Pages

22/12/2008

వార్తలా ? వ్యాపారమా ?

ఈ మధ్య అస్సలు టైం చిక్కట్లేదు - ప్రపంచకం ఏమయిపోతుందో తెలుసుకోవడానికి! టీవీ అస్సలు చూడకపోవడం ఒక కారణం. టీవీ లో వార్తలు చూద్దామన్నా - 'ఏమున్నది గర్వ కారణం ?' అనుకుని కొంతా, ఈ టీవీ రాజకీయాలకి మొహం మొత్తి కొంతా చూడక, వార్తల తో టచ్ పోయింది. అయితే అదృష్ట వశాత్తూ మీడియా మేటర్స్ మీద కొంచెం ఆసక్తి, ఆలోచనా కలిగింపచేసే సంగతులు పత్రికల్లో చదివి - చిన్న టపా పేలుస్తున్నా.


'ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే ఎవరో ఒక ఆడమనిషి గురించి, ఇద్దరు మగవాళ్ళు కలిసినా ఒక ఆడ మనిషి గురించి మాట్లాడుకుంటారనీ' -నవ్వులాటకి సగం, నిజానికి సగం అనుకుంటారు. ఇక్కడ పాయింట్ ఎవరిగురించి ఏమి మాటాడుకుంటున్నారని కాదు. ఎవరు ఎంత నిర్మాణాత్మకంగా తమ జీవితాలు గడుపుతున్నారో ఆలోచించుకోవాలని చెప్పాను. అలానే ఇతరుల జీవితాల్లో నానా భారతాలూ మాల్ మసాలా దట్టించి వినడం, పైశాచిక ఆనందంతో వినడం ఇచ్చే కిక్ అందరికీ తెలిసిందే. వీధుల్లో, అరుగుల్లో, క్లబ్బుల్లో, ఆఫీసుల్లో ఇద్దరు నాగరికులు కలిస్తే మాటాడుకునేవి ఇవే కదా.. మన భారతాన్ని ఎవరో విని నోళ్ళు నొక్కుకుంటే 'లోకులు పలు కాకులు ' అనుకుంటాం కదా. అలానే మనమూ కాకులమే !


మనం కాకులమయితే, మీడియా వాళ్ళో ? వీళ్ళు రాబందులే ! మీడియా అంటే ప్రింట్ మీడియా సంగతి పక్కన పెడితే, ఎలక్ట్రానిక్ మీడియా మీద వచ్చిన విమర్శలు చదివి ఈ మధ్య నేనూ తరించాను. చిన్న ఉదాహరణ గా - టీవీ సీరియళ్ళ నే తీసుకోండి ! ఈ ఇతరుల ప్రైవేట్ జీవితాల గురించిన ఆసక్తి లో కూడా కొన్ని రకాలున్నాయి. బీదవాళ్ళ జీవితాల్లో ఏముంది ? చూస్తే డబ్బున్నోళ్ళ కథలు చూడాలి ! కోట్ల మధ్య బ్రతికే కుటుంబాల మీదే సీరియళ్ళన్నీ ! పెయింటు పూతలూ, పట్టు చీరల రెప రెపలూ, ఖరీదయిన ఆభరణాలూ, అంతకన్నా ఖరీదయిన సెట్లూ, కార్లూ - విలాసాల మధ్య అగర్వాల్ కుటుంబమో, వీరానీల కుటుంబమో పడే అగచాట్లూ సంవత్సరాల తరబడి చూస్తాం. ఉడాన్ లాంటి సీరియల్ ఇపుడు ఏ చానెల్ లో నయినా వస్తుందా !


పోనీలే పాపం సీరియళ్ళు ఆడవాళ్ళ సెక్షన్ అనుకోవడానికి లేదు. ఈ సీరియళ్ళ లో కూడా వర్గ విభేధాలూ - పురాతన భావాలూ (అభ్యుదయ వాదం పేరుకే - సీరియళ్ళ లో భారతీయ సాంప్రదాయం పేరిట, తలా తోకా లేని పురాతన భావాలకే పెద్ద పీట) ఈ సీరియళ్ళు ప్రసారం అవుతున్న సమయం లో చానెళ్ళు చేసుకునే వ్యాపారం కోట్ల లోనే ! అయితే ఈ సీరియళ్ళ కన్నా బలమయిన వ్యాపారం ఇంకోటుంది. అది - వార్తలు ! ఇప్పుడు మన దేశంలో ప్రసారమవుతున్న వార్తా చానళ్ళు - వివిధ భాషల్లో కలిపి, 150 దాకా ఉన్నాయి. వీటిల్లో విపరీతమయిన పోటీ ! టీ ఆర్ పీ రేటింగుల బట్టే వీటిల్లో వ్యాపార ప్రకటనల రెవెన్యూ. ప్రజల కు కేవలం వార్తలు అందించడం, నిష్పాక్షికతా, పారదర్శకతా ఇపుడు అంతరించిపోయిన విలువలు ! అందుకే టీవీ వార్తలు ఒక అడ్డూ అదుపూ లేని వ్యాపార ప్రపంచం.

టీవీ వార్తలు - ఆరుషీ తల్వార్ కేసును భ్రష్టు పట్టించడానికీ, నిర్దాక్షిణ్యంగా ఆరుషీ తల్లితండృలను క్షోభ పెట్టడానికీ పోటీపడ్డాయి. మన దేశంలో వీటి మీద అడ్డూ అదుపూ లేకా, మన న్యాయ వ్యవస్థ లో లోపాల కారణం గా పరువునష్టం దావాలు వేసో, దానికి తగినంత నష్టపరిహారం అడిగో - వీళ్ళను రోడ్డు కీడ్చే సౌకర్యం లేక, టీవీ వార్తల భాధితులు అలానే అవస్థలు పడుతున్నారు.

అయితే వార్తల్లో ఇంకో ట్రెండ్ ఉంది. ఆరుషీ తల్వార్ హత్య కేసు లో - ఆరుషీ తో పాటూ ఒక నౌఖరు కూడా హత్య కు గురయ్యాడు. ఈయన ప్రస్తావన మాత్రం ఉద్దేశ్య పూర్వకంగా తప్పించి నగరంలో ప్రముఖులన్న కారణంగా తల్వార్ల కుటుంబానికి మచ్చలు అంటించి, అక్రమ సంబంధాలు అంటగట్టి, కేవలం మార్కెట్ లో రెవెన్యూ కోసమే - చానెళ్ళన్నీ కట్ట కట్టుకుని ఈ వార్తలు ఎలా ప్రసారం చేసేయంటే, కేవలం ఆరుషీ మాత్రమే హత్యకు గురి అయినట్టు, నౌఖరు హత్య ఒక హత్య కానట్టు, అసలు నౌఖరే లేనట్టు, మీడియా ప్రవర్తించింది!

దీన్నే సినిమా భాష లో క్లాస్ - మాస్ సిద్ధాంతం గా పరిగణిస్తారు. మొన్నటికి మొన్న ముంబయ్ ఆటవిక దాడుల్లో - చూడండి. చత్రపతి శివాజీ టెర్మినస్ లో అమానుషంగా చనిపోయిన అనేకమంది బీదా, బిక్కీ, మధ్య తరగతి జనం - టీవీ వాళ్ళ దృష్టి లో అల్పులయిపోయారు. మంటల్లో చిక్కుకున్న తాజ్ పేలస్ హోటల్ ను మాత్రం చూపిస్తూ మీడియా 60 గంటల పాటూ పేజ్ 3 పెర్సనాలిటీల ఆగ్రహావేశాల మధ్య - మేం పన్నులు కట్టం, మేము ఊరుకోం అని - ఆవేశపడిపోయిన ప్రముఖుల మధ్య మైకులూ కేమెరాలూ పెట్టి - దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే డబ్బున్న మనుషులోయ్ ! అన్నట్టు నిరవధిక ప్రసారం జరిపింది.


ఇంకో ముఖ్యమయిన ట్రెండ్ - రాజకీయ నాయకులే విలన్లు అన్నట్టు మాట్లాడటం! మీడియా వాళ్ళూ విలన్లే ! వీళ్ళ విచక్షణా రాహిత్యం వల్లనే ఎందరో అమాయకులు బలయ్యారు. ముఖ్యంగా భారతీయ మీడియా నిష్పాక్షికమయినది కాదు. ఏ పత్రిక ఎవరిని సపోర్ట్ చేస్తుందో - ఏ చానెల్ ఏ రాజకీయ పార్టీకి సలాములు చేస్తుందో అందరికీ తెలుసు ! ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా అయినా, పత్రికలు అయినా, కొందరు ప్రముఖ రాజకీయ నాయకులే స్థాపించుకుంటున్నారు. మన రాష్ట్రం లో నే ఏ పత్రిక ఎవరికి బాకా కొడుతుందో అందరికీ తెలుసు.

ఈ కాకి గోల ఏమిటా అని విసుక్కోకండి ! కొన్ని సత్యాలు కటువుగానే ఉంటాయి. అందరి జీవితాలూ మనకు కిక్ ఇవ్వవు. పి సాయినాథ్ యజ్ఞం లా ప్రచురించిన విధర్భ రైతుల గాధలో, మన రాష్ట్రంలో కట్ట కట్టుకు చనిపోతున్న రైతులా, చేనేత కార్మికుల గాధలూ మనకు అంత ఇంటరెస్టింగ్ గా అనిపించవు. ఐపీయెల్ మేచో, ఫలానా క్రికెటర్ కీ, సౌథ్ ఇండియన్ హీరోయిన్ కూ ఉన్న ప్రేమ వ్యవహారమో, మళ్ళా ఏ దాడిలోనో మరణించిన ప్రముఖుడో - ఇంటరెస్టింగ్ !


వార్తలంటే ఏమిటి ? గత అయిదు సంవత్సరాల్లో 1.5 లక్షల మంది రైతులు మన భారతావనిలో పూట గడవక, అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్నారు ! గ్లోబల్ హంగర్ రిపోర్ట్ లో - మన భారతావని నేపాల్ కన్నా కనాకష్టం గా 66 వ (66th of 88) స్థానంలో ఉంది ! మన దేశంలో రెండు రూపాయలు కట్టలేక, ఒక తండ్రీ కొడుకుల్ని బస్సు లోంచీ తోసేస్తే, వాళ్ళు అదే బస్సు కింద పడి పచ్చడయి నిర్దాక్షిణ్యంగా చనిపోయారు ! ఇదే ముంబాయి లో మరాఠీ మాట్లాడని వాళ్ళని, మనుషులు కానట్టు తరిమి తరిమి కొట్టారు. ఇదే దేశంలో క్రిస్టియన్ నన్ లని ముళ్ళ మీదా, గాజు పెంకుల మీదా వేసి తొక్కి గేంగ్ రేప్ చేశారు. ఇదే దేశంలో వేలాది ముస్లిం లను గోధ్రా అల్లర్లలో భయంకరంగా చంపేరు.

మీడియాలో వార్తలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. బులెట్ గాయాలకో, బాంబు దాడిలో షార్ప్ నెల్ గుచ్చుకునో బాధపడే క్షతగాత్రులను వీడియో షూట్ చేసి, అమ్ముకునే పాత్రికేయులు (టెలివిజనేయులు అనాలా?) మనుషులేనా ? వీళ్ళు క్షతగాత్రులను ఆస్పత్రికి తీస్కెళ్ళడానికి సాయం చెయ్యరా ?

ఎన్.డీ.టీ.వీ. లో 'వి ద పీపుల్' లో శోభా డే, నెస్ వాడియా, కునాల్ కోహ్లీలే మాటాడతారు ! రైల్వే ప్లాట్ ఫాం మీద సర్వం కోల్పోయిన ఏ బీహారీ కుటుంబమో 'వి ద పీపుల్ ' కాదేమో ! ఇది స్పష్టం గా క్లాస్ కోసమే ప్రసారం అవుతున్న టెలివిజన్ వార్త ! ఇరవయి నాలుగు గంటలూ వార్తలూ, బ్రేకింగ్ న్యూసులూ అమ్ముకు బ్రతికే మీడియా - రాజకీయ నాయకులే విలన్లు అన్నట్టు, తాము మాత్రం సత్య సంధులం అన్నట్టు మాట్లాడటం తగదు !


మన టెలివిజన్ వార్తలు అంత నిష్పాక్షికమయినవయితే, మన వ్యవస్థలో పాతుకుపోయిన అవినీతి, మన బ్యూరోక్రాట్ల రెడ్ టేప్ నుంచీ, మన దేశాన్ని పట్టి పీడిస్తున్న బీదరికం, అవిద్య, జనాభా, పారిశుధ్యం, కాలుష్యం - ఇలాంటి బర్నింగ్ పాయింట్స్ మీద ఎంత శాతం సమయాన్ని వెచ్చిస్తుంది ?


రాజకీయాల్లో కుళ్ళు నో, ప్రాజెక్టుల్లో కుంభకోణాన్నో ఎందుకు బయటపెట్టవీ చానెళ్ళు ? ఎంత సేపూ నేరాలూ, ఘోరాలూ అంటూ క్రైం ను అమ్ముకునో, ఇష్టం వచ్చినట్టు రక్తపాతాన్నీ, శవాల్నీ చూపిస్తూ భీభత్సాన్ని ఇంటరెస్టింగ్ గా చూప్సితూ పబ్బం గడుపుకున్న మీడియా వార్తా వ్యాపారాన్ని గురించి తెలుసుకుందాం.


ఈ వ్యాపారాత్మకత లో అమాయకంగా మనం కొట్టుకుపోయి, మనల్ని మనం మోసపుచ్చుకోకూడదు. ముంబయి దాడుల్లో ప్రముఖులూ, ఫస్ట్ క్లాస్ ప్రజలూ మరణించి ఉండకపోతే, ప్రభుత్వమో, మీడియానో జంప్ చేసి, ఎవరి లైన్లు వాళ్ళు సినిమాల్లో లా మాటాడేలా చెయ్యడానికి ఏ మాత్రం ఉపకరించకపోను.


డబ్బున్న ఫస్ట్ క్లాస్ జనాలే - మనుషులు కారు. ఆం ఆద్మీ - ట్రైన్లోనూ, బస్సుల్లోనూ వేలాడుతూ ప్రయాణిస్తూ, ఏ బాంబు దాడిలోనో పుటుక్కున మరణిస్తున్నాడు - కొన్ని వేల లక్షల భారతీయులు పురుగుల్లా-బ్రతికేస్తున్నారు. వార్తలంటే -వీళ్ళ గురించి రాయండి. వీళ్ళని చూపించండి. సామాన్యుడి గురించి కార్టూన్లు గీసే ఆర్కే లక్ష్మణ్ లా మీ వార్తల్లో ఈ దిక్కు లేని సామాన్యుణ్ణి కరుణించి చూపించండి ! వీడు -టెలివిజన్ చూడ్డానికి టైం లేని నికృష్టుడు ! అధముడు ! కనాకష్టం గా రోజు గడవడానికే ప్రాణాలకు తెగించి ఏదో చిన్న పని చేసుకుంటూ, వార్త చదవడానికి చదువు కూడా బహుశా వచ్చి ఉండని దరిదృడు. వీడ్ణి గురించి ఏదో ఒకటి చెయ్యండి.


బాలికా వధూ - లాంటి సీరియల్ని అమ్ముకోవడం కాదు ! నిజంగా బాల్య వివాహాలు అవుతున్నాయే - వీట్ని గురించి జనంలో అవేర్నెస్ తీసుకుని రండి. ఏ సాయినాథ్ లాగానో, కెవిన్ కార్టర్ లాగానో కొంచెం మనసు పెట్టి పనిచెయ్యండి.

15/12/2008

విజయ్ దివస్ 2008మన వీర సైనికులు 1971 లో పాకిస్తాన్ పై యుద్ధం లో సాధించిన విజయాన్ని పురస్కరించుకుని, ఒక ఉత్సవం లా, 'సలామే శస్త్ర్', 'సలామే శోక్'ల, దేహాన్ని పులకింపచేసే సైనిక లాంచనాల నడుమ దేశవ్యాప్తం గా ప్రతీ యేడూ, డిసెంబర్ 16 న 'విజయ్ దివస్' జరుగుతుంది. భారత రక్షక దళాల స్మృత్యర్ధం, ముఖ్యంగా మన సార్వభౌమత్వాన్ని కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన అమర వీరులెందరికో నివాళులర్పించే కార్యక్రమం ఇది.


ఈ మధ్య ముంబయి దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వీర సైనికుల నుంచీ, ఎక్కడో జమ్మూ కాశ్మీరులోనో, అసోం లోనో తీవ్రవాదాన్ని ఎదురుకొంటూ అసువులు బాసిన బారత మాత ముద్దు బిడ్డలందరికీ వందనాలు చెల్లించుకోవడానికి, ఈ విజయ్ దివస్ ఉత్సవాలు ఉపకరిస్తాయి.


అయితే, ఇది కేవలం స్టేట్ ఫంక్షన్ గా మాత్రమే ఇంత వరకూ నిర్వహిస్తున్నారు. దీనికి పటాటోపం లేదు. బేనర్లు ఉండవు. ప్రకటనలు ఉండనే ఉండవు. అయితే ఈ సారి ఈ సంవత్సరం ఈ ఫంక్షన్ ని కాస్త ఘనంగా నిర్వహిస్తున్నారు. టీవీ కవరేజ్, ఉత్తేజ పరిచే ప్రసంగాలూ, గారిసన్ చర్చుల్లో ప్రత్యేక రెమెంబరెన్స్ సర్వీసులూ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహకారంతో మన హైదరాబాద్ లో రేప్పొద్దున్న పెరేడ్ గ్రౌండ్స్ లో స్టేట్ ఫంక్షన్ ఉంది. సాధారణంగా వీటిల్లో - రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులూ, కంటోన్మెంట్ లో సీనియర్ సైనికాధికారులూ పుష్పగుచ్చాలు సమర్పించడం (రీథ్ లేయింగ్) ఒక ముఖ్య కార్యక్రమం. కేవలం పుష్పగుచ్చాలు ఉంచడమే కాదు, ఈ సారి ఈ అమర వీరుల జ్ఞాపకార్ధం ప్రత్యేక ప్రార్ధనలూ, సమావేశాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా కార్గిల్ లాంటి ప్రదేశాల్లో దేశ భక్తీ, భావావేశాల మధ్య జరిగే విజయ్ దివస్ ని మీరూ కొంచెం ఎంజాయ్ చెయ్యండి.


ఈ విజయ్ దివస్ కి ఒక ప్రత్యేకత ఉంది. కార్గిల్ తరవాత, ఈ వీరుల్ని మనస్పూర్తి గా గౌరవించుకోదగిన సందర్భం మనకు, నవంబరు 26 కలిగించింది. ప్రభుత్వమూ, వ్యవస్థా విఫలం అయి, హీన దీన పరిస్థితిలో పడిపోయిన దేశ ప్రతిష్ఠ ని నిలబెట్టడం కోసం, కొన్ని వందల మంది ప్రాణాల్ని కాపాడడం కోసమూ తమ ప్రాణాలు ఒడ్డి పోరాడిన మన రక్షక దళాలని, మనలో ఒక జాతి-స్తైర్యాన్ని నిలిపిన ఈ మంచి ముత్యాల్ని, ఘనులనీ, కొంచెం గౌరవించుకునే అవకాశం ఈ విజయ్ దివస్. [కార్గిల్ విజయం సందర్భంగా ఇంకో విజయ్ దివస్ ను జూలై 26 న జరుపుకుంటారు. అయితే ఇది ముఖ్యంగా కార్గిల్, సొనామార్గ్ లాంటి మిలిటరీ లొకేషన్ లలో ఘనంగా నిర్వహిస్తారు]


దురదృష్ట వశాత్తూ, మనం థాంక్ లెస్ ప్రజలం. పోలిటీషియన్ ల,సినిమా వాళ్ళ సభలకు లారీల్లోనూ, ట్రక్కుల్లోనూ హాజరయ్యే జనంలో ఒక్క పావు వంతయినా ఈ విజయ్ దివస్ కు హాజరు కాము. మనలో క్రైసిస్ తరవాత కలిగే సంఘీభావం ఒక వారం పది రోజులు దాటగానే శ్మశాన వైరాగ్యం మాదిరి, కరిగి నీరయిపోతుంది. హైదరాబాద్ రన్లూ, వైజాగు రన్ లూ అంటూ పరుగులు తీసే యువత కొందరయినా ఈ విజయ్ దివస్ నాడు ఈ వీరుల్ని కొంచెం తలచుకోండి. కనీసం వార్తల్లో ఈ ప్రస్తావన వస్తే ఒక్క నిముషం, వీళ్ళ కోసం ప్రార్ధన చెయ్యండి. కనీసం ఈ రోజు ఈ అమర వీరులకు హృదయ పూర్వకంగా థాంక్స్ చెప్పండి.

30/11/2008

Missingనాయనా.. నువ్వెక్కడున్నావు ? ఇంటి దగ్గర మీ మరాఠా అమ్మ నీ కోసం బెంగెట్టుకుంది. నీ సేన కూడా అయిపు లేదు. వీళ్ళందర్నీ వెంట బెట్టుకుని ఎక్కడ దాక్కున్నావబ్బా ? నీ ఆచోకీ తెలియక మరాఠ్వాడా మొత్తం తల్లడిల్లుతూ ఉంది. అసలు సిసలు మరాఠా ప్రజానీకానికి అన్న లాంటోడివి, నువ్వే ఇలా చేస్తే ఎలా నాయనా..?

ఇంటికి త్వరగా రా. అసలు మీ అనుమతి లేకుండా వచ్చిన నాన్-మరాఠా టెర్రరిస్టులూ, వాళ్ళ నుంచీ నాన్-మరాఠా మరియూ మరాఠా ప్రజల్ను రక్షించిన నాన్-మరాఠా సైన్యమూ, కమేండోలూ, వీళ్ళను చూసి నొచ్చుకుని ఇంట్లోంచి పారిపోయినావా నాయనా ?

ఇంటికొచ్చెయ్యి బాబూ.. నిన్నెవరూ ఏమీ అనరు. రెండ్రోజుల్లో రాష్ట్రం నీ చుట్టూనే తిరుగుతుంది లే! నీ ప్రాణాలకు ఒక 10 మంది నల్ల పిల్లుల్ని అడ్డు పెడతాం గానీ, గమ్మున టీవీ ల్లోకీ, పత్రికల్లోకీ తిరిగి రా బాబూ !

గమనిక : పై ఫోటో లోని వ్యక్తి, 26 నవంబరు 2008 తేదీ రాత్రి 9:30 గంటల నుంచీ కనిపించట్లేదు. తప్పిపోయినపుడు తెల్లని కుర్తా, పైజామా ధరించి ఉన్నారు. నిద్రలోనూ, మెలకువ లోనూ జై మహరాష్ట్రా అంటూ అరవడం అలవాటు. కేవలం మరాఠీ లో నే మాట్లాడగలరు. చత్రపతి శివాజీ మేనల్లుడి నని ఆయన నమ్ముతూ ఉంటారు. ఆచోకీ తెలిపినవారికి ఆకర్షణీయమయిన బహుమతులు ఇవ్వబడును.

18/11/2008

ఒక కప్పు టీ !

మనసు లో బ్రెమ్మాండమైన టీ పార్టీ ని ఊహించేసుకుంటూ చిన్న విషయం చెప్పాలి. టీ తో పాటూ సమోసాలు బావుంటాయా - వేడి వేడి ఉల్లి పకోడీలు బావుంటాయా అన్నది కాదు ఇక్కడ సమస్య ! సమస్య అంతా టీ తోనే ! నాకు ఈ మధ్య చాయ్ చమక్కులు ఎక్కువయ్యాయి. చీటికీ మాటికీ టీ తాగాలని అనిపిస్తూంది.


ఒక్కో సారి నాకు పిచ్చి ఎక్కుతుంది. టీ తాగాలని! చాయ్ చాయ్ అని పలవరించేస్తూనే పని చేస్తూ ఉంటాను. ఏమాట కామాటే చెప్పుకోవాలి - మా ఆఫీసు లో చాయ్ చాలా బావుంటుంది. కానీ మరీ కుంచెమే దొరుకుతుంది. అదీ పూర్తి పాలలో మరిగించిన ఇరానీ చాయ్ లాంటి చాయ్ ! అసలు ఇరానీ చాయ్ ఎందుకంత బావుంటుంది ? అసలే వాతావరణం చల్లగా ఉంది. చాయ్ కావాలా అని ఎవరన్నా అడగడమే ఆలీశం... నేను ఆవేశంగా బయల్దేరిపోతున్నాను.


సాయంత్రం అందుకే , ఇంటికి రాగానే ఇన్ని మిరియాలు దంచేసి, నీళ్ళలో మరిగించేసి, అంత పంచదార పోసేసి, మరిన్ని పాలు పోసేసి(అఫ్ కోర్స్ - టీ పొడి కూడా వేసేను)- టీ కాచేసి, తాగేను. ఆకాశం లో చుక్కలూ, చందమామా, మేఘాలూ అన్నీ కనిపించేయి. (చాలా బావుందని అర్ధం)


చాయ్ అంటే పిచ్చే ! చలి లో మేమిద్దరం (నేనూ, హీరో )ఇండియన్ టీ తాగుదామని ఒక అజాద్ - కాష్మీరు వాడి దుకాణానికెళ్ళి మూడు వేళ్ళు చూపించి షుగర్ అంటే - చెక్కగా యేలకులు దంచి వేసిన ఇంగ్లీష్ చాయ్ - స్కిం చేసిన పాలు కొంచెం కలిపి, మూడు స్పూన్ల పంచదార పోసి, పాయసం లా చేసిస్తే, చప్పరించుకుంటూ తాగేవాళ్ళం బెడ్ ఫోర్డ్ లో ! (ఇంట్లో చేసుకోవచ్చు గానీ - చలి లో బయట చాయ్ తాగడం భలే కమ్మగా ఉంటుంది - వర్షం లో కూడా !!!)


పై ఇంట్లో ఉండే తమిళ స్నేహితురాలు అల్లం పిండి (మీరు సరిగ్గానే చదివారు - గ్రౌండ్ జింజర్) వేసి మరిగించి చేసే చాయ్ కూడా ఇష్టమే. అసలు చాయ్ అనే బ్రహ్మ పదార్ధం కలిస్తే, పంచదార ఉన్నా, లేకపోయినా, పాలు ఉన్నా లేకపోయినా - ఇంగ్లీష్ చాయ్ లాగా వేడి నీళ్ళ పాళమైనా - చాయ్ అంటే తెగ ఇష్టమైపోయింది ఆ మధ్య !


మా ఫ్రెండ్ అయితే పాల లో మిరియాలూ, దాల్చిన చెక్కా, అల్లమూ కలిపి దంచి వేసి, దాన్లో చాయ్ పత్తీ మరిగించి బ్రెహ్మాండమైన చాయ్ తయారు చేస్తుంది. అలా చెయ్యాలని చాలా సార్లు ప్రయత్నించి - ఆ టేస్ట్ వచ్చినా రాకపోయినా ఆ టీ మాత్రం శుబ్బరంగా సేవించేసే దాన్ని. హీరో తో కలిసి ఊటీ వెళ్ళినపుడూ బోల్డన్ని టీ వెరైటీ లు తెచ్చి అందరికీ గిఫ్టులిచ్చేము. అందులో మసాలా టీ, చాక్లెట్ టీ - కారం టీ కూడా ఉన్నాయి.


టీ పిచ్చి ఈ మధ్య ఎక్కువ అయింది. అయితే తాగడానికే వీలు చిక్కట్లేదు. స్ట్రాంగ్ టీ - అంటే కొంచెం ఎడం. టీ అంటే అంత చిక్కగా ఉండకూడదూ, రంగూ ఉండకూడదు, రుచి కూడా మరీ ఉండకూడదు. ఇదేమి తిక్క కోరిక అని ఆశ్చర్యం గా ఉందా ? ఇలా అయితేనే ఎన్నిసార్లన్నా తాగగలం. రంగూ రుచీ చిక్కదనం - ఏడ్ గుర్తొచ్చిందా ? టీ ఏడ్ లు ఎప్పుడైనా చూసారా ? అమ్మాయికీ అబ్బాయికీ ఈ బాగ్ బక్రీ చాయ్ వల్ల పెళ్ళి నిశ్చయం అయిపోతుంది. జెమినీ చాయ్ వల్ల కుటుంబం లో సుఖ శాంతులు వెల్లి విరుస్తాయి. కేరళా వాళ్ళయితే మరీనూ - అందరూ కలిసి కావ్యా మాధవన్ పెళ్ళి అయితుందని ఏడుస్తున్నారా ? అదేదో 'కణ్ణన్ దేవన్' టీ మాత్రం కొనడం మాన్లేదు.


గేదె పాలలో కలిపే ఏ బ్రాండ్ టీ అయినా అత్భుతమే ! నేనూ ఎవెరీ డే మిల్క్ పౌడర్ తో పాలు చేసి చాయ్ చేస్తా.. నాకయితే పర్లేదు గానీ చుట్టు పక్క వాళ్ళే విచిత్రంగా చూస్తారు. ట్రైన్ లో టీ లా ఉందని ఆక్షేపిస్తారు. ఎలా ఉన్నా.. అనవసరం. టీ కదా - తాగేయడమే.


మా తోటికోడలు బ్రహ్మాండమైన లెమన్ టీ, ఇంకేదో - వాము తో ఒక రకం టీ, దాల్చిన చెక్క తో ఒక రకం టీ, ఇలా చాలా వెరైటీ లు చేస్తారు. వీటన్నిటి కన్నా మా హాస్టల్లో నీళ్ళు నీళ్ళు గా అతి పల్చగా చేసే టీ పెద్ద గ్లాసులో పట్టేసుకుని తాగేయడం చాలా రిఫ్రెషింగ్ గా ఉండేది. ఆ టేస్ట్ ఇంకెక్కడా రాలేదు. ట్రైన్ కేటరింగ్ వాడు కూడా ఆ రుచి, ఆ మేజిక్ తీసుకు రాలేడు. 'ఇంత చాయ్ పత్తీ అప్పివ్వండి వొదిన గారూ' (ఈ రోజుల్లో అలా పిలుచుకోవట్లేదు - మాలాంటోళ్ళు వయసు మీద పడినట్లుంటుందని పిలవనివ్వడం లేదు కూడా) అని ఎవరన్నా అడిగినా నాకు వారంటే ఇస్టమొచ్చేస్తుంది. ఇద్దరం చాయ్ క్లబ్బు సభ్యులం కాబట్టి ! చలికాలానికీ - తేనీరు సేవనానికీ దగ్గర సంబంధం ఏదో ఉన్నట్టుంది.అయినా - ఈ రోజు నాకేదో అయింది - టీ టీ అని పలవరించి, టీ తాగి, టీ గురించి రాసేస్తున్నాను. ఇందుమూలంగా తెలియజేయునదేమనగా, నాకు టీ ఇష్టం (అన్ని సార్లూ కాదు గానీ.. ఇంటికెళ్తే అమ్మ చేతి ఫిల్టర్ కాఫీ రుచి కి ఇంకేదీ సరి కాదనుకోండి!!!!) కాబట్టి మంచి టీ తయారీ విధానాలు తెలియచేస్తే మీ పేరు చెప్పుకుని కమ్మని చాయ్ తాగుతూ బ్రతికేస్తా.

10/11/2008

నా వీర గాధ - పార్ట్ 3

ఇదంతా రాస్తున్నానని తెలిసి ఒక ఫ్రెండ్ చేతుల్లో చీవాట్లు తిన్నాను. నీకు ఈ హిస్టరీ అంతా దునియాకి చెప్పాల్సిన అవసరం ఏమిటి ? నీకు సానుభూతి కావాలి - నీకు ఆ స్పెషల్ ట్రీట్మెంట్ కావాలి - అందుకే ఇదంతా తవ్వుతూ - గోల చేస్తున్నావని అరిచాడు. నేను తనకి విషయం ఎంత చెప్పినా అర్ధం చేసుకోలేదు. కోపం తగ్గనే లేదు. ఇంతకీ నా అత్యంత సన్నిహిత విషయాలు చెపుతున్నందుకు నాకూ ఆశ్చర్యంగానే ఉంది.

అయినా ఇది ఎవరికో ఒకరికి పకిని వస్తుందని ఆశించే రాస్తున్నాను. ఇది స్పూర్తి కలిగించడానికి కానే కాదు. అసలు అక్కడంత సీన్ లేదు. ఇది చెప్పడానికి కారణం ఒక్కోసారి పరిస్థితులు ఇలా కూడా ఉండొచ్చు ! నడుం నొప్పి చాలా కామన్ మనలో ! ముఖ్యంగా అమ్మాయిలలో ! సాఫ్ట్ వేర్ ఇంజనీర్లలో - ఎక్కువ దూరాలు ద్విచక్ర వాహనం డ్రైవ్ చేసే వాళ్ళలో ! ఇలా ఎందరో మనలో ఉండొచ్చు హెల్ప్ కావల్సిన వాళ్ళు.


దీనికి చికిత్స ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం వొళ్ళు దగ్గర పెట్టుకుని అంటే - బరువులు ఎత్తకుండా, కింద కూర్చోకుండా (నడుము నొప్పి ఉందని కింద నేల మీద పడుకుంటారు కొందరు - కానీ దాని వల్ల హానే ఎక్కువ జరుగుతుంది) - మంచి ప్రోటీన్ డైట్ తీసుకుని - ఇలా కొన్ని మార్పులు చేసుకుంటే, (వెస్ట్రన్ కమోడ్ వాడడం కూడా - ఒక మంచి విషయం) చాలా వరకూ రిలీఫ్ దొరుకుతుంది.


నా వరకూ - నేననుభవించిన కష్టం - ఇంకెవరూ అనుభవించకూడదని ఒక ఆశ. అయితే దురదృష్ట వశాత్తూ ఎవరికైనా ఇలాంటి బాధ ఎదురవచ్చు. దీని వల్ల ప్రపంచం తల్లక్రిందులైపోదు అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను.

పెళ్ళి కావల్సిన ఆడపిల్లలకు ఇలాంటి సర్జరీ చేయించడానికి అమ్మా, నాన్నలు త్వరగా ముందుకు రారు. ఇది చాలా తప్పు. ఎవరో ఏదో అనుకుంటారని కాక, మన పిల్లని రక్షించుకోవడానికి మనం ప్రయత్నించడం హ్యూమన్ !


ఈ పరిస్తితుల్లో నా వరకూ అయితే, లైఫ్ చాలా మంచి twists and turns తీసుకుంది. ముఖ్యంగా మా చుట్టాల్లో అందరికీ, మా హీరో చాలా ప్రియమైన వ్యక్తి అయిపోయారు - హీరో, నేనూ 'ఎవరూ - ఏమిటి - ఎక్కడా ?' - అని ప్రశ్నలు వేసుకోకుండానే, (ఝుంపా లాహిరి ఇంటర్ ప్రిటర్ ఆఫ్ మాలడీస్ లో చెప్పినట్టు ఎవర్నో ఒకర్ని పెళ్ళాడాలి కాబట్టే) పెళ్ళి చేసుకున్నాం !

ఆ తరవాత హీరో కారణం చెప్పేరు. వాళ్ళ నాన్నారు (మా మావయ్య గారు) ఈ అబ్బాయి ముందు రెండు ఆప్షన్స్ ఉంచేరుట - అవి 'యెస్!' మరియూ 'ఓకె!' - కాబట్టి మా హీరో నిర్ణయం ఏమో గానీ, పైన స్టార్లు మాత్రం మమ్మల్ని కలిపాయి. ముఖ్యంగా ఇద్దరి అమ్మకూ నాన్న కూ నచ్చిన సంబంధం. ఇలా.. కేవలం తల్లీ దండ్రీ నిర్ణయించేరు కాబట్టి మా పెళ్ళి జరిగింది.

నేను కళ్ళు మూసుకొని ఒప్పేసుకున్నా, హీరో కూడా కొత్త లో నాతో బెరుగ్గా మాటాడినా కొన్నాళ్ళకే ఈ అబ్బాయి లో చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని అర్ధం అయిపోయింది. మొత్తానికి వొళ్ళు బాగు చేయించుకుని, దిల్లీ షెహర్ కి ప్రయాణం కట్టాను. స్టేషన్ కి నా ఫ్రెండ్స్ వచ్చారు - తెల్లారి మంచులో, చీకటిలో ! ఇక్కణ్ణుంచీ వీళ్ళకి నాతో కంచి గరుడ సేవ అయిపోయింది. పాపం చాలా చాలా సాయం చేసారు. నేను ఆఫీసుకి వెళ్ళాలంటే, హాస్టల్ లో ఎవరో ఒకరు నాతో పాటూ ఆటో లో సాయం వచ్చేవారు. దాదాపు అందరం రైసినా హిల్ (రాష్ట్రపతి నిలయం, సౌథ్ బ్లాక్, నార్త్ బ్లాక్ ఉన్న కొండ) కి అటూ ఇటూనే ఉద్యోగాలు చేస్తుండటంతో ఎవరో ఒకరు షేరింగ్ ఆటో నాకోసం ఎరేంజ్ చేసే వారు.

తిరిగొచ్చేటపుడు మా ఇంకో ఫ్రెండ్ అటుగానే వెళ్తూ, నన్ను నా ఆఫీస్ దగ్గర పిక అప్ చేసుకునేది. హాస్టల్ మెస్ లోంచీ భోజనం నాకు బెడ్ డెలివరీ అయ్యేది. ఈ రోజుల్లో కూడా రూం మేట్ కొంచెం హింస పెట్టినా, ఫ్రెండ్స్ మాత్రం, వెన్ను దన్నుగా నిలిచేరు.

ఆఫీసు లో కూడా బోల్డంత సాయం ! అప్పటికి నేను కోలుకోవడం దాదాపు ముగిసినట్టే, నడక వచ్చేసింది, మెట్లెక్కడం వచ్చేసింది, అయినా, బస్ ఎక్కలేకపోవడం, త్వరగా నడవలేకపోవడం - తూగుతూ, నడవడం లాంటి ఫీట్లు జరిగేవి.

ఇలాంటి రోజుల్లోనే హీరో ఎందుకో పనుండి డిల్లీ వచ్చేరు (నన్ను చూడటం, కలుసుకోవడం, తెలుసుకోవడం కూడా ఒక పనే !) అప్పటికి పెళ్ళి కి 2 నెల్ల టైం ఉంది. హాస్టల్ బయట హీరో ని చూసి - ఎందుకో కొంచెం స్మార్ట్ గా నడుద్దామని ట్రై చేసి, కాళ్ళు సహకరించక, ఢాం అని కింద పడ్డాను. తిరిగి నా అంతట నేనే లేచేంత శక్తి లేనే లేదు. అపుడు హీరో నే నన్ను పట్టుకు లేపారు ! (మా కనెక్షన్ మొదలయింది.. కానీ) నా పాదం లో చిన్న ఫ్రాక్చర్ అయింది.

ఫ్రాక్చర్ సంగతినాకు తెలియలేదు. తిరిగి పైకొచ్చి, (2 అంతస్థులు మెట్లెక్కి) నాలుగయిదు పెయిన్ కిల్లర్లు వేసుకుని, స్పోర్ట్ షూ ఒకటి గాట్టిగా పాదాలకు బిగించేసి, మా అబ్బాయి తో దిల్లీ దర్షన్ కు బయలు దేరాను. నేనే డ్రైవింగ్, తను నా వెనుక పిలియన్ ! ఎలానో - కుంటుకుంటూ లోటస్ టెంపుల్ చూపించాను, (అక్కడ బాగా నడవాలి) - తనకి ఏదో షాపింగ్ పని ఉంటే పాలికా, చాందినీ చౌక్, కనాట్ సర్కస్ - అన్నీ తిప్పాను. రాత్రి స్టేషన్ దగ్గర వొదిలేసి, ఇంటికొచ్చి ఇంకోసారి మంచం మేద ఢాం అని పడిపోయాను.

రెండురోజులకు నొప్పి తగ్గక, కాలు ఫుట్ బాల్ లా వాచేస్తే - అపుడు జంతర్ మంతర్ పక్కన ఒక చారిటీ హాస్పిటల్ లో ఎక్స్-రే (అక్కడే మాకు దగ్గర్లో ఒక ఎక్స్-రే మిషీన్ ఉండింది) తీయించుకుని, డాక్టర్ కు చూపించుకున్నా. కచ్చా ప్లాస్టర్ వేయాలన్నరు. కానీ అది చారిటీ ఆస్పత్రి కాబట్టి, బయటే వేయించుకోమన్నారు.

బయట - సరే చూద్దాం అనుకుంటూండగా, మా ఫ్రెండ్స్ కుట్ర చేసేసి, నన్ను రాం మనోహర్ లోహియా హాస్పత్రి ఎమర్జెన్సీ కి రాత్రి కి రాత్రి తీసుకెళ్ళి ప్రభుత్వ కచ్చా ప్లాస్టర్ వేయించేసారు.


మావయ్య కొడుకు డెహ్రాడూన్ లో ఉన్నాడని చూడ్డానికొచ్చి డిల్లీ లో ఆగి, నన్ను కలవడానికి మా ఆఫీసుకొస్తే నా కవచం, కాలికి తెల్లని ప్లాస్టర్ తో కుంటుకుంటూ దర్శనం ఇచ్చాను! ఈ స్థితి లో మావయ్య నన్ను చూసి చాలా ఫీలయిపోయాడు - కానీ కనిపించనీలేదు.

ఇది చిన్న ఫ్రాక్చర్ కాబట్టి, పెళ్ళికి ముందే ప్లాస్టర్ విడిపోయింది. నన్ను, నా సామాన్లనూ ఫ్రెండ్సే బండి ఎక్కించారు. మొత్తానికి ఎలానో వైజాగ్ చేరాను. నా పెళ్ళికి ఒక్క వస్తువా నేను కొనుక్కోలేదు. రాయల్ గా వెళ్ళి, అమ్మ, నాన్నా ల షాపింగ్ లో, అక్కయ్య, చెల్లిల్ల ప్లానింగ్ లో పెళ్ళి కొడుకు వాళ్ళు మా వూరొచ్చి చేసుకున్నారు కాబట్టి - ఒక్క సేఫ్టీ పిన్ను కూడా కొనుక్కోకుండా పెళ్ళి చేసేసుకున్నాను. పెళ్ళి - పీటల మీద కాకుండా బెంచీల మీద అయింది.


అయితే మా అబ్బాయి మాత్రం ఈ కుంటుతూ, నొప్పితో వికారంగా (మొహంలో నవ్వు అనేదే ఉండేది కాదు) ఉన్న పెళ్ళి కూతుర్ని తన ఫ్రెండ్స్ కీ చుట్టాలకూ పరిచయం చెయ్యడానికి సిగ్గుపడిపోయేవాడు.


మేము కస్టం-మేడ్ ముగుడూ పెళ్ళాలం కానే కాదు. అయితే మేమిద్దరం కోతులే కాబట్టి తొందరగా కలిసిపోయాము. ఇప్పటికీ వీరోచితంగా కొట్లాడుకున్నా, తన పట్ల నాకు 'కృతజ్ఞత' / తనకి నా పట్ల 'ఏదో ఉద్ధరించేనన్న ఫీలింగ్ / జాలి ' లాంటి సంగతులు రాకుండా పిచ్చ పిచ్చగా కొట్లాడుకుంటాం. ఇప్పటికీ - నేను చెయలేని పనులని ఏకరువు పెడుతూ ఉంటాను. నా బలహీనతలు తనకు తెలుసు. నాకోసం తను ఉన్నాడన్న నమ్మకం కూడా నాకుంది.


నాకు వీటన్నిట్నీ మించిన విషయం - నా చుట్టు పక్కల వారి సహానుభూతి. (సానుభూతి కాదు- సానుభూతి కోరుకోవాల్సిన పరిస్థితి లో నేను లేదు. అదంతా అయిపోయింది) మనిషి కి మనిషి సాయం. మనిషి కి మనిషి అండ ! ఇలా చుట్టు పక్కల మనుషుల్లో పోసిటివ్ స్పిరిట్, సాయపడే తత్వం - వీటిని గమనించే అవకాశం, అమ్మా నాన్నల గ్రిట్, దేవుడిచ్చిన శక్తి - ఇవన్నీ నా మీద నాలో ఉండే జాలి (ఇది నాకే ఎందుకయ్యింది ? నేనేమి చేశాను ? లాంటి ఫీలింగ్స్)ని ఎదుర్కోవడానికి సహాయపడ్డాయి.

వీటి మధ్యలో పెళ్ళి జరగడం, ఒక్క సారి మార్పు - అదిచ్చిన టెన్షన్, కొత్త రోల్ లో నన్ను నేను హెల్ప్ లెస్ గా ప్రొజెక్ట్ చేసుకోకుండా ఉండటానికి పడిన తంటాలలో త్వర త్వరగా నా మానసిక పరిస్థితి మెరుగుపడింది. ట్రాన్స్ఫర్ కూడా అయ్యాకా, కెరీర్ మాత్రం బాగా దెబ్బ తిన్నది - కానీ ఏదో సాధించానన్న తృప్తి మిగిలింది. పెళ్ళి తర్వాత హీరో తో కలిసి ఉండటానికే మంచి కెరీర్ ను త్యాగం చేసేసాను. ఇపుడు ఈ సర్దుకుపోవడాల్లో సర్దుకుపోయాను.

ఇదంతా - కేవలం నా గురించి చెప్పడానికి కాకుండా - ఎవరైనా, నా లాంటి కష్టాలు ఫేస్ చేస్తున్నట్టయితే వాళ్ళకి ఈ అనుభవాలు పనికి వస్తాయేమో అని చెప్తున్నాను.

ఈ అనుభవం నాలో ధైర్యాన్ని కలిగించినా, (కొన్ని విషయాల్లో చాలా ధైర్యం, కొన్ని విషయాల్లో చాలా సున్నితత్వం వచ్చాయి అని నమ్ముతాను) కలిగించకపోయినా, నొప్పిని నేను తట్టుకోగలననీ, ఎదుర్కోగలననీ, ఒక నమ్మకాన్నిచ్చింది.

నొప్పి అలవాటయిపోవడం ఒక వింతైన ఫీలింగ్. నిజానికి కాన్స్టెంట్ (constant pain) నొప్పి, బాధ అనుభవించే మనిషి తనలో అహాన్ని మొదట జయిస్తాడు. నొప్పి ముందు మనమెంత ?! అనే ఫీలింగ్ కలుగుతుంది.

ఈ నొప్పిని జయించడంలో నాకు సహకరించిన అందరికీ, నా డాక్టరు కీ, డా.వినోద్ కీ, అఫ్ కోర్స్ అమ్మా నాన్నలకీ, చెల్లీ, అక్కలకీ, నడక నేర్చుకుంటూ పడిపోయిన నన్ను ఎన్నో సార్లు లేపిన సురేష్ కీ, ప్యూర్ వెజిటేరియన్ అయినా, హాస్టల్ లో నాకు మంచి ఫుడ్ లేదని చెప్పి ఉడికించిన ఎగ్స్ తెచ్చిచ్చి - నన్ను తన బండి మీద మహారాణిలా తిప్పి - ఎన్నో సార్లు నాకు వంట చేసి భోజనం పెట్టిన నా బెస్ట్ ఫ్రెండ్స్ కీ - ఆఫీసులో కొలీగ్స్ కీ, నవ్విస్తూ, నా కోసం ప్రార్ధిస్తూ నన్ను గుడ్ స్పిరిట్స్ లో ఉంచిన మావయ్యలూ, చిన్నాన్నలకూ, అత్తలకూ, ముఖ్యంగా సమయానికి వాకర్ అరువు ఇచ్చిన నానమ్మకీ - ఇలా ప్రతీ ఒక్కరికీ బోలెడన్ని థాంకులు ! మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. మీ అందరి కడుపునా పుట్టకుండానే ఎలానో ఓలా వచ్చే జన్మల్లో తీర్చేసుకుంటాను.


అన్నట్టు హీరో కి కూడా థాంక్స్ ! క్రైసిస్ లో నా చెయ్యి పట్టుకున్నందుకు ! నాతో పాటూ ఈ పెళ్ళి అనే సర్కస్ లో చిక్కుకుపోయినందుకు !


ఇప్పటికీ - ఇంకా ఫీట్లు జరుగుతూనే ఉన్నాయి. ఏవో చిన్నా, చితకా!! - కానీ నాకు మాత్రం భలే ధైర్యం వచ్చేసింది. ఇలాంటి చిన్న ఫీట్లు ఏముంది లే - పెద్ద ఫీట్లు చేసేసిన అనుభవం ఉంది - అని లెక్చర్ ఇచ్చేసుకుంటా, నాకే నేను ! ఇదో కొత్త అహం ! అయినా బావుంది. ఈ అహాన్నే రక్షణగా చేసుకుని బ్రతికేస్తున్నాను.


అన్నట్టు - ఆ తరవాత వచ్చే ముందు, రాష్ట్రపతీ నిలయం - ముఘల్ గార్డెన్ తిరిగాను హీరో తో (అంటే బోల్డంత నడక !) సర్జరీ జరిగిన ఏడాదికల్లా, పూనే - బెంగుళూరు హైవే లో చిన్న చిన్న కొండల మీదికి సాయం లేకుండానే షికారుకెళ్ళాను. ఆ కొండ ఎక్కినపుడు - ఏడాది క్రితం పరిస్థితి కీ అప్పటికీ తేడా తలచుకొని ఎవరెస్టు ఎక్కినంత ఆనందంగా ఫీల్ అయ్యాను. ఈ ఆనందం నాలో చాలా గర్వాన్ని నింపేసింది. వస్తే వొచ్చింది నడుము నొప్పి - నన్ను నాకే హీరోయిన్ లా ఫీల్ అయ్యేలా చేసింది - అనుకున్నాను.

ఈ తరవాత నుండీ - ఎవరు నొప్పన్నా - నా మనసు ఆ నొప్పిని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అదీ విషయం.

09/11/2008

నా వీర గాధ పార్ట్ - 2

నిద్ర లేచేసరికీ, అదేదో తెలియని నొప్పి శరీరం అణువణువునా నిండిపోయి పిచ్చి కోపం వచ్చేసింది. ఆపరేషన్ ఒక ఆరు గంటలు పట్టిందంట. అమ్మా నాన్నా, సినిమాల్లో లాగా బయట కారిడార్లో పచారాలు కొంచెం సేపు చేసి తర్వాత తిరగలేక, కూర్చున్నారు. వైజాగ్ లో ఉంటూన్న మావయ్యలూ, అత్తయ్యలూ, పెద్దమ్మ, పెదనాన్నలూ, కసిన్లూ - అందరూ వచ్చేరు. మధ్యాన్నం వెళ్ళాను లోపలికి. రాత్రి వచ్చేను. ముందు రోజు ఏమి తిన్నానో గానీ, ఆ రోజు ఏమీ తిన్లేదు. ఆపరేషన్ అయ్యాకా స్ప్రైట్ కూల్ డ్రింక్ (లేదా మౌంటైన్ డ్యూ) ఇస్తానని అమ్మ ప్రామిస్ చేసింది. కాబట్టి ఏమీ తాగలేదు కూడా.


నన్ను తిరగేసి పడుకోబెట్టి, వెన్ను మీదంతా ఇన్సిషన్ చేసి, చీల్చి, చేతులు పెట్టి - (ఓపెన్ సర్జరీ) చేసారు. మళ్ళా ఎంత అత్భుతమో తెలుసా, ఇన్స్ట్రుమెంటేషన్ అయ్యాకా, కోసిన చర్మాన్ని కలిపి కుట్టేసి, ఏదో టేప్ వేసి అతికించేసి, నన్ను మళ్ళీ వెన్ను మీదే పడుకోబెట్టేఅసి, స్ట్రెచర్ మీద తీస్కొచ్చి పోస్ట్ - ఓప్ రూం లో వేసేసారు. నాకు ఓపెన్ సర్జరీ చేస్తారు కాబట్టి, నా మట్టి బుర్ర, కుట్లు హీల్ అయ్యేదాకా పక్కకు తిరిగి పడుకోవాలేమో అనుకుంది. కానీ, నన్ను ఆ కుట్ల మీదే పడుకోబెట్టేసారు. చాలా ఆశ్ఛర్యం వేసింది. ఏమి మెడికల్ సైన్సు రా బాబూ.. ఏమి టెక్నాలజీ - అబ్బ సూపరు - అనుకున్నా.


ఆ పోస్ట్ ఆప్ లో స్ట్రెచెర్ నుంచీ మంచం మీదికి షిఫ్ట్ చేస్తున్నపుడు వాళ్ళు చేస్తున్న గోలకి తెలివొచ్చింది. నా వెయిట్ కి కనీసం ఆరుగురు ఆ దుప్పటిని పట్టుకునుంటారు. నొప్పి - మంటా, నీర్సం, దాహం, కోపం - అన్నీ నన్ను కమ్మేశాయి. వీటన్నిట్లోంచీ తేరుకుని ఇపుడేమి చెయ్యాలి అని ఆలోచించి 'ఊహ్ ఆహ్ - అమ్మా.. అమ్మా..' అని గోల మొదలు పెట్టాను. నాకు నిజంగానే నొప్పి. శరీరం అంతా నొప్పి. ఎవరన్నా నా దుప్పటి ముట్టుకుంటే, నొప్పి.


అమ్మ పాపం నన్ను చూడ్డానికొచ్చింది. నాకు కోపం వచ్చ్చింది - స్ప్రైట్ తేలేదు. ఇంకా కోపం వచ్చింది. (నొప్పి వల్లే అన్నమాట - విచక్షణ లేదు) మొహం తిప్పేసుకున్నాను. అమ్మకి బాధ అనిపించినా, నా దుప్పటి సర్దడానికో, కొప్పరి నూనె, జండూబాం, ఏదన్నా రాయడానికో నన్ను తాకబోతే నాకు టెన్షన్. ఎందుకో నా కాలి వేళ్ళు ఎవరు తాకినా నొప్పి. పెలివిస్ నుండీ, పాదం వరకూ మాత్రం స్పర్శ లేదు. నర్సులు నా కాళ్ళ కి హాట్ వాటర్ బేగ్ పెట్టారు - రాత్రంతా - చర్మం కాలి మాడిపోయింది. అయినా నాకు తెలియలేదు.


ఆ రోజు - దాహం దాహం.. ఎవరూ నీళ్ళివ్వలేదు. రాత్రంతా గోల గోల చేసుంటాను. ముక్కుతూ, మూలుగుతూ, ఎ.సి గది అయినా చెమటలు ధారాపాతంగా కారిపోయాయి. ఆ రాత్రి ఎలానో గడిస్తే చాలానిపించింది. నా ఆపరేషన్ మాత్రం గ్రాండ్ సక్సెస్. కాకపోతే, హై బీ పీ కంట్రోల్ కాలేదు 5 రోజుల దాకా. ఈ అయిదు రోజులూ పోస్ట్-ఓప్ లో నా (నాలుగు రాత్రులు) మాత్రం సూపర్. నాకోసం మా అమ్మా, నాన్నా, ప్రే చేసారు. పిన్ని ప్రేయర్ మౌంట్ లో ప్రేయర్ చేయించింది. మావయ్య - యోగదా సత్సంగ మిషన్ లో ప్రార్ధన చేయించారు. కసిన్ లూ, ఆంటీ లూ రేకీ ఇచ్చారు. నేనూ దేవుణ్ణి ప్రార్ధించాను. దేవుడి కి చాలా థాంక్ ఫుల్ అయిపోయాను. ఆ మరుసటి రోజు అమ్మ, నా కాలు కాలిపోయిన విషయం చూసుకుని, బాధపడి, నాన్న తో చెప్పి నాకో చిన్న మౌంటెన్ డ్యూ బోటిల్ కొనిపెట్టింది.


మొత్తానికి నా జీవితం లో ఒక ఎపిసోడ్ ముగిసింది. వెన్ను లో తాళ్ళు బిగిసాయి. ఇక వెన్ను పాము (స్పైనల్ కార్డ్) ని ఎవరూ నొక్కి పచ్చడి చెయ్యరు. నా బ్రతుకు నేను బ్రతకొచ్చు. అయితే ఇక్కడో తమాషా జరిగింది. నేను పూర్తి గా స్పృహ లో కి వచ్చాకా, నా ఎడమ కాలు అస్సలు నా మాట విన్లేదు. డాక్టర్ వచ్చి ఈ కాలు ఊపమ్మా, ఆ కాలు కదుపమ్మా - అంటే, కుడి కాలు కొంచెం అన్నా కదిలింది. గానీ ఎడమ కాలు మాత్రం కదల్లేదు. నా మెదడంతా ఎన్ని సారులు చెప్పినా నా మాట విన్లేదు. అయినా కాలు పోలేదు అనడానికి గుర్తుగా, వేళ్ళ లో భయంకరమైన నొప్పి. కానీ ఒక్క సెంటీ / మిల్లీ మీటరు కూడా కదలదు.


క్రాంప్స్ మాత్రం వచ్చాయి - రాత్రంతా నిద్ర పట్టనీకుండా! వీట్ని స్పాసం లు అంటారు. ఇవి మన మెదడు కు చెప్పకుండా - అసంకల్పితంగా వెన్ను నరాలు చేసే డిస్కో అన్న మాట. అంటే వరుస పెట్టి - నిముషానికొకటి చొప్పున కాలు మొదలు నుంచీ చివరి దాకా లోపల ఒక జెర్క్ లా - (కాలు విదిలించి నట్టు) వస్తూంది. నేను నా బ్రెయిన్ తో చెప్పాను - 'స్టోప్ దిస్ నాన్సెన్స్-నాకు నిద్రొస్తుంది' అన్నా. బ్రెయిన్ నా ఎడమ కాలితో చాలా నెగోషియేట్ చేసింది. మళ్ళీ నా దగ్గరకొచ్చి, లాభం లేదు, తను నా మాట వినట్లేదు అని చెప్పింది. తెల్లారనీ.. డాక్టర్ వస్తే నీ పని చెప్తాను - అని కోప్పడి ఇంక నిద్ర రాదు కనుక జపం చేసాను. ఆ రాత్రంతా! స్పాసం లు (Spasm) నాకు ఒక సంవత్సరం దాకా వచ్చాయి రాత్రి నిద్ర పోతున్నపుడు. బాగా అలసిపోయిన రోజు నిద్ర లో మరీ ఎక్కువగా వచ్చేవి.


ఆ రాత్రే కాదు. అక్కడ ఉన్నన్ని రాత్రులూ నాకు నిద్ర వచ్చేది కాదు. ఆ రూం లో కనీసం పది మంది పేషెంట్లు రక రకాల సీరియస్ కండిషన్ లో ఉండే వారు. ఒక ముసలాయన ఆక్సిడెంట్ లో మల్టిపుల్ ఫ్రాక్చర్స్ తో చేరారు. నా పక్క బెడ్ మీదింకో ముసలావిడ. ఇంకొంత దూరంలో ఒక నౌ జవాన్ అబ్బాయి... మిగతా బెడ్ ల మీద కూడా వస్తూ పోతూ ఉండే వారు. వీళ్ళతో రాత్రి పెద్ద గొడవ అయిపోయేది. నొప్పి తో వాళ్ళు చేసే ఆర్త నాదాల తో నిద్ర పట్టేది కాదు.


ఏ తెల్లారుతూండగానో నిద్ర పట్టిందా అంటే - 4:30 అయే సరికీ స్క్రబ్, టూత్ బ్రెష్షూ పట్టుకుని నర్సమ్మాయి తయార్. నిద్ర లేపేశేది. బ్రెష్ చేయించి, స్పాంజ్ బాత్ ఇచ్చి, మందులేసేసి, జడేసేసి, బెడ్ షీట్ మార్చేసి, బీపీ - అదీ - ఇదీ రికార్డ్ చేసేసి టిప్పు టాపు గా తయారు చేసేసేది. నాకు ఈ స్పాంజ్ బాత్ అంటే భయం అయిపోయేది. నా వొంటి మీద ఎక్కడ చెయ్యేసినా నొప్పే ! ఆమె మాత్రం వొదల్దూ.. ''యూ మష్ట్ కూబెరేట్ - బ్లీస్ '' అనేది. నాకు అపుడు అమ్మ పియర్స్ సోప్ ఇచ్చింది. వొళ్ళంతా పియర్స్ వాసనా.. ఆమ్మాయి రాగానే పియర్సు వాసన, ఆ వాసన తో పాటూ ఎసోసియేట్ అయిన నొప్పి - నా మెదడు లో పాతుకు పోయి, పియర్స్ అంటేనే కోపం, చిరాకు - అసహ్యం ఒక రెండు ఏళ్ళకు గానీ పోలేదు.


ఇలా లైన్ గా అందరికీ స్పాంజ్ బాత్ ఇచ్చేది. ఆ నౌ జవాన్ అబ్బాయి పాపం ఈ 17 - 18 ఏళ్ళ నర్సింగ్ స్టూడెంట్ ఎంతో ప్రొఫెషనల్ గా స్పాంజ్ బాత్ ఇస్తూంటే ఫీల్ అయిపోయే వాడు. నాకు చాలా బాధ కలిగేది. నేనేవో అనుభూతించిన రోజులు అవి. ఆ స్టూడెంటమ్మయిల మీదా, ఆ హాస్పెటల్ వాతావరణం మీదా గౌరవం కలిగించిన రోజులు.


మరుసటి రోజు డాక్టర్ గారు వచ్చి నా ఎడమ కాలు తోనూ కుడి కాలు తోనూ మాట్లాడారు. అవి ఆయన మాట కూడా విన్లేదు. ఆయన వెంటనే మా నా కేస్ షీట్ మీద 'ఫిసియో థెరపీ' అని రాశేసారు. ఆ సాయంత్రం వినోద్ అనే అబ్బాయి నన్ను చూడటానికి వచ్చాడు. ఆ అబ్బాయి కళ్ళూ, జుట్టూ బావున్నాయి. నాకన్నా చిన్న వయసే ఉండొచ్చు. తను నా ఫిసియో థెరపిస్ట్ !


అప్పటి దాకా ఫిసియో థెరపిస్టు గురించి నానమ్మ దగ్గర విన్నాను గానీ ఎపుడూ చూడలేదు. నానమ్మ కి మోకాళ్ళ నొప్పి. తనకి ఇంటికొచ్చి ఫిసియో థెరాపీ ఇప్పించే వాళ్ళు. అందుకే డా.వినోద్ ని కొంచెం జాగ్రత్త గా చూశాను. ఈ అబ్బాయి మీద నాకు పెద్ద ఆశలేమీ లేవు అప్పటికి. తను నా కాలి వేళ్ళు పట్టుకుని వాటి స్పర్శని చెక్ చేసినపుడు ప్లీస్ ప్లీస్ వాటిని ముట్టుకోవద్దు - అని ఏడిచాను. నిజానికి తనే ఆ వేళ్ళని రక రకాలు గా కదిపి, వాట్లో రక్త ప్రసరణ సరిగ్గా అయ్యేలా చేసి, నా కాళ్ళతో చిన్న సర్కస్ చేసి, ఒక మూడు వారాలకు ఆ నొప్పిని ఆశాంతం తగ్గించారు. నా కాళ్ళతో సర్కస్ అని ఎందుకు చెప్తున్నానంటే, నా కాళ్ళు నా మాట వినేవి కాదు. అస్సలు కదిలేవి కావు. తనే ఆ కాళ్ళతో కుస్తీలు పడి, ఎక్సర్ సైసులు చేయించి, వాటిని నేనే లేపగలిగేలా చేయించారు. దీనికి సరిగ్గా 1.5 నెలలు పట్టింది.


డిస్చార్జ్ అయి ఇంటికి వచ్చాకా - నెల రోజులకి నా కాళ్ళు నేను చెప్పిన మాట విన్నాయి. అపుడే లండన్ ట్యూబ్ లో బాంబులు పేలాయి. నేను బెడ్ మీదినుంచే టీవీ చూస్తూ కాలక్షేపం చేశాను ఈ నెల రోజులూ. కూర్చోవడం అప్పటికి ఊహకందని విషయం. నొప్పుట్టినా, నొప్పుట్టక పోయినా, నా కుట్ల మీదే, నా వెన్ను మేదే పడి నిద్ర పోయేదాన్ని. బెడ్ మీదే నా జీవితం నడిచింది. అమ్మ మీదే ఆదారం. అసలు అమ్మ ఎవరి క్రైసిస్ లో నైనా ముందు వచ్చి నిలిచే వ్యక్తి. అయితే నేనే పెద్ద క్రైసిస్ అయిపోయాను అమ్మకి. అయినా మా అమ్మ మంచిది. నెల రోజుల పాటూ నాకన్నీ చేసింది. రోజూ ఇంజక్షన్ ఇచ్చేది, కుట్లు క్లీన్ చేసి, డ్రెస్సింగ్ చేసేది, మందూ, మాకూ చూసుకునేది, ప్రోటీన్ రిచ్ డైటూ - దాంతో పాటూ మంచం మీదే ఉంటాం కాబట్టి లావయిపోకుండా బాలన్సెడ్ డైటూ ఇచ్చేది. నా ఫిసియో థెరపిస్ట్ మాత్రం నన్ను చాలా బాగా ట్రీట్ చేశారు.


అది మరిచిపోలేని కృతజ్ఞతా భావన. కాళ్ళ ఎక్సర్సైసులు లిటరల్ గా తనే చేసేవాడు (నేను స్వంతంగా చేయలేను కాబట్టి) కొన్నాళ్ళకు బరువు కట్టి, కాళ్ళూ, చేతులూ లేపడం, మోకాళ్ళ నొప్పికి ఇంకొన్ని సూచనలూ - ఇలా.. నడుస్తూనే ఉండేది. మంచం మీంచీలేచి, ఎలా కూర్చోవాలో నేర్చుకున్నాను. ఆనక నడవటం నేర్చుకోవాల్సి వచ్చింది. అపుడే, నానమ్మ నాకు తన వాకర్ పంపించింది. ఆ రోజు నా కాళ్ళ మీద వాకర్ సాయంతో ఒక్క నిముషం నించున్నాను.


నేను నా సర్కస్ చేస్తూ ఉంటే, చిన్నాన్న గానీ మావయ్య గానీ, చెల్లి గానీ, అమ్మ గానీ, 'కర్తవ్యం లో విజయ శాంతి లా.. ఉన్నావే!' -'విజయశాంతి లా నడువు - విజయశాంతి లా స్పిరిట్ తెచ్చుకుని చెయ్యాలి - లాంటి డైలాగులేసి ధైర్యాన్ని ఇస్తూనే నవ్వు తెప్పించెసే వారు.


నాతో పాటూ నా ఫిసియో థెరాపిస్ట్ కూడా నవ్వేవాడు. రోజుకి ఒక 12 అడుగులూ - తరవాత 20 అడుగులూ, తరవాత్ 40 - ఇలా నా నడకోద్యమం మొదలయింది. అయితే, అపుడు నా వెన్నంతా కవర్ చేస్తూ ఒక పెద్ద బెల్ట్ ఉండేది. అది పెట్టుకుని గానీ మంచం మీంచీ లేచి కూర్చోకూడదు. వెన్ను నిటారుగా నిలపడానికి అది అవసరం.


సో - నా నడకోద్యమం లో ఈ బెల్టు ఒక భాగం. చిన్న మావయ్య ఈ బెల్టు పెట్టుకున్న నన్ను చూసి, అబ్బ - ఇదేదో కవచం లా ఉందే - అంటూ - ఎప్పుడూ ఇది వేసుకోమని చెప్తూ, మాయా బజార్ సినిమా లో 'కవచ మితి కవచ మితి సుభగం సుచిత్రం - రక్ష ఇతి రక్ష ఇతి పరమం పవిత్రం' అనే డైలాగ్ చెప్పే వాడు [ ఉత్తర కుమారుడికి భయం కలిగితే అల్లు రామలింగయ్యా, ఇంకో ఆయనా - రక్ష కడుతూ చెప్పే డైలాగు ] నేను ఇంక డిప్రెస్ అవుదామంటే ఎలా అవుతాను చెప్పండి ?


ఈ చిన్న మావయ్య ఎన్ని డైలాగులో చెప్పలేం. నా నడుము ముసలమ్మ లెవెల్లో వొంగి పోయింది కదా అప్పటికే - బెల్టు పెట్టుకున్నా, వెన్ను లో బలం లేక, కనీసం 30 డిగ్రీల కోణం లో వొంగిపోయే ఉండే దాన్ని - నిటారుగా నించోమని ఎవరైనా హెచ్చరిస్తే తప్ప ఆ విషయమే నాకు తెలిసేది కాదు. అపుడు ఈ మావయ్య - చూడు - ఇపుడు నువ్వు సావిత్రి వి అనుకో - నిన్ను ఘటోత్కచుడు పూనేశాడు - అపుడు సావిత్రి చూడు - ఎలా రొమ్ము విరుచుకుని నించుంటుందో - అలా నించో - ఠీవి గా.. అలా నడవ్వే - నీకు తిన్నగా నడవటం వచ్చేస్తుంది ' అని నవ్వొచ్చే సూచనలు ఇచ్చే వాడు.


నడక మొత్తానికి ఎలానో పడుతూ, లేస్తూ నేర్చేసుకున్నాను. అమ్మకి ఇంక ధైర్యం వచ్చి - గుళ్ళ కి వెళ్ళి మొక్కులు తీర్చడం మొదలు పెట్టింది. నాన్న పెళ్ళి సంబంధం గురించే రాత్రీ పగలూ టెన్షన్ పడే వారు. వినోద్ తన ఇంకో పేషెంట్ గురించి ఉదాహరణ చెప్పి (రెండు కాళ్ళూ ఫ్రేక్చర్ అయిన ఒక అమ్మాయి - ఆరు నెలల్లో మేరేజ్ చేసుకుందని..) కొంత ధైర్యం ఇచ్చారు. ఇంకా పెద్దమ్మ వేలు విడిచిన ఎవరో చుట్టాలమ్మాయి కూడా ఇలానే వెన్ను లో ఫ్యూషన్ చేయించుకుని, పెళ్ళాడిందనీ - ఆమెకిప్పుడు పిల్లలు కూడాననీ - చాలా ధైర్యం చెప్పింది.


మొత్తానికి ఈ గోలంతా ముగిసే సరికీ నాకు ఎంగేజ్మెంట్ అయింది. డాక్టర్ గారు చాలా ఆనందించారు. ఎంగేజ్మెంట్ రోజు మా హీరో ని కొంచెం శ్రద్ధగా చూశాను. నాకు నచ్చలేదు. - నేనూ తనకి పెద్ద నచ్చలేదనీ అర్ధం అయిపోయింది. నాకు అంత సేపు కూర్చోడానికి నొప్పి అడ్డం వచ్చింది. పెద్ద ఆర్భాటాలేమీ లేకుండా (కింద కూర్చోలేను - అందుకని సోఫా మీదే కూర్చో బెట్టారు) ఫంక్షన్ జరిగింది. ఫోటోల్లో నా నొప్పి కనిపిస్తోంది. మా అత్త గారు వరుసగా నా చేతి కి రక రకాల ద్రవ్యాల తో కూడిన పళ్ళాలు అందిస్తున్నారు. ఆ బరువు నిజానికి నా వల్ల కాట్లేదు. నేను ఏడుపు మొహం పెట్టుకుని నించున్నాను.ఎంత ఆనందమే అయినా మా ఇంట్లో అందరికీ నేనెక్కడ పడిపోతానో అని భయానికి మొహం టెన్షన్ గా ఉంది. అపుడు లడ్డూల పళ్ళెం వచ్చింది. చిన్న మావయ్య 'సుజాతా - ఇంక నవ్వు!' అని వెనక నుంచీ కేకేసాడు. అన్ని ఫోటోల్లోకీ ఈ లడ్డూ ల పళ్ళెం తో నేనున్న ఫోటోనే బాగా వచ్చింది. నేను - నాన్నా, అమ్మా, చెల్లీ , అక్క, మా హీరో - అందరూ ఆ ఫోటో లో మాత్రమే నవ్వుతూ కనిపిస్తాం.

పొడిగించినట్టు ఉంటుందనీ, ఎవరైనా భయపడతారనీ - నా నొప్పి గురించి మరీ చెప్పట్లేదు.

నా నొప్పి, ప్రస్తుతం కేన్సర్ తో, కీమో థెరాపీ వల్ల కలిగే నొప్పి తో బాధపడుతున్న మా పెద్ద మావయ్య నొప్పికన్నా ఎక్కువ కాదు.

ఈ సోదంతా 'నొప్పి' మీద కాదు 'సెల్ఫ్-పిటీ' మీద కూడా నేను సాధించిన విజయం గురించి -

నిజానికి నేను చాలా చాలా లక్కీ - పేరా ప్లీజియా బాధితుల నిస్ప్రుహ ల కన్నా నా 6 నెలల సర్కస్ ఎక్కువ కాదు. ఈ ఆరు నెలల్లో నా కజిన్స్, నా ఫ్రెండ్స్ - అందించిన మానసిక ఆలంబనా - అమ్మా, నాన్న ల సపోర్ట్ ! అక్క, చెల్లీ లిటరల్ గా నన్ను చిన్న పిల్ల లా చూసుకోవడం ! మా చుట్టాల రోజు వారీ విజిట్లూ, నా చుట్టూ చేరి, నా పొట్ట మీద జంతికల పళ్ళెం పెట్టి మాట్లాడుకోవడం, జోకులూ, నా పెళ్ళి ప్లానింగులూ - ఇవన్నీ ఏదో సూరజ్ బర్జాత్యా సినిమాలాగా అనిపించేవి.

అయితే - కహానీ ఖతం నహీ హుయీ.

నా సర్కస్ ఇంకా మిగిలుంది. నేను నా మెడికల్ లీవు ముగించుకుని, డిల్లీ ప్రయాణం కట్టాలి. ఆ కవచం కట్టుకుని రైసీనా హిల్ మీద ఫోటో తీయించుకోవాలి. అదీ కల ! ఆ తర్వాత తిరిగొచ్చి హీరో ని పెళ్ళి చేసుకోవాలి. ఇంకొన్ని ఫీట్లు మిగిలున్నాయి.

07/11/2008

నా వీర గాధ Part - I
డిస్కవరీ చానెల్లో 'మై స్టోరీ ' లెవెల్లో ఉండదు నాకధ. కానీ నాదీ ఒక మంచి కధే. నాకే పాఠాలు చెప్పిన బుజ్జి కధ. నాకు నా ప్రత్యేకతని గుర్తింపచేసే కధ. నన్ను అందరికీ దగ్గర చేసిన కధ. అదేదో అంటారే.. నన్ను మరింత మెరుగైన మనిషి గా తీర్చి దిద్దిన కధ.


నా కధ మొదలయ్యే నాటికి నేను ఒంటరిని. ఇంటి నుండీ దూరంగా, హాస్టల్ లో జీవితం. చాలా హాయి అయిన ఉద్యోగం, మంచి స్నేహితులూ, నింపాది గా నడిచే కాలం, హాబీలూ, కాలక్షేపాలూ, నాటకాలూ, సినిమాలూ, షాపింగ్ - బాడ్మింటన్ - వీటితో ఏదో మంచి జీవితాన్నే అనుభవించేస్తున్న తృప్తి. వీటి కన్నా ఏమి కావాలి ?


2004 లో నడుము నొప్పి మొదలయింది. అసలు 2003 నుండే మొదలైంది. కానీ అంత సివియారిటీ లేదు. నా మొహం చూసిన డాక్టర్లంతా ముందు బరువు తగ్గమ్మా.. నడుము నొప్పి అదే తగ్గుతుంది అని సలహా పడేసే వారు. బరువు తగ్గడానికి నడకా, డైటింగ్, బాడ్మింటన్ (నేను చాలా బాగా ఆడేదాన్ని - మా హాస్టల్లో & చిన్నపుడు కాలేజీ లో, నా ఆటని ప్రత్యేకంగా చూసేవారు) - ఆఫీసు నుండీ హాస్టల్ దాకా నడకా మొదలు పెట్టాను. ఫలితం లేదు. నీర్సం వచ్చేది. ఆయాసం కూడా శృతి మించేది. బరువు తగ్గుతూంది గానీ నడుము నొప్పి తగ్గట్లేదు.ఈ లోగా పరీక్షలూ, ఇంటికి పోయి రావడాలూ, వైజాగ్ లో యూరాలజిస్ట్ (కిడ్నీ లో రాళ్ళుండడం వల్ల నొప్పి కావచ్చేమో అని) నుంచీ గైనకాలజిస్ట్ దాకా అందర్నీ చూసాం. మా పెద్దమ్మ ఇంట్లో వారాలు చేసుకుని చదివి పెద్దయ్యిపోయిన ఒక ఎముకల డాక్టరు దగ్గరికి వెళ్ళాను. ఈయనకి మా పక్క వీధి లోనే బ్రహ్మాండమైన మయ సభ లాంటి ఇల్లుంది. స్టేషన్ రోడ్ లో చెండాలమైన క్లినిక్ ఉంది. క్లినిక్ లో నన్ను చూసి, (మొత్తం చూసి - జస్ట్ చూసి) స్పాండిలైటిస్ అని నిర్ణయించేసి, మెడకో బెల్టు కొనిపించేసి పంపించేసాడీయన. ఈయన నన్ను పరీక్షించిన తీరు మర్చిపోలేను. ఇది విషాదాల్లోకెల్లా విషాదం అని ఇప్పటికీ నమ్ముతాను. శుష్కించి, క్షీణించి, నొప్పితో (ఆ నొప్పిని వర్ణించలేను - చాలా సీరియస్ నొప్పి. ఈ నొప్పికి కారణం తరవాత తెలిసింది) బాధపడుతున్న ఒక మహిళని హెల్ప్ లెస్ గా ఫీల్ చెయ్యడం ఇతనికే చెల్లింది.


ఈ నొప్పితోనే ఢిలీ నుండీ విశాఖ కు 36 - 38 గంటల ప్రయాణం, ఒక్కోసారి రెండు రైళ్ళు మారడం - చేసేదాన్ని. (సీరియస్ నెస్ తెలియక) ఆ రోజుల్ని తలచుకుంటే ఇపుడు కొంచెం భయం వేస్తుంది. ఆఖరు సారి మాత్రం, ట్రైన్ లో ఆర్.ఎ.సి టికెట్ మాత్రం దొరికి, విశాఖ కు ప్రయాణం కట్టాను. నాతో పాటూ ప్రాయాణించిన ఆర్.ఎ.సి ప్రయాణికురాలు బాలింత. పసి పిల్లాడితో ప్రయాణించిన ఆమె కోసం బెర్తు ని వొదిలి 30 గంటలు కూర్చుని ప్రయాణం చేశాను. అంతే.. ఈ ప్రయాణం తరవాత, నిటారుగా నిలబడలేదు. నా శరీరం 45 డిగ్రీ ల కోణంలో ఉండిపోయింది. నాకు మాత్రం, నేను నిటారుగా నించున్నట్టే అనిపించేది.ఈ ప్రయాణం మాత్రం నా జీవితాన్ని మార్చేసింది. నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన నాన్న షాక్. నడుము నొప్పి, నడుము నొప్పి అని ఏడిచే నన్ను మరీ లైట్ తీసుకోకపోయినా - ఇంత భయంకరమైన నొప్పి ఉన్నట్టు తెలుసుకోలేక పోయారు.


ఈ ప్రయాణానికి ముందే నేను నాలో గమనించిన మార్పులు విపరీతంగా బరువు తగ్గడం, తిండి మీద ఆసక్తి నశించడం, రెండు కాళ్ళ లో కో-ఆర్డినేషన్ క్షీణించడం. ఉదా : బట్టలు వేసుకునేటప్పుడు నడుము మీది భాగానికి సులువు గా బట్టలు తొడగ గలిగే దాన్ని. నడుము కింది భాగానికోసం చాలా సర్కస్ చెయ్యాల్సొచ్చేది. అప్పటికీ నా నడుము కింది భాగం బలహీనమైన విషయం నాకు అర్ధం కాలేదు. బండి డ్రైవ్ చేసేటపుడు ఎపుడన్నా ఒక కాలు కిందికి దింపి నిలిపితే, ఆ కాలు తిరిగి పైకి తీసుకోలేకపోయేదాన్ని. ఏదో - సంథింగ్ రాంగ్ అనిపించేది గానీ ఇంత బాబోయ్-రాంగ్ అనిపించలేదు.


అందుకే దీన్ని వీరగాధ అంటాను. ఈ గొడవల్లోనే అత్యంత కష్టపడి గ్రూప్ వన్ పరీక్షలు రాశాను. హాల్లో కూర్చోలేక సర్కస్, నడవలేక సర్కస్, చదవలేక సర్కస్, ఏడుపూ - గోలా చూసి అమ్మా నాన్నా బాధపడే వారు. అందుకే బయటకు గోల పెట్టడం మానేసి మానసికంగా కృంగిపోవడం మొదలు పెట్టాను. బయటపడితే అమా, నాన్నా బాధపడతారని. ఊర్లో అందరు డాక్టర్లూ కవర్ అయిపోయారు. అందరూ చెప్పిన విషయం - అమ్మాయ్ - నువ్వు లావు తగ్గితే గానీ నీ నడుము నొప్పి తగ్గదు. ఇపుడు అర్జంట్ గా లావు ఎలా తగ్గాలి ? నడవడానికి కాళ్ళు సహకరిస్తే కదా.. అసలు నేను నిటారుగా నిలబడగలిగితే కదా...


నేను ఆ నొప్పికి చచ్చిపోతానేమో అని అనుకున్నాను. ఒక వేళ చచ్చిపోకపోతే, ఎలానో ఒక లా చచ్చిపోదామని కూడా నిర్ణయించేసుకున్నాను. పేపర్లో ఎపుడైనా కడుపునొప్పికో తలనొప్పికో ఎవరో ఆత్మ హత్యలు చేసుకుంటున్నారంటే ఏమిటో అనుకునే దాన్ని. ఇపుడు ఆ బాధ ఏమిటో తెలిసింది.


ఈ బాధ లో ఒక యూరాలజిస్ట్ నా స్కాన్ లూ అవీ పరీక్షించి డాక్టర్ విష్ణు ప్రసాద్ కు నన్ను రిఫర్ చేసారు. ఈ విష్ణు ప్రసాద్ గారు నన్ను చూడగానే - ఎం.ఆర్.ఐ. స్కాన్ తీయించుకోమని సలహా ఇచ్చారు. అప్పటికే నా ఆరోగ్యం చాలా పాడైంది. ఎం.ఆర్.ఐ. లాంటి గోల గోల రేడియేషన్ పరీక్ష సమయంలో స్పృహ కోల్పోయినట్టే నిద్ర పోయానంటే, చూడండి.ఇంకా గ్రూప్ వన్ మెయిన్స్ లో ఆప్షనల్స్ పరీక్షలు జరగాల్సి ఉంది. నేనూ సిద్ధం అయ్యాను. అసలు వాటికోసమే వైజాగ్ వచ్చానప్పటికి. నా ఎం ఆర్ ఐ చూసి ఆ డాక్టర్ చూసిన చూపు, ఆయన పలికిన కైండెస్ట్ పదాలూ మర్చిపోలేను. 'ఇంత నొప్పి ఎలా భరించ గలిగావమ్మా?' అని అడిగారాయన. నాకు అపుడైతే కన్నీళ్ళు రాలేదు. బలహీనంగా కష్టాల్లో సావిత్రి లా నవ్వాను. ఇపుడు ఆ సీన్ తలుచుకుంటే ఏడుపొస్తుంది.


ఇంక నువ్వు బెడ్ రెస్ట్ తీసుకోవాలి - మంచం మీద నడుము వాల్చి పడుకోవడమే.. అర్జంటుగా నువ్వు బెడ్ రెస్ట్ కి వెళ్ళకపోతే నీ కాళ్ళు మరింత బలహీనం అయిపోతాయి చూసుకో మరి అని ఆయన వార్నింగ్ ఇచ్చారు. అప్పటికి ఎంత నొప్పి ఉన్నా.. మరి పరీక్షలో - ఆఫేసో - నా ప్రయాణమో - అని భయపడ్డాను. నొప్పికి విపరీతంగా డైక్లో ఫినాక్ వాడటం అలవాటైంది. ఒక్కోసారి రోజుకు 5 - 6 మందులు బిగించేసి, పరీక్ష ఇచ్చేదాన్ని. అప్పుడే నాకు హై.బీ.పీ మొదలైంది.


కానీ ఆయన అవన్నీ రూల్ ఔట్ చేసేసారు. బెడ్ రెస్ట్ అంటే బెడ్ రెస్ట్ - స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ ! ఇంకో మాట - నీకు సర్జరీ అవసరం. మీరు సిద్ధంగా ఉండండి ! అని నాన్నకి ఆల్టిమేటం ఇచ్చారు. ఆ మరుసట్రోజే హీరో నన్ను చూడటానికి వచ్చారు.


మా నాన్న కి అప్పటి జీవిత లక్ష్యం నా పెళ్ళి చెయ్యడమే. అందుకే వైజాగ్ నేను వస్తున్నానంటే పెళ్ళి సంబంధాలు చూసేవారు - నేనొచ్చే రోజుల్లో షూటింగ్ లు (పెళ్ళి చూపులు) జరిపేవారు. వాటికి హంగామా, ఇల్లు సర్దుకోవడం, మనసులో నానా తిట్లూ తిట్టుకుంటూ ముస్తాబవడం - అమ్మా, నాన్నల గోల - ఇవన్నీ మామూలే. సో, ఈ హడావుడిలో మా హీరో రావడం ముందే నిర్ణయం అయిపోయి ఉంది. కాబట్టి ఆపరేషన్ అనగానే మా అమ్మా, నాన్నలు ముఖాలు చూసుకున్నారు. సరే - ఆ రోజు ఇంటికొచ్చేసా. రాత్రి జ్వరం, తెల్లారి ముహూర్తానికి షూటింగ్, పెళ్ళికొడుకు రావడం, నేను ఎదురుగా వచ్చి కూర్చున్నా కన్ ఫ్యూస్ అయిపోయి ఇంకా 'వధువు వస్తున్నదీ !' అని ఎదురు చూడటం, అంత లోనే పెళ్ళి చూపులు అయిపోవడం - నేనూ 'ఆ - వీడేం చేసుకుంటాడ్లే అనుకోవడం' లోపలి గది కి పోయి ముణగదీసుకు పడుకోవడం జరిగిపోయాయి. తీరా ఈ సంబంధమే కుదిరింది.


పెళ్ళి కుదిరింది.. మా నాన్న గారి జీవితాశయం నెరవేరబోతుండగా - ఆపరేషన్ సమస్య ముందుకొచ్చింది. పెళ్ళిచూపుల రోజు ఎలా నడిచేనో గానీ మరుసట్రోజు అసలు లేవలేకపోయాను. కాలకృత్యాల దగ్గర్నించీ తిండి దాకా నిస్సహాయ స్థితి లోకి జారిపోతున్నాను. నాకు పెళ్ళీ గిళ్ళీ వొద్దు అని గాట్టి గా అందరికీ ట్యూషన్ చెప్పేసాను.


ఈ లోగా నాన్న గారు నన్ను సెకండ్ ఒపీనియన్ కని వేరే వేరే స్పెషలిస్టులకూ చూపించారు. కొందరు ఆపరేషన్ అవసరమనీ, కొందరు కేవలం బెడ్ రెస్ట్ (స్నానపానాదులతో సహా మంచం మీదే) ఒక ఆరు నెల్లు తీసుకుంటే చాలనీ చెప్పడంతో ఒక వైపు ఆరునెలల తరవాత పెళ్ళి ముహూర్తం పెట్టుకోవాలా / పెళ్ళి మానుకోవాలా / సంవత్సరం ఆగాలా అని డైలమా లో ఉండగా డా.సుబ్బారావు గారు నాన్న గారికి మంచి సలహా ఇచ్చారు.


అసలు నాకొచ్చిన రోగం ఏమిటీ అంటే, నా వెన్నెముక లో రెండు వెర్టిబ్రా అరిగి పోయి, కుళ్ళిపోయి - ముక్కలయి, వెనక్కి జరిగి (రెండు చోట్ల) వెన్ను పాము ను నొక్కేస్తున్నాయి. ఈ రెండు వెర్టిబ్రా లూ లంబార్డ్ స్పైన్ అనగా నడుము లో కింది భాగానికి చెందిన్వి కావడం వల్ల నాలో మొబిలిటీ (నడక) ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఈ వెన్ను భాగం నుండీ బయటకు వచ్చే నరాలు డైరెక్ట్ గా పెల్విస్ కూ, కాళ్ళకూ సంబంధించినవి. ఇలా అంత పెద్ద విషయం అక్కడ జరగడానికి నాకు 2002 లో జరిగిన రోడ్ ఆక్సిడెంట్ కారణం అయి ఉండొచ్చని ఒక విశ్లేషణ కూడా చేశారు. ఆ ఆక్సిడెంట్ లో నేను బండి మీంచీ ఎగిరి రోడ్ మీద సరిగ్గా నా వీపు మీద పడ్డాను. అందుకని నా వెన్నుకి ఆరోజు దెబ్బ తగిలి ట్రూమా కారణంగా వెర్టిబ్రే డీజెనెరేషన్ మొదలయి ఉంటుందని అంచనా. ఇంకో 3 వారాల్లో ఆపరేషన్ చెయ్యకపోతే కొన్ని నరాలు పూర్తిగా దెబ్బతిని నాకు పేరాప్లీజియా వచ్చే అవకాశాలున్నాయి. పేరా ప్లీజియా కు చికిత్స అందుబాటులో లేదు. (స్టెం సెల్ టెక్నాలజీ ద్వారా చికిత్స చెయ్యగలమని అంచనా. స్టెం సెల్ టెక్నాలజీ కి కొన్ని నైతిక, ధార్మిక న్యాయపరమైన అవరోధాలు ఇంకా ఉన్నాయి). దీనివల్ల నడుము క్రింది భాగం పూర్తిగా చచ్చుబడిపోతుంది. అదీ సంగతి.


అందుకే ఆలస్యం చెయ్యకుండా పెళ్ళి మాట పక్కనుంచి ఆపరేషన్ చేయించండి - అని ఆయన సలహా ననుసరించి నాకు ఈ రిపేర్ వర్క్ చేయించారు నాన్నారు. మొత్తానికి జూన్ 23, 2005 న, వైజాగ్ సెవెన్ హిల్ల్స్ హాస్పిటల్ లో నాకు ఆపరేషన్ జరిగింది. ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని మంచి రోజు. నా జీవితాన్నే మార్చేసిన రోజు. నాకెందుకొచ్చిందబ్బా ఈ జబ్బు అని నన్ను నేను తిట్టుకున్న రోజు. డా.విష్ణు ప్రసాద్ కి మనసులో పెద్ద దణ్ణం పెట్టుకున్న రోజు. మా అమ్మ కీ నాన్న గారికీ నాకు ఇంకో జన్మనిచ్చినందుకు పదే పదే కృతజ్ఞతలు చెప్పుకున్న రోజు.


నాదో కోతి మనస్తత్వం కాబట్టి ఆపరేషన్ అంటే నాకు చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. ఈ సర్కస్ లో నాకెన్ని బాధలున్నాయో అపుడు నాకు తెలియలేదు. మా చుట్టాల్లో, నా ఫ్రెండ్స్లో నా వొంకర నడుమూ, నొప్పీ కలిగించిన ఆత్రుత నాకో సూడో స్పెషాలిటీ ని కలిగించి, భలే కిక్ ఇచ్చింది. ఆపరేషన్ కు వెళ్ళేటపుడు గౌన్ వేయించినపుడు సర్కస్ మొదలయింది. బయట అమ్మకూ నాన్న కూ చేతులూపి వెళ్ళాను. అంత మంచి సోఫిస్టికేటెడ్ ఆపరేషన్ థియేటర్ ను కళ్ళారా చూడనే లేదు - ముఖానికి మాస్కు పెట్టి ఎనెస్థీషియా ఇచ్చారు. చేతికి బీ.పీ మానిటరు చాలా టైట్ గా కట్టేసేరబ్బా.. నొప్పుడుతూంది అని చెబ్దామనుకుంటూనే నిద్ర పోయాను.

02/11/2008

నా బ్లాగు సొంత డబ్బా !

చాలా రోజులనుండీ కూడలి లో నేను తప్పిపోయాను. ఎవరికి వారే సాయం చేసుకోవాలి. ఎవర్ని వారే వెతుక్కోవాలి. అందుకే ఇదింకో టెస్టింగ్ పోస్ట్.

చాలా రోజులుగా నేను చెయ్యని పని ఒకటి మిగిలిపోయింది. అది నా బ్లాగు ప్రయాణం విశేషాలని పంచుకోవడం. ఈ పోస్టు ఇక చాలా మందికి అందుబాటులో ఉండదు కనుక, ధైర్యం చేసి రాస్తున్నాను. చదివిన వారే - దురదృష్టవంతులు.


నా మట్టుకూ నేనొక ప్రత్యేకమైన వ్యక్తిని. (ఇది నా వ్యక్తిగత అభిప్రాయం!!) కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో (...mm...tell you later) ఎప్పుడూ చిక్కుకుపోతూ ఉంటాను. ఉద్యోగం ఒక చాలెంజ్, పెళ్ళి ఇంకో చాలెంజ్, పెళ్ళయ్యాకా నన్ను నేను కోల్పోకపోవడం ఒక సెపెరేట్ చాలెంజ్, (పెళ్ళయ్యాకా హీరోయిన్ లా ఫీలయిపోకుండా - నేల మీదే నిలబడి, పూర్తిగా మారిపోకుండా, నా ఫ్రెండ్స్, నా హాబీలూ, నా అభిరుచులూ.. నా సొంత వ్యక్తిత్వము నిలుపుకోవడం.. ఇవన్నీ మళ్ళా మా అయన్ను నొప్పించకుండా, అనుమానం రాకుండా, నా స్పేస్ లోకి రానీయకుండా టైట్ రోప్ వాక్ చెయ్యడం ఒక పెద్ద చాలెంజ్. పెళ్ళయిన అమ్మాయిలకు {esp if it is arranged marriage} తెలుస్తుంది.)


ఈ ప్రత్యేకతల్లో నా ఉద్యోగానికి సెలవు పెట్టి, చెత్త ఆఫీసునుంచీ, (It was such a phase) (లిటరల్ గా) ముగుడితో కలిసి, ఇంగ్లండ్ పారిపోవడం ఇంకో ప్రత్యేకత. ఈ ముగుడు గారికి ఆఫీసు రోజుకి 13 గంటలు. నాకేమో ఇంట్లో కూర్చోడం కొత్త ! ఎంత చారిటీ (see very raw blog post) షాపులో గానుగెద్దు చాకిరీ చేసినా డబ్బులు ఎలానూ ముట్టేవి కాదు. కానీ కొంచెమే టైం పాస్ అయేది. చలి కాలంలో గ్లూమీ నెస్. సరే కనీసం వంటలు నేర్చుకుందామని యూట్యూబ్ వెంట పడ్డాను.


నా మట్టుకూ ఇదొక మంచి అనుభవం. సంజయ్ తుమ్మా దగ్గరే (వహ్ షెఫ్) బోల్డన్ని నేర్చుకున్నా. ఆ ప్రయోగాలన్నీ ఆఫీసునుంచీ వచ్చిన హీరో మీద ప్రయోగించేదాన్ని.


అయితే వ్యాపకం లేకపోవడం వల్ల జీవితంలో బోల్డంత వెలితి కనబడేది. నాకు మా షాపు మేనెజర్ ఇచ్చిన బిరుదు 'బోర్డ్ హౌస్ వైఫ్ ' అస్సలు నచ్చలేదు. బ్లాగులంటే అప్పటికి పెద్ద ఇష్టం లేదు. వీడియో దునియా, వీడియో మస్తీ ల్లో ఏవో సినిమాలు చూడటం ! అపుడపుడూ టైం మేగజైన్ మాత్రం మూడు పౌండ్ లకు కొనుక్కుని, ముఖ చిత్రం నుంచీ చివరి పేజీ దాకా చదవడం, ఆదివారం వచ్చే ఫ్రీ న్యూస్ పేపర్ లో ఆర్బిట్యూరీ లు కూడా వింత గా చదవడం - లేదా నడవడానికి పోవడం ! ఇలానే బ్రతికేను.


కొన్నాళ్ళకి నాకు నెట్ లో 'మనిషి ' కనిపించాడు. అదీ తెలుగు మనిషి. నేను చదివిన మిట్టూరోడి లాంటి మనిషి. అంతే ! నేను గెంతి, ఈ బ్లాగు గంప లో పడ్డాను. రాద్దామని అనుకోలేదు. కనీసం 3 నెల్లు చదివుతూనే ఉన్నాను. కొన్ని చాలా మంచి బ్లాగులూ, కొన్ని చెత్త కబుర్లు రాసే బ్లాగులూ, తెలుగులో ! కౌముది, పొద్దు, భూమిక కూడా చదివేదాన్ని.

నాకు తెలుగు బాగా వచ్చు ! పైగా నేను ఏమి రాసినా హీరో కి అర్ధం కాదు. (హీరో తెలుగు మాట్లాడగలరు. అంతే !) కాబట్టి ఇదో మహాద్భుత అవకాశం. నేనూ రాశేస్తాను. ఏదో ఒకటి! పైగా రాయగా రాయగా ఆలోచనలు దార్లోకి వస్తాయి - అనుకుని నేనూ బ్లాగర్ లో చేరాను.

నిజానికి ఎప్పుడో చేరినా, కొన్నాళ్ళకు గానీ కుదురు రాలేదు. కుదిరాకా, రాత కుదర్లేదు. రాత కుదిరాకా, కోతలు కుదర్లేదు. ఇదీ కుదిరాకా నా ప్రత్యేకత సర్ఫేస్ మీదికొచ్చింది. పైగా 2008 జనవరి లో హీరో కసిన్ ఒకబ్బాయి - నా న్యూ ఇయర్ రిసల్యూషన్ ఏమిటో చెప్పమన్నాడు. అపాటికి హీరో కీ నాకూ తీవ్ర స్థాయిలో తగువులు తంటాలూ నడుస్తున్నాయి. అందుకే ఆ కక్ష తో నన్ను నేను డైవర్ట్ చేసుకోవడానికీ, నన్ను నేను కోల్పోకుండా - నేగింగ్ వైఫ్ గా అయిపోకుండా, బ్లాగింగ్ ని సీరియస్ గా తీసుకుంటానని నిర్ణయానికొచ్చాను.

నా ఈ బ్లాగు నన్ను ఒక విధంగా కాపాడింది. ఏదన్నా చదివినా, చూసినా దాన్ని గురించి రాయాలనిపించేది. మొదట మా hero మాతృభూమి ఒరిస్సా ప్రత్యేకతల్ని - సంబల్ పురీ కళల్ని, పట చిత్రాలనూ, మగ పిల్లల ఒడిస్సీ శైలి నృత్య విన్యాశాల గురించీ నాకు తెలిసినంత మటుకూ రాశాను. మాతృభూమి సినిమా గురించి రాశాకా, నాకు కాస్త గుర్తింపు వచ్చింది. సినిమాలు అంటే పిచ్చి లేదు గానీ మంచి సినిమాలంటే కుంచెం ప్రేమ. నేను సినిమాల గురించి రాసింది కొంచెమే గానీ - నా బ్లాగు ఆధారంతో నవతరంగం లో చేరిపోయా ! మొదట నాకు ఆ మాత్రం గుర్తింపునిచ్చింది ఈ తప్పుల తడకల మాతృభూమి రివ్యూ.


నేను వ్యక్తిగతంగా ప్రత్యేకంగానే ఉండిపోవాలని ఆశిస్తాను. (So I started blogging!) ఈ ప్రత్యేకత - నా హాబీల (చదవడం, బొమ్మలూ, పర్యటనా, సంగీతం) ద్వారా నిలుపుకోవాలని - నా ఆశ ! But I am a private person. (ఈ టపా పూర్ణిమ కోసమే రాశాను ! పూర్ణిమ తో ఎపుడన్నా మాటాడినపుడు ఒక ఆరేళ్ళ క్రితం నా జీవితం, ఆ రోజుల్లో ఆవేశం, ఉత్సాహం గుర్తొస్తాయి - నా మెమోయిర్స్ తరవాత రాస్తాను గానీ - పూర్ణిమా థాంక్స్) కాబట్టి నా బ్లాగ్ నాకో వెంటిలేటర్. మంచి వర్చువల్ ఫ్రెండ్ సర్కిల్ ఉంది నాకు మరి !!! ఇంత కన్నా ఏమి కావాలి నా లాంటి ఇంట్రావర్ట్ కి ?


బ్లాగింగ్ డైరీ లా కాదు గానీ నా ఆలోచనలకొక రికార్డు లా పనికొస్తుంది అనిపించింది. మా కికోసు రేప్పొద్దున్న చదివితే నాగురించి తెలుసుకుంటాడని రాస్తున్నాను. ఇది అత్యాశేమో గానీ - ఒక ఫ్రీక్ దురాశేమీ కాదు కదా ! పైగా - బ్లాగింగ్ నా ఆలోచనల్ని సరైన దారిలో పెట్టింది. బ్లాగు లకు ఎడిక్ట్ కావడం కూడా అపుడే మొదలైంది.


అయితే, వెనక్కి తిరిగొచ్చి,ఆఫీసులో చేరాకా, బ్లాగుల మీద ఉన్న ఎడిక్షన్ తగ్గింది. వ్యాపకాలు, ఉమ్మడి కుటుంబ బాధ్యతలూ దీనికి కారణం. ఒక దశ లో బ్లాగింగ్ కు ఇవతల జీవితం కూడా బానే ఉందే అనిపించేలా తయారయ్యాను. ఇపుడు నా రియాలిటీ లో బ్లాగింగ్ ఒకభాగం. ఇదే జీవితం కాదు. ఇపుడు రాయడం, చదవడం కూడా బాగా తగ్గింది. టైం దొరకట్లేదు. అయినా మనసు బాలేనపుడూ, సంఘర్షణ ఎదురైనపుడూ గడ్డిపూల వైపు చూస్తాను. మూడ్ బావున్నపుడు చాక్లెట్ల వైపు దృష్టి పెడతాను. నా హాబీ సంగీతం.. శాస్త్రీయ సంగీతం ఇష్టం ! పైగా మెట్టింట్లో తెలుగు కీర్తనలు పాడి వినిపించమని అడిగేవారూ లేరు, పాడితే అర్ధం చేసుకుని ఆనందించగలిగే వారూ లేరు. అందుకే నాలో ఈ వలపు నశించకుండా - నాకొచ్చినవీ, రానివీ, నేర్చుకోవాలనుకున్నవీ పాటలు - శ్రీనివాసంలో పెడతాను.


అదీ కధ !


నేను రాసిన టపాల్లో నాకు నచ్చిన కొన్ని :

ఈద్ గా - మున్షీ ప్రేం చంద్

కొలంబియా - ఇన్ గ్రిడ్ విడుదల

తీవ్ర వాదం - ఐ ఈ డీ ట్రెండ్స్ [ ఇవి అయిదు భాగాలు ]

నా పెన్ను పిచ్చి గురించి

స్త్రీ పక్షపాతం

లక్కీ మిట్టల్ పతకాలు

Switzerland

లార్డ్స్

న్యూ లవ్

{చదివినా చదవకపోయినా - బ్లాగమంటూ ప్రోత్సహించిన హీరోకి ప్రేమతో ఈ టపా అంకితం}

30/10/2008

నేనూ - నువ్వూనేనీ మద్య అదృశ్యం అయిపోయానని అనుమానంగా ఉంది. ఇది టెస్టింగ్ పోస్ట్ అన్న మాట !

28/10/2008

మహిళలూ - పిల్లకాయలూ - ఉద్యోగాలూ !!

సిక్స్థ్ పే కమిషన్ రికమండేషన్స్ లో ఒక విషయం మీద నేనూ మా ఫ్రెండూ నిన్న రాత్రే వాదించుకున్నాం. వాదన అంటే పోట్లాట కాదు - ఒక విషయ విచారం అన్నమాట. అదేంటంటే మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం 6 నెల్ల జీతంతో సహా ప్రసూతి సెలవు ఇవ్వడంతో పాటూ, పూర్తి సర్వీసులో ఒక రెండేళ్ళపాటూ - పిల్లల సంరక్షణ సెలవులు తీసుకోవచ్చు. ఈ రెండేళ్ళూ, జీతం ఇస్తారు. నేను వావ్ అనుకున్నాను కానీ మా ఫ్రెండ్ కి కొన్ని అనుమానాలున్నాయి. ఆ అనుమానాలు విని నేనూ ఆశ్చర్యం లో పడ్డాను.


మా బేచ్ లో ఒక సఖి కి మొన్నీమధ్యే హీరో పుట్టేడు. అప్పుడే ఈ పే కమిషన్ ఔట్ అయింది. అరే వా.. నీకింక 6 నెల్లు సెలవు.. ఎంజాయ్! అని చెప్పేసుకున్నాం.


ఇది పర్లేదు కానీ, నా తో వాదించిన సఖి కి మాత్రం ఆ రెండేళ్ళ పెయిడ్ లీవ్ మీద కాస్త గుర్రు గా ఉంది.. ఎందుకని..? పిల్లల్ని పెంచడం కేవలం ఆడవాళ్ళ టెర్రిటరీ నా ? మగ వాళ్ళకి బాధ్యత ఉండదా ? ఈ అమ్మాయి కి కెరీర్ అక్కర్లేదా ? ఫిల్లల్ని కనడం, పెంచడమూనేనా ఆడ వాళ్ళ జీవితం ? ఈ సెలవుల్లో ఆమె ప్రమోషనూ, ఇంక్రెమెంట్లూ, బోనస్ లూ, లాంటివి మిస్ అయిపోతాయి కదా ? రెండేళ్ళ సెలవంటే ప్రమోషన్ అవకాశాలు ఖచ్చితంగా దెబ్బ తింటాయి కదా !! మగ వాళ్ళకు కూడా ఆ సెలవేదో ఒక ఏడాది ఇవ్వచ్చు కదా.. వారు కూడా పిల్లల్ని పెంచాలి కదా.. ఇలా బోల్డంత వాదించేసింది.


ఏమో.. ఈ ప్రశ్నల్లో కొన్ని పట్టున్నవే - ఆడ వాళ్ళకు ఆడ వాళ్ళే శత్రువులంటారు. (మగ వాళ్ళకి మగ వాళ్ళూ శత్రువులు కానట్టు) అయితే, ఈ వాదన వల్ల నాలో కూడా కొన్ని ప్రశ్నలు పుట్టేయి. స్త్రీ వాదానికీ, స్త్రీత్వానికీ చాలా తేడా ఉంది. అతి వాదం, స్త్రీ నే ఎందుకు పిల్లల్ని కనాలి అని ఆలోచించలా చేస్తుంది. స్త్రీ వాదం - దాన్ని ఒక చాయిస్ లా చెయ్యాలని కోరుకుంటుంది. స్త్రీత్వం దాన్ని తన అస్థిత్వం లో భాగంగా వాదిస్తుంది. మన ఆలోచనల్లో అస్పష్టత ఎదురవుతున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు పుడతాయిగా..


నా అక్కయ్య ని చూస్తే పిల్లలూ - ఉద్యోగమూ అన్న సంగతి చాలా చికాకు కలిగించింది. ఈ ఉద్యోగం కోసం తను కనీసం 3 ఏళ్ళు రాత్రీ పగలూ కష్టపడి చదివింది. పెళ్ళి కి ముందు చాలా చాలెంజింగ్ గా ప్రిలిమినరీ, మెయిన్సూ రాసాక, పెళ్ళి అవ్వగానే ఇంటర్వ్యూ - ఉద్యోగం వచ్చాయి. కొడుకు పుట్టే సమయానికి రెస్పాన్సిబుల్ ఉద్యోగం లో ఇంకా ప్రొబేషనర్. అవతల ఆఫీసు నీ నిర్లక్షం చెయ్యకూడదు, ఇక్కడ కన్న కొడుకు ని కూడా జాగ్రత్త గా చూసుకోవాలి. ఉయ్యాల్లో పిల్లాడ్ని వొదిలి ఆఫీసుకి వెళ్ళడం, పాలు తాగాడో లేదో అని బెంగ పడటం, జ్వరం తొ ఉన్న కొడుకుని తలుచుకుని బాధ పడుతూ కేంపు కో, ట్రైయినింగ్ కో వెళ్ళడం.. హోం వర్క్ చేసాడో లేదో, తిన్నాడో, మట్టి లో ఆడు కుంటున్నాడో అని మధనపడుతూ ఉద్యోగం చెయ్యడం, అక్కడ కూడా ఈ ఏకాగ్రత దెబ్బ తిని చిక్కుల్లో పడటం, ఎప్పటికప్పుడు, పిల్లాడికి జ్వరమనో, విరేచనాలనో - సెలవు పెట్టడం వల్ల, సుపీరియర్ లకు చులకన కావడం, ఇవన్నిటినీ అధిగమిస్తూ.. పిల్లాడికి త్వరగా ఒక 10 - 12 ఏళ్ళ వయసు రావాలని కోరుకోవడం తప్ప ఇంకేమీ చెయ్యలేక, ప్రస్తుతానికి ఈ సంసార రధాన్నీ, ఉద్యోగాన్నీ నెట్టుకొస్తూ ఉండటం చూస్తూ ఉండటం వల్ల - అమ్మో పిల్లలు !! అనుకున్నాను.

తను ఒంటి చేత్తో పిల్లాడ్ని పెంచుతూంది అని అనట్లేదు. కానీ పిల్ల వాడే ఆమె కు మెయిన్ ప్రయారిటీ. అందరు స్త్రీ ల లాగే తను తన కోసం కన్నా పిల్లాడి కోసమే బ్రతుకుతుంది. ఉద్యోగం చేసే మహిళలకు పిల్లకాయలు పెద్ద తంటానే. తలలో అస్తమానూ మెదిలేది వాళ్ళే. కొంచెం పెద్దయ్యే దాకా కొంచెం బెంగ, కొంచెం కన్సర్న్ ఉండనే ఉంటాయి. ఇది ... మానవ సహజం!!


కాబట్టి - నాకు ఈ రెండేళ్ళ సెలవు భలే మంచి అవకాశం గా అనిపించింది. ఇలాంటి లా బ్రిటన్ లో అమల్లో ఉంది. ఖచ్చితంగా ఇలానే కాదు - కానీ ఉంది. సో.. ఇది మనమే కొత్తగా కనిపెట్టినదేమీ కాదు.

అయితే ఇది స్త్రీ ల పట్ల ప్రభుత్వం.. స్వీట్ గా అమలు పరుస్తున్న వివక్షా లేక స్త్రీ ల మాతృత్వానికి వ్యవస్థ ఇస్తున్న ప్రాధాన్యమా ? లేక ఏ యునెస్కో నో తెచ్చిన ఒత్తిడి ఫలితమా ? ఇలాంటి అవకాశాలు ఇతర రంగాల్లో పని చేసే మహిళలకు కూడా ఇవ్వొచ్చా ? మహిళలకే ఎందుకివ్వాలి - పిల్లల్ని పెంచడం లో పురుషుల పాత్ర లేదా ? అందరికీ పిల్లని పెంచడం కోసం సెలవులిస్తూ పోతే దేశం ఏమి కావాలి ?

అసలే మహిళా ఉద్యోగులు సరిగ్గా పని (సరిగ్గా డ్రైవ్ చెయ్యరనీ.. కూడా) చెయ్యరని చెడ్డ పేరు (అన్ని నిజాలూ ఖచ్చితమైన నిజాలు కావు కదా)!! ఈ పిల్ల కాయల వల్ల పెట్టే సెలవులు ఇలా మహిళల స్థానాన్ని బలహీనపరుస్తాయా లేవా ? ఏమో !! ఏది వితండ వాదమో, ఏది సరైన ఆలోచనో అర్ధం అయ్యి చావట్లేదు. ఎవరన్నా కాస్త సాయం చేస్తారా ?

22/10/2008

చంద్రయాన్ - నా గ్లాస్ ఎలివేటర్ లో !

చంద్ర యాన్ కి అంతా సిద్ధపడుతూ ఉండగా.. నాకు కొంచెం నోస్టాల్జియా.. జూల్స్ వెర్న్ 'భూగర్భం లోకి ప్రయాణం ' గుర్తొచ్చింది. అందుకే ఇప్పుడు 'చార్లీ ఎండ్ ద గ్రేట్ గ్లాస్ ఎలివేటర్ తీసి చదువుతున్నాను. అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయినపుడు పిల్లల్లో 'రాకెట్ సైంటిస్ట్ ' అయిపోదామని కొత్త కలలు పుట్టేయంట. మన చంద్ర యాన్ కూడా ఎంత మంది పిల్లల్ని ఇన్స్పైర్ చేస్తుందో తెలియదు గానీ.. నాలో పిల్ల మనస్తత్వాన్ని ని మాత్రం తట్టి లేపింది. ఈ పుస్తకం చదువుతూ నిద్రపొయానేమో రాత్రి - గ్లాస్ ఎలివేటర్ లో తేలుకుంటూ (మరి గురుత్వాకర్షణ శక్తి ఉందదు కదా..) చందురుడి పక్కనుంచీ క్రాస్ అయి స్పేస్ లోకి వెళిపోయినట్టు కల వచ్చింది. భలే భలే గా ఉందీ అనుభవం. రాకేష్ శర్మ ఎక్కడున్నారో గానీ మీకో పెద్ద వీర తాడు !


చార్లీ ఎండ్ చాక్లెట్ ఫేక్టరీ తర్వాత - ఈ గ్రేట్ గ్లాస్ ఎలివేటర్ నాకు ఇష్టం. ఇలాంటివి తెలుగులో వస్తే బావుణ్ణు. కొన్ని విషయాలు పంచతంత్రం తరహాలో చక్కగా కధల్లాగా, ముఖ్యంగా సైన్స్ సంగతులు పిల్లల భాష లో చెప్తే మన దేశం లో కూడా స్టూడెంట్స్ లో సైన్స్ మీద ఉత్సుకత పెరుగుతుంది. సో, ఇలాంటి సైన్స్ ఫిక్షన్లు పిట్ట కధల్లా.. అంతంత పెద్ద కళ్ళు చేసుకుని వినే పాపాయిల కోసం చెప్పాపంటే ఎంత బావుంటుందో చూడండి. ఈ గ్లాస్ ఎలివేటర్ గురించి తరవాత రాస్తాను.

చంద్ర యాన్ కి మాత్రం నా బోల్డన్ని శుభాకాంక్షలు. మన దేశం లేటు గా అయినా లేటెస్ట్ గా చందురుడి మీదికి వెళ్ళ బోతోంది. గుడ్ లక్.

19/10/2008

ఆదివారం

హాస్టల్ రోజుల్నుంచీ సండే అంటే ఏదో పర్వదినంలాగా గడపడం నాకు చాలా ఇష్టం. అన్నిపనులూ.. బట్టలుతకడం, ప్రెస్ చేసుకోవడం, బ్యూటీ పార్లర్ కు వెళ్ళడం, బండి సర్వీసింగ్, ఇలాంటి చెత్త పనులన్నీ శనివారమే ముగించుకుని, ఆదివారం మాత్రం నాకు, కేవలం నాకే కేటాయించుకోవడం, మెహెందీ పెట్టుకోవడం, గుడికి వెళ్ళడం, ఆ వారం న్యూస్ పేపర్లన్నీ ఒకే రోజు చదవడం, వీలయినంత సేపు నిద్ర పోవడం, రాత్రి మాత్రం ఫోన్లు చేసుకుని, కాసేపు ఆడుకుని, గుడ్ నైట్ కల్లా ఈ విశ్రాంతి తీస్కోవడంలో అలిసిపోయిన శరీరానికి ఆరాంగా మంచి మ్యూసిక్ వినిపిస్తూ నిద్రపోవడం అలవాటు.


ఇప్పుడు ఆదివారం అంటే ఏదో బెడద లా వుంది. అసలే ఇక్కడ 6 రోజుల వీక్ లో దొరికిపోయాను. శనివారం అసలు టైం వుండదు. ఆదివారం వంట, తంటా - ఇవన్నీ. అయినా వీలయినంత వరకూ ఆదివారం ఇంట్లోనే ఉండటానికి ప్రయత్నిస్తాను. మా ఆయన కి ఈ తినడం, పడుకోవడం స్కీం అస్సలు నచ్చదు. ఇదే నా పీకలమీదికొచ్చింది. పొద్దున్న లేట్ గా లేస్తానని, తీరిగ్గా బజారుకెళ్దామని, తీరిగ్గా వంట చేసుకుని, సినిమాకో, షికారుకో.. అంటే - నాకు గుండెలో రాయి పడేది. పొద్దున్న లేట్ అంటే నా ప్రోగ్రాం అంతా అప్సెట్ అయిపోతుంది. అస్సలే ఆదివారం అంటే నాకు పరమ పవిత్ర దినం. ఈ రోజు ఏదో కాస్త 'బ్రతకడానికి ' తిని పడుకోరాదా అని నా బాధ. అప్పటికీ ఆదివారం అసలు ఏ పనీ పెట్టుకోను. ఎందుకంటే ఆరోజు ఈయన వుంటే, ఎవర్నన్నా పిలవడం లేదా ఎవరింటికన్నా వెళ్ళడం ప్లాన్ చేస్తాం (నాకు ఇష్టం ఉండదు) ఆదివారం మాత్రం పొద్దున్నే చక చకా పనులు ముగించుకుని, ఇల్లు అద్దంలా సర్దేసుకుని, ఎండ ఫెళ ఫెళ లాడే వేళ అన్నం తినేసి, తలుపులూ, కర్టెన్లూ వేసేసి, కాసేపు పేపరూ చూసేసి నిద్ర పోదామని నా పిచ్చి కల !


కానీ పెళ్ళయ్యాకా.. అందరి కోరికలూ, నా సామాజిక భా ద్యతలూ తీర్చడానికి ఈ ఆదివారమే వచ్చేది. వంటా, వార్పూ, ఇల్లు సర్దుకోవడం, అతిధులూ, నవ్వులూ, కాపీలూ, టిపినీలూ, మళ్ళీ నవ్వులూ... కాసేపటికి 'బైటికి బైల్దేరడాలూ ' ! ఇవే నాకు చాలా చిరాకు. అదేంటో, ఆదివారం హైదరాబాద్ లో మాత్రం ఎక్కడికెళ్ళినా కిక్కిరిసిపోయి ఉంటుంది. అసలు Sunday రోడ్లమీద ట్రాఫిక్ ఉండకూడదు. కానీ ఆరోజే విపరీతమైన ఔటింగ్! బళ్ళూ, కార్లూ.. ఆటోలూ, పట్టుచీరలూ, చర్చికి పోయే వాళ్ళూ, రైతు బజార్ కి వెళ్ళేవాళ్ళూ, సంగీత్ జంక్షన్ లో లేదా క్లాక్ టవర్ దగ్గర చేపల దుకాణానికి వెళ్ళే వాళ్ళూ, గుడికి పోయే భక్తులూ.. వీళ్ళతో రోడ్లు హడావుడి గా వుంటాయి. పొద్దున్న 12ఇంటి దాకా ఇదే హడావుడి. ఆ తరవాత ఇంకో రకం హడావుడి. రెస్టారెంట్లూ, సినిమా హాళ్ళూ - సాయంత్రం అవుతుండగా ఊర్లో ఉన్న రెండే రెండు పార్కులూ, ఒక్కే ఒక్క ఐమాక్సూ - జనం తో గింజుకుపోతూ ఉంటాయి. హైదరాబాద్ లో రెస్టారెంట్ అనుభవాలు కూడా రక రకాలు. భోజన శాలలు కిక్కిరిసిపోవడం. యాత్రీ నివాస్ లో పార్కింగ్ ప్లేస్ దొరకకపోవడం.. ఇలాంటి సిత్రాలన్నీ ఆదివారమే.


నాకీ రోజు బిజీ గా గడిచినా బాధే, లేజీ గా గడిచినా బాధే - ఎందుకని ? లేజీ గా అంటే - అయ్యో ఈ రోజు ఎన్నో పనులు అయి ఉండేవి గా అనిపిస్తూ ఉండటం వల్ల. నాలాంటి కన్ ఫ్యూషన్ ఇంకెవరికైనా ఉంటుందా అని నా సందేహం ! ఇక్కడ శనివారాలు కూడా పనిదినాలు కావడం వల్ల, ఆదివారం బయటికి వెళ్ళాలంటే ఇల్లంతా ఏవో పనులు కనిపిస్తూనే ఉంటాయి. ఏదో ఇన్స్పెక్షన్ టీం వస్తున్నట్టూ, బోల్డంత పని పెండింగ్ ఉన్నట్టూ మనసు బెంబేలెత్తుతుంది. అయినా 'పని తరవాత చెయ్యొచ్చులే - పద బైల్దేరదాం !' అంటారు. ఈ రోజే ఎవరింటికో వెళ్ళాలి. కష్టపడి ఉతికి ఇస్త్రీ చేసిన బట్టలు తీసి కట్టుకోవాలి. వాళ్ళు బయటికెళ్దాం అంటే బయల్దేరాలి. వాళ్ళ పిల్లల అల్లరి భరించాలి. ఇలా పొద్దున్నుంచీ నటించీ నటించీ, అలిసిపోయి, ఆదివారం కూడా ఆఫీసు ఉండుంటే బావుణ్ణు అనేలా అయిపోతూ ఉంటాను.


ఆదివారం ఇల్లు కదల బుద్ది వెయ్యదు సరే ! కానీ సాయంత్రాలు వ్యాహ్యాళి కో ఆడుకోవడానికో వెళ్ళాలనుంటుంది. ఎక్కడా ? నేనేమన్నా ఆర్మీ వాళ్లలాగ అదృష్టవంతురాలినా ? నా వయసు కి ఇక్కడ ఆటలు అయితే కుదరదు. గోల్ఫ్, గిల్లీ డండా, క్రికెట్, బాస్కెట్ బాల్ లాంటి పెద్ద ఆటలు కాకపోయినా షటిల్ ఆడాలనుంటుంది. చుట్టుపక్కల ఎవరూ ఆడేవాళ్ళు లేరు. నేనస్సలు టీవీ చూడను. ఒక్కో సారి వారాల తరబడి అటు వైపు చూడను. ఎప్పుడో బుద్ధి పుడితే చూస్తాను. కానీ ఎక్కువసేపు కూర్చోలేను. పడుకుని చూడాలనుంటుంది. పెద్ద వాళ్ళ ముందు ఎలా ? అందుకే టీవీ బంద్ అయిపోయింది. ఆదివారం ఇంట్లో ఉండుంటే, అమ్మ, నాన్నగార్ల తో కలిసో, మా చెల్లి ఉంటే క్రికెట్ చానెల్ మార్చవే అని గొడవ పడుతూనో టీవీ చూడడంలో ఉన్న మజా ఇప్పుడు రాదు. అంతగా చిరాకేస్తే బీచ్ కి వెళిపోవడమే !


సినిమా హాలు కెళ్ళి సినిమా చూసి ఏడాదిన్నర పైగా అయింది. సినిమా అంటే ఇష్టం లేక కాదు. నాకిష్టమైన / నేను చూడాలనుకునే సినిమాలు ఎక్కడో మాళ్ళ లో చూపిస్తుంటారు. మా నానమ్మ కి భలే ఇంటరెస్ట్ ఉండేది. తను ఒక్కత్తీ రిక్షా కట్టించుకుని సినిమాకి వెళిపోయేది. బన్ను ముడి వేసుకుని, జరీ చీర కట్టుకుని, మెరుస్తూ, చటుక్కున తెరుచుకునే చిల్లర పర్సూ,ఒక రుమాలూ పట్టుకుని, రిక్షా ఎక్కి మేటనీకి చెక్కేసేది. తను అపుడు ఒక్కర్తీ ఉండేది. అయినా కోలనీ అంతా స్నేహితులూ ఉన్న, ఒంటరినన్న బాధ లేకపోవడం - ఎవరో తీస్కెళ్తారని ఎదురు చూడకుండా, తన పని తానే చేసుకునే మనస్తత్వం వల్ల అలా వెళిపోయేది. కానీ నేను ఒక్కర్తినీ వెళ్ళలేను. ఆదివారం ఎవరన్నా తోడు దొరుకుతారు. కానీ ఆదివారం సినిమా చూడటం నా అంతరాత్మని ఖేదపరుస్తుంది. ఆదివారం సినిమా ఏమిటి, తిని బజ్జోకుండా ?! అయినా వైజాగ్ లా కాదు కదా. ఊళ్ళో సినిమా చూడ్డానికీ ఈ మహానగరంలో చూడ్డానికీ చాలా అంతరం ఉంది. ఇది అవస్థ. అది అనుభవం.


జీవితంలో మొనాటనీ విసుగు కలిగిస్తుంది. ఈ మధ్య ఇంట్లో నా సెలెబ్రేషన్స్ కూడా నచ్చట్లేదు. అప్పటికీ చెక్కేస్తూ ఉన్నా మా కజిన్ ఇంటికో, ఫ్రెండ్ ఇంటికో. కానీ వాళ్ళ 'ఆదివారాన్ని ' ఖరాబు చేస్తున్నానేమో అని భయం. వాళ్ళూ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే. వాళ్ళకీ ఏవో ప్లేన్లు ఉంటాయిగా ! ఒంటరితనం నాకు చాలా ఇష్టం. నేనో ఇంట్రావర్ట్ ని. అందుకే నా ఆదివారాలు నా కోసం గడపడం నాకు చాలా ఇష్టం. డాబా మీదికెక్కి, రాత్రి వేళ వెనక రోడ్లో విరగబూచిన నాగమల్లి చెట్టును చూస్తూ, దీపాల కళకళల్తో మెరిసిపోతున్న నగరాన్ని చూడటం చాలా ఇష్టం. ఇంతకు ముందు విమానాలు వచ్చి వాలుతూండేవి. ఇపుడు ఒకటీ అరా మాత్రమే కనిపిస్తూంటాయి.


ఇన్ని ప్లాన్లూ, సిద్ధాంతాలూ ఉన్నా, ఆదివారం చక్కగా నిద్ర పోవడానికుండదు. ఏదో పని, ఎవరిదో పని. ఎందుకో ఒకందుకు ఏదో ఒక చెత్త పని తగుల్తుంది. సాయంత్రం ఆ ప్రమదావనం చాటింగ్ సమయానికే ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది. లేదా ఎవరో అతిధులు వస్తారు. అన్నీ బావుంటే కరెంట్ పోతుంది. లేదా ఇంటర్నెట్ ఉండదు. సరే ! అనుకుంటే ఇంకోటి, ఇంకోటి. చూస్తూండగానే ఆదివారం గడిచిపోతుంది. రేపు ఆఫీసులో చెయ్యాల్సిన పనులు గుర్తొస్తాయి. ఎందుకోలే గానీ నాకు ఆఫీసంటే కొంచెం ఇష్టమే. అయినా ఆదివారం ఎంత తొందరగా ముగిసిపోతుంటే - కాస్త ఆశ్చర్యం కలుగుతుంది. అపుడే చీకటి పడింది - ఇదుగో అయిపోయింది.. అని! ఇంక నా జీవితం అంతా ఆదివారాలంటే ఇలానే ఉంటాయ్యేమో !

18/10/2008

monsoon wedding

బిగ్ ఫేట్ పంజాబ్బీ వెడ్డింగ్ నేపధ్యంలో న్యూ ఢిల్లీ లో తీసిన సినిమా.. మీరా నాయర్ దర్శకురాలు ! వెడ్డింగ్ అన్న మాట పేరులో చూసి, ఇదేదో డాన్సూ, పాటలూ, సరదా, సంబరం లాంటి ఎలిమెంట్స్ మాత్రమే నింపకుండా, మంచి కధ లా తీసిన, చెక్కగా, సున్నితంగా సాగిపోయే సినిమా ఈ మోన్సూన్ వెడ్డింగ్ !


సాధారణంగా పెళ్ళిళ్ళను ఎంతో రొమాంటింక్ గా.. ఎంతో సంతోషంతో - అందరు పాత్రలూ, పాత్రధారులూ సంబరంగా జరుపుకునే ఈవెంట్ లాగా తీస్తారు సినిమాల్లో. అదే సందర్భంగా పెళ్ళింట్లో, పట్టుచీరల రెపరెపలు, ఫెళ్ళుమని ఖర్చయిపోయే రూపాయలూ, పందిళ్ళూ, బాజాలూ, బాజంత్రీలూ, పెట్టుపోతలూ, కృత్రిమమో, నిజమో గానీ బోల్డన్ని ఆప్యాయతలూ, అనురాగాలూ ఆర్భాటంగా ప్రదర్శితమయ్యే సందర్భం - పెళ్ళి. మోన్సూన్ వెడ్డింగ్ - అడావుడిగా ముప్ఫయి రోజుల్లోనే షూట్ చేసిన పకడ్బందీ సినిమా. మీరానాయర్ లాంటి దర్శకురాలూ, థియేటర్ నుంచీ వచ్చిన మెఱికల్లాంటి నటీనటులూ, మరీ ఆర్టు మూవీలాగా కాకుండా, భలే సరదాగా - గమ్మత్తయిన కధనం తో, జీవితపు అన్ని పార్శ్వాలనూ స్పృసిస్తూ తీసిన ఈ సినిమా ఒక తప్పకుండా చూసి తీరాల్సిన 'మేడ్ ఇన్ ఇండియా' సినిమా.

సినిమా.. ఒక ఎగువ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన నేపధ్యంలో మొదలవుతుంది. తంబూ వాలా (పెళ్ళి పందిరి వేసే వాడు / కాంట్రాక్టరు), పనిమనిషీ కూడా మన ఈ చిత్రం లో ముఖ్య పాత్రలు! ఈ పాత్రలకి సినిమా ప్రధాన ప్లాట్ తో ఏ సంబంధం లేకపోయినా, మన జీవితాల్లో ఇతరుల జీవితాల కలబోత స్పష్టంగా, క్యూట్ గా చూపిస్తారు దర్శకురాలు. ఒక పారదర్శకత తో - కొత్త భారతీయ జీవితాన్ని చూడండి - ఆధునికత, ప్రాచీనత, విలువలూ, నాగరికతా, ఇవన్నీ, కలగలిసిపోయి, ఫేషనబుల్ యువత, సెక్స్ - దోపిడీ - ఇలా అన్నీ కలగైసిపోయి, నేటి మన జీవితాన్ని మన ముందు అందమయిన ప్లేటర్ లో చెక్కగా పేర్చి కొందరి కధల్ని కలగలిపి (ప్రతీ పాత్ర కీ ఒక కధ ఉంటుంది, ప్రతి ఫ్రేం చూడతగినది) అందంగా వొడ్డించిన వంటకం ఈ మోన్సూన్ వెడ్డింగ్.


లలిత్ వర్మ (నసీరుద్దీన్ షా) కూతురు అదితి (వసుంధరా దాస్) కు పెళ్ళి. హడావుడి గా పెళ్ళి కుదిరింది. పిల్లాడు హేమంత్ ఐ.ఐ.టీయన్. హూస్టన్ లో ఉంటాడు. పెళ్ళి వర్షాకాలంలో! అందుకే పిల్ల తండ్రి ఇంటి బయట వేసిన తంబూ (పందిరి) వాటర్ ప్రూఫ్ చేయించాలనుకుని కాంట్రాక్టర్ కు ఆర్డర్ ఇస్తాడు. అక్కడ సినిమా మొదలవుతుంది. తీరా కాంట్రాక్టర్ తెల్లని తంబూ (విషాదాలూ, చావులకు తెలుపు వాడతారు పంజాబీలు) వెయ్యడంతో కోపం నషాళానికంటుకుని, రంకెలు వేస్తూ ఉండగా సినిమా మొదలవుతుంది. పెళ్ళిళ్ళలో సప్లయర్ల దోపిడీ - చమత్కారంగా చూపిస్తూనే, సినిమా లోతుల్లోకి తీసుకెళ్తారు. తీరా ఈ పెళ్ళికూతురికి ఒక వివాహితునితో లవ్-అఫైర్ ఉంటుంది. పెళ్ళి కూతురి కసిన్ రియా (షెఫాలీ షెట్టి,) తల లో నాలుకగా పెళ్ళి పనుల్లో సహాయపడుతూ ఉంటుంది. రియా కు యూ.ఎస్ వెళ్ళి క్రియేటివ్ రైటింగ్ లో కోర్సు చెయ్యాలనుంది. పెళ్ళి కూతురి తల్లి (లిలిటీ దూబే), పనిమనిషి, చుట్ట పక్కాలూ, పెళ్ళి కుమారుని కుటుంబం.. ఇలా ఒక్కో పాత్రా అందంగా ప్రత్యక్షం అవుతున్నారు.

ఎంగేజ్మెంట్ అయ్యాకా, పెళ్ళి పనులు మొదలయ్యాయి. తండ్రి గోల్ఫ్ కోర్స్ ఒక స్నేహితుణ్ణి చాలా మొహమాటపడుతూ డబ్బు అడగడం, అతను అందరిముందూ ఈ విషయాన్ని డిక్లేర్ చేసి, అతన్ని కొంచెం అవమానపరచడం.. నుంచీ, పనిమనిషి ఏలిస్, తంబూ ల కాంట్రాక్టరు దూబే ల మధ్య చివురించిన ప్రేమ.. ఇవన్నీ సినిమాని చూడదగ్గవి గా తయారుచేస్తాయి. అ కానీ పెళ్ళి కూతురి ఎఫైర్ - అతనితో ఆమె వ్యవహారం నడుస్తూండగా ఒక సారిఅర్ధ రాత్రి ప్రియుడ్ని కలిసేందుకు వెళ్ళిన అదితికి చేదు అనుభవం ఎదురవుతుంది. ఈ అనుభవం ఈమెను ఎంతగా ఎడ్యుకేట్ చేస్తుందంటే, హేమంత్ కు తన విషయం మొత్తం చెప్పడం కూడా చూడాలి. ఈ పెళ్ళి కి లలిత్ వర్మ కుటుంబ సభ్యులు అమెరికా, ఆస్ట్రేలియా .. ఇలా అన్ని ప్రదేశాల్నుంచీ వస్తూన్నారు. ఈలోగా తంబూ వాలా డూబే ఇంకా పనిమనిషి ఏలిస్ లు నెమ్మదిగా ప్రేమ లో పడతారు.

ఈ వచ్చే బంధుగణం తో సంబరంగా ఇల్లు కళకళలాడుతూండగ - రియా కధ తెలుస్తుంది. రియా అన్ని విషయాల్లోనూ చురుగ్గా ఉన్నా.. ఈమె తండ్రి లేనిది. తల్లి టీచర్ గా పని చేస్తూ ఉంటం వల్ల, ఆ పసితనంలో ఆ పిల్ల ని ఒక అంకుల్ (రజత్) సెక్సువల్ గా ఎబ్యూస్ చేస్తాడు. ఈ అంకుల్ ఇన్నాళ్ళకు ఈ పెళ్ళి లో ప్రత్యక్షమయ్యి ఆప్యాయత ఒలకబోస్తూ రియా అమెరికా చదువుకు తను సాయం చేస్తానని ముందుకు వస్తాడు. అయితే అతని వొంకర బుద్ది (అతనో పీడోఫైల్) పోక ఇంకో చిన్న పిల్లని దగ్గర చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా రియా.. అందరిముందూ అతని విషయం చెప్పి, గొడవ చేస్తుంది. ఈ సీన్, ఆ తరవాత సీన్ లూ, లలిత్ వ్యక్తిత్వాన్ని ఎంతో చక్కగా ప్రతిబింబిస్తాయి.

ఇంత మంచి సినిమా, ఇన్ని మలుపులూ, ఇన్ని సంక్లిష్టతలూ.. ఉన్న సినిమా, సింపుల్గా, బోరు కొట్ట కుండా, ముచ్చటగా ముప్పయి రోజుల్లో తీసారంటే, ఆశ్చర్యమే. ఈ సినిమా తప్పకుండా చూడాలి. చాందినీ చౌక్ లో కుల్ఫీ తినడం, వర్షంలో కొబ్బరి ముక్కలు అమ్మడం, ఓల్డ్ దిల్లీ లో దూబే ఇల్లూ - రిక్షా లో సవారీ.. ఇవన్నీ ఇండియాని, ముఖ్యంగా డిల్లీ లైఫ్ ని కళ్ళ ముందుంచుతాయి. నవతరంగం పాటకులు మంచి సినిమాని మెచ్చుకుంటారు కదా.. ఈ సినిమా మన మెదడుకు, మనసుకూ కూడా నచ్చుతుంది. భీభత్సాలేవీ లేవు. అన్యాయాలూ అక్రమాలూ లేవు. మామూలు మనుషుల జీవితం. మామూలు పరిస్థితులూ, వీటిల్లో మనుషుల అసాధారణ మానవత - ఇవన్నీ కలిసి ఈ సినిమాకి ప్రాణం పోసాయి.


దూబే పాత్ర లో, ఏలిస్ పాత్ర లో దిల్లీ వాలాలూ, రియా, అదితి పాత్రల్లో ఆధునిక మహిళలూ, పెళ్ళి కొడుకు వ్యక్తిత్వం, లలిత్ ఇంట్లో ఆ పెళ్ళి కొచ్చిన బంధువుల వ్యక్తిత్వం.. ఇవన్నీ ఇప్పటి మన భారతీయ సమాజాన్ని ప్రతిబింబిస్తాయి. ఇది ఆధునికత - సాంప్రదాయాల మేలు కలయిక. ఈ చిత్రంలో రియా పాత్ర ద్వారా చైల్డ్ ఎబ్యూస్ (సెక్సువల్ ఎబ్యూస్ - సాధారణంగా పిల్లలకు బాగా తెలిసిన్ వారి ద్వారా / బంధువుల వల్ల జరుగుతుందనే) విషయాన్ని బాగా చెప్పడం జరిగింది. 2001 నాటికి మన సినిమాల్లో ఈ విషయం ప్రస్తావనకు రావడం చక్కని ప్రయత్నమే.

సినిమాలో హర్షించదగిన విషయం నేచురాలిటీ ! ప్రతీ వ్యక్తి అనుభవమూ సామాన్యం. వీటిల్లో అసామాన్యం - కనీసం అసాధారణమైన డాన్సులూ - ఒక్క పిడిగుద్దుకే మనుషులు గింగిరాలు తిరుగుతూ పడిపోవడం, లాంటి లాజిక్ కు అందని సీన్ ఒక్కటంటే ఒక్కటి లేదు. సినిమా తియ్యడం ఆర్టా సైన్సా అన్న డౌట్ వస్తుంది ఇలాంటి సినిమాలు చూస్తే. పంజాబ్బీ ల ఫ్లాంబోయన్సీ - (ఖాతే పీతే టైప్) ముఖ్యంగా పెళ్ళిళ్ళలో - భలే అందంగా చూపించారు. సినిమా చివరాఖరికి బారాత్ రావడం, వర్షం మొదలు కావడం, డూబే వేసిన వాటర్ ప్రూఫ్ తంబూ (పందిరి) లో అందరూ డాన్స్ చెయ్యడం తో ఆనందం గా ముగుస్తుంది. లలిత్ దూబే నీ ఏలిస్ ను కూడా డాన్స్ లో కి లాగుతాడు. ఏమయినా పంజాబ్బీ వివాహాలు సూపర్లే అనిపించేలా భలే జరుగుతుంది అదితి పెళ్ళి. సినిమా ముగిసేసరికి, అప్పటికే ఈ ఎగువ మధ్య తరగతి జీవితంలో జరిగే రక రకాల సంఘటనల అనుభవాల్తో బరువెక్కిన మనల్ని హేపీ హేపీ గా చేసేసి, ఇంటికి వెళ్ళేలా చేస్తుంది దర్శకురాలు. ఇంత వరకూ చూడక పోతే త్వరగా చూడండి.

16/10/2008

శ్రీలంక - హా !

చాలా ముద్దొచ్చీసింది నాకీ వేళ జయలలిత స్టేట్మెంట్ చదివి. ఇప్పుడు దేశం అంతా వొళ్ళంతా చెవులు చేసుకుని సిగపట్లేసుకున్న ఇద్దరు అమ్మలిద్దరి గొడవా చూస్తూ... వింటూ ఉంటూండగా, ఇంకో పక్క ఇంకో గడ్డిపోచలమ్మ వీధి లో గొడవ పడుతూ ఉండగా, సాధారణంగా బేజారెత్తించే ఈ యమ్మి మాత్రం, మంచి తెలివైన మాట చెప్పింది.

అసలు శ్రీలంక అంతర్గత వ్యవహారాల్లో చెయ్యీ కాలూ ముక్కూ దూర్చడానికి మనమెవ్వరం ? ఒక టెర్ర్రరిస్టు / ఉగ్రవాద సంస్థ మీద ఒక దేశ ప్రభుత్వం అంత మంచి విజయం సాధించబోతూ ఉండగా, దాన్ని నిరోధించడానికి (వాళ్ళు ఎత్నిక్ గా తమిళులు కావడం వల్ల మాత్రమే) మనం ఎవరం ?

వీధుల్లో బాంబులు పేలడం, మనుషులు చావడం సాధారణం అయిపోతున్న మన దేశంలో, ఉగ్రవాదం - పచారీ కొట్లలో కూడా ఈసీ గా దొరుకుతున్నప్పుడు (మన దేశంలో తీవ్రవాదాన్ని ప్రచారం చెయ్యడం / మారణ హోమం సృష్టించడం, అతి సులభం) .. మన ముందున్న ముఖ్య శత్రువు తీవ్రవాదం. మనం తీవ్రవాదుల్ని ఏమీ చెయ్యం. ఇంకెవ్వర్నీ ఏమీ చెయ్యనివ్వం !

చేస్తే, మిత్ర పక్షాల వారికి అది ఒక సామాజిక వర్గాని టార్గెట్ చేసిన వేధింపు లా కనిపిస్తుంది. (Mulayam & Amar loves SIMI) అలా అయితే ఎలా ? శ్రీలంక లో ఇన్నాళ్ళకిన్నాళ్ళకి తీవ్రవాదానికి ప్రతిఘటన ఒక స్థాయి కి అంటూ చేరినపుడు, అందులో ప్రభుత్వ విజయ సూచనలు కనిపిస్తున్నపుడూ, ప్రభాకరన్ ఒత్తిళ్ళకు (సానుభూతితో నా ) ఈ తమిళ ముఠా అంతా, ప్రధాని మీద ఒత్తిడి తేవడం.. అన్యాయం. తెస్తే తెచ్చేరు - ఈయన ఎందుకు లొంగిపోవాలి ?

ప్రభాకరన్ ఇప్పుడు కలుగు లోంచీ బ్రతికి బయటకు వస్తే ఎలా విజృంభిస్తాడో, ఇంకెంత మందిని పొట్టనపెట్టుకుంటాడో - ఇంకెందరు తీవ్రవాదులకు సాయపడతాడో - ఈ విజయం కలిగించే పరిణామాలకు రక్షక దళాలకు ఎంత నైతిక మైన అస్థైర్యాన్ని ఇస్తుందో - ఎవరికన్నా ఆలోచన ఉందా ?

మన దేశంలో, మన వ్యవహారాల్లో ఇంకొకరు చెయ్యి దూరిస్తే మనం అందుకే చచ్చినట్టు ఊరుకుంటాం. అరుణాచల్ ప్రదేష్ మాది అని పైవారు అంటే - హీ హీ అని నవ్వుతాం. కాష్మీరు మాది అని ఇంకొకరు అంటే - చీ పో ! అని సిగ్గుపడతాం. ఇంక మనల్ని రోజుకోక చోట, పూటకొక రకంగా తీవ్రవాదం బెంబేలెత్తించకపోతే ఏమి చేస్తుంది ?

తీవ్రవాదానికి - అన్నట్టు ఇంతవరకూ బలవుతూంది సామాన్య ప్రజలే - మన దేశంలో - ఎవరన్నా పెద్దాయన, రాజకీయ నాయకుడో / స్థాయి పరంగా చూసుకుంటే, ఏ 'గాంధే'య వాదో చచ్చూరుకుంటే తప్ప, వ్యవస్థ లో చలనం ఉండదు. అప్పటివరకూ మనకి అందరూ 'బాగా' కావాల్సిన వాళ్ళే ! మా వాళ్ళ మీద చెయ్యి వేస్తే బావుండదండీ అని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉండండి - మీ పీక నొక్కే వాడు మీ వెనకే తయారవుతాడు !

శ్రీ లంక లో వినిపిస్తున్న ఆ 'హా హా కారాలు ' ఇప్పుడు ప్రభాకరన్ నుంచీ వినిపిస్తున్నాయి. తమిళులు - చాందస వాదులూ - బుద్ధి హీనులూ - అతన్ని రక్షించాలని చూస్తూండడం చాలా అయోమయంగా వుంది. ఈ అయోమయంలో ఈ అమ్మి మాటలు విని అందుకే కొంచెం ముద్దొచ్చీసింది.

ఎవర్నీ వ్యతిరేకించడానికి అని కాదు గానీ.. ఒకరు తీవ్రవాదానికి వ్యతిరేకంగా పని చేస్తున్నప్పుడు, అది కాదండీ మాకు ప్రభాకరన్ బాగా కావల్సిన వాడు (తమిళుడు - కరుణానిధి గారి ప్రకారం) - వాడ్ని మీరు చంపకండీ అని బతిమలాడే మనం - రేప్పొద్దున్న మనల్ని పేలుచుకు చంపే తీవ్రవాదుల్ని పాకిస్తాను వాళ్ళు - ''స్వాతంత్ర పోరాట యోధులు'' అనకూడదని ఎలా డిమేండ్ చెయ్యగలం ?

13/10/2008

పిచ్చి ప్రేమ

సరదాగా వచ్చేసి ప్రేమించేస్తున్నానన్నాడు.
సరే లే అన్నాను.

కున్ని రోజులకు ప్రేమ ఉంది లే గానీ.. పరిస్థితులు బాలేవన్నాడు.
ఏమీ పర్లేదులే అనేసేను.

ఇంకున్ని రోజులకొచ్చి ప్రేమ ఎక్కువైపోయింది
తట్టుకోలేకపోతున్నా అని గొడవ చేసాడు.
పోనీలే తగ్గిద్దూలే అనేసి ఒప్పేసుకున్నాను.

ఉన్నట్టుండి... నిన్ను చూడ్లేకుండా ఉండ్లేనన్నాడు.
అవునా అని నోరెళ్ళబెట్టాను.

ప్రేమ గీతాలు నేర్చేసుకునుచ్చి పాడేడు.
పెన్నులూ, పెనిసిళ్ళూ కానుకలిచ్చి నన్ను వల్లో వేసేసుకున్నాడు
కారు లో లాంగ్ డ్రైవ్ అన్నాడు.
వీలు నాకిస్తేగానీ వీల్లేదన్నాను.
అయినా - ప్రేమించాను గా ఇంక చస్తానా అన్నాడు.
నేను ఉప్పొంగిపోయేను.


కొన్ని రోజులు పోయాకా, మళ్ళీ సరదాగా
చూద్దాంలే ప్రేమ సంగతి అన్నాడు.
నేనూ చూద్దాంలే అన్నాను.


మనసులో ప్రేమ బాధ కొన్ని రోజులు పడి,
నా వల్ల కాదేమో నని భయపడిపోయీనన్నాడు
సరే ఎందుకొచ్చిన గొడవలే అని - ఊరుకోద్దూ అని సముదాయించేను.


ఒకసారెప్పుడో, ఎమోషనల్గా ఎటాచ్ కాకు అమ్మలూ అని హితబోధ చేసేడు.
తరవాత నీ గుండె పగిలితే నేను తట్టుకోలేను కన్నలూ అని చెప్పాడు
అపుడు కూడా నిజమే నిజమే.. భద్రం, మనసు భద్రం అని జాగర్తపడిపోయేను.

ఊరెళ్ళిపోతూ, మర్చిపోతావా.. మర్చిపోకు నన్ను - అని ఒట్టేయించుకున్నాడు.
లేదు లేదు.. నాకు జ్ఞాపక శక్తి ఎక్కువే ని ఒప్పించీసేను.
ఆరోగ్యం జాగర్త - కంగారు పడిపోకు - ఆర్గనైస్డ్ గా ఉండు అని జీవితాన్ని గురించి బోధపరిచేడు.
నువ్వే నా ప్రియ నేస్తం అని తనకి చెప్పేసి ఎస్ ఎం ఎస్ ఇచ్చీసేను.

కొన్నిరోజులతరవాత బుద్దొచ్చి, జ్ఞాన దంతాలు వొచ్చి, లోక్ జ్ఞానం తెలిసొచ్చి..
మెడుల్లా ఆంబ్లాగేటా సర్వీసింగ్ చేయించుకొచ్చి,
నాకు భవ బంధాలున్నాయి.. అర్ధం చేసుకోమ్మా అని బ్రతిమలాడేడు.
మరేమీ పర్లేదు.. నేనేమీ నీ ప్రేమ కోసం అల్లాడట్లేదులే - పోయి స్వతంత్రుడవు కా ! అని ఆశీర్వదించేను.


చివరాఖరికి - నా వల్ల కాదని చెప్పి వొదిలేసాడు.
నేనూ - నా వల్ల అంతకన్నా కాదులే అని ఊరుకున్నాను.


ఎందుకొచ్చిందో ప్రేమ, ఎలా వొచ్చిందో అలా నిష్క్రమిస్తే గొడవేముంది ?
ఇంత పకడ్బందీ గా అంటీ ముట్టకుండా ప్రేమించినా, గుండె లోతుల్లోకి గాయం చెయ్యకుండా ఉండలేకపోయింది.

అరే ! నా మీద కొంచెం కూడా నీకు ఫీలింగ్స్ లేవన్నాడు.
నువ్వెప్పుడూ నన్ను తేలిగ్గానే తీసుకున్నావన్నాడు.
నేను ఏడ్చి మొర పెట్టలేదని నొచ్చుకున్నాడు.


అంతూ పొంతూ తెలియని పిచ్చి ప్రేమల్లో ఏమి జరుగుతుంది ? ఇక్కడా సరిగ్గా అదే జరిగింది.
అతను నొచ్చుకునందుకు నేనూ నొచ్చుకున్నానంటే నమ్మడు.
నేనూ ప్రేమించేనబ్బా అంటే వినడు.

04/10/2008

నిషబ్ద్

నిషబ్ద్ - పోస్టర్ మీద 'అతనికి 60, ఆమెకు 18' అని రాసి ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్ కాస్త ఇరుకైనది. నిషబ్ద్ అసలు చాలా హైప్ లోంచీ, కాంట్రవర్సీ, ఈ సబ్జెక్ట్ మీద ఎప్పట్లాగే మీడియా లో చర్చల లోంచీ బోల్డంత ఆసక్తి కలిగిస్తూ థియేటర్లలో విడుదలయింది. ఇలాంటి ప్రేమ ని ఒప్పుకోలేని సమాజం సంకుచితమా, సమాజం హర్షించలేని ఆ ప్రేమ సంకుచితమా అని మనుషుల్లో కలిగే ఒక ఆలోచన కలిగించడానికి పనికి వస్తుంది.


నిజంగా చెప్పాలంటే, ప్రేమకు వయసు, కారణం.. ఇలాంటివన్నీ ఉండవు. సినిమాల్లో అయితే మరీ గ్లోరిఫై అయిన ప్రేమ - మొదటి చూపు లోనే ప్రేమ - ప్రేమించిన అమ్మాయి కోసం అబ్బాయి, చంపడం లేదా చచ్చిపోవడం, ఇలాంటివన్నీ సాధారణంగా చూస్తూ ఉంటాము గాబట్టి మనకవన్నీ అలవాటే. నిజ జీవితం లో ప్రేమ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ముఖ్యంగా వయసు మళ్ళిన ఒక గృహస్థు (భార్యా, పిల్లలు కలవాడు) తన వయసులో కన్నా ఎంతో చిన్నదైన అమ్మాయిని ప్రేమించడం - ఆ అమ్మాయి, అతని కూతురి స్నేహితురాలు కావడం, ఇవన్నీ ఎంత అనూహ్యమైన విషయాలు ?


నిషబ్ద్ మొదలయేసరికే విజయ్ (అమితాబ్) ఒక పర్వత శిఖరం కొన మీద నించుని ఉంటాడు - అక్కణ్ణించీ దూకి, ఆత్మ హత్య చేసుకోవడానికి. ఎందుకు - అంత కష్టం ఏమొచ్చిందీ అంటే - అతను చెప్పిన తన కధ ఈ నిషబ్ద్. ఒక నటుడిగా అమితాబ్ విలక్షణత, అతని భార్యగా నటించిన రేవతి మీనన్ ప్రతిభ ఈ సినిమాని చూడ చక్కగా తీర్చిదిద్దాయి.


కేరళ లో (మున్నార్) అందమైన పిక్చర్ పెర్ఫెక్ట్ పరిసరాల్లో విజయ్ (అమితాబ్), అమృతల (రెవతి) అందమైన పొదరిల్లు లాంటి ఇల్లు. విజయ్ ఒక ఫొటొగ్రాఫర్. వీళ్ళకి ఒక అందమైన కూతురు రీతు (ష్రద్ధా ఆర్య)! ఈ అమ్మాయి స్నేహితురాలే జియా. జియా ఒక ట్రబుల్డ్ టీనేజర్. ఈమె తల్లిదండృలు విడిపోయారు. తల్లి ఆస్ట్రేలియా లో ఒంటరిగా ఉంటుంది. జియా మాత్రం ఇండియాలో ఉండి చదువుకుంటూంది. ఈమె రీతూ తొ కలిసి, శలవులకు కేరళ రావడంతో కధ మొదలవుతుంది. రామూ శైలి లో జియా..(ఆస్ట్రేలియన్ పెంపకం గాబట్టి అనుకోవాలా) చిన్న చిన్న బట్టల్లోనే పరిచయం అవుతుంది. ఈ ఇద్దరు పిల్లల్నీ రీతూ తల్లి దండృలు ఎంతో సాదరంగా ఆహ్వానిస్తారు. రీతూ, జియా ఇద్దరూ ప్రాణ స్నేహితులు. రీతూ కన్న, జియా చాలా పెంకిది, తెలివైనది. చురికైనది. తొందరలోనే, అందరితోనూ కలిసిపోతుంది.


అయితే ఆమె లో ఏదో చైతన్యం తో విజయ్ (అమితాబ్) ఉత్తేజితుడవుతాడు. ఆమె కూడా అతని పట్ల తెలియని ఇష్టాన్ని పెంచుకుంటుంది. ఇవన్నీ ఎవరికి వారు గమనించుకునే లోగానే, ఇద్దరూ ప్రేమ లో పడతారు. ప్రేమ లో పడటానికి మనలో ఏదో కావాలి. అది ఏమిటి - మనలో స్పందనల్ని ఒడిసిపట్టగలిగే ప్రేరణలని ఎదిరించి, ప్రేమ కోసమే ప్రేమించడానికి కూడా ఏదో అవసరం. అందరూ ప్రేమించలేరు. అయితే, సమాజంలో ప్రేమ కి ఒక బాధ్యత ఉంటుంది. ఒక భార్య కి భర్త అయి ఉండి, ఒక కూతురి తండ్రి అయి ఉండి, తన కూతురి వయసు పిల్లతో ప్రేమ లో పడటం న్యాయం కాదు. అయితే ఎవరూ కావాలని ప్రేమ లో పడరు.


అంతవరకూ తన భాద్యతలని ఎరిగిన మనిషిగా, ఎంతో హుందాగా, ఎంతో గౌరవంగా జీవితాన్ని గడిపిన వ్యక్తి, తన వయసుని మరిచి, తన ముందున్న స్త్రీని ఒక స్త్రీ లాగా ప్రేమించడం, అదే తొలి ప్రేమ అన్నంతగా ప్రేమించడం సాధ్యమా..?


జియా ఖాన్ కూడా చాలా అందంగా - యవ్వనంతో మిసమిస లాడుతూ, కనిపించినా, పాత్ర పరంగా తన అంతరంగం లో దాగున్న అగ్నిపర్వతాలను కూడా చాలా బాగా ప్రదర్శించింది. జియా (పాత్ర పేరు కూడా అదే) ఒక ఫ్రీ బర్డ్. ఆమె అన్ని మానసిక అవసరాలనూ తీర్చడానికీ ఒక కుటుంబం అంటూ లేకుండా, ప్రేమను అనుభవించకుండా, బలవంతపు కఠినాత్మకత, కేర్లెస్ నెస్, తల్లి కున్న బాయ్ ఫ్రెండ్స్ ని చూస్తూ, తల్లి అనుభవాల్ని చూస్తూ ఏర్పరచుకున్న వ్యక్తిత్వం ఆమెది. అంతవరకూ ఆమె తొ మామూలుగానే ఉంటూ వచ్చిన తల్లి బాయ్ ఫ్రెండ్ కూడా - తనకు కాస్త వయసు రాగానే తననే ఆశించడాన్ని తీవ్రంగా అసహ్యించుకున్న వ్యక్తి - ఒక తెగిన గాలిపటం. ఇపుడు ఆమెకు ఆస్ట్రేలియా వెళ్ళడం ఇష్టం లేదు. ఎందుకంటే అక్కడ 'అతను ' ఉంటాడు. తల్లి అతన్ని వొదులుకోలేదు.


ఇలాంటి అమ్మాయికి ఈ అరవయ్యేళ్ళ వృద్ధుణ్ణి చూసి ప్రేమ కలిగింది. అయితే, తను అనుభవిస్తున్న ప్రేమ వెనకున్న పరిమాణాల సంగతి ఆమెకు తెలియదు. ఆమెకు ప్రేమో / ఆకర్షణో కలిగింది. ఈ ప్రేమకి చలించిన విజయ్ - తన వయసునీ, వరుసనీ మరిచి, పిచ్చివాడైపోతాడు. అతను అలా చెయ్యకూడదు - అలా చెయ్యకూడదని జియాకు తెలియదు. ఆమె లో భారతీయత తక్కువ.


ఈ సినిమా లో రేవతి గురించి చెప్పుకోవాలి. రేవతి అంటేనే, చాలా మంచి నటి.. అని అందరికీ తెలుసు. ఒక సారి జియా వీళ్ళ ఫేమిలీ ఫోటోలు చూస్తూండగా, రేవతి చిన్నపుడు (పెళ్ళి కాక ముందు) భరతనాట్య ప్రదర్శన ఇచ్చినప్పటి ఫోటో కనపడుతుంది. అపుడు జియా 'ఆంటీ.. మీకు డాన్స్ వచ్చా.. ?' అంటే నవ్వి రేవతి 'పెళ్ళయ్యాక మానేసాను ' అంటుంది. జియా.. ఎందుకు మానేసారు అని అడిగితే, ఆలోచన లో పడి.. 'పెళ్ళయ్యాక, విజయ్ నే నా జీవితం. తరవాత రీతూ వచ్చింది.. ఇంకెక్కడ కుదురుతుంది ?' అంటుంది. ఇంతగా కుటుంబం కోసం తన ఇష్టాఇష్టాలని వొదులుకుని, పూర్తిగా విజయ్ కే అంకితమైన భార్య ఆమె.


విజయ్ గా అమితాబ్ - తప్పు ఒప్పుల సంఘర్షణల మధ్య ఊగిసలాడినా.. జియా వైపే మొగ్గుతూ ఉంటాడు. ఈ పరిస్థితుల్లో రీతూ కు తండ్రికీ, తన స్నేహితురాలికీ మధ్య ఉన్న 'అనుబంధం' గురించి అనుకోకుండా తెలుస్తుంది. తండ్రికి తల్లి కాకుండా వేరే ఎవరితోనో 'ప్రేమ ' ఉందని తెలిస్తే ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది ? రీతూ గా ష్రద్ధా ఆర్య నటన చాలా బావుంది. ఈ అమ్మాయి, ఈ విషయాన్ని తల్లికి చెప్పలేక, తండ్రితో మాట్లాడలేక, (జియా తో మాత్రం మాటాడటం మానేస్తుంది) ఎంత తల్లడిల్లిపోతుందో చూస్తే జాలి కలుగుతుంది. ఆఖర్న తల్లికి జియాని పంపెయమ్మా.. తను మనింట్లో ఉండొద్దు ! అని చెప్తే, అమృత కి అసలు విషయం అర్ధం కాదు. ''మీరు ఫ్రెండ్స్ కదా - అలా కోపం వస్తే ఆమెని వెళ్ళిపోమంటారా ఎవరైనా..?'' అని సర్దేస్తుంది. ఈ పాత్ర లో రేవతి ఎంత చక్కగా ఒదిగిపోయిందంటే, ఆమెకి భర్త మీద లేశమాత్రమైనా అనుమానం ఉండదు. అసలు వీరిద్దరి మధ్యా జరుగుతున్నది రేవతి కి మాత్రం కనిపించదు - అనిపించదు.


ఈ పరిస్థితుల్లో ఆపధ్బాంధవుడిలా శ్రీధర్ (నాజర్) (అమృత సోదరుడు) ప్రవేశిస్తాడు. రీతూ తన హోం ట్రూత్ ని మామయ్య కి చెప్పడం, ఆయన విజయ్ తో (అమితాబ్) తో ఈ విషయం డిస్కస్ చెయ్యడం (జియా ఇంకా చిన్నపిల్ల ! ఆమె ఒక వేళ నిన్ను నిజంగా ప్రేమించిందే అనుకో - నీ వయసు కు నువ్వు ఆమెకు ఎలాంటి జీవితాన్నివ్వగలవు ? ఆమె ను ప్రేమించి, ఆమె ఫ్యూచర్ కు నువ్వు అన్యాయమే చేస్తున్నావు అని వాదిస్తాడు శ్రీధర్) చివరికి రేవతి కి కూడా సంగతి తెలియడం.. ఆమె భర్తని అసహ్యించుకోవడం..(అది చూసి తీరాల్సిన సీన్) చివరికి సమాజపు, కౌటింబికపు భాద్యతల పరంగా విజయ్ - జియాని పిలిచి, 'నేను నిన్ను ప్రేమించడం లేదు - నీది ఎడాలసెంట్ వయసు అందుకే నీకు అలా అనిపిస్తూంది. నువ్వు నా ఇంటి నుంచీ వెళిపో. నీ ముఖం కూడా చూపించొద్దు. ఏదో కాస్త ప్రేమ గా మాట్లాడితే అది నిజం ప్రేమ అనుకుంటావా..'' లాంటి ఏవో మనసు విరిచే మాటలని, ఆమెను ఇంటినుంచీ వెళ్ళగొట్టడం - తో ఈ గొడవ సద్దుమణుగుతుంది. ఈ నిరాకరణ ని ఎదుర్కోవడానికి జియా కు ఎంత ధైర్యం కావాలి ? జియా విజయ్ ని బ్రతిమాలుతుంది. 'నిన్ను చూడకుండా ఉండలేను ' అంటుంది. కానీ అమితాభ్ కాఠిన్యాన్ని చూసి, గుండె చెదిరి - ఏడుస్తూ వెళిపోతుంది. ఈమెను ప్రేమించే బాయ్ ఫ్రెండ్ (ఆమె ఇష్టపడదు) ఆఫ్తాబ్ శివ్ దాశానీని పిలిచి అతనికి ఆమెని అప్పగించేస్తాడు విజయ్.


ఈ చిన్ని ఎపిసోడ్ ముగిసాక, విజయ్ ఒంటరి అయిపోతాడు. అతనితో భార్య మాటలాడదు. (ఆమె విశ్వాసాన్ని అతను కోల్పోయాడుగా) కూతురు అసహ్యించుకుంటుంది. జియా లేదు. వెళిపోతున్న జియా ఎంత హర్ట్ అయిపోయి వెళిపోయిందో అదే గుర్తొస్తూ.. ఆమె లేక బ్రతకలేక, ఆ కొండ కొమ్మున నించుని ఉంటాడు అమితాబ్. కానీ చాలా సేపు, ఆమె ని తలచుకుని రోదిస్తూ.. పొద్దు పోయేదాకా గడిపి, ఇంటికొస్తాడు. Sridhar (నాజర్) 'ఇంత వరకూ ఎక్కడికెళ్ళావు విజయ్?' అని అడిగితే, 'చావడానికీ అని నిర్లిప్తంగా చెప్పి - 'కానీ చావలేకపోయాను. జియాని తలచుకుంటూ.. ఆ విరహ బాధలో ఇంకొన్నాళ్ళు ఆమె కోసం బాధపడుతూ బ్రతకాలనుంది - అందుకే ఇంటికొచ్చేసాను ' అంటాడు. అప్పుడు విజయ్ లో ఉన్న ప్రేమ తీవ్రత అర్ధం అవుతుంది. అంతే..! ఇదే ముగింపు.


అయితే, రాం గోపాల్ వర్మ కి కొంచెం ప్రేక్షకులను ఆకర్షించడానికి కాస్త ఉత్సాహపడే లక్షణం - ఈ సినిమాని కొంచెం (కొంచెమే లెండి) చతికిలపరిచాయి. కొన్ని సార్లు ప్రేమ ని కొంచెం మంచిగా చూపించాలి. సౌందర్యానికీ, పొడుగు కాళ్ళకూ, స్కిన్ షో కూ కొంచెం ఎక్కువ మోతాదులో ప్రాముఖ్యత ఇస్తే, జియా ఖాన్ ని తడిపి, చిన్న బట్టల్లో చూపితే - అది చూసి అమితాబ్ కు ప్రేమ కలగడం - ఇవి కొంచెం చీప్ గా అనిపిస్తాయి. సినిమా లో జియాఖాన్ కాళ్ళు చూసీ చూసీ విసుగు పుడుతుంది. అసలు జియా ఖాన్ ముఖం చూస్తేనే చిరాకు వచ్చేంత వరకూ చూపించి, చివరి అర్ధ గంట లో మాత్రం మంచి నటన చూపించాడు. ప్రేమ ఒక ఉత్కృష్టమైన భావన. దీన్ని అంతకన్నా తక్కువగా చూపిస్తే, అది కన్విన్సింగ్ గా ఉండదు.


విజయ్ పాత్ర లో అమితాబ్ కాకుండా ఇంకోరెవరైనా ఉంటే సినిమా తేలిపోయి ఉండేది. నిస్సహాయమైన ఒక వృద్ధ ప్రేమికుడి గా విజయ్ 'జియా జ్ఞాపకాలలో నైనా జీవించాలని ఉంది..' అన్నప్పుడు పురుషుని ప్రేమ ఎంత లోతైనదో అర్ధం అవుతుంది. మన సమాజం లో - ఒక వయసు రాగానే పెద్దలు కుదిర్చిన పెళ్ళీ.. పెళ్ళి అయిన కొన్నాళ్ళకి పిల్లలూ - ఇవి మనుషులకి తప్పని చిక్కుముళ్ళు. వీటికి వ్యతిరేకంగా ఏ ఒక్కటి జరిగినా సమాజం లో అలజడి మొదలవుతుంది. 'ఇంకా ఎందుకు పెళ్ళి చేసుకోలేదు '? 'ఇంకా ఎందుకు పిల్లలు కనలేదు ?' 'ఇంకా ఎందుకు మీ పిల్లలకి పెళ్ళి చెయ్యలేదు ?' ఇలా ప్రశ్నలు - వీటికి సమాధానం ఏముంది ? పెళ్ళి బయట ప్రేమ అంటే సమాజం (family) ఊరుకుంటుందా ? అయినా ఒక కుటుంబాన్ని కలిపి ఉంచే నమ్మకం, విశ్వాశం, ప్రేమ, ఇవన్నీ ఏమిటి ? ఈ ఏక్సిడెంట్ ల తరవాత ఆ ముగ్గురు కుటుంబ సభ్యులూ బాధితుల్లా ఒకరి కొకరు దూరమయిపోయి - తట్టుకోలేని నిశ్శబ్దం లో మిగిలిపోతారు. ఈ నిశ్శబ్దం లో కూడా విజయ్ లో ప్రాణాన్ని హరించకుండా నిలిపి ఉంచింది, ఈ ప్రేమే. నిష్కారణంగా బంగారం లాంటి సంసారాన్ని పాడుచేసుకున్నాడే - అనిపించినా, ఎట్ లీస్ట్ జియా పట్ల తనకి కలిగిన ప్రేమ ని అంగీకరించి, (రేవతి ముందు) నిజాయితీ గా, దాని పర్యవశానాన్ని ఎదుర్కున్న ప్రేమికుడిగా అమితాబ్ చాలా చక్కగా నటించారు.


So..ఇన్ని సమస్యలకూ ఒక కళా రూపం నిషబ్ద్ ! పోస్టర్ చూసీ, స్టోరీ వినీ, వెళ్ళని వారు భయపడకుండా చూడొచ్చు. భారత దేశపు అత్యుత్తమ నటులు ముగ్గురు ప్రధాన పాత్రల్లో నటించారు. పర్లేదు. ధైర్యంగా చూడండి.

02/10/2008

15 పార్క్ ఎవెన్యూ

15 పార్క్ ఎవెన్యూ - భూటాన్ లో తీసారు....(అదో .. రెఫ్రెషింగ్ ఫీలింగ్)... నేనప్పటకి ఢిల్లీ కీ గల్లీల్లో ఉండేదాన్ని. ఇప్పట్లాంటి గడ్డు రోజులు కావవి. ప్రగతీ మైదాన్ (Sakuntalam) లో యాభయి రూపాయలు పెడితే మంచి సినిమా టికెట్ దొరుకుతుంది. పార్కింగ్ ఫ్రీ. ఆఫీసు 5.30 కి ముగిసాకా, వేరే వేరే చోట పనిచేసే మా ఫ్రెండ్స్ అందరం మా వాయు భవన్ ముందర కలుసుకుని, పొలోమంటూ ప్రగతీ మైదాన్ కి పోయి, టికెట్ కొన్నాక ఓమాటు బైటికొచ్చి, ఆవనూనె లో వేయించిన పెసలు తింటూ, హాయి హాయి గా గడిపి, 7 / 8 గంటల షో (సినిమా నిడివి బట్టీ) కి తయారయ్యేవాళ్ళం.


అలాంటి రోజుల్లో అపర్ణా సేన్ సినిమా కాబట్టి బోల్డంత ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళి చూసిన సినిమా ఈ '15 పార్క్ ఎవెన్యూ'. కధ - గురించి ముందే తెలుసుకునుండకపోయుంటే, కొంచెం కష్టం అయేది. కానీ స్కీజో ఫ్రీనియా అనే ఒక రకమైన మానసిక రోగం తో బాధపడే ఒక అమ్మాయి కధ అని విని ఉన్నాం కనుక - ఈ మేధోపరమైన సినిమాకి మానసికంగా తయారయి ఉన్నాం. ఈ అమ్మాయి పేరు మీఠీ (కొంకణా సేన్ శర్మ). ఈమె, తన అక్కయ్య షబానా ఆజ్మీ తో కలిసి 15 పార్క్ ఎవెన్యూ అనే ఎడ్రెస్ వెతుకుతూండడంతో సినిమా మొదలవుతుంది.


మీఠీ కి తనకి జయొదీప్ తో పెళ్ళయిందనీ, తనకు 5గురు పిల్లలున్నారనీ, తామంతా పార్క్ ఎవెన్యూ లో 15 వ నెంబరు ఇంట్లో ఉన్నామనీ ఒక భ్రమ. అది భ్రమ మాత్రమే కాదు.. అదే ఆమెకు సంబంధించిన జీవితం, ఆమె అస్థిత్వం. ఇలాంటి భ్రమనే నమ్ముకుని జీవిస్తున్న మీఠీ ని కంటికి రెప్ప లా కాపాడుకుంటూ వస్తున్నారు తన అక్కయ్య (షబాన) మరియూ తల్లి (వహీదా రెహ్మాన్). వీరందరి జీవితాల్తోనూ ఒక నిజమైన జయొదీప్ (రాహుల్ బోస్) తరవాత వచ్చి కలిస్తే, కొన్ని అత్భుతమైన పెర్ఫార్మెన్సులూ, కొన్ని విషాద సంఘటనలూ, అత్యత్భుతమైన స్క్రీన్ ప్లే..ఇవన్నీ కలిసి, గుండె తరుక్కుపోయేలా చేసే జీవిత క్రమాలూ.. కలిస్తే 15 పార్క్ ఎవెన్యూ అవుతుంది.

అందరూ బెంగాలీ లూ (బహుశా వహీదా, kanwaljit తప్ప) కలిసి, ఈ సినిమాని చాలా మంచి హైట్స్ కి తీస్కెళ్ళి వొదిలేసారు. సినిమా ముగిసాకా, పట్టేసిన గుండె సర్దుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. మీఠీ చిన్నప్పట్నించీ హాలూసినేషన్స్ కి గురవుతూ ఉంటుంది. ఆమెకు తండ్రి మానశిక చికిత్సాలయం లో ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తారు. కొన్నేళ్ళకు పరిస్తితి మెరుగు పడినట్టనిపించి సగం, అక్కడ కన్నా, ఇంట్లో అయితే ఆడపిల్లకు సేఫ్ అనీ ఆలోచించీ సగం, పిల్లను ఇంటికి తీసుకొచి కాలేజీ లో చేర్చి మంచి మానసిక ఆలంబన అందిస్తుంది ఆ కుటుంబం. కాలేజీ లో జర్నలిజం లో కోర్స్ చేస్తుంది మీఠీ. అక్కడే జొయొదీప్ (రాహుల్ బోస్) పరిచయం అవుతాడు. రాహుల్ బోస్ అంటే నాకు 'ఇంగ్లీష్ ఆగస్ట్ ' సినిమా నుంచీ కొంచెం ఇష్టం.


జొయొదీప్ అంటే పిచ్చి ప్రేమ పెంచుకుంటుంది మీఠీ. ఒక మంచి ప్రేమికుడిగా, స్నేహితుడిగా, మీఠీ లో ముడుచుకుపోయే తత్వాన్ని పోగొట్టడానికి, ఆమె లో ఆత్మ విశ్వాసం నింపడానికీ జొయొదీప్ ప్రయత్నిస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరి సంగతీ, పెద్దలకు తెలిసి, వారికి ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అవుతుంది. ఈ లోగా జర్నలిస్ట్ గా ఉద్యోగం చేస్తున్న ఈ పిల్లను యాజమాన్యం ఒక చోట అల్లరి మూకలు (ప్రస్తుతం కాంధమాల్ లో జరుగుతున్నట్టు) చేస్తున్న అల్లర్లను కవర్ చేయడానికి పంపబోతుంది. అయితే మొదట బెదిరినా ఆ అమ్మాయి, జొయొదీప్ ముందు తనను తాను నిరూపించుకోవడానికి ఈ ఎసైన్మెంట్ కు ఒప్పుకుని, కుటుంబ సభ్యులకు సరిగ్గా వివరాలు చెప్పకుండానే ఆ భయంకర ప్రదేశాల్లోకి ఒంటరి గా వెళ్తుంది. అక్కడ దారుణంగా గేంగ్ రేప్ కు గురవుతుంది. ఈ షాక్ కి ఆమె ఈ సారి నిజంగానే మానసికంగా బలహీనురాలయిపోతుంది.

ఎలాగో ఈ వార్త తెలిసి, మీఠీని ఇంటికి తీసుకొచ్చాకా, మీఠీ ని కలవడానికి వెళ్ళిన జొయొదీప్ - తన పరిస్థితి చూసి జాలి తో నిండిపోతాడు. తనను తాకిన వెంటనే మీఠీ జొయొదీప్ ను గుర్తించక, కరెంట్ షాక్ కొట్టినట్టు, వెనక్కి తప్పుకుంటుంది. ఆమెకు స్పర్శ అంటేనే ఏదో ఏవగింపు.. భయం. తను చేసుకోబోయే అమ్మాయి మీద ప్రేమతో తప్ప, ఇలా జాలితో పెళ్ళి చేసుకోలేనని చెప్పి, జొయొదీప్ వారి జీవితాల్నుంచీ నిష్క్రమిస్తాడు. తండ్రి ఈ విషాదానికి తట్టుకోలేక, గుండెపోటు తో మరణిస్తాడు.

ఇన్ని విషాదాల తరవాత మీఠీ ని ఆక్రమించుకున్న స్కీజోఫీర్నియా.. ఆమె ను ఆమె గతంలో జొయొదీప్ తో కన్న కలలే నిజం అనేంత గా భ్రమల్లో ముంచుతుంది. జొయొదీప్ తో తనకు నిజంగానే పెళ్ళయినట్టూ, వారికి 5 గురు పిల్లలున్నట్టూ, వారంతా 15 పార్క్ ఎవెన్యూ లో నివాశం ఉంటున్నట్టూ ఊహించుకుంటూ ఆ ఊహల్లోనే బ్రతుకుతూ ఉంటుంది మీఠీ.


ఇన్ని కాంప్లెక్సిటీ ల తరవాత.. కొన్నాళ్ళకి జొయొదీప్ నిజంగానే వీరి జీవితాల్లోకి వస్తాడు. ఈ రావడం యాధ్రుచ్చికంగానె జరిగినా, మీఠీ ప్రస్తుత పరిస్థితి చూసి, ఆమె ఈ పరిస్థితికి కాస్త తనూ కారణమేనేమో అన్న గిల్టీ ఫీలింగ్ తో తను ఆమెకు ఏదోలా సహాయం చేద్దామనే ఉద్దేశ్యంతోనే వస్తాడు. మీఠీ కి 15 పార్క్ ఎవెన్యూ వెతకడానికి సహాయం చేస్తానని చెప్తాడు. కానీ ఆఖరికి, ఈ ఇల్లు వెతకడం లోనే మీఠీ కనిపించకుండా పోతుంది. ఆమె కు తన ఇల్లూ, పిల్లలూ, భర్తా దొరికారా, లేదా అనేది మన ఊహ కే వొదిలేసిన దర్శకురాలు, మీఠీ ని ఇన్నాళ్ళూ పసిపాప లాగా సాకిన తల్లీ, మీఠీ కోసం, ప్రేమనూ, జీవితాన్ని త్యాగం చేసిన అక్కయ్యా, అప్పటికి ఇద్దరు పిల్లల తండ్రి అయినా, మీఠీ కోసం ప్రేమ (!!!) తో, ఆమె మీద జాలితో, ఆమె తప్పిపోయేంత వరకూ ఆమె తో స్నేహించిన జొయొదీప్.. ఇలా అందరూ మీఠీ తప్పిపోయాక పడిన ఆందోళన మన మనసుల్లోనూ కలిగిస్తుంది అపర్ణా సేన్.


మీఠీ కధ ని చెప్తున్నపుడు వాళ్ళింటి దగ్గర రోడ్ మీద చెత్త, గాజు పెంకులూ ఏరుకుంటూ.. అవే అత్బుతమైన వస్తువుల్లా దాచుకునే ఒక పిచ్చిదాన్ని చూపిస్తారు. ఆమె ని చూసి, మీఠీ భయపడుతూ ఉంటుంది. ఆమె ను ఒక రెండు సార్లు మాత్రమే చూపించినా ఆ సీన్ చూస్తే, సాధారణంగా మనకు తారసపడే మానసిక రోగుల పాస్ట్ గురించి ఎందుకో ఆలోచించాలనిపిస్తుంది. వారి పట్ల సమాజపు వివక్ష ని అసహ్యించుకోవాలనిపిస్తుంది.


సినిమా కధ ఇంత సింపుల్ గా చెప్పగలిగినా.. చూడడానికి చాలా బావుంది. సహజంగా విషాదాంతాలు ప్రేక్షకుల మీద చూపించే ప్రబావం ఎక్కువ. 15 పార్క్ ఎవెన్యూ లో తెర ముందు నటించిన ప్రతి ఒక్కరి నటనా - తెర వెనుక ఉన్న ప్రతి ఒక్కరి ప్రతిభ అబ్బురపరుస్తుంది. విదేశాల్లో షూటింగులూ, పాటలూ చిత్రీకరించడం.. ఒక్కోసారి విదేశాల్లోని సబ్జక్టుల తో నే సినిమాలు తీయడం ఎక్కువైన రోజుల్లో, భూటాన్ లో తీసిన, (ఎక్కువ భాగం ఇండియాలోనే) ఈ సినిమా చాలా మంచి ప్రమాణాలతో తీసినది. నేను మొదలు పెట్టడమే ఈ సినిమా భూటాన్ లో తీసారు - అని ఎందుకు చెప్పానంటే, భూటాన్ లో చిత్రీకరించిన భాగం.. చాలా గాఢమైనది; స్వచ్చమైన ప్రతిభ, మనుషుల మనసుల్లోని అందాలను బయటికి తీసుకొచ్చే ఏదో మిస్టిక్ భావజాలం ఆ సీన్ ల లో అల్లుకుపోయి కనిపిస్తుంది. అప్పటికే తడిచిపోయిన ప్రేక్షకుల మనసుల్ని కాస్త ఆహ్లాదపరిచే గాంభీర్యం భూటాన్ ది. అందుకే అది చాలా రిఫ్రెషింగ్ ఫీలింగ్ అన్నాను.


ఇంట్లో స్పెషల్ పిల్లలు ఉంటే ఆ కుంటుంబం చేసే త్యాగాలు.. వారి లో ప్రతి ఒక్కరి జీవితం.. ఒక కధ లాగా - వారి మనసుల్లోకి మనం తొంగిచూడగలిగితే కనిపించే లోతులు.. ఇదంతా, ఈ సినిమా చూస్తే కొంచెం అన్నా అర్ధం అవుతుంది. ముఖ్యంగా షబానా.. సైకియాట్రిస్ట్ గా నటించిన చటర్జీ.. ఈ లోతుల్ని స్పృసించడానికి కాస్త సహాయపడతారు.


ముఖ్యంగా వహీదా రెహ్మాన్ - తల్లి గా ఎంత అత్భుతంగా నటించినంటే, కూతురి గురించి బాధపడే నిస్సహాయురాలైన వృద్ధ, అమాయకురాలైన తల్లి గా ఆవిడ జీవించింది. ఒక సీన్ లో మూఢ నమ్మకాల ఆధారంగా పనిమనిషి చెప్పిన మాట నమ్మి.. అలా చేస్తే పిల్ల బాగుపడుతుందేమో అన్న ఆశ తో మీఠీ కి మంత్రాల ట్రీట్మెంట్ కూడా ఇప్పించబోతుంది. షబానా నటన చెప్పనే అక్కర్లేదు. షెఫాలీ షెట్టి (జొయొదీప్ భార్య) చాలా తక్కువ సేపు కనిపించినా..చాలా బాగా నటించింది. ఇంత మంది విదూషీమణులు, కన్వల్ జీత్, రాహుల్ బోస్, ధ్రితిమాన్ చెటర్జీలు (సైకియాట్రిస్ట్) నటించిన సినిమా ఎలా వుంటుందనుకుంటున్నారు ?


సీరియస్ నటన, ప్రతిభలు నచ్చే వారూ.. సినిమా ఒక కళ అయితే.. ఆ కళ ని ఆరాధించే వారూ, పిపాసులూ.. తప్పకుండా చూడదగిన చిత్రం ఈ '15 పార్క్ ఎవెన్యూ' ! {చూడాలనుంటే, యూ ట్యూబ్ లో చూడొచ్చు}

కొత్త ప్రేమ

మేమిద్దరం.. కేవలం మేమిద్దరం.
రాత్రి తలత్ అజీజ్ మ్యూసిక్ నైట్ కి వెళ్ళాం.

కూర్చోడానికి కుర్చీల్లేవు.
అదనంగా కుర్చీలు తెచ్చారు.
చాల లేదు.
ప్రోగ్రాం మొదలవక ముందే
హాలు నిండింది.
చాలా మంది నించుని
కొందరు కూర్చుని,
కొందరు నేల మీద బైటాయించి
ఘజళ్ళు విన్నారు.

ఎవరూ ఒకర్నొకరు కసురుకోలేదు
వెర్రి కోపపు చూపులు చూసుకోలేదు
అంతా, మౌనంగా, సంబరంగా ఉంది.
అంత రద్దీ లోనూ,
మేమిద్దరమే ఉన్నాం.
మా ఇద్దరి కోసం.

ప్రోగ్రాం మొదలయ్యాకా, మనసుల్లో
నిశ్శబ్ద సంచలనాలు మొదలయ్యాయి.
జిందగీ జబ్ భీ తెరీ బజ్మ్ మె .. లాతా హై హమే..
లాంటి పాటలు వింటే, ప్రేమే కలుగుతుంది మరి.

మ్యూసిక్ నైట్ ముగుసాకా,
ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నాం
ఇద్దరం మొబైలు ఫోన్ పక్కన పెట్టి,
కాస్త రిలాక్స్ అయ్యాం.
తను ఇంత కష్టపడి వెళ్ళినందుకు
డ్రైవ్ చేసుకుంటూ, ఆపసోపాలు పడి
ఇల్లు చేరితే,
నేను ఫోను టేబుల్ మీద పడేసి
టీవీలో వార్తలు చూడడానికి వెళిపోయాను.

మేమిద్దరం.. మా ఇద్దరికోసం
అనుకోకుండా మొబైల్లో
శంకర్ దాదా లెవెల్లో
ప్రసారం చేసుకున్న
మ్యూసిక్ నైట్ - అదిరింది.
అన్యాయం.. పైరసీ అయింది అనకండి
నేను చెప్పేది..
ఐ.టీ.సీ.కాకతీయా లో ఆడిటోరియం
సౌండ్ క్వాలిటీ గురించి.
ఇంకా.. ఏర్ టెల్ అత్త్యుత్తమ
కనెక్టివిటీ గురించీ -
తలత్ అజీజ్ జనాకర్షణ గురించీ -
మా కొత్త ప్రేమ గురించీ.

24/09/2008

హెల్మెట్ సమానత్వం

గోదావరి సినిమాలో ఒక సీనుంది. హీరోయిన్ చెక్కగా ముస్తాబయ్యి, టూ వీలర్ మీద వెళ్తూంటే, దార్లో పోలీసులు పట్టుకుంటారు. హెల్మెట్ పెట్టుకోనందుకు ఫైన్ వేస్తామంటారు. అప్పుడు ఆ అమ్మాయి 'సర్ మా ఇంట్లో అమ్మ పెళ్ళి సంబంధాలు చూస్తూంది.. హెల్మెట్ పెట్టుకుంటే హైర్ స్టైల్ పాడైపోతుంది.. ' లాంటి ఎక్స్క్యూసెస్ ఇచ్చి, చివరికి లంచం ఇస్తున్నట్టు నటించి, ఇవ్వకుండానే, పారిపోతుంది.


అప్పట్లో ఈ సీన్ చాలా మంది ప్రేక్షకులకి నచ్చు ఉండొచ్చు. కానీ నాకు సరదాగానే ఉన్నా కొంచెం నచ్చని సీన్ ఇది. మా ఆర్మీ లొకాలిటీ లో టూ వీలర్ మీద రైడర్, మగ వారైతే, పిలియన్ రైడర్ కూడా తప్పకుండా హెల్మెట్ గానీ హెల్మెట్ లాంటి పదార్ధం గానీ తప్పకుండా ధరించాలి. లేక పోతే, అనవసరం గా బోల్డంత ట్రబుల్ (మహా అయితే నడిచి వెళ్ళిపోవల్సి రావడం) ఇచ్చేస్తారు. అదేంటో గానీ ఎంత ఆర్మీ వాళ్ళయినా, పిలియన్ రైడర్ ఆడవాళ్ళైయితే హెల్మెట్ పెట్టుకోక పోయినా వొదిలేస్తారు. అసలే స్త్రీ పక్షపాతినేమో - వాళ్ళు వొదిలేస్తున్నందుకు ఆనందం కాక బాధ కలుగుతుంది నాకు. అసలు ఆడవాళ్ళని ఆర్మీ వాళ్ళూ, పోలీసు వాళ్ళూ ఎందుకని వొదిలేస్తారు ? వాళ్ళకి ఎందుకు ఫైన్ వెయ్యరు ? ఇందులో సమానతని సాధిద్దామని నేను అనడం లేదు. ఇది కామన్ సెన్స్. దేవుడి దయ వల్ల అంతా సవ్యంగా జరిగితే పర్లేదు. ఏక్సిడెంట్ అయితే, స్త్రీ ల తలలకు దెబ్బలు తగలవా..? వారి తలలు పగలవా ? అసలు ఎందుకీ ఆడవాళ్ళు హెల్మెట్ పెట్టుకోవడానికి తెగ అవమానం ఫీల్ అయిపోతారో తెలియదు.


సౌందర్య పిపాస.. జుట్టు మీద అభిమానం, హెల్మెట్ పెట్టుకుంటే, ముగాంబో ల్లా ఉంటామని భయం, ఇలాంటివన్నీ బహుసా వీళ్ళని హెల్మెట్ కు దూరంగా ఉంచుతాయి. దీన్లో మగ వాళ్ళూ తక్కువ తిన్లేదు. హెల్మెట్ లేక పోతే, అడ్డమైన పోలీసూ, అడ్డమైన చోటల్లా పట్టుకొని లంచమో, ఫైనో గుంజబట్టి గానీ..(అప్పుడు కూడా పోలీసులూ, హెల్మెట్ డీలర్లూ కుమ్మక్కయ్యారని, హెల్మెట్ల సేల్స్ పెంచుకోవడానికే పోలీసులతో ఇలా రక రకాల రైడ్లు చేయిస్తున్నారనీ, సభ్య సమాజంలో మనుషులకి హెల్మెట్ లేకుండా తిరగ గలిగే స్వేచ్చ లేదనీ, పేపర్లో ఆరోపణలు వస్తాయి) నూటికి ఎనభయి శాతం ఇప్పటికీ హెల్మెట్ లు ధరించకపోయుణ్ణు. నాకు బైక్ మీద హెల్మెట్ పెట్టుకోవడం అలవాటు. దీని వల్ల రోడ్ రూల్స్ పాటించినట్టే కాకుండా, దుమ్మూ, ధూళీ నుంచీ నా ముఖ చర్మానికి రక్షణ దొరుకుతుంది. అసలే హైదరాబాదు. హెల్మెట్ లేకుండా రోడ్ మీదికి వెళ్తే, ఇంటికొచ్చీసరికీ, కాకి లా, కోయిలల్లా తయారై పూడుస్తాము. (దుమ్మూ, ఎండా.. ల కారణం గా) So helmet helps.


చావు గురించి ఒక్కొక్కరికీ ఒక్కొక్క ఫిలాసఫీ ఉండొచ్చు. చచ్చేది రోడ్ ప్రమాదం లో చచ్చిపోతే పైకి బానే ఉంటుంది (భార్యా పిల్లలూ.. ఇంట్లో వెయిట్ చెయ్యని రకాలకి) కానీ తలకి దెబ్బ తగిలి కోమాకో, కేంద్ర నాడీ వ్యవస్థ దెబ్బ తినడమో జరిగితే గానీ తమ నిర్లక్షం తమకి తెలియదు. హెల్మెట్ ప్రాణాల్ని కాపాడుతుంది. అసలే మనవి ప్రమాదకరమైన రోడ్లు. బైక్ నడపడం లో మన తప్పు లేక పోవచ్చు. ఎదుటి వాడి తప్పు వల్ల మనం జీవితాన్ని కోల్పోవాలసి రావడం, చాలా ట్రాజెడీ. దాన్ని మనం నివారించలేకపోవడం సిల్లీ.


హెల్మెట్ ధరించక పోతే, ఇంత ఫైన్, కార్ లో సీట్ బెల్ట్ పెట్టుకోక పోతే అంత ఫైన్ అని ప్రభుత్వం (పోలీస్) ప్రకటించేసి ఊరుకుంటుంది. ఫైన్ లు కూడా వేస్తుంది. కానీ ఎందుకు పెట్టుకోవాలో, పెట్టుకోకపోతే, దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగితే ఎలాంటి దెబ్బలు తగిలే సంభావన ఉందో, కొంచెం నిజం, కొంచెం హైప్ లతో చిన్న చిన్న ఏడ్ లు తయారుచేసి ప్రతీ సినిమా హాల్లోనీ, టీవీ చానెల్లోనీ ప్రదర్శించాలి. అప్పుడు గానీ సీన్ జనాలకి తలకెక్కదు.(దురదృష్టవశాత్తూ.. తాగుబోతు కి మనం తాగవద్దని ఎంత చెప్పినా తలకెక్కదు) మన పిచ్చి గానీ మంచి చెప్తే ఎవరికి నచ్చుతుంది చెప్పండి ?


పోలీసులు ప్రజలకు వ్యతిరేకం అనే భావన పాతుకుపోయిన సమాజం మనది. అలానే మన లాంటి అలసత్వం జీర్ణించుకుపోయిన మనస్తత్వాలకి భద్రత అంటే ఏదో 'కొత్త ' సంగతి లా అనిపిస్తుంది. పెద్ద పెద్ద భవన నిర్మాణాల్లో కూలీలు కూడా ఒక హెల్మెట్టూ, బెల్టులూ లేకుండానే ఇక్కడ చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లొ పని చేస్తుంటారు. అంతెత్తునుండీ కాలు జారి పడితే..?!ఇలాంటి ప్రమాదమే మన వెనుక కూడా పొంచి ఉంది. ఎంత నెమ్మదిగానో డ్రైవ్ చేసే నాకే మరీ అవమానకరంగా సైకిలు నడిపే చిన్న పిల్లల కారణంగా రెండు సార్లు ఏక్సిడెంట్ అయింది. (అవమానకరం అంటే, నన్ను గుద్దేసింది పిల్లకాయలు!! ఏ కారో, లారే నో, ఫెలో స్కూటరిస్టో అయితే.. ఈ పాటికి ఏ కాలో చెయ్యో విరిగి ఉండేది... ఇది హెల్మెట్ గురించి గాబట్టి, తలకి గాట్టి దెబ్బ కనీసం తగిలి మతి పోయి ఉండేది). ఇలాంటి కొన్ని ప్రత్యేక క్షణాల్లో నే నా జ్ఞాన చక్షువులు తెరుచుకున్నాయి. ఈ భూ ప్రపంచకంలో నూటికి 70 శాతం పిలియన్ రైడర్లూ ఆడవాళ్ళూ, పిల్లలే! మిగతా దేశాల సంగతి పక్కన పెడితే, మన ప్రభుత్వానికి ఆడవాళ్ళ రక్షణ గురించి చింత లేదు.


ఏ పోలీసు (సినిమాల్లో హీరో పోలీసులకి సైతం) కూడా.. హెల్మెట్ పెట్టుకోని ఆడ డ్రైవర్ని పట్టుకుని ఝాడించడు. (కనీసం మందలించే రకం పోలీసెంకటసాములు కూడా, చాలా తక్కువాతి తక్కువ లెండి) అంత ధైర్యవే ?! అది కూడా కాదు.. వాళ్ళకి పిలియన్ రైడర్ స్త్రీ అయితే ఆవిడ హెల్మెట్ పెట్టుకోకపోవడం అసలు ఒక పాయింట్ లా అనిపించదు.


ఇక నుంచీ అందరు పిలియన్ రైడర్లూ (పోనీ కనీసం ఆడ డ్రైవర్లు) స్త్రీ పురుష భేదం లేకుండా హెల్మెట్ పెట్టేసుకోవాలని మన మహిళా సంఘాలు పోరాటం చెయ్యకపోతే మహిళా సాధికారత కి అర్ధం లేదు. :D


కొంచెం చించితే - ప్రమాదం జరిగినపుడు దెబ్బలు ఆడ వారికీ మగ వారికీ ఒకేలా తగుల్తాయి ! అందుకే అందరూ హెల్మెట్ పెట్టుకోవాలి. హైర్ స్టైయిల్ కన్నా సేఫ్టీ మిన్న ! అవునా కాదా ?

23/09/2008

మనసు రాజు గారు !In the picture : King Jigme Khesar Namgyel Wangchuk, Bhootan's new King.జిగ్మే సింగే వాంగ్ చుక్ - భూటాన్ రాజు - ప్రపంచం లో మొట్ట మొదటి సారి గా స్వచ్చందంగా తన రాజ్యాన్ని ప్రజా స్వామ్యం వైపు నడిపించారు. భారత దేశం నుండీ పారిపోయి, తమ భూభాగం లో తలదాచుకున్న ఉగ్రవాదుల పైకి సైన్యాన్ని నడిపించిన మన మొట్ట మొదటి పొరుగు వీరుడు. ఈయన మరీ ఎంత మంచి మనసున్న మారాజంటే - ఈయన తెచ్చిన సంస్కరణల లో స్వచ్చందంగా ప్రజాస్వామ్యాన్ని ఆహ్వానించడం, (March 08 ఎన్నికల లో గెలిచిన పార్టీ భూటాన్ పీస్ అండ్ ప్రాస్పరిటీ - గెలిచింది జిగ్మే థిన్లే), పార్లమెంట్ కు సార్వభౌమత్వం, రాజుని తొలగించే అధికారాన్నివ్వడం, కొత్త రాజు గారికే రిటైర్మెంట్ వయసు - అరవైగా నిర్ణయించడం లాంటివి ముఖ్యమైనవి. ఇక్కడ ప్రజల ఆనందమే - రాజు కి ఆనందం ! ఆనందమే జీవిత మకరందం అని గట్టి గా నమ్మిన రాజు వాంగ్ చుక్ !


భూటాన్ రాజు గారు ఈ విధంగా రిటైర్ అయ్యాక, వారి అబ్బాయి రాజా జిగ్మే ఖేసార్ నమ్గఎల్ వాంగ్చుక్ - కి వచ్చే నెల పట్టాభిషేకం జరగనుంది. ఈయన వయసు ఇరవై తొమ్మిది ! ఈయన ప్రపంచం లో కెల్లా చిన్న వయసున్న రాజు గారు కానున్నారు.


భూటాన్ లో ఈ 'మొదటి' సారి రికార్డులు ఇంకా ఉన్నాయి. ప్రపంచం లో, కేవలం ఈ దేశం లోనే, అభివృద్ధిని, ప్రజల ఆనందం తో కొలుస్తారు. (Bhutan is the only country that measures its Prosperity by the gross national happiness) చందమామ కద లా ఉన్నా, ఇది నిజం. ప్రజల శాంతి, ఆనందం, భద్రత లే పరిపాలన లో వారు విధించుకున్న ప్రమాణాలు !


మొదటి సారి (బహుసా చివరి సారి) స్వచ్చందంగా రాజు పదవీ విరమణ చెయ్యడం, తన అధికారాలన్నిటినీ గుత్తంగా ప్రజలకు కట్టబెట్టడం, ఇక్కడే జరిగింది.


కొత్త రాజు గారు సినిమాలు ఎక్కువ గా చూస్తారుట! అందుకే ఆయన పట్టాభిషేకానికి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, సోనియా, రాహుల్, తో పాటూ, షారుఖ్ ఖాన్ కూడా వెళ్తున్నారు. అక్కడ థింపూ సాకర్ స్టేడియం లో షారుఖ్, కత్రినా ల స్టేజ్ షో ఉంది. ఈ షో - రాజు గారి రాయల్ రిక్వెస్ట్ మీద ఏర్పాటు చేసారట. ఈ న్యూస్ చదవగానే నాకు వావ్ అనిపించింది. అందుకే పోస్ట్ చేస్తున్నా!

భూటాన్ కి మరియు కొత్త రాజు గారికి శుభాకాంక్షలు !