Pages

26/04/2011

కబుర్లు, కాకర కాయలు..

1. దోభీ ఘాట్ చూసాను ఆదివారం. యాస్మిన్, మున్నా, Arun , Shai ల కధ బావుంది. సీరియస్ కధే ! ఆమీర్ స్థానంలో ఎవరైనా కొత్త నటుడుంటే బావుండేది. కానీ సరే ! ఆమీర్ ఎప్పట్లానే చాలా బాగా నటించాడు. యాస్మిన్ గొంతు మాత్రమే వినిపించి ఆమె కధ ను మొదలు పెట్టడం బావుంది.

స్మితా పటేల్ కొడుకు ప్రతీక్ బబ్బర్ పాత్ర చాలా బావుంది. ముంబై లో అర్బన్ జీవితానుభవాల్ని కళ్ళక్కట్టినట్టు చూపించడం లో కిరణ్ రావ్ చాలా మటుకూ సఫలీకృతురాలైనట్టే, ఇది 'దిల్ చాహ్తా హై' సినిమా లా 'మొదటి సారే 'వావ్' అనిపించే రకం ?!?' కావాలని ప్రయత్నించినట్టుంది.

మొత్తానికి యాస్మిన్ పాత్ర, ఆ నటి నటనా, గొంతు లో స్వచ్చతా, కొత్తదనం, అమాయకత్వం - ఒంటరితనం, అన్నీ చాలా బాగా నచ్చాయి. యాస్మిన్ తీసుకున్న వీడియోల్ని మురిపెంగా చూస్తూండే ఆమీర్ కూడా ముద్దొస్తాడు కొన్ని చోట్ల.

అయితే ఈ సినిమా లో మొట్ట మొదటి సారిగా ఎలుకలు చంపే మునిసిపల్ పని వాళ్ళ ని (ప్రతీక్ అసలు ఏం చేస్తున్నడో మొదట అర్ధం కాలేదు) గురించి తెలుసుకున్నాను. చాలా ఆశ్చర్యం కలిగింది. ఇది ముంబై లో చాలా మందికి తెలీని కొత్త కోణం అనుకుంటాను.

అందుకే ఈ నైట్ రాట్ కిల్లర్స్ గురించి చదవాలనిపిస్తే ఇక్కడ చూడండి.

2. ఈ మధ్య జూజూ రోబో చాలా హల్ చల్ చేస్తున్నడు వోడాఫోన్ ప్రకటనల్లో ! అసలే రోబో - అందులోనూ రజనీ కాంత్ రోబో!! ఎన్ని విచిత్రాలు చేస్తాడో చూశారు కదా శంకర్ "రోబో" లో ! మరి అలాంటి రజనీ నే ఇమిటేట్ చేస్తూ తీస్తున్న జూ జూ వీడియోలు వోడాఫోన్ నిజంగానే సృజనాత్మకత లో ఫాస్టర్, స్మార్టర్, బెటర్ లా అనిపిచుకుంటూంది. మచ్చుకి ఒకటి, రెండు, చూడండి.

07/04/2011

The Nonsense i.e., అవినీతి!!

వాటీస్ దిస్ నాన్సెన్స్ ! అందరికీ సడన్ గా ఏమొచ్చింది ? ఎవర్ని చూస్తే వాళ్ళే అవినీతి పై పోరాటం చేసేస్తున్నారు. ఇదో పెద్ద ఫాషన్ అయిపోయింది ! అవినీతి అంటే ఏమిటి ? 'అవినీతి' అన్న మాటలోనే 'నీతి' వుంది. ఇంత కన్నా నీతి ఎక్కడ దొరుకుతుంది ? బాబా రాందేవ్ అడావుడి గా అవినీతి పై వాగ్బాణాలు సంధించేస్తుంటే - కాషాయ వస్త్రాలని ప్రిఫరబుల్ క్వాలిఫికేషన్ గా పరిగణించే భా.జ.పా కూడా ఝడుసుకుంటూంది. అన్నా హజారే కి సడన్ గా ఏమొచ్చింది ? జంతర్ మంతర్ కాడికి రోజూ ఎంత మంది ఫారినర్స్ వస్తారు ? ఇదంతా చూసి ఏమనుకోవాలి ? జనం తామర తంపెర లా వస్తున్నారంట. ఎంత ట్రాఫిక్ జాం ? ఎంత ఇబ్బంది ?

ఎంత వరకూ సక్సస్ అవుతుందో ఈ కొత్త పోరాటం ? ఎవరో స్విస్ బాంకు లో డబ్బుల్దాచేరంట - అవన్నీ ఇండియా తీసుకు రావాలంట. కొంచెం అయినా సెన్స్ ఉందా ? మన సిస్టం అలాంటిది. ఆ తెచ్చిన డబ్బంతా ప్రజా సంక్షేమం కోసం ఖర్చు పెడుతుండగా, మరింత సొమ్ము ఉత్పత్తి అయ్యి, మళ్ళీ బ్యాంక్ బాకీలకెళిపోతుంది అని తెలుసుకోరు ! ఎందుకంత అర్ధం లేని డిమాండింగులు ? ఎవరి సొమ్ము? ఏమి సొమ్ము ? అంతా మాయ !

మన దేశంలో 'అవినీతి ఈజ్ అ వే ఆఫ్ లైఫ్'. ఆ మాత్రం అర్ధం కాపోతే ఎలా ? అవినీతి అంటే ఏంటి ? కేవలం ద్రవ్యార్జనే అవినీతా ? అలా అయితే కట్నం తీసుకోవడం అవినీతే ! మరి మన ఆస్థి కి కేవలం తాళి కట్టినందుకంచెప్పి ఒక పిల్లొచ్చి ఊరికే వారసురాలు అయిపోవట్లా ?! ఈ సంపాదనాస్థి లో కొంచెం అన్నా పెట్టుబడి ఆ పిల్ల పెట్టొద్దూ ? అది అవినీతెలా అయింది ? రాందేవ్ బాబా కి బుర్ర లేదు ! ముక్కు మూస్కొని ప్రాణాయామం చేస్కోకుండా, ద్రవ్యార్జన అంటూ రాజకీయాల్లోకి వస్తానంటాడు. తన యోగా బిజినెస్సు బోరు కొట్టి వుండొచ్చు. అవినీతి వ్యతిరేకత ఎంత ఫేషన్ కాపోతే ఆ ధైర్యం ?

నిజంగా జనానికి చిత్త శుద్ధే ఉంటే, అందరూ పన్నులు సరిగ్గా కట్టి, (చిల్లర కొట్లో కూడా బిల్లు అడిగి), ఎక్కడా ఫార్మాలిటీస్ అన్న మాట రానీయకూడదు. ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతి చీమలు పుట్టలు పెట్టాయి సరే ! మరి ప్రైవేటు సంస్థల్లో ఈ 'ఫార్మాలిటీ' పద్దులు లేవా ఏంటీ ? లక్ష్య సాధన కోసం ఎవరి బాధ వాళ్ళు పడతారు. దానికి అవినీతి అని పేరు పెట్టడం అన్యాయం.
టీ.ఆర్.పీ కోసం వార్తా చానెళ్ళు అశ్లీల కధనాలను పదే పదే ప్రసారం చేస్తాయి. వార్తా పత్రికలు భళా భళీ అంటూ అధికార పార్టీ లకు భట్రాజీయం వెలగబెడతాయి (ప్రజల ఖర్చుతో) ! ఒక ప్రముఖ సినీ సెలెబ్రిటీ ఇంకో సినీ సెలెబ్రిటీ తో టాక్ షో నిర్వహిస్తారు. పాపులారిటీ కొసం poor things, ఏదైనా చేస్తారు. ఈ పాట్లన్నీ కోటి (కూటి) కోసమే కదా ! కోటి కి తక్కువున్నయా భూముల రేట్లు ? ఇళ్ళు ఎంత ఖరీదున్నాయి ? పిల్లల్ని రేప్పొద్దున్న, ఐ.బీ.ఎం లోనో, బిజీజిస్ స్కూల్లోనో, ఐ.ఐ.పీ.ఎం లో చేర్చాలంటే సంవత్సరానికి ఎన్ని లక్షలు కట్టాలి ? ముందు చూపు కనపర్చకపోతే, రేప్పొద్దున్న పిల్లలకు ఏమిస్తాం అన్న ఆలోచన అందర్నీ (దేశాన్ని) నడిపిస్తుంది !

రిటయిరయ్యాకా పెన్షన్ తో ఇంటద్దె కట్టడం ఎంత పెద్ద సర్కస్ ? అందుకే ఇప్పుడు ఇల్లుండాల! పిలకాయలక్కూడా ! వచ్చే యేడు బియ్యం బులియన్ ఎంతకి పెరుగుతుందో, వెచ్చాల కోసం జీతం లో ఎంత శాతం ఖర్చుపెట్టాలో ?! కూరగాయలసలు డబ్బిచ్చినా దొరుకుతయో లేదో ! అన్నిటికీ ఈ లోకం లో డబ్బు కావాలి. ఈ 20 వ శతాబ్దంలో 'ఇంకా..' డబ్బు కావాలి. మున్ముందు 'ఇంకా', 'ఇంకా' కావాలి. దానికి జనాభా అంతా సమిష్టి గా 'అవినీతి' మరియూ, 'నీతి' మార్గాల్లో రైలు పట్టాల్లా.. సమాంతర రేఖల పై ప్రయాణం చేస్తుంటే, ఒక వైపు పట్టాల్ని కూలదోస్తామంటున్న్నరు. వాటెబౌట్ ఫ్యూచర్ ? రేప్పొద్దున్న దేశం ఎలా నడుస్తుంది ? అసలు అవినీతి తగ్గాలంటే - జనాభా తగ్గాలి, రేట్లు తగ్గాలి ! ఇదంతా అయ్యే పనేనా ?

రికార్డు కుంభకోణాల్తో యూ.పీ.యే.. ఇంక దిగిపోవచ్చని పత్రికలు చెప్తున్నాయి. మరి మళ్ళీ గెలవాలంతే, ఓటర్లకు నజరానాలివ్వాలంటే, ఎలక్షన్ రోజు తాగించి, విందులు చెయ్యాలంతే, చిన్నా చితకా పేట నాయకులకు సూట్కేసులిచ్చి వోట్లు కొనాలంటే, కుల వర్గ ప్రాంత మత బేధాల పరంగా ప్రతీ వారిలోనూ అభద్రత కలిగించి, విడదీసి, మళ్ళీ అభయాలిచ్చి, వోటాట గెలవాలంటే, ఏ సర్కారు కైనా అవినీతి అవసరం. ఓటమ్ముకునే వోటరు అవినీతి వ్యతిరేక పోరాటానికి తగడు. అయితే, జన చైతన్యం మెల్లిగానూ మహోధ్రుతంగానూ రావడం - మెచ్చుకోదగ్గదే ! పోయిన సంవత్సరం ఎన్నికల్లో - ఈ 'హక్కుల ప్రచారం' వల్ల ప్రభావితం చెంది, జీవంలో మొదటి సారి, ఎండలో రొప్పుతూ, రోజుతూ, క్యూ లో నించుని ఓటు వేసినవారెందరో ! (ఓటు హక్కు వినియోగం) మరి 'అన్నా హజారే' ఇంకో హజారు బార్లు ప్రధానికి ఉత్తరం రాసినా తీరట్లేదని చెప్పి, అన్నం మాని కూర్చున్నడంట. ఇలాంటి పాపులర్ పబ్లిక్ ఫిగర్ - బాలీవుడ్ స్టైల్లో రంగంలోకి దిగితే, నాటకీయత రక్తి కట్టి - చట్టం వచ్చి, అదెప్పుడో టెర్రరిస్టు దాడి లో చచ్చిపోవాల్సిన పార్లమెంటేరియన్లందరూ - తీహారు జైల్లో సర్దుకుంటారని 'భావి భారతం' ఆశిస్తోంది. ఇదేమైనా వాల్డ్ కప్పా - అత్భుతాలు జరిగిపోవడానికి ? దేశం పరువుని (అంటూ ఒకటుంటే) బయటికీడ్చడం తప్ప ! మన లో రిచ్ పీపుల్ పెరుగుతున్నారు. వాళ్ళు ఏటికేటికీ మరీ రిచ్ అవుతూ వస్తున్నారు. అవేవో జాబితాలకెక్కుతున్నారు ! దేశానికీ పేరు తెస్తున్నారు. మరి పూర్ పీపుల్ ఏటికేటికీ మరింత పూర్ అవుతున్నరంటారు. గ్లాసు లో సగం నీళ్ళు పోసి 'గ్లాస్ ఈజ్ హాఫ్ ఫుల్' అనడం ఎపుడు నేర్చుకుంటారో !

BTW .. If u still feel that its 'ok' to support Anna Hazaare, click here. :D Go ahead.