Pages

20/03/2009

బేరం చేసే హక్కు !

మా చిన్నప్పుడయితే మాలో చాలా మంది ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకునే వారు. నిన్నో మొన్నో నాకు తెలిసిన అంకుల్ ఒకాయన తాను చదువుకునే రోజుల్లో ఎలా ఇసుక సంచులు మోసుకెళ్ళి, నేల మీద పరిచి అక్షరాలు పుల్లతోనో వేలుతోనో దిద్దుకుంటూ చదువుకునే పద్ధతి గురించి చాలా హాస్యంగా - రసరమ్యంగా చెప్పారు. ఇప్పుడు ఆఫీసుకి వెళ్తుంటే దారిపొడుగునా రంగు రంగుల యూనిఫారాలూ, పిల్లకాయలూ, వాళ్ళ లగేజీ, బస్సులూ, ఆటోలూ, స్కూటర్ల లో స్కూలు పిల్లలే పిల్లలు. పిల్లల చదువు ఇపుడు సమజాన్ని పట్టి పీడిస్తున్న (అలా అనకూడదు లెండి) పెద్ద సమస్య ! తరగతుల అంతరం (పాత సినిమా భాష లో అంతస్థులు) ఎలా వున్నా బీద కుటుంబాలు కూడా పిల్లల్ని పట్టు బట్టి ప్రైవైటు బళ్ళలోనే చదివించడానికి ప్రయత్నిచడం, ప్రభుత్వ ఆధ్వర్యం లో నడిచే బళ్ళ వైఫల్యాలని నొక్కి చెప్తూ ఉన్నాయి.

ఎలక్షన్లకూ, జనాభా లెక్కలకూ టీచర్లను విచ్చలవిడిగా ఉపయోగించడం, పిల్లల చదువుల్లో కావలసినంత ప్రమాణాలను నిలబెట్టడంలో విఫలం కావడం వగైరా బోల్డన్ని కారణాల మూలంగా - వీధి వీధినా ప్రైవేటు యాజమాన్యంలో పాఠశాలలు వెలిసాయి. ఇంగ్లీషు మీడియంలో చదువు చెప్పడం, శ్రద్ధ తీసుకుని చదివిస్తామనడం - ఇలా రక రకాల కారణాల వల్ల తల్లిదండ్రులు తల తాకట్టు పెట్టయినా సరే పిల్లల్ని ఆయా స్కూళ్ళలో చదివించడమే సరయిన నిర్ణయంగా తీసుకోవడం జరిగింది. అయితే, అతిగా జరిగే పరిణామాలకు కొన్ని విపరిమాణాలు కూడా వుండి తీరతాయి. మెల్లగా ప్రైవేటు స్కూళ్ళ ప్రాధాన్యం పెరిగింది. పిల్లలకు బెస్ట్ స్కూల్ లో చదివించగలగడం అనే సాధారణ, సామాన్య మయిన, సహజమయిన కోరిక ఈ రోజుల్లో ఒక గొంతెమ్మ కోరిక గా తయారయింది.

ఇలా కావడానికి ముఖ్య కారణం - వినియోగదారుల్లో (విద్య వ్యాపారమే గాబట్టి, తల్లిదండృలూ, పిల్లలూ వినియోగదారులే!) ఐక్యతా, సంఘీభావం లోపించడమే కారణం. స్కూళ్ళు (ఇంటర్నేషనల్ స్కూళ్ళు మరీ ముఖ్యంగా) ఒక సమూహం /శ్రేణి గా ఏర్పడి, కలసికట్టుగా ఫీజుల్ని ఒక లెక్క ప్రకారం, ఏడాదికి 25% చొప్పున పెంచుకుంటూ పోతున్నాయి. (ఉదా : ఓక్ బ్రిడ్జ్, గ్లెన్ డేల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, చిరెక్, శ్రీనిధి ఇంటర్నేషనల్ మొదలయిన స్కూళ్ళు) గత మూడేళ్ళలో ఈ స్కూళ్ళు ఫీసుల్ని 130% దాకా పెంచి పారేశాయి. ఆర్ధిక మాంద్యం జేబులకి చిల్ల్లులు పెట్టేస్తున్న రోజుల్లో కూడా పిల్లల్ని స్కూల్లో చేర్పించాలంటే 65,000 నుండీ 1,00,000 దాకా చెల్లించాల్సి రావడం తలిదండృల్ని బెంబేలు పెట్టిస్తుంది. ట్రాన్స్ పోర్ట్ చార్జులయితే గత ఏడాది తో పోలిస్తే 13,000/- నుండీ 19,800/- పెంచేరు. స్కూళ్ళ యాజమాన్యాలు మాత్రం తెలివి మీరి కలిసికట్టుగా పేరెంట్స్ మీద కుట్రలు చేస్తూ పోతూ ఉంటే ఈ వినియోగదారులంతా పిచ్చోళ్ళలాగా ఏడ్చుకుంటూ ఫీసులు అడిగినంత అడిగినంతగా చెల్లించుకుంటూ పోతూనే ఉన్నారు. కానీ ఇలా ఎన్నాళ్ళు ?

ఈ పెంచుకుంటూ పోవడం - ఎడతెగని వ్యవహారంలా, ఎవరి గోల వారిదే శైలిలో సాగితే, రేప్పొద్దున్న ఎవరికి నష్టం ? పేరెంట్సు దివాలా తీస్తే పిల్లల్ని ఎక్కడ చదివించాలి ? చూస్తూ చూస్తూ ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలి - Compromise కావాలి. జనం ఉద్యమించి, విద్య కోసం ప్రభుత్వ కేటాయింపులు పెంపు చేయించి, ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలను మెరుగుపరచుకోవడం సినిమాల్లో కూడా ఊహించలేని ఫిక్షన్. అందుకే ఈ బాధిత తల్లిదండృలందరూ కలిసి, ఒక అసొసియేషన్ ఏర్పరుచుకున్నారు. Meridian Schools Parents Association (MSPA) - సీ.బీ.ఎస్.ఈ ఆధ్వర్యంలో నడిచే ఈ ఇంటర్నేషనల్ / ప్రైవేటు స్కూళ్ళ వ్యాపార ధోరణి మీద సీ.బీ.ఎస్.ఈ ని ఎంత కదిపినా రెస్పాన్సు లేకపోవడంతో అసలు మనమంటూ కలుద్దామని ఏర్పడిన పేరెంట్స్ అసోసియేషన్ ఇది. అయినా కూడా - హైదరాబాదీలు ఎవరయినా పిల్లల అడ్మిషన్ల విషయంలో గానీ, స్కూలు పనితీరులో గానీ, అతి వ్యాపార ధోరణి గురించి గానీ సంఘటితం కాదలచుకుంటే - వివరాలను పంపుతూ parentshyderabad@yahoo.co.in కు ఒక మెయిలు చెయ్యండి. ప్రతీ స్కూలు లోనూ పేరెంట్స్ కలిసికట్టుగా, యాజమాన్య ధోరణులు విపరీతంగా తోస్తే, వారితో సంఘటితంగా సంప్రదింపులూ జరపవచ్చు లేదా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చెయ్యొచ్చు. కాబట్టి ప్రైవేటు స్కూళ్ళలో పిల్లలను చదివించే తల్లిదండృలారా ఏకం కండి. భారత రాజ్యాంగం మనకు ఇచ్చిన 'బేరం చేసే హక్కు'ని వినియోగించుకోండి. కొంచెం లో కొంచెం అన్నా జేబులో చిల్లు సైజు ని తగ్గించుకోవచ్చు.

18/03/2009

ఆరంభింపరు నీచ మానవులు

ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై
యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘనిహన్య మానులగుచు ధ్రుత్యున్నతొత్సాహులై
ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధలల్ గావునన్ - ఏనుగు లక్ష్మణ కవి.ఏదైనా పని మొదలు పెట్టినపుడు ఎన్ని అడ్డంకులు ఎదురయినా వెరువక తుదికంటా లక్ష్యం కోసం శ్రమించడమే కార్య సాధకుడి నైజం. అలాంటివారు ఉత్తములు. ఎప్పుడో ఎదురయ్యే అడ్డంకులను తలచుకుని ఏ పనీ చేపట్టనివారు అధములు. ఏదో చెయ్యాలన్న తపనతో మొదలు పెట్టినప్పటికీ మధ్యలో ఆటంకాలు ఎదురవగానే వదిలేసేవారు మధ్యములు.


(ఇష్టమైన తెలుగు పద్యం.. పాత ఈనాడులో దొరికింది)