Pages

14/07/2008

తీవ్రవాదం - IEDs - 2

ఒక చోట బాంబు పేలుడు జరగ గానే, అది తీవ్ర వాదుల దాడి అని నిర్ధారణకు రావడం వెంటనే జరిగినా, అది ఏ తీవ్రవాద సంస్థ చేసిందో వెంటనే కనిపెట్టలేక పోవడానికి ముఖ్య కారణం - ఇమిటేషన్. ఒక సారి ఒక బాంబు దాడి సఫలం అయ్యాక, ఒక సంస్థ అదే రీతి లో (అవే బాంబులూ, పద్ధతులూ ఉపయోగిస్తూ) దాడి చెయ్యొచ్చు. కానీ చాలా కేసుల లో, ఒకే పద్ధతిని వేరే వేరే తీవ్ర వాద సంస్థలు అనుకరిస్తాయి. అందుకే, బాంబు పేలుడు మేమే చేసామని ఆయా సంస్థలు ప్రకటించే వరకూ ఫలానా సంస్థే చేసిందని పోలీసులు నిర్ధారణగా చెప్పలేరు.


ఇంకో భయంకరమైన విషయం ఏమిటంటే, పోలీసుల / దర్యాప్తు సంస్థల వద్ద, ఎప్పటి కప్పుడు మారిపోతుండే కొత్త ఐ.ఈ.డీ ల సాంకేతిక పరిజ్ఞానం గురించి ముందస్తు సమాచారం ఏమీ వుండదు. పైగా, పేలుడు జరిగాకా.. పేలుడు ఏ పదార్ధం తో జరిగిందో తెలుసుకునేసరికే తాతలు తిరిగి వస్తారు. ఇది పెద్ద టైం వేస్ట్ వ్యవహారం. కానీ ఇదే పోలీసులకు దొరికే ముఖ్యమైన నోట్స్. ఎందుకంటే, దీని ద్వారానే, తీవ్రవాదుల పేలుడు కు ఉపయోగించే పద్దతి మీద అవగాహన వస్తుంది. అంతే.

అందుకే, ఇప్పటి దాకా జరిగిన పేలుళ్ళూ, దాడుల ఆధారంగా పేలుడు కు ఉపయోగించిన పద్దతులూ, పరికరాలూ - అంటూ ఒక సామాన్య పరిజ్ఞానం అందుబాటు లో ఉంది. ముఖ్యంగా ఐ.ఈ.డీ లలో రకాలూ ఈ కింది విధంగా ఉంటాయి.

1) లాండ్ మైన్లు / భూమి లో పాతి పెట్ట బడ్డ ఐ.ఈ.డీ లు

ఈ లాండ్ మైన్లు నక్సలైట్ల హాట్ ఫేవరేట్ బాంబులు. వీటి ద్వారా, పోలీసులూ, వీ.ఐ.పీలను తుదముట్టించడం చాలా విరివిగా జరిగింది. ఇవి ప్రాధమికంగా, వైర్ లెస్ పరిజ్ఞానంతో తయారవుతాయి. కేమెరా ఫ్లాష్ ద్వారా ట్రిగ్గెర్ చెయ్యబడతాయి. వీటిని, సాధారణంగా, వాహనం లో ప్రయాణిస్తున్న వారి మీద దాడి చెయ్యడానికి వాడతారు. సెమీ-మెటల్ రోడ్లు, కచ్చా రోడ్లు, కల్వర్టులు, రైల్ రోడ్ క్రాసింగ్లూ, నదీ తీరాలు, రోడ్డు మలుపులు లాంటి, ఎక్కడ వాహనం వేగం బాగా తగ్గించి నడపాలో అక్కడ, అమర్చుతారు. వాహనం వేగం తక్కువ గా ఉన్నప్పుడు, ఖచ్చితంగా పేలుడు జరపొచ్చు, ఎక్కువ ప్రాణ నష్టం కలిగించ వచ్చు. అయితే, ఈ పద్ధతి లో, ఇలా, దాడి చెయ్యడానికి ఎంచుకునే ప్రదేశానికి ఒక ఫీచర్ ఉండి, కొంత లో కొంత అయినా మనం అప్రమత్తం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే, జనార్ధన రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి అదృష్టవంతులు, వెంట్రుక వాశిలో మృత్యువు ను మోసం చేసేసారు.
అయితే, అందరూ అదృష్టవంతులు కాలేరు గా. అందుకే, చాలా మంది పోలీసు అధికారులూ, వారితో పాటూ ప్రయాణిస్తున్న సివిలియన్లు (పౌరులు) కూడా ఎన్నో సార్లు మృత్యువాత పడ్డారు. ఉదా : చత్తీస్ గడ్ లోని దంతేవాడా లో 100 కిలోల పేలుడు పదార్ధాలు అమర్చి, పేల్చిన లాండ్ మైన్, (2005 లో) పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని తునాతునకలు చేసింది. ఈ దాడిలో వాహనం లో ఉన్న 27 మంది లో 24గురు అక్కడి కక్కడే చనిపోయారు.
2) వాహనం లేదా సైకిలుకు అమర్చిన ఐ.ఈ.డీ లు.
వాహనాలను బాంబులనూ, పేలుడు పదార్ధాలను ఒక ప్రదేశాన్నించీ, వేరొక ప్రదేశానికి రవాణా చెయ్యడానికి వాడటం ముందు నుంచీ ఉన్నదే. కానీ ఈ వాహనాలనే, పేలుడు కు ఉపయోగించడం, ఇంకొక పద్ధతి. బొంబాయి పేలుళ్ళు వీటికి ఉదాహరణ. అసలు ఈ ట్రెండ్ 1920 లో ఒక ఇటాలియన్ తీవ్రవాది న్యూయార్క్ లో వాల్ స్ట్రీట్ లో జె.పీ. మోర్గన్ వాళ్ళ ఆఫీసు దగ్గరకి ఒక పేలుడు పదార్ధాలు నింపిన గుర్రపు బగ్గీ ని తోలుకు వచ్చి, పేల్చెయ్యడం తో మొదలయ్యింది. ఈ దాడి లో, 40 మంది మరణించారు.
ఇరాక్, ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్ లలో కూడా ఈ పద్ధతి చాలా వాడబడుతుంది. రక్షక బలగాల కాన్వాయ్ కి దగ్గరగా ఒక బాంబ్ లు నింపిన వాహనాన్ని పార్క్ చేసి, కాన్వాయ్ సమీపిస్తుండగా పేల్చడం (రోడ్ సైడ్ పార్క్ చేసిన కారు బాంబులు), తద్వారా, సైనికులకు ఎక్కువ హాని కలిగించడం, దీని ముఖ్య ఉద్దేశ్యం.

వీటిల్లో, మన దేశంలో, ఎంతమాత్రం అనుమానం కలిగించని వాహనం సైకిలు. ఈ సైకిలు కే, బాంబులను ఏ బాగ్ లోనో ఉంచి, అమర్చి, రద్దీ గా ఉండే మార్కెట్ ఏరియాల్లో, గుళ్ళలో, ప్రార్ధనా స్థలాల దగ్గరా పార్క్ చేసి ఉంచడం; అదను చూసుకుని పేల్చడం కూడా ఈ మధ్య చాలా సక్సెస్ ఫుల్ గా తేలింది.

ఈ పద్ధతి / సైకిళ్ళ లో అమర్చ గల ఐ.ఈ.డీ లనే, ఈ మధ్య లక్నో, ఫైసాబాద్, వారణాసి ల సీరియల్ దాడులలో వాడారు. ఇలానే, గోరక్ పూర్ లో బాంబు దాడి కూడా నిర్వహించారు. 2008 లో జైపూర్ దాడుల లో వాడినవి కూడా, సైకిలు ఐ.ఈ.డీ లే.

No comments: