Pages

26/04/2017

సాదత్ హసన్ మంటో కధలు - 2

ఈ రోజు ఇంకో మంటో కధ.

సిరాజ్

'నాగపడా' పోలీస్ స్టేషన్ దగ్గర ఇరానీ రెస్టారెంట్ దగ్గర,  దీపపు స్థంబానికి తలనానించుకుని నించునుంటాడు 'ఢూండూ'.   అతనికి ఈ ముద్దు పేరు ఎవరు పెట్టారో గానీ, సరిగ్గా అతికినట్టు ఉంటుంది ఈ పేరు.  'ఢూండూ' అంటే 'వెతికి పెట్టేవాడు'  అని అర్ధం. సరిగ్గా అదే పని చేస్తాడు మనవాడు. విటులు కోరే ఎటువంటి అమ్మాయినైనా చిటికెలో సమకూర్చడం అతని వృత్తి.   అతనొక పింప్.

ఏ కులం,మతం, రంగు, వర్ణన కైనా అనుగుణంగా అమ్మాయిల్ని విటులకు అందివ్వడం అతనికి వెన్నతో పెట్టిన విద్య.   ఈ దీపపు స్థంబం,  అతని ఫేవరెట్ స్పాట్. ఎప్పుడన్నా ఆ వీధెమ్మట వెళ్తే, తప్పకుండా ఆ దీపెపు స్థంబాన్ని ఆనుకుని ఢుండూ కనిపిస్తాడు. ఒక వేళ అతనునా రోజు కనబడకపోయినా ఆ స్థంబం అతని మరో ఆత్మ లా అక్కడే నుంచుని నవ్వుతుంటుంది. ఎందుకంటే ఆ స్థంభం పొడుగైనది.  ఢుండూ కూడా పొడగరి.  

ఆ స్థంబాన్నించీ బోల్డన్ని కరెంటు తీగలు ఎక్కడెక్కడికో ప్రవహిస్తుంటాయి.. వాటిదో నెట్వర్క్. అలానే ఢుండూ ది కూడా పెద్ద నెట్వర్క్. ఆ స్థంబానికి  టెలిఫోన్ డిపార్ట్మెంట్ వారు కూడా ఒక జంక్షన్ బాక్స్ పెట్టారు. ఎపుడన్నా కనెక్షన్ లు కలపడానికీ, రిపైర్లు చెయ్యడానికీ.  ఢుండూ కూడా అలాంటి బాక్స్ లాంటి వాడే, ఏ తీగ ఎక్కడ పట్టుకోవాలో, ఎవరి అభిరుచికి అనుగుణంగా వారికి కొత్త కనెక్షన్లు ఎలా ఇవ్వాలో తెలిసిన వాడు.

అతనికి తన వృత్తిలో ప్రతి అమ్మాయీ తెలుసు. వారి శరీరపు ఆకృతి,  వారి చర్మాల క్రింద ఊపిరి తీసుకునే  ప్రతీ నరమూ,  ప్రతి అమ్మాయి స్వభావమూ, వగైరా.   ఏ అమ్మాయి ఎవరికి నప్పుతుందో ఢుండూ కి తెలుసు. ఇలా జీవితం సాఫీ గా గడిచిపోతున్న వేళ సిరాజ్ ప్రవేశిస్తుంది.  ఆమె కొత్తగా వచ్చిన వేశ్య.   స్వగతంగా చెప్పిన ఈ కధ లో  ఢుండూ, రచయిత (మంటో) తో,   ఈ పిల్ల గురించి చెప్తూ మొత్తుకుంటాడు.   

"ఈ దరిద్రానికి మెదడు వాచిందేమో చూడండి మంటో సాబ్!!  దుష్ట స్వభావి, అహంకారి.. అనూహ్యమైన మనిషి. అసలు ఈ వృత్తిలోకి ఎందుకొచ్చిందో?!   ఎవణ్ణీ తాకనివ్వదు.   ప్రతీ మనిషి మీదా నోరేసుకుని పడిపోతూంటుంది.   ఏ 'పాసింజరు'  నూ దగ్గరకే రానివ్వకపోతే బ్రతుకెట్టా గడిచేది? ఇపుడు చూడండి - మనిషి ఒక వస్తువను కొనుక్కున్నాకా, దాన్ని తాకి చూస్తాడు.   అంత దాకా ఇష్టమున్న మనిషిలా నటించి, తీరా వాళ్ళు ముందుకొచ్చాకా రంకెలు వేసి బెదరగొట్టేస్తుంది.   ఆఖరికి పాసింజర్లను ఉగ్ర రూపం దాల్చి కొట్టేస్తుంది కూడా.   నా సగం బిజినెస్స్ ఈ మనిషి వల్లే పడిపోయింది" అని చెప్తూ.. ఈ సమస్యను పరిష్కరించమంటాడు.

'మరి వృత్తి సరిపడని అలాంటి పిల్లను బలవంతంగా ఉంచడం దేనికి ?  పిల్లను తిప్పి పంపేయలేకపోయావా ?    కావాలంటే  ఆమెను పంపేందుకు డబ్బును ఇస్తానంటాడు' మంటో.   ఆ మాటకు సిగ్గుపడిపోతాడు ఢుండూ.   "పంపేయదల్చుకుంటే ఆమె ను పంపేందుకు  కావల్సిన డబ్బు నేనూ సర్దగలను.   కానీ ఆమె ఇక్కడే ఉండాలి" అంటాడు. 

"ఆమెను ప్రేమిస్తున్నావా ?"  అంటే, అవునూ కాదన్నట్టు తలాడించి.   ఆమె అంటే ఇష్టం!  అని ఒప్పుకుంటాడు.   "మీరు చదువుకున్న వారు సాబ్.   ఆమెకు కాస్త నచ్చచెప్పండి.  బీదరాలు.  వొంటి మీద చిరిగిన దుస్తులు తప్ప ఏమీ లేనిది.   హషిష్,  హిందీ సినిమా   పాటలూ తప్ప ఇంకేదీ రుచించని మనిషి.   మీకు తెలుసా ఇప్పటికీ ఆమె కన్యే. ఎవరినీ మీద చెయ్యే వెయ్యనివ్వని మనిషి కన్యే కదా!!!  చూడండి మంటో సాబ్, ఈ నాగపడా పోలీసులు మంచివారు కాబట్టి నేను ఇంకా బ్రతికున్నాను. ఆ పిచ్చిది సృష్టించిన హంగామా కి ఈ విటులే నన్ను లేపేసేవారేమో.. ఆమె తో మాటాడి ఆ పిల్ల బాధేంటో కనుక్కోండి. మీకు పుణ్యముంటుంది"  అని ప్రాధేయపడతాడు.

"ఇప్పటికే బొంబాయిలో వివిధ 'మేడం'  ల దగ్గర పనికి కుదిరి, 'పాసెంజర్ల'ను అదరగొట్టి, బిజినెస్సు దెబ్బ తీసిందని బయటికి తరమబడింది.   ఆ తరవాత ఒక హోటెల్ లో చేరింది, ఈమె ప్రవర్తన చూసి, వాళ్ళూ తరిమేసారు.   తిండీ, గూడూ లేకపోతే చూసి నేను చేరదీస్తే ఇదీ పరిస్థితి.  ఆమెను నేనూ తరిమేయలేను.  ఆమె లో ఈ మిగిల్న అమ్మాయిలో లేనిది ఏదో ఉంది.   పంజాబీ పిల్ల.   అలా నోటినే నమ్ముకుని,  ఎన్నాళ్ళు ఇలా ఉండగలదు?  చూసి చూసి ఏ వెధవో  ఆమెను బలవంతంగానైన చెరుస్తారు. లేదా పొడిచి పారేస్తారు. ఆ పిల్లని మీరే మార్చాలి మంటో సాహిబ్!"  అని మొత్తుకుంటాడు.

ఈ సిరాజ్ ను మంటో ఒకట్రెండు సార్లు చూసాడు.  సరైన భోజనం లేక బక్కచిక్కినా అందమైన మనిషి సిరాజ్. బలహీనంగా ఉన్నా ఏదో తెలియని ఆత్మ విశ్వాసం ఉంటుంది ఆమెలో.   ఆమె కళ్ళు పెద్దవి. స్పష్టంగా, ఆ చక్కని మొహంలో మెరుస్తూ ఉంటాయి. ఆ పెద్ద కళ్ళే మనకు కుతూహలం కలగజేస్తాయి. మంటో కి ఆ కళ్ళను కాసేపు ఎవరన్నా కాసేపు పక్కకు తప్పిస్తే తప్ప ఆమెను పూర్తిగా చూడడం  అసాధ్యం అనిపిస్తుంది. ఆమె పూర్తిగా నిండి ఒలికిపోతున్న మధుపాత్రలా వుంటుంది.  స్త్రీ కి ఉండాల్సిన మృదుత్వమూ, తెచ్చిపెట్టుకున్న చిక్కటి కరుకుతనం కలిపి వైన్ లా ఉండే మనిషి. చిటపటలాడుతూండే స్వభావం ఆమె చిందరవందర జుత్తుకూ,  ముడుచుకుపోయున ముక్కుకీ పెదవులకూ అంటుకునే వుంటుంది.

మంటో చివరికి సిరాజ్ ను,  ఢుండూ కు తెలియకుండా కలుస్తాడు.  ఢుండూ ఇచ్చిన ఆనవాళ్ళ ప్రకారం పరమ రొచ్చు వాతావరణంలో ఒక గుడిసెలో వుంటూన్న సిరాజ్ ని పది రూపాయల కు, మాటాడుకుని, ఒక రెస్టారెంటుకు తీసుకొస్తాడు. నాలుగు పెగ్గుల విస్కీ తరవాత ఆమె మిగిల్న విటులతో ఎలా ప్రవర్తిస్తుందో చూసేందుకు, ఆమె లో ఆగ్రహాన్ని రగిలించడానికీ కాస్త ప్రయత్నిస్తాడు.   అయినా ఆమె ప్రశాంతంగానే ఉంటుంది.  ఆమెకు నలభై రూపాయలిస్తే పుచ్చుకుంటుంది.   విస్కీ తీసుకోదు గానీ,  చరస్ అడిగి తీసుకుంటుంది. ఆ  చరస్  మత్తులో ఆమె,  'రాజ్యాలు కోల్పోయిన మహారాణి' లా అత్యంత విషాదంగా కనిపిస్తుంది.  ఆమె లో గూడుకట్టుకున్న దు:ఖానికి కారణమేమిటో తెలియక బాధనిపిస్తుంది మంటోకి. మర్నాడు   వీరిద్దరి 'మీటింగ్'  గురించి తెలిసి ఢూండూ కొంచెం ఫీలయ్యి, "మీరు ఇలా చేస్తారని అనుకోలేదు సాహిబ్!!" అని ఊరుకుంటాడు.    

విచిత్రంగా ఆ తరవాత కొన్నాళ్ళ పాటూ, సిరాజ్, ఢుండూ,  ఇద్దరూ ఎక్కడా కనిపించరు. సిరాజ్ గురించి వాకబు  చేస్తే ఆమె తిరిగి లాహోర్ వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. మరి ఢుండూ ఏమయినట్టు ? ఆమె ను దింపేసి రావడానికి వెళ్ళాడా? లేదా ఇద్దరూ లేచిపోయారా అర్ధం కాదు. ఢుండూ అలాంటి పని చెయ్యడు. భార్యా పిల్లలున్న వాడు. వాళ్ళంటే అతనికినెంతో అభిమానం.. ఇలా - ఆ దీప స్థంబాన్ని చూస్తూ, ఢుండూ వార్తల కోసం ఎదురు చూస్తుంటాడు మంటో.

ఆఖరికి, ఒక రోజు,  తనకలవాటైన చోటే ఢుండూ కనిపిస్తాడు.   ఇద్దరూ ఇరానీ హోటెల్లో చాయ్ తాగుతూ మాటాడుకుంటారు.   జరిగిందంతా చెప్తాడు ఢుండూ.   "మీతో కలిసి వచ్చాకా, నన్ను లాహోర్ తీసుకెళ్ళమని ప్రాధేయపడింది సిరాజ్. మీరు మిగిల్నసేఠ్ ల లా కాకుండా ఆమె తో ఎంతో బాగా ప్రవర్తించారంటగా.. మిమ్మల్ని ఆ రోజా మాట అన్నందుకు మన్నించండి. మీకు తెలుసు కదా, ఆమె ను నేను కాదనలేను. ఎంత నచ్చజెప్పినా వినలేదు.  మొత్రానికి లాహోర్  వెళ్ళాం. ఒక హోటెల్లో గది అద్దెకు తీసుకున్నాం. ఆమె కోరిక పై ఒక బురఖా కొన్నాను. అది వేసుకుని నెల రోజుల పాటూ వీధి వీధీ తిరిగింది, ఆమె తో నా టైం, బిజినెస్సూ పోగొట్టుకున్నందుకు, నన్ను నేను తిట్టుకోని క్షణం లేదు.

ఆఖరికి ఒక రోజు జట్కాలో  వెళ్తుండగా జట్కా వాణ్ణీ, బండి ఆపమని,  ఒక యువకుణ్ణి చూపించింది.  "నువ్వు ఇక్కడ దిగి, ఆ యువకుణ్ణి హోటెల్ కు తీసుకుని రా.. నేను ముందు వెళ్ళి అక్కడ ఎదురు చూస్తుంటాను"   అంది. నేను ఆ యువకుడితో మాటాడేసరికీ, నా ఇన్నేళ్ళ వ్యాపారానుభవాన్ని బట్టీ వాడుత్త స్త్రీలోలుడని అర్ధమైంది.  అతన్ని తీసుకొచ్చి ఆమె ముందు నిలబెట్టాకా, ఆ యువకుడు,   సిరాజ్ ని చూసి అదిరిపోయాడు. సిరాజ్  అతన్ని చూసి,  "నిన్ను ప్రాణప్రదంగా ప్రేమించాను. నువ్వూ నన్ను ప్రేమించావన్నావు.  నీ కోసం, నా తల్లిదండ్రులనూ, ఇంటినీ వొదిలి వచ్చాను. మనం ఈ హోటెల్లోనే ఒక రాత్రి గడిపాము. నువ్వు మర్నాడు పొద్దున్నే, నన్నొదిలి పారిపోయావు. నేను నీ కోసం ఎదురుచూడడం తప్ప, ఏమి చెయ్యాలో తెలీని పరిస్థితి లో వొదిలేసి వెళ్ళావు.. నా ప్రేమ మాత్రం ఆ రోజు ఎలా వుందో, ఈ రోజూ అలానే వుంది"  అంటూ అతన్ని కౌగిలించుకుంది.  అతను దు:ఖంతో వొణికిపోయాడు.  ఆ రోజు సమాజానికి భయపడి అలా చేసానన్నాడు. నన్ను బయటకు వెళ్ళమంది,   నేను వరండా లో మంచం వాల్చుకుని పడుకున్నాను. తెల్లారుతూనే సిరాజ్ వచ్చి, 'పద'  అంది.  'ఎక్కడికి' అంటే 'బొంబాయికి' అంది.   'మరి అతనో?' అంటే,   "తను పడుకున్నాడు. నా బురఖా కప్పేసి వచ్చాను"  అంది.  అలా ఇద్దరం వెనక్కి వచ్చాం" అన్నాడు.

వీళ్ళిలా  మాటల్లో పడి ఇంకో స్పెషల్ టీ ఆర్డరిచ్చే సమయానికి అక్కడికి సిరాజ్ రానే వచ్చింది.   మంటో కి స్పష్టంగా కనిపించడం మాత్రం ఇలా -   "ఆమె మొహం, కళ్ళూ దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ఏదో సాధించినట్టు, పెదవులపైన అత్భుతమైన చిరునవ్వు. పలకరింపుగా నవ్వుతున్న ఆమె కళ్ళు పచ్చ రైల్వే సిగ్నళ్ళలాగా మెరుస్తున్నాయి!"  ఇదీ సిరాజ్ ముగింపు. వేశ్యల జీవితాల వెనుక ఉన్న విషాద కోణాల్ని చూపించడానికి సిరాజ్ లాంటి ఎన్నో పాత్రలను మంటో సృష్టించాడు.  ఇది కూడా ఒక బాంబే స్టోరీ. కుష్వంత్ సింగ్ మెచ్చినదీనూ.  దీనితో నేను రాయాలనుకున్న రెండు మంటో కధలూ అయిపోయాయి.  

25/04/2017

The Book Thief


ద బుక్ థీఫ్. 



ఇది బాల సాహిత్యం.   ఈ కధ పుస్తకాలెత్తుకుపోయే పదీ పన్నెండేళ్ళ ఏళ్ళ అమ్మాయి  "లీసెల్ మెమింగర్" ది.   గత ఏడు సంవత్సరాలుగా సిరియాలో జరుగుతూన్న అంతర్యుద్ధం కారణం గా దాదాపు ప్రతి రోజూ జరుగుతున్న బాంబు దాడులూ, వాటిల్లో వందల్లో చచ్చిపోతున్న చిన్న పిల్లలూ, -  ఒక కొత్త తరాన్ని అంతరింపజేసేస్తున్న యుద్ధం -  ఇవన్నీ చూస్తూనే ఉన్నాం.  యుద్ధాల్లో అసలైన బాధితులు పిల్లలే.  స్కూళ్ళలో, ఆట స్థలాల్లో ఉగ్రవాద,  అధికారిక దాడుల్లో,   అసలు యుద్ధాల్లో ఎక్కువగా నష్టపోయేదీ, చచ్చిపోయేదీ, తన వాళ్ళని కోల్పోయి అగమ్యగోచరంగా ఎప్పుడు వస్తుందో తెలీని మృత్యు నీడలో భయంగా బ్రతికేదీ చిన్నారులే.    ఇదంతా పెద్ద హోక్స్ అని, పిల్లలెవ్వరూ చచ్చిపోవట్లేదనీ రెజీం చెప్తూన్నా,  కళ్ళ ముందు కనిపించే రక్త పాతం, మొన్నటి UNICEF నివేదిక (2016 సిరియన్ బాలల అత్యంత దారుణమైన సంవత్సరం)  - ఏటికేడూ పెరిగిపోతున్న చిన్నారుల మరణాలు,   దేశం వదిలి పారిపోతున్న చిన్నారులూ,   భవిష్యత్తేమిటో తెలీని పిల్లలూ,   తిండికో,  ఇంకో దేనికో యుద్ధం లో చేరిపోతున్న (ఏడేళ్ళ వయసు  పిల్లల్తో కలిపి)   పిల్లల గురించీ ఇంత స్పష్టమైన వీడియోలూ, గణాంకాలూ మధ్య - యుద్ధం లో తన వాళ్ళ ని కోల్పోయి,  భీభత్సాన్ని, హింస ను,  ఇన్ని కష్టాల్లోనూ, మానవత్వాన్ని  మర్చిపోని  మనుషుల్నీ చూస్తూ పెరిగిన పిల్ల   "లీసెల్" -   ఒక ప్రామాణిక పాత్ర. 

లీసెల్ కధనంతట్నీ మనకి చెప్పేంత పరిజ్ఞానం ఎవరికి ఉంటుంది - మృత్యువు కే. ఎందుకంటే  గాంధీ గారన్నట్టు "మృత్యువు మనల్ని నమ్ముకుని ఎన్నడూ వెంట ఉండే ప్రేయసి".   ఈ ప్రేయసి,  మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టి పోదు.  బుక్ థీఫ్ రాసిన - మార్కస్ జుసాక్ - దీన్ని మృత్యు స్వగతం గానే రాసాడు.  కాబట్టి ఇది మృత్యువు చెప్పిన కధ.

కధాకాలం రెండో ప్రపంచ యుద్ధం నాటిది.   నేపధ్యం - ఆర్య సిద్ధాంతపు కైపులో మునిగి తేలుతున్న జెర్మనీ లో మ్యూనిచ్ కి దగ్గరలో ఉన్న చిన్న గ్రామం -  మోల్ చింగ్ / మోల్ కింగ్.   ఫ్యూరర్ (Fuhrer (Hitler)) గారి ప్రతాపం లోకానికి తెలిసే నాటికి,  మోల్కింగ్ లో ఓ పేదల ఇంటికి పెంపకానికొస్తుంది లీసెల్.   నిజానికి లీసెల్, తన తమ్ముడూ రావాల్సింది,  కానీ ఆ చలి లో నిమోనియా తో  చిన్న తమ్ముడు శ్వాస అందక మార్గ మధ్యంలోనే ప్రాణాలు విడుస్తాడు.   పిల్లల్ని ఈ ఫాస్టర్ పేరెంట్స్ కి అప్పచెప్పడానికొచ్చిన తల్లి, ఎ లానో పిల్లాణ్ణి సమాధి చేసి,  పిల్లని తీసుకుని ఊర్లోకి అడుగుపెడుతుంది.  ఈ లీసెల్ - తమ్ముడ్ని కోల్పోయిన దుఃఖం'  ఏమిటో అర్ధం కాకముందే, శ్మశానంలో పిల్లాణ్ణి పాతిపెడుతున్న దృశ్యాన్ని కళ్ళప్పగించి చూస్తూ.. అక్కడ తడి మట్టి లో పడి ఉన్న ఒక పుస్తకాన్ని చటుక్కున తన స్కర్టు లో దాచేసి, తెచ్చుకుంటుంది. బహుశా తమ్ముడి జ్ఞాపంగా..  అదే మృత్యువు చూసిన మొదటి దొంగతనం.  అందుకే  లీసెల్ ని మృత్యువు" పుస్తకాల దొంగ" అనే పిలుస్తూ ఉంటుంది.   ఆ పుస్తకం   - "A Grave Diggers' Handbook".   గుండెల్నిండా కొడుకుని కోల్పోయిన దుఃఖం,  కూతుర్ని వేరే ఎవరి ఇంటిలోనో వొదిలేసి వెళ్ళాల్సి రావడం వల్ల  తల్లి మొహం లో ఎమోషన్స్ - గుండె నిండా బడబాగ్నిని దాచుకుని ధీర లా కర్తవ్యం వైపు అడుగులేసిన ఆ తల్లి ని చూసి మృత్యువు కూడా అబ్బురపోతుంది..
"How could she walk ?
How could she move ?
That's the sort of thing I 'll never know, or comprehend"..


ఇక్కణ్ణించీ లీసెల్ కధ లో ఓ పెద్ద మలుపు.  పిల్లని "హిమ్మెల్"  వీధి లో" హాన్స్ హబ్బర్  మేన్" అనే పెద్ద మనిషి కుటుంబానికి అప్పగించి,  వచ్చిన దార్లోనే వెళిపోతుంది తల్లి.  హెమ్మెల్ వీధి - ఒక స్వర్గం. పేదవాళ్ళ బస్తీ.  ఆమె ఎందుకు పిల్లల్ని వొదులుకోవాల్సి వస్తుందో అస్పష్టం.  అమె కమ్యూనిస్ట్ నేపధ్యం కారణం కావచ్చు. తండ్రి కుటుంబాన్ని వొదిలి వెళ్ళిపోయాడు. పిల్లల్ని ఫాస్టర్ కేర్ లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇవ్వాలి.    ఆమెకు ఎంత కష్టం - యుద్ధం, ఆర్ధిక మాంద్యం వగైరా ల వల్ల, ఇద్దరు పిల్లలకి తిండి పెట్టే స్తోమత లేదు. .  పిల్లని పెంచుకున్నందుకు గానూ ఫాస్టర్ పేరెంట్స్ కు కొంత అలవెన్సు దొరుకుతుంది. అంతే కాదు. ఈ హబ్బర్  మేన్లు ఒంటరి ప్రాణులు. వాళ్ళ ఒక్కగానొక్క కొడుకు జెర్మనీ తరఫున యుద్ధానికి వెళ్ళి ఉన్నాడు.  హిట్లర్ నూరిపోసిన అతి జాతీయవాదం నర నరానా జీర్ణించుకుపోయి, యుద్ధానికి వెళ్ళని తండ్రి మితవాదాన్ని అసహ్యించుకునే మనస్తత్వం కొడుకుది.     వీధి లో చాలా మంది మగ పిల్లలు యుద్ధం లో నే ఉన్నారు. వాళ్ళలో కొందరు ఇష్టపడి, హిట్లర్ ఉన్మాదత ని ప్రేమించి,  ఆయన కల్ల బొల్లి మాటలు నమ్మి  యుద్ధానికి వెళ్తే,  కొందరు తొందర్లోనే యుద్ధోన్మాదంలో ప్రమాదాన్ని తెలుసుకున్నా.. హిట్లర్ ని నమ్మినా నమ్మక పోయినా - అధికారుల పట్ల భయంతో యుద్ధానికి వెళ్తారు. కాబట్టి, తల్లి కీ తండ్రికీ  తమ శూన్యత ని మరిచిపోవడానికి , కాలక్షేపానికి ఈ పిల్ల ని పెంచడం అవసరం.  ఆ రోజుల్లో యుద్ధాల  వల్ల అనాధలయిన పిల్లల్ని  మిగతా కుటుంబాలు సాకడం సాధారణం.

లీసెల్ కొత్త ఇంట్లో కి వచ్చేసరికీ, తన జీవితంలో ఏర్పడిన ఒడిదుడుకులు, ఒంటరితనం వల్ల,  భయపడి పోయి  ఉంటుంది.  పెంపుడు తల్లి రోసా హబ్బర్ మేన్ ది చెక్క మొహం.  దాన్లో కరుణ అనేది ఏ కోశానా కనిపించదు.  పిల్లని భయపెట్టడం లో సిద్ధ హస్తురాలు.   తండ్రి హాన్స్ హబ్బర్ మేన్ ఎంతో దయ గల వ్యక్తి. అతను ఒకప్పుడు జెర్మనీ తరఫున యుద్ధం లో పాల్గొన్న వాడే.  కానీ సౌమ్యుడు.   యుద్ధంలో అతనికి ఒక యూదు సైనికునితో స్నేహం కుదురుతుంది.  దురదృష్టవశాత్తూ ఆ యూదు సైనికుడు హబ్బర్ మేన్ ను స్థానాన్ని తీసుకోవడం వల్ల మృత్యువు పాలవుతాడు.   యుద్ధానంతరం,  తీవ్రమైన గిల్ట్ తో, హాన్స్ తన యూదు స్నేహితుని కుటుంబాన్ని కలిసి,  క్షమాపణలు వేడుకోవడానికి వెళ్తాడు.   అప్పటికి ఆ యూదు సైనికునికి, ఒక చిన్న పిల్లాడు.  అతని భార్య కి తన ఎడ్రసు ఒక కాగితం మీద రాసి ఇచ్చి - "నీకు ఎటువంటి సాయం కావాలన్నా - నన్ను అడుగు. నా స్నేహితుడు కాపాడిన ఈ ప్రాణాన్ని అతని కుటుంబానికి ఏ చిన్న సాయం చేసైనా ఉపయోగిస్తాను" అని ప్రమాణం చేసి వస్తాడు హాన్స్.  అప్పణ్ణించీ,  హాన్స్ ని యుద్ధపు పిలుపులు  తాకవు.   ఆ రోజుల్లో  ఓటమి వైపు పయనిస్తున్న జెర్మన్ సైన్యం, అసంఖ్యాకంగా చనిపోతున్న తన సేనల స్థానాన్ని,  ప్రజల్లో కాస్త able గా కనిపించే వారితోనూ,  మాజీ సైనికులతోనూ భర్తీ చేసేవి.   'గెస్టపో'  పని ప్రజల్లో  తిరగడం, కనబడిన యూదుని పట్టి బంధించడం,  పనికొస్తాడూ అనుకున్న వాణ్ణల్లా సైన్యంలో తోయడం.. ఇదే.  హాన్స్, కష్ట కాలంలో కొన్నాళ్ళు రెండో ప్రపంచ యుద్ధం లో కూడా కొన్ని నెలలు పాల్గొంటాడనుకోండి.   కానీ అతను మనుషుల్ని చంపే సైనికుడు కాదు. 


యుద్ధపు రోజుల్లో ఉద్యోగాలు ఉండవు.  ఉన్న ఉద్యోగాలన్నీ యుద్ధానికి సంబంధించినవే.  హాన్స్ ఒక పెయింటర్.  యూదు ఇళ్ళ మీద గెస్టపో వేసిన క్రాస్ మార్కుల్ని తన పెయింట్ తో కప్పేసే సాహసం చేసేవాడు కూడానూ.    హాన్స్ దగ్గర ఒక అకార్డియన్ ఉంటుంది.  ఈ వాద్య పరికరం.. హాన్స్ యూ.ఎస్.పీ.   యూదు అన్నాక పనంటూ లేక, తనకి ఇవ్వడానికి డబ్బుల్లేని యూదులకు కూడా పైకి తెలీకుండా సాయం చేసేవాడు.   రోసా ఊర్లో కాస్త పెద్ద వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి బట్టలు తీసుకొచ్చి ఉతికి, ఇస్త్రీ చేసి, కాసిన్ని డబ్బులు సంపాదించ బట్టి గానీ, హాన్స్ కరుణామయ సేవల కి కుటుంబం నడవడం కష్టం అయి ఉండేది.

హాన్స్ ఇంట్లో ఒక చిన్న బేస్మెంట్ - ఓ నాలుగు గదులూ.  కిచెన్ లో ఎప్పుడూ బట్టలు ఉడికించే గంగాళం, ఇస్త్రీ వాసన కొట్టే గాలీ - రోసా ఎలాగో వండి వార్చే పీ-సూపూ, రేషన్ లో దొరికే రొట్టే  తప్ప ఇంకేవీ ఉండేవి కాదు.   బేస్మెంట్  చిన్నదీ అని ఎందుకు అన్నామంటే,  ఊర్ల మీద బాంబింగ్ జరిగితే ఇళ్ళలో జనం తల దాచుకోవడానికి బేస్మెంట్ కాస్త లోతైనది ఉంటే బావుంటుంది.   కధ ప్రారంభం లో మృత్యువు అంటుంది.  "ఈ బేస్మెంట్ చిన్నది. గెస్టపో లెక్కల ప్రకారం పెద్దగా పనికిరానిది. నిండా హాన్స్ పెయింట్ డబ్బాలూ, చెత్తా తో నిండి, చల్లగా, చీకటిగా.. అసహ్యంగా!   కానీ ఈ బేస్మెంట్ రెండు ప్రాణాల్ని కాపాడింది!" అని.

లీసెల్ 'హమ్మల్ వీధి' జీవితం గురించి చెప్పాలి.   కొత్త తనానికి, ఒంటరి తనానికీ బెంగ పడుతూండే దశ.  కొత్త తల్లి  రోసా ముందు స్నానానికి బట్టలు విప్పడానికి భయపడే పిల్ల,   నిద్ర లో ఉలిక్కి పడి లేచేసె పిల్ల,  పక్క తడిపేస్తే, హాన్స్ తనని ఎత్తుకుని వేరే పక్క మీదికి మారిస్తే హాన్స్ చేతినిపట్టుకుని నిశ్చింత ని వెతుక్కునే పిల్ల -  పెద్ద రౌడీ లా.. వీధిలో  ఆడుకుంటూండే పొరుగు పిల్లలతో పోరాటనికి దిగి, ఆ దశ లో ఫుట్ బాల్ ఆట వల్ల తన ప్రాణ స్నేహితుణ్ణి సంపాదించుకుంటుంది.    వాడే మన హీరో - రూడీ స్టీనర్.   వీడు ఒక జ్వాల.   యుద్ధ కాలంలో పిల్లలందరూ చాలీ చాలని తిండి వల్ల ఆకలిగా, బలహీనంగా ఉండేవారు. అందులోనూ, రూడీ ఇంట్లో ఆరుగురిలో ఒకడు. అప్పుడపుడూ తిండి, తోటల్లో పళ్ళూ దొంగతనం  చేస్తూ ఉంటాడు.   రూడీ కి 'హిట్లర్' మోహం అంతగా తలకెక్కదు.   ప్రతీదీ ప్రశ్నించే మనస్తత్వం.     లీసెల్ వీధి లో పొరుగు  అబ్బాయి.   ఈ కొత్త పిల్ల అమాయకత్వం, తెగింపూ వాణ్ణి ఆకర్షిస్తాయి. రూడీ కూడా తక్కువ వాడు కాదు.   1936 లో ఒలింపిక్స్ లో నాలుగు బంగారు పతకాలు గెల్చుకున్న నల్ల జాతి మేలి ముత్యం  జెస్సీ ఓవెన్స్. కానీ  తను తక్కువ జాతి వాడు కావడం వల్ల హిట్లర్ అతనితో కరచాలనం చెయ్యడానికి నిరాకరిస్తాడు.  హిట్లర్ అహాన్ని దెబ్బ తీసిన జెస్సీ ఓవెన్స్ చరిత్ర లో నిల్చిపోయిన అత్భుతమైన అథ్లెట్.

జెస్సీ ఓవెన్స్ గురించి తెలుసుకున్నాక రూడీ కన్నా జెర్మనీ లో ఎవరూ ఇంప్రెస్ అయి ఉండరు.  ఇంట్లో ఎవరూ చూడకుండా,  బొగ్గు మసి మొహానికి రాసుకుని గ్రౌండ్ లో కొన్ని రౌండ్లు పరిగెట్టీ దాకా వాడికి మనసు తీరదు. ఈ నల్ల మసి బాలుణ్ణి చూస్తూ చుట్టూ చేరి కేరింతలు కొడుతున్న జనం, తనే 'జెస్సీ ఓవెన్స్'  అనుకుంటూ స్వాప్నికుడిలా రూడీ పరుగు..  ఆఖరికి పిల్లాణ్ణి వెతుక్కుంటూ వచ్చిన తండ్రి  జెస్సీ ఓవెన్స్ అయినందుకు (హిట్లర్ ని ధిక్కరించిన నల్ల వాడు అయినందుకు - ఆ రోజుల్లో హిట్లర్ మీద అభిమానాన్ని నాజీ జెర్మనీ లో బహిరంగంగా ప్రదర్శించిన వాళ్ళకే బ్రతుకు!   ధిక్కార స్వరం ఏ కోశాన వినిపించినా వాళ్ళ ని పట్టుకుని జైళ్ళలోకి తోయడానికి గూఢచారులు  సిద్ధంగా ఉండేవారు)  చెవి మెలిపెట్టి గట్టిగా తిప్పుతూ తీసుకెళ్ళిపోతుంటే అందరూ ఆ పిల్లాడి గురించే చెప్పుకుంటారు.   ఈ రూడీ చాలా దయ గల వాడు.  వీధుల్లో పెరేడ్ చేయబడుతూండే యూదు ఖైదీల బక్కచిక్కిన మొహాల్ని చూసి, శోషొచ్చి పడిపోతున్న ఏ దీనుడికో రొట్టె ముక్క విసిరి, పోలీసుల కన్ను గప్పకుండా పారిపోవడం, అతను సాధారణంగా చేస్తూండే సాహసం.  ఈ రూడీ కి,  లీసెల్ కన్నా అత్భుతమైన స్నేహితురాలు దొరికే అవకాశం లేదు.

మెల్లగా లీసెల్ కి తల్లి తండృల హృదయం అర్ధం అవుతూంటుంది.  తనని "పంది" (Soukerl) [రూడ్ గా మాటాడే రోసా కి ఇదో ఊతపదం]  అని తిడుతూండే, ఎప్పుడూ రుస రుసలాడుతూండే రోసా మంచితనం నెమ్మది నెమ్మది గా లీసెల్ కు అర్ధం అవుతూంటుంది.   మెలమెల్లగా తమని మమా, పాపా (అమ్మా, నాన్నా) అని పిలిపించుకుని, వాళ్ళ కుటుంబంలోకీ, జీవితంలోకీ ఆహ్వానించిన వాళ్ళిద్దరూ లీసెల్ హృదయం లోకి ప్రవేశించారు.   భర్త "సహృదయంతో" ప్రతి రోజూ డబ్బు ఇంటికి తేకపోయినా - ఎక్కడో రోజంతా వాలంటీరింగ్ చేసి వచ్చినా,  ముగ్గురికీ ఉన్న దాంతోనే వండి వార్చాల్సిన అవసరం రోసాది.  బట్టలు ఉతకడం, ఇంట్లోనే వాట్ని ఎండేయడం,  ఇస్త్రీ చేయడం లాంటి కష్టపడే పనులు చెయ్యడం తో పాటూ, వాట్ని ఇంటికెళ్ళి డెలివరీ చెయ్యడం, మాసిన బట్టలు కలెక్ట్ చెయ్యడం ఇవన్నీ ఈవిడ ఒక్కచేత చెయ్యలేక, నెమ్మదిగా ఈ వాతావరణానికి అలవాటు పడుతున్న లీసెల్ ని తన తో తోడు తీసుకెళ్ళడం మొదలు పెడుతుంది.  నెమ్మదిగా లీసెల్ కే బట్టలు తెచ్చి, తిరిగిచ్చే బాధ్యత నెత్తి మీద పడుతుంది.  అలా కొన్ని కుటుంబాలతో  లీసెల్ కి పరిచయం .  రోసా కస్టమరు ఆ వూరి మేయరు హైంజ్ హెర్మన్.  అతని భార్య ఇల్సా  వాళ్ళింటికి వెళ్ళడం లీసెల్ జీవితం లో పెద్ద సంఘటన. ఎందుకంటే ఈ పుస్తకాల దొంగ కి వాళ్ళింట్లో పెద్ద లైబ్రరీ కనిపిస్తుంది.

నాజీ జెర్మనీ లో ఒక రాసిపెట్టని రూలు ఉండేది. ప్రతీ జెర్మనూ విధి గా హిట్లర్ విధేయుడే అయి వుండాలి.  పార్టీ ఆఫీస్ లో సభ్యత్వం ఉండాలి. దేశ సేవ కోసం ఏఅ క్షణాన పిలుపు వచ్చినా వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. వీధుల్లో యూదులను తీసుకుపోయి కాంపుల్లో పెట్టినా, మానవత్వం తో ఎవర్నీ రక్షించడం అవీ చెయ్యకూడదు.  అలా చేస్తే వాళ్ళు కూడా అవిధేయ ముద్ర తో ఏ కాన్సంట్రేషన్ కాంపు కో, జైలు కో లేదా ఏకంగా పైలోకానికో వెళ్ళాల్సిందే !  గెస్టాపో కళ్ళ బడకూడదంటే,  ఇంట్లో హిట్లరు రాసిన 'మీన్ కాంఫ్' ఉండాల్సిందే.  [హాన్స్ కూడా పార్టీ ఆఫీసుకెళ్ళి ఒక పుస్తకం తెచ్చుకుంటాడు  అంత వరకూ మీన్ కాంఫ్ ని తననీ, కొడుకునీ దూరం చేసిన ఒక దరిద్రపు పుస్తకంగా అసహ్యించుకున్నా కూడా ! ]   లీసెల్ కి చదవడం రాయడం రాకపోయినా పుస్తకాల పట్ల ఆమె కున్న ప్రేమని మెచ్చుకుంటూ, ఇంటిలో మెల్లగా ఆమెకు చదవడం నేర్పిస్తాడు తండ్రి.  ఈ లోగా అడపా దడపా ఎక్కడ్నుంచో పుస్తకాల్ని తెచ్చి, ఆమెకు ఇవ్వడం మొదలుపెడతాడు. వాళ్ళు రాత్రి పూట మెల మెల్లగా ఒక్కో పుస్తకాన్నీ పూర్తి చేస్తుంటారు. ఆ క్షణాలు అపురూపమైనవి లీసెల్ కి.  కానీ ఆమెకు హాన్స్ అంత కన్నా నేర్పలేకపోతాడు.  నట్టుతూ నట్టుతూ, పరమ మెల్లగా పుస్తకల్ని చదువుతుంటారు తండ్రీ కూతురూ.


ఈ లోగా లీసెల్ జీవితంలో ఇంకో పెద్ద సంఘటన !  గెస్టపో వాళ్ళు,  హిట్లర్ ఆదేశాల ప్రకారం, మనసుల్ని పొల్యూట్ చేసే ('మీన్ కాంఫ్'  తప్ప) అన్ని పుస్తకాల్నీ స్క్వేర్ లో వేసి కాల్చేస్తారు ఒక సారి.   ఆ కాల్చేయడం జనం సంబరంగా చూడాలి..   స్వచ్చందంగా ఏమైనా పుస్తకాలు ఇంట్లో ఉంటే తెచ్చి మంటల్లో వెయ్యాలి. హిట్లర్ కి చేయెత్తి జై కొట్టాలి. అదీ కార్యక్రమం.    లీసెల్ ఈ పుస్తకాల కాల్చి వేత చూసి దిమ్మెర పోతుంది.   లీసెల్ ఇంటికొచ్చిన కొత్తలో ఆమె పరుపు కింద దాచుకున్న మొదటి దొంగతనం. 'A Gravedigger's Handbook'.   దాన్ని చూసిన హాన్స్ మెల్లగా,  అపుడపుడే లీసెల్ కు చదవడం నేర్పిస్తున్నాడు కదా.   పెద్ద పెద్ద పుస్తకాలూ కధలూ చదివేయాలని ఆశగా ఉంటూండే ఆ చిన్న పిల్లకు కొత్త ప్రపంచ ద్వారాలు,  అపుడపుడే తెరుచుకుంటున్నాయి.  అందుకే జ్ఞానానికి ప్రతీకలూ , కొత్త లోకాల కీ దారులు చూపించే ఈ పుస్తకాల్ని కాల్చేస్తూండటం భరించలేక,   ఆఖరికి కాలీ కాలకుండా,  ఆ బూడిద కుప్పలో దొరికిన ఒక పుస్తకాన్ని, ఆ కుప్ప మీద ఊసే నెపంతో వెళ్ళి, చటుక్కున కోటు మాట్న దాచి, గెస్టపో వాళ్ళ కళ్ళ పడకుండా  తండ్రి తో కలిసి ఇంటి దారి పడుతుంది.   కోటు లో కాల్తూన్న పుస్తకం చర్మాన్ని కాలుస్తునా, కిక్కురుమనకుండా  ఒక సేఫ్ ప్లేస్ కి వచ్చాకా తన "ట్రోఫీ"  పుస్తకాన్ని హాన్స్ కి చూపిస్తుంది.   ఇది రెండో దొంగతనం.  ఈ రహస్యం వాళ్ళిద్దరికే తెలుసనుకుని ఇద్దరూ చిన్న నవ్వుతో ఇంటికి వెళ్తారు. పుస్తకాలంటే లీసెల్ కి ఉన్న ఇష్టం హాన్స్ కి బాగా తెలుసు కనుక !

కానీ ఎవరూ చూడకపోయినా ఆ రోజు లీసెల్ దొంగతనాన్ని స్క్వేర్ కి ఆనుకున్న తన ఇంట్లోంచీ మేయర్ భార్య  ఇల్సా చూస్తుంది.      ఇల్సా ఒక చదువుకున్న, స్వతంత్ర భావాలున్న మహిళ.   కానీ ఒక్కగానొక్క కొడుకు మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోవడంతో విత్ డ్రాన్ గా ఉంటుంది. కానీ మనసు వెన్న దంపతులది.   తనింట్లో బట్టల కోసం వస్తూండే లీసెల్ ను గుర్తుపట్టి, ఆ పేద పిల్లకు గెస్టపో కళ్ళు కప్పి పుస్తకాన్ని ఎత్తుకుపోయేంత ఇష్టం వుండడం చూసి అబ్బురపడుతుంది.   ఆమెకు లీసెల్ అంటే అభిమానం అప్పణ్ణించే మొదలయ్యి..  లీసెల్ ని బట్టలకోసం వచ్చినపుడల్లా లైబ్రరీ లో పుస్తకాలు చదువుకోవడానికి అనుమతిస్తుంది.   అన్ని పుస్తకాల్ని ఒక్క సారి చూసి, వాటిని తను ఎంత సేపు కావాలంటే అంత సేపు చూడొచ్చనే సంగతి తెలిసి లీసెల్  తెగ సంబరపడిపోతుంది.  ఈ పుస్తకాల్ని కాల్చని మేయర్ హృదయం మంచిదని కూడా  (అప్పటికి జర్మనీ లో మేధా వర్గం హిట్లర్ ని గుడ్డిగా ఆరాధించడం మానడం మొదలయింది) గ్రహిస్తుంది.

అయితే అదే మంచితనం వల్ల గ్రామంలో ప్రజలందరూ కష్టపడి బ్రతుకుతున్నపుడు తన కుటుంబం బట్టల్ని ఉతికించుకోవడం,  luxury ని అనుభవించడం ఇష్టపడక,  మేయరు భార్య రోసా సేవల్ని ఒక సారి ఆపేస్తుంది. లీసెల్ వచ్చినపుడు  "బట్టలు లేవు ఈ కవరు మీ అమ్మకు ఇవ్వు!"   అంటుంది.   " నీకు కావల్సినపుడల్లా మా లైబ్రరీ కి రావచ్చు. నీకు ఎప్పుడూ స్వాగతం "  అని కూడా అంటుంది.    కానీ అప్పటికే యుద్దం వల్ల చుట్టుముట్టిన ఆర్ధిక మాంద్యం వల్ల,  అందరూ పని మానిపించేయడంతో తినడానికి కష్టంగా ఉన్న పరిస్థితి తెలుసు కనుక,   ఎందుకో లీసెల్  నిస్సహాయమైన  కోపంతో మేయర్ భార్యని తిట్టి,  అక్కణ్ణించీ ఏడుస్తూ ఇంటికొచేస్తుంది.   కానీ తిట్టాననే పశ్చాత్తాపం ఆమెని దహించేస్తూ ఉంటుంది.   రోసా ఈ వార్తను కూడా దిగమింగి ఎలానో ఊరుకుంటుంది గానీ లీసెల్ కి  లైబ్రరీ ని మిస్స్ కావడం వల్లా, మేయరు భార్య కి మొహం చూపించలేకా.. చాలా రెస్ట్ లెస్ గా వుంటుంది.

ఇప్పుడు రూడీ సాయంతో పుస్తకాల్ని లైబ్రరీ నుంచీ ఒకటీ, అరా కిటికీ గుండా (ముందు ద్వారం లోంచీ వెళ్ళడానికి మొహం చెల్లక) తీసుకొచ్చేయడం, "దొంగతనం" మళ్ళీ చేస్తుంది. ఈ విషయం మేయర్ బార్య పసిగట్టినా... ఏమీ అనదు.   కొన్నాళ్ళకి లీసెల్ ని 'నువ్వు ఇంక కిటికీ గుండా రావద్దు..  ముందు ద్వారం లోంచీ రా'.. అని చెప్పేంత వరకూ తన దొంగతనం ఎవరూ చూడట్లేదనే అనుకుంటుంది లీసెల్.

వీటన్నిటి మధ్యా - జెర్మనీ రష్యా మీదకి యుద్ధానికి వెళ్ళి ఉంటుంది. జెర్మనీ లో పరిస్థితులు చాలా దిగజారి ఉన్నాయి. ఒక రోజు రాత్రి చీకటి తెరల్లోంచీ హబర్మేన్ ల ఇంటికి ఒక అతిధి శరణు కోరి వస్తాడు.   అతను ఎన్నో బాధలు పడి హాన్స్ హబ్బర్ మేన్ ను వెతుక్కుంటూ వచ్చిన పూర్వపు యూదు  సైనికుడి కొడుకు.  అతన్ని ఇంట్లో దాచి మృత్యువు నుండీ కాపాడటం, హాన్స్ కర్తవ్యం. దీన్ని దంపతులిద్దరూ ఎంతో హృదయపూర్వకంగా స్వాగతిస్తారు.  తమకి ప్రాణాపాయమని తెలిసినా, మానవత్వం తో, కృతజ్ఞత తో మాక్స్ వాండెన్ బర్గ్  ని ఇంట్లో కి ఆహ్వానిస్తారు. అసలే పరిమితంగా దొరికే రేషన్ ని, ఈ నాలుగో వ్యక్తి తో పంచుకోవడం అంటే ఎంత కష్టం, రోసా ని ఈ ప్రశ్న కలవరపెట్టినా, హాన్స్ మొహం చూసి ఊరుకుంటుంది.    మొత్తానికి కుటుంబం అంతా ఏకతాటి మీద నిలబడి ఒక నిర్ణయానికొస్తుంది.  కొత్త స్నేహితుడి విషయం లీసెల్ ఎక్కడా పొక్కనివ్వకూడదు.  రూడీ కి, ఎవ్వరికీ.. ఈ విషయం తెలీకూడదు. తెలిస్తే గెస్టపో చేతిలో [మాక్స్ కి లేదా అందరికీ]  మృత్యువు తధ్యం.

ఈ కొత్త పాత్ర మాక్స్ - నాజీలు ఇంటిమీదికొచ్చాకా, తల్లీ, అప్ప చెల్లెళ్ళూ మృత్యుముఖం లోకి వెళ్తూ కడసారి చూసిన చూపును మర్చిపోలేకపోతూ.. మృత్యు భయంతో వొణికిపోతూ ఉన్న ఒక నవ యువకుడు.  అంత నిరాశ లో నాజీలు యూదుల్ని వెతికి వెతికి ఊచకోత కోస్తున్న రోజుల్లో, మాక్స్ తల్లికి ఎపుడో తనకి సాయం కోరవచ్చంటూ ఎడ్రసు ఇచ్చిన హాన్స్ హబ్బర్ మాన్ గుర్తొచ్చి, హాన్స్ ఎడ్రసు రాసున్న ఆ కాగితం ముక్క ఇన్నాళ్ళకి వెతికి  సంపాదించి, మాక్స్ ని ఎలా అయినా  హాన్స్ దగ్గరకి పారిపొమ్మని చెప్తుంది.  అలా దాక్కుని, కడసారి తల్లి నీ చెల్లెళ్ళనీ వొదిలి, స్నేహితుని సాయంతో ఈ మోల్ కింగ్ చేరి, హాన్స్ ఇంటికి ఓ అర్ధ రాత్రి వేళ చీకటి లో ఓ నీడ లాగా వచ్చి తేల్తాడు.  మానసికంగా, శారీరకంగా అలసిపోయిన మాక్స్ కి హాన్స్ ఇంట్లో చల్లని బేస్మెంట్ రెండు చేతులా స్వాగతం పలుకుతుంది.

మాక్స్ ఈ బేస్మెంట్ లో, హాన్స్ సంరక్షణ లో, లీసెల్ స్నేహపూర్వక ఆసక్తి తో మనిషవుతాడు.  లీసెల్ కి చక్కగా చదవడం రాయడం నేర్పిస్తాడు. అతను చదువుకున్న వాడు. వీళ్ళిద్దరి అనుబంధం బలపడుతుంది.  క్రాస్ వర్డ్ పజిల్స్ పూర్తి చెయ్యడం అంటే మాక్స్ కి ఇష్టం.  అది తెలుసుకున్న లీసెల్.. ఎక్కడన్నా, ఆఖరికి చెత్త బుట్టల్లోనైనా క్రాస్వర్డ్ పజిల్ ఉన్న  News Paper  ముక్క కనపడితే, మాక్స్ కి తెచ్చి ఇస్తూ ఉంటుంది. మాక్స్ కూడా లీసెల్ చేత వాళ్ళింట్లో ఉన్న  పుస్తకాలన్నిటిని చదివించేస్తాడు.  ఇప్పుడు లీసెల్ కి స్వంతంగా చదవడం, రాయడం వచ్చు.  మేక్స్ మధ్య లో జబ్బు పడతాడు. అతను కోలుకునే వరకూ... ఎంతో ఆదుర్దా పడిన ఆ కొత్త కుటుంబం - ముఖ్యంగా లీసెల్.  బయటకు ఎవరికీ అణుమాత్రమైనా అనుమానం రాకుండా ప్రాణాలతో దాచి ఉంచిన ఈ స్నేహితుడు, అనారోగ్యంతోనే కన్ను మూస్తాడేమో అని టెన్షన్ అనుభవిస్తూంటుంది..   లీసెల్ మమ్మూలు గానే స్కూల్ కి వెళ్తూంటుంది, రూడీ తో ఇతర స్నేహితులతో ఆడుకుంటూంటుంది. పొలాల్లో, తోటల్లో, ఆకలికి మిగిల్న పిల్లల తో కలిసి దొంగతనాలు చేస్తూంటుంది.   వీధుల్లో పోలీసు కనబడితే భయంతో బిక్క చచ్చిపోయినా... ధైర్యం తెచ్చుకుని, ఏదో ఒక నెపంతో తల్లి తండృల్ని ఎలర్ట్ చేస్తూ.. వెయ్యి కళ్ళతో మాక్స్ ని కాపాడుతూ వస్తుంది.


నిజానికి  శీతాకాలపు చలి కి,  మంచులో కూరుకుపోయిన ఆ బేస్మెంట్ లో, సరైన తిండీ, నిద్రా లేని మాక్స్  విపరీతంగా జబ్బు పడిపోతాడు.  వళ్ళెరగని మత్తు లో కూరుకుపోతాడు. రోసా ఎలానో పరిచర్యలు చేస్తూంటుంది.  మాక్స్ ని ఉంచిన బేస్మెంట్, మూత్రపు వాసన తో,  ఉక్క పోత తో ఏ మాత్రం ఆరోగ్యంగా లేకపోవడంతో అతన్ని  లీసెల్ గదికి, లీసెల్ బెడ్ మీదికి మారుస్తారు.   మాక్స్ పక్కన కూర్చుని అతను వింటాడేమో అన్నట్టు రక రకాల తన "రహస్య"  పుస్తకాల ని చదువుతూ, అతని లో ఏ మాత్రం కదలిక ఉన్నా.. వొంగి అతని మొహాన్ని పరిశీలిస్తూ.. లీసల్ ఇదే పని లో ఉంటుంది. ఇంట్లో ఉన్నంత సేపూ!  జ్వర తీత్రత లో, తల్లీ చెల్లెళ్ళని మృత్యువు కు వొదిలేసి, తాను మాత్రం బ్రతికి ఉన్నందుకు సిగ్గు పడుతున్న ఈ ప్రాణికి,  మగత లోంచీ మెలకువ వచ్చినప్పుడల్లా, తన పక్క న కూర్చుని, పుస్తకాన్ని బయటకు చదువుతూ, తన మొహంలోకి ఆత్రుతగా చూస్తుండే లీసెల్ ప్రతిబింబం మనసంతా ముద్రించుకుపోతుంది. ఆ కృతజ్ఞత అతన్ని జీవితాంతం అంటిపెట్టుకునే వుంటుంది. 

ఆఖరికి లీసెల్ స్కూల్లో ఉండగా మాక్స్ కి తెలివొస్తుంది. రోసా అప్పటికప్పుడు స్కూల్ కి బయల్దేరి, లీసెల్ ని దేనికో నానా తిట్లూ తిడుతూ (అందరికీ రోసా తిట్ల మోతు, గయ్యాళి  అనే ఇంప్రెషన్ కదా)  దగ్గరికి లాక్కుని మాక్స్ బ్రతికినట్టు చెప్తుంది. అప్పుడు ఇద్దరూ ఎంతో ఎమోషన్ ని గుండెల్లో దాచుకుని, గమనించే వాళ్ళకి ఏ మాత్రమూ  అనుమానం రాకుండా విడిపోతారు.   లీసెల్ అనాసక్తంగా ఇంటికి చేరినట్టు నటించి, లోపలికి వెళ్ళాకా, ఒక్క పాటున మాక్స్ దగ్గరికి పరిగెత్తి... అతన్ని ప్రాణాలతో చూడగలిగినందుకు ఎంతో ఆనందిస్తుంది.  

మాక్స్ కూడా రోసా, హాన్స్, ముఖ్యంగా ఆత్మీయమైన లీసెల్ మంచితనానికి  ముగ్ధుడైపోతాడు.    హన్స్ సాయంతో లీసెల్  కి, పాత కాయితాల మీద తెల్లని పెయింట్  వేసి ఆరాక బొమ్మలతో సహా తన జీవిత  కథ రాసి పుస్తకంలా చేసి ఇస్తాడు. ఆదో అత్భుతమైన గిఫ్ట్ ఆ  పిల్లకి!    అప్పటికి జెర్మన్ నగరాల మీద మిత్ర పక్షాల వైమానిక దాడులు ముమ్మరం అవుతున్నాయి.   వీళ్ళుండే ఊరి మీద కూడా విమానాలు చక్కర్లు కొడుతున్నాయి.  చీకట్లలో సైరన్లు మోగగానే జనం బేస్ మెంట్ల లోకి పరుగులు  తీస్తున్నారు. పోలీసులు ఎవరి ఇళ్ళలో బేస్ మెంట్లు ఎక్కువ మందిని కాపాడగలవో అని ఇంటింటికీ చెకింగ్ కి వస్తారు.  హాన్స్ బేస్మెంట్ లో మాక్స్ ని దాచి, అతని చుట్టూ పెయింట్ డబ్బాల్లు సర్ది... ఎలానో కాపాడతారు. కానీ బాంబింగ్ మొదలయ్యాక, అందరితో పాటూ మాక్స్ షెల్టర్ కి వెళ్ళడానికి లేదు.

మిగిల్న పొరుగు వారికి ఎవరికీ అక్కడ ఆ చీకటి గుహ లో ఒక మానవ మాత్రుడు ఉన్నట్టు తెలియదు.  ఈ యుద్ధ నేపధ్యంలోనే లీసెల్ అక్షరాల్ని వింతగా చూసే స్థాయి నుండీ, వాటి శక్తిని ఆకళింపు చేసుకుని, వాటితో మృత్యుభయాన్ని, నిరాశ నూ పోగొట్టగలగడం  దాకా ఎదుగుతుంది.    బాంబింగ్ జరిగే రాత్రుల్లో అందరూ ఒక పెద్ద బేస్మెంట్ లో తల దాచుకున్నప్పుడు లీసెల్, అక్కడి వారి కోసం ఏదో ఒక పుస్తకం తీస్కెళ్ళి చదవడం, వాళ్ళ మనసుల్ని భయం నుండీ డైవర్ట్ చేయడం అవీ చేస్తూంటుంది.    తరవాత సేఫ్ సైరన్లు మోగాకా ఇంటికొచ్చి మాక్స్ కి ఇవన్నీ చెప్తూ ఉంటుంది.   మాక్స్ సహజంగా సిగ్గరి, భావుకుడు.. ఈ చీకటి గుయ్యారంలో నెలల తరబడి ఉండడం వల్ల బయట ప్రపంచం ఎలా ఉందో తెలియదు.  అతను లీసెల్ చేత ఆ రోజు ఆకాశం ఎలా వుందో, బయట ఎలా గాలి వీస్తోందో, మంచు పడుతోందో చెప్పించుకుంటూ ఉంటాడు.  వాళ్ళిద్దరి మధ్యనా చాలా ఆత్మార్ధమైన స్నేహం బలపడిపోతుంది.  బాంబింగ్ జరిగే రాత్రి,  ఇంటి వారంతా బయట వేరే వారి బేస్మెంట్ కి పారిపోయాక, తన 'గుహ'  లోంచీ బైటికొచ్చి, ఇంటి లో కొచ్చి, కర్టెన్ తొలగించి, చిమ్మ చీకట్లోకి -  బయటి ప్రపంచాన్ని చూడగలగడమే అతనికున్న లక్సరీ.

నాజీ జెర్మనీ లో యుద్ధం లో చేరి భయానకమైన చావులు చనిపోయే మామూలు సైనికులకు  కొదవ లేదు. తన అన్న, రష్యా మీద జర్మనీ చేసిన దాడిలో తీవ్ర గాయాల్తో తన ఎదురుగానే చనిపోవడం చూసిన మరొక సైనికుడి పాత్ర కూడా  వీళ్ళ పొరుగునే  ఉంటుంది.  షెల్ షాక్ కి గురయిన సైనికుడి, సోదరుడి వేదన - లీసెల్ కళ్ళెదురుగా.. ఆత్మహత్య తో - మృత్యువు కౌగిట్లో గానీ తీరని వేదన అది.  వాళ్ళిద్దరి తల్లి,  ఎదిగొచ్చిన కొడుకు మరణాన్ని భరించలేక, బాంబింగ్ సమయంలో షెల్టర్ కి రాకుండా ఇంట్లోనే మృత్యువు కోసం ఎదురు చూస్తూ కూర్చోవడం,  ఒక హృదయ విదారకమైన సంఘటన.

ఆఖరికి మాక్స్ ఇంక ఎన్నాళ్ళూ ఇలా దాగలేనని గ్రహించి,  హాన్స్ సమ్మతి తోనే, ఆ ఇంటిని విడిచిపెడతాడు. కానీ అతనికి ఏమయిందో - ఎలా ఉన్నాడో, పట్టుబడిపోయాడో, మరణించాడో,  తెలీని పరిస్థితుల్లో, వీధుల్లో కేంపులకు తరలించబడే యూదుల పెరేడ్ లో ప్రతి వ్యక్తి మొహాన్నీ పీచు పీచుమనే గుండె తో -  పరిశీలనగా చూడటం అలవాటయింది లీసెల్ కి.    రూడీ తో కలిసి, వాళ్ళు వెళ్తుండే దారిలో చిన్న చిన్న రొట్టెల తుంపుల్ని రోడ్డు మీద పేరుస్తూంటుంది.  పెరేడ్ ఆ రోడ్ కి రాగానే బందీలు రొట్టె ముక్కల కోసం ఆత్రం వా వంగడం,  నాజీలు వాళ్ళపై కొరడాలు చెళ్ళుమనిపించడం జరుగుతుంటాయి.


లీసెల్ కోసం రూడీ ఎంత సాహసాన్నయినా నిర్మొహమాటంగా చేసేస్తాడు. రూడీ కి లీసెల్ అంటే ప్రాణం. ప్రేమ!   లీసెల్ కి కూడా రూడీ అంటే అభిమానమే.  కానీ తనకి రూడీ అంటే ఎంత ప్రేమో లీసెల్ కి ఆఖరి వరకూ తెలియదు.   రిస్క్ చేసి లీసెల్ ని సంతోష పెట్టిన ప్రతి సారీ, రూడీ ఒక్క ముద్దిమ్మంటూ ప్రాధయపడేవాడు.  స్త్రీ సహజమైన సిగ్గు వల్లో, తన అహం  పట్ల అభిమానంతోనో,  ఎప్పుడూ వద్దంటూ  తప్పించుకునేది లీసెల్.   ఆఖరికి వాళ్ళుండే వీధిలోనే జరిగిన బాంబు దాడిలో అమ్మ నీ, నాన్ననీ, రూడీనీ అందర్నీ కోల్పోయిన తరవాత గానీ తనకు రూడీ మీద అంత ప్రేమున్నట్టు తెలీదు మన పుస్తకాల దొంగ కి.   మధ్య లో హాన్స్ ఒక సారి పార్టీ పిలుపు మీద యుద్ధానికెళ్తాడు. కొన్ని నెలల పాటూ..  యుద్ధంలో జెర్మనీ ని ఓటమి నలువైపులా చుట్టుముడుతోంది. మ్యూనిచ్ మీదా ఇతర జెర్మన్ నగరాల మీదా బాంబు దాడులు ఎక్కువవుతున్నాయి.  'మృత్యువు' కి పని ఎక్కువయి ఉక్కిరి బిక్కిరవుతుంది.

మృత్యువు దురదృష్టవశాతూ హెమ్మెల్ వీధికి కూడా రావాల్సి వచ్చింది.  ఏ సైరనూ మోగని ఒక దురదృష్టకరమైన రాత్రి షెల్టర్ కు వెళ్ళకుండా ఎవరిళ్ళలో వాళ్ళు నిద్రపోతుండగా, అకస్మాత్తుగా బాంబింగ్ జరుగుతుంది.   పుస్తకాల మీద ప్రీతి తో, మాక్స్ జ్ఞాపకాల మీద భ్రాంతి తో,  మాక్స్ చేత్తో చేసిచ్చిన పుస్తకాన్ని చదవడానికి  లీసెల్ వెళ్ళి బేస్మెంట్ లో కూర్చున్న క్షణానే వాళ్ళింటి మీద బాంబు  పడుతుంది.  తల్లి తండ్రి, పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే చనిపోతారు.  మర్నాడు శిధిలాల్లోంచీ, షాక్ కి గురైన ఈమె ని బయటకు తీసిన సహాయ బృందాలు లీసెల్ ప్రాణాల్తో ఉండడం ఆశ్చర్య పోతాయి.    శిధిలాల్లోంచీ బయటికొచ్చి, తల్లిన్ నీ తండ్రినీ వెతుక్కుంటూ, వాళ్ళ దేహాల్ని చూసి, నమ్మశక్యం కాని మృత్యువును ఎదిరించలేక,  శకలాల్లో దొరికిన హాన్స్ ఎకార్డియన్ ని జ్ఞాపకంగా తెచ్చుకుంటున్న లీసెల్ కి, రూడీ ఇంటికొచ్చాక, రూడీ దేహం పలకరిస్తుంది.  అప్పుడు గానీ లీసెల్ కళ్ళలో కన్నీరు మొదలవదు.   లీసెల్ రూడీ దేహాన్ని చూసి,  రూడీ ముఖాన్ని ప్రేమగా ముద్దుపెట్టుకోవడం చూసి మృత్యువు  బాధపడుతుంది - 'రూడీ బ్రతికి ఉంటే ఈ క్షణాన్ని ఎంత ఆస్వాదించేవాడో కదా?!' అని.   ఈ బాధనంతా చూసి మృత్యువు బాధపడినా, మరోచోట తన 'అవసరం'  ఉన్న కాలిన గాయాలైన జెర్మన్ సైనికుడికోసం అక్కణ్ణించీ  వెళ్ళాల్సి వస్తుంది  మృత్యువు కు.    ఆఖరికి లీసెల్ రూడీ ఇంట్లో రూడీ తండ్రి ఒక్కడూ, [అప్పటికి అతను వేరే ప్రాంతాలకి వెళ్ళడం వల్ల బ్రతికి బయట పడగా], అతనితో ఉంటూంటుంది.  

యుద్ధం ముగిసాకా, నాజీ జెర్మనీ హిట్లర్ నుండీ విముక్తమయ్యాకా, October, 1945 లో,  మాక్స్,  లీసెల్   ని వెతుక్కుంటూ వస్తాడు.   రెడ్ క్రాస్ వారి సహకారంతో లీసెల్ ఒక్కర్తీ బ్రతికి బయటపడ్డట్టు తెలుసుకుని రూడీ తండ్రి నడుపుతున్న దుకాణానికి వచ్చి లీసెల్ ని అడుగుతున్న ఈ యువకుణ్ణి రూడీ తండ్రి చాలా ఆశ్చర్యంగా చూస్తాడు.   ఒక అన్న లా లీసెల్ బాధ్యత వహించి, ఆమెను తనతో  కొత్త జీవితానికి, సిడ్నీ, ఆస్ట్రేలియా,  తీస్కెళ్ళిపోతాడు.  ఇదీ బుక్ థీఫ్ కధ.  ఇదంతా మృత్యువు చెప్పే కధే.  

రచయిత మృత్యువును ఎంతో లలితంగా వర్ణిస్తాడు.  లేదా మృత్యువే "చావుని"  లలితంగా వర్ణిస్తుందనాలి.  మరణించిన ప్రతి ప్రాణీ మృత్యువు కు ప్రత్యేకమే.  ప్రతి ప్రాణాన్నీ ఎంతో ఆత్మీయంగా చేతుల్లోకి లేవదీస్తుంది.  ఆ ఆత్మ ఐస్క్రీం లా సాఫ్ట్ గా, చల్లగా ఉంటుందంట.  పక్షి ఈక లా తేలిగ్గా.. మృత్యు హస్తాల్లో సేద తీరిన ఆత్మ (!) మెల్లగా కరిగి - మాయమవుతుంది.  మృత్యువు ఓదార్పులు -  బాంబు దాడుల్లో చనిపోయిన వాళ్ళకీ,  నిష్కారణంగా నిండు యవ్వనాన్ని యుద్ధోన్మాదికి  (జెర్మనీ తరఫు)  అంకితం చేసి,   ఛిద్రదేహాలతో చిత్రహింస అనుభవించే సైనికులకీ - రోగాలతో నయం కాని మానసిక వ్యగ్రత తో చనిపోయే సామాన్యులకీ,  హిట్లర్ చంపించేసిన లక్షలాది యూదు ఖైదీలకీ, ఆఖరికి హిట్లర్ కి కూడా ఎంతో ప్రేమ తో చెందుతాయి.  మృత్యువు ఎంత శాంతంగా ఉంటుందో !  మృత్యువుకీ మనసుంటుంది. ఈ భీభత్సాన్నీ, హింసనూ చూసి మృత్యువు కూడా బాధపడుతుంది. మృత్యువు అందరిదీనూ. అందరికీ మృత్యువు చెందినదే !


 కధ ముగిసే సమయానికి,  మృత్యువూ, లీసెల్ కలుసుకుని,  ఈ ముచ్చట్లన్నీ నెమరువేసుకుంటారు.  అదొ మైమరపించే ఫిలసాఫికల్ సీన్.     అందరికీ  మృత్యుముఖాన ఉన్నప్పుడు  జీవిత చక్రం  మొత్తం   స్పష్టంగా కనిపిస్తుందంట.    నీకవన్నీ  గుర్తున్నాయా అంటుంది లీసెల్   మృత్యువు తొ!  ఓ స్నేహితురాలితో మాట్లాడుతున్నట్టు.


[I wanted to tell the book thief many things go,  about beauty and brutality.  But what could I tell her about the things that she didn't already know?  I wanted to explain that I'm constantly overestimating and underestimating the human race - that rarely do I ever simply estimate it.  I wanted to ask her how the same thing could be so ugly and so glorious,  and its  words so damning and brilliant and so glorious,  and its words so damning and brilliant. 

None of those things,  however,  came out of my mouth.]


ఈ పుస్తకానికి దొరికిన ఆదరణ ని చూసి, దీన్నో సినిమా గా కూడా తీసారు.  పుస్తకం చదివే ఓపిక లేనివాళ్ళ కోసం,  ఇంటర్ నెట్ నిండా బోల్డన్ని సినాప్సిస్ లూ, వీడియోలూ ఉన్నాయి.  మృత్యువు చెప్పిన ఈ కధ, పుస్తకాల మీద ప్రేమతో పుస్తకాల సాయంతో బ్రతికి, నాజీ జెర్మనీ లో పుస్తకాలు వొద్దన్న నాజీల నైజానికి వ్యతిరేకంగా తాను దొంగిలించిన పుస్తకాల్ని దాచుకుని చదువుతూ, తన ప్రపంచాన్ని సృష్టించుకున్న లీసెల్ మెమింజర్ కధ.  పుస్తకం గానే చదివితే బావుంటుంది.


Note : This post first appeared in Pustakam.net   http://pustakam.net/?p=19607 

11/04/2017

సాదత్ హసన్ మంటో కధలు -1

సాదత్ హసన్ మంటో కధలు  రెండు :

1. Mozelle

త్రిలోచన్ నాలుగు సంవత్సరాలుగా బొంబాయిలో ఉంటున్నాడు. అద్వానీ టవర్స్ లో! అతను సాంప్రదాయాన్ని పాటించే సిఖ్.   పల్లెలో ప్రైమరీ విద్య పూర్తయ్యాకా, హైస్కూల్ కి పట్నం వచ్చేసాడు.  కాలేజీ చదువు పట్నం లోనే. బొంబాయి చేరే ముందు ఉపాధి కోసం ఎక్కడెక్కడో తిరిగాడు.  బొంబాయి వచ్చాకా 'యూదులు' ఎక్కువగా నివసిస్తూండే ప్రాంతాల్లో అద్వానీ టవర్స్ లో ఒక చిన్న ఫ్లాట్ లో తలదాచుకుంటున్నాడు. కధ మొదలయ్యేనాటికి బొంబాయి లో అల్లర్లు జరుగుతున్నాయి. త్రిలోచన్ అర్ధ రాత్రి దాటాకా,  మూడింటికి టెర్రస్ మీదికొచ్చి దూర దూరాల్లో ఆకాశహర్మ్యాలలో దాక్కున్న మిణుగురుల్లాంటి  దీపాల్ని చూస్తున్నాడు.

త్రిలోచన్ ముప్ఫయి ఐదేళ్ళ యువకుడు.  ఈ మధ్యనే అతనికి కల్వంత్ కౌర్ తో ప్రేమ కుదిరింది. కల్వంత్ అతని గ్రామానికి చెందిన పిల్లే.   కల్వంత్ సోదరుడు నిరంజన్, బొంబాయికి దగ్గర్లోని దేవ్ లాలీ  లో ఏవో కాంట్రాక్టులు చేస్తుంటాడు.  కల్వంత్ కి  పక్షవాతానికి గురయి మంచానికే పరిమితమైన తండ్రి, గుడ్డి తల్లి,  ఉన్నారు. త్రిలోచన్  తీవ్ర ఆందోళన లో ఉన్నాడు.

కల్వంత్ ఇల్లు ముస్లింలు ఎక్కువ గా ఉండే ప్రాంతం లో ఉంది.  రోజూ వార్తా పత్రికల్లో మతం పేరుతో మనుషుల్ని తెగ నరుకుతున్నారన్న వార్తలు చదువుతున్నాడు.   సిక్కుల్నైతే ఊచ కోత కోస్తున్నారు.  ఈ సారి నిరంజన్ ని ఎంత బ్రతిమలాడినా పని ఉందని  దేవ్ లాలీ వెళ్ళాడు. ఈ అల్లర్ల గురించి, త్రిలోచన్ వ్యక్త పరచిన భయాల్ని తోసి పారేశాడు.  పైగా ఇది అమృత్ సరో, లాహోరో కాదని  , బొంబాయి అనీ, ఇక్కడ తాను పదేళ్ళు గా ఉంటున్నాడని, చెదురు ముదురుగా తప్ప అక్కడ అల్లర్లు జరగవు అనీ నచ్చ జెప్పి వెళ్తాడు, నిరంజన్.

కానీ వారం గడిచాకా పరిస్థితులు బాగా దిగజారాయి.  నిరంజన్ ని, తన కుటుంబాన్ని తన చిన్న ఫ్లాట్ కు తెచ్చేయమని, బ్రతికుంటే ఎలానో సర్దుకుందామనీ చెప్పినా విన్లేదు.   ఇప్పుడు త్రిలొచన్ ఉన్న  ప్రాంతాల్లో 48 గంటల కర్ఫ్యూ అమల్లో ఉంది. ఇది ఇంకా పొడిగింపబడవచ్చు.   ఏమాత్రం అవకాశం చిక్కినా వెంటనే వెళ్ళి కనీసం కల్వంత్ ని రక్షించుకోవాలని త్రిలోచన్ తీవ్ర ఆందోళన లో ఉన్నాడు.   కానీ కర్ఫ్యూ వల్ల ఎటూ కదలడానికి లేదు.

ఆ వేళప్పుడు టెర్రస్ మీద ఆలోచనల్లో కూరుకుపోయిన త్రిలోచన్ కు తన ఎదురింటమ్మాయి మోజెల్ గుర్తొస్తుంది. ఒకప్పుడు మోజెల్ ను ఎంత గానో ప్రేమించాడతను.  ఆమె ను మర్చిపోవడం అసాధ్యం.   ఆ పిల్ల చాలా అందమైనది. ఆ అందంకో అంతులేని 'లెక్కలేని' తనం.   త్రిలోచ్ లాంటి కరుడు కట్టిన సిక్కు ని కదిలించిన ఆమె హృదయం.   మోజెల్ నిర్లక్షమైన వ్యక్తిత్వం తప్పితే ఆమె కు సంబంధించినది ప్రతీదీ ఇతనికి ఇష్టం. మోజెల్ ఒక యూదు యువతి, కర్ర జోళ్ళు ధరించి  టిక్కు టక్కు మంటూ మగవాడిలా  నడుస్తుంది.

పల్చని  గౌన్లాంటిదేదో వేసుకునుంటుంది.  పెద్ద యూదు కళ్ళు.  రంగు రాయక పోయినా ఎర్రగా మాంసం లా మెరుస్తూండే పెదవులూ.    ఆమె శరీరంలో  ప్రధానంగా  ఆకర్షించే   పెద్ద స్తనాల మీద నీలి రంగులో నరాలు  కనిపించేంత  'లో నెక్'  గౌన్ లు ధరిస్తుంది.  నిర్లక్షమైన వస్త్ర ధారణ,  లేశ మాత్రమైనా స్త్రీ సహజమైన సున్నితత్వం అంటూ లేని  ఆమె నడక,   అడ్డదిడ్డంగా ఉండే జుత్తూ, వెరపు కలిగించే లిప్ స్టిక్ వెనక  ఆమె హృదయాన్ని,  ఈ సిక్కూ ఎందుకో ఆకర్షించాడు.

త్రిలోచ్,  మోజెల్ ని హృదయపూర్వకంగా ప్రేమించాడు.   ఆమె కూడా తన అభిమానాన్ని దాచుకునేది కాదు.  వారి ఏకాంతం లో మోజెల్ పెద్దగా ఉత్సాహం చూపేది కాదు. ఎంత అభిమానం ఉన్నా పుల్ల విరుపు మాటల్తో, త్రిలోచన్ ని దూరం పెట్టేది.    త్రిలోచ్ ని మత పరంగా అవమానిస్తూ మాట్లాడేది.   అతని కేశ్, కచ్చా (సిక్కులకు మత పరంగా కేశ్, కృపాణ్, కడా, కంగా, కచ్చా అంటే, కత్తిరించని జుత్తు, కత్తి, నిక్కర్ లాంటి అంగ వస్త్రం, ముంజేతి కడియం, చెక్క దువ్వెన- ముఖ్యమైనవి) లను ఆటపట్టించేది.  నీ గరుకు గడ్డంతో నా స్కర్ట్ ఉతుక్కోవచ్చు అని వెక్కిరించేది.

ఆమె తన వేషాన్ని గురించి మాటాడినప్పుడల్లా త్రిలోచ్ కు వళ్ళు మండేది,   గానీ పెద్దగా ఆమెను ఏమీ అనలేకపోయేవాడు.   ఎందుకంటే మోజెల్ తో వాదించి గెలవడం కష్టం.   హిపోక్రసీ గిట్టని మనిషి ఆమె.   మతం, మత చిహ్నాలూ అంటే చిన్న చూపు ఆమెకు.   అతని గడ్డాన్ని వేళాకోళం చేసేది. పొడుగైన అతని జుత్తుని హాస్యం చేసేది, ఆఖరికి అతని కచ్చా ని కూడా అవమానించేది.  ఈ మోజెల్ కి ఏదీ దాయడం రాదు.   మధ్యలో ఆమె తిరుగుమోత్తనాన్ని కూడా ఆపేది కాదు. వీధి లో ప్రతీ వాడూ ఆమె ప్రియుడే. ఆ విచ్చలివిడి తనాన్ని త్రిలోచ్ ఒప్పుకోలేకపోయినా, ఆమె వ్యక్తిత్వం మీద గౌరవం ఇంకా పోలేదు అతనిలో.

ఎన్ని సార్లు త్రిలోచ్ పెళ్ళి ప్రతిపాదన తెచ్చినా తెలివిగా తప్పించుకునేది,  నాకు, నీలా వొంటి నిండా జుత్తు మోసుకు తిరిగే సిక్కు కీ కుదరదు లెమ్మనేసేది.    త్రిలోచ్ పొడుగ్గా పెరిగిన గడ్డాన్ని బన్ లా రోల్ చేసి, క్లిప్పులతో చుబుకానికి దగ్గరగా కట్టుకునేవాడు.   ఒక రోజు ఆమె ఆ క్లిప్ లన్నీ ఊడ తీసి..నీ  జుత్తు మృదువుగానే ఉందే..అని ప్రేమగా మాటాడింది.   త్రిలోచ్ కరిగిపోయాడు.   మోజెల్ కళ్ళల్లో తన పెళ్ళి ప్రతిపాదన తో కనిపించిన మెరుపు చూసి అతని మనసు నిండిపోయింది.

'నీకూ నాకూ మధ్య అడ్డంగా ఉన్న ఈ జుత్తుని తీసేసావో అపుడు నిన్ను తప్పకుండా పెళ్ళాడుతా!' అని చెప్తుంది. త్రిలోచ్ మరో మాట లేకుండా ఒప్పేసుకుంటాడు.  మర్నాడు బార్బర్ షాప్ కి పోయి శుభ్రంగా క్షవరం చేయించుకుంటాడు.  సహజంగా అందగాడు. ఈ క్షవరం తరవాత ఈడొచ్చిన ఆడపిల్లలా మెరిసిపోతాడు.  ఇన్నాళ్ళూ మతం పేరు చెప్పి ఇంత బరువు ఎలా మోసానబ్బా అని కూడా అనుకుంటాడు కత్తిరించేసిన తన కేశాల్ని తల్చుకుని. కానీ ఇంత మార్పుకీ కారణమైన  మోజెల్ మాత్రం రేపు పెళ్ళాడతాననగా ఎంతో నిర్లక్షంగా, అతని హృదయం మీద నుంచీ నడిచెళ్ళి, ఒక తెలిసిన యువకుడితో కలిసి దేవ్ లాలీ వెళ్ళిపోతుంది.  ఈ హార్ట్ బ్రేక్ తరవాత చాన్నాళ్ళు త్రిలోచ్ మనిషి కాలేకపోతాడు.  అయితే ఇదంతా జరిగి ఏడాది అయింది. మోజెల్ ఎక్కడుందో తెలీదు.

అఅది జరిగిన కొన్నాళ్ళ తరవాత కల్వంత్ ని కలిసాడు త్రిలోచన్. మర్యాద గల ప్రవర్తన గురించి తాను మోజెల్ కి చెప్తూన్నపుడు..' నీ హృదయాన్నికి దగ్గరగా ఉండే ఏ సిక్కు పిల్ల నో చేసుకోవచ్చు కదా - నాకూ నీకూ పడదు'  అంటూ మోజెల్ జవాబు చెప్తూండేది. అలాంటి మర్యాదస్తురాలైన పిల్లే "కల్వంత్"!   ఆమె పరిచయం అవ్వగానే, అంత వరకూ తాను కోరుకున్నది అలాంటి పిల్లనే అని త్రిలోచన్ తెలుసుకున్నాడు. మోజెల్ కి పూర్తి గా వ్యతిరేకం ఈ పిల్ల.

కావడానికి పల్లె లో పుట్టి పెరిగీ, ఎండా, వానా తెలిసిన పిల్లే ఐనా ఆమె లో సిక్కు స్త్రీల లో కనిపించే మగ లక్షణాలూ,  శ్రమ ని ఓర్చుకునే శారీక ధారుఢ్యం లేవు,   తెల్లని,  తేనె లాంటి వళ్ళూ,   నూలు లాంటి మృదువైన చర్మం, సిగ్గూ, అమాయకత్వం కలగలిపిన సౌందర్యం కల్వంత్ ది.   ఆమెలో స్త్రీత్వపు సున్నితత్వం,   ఇంకా ఎదిగి నిండుతనాన్ని సంతరించుకోని ఎద,   త్వరగా భయపడిపోయే వ్యక్తిత్వం,  ఆమె కు ఎటువంటి హానీ జరగ కుండా కాపాడి  తీరాలనిపించేలాంటి భావన ని  త్రిలొచన్ లో తట్టి లేపింది.

మోజెల్ జ్ఞాపకాల నుండీ తన ఆలోచనల్ని బలవంతంగా తప్పించుకుని, కల్వంత్ గురించి ఆలోచిస్తున్నాడు.  ఆమె గుడ్డి తల్లీ, పక్షవాతపు తండ్రినీ కాపాడలేకపోయినా కనీసం ఆమె ను ఊచకోత నుండీ రక్షించాలి. కానీ కింద కర్ఫ్యూ. మోజెల్ దయ వల్ల తన జుత్తుని కత్తిరించినా తన ప్రవర్తన కు సిగ్గు పడి, మళ్ళీ జుత్తు పెంచుకుంటున్నాడు. గడ్డం తెలివిగా ట్రిం చేయించుకుంటున్నాడు.   కల్వంత్ కుటుంబానికి మాత్రం తన టర్బన్ కింద పొడుగు కేశాలే ఉన్నట్టు భ్రమ కలిగించేట్టు గుట్టుంగా నెట్టుకొస్తున్నాడు.  తాను జుత్తు కత్తిరించినట్టు తెలిస్తే సాంప్రదాయ వాదులైన వారి కుటుంబం తనను నిరాకరించవచ్చు.
   
అదే సమయానికి ఎక్కణ్ణుంచో మోజెల్ ఊడిపడుతుంది టెర్రస్ మీదికి!   ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడినందుకు  క్షణం ఇబ్బంది పడినా, మోజెల్ మొదట మాటలు మొదలు పెడుతుంది, ఎగురుతున్న అతని జుత్తు చూసి, 'ఓహ్! నువ్వు మళ్ళీ 'సిక్కు' వవుతున్నావా ? '  అని అడుగుతుంది. 'అవును!' అనంగానే 'మరి ఇంకో అమ్మాయి తో ప్రేమ లో పడ్డావా?!'  అని  అడుగుతుంది.   ఆమె మీద అక్కసు తో ఆమె కు 'కల్వంత్' గురించి చెప్తాడు.  తన ఆందోళన గురించి కూడా.

మోజెల్ మరి.. "ఆమె ను రక్షించకుండా ఇక్కడ ఏమి చేస్తున్నావ"ని అడుగుతుంది ఏమత్రం తొణక్కుండా!  "కర్ఫ్యూ గురించి నీళ్ళు నముల్తూంటే ఆమె శవమే మిగుల్తుంది. పద వెళ్దాం!"  అని బయల్దేరదీస్తుంది.  మోజెల్ తనని వొదిలి వెళ్ళిందన్న అక్కసు కొంచెం నెమ్మదించాకా, ఆమె ఎంత తిరుగుబోతయినా, తన తో రెండేళ్ళు దగ్గరగా మెలిగిందన్న సంగతి గుర్తొస్తుంది. ఆమె గురించి తనకు తెలుసు. మొండి ధైర్యం ఈ పిల్లకి.   ముందూ వెనకా ఆలోచించదు. మనసుకు ఏమి తోస్తే ఆ మాటనడం, ఆ పని చెయ్యడం ఆమె లక్షణం. ఎవ్వర్నీ లెక్క చెయ్యదు.

కాసేపు వాదించాకా, ఉండు నేను టర్బన్ ధరించి వస్తాను అని అతను వెళ్ళబోతుంటే, 'నీ మతాన్ని కాస్త పక్కన పెడతావా? మనం వేళ్ళేది ముస్లిం ప్రాంతానికి, నీ వేషం చూడగానే, నిన్ను నరికి పోగులు పెడతారు' అని అరుస్తుంది. త్రిలోచన్ వినడు.  టర్బన్ లేకుండా తన పొట్టి కేశాలతో కల్వంత్ కౌర్ కు ఎదురుపడడం అతనికి ఇష్టం లేదు. నానా తిట్లూ తిట్టి, ఉన్న ఫళానా బయల్దేరుతుంది మోజెల్.   తన కర్ర జోళ్ళు టక టక లాడిస్తూ, పల్చని ఆ గౌన్ లోనే, వీధిలో మొగవాడిలా నడుచుకు పోతుంది. వెనగ్గా త్రిలోచన్.

వీళ్ళు వెళ్తూంటే దార్లో ఒక పోలీసు అటకాయిస్తాడు.  అక్కడా , ఇంకా,  ఎన్నో ఆపదలు, గండాలూ ఎదురైనా సమయస్పూర్థి తో, తన చిలిపి నవ్వుల్నీ ఎర వేసి,  'పూర్వ'  పరిచయాల్ని గుర్తు చేస్తూ,  త్రిలోచ్ ను ముందుకు తీసుకెళ్తూంది.  కల్వంత్   నివాస పరిసరాల్లో పరిస్థితులు విషమంగానే ఉన్నాయి.  వీళ్ళు చేరే సరికీ నిర్మానుష్యమైన బజార్లలో, లూటీలూ, దొమ్మీలూ జరుగుతున్నాయి.   త్రిలోచన్ కి అడుగడుక్కీ ధైర్యం చెప్తూ ముందుకు సాగిపోతుంది మోజెల్.   ఆమె ధైర్యానికి, తెగువ కూ, ఆమె వ్యవహార కుశలతనూ,  ప్రాణాన్ని, శీలాన్నీ లెక్క చెయ్యని ఆమె వ్యక్తిత్వాన్నీ  చూస్తూ ఈ మాజీ ప్రేమికుడు విస్తుపోతున్నాడు.    ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆమె విచ్చలివిడితనమే అతన్ని రక్షిస్తోంది.

త్రిలోచ్ ని పొడవబోయిన  ముస్లీము దొంగ ని కూడా, పేరు పెట్టి పిలిచి, స్నేహంగా మాటాడి, కవ్వించ్ని,   దృష్టి మళ్ళించి  రక్షిస్తుంది.  అతను కామం నిండిన కళ్ళతో మోజెల్ ను తాగేసేలా  చూసి, మోచేత్తో   ఆమె ఎదను నొక్కేసి,  వీణ్ణి పొడవకుండా వెళిపోతాడు.    మోజెల్ తన గౌన్ సర్దుకుని మామూలుగా ముందుకు సాగుతుంటే,  వాడి ప్రవర్తన ని తల్చుకుని "చీ!  ఎంత నీచం?!"  అని త్రిలోచన్ విసుక్కుంటే .. "ఏమిటి నీచం?! అంతా ఒకటే!! "  అనేస్తుంది తేలిక గా.

తీరా వీళ్ళు కల్వంత్ ఇంటికి చేరే సరికీ ఊచ కోత మొదలయ్యి ఉంటుంది.  పై అంతస్థు లో దాడి జరుగుతోంది. ఇంట్లో ఒంటరిగా కల్వంత్, తల్లిదండృలు వొణికిపోతున్నారు. మోజెల్ కల్వంత్ ని చూసి, పరిచయాలు చేసుకునే సమయం లేదు.  అయినా ఆమె కల్వంత్ ని తన పెద్ద హృదయానికి హత్తుకుని, "భయపడకు.. త్రిలోచన్ వచ్చాడుగా! అతను నిన్ను కాపాడతాడు" అని ఓదారుస్తుంది.  ఏమీ చెయ్యడానికీ దిక్కు తోచక నిశ్చేష్ఠ  గా నిలబడిపోయిన కల్వంత్ షర్ట్ ని గబ గబా లాగేసి, తాను నిముషాల్లో గౌన్ తీసి,  నగ్నంగా మారి,  తన గౌన్ ని ఆమె కు తొడిగి,  సల్వార్ ని కూడా  లాగేస్తుంది. అల్లుకున్న ఆమె కురుల్ని విప్పేస్తుంది.   'కల్వంత్ ని, తల్లి దండ్రుల్ని తీసుకుని పారిపో త్రిలొచన్. కల్వంత్ దుస్తుల్ని చూసి ఎవరూ ఆమె ను సిఖ్ అనుకోరు.   నేను మీ వెనకే వస్తా" అంటుంది. జనం అప్పటికి వీళ్ళింటి మీద పడ్డారు. తలుపులు విరిగేలా బాదేస్తున్నారు.

అంత కన్నా ఆలోచించడానికి వ్యవధి లేదు.  ఏ క్షణానైనా ఆ తలుపు విరిగిపోవచ్చు.   ఆ ఇంట్లో ఉన్న అందరి కన్నా, ఆ క్షణాన ఆలోచించ గలిగేంత మానసిక స్థైర్యం మోజెల్ కే ఉంది. ఆమె వెంటనే   'నేను తలుపు తెరుస్తాను. బయటికి పరిగెడతాను. త్రిలోచ్, నువ్వు నా వెనకే పరిగెట్టు. బయట జనం గందరగోళ పడతారు. ఆ సమయాన కల్వంత్ సహా అందరూ తప్పించుకోవాలి. నువ్వూ ఆ గందరగోళం లో తప్పించుకో ' అని చెప్పేసి, త్రిలోచన్ ఆమె ఆలోచన ను కల్వంత్ కు విడమరచి చెప్పగానే, తలుపు తెరిచి బయటకు పరుగు తీస్తుంది. తెల్లని శిల్పం  (తెల్లని బల్లి లాంటి నగ్నత !!! - మంటో వర్ణన ఇది)  లాంటి ఆమె నగ్నత చూసి  జనం మతి పోయి ఒక్క క్షణం ఆగిపోతారు. ఆమె వెనకే పరుగు తీసిన త్రిలోచన్ (టర్బన్ తీసేసాడు కల్వంత్ ఇంట్లో) కి, అప్రయత్నంగా  దారి తొలగుతారు.

తన కర్ర జోళ్ళ ను టక టక లాడిస్తూ మెట్ల మీదుగా పరిగెత్తిన మోజెల్ ఒక అంతస్థు దాటగానే జోళ్ళు తట్టుకునే పడిపోతుంది.   ఆమె నగ్న దేహం, మెట్ల మీద నుండీ దొర్లి, రెయిలింగ్ ని రాసుకుంటూ దబ్బున నేల వాలగానే, త్రిలోచన్ ఆందోళన తో ఆమెను చేరి, తలను ఎత్తి పట్టుకుంటాడు. ఆమె వొళ్ళంతా గాయాలు. పెదవి అంచుల్నిండా రక్తం.  ఆమె తన పెద్ద యూదు కళ్ళనెత్తి త్రిలోచన్ ని చూస్తుంది. ఆమె కళ్ళు ఎర్రగా రక్తమోడుతున్నట్టు ఉంటాయి.   ఆమె అతన్ని చూసి నవ్వుతుంది.

'మోజెల్',  'మోజెల్'  అని వెర్రిగా అరుస్తున్న అతన్ని చూసి.. "వెళ్ళు!  కింద నా అండర్ వేర్ ఉందో లేదో చూడు..నీ కర్ధం అవుతుందా ? "  అని అడుగుతుంది.   ఊచకోత కోయడానికొచ్చిన రాక్షస జనం ఆమె దేహం చుట్టూ మూగి ఉన్నారు.   ఆమె చెప్పే అండర్వేర్ సంగతి అతనికి అర్ధం అయినా, ఆ పరిస్థితి లో ఆమెను వొదిలి  వెళ్ళ లేక, అతను పడే తపన ను చూసి.. "వెళ్ళు  సిక్కూ.. వెళ్ళు పోయి చూసి రా"  అంటుంది కోపంగా.

అతను అలా వెళ్ళగానే చుట్టూ మూగిన వాళ్ళని చూసి.. "అతను ముస్లిమే. కాకపోతే కొంచెం రౌడీ తరహా. అందుకే అతన్ని నేను సిక్కు అంటూ ఉంటాను" అంటుంది. కిందికి వెళ్ళి వచ్చి త్రిలోచన్,  కల్వంత్ కుటుంబం తప్పించుకున్న సంగతి కళ్ళ తోనే చెప్పాక, ఆమె రిలీఫ్ తో ఒక నిట్టూర్పు విడుస్తుంది. ఆ ప్రయత్నంలో ఆమె నోటిలొంచీ రక్తం మరింత  కారిపోతుంది.    త్రిలోచన్ తన టర్బన్ ని విప్పి ఆమె మీద కప్పుతాడు.   ఆమె "సరే.. డార్లింగ్. గుడ్ బై"  అని చెప్తుంది.

త్రిలోచన్ ఆమె తో ఏదో చెప్పాలనుంటాడు. కానీ ఉద్వేగంతో అతని గొంతు లోంచీ మాటలు రావు. కళ్ళలోంచీ కన్నీరు తప్ప!  ఆమె అతి ప్రయత్నం మీద, తన మీద కప్పిన "తల పాగా" [Turban] వస్త్రాన్ని తీసి అతనికి ఇచ్చి... "ఇంద తీసుకో  నీ మతాన్ని" అంటుంది. అన్నాకా..నిర్జీవమైన ఆమె చేతులు ఆమె పెద్ద పెద్ద  స్తనాల పై వాలిపోతాయి. ఇదీ మోజెల్ ముగింపు.

మోజెల్ ఒక అందమైన, సిగ్గు ఎగ్గు, భయమూ, ఎరగని విచ్చలి విడి మనిషి. ఆమె కు ఈ కుల మతాలూ, ఉచ్చ నీచాలూ లేవు, అందరూ సమానమే.  అయినా ఏ మూలో త్రిలోచన్ అంటే ప్రేమ. అతని మనస్తత్వానికీ, తన మనస్తత్వానికీ కుదరదని తెలుసు. ఆఖర్న దేవత లా అతని కష్ట సమయాన ప్రత్యక్షమై, ప్రాణాలొడ్డి, అతన్ని, అతను ప్రేమించిన  అమ్మాయినీ కాపాడుతుంది.  కధంతా మంటో వర్ణనల్లో ఆమె స్తనాలూ, ఇతర శరీర భాగాలూ, అసహ్యమైన అలవాట్లూ, నిర్లక్ష ధోరణీ వెనక ఆమెకు ఓ హృదయం ఉందని, దాన్ని పాఠకుల చేత గుర్తింప చేయడం లో మంటో సఫలుడయ్యాడు.

సాదత్ హసన్ మంటో స్త్రీ శరీరాన్ని వర్ణిస్తాడనీ, వ్యభిచారుల గురించి రాస్తాడనీ వగైరా ఆరోపణలు ఎదుర్కొన్నాడు.    ఆయన ఎవరూ మాట్లాడడానికి సాహసించని విషయాల మీద రాసాడు.   మోజెల్ లానే రక రకాల "స్త్రీ"  ల కధల్ని రాసాడు.    ఇంకో కధ లో ఇంకో స్త్రీ హృదయాన్ని  తెలుసుకుందాం.   మోజెల్ మిమ్మల్ని వెంటాడడం ముగిసేలోపే ఆ ఇంకో మంటో కధ ను గురించి రాస్తాను.

ఈ కధ బాంబే స్టోరీస్ లోనిది.   ఇంకా దీన్ని  కుష్వంత్ సింగ్ సెలెక్ట్ చేసిన బెస్ట్ ఇండియన్ షార్ట్ స్టోరీస్ వాల్యూం-II లో కూడా ప్రచురించారు.

06/04/2017

కల

అది 1961 సెప్టెంబరు.  పూనా లో మిలిటరీ ఇంజనీరింగ్ కాలేజీ లో  మా కోర్స్ ముగిసిన తరవాత మా మొదటి పోస్టింగ్ సిక్కిం. ఆ రోజుల్లో అది ఇంకో రాజ్యం లా ఉండేది.  అప్పుడే అక్కడ చనిపోయిన ఇద్దరు ఇంజనీరింగ్ ఆఫీసర్ల స్థానాన్ని మేము భర్తీ చేస్తున్నాం అన్నమాట.   అక్కడ మా యూనిట్ కు చేరగానే నన్ను కధా స్థలానికి వెళ్ళమన్నారు.   కాకులు దూరని కారడవిలో హీమాలయ సానువుల్లో  ఇక్కడ ఒక రోడ్,  నది మీద ఓ వంతెన కట్టాలి మేము.  

ఆ మధ్య కాలం లోనే  తీస్థా నది లో వరదలు వచ్చాయి. ఉన్న వంతెన కాస్తా కొట్టుకుపోయింది.   సిక్కిం భూతల స్వర్గమే. కానీ మేము కట్టే రోడ్లూ, వంతెనలూ లేకపోతే ఇక్కడికినెవరైనా రాగలరా ?  ఈ మధ్య వంతెన కొట్టుకుపోయాకా, తాళ్ళతో ఒక వంతెన కట్టారు. అది కొన్నాళ్ళ వరకూ పనికొచ్చింది. ఒక సారి అదీ పుటుక్కుమంది- బరువెక్కువై.   దాంతో వంతెన మీదున్న ఆరుగురు కూలీలూ, ఇద్దరు కుర్ర ఆఫీసర్లూ, అయిదుగురు జవాన్లూ అదిగో ఆ తీస్థా లోనే పడి చనిపోయారు.    నేనూ అందుకే వచ్చాను. అంటే కొట్టుకుపోవడానికి కాదు లెండి. కట్టడానికి.

మేము ఇక్కడ సైనిక అవసరాల కోసం ఒక వంతెన కట్టాలి, ఈ సారి దీన్ని పఠిష్టంగా కట్టాలని ఆదేశాలొచ్చాయి.  కాసింత  దూరాన చైనా సరిహద్దు నుంచీ బైనాక్యులర్లు లేకుండానే వాళ్ళ విలాసవంతమైన రోడ్లూ, భవనాలూ (మన సరిహద్దు ప్రమాణాల్తో పోలిస్తే)   కనిపిస్తాయి.   మనం మాత్రం ఈ చరియలు జారిపడే మెత్తని కొండ లోయల్లో, తీగ వంతెనల్లోంచీ కొట్టుకుని వెళ్ళి ఏ బ్రహ్మపుత్ర లొనో శవాలై తేలుతాం.   తీస్థా నది సిక్కిం లో పుట్టి, బెంగాలు గుండా ప్రవహించి, బంగ్లాదేశ్ లో బ్రహ్మపుత్రా నది లో కలుస్తుంది. హిమాలయాల్లో పుట్టిన నది, ఆ వంకలన్నీ మలుపులన్నీ హుషారుగా దాటి, అడ్డూ అదుపు లేని సుడిగాలి లా ప్రవహిస్తుంది. మధ్యలో కొన్ని ఉపనదులు కూడా కలుస్తాయి. ఇంకేం ?

'టూంగ్' లో 'థేంగ్' అనే అత్యంత ప్రమాదకరమైన రాళ్ళతో నిండిన పర్వత సానువుల్లో వంతెన కట్టాలి. నేను, అక్కడికి 4 కిలో మీటర్ల దూరంలో కాస్త ఎత్తున 'థేంగ్ జిగ్స్'  లో విడిది చేశాను. ఎందుకంటే, ఇక్కడినించీ రోజూ ఒకసారి ఆ ప్రాంతాన్నంతా సింహావలోకనం చెయ్యొచ్చు. అంత ఎత్తునుంచీ ఏదైనా ప్రమాదకరంగా కనిపిస్తే నిర్ణయాలు తీస్కోవచ్చని నా ఆలోచన.   అయితే ఇక్కడ పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు.మేము సామానంతా ఎలానో మోసుకుని ఇక్కడికి వచ్చాకా, ఇక్కడ వంతెన కట్టడం అసాధ్యమని తేలిపోయింది.  కిందకు ఓ వెయ్యి అడుగుల లోతున  ఉధృతమైన తీస్థా, నునుపు తేలిన బండ రాళ్ళతో నిస్పూచీ గా తెర్లుతూ ప్రవహిస్తుంది.  

 అక్కడ చైనాగ్ అనీ ఒక ప్రాంతం ఉంది. అది దాదాపూ నాలుగొందల అడుగుల రాతి ప్రాంతం.  వంతెన లేకుండా ఈ గుట్టని దాటాలంటే నాలుగొందల అడుగులు ఎక్కాలి, ఇంకో తొంభయి నిముషాలు  కిందికి దిగాలి.     యుద్ధ కాలాన ఇది చాలా ఎక్కువ సమయం. ఇప్పటికీ అరుణాచల్ ప్రదేశ్ లో వగైరా చైనా సరిహద్దుల్లో పెట్రోలింగ్ చెయ్యడం కష్టసాధ్యం.  చీనీ సైనికులు, గుంపులా వచ్చి సరిహద్దు గురుతుల దగ్గర ఫోటోలు దిగి వెళ్తూంటే మన సైనికులు అరకొర వసతుల మధ్య, కొద్ది మార్బలం తోనే పెట్రోలింగ్ చెయ్యాలి. మన టెర్రైన్ అలాంటిది. వాళ్ళు ఫుట్ బాల్ ఆడుకుంటూంటే మనం చూస్తూ ఉండాలన్నమాట.  వారు అత్యంత ప్రామాణికత తో సరిహద్దు లో పహారా కాసే సైనికులకు పూర్తి సౌకర్యాలు కల్పించగలిగారు. సాంకేతికతా, సామర్ధ్యమూ తో పాటూ వారి వైపు ప్రాంతం మన వైపు లా దుర్భరం కాకుండా చూసుకోవడంలో చైనీయులు ముందు ఉన్నారు.  ఇప్పుడైతె, సరిహద్దులో మన మొబైల్ ల లో కూడా భారతీయ మొబైల్ సిగ్నల్ కాకుండా చైనా సిగ్నల్ వస్తూంటుంది.


ఈ మధ్య కొంత టెక్నాలజీ ని వాడుతున్నారు, కానీ అరవైల్లో ఆ అడవుల్లో, కొండల్లో ఏదైనా నిర్మాణం  ఎంత కష్టమో ఈ తరానికి తెలియదు.    ఈ వంతెన, రోడ్డూ తొందరగా కట్టాలి.  కాబట్టి, కొండకిరువైపుల నుంచీ పని మొదలుపెట్టాం. లంచ్ ముందు  ఒక వైపు, లంచ్ తరవాత ఇంకో వైపు. నిజానికి అక్కడ గుట్టని కాస్త పేల్చి 45 డిగ్రీ ల కోణంలో 20 అడుగుల వెడల్పుతో రోడ్ వెయ్యాలి అనుకున్నాం.   కానీ అక్కడి మట్టి చాలా వొదులు. పేలుడు తీవ్రత ఏమాత్రం ఎక్కువ అయినా.. మా టీం మొత్తం ఏటవాలు కొండ మీది నుంచీ తీస్థా లోకి జారిపడడం తథ్యం.


కానీ  200 అడుగుల రోడ్ కోసం కాసిన్ని పేలుళ్ళు  జరపాలి. దాని వల్ల చాలా చెత్త పోగయ్యేది. దాన్ని తీసి దారి శుభ్రం చేయడానికే చాలా సమయంపట్టేది.  పొద్దున్న పేలుడు జరిపితే, మధ్యాన్నం,  సాయంత్రం జరిప్తే పొద్దున్నా ఆ వ్యర్ధాలన్నిట్నీ శుభ్రం చేసేవాళ్ళం.  ఈ నది ఉత్తరాన్నించి దక్షిణానికి పారేది.   ఆ ఒరవడి,  జోరు, పరిసరాల్ని హోరెత్తించేది.  కానీ అక్కడి కొండల్లో మెత్తని మట్టి -  స్థిరత్వం లేని, పదును నిలవని మట్టీ, రాళ్ళూ, ఎప్పుడు జారిపడతాయో తెలీదు.  స్లైడింగ్ జరగడం, ఆ మట్టికుప్పల్లో బురదలో కూరుకుపోయి మరణించడం తాలూకు సంభావన చాలా ఎక్కువ. నా మిలిటరీ ఎకాడమీ కోర్స్ మేట్ ఇలానే మరణించాడు. కింద 1000 అడుగుల లోతున నదీ, 75 డిగ్రీల వాలులో నిర్మాణ వ్యర్ధాలూ.. వాటికి కొంచెం ఎగువన రోడ్డు కోసం మేము చేసుకుంటూన్న కాంక్రీటు  స్లాబులూ.. ఇదీ పరిస్థితి.

ఆ ఏటవాలు లోయలూ,  ఆరడుగుల వెడల్పున మేము వేసిన 100 అడుగుల  పొడుగు రోడ్డు,   స్లైడింగ్ హెచ్చరికలూ.. వీటన్నిటి వల్లా, నది మిగిల్చే అప్రశాంతమైన హోరు వల్లా నాకు రాత్రిళ్ళు కలత నిద్రే పట్టేది.  దానికి తోడూ.. మట్టిపెళ్ళల్లో నేను కూరుకుపోతున్నట్టూ, ఏదో కొండచిలువ నిలువెల్లా మింగేస్తున్నట్టు ఎముకలలో నొప్పీ, ఒక ఇరుకు పైపు లో నా శరీరాన్ని కుక్కేస్తున్న భావనా, ఊపిరీ, మాటా ఆగిపోయినట్టు.. కలలు వచ్చేవి. కలలు అనకూడదు. ఒకటే కల. తిప్పి తిప్పి అదే వచ్చేది. దీన్ని నాలో భయాలకూ, ఆందోళనకూ ప్రతిబింబమనే అనుకున్నాను చాలా నాళ్ళు.   మా డాక్టర్ కూ, టాస్క్ ఫోర్స్ కమాండర్ కూ కూడా ఈ కల గురించి చెప్పాను. వాళ్ళ సలహా మీద మా కమాండెంట్ కి కూడా.


ఆయన కూడా పడుతూ లేస్తూ సైట్ కి వచ్చి, కొండల్లో మా బ్లాస్ట్ లను పర్యవేక్షించారు. ఆ ఇన్స్పెక్షన్ కోసం మా టీం అంతా సిద్ధంగా ఉంది. ఎన్న్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎన్ని పర్యవేక్షణలు జరిపినా,  నాకు మా పనుల్లో తృప్తి కలిగేది కాదు. ఒక సారి కమాండెంట్  వెళ్ళగానే ఉపద్రవం  రానే వచ్చింది.  నా కళ్ళెదురుగా స్లైడింగ్ జరిగింది. క్షణాల్లో నేను మట్టి పెళ్ళల్లో, రాయీ రప్ప్పా తో కలిసి తీస్థా లోకి జారిపోసాగాను. సరిగ్గా కలలో లానే, నా శరీరం మట్టి దిబ్బల్లో కూరుకుపోయింది. ఉక్కిరి బిక్కిరి అయ్యాను.


ఆ బురద లో నదిలోకి కొట్టుకుపోయానంటే  ఇక బ్రతికేది లేదు. మామూలుగా తూలి పడబోతేనే నిగ్రహించుకోలేము కొన్ని సార్లు. అలాంటిది కొండ చరియల్తో పాటూ 1000 అడుగుల లోతుకి జారితే ఏది తట్టుకుని ఆగగలను ? నా పని అయిపోయిందనే అనుకున్నాను. దేవుడూ దెయ్యమూ ఏమీ గుర్తు రాలేదు. నా కలే గుర్తొచ్చింది. నా చావే నాకు ముందుగా కల లో కనిపిందేమో అని అనుకున్నాను. అసలు కొండ చరియ   మిన్నువిరిగినట్టు  విరిగి మేను మీద పడ్డాకా పుర్రెలో  ఇన్ని ఆలోచనలా అనిపించి, కాస్త బుర్ర పెట్టి ఆలోచిస్తే, కాస్త తల ఎత్తి చూడగలుగుతున్నట్టు  అర్ధమైంది.

దైవవశాన నా  కాళ్ళ కింద ఒక స్లాబూ, నెత్తి మీద ఒక స్లాబూ ఉన్నట్టు అర్ధమైంది. అవే నన్ను  చావు నుండీ కాపాడాయి.  కింది స్లాబు నా జారుడును నిలువరించింది. అదే లేకపోతే ఆ మెత్తని మన్నులోకి కూరుకుపోయి సజీవ సమాధి అయ్యే వాడిని, నెత్తిన ఉన్న స్లాబు, చెట్లూ, రాళ్ళూ నెత్తిన పడి, పుర్రె పగలకుండా కాపాడింది.  దాదాపు  16 గంటల తరవాత  నన్ను ఆ  మట్టి లోంచీ లాగారు. నలుగురు కూలీలు చనిపోయారు. నాకు ఏమీ కాలేదు. అక్కడక్కడా చెక్కుకుపోవడం తప్ప.  నా చావుని ఏ శక్తి ఆపిందో తెలీదు. డాక్టరు దయ వల్ల ఫిట్ నెస్ పత్రం తెచ్చుకుని ఆ తీస్థా మీదనే ఇంకో నాలుగు నెలల్లో వంతెనా, రోడ్డూ నిర్మించాను.   ఒక సారి చచ్చి బ్రతికాక, చావు మరెప్పుడూ భయపెట్టలేదు.

అదృష్టం ప్రతీ సారీ దయ తలుస్తుందని లేదు. నా చావు ఆ రోజలా రాసిపెట్టి లేదు. అంతే. కానీ ఆ చావు నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. కాంక్రీటూ, ఉక్కూ ఆ ఎత్తున ఎలా చేర్చామో, కాంక్రీటు స్లాబుల్ని ఎలా తయార  చేసామో తెలీదు. రాత్రీ పగలూ అక్కడే ఉండి, చావూ బ్రతుకుల ఊగిసలాట లో బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తి చేసాం.   సిక్కిం లో ఇలాంటివెన్నో చేసాం.   ఇంకా సరిహద్దు వెంబడి కొండల్లో సైన్యం తిరగగలగడానికి, సరిహద్దు కి చప్పున చేరడానికి వేసిన రోడ్ల,వంతెన ల నిర్మాణాల్లో ఎందరో ఆర్మీ జవాన్లూ, ఆఫీసర్లూ, మామూలు కూలీలూ చనిపోయారు.  వాళ్ళందరి ఆత్మలూ నన్న ఆ పూట బ్రతికించాయనుకుంటాను.  నేను ఆ రోజు మరణించి ఉంటే మరో ఇంజనీర్ వచ్చి నా పని పూర్తి చేసి ఉండేవాడు. కానీ జారుతూండే కొండ వాళ్ళ భయంతో ఆ నిర్మాణాన్ని పటిష్ఠం గా ముగించి ఉండేవాడా అనేది నేను చెప్పలేను.    ఆ కల ఇప్పటికీ స్పష్టంగా గుర్తొస్తూ ఉంటుంది.  అది ఒక కల మాత్రమే.. అనుకుంటూ ఊరుకుంటాను.

ఈ పని ముగించడానికే ఏ దివ్య శక్తో నన్ను రక్షించిందని అనుకుంటాను. ఇన్నాళ్ళకీ నేను కట్టిన .. అహ.. కాదు.. నన్ను ఉపయోగించుకుని ఏదో ఒక  దివ్య  భారతాత్మ కట్టించిన రోడ్డూ, వంతెనా, సిక్కిం లో కొత్త దార్లను తెరిచింది. సైన్యానికీ, స్థానికులకూ ఉపయోగకరంగా మిగిలింది.





PS :  {నిజమైన సంఘటనలకు కాస్త కల్పన జోడించి రాసినది}