Pages

14/02/2010

నేను తీసిన కొన్ని ఫోటోలు


-- > మిట్ట మద్యాహ్నం తెన్నేటి పార్కు, విశాఖపట్నం


-- > గ్రేట్ రివర్ ఔస్ లో ఒక పాయ - బెడ్ఫోర్డ్, ఇంగ్లండ్


-- > పెరట్లో విరగబూసిన చెట్టు, బెడ్ఫోర్డ్, ఇంగ్లండ్


-- > (ప్రయోగాలు - భంగిమ) పాట్ ప్యూరి-- > ప్రయోగాలు - దీపావళి అలంకరణ కోసం కొన్న గుర్రం బొమ్మలు


-- > Town Centre దగ్గరనుకుంటా! బెడ్ఫోర్డ్, ఇంగ్లండ్

--> వెరసి, తోచీ తోచనమ్మ తీసిన ఫోటోలు! చాన్నాళ్ళకి చూసాకా, బావునాయే అనిపించి, ఇలా పోస్ట్ చేసాను.

08/02/2010

నాద నీరాజనం - SVBC

నాద నీరాజనం, శ్రీ వేంకటేశ్వరా భక్తి చానల్లో ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుండీ, 7.30 దాకా ప్రత్యక్ష ప్రసారం అవుతున్న ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం మొదలు పెట్టిన దగ్గర నుంచీ దాదాపుగా అన్ని ఎపిసోడ్లూ చూస్తూనే వస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వరా భక్తి చానెల్ దేవస్థానం శ్రీవారికి నిష్ణాతులయిన సంగీత కళాకారుల చేత, వారి అద్వితీయమైన సంగీత ప్రతిభ చేత, ఇస్తున్న స్వర హారతే ఈ నాద నీరాజనం.

ఈ డైలీ కాన్సెర్టులు - శ్రీ వారి ఆలయం ఎదురుగా బహిరంగం గా - అందరు భక్తులకోసం, ఆరుబయట నిర్మించిన మండపంలో నిర్వహించపడుతున్నాయి. ఇప్పటివరకూ ఈ వేదికపై ప్రముఖ సంగీత విద్వాంసులు, కర్ణాటక, హిందుస్తానీ - భజన - దాస సాంప్రదాయాలలో గాత్ర, వాయిద్య సంగీత ప్రదర్శనలతో ప్రజల్లోకి భారతీయ, హిందూ, భక్తి సంస్కృతులను ఆఘౄణింపచేస్తూ, సామాన్య భక్తులను తమ స్వర రాగాలయ దర్శనం చేయిస్తున్నారు.

అసలే తిరుమల. ఎన్నో వ్యయ ప్రయాశలకోర్చి చేసుకున్న శ్రీవారి దర్శనం. ఉస్సూరుమంటూ గుడి బైటికొచ్చిన భక్త కోటికి సాయంత్రాల్లో ఓదార్పు గా ఈ వీనుల విందు. ఉత్కృష్ఠమైన ఈ సాంప్రదాయ సంగీత కళ, దేశ విదేశాల్లో పేరెన్నిక గన్న కళాకారుల ఉక్కిరి బిక్కిరి చేసే ప్రదర్శనలు - ఉచితంగా, భక్తుల కోసం ఏ ఆస్థాన మండపంలోనో కాకుండా - ఆరుబయట ఏర్పాటు చేసిన వేదిక, దేవస్థానం వారి దూరదర్శని లో ప్రత్యక్ష ప్రసారం - ఇదీ నాద నీరాజనం లో ప్రత్యేకత.

భారతీయ శాస్త్రీయ సంగీతానికి పెరుగుతూన్న ఆదరణ, సామాన్య భక్త జనంలొ ఉన్న భక్తికి, సంగీతం పట్ల అనురక్తినీ జోడించి పారవశ్యంలో ఓలలాడిస్తున్న ఈ నిత్యమూ జరిగే కచేరీలు ఒక నిదర్శనం.

అయితే, ఈ కచేరీలలో, కొన్ని నిజంగా ఆణిముత్యాల లాంటి కచేరీలు - ప్రత్యక్ష ప్రసారం ఒక సారి జరిగిన తరవాత ఇంకోసారి చూసుకునే అవకాశం లేకపోవడం విచారించదగిన విషయం. మిగిలిన చానెళ్ళ లాగా బెస్ట్ ఆఫ్ నాదనీరాజనం లా ఈ మణిపూసల్ని ఇంకోసారి మరోసారి ఎపుడన్నా ప్రసారం చేసే ఆలోచన తి.తి.దే.వారికి ఉంటే బావుండేది.

మొన్ననే లతా మంగేష్కర్ చేత అన్నమయ్య సంస్కృత సంకీర్తనలను సీడీలు గా చేయించి విడుదల చేసిన సందర్భంలో ఈ నాదనీరాజనం వేదికను రసాభాసా చేసింది తి.తి.దే. నాద నీరాజనం కార్యక్రమం చోటుచేసుకునే ఆ సరస్వతీ మండపాన్ని రాజకీయ నాయకుల కాళ్ళు ఎక్కి తొక్కడం - లతా కచేరీ ఉంటుందని విశేషంగా జనాకర్షణ చేసిన సారాయి వీర్రాజు గారు వేదిక మీద త్రిభాషా ప్రసంగం చేసి (ఏ భాష లోనూ తీరా సరిగా మటాడ్లేకపోయారు) లతమ్మనూ, భక్తులనూ విసిగించడం దురదృష్టకరం. తీరా ఈ కార్యక్రమంలో లత పాడలేదు. కానీ ఆరోజు సభా ముఖంగా శ్రీవారికి తాను చేసిన స్వరార్చన (అన్నమాచార్య సంస్కృత సంకీర్తనలు హిందూస్తానీలో ఆలపించడం) సీడీలను విడుదల చేసి, ఏదో ఒక రోజు ఈ వేదిక పై కచేరీ చేయగల శక్తిని తనకు ఈయమని స్వామిని వేడుకుంది.

మంగళంపల్లి బాల మురళి, ఉన్నికృష్ణన్, ప్రియా సిస్టర్స్, హరిప్రసాద్ చౌరాసియా లాంటి ఎందరో ఉద్దండులు చేసిన కచేరీలు శ్రీవారికి నాద నీరాజనంగా సమర్పింపబడ్డాయి ఈ వేదిక మీదే. ప్రతి రోజూ సాయంత్రం భక్తులకు ఈ భక్తి సంగీత విందు - ఆసక్తి గల బ్లాగర్లకూ, సంగీత విద్యార్ధులకు మరి భలే పసందు. ప్రతి సంగీత కళాకారుడూ ఈ వేదిక మీద కచేరీ చేయాలని ఆశించే స్థాయిలో ఈ కార్యక్రమాన్ని రసరమ్యంగా నిర్వహిస్తున్న TTD, SVBC మరియూ ఈ.వో గారు శ్రీ కృష్ణారావుగారూ ధన్యులు. వీడియోలు యూట్యూబ్ లో కొన్ని చూడొచ్చు.