Pages

29/03/2021

సూపర్ 30 విజనరీస్ - సునీల్ ధవళ

 



ఈరోజు హోలీ. పిల్లలకి పిడిలైట్ రంగులు తెచ్చారు. పిడిలైట్ లోగో చూసి, ఈ పుస్తకమే గుర్తొచ్చింది. మామూలుగా నాకు సెకన్లలో  ప్రభావాన్ని చూపించే వాణిజ్య ప్రకటనలు చాలా ఇష్టం. ఈ మధ్య వచ్చే ఎడ్వర్టైస్మెంట్ల పై స్పందనలు, ప్రకటన దారుల సోషల్ మీడియా పేజీల్లో, సహేతుక, నిర్హేతుక విమర్శలు, ముంచెత్తడం చూస్తే, ఇప్పుడు ప్రకటనల రంగంలో ఎంతో పోటీ వుంది, ఎంతో ట్రోలింగ్ కూడా జరగడం సాధారణం. అని ఒప్పుకోవాలి. ఇప్పుడు ప్రకటన బాలేకపోతే, చీల్చి చండాడేందుకు ఔత్సాహికులు వెనకాడడం లేదు.  వస్తువుల నాణ్యత బాలేకపోయినా ప్రకటనలు దాన్ని మసిపూసి మారేడు చేస్తూ అమ్మజూపడం కూడా వినియోగదారులు సహించలేకపోతున్నారు. పూర్వకాలపు బ్రాండ్ లు నాణ్యత ని ప్రమాణంగా తీసుకుని పాతుకున్నాయి. దానికి ప్రకటనల వ్యూహాలు తోడిచ్చాయి అని చెప్పొచ్చు. 


పాత కాలపు బ్రాండ్లు మన మనసుల్లో ఎంతగా పాతుకుపోయాయో - వాటి వెనక ఎంత ప్రణాళిక, తపన, పరిశ్రమ ఉండుంటాయో ఇపుడు  అర్ధం అవుతుంది.   అప్పట్లో నేనైతే, వీకో, నిర్మా, సర్ఫ్, కాడ్బరీ చాకొలెట్లు, ఎం.ఆర్.ఎఫ్. టైర్లు, రామాయణం.. ఇవన్నీ ఎటువంటి ప్రశ్నలూ లేకుండానే చూడడం గుర్తుంది.  అవన్నీ ఈ పుస్తకం మనసు ముందుకు తెస్తుంది.   మళ్ళీ, వాటి తెర వెనుక కలల్నీ, కథల్నీ,  వాటిని పురమాయించిన వ్యక్తుల, సంస్థల అవసరాల్నీ, తటపటాయింపుల్నీ, మరీ ఎలాబరేట్ గా కాకుండా, అవసరమయినంత  convincing గా గుర్తు చేస్తుంది. అలా అని ఇది కేవలం ఒక బిజినెస్ స్టూడెంట్ మాత్రమే చదవాల్సిన పుస్తకం కాదు.  


సాధారణంగా వాణిజ్యం, వ్యాపార రంగాల చదువులు చదువుకునే వారు చదివే బిజినెస్ పాఠాలు మామూలు పాఠకుల దాకా రావడం అరుదు.  కష్టపడే వాడిదే విజయం అనే సింపుల్ సూత్రాన్ని అన్వయించుకోవడానికి సగటు మనిషి కూడా తపించాల్సిందే అని తెలుస్తూనే వుంటుంది. కానీ విజయాలు సాధించడానికి ఇంకేదో కావాలి. అదేంటో తెలీక సగం, ఎదురు దెబ్బలు కలిగించే కుంగుబాటు తనం సగం, మనల్ని వెనక్కి లాగేస్తుంటాయి. అలాంటప్పుడు మనకి మంచి స్నేహితుడెవరో భుజం పట్టుకుని ఆపి చెప్పే సూర్థి కలిగించే మాటలు చాలా అత్యత్భుతంగా పనిచేస్తుంటాయి.   


అలాంటి పుస్తకమే ఈ సూపర్ 30 విజనరీస్. మామూలుగానయితే నేను వ్యక్తిత్వ వికాస పాఠాలకు దూరంగా ఉంటాను. ఎందుకో నాకు కొన్ని "మంచి మాటలు" నచ్చవు.  ఒకలాంటి పొగరు అనుకోవచ్చు. కానీ ఈ పుస్తకాన్ని రచయిత నాకు పంపించినపుడు పేజీలు తిరగేసి నాకు ఆసక్తి కలిగించే అన్ని లక్షణాలూ ఈ పుస్తకంలో ఉన్నందున ఏకబిగిన చదివేసాను.  ఈరోజిలా పిడీలైట్ పేరే - ఓ ఫెవికాల్ బంధంలా నన్ను మళ్ళీ ఈ పుస్తకం వైపు లాక్కొచ్చింది.  Brand power. అదే విధంగా ఈ బ్రాండులు తమ నిజాయితీ తో భారతీయ కుటుంబాల imagination ని చాలా సాంప్రదాయక మార్గాలలో, కొన్ని అసాధారణ సాహసాలతోనూ ప్రభావితం చేసాయి.   



మొత్తం 30 మంది వ్యాపార దిగ్గజాల గురించి అన్నాను కదా. మొత్తం ముప్ఫయి సంక్షిప్త వ్యాసాలు - 30 విజయ గాధలు.  రచయిత బహుశా వీటిని ఒక ఫార్మాట్ ప్రకారం, చిక్కని క్లుప్తత తో మాగజీన్ 'కాలం' తరహాలో రాయడం ఒక పెద్ద ప్లస్ పాయింటు.  దీని వల్ల అస్సలు సాగదీత లేకుండా, ఆసక్తి చెడకుండా, ముఖ్యంగా ఎన్ని కష్టాలు ఎదుర్కొని, ఎన్ని సాహసాలు చేసి ఆయా రంగాలలో ప్రముఖులు ఇలా విజయాలని సాధిస్తారో అర్ధమవుతుంది.  కొత్త వ్యాపార వృత్తి నిపుణతలు, కొత్త ఆలోచనలు చెయ్యడం, దేశంలోకి ప్రవేశపెట్టబడిన వాణిజ్య సంస్కరణలను అందిపుచ్చుకోవడం వల్ల ఎదిగిన విజేతల గురించి కథనాలివి. 

అన్నట్టు ఇది అంతా మన డైలీ లైఫ్ లో భాగమయిన ఫెవికాల్, ఫెవీస్టిక్ వగైరాల పెడిలైట్ గురించి అనుకోలు తో మొదలైంది కాబట్టి చెప్పడం - దీనిలో ఫెవికాల్ ఆవిర్భావం, ప్రయాణం గురించి కూడా ఆసక్తికరమైన కథనం  ఉంది. యూట్యూబ్ లో ఫెవికాల్ వి ఓ పది పదిహేను ప్రకటనలు వరుసగా చూసినా బోరు కొట్టదు.   అయితే ఇది  ప్రకటనల విజయం తో పాటూ, ఫెవికాల్ నాణ్యత, గొప్పతనం కూడా.  నిర్మా, సర్ఫ్,  MDH  మసాలా లు, అమూల్ ప్రకటనలు, మన సంస్కృతి లో భాగం అయిపోయాయి. పాత కాలపు జింగిల్స్, బ్రూక్ బాండ్, గోల్డ్ స్పాట్ ప్రకటనలు అలాంటివే. నాకు ఏ.ఆర్. రెహమాన్ జింగిల్ తోనే గుర్తుండిపోయాడు.  సూడో ఆడ్వర్టైసింగ్  - అనగా‌ మంచి నీళ్ళ పేరో,  music కాసెట్ల పేరో చెప్పి ఆల్కహాల్ బ్రాండ్ ప్రకటనలు గుప్పించడం, దేశ భక్తి ని ఎరగా వేసి గుట్కా ను అమ్మజూపడం లాంటివి.  దీనిలో "నెంబర్ వన్ - యారీ" (McDowell's) లాంటివి, "మెన్ విల్ బి మెన్" (Imperial Blue) ప్రకటనలు -  అసలు ఎపిక్ లు.  

ఇది కేవలం వస్తువును ఎలా అమ్ముకోవడం అనే సంగతి గురించి కాదు. ఆ వస్తువుల్ని ఎంత నాణ్యంగా, వినియోగదారులకు నిజాయితీ గా అందుబాటులోకి తెచ్చారు అనేదాని గురించి. అది ఆయుర్వేద ఔషధాల నుంచీ, బాంకింగ్, రియల్ ఎస్టేట్ లాంటి అన్ని రంగాలది.   బ్రాండ్ వాల్యూ ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం. ఆయా సంస్థల్లో, ఆయా రంగాల్లో ప్రముఖులు ఎలా కష్టపడి పైకొచ్చారో చదవడం చాలా బావుంది. వీటిల్లో పాతకాలపు ప్రముఖులు అనగా కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు (అమృతాంజనం), కేశవ్ విష్ణు పెంధార్కర్ (వీకో టర్మరిక్) లాంటి వారితో పాటు, కిరణ్ మజుందార్ షా,  జియా మోడీ లాంటి కొత్త తరం మహిళా విజేతల కథలు  కూడా ఉన్నాయి.  Glass ceiling ని బద్దలుకొట్టిన తొలి తరం మహిళలు ఇప్పుడు ప్రముఖ స్థానాన్ని చేరినా, వాళ్ళు ఎదుర్కొన్న సవాళ్లు ఎలాంటివి, పెద్ద చదువులు చదివినా, ఉన్నత కుటుంబ నేపథ్యం ఉన్నా కూడా తమను తాము నిరూపించుకోవడానికి ఎలాంటి యుద్ధాలు చేసారో చదవడానికి బావుంటుంది.  ఇదే విధంగా మధ్యతరగతి, పేద కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మహిళా విజేతల కధలు కూడా ఉన్నాయి. 

రచయిత ప్రొఫెషనలిసం చాలా బావుంది. చిన్న చిన్న పొరపాట్లు మినహా, (నిర్మా గర్ల్ గురించి), అతిశయోక్తుల్లాంటి కథనం, (తప్పదు మరి..!)  మినహా మొత్తం చదవడానికి బావుంది. ఈ విజేతలు ఆడుతూ పాడుతూ ఇక్కడికి చేరుకోలేదని, వాళ్ళూ, అష్ట కష్టాలూ పడ్డారని, సాహసంతో, ఓర్పుతో, శ్రమతో, లక్ తో, సాధనతో ఈ మెట్లన్నీ ఎక్కగలిగారనీ, పెద్ద పెద్ద వాణిజ్య  సామ్రాజ్యాలు నిర్మించారనీ, మన  దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే, ఇలాంటి పారిశ్రామిక వేత్తలూ, పీవీ, వాజపేయీ లాంటి దార్శనికిత ఉన్న రాజకీయ నాయకులు ఉండాలనీ, మనందరి కలలూ సాధ్యం చేసేందుకు ఇలాంటి వాళ్ళు స్పూర్థిదాయకమైన పోరాటం చేస్తూనే ఉన్న్నరనీ చెప్పడం ఈ పుస్తకం ముఖ్య ఉద్దేశ్యం. 

ఈ పుస్తకానికి ముందుమాట తో కలిపి 15 మంది ప్రముఖుల (ఈ పుస్తకంలో ప్రస్తావించబడ్డ విజేత కూడా ఉన్న్నరందులో) ఎండార్స్మెంటులు ఉన్నాయి.  రచయిత దీనిని  పీవీ, NTR,వాజపేయి, JRD  లాంటి  మహారథులకు అంకితం ఇచ్చారు.  రచయిత పరిచయం తొ సహా ఇంత positive punch / సానుకూలత తట్టుకోలేక ఎలాగో మెల్లగా మొదలుపెడితే, పుస్తకం లోపలి కంటెంటు (మొత్తం  30 మంది ప్రముఖుల విజయ గాధలు. ఎక్కువ గా వ్యాపార దిగ్గజాల గురించి ఉంది. ) మాత్రం ఎంత మాత్రం నిరాశపరచదు.  కొంత నాటకీయత తో చదివింప జేస్తుంది.  Inspirational work కాబట్టి, పెద్ద పిల్లలకు, ఇంకాస్త పెద్ద వారికీ, గిఫ్ట్ చెయ్యడానికి బావుంటుంది.   


Written by : Shri Sunil Dhavala

వ్యాసాలు : 30

మొత్తం  పేజీలు : 219 

 మొత్తం  ప్రకటనలు: 29 (ప్రకటనలు అనగా - ప్రతి వ్యాసం తరవాత ఒక్కోటి చొప్పున రకరకాల పూర్తి పేజీ ప్రింట్ ప్రకటనలు  - ఇవి కొంచెం లేకుంటే బావుండేది. గానీ ఇదేదో కొత్త పద్ధతి అనిపించింది!)

వెల : Rs. 250 /-

ISBN : 9 88194 44904

Special Mention  : కవర్ పేజీ.  కవర్ డిసైన్ (Shri P Suresh)  బావుంది . 

(With permission from Author)

08/03/2021

Lone Fox Dancing - Ruskin Bond

 Lone Fox Dancing - Ruskin Bond 


మనకి ఇప్పుడు కథలు చెప్పేవారు తక్కువయిపోయారు. మనం పిల్లలం అయిపోయి కథలు వినడానికి సిద్ధంగా ఉంటాం. కథలు, జ్ఞాపకాలూ.. కొంత చరిత్రా, కొన్ని పొరపాట్లూ, కొండలూ, జీవితాలు, రక రకాల మనుషులు. ఇవన్నీ ఇప్పుడు చాలా కొద్ది మోతాదులో ఏ క్లుప్తపరిచిన అర్ధం కాని కథ లోనో, వెబ్ సిరీస్ లోనో చూస్తాం.    అయితే, ఇప్పటి కథల్లో అమాయకత్వం కన్నా కొంచెం సంఘర్షణా, పిల్లలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఒత్తిడీ, రక్షణ లేని జీవిత విధానాలు, జీవితపు దుర్మార్గాలు కూడా చేరిపోయాయి. వారికి జీవితం  లో అందాన్నీ, సౌమ్యత నూ పరిచయం చేసే కథలు అరుదయిపోయాయి.  అందుకే పెద్ద పిల్లలు, యువతీ యువకులూ, ఇప్పటికీ కొనుక్కుని చదివే పాతవీ, కొత్తవీ రస్కిన్ బాండ్ రచనలు సుప్రసిద్ధాలు.  వరుసగా పుస్తకాలు విడుదల చేస్తూ, కొత్త తరం రచయితల కన్నా ఎక్కువ ప్రియతమత్వాన్ని అనుభవిస్తున్న బాండ్ జీవిత కథే ఈ పుస్తకం.

ఎన్నో ఏళ్ళు గా ఫలానా రచయిత, ముఖ్యంగా హిందీ మాటాడే అంగ్రేజ్,  కొండ దారుల్లోకి తీసుకెళ్తాడనీ, మేఘ మలహర్ లాంటి పక్కా ఇండియన్ కథలు కథలు చెప్తాడనీ ఒక అభిప్రాయం ఏర్పడిపోయాక,   చదువరి కి  ఇంక అంతా సులభమే.    ఎన్నెన్నో కథలు. తన చిన్న్నప్పటివి, ఇప్పటివి, ఒకప్పటివి, అన్నీ తన కథలే. తన కన్నా గత కాలానివి, విన్న నిజాలకు కల్పనలు జోడించినవి, పిల్లల కోసం రాసినవీ, పెద్ద ల కోసం రాసినవీ, అన్నీ బోల్డన్ని కథలు. అసలు ఈ కథలన్నీ కలిస్తే కదా మన కథ - అనిపించేలా. అవి కథలో,కబుర్లో, మనం ఆసక్తి గా ఏ మంచం చుట్టూ మూగి, రాత్రి నిద్రపొయే వేళల్లో, తాతయ్య దగ్గరో, బామ్మల దగ్గరో - అక్కయ్యలూ, అన్నయ్యల దగ్గర విన్న కథలు గుర్తొచ్చేలా - పక్కన కూర్చొపెట్టుకుని కథలు చెప్తూంటే,   ఇంత చక్కగా వినాలనిపిస్తుంది కదా. బాండ్ కథలు అలానే వుంటాయి. నిజానికి మానసిక దుర్బలత్వం ఎదుర్కొన్నప్పుడు, మనసుకి ప్రశాంతత కావాలన్నప్పుడూ, కొన్ని అభూత కల్పనలూ, బాల సాహిత్యమూ చదవడం మంచిది.  లైట్ రీడింగ్, ఆశావహ దృక్పథాన్ని పెంచేది, ఎంతో కొంత రచయిత పట్ల మనకీ, మనం అంటే రచయితకీ,  అభిమానం ఉందీ అనుకున్న రచనను  చదవడం,  నన్ను చాలా సేద తీరుస్తుంది.

ఇది రస్కిన్ బాండ్ ఆత్మ కథ. తన గురించి "రాయవోయ్ అని పట్టి పీడించిన స్నేహితుల మాటలకు లొంగి, ఇన్నాళ్ళకు నా కథ రాస్తున్నా. ఇందులో మీరు చదివేవన్నీ, నా కథల్లో ఎప్పుడో చదివేసే ఉంటారు. నేను రాసిందంతా నా జ్ఞాపకాల లోంచే, వీటిల్లో  పేర్ల మార్పే తప్ప, అవే జీవితాలుంటాయి. అయితే, కొందరు నా జీవితంలో ముఖ్యులు, నేను తప్పకుండా వారి గురించి చెప్పాలీ అనుకున్న మనుషులున్నారు. అందుకే ఇది రాస్తున్నా" అని ముందే చెప్పేస్తారు.  ఎవరి జీవితమూ పూల పానుపు కాదు. ఎవరి కష్టాలు వాళ్ళకి ఉంటాయి. వాట్ని దాటి వచ్చాక, నిజానికి వృద్ధాప్యం లో అయిన వారంతా పోయి, ఉన్నవారు చెదురు ముదురయి, ఒంటరి తనం చుట్టేస్తున్న వేళ, తన జ్ఞాపకాల దన్నుతో నిలబడి,  నిత్య యవ్వనుడి గా, అంత పొడుగు ఫేన్ ఫాలోయింగ్ తో రాణిస్తున్న రచయిత రస్కిన్ బాండ్. 

"లోన్ ఫాక్స్ డాన్సింగ్" - బాండ్ రాసిన ఒక  ప్రసిద్ధ కవిత.    ఒక రాత్రి భోజనానికి రెస్టారెంట్ కు వెళ్ళి గుడ్డి వెలుతురులో దాదాపు అరణ్యాన్నానుకున్న ఆ ఊరి రోడ్ మీద అలవాటు గా, తన కాటేజ్ కి ఒక్కడూ నడిచొస్తున్నపుడు ఒక అడవి నక్క రోడ్ మీద డాన్స్ చేస్తూండగా చూసి, రాసిన కవిత.  ఆ  పేరు (Lone Fox) తనకు తాను ఆపాదించుకుని, తన ఆత్మ కథ కు పెట్టుకున్న పేరు.     

బాండ్ తన చిన్న తనంలోనే విడిపోయిన తల్లితండ్రుల పెద్ద కొడుకు. అతని కుటుంబం స్థిరం లేనిది.  వ్యక్తిత్వం రీత్యా భిన్న ధృవాలయిన తల్లీ తండ్రీ వయసు ఊపునే ప్రేమనుకుని పెళ్ళి ఊబిలో దిగాక జరిగిన ఏక్సిడెంట్ ని నేను అనుకోవడం చాలా  కష్టం.  అయినా జీవితం లో ప్రతి మలుపుకీ కారణాలు ఊహించగలిగే, సమాధానాలు వెతుక్కునే,  ప్రతి లోటుపాటు నీ స్వీకరించగలిగే, చిన్న చిన్న ఆనందాలని అనుభవించగలిగే మనస్తత్వం ఆ 'ఏక్సిడెంట్' తాలూకూ ప్రభావమేనేమో.  

బాల్యంలో జాం నగర్ లో తండ్రి రాజప్రసాదం లో పిల్లలు యూరోప్ వెళ్ళే ముందు ఇంగ్లీష్ నేర్పించే ఉద్యోగం లో ఉండేవాడు.  తండ్రి వయసులో పెద్ద వాడు. జెంటిల్ మేన్. అతని స్టాంపు కలెక్షన్, కొడుక్కు రాసిన ఉత్తరాలూ అపురూపం.   తరవాత ఎన్నో ఉద్యోగాలు మారినా, చివరికి రాయల్ ఏర్ ఫోర్స్ లో ఆయన చేరాకా, పిల్లల్నీ, భార్యనూ డెహ్రా డూన్ లో ఆమె తల్లి దగ్గర విడవడం.   తల్లి దండృల విడాకులు, తల్లి ఒక పంజాబీ వ్యక్తి ని రెండో పెళ్ళి చేసుకోవడం, వారి కి కలిగిన పిల్లలు, తండ్రి మరణం, తన చదువూ, రాత వ్యాపకం.. ఇంగ్లండు యాత్ర, అక్కడ తన పబ్లిషర్ లను కలుసుకోవడం, పదిహేడేళ్ళకే రచయిత అయ్యి, సంపాదన లో పడడం,  ఇండియా వచ్చాక, ఇలస్ట్రేటెడ్ వీక్లీ లో, డెబొనైర్ లో తన వ్యాసాల ప్రచురణ, రచయిత గా కుదురుకోవడం,  కేసులు, రాజకీయాలు, విస్తారమైన అనుభవాల సారాలను పీకి పాకం పెట్టి,  కథలల్లే నిపుణత తో పాటు, కాస్తో కూస్తో చరిత్ర చెప్పడం ఇదంతా.  చివరకు, ఒత్తిడి వల్ల చేసిన ఉద్యోగాలు, వాటి ద్వారా విస్తృతమైన పరిధీ, రచయిత ఎన్ని చెవుల తో ఎంత హృదయం పెట్టి కళ్ళు తైరిచి తన చుట్టూ చూస్తే,  పుట్టే ఎన్ని కథలో.    వాటినే  సరళ ప్రక్రియల్లో, సులభమైన కథల్ని గా మార్చి చెప్పుకుంటూ, ఎలా తను ఇపుడు ఇలా కుదురుకున్నదీ చెప్తారు.  

వ్యక్తి గత జీవితం, తల్లి మరణం, చెల్లెలి వైకల్యం, తమ్ముళ్ళ మరణం, ఆఖరికి పెళ్ళి చేసుకోకుండా మిగిలి, ఒక కుటుంబాన్ని ఎలా దత్తు తీసుకున్నదీ, ఇప్పుడు లాండౌర్ లో ఎలా సెటల్ అయిందీ చాలా హాయిగా చెప్పారు. 86 ఏళ్ళకూ ఇంకా రాస్తూనే ఉన్నారు బాండ్.  సినిమా, టెలివిజన్ సిరీస్, పుస్తకాలు, కవితలు, అన్నీ తన జ్ఞాపకాల లోంచే రాసా అంటారు.

అందరి లాంటి జీవితం కాదది. చిన్న పిల్లాడి గా ఉన్నప్పుడే తండ్రి మరణం తో దాదాపు ఒంటరి జీవితమే. మొదటి స్కూల్ లో చేరటం, అక్కడి అనుభవాలు చాలా జాలి కలిగిస్తాయి.  జాం నగర్ లో తన చిన్న తనం లో తనని సాకిన కథియవార్ బీద ముస్లిం కుటుంబపు ఆయా - ఆమె మెత్తని హృదయం, తనకు గుర్తుండిపోయిన స్పర్శ - ప్రేమ, ఆమె చెప్పిన కథలు, కల్పనలు నుంచీ, ఆ కాలం నాటి అందరు రచయితల్లాగే, యుద్ధం, స్వతంత్ర పోరాటం, దేశ విభజన - ఆ తరవాత డెహ్ర డూన్ లో, షింలా లలో జీవితం, దేశాన్ని విడిచి పెట్టిన విదేశీయులు, అప్పటి హిమాలయాల్లో రాజకీయ, భౌగోళిక జీవితం, అన్నీ ఏ కౄరమృగమో ఎత్తుకుపోయిన తన పెంపుడు పిల్లి తో,  సహా.. కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తారు.  

తనను తాను పెద్ద గొప్ప మనిషి ని అని అహం ఏమీ లేని పసి పిల్లాడి లాంటి మనసు.  తాను అడవిలో భాగం అనీ, ఆ చెట్లలో ఓ చెట్టుననీ, ఓక్ చెట్ల మీద వాలే కాకులూ, ప్లాస్టిక్ బకెట్ లలో పాతిన పూల చెట్లకి గుత్తులుగా పూసే పూలు, కొండల్లో తనను తాకుతూ సాంత్వన పరిచే గాలీ, అవే తన కుటుంబం అనీ తలచుకుంటూ జీవిస్తున్నాడు. లాండోర్ లో ఆ పాతగది కిటికీ లోంచీ ఈడ్చి కొట్టే చల్ల గాలి, తలుపు తెరవగానే గదిలోకి బాహాటంగా తొంగి చూసే ఆకాశం, మేఘాలూ, డూన్ లోయా, సస్వా నదీ, అస్తమించె సూర్యుడి వెండి ఆకాశం, ఒకదాన్నొకటి అలల్లా అంటుకుంటూ, విశాలంగా పరుచుకున్న పర్వత శ్రేణీ, ఇవే లోకంగా ఎన్నో ఏళ్ళుగా జీవిస్తున్న బాలుడు. 

కావడానికి ఇదో లైట్ రీడ్ - పెద్ద భావజాలాలు ఉండవు. జీవితంలో అర్ధాన్ని వెతుక్కునే ప్రయత్నం కొంచెం ఉంటుంది.  ముఖ్యంగా తాను కలిసిన వివిధ రకాల మనుషులూ, వారి జీవితాలలో వివిధ కోణాలు, వారి దగ్గర నేర్చుకున్న విలువల గురించి బాగా చెప్తారు.  తల్లి ని పెళ్ళి చేసుకున్న పంజాబీ పెద్ద మనిషి మొదటి భార్య "బీబీ జీ", ఆమె దృఢ వ్యక్తిత్వం, తల్లి లా తన కడుపు నింపిన ఆమె ఆదరణా,  ఒంటి చేత్తో ఆమె నెట్టుకొచ్చిన వ్యాపారం, జీవితం, అసలు వీరిద్దరి అనుబంధం, ఆశ్చర్యం కలిగిస్తాయి. , తనను ప్రేమగా ఆదరించిన ప్రతి వ్యక్తీ,   ఆదరించని  వారూ,  వ్యతిరేకులూ, ఇష్టులూ, ప్రేమించిన అమ్మాయి, తోటి పిల్లలూ, తాను వారిలో ఒకడైపోయేంత గా ఆదరించి, తన జీవితం తో మమైకమై పోయిన భారతీయ, ఆంగ్లేయ  స్నేహితులూ,  తను చదివిన పుస్తకాలు,  విన్న పాటలూ, అన్నీ కేవలం గుర్తు పెట్టుకుని ఇంత నైపుణ్యం తో చక్కగా  కూర్చి చెప్పడం ఆయనకే సాధ్యమైన విద్య.   అన్నీ ఒక తాతగారు చెప్ప్తున్న గొప్పల్లా అనిపిస్తాయి. కానీ అన్నీ నిజాలే.  


బాండ్ చెప్పే కథలు నిజమేనా అని - అభిమానులు చర్చించుకుంటారంట. ఆయన్ వర్ణించే, తానూ, తన తండ్రీ నాటిన చెట్ల దగ్గర నుంచీ, ఆయన తిరిగిన ప్రాంతాలూ, డూన్ చుట్టు పక్కల పల్లెలూ, ఎక్కిన కొండలూ, ఆయన చూసిన ఎలుగుబంట్లూ, అర్ధరాత్రి రోడ్ మీద నృత్యం చేసిన నక్కా, దొడ్లో కుక్కల్ని ఎత్తుకుపోయి తినేసే చిరుతా, అన్నీ నిజమే అని చెప్తారు.    

ఎప్పుడో చిన్నప్పుడు తనను పెద్దగా పట్టించుకోని (వివిధ కారణాల వల్ల - ఆయా సంరక్షణ లో పిల్లలు పెరగడం ఆంగ్లేయుల సంప్రదాయం) తనని స్వయంగా తన గుండెలో ఓ భాగం గా చూసుకున్న ఆయా. [ఆమె పేరేంటో తెలీదు. ఆమెకు పిల్లలు, కుటుంబమూ ఉన్నాయని తెలీని వయసు] ఆమె తోడిదే లోకం అన్న వయసులో ఆమె 'హిందూస్తానీ' లో కథలు చెప్పడం, భరించలేనంత అల్లరి చేస్తే తిట్టి, కొట్టి, అప్పుడు తానేడిస్తే, తనూ భరించలేక ఏడ్చేస్తూండే 'ఆయా' ని ప్రాణంగా పరిచయం చేస్తారు. బాల్య జ్ఞాపకాలు చాలా ముఖ్యమైనవి. ఒక మనిషి ని తీర్చి దిద్దడం లో అవెంత ప్రాముఖ్యత వహిస్తాయో తెలియాలి.  ఆమె కల్పనా శక్తి తనని ఎంత ప్రభావితం చేసిందో, ఆమె  ప్రేమ ప్రభావం తనని ఎంత సజీవం గా ఉంచిందో చెప్తే చాలా బాగుంటుంది.   అదే విధంగా ఎందుకనో తనను పెద్ద గా ఇష్టపడని అమ్మమ్మ, ఆమె నిరాదరణ పూర్వక ప్రవర్తన, భావాల్ని దాచుకునే లోహం లాంటి గుండె ని కూడా అతను మర్చిపోలేదు. 

క్లుప్తత కి పెద్ద పీట వేసే ఈయన లక్ష కు మించిన పదాలతో రాసిన అతి పెద్ద పుస్తకం ఇది అని అంటారు. జోక్ !  కానీ బెంగ గానో, ఒంటరి గానో, ఓడిపోయినట్టో అనిపిస్తే, ఇలాంటి పుస్తకం చదివితే, మనసు అంతా నిండిపోయి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.   తల్లి విడిపోయాక, తండ్రి దగ్గర గడచిన తన జీవితం, తండ్రి జ్ఞాపకాలు, అతని అత్యత్భుత క్షణాలు. వాటిని చాలా హృద్యంగా రాస్తారు. పిల్లలు ఏర్పరచుకునే మానసిక అనుబంధాల్ని తప్పకుండా గుర్తించాలి అనిపిస్తుంది. వస్తువుల పట్లా, మనుషుల పట్లా, వారికున్న  ప్రేమనీ, తప్పకుండా గౌరవించాలి. తెలుగు లో కేవలం కొ.కు. రచనల్లోనే పిల్లల హృదయం, వారు బెంగ పెట్టుకోవడం, వారిని ఆదరించాల్సిన తల్లి దండ్రుల పాత్ర ని గురించీ చదివాను. 


రస్కిన్ బాండ్ ,  1950 నుంచీ ఆయా నవలలు, జ్ఞాపకాలు, చిన్న కథలు, వ్యాసాలు, కవిత్వం, అన్ని వయసుల వారికోసం రాసారు. ఇప్పటికీ ఆయన పుస్తకాలు అత్యధికంగా అమ్ముడు పోతున్నాయి. 1999 లో పద్మ శ్రీ, 2014 లో పద్మ భూషణ్ తో భారత ప్రభుత్వం ఆయన్ను సత్కరించింది.  మొదటి స్వాతంత్ర పోరాటంలో ఒక చర్చ్ లో ఊచకోతకు గురయిన బ్రిటీష్ వారి కథ ఆధారంగా ఆయన రాసిన "A Flight of Pigeons" ను "జునూన్" అనే సినిమాగా  తీసారు. అది   భారతీయ సినిమా రంగంలో ఓ ఆణిముత్యం.  తరవాత 'సాత్ ఖూన్ మాఫ్' ను కూడా ఆయన కథ ఆధారంగా తీసారు. జునూన్ నాకు చాలా చాలా ఇష్టమైన   సినిమా.   అది చూసాకే బాండ్ "కేవలం పిల్లల రచయిత' అనే భావన వొదిలింది.   ఇప్పటికీ  రస్కిన్ బాండ్  రాస్తూనే ఉన్నారు.  How To Be A Writer, Harper Collins (Oct 2020)  తరవాత  త్వరలో  ఇంకో పుస్తకం విడదల కానుంది. 


ఈ కాలం పిల్లలకు పూర్తి విదేశీ లేదా పక్కా దేశీ పౌరాణిక, లేదా సాహసిక, (అభూత) కల్పనాత్మక సాహిత్యమే బహుశా దొరుకుతూంది.  సమకాలీన చరిత్ర, గురించి అయితే చాలా తక్కువ.   కథలు ఏవైనా మంచివే. అవి మన లో ఆత్మని సజీవంగా ఉంచుతాయి. కొంచెం చరిత్ర, మానవ సంబంధాలు, పాత కాలపు విలువలు - వీటి గురించి బాండ్ రచనలు (కొన్ని సార్లు రెపెటీటివ్ గా అనిపిస్తాయి - అయినా సరే) చెప్పినంత హృద్యంగా ఎక్కడా చదవలేదు.  Blue Umbrella ని రాసింది రస్కిన్ బాండ్. ఇలాంటి కథలూ, సినిమాలూ,  పిల్లల లోకం లోకి మనన్ని తీసికెళ్తాయి. కష్టాలనుభవించే వారికి అవి దాటిపోయే వరకూ వాటి దయనీయత అంటుకోనే కోదు.   అదీ జీవితం. 

ఇప్పుడురోజుల్లో పిల్లలకు, పూర్వ కాలపు పిల్లల్లాగే రక రకాల ఒత్తిళ్ళూ, బాధలు, పరుగు పందేలూ, పోటీలు. అయినా ఇప్పుడు ఉన్నంత ఆర్ధిక స్వాతంత్రం, భావ ప్రకటనా స్వాతంత్రం, తల్లి తండృలతో సమానంగా మార్కెట్ ను శాసించేంత "అధికార" స్వాతంత్రం ఎక్కువ.   వీళ్ళకు తెలీని కష్టాలు - తిండి లేకపోవడం, ఉండేందుకు వసతి దొరకకపోవడమూ - తన కుటుంబం ఎలా నడుస్తూందీ ఆలోచించాల్సి రావడం - వగైరా. వీరు కొన్నయినా రస్కిన్ బాండ్ లాంటి కథల్ని చదవ గలిగితే, ముఖ్యంగా మనకి ఇప్పుడు బొత్తిగా అరుదయిపోయిన కబుర్ల లాంటి కథల్ని చదివితే, చెట్లనీ, పువ్వుల్నీ, మొక్కల్నీ, మేఘాల్నీ అభిమానించగలిగితే, లోకం సుభిక్షమైపోదూ! 

అందుకే   " Lone Fox Dancing "  హాయిగా - చదవొచ్చు, అన్ని వయసుల పిల్లల చేతా చదివించొచ్చు. ఇందులో అన్ని ఎమోషన్ ల లోనూ తేలి ఆడించొచ్చు.  రస్కిన్ అభిమాన్లకి పండగే.   కొన్ని ప్రాంతాల్నీ,  తాము అంతకు ముందు చదివిన కథల్లో పాత్రల్నీ వెతుక్కుంటూ చదువుతారు.  అవేమీ చదివి ఉండకపోయినా నిరపాయంగా చదువుకోవచ్చు.  మంచి మూడ్ లిఫ్టర్.  Bond ఎంతసేపూ గతం లో మునుగుతూ, తేలుతూ, వరుస ఆత్మ కథల్లాంటి మెమువా లతో విసిగించేస్తున్నా సరే (విసుగేమీ ఉండదు) .. కొన్ని సార్లు కొన్ని  బావుంటాయంతే. 


Notes : 


Best Review I read about this book : The Hindu's Review  on Lone Fox Dancing 


ఒకప్పుడు నేను అనువాద ప్రయత్నం చేసిన చిన్న కథ. అప్పటి తరం అనివార్యంగా ఎదుర్కొన్న దేశ విభజన ది. ఈ  ఆత్మకథ లో పేర్లు, సాంద్రతా మారాయి :-  https://sangharshana.blogspot.com/2018/09/the-playing-fields-of-shimla-ruskin-bond.html


My first encounter :  మొదట ఈ పుస్తకం (2017) గురిించి  Senior Reading Racoons  అనే ఫేస్ బుక్ Group లో చదిివి 2019 లోనే  కొన్నా,  2020 December లో మానాన్న  గారి మరణం తరవాత జనవరి, 2021 లో,  నిస్పృహ నుండీ కోలుకోవడానికి చదివిన పుస్తకాల్లో ఒకటి. నాన్న మాకు చిన్నప్పట్నించీ  "చదవడం,  చదవగలగడం,"  అనే వెల లేని ఆస్తి ని ఇచ్చేసి వెళ్ళారు. కష్టాలు  ముంచెత్తినప్పుడు చదవడమే మమ్మల్ని ఆదుకుంటూ వచ్చింది. ఇక ముందు కూడా మంచి సాహిత్యం చదవడం ద్వారా గాయాల్ని పూడ్చుకోకలను అని విశ్వాసం ఇచ్చింది ఈ పుస్తకం.


Some of my favorite Lines from the book : 

"For better or worse, we are all shaped by our parents.  My mother's sensuality, I think, was stronger than her intelligence ; in me, sensuality and intelligence have always been at war with each other.  And I probably also inherited her unconventional attitude to life, her stubborn insistence on doing things that respectable people did not approve of - traits that she got from her father a convivial character, who mingled with all and shocked not a few.  She must have been quite a handful for my poor father, bookish and intellectual, who probably wanted her to be a 'Lady'.  But this was something that went against her nature."

Closing lines :  "This is the evening of a long and fairly fulfilling life.  And it is late evening in Landour.  A misty, apricot light suffuses the horizon.  Down the village, the apricots are ripening.  A small boy brought me the fresh fruit this moring - still very sour, very tangy, but full of promise.  And if apricots could take precedence over missiles, the world would be full of promise too..

I am afraid Science and Politics have let us down. But the Cricket still sings on the window-sill. "



The Poem - Lone Fox Dancing. 

As I walked home last night

I saw a lone fox dancing

In the bright moonlight.

I stood and watched,

Then took the low road, knowing

The night was his by right.

Sometimes, when words ring true,

I'm like a lone fox dancing

In the morning dew.”

Summary of the Poem

Ruskin Bond 

Junoon Hindi Movie 

Saat Khoon Maaf

Blue Umbrella 

This appeared in pustakam.net on 24/3/21.


.....................