Pages

02/05/2011

ఆహారం పరబ్రహ్మం !!

పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది. పేపర్లో సెంటర్ స్ప్రెడ్ లో బంగారు ఆభరణాలూ, డిజైనర్ పట్టు వస్త్రాల ప్రకటనలు ప్రత్యక్షం అవుతున్నాయి. పెళ్ళి అనగానే మనకే కాదు ప్రపంచం అంతా ఒక జీవితకాలపు వేడుక. మొన్నే ఇంగ్లాండు లో బ్రహ్మాండమైన ఖరీదైన పెళ్ళి జరిగింది. పత్రికలూ, టెలివిజన్ ఈ సిత్రాన్ని ప్రజల కళ్ళ ముందు బాగానే తీస్కొచ్చాయి.

వీటికన్నా మన ఇండియన్ వివాహాలు ఏమైనా తక్కువా ? సాధారణ మధ్య తరగతి పెళ్ళి కూతుర్లే ముహూర్తం సమయానికి 15 - 30 వేల ఖరీదు చేసే పట్టు చీరలు కట్టుకుంటున్నారు. అబ్బాయి ల పెళ్ళీ బట్టలు కూడా ఖరీదే. మళ్ళీ జీవితంలో పెళ్ళి లో వివిధ సందర్భాలకనీ, వేడుకలకనీ తీసిన పట్టు చీరల్ని చూసేది లేదు. కట్టుకునేదీ తక్కువే. అన్ని వేలు పోసి కొన్న షేర్వాణీలనూ, పంచెల్నీ మళ్ళీ వాడే అవకాశాలు చెప్పుకోదగ్గవేవీ రావు. అయినా సరే ఆయా బట్టలకున్న సెంటిమెంటల్ వాల్యూ వల్ల పోనీ అవి ఇంకోసారి ఏ వ్రతానికో దేనికో కట్టుకోవచ్చు. అయితే ఇవన్నీ పూర్తిగా వ్యక్తిగత విషయాలు. వీటి వల్ల సమాజానికేమాత్రం నష్టం లేదు. పైగా పెళ్ళిళ్ళు మన ఎకానమీలో కీలక పాత్ర పోషిస్తాయి. పెళ్ళి కి సగటు పౌరుడు పెట్టే ఖర్చు పెరిగిన కొద్దీ ఎకానమీ కూడా బూస్ట్ అవుతూ వుంటుంది.

అయితే, పెళ్ళిళ్ళ లో ముఖ్యమైన ఘట్టం ఏమిటీ ? భోజనాలు. ఈ టపా వాటి గురించే. ఈ మధ్య మా ఆయన ఎవరో తెలిసిన వాళ్ళింట్లో పెళ్ళి కి వెళ్ళారు. అక్షరాలా 250 రకాల పదార్ధాలు వొండి వడ్డించారంట. ఇన్ని స్వీట్లూ.. అన్ని అయిస్ క్రీములూ... 30 రకాల బిర్యానీలూ .. వగైరా. అసలు పెళ్ళిళ్ళలో జరిగేంత డబ్బు వృధా ఎక్కడా జరగదు. పిల్లల పెళ్ళిళ్ళ కోసం దాచిపెట్టుకున్న డబ్బంతా ఒక్కసారిగా వొదిలిపోయే ఈవెంటు ఇది. పెళ్ళి అనగానే బోల్డంత ఖర్చు. ఆ ఒక్క రోజుకీ మర్యాదలూ, లాంచనాలూ అంటూ, బోల్డంత డబ్బు వేస్ట్ చేసేది ఈ పెళ్ళి విందు అనే ఈవెంటు మీదే ! పగలుపెళ్ళిళ్ళ సంగతి పక్కనుంచితే, రాత్రి పూట విందైతే, లైట్లూ, డెకరేషనూ కూడా అదనం. ఫలానా వాళ్ళు పెళ్ళి 'మా బాగా, ఘనంగా' చేసారని చెప్పుకోవాలని తపన.

పెళ్ళి ఎవరు ఎలా చేసినా, మధ్య తరగతి వారైనా, ధనికులైనా, కొట్టొచ్చినట్టు చేసే నేరం మాత్రం, ఆహారాన్ని వృధా చెయ్యడం. అన్నన్ని రకాల వంటకాల్ని చెయ్యడం శుద్ధ దండగ. అతిధి ఎంత ఆకలి తో వెళ్ళినా, ఒక మనిషి ఎంత తినగలడు ? అలా వందల కొద్దీ అతిధుల్ని పిలవడం, వాళ్ళు తిన్నంత తిని, కెలికి పళ్ళేల లొ వొదిలేసే ఆహారం.. ! పెళ్ళిళ్ళలో జరిగే ఈ వృధా క్షమించరానిది.

'డబ్బు వెదచల్లితే వచ్చేదే కదా ఆహారం' అనే భావన ఉంటే అది వొదిలించుకోవాలి. పెళ్ళి విందుల్లో తేడాలు రావడం సాధారణమే. ఇలా చాలా మంది ఇళ్ళలో కామన్ గా wastage జరుగుతూ ఉంటుంది. అయితే, మన చుట్టూనే ఇంత ఆహార కొరతా, బీదరికం, తాండవిస్తున్నప్పుడు గొప్పలకి పోయి, వందల్లో వంటకాలు తయారు చేసి విందు చెయ్యడం ఎంతవరకూ సమంజసం ? అతిధుల్ని సత్కారాల్లో లోపాలు జరగకూడదనే భావన మంచిదే కానీ ఆ ముసుగులో, మన్లో చాలా మంది ఈ 'వృధా' నేరం చేస్తుంటారు.


ఇలా పెళ్ళిళ్ళలోనూ, ఇతర విందుల్లోనూ మిగిలి పోయిన ఆహారాన్ని కలెక్ట్ చేసుకుని, పేదలకూ, రైల్వే స్టేషన్ దగ్గరా, ఫుట్ పాథ్ లపైనా నివశించే పేద వాళ్ళకి పంచే సేవా సంస్థలూ ఉన్నాయి అని విన్నాను. కానీ వాటి గురించి చాలా తక్కువమందికి తెలుసు.


ఎంతయినా, విందుల్లో ఆమాత్రం వేస్టేజీ వుంటుంది. అతిధులు ఏ కారణం చేతనన్నా, అనుకున్న సంఖ్య లో రాకపోవచ్చు. మరెదయినా కారణం కావచ్చు. కానీ కావాలని అతి ఎక్కువ వంటకాలు వడ్డించడం వల్ల ఎంత బఫే పద్ధతి లో వడ్డన సాగించినా, అన్ని పదార్ధాలూ, తినడం అందరి అతిధులవల్లా కాకపోవచ్చు. దీని వల్లే, ఔట్ లుక్ లో అనుకుంటా.. పెళ్ళిళ్ళలోనూ, ఇతర విందుల్లోనూ, వంటకాలు 'ఇన్నే!' (A limited no. of items) వుండాలని ఏదో చట్టం తీసుకురాబోతున్నారంట. దీని మీద ఒక నేషనల్ అడ్వైసరీ కమిటీ (NAC) కసరత్తులు చేస్తూందంట. ఆలోచన బానే వుంది. కానీ దాన్లో కూడా కావల్సినన్ని అడ్డంకులున్నాయి. ఎంత వరకూ ఈ 'పరిమితు'ల్నీ విధించాలి ? నోరూరించే రక రకాల ప్రాంతీయతల సాంప్రదాయ భారతీయ భోజనం లో వడ్డించే వంటకాలు ఎన్నో ! ముఖ్యంగా పిల్లల జీవితంలో మధుర ఘట్టం అయిన ఈ పెళ్ళిని ఎంతో బాధ్యతగా, మురిపెంగా జరిపించుకునే తల్లితండ్రుల చేతుల్ని ఎంత వరకూ కట్టేయడం ? కానీ ఎక్కడో ఒక దగ్గర ఈ అపరిమిత వంటకాల లిస్ట్ కి చెక్ పెట్టాలి. 30 రకాల బిర్యానీలూ, 40 రకాల ఐస్ క్రీములూ 20 రకాల స్వీట్లూ అంటూ లిస్టుని చేంతాడంత పెంచేయడం కొంచెం తగ్గించుకోవాలి. ఈ గందరగోళంలో మిగిలిపోయే ఆహారపు Quantity కూడా తగ్గించాలి.

చట్టం ఏమి చెయ్యగలదు ? ఎన్నో మూలపడిన, (అమలు జరపడంలో ఉన్న బోటిల్ నెక్ ల వల్ల, సామాజిక, మత పరమైన కారణాల వల్లా, వగైరా) లక్షలాది చట్టాలలాగే, సగం జనాభాకి తెలియకుండానే ఈ చట్టం కూడా మట్టి (దుమ్ము) పట్టిపోతుంది. ఆహార వ్యర్ధాన్ని గురించి ముందుగా మనలో ఉండాల్సింది, ఆహారం పట్ల గౌరవం, బాధ్యతా! అందుకే 'మితం' మహాశ్రేష్టం. మనంతట మనమే ఈ బాధ్యతని గుర్తెరిగితే, ఈ నిష్కారణ వృధాని చాలా వరకూ తగ్గించొచ్చు. ఏమంటారు ?