సిద్ధాంతాన్ని ఎవరూ పట్టించుకోరనుకోండి.  కానీ నాకు గుర్తున్నంత వరకూ టెంపెస్ట్ లాంటి అత్యంత క్లిష్టమైన, ఎగరడానికీ, దించడానికీ కూడా కఠినంగా అనిపించే విమానంలోంచీ మీరు సకాలంలో బయట పడగలిగారంటే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండి ఉండరు.  భారతీయ వాయు సేన తొలి నాటి రోజుల్లో  'ఇర్విన్ '  పారాషూట్ వాడి సురక్షితంగా బయట పడింది మీరే "




ఆయన సమాధానం నన్ను అబ్బుర పరిచింది.  ఆ రోజుల్లో పరిమిత సాంకేతికత సాయంతో కూడా అత్యంత సాహసోపేతంగా విమానాలు నడిపిన తరం ఉండేది.   టెంపెస్ట్ అలాంటి విలువల కాలం నాటిది.   ఈ రోజుల్లో ఆధునిక విమానాల్లో ఇంకా ఆధునికమైన ఎజెక్షన్ (ejection) సీట్లు ఈ పాత కాలపు సిద్ధాంతాల్ని బేఖాతరు చేసేసాయి. "తప్పు"  చేసినా తప్పించుకోగలమనే దృక్పధం మాకు కొత్త!    అయితేనేం?     ఈ డెబ్భయి ఏళ్ళ నాటి టెంపెస్ట్ కబుర్లు నా కెనడా పాఠకుని ఈ మెయిల్ కు,  సరైన సమాధానాన్ని ఇస్తాయేమో అని నా ఆశ. 


- ఎయిర్ వైస్ మార్షల్ సెసిల్ పార్కర్, మహా వీర్ చక్ర, వాయు సేనా మెడల్ (రిటైర్డ్ )
AVM Cecil Parker, MVC, VM (Retd)
[ఆర్ ఎస్ ఐ మాగజీన్, జూలై, 2017 నుంచీ. ]

(Translated, with permission of the AVM)

 ----------------------------------------------------------------------------------------------------------------------
Note :

1.  కాటర్ పిల్లర్ క్లబ్ :  యుద్దం లోనూ, శాంతి యుత ట్రైనింగ్ లోనూ,  కూలిపోబోతున్న విమానాల్లోంచీ పారాషూట్ ల ద్వారా బయట పడ్డ పైలట్ ల కోసం మాత్రమే ఏర్పడిన క్లబ్ ! దీన్లో ఔత్సాహిక స్కై డైవర్లకు ప్రవేశం నిషిద్ధం.  "బెయిల్ ఔట్"  క్షణాల వ్యవధి లో, కేవలం ఆఖరి మార్గం గా తీసుకోవాల్సిన నిర్ణయం, అత్యంత చాకచక్యంగా, అత్యంత స్వల్ప వ్యవధి లో సాహసంతో, ఎక్కడ దిగుతామో తెలియని పరిస్థితి లో భౌతిక సూత్రాల కు వ్యతిరేక పరిస్థితుల్లో శరీరాన్ని ఎయిర్ క్రాఫ్ట్ నుండీ సెకెన్ల లో వేరు చేసేందుకు, ఈ పైలెట్ ల కుశాగ్రత, సాహసం, అదృష్టం, అన్నీ అవసరం.   అందుకే ఇవి కేవలం బెయిల్ ఔట్ అయిన పైలట్ల క్లబ్. నిజానికి దీన్ని ఇర్విన్ ఎయిర్షూట్ కంపెనీ  1922 లో మొదలు పెట్టింది.  లెస్లీ ఇర్విన్, 1922 లో కనిపెట్టిన పారాషూట్ మొదటి ప్రపంచ యుద్ధంలో ఎందరో పైలట్ల ప్రాణాల్ని కాపాడింది.  కాటర్ పిల్లర్ అని ఎందుకు పేరు పెట్టారంటే, తొలినాటి  పారాషూట్ల  వస్త్రం,  పట్టు తో చేయబడడం వల్ల - ఈ పట్టు పురుగుల పట్ల గౌరవం తో.   పైగా కాటర్ పిల్లర్లు తమ కుకూన్ లనుండీ బయటపడితేనే వాటికి జీవితం. అందుకే ఈ పోలిక, అందుకే ఈ పేరు.

2. AVM Cecil Parker, MVC, VM :  ఎయిర్ వైస్ మార్షల్ సెసిల్ వివియన్ పార్కర్ (Cecil Vivan Parker)  - 28 అక్టోబర్ 1952 న రొటీన్ సార్టీ లో,  కూలుతోన్న టెంపెస్ట్ (Tempest-II)  నుండీ  హకీంపేట లో పారాషూట్ సాయంతో బయటపడ్డారు. ఇదొక్కటే ఆయన ఘనత కాదు.  బాంగ్లా విమోచన యుద్ధంలో వింగ్ కమాండర్ గా 20 వ స్క్వాడ్రన్ హంటర్స్ తరపున  పాకిస్తానీ సాబర్ విమానాన్ని కూల్చి,  శత్రు భూభాగం లో "అటోక్"  లో రిఫైనరీ ని బాంబ్ చేసి,  విపరీతమైన దగ్గరి, ఫైరింగ్ లో కూడా ప్రతిభను ప్రదర్శించి, శత్రువు కు ఎక్కువ నష్టం కలిగించి, డిసెంబర్ 1971 లో భారత్ విజయానికి తోడ్పడ్డారు.  ఆయన ప్రదర్శించిన సాహసానికి పరమ వీర చక్ర తరవాత అంత గొప్పదైన మహా వీర చక్ర పురస్కారం లభించింది. ప్రస్తుతం, పదవీ విరమణ తరవాత ఫ్రీ లాన్స్ రైటర్ గా పని చేస్తున్నారు.  

3. RSI (Rajendra Singhji Institute) : మొదటి  సైన్యాధ్యక్షుడు మహారాజా రాజెందర్ సింఘ్ జీ పేరిట ఏర్పడిన ఆర్మీ క్లబ్.  కంటోన్మెంట్ లో పని చేస్తున్న సైన్యాధికారులూ, మాజీ సైన్యాధికారులూ సభ్యులు.   దేశం లో దాదాపు అన్ని ప్రముఖ కాంటోన్మెంట్ లలోనూ ఉన్నా, బెంగళూరు లో క్లబ్,  ప్రముఖమైన,  ఆధునికమైన RSI క్లబ్.  ఏ వూరి క్లబ్ మెంబర్ల రచనలు నెలకో సారి విడుదలయ్యే ఆ వూరి క్లబ్ మేగజీన్లో చదవొచ్చు. చాలా వరకూ ఈ రచనలు పాత, కొత్త జ్ఞాపకాల కలబోత. 

 4. Marshal Arjan Singh, DFC, Padma Vibhushan : ఆయన గురించి వికీ లో పూర్తి సమాచారం చదవచ్చు.  పై ఉత్తరం రచయితకు ఆయన జూలై 1994 లో రాసారు. కాబట్టి  ఈ రచయిత జ్ఞాపకాలు చాలా పాతవి అని గమనించొచ్చు. 
--------------------------------------------------------------------------------------------------------------------------
**ఇది నాకున్న పరిమిత జ్ఞానంతో ఒక మిలిటరీ తరహా వ్యాసాన్ని అనువదించేందుకు చేసిన ప్రయత్నం. గూగుల్ నుండీ తీసుకున్న ఫోటోలు కేవలం ప్రతీకలు.
  

04/05/2017

ISIS The State of Terror - Jessika Stern & J.M.Berger




ఇది ఒక సారి చదవడానికీ, కరెంట్ అఫైర్స్ రిఫ్రెషర్ లాంటి  పుస్తకమే. ఇది సాహిత్యం కాదు. కొందరి జీవితం.  ఎప్పటికప్పుడు మారిపోయే వార్తల్లో ఒక భయంకరమైన కధనం. కాకపోతే ఈ కధ లో బోల్డన్ని మనకి తెలిసినవీ, తెలియనివీ థియరీలు ఉన్నాయి.  ఈ కార్పొరేట్ తరహా, ఎక్సిక్యూటివ్ ఉగ్ర సంస్థ పుట్టు పూర్వోత్తరాల గురించి చాలానే పుస్తకాలొచ్చాయి. అన్నిట్నీ చదవలేకపోయినా, నేను తడిమిన రెండు మూడు పుస్తకాల్లో ఇది కాస్త ఆసక్తికరంగా అనిపించింది. కాలంతో పాటు ద్రవంలా పరిస్థితులు  ఎప్పటికప్పుడూ మారిపోతున్నప్పుడు ఫాలో అప్ లా ఇలాంటి రికనర్లు ఉపయోగపడతాయి.

కొత్తగా తెలుసుకోవడానికి ఏమీ లేకపోయినా ఒక రిఫ్రెషర్ లాంటి పుస్తకం ఇది. "ఇదే ఆఖరు. దీని తరవాత ఇంక ప్రపంచమే లేదు"  అనిపించేంత దారుణమైన, బలంగా అల్లుకున్న,  లొంగని మొండి కేన్సర్ లాంటి  వ్యవస్థ ఐసిస్; అతి పెద్ద నెట్వర్క్ ఉన్న తీవ్రవాద సంస్థ.  అమెరికానే ఐసిస్ ని సృష్టించిందీ, ప్రోత్సహిస్తోందీ అని రక రకాల వాదనలు ప్రచారంలో ఉన్నా,   ఐసిస్ పుట్టుక, బ్రతుకు, చావు (!)  గురించి ప్రపంచానికి, ముఖ్యంగా పాత్రికేయులకూ తెలిసిన సమాచారమే ఈ పుస్తకం.

గ్లాసరీ లో పేరులు,   టైంలైన్ లో వార్తలూ,   సమస్య ను సరిగ్గా అర్ధం చేసుకోవడానికి పనికొస్తాయి. రచయితలు ఇద్దరూ (అమెరికన్) జర్నలిస్టులు: జెసికా స్టెర్న్, జె ఎం బెర్గర్లు. ఇది ఒక చరిత్రను నమోదు చేసే ప్రక్రియ అని ఇద్దరి అభిప్రాయం కూడా.  "If journalism is the first draft of history, a book such as this can only be the second draft, and certainly not the final word."  ఏ రోజుకారోజు కొత్త కొత్త వార్తల్లో పాత వార్తలు మరుగున పడిపోయే ఈ కాలంలో పుస్తకంలో ముఖ్య భాగాల్నిండా.. 'ఈ పుస్తకం ప్రెస్ కి వెళ్ళినపుడు ఇలా జరిగింది' అని మరీ మరీ చెప్పుకున్నారు.

ఐసిస్ బహుశా ఎన్నడూ లేనంత విస్తృతంగా ప్రపంచమంతా  విస్తరించిన సంస్థ.   మామూలు ఉగ్రవాద మూక కాదు. దీనికి పెద్ద బలగం, వ్యూహం, లక్ష్యం వున్నాయి.   ఏ దేశానికి చెందిన వారినైనా ఒక సారి తమ లో చేర్చుకున్నాకా, వీలైనంత వరకూ వారి చావు కబురు మాత్రం తప్పకుండా దగ్గరి వారికి చేరవేయగల  సమగ్రమైన, ఒక ప్రభుత్వ సంస్థ లాగా ఆర్గనైస్డ్  పరిధి వారికి ఉంది.     ఐసిస్ బాధితులు రెండు రకాలు.  [ముస్లిం యువత] మతపరమైన ప్రలోభాలతో తమలోకి ఆకర్షించగా  మిగిలిన, ఆ పిల్లల్ని  కోల్పోయిన తల్లులూ. తండ్రులూ ఒక రకం ;   ఐసిస్ చంపేసిన జనం, వారి బంధువులూ ఇంకో రకం.

పుస్తకంలోకి దూకే ముందు ఒక సారి గుర్తు చేసుకోవాల్సినవి :

2003 లో ఇరాక్ మీద అమెరికా యుద్ధం మొదలు, సద్దాం ప్రభుత్వం కూలడం, జర్కావీ (Terrorist leader  behind AQI, ISIS) అనే భూతం పుట్టుకొచ్చి బాగ్దాద్ లో UN Headquartes మీద బాంబు దాడి చేయడం.

2004 లో అబూ గ్రాయిబ్ జైల్లో, బందీలు గా ఉన్న వారిపై US సాగించిన అకృత్యాల ఫోటోలు బహిర్గతం, వెల్లువెత్తిన ప్రజాగ్రహం, AQI (al Qaeda in Iraq)  మొదలు. జర్కావీ,  బిన్ లాడెన్ కు మద్దతు ప్రకటించడం

2005 లో పబ్లిక్ గా ఆల్కైదా ఇన్ ఇరాక్ (AQI),  శిరస్చేధాలకు తెగబడటం. విదేశీ పోరాట వీరులకు ఆకర్షణీయంగా మారడం.  ఈ లోపు Iraq లో బలవంతపు ప్రజాస్వామ్యం స్థాపన.  అల్లకల్లోలం గా సున్నీ, షియాల ఆధిపత్య పోరు.

2006 లో అమెరికన్ బాంబు దాడిలొ జర్కావీ మరణం,  ఐ.ఎస్.ఐ స్థాపన, అబు ఒమర్ అల్ బగ్దాదీ (బాగ్దాద్ కు చెందిన ఒమర్) దాని నాయకుడు గా ప్రకటింపబడడం. సద్దాం ఉరి.

2007 లో అమెరికన్ మిలిటరీ ఆధిపత్యం, సున్నీల ఉద్యమం మొదలు, దారుణంగా అణచపడిన ఐ.ఎస్.ఐ.

2008 లో Twist in the tale  - ఇరాక్ ప్రైం మినిస్టర్ మాలీకీ  'షియా మిలీషియా' అణిచివేతకు ఆదేశాలివ్వడం,

2009 లో మాలీకీ ఆదేశాల మేరకు 'సున్నీ తీవ్రవాద సంస్థల' అణిచివేత.  అంతర్గత కలహాల అనంతరం, సున్నీల లో  ఐ.ఎస్.ఐ పట్ల పెరిగిన ఆదరణ.    పట్టు తిరిగి సాధించుకుందుకు అవకాశం.  ఐ.ఎస్.ఐ. బాంబు దాడుల్లో ఇరాకీ మంత్రులు సహా 100కు పైగా మరణం,  అమెరికాకు చెందిన 'కాంప్ బక్కా'  మూసేసాకా, దాన్నుండీ "అబు బకర్ అల్ బగ్దాదీ"  విడుదల.

2010 లో అమెరికా దాడులో ఐ.ఎస్.ఐ. నాయకులు "అబు ఒమర్ అల్ బగ్దాదీ", "అబు అయూబ్ అల్ మస్రీ" ల  మరణం తరవాత 'అబు బకర్ అల్ బగ్దాదీ' దానికి నాయకుడు కావడం..  ఇరాకీ ప్రభుత్వం లో మతపరమైన ఇబ్బందులు, కుట్రలు.  అల్లకల్లోలంగా ఇరాక్ రాజకీయ చిత్రం.   ప్రజల్లో ప్రభుత్వం మీద పెరిగిన అసంతృప్తి.

ఇది ఇరాక్ దాకా... ఇపుడు సిరియా:

2011 లో సిరియా లీ దారా పట్టణం లో పదిహేనేళ్ళ పిల్లలు ఒక డజన్ మందిని ప్రభుత్వ వ్యతిరేక గ్రాఫిటీ రాసినందుకు రెజీం అరెస్టు చేసింది. దీనికి వ్యతిరేకంగా దేశ వ్యాప్త నిరశనలు.  ఈ పిల్లల్లో "హంజా అల్ ఖాతిబ్" అనే పిల్లాడి చిత్రవధలతో చంపబడ్డ శరీరం ఇంటికి రావడం,  ప్రజల్లో ప్రభుత్వం పట్ల వెల్లువెత్తిన ఆగ్రహ జ్వాల, అసాద్ ఉక్కు పాదం,  ఇంకా ఇక్కడ పాకిస్తాన్ లో, ఒసామా బిన్ లాడెన్ మరణం,

2012 లో జవాహిరి (ఒసామా తరవాతి ఆల్ కైదా నాయకుడు) అసాద్ కు వ్యతిరేకంగా ముస్లింలు ఐక్యం కావాలని పిలుపు.   ఐ.ఎస్.ఐ. మొదటి popular వీడియో The clanging of swords  విడుదల.    ఈ కాలంలోనే తన మీద పెద్ద అదుపు లేకపోవడం వల్ల  జూలు విదిల్చిన ఐ.ఎస్.ఐ,  జైళ్ళ నుండీ ఖైదీల్ని విడిపించడం అనే 'గోడలు బద్ధలు కొడదాం' అనే ఉద్యమాన్ని లేవదీసింది. ఇది, ఖైదీల్ని తమలో చేర్చుకుని, తమను "బలవంతంగా" చేసుకునే ప్రక్రియ.

2013 లో అమెరికా సిరియా కి "నిరాయుధ"  మద్దతు ప్రకటించడం, 'జభాత్ అల్ నుస్రా'  అనే తీవ్రవాద సంస్థ ప్రాబల్యం పెరగడం, తూర్పు సిరియా ఇస్లామిస్ట్ గ్రూపుల అదుపుకి రావడం.  ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు మెర్జర్ లను ప్రకటించినట్టు  ఐ.ఎస్.ఐ, 'జభాత్ అల్ నుస్రా', తమ సిరియన్ విభాగం అని ప్రకటించడం, వీళ్ళు కాస్తా దాన్ని ఖండించడం, అవీ.    పూర్తి స్థాయి అంతర్యుద్ధం మొదలు.   వివిధ జైళ్ళ నుండీ 500కు పైగా కరుడు కట్టిన ఆల్కైదా తీవ్రవాదుల విడుదలంచేసి తమలో కలిపేసుకున్న ఐ.ఎస్.ఐ.  సిరియన్ రెబల్స్ ని కూడా సిరియా నుండీ తరిమేసి, ఆధిపత్యం నిలుపుకోవడం. ISI - ISIS (Islamic State in Iraq and Syria) గా మారి తన మొదటి అధికారిక ట్విట్టర్ అకౌంట్ ని తెరవడం.

2014 లో అల్కైదా,ఇతర తీవ్రవాద సంస్థలతో పోట్లాటలు వచ్చినా, ముందుకే వెళ్ళి ఒక రోజు వేలాది ట్వీట్లు చెయ్యగల 'ఆప్'  ని తీసుకు రావడం, డజన్ల కొద్దీ ఇరాకీ సైనికుల తలలు నరకడం లాంటి భయానక దృశ్యాలున్న The Clanging of Swords Part-4"   వీడియో విడుదల, దేశ విదేశాల్లో యువత లో పెరిగిన క్రేజ్,  ఇపుడే కాలిఫైట్ ప్రకటన, ISIS  కాస్తా ఇస్లామిక్ స్టేట్ (Islamic State), 'అబు బకర్ అల్ బగ్దాదీ' -  "కాలిఫ్ ఇబ్రహీం" గా మారడం,  IS మొదటి ఇంగ్లీష్ మాగజీన్ 'దాబిక్'  విడుదల.

ఈ సమయంలోనే  విదేశీ బందీల గొంతు తెగ్గోసి చంపి,  వాటి వీడియోల్ని విడుదల చేయడం ద్వారా ప్రపంచ ప్రఖ్యాతి చెందింది ఐసిస్. .  ఈ ఏడాదే ఎన్నో దేశాల్లో లోన్ వుల్ఫ్ ల (విఫల మరియు సఫల) దాడుల ద్వారా,  తమ వేళ్ళు ఎంత లోతులకు పాతుకున్నాయో కూడా ప్రపంచానికి చాటి చెప్పింది ఐసిస్.

ఆగస్ట్ 19, 2014 న అమెరికన్ జర్నలిస్ట్ James Foley  ఆ తరవాత ఇతర విదేశీయులు - బ్రిటిష్, రష్యన్, జాపనీస్, బల్గేరియన్, కొరియన్, ఫిలిపినో పౌరులు - ఇదే పద్ధతిలో చంపబడ్డారు. ఈ చావులన్నీ వీడియో కేమెరా ఎదురుగా. ప్రపంచానికి చాటిచెప్పడం కోసం. భయోత్పాతం కలిగించడం కోసం  చిత్రీకరించబడ్డాయి. జిహాదీ జాన్ గా పేరు కాంచిన బ్రిటీష్ ఉగ్రవాది ఐసిస్ పరిధి ని ఇంకోసారి తెలియజేసాడు.    ఈ తల నరికే వీడియీలు మొదట అల్ కైదా ఇన్ ఇరాక్ నాయకుడు 'అబు ముసాబ్ అల్ జర్కావీ'  ఐడియా. వాటి ప్రభావం మీద అతనికి గొప్ప నమ్మకం. మొండి కత్తితో తీరిగ్గా గొంతు కోయడం, కౄరతకు, రాక్షసత్వానికీ పరాకాష్ఠ.  రాత్రికి రాత్రే ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసే ప్రభావశీలత వీటికి ఉంది.

శత్రువు బలాన్ని అంచనా వేయడానికీ, దాన్లో విఫలమవడానికీ చాలా తేడాలుంటాయి.    ఈ మధ్య యుగాల నాటి అరాచక  కౄర అకృత్యాల వీడియోల DVDలు మొదట ఇరాక్ లో ఫిసికల్ గా పంచేవారు.   ఇంటర్నెట్ యుగంలో ఈ ప్రచార కార్యక్రమం కొత్త పుంతలు తొక్కింది.   ప్రచారం తో పాటూ ఈ ఉగ్ర మూక కు మిగిలిన అల్లాటప్పా ఉగ్ర మూకల కన్న ఎక్కువ ప్రాబల్యం చిక్కడానికీ,  కొత్త వారిని ఆకర్షించడానికీ, తిరుగులేని ఒక   సాంకేతిక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకోవడానికీ సహాయం చేసింది.

ఈ సంస్థ కేవలం ఇరాక్ సిరియాల్లోనే కాకుండా ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం లోనూ, లోన్ వుల్ఫ్ ల ద్వారా విస్తృతంగా యూరోప్ లోనూ వ్రేళ్ళు తన్నుకుంటూ, బలంగా, వేగంగా, చాప కింద నీరులాగా విస్తరించడానికి ఈ సాంకేతిక ఆధిపత్యమే కారణం. వందలాది ప్రాచ్య పాశ్చాత్య దేశాలకు చెందిన కొత్త సభ్యులతో కొత్త ఉత్సాహంతో పుంజుకుంటూనే ఉంది.

2014-17 వరకూ, అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా,  డెన్మార్క్, ట్యునీషియా, బెల్జియం, ఇంగ్లండ్, బంగ్లాదేష్, ఇరాక్, పాకిస్తాన్ లలో పోలీసుల మీదా, సైనికుల మీదా, సామాన్య ప్రజల మీదా చేసిన వివిధ రక ఆయుధ దాడిలో దాదాపూ 1200 కు పైగా మరణించారు. ఇదో పెద్ద సంఖ్య కాదు.  హిట్లర్ నాజీ జెర్మనీలో, వియత్నాం, కాంబోడియా,  శ్రీలంకల్లో,   గడాఫీ, సద్దాం, ఇడీ అమీన్ రాజ్యాల్లో,  రెండు ప్రపంచ యుద్ధాల్లో, కరువు, కాటకాల్లో, సిరియా యుద్ధంలోనూ ఇంతకన్నా ఎక్కువ సంఖ్య లోనే  ప్రజలు ఘోరాతి ఘోరంగా మరణించారు. మరి ఇదే ఎందుకు ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడించే సమస్య ?  ఈ పుస్తకాన్ని చదవాల్సినిది మొదట రాజకీయ వర్గమే. దేనికైనా  రాజకీయ పరిష్కారం సాధ్యమే.

ఈ సంస్థ మిగిల ఉగ్ర సంస్థల లాగా publicity shy కాదు.   publicity hungry.    ఆల్కైదా అగ్ర నాయకులకే విరక్తి కలిగించేంత లెవెల్లో మొండి కత్తులతో నెమ్మదిగా గొంతుకోసి హత్యలు చేయడం, ఒక గుంపు గా మనుషుల్ని హత్య చేస్తున్నప్పుడు, మిగిలిన బందీల్ని ఆ హత్యల్ని చూసేలా నిర్బంధించడం, స్త్రీల పట్లా, యజీదీల పట్లా చెప్పలేనంత ఘోరాలకు పాల్పడడం.. దొరికిన వాళ్ళను (ఇస్లాముని నమ్మని వాణ్ణి/వాళ్ళను) ఏ ఆయుధం చేతిలో ఉంటే దాంతో, ఆఖరికి చేతులతోనైనా, ఏదైనా వాహనంతోనైనా చంపమంటూ ప్రచారం చేసుకునే  భయంకరమైన సంస్థ ఇది.  ఆయా దాడుల్లో మరణించే ముస్లింలనూ, విశ్వాసులనూ   collateral damage  గా తీసిపారేసేస్తుంది.  

దీన్ని ఎదుర్కోవడం కొండని తవ్వడం లాంటి పెద్ద పని.  ప్రస్తుతానికి ఎక్కువ ప్రచారంలో ఉన్న వ్యూహం.. సైనిక పరమైన అలోచన.   వారిని కార్నర్ చేసి, కుళ్ళగొట్టడం (let them Rot) .. ఆహారం, ఇతర సరఫరాలు అందకుండా  చూడడం లాంటివి..   కానీ వివిధ భౌగోళిక, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, అనాలోచిత వ్యూహాత్మక నిర్ణయాల మూలంగా, పరిష్కారం మాత్రం అందనంత దూరంలో ఉంది.  

ఏది ఎలా ఉన్నా,  ఈ పుస్తకాన్ని చదివాకా, రచయితలు ప్రస్తావించిన వివిధ సిద్ధాంతాలు,  ప్రపంచ వ్యాప్తంగా ఐసిస్ హత్యా వ్యాపార లీలా వినోదాల వీడియోలకున్న క్రేజ్   , దీని ప్రాబల్యాన్ని తగ్గించేందుకు  వివిధ రకాలుగా జరుగుతున్న యుద్ధాలూ, ఆసక్తికరంగా అనిపిస్తాయి.   ఒకోసారి అసలంత కీలకంగానే అనిపించని ఈ సంస్థ వల్ల పొంచి ఉన్న ఆపదలు - విస్తృతంగా చర్చ లోకి వస్తాయి. వాళ్ళ పనితీరు, క్రమశిక్షణ, వృత్తి లో నైపుణ్యం, ముఖ్యంగా అబు బకర్ అల్ బగ్దాదీ పట్టూ. ఇవన్నీ చదివితే, సమస్య ని అర్ధం చేసుకోగలం.  అందుకే కరెంట్ అఫైర్స్ ఇష్టపడేవాళ్ళు, (ప్రస్తుతానికి కంపేర్ చేసి చూస్తే పాతదే ఈ పుస్తకం) చదవొచ్చు.


This was first published in  pustakam.net [  http://pustakam.net/?p=19624 ]




26/04/2017

సాదత్ హసన్ మంటో కధలు - 2

ఈ రోజు ఇంకో మంటో కధ.

సిరాజ్

'నాగపడా' పోలీస్ స్టేషన్ దగ్గర ఇరానీ రెస్టారెంట్ దగ్గర,  దీపపు స్థంబానికి తలనానించుకుని నించునుంటాడు 'ఢూండూ'.   అతనికి ఈ ముద్దు పేరు ఎవరు పెట్టారో గానీ, సరిగ్గా అతికినట్టు ఉంటుంది ఈ పేరు.  'ఢూండూ' అంటే 'వెతికి పెట్టేవాడు'  అని అర్ధం. సరిగ్గా అదే పని చేస్తాడు మనవాడు. విటులు కోరే ఎటువంటి అమ్మాయినైనా చిటికెలో సమకూర్చడం అతని వృత్తి.   అతనొక పింప్.

ఏ కులం,మతం, రంగు, వర్ణన కైనా అనుగుణంగా అమ్మాయిల్ని విటులకు అందివ్వడం అతనికి వెన్నతో పెట్టిన విద్య.   ఈ దీపపు స్థంబం,  అతని ఫేవరెట్ స్పాట్. ఎప్పుడన్నా ఆ వీధెమ్మట వెళ్తే, తప్పకుండా ఆ దీపెపు స్థంబాన్ని ఆనుకుని ఢుండూ కనిపిస్తాడు. ఒక వేళ అతనునా రోజు కనబడకపోయినా ఆ స్థంబం అతని మరో ఆత్మ లా అక్కడే నుంచుని నవ్వుతుంటుంది. ఎందుకంటే ఆ స్థంభం పొడుగైనది.  ఢుండూ కూడా పొడగరి.  

ఆ స్థంబాన్నించీ బోల్డన్ని కరెంటు తీగలు ఎక్కడెక్కడికో ప్రవహిస్తుంటాయి.. వాటిదో నెట్వర్క్. అలానే ఢుండూ ది కూడా పెద్ద నెట్వర్క్. ఆ స్థంబానికి  టెలిఫోన్ డిపార్ట్మెంట్ వారు కూడా ఒక జంక్షన్ బాక్స్ పెట్టారు. ఎపుడన్నా కనెక్షన్ లు కలపడానికీ, రిపైర్లు చెయ్యడానికీ.  ఢుండూ కూడా అలాంటి బాక్స్ లాంటి వాడే, ఏ తీగ ఎక్కడ పట్టుకోవాలో, ఎవరి అభిరుచికి అనుగుణంగా వారికి కొత్త కనెక్షన్లు ఎలా ఇవ్వాలో తెలిసిన వాడు.

అతనికి తన వృత్తిలో ప్రతి అమ్మాయీ తెలుసు. వారి శరీరపు ఆకృతి,  వారి చర్మాల క్రింద ఊపిరి తీసుకునే  ప్రతీ నరమూ,  ప్రతి అమ్మాయి స్వభావమూ, వగైరా.   ఏ అమ్మాయి ఎవరికి నప్పుతుందో ఢుండూ కి తెలుసు. ఇలా జీవితం సాఫీ గా గడిచిపోతున్న వేళ సిరాజ్ ప్రవేశిస్తుంది.  ఆమె కొత్తగా వచ్చిన వేశ్య.   స్వగతంగా చెప్పిన ఈ కధ లో  ఢుండూ, రచయిత (మంటో) తో,   ఈ పిల్ల గురించి చెప్తూ మొత్తుకుంటాడు.   

"ఈ దరిద్రానికి మెదడు వాచిందేమో చూడండి మంటో సాబ్!!  దుష్ట స్వభావి, అహంకారి.. అనూహ్యమైన మనిషి. అసలు ఈ వృత్తిలోకి ఎందుకొచ్చిందో?!   ఎవణ్ణీ తాకనివ్వదు.   ప్రతీ మనిషి మీదా నోరేసుకుని పడిపోతూంటుంది.   ఏ 'పాసింజరు'  నూ దగ్గరకే రానివ్వకపోతే బ్రతుకెట్టా గడిచేది? ఇపుడు చూడండి - మనిషి ఒక వస్తువను కొనుక్కున్నాకా, దాన్ని తాకి చూస్తాడు.   అంత దాకా ఇష్టమున్న మనిషిలా నటించి, తీరా వాళ్ళు ముందుకొచ్చాకా రంకెలు వేసి బెదరగొట్టేస్తుంది.   ఆఖరికి పాసింజర్లను ఉగ్ర రూపం దాల్చి కొట్టేస్తుంది కూడా.   నా సగం బిజినెస్స్ ఈ మనిషి వల్లే పడిపోయింది" అని చెప్తూ.. ఈ సమస్యను పరిష్కరించమంటాడు.

'మరి వృత్తి సరిపడని అలాంటి పిల్లను బలవంతంగా ఉంచడం దేనికి ?  పిల్లను తిప్పి పంపేయలేకపోయావా ?    కావాలంటే  ఆమెను పంపేందుకు డబ్బును ఇస్తానంటాడు' మంటో.   ఆ మాటకు సిగ్గుపడిపోతాడు ఢుండూ.   "పంపేయదల్చుకుంటే ఆమె ను పంపేందుకు  కావల్సిన డబ్బు నేనూ సర్దగలను.   కానీ ఆమె ఇక్కడే ఉండాలి" అంటాడు. 

"ఆమెను ప్రేమిస్తున్నావా ?"  అంటే, అవునూ కాదన్నట్టు తలాడించి.   ఆమె అంటే ఇష్టం!  అని ఒప్పుకుంటాడు.   "మీరు చదువుకున్న వారు సాబ్.   ఆమెకు కాస్త నచ్చచెప్పండి.  బీదరాలు.  వొంటి మీద చిరిగిన దుస్తులు తప్ప ఏమీ లేనిది.   హషిష్,  హిందీ సినిమా   పాటలూ తప్ప ఇంకేదీ రుచించని మనిషి.   మీకు తెలుసా ఇప్పటికీ ఆమె కన్యే. ఎవరినీ మీద చెయ్యే వెయ్యనివ్వని మనిషి కన్యే కదా!!!  చూడండి మంటో సాబ్, ఈ నాగపడా పోలీసులు మంచివారు కాబట్టి నేను ఇంకా బ్రతికున్నాను. ఆ పిచ్చిది సృష్టించిన హంగామా కి ఈ విటులే నన్ను లేపేసేవారేమో.. ఆమె తో మాటాడి ఆ పిల్ల బాధేంటో కనుక్కోండి. మీకు పుణ్యముంటుంది"  అని ప్రాధేయపడతాడు.

"ఇప్పటికే బొంబాయిలో వివిధ 'మేడం'  ల దగ్గర పనికి కుదిరి, 'పాసెంజర్ల'ను అదరగొట్టి, బిజినెస్సు దెబ్బ తీసిందని బయటికి తరమబడింది.   ఆ తరవాత ఒక హోటెల్ లో చేరింది, ఈమె ప్రవర్తన చూసి, వాళ్ళూ తరిమేసారు.   తిండీ, గూడూ లేకపోతే చూసి నేను చేరదీస్తే ఇదీ పరిస్థితి.  ఆమెను నేనూ తరిమేయలేను.  ఆమె లో ఈ మిగిల్న అమ్మాయిలో లేనిది ఏదో ఉంది.   పంజాబీ పిల్ల.   అలా నోటినే నమ్ముకుని,  ఎన్నాళ్ళు ఇలా ఉండగలదు?  చూసి చూసి ఏ వెధవో  ఆమెను బలవంతంగానైన చెరుస్తారు. లేదా పొడిచి పారేస్తారు. ఆ పిల్లని మీరే మార్చాలి మంటో సాహిబ్!"  అని మొత్తుకుంటాడు.

ఈ సిరాజ్ ను మంటో ఒకట్రెండు సార్లు చూసాడు.  సరైన భోజనం లేక బక్కచిక్కినా అందమైన మనిషి సిరాజ్. బలహీనంగా ఉన్నా ఏదో తెలియని ఆత్మ విశ్వాసం ఉంటుంది ఆమెలో.   ఆమె కళ్ళు పెద్దవి. స్పష్టంగా, ఆ చక్కని మొహంలో మెరుస్తూ ఉంటాయి. ఆ పెద్ద కళ్ళే మనకు కుతూహలం కలగజేస్తాయి. మంటో కి ఆ కళ్ళను కాసేపు ఎవరన్నా కాసేపు పక్కకు తప్పిస్తే తప్ప ఆమెను పూర్తిగా చూడడం  అసాధ్యం అనిపిస్తుంది. ఆమె పూర్తిగా నిండి ఒలికిపోతున్న మధుపాత్రలా వుంటుంది.  స్త్రీ కి ఉండాల్సిన మృదుత్వమూ, తెచ్చిపెట్టుకున్న చిక్కటి కరుకుతనం కలిపి వైన్ లా ఉండే మనిషి. చిటపటలాడుతూండే స్వభావం ఆమె చిందరవందర జుత్తుకూ,  ముడుచుకుపోయున ముక్కుకీ పెదవులకూ అంటుకునే వుంటుంది.

మంటో చివరికి సిరాజ్ ను,  ఢుండూ కు తెలియకుండా కలుస్తాడు.  ఢుండూ ఇచ్చిన ఆనవాళ్ళ ప్రకారం పరమ రొచ్చు వాతావరణంలో ఒక గుడిసెలో వుంటూన్న సిరాజ్ ని పది రూపాయల కు, మాటాడుకుని, ఒక రెస్టారెంటుకు తీసుకొస్తాడు. నాలుగు పెగ్గుల విస్కీ తరవాత ఆమె మిగిల్న విటులతో ఎలా ప్రవర్తిస్తుందో చూసేందుకు, ఆమె లో ఆగ్రహాన్ని రగిలించడానికీ కాస్త ప్రయత్నిస్తాడు.   అయినా ఆమె ప్రశాంతంగానే ఉంటుంది.  ఆమెకు నలభై రూపాయలిస్తే పుచ్చుకుంటుంది.   విస్కీ తీసుకోదు గానీ,  చరస్ అడిగి తీసుకుంటుంది. ఆ  చరస్  మత్తులో ఆమె,  'రాజ్యాలు కోల్పోయిన మహారాణి' లా అత్యంత విషాదంగా కనిపిస్తుంది.  ఆమె లో గూడుకట్టుకున్న దు:ఖానికి కారణమేమిటో తెలియక బాధనిపిస్తుంది మంటోకి. మర్నాడు   వీరిద్దరి 'మీటింగ్'  గురించి తెలిసి ఢూండూ కొంచెం ఫీలయ్యి, "మీరు ఇలా చేస్తారని అనుకోలేదు సాహిబ్!!" అని ఊరుకుంటాడు.    

విచిత్రంగా ఆ తరవాత కొన్నాళ్ళ పాటూ, సిరాజ్, ఢుండూ,  ఇద్దరూ ఎక్కడా కనిపించరు. సిరాజ్ గురించి వాకబు  చేస్తే ఆమె తిరిగి లాహోర్ వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. మరి ఢుండూ ఏమయినట్టు ? ఆమె ను దింపేసి రావడానికి వెళ్ళాడా? లేదా ఇద్దరూ లేచిపోయారా అర్ధం కాదు. ఢుండూ అలాంటి పని చెయ్యడు. భార్యా పిల్లలున్న వాడు. వాళ్ళంటే అతనికినెంతో అభిమానం.. ఇలా - ఆ దీప స్థంబాన్ని చూస్తూ, ఢుండూ వార్తల కోసం ఎదురు చూస్తుంటాడు మంటో.

ఆఖరికి, ఒక రోజు,  తనకలవాటైన చోటే ఢుండూ కనిపిస్తాడు.   ఇద్దరూ ఇరానీ హోటెల్లో చాయ్ తాగుతూ మాటాడుకుంటారు.   జరిగిందంతా చెప్తాడు ఢుండూ.   "మీతో కలిసి వచ్చాకా, నన్ను లాహోర్ తీసుకెళ్ళమని ప్రాధేయపడింది సిరాజ్. మీరు మిగిల్నసేఠ్ ల లా కాకుండా ఆమె తో ఎంతో బాగా ప్రవర్తించారంటగా.. మిమ్మల్ని ఆ రోజా మాట అన్నందుకు మన్నించండి. మీకు తెలుసు కదా, ఆమె ను నేను కాదనలేను. ఎంత నచ్చజెప్పినా వినలేదు.  మొత్రానికి లాహోర్  వెళ్ళాం. ఒక హోటెల్లో గది అద్దెకు తీసుకున్నాం. ఆమె కోరిక పై ఒక బురఖా కొన్నాను. అది వేసుకుని నెల రోజుల పాటూ వీధి వీధీ తిరిగింది, ఆమె తో నా టైం, బిజినెస్సూ పోగొట్టుకున్నందుకు, నన్ను నేను తిట్టుకోని క్షణం లేదు.

ఆఖరికి ఒక రోజు జట్కాలో  వెళ్తుండగా జట్కా వాణ్ణీ, బండి ఆపమని,  ఒక యువకుణ్ణి చూపించింది.  "నువ్వు ఇక్కడ దిగి, ఆ యువకుణ్ణి హోటెల్ కు తీసుకుని రా.. నేను ముందు వెళ్ళి అక్కడ ఎదురు చూస్తుంటాను"   అంది. నేను ఆ యువకుడితో మాటాడేసరికీ, నా ఇన్నేళ్ళ వ్యాపారానుభవాన్ని బట్టీ వాడుత్త స్త్రీలోలుడని అర్ధమైంది.  అతన్ని తీసుకొచ్చి ఆమె ముందు నిలబెట్టాకా, ఆ యువకుడు,   సిరాజ్ ని చూసి అదిరిపోయాడు. సిరాజ్  అతన్ని చూసి,  "నిన్ను ప్రాణప్రదంగా ప్రేమించాను. నువ్వూ నన్ను ప్రేమించావన్నావు.  నీ కోసం, నా తల్లిదండ్రులనూ, ఇంటినీ వొదిలి వచ్చాను. మనం ఈ హోటెల్లోనే ఒక రాత్రి గడిపాము. నువ్వు మర్నాడు పొద్దున్నే, నన్నొదిలి పారిపోయావు. నేను నీ కోసం ఎదురుచూడడం తప్ప, ఏమి చెయ్యాలో తెలీని పరిస్థితి లో వొదిలేసి వెళ్ళావు.. నా ప్రేమ మాత్రం ఆ రోజు ఎలా వుందో, ఈ రోజూ అలానే వుంది"  అంటూ అతన్ని కౌగిలించుకుంది.  అతను దు:ఖంతో వొణికిపోయాడు.  ఆ రోజు సమాజానికి భయపడి అలా చేసానన్నాడు. నన్ను బయటకు వెళ్ళమంది,   నేను వరండా లో మంచం వాల్చుకుని పడుకున్నాను. తెల్లారుతూనే సిరాజ్ వచ్చి, 'పద'  అంది.  'ఎక్కడికి' అంటే 'బొంబాయికి' అంది.   'మరి అతనో?' అంటే,   "తను పడుకున్నాడు. నా బురఖా కప్పేసి వచ్చాను"  అంది.  అలా ఇద్దరం వెనక్కి వచ్చాం" అన్నాడు.

వీళ్ళిలా  మాటల్లో పడి ఇంకో స్పెషల్ టీ ఆర్డరిచ్చే సమయానికి అక్కడికి సిరాజ్ రానే వచ్చింది.   మంటో కి స్పష్టంగా కనిపించడం మాత్రం ఇలా -   "ఆమె మొహం, కళ్ళూ దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ఏదో సాధించినట్టు, పెదవులపైన అత్భుతమైన చిరునవ్వు. పలకరింపుగా నవ్వుతున్న ఆమె కళ్ళు పచ్చ రైల్వే సిగ్నళ్ళలాగా మెరుస్తున్నాయి!"  ఇదీ సిరాజ్ ముగింపు. వేశ్యల జీవితాల వెనుక ఉన్న విషాద కోణాల్ని చూపించడానికి సిరాజ్ లాంటి ఎన్నో పాత్రలను మంటో సృష్టించాడు.  ఇది కూడా ఒక బాంబే స్టోరీ. కుష్వంత్ సింగ్ మెచ్చినదీనూ.  దీనితో నేను రాయాలనుకున్న రెండు మంటో కధలూ అయిపోయాయి.  

25/04/2017

The Book Thief


ద బుక్ థీఫ్. 



ఇది బాల సాహిత్యం.   ఈ కధ పుస్తకాలెత్తుకుపోయే పదీ పన్నెండేళ్ళ ఏళ్ళ అమ్మాయి  "లీసెల్ మెమింగర్" ది.   గత ఏడు సంవత్సరాలుగా సిరియాలో జరుగుతూన్న అంతర్యుద్ధం కారణం గా దాదాపు ప్రతి రోజూ జరుగుతున్న బాంబు దాడులూ, వాటిల్లో వందల్లో చచ్చిపోతున్న చిన్న పిల్లలూ, -  ఒక కొత్త తరాన్ని అంతరింపజేసేస్తున్న యుద్ధం -  ఇవన్నీ చూస్తూనే ఉన్నాం.  యుద్ధాల్లో అసలైన బాధితులు పిల్లలే.  స్కూళ్ళలో, ఆట స్థలాల్లో ఉగ్రవాద,  అధికారిక దాడుల్లో,   అసలు యుద్ధాల్లో ఎక్కువగా నష్టపోయేదీ, చచ్చిపోయేదీ, తన వాళ్ళని కోల్పోయి అగమ్యగోచరంగా ఎప్పుడు వస్తుందో తెలీని మృత్యు నీడలో భయంగా బ్రతికేదీ చిన్నారులే.    ఇదంతా పెద్ద హోక్స్ అని, పిల్లలెవ్వరూ చచ్చిపోవట్లేదనీ రెజీం చెప్తూన్నా,  కళ్ళ ముందు కనిపించే రక్త పాతం, మొన్నటి UNICEF నివేదిక (2016 సిరియన్ బాలల అత్యంత దారుణమైన సంవత్సరం)  - ఏటికేడూ పెరిగిపోతున్న చిన్నారుల మరణాలు,   దేశం వదిలి పారిపోతున్న చిన్నారులూ,   భవిష్యత్తేమిటో తెలీని పిల్లలూ,   తిండికో,  ఇంకో దేనికో యుద్ధం లో చేరిపోతున్న (ఏడేళ్ళ వయసు  పిల్లల్తో కలిపి)   పిల్లల గురించీ ఇంత స్పష్టమైన వీడియోలూ, గణాంకాలూ మధ్య - యుద్ధం లో తన వాళ్ళ ని కోల్పోయి,  భీభత్సాన్ని, హింస ను,  ఇన్ని కష్టాల్లోనూ, మానవత్వాన్ని  మర్చిపోని  మనుషుల్నీ చూస్తూ పెరిగిన పిల్ల   "లీసెల్" -   ఒక ప్రామాణిక పాత్ర. 

లీసెల్ కధనంతట్నీ మనకి చెప్పేంత పరిజ్ఞానం ఎవరికి ఉంటుంది - మృత్యువు కే. ఎందుకంటే  గాంధీ గారన్నట్టు "మృత్యువు మనల్ని నమ్ముకుని ఎన్నడూ వెంట ఉండే ప్రేయసి".   ఈ ప్రేయసి,  మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టి పోదు.  బుక్ థీఫ్ రాసిన - మార్కస్ జుసాక్ - దీన్ని మృత్యు స్వగతం గానే రాసాడు.  కాబట్టి ఇది మృత్యువు చెప్పిన కధ.

కధాకాలం రెండో ప్రపంచ యుద్ధం నాటిది.   నేపధ్యం - ఆర్య సిద్ధాంతపు కైపులో మునిగి తేలుతున్న జెర్మనీ లో మ్యూనిచ్ కి దగ్గరలో ఉన్న చిన్న గ్రామం -  మోల్ చింగ్ / మోల్ కింగ్.   ఫ్యూరర్ (Fuhrer (Hitler)) గారి ప్రతాపం లోకానికి తెలిసే నాటికి,  మోల్కింగ్ లో ఓ పేదల ఇంటికి పెంపకానికొస్తుంది లీసెల్.   నిజానికి లీసెల్, తన తమ్ముడూ రావాల్సింది,  కానీ ఆ చలి లో నిమోనియా తో  చిన్న తమ్ముడు శ్వాస అందక మార్గ మధ్యంలోనే ప్రాణాలు విడుస్తాడు.   పిల్లల్ని ఈ ఫాస్టర్ పేరెంట్స్ కి అప్పచెప్పడానికొచ్చిన తల్లి, ఎ లానో పిల్లాణ్ణి సమాధి చేసి,  పిల్లని తీసుకుని ఊర్లోకి అడుగుపెడుతుంది.  ఈ లీసెల్ - తమ్ముడ్ని కోల్పోయిన దుఃఖం'  ఏమిటో అర్ధం కాకముందే, శ్మశానంలో పిల్లాణ్ణి పాతిపెడుతున్న దృశ్యాన్ని కళ్ళప్పగించి చూస్తూ.. అక్కడ తడి మట్టి లో పడి ఉన్న ఒక పుస్తకాన్ని చటుక్కున తన స్కర్టు లో దాచేసి, తెచ్చుకుంటుంది. బహుశా తమ్ముడి జ్ఞాపంగా..  అదే మృత్యువు చూసిన మొదటి దొంగతనం.  అందుకే  లీసెల్ ని మృత్యువు" పుస్తకాల దొంగ" అనే పిలుస్తూ ఉంటుంది.   ఆ పుస్తకం   - "A Grave Diggers' Handbook".   గుండెల్నిండా కొడుకుని కోల్పోయిన దుఃఖం,  కూతుర్ని వేరే ఎవరి ఇంటిలోనో వొదిలేసి వెళ్ళాల్సి రావడం వల్ల  తల్లి మొహం లో ఎమోషన్స్ - గుండె నిండా బడబాగ్నిని దాచుకుని ధీర లా కర్తవ్యం వైపు అడుగులేసిన ఆ తల్లి ని చూసి మృత్యువు కూడా అబ్బురపోతుంది..
"How could she walk ?
How could she move ?
That's the sort of thing I 'll never know, or comprehend"..


ఇక్కణ్ణించీ లీసెల్ కధ లో ఓ పెద్ద మలుపు.  పిల్లని "హిమ్మెల్"  వీధి లో" హాన్స్ హబ్బర్  మేన్" అనే పెద్ద మనిషి కుటుంబానికి అప్పగించి,  వచ్చిన దార్లోనే వెళిపోతుంది తల్లి.  హెమ్మెల్ వీధి - ఒక స్వర్గం. పేదవాళ్ళ బస్తీ.  ఆమె ఎందుకు పిల్లల్ని వొదులుకోవాల్సి వస్తుందో అస్పష్టం.  అమె కమ్యూనిస్ట్ నేపధ్యం కారణం కావచ్చు. తండ్రి కుటుంబాన్ని వొదిలి వెళ్ళిపోయాడు. పిల్లల్ని ఫాస్టర్ కేర్ లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇవ్వాలి.    ఆమెకు ఎంత కష్టం - యుద్ధం, ఆర్ధిక మాంద్యం వగైరా ల వల్ల, ఇద్దరు పిల్లలకి తిండి పెట్టే స్తోమత లేదు. .  పిల్లని పెంచుకున్నందుకు గానూ ఫాస్టర్ పేరెంట్స్ కు కొంత అలవెన్సు దొరుకుతుంది. అంతే కాదు. ఈ హబ్బర్  మేన్లు ఒంటరి ప్రాణులు. వాళ్ళ ఒక్కగానొక్క కొడుకు జెర్మనీ తరఫున యుద్ధానికి వెళ్ళి ఉన్నాడు.  హిట్లర్ నూరిపోసిన అతి జాతీయవాదం నర నరానా జీర్ణించుకుపోయి, యుద్ధానికి వెళ్ళని తండ్రి మితవాదాన్ని అసహ్యించుకునే మనస్తత్వం కొడుకుది.     వీధి లో చాలా మంది మగ పిల్లలు యుద్ధం లో నే ఉన్నారు. వాళ్ళలో కొందరు ఇష్టపడి, హిట్లర్ ఉన్మాదత ని ప్రేమించి,  ఆయన కల్ల బొల్లి మాటలు నమ్మి  యుద్ధానికి వెళ్తే,  కొందరు తొందర్లోనే యుద్ధోన్మాదంలో ప్రమాదాన్ని తెలుసుకున్నా.. హిట్లర్ ని నమ్మినా నమ్మక పోయినా - అధికారుల పట్ల భయంతో యుద్ధానికి వెళ్తారు. కాబట్టి, తల్లి కీ తండ్రికీ  తమ శూన్యత ని మరిచిపోవడానికి , కాలక్షేపానికి ఈ పిల్ల ని పెంచడం అవసరం.  ఆ రోజుల్లో యుద్ధాల  వల్ల అనాధలయిన పిల్లల్ని  మిగతా కుటుంబాలు సాకడం సాధారణం.

లీసెల్ కొత్త ఇంట్లో కి వచ్చేసరికీ, తన జీవితంలో ఏర్పడిన ఒడిదుడుకులు, ఒంటరితనం వల్ల,  భయపడి పోయి  ఉంటుంది.  పెంపుడు తల్లి రోసా హబ్బర్ మేన్ ది చెక్క మొహం.  దాన్లో కరుణ అనేది ఏ కోశానా కనిపించదు.  పిల్లని భయపెట్టడం లో సిద్ధ హస్తురాలు.   తండ్రి హాన్స్ హబ్బర్ మేన్ ఎంతో దయ గల వ్యక్తి. అతను ఒకప్పుడు జెర్మనీ తరఫున యుద్ధం లో పాల్గొన్న వాడే.  కానీ సౌమ్యుడు.   యుద్ధంలో అతనికి ఒక యూదు సైనికునితో స్నేహం కుదురుతుంది.  దురదృష్టవశాత్తూ ఆ యూదు సైనికుడు హబ్బర్ మేన్ ను స్థానాన్ని తీసుకోవడం వల్ల మృత్యువు పాలవుతాడు.   యుద్ధానంతరం,  తీవ్రమైన గిల్ట్ తో, హాన్స్ తన యూదు స్నేహితుని కుటుంబాన్ని కలిసి,  క్షమాపణలు వేడుకోవడానికి వెళ్తాడు.   అప్పటికి ఆ యూదు సైనికునికి, ఒక చిన్న పిల్లాడు.  అతని భార్య కి తన ఎడ్రసు ఒక కాగితం మీద రాసి ఇచ్చి - "నీకు ఎటువంటి సాయం కావాలన్నా - నన్ను అడుగు. నా స్నేహితుడు కాపాడిన ఈ ప్రాణాన్ని అతని కుటుంబానికి ఏ చిన్న సాయం చేసైనా ఉపయోగిస్తాను" అని ప్రమాణం చేసి వస్తాడు హాన్స్.  అప్పణ్ణించీ,  హాన్స్ ని యుద్ధపు పిలుపులు  తాకవు.   ఆ రోజుల్లో  ఓటమి వైపు పయనిస్తున్న జెర్మన్ సైన్యం, అసంఖ్యాకంగా చనిపోతున్న తన సేనల స్థానాన్ని,  ప్రజల్లో కాస్త able గా కనిపించే వారితోనూ,  మాజీ సైనికులతోనూ భర్తీ చేసేవి.   'గెస్టపో'  పని ప్రజల్లో  తిరగడం, కనబడిన యూదుని పట్టి బంధించడం,  పనికొస్తాడూ అనుకున్న వాణ్ణల్లా సైన్యంలో తోయడం.. ఇదే.  హాన్స్, కష్ట కాలంలో కొన్నాళ్ళు రెండో ప్రపంచ యుద్ధం లో కూడా కొన్ని నెలలు పాల్గొంటాడనుకోండి.   కానీ అతను మనుషుల్ని చంపే సైనికుడు కాదు. 


యుద్ధపు రోజుల్లో ఉద్యోగాలు ఉండవు.  ఉన్న ఉద్యోగాలన్నీ యుద్ధానికి సంబంధించినవే.  హాన్స్ ఒక పెయింటర్.  యూదు ఇళ్ళ మీద గెస్టపో వేసిన క్రాస్ మార్కుల్ని తన పెయింట్ తో కప్పేసే సాహసం చేసేవాడు కూడానూ.    హాన్స్ దగ్గర ఒక అకార్డియన్ ఉంటుంది.  ఈ వాద్య పరికరం.. హాన్స్ యూ.ఎస్.పీ.   యూదు అన్నాక పనంటూ లేక, తనకి ఇవ్వడానికి డబ్బుల్లేని యూదులకు కూడా పైకి తెలీకుండా సాయం చేసేవాడు.   రోసా ఊర్లో కాస్త పెద్ద వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి బట్టలు తీసుకొచ్చి ఉతికి, ఇస్త్రీ చేసి, కాసిన్ని డబ్బులు సంపాదించ బట్టి గానీ, హాన్స్ కరుణామయ సేవల కి కుటుంబం నడవడం కష్టం అయి ఉండేది.

హాన్స్ ఇంట్లో ఒక చిన్న బేస్మెంట్ - ఓ నాలుగు గదులూ.  కిచెన్ లో ఎప్పుడూ బట్టలు ఉడికించే గంగాళం, ఇస్త్రీ వాసన కొట్టే గాలీ - రోసా ఎలాగో వండి వార్చే పీ-సూపూ, రేషన్ లో దొరికే రొట్టే  తప్ప ఇంకేవీ ఉండేవి కాదు.   బేస్మెంట్  చిన్నదీ అని ఎందుకు అన్నామంటే,  ఊర్ల మీద బాంబింగ్ జరిగితే ఇళ్ళలో జనం తల దాచుకోవడానికి బేస్మెంట్ కాస్త లోతైనది ఉంటే బావుంటుంది.   కధ ప్రారంభం లో మృత్యువు అంటుంది.  "ఈ బేస్మెంట్ చిన్నది. గెస్టపో లెక్కల ప్రకారం పెద్దగా పనికిరానిది. నిండా హాన్స్ పెయింట్ డబ్బాలూ, చెత్తా తో నిండి, చల్లగా, చీకటిగా.. అసహ్యంగా!   కానీ ఈ బేస్మెంట్ రెండు ప్రాణాల్ని కాపాడింది!" అని.

లీసెల్ 'హమ్మల్ వీధి' జీవితం గురించి చెప్పాలి.   కొత్త తనానికి, ఒంటరి తనానికీ బెంగ పడుతూండే దశ.  కొత్త తల్లి  రోసా ముందు స్నానానికి బట్టలు విప్పడానికి భయపడే పిల్ల,   నిద్ర లో ఉలిక్కి పడి లేచేసె పిల్ల,  పక్క తడిపేస్తే, హాన్స్ తనని ఎత్తుకుని వేరే పక్క మీదికి మారిస్తే హాన్స్ చేతినిపట్టుకుని నిశ్చింత ని వెతుక్కునే పిల్ల -  పెద్ద రౌడీ లా.. వీధిలో  ఆడుకుంటూండే పొరుగు పిల్లలతో పోరాటనికి దిగి, ఆ దశ లో ఫుట్ బాల్ ఆట వల్ల తన ప్రాణ స్నేహితుణ్ణి సంపాదించుకుంటుంది.    వాడే మన హీరో - రూడీ స్టీనర్.   వీడు ఒక జ్వాల.   యుద్ధ కాలంలో పిల్లలందరూ చాలీ చాలని తిండి వల్ల ఆకలిగా, బలహీనంగా ఉండేవారు. అందులోనూ, రూడీ ఇంట్లో ఆరుగురిలో ఒకడు. అప్పుడపుడూ తిండి, తోటల్లో పళ్ళూ దొంగతనం  చేస్తూ ఉంటాడు.   రూడీ కి 'హిట్లర్' మోహం అంతగా తలకెక్కదు.   ప్రతీదీ ప్రశ్నించే మనస్తత్వం.     లీసెల్ వీధి లో పొరుగు  అబ్బాయి.   ఈ కొత్త పిల్ల అమాయకత్వం, తెగింపూ వాణ్ణి ఆకర్షిస్తాయి. రూడీ కూడా తక్కువ వాడు కాదు.   1936 లో ఒలింపిక్స్ లో నాలుగు బంగారు పతకాలు గెల్చుకున్న నల్ల జాతి మేలి ముత్యం  జెస్సీ ఓవెన్స్. కానీ  తను తక్కువ జాతి వాడు కావడం వల్ల హిట్లర్ అతనితో కరచాలనం చెయ్యడానికి నిరాకరిస్తాడు.  హిట్లర్ అహాన్ని దెబ్బ తీసిన జెస్సీ ఓవెన్స్ చరిత్ర లో నిల్చిపోయిన అత్భుతమైన అథ్లెట్.

జెస్సీ ఓవెన్స్ గురించి తెలుసుకున్నాక రూడీ కన్నా జెర్మనీ లో ఎవరూ ఇంప్రెస్ అయి ఉండరు.  ఇంట్లో ఎవరూ చూడకుండా,  బొగ్గు మసి మొహానికి రాసుకుని గ్రౌండ్ లో కొన్ని రౌండ్లు పరిగెట్టీ దాకా వాడికి మనసు తీరదు. ఈ నల్ల మసి బాలుణ్ణి చూస్తూ చుట్టూ చేరి కేరింతలు కొడుతున్న జనం, తనే 'జెస్సీ ఓవెన్స్'  అనుకుంటూ స్వాప్నికుడిలా రూడీ పరుగు..  ఆఖరికి పిల్లాణ్ణి వెతుక్కుంటూ వచ్చిన తండ్రి  జెస్సీ ఓవెన్స్ అయినందుకు (హిట్లర్ ని ధిక్కరించిన నల్ల వాడు అయినందుకు - ఆ రోజుల్లో హిట్లర్ మీద అభిమానాన్ని నాజీ జెర్మనీ లో బహిరంగంగా ప్రదర్శించిన వాళ్ళకే బ్రతుకు!   ధిక్కార స్వరం ఏ కోశాన వినిపించినా వాళ్ళ ని పట్టుకుని జైళ్ళలోకి తోయడానికి గూఢచారులు  సిద్ధంగా ఉండేవారు)  చెవి మెలిపెట్టి గట్టిగా తిప్పుతూ తీసుకెళ్ళిపోతుంటే అందరూ ఆ పిల్లాడి గురించే చెప్పుకుంటారు.   ఈ రూడీ చాలా దయ గల వాడు.  వీధుల్లో పెరేడ్ చేయబడుతూండే యూదు ఖైదీల బక్కచిక్కిన మొహాల్ని చూసి, శోషొచ్చి పడిపోతున్న ఏ దీనుడికో రొట్టె ముక్క విసిరి, పోలీసుల కన్ను గప్పకుండా పారిపోవడం, అతను సాధారణంగా చేస్తూండే సాహసం.  ఈ రూడీ కి,  లీసెల్ కన్నా అత్భుతమైన స్నేహితురాలు దొరికే అవకాశం లేదు.

మెల్లగా లీసెల్ కి తల్లి తండృల హృదయం అర్ధం అవుతూంటుంది.  తనని "పంది" (Soukerl) [రూడ్ గా మాటాడే రోసా కి ఇదో ఊతపదం]  అని తిడుతూండే, ఎప్పుడూ రుస రుసలాడుతూండే రోసా మంచితనం నెమ్మది నెమ్మది గా లీసెల్ కు అర్ధం అవుతూంటుంది.   మెలమెల్లగా తమని మమా, పాపా (అమ్మా, నాన్నా) అని పిలిపించుకుని, వాళ్ళ కుటుంబంలోకీ, జీవితంలోకీ ఆహ్వానించిన వాళ్ళిద్దరూ లీసెల్ హృదయం లోకి ప్రవేశించారు.   భర్త "సహృదయంతో" ప్రతి రోజూ డబ్బు ఇంటికి తేకపోయినా - ఎక్కడో రోజంతా వాలంటీరింగ్ చేసి వచ్చినా,  ముగ్గురికీ ఉన్న దాంతోనే వండి వార్చాల్సిన అవసరం రోసాది.  బట్టలు ఉతకడం, ఇంట్లోనే వాట్ని ఎండేయడం,  ఇస్త్రీ చేయడం లాంటి కష్టపడే పనులు చెయ్యడం తో పాటూ, వాట్ని ఇంటికెళ్ళి డెలివరీ చెయ్యడం, మాసిన బట్టలు కలెక్ట్ చెయ్యడం ఇవన్నీ ఈవిడ ఒక్కచేత చెయ్యలేక, నెమ్మదిగా ఈ వాతావరణానికి అలవాటు పడుతున్న లీసెల్ ని తన తో తోడు తీసుకెళ్ళడం మొదలు పెడుతుంది.  నెమ్మదిగా లీసెల్ కే బట్టలు తెచ్చి, తిరిగిచ్చే బాధ్యత నెత్తి మీద పడుతుంది.  అలా కొన్ని కుటుంబాలతో  లీసెల్ కి పరిచయం .  రోసా కస్టమరు ఆ వూరి మేయరు హైంజ్ హెర్మన్.  అతని భార్య ఇల్సా  వాళ్ళింటికి వెళ్ళడం లీసెల్ జీవితం లో పెద్ద సంఘటన. ఎందుకంటే ఈ పుస్తకాల దొంగ కి వాళ్ళింట్లో పెద్ద లైబ్రరీ కనిపిస్తుంది.

నాజీ జెర్మనీ లో ఒక రాసిపెట్టని రూలు ఉండేది. ప్రతీ జెర్మనూ విధి గా హిట్లర్ విధేయుడే అయి వుండాలి.  పార్టీ ఆఫీస్ లో సభ్యత్వం ఉండాలి. దేశ సేవ కోసం ఏఅ క్షణాన పిలుపు వచ్చినా వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. వీధుల్లో యూదులను తీసుకుపోయి కాంపుల్లో పెట్టినా, మానవత్వం తో ఎవర్నీ రక్షించడం అవీ చెయ్యకూడదు.  అలా చేస్తే వాళ్ళు కూడా అవిధేయ ముద్ర తో ఏ కాన్సంట్రేషన్ కాంపు కో, జైలు కో లేదా ఏకంగా పైలోకానికో వెళ్ళాల్సిందే !  గెస్టాపో కళ్ళ బడకూడదంటే,  ఇంట్లో హిట్లరు రాసిన 'మీన్ కాంఫ్' ఉండాల్సిందే.  [హాన్స్ కూడా పార్టీ ఆఫీసుకెళ్ళి ఒక పుస్తకం తెచ్చుకుంటాడు  అంత వరకూ మీన్ కాంఫ్ ని తననీ, కొడుకునీ దూరం చేసిన ఒక దరిద్రపు పుస్తకంగా అసహ్యించుకున్నా కూడా ! ]   లీసెల్ కి చదవడం రాయడం రాకపోయినా పుస్తకాల పట్ల ఆమె కున్న ప్రేమని మెచ్చుకుంటూ, ఇంటిలో మెల్లగా ఆమెకు చదవడం నేర్పిస్తాడు తండ్రి.  ఈ లోగా అడపా దడపా ఎక్కడ్నుంచో పుస్తకాల్ని తెచ్చి, ఆమెకు ఇవ్వడం మొదలుపెడతాడు. వాళ్ళు రాత్రి పూట మెల మెల్లగా ఒక్కో పుస్తకాన్నీ పూర్తి చేస్తుంటారు. ఆ క్షణాలు అపురూపమైనవి లీసెల్ కి.  కానీ ఆమెకు హాన్స్ అంత కన్నా నేర్పలేకపోతాడు.  నట్టుతూ నట్టుతూ, పరమ మెల్లగా పుస్తకల్ని చదువుతుంటారు తండ్రీ కూతురూ.


ఈ లోగా లీసెల్ జీవితంలో ఇంకో పెద్ద సంఘటన !  గెస్టపో వాళ్ళు,  హిట్లర్ ఆదేశాల ప్రకారం, మనసుల్ని పొల్యూట్ చేసే ('మీన్ కాంఫ్'  తప్ప) అన్ని పుస్తకాల్నీ స్క్వేర్ లో వేసి కాల్చేస్తారు ఒక సారి.   ఆ కాల్చేయడం జనం సంబరంగా చూడాలి..   స్వచ్చందంగా ఏమైనా పుస్తకాలు ఇంట్లో ఉంటే తెచ్చి మంటల్లో వెయ్యాలి. హిట్లర్ కి చేయెత్తి జై కొట్టాలి. అదీ కార్యక్రమం.    లీసెల్ ఈ పుస్తకాల కాల్చి వేత చూసి దిమ్మెర పోతుంది.   లీసెల్ ఇంటికొచ్చిన కొత్తలో ఆమె పరుపు కింద దాచుకున్న మొదటి దొంగతనం. 'A Gravedigger's Handbook'.   దాన్ని చూసిన హాన్స్ మెల్లగా,  అపుడపుడే లీసెల్ కు చదవడం నేర్పిస్తున్నాడు కదా.   పెద్ద పెద్ద పుస్తకాలూ కధలూ చదివేయాలని ఆశగా ఉంటూండే ఆ చిన్న పిల్లకు కొత్త ప్రపంచ ద్వారాలు,  అపుడపుడే తెరుచుకుంటున్నాయి.  అందుకే జ్ఞానానికి ప్రతీకలూ , కొత్త లోకాల కీ దారులు చూపించే ఈ పుస్తకాల్ని కాల్చేస్తూండటం భరించలేక,   ఆఖరికి కాలీ కాలకుండా,  ఆ బూడిద కుప్పలో దొరికిన ఒక పుస్తకాన్ని, ఆ కుప్ప మీద ఊసే నెపంతో వెళ్ళి, చటుక్కున కోటు మాట్న దాచి, గెస్టపో వాళ్ళ కళ్ళ పడకుండా  తండ్రి తో కలిసి ఇంటి దారి పడుతుంది.   కోటు లో కాల్తూన్న పుస్తకం చర్మాన్ని కాలుస్తునా, కిక్కురుమనకుండా  ఒక సేఫ్ ప్లేస్ కి వచ్చాకా తన "ట్రోఫీ"  పుస్తకాన్ని హాన్స్ కి చూపిస్తుంది.   ఇది రెండో దొంగతనం.  ఈ రహస్యం వాళ్ళిద్దరికే తెలుసనుకుని ఇద్దరూ చిన్న నవ్వుతో ఇంటికి వెళ్తారు. పుస్తకాలంటే లీసెల్ కి ఉన్న ఇష్టం హాన్స్ కి బాగా తెలుసు కనుక !

కానీ ఎవరూ చూడకపోయినా ఆ రోజు లీసెల్ దొంగతనాన్ని స్క్వేర్ కి ఆనుకున్న తన ఇంట్లోంచీ మేయర్ భార్య  ఇల్సా చూస్తుంది.      ఇల్సా ఒక చదువుకున్న, స్వతంత్ర భావాలున్న మహిళ.   కానీ ఒక్కగానొక్క కొడుకు మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోవడంతో విత్ డ్రాన్ గా ఉంటుంది. కానీ మనసు వెన్న దంపతులది.   తనింట్లో బట్టల కోసం వస్తూండే లీసెల్ ను గుర్తుపట్టి, ఆ పేద పిల్లకు గెస్టపో కళ్ళు కప్పి పుస్తకాన్ని ఎత్తుకుపోయేంత ఇష్టం వుండడం చూసి అబ్బురపడుతుంది.   ఆమెకు లీసెల్ అంటే అభిమానం అప్పణ్ణించే మొదలయ్యి..  లీసెల్ ని బట్టలకోసం వచ్చినపుడల్లా లైబ్రరీ లో పుస్తకాలు చదువుకోవడానికి అనుమతిస్తుంది.   అన్ని పుస్తకాల్ని ఒక్క సారి చూసి, వాటిని తను ఎంత సేపు కావాలంటే అంత సేపు చూడొచ్చనే సంగతి తెలిసి లీసెల్  తెగ సంబరపడిపోతుంది.  ఈ పుస్తకాల్ని కాల్చని మేయర్ హృదయం మంచిదని కూడా  (అప్పటికి జర్మనీ లో మేధా వర్గం హిట్లర్ ని గుడ్డిగా ఆరాధించడం మానడం మొదలయింది) గ్రహిస్తుంది.

అయితే అదే మంచితనం వల్ల గ్రామంలో ప్రజలందరూ కష్టపడి బ్రతుకుతున్నపుడు తన కుటుంబం బట్టల్ని ఉతికించుకోవడం,  luxury ని అనుభవించడం ఇష్టపడక,  మేయరు భార్య రోసా సేవల్ని ఒక సారి ఆపేస్తుంది. లీసెల్ వచ్చినపుడు  "బట్టలు లేవు ఈ కవరు మీ అమ్మకు ఇవ్వు!"   అంటుంది.   " నీకు కావల్సినపుడల్లా మా లైబ్రరీ కి రావచ్చు. నీకు ఎప్పుడూ స్వాగతం "  అని కూడా అంటుంది.    కానీ అప్పటికే యుద్దం వల్ల చుట్టుముట్టిన ఆర్ధిక మాంద్యం వల్ల,  అందరూ పని మానిపించేయడంతో తినడానికి కష్టంగా ఉన్న పరిస్థితి తెలుసు కనుక,   ఎందుకో లీసెల్  నిస్సహాయమైన  కోపంతో మేయర్ భార్యని తిట్టి,  అక్కణ్ణించీ ఏడుస్తూ ఇంటికొచేస్తుంది.   కానీ తిట్టాననే పశ్చాత్తాపం ఆమెని దహించేస్తూ ఉంటుంది.   రోసా ఈ వార్తను కూడా దిగమింగి ఎలానో ఊరుకుంటుంది గానీ లీసెల్ కి  లైబ్రరీ ని మిస్స్ కావడం వల్లా, మేయరు భార్య కి మొహం చూపించలేకా.. చాలా రెస్ట్ లెస్ గా వుంటుంది.

ఇప్పుడు రూడీ సాయంతో పుస్తకాల్ని లైబ్రరీ నుంచీ ఒకటీ, అరా కిటికీ గుండా (ముందు ద్వారం లోంచీ వెళ్ళడానికి మొహం చెల్లక) తీసుకొచ్చేయడం, "దొంగతనం" మళ్ళీ చేస్తుంది. ఈ విషయం మేయర్ బార్య పసిగట్టినా... ఏమీ అనదు.   కొన్నాళ్ళకి లీసెల్ ని 'నువ్వు ఇంక కిటికీ గుండా రావద్దు..  ముందు ద్వారం లోంచీ రా'.. అని చెప్పేంత వరకూ తన దొంగతనం ఎవరూ చూడట్లేదనే అనుకుంటుంది లీసెల్.

వీటన్నిటి మధ్యా - జెర్మనీ రష్యా మీదకి యుద్ధానికి వెళ్ళి ఉంటుంది. జెర్మనీ లో పరిస్థితులు చాలా దిగజారి ఉన్నాయి. ఒక రోజు రాత్రి చీకటి తెరల్లోంచీ హబర్మేన్ ల ఇంటికి ఒక అతిధి శరణు కోరి వస్తాడు.   అతను ఎన్నో బాధలు పడి హాన్స్ హబ్బర్ మేన్ ను వెతుక్కుంటూ వచ్చిన పూర్వపు యూదు  సైనికుడి కొడుకు.  అతన్ని ఇంట్లో దాచి మృత్యువు నుండీ కాపాడటం, హాన్స్ కర్తవ్యం. దీన్ని దంపతులిద్దరూ ఎంతో హృదయపూర్వకంగా స్వాగతిస్తారు.  తమకి ప్రాణాపాయమని తెలిసినా, మానవత్వం తో, కృతజ్ఞత తో మాక్స్ వాండెన్ బర్గ్  ని ఇంట్లో కి ఆహ్వానిస్తారు. అసలే పరిమితంగా దొరికే రేషన్ ని, ఈ నాలుగో వ్యక్తి తో పంచుకోవడం అంటే ఎంత కష్టం, రోసా ని ఈ ప్రశ్న కలవరపెట్టినా, హాన్స్ మొహం చూసి ఊరుకుంటుంది.    మొత్తానికి కుటుంబం అంతా ఏకతాటి మీద నిలబడి ఒక నిర్ణయానికొస్తుంది.  కొత్త స్నేహితుడి విషయం లీసెల్ ఎక్కడా పొక్కనివ్వకూడదు.  రూడీ కి, ఎవ్వరికీ.. ఈ విషయం తెలీకూడదు. తెలిస్తే గెస్టపో చేతిలో [మాక్స్ కి లేదా అందరికీ]  మృత్యువు తధ్యం.

ఈ కొత్త పాత్ర మాక్స్ - నాజీలు ఇంటిమీదికొచ్చాకా, తల్లీ, అప్ప చెల్లెళ్ళూ మృత్యుముఖం లోకి వెళ్తూ కడసారి చూసిన చూపును మర్చిపోలేకపోతూ.. మృత్యు భయంతో వొణికిపోతూ ఉన్న ఒక నవ యువకుడు.  అంత నిరాశ లో నాజీలు యూదుల్ని వెతికి వెతికి ఊచకోత కోస్తున్న రోజుల్లో, మాక్స్ తల్లికి ఎపుడో తనకి సాయం కోరవచ్చంటూ ఎడ్రసు ఇచ్చిన హాన్స్ హబ్బర్ మాన్ గుర్తొచ్చి, హాన్స్ ఎడ్రసు రాసున్న ఆ కాగితం ముక్క ఇన్నాళ్ళకి వెతికి  సంపాదించి, మాక్స్ ని ఎలా అయినా  హాన్స్ దగ్గరకి పారిపొమ్మని చెప్తుంది.  అలా దాక్కుని, కడసారి తల్లి నీ చెల్లెళ్ళనీ వొదిలి, స్నేహితుని సాయంతో ఈ మోల్ కింగ్ చేరి, హాన్స్ ఇంటికి ఓ అర్ధ రాత్రి వేళ చీకటి లో ఓ నీడ లాగా వచ్చి తేల్తాడు.  మానసికంగా, శారీరకంగా అలసిపోయిన మాక్స్ కి హాన్స్ ఇంట్లో చల్లని బేస్మెంట్ రెండు చేతులా స్వాగతం పలుకుతుంది.

మాక్స్ ఈ బేస్మెంట్ లో, హాన్స్ సంరక్షణ లో, లీసెల్ స్నేహపూర్వక ఆసక్తి తో మనిషవుతాడు.  లీసెల్ కి చక్కగా చదవడం రాయడం నేర్పిస్తాడు. అతను చదువుకున్న వాడు. వీళ్ళిద్దరి అనుబంధం బలపడుతుంది.  క్రాస్ వర్డ్ పజిల్స్ పూర్తి చెయ్యడం అంటే మాక్స్ కి ఇష్టం.  అది తెలుసుకున్న లీసెల్.. ఎక్కడన్నా, ఆఖరికి చెత్త బుట్టల్లోనైనా క్రాస్వర్డ్ పజిల్ ఉన్న  News Paper  ముక్క కనపడితే, మాక్స్ కి తెచ్చి ఇస్తూ ఉంటుంది. మాక్స్ కూడా లీసెల్ చేత వాళ్ళింట్లో ఉన్న  పుస్తకాలన్నిటిని చదివించేస్తాడు.  ఇప్పుడు లీసెల్ కి స్వంతంగా చదవడం, రాయడం వచ్చు.  మేక్స్ మధ్య లో జబ్బు పడతాడు. అతను కోలుకునే వరకూ... ఎంతో ఆదుర్దా పడిన ఆ కొత్త కుటుంబం - ముఖ్యంగా లీసెల్.  బయటకు ఎవరికీ అణుమాత్రమైనా అనుమానం రాకుండా ప్రాణాలతో దాచి ఉంచిన ఈ స్నేహితుడు, అనారోగ్యంతోనే కన్ను మూస్తాడేమో అని టెన్షన్ అనుభవిస్తూంటుంది..   లీసెల్ మమ్మూలు గానే స్కూల్ కి వెళ్తూంటుంది, రూడీ తో ఇతర స్నేహితులతో ఆడుకుంటూంటుంది. పొలాల్లో, తోటల్లో, ఆకలికి మిగిల్న పిల్లల తో కలిసి దొంగతనాలు చేస్తూంటుంది.   వీధుల్లో పోలీసు కనబడితే భయంతో బిక్క చచ్చిపోయినా... ధైర్యం తెచ్చుకుని, ఏదో ఒక నెపంతో తల్లి తండృల్ని ఎలర్ట్ చేస్తూ.. వెయ్యి కళ్ళతో మాక్స్ ని కాపాడుతూ వస్తుంది.


నిజానికి  శీతాకాలపు చలి కి,  మంచులో కూరుకుపోయిన ఆ బేస్మెంట్ లో, సరైన తిండీ, నిద్రా లేని మాక్స్  విపరీతంగా జబ్బు పడిపోతాడు.  వళ్ళెరగని మత్తు లో కూరుకుపోతాడు. రోసా ఎలానో పరిచర్యలు చేస్తూంటుంది.  మాక్స్ ని ఉంచిన బేస్మెంట్, మూత్రపు వాసన తో,  ఉక్క పోత తో ఏ మాత్రం ఆరోగ్యంగా లేకపోవడంతో అతన్ని  లీసెల్ గదికి, లీసెల్ బెడ్ మీదికి మారుస్తారు.   మాక్స్ పక్కన కూర్చుని అతను వింటాడేమో అన్నట్టు రక రకాల తన "రహస్య"  పుస్తకాల ని చదువుతూ, అతని లో ఏ మాత్రం కదలిక ఉన్నా.. వొంగి అతని మొహాన్ని పరిశీలిస్తూ.. లీసల్ ఇదే పని లో ఉంటుంది. ఇంట్లో ఉన్నంత సేపూ!  జ్వర తీత్రత లో, తల్లీ చెల్లెళ్ళని మృత్యువు కు వొదిలేసి, తాను మాత్రం బ్రతికి ఉన్నందుకు సిగ్గు పడుతున్న ఈ ప్రాణికి,  మగత లోంచీ మెలకువ వచ్చినప్పుడల్లా, తన పక్క న కూర్చుని, పుస్తకాన్ని బయటకు చదువుతూ, తన మొహంలోకి ఆత్రుతగా చూస్తుండే లీసెల్ ప్రతిబింబం మనసంతా ముద్రించుకుపోతుంది. ఆ కృతజ్ఞత అతన్ని జీవితాంతం అంటిపెట్టుకునే వుంటుంది. 

ఆఖరికి లీసెల్ స్కూల్లో ఉండగా మాక్స్ కి తెలివొస్తుంది. రోసా అప్పటికప్పుడు స్కూల్ కి బయల్దేరి, లీసెల్ ని దేనికో నానా తిట్లూ తిడుతూ (అందరికీ రోసా తిట్ల మోతు, గయ్యాళి  అనే ఇంప్రెషన్ కదా)  దగ్గరికి లాక్కుని మాక్స్ బ్రతికినట్టు చెప్తుంది. అప్పుడు ఇద్దరూ ఎంతో ఎమోషన్ ని గుండెల్లో దాచుకుని, గమనించే వాళ్ళకి ఏ మాత్రమూ  అనుమానం రాకుండా విడిపోతారు.   లీసెల్ అనాసక్తంగా ఇంటికి చేరినట్టు నటించి, లోపలికి వెళ్ళాకా, ఒక్క పాటున మాక్స్ దగ్గరికి పరిగెత్తి... అతన్ని ప్రాణాలతో చూడగలిగినందుకు ఎంతో ఆనందిస్తుంది.  

మాక్స్ కూడా రోసా, హాన్స్, ముఖ్యంగా ఆత్మీయమైన లీసెల్ మంచితనానికి  ముగ్ధుడైపోతాడు.    హన్స్ సాయంతో లీసెల్  కి, పాత కాయితాల మీద తెల్లని పెయింట్  వేసి ఆరాక బొమ్మలతో సహా తన జీవిత  కథ రాసి పుస్తకంలా చేసి ఇస్తాడు. ఆదో అత్భుతమైన గిఫ్ట్ ఆ  పిల్లకి!    అప్పటికి జెర్మన్ నగరాల మీద మిత్ర పక్షాల వైమానిక దాడులు ముమ్మరం అవుతున్నాయి.   వీళ్ళుండే ఊరి మీద కూడా విమానాలు చక్కర్లు కొడుతున్నాయి.  చీకట్లలో సైరన్లు మోగగానే జనం బేస్ మెంట్ల లోకి పరుగులు  తీస్తున్నారు. పోలీసులు ఎవరి ఇళ్ళలో బేస్ మెంట్లు ఎక్కువ మందిని కాపాడగలవో అని ఇంటింటికీ చెకింగ్ కి వస్తారు.  హాన్స్ బేస్మెంట్ లో మాక్స్ ని దాచి, అతని చుట్టూ పెయింట్ డబ్బాల్లు సర్ది... ఎలానో కాపాడతారు. కానీ బాంబింగ్ మొదలయ్యాక, అందరితో పాటూ మాక్స్ షెల్టర్ కి వెళ్ళడానికి లేదు.

మిగిల్న పొరుగు వారికి ఎవరికీ అక్కడ ఆ చీకటి గుహ లో ఒక మానవ మాత్రుడు ఉన్నట్టు తెలియదు.  ఈ యుద్ధ నేపధ్యంలోనే లీసెల్ అక్షరాల్ని వింతగా చూసే స్థాయి నుండీ, వాటి శక్తిని ఆకళింపు చేసుకుని, వాటితో మృత్యుభయాన్ని, నిరాశ నూ పోగొట్టగలగడం  దాకా ఎదుగుతుంది.    బాంబింగ్ జరిగే రాత్రుల్లో అందరూ ఒక పెద్ద బేస్మెంట్ లో తల దాచుకున్నప్పుడు లీసెల్, అక్కడి వారి కోసం ఏదో ఒక పుస్తకం తీస్కెళ్ళి చదవడం, వాళ్ళ మనసుల్ని భయం నుండీ డైవర్ట్ చేయడం అవీ చేస్తూంటుంది.    తరవాత సేఫ్ సైరన్లు మోగాకా ఇంటికొచ్చి మాక్స్ కి ఇవన్నీ చెప్తూ ఉంటుంది.   మాక్స్ సహజంగా సిగ్గరి, భావుకుడు.. ఈ చీకటి గుయ్యారంలో నెలల తరబడి ఉండడం వల్ల బయట ప్రపంచం ఎలా ఉందో తెలియదు.  అతను లీసెల్ చేత ఆ రోజు ఆకాశం ఎలా వుందో, బయట ఎలా గాలి వీస్తోందో, మంచు పడుతోందో చెప్పించుకుంటూ ఉంటాడు.  వాళ్ళిద్దరి మధ్యనా చాలా ఆత్మార్ధమైన స్నేహం బలపడిపోతుంది.  బాంబింగ్ జరిగే రాత్రి,  ఇంటి వారంతా బయట వేరే వారి బేస్మెంట్ కి పారిపోయాక, తన 'గుహ'  లోంచీ బైటికొచ్చి, ఇంటి లో కొచ్చి, కర్టెన్ తొలగించి, చిమ్మ చీకట్లోకి -  బయటి ప్రపంచాన్ని చూడగలగడమే అతనికున్న లక్సరీ.

నాజీ జెర్మనీ లో యుద్ధం లో చేరి భయానకమైన చావులు చనిపోయే మామూలు సైనికులకు  కొదవ లేదు. తన అన్న, రష్యా మీద జర్మనీ చేసిన దాడిలో తీవ్ర గాయాల్తో తన ఎదురుగానే చనిపోవడం చూసిన మరొక సైనికుడి పాత్ర కూడా  వీళ్ళ పొరుగునే  ఉంటుంది.  షెల్ షాక్ కి గురయిన సైనికుడి, సోదరుడి వేదన - లీసెల్ కళ్ళెదురుగా.. ఆత్మహత్య తో - మృత్యువు కౌగిట్లో గానీ తీరని వేదన అది.  వాళ్ళిద్దరి తల్లి,  ఎదిగొచ్చిన కొడుకు మరణాన్ని భరించలేక, బాంబింగ్ సమయంలో షెల్టర్ కి రాకుండా ఇంట్లోనే మృత్యువు కోసం ఎదురు చూస్తూ కూర్చోవడం,  ఒక హృదయ విదారకమైన సంఘటన.

ఆఖరికి మాక్స్ ఇంక ఎన్నాళ్ళూ ఇలా దాగలేనని గ్రహించి,  హాన్స్ సమ్మతి తోనే, ఆ ఇంటిని విడిచిపెడతాడు. కానీ అతనికి ఏమయిందో - ఎలా ఉన్నాడో, పట్టుబడిపోయాడో, మరణించాడో,  తెలీని పరిస్థితుల్లో, వీధుల్లో కేంపులకు తరలించబడే యూదుల పెరేడ్ లో ప్రతి వ్యక్తి మొహాన్నీ పీచు పీచుమనే గుండె తో -  పరిశీలనగా చూడటం అలవాటయింది లీసెల్ కి.    రూడీ తో కలిసి, వాళ్ళు వెళ్తుండే దారిలో చిన్న చిన్న రొట్టెల తుంపుల్ని రోడ్డు మీద పేరుస్తూంటుంది.  పెరేడ్ ఆ రోడ్ కి రాగానే బందీలు రొట్టె ముక్కల కోసం ఆత్రం వా వంగడం,  నాజీలు వాళ్ళపై కొరడాలు చెళ్ళుమనిపించడం జరుగుతుంటాయి.


లీసెల్ కోసం రూడీ ఎంత సాహసాన్నయినా నిర్మొహమాటంగా చేసేస్తాడు. రూడీ కి లీసెల్ అంటే ప్రాణం. ప్రేమ!   లీసెల్ కి కూడా రూడీ అంటే అభిమానమే.  కానీ తనకి రూడీ అంటే ఎంత ప్రేమో లీసెల్ కి ఆఖరి వరకూ తెలియదు.   రిస్క్ చేసి లీసెల్ ని సంతోష పెట్టిన ప్రతి సారీ, రూడీ ఒక్క ముద్దిమ్మంటూ ప్రాధయపడేవాడు.  స్త్రీ సహజమైన సిగ్గు వల్లో, తన అహం  పట్ల అభిమానంతోనో,  ఎప్పుడూ వద్దంటూ  తప్పించుకునేది లీసెల్.   ఆఖరికి వాళ్ళుండే వీధిలోనే జరిగిన బాంబు దాడిలో అమ్మ నీ, నాన్ననీ, రూడీనీ అందర్నీ కోల్పోయిన తరవాత గానీ తనకు రూడీ మీద అంత ప్రేమున్నట్టు తెలీదు మన పుస్తకాల దొంగ కి.   మధ్య లో హాన్స్ ఒక సారి పార్టీ పిలుపు మీద యుద్ధానికెళ్తాడు. కొన్ని నెలల పాటూ..  యుద్ధంలో జెర్మనీ ని ఓటమి నలువైపులా చుట్టుముడుతోంది. మ్యూనిచ్ మీదా ఇతర జెర్మన్ నగరాల మీదా బాంబు దాడులు ఎక్కువవుతున్నాయి.  'మృత్యువు' కి పని ఎక్కువయి ఉక్కిరి బిక్కిరవుతుంది.

మృత్యువు దురదృష్టవశాతూ హెమ్మెల్ వీధికి కూడా రావాల్సి వచ్చింది.  ఏ సైరనూ మోగని ఒక దురదృష్టకరమైన రాత్రి షెల్టర్ కు వెళ్ళకుండా ఎవరిళ్ళలో వాళ్ళు నిద్రపోతుండగా, అకస్మాత్తుగా బాంబింగ్ జరుగుతుంది.   పుస్తకాల మీద ప్రీతి తో, మాక్స్ జ్ఞాపకాల మీద భ్రాంతి తో,  మాక్స్ చేత్తో చేసిచ్చిన పుస్తకాన్ని చదవడానికి  లీసెల్ వెళ్ళి బేస్మెంట్ లో కూర్చున్న క్షణానే వాళ్ళింటి మీద బాంబు  పడుతుంది.  తల్లి తండ్రి, పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే చనిపోతారు.  మర్నాడు శిధిలాల్లోంచీ, షాక్ కి గురైన ఈమె ని బయటకు తీసిన సహాయ బృందాలు లీసెల్ ప్రాణాల్తో ఉండడం ఆశ్చర్య పోతాయి.    శిధిలాల్లోంచీ బయటికొచ్చి, తల్లిన్ నీ తండ్రినీ వెతుక్కుంటూ, వాళ్ళ దేహాల్ని చూసి, నమ్మశక్యం కాని మృత్యువును ఎదిరించలేక,  శకలాల్లో దొరికిన హాన్స్ ఎకార్డియన్ ని జ్ఞాపకంగా తెచ్చుకుంటున్న లీసెల్ కి, రూడీ ఇంటికొచ్చాక, రూడీ దేహం పలకరిస్తుంది.  అప్పుడు గానీ లీసెల్ కళ్ళలో కన్నీరు మొదలవదు.   లీసెల్ రూడీ దేహాన్ని చూసి,  రూడీ ముఖాన్ని ప్రేమగా ముద్దుపెట్టుకోవడం చూసి మృత్యువు  బాధపడుతుంది - 'రూడీ బ్రతికి ఉంటే ఈ క్షణాన్ని ఎంత ఆస్వాదించేవాడో కదా?!' అని.   ఈ బాధనంతా చూసి మృత్యువు బాధపడినా, మరోచోట తన 'అవసరం'  ఉన్న కాలిన గాయాలైన జెర్మన్ సైనికుడికోసం అక్కణ్ణించీ  వెళ్ళాల్సి వస్తుంది  మృత్యువు కు.    ఆఖరికి లీసెల్ రూడీ ఇంట్లో రూడీ తండ్రి ఒక్కడూ, [అప్పటికి అతను వేరే ప్రాంతాలకి వెళ్ళడం వల్ల బ్రతికి బయట పడగా], అతనితో ఉంటూంటుంది.  

యుద్ధం ముగిసాకా, నాజీ జెర్మనీ హిట్లర్ నుండీ విముక్తమయ్యాకా, October, 1945 లో,  మాక్స్,  లీసెల్   ని వెతుక్కుంటూ వస్తాడు.   రెడ్ క్రాస్ వారి సహకారంతో లీసెల్ ఒక్కర్తీ బ్రతికి బయటపడ్డట్టు తెలుసుకుని రూడీ తండ్రి నడుపుతున్న దుకాణానికి వచ్చి లీసెల్ ని అడుగుతున్న ఈ యువకుణ్ణి రూడీ తండ్రి చాలా ఆశ్చర్యంగా చూస్తాడు.   ఒక అన్న లా లీసెల్ బాధ్యత వహించి, ఆమెను తనతో  కొత్త జీవితానికి, సిడ్నీ, ఆస్ట్రేలియా,  తీస్కెళ్ళిపోతాడు.  ఇదీ బుక్ థీఫ్ కధ.  ఇదంతా మృత్యువు చెప్పే కధే.  

రచయిత మృత్యువును ఎంతో లలితంగా వర్ణిస్తాడు.  లేదా మృత్యువే "చావుని"  లలితంగా వర్ణిస్తుందనాలి.  మరణించిన ప్రతి ప్రాణీ మృత్యువు కు ప్రత్యేకమే.  ప్రతి ప్రాణాన్నీ ఎంతో ఆత్మీయంగా చేతుల్లోకి లేవదీస్తుంది.  ఆ ఆత్మ ఐస్క్రీం లా సాఫ్ట్ గా, చల్లగా ఉంటుందంట.  పక్షి ఈక లా తేలిగ్గా.. మృత్యు హస్తాల్లో సేద తీరిన ఆత్మ (!) మెల్లగా కరిగి - మాయమవుతుంది.  మృత్యువు ఓదార్పులు -  బాంబు దాడుల్లో చనిపోయిన వాళ్ళకీ,  నిష్కారణంగా నిండు యవ్వనాన్ని యుద్ధోన్మాదికి  (జెర్మనీ తరఫు)  అంకితం చేసి,   ఛిద్రదేహాలతో చిత్రహింస అనుభవించే సైనికులకీ - రోగాలతో నయం కాని మానసిక వ్యగ్రత తో చనిపోయే సామాన్యులకీ,  హిట్లర్ చంపించేసిన లక్షలాది యూదు ఖైదీలకీ, ఆఖరికి హిట్లర్ కి కూడా ఎంతో ప్రేమ తో చెందుతాయి.  మృత్యువు ఎంత శాంతంగా ఉంటుందో !  మృత్యువుకీ మనసుంటుంది. ఈ భీభత్సాన్నీ, హింసనూ చూసి మృత్యువు కూడా బాధపడుతుంది. మృత్యువు అందరిదీనూ. అందరికీ మృత్యువు చెందినదే !


 కధ ముగిసే సమయానికి,  మృత్యువూ, లీసెల్ కలుసుకుని,  ఈ ముచ్చట్లన్నీ నెమరువేసుకుంటారు.  అదొ మైమరపించే ఫిలసాఫికల్ సీన్.     అందరికీ  మృత్యుముఖాన ఉన్నప్పుడు  జీవిత చక్రం  మొత్తం   స్పష్టంగా కనిపిస్తుందంట.    నీకవన్నీ  గుర్తున్నాయా అంటుంది లీసెల్   మృత్యువు తొ!  ఓ స్నేహితురాలితో మాట్లాడుతున్నట్టు.


[I wanted to tell the book thief many things go,  about beauty and brutality.  But what could I tell her about the things that she didn't already know?  I wanted to explain that I'm constantly overestimating and underestimating the human race - that rarely do I ever simply estimate it.  I wanted to ask her how the same thing could be so ugly and so glorious,  and its  words so damning and brilliant and so glorious,  and its words so damning and brilliant. 

None of those things,  however,  came out of my mouth.]


ఈ పుస్తకానికి దొరికిన ఆదరణ ని చూసి, దీన్నో సినిమా గా కూడా తీసారు.  పుస్తకం చదివే ఓపిక లేనివాళ్ళ కోసం,  ఇంటర్ నెట్ నిండా బోల్డన్ని సినాప్సిస్ లూ, వీడియోలూ ఉన్నాయి.  మృత్యువు చెప్పిన ఈ కధ, పుస్తకాల మీద ప్రేమతో పుస్తకాల సాయంతో బ్రతికి, నాజీ జెర్మనీ లో పుస్తకాలు వొద్దన్న నాజీల నైజానికి వ్యతిరేకంగా తాను దొంగిలించిన పుస్తకాల్ని దాచుకుని చదువుతూ, తన ప్రపంచాన్ని సృష్టించుకున్న లీసెల్ మెమింజర్ కధ.  పుస్తకం గానే చదివితే బావుంటుంది.


Note : This post first appeared in Pustakam.net   http://pustakam.net/?p=19607