Pages

18/12/2024

మృత్యుంజయ - అబ్బూరి చాయా దేవి






హైదరాబాద్ బుక్ ట్రస్ట్ 1993 లో ప్రచురించిన పుస్తకం ఇది. ఒక సెకండ్ హాండ్ పుస్తకాల అంగట్లో అబ్బూరి చాయా దేవి గారి పేరు చూసి, చటుక్కున కొనేసుకున్నాను. సామాన్యంగానే ఒక తండ్రీ, కూతుళ్ళ మధ్య ఉన్న బంధం అపూర్వమైనది. అందులోనూ, సింప్లిసిటీ, విద్వత్తూ, అందమైన స్నేహమూ ఉన్న ఇద్దరు తండ్రీ కూతుర్ల మధ్య నడిచిన ఉత్తరాలే ఈ పుస్తకం నిండా.  ఇది ఆమె చెప్పబోయిన తన తండ్రి జీవిత కథ, తన గాధ అనిపించింది. నేను పుస్తకం చదివి కదిలిపోయిన మాట నిజం. మా నాన్నగారిని బాగా గుర్తు చేసుకున్న మాటా నిజమే. చాయాదేవి గారి రచనల్లో ఇది నిజానికి "పెద్ద కథ" అని చదివాను. కానీ ఇది నవలో, కథో, ఆత్మ గాధో తెలియలేదు. ఏమైతేనేం, ఇది చదవడం వల్ల మనసు శుద్ధి చెందింది. 

ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు రాసిన 'ముందుమాట' పుస్తకం మీది గౌరవాన్ని అమాంతం పెంచేసింది. అసలు ఎన్నడూ విని ఉండకపోవడం వల్ల ఈ చిన్ని పుస్తకం నుంచి ఏమి ఆశించాలో తెలీని పరిస్థితిలో ఈ ముందుమాట గొప్ప మేలు చేసింది. పాఠకుడికీ, పుస్తకానికీ కూడా. 

లాయరుగా వృత్తిపరంగా బిజీగా ఉన్నా కూడా ఊరికే కూర్చునే రకం కాని 'నాన్నగారి  ఆధ్యాత్మిక భావాల సంగతితో పాటూ, అహంకారం సంగతి' కూడా బాగా తెలిసిన కూతురు ఆయన రాజమండ్రి నుండి హైదరాబాదుకి మకాం మార్చిన వార్త విని ఆదుర్దా చెందుతున్నపుడు  తండ్రి నుండి ఉత్తరం అందుతుంది.  'ఇదిగో ఫలానా పనికి రాజమండ్రి వెళ్ళొచ్చాను. ఇక లాయరుగా నా జీవితం సమాప్తమైందని నిశ్చయంగా చెప్పవచ్చు. ఆఖరి కేసు పూర్తిచేసాను. ఇక ఏ కోర్టు తోనూ ఇంక సంబంధం లేదు. సన్యాసి కావడానికి అడవులకు పోయి ఉండనక్కర్లేదు. మానసికంగా నిజమైన సన్యాసిగా ఉండవచ్చు. ఏవిధమైన గొడవలూ లేకుండా మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుని, అన్ని కోరికలనూ, భయాలనూ త్యజిస్తే అదే నిజమైన సన్యాసం.. మీరు ఢిల్లీ వెళ్ళి అపుడే రెండేళ్ళు దాటింది. అవసరమైనవీ, కుతూహలమైనవీ, అన్ని విశేషాలతో పెద్ద ఉత్తరం రాస్తే నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటాను.." అంటూ రాస్తారాయన.  అనగా ఆయన స్వచ్చందంగా వృత్తి విరమించి, తనకి కావల్సిన విధంగా రిటైర్డ్ లైఫ్ గడపాలనుకున్న వ్యక్తి. ఇంకా సంపాదించేయాలన్న ఆసక్తి లేని సింపుల్ (/చాదస్తపు) మనిషి.

అసలు ఉత్తరాలు రాసుకోవడం ఎంతందమైన కళ ! అందులోనూ, ఉన్నతాదర్శాలు, ఉత్తమ సంస్కారం గల మనుషుల మధ్య ! కుమార్తె తండ్రి ని 'పదవీ విరమణ చేసాక ఊరికే ఉండడానికి పిచ్చెక్కుతుంది. మీరు ఢిల్లీ వచ్చి కొన్నాళ్ళు కాలక్షేపం చేయమంటే' ఆయన అస్సలు ఒప్పుకోరు. నేనెక్కడున్నానో అక్కడే బావుంది. మీ అమ్మ(గారి) లాగా నాకు డిల్లీ, ఆగ్రా, బదరీనాధ్ అవీ చూడాలనే ఉత్సాహమేమీ లేదు అనేంత తాత్విక మనస్తత్వం ఉన్న మనిషి,  కొన్నాళ్ళకు ఎర్ల్ స్టాన్లీ గార్డ్నర్ నవలలు చదువుతున్నాననీ అవి న్యాయానికీ, చట్టానికీ సంబంధించిన సృజనాత్మక సాహిత్యంలో మేలైన రచనలనీ, ఉత్తరంలో రాస్తారు. గార్డ్నర్ రచనలు వరుసగా చదివి, రచయిత అభిప్రాయాలు, జీవన్మరణాలగురించిన తత్వం అచ్చు జిడ్డు కృష్ణమూర్తిగారి అభిప్రాయాలతో సరిపోలడం గురించి ఉత్తరం రాసారు.  ఆయన కాలక్షేపానికైనా వేదాంత గ్రంధాలనే చదివే వ్యక్తి. అలాంటి మనిషి డిటెక్టివ్ నవలలను చదువుతున్నారని ఉబ్బితబ్బిబ్బవుతుంది కూతురు. ఆషాడ బహుళ నవమిన అన్నదీ, తండ్రిదీ పుట్టిన రోజు. ఇద్దరికీ చెరొక "బెర్ట్రాండ్ రసెల్ స్పీక్స్ హిస్ మైండ్"  పుస్తకాన్ని బహుమతిగా పోస్ట్ చేస్తుంది.  

ఆయన ఏకబిగిన దాన్ని చదివి, అనువాదం చేసేసేంతగా నచ్చేస్తుంది ఆ పుస్తకం. "నువ్వు పంపిన పుట్టినరోజు బహుమతి అద్భుతమైనది. గత కొద్దిరోజులుగా నేను బెర్ట్ రాండ్ రసెల్ సాన్నిధ్యంలో ఉన్నాను. ఆయన సాన్నిధ్యాన్ని నేనెంతో ఆనందించాను. పదిరోజులక్రితం రాత్రి 8 గంటలకి అనువాదం ప్రారంభించి ఈరోజు మద్యాహ్నం 3 గంటలకి పూర్తి చేసాను..  బెర్ట్ రాండ్ రసెల్ కీ, జిడ్డు కృష్ణమూర్తి గారికీ చాలా సామ్యం కనిపించింది. ఇద్దరూ ప్రపంచ విఖ్యాత మేధావులు, తత్వవేత్తలు, బోధకులు.  అయితే లార్డ్ రసెల్ బోధకుడవునో కాదో చెప్ప్పలేకపోవచ్చు కానీ ఆయన నిశ్చయంగా మహా మేధావి, తత్వవేత్త.  ఆయన అభిప్రాయాలు విప్లవాత్మకమైనవే కాదు. ఎంతో వినూత్నమైనవి. ఆయన (పుస్తక పఠనా..) సాన్నిధ్యం నాకెంతో ఆనందం కలిగించింది" అంటూ జవాబు రాస్తారు. 

ఇద్దరూ ఉత్తరాలు రాసుకుంటున్నప్పుడు, కొన్నాళ్ళకు తండ్రి హఠాత్తుగా సంతకానికి బదులు చుక్కలు పెట్టడం గమనిస్తుంది కూతురు. "ఈసారి నుండీ నా చిరునామా లో అసలు పేరు స్థానంలో మృత్యుంజయ అని రాయు. ఇది నేను పెట్టుకున్న పేరు. ఎప్పుడో అప్పుడు గతమంతా నశించాలి. ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. నాయీ కోరిక అనుకో, లేదా మానసిక బలహీనత అనుకో, దాన్ని మన్నించు. చెప్పినట్టుగా చెయ్యి. చిరునామాలో ఇంటి నెంబరు వేయాలి సుమా" అని చమత్కరించి రాసిన ఉత్తరంలో సంతకం స్థానంలో మృత్యుంజయ అని సంతకం చేసారు. 

ఇద్దరి మధ్యా రకరకాల ఉత్తరాలు. ఆమె ఆరోగ్యం, అనారోగ్యం, ఆయన చదివిన పుస్తకాలు, చేస్తున్న అనువాదాలు. దీపిక కోసం రాసిన వ్యాసాలు, మిగిల్న తోబుట్టువుల గురించి, బంధువుల ఇళ్ళలో పెళ్ళిళ్ళ గురించి, దివ్యజ్ఞాన సమాజం గురించీ, హోమియో పతీ మందుల సూచనలు, ఆమె చదువులు, చేయాల్సిన కోర్సులు, చైన్సీస్ విద్యా, అల్లుడి ఉద్యోగమూ, దిల్లీ రమ్మనడం, ఆయన వద్దనడం, కుమార్తె అత్తమామల గురించి హెచ్చరికలు, వారిని గురించి రాయకపోవడం గురించి మందలింపులు, వారి ఆదరణ గొన్నందుకు కూతురికి ప్రశంసలు, ప్రస్తావనలు వగైరాలు.  వీటన్నిటిలోనూ ఇద్దరి వ్యక్తిత్వమూ, కష్టపడే తత్వమూ, జీవితపు మిగిల్నకోణాల పట్లా, మనుషుల పట్లా, బంధాల పట్లా ఉన్న అవహాహన, ప్రేమ, వ్యక్తమవుతూ ఉంటాయి.


ఆయన రాసిన ఉత్తరాల్లో కొన్ని వాక్యాలు చూడండి.

(i) ఒకడు కొండల కింద, చీకటి లోయల చుట్టూ ఎప్పుడూ ఏదో తడుముకుంటూ, లొడ లొడ వాగుతూ, సణుక్కుంటూ, అష్టకష్టాలు పడుతూ, సంపాదిస్తూ, పోగు చేసుకుంటూ ఉంటాడు.  మరొకడు మేఘాలులేని ఆకాశంలోకి దూసుకుపోయి అత్యున్నత పర్వత శిఖరాగ్రాల కింకా పైన ఏ విధమైన ఆటంకాలూ ఎదురవని చోట, ప్రగాఢమైన పరిపూర్ణ నిశ్శబ్దత, ప్రశాంతత ఆవరించి ఉన్నచోట తేలుతూ ఉంటాడు.  ఈ ఇద్దరిమధ్య ఉండే వ్యత్యాసం గురించి నీకేమనిపిస్తుంది ? 

(ii) అమ్మా, మనం మన గూళ్ళలో నివసిస్తూనే, మబ్బుల్లేని అనంతాకాశంలో తేలుతూ, వర్ణనాతీతమైన ఆనందాన్ని చవిచూడటం సాధ్యం అంటావా, కాదంటావా ? 

(iii) ఏసుక్రీస్తు చెప్పిన మాటల్ని మనం మరచిపోకూడదు. "నీ దగ్గర రెండు కప్పుకునే దుస్తులుంటే ఒకటి అసలు లేనివాడి కి  ఇయ్యి" నన్ను ఇలా సాదాగా, నిరాడంబరంగా ఉండనీ..."

(iv)   నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే, నేను త్వరగా ఏ వ్యాధి, ఏ బాధా లేకుండా, ఎవరికీ ఏ బాధా కలుగజేయకుండా, దగ్గరగా ఉన్నవాళ్ళకు గాని, దూరంగా ఉన్నవాళ్ళకు గాని, ఎవరికీ కష్టం కలుగజెయ్యకుండా నేను తనువు చాలించాలని మనసారా కోరుకోమని నిన్ను బ్రతిమాలుకుంటున్నాను. 


వృద్ధాప్యం కమ్ముకొచ్చేస్తున్న తల్లితండ్రులను ఊర్లో ఒంటరిగా వొదిలి, వాళ్ళకు ఆరోగ్యం బాలేనపుడల్లా అప్పటికే మధ్యవయసుకొచ్చి, బాధ్యతల్లో మునిగిపోయిన పిల్లలు పడే ఆవేదన అందరికీ అనుభవంలోకి వచ్చేదే.  తండ్రి వీలయినంత శారీరక శ్రమ, మొక్కలకు నీళ్ళు తోడటమూ, కూరలు తీసుకురావడమూ, చదువుకోవడమూ, ఉత్తరాలు రాయడమూ, భార్యకు సాయపడటమూ, ఆవిడ ఊరెళ్తే, మొత్తం పనిచేసుకోవడమూ - ఇలా తనకు ఓపికున్నన్నాళ్ళూ చేస్తూనే ఉంటారు. సైంటిస్ట్ అయిన కొడుకు డెహ్రాడూన్ లో ఉండటం వల్ల, వీళ్ళకు వెళ్ళే ఉద్దేశ్యమూ ఉండదు. అయితే విధివశాత్తూ, ఆయనే 84 ఏళ్ళ వయసులో కొడుకు హఠాన్మరణంతో ఇంకొన్ని కుటుంబ బాధ్యతలు స్వీకరించాల్సొస్తుంది. కాటరాక్ట్ తో కళ్ళు కనిపించడం తగ్గుతుంది. 

తల్లితండ్రులను గురించి, ముఖ్యంగా తండ్రి గురించి ఎంతో బెంగ పెట్టుకుని మనసారా ప్రేమించిన పిల్లలకు ఆయన చివరి రోజులు భారమవుతాయి. తండ్రిని గురించి రాస్తూ కూతురు రాసిన ఆఖరి పేరాల లో కొంత భాగం :- 

ఒక్క సంగతి మరచాను. నాన్నగారు 'మృత్యుంజయ' అన్న సంగతి. కొడుకు మరణాన్ని కొండంత స్థైర్యంతో స్వీకరించారు. కోడలి కోరిక ప్రకారం యధావిధిగా కర్మకాండ జరిపారు. కొడుకు కొడుక్కి ఉపనయనం కానందున తను ఏనాడో విసర్జించిన జంద్యాన్ని మళ్ళీ వేసుకుని కర్మ చేసారు. కేటరాక్ట్ ముదిరిపోయింది. రెండు కళ్ళూ చీకటి గూళ్ళు. మంచమే శరణ్యం అయింది. మరణం కోసం ఎదురు చూడ్డమే మిగిలింది. బ్రతికినన్నాళ్ళూ కోరికలని చంపుకుంటూనే బ్రతికారు. మరణించాలన్న కోరిక ఒక్కటే ఆయన చంపుకోలేకపోయింది. దానికే శిక్ష అనుభవించినట్టున్నారు.  కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకు ముందే పోయాడు.  అన్నయ్య పోయిన రెండేళ్ళకు నాన్నగారి రెండు కళ్ళూ పోయాయి. వాటితో పాటే నేనూ నా చిరకాలపు 'కలం స్నేహితుణ్ణి'  కోల్పోయాను".

తండ్రులతో గాఢమైన అనుబంధం ఉన్న కూతుర్లకు ఈ పుస్తకం చాలా నచ్చుతుంది. అదెలాగూ ఉన్నదే. ఈ పుస్తకంలో అంతకు మించిన స్నేహానురక్తి ఉంది. మృత్యుంజయ దివ్యజ్ఞాన సమాజాన్ని, కృష్ణమూర్తి బోధనలనూ  నమ్మిన వ్యక్తి. "నవ్య మనస్సు" అనే శీర్షికన దివ్యజ్ఞానం పై అనేకమైన ప్రసంగ వ్యాసాలను రాశారు. జిడ్డు కృష్ణమూర్తి, దివ్యజ్ఞానము అనే అంశాలపై వివిధ నగరాల్లోనూ, రేడియోలోనూ తెలుగు, ఇంగ్లీషుల్లో ప్రసంగించారు. ఆయన వ్యాసాలు రెండు భాషల్లోనూ అచ్చయ్యాయి. ఆయన హైదరాబాదు లో జిడ్డు కృష్ణమూర్తిగారి ప్రభోధాలను వివరిస్తూ చేసిన ప్రసంగాన్ని విని, దివ్యజ్ఞాన సమాజం హైదరాబాదు శాఖ వారు ప్రచురించి దేశమంతా పంచిపెట్టారు. ఈ విషయాల్ని రాస్తూ, జిడ్డు కృష్ణమూర్తి తత్వాన్ని, తనకు చేరినంత జ్ఞానాన్ని, వీలయినంతగా వ్యాప్తి చెయ్యాలంటే ఏమి చెయ్యొచ్చో చెప్పాల్సిందిగా కోరారు. ఆమె ఇచ్చిన సలహానీ స్వీకరించారు. 

ఈ మధ్య 'మినిమలిజం ' గురించి ఒక స్పృహ వృద్ధులలోనూ మొదలయినట్టు చదివాను. చనిపోయే ముందు ఇంట్లో వస్తువుల పట్లా, పేర్చుకుపోయిన బంధనాల పట్లా బాధ్యతాయుతమైన డిటాచ్మెంట్, వదిలించుకోవడమూ గురించి ఆలోచనలు బాగా చదివాను. మృత్యుంజయుని గా  మారిన కొత్తల్లోనే, పూర్తి స్పృహతో ఆయన రాసుకున్న వీలునామా చదివితే ఆయన ఎంత నిరాడంబరంగా జీవించారో, ఎంత ఉన్నతాదర్శాలతో బ్రతుకుని తీర్చిదిద్దుకున్నారో తెలుస్తుంది.   తన నిర్దుష్టమైన బాధ్యతలను గుర్తెరిగినట్టు భార్య పేరిట కాస్త సొమ్ము, తన దహన సంస్కారాలకోసం కేటాయించిన సొమ్ము ఖచ్చితంగా కేటాయిస్తారు.  దహనానంతరం తన బూడిదను వారణాసిలో గట్రా కలపొద్దు, దహనం జరిగిన ప్రదేశానికి దగ్గరలోని నీటిప్రవాహంలో కలిపితే చాలు అని రాస్తారు. కర్మ కాండ పట్ల ఆయనకు నిర్దుష్టమైన అధునాతన అభిప్రాయాలున్నాయి. తనకై కర్మకాండ అస్సలు జరిపించవద్దని చాలా విపులంగా రాస్తారు. రిస్టువాచీ, బట్టలూ, హోమియోపతి పుస్తకాలు, మందులూ, ఎవరికి ఆసక్తి ఉంటే వారు తీసుకోవచ్చు. దహనానంతరం డబ్బు మిగిలితే కుష్టురోగులకు భోజనం పెట్టాలి. తన బట్టలన్నీ బీదలకు పంచాలి.. తన ఫలానా వస్తువులన్నీ ఫలానా అందరికీ ఇవ్వాలి అని రాసి, ఆఖర్న, "మృత్యుంజయ తన అనంతరం వదిలివెళ్ళేది సుహృద్భావం, ప్రకృతిలోని ప్రతి ప్రాణి పట్ల ప్రేమ - అంతకు మించి మరేమీ లేదుఅని రాసారు.  

ఈ పుస్తకం ముందుమాట లో  సుబ్రహ్మణ్యం గారు రాసినట్టు, "ఎన్ని తరాలు మారినా, ఏ దిక్కు నుంచి ఎన్ని ప్రభంజనాలు వీచినా, విజ్ఞాన శాస్త్రంలో ఎన్ని మార్పులు వచ్చినా, వస్తున్నా, తండ్రీ తనయల స్వభావం మారనిది.  'మృత్యుంజయా, ఆయన కూతురూ,  ఒకే క్రాంతి చక్రంలో విక్రమిస్తున్నారు - ఒకరి వలయాన్ని ఇంకొకరు ఖండించకుండా, ఘర్షణ పడకుండా.. "

ఈ పుస్తకం చాలా రోజులకు నన్ను నవ్వించింది, ఏడిపించింది, కదిలించింది. మా నాన్నగారితో  నా అనుబంధం, చివరి రోజుల్లో ఆయన నన్ను పోల్చుకోలేకపోవడం, ఆయన్ని నేను బాధపెట్టిన సంగతులూ, ఆయన ఉత్తరాలు దాచుకోవడం, ఆయన సంతకమూ, ప్రోత్సాహ పూర్వక వాక్యాలూ, అందమైన దస్తూరీ.. ఇవన్నీ గుర్తొచ్చాయి. సరిగ్గా ఇలానే హోమియో మందులు సూచించడమూ, మా చదువుల్నీ, ఉద్యోగాల్నీ, కుటుంబాలనీ ఆయన ఎంత ఇంటరెస్ట్ గా సమకూర్చి పెట్టారో తలచుకున్నాను. ఆయన ఉండి వుంటే నేనిప్పుడు పడుతున్న చిన్నా పెద్దా కష్టాలకు ఆయన  ఓదార్పులు, ధైర్యవచనాలూ, నాకు ఎంత దన్నుగా ఉండేవో గుర్తు చేసుకున్నాను. ఇకపై అబ్బూరి చాయాదేవి రచనల్ని వెతికిమరీ చదవాలని నిశ్చయించుకున్నాను. 

***


No comments: