Pages

24/08/2023

వీరయ్య - కృష్ణ గుబిలి

ఈ పుస్తకం 2020 లో విడుదల అయినప్పుడు ఆన్ లైన్ ప్లాట్ ఫారాలలో సంచలనం సృష్టించింది.  చాలా మంది చదువరులు ప్రశంసలు కురిపించారు. చాలా చోట్ల ఆన్ లైన్ రివ్యూలు చాలా పాసిటివ్ గా వచ్చాయి. అసలు నేను ప్రత్యేకం గా / కొత్తగా చెప్పేందుకు కొత్తగా ఏమీ లేకపోయినా, ఇది చాలా మంచి/బహుశా special, out of the box  పుస్తకం అని ఖచ్చితంగా చెప్పగలను. 

మనం బానిస వ్యవస్థ గురించి, తమ తమ ఊళ్ళలో ఉన్న ఆఫ్రికన్లని ఉన్నపాటుగా ఎత్తుకెళ్ళిపోయి, ఓడల్లో అమానవీయ పరిస్థితుల్లో కుక్కి, రేవుల్లో జంతువుల్ని అమ్మినట్టుగా అమ్మి, తల్లుల్నీ పిల్లల్నీ వేరు వేరుగా అమ్మి, వాళ్ళ జీవితాల్ని కొన్ని తరాల పాటూ సర్వనాశనం చేసేసి, వాళ్ళ మీద అత్యంత క్రూరమైన అత్యాచారాలకు పాల్పడటం, జాత్యహంకారాన్ని ప్రదర్శించడం గురించి చాలా సినిమాలూ చూసాము, చాలా పుస్తకాలూ చదివాం. 

కానీ బానిస విధానపు నిర్మూలన తరవాత, దాదాపు అదే స్థాయిలో వెట్టిచాకిరీ చేయడానికి భారత ఉపఖండం నుండి 1800-1900 మధ్యలో వేలాదిగా తరలివెళ్ళి, రబ్బరు, చెరుకు లాంటి కఠిన వ్యవసాయ ఉత్పత్తులను  పండించేందుకు, రక రకాల కొత్త దేశాలలో, ఖండాలలో అత్యంత ఘోరమైన పరిస్థితుల్లో ఊడిగం చేసి,   నానా కష్టాలు అనుభవించిన భారతీయుల గురించి, తిరిగి రాలేక, అక్కడి సమాజాలలో భారతీయ సంతతి వారిగా సమైక్యమైపోయి,  అక్కడే ఉండిపోయిన ప్రవాస భారతీయుల కథల్ని పెద్దగా చదవలేదు. మనకు దాదాపు ప్రవాసుల కథలు అభివృద్ధి చెందిన దేశాల నుంచే వచ్చాయి గానీ, ఖండాంతరాలలో మగ్గిపోయిన బీద  తెలుగు ప్రవాసుల గురించి పెద్దగా చదవడానికి ఏదీ దొరకలేదు. 

అలాంటి పరిస్థితుల్లో, కేవలం ఆసక్తి కొద్దీ, దక్షిణ ఆఫ్రికాలో కొన్నేళ్ళపాటూ పనిచేసి, పుట్టిన గడ్డకు తిరిగొచ్చి, మరణించిన తన ముత్తాత వీరయ్య గారి మూలాలను వెతుక్కుంటూ, కృష్ణ గుబిలి గారు చేసిన అన్వేషణ, దక్షిణ ఆఫ్రికా  లో తెలుగు, తమిళ ప్రవాసులు గడిపిన బానిస జీవితం గురించీ, వీళ్ళని తీసుకెళ్ళి, పని చేయించిన చెరకు తోటలు, పంచదార ఫాక్టరీల గురించి, కలుసుకున్న తన "విడిపోయిన" కుటుంబంగురించీ చాలా చక్కగా ఆయన రాసిన ఇంగ్లీష్ పుస్తకానికి, తన తండ్రిగారిచేతనే తెలుగులోకి అనువదింపజేసి తీసుకొచ్చిన పుస్తకం ఇది. 

వీరయ్య చాలా కష్టపడి పైకొచ్చిన మనిషి. ఆయన బోల్డన్ని కష్టాలనుభవించి, దళారుల వలలో పడి, కూలీ గా దక్షిణాఫ్రికా చేరి, అక్కడ కొన్నేళ్ళ పాటూ కూలీగా పనిచేసి, తన సామర్ధ్యాలు, కష్టపడే తత్వం కారణంగా సూపర్వైసర్ (సర్దార్) గా ఎదిగి, ఒక స్థాయికి తన కుటుంబాన్ని చేర్చిన వ్యక్తి. తను చిన్ననాట వదిలి వెళ్ళిన తన కుటుంబాన్ని వెతుక్కుంటూ ఆయన ఇండియా తిరిగిరావడం ఒక కథ.   బాధలు పడ్డా,  కష్టాన్ని ఆసరాగా చేసుకుని  బోల్డంత ధనం సంపాదించగలిగినా, చివరకు "బంధు" రాబందుల చేతిలో అన్నీ కోల్పోయి, కళ్ళెదురుగానే పిల్లల్ని కోల్పోయి, అసహాయుడైపోయి,  వృద్ధాప్యంలో  మనోవ్యధ తో  మరణించారు. 

అయితే, ఆయన కోడలు నాంచారమ్మ గారు (కృష్ణ గారి నాయనమ్మ) మాత్రం, మామగారిని మర్చిపోలేదు.  ఆవిడనే అసలు ఈ పుస్తకం బయటకు రావడానికి   ప్రేరణ.  ఆమె ఒక కూతురిలా చెల్లాచెదురైన  తన  కుటుంబం గురించి ఆరాటపడి, ఎటువంటి కమ్మ్యూనికేషన్ సాధ్యం కాని రోజుల్లోనే,  రికార్డ్ గా పనికొచ్చే ప్రతి అంశాన్నీ దాచి, తన మనుమలకు తమ మూలాలను గురించి చెప్తూ,  ఆసక్తి రగిలించడంలో,  ఖండాంతరాలలో చెదిరిపోయిన  కుటుంబాన్ని కలుసుకోవాలనే కోరికను సజీవంగా ఉంచడంలోనూ ప్రధాన పాత్ర వహించారు.  

నాయనమ్మ వర్ణనల్లో తమ తాతయ్య, ముత్తాతలు హీరోలు, ఆజానుబాహులు, ఆదర్శ పురుషులు, కానీ నిజానికి వారి గురించి వివరాలేవీ తెలీని పరిస్థితుల్లో, కృష్ణగారు సరదాగా మొదలుపెట్టిన వంశవృక్షపు ప్రాజెక్టు, ఒక్కో వివరమూ తెలిసేకొద్దీ, దక్షిణాఫ్రికాలో సగం, ఇండియాలో సగం గా చెల్లాచెదురైన బంధువుల్ని వెతుక్కుంటూ, బదులు రాని అసంఖ్యాక ఉత్తరాలు రాస్తూ, ఒక్కో గొలుసునీ నిర్మించుకుంటూ వస్తూన్నకొద్దీ, ఒక్కో బంధువూ దొరకడం చాలా ఓపికగా ఒక్కో ఫేస్ నూ దాటుకుంటూ, మొత్తానికి దక్షిణాఫ్రికా వెళ్ళి, అక్కడి ఒక Institution లో ఎంతో వెతుకులాట అనంతరం, ఇండియానుంచి వచ్చిన ఒక "ఓడలో దిగిన వారి లిస్టు" లో తమ ముత్తాతయ్య   వీరయ్య గారి పేరును కనుక్కుంటారు. 

కుటుంబం మొత్తానికి కలుసుకుంది. అదీ, దక్షిణాఫ్రికాలో  అపార్థీడ్ రోజులు ముగిసాక. అంటే, నెల్సన్ మండేలా జైల్ నుండీ విడుదలయ్యాక, ఆయన అధికార పీఠాన్ని ఎక్కాక. అంతవరకూ, కనీసం ఉత్తరం రాయగలిగే పరిస్థితుల్లో కూడా లేరు అక్కడి ప్రవాస భారతీయులు.  అదీ వారి స్వాతంత్రం.  ఇలా వేలాది చిక్కుల్ని ఒక  Consistent  పోరాటం వల్ల, కృష్ణ గారు అధిగమించగలిగారు.  అయితే ఈ అన్వేషణలో ఆయన చాలా చేదునిజాల్నే తెలుసుకోవల్సి వచ్చింది. ఇలా తమ మూలాల్ని కనుక్కోగలిగే ఓపిక, ఆసక్తి, నిజాయితీ, స్పూర్థి, కాస్తో కూస్తో దారి చూపించే అదృష్టమూ, అందరికీ ఉండకపోవచ్చు. అందుకే  ఆ ప్రయాణాన్ని డాక్యుమెంట్ చెయ్యడం అవసరం గా భావించి, దాన్ని తెలుగులోకి కూడా తీసుకురావడం, ఈ పుస్తకం విలువని గుర్తించి,  "అన్వీక్షకి"  దాని చక్కగా ప్రచురించడం, మెచ్చుకోదగిన విషయాలు. 

INDENTURED LABOUR (ఒక విధంగా ఒప్పంద కూలీలు) వ్యవస్థ గురించి వివరాలతో వచ్చిన తొలి తెలుగు పుస్తకం కూడా ఇదే. వనవాసి లో "మంచీ" ఏ అస్సాం టీ తోటలలో బానిసయిపోయిదో అని ప్రొటాగనిస్ట్ భయపడినట్టూ,   'బాలా' తీసిన "పరదేశి"  సినిమాలో, నెలలపాటు గొలుసులతో బంధించిన కాళ్ళతో మైళ్ళకొద్దీ నడిచి, టీ తోటల లో బానిసలుగా పనిచేసిన వేలాది తమిళ కూలీల వ్యధను చూసినట్టూ,  కూలీ భార్యాభర్తలను వేరు వేరుగా వేరువేరు తోటలకు (యజమానులకు) అమ్ముకోవడం, తల్లీ పిల్లల్ని విడదీసేయడం, భాష, చదువూ రానివారిచే కాంట్రాక్టుల మీద వేలిముద్రా సంతకాలు తీసుకుని, వారు దానికి కట్టుబడేటట్టు వంచించడం, ఈ ఇండెంచర్ కార్మికుల విషయంలో కూడా జరిగాయి. వీళ్ళలో కూడా, బీద, నిస్సహాయ మహిళలు దారుణమైన దోపిడీకి గురయ్యారు. 

కాలంతో పాటూ మారిన సామాజిక, ఆర్ధిక పరిస్థితుల వల్ల  మెల్లగా ఈ విధానం నశించి,  అక్కడ, నాటుకుని, జీవితాలని ఒక దారిలోకి తెచ్చుకుని, తరవాత వీరు వెస్టిండీస్ దీవులు, మారిషస్, ఫిజీ వంటి ఆయాదేశాలలో స్థిరపడ్డారు. వీరయ్య గారి కథ దక్షిణ ఆఫ్రికాకే పరిమితం అయినా, అనుబంధంలో ఏయే దేశాల్లో ఈ వ్యవస్థ ఉండేదో చక్కగా వివరించారు. ఇప్పుడు    ఆ దేశాలలో బానిసల్లా మగ్గిన ఇండెంచర్ కార్మికుల సంతతే ఇప్పుడు "భారతీయ" సంతతి అయ్యారు. ఆ విషయాల్నీ, నైపాల్ లాంటి ఇండెంచర్ కార్మికుల సంతతి ఎంత పైకెదిగారో, ఇలా ప్రతీ దేశం నుంచి, పేరొందిన ప్రవాస భారతీయుల సమగ్ర సమాచారాన్ని, కృష్ణ అందించారు. ఇది ఇండెంచర్ కార్మికులకు  తెలుగు దేశం చేసిన సలాం. 

బిభూతి భూషన్ బందోపాధ్యాయ్ రాసిన చంద్రగిరి శిఖరంలో భారతీయులు ప్రవాసంలో కనిపిస్తారు. ఉగాండా ఊచకోతల సమయంలో మార్వాడీలు టార్గెట్ అవడం గుర్తుండి ఉంటుంది. మొన్నే నేను చదివిన నట్మెగ్స్ కర్స్ లో, ఒక భారతీయుడే సంక్షోభ సమయంలో జాజికాయ, జాపత్రి విత్తుల్ని (నట్ ని) రక్షించి, అవి ద్వీపం లో బ్రతికుండేలా చేస్తాడు. ఇవే ద్వీపాలలో స్థానికుల్ని ఊచకోత కోసేందుకు జపాన్ సమురాయ్ (కత్తి యుద్ధ వీరులు) లని విస్తారంగా వాడారు. వాళ్ళు తలారుల్లా పనిచేసేవారు. వాళ్ళు జీవం తీస్తే,  ఒక ప్రవాసీ భారతీయుడు,  జాజి కాయ వంగడపు జీవాన్ని  రక్షిస్తాడు. This small act of kindness, మన దేశం గురించి మనల్ని గర్వపడేలా చేస్తుంది.  

గాంధీ లాంటి మహాత్ముడు దక్షిణాఫ్రికాలో ఈ ఇండెంచర్ కూలీల వైపునుండీ మాటాడడం ద్వారా తన ఉద్యమ జీవితాన్ని మొదలు పెట్టడం జరిగింది. గాంధీ ప్రవేశం తరవాత, ఆయన వీరి బాధల్ని గ్రహించి బ్రిటిష్ ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవడం వల్లనే ఇండెంచర్ కార్మికుల జీవితాలలో కాస్త కుదురు వస్తుంది. గాంధీని ఇలాంటి కార్మికుల సంతతి వాడనుకునే,  రైల్లోంచీ నెట్టేయడం జరిగింది. దీన్ని బట్టి, పనులకోసం వేరే దేశాలకు మోసపూరితంగానో, ఇష్టపూర్వకంగానో తరలివెళ్ళిన మన పూర్వీకుల కృషి ని తెలుసుకోవడం అవసరమే అనిపిస్తుంది. 

చాలా మంచి పుస్తకం. కేవలం ఒక కుటుంబం కథ కాదు. "వీరయ్య" ఒక వసుధైవ కుటుంబకం గురించిన పుస్తకం. దాదాపు మూడు సంవత్సరాల తరవాత అయినా చదవగలిగినందుకు సంతోషం కలిగించిన తెలుగు పుస్తకం ఇది.  ముందుమాట రాసినది తనికెళ్ళ భరణి. ఈ పుస్తకం కూడా ఈ రూపు దాల్చడానికి వెనుక  ఒక పెద్ద "కుటుంబమే" ఉంది. అలాంటి సమిష్టి కృషి, సహకారం, ప్రోత్సాహం, ఈ మధ్యకాలంలో మనం చూసి ఉండం.  వీళ్ళందరికీ అభినందనలు. 


***

https://fb.watch/nLCKxRzoeP/?mibextid=NnVzG8&startTimeMs=113634



01/08/2023

రంగురంగుల కవిత్వం - సంపాదకుడు : అనిల్ బత్తుల (Part II)


-------------------------

Where the mind is without fear and the head is held high
Where knowledge is free
Where the world has not been broken up into fragments
By narrow domestic walls
Where words come out from the depth of truth
Where tireless striving stretches its arms towards perfection
Where the clear stream of reason has not lost its way
Into the dreary desert sand of dead habit
Where the mind is led forward by thee
Into ever-widening thought and action
Into that heaven of freedom, my Father, let my country awake.

                                                                                                          - Rabindranath Tagore

ఈ కవిత : మా బాస్ రూం లో ఒక పెద్ద చెక్క board పై చెక్కి ఉంటుంది. (ఏ నాటిదో - పాత గా ఉన్నా, దాన్ని మార్చేయలేదు) కొత్తగా ఇక్కడికొచ్చినపుడు, కేవలం ఆ బోర్డు మార్చేయనందుకు బాస్ మీద మంచి అభిప్రాయం కలిగింది. బహుశా మనందరికీ మన భారతీయత మీద  గర్వపడేలా చేయగలిగిన కవిత ఇది.  దీని అనువాదాలు రెండు వెర్షన్లు చూద్దాం :

స్వర్గసీమ : దేవులపల్లి కృష్ణశాస్త్రి  (1948)

ఎచట నా మస్తకమ్మెగయు హిమశృంగమై 
ఎచట జ్ఞానమ్మందు నెల్లరకు ముక్తమై, 
నిర్భీతి మన సెచట నిశిత హేతిగ మెరయు,
లోకమెట విడదిరుకు చీకుగోడల చిదికి,
వాక్కు లెచ్చోట వెల్వడును నిశ్చల సత్య
గర్భమ్ము నుండి నిర్భరజీవనదులుగా,
ఎచ్చోట తీవ్ర వేగోచ్చలిత దుర్వార 
కర్మధారలు నిండుకడలి లోపల పండు,  
స్వచ్చందమై స్వచ్చ సరళమై ఎచట వి
జ్ఞాన మింకదు జడాచార సికతా సీమ, 
ఎచట మనసెపుడు పరువెత్తు క్రొంగ్రొత్త భా
వాధ్యముల కండరములందు జాగృతి నించి,
అచ్చోట ఆ స్వర్గమందు మేల్కొలుపవా
ఈ పురాణ ధరిత్రి నీ భారత సవిత్రి,
నీ దయాధృఢహస్త నిర్దయాఘాతమున ! 

-----------------------------------------------------------------------

గీతాంజలి : రొంపిచర్ల భార్గవి (2014)

ఎక్కడ మనస్సు నిర్భయంగా వుండి తల పైకెత్తుకోగలదో
ఎక్కడ జ్ఞానానికి స్వేచ్చ వుందో
ఎక్కడ కుటిలమయ కుటుంబపు గోడలు లోకాన్ని ముక్కలుగా చెయ్యవో
ఎక్కడ నిజాల లోతుల్లోంచి పదాలు వెలువడుతాయో
ఎక్కడ నిరంతర శ్రమ పరిపూర్ణత కోసం చేతులు చాస్తుందో
ఎక్కడ హేతువు అనే తేట నీటి ప్రవాహం
ధూళి ధూసరితమైన పాత అలవాట్ల ఎడారి దారి పట్టదో
ఎక్కడ నా మనసు నీ మార్గదర్శకత్వంలో
విశాల భావాల, చర్యల దిశగా సాగుతుందో 
అలాంటి స్వేచ్చాస్వర్గంలో నా తండ్రీ
నా దేశాన్ని కళ్ళు తెరవనీ.  

--------------------------------------------------------------------------


Night of the Scorpion - Nissim Ezekiel

I remember the night my mother 
was stung by a scorpion. Ten hours
of steady rain had driven him
to crawl beneath a sack of rice.

Parting with his poison - flash
of diabolic tail in the dark room -
he risked the rain again.

The peasants came like swarms of flies
and buzzed the name of God a hundred times
to paralyse the Evil One.

With candles and with lanterns
throwing giant scorpion shadows
on the mud-baked walls
they searched for him: he was not found.
They clicked their tongues.
With every movement that the scorpion made 
his poison moved in Mother's blood, they said.

May he sit still, they said
May the sins of your previous birth
be burned away tonight, they said.
May your suffering decrease
the misfortunes of your next birth, they said.
May the sum of all evil
balanced in this unreal world

against the sum of good
become diminished by your pain.
May the poison purify your flesh

of desire, and your spirit of ambition,
they said, and they sat around
on the floor with my mother in the centre,
the peace of understanding on each face.
More candles, more lanterns, more neighbours,
more insects, and the endless rain.
My mother twisted through and through,
groaning on a mat.
My father, sceptic, rationalist,
trying every curse and blessing,
powder, mixture, herb and hybrid.
He even poured a little paraffin
upon the bitten toe and put a match to it.
I watched the flame feeding on my mother.
I watched the holy man perform his rites to tame the poison with an incantation.
After twenty hours
it lost its sting.

My mother only said
Thank God the scorpion picked on me
And spared my children.

ఈ కవిత అనువాదాన్ని మాత్రం కాస్త రుచి (One version) చూపించేసి ఆపేస్తాను. 

మా అమ్మని తేలు కుట్టిన ఆ రాత్రి నాకు బాగా గుర్తుంది. 
పది గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం
తేలుని బియ్యపుబస్తా క్రిందకి వెళ్ళేలా  చేసింది
చీకటిగదిలో ఒక్కసారి తోక జాడించి,
తోకకున్న విషం ఎక్కించి మళ్ళీ వర్షంలోకి పారిపోయింది. 

రైతులందరూ ఈగల్లా మూగిపోయేరు
వందసార్లు భగవన్నామ జపం చేసేరు
ఆ తేలు ఎక్కడుంటే అక్కడ ఆగిపోడానికి.
కొవ్వొత్తులూ, లాంతర్లూ
మన్ను మెత్తిన గోడల మీద 
పెద్ద తేలు లాంటి నీడలు కదులుతుండగా
దానికోసం వెతికేరు గానీ, లాభం లేకపోయింది.
"ళబళహళబళబ" అంటూ నాలికతో చప్పుడు చేసేరు
దాన్ని భయపెట్టడానికి.
దాని ప్రతికదలికకీ, అమ్మ రక్తంలో 
విషం  మీదకి ఎక్కుతుందని చెప్పేరు.
తేలు కదలకుండా చూడాలని అన్నారు. 
అమ్మతో మీరు పూర్వజన్మలో చేసిన పాపాలు 
ఈ రాత్రి దహించుకుపోవాలన్నారు
అప్పుడు అనుభవించిన బాధ మళ్ళీ జన్మలో 
ఆమె అనుభవించబోయే కష్టాల్ని తగించాలన్నారు. 
ఇక్కడ చేసిన పాపాలు, పుణ్యాలలో
కొట్టుకుపోతాయి గనుక ఆమె అనుభవించిన బాధకి
కొంత పాపం కొట్టుకుపోతుందన్నారు. 
విషం ఆమె రక్తాన్ని శుభ్రపరచాలనీ,
ఆమె కోరికలూ, ఆశలూ అణిగిపోవాలనీ చెప్పి
అమ్మని మధ్యలో కూచోబెట్టి
అందరూ చుట్టూ కూచున్నారు.

అందరిముఖాల్లోనూ ఆమె బాధపట్ల సానుభూతి.
మరిన్ని కొవ్వొత్తులూ, మరిన్ని లాంతర్లూ, 
మరింతమంది చుట్టుపక్కలవాళ్ళూ,
మరిన్ని పురుగులూ, ఆగకుండా మరింత వాన.
మా అమ్మ నొప్పితో కింకలు చుట్టుకుపోతూ
పాపం చాపమీద అటూ ఇటూ దొర్లుతోంది.
హేతువాదీ, ఏదీ ఓ పట్టాన నమ్మని మా నాన్న
చూర్ణం, మిశ్రమం, వేరు, పసరు, ఒకటేమిటి
ప్రయత్నించని మందు లేదు..
చివరికి, కుట్టిన వేలిమీద కొంచెం పేరఫిన్ వేసి
అగ్గిపుల్ల వెలిగించేడు కూడా.
ఆ మంటకి మా అమ్మ చర్మం బొబ్బలెక్కడం చూసేను. 
విష బాధ  నివారణకి మంత్రగాడు వచ్చి 
ఏవో పూజలు చేసి మంత్రాలు చదవడం చూసేను.
అలా ఇరవై గంటలు గడిచిన తర్వాత
ఎలాగయితేనేం విషం ప్రభావం తగ్గింది. 

మా అమ్మ తర్వాత ఒకటే మాట అంది.
భగవంతుడు చల్లగా చూడబట్టి
ఆ తేలేదో నన్ను కుట్టింది 
నా పిల్లల్ని కుట్టకుండా. 

                                                         -  నౌడూరి మూర్తి 


------------------------------------------------------------------------------------
ఈ కవితల్ని యధాతధంగా పుస్తకం నుండీ ఎత్తేసి ఇలా పోస్ట్  చెయ్యకూడదు. కానీ ఇంకెలా ఈ పుస్తకం చాలా బావుందని చెప్పాలో అర్ధం కాలేదు. Words failed me.  This is the best thing to happen in recent times, good content, good taste, good quality and good collaboration. Big Thanks.







***

Victory City - Salman Rushdie



రెండువందల నలభై ఏడు ఏళ్ళ వనిత, కళ్ళు లేని కవయిత్రి, మంత్రగత్తె, సోది చెప్పే "పంప కంపన" ఈ బిస్నగ సామ్రాజ్యం గురించి రాసిన దీర్ఘ కవిత ఈ "విక్టరీ సిటీ". అంటే విజయ నగరం కథ.   కాల పురుషుడు మన హెచ్చు తగ్గుల్నీ, జరామరణాల్నీ నిర్ద్వందంగా చూస్తూ ఏ అనురక్తితో సృష్టి స్థితి లయ విన్యాసాలు చేస్తాడో అలా రష్దీ,  "విజయనగర సామ్రాజ్యాన్ని" సృష్టిస్తాడు.  దాని కర్తా, కర్మ క్రియల్ని దర్శిస్తాడు. ఆఖరికి  దాని వినాశనాన్ని కూడా దర్శింపచేస్తాడు. ఇది  మొదటి విజయనగర రాజుల నుండీ, మలినాటి తుళువ వంశం / ఆఖరికి రామరాయల దాకా,  వాళ్ళు గెలిచిన, ఓడిన రాజ్యాల దాకా,  హంపి వీధుల్లో, శిధిలాల్లో, బండరాళ్ళ గుట్టల్లో, తుంగభద్ర అలల్లో, చరిత్రను  వెతుక్కునే యాత్రీకుడి కళ్ళ ఎదుట ఓ మహా సామ్రాజ్యాన్ని దృశ్యాలుగా నిలబెట్టి, పెద్ద సినిమా చూపించినట్టు చూపిస్తాడు. 

ఈ పుస్తకాన్ని నేను చాలా ఎంజాయ్ చేసాను. రాజుల కథ, చందమామ కథ లాగుంది. అయితే ఓ హైదరాబాదీ గా, హంపి, బీదర్, ఔరంగాబాద్ లాంటి మహరాష్ట్ర లో కొన్ని భాగాలు, గత మూడేళ్ళలోనే కవర్ చెయ్యడంతో రష్దీ వర్ణనలు మరీ బాగా మెదడులోకి ఇంకి, పైగా, ఇలాంటి చందమామ కథల సినిమాలు చూసి ఉండడంతో  ఎక్కువగా ఆనందించగలిగాను.  "పంప కంపన" ఈ నవల్లో హీరోయిను. ఆవిడ తండ్రి ఓ మామూలు బుల్లి రాజు. ఆయన ఆ రోజుల్లో దిల్లీ సుల్తానుల కోసం దక్షిణాదిన  జరిగిన అసంఖ్యాక యుద్ధాలలో,  అంటే, మరీ స్పష్టంగా చెప్పాలంటే, "ఊరూ , పేరులేని" ఒకానొక  యుద్ధంలో ప్రాణాలు కోల్పోతాడు.  తల్లి, నది ఒడ్డున తనలాంటి మిగిలిన   యుద్ధవీరుల విధవలతో కలిసి  మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది.  అప్పటికి బాలిక అయిన పంప (తండ్రి పేరు కంపన)  కళ్ళెదురుగానే,  ఆ నిప్పుల్లోకి మౌనంగా వ్యాహ్యాళికెళ్తున్నట్టు వెళ్ళిన తల్లి, ఇంకా ఆ   స్త్రీల బృందం, మంటలు శరీరాన్ని దహించివేస్తున్నా, మాంసం కాలి నరకయాతన అనుభవిస్తున్నా, చిన్న కేక కూడా బయటికి రానివ్వకుండా ధైర్యంగా సజీవ దహనం అయి చనిపోతారు. తల్లి  ఆ నిప్పుల్లోకి తన చేతిని వొదిలి నడిచెళ్తుంటే, ఇదుగో ఇప్పుడే వచ్చేస్తుందిలే అని ఎదురు చూసిన పంప కి, ఆమె ఎముకల నుండీ కాలిన మాంసం రాలుతుంటే, తల్లి ఇక తిరిగి రాదని అర్ధమయిపోతుంది.   బ్రతికేందుకు దమ్ము లేక, సుగంధ ద్రవ్యాలతో, గంధపు చెక్కలతో చితి పేర్చుకుని ఆ స్త్రీలు చేసిన ఆత్మత్యాగం విలువ ఏమిటో, ఆ చిన్న వయసులో కూడా పంపకేమీ అర్ధం కాదు.   అప్పుడే ఆమెకు చావంటే అయిష్టం కలుగుతుంది. ఎప్పటికీ ఆత్మ హత్య చేసుకోకూడదని, చావు  దేనికీ పరిష్కారం కాదనీ ఆ క్షణాన్నే బాల్యాన్ని కోల్పోయిన ఆ పిల్ల గట్టిగా నిశ్చయించుకుంటుంది.   ఏదో తెలీని గగుర్పాటుతో, తీవ్ర అలజడితో పంపా నది ఒడ్డున నుల్చున్న ఆ అనాధ పిల్లకు అశరీరవాణి  "దీర్ఘాయువు"ను ప్రసాదిస్తున్నట్టు వరం ఇస్తుంది. 

తల్లి  తండ్రీ ఇద్దరూ పోయాక అనాధ అయిన ఆ పిల్ల, ఒంటరిగా ఈ దుష్ట ప్రపంచంలో  ఎలా బ్రతికి బట్టకట్టిందో, ఎలా దోపిడీకి గురయిందో, ఏమి కష్టాలు చూసి బ్రతికిందో చెప్పలేను.  విజయనగర  సామ్రాజ్యాన్ని  స్థాపించడంలో విద్యారణ్యులనే ఓ ఋషి పాత్ర ఉంది కదా.  ఈ కథలో అతను విద్యాసాగరుడు.  పంప  అనాధయేటప్పటికి ఈ విద్యాసాగరుడు  యువ సన్యాసి. ఒక్కడూ గుహలో తపస్సు చేసుకుంటున్నాడు.  ఆధ్యాత్మిక  గ్రంధాలని చదువుకుంటున్నాడు. అతని  ఆశ్రయంలోకి "పంప"ని విడిచిపెడతారు. పగలు  ఎలానో పనిపాటల్లో గడిచిపోయినా , రాత్రి సమయాల్లో ఆ యువకుడూ, ఈ వయసొస్తున్న పిల్లా ఒకే గుహలో పడుకుంటారు. కఠోర బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్న ఆయువ సన్యాసి కాస్తా,  ఆమెను శారీరకంగా వాడుకునేవాడు. 'పంప'  ఎలాగో బ్రతకడం కోసం,  ఇంకో దిక్కు లేక, తనని ఇలా వదిలేసిన తల్లిని నిందించుకుంటూ అతని పంచనే ఉండాల్సి వచ్చింది.  అయితే, అప్పటినించీ పంప 'మాట'లాడలేదు.   ఆమె మౌనం ఎన్ని సంవత్సరాలు  గడిచిందంటే, తనతో అన్నేళ్ళు 'బానిస'లా బ్రతికిన ఆ పిల్ల పేరేంటో  విద్యాసాగరుడికి తెలీదు. 


పంప యౌవనంలోకి వచ్చేసరికి అసమాన సౌందర్యవతి అయింది.  ఆమె సౌందర్యం లో ఎంతో గాంభీర్యం, హుందాతనం ఉండేవి.  అప్పుడే ఆ గుహ దగ్గరకి అప్పటికి చుట్టుపక్కల రకరాలుగా జరుగుతుండే యుద్ధాల్లో సైనికులుగా పనిచేసుకుంటూ, జీవిక చూసుకునే ఇద్దరు అన్నదమ్ములు (హరిహర బుక్క రాయలు) వస్తారు. వాళ్ళకి రాజ్య విస్తరణ (స్థాపనా) కాంక్ష ఉంది. విద్యాసాగరుని ఆశీర్వాదం కోసం వస్తారు వాళ్ళిద్దరూ.   గురువు దగ్గరికి ఒట్టి చేత్తో ఏమొస్తారు ? కొన్ని పళ్ళు, విత్తులూ ఉన్న బుట్ట ని తీస్కొస్తారు.   గురువు అప్పటికి పెద్దవాడయ్యాడు. పంప అతని కూతురో / భార్యో ఎవరికీ తెలీదు.  పంప  అంతవరకూ మూగదనే అనుకుంటున్నారందరూ.  

రాజ్యం మాటొచ్చాక పంప తొలిసారిగా వారితో మాటాడింది. వాళ్ళు తీసుకొచ్చిన విత్తనాల్ని వాళ్ళకే ఇచ్చి,  తుంగభద్ర చుట్టుపక్కలంతా చల్లమంది. ఆ  విత్తనాల్లోంచీ మనుషులు పుడతారు. దేశమంటే మట్టి కాదు కద. దేశమంటే ప్రజలు. ఆ  ప్రజలు అంటూ ఏర్పడ్డాకా, ఒక కోట కట్టి, అందులో రాజ్య స్థాపన చెయ్యమంటుంది. రాళ్ళు, రప్పలతో నిండిన ఆ భూమిలో ఆమె ఏ మంత్రం వేసి ఆ విత్తనాలిచ్చిందో కానీ,  వీళ్ళు ఇలా చల్లాక, తెల్లారేసరికీ ఓ అందమయిన రాజ్యం స్థాపించేయగలిగారు. 'ఖావల్సినంత' మంది  ప్రజలు  ఆ విత్తుల్లోంచీ పుట్టుకొచ్చారు. రకరకాల వృత్తుల వారు. వ్యాపకాలవారు. వ్యాసంగాలవాళ్ళు.. బోల్డుమంది.  మాట వినే ప్రజలు.. వాళ్ళకి గతం లేదు.  ఈ కొత్తజీవితంలో కొత్త ప్రాణులే అయినా, పంప  తన అలౌకిక శక్తులను వాడి, అశరీరంగా మారి,  ప్రతి ఒక్కరి చెవిలోనూ వాళ్ళకో కథ చెప్పేది… ఉదాహరణ కు కుమ్మరి వాడున్నాడనుకోండి.. "నీ పేరు ఫలానా… నువ్వు వృత్తి రీత్యా కుమ్మరివి.. నువ్వు ఎంతో నైపుణ్యంతో కుండలు చేస్తావూ" అని.. అలాగే వడ్రంగి నుంచీ సైనికుడికీ.. అందరికీ తమ తమ పాత్రలు తెలుసు. అదే  పంప పుట్టించిన రాజ్యం. పంప  సృష్టించిన మనుషులు.  పంప  చెప్పిన కథల్నే తమ తమ జీవితాలు చేసేసుకున్న ప్రజలు.  ఆలా విజయనగర సామ్రాజ్యం మొదలయింది. 

బుక్క రాయలు, అతని తమ్ముడు హుక్క రాయలలో మొదట ఈ రాజ్యానికి రాజు ఎవరవ్వాలి? రాజు  అంటూ అయాక, రాణి ఉండాలి కద మరి, పంప ని ఇద్దరూ ఇష్టపడుతున్నారాయె.  వీళ్ళిద్దరిలో పంప ఎవరిని ఎన్నుకుంటుంది?  పంప ఇద్దరినీ పెళ్ళాడుతుంది. మొదటి భర్తతో కొడుకుల్నీ, రెండో భర్తతో కూతుర్లనీ కంటుంది.  భర్త  ఉండగానే  తమ రాజ్యానికి గుర్రాలమ్మేందుకని వచ్చిన పోర్చుగీసు యువకునితో ప్రేమలో పడుతుంది.  అలా రాజు భార్యతో సంబంధం పెట్టుకోవడం పులిబోనులో తల పెట్టడమే అని తెలిసినా ఆమెను వొదులుకోలేని ప్రియుడూ, తన కళ్ళెదురుగానే ప్రియుడితో తిరిగే "ప్రశ్నించే వీలు కాని" భార్య ఉన్న రాజూ..  నిజానికి ఆవిడతో ఇక గడిపేందుకు భయపడో, అలా ఉండలేక బాధపడో, రాజు ఎక్కువగా యుద్ధాలలోనే గడిపేవాడు. అలా దక్షిణాదిన ముసల్మానుల రాజ్య విస్తరణను అడ్డుకుంటాడు. 

అదో  పెద్ద  కథ… పంప కంపన ఆతరవాత రెండు వందల ఇరవైయేళ్ళు బ్రతికింది. "తన వాళ్ళ" చేతే  వెళ్ళగొట్టబడింది.   రాజ్యం ఎన్ని చేతులు మారుతుందో చూస్తుంది. విజయనగరం రకరకాల వంశాల చేతుల్లోకి వెళ్తుంది. తను  సృష్టించిన ప్రజలే ఆమెను అసహ్యించుకుంటారు. కొన్నేళ్ళు అజ్ఞాతవాసం చేసి తిరిగొస్తుంది. భర్తలు, ప్రియులు, పిల్లలు – అందరూ తన కళ్ళెదుటే చనిపోతారు. విద్యాసాగరుడు చాలా సంవత్సరాలు బ్రతుకుతాడు.   అతను మతమౌడ్యం మీద పునాదులేసుకుని, ఒక ఆశ్రమాన్నేర్పరచి, తరవాత రాజ్యవ్యవహారాలో చేయి పెట్టి,  రాజులాగా  దిగ్విజయంగానే బ్రతుకుతాడు.   పంప కంపన రాజ్య బహిష్కరణకి కారణం అవుతాడు.  ఎన్నో ఏళ్ళపాటు అడవుల్లో తలదాచుకుని, కాలంతో ప్రయాణం చేసి,  ఆఖరికి శ్రీ కృష్ణదేవరాయని కాలం లో పంప, తన ముని ముని ముని ముని ముని ముని మనవరాలితో కలిసి, రాజ్యానికి తిరిగొస్తుంది.  

తిమ్మరసు అంతటి "మంత్రిణి" అవుతుంది. ఎన్నో  అత్భుతాలు చేస్తుంది. పుట్టుక నుంచీ, విజయనగరం గతించిపోయే దాకా, దాని చరిత్రను స్వయంగా రచిస్తూ, దానితో పాటూ పుడుతూ, నశిస్తూ, మళ్ళీ జీవిస్తూ, ఎన్నో బాధలు సహిస్తుంది.   అయితే తన జీవితాన్ని అడుగడుగునా డాక్యుమెంట్ చేసి,  ఓ దీర్ఘ కవితలా రాసి, ఆ కాయితాల్ని ఒక మట్టి కుండలో భద్రపరుస్తుంది.  అదే ఈ కావ్యం.  ఈ కావ్యం లో The Woman King సినిమా లో లాగా అత్యంత శక్తివంతులయిన మహిళా సైనికులుంటారు. వాళ్ళకి ఉక్కులాంటి శరీరం, భయం ఎరుగని ప్రవృత్తి, యుద్ధ విద్యల్లో నైపుణ్యమూ, అసామాన్యమైన విశ్వాసమూ ఉంటాయి.  

ఆమె జీవితయానంలో  "ఘన విజయనగర సామ్రాజ్యం"లో ఎందరో విదేశీయులు రాజు తో కలిసి పనిచేస్తారు. "పోర్చుగీసు ప్రేమికుడు" పంపకు ప్రతి తరంలోనూ, ఒకడు ఎదురవుతాడు.  ఆమె వయసు పెరగని, మృత్యువు రాని యవ్వనవతి.  200 ఏళ్ళ వయసుకి 24 ఏళ్ళ పడుచు మనిషిలా కనిపిస్తుంది.  ఆ మొదటి పోర్చుగీసు ప్రేమికుడు ఆమెను ఎంత ప్రేమించాడంటే, ఆమెకోసం మళ్ళీ మళ్ళీ పుడుతూనే వుంటాడు. సముద్రాలు దాటి ఏదో ఒక వంకతో మన దేశానికొస్తాడు. దక్షిణాది కి గోవా నుంచొచ్చి, పంప ఎదుట నిల్చిన ప్రతిసారీ.. "వచ్చావా!" అంటుంది ఆమె నింపాదిగా, ఆపేక్షగా, అతనొస్తాడని ముందే తెలిసినట్టు!    అతనికి పూర్వజన్మవాసనలుండవేమో.. "కొత్త యువకుడు"  ఈమెని చూసి, "ఎన్నో యుగాల పరిచయం ఉన్నట్టుందే, ఎవరీమె?" అనుకుంటూ..  అయోమయపడతాడు.  చాలా సహజంగానే ఆమెతో ప్రేమలోనూ పడతాడు. 

పంప  కూతుర్లలో ఒక ఆమెను విజయనగర రాజుని ఆశ్రయించిన ఒక  చైనీయుడు పెళ్ళాడతాడు. వారిద్దరి  ప్రేమకథ అపురూపం. నిజానికి  వాళ్ళు పెళ్ళి  చేసుకోరు. తరతరాలుగా  కొన్ని జన్మల పాటు, మళ్ళీ మళ్ళీ పుడుతూ, కలుస్తూ, ప్రేమించుకుంటూ, కలిసే ఉంటూ - బ్రతుకుతారు.  వాళ్ళ..."ముని ముని ముని కూతురు" పెద్దయి, తన అమ్మమ్మ తో కలిసి విజయనగరానికొచ్చి శ్రీ కృష్ణదేవరాయని  "ప్రేమిక " అవుతుంది.   అసలు పెళ్ళాడేదేమో కానీ, రాజ్య వ్యవహారాలు చక్కబెట్టాల్సిన తిమ్మరసు సలహా మీద రాయలు ఒక రాజకుమార్తెను పెళ్ళాడాల్సి వస్తుంది. ఆవిడ పట్టమనిషి కాబట్టి, పంప మనుమరాలు "ప్రధాన ప్రేయసి" గానే మిగిలిపోతుంది. 


ఆనాటి రాచరికపు మర్యాదలు, కుట్రలు, కుతంత్రాలు,  అమర్యాదలు, రాజుల స్త్రీలోలత్వమూ, యుద్ధ కాంక్ష, విస్తార భ్రమణమూ అన్నీ వర్ణనలు, ఎలా ప్రతీదీ ఉండేదో, ఎలా జరిగేదో, రాయలు, తిరుపతి నుంచీ సింహాచలం దాకా  వివిధ రాజ్యాలలో క్షేత్ర దర్శనాలు చేయడం, శాసనాలు రాయించడం, బోల్డన్ని గుళ్ళు కట్టించడం, గుళ్ళకు భూరి విరాళాలివ్వడం, రాజ్యాలు గెల్చుకోవడం, అతని భార్యలు కూడా వివిధ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి, సాంస్కృతిక, సాహిత్య రంగాలలో ప్రతిభని చాటడం, అతని రాజ్యంలో పేరెన్నిక  గన్న కవులూ,  రాజు స్వయానా అత్భుతమైన సాహిత్యం రచించడం, దక్షిణ, కళింగ దేశాలని ఏలడం..  వీటన్నిటినీ సల్మాన్ రష్దీ చాలా చక్కగా రాసుకొచ్చాడు.   ఇవన్నీ రష్దీ ఎలా ఒక కథ లో ఇమడ్చగలిగాడో అని చాలా ఆశ్చర్యం కలుగుతుంది. 

చదివే వాళ్ళకి కథంతా చెప్పేసి, అన్యాయం చేస్తానని నా మీద ఒక ప్రథ ఉంది. క్షమించాలి. ముగింపు  చదవడం మాత్రం ఒక అనుభవం. మన కథలు GOT కన్నా ఏం తక్కువ ? ముగింపు చదవడం కోసం ఈ పుస్తకాన్ని కొనుక్కోండి. 


చిన్న సందేహం : 

తల్లి లాంటి పంప కంపన ని అచ్చు మన "మహామంత్రి తిమ్మరసు" సినిమాలో లాగానే 'రాయలే ' కళ్ళు పొడిపించేసి,  గుడ్డిదాన్ని చేసేస్తాడు. అప్పుడు నాకు ఎంటీఆర్ మీద గొప్ప కోపం వచ్చింది. Hee hee !!   నవలంతా నాకు భానుమతీ, ఎంటీ ఆర్, నాగయ్య, వీళ్ళే కనిపించారు.  Is it my Telugu conditioning ???

ఒక సౌత్ ఇండియన్ గా, మిస్టిసిసం తో మెరుస్తూ ఉండే హంపి నగర వర్ణనల మధ్య సరిగ్గా అలాంటి అలౌకిక శక్తి ఉన్న పంప "కళ్ళతో చూసినదీ, జ్ఞానేంద్రియాలతో, మనసుతో చెప్పినదీ" అయిన ఈ "విజయ నగర" కథ ని చదివి ఈవిడ (Rushdie)  - ఈ "విజయనగరా"నికి  "బిస్నగ" (BISNAGA) అని ఎందుకు పేరు పెట్టిందో కాస్త చెప్పండి.   నాకు ఎంత వెతికినా సరిగా తెలీలేదు. "బిస్నగ సామ్రాజ్యం " అనడిగితే, వికీ  "విజయనగర సామ్రాజ్యాని" కి దారి చూపిస్తోంది. దాని వెనకేముందో కథ మరి!! 

***