Pages

12/09/2019

Women in Terrorism Case of the LTTE by Tamara Herath - 5




ప్రతి ముగ్గురు పురుషులకీ ఒక స్త్రీ అనే నిష్పత్తిలో ఎల్.టీ.టీ.ఈ లో మహిళా సభ్యులు ఉండేవారు. వారిలో నాయకత్వ స్థాయిలో చాలా తక్కువమందే ఉన్నా, ప్రభాకరన్ తో వారికున్న రక్త సంబంధానికన్నా అతీతమైన బంధం, "అన్నా" అని వరుసతో పిలిచే గౌరవం, పరమ విధేయత, చెప్పుకోదగ్గవి. అసలంత చరిష్మా ని ప్రభాకరన్ ఎలా ఏర్పరచుకున్నాడు ? స్త్రీలకీ, వారి సమానత్వానికీ, పురుషులతో పోటీ పడి పనిచేసే వారి తెగింపుకీ, విశ్వాసానికీ అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన సంస్థ గా ఎల్.టీ.టీ.ఈ. ని రూపుదిద్దటం ద్వారానే.

తాము ఆ దేశంలో మైనారిటీలయి ఉండి, ప్రత్యేక ఈలం పోరాటం చేయడం లో ఉన్న చాలెంజ్ లను బేరీజు వేసుకున్న ఈ సంస్థ మొదటి నుండీ, స్త్రీ సమానత్వానికి తగిన ప్రాధాన్యతని ఇస్తూ వచ్చింది. వారు విధేయత తో సంస్థ లక్ష్యాలకోసం పని చేసేరు తప్ప పెద్దగా నాయకత్వ స్థానాలలో పని చేయలేదు. కానీ మతానికి సంబంధమే లేకుండా కేవలం  దేశ సాధన కోసం కృషి చేసిన దళం కాబట్టి ఇక్కడ అసమానత కి తావు లేకుండా, నిజానికి మహిళల కి లైంగిక మానసిక వేధింపులు ఎదురవకుండా వారికి చాలా ప్రాధాన్యాన్నిచ్చి దళాన్ని నడిపించడం జరిగింది. 

చెచెన్యా, పాలస్తీనా ల లా (అక్కడ ఆత్మాహుతి దాడి కి పాల్పడిన పురుషుడి కుటుంబానికి నాలుగొందల డాలర్లూ, స్త్రీ కుటుంబానికి రెండొందల డాలర్లూ ప్రతీ నెలా, జీవన భృతి చిక్కేది) స్త్రీ ప్రాణానికి తక్కువ విలువ, పురుషుడి ప్రాణానికి ఎక్కువ విలువా అని నిర్వచించలేదు. కానీ సాధారణ పౌర సమాజంలో స్త్రీ ల లాగా వీరు తాము బలహీనులం కాము అని నిరుపించుకోవడం కోసం ఎన్నో త్యాగాలు చేసారు.  పోరాటం ముదిరినపుడు తప్పని సరి గా సాధారణ దుస్తులు ధరించాల్సి వచ్చేది.  వారిని ఈ సాయుధ పోరాటంలో కి తీసుకు రావడమే సులువు.  వన్ని పరిసరాల్లో ఎన్నోసార్లు ఆత్మ రక్షణ కోసం  గూడు చెదిరి పారిపోవాల్సి వచ్చినపుడు, దాడులకు గురయినపుడూ వారు ఎదుర్కొన్న రక్షణ లేని పరిస్థితులకు మహిళలకి ఈ ఈలం పోరాటం ఓ కవచం లా కనిపించడంలో తప్పు లేదు.

పురుషులతో సమానంగా వారు పేలుడు పదార్ధాలు అమర్చి, పేల్చి, లోతుల్లోకి దిగి, అత్యంత సాహసమైన, దుర్లభమైన బావులు తవ్వడం లాంటి పనులు చేసారు.  క్లిష్టమైన పనుల్లో స్త్రీ సహాయకురాలిగా, పురుషుడు ప్రధాన పాత్ర గా కాకుండా దానికి భిన్నంగా పని చేసి చూపించారు. వారు బావులు తవ్వినపుడు పురుషులు తట్టలు మోసారు. వారు లాండ్ మైన్ లను అసెంబుల్ చేసారు, అమర్చారు.  పేలుడు పదార్ధాలను వాడారు. ఆయుధాలను మోసారు. మైళ్ళ కొద్దీ అడవుల్లో, నగరాల్లో, సైనికులమీద దాడులకు దిగారు. ఆత్మాహుతి దాడుల్లో ఒక్క మారు కూడా వెనుతిరిగి చూడకుండా పాల్గొన్నారు.  పోరాటం చివరి రోజుల్లో ట్రక్కుల కొద్దీ శవాలై తేలారు. సముద్రం మధ్యలో శ్రీలంక నేవీ మీద కు దాడికి దిగారు. పురుషుల కన్నా ఎక్కువ సమర్ధవంతంగా పని చేసారు.

తమ జెండర్ సాకు గా చూపించి ఏ పనీ చెయ్యడానికి వెరవలేదు.  శక్తికి మించిన పనులే చేసారు. ప్రాణాల్ని తృణప్రాయంగా వదిలారు. అయితే శ్రీలంక ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా, ఉక్కుపాదంతో నలువైపుల నుండీ చుట్టుముట్టి వేలాదిగా దళ సభ్యుల్ని తుడిచిపెట్టేసినపుడు, పురుషుల కన్నా ఎక్కువ హింసకి లోనై చంపబడ్డారు.  పైగా తమని తాము నిరూపించుకోవడానికి పురుషుల కన్నా ఎక్కువే కష్టపడ్డారు. ప్రభాకరన్ విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండేందుకు, ఆయన మీద గౌరవంతో ఎన్నో సమస్యలని ఎదుర్కొన్నారు.  పోరాటం ముగిసి, నాయకులంతా మరణించాకా, హింసని మర్చిపోయేందుకు శ్రీలంక సమాజం చేసిన ప్రయత్నాలలో ఈ మహిళా తీవ్రవాదులని కూడా స్మృతి పథం లోంచీ అందరూ తుడిచేసారు.


ఈ మహిళా తీవ్రవాదుల గురించి సెప్టెంబరు 11 దాడుల ముందు వరకూ ఎవరూ, ముఖ్యంగా లంక మరియు విదేశీ మీడియా అస్సలు పట్టించుకోనే లేదు.  సంఖ్యాపరంగా కూడా, వ్యవస్థాగత అమరిక లోనూ,  తక్కిన సంస్థల్లో  మహిళా తీవ్రవాదుల కన్నా ఎక్కువ సంఖ్యలో ఎక్కువ ఫలితాలనీ, లక్ష్యాలనీ సాధించినా, వీరికి తగిన గుర్తింపు అప్పటి వరకూ దొరకనే లేదు.  9/11 తరవాత పాశ్చాత్య, లంకీయ మహిళా జర్నలిస్టులు సైతం ఈ మహిళా తీవ్రవాదుల పాత్రపై దృష్టి సారించారు.  వీరి ప్రవేశం, దళాల వ్యవస్థా, పనితీరు, ప్రాధాన్యత, ధైర్యం వగైరా అంశాల పై పరిశోధన మొదలైంది.

సింహళ, తమిళ సమాజాలలో సాధారణ మహిళల నుంచీ ఈ తీవ్రవాద మహిళలకు పెద్ద సానుభూతి ఏమీ దక్కలేదు. ఎప్పుడో పాత తరపు స్త్రీలు మాత్రం, కట్టుబాట్లను చేదించి, ఆభరణాలను త్యజించి, ఆయుధాలు ధరించి, పురుషుల దుస్తులు ధరించి, ఏదో లక్ష్యం కోసం పని చేస్తున్న  ఈ తీవ్రవాద మహిళలని కాస్త ఆదరంగా చూసినా,  అంతకు మించి గుర్తింపు దక్కలేదు.

మే 2009 లో ప్రభాకరన్, అతని ఇద్దరు కొడుకులూ, కూతురూ, భార్యా, విధేయ అనుచరులూ హత్య కావింపబడ్డాక, ఈలం పోరాటం చాలా దారుణ పరిస్థితుల్లో ముగిసింది.  అప్పటి నుండీ శ్రీలంక రాజకీయ వాతావరణం, సమాజ వాతావరణం చాలా మారిపోయింది.  పోరాటం  ముగిసాకా, ఎల్.టీ.టీ.యీ ఏకాకిత్వం ఎక్కువయిపోయింది. సమాజం లో ప్రతి ఒక్కరూ, వీరికి దూరంగా జరిగారు.  ఏతావాతా విదేశీ మీడియా, సానుభూతిపరులూ, లంక సైన్యం సాగించిన అక్రమ నిరంకుశ రాక్షస విధానాలనూ, యుద్ధ నేరాలనూ రికార్డు చేసాయి.  హిలరీ క్లింటన్ ఈ యుద్ధ నేరాలను గర్హిస్తూ చేసిన చిన్న ప్రకటనలు తప్ప ఎక్కువ పనేమీ జరగలేదు.

ఈలం పోరాటం లో ఈ మహిళల పాత్ర మాత్రం అసామాన్యమైనది. తమ నాయకుడు, అతని భార్యను మాత్రం సాంప్రదాయ కుటుంబ చట్రంలో భద్రంగా ఉంచి,  మిగిలిన మహిళలను మాత్రం తీవ్రవాదం లోకి తీసుకొచ్చి, పోరాటంలో వాడుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.  ఎల్.టీ.టీ.ఈ ప్రధానంగా ఆత్మాహుతి దళం.  ఇందులో ఒక మాటు ప్రవేశించాక, నిష్క్రమణ మరణం ద్వారానే అని తెలిసీ, తమిళ దేశపు లక్ష్య సాధన కోసం altruistic suicides కి ముందుకొచ్చిన ఈ వేలాది మహిళలు చరిత్ర లో ఓ భాగంగా మిగిలిపోయారు.

ఎల్.టీ.టీ.ఈ లో ఈ మహిళల active role సాధారణ శ్రీలంక /తమిళ సమాజం లో మహిళల సమానత్వ కాంక్ష కూ, వారి రాజకీయ సామాజిక చైతన్యానికీ సూచిక. ఈ మహిళలు, పురుషుల చాటు రెండో తరగతి ప్రజల్లా ఉండి పోకుండా, తమ కు ఎదురైన వ్యక్తిగత, జాతిగత అన్యాయాలను తమకు చాతనయినంత మేరకు ఎదుర్కొన్నారు.  అసలు సమాజం కూడా ముప్పయేళ్ళ హింస కు ఎందరో మనుషులనీ కోల్పోయింది. తప్పనిసరి గా లక్షలాది మంది దేశాలు పట్టి పారిపోయారు.

పోరాటం ముగింపు దశలో ఎందరో అమాయక జనం తీవ్రవాదుల, సైనికుక చేతుల్లో చనిపోయారు.  రచయిత్రి ఇంటర్యూ చేసిన మహిళా తీవ్రవాదులు మామూలు గృహిణులు, పిల్లలు, యువతులు.. వివిధ వయసుల్లో, వివిధ నైపుణ్యాలతో యుద్ధాన్నీ, హింసనీ దగ్ఫరగా చూసిన వారు. వారికి ఈ ఆయుధాలు, పోరాటం, దళాలలో చిక్కే గౌరవం, నిరాశ గా ఉండిపోకుండా ఏదో చేసామన్న తృప్తి ని ఇవ్వడం గురించి మాట్లాడారు. సమాజం లో మహిళల పట్ల మారాల్సిన దృక్పథం గురించి, తమ తమ అభిప్రాయాలు వ్యక్తపరిచారు.‌

ఈలం గురించి వివిధ వెబ్ సైట్ లలో, ఎల్.టీ.టీ.ఈ అధికారిక వెబ్ సైట్ల లో జెండర్ బేస్డ్ డాటా కోసం వీలయినంత మేర ప్రయత్నించినట్టు రచయిత్రి చాలా చోట్ల చెప్పడం బావుంది. నిజానికి ఇందరు స్త్రీలు, ఇందరు పురుషులు అని ఎక్కడా సమాచారం దొరకక కుస్తీ పడాల్సొచ్చింది. అయితే ప్రతీ సభ్యుడు, స్త్రీ పురుష బేధం లేకుండా సాధించిన వివిధ విజయాల గురించి వెబ్ సైట్ లు యధాతధంగా ప్రచురించడం ప్రస్తావించారు.

ఏదేమైనా ఈ తమిళ మహిళా పులులు ప్రత్యేకమైన పాత్ర పోషించి, తీవ్ర వా దాని కున్న dimensions ని మార్చేసారనడం లో సందేహం లేదు. 240 పేజీల ఈ రీసెర్చ్ గ్రంధం చదివి ఆ తరవాత ఊరుకోక అందులో కనిపించిన సోర్స్ ల గురించి నెట్ లో వెతికి భీభత్స రణ చరిత్ర ని చదివి, తీవ్రవాదాన్ని అణచడం లో శ్రీలంక గొప్పగా చెప్పుకునే శ్రీలంక మోడల్ మిలటరీ ప్లాన్ గురించి ఆలోచించి ఆశ్చర్యం కలిగింది.  మొత్తానికి ఇప్పుడు శ్రీలంక శాంతియుత దేశం. పర్యాటక ప్రాంతం‌  ఈలం తుడిచిపెట్టబడ్డ చరిత్ర. ఈ మహిళల మార్క్ మాత్రం ప్రపంచంలో ఎక్కడో లీలగా ఉండిపోతుంది.

-Finished-






02/08/2019

Women in Terrorism Case of the LTTE by Tamara Herath - 4


                                     మాలతి

21 మే 1991 న తమిళనాడు శ్రీ పెరంబదూర్ లో  భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య జరిగింది. ఎల్ టీ టీ ఈ కు చెందిన మహిళా తీవ్రవాది ధను (అసలు పేరు థెన్ మోళి రాజరత్నం) నడుముకు చుట్టుకున్న బెల్టు బాంబు పేల్చి ఆత్మాహుతి దాడికి పాల్పడడంతో రాజీవ్, ధనులతో సహా వారికి చుట్టుపక్కల ఉన్న  16 మంది దుర్మరణం పాలయ్యారు.  రాజకీయ కల్లోలం సృష్టించిన ఈ ఘటన ఆ తీవ్రవాద సంస్థ తుడిచిపెట్టబడడానికి, భారత ప్రజల్లో శ్రీలంక తమిళుల పట్ల ఉన్న సానుభూతిని చెరిపేయడానికీ దోహదపడింది. బాలసింగం అన్నట్టు ఇదో దురదృష్టకరమైన సంఘటన. ప్రభాకరన్ వ్యూహాత్మక తప్పిదం. అయితే, ధను తీవ్రవాదంలో మహిళల పాత్ర పట్ల ప్రపంచ దృక్కోణాన్ని మార్చేసింది.

దాడి సఫలం అయిన వెంటనే, వాటి తీవ్ర రాజకీయ పరిణామాలను ఊహించిన ఎల్.టీ.టీ.ఈ. ఈ హత్య వెనుక తమ పాత్ర లేదని వాదించింది. ధను ఐ.పీ.కే.ఎఫ్ చేతిలో అత్యాచార బాధితురాలని, ఆమె వ్యక్తిగతంగా ప్రతీకారం తీర్చుకోవడానికే రాజీవ్ ని చంపిందనీ ప్రకటించింది. ఐ.పీ.కే.ఎఫ్ 1987 - 1990 వరకూ జఫ్నా లో పనిచేసింది.  మహిళల శీలం, పవిత్రతా లకు సాధారణంగా సమాజంలో ఓ గౌరవనీయమైన స్థానం ఉంటుంది.  రాజ్యం / ఐపీకేఎఫ్ / శ్రీలంక దళాలు, తమిళులను కృంగదీయడానికి సామూహిక హత్యలూ, అత్యాచారాలకు తెగబడ్డాయన్నది నిజం. అలా దాడులకు, తరచూ ఇంటిని / తమ స్వస్థలాలనూ వొదిలి పారిపోవాల్సి రావడం, చెట్లకిందే సమూహాలలో బ్రతుకు జీవుడా ని జీవించడం, కళ్ళముందే అయినవారిని కోల్పోవడం, చాలా మంది మహిళలను ప్రతీకారేచ్చ తో రగిలేటట్టు చేసాయి. ఏ రక్త సంబందమూ ఇవ్వలేని బాంధవ్యాన్ని ఈలం పోరాటం కల్పించింది.   వారు ఇలాంటి తీవ్రవాద / ఆత్మాహుతి దాడికి పాల్పడి, వారు తమ పవిత్రత ని తిరిగి పొందవచ్చనీ, చెరచపడ్డ ఆడది, తిరగబడటానికి, చంపడానికీ తుపాకీ చేపట్టడం, తిరుగులేని జవాబు గా భావించడం,   ఓ అధికారంగా భావించడం జరిగింది. ఏ యుద్ధంలో అయినా మహిళ ల పట్ల ఘోర అన్యాయాలు జరుగుతాయి. అత్యాచారం వాటిలో మొదటిది. భర్తలనూ, పిల్లలనూ చంపడం, అశక్తురాలను చేయడం మిగతావి.  వాటికి ప్రతీకారం తీర్చుకునేందుకు "తమిళ పులులు" వారికి అవకాశం ఇచ్చారు.

రేప్ కు గురయిన స్త్రీ, బయట సమాజంలో అంతగా గౌరవింపబడదు. కానీ తమిళ పులుల సమాజంలో వారికి పురుషులతో సమాన హోదా వుంది.  పైగా స్త్రీ సహజ నైజం త్యాగం (సమాజపు చట్రాల ఆలోచనల్లో, స్త్రీ తప్పనిసరిగా త్యాగధనే)  కాబట్టి, ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ మహిళ అయితే ఇంకా గౌరవింపబడేది.  హమాస్ లాంటి చాందసవాద ముస్లిం సంస్థల్లో పురుషులతో సమానంగా తీవ్రవాద ఆత్మాహుతి దాడులకు అనుమతించాలని ఉద్యమించిన మహిళలకు ఆ అవకాశం ఇవ్వడానికి మొదట తటపటాయించినా, తిరుగులేని జవాబుదారీతనంతో, ఖచ్చితత్వం తో వారు ఈ దాడులకు దిగడం తో స్త్రీ ల ఉగ్రవాద పాత్రల పట్ల, వారికి కొన్ని కీలక ప్రదేశాల్లో పురుషులకు కూడా దొరకని ప్రవేశావకాశాలను  దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం ఎంత లాభదాయకమో హమాస్, ఇస్లామిక్ జిహాద్ వగైరా సంస్థలు వెంటనే గుర్తించాయి.

అందరు మంచి మహిళల లాగే ఈ తీవ్రవాద ముస్లిం మహిళలు కూడా, టార్గెట్ వరకూ ఒక మగ మనిషితో వచ్చారు. ఈ మగ సహచరుడు, బహుశా వీరు దాడి చేస్తారా చెయ్యరా చూడడానికి వచ్చినట్టు కూడా అనుకోవచ్చు.  వాళ్ళ కళ్ళు విప్పార్చుకునేలా దాడులు చేసిన మహిళలు, మహిళా తీవ్రవాదానికి ఒక పెద్ద పీట వేయించారు. కాశ్మీర్ లో ఈ మధ్య వరకూ చిన్న పిల్లలు, ముక్కు పచ్చలారని బాలురు, డబ్బులకు రాళ్ళు రువ్వడం ప్రచార మాధ్యమాలలో బాగా చూసాం. ఈ పసివాళ్ళే, ఆర్మీ కాన్వాయి మీద చేతితో క్లిప్ తీసి, విసిరే గ్రనేడ్ లనూ అవలోకగా విసురుతారు.  అలా చిన్న చిన్న పసివారు కూడా తీవ్రవాదంలో భాగం కావడం సామాన్యం. శ్రీలంక ఈలం పోరాటంలో వేలాది పిల్లలు, మహిళలూ దళంలో చేరారు. చావు వీరికి, తమ జీవితంలో ఎదురవబోయే ఓ ముప్పు. ఎన్నో పరిణామాల వంటిదే.

అయితే ఆత్మాహుతి దళంలో చేరడం, స్లీపర్లు గా పనిచేయడం, వారి అవసరం పడినపుడు తమ నేతకు తలవంపులు తేకుండా, 100% సఫలత తో దాడికి తెగబడడం, వారు చాలా ఇష్టంగా ఎంచుకునే ప్రక్రియ.  మహిళల కైతే, తమ పవిత్రతని తిరిగి పొందేందుకు ఇదో సాధనం.

నిజానికి ఎల్.టీ.టీ.ఈ. దళాలు తప్పనిసరిగా తమ ట్రైనింగ్ ముగిసిన గుర్తుగా మెళ్ళో ఓ కుప్పి / సైనేడ్ బిళ్ళ ను వేసుకునే వారు. గాజు కుప్పె / తావీజు లో పేక్ చేసిన ఆ సైనేడ్, రక్త ప్రవాహంలో చేరిన వెంటనే 5-10 నిముషాల పాటు విపరీతమైన వేదనకు గురి చేసి, మనిషి ప్రాణాన్ని తీస్తుంది. మోతాదు తక్కువ అయితే, మెదడు కోలుకోలేనంతగా దెబ్బ తింటుంది. మిలిటెంట్ విద్యార్ధి ఉద్యమంలో పోలీసులకు పట్టుబడే ముందు శివకుమార్ అనే నాయకుడు సైనేడ్ సేవించి 1974 లో ఆత్మహత్య చేసుకోవడం, ప్రభాకరన్ దృష్టిలో పడింది.

నిజానికి సైనైడ్ మరణం అత్యంత బాధ తో, హృదయవిదారకమైన వేదనతో నిండినది. కానీ పోలీస్ / సైనికుల చేతిలో విపరీతమైన చిత్రవధ, తరవాత తప్పని భయంకరమైన మృత్యువును తప్పించుకునేందుకు సైనైడ్ ను నమ్ముకుంది ఎల్.టీ.టీ.ఈ.  కొత్తల్లో ఈ కుప్పె ను కొరికి, నాలుక/పెదవుల మీద అయిన గాయం ద్వారా సైనైడ్ ను తీసుకునేవారు. కానీ గట్టి గా ఉంటూండే కుప్పెను అంత గట్టిగా కొరకడం అన్నిసార్లూ కుదిరేది కాదు. గాయం చిన్నదయినా, మోతాదు తగ్గినా విపరీత పరిణామాలుండేవి.

ఆఖరికి ఈ కుప్పె లో ఆధునిక మార్పులు వచ్చి, సన్నని గాజు కుప్పెలు వాడటం మొదలయింది. భారత దేశాన్నిండీ దీన్ని దిగుమతి చేసుకునే వారు. తీవ్ర గాయాలతో శ్రీలంక దళాలకు చిక్కేసే పరిస్థితుల్లో సైనైడ్ తిని ఆత్మహత్య చేసుకున్న మొదటి మహిళా సభ్యురాలు మాలతి వీర మరణాన్ని, అక్టోబర్ 2009 లో చివరి పోరాటం లో ఓడిపోయే వరకూ ఎల్.టీ.టీ.ఈ. గౌరవిస్తూనే ఉంది. సైనేడ్ మరణాలను చాలా వరకూ హాయైన మరణంగా ప్రచారం చేసేవారు.  ఎందుకంటే దొరికిపోయి, తమ తోటివారికి ప్రమాదం గా తయారవకుండా, చనిపోవడమే క్షేమమని భావించేవారు.


ఎల్.టీ.టీ.ఈ, చాలా విషయాల్లో మిగతా తీవ్రవాద దళాల కన్నా స్త్రీ సమానత్వం లో మెరుగు.  ఏ నమ్మకాల మీద, బ్రెయిన్ వాషింగ్ మీదనో, తమిళ బాధిత స్త్రీలు దళంలో చేరినపుడు వారికి పురుషులతో సమాన అవకాశాలు కల్పించింది.  బెదురు లేని, ఇంటిలాంటి వాతావరణాన్నిచ్చింది. అప్పటి వరకూ సామాన్యంగా జీవించేందుకు పోరాడిన సామాన్య మహిళలు కాస్తా, సమాజం కట్టుబాట్లని వదిలి, పురుషులతో సమానమైన ట్రైనింగ్, ఆయుధాలు, లక్ష్య నిర్దేశ్యాలలో, నాయకత్వ నిర్ణయాలలో భాగం తీసుకోవడం మొదలయింది.

ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ వారి కుటుంబాలకి,  ప్రతీ తీవ్రవాద సంస్థా నెలకింత అని స్టైపెండ్ ఇస్తుంది. కానీ హమాస్, ఇస్లామిక్ జిహాద్ లు పురుషుడి కుటుంబానికి  ఎక్కువా, మహిళా తీవ్రవాది కుటుంబానికి అందులో సగం ఇచ్చేవారు. ఎందుకంటే, బ్రతికి ఉండుంటే, పురుషుడు తన కుటుంబానికి ఏదో ఓ పని చేసుకుని డబ్బు సంపాయించి ఇచ్చిఏవాడు కనుక.  కానీ ఎల్.టీ.టీ.ఈ అలాంటి తేడాలేవీ చూపించలేదు.  అయితే ఈ తరహా సొమ్ము ను తమిళ కుటుంబాలు ఎంత చొప్పున అందుకునేవో బయటికి తెలిసేది కాదు.  ఒకవేళ వారు దాన్ని నిరాకరించినా, ఈలం సమాజంలో ఆయా కుటుంబాలకు సముచిత గౌరవం దక్కేది.

ప్రతీ 27 నవంబరు నా,  వీరుల స్మారక దినం రోజు అన్న ప్రభాకరన్ ఆయా కుటుంబాలను ఉద్దేశించి బరువైన ప్రసంగం చేసేవాడు.   ఆత్మాహుతి దాడి చేసుకున్న   మొదటి పురుషుడు కేప్టెన్ మిల్లర్ కు ఎంత గౌరవం దక్కిందో, సైనైడ్ తిని ఆత్మహత్య చేసుకున్న మొదటి మహిళగా మాలతి కీ  అంతే గౌరవం దక్కింది.  వివిధ యుద్దాలలో, ఆత్మాహుతి దాడుల్లో చనిపోయిన ఈలమ్ వీరుల త్యాగాలు ఊరికేనే వృధా కావనీ, పోరాటానికి జవస్త్వాలు కూర్చడానికి ప్రాణాల్నే బలిదానం చేసిన వీర సైనికులమేలు మరవలేనివనీ ప్రభాకరన్ వల్లించడం ఆయా కుటుంబాలను సాంత్వన పరచేవి.



27/07/2019

Get Published - మహమ్మద్ ఖదీర్ బాబు

"న్యూ బాంబే టైలర్స్, ఇతర కథలు" అనే  మహమ్మద్ ఖదీర్ బాబు గారి 2012 నాటి కథా సంకలనం లో నాకు నచ్చిన కథ ఈ 'గెట్ పబ్లిష్డ్'.  ఒక రచయిత కి ఒక ప్రత్యేక శైలి ఉండటం, దానికి మనం అలవాటు పడడం,     మరీ ఎక్కువయినప్పుడు చిరాకు పడడం, మామూలు గా జరుగుతూ ఉంటుంది. ఫలానా ఆయన / ఆమె ఇలాంటి కథలే రాస్తారూ అని ఓ ముద్ర పడిపోయాక, ఆయా కథలని చదివాక ఒకే అనుభూతి కంటిన్యూ అవదు. ఎందుకో నాకు ఇది వర్తిస్తుంది.  పైగా కొన్ని వ్యక్తిగత అభిప్రాయాలు కూడా సాహిత్యం పేరుతో చలామణీ కావడం. చలామణీ అయ్యేలా ప్రచారానికి దిగడమూ, పొలిటికల్లీ కరెక్ట్ కావడం కోసం ప్రయాస కూడా మన దృష్టి ని దాటదు.

నిజానికి న్యూ బాంబే టైలర్స్ మరియు ఇతర కథల లో అన్ని కథలూ బానే ఉన్నాయి. అవన్నీ వివిధ పత్రికలలో ప్రచురింపబడినవీ, అందరూ మెచ్చుకున్నవీ. కొన్ని కథలు ముగించాకయితే ఒక క్షణం ఆగి, ఆలోచించుకోవాలనిపించేలా ఉన్నాయి.  కొన్ని బీద ముస్లీము కుటుంబాల కథలు, కొన్ని మామూలు హిందూ కథలు, దురదృష్టవంతుల కథలు, పోరాట వీరుల కథలు ఉన్నాయి.  కాకపోతే,  అవన్నీ దాదాపు ఒకే మూడ్ లో ఉన్నట్టు అనిపించాయి. కొన్ని మరీ అతిగానూ ఉన్నట్టనిపించాయి.

"గెట్ పబ్లిష్డ్" (2010)  క్లాసిక్ గా, చాలా బావుంది. ఈ కథ చెప్పడంలో రచయిత అతి ఆత్మ విశ్వాసం ఏదీ ప్రదర్శించలేదు. ఒక నిబద్ధత కల ముస్లిం  జర్నలిస్ట్ ఒక బీద ముస్లిము కుటుంబం గురించి రాసిన చిన్న కథ ఇది. అయితే ఇది టెర్రరిజం కు సంబంధించిన బీద కథ. అదీ విశేషం.  మహమ్మదీయుల తీవ్రవాదం వల్ల ఎవరయ్యా నష్టపోయారూ అంటే సాటి మహమ్మదీయులే.  హిందూ తీవ్రవాదుల వల్ల నష్టపోయిందీ మహమ్మదీయులే. ఈ విషయాన్ని అందరూ కళ్ళతో చూస్తారు, చెవులతో వింటారు గానీ, కాయితం మీద పెట్టరు. ఏదో అడ్డుగోడ అది.

తెలంగాణా రాజధానిలో ఓ మసీదు కు నమాజు కి తరచూ వెళ్తూండే ఆంధ్రా ముస్లీము కధకుడు. ఆయన వేష భాషలేవీ హైదరాబాదీయంగా వుండవు. అసలు సాటి ముస్లీములే గుర్తు పట్టరే అన్నట్టుంటాడు. అనగా, మతాన్ని తన భుజాన వేసుకుని తిరిగే మనిషి కాదు ఆయన.  సరే.. వెళ్తున్నాడా, ఆ మసీదులో ఓ చిన్ని బాలుడు. బీద వాడు.  ప్రార్ధనలకు వచ్చే వారి చెప్పులకు కాపలాగా ఉండి రెండూ మూడు రూపాయలు సంపాదిస్తూ ఉండే మామూలు పిల్ల వాడు. ఈ అబ్బాయితో కథకుడికి చిన్న అనుబంధం. అదీ ట్రిగ్గర్ ఇక్కడ. వేరే ఎవరి కథ నో అయితె ఇంత ఇదిగా చెప్పుండునా ఈయన ? ఈ బుడ్డోడి కథ కాబట్టి బాగా చెప్పాడు.

అసలు ఎవరి కష్టాన్నయినా మనం మనసులతో చూస్తే గానీ, వారి చెప్పుల్లో దూరితే గానీ అర్ధం చేసుకోలేం. అదే ఈ కథ. ఈ మసీదులో చెప్పులు కాపలా కాస్తూండే అబ్బాయికి ఓ అమ్మా, నాన్న. నాన్న అంటే పిల్లాడికి చాలా అభిమానం, ప్రేమ. తండ్రి జీవితంలో ఒకప్పుడు బాగా బ్రతికి ప్రస్తుతానికి చెడ్డవాడు. తల్లి దాదాపు యాచకురాలు.. ప్రజలామెకు ఫకీరు నామం కూడా తగిలించారు. ఈ కుటుంబం, డబ్బు లేకపోయినా మనశ్శాంతిగానే బ్రతుకుతూంది. కానీ ఓ ఉగ్రదాడి తరవాత అనుమానితుడి గా పిల్లాడి తండ్రిని ఓ రాత్రి వేళ భోజనం చేస్తుండగా వచ్చి, పోలీసులు నిర్బంధంగా అపహరిస్తారు.

తీవ్రవాద చట్టాలూ, తీవ్రవాద న్యాయాలూ చాలా తీవ్రంగా ఉంటాయి. తండ్రి తన కళ్ళ ముందే అలా మాయమవడం చూసిన పిల్లాడు భయంతో జ్వరం తెచ్చుకుంటాడు. అదృష్టం బావుండి కొన్నాళ్ళకు అమాయకుడైన తండ్రిని పోలీసులు విడిచిపెడతారు.  బందీగా ఉన్నప్పుడు విపరీతమైన చిత్రవధకు గురయిన  ఆ తండ్రి ఇప్పుడో జీవచ్చవం. ఆ కుటుంబం పడ్డ కష్టాలనూ, పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ నీ దగ్గరగా చూసి, కథకుడు రాసిన రిపోర్ట్, ఆయన రాసినది చదివి స్పందించిన పత్రిక సంపాదకుడి మానవత్వ స్పందనా ఈ కథ.  ఈ జీవచ్చవమూ, రోజూ రాత్రవగానే జ్వరం తెచ్చేసుకుని భయంతో వొణికే చిన్న పిల్లాడూ.. వీళ్ళ జీవితాలు ఒడ్డున పడేలా చేసేది ఏది ? పైగా ఆ కుటుంబం ధనసాయం తీసుకోదు.

ప్రధాన మీడియాలో ఇలాంటి ముస్లీం గొంతులని వినిపించి, వారి తరఫు కథ ను చెప్పడానికి ప్రయత్నిస్తే ఆ కథనాలు ప్రచురితమవుతాయా..? ఎటువంటి ముద్రా వేయకుండా ప్రజలు అలాంటి కథనాలని చదువుతారా అనేది కథకుడు సంధించిన సూటి ప్రశ్న.  ఈ సంకలనం లో కొన్ని మిగతా ముస్లిం కథలు కూడా ఇవే ప్రశ్నలు వేస్తాయి. పాత  బస్తీ విలాసమూ, మహమ్మదీయ నామధేయమూ బ్రతుక్కి అడ్డంకిగా మారిన వేలాది యువకుల గురించి ప్రస్తావన ఉంటుంది.

ఇలాంటి కథలు రాయాలంటే అరుంధతీ రాయ్ కే సాధ్యం. అలా నిర్భయంగా ప్రశ్నించాలంటే లౌక్యం చొక్కా విప్పేసి, ధైర్యం చొక్కా తొడుక్కోవాలి.  కాబట్టి, ఒక తెలుగు కథ గా ఇది చాలా విచిత్రమైన కథ.  అడ కత్తెరలో ఉన్న పోక చెక్కల్నిగురించి  ఇలా రాసి, ప్రచురించి, మానవత్వం ప్రదర్శించినందుకు రచయితకు అభినందనలు.

ఈ మధ్య కాలంలో నాకు చాలా చాలా తక్కువ తెలుగు కథలు నచ్చుతున్నాయి.  ఊరికే డీటైల్స్ ఎక్కువుండే రచనలు అస్సలు నచ్చట్లేదు. ఎక్కడికక్కడ చిన్న చిన్నభాగాలుగా, ముందుకూ, వెనకకూ జరుగుతూ సంభాషణ లాంటి కథ నచ్చడం చాలా బావుంది.  మనకి కావలసింది చేంజ్.  బాధితుడి కథ విన్నాక, అతని వెర్షన్ పట్ల కూడా సానుభూతి కలగాలి. అప్పుడు సమాజం కదులుతుంది.  ముస్లిం కథలైనా, వేరే ఏమయినా, ఇవే చేస్తాయి. కానీ పుస్తకాల, ప్రచురణల  మార్కెట్, పాఠకుల మార్కెట్ కన్నా చాలా విభిన్నంగా ఉండటం ఇప్పుడిప్పుడే తెలుస్తూంది.  కాబట్టి కొన్ని ప్రచురణ కి నోచుకోవడం, నోచుకోకపోవడం గురించి ఎవరి అభిప్రాయాలు వారివి. అందుకే ఇది రొటీన్ కన్నా భిన్నం. ఇలాంటిది ఇంకోటి రాదు. వచ్చినా ఒకటే ట్రంప్ కార్డ్ ఎక్కువ నాళ్ళు చెల్లదూనూ.

***





చంద్రగిరి శిఖరం (చందేర్ పహార్) - బిభూతి భూషణ్ బంధోపాధ్యాయ




పేరు చూడగానే నేను చెప్పబోయేది బెంగాలీ నవల కి తెలుగు అనువాదం అని తెలుస్తూంది కద.   అసలు ఇతివృత్తం ప్రకారం, "చందేర్ పహార్" అనే పేరున్న ఓ గొప్ప సాహస మెకన్నాస్ గోల్డ్ తరహా బెంగాలీ నవల, అదీ ఆఫ్రికా నేపధ్యంలో, దేశ స్వాతంత్రానికి ముందే, ఇంత రోమాంచితంగా రాసారంటే, సహజంగానే ఉత్సుకత కలుగుతుందెవరికయినా.  దాన్ని అరటి పండు చేతిలో వొలిచి పెట్టినట్టు కాత్యాయని గారు అనువాదం చేసారు.

ఇదే పేరుతో తీసిన సినిమా కూడా బెంగాలీ లో సూపర్ హిట్టు అయింది. యూట్యూబులో ట్రైలర్ చూసి ఆనందించండి. పూర్తి సినిమా, ఈ రోజుల్లో చూస్తే, చదివితే వచ్చేంత గగుర్పాటూ, ఆనందమూ కలుగుతాయో లేదో చెప్పలేము.  అన్నీ దృశ్య రూపంలో, ప్రత్యేకంగా ఇమాజిన్ చేయనక్కర్లేకుండా ఉంటుంది కాబట్టి, ఇంకా మజా రావచ్చేమో చెప్పలేను.

ఆఫ్రికా గురించి అంతవరకూ ప్రత్యేకంగా తెలుసున్న వారికి 1937 లో ప్రచురితమైన ఈ కథ నమ్మశక్యంగానే అనిపిస్తుంది. నాకయితే 13/15 ఏళ్ళ క్రితం గొల్లపూడి టాంజానియా యాత్రానుభవం 'కౌముది'లో చదివేదాకా ఆఫ్రికా గురించి ఏమీ తెలీదు.   గొల్లపూడి   చెప్తే మసాయి తెగ వారి గురించి అబ్బురంగా చదవడం గుర్తుంది. రక్తం తాగే, ఈ పొడుగాటి పిల్లంగోవి వీరులు, యాదవులలా, పశు కాపరులే అయినా, వీళ్ళని చూసి ఆఫ్రికన్ సింహాలే భయపడతాయని ప్రతీతి.

ఫూడ్ రేంజర్ అనే ప్రఖ్యాత యూ ట్యూబర్ కూడా మసాయి తెగ వారి ఆహారపు అలవాట్ల గురించి వీడియో తీసారు.  పచ్చి నెత్తురు తాగే ఈ సాంప్రదాయ ఆఫ్రికన్ తెగ మూలాల గురించి గొల్లపూడి మారుతీ రావు, ఓ ప్రచారంలో ఉన్న పిట్ట కథ కూడా చెప్పారు. దాని ప్రకారం, మసాయిలు మన ద్వాపర యుగం నాటి యాదవులే. గుజరాత్ ప్రాంతం నుండీ భూమి ఫలకాల మార్పుల వల్ల వారి భూభాగం జరిగి టాంజానియా / ఆఫ్రికా లో కలిసిపోయిందని ఓ వాదన.  ఇదంతా నాకు గుర్తున్న మటుకూ విషయాలు. ఫుడ్ రేంజర్ వీడియో మాత్రం ఈ మధ్య తీసినదే.  ఆసక్తి ఉన్న వారు చూడ వచ్చు.

బ్రిటీషు రాజ్యంలో భారత దేశం నుండీ ఎందరో కూలీలు ఆఫ్రికాలో, మారిషస్ లో, శ్రీలంక లో, ఇంకా ఇతర సుదూర ప్రాంతాలలో ప్రపంచం నలు మూలలకూ విస్తరించిన కాలం అది. అయితే ఈ చందేర్ పహార్ పథికుడు ఒక బాగా చదువుకున్న బీద బెంగాలీ బాబు శంకర్. పట్టభదృడయి ఉండి కూడా జూట్ మిల్లులో చిన్న పనికి పోవాల్సిన పరిస్థితుల్లో కూడా, రగిలిపోయే సాహసేచ్చ, ప్రపంచాన్ని చూడాలనుకునే ఉత్సాహమూ ఉన్న యువకుడు. తెలిసిన వారెవరో ఉగాండా లో రైల్వేలో పని చేస్తూండటంతో వారి సాయంతో మొదట మొంబాసాకు 350 మైళ్ళ దూరంలో ఓ స్టేషన్ నిర్మాణ పనుల్లో ఆ కేంపు  గుమస్తా, స్టోర్ కీపర్ గా ఉద్యోగంలో కుదురుతాడు.  అక్కడ గుడారంలో మకాం.  ఆ సమయంలోనే ఎలిఫెంట్ గ్రాస్ అని పిలవబడే నిలువెత్తు గడ్డి భూముల్లో చాలా దూరం దాకా నడిచి వెళ్తూండే శంకర్ కు అనుభవజ్ఞులు హెచ్చరికలు చేస్తారు. ఆ గడ్డిలో వన్య మృగాలు మాటు వేసి ఉంటాయని. అదే, ప్రమాదాలతో  శంకర్ కు పరిచయం చేసిన సమయం.

అక్కడే పలు మసాయిలూ, భారతీయులూ కలిసి కూలీలుగా పని చేస్తూంటారు. మసాయిలు స్థానికులే కాబట్టి వారే తోటి వారిని హెచ్చరిస్తూ ఉంటారు. అయినా, ఆ సమయంలో విపరీతంగా సింంహాల దాడి జరిగి కనీసం రోజుకొకరు చొప్పున ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కార్మికులు మరణిస్తూ ఉంటారు. వీరంతా వివిధ పనులకోసం, కేంపు వదిలి బయటకు వెళ్ళినవారే. ఆఖరికి వారంతా బయటకు వెళ్ళటం మానుకునేసరికీ, సింహాలే కేంపు లోపలికి చొచ్చుకొచ్చి, నిద్రపోతున్న వారిని కూడా లాక్కెళ్ళడం మొదలు పెడతాయి.

అప్పుడప్పుడే సన్నిహితుడవుతున్న తిరుమలప్ప అనే  తమిళ గుమస్తా, శంకర్ తో మాటాడుతూ పక్కనే నిద్రపోయిన ఒక రాత్రి, వారి గుడిసెలోకి చొచ్చుకొచ్చిన సింహం, తిరుమలప్పను లాక్కెళ్ళిపోతుంది. ఇలా మృత్యువు అతి సమీపంలోకి రావడాన్ని శంకర్ చూసి చాలా వ్యాకులపడతాడు. ఈ కేంపు సింహాల దెబ్బకి మూతపడ్డాక, ఉగాండాలో ఓ మారుమూల ప్రాంతపు రైల్వే స్టేషన్ లో ఉద్యోగానికి కుదురుతాడు.  రైల్వేస్టేషన్ లో  రోజంతటికీ వచ్చే ఒకే ఒక్క రైలుకు  సిగ్నల్ ఇవ్వటమే అతని పని.

అతను ఉద్యోగంలో చేరేనాటికి తనని చుట్టుముట్టబోయే ఒంటరితనం, భయానక పరిస్థితుల గురించి అస్సలు అవగాహన లేని శంకర్ ని రిసీవ్ చేసుకున్న  పాత ఉద్యోగీ, గుజరాతీయుడే.  అతను కాస్తా వీడ్కోలు చెప్పాక బొత్తిగా ఒంటరితనం, ప్రమాదాలూ చుట్టుముడతాయి.  అప్పటినుంచీ ఆ పరిసరాల్లో  యదేచ్చగా చుట్టుముట్టే సింహాలూ, అతి భయానకమైన మాంబా సర్పాలూ. వాటి దాడులూ, తన ఆత్మ రక్షణా వ్యూహాలూ,  నిత్య కృత్యాలయిపోతాయి. .  నిద్ర లేని రాత్రుల మధ్యా ఉద్యోగ జీవితం గడుస్తూంటుంది.  నిజానికి అప్పటికే  ఆ స్టేషన్ లో ఓ ఇద్దరు పూర్వ ఉద్యోగులు మరణించడం, మరో నలుగురు ట్రాన్స్ ఫర్ కోసం దరఖాస్తు చేసుకుని పారిపోవడమూ జరిగింది.  శంకర్ కి కూడా ట్రాన్స్ఫర్ సలహా ఇస్తారు తెలిసిన వారు.  కానీ అంత తేలిగ్గా బ్రతుకు జీవుడా అనుకునే మనిషి కాదు కదా మన హీరో.

[అసలు  మాంబా సర్పాల గురించీ నాకేమి తెలుసు? రాల్డ్ డాల్ చెప్తే గానీ తెలీలేదు. అతనూ ఆఫ్రికాలో షెల్ కంపెనీ లో ఉద్యోగం చేసేటప్పుడు,  స్థానిక సమాచారం లో భాగంగా ఎరిగిన,  మనిషి ఎత్తు కి లేచి, తల మీద నిర్దాక్షిణ్యంగా కాటు వేసే, విరుగుడు లేని విష సర్పం మాంబా గురించి మతిపోయీలాగా చెప్పిన విషయం గుర్తొచ్చింది.    ఆఫ్రికా ఖండంలో ప్రసిద్ధికెక్కెన ఆ బ్లాక్  మాంబా కరిచిన కొద్ది సెకన్లకే, రక్తం పెరుగు లా గడ్డలు కట్టి,  శరీరంలో రక్త ప్రసరణ జరగక మనిషి మరణిస్తాడు.]

సరైన ఆహారమూ, నీరూ, మాటాడ్డానికో తోడూ దొరకని ఆ స్టేషన్ లో ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే చేపల వేటకు దగ్గరలో నీటి కుంటకు బయలుదేరిన శంకర్ కు దప్పికతో చావుకు దగ్గర్లో ఉన్న ఆల్వరెజ్ కనిపిస్తాడు. అతన్ని తన బసకు తీసుకొచ్చి, నాలుగయిదు రోజులు సేవ చేసి, మనిషిని చేస్తాడు. ప్రాణాపాయం నుండీ బయటపడ్డ అరవయ్యారేళ్ళ ఆల్వరెజ్ శంకర్ కు తన వజ్రాల అన్వేషణ, అవి ఓ గుహలో ఉండటం, వాటిని వెతుక్కుంటూ వచ్చి తాను దారి తప్పిపోవడం, ఇతర ప్రమాదాలు, సహచరుడి మరణం, వగైరాల గురించి చెప్తాడు.... అంతటితో రైల్వే ఉద్యోగానికి సలాం చెప్పి, ఆల్వరెజ్ వెంట వెళ్తాడు. ఇద్దరూ తండ్రీ కొడుకుల్లా సమన్వయంతో  వజ్రాల వేటలో ఆ భయానక ఆఫ్రికన్ అడవుల్లో, దుర్గమమైన దారుల్లో, అత్యంత భయానకమైన సవాళ్ళను ఎదుర్కొంటూ సాహస యాత్ర మొదలుపెడతారు.. అదీ ఈ కథ. ఈ మొత్తం ఆఫ్రికా అనుభవం వయసు పద్ధెనిమిది నెలలు. ఈ పద్ధెనిమిది నెలల్లోనే వంద జీవితాల్ని జీవిస్తాడు శంకర్.

వికీ లో 'చందేర్ పహార్' కథా, ఈ అనువాద పుస్తకంలోనీ కథా,  ముగింపు లో తేడాగా ఉన్నాయి. అది బహుశా సినిమా కథ అయి ఉండొచ్చు. సినిమా కోసం నాటకీయత జోడించి ఉండొచ్చు. మొత్తానికి జింబాబ్వే (రోడీషియా), సౌత్ ఆఫ్రికా, కెన్యా.. ఇలా దూర దూర ప్రాంతాలంతా నడిచి నడిచి, మనిషనేవాడెవ్వడూ అప్పటికి ఎరిగే ఉండని ప్రాంతాల్లో, గొడ్డలి దెబ్బే తగలని వనాలలో, శతాబ్దాలుగా రాలిన ఆకుల మీద మెత్తగా అడుగులేస్తూ, దిక్సూచి పాడయితే, తిరిగిన చోటల్లోనే పదే పదే తిరుగుతూ, అడుగడుగునా మృత్యువు విసిరే సవాళ్ళను ఎదుర్కొంటూ, అగ్ని పర్వత విస్ఫోటనాన్ని కళ్ళారా చూస్తి, దుస్సాహసమైన రిచ్టర్స్వెల్డ్ (ఇదే బహుశా ఈ చంద్రగిరి శిఖరం)  పర్వతాలని అధిరోహించి, మొత్తానికి ప్రాణాలతో బయటపడతాడు శంకర్.


తనకు సాహసయాత్రకు పురిగొలిపిన, ఎంతో చదువుకున్న, ఆల్వరెజ్ లాంటి ప్రతిభావంతులు కేవలం వజ్రాల వేటకు, బంగారు గనుల అన్వేషణకూ బయలుదేరి వెళ్తారంటే నమ్మలేని మనిషి శంకర్. వారి రక్తాలలో సాహసం చేయాలన్న తృష్ణ ఉంటుంది.  దేనికీ బెదిరిపోని ధైర్యం, దానికి అలవాటుపడి, సుఖంగా ఏ పట్నంలోనో స్థిరపడి సుఖంగా ఉండే నింపాది లేని మనస్తత్వం వీరిది.  ఈ వజ్రాలూ, బంగారమూ, దురాశా కన్నా, వారిని నడిపించే శక్తి ఏదో ఉందని నమ్ముతాడు శంకర్. ఎన్ని సాహసాలు, ఎన్ని వైఫల్యాలు, ఎన్ని కొత్త ప్రయత్నాలు.. వీటికి మానసిక శక్తి ఎక్కడ నుండి వస్తుంది ?


అగ్ని పర్వతం పేలడం ఎన్నడూ జన్మలో ఎరగని శంకర్, తన కళ్ళ ముందు ఆవిష్కృతమైన ఆ దృశ్యాన్ని చూసి, నిర్వాణ / సమాధి స్థితిని అనుభూతించినట్టు అయి, దేవుడికి కృతజ్ఞతలు చెప్పిన ఘట్టం చాలా సరళంగా అనువదించారు.  బర్డోలియో లెంగాయ్ అనే పేరున్న ఈ అగ్నిపర్వతం పేలినప్పుడు - దానిని చూసిన శంకర్ అనుభూతి ఇలా ఉంది.

QUOTE
అలాంటి దృశ్యాన్ని చూసిన భారతీయ యువకుడు శంకర్, తన సంప్రదాయం ప్రకారం ఆ పర్వతానికి చేతులు జోడించి, ఆ చేతులను కళ్ళకద్దుకుంటాడు. 'లయ కారకా, నీకు నా ప్రమాణాలు ! నీ విలయతాండావాన్ని ప్రత్యక్షంగా దర్శించే భాగ్యాన్ని కలిగించిన నీకు నా నమస్కారం.  నీ అత్భుత స్వరూపం ముందు వంద వజ్రపు గనులైన దిగదుడుపే.  ఇంత కాలంగా నేను పడిన శ్రమకు ఫలితం దక్కింది. నాకిది చాలు!" అని తన్మయుడయ్యాడు.
UNQUOTE


హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన ఈ చిన్ని పుస్తకం వెల 50 రూపాయలే.  బిభూతి ఈ పుస్తకాన్ని రాయడానికి ఎంత రీసెర్చ్ చేసి ఉంటారో,   వీరి సాహస యాత్ర లో తిరిగిన దారులూ, ఆఖర్న యాత్ర ముగిసాక, బెంగాలు బయలు దేరే ముందు అక్కడెక్కడో దక్షిణాఫ్రికాలో శంకర్ కు దొరికిన భారతీయ ఫలహారం.. ఇప్పట్లా ఇంటర్నెట్ అందుబాటులో లేని నాళ్ళలోనే, కళ్ళకు కట్టిన చిన్న చిన్న వివరాలు.. చాలా బావున్నాయి.

కథాకాలం మరీ పురాతనమైనది కాదు గాబట్టి,  ఎందరో ప్రవాస భారతీయుల గురించి మనం చదివాము కాబట్టి, ఈ కథ లో అసంబద్ధమైనదేదీ కనపడదు.  ఉదాహరణకు వీ.ఎస్.నైపాల్ ట్రినిడాడ్ అండ్ టొబాగో వాడు కదా, ఆయన చెప్పిన వాళ్ళ నాన్న కథా అలాంటిదే కదా.  ఇంకా అక్కడ లేదా ప్రవాసంలో దొరికే భారతీయ ఆహారం గురించి చదివినా,   ట్రినిడాడ్ లో ప్రసిద్ధమైన  "డబల్స్" లాంటి పదార్ధాలు గుర్తొస్తాయి.  ఈడీ అమీన్ తరంలో అయితే, గుజరాతీయులు ఉగాండా నుండీ నిష్క్రమించడం..., ఇవన్నీ.   అందుకే ఈ కథ ఎంతో నిజంగా జరిగినట్టుగానే అనిపించేస్తుంది.   ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలో మన ప్రవాసుల ప్రస్తావన తో మొదలయిన కథ ఇది. కాబట్టి, మరీ అభూత కల్పన లాగా ఎక్కడా అనిపించదు.


బిభూతి ఇతర నవలల్లోగా, పేరా పేరా కూ పాఠకుడు ఆ "అనుభూతిస్తూ", మైమరపుకు చేరుకునేలా లేదీ పుస్తకం. పేరా పేరాకూ ఒక స్వప్నం,  వెను వెంటనే  ఒక నిజానుభవం, ఓ జలదరింపు, ఆసక్తి కలిగించే వర్ణనా.. దట్టమైన రెయిన్ ఫారెస్ట్ లో కాలు జారే ప్రాంతాల్లో, ఆ ఆకుల వాసనా, జంతువుల అరుపులూ, వాటి విచిత్ర అలవాట్లూ, పాములూ, కొండ చిలువలూ, హైనాలూ, చిరుతలూ.. జిరాఫీలూ వీటన్నిటి మధ్యా మనమూ నడుచుకుంటూ, భయపడుతూ, వెళ్తూ ఉంటాము. అనువాదం చాలా బావుంది.

ఇన్ని నానా అగచాట్ల అనంతరం, అనుకోకుండా ఎదురైన , గులకరాళ్ళ లా పడి ఉన్న వజ్రాలను మనమూ అసలు ఖాతరు చేయము. సర్వైవల్.. ఎలాగైనా బ్రతకాలని శంకర్ / ఏ ఇతర సాహసికుడైనా పడే బాధలూ, వారి జీవన కాంక్ష చదివి మెచ్చుకుంటూ.. భయంకర మృగ దాడుల మధ్య, అనారోగ్యాలూ, అలసటల మధ్య, నీరూ , భోజనమూ, నిద్రా లేని ఘోర పరిస్థితుల్లో వీళ్ళని నిలబెట్టే శక్తి ఏది ?   అస్సలు మనకు తెలియనే తెలియని, సరైన map లే లేని ప్రాంతాల్లోకి వీరు ఏ ధైర్యంతో అగమ్య గోచర ప్రయాణం చేస్తారో అని  ఆశ్చర్యపోతూ మనమూ ప్రయాణిస్తాం. మొత్తానికి మనసుకు పట్టిన మకిలినేదో తొలగించిందీ కథనం.   నేనేమీ కథ ని పూర్తిగా చెప్పలేదు కాబట్టి మీ ఉత్కంఠ డిగ్రీలు క్షేమంగానే ఉంచుకోండి. అసలు కథ, దానిలో దూకితేనే  తెలుస్తుంది. దొరికితే చదవండి.


☸☘☙☙☘☸





12/04/2019

Women in Terrorism Case of the LTTE by Tamara Herath - 3

Part - 3


ఈ పుస్తకంలో శ్రీలంక చరిత్ర ని పూర్తిగా చర్చించండం జరిగింది. సింహళీయులు - తమిళులు మధ్య తగువు ఎలా మొదలయిందో వివరంగా రాసారు. శ్రీలంక చరిత్ర ప్రకారం శ్రీలంకీయులలో,  సింహానికి పుట్టిన సింహళులు కాకుండా హైనా సంతానం తరాచ్చులూ, కాకి సంతానం బలిభోజకులు, కుందేలు సంతానం లంబకన్నులు, నెమలి సంతానం మోరియాలూ ఉన్నారు.  సింహళులు, భారత దేశం నుండీ వెళ్ళగొట్టబడిన ఒక రాజు, తంబప్ని ప్రాంతంలో నాలుగో, ఆరో శతాబ్దంలో ఒక సిమ్హాన్ని వివాహం చేసుకోవడం ద్వారా జన్మించారు.  పైన చెప్పిన వివిధ జంతువులు ఆయా జాతులు ఆరాధించిన దేవతలు కావచ్చు. వీటికి ఆధారాలు ఏమీ లేవు. వారి పురాణ గాధల ప్రకారం కావచ్చు. ఉదాహరణ కి ఆంధృలు నాగులు అని ఒక థియరీ ఉంది. మహాభారత యుద్ధంలో నాగులు పాల్గొన్నారు. వారి సంతానమే ఆంధృలు  అంటారు. అలాగే వీళ్ళూ.  ఇప్పుడు ఈ సింహాలు తాము, తమిళుల మీదా, ఇతర తెగల మీదా ఆధిక్యం ప్రదర్శించడం - దానికి తిరుగుబాటు గా ప్రభాకరన్ పులులని ప్రతీక గా తీసుకుని బ్లాక్ టైగర్స్ ని తన జెండా గా మార్చుకోవడం, చరిత్ర.

నిజానికి డా. తమారా హెరాథ్ సింహళ మూలాలున్న బ్రిటిష్ వనిత.  అయినా తూకం ఎటూ బరువెక్కకుండా ఈ ఈలం పోరాటం తాలూకూ మూలాలనూ వేర్లనూ చక్కగా పక్షపాతం లేకుండా టైం, డేట్ లైన్లతో సహా వివరించారు.  సింహళాన్ని అధికార భాషగా తమిళుల మీద రుద్దడం ఇందులో ఒక భాగం.  సింహళ భాష రానివారికి ఉద్యోగాలు దొరకవు. బ్రతుకు తెరవు లేదు.  వివక్ష రూపాలనూ, నెమ్మదిగా మొదలయిన అసంతృప్తి తీవ్ర అసహనంగా రూపుదిద్దుకుని తీవ్రవాదం గా రూపాంతరం చెందడం ఇందులో కళ్ళకు కట్టినట్టు రచయిత్రి చెప్తారు.

 నిజానికి ఈలం అంటే అర్థం శ్రీలంకే.   తమిళ ఈలం అంటే శ్రీలంక లో తమిళ భాగం.  శ్రీలంక యొక్క తమిళ పదం 'ఈలంకై' కు మరో రూపమే ఈలం. భాషా ప్రాతిపదికన శ్రీలంక సమాజం చీలిపోవడానికి బ్రిటీషు వారి 'విభజించు పాలించు' సూత్రమే కారణం. అది రాను రానూ తమిళు ల పై వివక్ష, అత్యాచారానికీ. వారి తిరుగుబాటు కూ, మరిన్ని వ్యధలకూ కారణమయింది.  ఈ ఈలం పోరాటం 1970 లలోనే మొదలయింది.   

ఈ ఉద్యమంలో స్త్రీల ప్రవేశం, పిల్లల ప్రవేశం, మరణాల ద్వారా తగ్గిపోతున్న దళ సంఖ్యని పెంచడానికి పనికొచ్చేది. పైగా అణిచివేత, వెలివేత, ఉన్న ఊర్లనుండీ, ఇళ్ళ నుండీ   మాన ప్రాణాలు దక్కించుకుంటూ పారిపోతూ, జాఫ్నా, వన్ని లాంటి ఊర్లలో తల దాచుకున్న కుటుంబాలూ, చెట్ల కింద కుల మత, వర్గ భేధాలు లేకుండా కమ్యూన్ల మాదిరి బ్రతుకుతూ కలగలుపుకున్న స్నేహాలు, చెల్లా చెదురయిన బ్రతుకుకు, ఆగిపోయిన చదువుకూ, అత్యాచార బాధితులకూ, అందరినీ కోల్పోయిన అనాధలకూ ఎల్.టీ.టీ.యీ ఆశ్రయం ఇస్తూ అక్కున చేర్చుకోవడం మొదలయింది.  

ఇళ్ళలో పెద్దవారు ప్రభాకరన్ గురించి, అతని దళం గురించీ అబ్బురంగా  చెప్పుకోవడం, ప్రభాకరన్ ప్రదర్శించే నైపుణ్యమైన పెద్దన్న తరహా లక్షణాలు, మెరిసే బూట్లూ, పులిచారల యూనిఫాం, చేతిలో తళుక్కుమనే తుపాకీ, మెడలో రక్షణ కోసం ఉండే సైనేడ్ - ఇవన్నీ పెద్ద ఆకర్షణలు. ఇంకే భవిష్యతూ లేని తరానికి ఈ వాలంటీరింగ్ తప్ప వేరే దారి లేదు. అలా అని ప్రతీ అత్యాచార బాధితురాలూ ఈలం పోరాటంలో చేరినట్టు కాదు. ప్రతి ఆత్మాహుతి దాడి జరిపిన మహిళా,  అత్యాచార బాధితురాలు కాదు. కానీ ఎక్కువ సార్లు ఇదే జరిగింది.  వారిని బ్రెయిన్ వాష్ చేయడం సులభం. ఇదో ఆబ్లిగేటరీ ఆల్ట్రూయిస్టిక్ సూయిసైడ్. 

పైగా తమిళులపై జరిగిన అకృత్యాలలో భాగంగా గాంగ్ రేప్ లకు గురయిన మహిళలకు తమ శరీరం అపవిత్రం అయిందనీ, ఆత్మాహుతి దాడి ద్వారా దాన్ని పునీతం చేసుకోవచ్చనీ, (అగ్నిప్రవేశం) లేదా ఇలా ప్రతీకారం తీసుకోవచ్చనీ కొన్ని భావాలు అప్పటికే పాతుకుపోయి ఉండేవి.  తమని ప్రత్యక్షంగా అతిక్రమించిన వ్యక్తుల మీద ప్రత్యక్షంగా కాకపోయినా, పరోక్షంగా ఈ పతనానికి కారణమైన నేతల మీదా, వ్యవస్థ మీదా ప్రతీకారం తీసుకోవడం ద్వారా సమాజానికో సందేశం ఇవ్వడానికీ  బెల్టు బాంబు ఉపయోగపడేది. 

పైగా ప్రభాకరన్ దళంలో అత్యాచార బాధితులని తక్కువగా చూడడం, తక్కువ కులాల వారిని వివక్ష తో చూడడం అలాంటివేవీ లేకపోవడం, బయట సమాజం కన్నా దళంలో దొరికిన సమానత్వం, గుర్తింపూ, బంధనాలూ వారిని ఎక్కువగా ప్రభావితం చేసేవి.  ఇలా అగ్ని పునీతం అవ్వడం లాంటి ఎల్.టీ.టీ.యీ తరహా నమ్మకాలు మత పరమైన బ్రెయిన్వాషింగ్ కి ఉపయోగపడ్డాయి.   

ఎల్.టీ.టీ.యీ లో అందరు దళ సభ్యులూ ఏదో రకం బాధితులే.  అందరూ అన్నా, అక్కా, అలా వరసలు కట్టి పిలుచుకుంటూ ఒకే కుటుంబం లా ఉంటూండే వారు.  పురుషులదో గ్రూప్, మహిళలది వేరే గ్రూప్.  వారి మధ్య ఇంటరాక్షన్ తక్కువ. గెలుపు సంబరాల్లో కూడా ఎక్కడా స్త్రీ పురుషులిద్దరూ కలిసి నృత్యం చేసిన ఆనవాళ్ళు లేవు. మహిళలు వేరే గా, పురుషులు వేరే గా సంబరాలు చేసుకునే వారు.  ఒక వేళ స్త్రీ పురుసుల మధ్య ప్రేమ తలెత్తితే, వారి పెళ్ళి బయటి సమాజం లొ లానే జరిగేది. తమిళుల విలువల ప్రకారం, అబ్బాయి అమ్మాయి దళ కమాండర్ కు తన ప్రేమ విషయం చెప్పి అనుమతి కోరాలి.  అమ్మాయికి ఈ సంబంధం అంగీకారం అయితేనే పెళ్ళి జరిగేది. పెళ్ళయే దాకా వారు ఎప్పుడూ కలుసుకోనే కూడదు అనే నియమం తో.  

పైగా ప్రభాకరన్, మాలథి (మాథి) ల పెళ్ళయే దాకా, దళంలో పెళ్ళి ని, ప్రేమలనూ నిషేదించారు.  అవి దళ సభ్యులను లక్ష్యానికి దూరం చేస్తాయేమో అని భయపడ్డారు.   పెళ్ళి, పిల్లలూ, ఝంఝాటం తమకు వద్దనుకున్నారు.  కానీ ప్రభాకరన్ మాలతి ని కిడ్నాప్ చేసి తమిళ నాడు లో ఉంచి పెళ్ళి చేసుకోవడం పెద్ద కధ.  ఆయన వివాహం తరవాత దళ సభ్యుల్లో ప్రేమ పెద్ద ఆక్షేపణ కాలేదు. అయితే అది ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మాయి ఇష్టప్రకారమే జరిగేది. అమ్మాయి ఇష్టపడకపోయినా, సమయం కోరినా ఆమె మాటకు పూర్తి విలువ ని ఇచ్చేవారు. మహిళలు సాధికారంగా ఫీల్ అవడానికి ఈ నియమం ఎంతగానో పనిచేసింది. తమ పట్ల ఇంత మానవత్వంతో వ్యవహరించే దళం వారికి కుటుంబం కన్నా ఎక్కువ అయ్యేది. 

సాధారణం గా దళంలోకి రిక్రూట్మెంట్ ద్వారా గానీ వాలంటరీ గా గానీ [ఆడ, మగ] పిల్లలు, మహిళా సభ్యులు 16 లేదా అంత కన్నా చిన్న వయసులోనే చేరేవారు. ఒక లక్ష్యంతో ఆధర్శం తో చేరే వారు. వారికి పెళ్ళి పెద్ద లక్ష్యం కాదు. చాలా మంది పెళ్ళి కి ఇష్టపడలేదు కూడా. పెళ్ళి చేసుకుంటే, బయటి సమాజంలో లాగే తమ స్త్రీపాత్ర ని పోషించండానికి ఎక్కువ మంది ఇష్టపడలేదు.    

తీవ్రవాదం లోకి మహిళలని మతపరంగా ఆకర్షించడం పాలస్తీనా లో ప్రయత్నాల గురించి తెలుసుకున్నాం కదా. యాసర్ అరాఫత్ పిలుపు ను అందుకుని రంగంలోకి దూకిన మహిళలని "ఆర్మీ ఆఫ్ రోజెస్" అన్నారు.  'దారీ అబూ ఆయెషా' అనే మహిళ ఇద్రిస్ తరహాలో కాకుండా పక్కా ప్రణాళిక తో, వీడియో రికార్డింగ్ తో సహా మొదటి అధికారిక ఆత్మాహుతి దాడి కి పాల్పడ్డాకా, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ నుంచీ 2003 లో ముగ్గురూ, హమాస్ నుండీ 2004 లో ఒకరూ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.  

హమాస్ కు చెందిన మత గురువు షేక్ యాసిన్, కొరాన్ లో స్త్రీలు ఇలాంటి స్వాతంత్ర పోరాటంలో పాల్గొనకూడదని ఎక్కడా లేదనీ, వారు భేషుగ్గా పాల్గొనచ్చనీ ప్రకటించి గేట్లు బార్లా తెరిచాడు.  2004 లో 14 జూన్ న 'రీం రియాషీ'  అనే మహిళ, ఒక భార్య, తల్లి, బామ్మ,  అన్ని బాధ్యతలూ ఉన్న మహిళ హమాస్ తరఫున మొదటి ఆత్మాహుతి దాడికి పాల్పడి చరిత్ర సృష్టించింది. అంటే, బాదరబందీలు లేని, సమాజానికి భారమయ్యే విధవల్లాంటి వారే (వర్త్ లెస్) తీవ్ర వాద దాడి చేయక్కర్లేదు. అందరూ ఆహ్వానితులే అని దీనర్ధం. 


పైగా దీనికో మత విశ్వాసం కూడా తోడ్పడింది.  నలుగురిని చంపుతూ ఇలాంటి దాడిలో పొందిన వీర మరణం తరవాత దొరికిన స్వర్గంలో సర్వ సుఖాలతో పాటూ, ఒక మంచి భర్త లభించడం, తద్వారా 70 మంది బంధువులని కాపాడబడడం లాంటి బోనస్ లు కూడా ఉంటాయిట. దీని అర్ధం నాకూ తెలీదు. కానీ ఇలాంటి మత విశ్వాసం ద్వారా, మరణానంతరం, అందరికీ సాయపడగలగడం, భర్త కి సేవ వగైరాల ద్వారా మళ్ళీ బాధ్యతలని స్వీకరించడం ద్వారా స్త్రీ త్యాగధనం మరింత పెంచే ప్రయత్నం జరిగినా.. అదో నైతిక ధర్మం అన్నట్టు జరిగిన మీడియా ప్రచారం, మధ్య ప్రాచ్యంలో మహిళలు విస్తృతంగా బాంబ్ బెల్టులను ధరించేలా ఆయుధాలు చేపట్టగలిగేలా చేసింది. 

Notes :

కోరా లో ఎ.టీ.టీ.యీ మహిళా బ్రిగేడ్ ల గురించీ, మహిళా సభ్యుల పాత్ర గురించీ విస్తృత వ్యాసం. 

ఆర్మీ ఆఫ్ రోజెస్ -  Yasser Arafat మహిళలను తమ దేశంకోసం ప్రాణ త్యాగానికి సైతం సిద్ధపడమంటూ  వారిని తన 'ఆర్మీ ఆఫ్ రోజెస్' గా అభివర్ణించినప్పుడు వచ్చిన  అనుకోనంత గొప్ప రెస్పాన్స్, వఫా ఇద్రిస్ దాడి, మరణం.. చక చకా జరిగిపోయాక,  వేలాదిగా మహిళలు పాలస్తీనా పోరాటంలోకి దిగడం ఒక చారిత్రాత్మక మలుపు.


Shiek Yassin of Hamas












10/04/2019

Women in Terrorism Case of the LTTE by Tamara Herath - 2

Part - 2


సాధారణంగా పురుషాధిక్య సమాజంలో స్తీ కి వుండే వర్త్ లెస్ నెస్.. లేదా విలువ లేకపోవడం తీవ్రవాదంలో కూడా కనిపిస్తుంది. మాస్కో థియేటర్ దాడిలో కేవలం మహిళా ఉగ్రవాదుల శరీరాలకే  బాంబు బెల్టులు కట్టి ఉన్నాయి. దీని ద్వారా స్త్రీ విలువ, పురుషుని కన్నా తక్కువే ఉన్నట్టు కనిపిస్తుంది.  పైగా ఆయా తీవ్రవాద పోరాటాల్లో ఆత్మాహుతి దాడికి ఎంచుకోబడిన స్త్రీలు, సాధారణంగా విధవలూ, పిల్లలు లేని వారు, పెళ్ళి కాని వారూ.. అలా బాధ్యతలూ, బంధనాలూ లేని వారిలోంచీ వుండేవారు. రాను రాను, పిల్లలున్న తల్లులు కూడా ప్రాణ త్యాగానికి సిద్ధపడటం మొదలయింది.  

జనవరి 2002 లో యాసర్ ఆరాఫత్ దృష్టి మగ "షహీద్" ల నుంచీ మళ్ళి మహిళా "షహీదా"ల పైకి, ఆత్మాహుతి దాడుల ద్వారా వారు ఉద్యమానికి చేయబోయే సాయాన్ని అత్యంత ప్రభావవంతంగా గ్లోరిఫై చేయడాన్ పట్లా మళ్ళింది.  వాళ్ళ త్యాగనిరతి ని హైలైట్ చేస్తూ,  ఈ పనుల ద్వారా వారు సాధించిన సమానత్వాన్నీ, ప్రదర్శించిన నిస్స్వార్ధత నీ, ముఖ్యంగా 'స్త్రీ జీవితం' తాలూకూ బాధ్యత నీ, గుర్తు చేస్తూ వాళ్ళని ప్రభావితం చేసేలా మారింది పాలస్తీన్ ఉద్యమం. 

అయితే తీవ్ర వాదంలో ఎల్.టీ.టీ.ఈ సాధించిన ఘనత ఏంటంటే, స్త్రీలని తీవ్రవాదంలోకి ఆకర్షించడం ద్వారా, చాందసవాద తమిళ శ్రీలంక సమాజంలో స్త్రీ ల పాత్రని మార్చి, తీవ్రవాదంలోనూ, బయట సమాజంలో కూడా స్త్రీల దృక్పథం మారడంలోనూ, వాళ్ళని కుల వర్గ ఆర్ధిక అంతస్తుల బేధాలు లేకుండా కలిసి పని చేసేలా చేసి,  శ్రీలంక సమాజం లో మార్పు తీసుకురావడం. కొన్ని  పురుషాధిక్య భావాలున్నా, సెక్సువల్ హెరాస్మెంట్ లేని, కుటుంబ వాతావరణం కల్పించడం ద్వారా, తమిళ మహిళా పులులు పూర్తి అంకిత భావంతో పని చేసేందుకు అనుగుణమైన వాతావరణాన్ని అందించడం.

ఇక్కడ పాలస్తీనా మహిళా తీవ్రవాదం లోకి వస్తే, 2000 లో 'ఆల్ అక్సా ఇంతిఫదా' తరవాత తమ బ్రతుకులు దుర్భరం అయ్యాయని వాళ్ళ కంప్లైంట్. వాళ్ళ లక్ష్యం (soft target) ఎప్పుడూ సాధారణ ప్రజలు, పౌర సమాజం, వీరి మీద ఆత్మాహుతి దాడి సులభం, ఖరీదు 150 అమెరికన్ డాలర్ల కన్నా చవుక.  పైగా మహిళలకు ఒక గుర్తింపు కల్పించడానికి ఒక ఆయుధం.  రెఫ్యూజీ కాంప్ లలో బ్రతుకు తిప్పలు, అష్ట కష్టాలూ పడుతూ (దీనికి ఒక సొల్యూషన్ లేదు.. బహుశా జీవితాంతమూ ఆ కేంప్ లోనే బ్రతకాలి)  తమ జీవితంపై అన్ని హక్కులూ గల సోదరుల, తండ్రుల, భర్తల, కొడుకుల నిర్ణయాలపై ఆధారపడుతూ బ్రతికే బ్రతుకు కూ, తమకు కాస్తో కూస్తో సాధికారతని ఇచ్చేదీ అయిన తీవ్రవాదం వైపు వారు సులువుగానే మళ్ళారు., ఈ విలువే లేని బ్రతుకు లో  చైతన్యం కోసం కొందరు ఉగ్రవాదం కోసం వస్తే, 'హమాస్',  'ఇస్లామిక్ జిహాద్' లు వారి ని తమ తమ స్వార్ధం కోసం సపోర్ట్ చేయడం,  'ఆల్ అస్కా మార్టిర్స్' సంస్థ పూర్తి లాజిస్టిక్ సపోర్ట్ ఇవ్వడమూ చేసి పూర్తి తోడ్పాటుని అందించాయి. 

సాయుధ, ఆత్మాహుతి యుద్ధంలోకి స్త్రీలను ఆరాఫత్ అధికారికంగా ఆహ్వానించిన రోజు 27 జనవరి 2002 నే 'వఫా ఇద్రిస్' అనే మహిళ, రెడ్ క్రీసెంట్ ఉద్యోగి, డిపార్ట్మెంటల్ స్టోర్ లోకి తన హాండ్ బాగ్ లో బాంబ్ ని తీసుకు వెళ్ళి పేల్చడం ద్వారా, ఒకరి మృతికి, 100 మంది ఇజ్రాయిలీలకు గాయాలకీ కారణం అవుతుంది.  'ఆల్ అక్సా బ్రిగేడ్' ఈ దాడికి బాధ్యత వహించింది. కానీ దాడికి ముందు సాధారణంగా పాలస్తీనియన్ తీవ్రవాదులు విడుదల చేసే వీడియో మెసేజ్ ఏదీ ఇద్రిస్ ఇవ్వలేదు.  కాబట్టి, ఆమెకు దాడి గురించి తెలియనే తెలియదనీ, ఆమెను ఒక పావులా గా వాడుకున్నారనీ ఆరోపణలు వచ్చాయి.  మొన్న కాష్మీర్ లో సీ.ఆర్.పీ.ఎఫ్ పైన జరిగిన దాడిలో తీవ్రవాది విడూల చేసిన వీడియో మెసేజ్ చూసే వుంటారు. అది ఒక ప్రొఫెషనల్ హాక్.  దాడి చేయడం ఎవరైనా చేస్తారు. ప్రచారం పొందడం ముఖ్యం కదూ.  అసలు తీవ్రవాదం లక్షణమే, భయాందోళనలకు గురి చేయడం.  [తానేదో మంచిపనినే చేస్తున్ననన్న నమ్మకంతో].  

వఫా మరణాన్ని గ్లోరిఫై చేసి ఆమె శ్రద్ధాంజలి లో  వఫా బలిదానం ద్వారా, పాలస్తీనా జాతీయోద్యమం లో మహిళల పాత్రకి గౌరవాన్ని తెచ్చిపెట్టినట్టు ప్రచారం జరిగింది.  ఆమె మరణం ఒక అత్యత్భుతమైన హీరొఇజం ని కళ్ళెదుట నిలిపినట్టు, మహిళలు కూడా ఇలా ఆత్మ బలిదానాలు చేయడం ద్వారా జాతి విముక్తి త్వరలోనే కలుగుతుందనీ, నమ్మకం కలిపించే ప్రచారం జరిగింది. 

ఇక్కడ తమిళ పులుల పోరాటంలో రేప్ బాధితులు - దాడుల ద్వారా, తమ శరీరాలు పవిత్రమైనట్టు భావించడం, వారికి వివిధ మాధ్యమాల ద్వారా దొరికిన సెన్షేషనల్ గుర్తింపూ, మీడియా రిపోర్ట్ లు అలాంటి పని చేసిన మహిళల మీద వివిధ  కధనాలు ప్రచారం చేయడం ద్వారా వారికి దొరికిన పేరు, పరువూ, ఖ్యాతీ,  ఈ మార్గంలోకి లాక్కొచ్చాయి.   అయితే ఇంత త్యాగం చేస్తున్నా, ఇంత సాహసం చేస్తున్నా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ ఒక్క తీవ్రవాద సంస్థ లోనూ, ఉదాహరణకి Urugvayan Tupamaros Revolutionary Group, Salvadorian Farabundo Marti Front for National Liberation, Nicaraguan SandivistasChinese Red Army, వగైరా ఎందులోనూ మహిళలకు తగిన రాంకులలో సమనత్వం, పై స్థాయి నాయకత్వ స్థానమూ దొరకననే లేదు.  దీనిని బట్టి వాళ్ళని పూర్తిగా పని దోపిడీ కి గురి చేసారన్న సంగతి , వాడుకున్నారు అన్న విషయం తెలుస్తుంది. వీటిల్లో LTTE


నయం.


Notes : 












09/04/2019

Women in Terrorism, Case of the LTTE - Tamara Herath



Part - I 

Netflix లో బోడీ గార్డ్ అని ఒక సిరీస్ ఉంది.  ఇంగ్లీష్ డ్రామా.  సరే. దీన్లో ఒక ముస్లిం మహిళ మొట్ట మొదటి ఎపిసోడ్ లోనే, తన చాందసవాద టెర్రరిస్ట్ భర్త కారణంగా బ్రెయిన్ వాష్ చేయబడి,  వళ్ళంతా బాంబ్ లు కట్టుకుని, ట్రెయిన్ లో వొణికిపోతూ హీరో కి కనిపిస్తుంది.  ఒక్క బటన్ నొక్కగానే విధ్వంసం సృష్టించగల క్షణాన, హీరో ఆమెతో మాట్లాడి, భయాన్ని పోగొట్టి, మెల్లగా ఆమె బాంబ్ ను పేల్చకుండా ఆపగలుగుతాడు.  ఇరవయ్యీ పాతిక కూడా మించని - బహుశా టీనేజ్ అమ్మాయి లా వుండే ఈ అతి భయస్తురాలు సిరీస్ అంతా చెమట్లతో, వొణికిపోతూ, భయపడిపోయి, తికమక పడుతూ పెడుతూ, ప్రేక్షకుల జాలి ని అంతా గాలన్ల కొద్దీ తాగేస్తూ... ఉండగా చివరాఖరికి ఈమే టెర్రరిస్టు అనీ, పెద్ద ఇంజనీరనీ, బాంబులు చిటికెన వేలు తో తయారుచేయగల సమర్ధురాలనీ, వగైరా తెలుస్తుంది.  అంతవరకూ ఆమె మీద జాలి పడిన ప్రేక్షకుడు షాక్ అవుతాడు. భయపడతాడు. నివ్వెరపోతాడు. ఈ పాత్ర పోషించిన నటి  "మొదట చేయననుకున్నాను గానీ, తరవాత ఈ పాత్ర చాలా శక్తివంతంగా అనిపించి,   Empowering గా అనిపించీ చేసానని" ఒక ఇంటర్వ్యూ లో చెప్తుంది.  పాత్ర పేరు 'నాదియా'. భయంకరమైన ఉగ్రవాది. అంత సున్నితమైన, పువ్వు లాంటమ్మాయి, మనుషుల ప్రాణాలంటే లెక్క లేని పిచ్చి మనిషి అనీ, అమాయకులని నిష్కారణంగా చంపేందుకు, అదీ, అత్యంత ఘోరంగా.... వెనకాడదనీ తెలుసుకున్నాక చాలా బాధనిపిస్తుంది. సరే.. ఈ పిల్ల కి తీవ్రవాదం ఎంపవరింగ్ గా అనిపించడం (పాత్రకూ, పాత్ర ధారికీ) చాలా ఇంటరెస్టింగ్ గా అనిపించి, ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తున్నాను.

ఇరాక్ సిరియాల్లో ఐసిస్ మీద యుద్ధం ఓ కొలిక్కి వచ్చేలా అనిపిస్తూ, కలుగులోంచీ వందలాదిగా తీవ్రవాదులూ, ఇల్లూ, పొల్లూ, దేశమూ, సొంత జీవితాన్నీ విడిచిపెట్టి తీవ్రవాదులకి సాయం చేయడానికీ, పిల్లల్ని కనడానికీ వరసకట్టి వెళ్ళిన వివిధ దేశాల ఐసిస్ పెళ్ళికూతుర్లూ, ఐసిస్ విధవలూ, వారికి పుట్టిన, పుట్టి, గిట్టిన పిల్లల గురించీ కూడా విరివి గా వార్తలు వస్తున్నాయి. భవిత గురించి వాళ్ళ ఐడియాలూ, యెమనీ యజీదీ మహిళల సాక్షాలూ, వారిని తిరిగి సమాజం లోకి ఆహ్వానించడానికి జంకే దేశాలూ.. ఇవన్నీ తీవ్రవాదంలో మహిళల పాత్ర ఇలా కూడా ఉండటం,  ఇంటర్ నెట్ ద్వారా యువతులని ఆకర్షించి, సిరియా దాకా తీసుకొచ్చి, వాళ్ళని భార్యలుగా కుదిర్చడం, పెళ్ళిళ్ళు చేయడం, వారూ దీనికి సిద్ధపడీ, ఇష్టపడీ, బురఖాలు ధరించి, సామూహిక హత్యల్ని నిర్లిప్తంగా చూస్తూ, ఏదో 'మంచి పని చేసేస్తున్నట్టు నమ్మడం, వారి మానసిక స్థితీ, భవిష్యత్తూ.. తల నొప్పులన్నీ పక్కన పెడితే, అసలు తీవ్రవాదం ఎలా మహిళల్ని శక్తివంతం చేస్తుంది - సమాజికంగా, ఎమోషనల్ గా.. అనే ప్రశ్న ఎవరికైనా ఎదురవుతుంది.

కొన్ని సమాజాల్లో మరీ ఎక్కువగా, కొన్నిటిలో తక్కువగానూ మహిళలు అసహజమైన అసమానత ని ఎదుర్కొంటారు. వారికి  ఇష్టపడిన వారిని పెళ్ళాడే హక్కు లేదు. ఇష్టం లేనివాడిని వొద్దనే హక్కు లేదు.  చదువుకునే హక్కు లేదు. ఉద్యోగం చేసే హక్కూ లేదు. వారు కేవలం వస్తువులు. తండ్రీ, సోదరుడూ, భర్తా, కొడుకూ.. వీళ్ళ చేతుల మీదుగా బ్రతకాల్సిన బానిసత్వం చాలా మామూలు విషయం. మతం కూడా వీలైనంత తొక్కి పారేస్తుంటుంది. సాంప్రదాయం, ఆచారం, పద్ధతీ, ముఖ్యంగా శీలం, ప్యూరిటీ, పవిత్రత.. ఇవన్నీ మేకులై శిలువ కొట్టేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు తీవ్రవాదం నిన్నూ ఓ మనిషి గా గుర్తించి నీ బ్రతుక్కీ ఓ లక్ష్యం ఉంది.. నువ్విలా కా.. నువ్విది చెయ్యు.. నువ్వు చేయగలవూ.. ఇలా ప్రోత్సాహకరంగా ఉంటూన్నపుడు స్త్రీలు ఆకర్షితులవుతారు. పైగా దీని వెనక ఏవో ఆదర్శాలూ, మత పరమైన గుర్తింపూ దక్కేటప్పుడు. వగైరా వాదనలు, థియరీలను ఈ పుస్తకంలో చక్కగా చర్చించారు.

తమిళ పులుల గుర్నించి ఎప్పుడో పదిహేనేళ్ళ క్రితం అనితా ప్రతాప్ రాసిన"ఐలాండ్ ఆఫ్ బ్లడ్" చదివాక, ఎల్ టీ టీ ఈ గురించి ఒక పుస్తకం చదవడం ఇన్నాళ్ళకి ఇప్పుడే.   అనితా ప్రతాప్ తమిళ సింహళుల మధ్య ఈ యుద్ధం ఎందుకు జరిగిందో రాసినట్టు గుర్తు లేదు. కానీ ప్రభాకరన్ ఒక్కో సాటి తమిళ తీవ్రవాద, మిత వాద, అతివాద బృందాలనీ, లీడర్లనీ మట్టు పెట్టుకుంటూ వస్తూ, భయంకరం, భయానకమైన హత్యలు చేసి, తమిళ, సింహళ సమాజాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తూ, ఒక ప్రభంజనం లా ఎలా తెరమీదకొస్తాడో రాసారు. అయితే, అప్పటికి తమిళ ఈలం కోసం పోరాటం జరుగుతూండేది.  అనిత శ్రీలంక లో పర్యటించినపుడూ, తొట్ట తొలి గా ప్రభాకరన్ ను ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ గా నిలిచినప్పుడూ.. ఆ సమయాల్లో ఆమె ముందే ఎన్నో హత్యలు జరిగాయి. భీభత్సాన్ని కళ్ళారా చూసారావిడ.  కూడళ్ళలో, లాంప్ పోల్ ల దగ్గర కట్టేసి, తుపాకీతో కాల్చి చంపేసిన మనుషుల శవాలని చూసారావిడ.  భయాందోళనలు సృష్టించడమే ప్రభాకరన్ యూ ఎస్ పీ.. చివరికి ఈ అతి తీవ్రవాదమే, రాజీవ్ గాంధీ ని హత్య చేయడానికీ, ఆఖరికి తానూ మట్టుపడిపోవడానికీ దారి తీసింది.

Women in Terrorism Case of the LTTE ని ఒక మహిళ Tamara Herath  ఇంత సమర్ధవంతంగా రాయడం, తాను చెప్పే ప్రతీ వివరానికీ, రిఫరెన్సు, ఫుట్ నోట్సూ ఇవ్వడం.. టైం మెషీన్ మీద రైడ్ లా అనిపించాయి.  రాజీవ్ హత్య సమయంలో మేము ఫ్రంట్ లైన్, తెలుగులో కాబోలు అచ్చయ్యే ఇండియా టుడే లాంటి మేగజైన్ లని ఎంతో ఆసక్తి గా చదివే వాళ్ళం.  శ్రీలంక నుండీ పోటెత్తే తమిళ శరణార్ధులూ, వారి పై తమిళ రాజకీయాలూ అవీ చాలా ఆశ్చర్యం కలిగించేవి.  అయితే, వయసూ, అజ్ఞానం అదేదో మనకి సంబంధించిన విషయం కాదనుకోవడమూ.. అవన్నీ గుర్తొచ్చాయి.  తమిళ శరణార్ధులు, ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడి,  ప్రభాకరన్ మరణం తరవాత ఈలం మాటే లేకుండా ఇప్పుడంతా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించడం. పెరిగిన టూరిజం.  ఇదీ ఈ నాటి వాస్తవం.  కానీ ఒకప్పుడు అత్యంత అధిక సంఖ్య లో మహిళలూ, పిల్లలూ పనిచేసిన తీవ్రవాద సంస్థ ఈ ఎల్ టీ టీ ఈ.  రాజీవ్ హత్య లో చనిపోయిన, ఆత్మాహుతి దాడి చేసిన  తీవ్రవాది కూడా ఒక మహిళే. తీవ్రవాదులకు - వారు ఏ ప్రాంతానికీ, దేశానికీ, సంస్కృతికి చెందిన వారైన  ఒక కామన్ వర్క్ కోడ్ ఉండటం, తాము ప్రచారం పొంద దలచిన దాడులని, ముఖ్యంగా దళాన్ని ఉత్తేజితం చేసే ఎన్ కౌంటర్లనూ, ఆత్మాహుతి దాడులనూ వీడియో గ్రాఫ్ చేయడం - అదే వారి డిజిటల్ సిగ్నేచర్ కావడమూ,  చీకట్లో, తమిళ నాడు లో ఓ మారుమూల చిద్రమై చనిపోయిన రాజీవ్ హత్య కేసు ను సాల్వ్ చేయడానికి ఈ కేమెరాలే ఆధారం కావడమూ కాకతాళీయాలు.


మహిళ లని ఆయుధాలుగా వాడటం, వారి శరీరాలని ఆత్మాహుతి దాడుల కోసం వాడుకోవడమూ, అలా ఉద్యమం కోసం పనికిరాగలగడంలో తమ శక్తి ని ఉపయోగించడం వల్ల మహిళ శక్తివంతంగా ఫీల్ కావడం గురించి రక రకాల వాదనలు ప్రచారంలో ఉన్నాయి. వీటిలో ప్రముఖమైనది బ్లాక్ విడోస్ ఆఫ్ చెచెన్యా అనే మహిళా తీవ్రవాద సంస్థ.  రష్యా ఆక్రమణ లో అణగదొక్కబడిన చెచెన్లు విప్లవం లేవదీసినప్పుడు 1994 లోనే మహిళలు, ముఖ్యంగా ఉద్యమ ప్రభావితులైన విధవలు, తమ ఆత్మల్నీ, శరీరాల్నీ,  విప్లవం కోసం అంకితం ఇచ్చి, తిరుగులేని ఖ్యాతిని, తమ త్యాగం ద్వారా బహుశా స్వర్గం లో స్థానాన్నీ సంపాదించారు.

విధవా జీవితం లో పనికిరాకపోవటమనే నిరాశక్తికరమైన, దుర్భర, విలువ లేని జీవితాన్ని గడపడం కన్నా విప్లవం కోసం, దేశం కోసం, ఒక ఆదర్శం కోసం చనిపోవడమే మేలు అని తలిచిన చెచెన్ మహిళలు, బహుశా మొట్ట మొదటి మహిళా తీవ్రవాదులు.   1994-96 దాకా జరిగిన పోరాటంలో మహిళలు, ఆత్మాహుతి దాడుల్లో విస్తృతంగా పాల్గొనడం జరిగింది. కేవలం 2004 లోనే మహిళలు 12 ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు.  అక్టోబర్ 2002 లో మాస్కో లో అత్యంత దారుణమైన థియేటర్ ముట్టడి లో పాల్గొన్న తీవ్రవాదుల్లో కేవలం 16 ఏళ్ళ అమ్మాయి కూడా ఉండటం చాలా బాధాకరం.  చెచెన్ ఆత్మాహుతి మహిళా దళాల స్పూర్థి ని పాలస్తనైసేషన్ గా కొట్టి పడేసారు కానీ నిజానికి పాలస్తీనా మహిళలే చెచెన్ మహిళల నుండీ స్పూర్థి పొందారు.  ముస్లిం మహిళలు గా చెచెన్ సోదరీమణులు చేసే సాహసాలను, త్యాగాలనూ మమ్మల్నీ చేయనివ్వండీ అంటూ పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ కు ఉత్తరం రాసారు.

- ఇంకా వుంది.


Notes :

LTTE

Anita Pratap  :  Prabhakaran ను ఇంటర్వ్యూ చేసిన మొదటి జర్నలిస్ట్.   ఈమె పుస్తకంలో మహిళల పట్ల ప్రభాకరన్ సంస్కారవంతమైన ప్రవర్తన నీ, తమిళ పులుల విలువల గురించీ రాసారు.   ఈలం కోసం జరిగిన పోరాటంలో ప్రభాకరన్ ఎంతటి ఘోరాలకు పాల్పడినా, అతను గానీ, అతని సంస్థ లో సభ్యులు గానీ సిమ్హళ మహిళల పైన అత్యాచారాలకూ, అకృత్యాలకూ పాల్పడిన ఆధారాలు / కధనాలూ లేవు.  ఆఖరికి చివరి ఈలం పోరాటం తరవాత శ్రీలంక సైనికులు మాత్రము తమిళ మహిళలని చంపే ముందు అత్యాచారం చేసి, తీవ్రంగా అవమానించి, చిత్రవధలు చేసి చంపినట్టు, ట్రక్ లలోకి స్త్రీల నగ్న మృతదేహాలను గుట్టగా  విసిరేస్తూ.. "ఆమె ఇంకా కామంతో నిట్టూరుస్తుంది చూడు", " ఈమె కు ఇంకా కావాలంట !"  అని నవ్వుతూ  అంటూన్న శ్రీలంక సైనికుని వీడియో, చానెల్ 4 డాక్యుమెంటరీ లో చూడొచ్చు.

హమాస్ :  పాలస్తీనా కు చెందిన (తీవ్రవాద ) సంస్థ

Black Widows of Chechnya :  చెచెన్యా లో మహిళా తీవ్రవాదుల సంస్థ. షహీదా అనే పదానికి గుర్తింపు తెచ్చిన మొదటి సంస్థ

Grozny

Moscow Theater Seize 

The Hindu Article  :  ఈ పుస్తకం గురించి ఒక పరిచయం.  ఎంపవర్మెంట్ భ్రమల గురించి.