Pages

22/11/2013

నాకు నచ్చిన వీడియో!

ఈ మధ్య మా అమ్మాయి తో కలిసి టీవీ చూస్తున్నపుడు డిస్నీ చానెల్లో ప్రసారమైన పాట. అబ్బ ఎంత బావుందో! పాట బర్ఫీ లోనిది. పిల్లల ఫంక్షన్ల లో స్కూల్ ఫంక్షన్ల లోనూ డాన్స్ వేసేందుకు భలే బావుంది.

26/09/2013

Short Film - Connection

 నాకు చాలా నచ్చింది ఈ సినిమా. జూడ్ లా అంటే ఉన్న ఇష్టం వల్ల మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తూంది.  ఇక్కడ ఇద్దరికీ అస్సలు సంబంధం వుండదు. భాష తెలీదు.. అయినా ఎలానో కనెక్ట్ అవుతారు. అసలతను అంత పెద్ద సినీ తార అని ఇంకో పెద్దాయనకి తెలీదు. తన నిత్యజీవితం లో తన ఇమేజ్ మూలంగా తరచూ ఇబ్బందులు పడే జూడ్, తనని సహజం గా, తోటి ప్రయాణికుడి గా మాత్రమే భావించిన ఆ అపరిచితుడి తో ఎంత బాగా మూవ్ అవుతాడో చూసి చాలా ఆనందించాను.  కొత్త మూవీ. షార్టు ఫిలిం ల కరిష్మా ని పెంచిన జూడ్ లా కి :) SALAM.


15/07/2013

Thanks Maa (Hindi)

ఇది స్లో గా మొదలయ్యి.. సమాజపు కుత్సితాన్ని ఎండగడుతూ, దుర్భాగ్యుల దైనందిన జీవితం లో ఓ రెండ్రోజుల ని అత్భుతం గా అల్లి షాకు ల మీద షాకులిస్తూ – దర్శకుడు పచ్చిగా, నిస్సిగ్గుగా, నిష్పాక్షికంగా, నిష్పూచీగా చూపించే వ్యధా గాధల్ని – ముందు పెడుతుంది.     చెప్పడానికి ఇందులో  ప్రధాన పాత్రలు చిన్న పిల్లలే అయినా, కధ మాత్రం, పెద్ద వాళ్ళది.





కధ ప్రత్యేకంగా చెత్త కుండీల్లో, కుక్కలకూ, పందులకూ ఆహారంగా విడిచిపెట్టేయబడ్డ ముక్కు పచ్చలారని పసి బిడ్డల గురించి.   మన దేశం లో అత్యంత సాధారణం గా జరిగే నేరాల్లో, పసి బిడ్డల్ని చంపడం / అనాధల్లా ఆస్పత్రులలో నూ, అనాధ శరణాలయాల్లోనూ విడిచిపెట్టడం వగైరా అందరికీ తెలిసిందే.  కన్న బిడ్డల్ని రైళ్ళలోనూ,  కుక్కలకు ఆహారంగా చెత్త కుండీల్లోనూ వదిలేయగల  రాక్షసత్వం అత్యంత సాధారణం.  అయితే – ఈ తల్లి కన్న బిడ్డలో అని నిట్టూర్పులు విడవడం, అలా కనబడిన పిల్లల్లో మొగ పిల్ల వాళ్ళని పెంచుకోవడం జరిగినా, ఆడ పిల్లల్ని మళ్ళా లెక్కా డొక్కా లేకుండా  ప్రభుత్వ శాఖల వారు తీస్కెళ్తారులే అని వొదిలెయ్యడం కూడా సాధారణం.
ఇలాంటి ఏ తల్లి కన్న బిడ్డలో, బ్రతికి బట్ట అంటూ కడితే, ఎదిగిన తరవాత వాళ్ళేమవుతారు ? చాలా మంది ఏ రక్షణా లేక, అనారోగ్య కరమైన వాతావరణం లో పెరుగుతూ, ఆడపిల్లలైతే మరీ అన్యాయంగా ట్రాఫికింగ్ కి, మొగ పిల్లలు చిల్లర దొంగతనాలకూ మాదక ద్రవ్యాలకూ అలవాటుపడుతూ, బాల్యాన్నీ, అమాయకత్వాన్నీ కోల్పోయి, ఎవరో చేసిన పాపాలకు తప్పించుకోలేని జీవితాంతపు శిక్షకు గురవుతుంటారు.

అలాంటి తల్లి లేని బిడ్డ 'మునిసిపాలిటీ' కధ ఈ ‘థాంక్స్ మా' !   అయితే దర్శకుడు, కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసి వాళ్ళ కష్టాల్ని కళ్ళకు కట్టేస్తున్న కొద్దీ, ప్రేక్షకుల గుండె జారి మనసంతా బేజారవుతు ఉంటుంది.   చాలా మంది ప్రముఖ కళాకారులు,  వాణిజ్య ప్రకటనల్లో తరచూ కనిపించే నటులూ, టీవీ ఆర్టిస్టులూ,  కధనానికి మంచి పటుత్వాన్ని, నమ్మదగేలాంటి నటననీ, ఒక క్లాస్ నీ అందిస్తారు.  ఈ కాస్టింగ్ లో ఏ మాత్రం తేడా వచ్చినా కధ లో సీరియెస్ నెస్స్ చాలా మటుకూ కనుమరుగయి ఉండేది.

రన్వీర్ షౌరీ నుంచీ అలోక్ నాథ్ వరకూ – మర్యాదస్తుల ముసుగులో దుర్మార్గపు పనులు చేసే పీడోఫైల్ లూ,  వ్యభిచారుల పాత్రల్ని పోషించి, సినిమాకెంతో న్యాయం చేస్తారు.  అసలు వాళ్ళ screen time ఒక పది నిముషాలు కూడా వుండదు. కానీ ఆ ముహాలు చాలు. సమాజం భ్రష్టతని చెప్పడానికి.

కధ సంగతి కొస్తే, 'మునిసిపాలిటీ', ఒక అనాధ బాలుడు.   వాడి తల్లి వాణ్ణి ప్రభుత్వాస్పత్రిలో కని వొదిలేసి వెళిపోతుంది.  ఊహ తెలిసిన దగ్గర్నుంచీ, తల్లి ధ్యాసే వాడికి. తనని ఎందుకో వొదిలేసి వెళిపోయినా, తల్లి తనని వెతుక్కుంటూ ఏనాటికైనా వస్తుందని రోజూ ఆ ఆస్పత్రి దగ్గరకెళ్ళి కాసేపు గడిపి వస్తూంటాడు.  వాడి తోటి పిల్లలు, వాళ్ళలో ఒక ఆడ పిల్ల, అందరూ బ్రతకడానికి చిల్లర మల్లర దొంగతనాలు చేస్తుంటారు.. చిన్నపాటి గాంగు లా ఏర్పడి.    ఈ అనాధ పిల్లల పరిసరాలు,  దొంగలూ, నేరస్థులతో నిండి వుంటుంది.


 ఐతే, ఓ సారి ఏదో గొడవ జరిగి, వాళ్ళ గుంపు లో 'మునిసిపాలిటీ'  పోలీసులకి పట్టుబడతాడు.  జువనైల్  కోర్టు లో బాలల హోం లో వుంచాల్సింది గా తీర్పొస్తుంది. అక్కడికెళ్ళిన రోజే,  ఓ పీడో ఫైల్ వార్డర్ (అలోక్ నాధ్) చేతిలో పడతాడు.  ఆ నరకం నుండీ తప్పించుకునేందుకు అదే రోజు రాత్రి హోం నుండీ తప్పించుకు పారిపోతుండగా, అతను చూస్తుండగానే, మెయిన్ గేట్ లొంచీ  టాక్సీ లో ఓ స్త్రీ దిగి, ద్వారం దగ్గర ఓ రెండ్రోజుల పసిగుడ్డుని విడిచిపెట్టి వెళిపోతుంది. ఆ శిశువు దగ్గరకి ఓ వీధి కుక్క వెళ్ళి తాకుతుండగా చూసి, భయపడి, ఆ పాపడిని ఎత్తుకొచ్చేస్తాడు మునిసిపాలిటీ.

అంతే – ఈ బాబు ని ఎత్తుకుని తన అడ్డా కి పారిపోతాడు. అక్కడ మిగిల్న పిల్లల కి అప్పటికే, మునిసిపాలిటీ హోం విడిచి పారిపోయాడని పోలీసులు వాయగొడ్తారు.  అయితే ఈ  పసి బాబు భాద్యత ని స్వీకరించే వయసూ, అనుభవమూ లేని ఆ పిల్లలు మొదట మునిసిపాలిటీ ని పిల్ల వాడ్ని వొదిలించుకోమని ఒత్తిడి చేసినా, అతని ఫీలింగ్స్ ని అర్ధం చేసుకుని తమ తో పాటూ ఉండనిస్తారు. పిల్లాడికి  గేదె నుండీ పిండుకొచ్చిన పాలు (ఎత్తుకొచ్చిన) పట్టి, ప్రాణం నిలబెడతాడు మునిసిపాలిటీ.  ఐతే,అదే సమయానికి నగరం లో ఓ ప్రముఖ వ్యాపారి పిల్ల వాడ్ని ఎవరో పార్కులోంచీ ఎత్తుకెళ్ళారనీ, ఆ పిల్లాడే వీడనీ వాళ్ళ పరిధి లో వాళ్ళకి ఓ సమాచారం అందుతుంది.


మునిసిపాలిటీ నిజానికి తల్లి చే పసి ప్రాయం లో విడిచిపెట్టేయబడ్డ అనాధ. కాబట్టి వాడికి ఈ బాబు తనలా కాకూడదని  పంతం. వాడ్ని ఎలా ఐనా తల్లి దగ్గరకు చేరుస్తానని శపధం చేస్తాడు.   వీళ్ళు  అనుకున్నట్టు ఆ పిల్లవాడు వ్యాపారి తప్పిపోయిన బిడ్డ కాదు. సినిమా మలుపులు, గుండె చిక్క బెట్టలేని ఉత్కంఠా, అథెంటిసిటీ తో సాగిపోతూ పిల్లాడి అసలు తల్లి ని కలిసే దాకా నడుస్తుంది. ఐతే, ఆమె పాపం బిడ్డను ఏ పరిస్థితుల్లో వదిలేసిందీ చూస్తే నిజంగానే ప్రేక్షకుడు డీప్ షాక్ కు గురవుతాడు. సినిమా మన సమాజం లో వున్న అన్ని అవకతవకల్నీ, స్పృశిస్తుంది.  వాట్ని మనం రోజు వారీ వార్తల్లో చదువుతూనే వుంటాం, గానీ అవి మనదాకా వస్తేనో ! అనే అలోచన మనకెప్పటికీ రాదు.
అలాంటి ఆలోచన రావడాన్నే మానవత్వం అంటారు.  ఆ మానవత్వాన్ని ప్రేక్షకుడు అనుభూతించగలిగితే, ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. పాపభీతి, దైవ భీతి, కరుణ, దయ లాంటివేమీ లేని స్వార్ధ పర / ముసుగులేసుకున్న సమాజం లో మనకీ ఓ ముసుగుందేమో, ఆ ముసుగు వెనక ఓ తోడేలో, హైనా నో ఉందేమో తరచి చూసుకోవాల్సిన అవసరం ఎప్పటికీ ఉంది.  

మృగప్రాయులైన మనుషుల మధ్య, దేవత లాంటి ఓ దొంగ, వీధి బాలుడు, అనాధ అయిన ఈ 'మునిసిపాలిటీ',  జీవితం లో ఓ రెండు రోజులు ఈ సినిమా.

నాకు  అర్ధం కానివీ, లాజిక్ కి అందనివీ ఎన్నో ప్రశ్నలు, సందేహాలూ ఉన్నా కూడా, వాట్ని పెద్ద పెద్ద లోపాలు అని చెప్పి సినిమాని తీసిపారేయక్కర్లేదు.  ఆయా కారణాల వల్ల   ఈ చిత్రానికి పెద్దగా పేరు వచ్చినట్టు లేదు. అయినా మంచి ప్రయత్నం.  అందరూ,  ముఖ్యంగా పిల్లలూ చాలా బాగా నటించారు. తారాగణం, చిన్న చిన్న వాళ్ళతో కలిపి ఏడ్ ల స్టార్లూ, టీవీ స్టార్లూ, చిన్న చిన్న పాత్రల్లో సందర్భోచితంగా ఒదిగిపోయి,  కధ కి ప్రాణం పోసారు. ముఖ్యంగా ఆ పసివాడి తల్లి పాత్ర లో నటించిన నటి,  ఇలాంటి సినిమాలు మన దేశం లో కూడా వస్తాయా !  మన వాళ్ళు ఇంత బాగా చేస్తారా ?! అని అబ్బురపోయేలా నటించింది.

దర్శకుడు ఇర్ఫాన్ కమాల్.  రచయిత గా, పాటల రచయిత గా పేరు తెచ్చుకున్నాడు.  ఈ సినిమా చాలోటి ఫిలుము ఫెస్టివళ్ళలో ప్రదర్శించబడిందంట ! బయటి దేశాల వాళ్ళు చూసి తరించడానికి కావల్సినంత దౌర్భాగ్యం సినిమాలో కుక్కి వదిలారనిపించింది. కాకపోతే, దీన్లో సినిమా తప్పేమీ లేదు. మన దేశం లో కూడా పరిస్థితులు అంత ఘోరంగానూ ఉన్నాయి.  తమిళ దర్శకుల అతి ఒరిజినాలిటీ చూసి ఎంత విసుగేస్తుందో అలా అనిపించింది కొన్ని చోట్ల - కానీ ఏమీ చెయ్యలేం. సన్నివేశాలు డిమాండ్ చేసాయి కాబట్టి, సత్యం నగ్నం గా మన ముందు నిలబడుతుంది.  అదో అథెంటిసిటీ ! అదో కళ. 


మన సమాజం లో ఉన్న అనేకానేక రుగ్మతల్లో ఇదో రుగ్మత !  నైతికత గురించి ఎన్నైనా ప్రసంగాలివ్వొచ్చు. కానీ మానవత్వం ఒకరు నేర్పేది కాదు.  ఆ అనుభూతినే మర్చిపోయిన సమాజానికి ఓ చెంప పెట్టు ఈ "థాంక్స్ మా" ! 




04/06/2013

Ball of Fat - Guy de Maupaassant

 ‘బౌల్ డి సూఫ్’  ప్రెంచు పేరు. దాన్ని  ఇంగ్లీష్ లోకి అనువదిస్తే బాల్ ఆఫ్ ఫాట్ (Ball-of-Fat) –  ఈమె చిక్కగా, లావుగా, ఆకర్షణీయమైన వొంటి  రంగూ,  నిండైన అవయవ సంపద తో  దొండపండు లాంటి  పెదవులు ఎపుడూ, తడితో మెరుస్తూ ముద్దుపెట్టుకోవాలనిపించేలా వుంటాయంట.  అయితే దురదృష్టవశాత్తూ ఈ అందగత్తె, ఒక వేశ్య!     వేశ్య కు మానాభిమానాలూ, ఆలోచించే విచక్షణా, దేశభక్తీ లాంటివి ఉంటాయని చెప్పే కధే ఇది. మోపాసా  కధల్లో అత్యుత్తమ కధ గా పేరెన్నిక పొందినది.

అవి ప్రష్యా, ఫ్రాన్సు ల మధ్య యుద్ధం జరుగుతున్న కాలం.  బాల్ ఆఫ్ ఫేట్ ఉన్న రోవెన్ అనే ఫ్రెంచు గ్రామం ప్రష్యా (జెర్మనీ) ఆక్రమణ లోకి వెళ్ళిపోయింది.  తలుపులు మూసుకుని, ఎవరి ఇళ్ళలో వారు బందీలయిన ప్రజలకు వీధుల్లో జెర్మన్ సైనికుల వీరత్వ ప్రదర్శన, వాళ్ళ రణగొణ ధ్వని,  ‘ఎపుడేమవుతుందో తెలీని’ అభద్రతా భావం,  కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి.  గ్రామం శత్రు సైనికుల ఆక్రమణ లో వుంది. ఆ  మాటకొస్తే, చుట్టు పక్కల గ్రామాలన్నిట్లోనూ ఇదే పరిస్థితి.   ధనవంతులు శేర్ల కొద్దీ బంగారు, వెండి నాణాల్ని  దురాశాపరులైన శత్రు సైనికుల జోలెల్లో పోసి, స్వాతంత్ర్యాన్ని  ఘడియల లెక్కన కొనుక్కుంటున్నారు.  బీద వాళ్ళు కోళ్ళనూ, మేకల్నీ, ఆఖరికి ఆహార ధాన్యాల్ని కూడా దాచుకోవల్సిన పరిస్థితి. ఇలాంటి దీనమైన  యుద్ధపు రోజుల్లో వేశ్యల బ్రతుకు ఎంత దుర్భరం ?

బాల్- ఆఫ్-ఫాట్ వేశ్యే కావచ్చు. ఆమెకు  తానూ ఓ మొగవాడినయి ఉంటే, యుద్ధంలో చేరి జర్మన్లను చంపేసి వుందునే అనే నిస్సహాయపూర్వకమైన ఆవేశం కలుగుతూ ఉంటుంది. వేశ్యే అయినప్పటికీ, ఆమెలో దేశభక్తి కేమీ తక్కువ లేదు. జెర్మన్ సైనికుల విలాసాలు తీర్చేందుకు ఒప్పుకోదు. వాళ్ళతో ఆమెకు చచ్చే చావైంది.  వాళ్ళని ప్రతిఘటించడం వల్ల కాక, ఈ లోగా ఆవేశంతో ఒక సైనికుణ్ణి దేంతోనో మోది, చంపినంత పని చేసి, గత్యంతరం లేక, ఊరి నుండీ ఫ్రెంచు సేన్ల ఆధీనం లో ఉన్న ప్రాంతానికి పారిపోవాలని నిశ్చయించుకుంటుంది.

ఆమె లానే కొందరు పౌరులు  – ఒక బండి మాట్లాడుకుని, తెల్లవారకముందే ఊరు విడిచి పోయేందుకని సిద్ధం అవుతారు. వాళ్ళలో ఇద్దరు క్రైస్తవ సన్యాసినులు (నన్ లు), ఒక వ్యాపారస్థుడూ, అతని భార్య, ఒక విద్యా వేత్త – ఒక చిన్న సైజు జమీందారూ (కౌంటు), అతని భార్యా,  వగైరాల మినీ ఫ్రెంచు బూర్జువా సమాజం, ఈ వేశ్య తో కలిసి ఒక మంచు కురుస్తున్న చల్లని శుభోదయాన ఆరు గుర్రాలు పూనిన బండి లో ఆవల ఫ్రెంచు సేనల అదుపులో ఉన్న ప్రాంతానికీ, ఇంకా వీలైతే ఇంగ్లండ్  కీ పారిపోదామని బైల్దేరతారు.


నిజానికి  వీళ్ళు తమ పలుకుబడిని ఉప్యోగించి  ఆ ప్రాంతానికి రాజు లాంటి జెర్మన్ సైనికాధికారి దగ్గర ప్రయాణానుమతి పత్రం తీసుకుని వుంటారు. అయినా ఏదో భయం, టెన్షన్!   తెల్లారి బయల్దేరిన వీళ్ళ బండి, రాత్రంతా కురిసిన మంచు గడ్డగట్టడం వల్లా,  దూదిలా ఇంకా జల జలా రాలే మంచు, అది  కలిగించిన బురద, జారుడూ, వల్ల నెమ్మదిగా సాగి,  బ్రేక్ ఫాస్ట్ టయానికి చేరాల్సింది కాస్తా అనుకున్న గ్రామం చేరుకోవడానికి రాత్రి అవుతుంది. అంత  వరకూ,  తినడానికి గానీ, తాగడానికి గానీ ఏమీ తెచ్చుకోని ఈ బూర్జువా ప్రాణుల్ని ఈ           వేశ్యే తను దారి కాపు కని తెచ్చుకున్న ఆహార పదార్ధాలిచ్చి, వైను,  ఇచ్చి నిలబెడ్తుంది.  


బండి లో కూర్చుని, తము వొదిలి వచ్చిన గ్రామ వాసుల దేశభక్తిని పొగుడుకుంటారు.  తాము స్వయంగా యుద్ధం నుండీ పారిపోతున్నా కూడా !  ఓ వేళ  పరిస్థితులు ఇంతకన్నా దారుణమౌతాయేమో చెప్పలేం అని తమ  చర్యల్ని తామే సమర్ధించుకుంటారు.   Ball-of-Fat  తన అనుభవాల్నీ చెప్తుంది.   'నన్లు'  తాము గాయపడిన ఫ్రెంచు సైనికుల సేవ చెయడానికి వెళ్తున్నామని చెప్తారు.  ఇలా  తమ తమ కారణాలు చెప్పుకుని, తాము  గ్రామం నుంచీ కదలాల్సిన అవసరాన్ని సమర్ధించుకుంటారు. 


మొదట బండి బైల్దేరగానే,  తమ తోటి ప్రయాణీకురాలు గ్రమం లో పేరు పొందిన వేశ్య అని తెలవగానే,  ఆ భద్ర మహిళలూ, మర్యాదా పురుషోత్తములైన పురుషులూ, గుసగుసలు పోతారు. మహిళల గుస గుసలు కాస్తా అవమాన కరంగా, పెద్దగానే వినిపిస్తాయి.  అవమానం  భరిస్తూ, చిర్నవ్వుతో నిర్లక్షమైన చూపుల్ని విసిరి, బాల్ ఆఫ్ ఫేట్ తన సహజ ప్రవృత్తి తో నిలకడ గా కూర్చుంటుంది.      రోజు  కొంత గడిచీ సరికీ గొంతెండిపోయి, ఆకలికి కరకర లాడిపోతున్న  వాళ్ళకి మొహమాటంగా తన తో తెచ్చుకున్న ఆహారాన్ని  ఆఫర్ చేస్తుంది. మొదట ‘మర్యాద’, ‘సంస్కారం వగైరాలు అడ్దొచ్చినా, ఆకలి భరించలేక, అందరూ వాట్ని తీసుకుంటారు, నిర్లజ్జగా లాగిస్తారు. వాళ్ళ కడుపులు నిండేసరికీ, బాల్- ఆఫ్- ఫేట్  కూడా సంత్రుప్తి చెందుతుంది.


వాళ్ళు ఆఖరికి 'టౌటస్' అనే ఆ ఫ్రెంచు గ్రామం చేరి అక్కడ రాత్రి బస చెయ్యడానికో విడిది (హోటలు/Inn) ముందు ఆగుతారు. వాళ్ళకి బయట జెర్మను భాషలో సైనికుల బూట్ల టక టకలు స్వాగతం చెప్తాయి. నిజానికి  ఈ విడిది ని జర్మన్లు  పట్టుకుని, అక్కడ బస చేసి వుంటారు.  సరిహద్దుల్లో పారిపోతున్న పౌరుల్ని నిలువరించేదుకే ఈ ఎత్తుగడ.


వాళ్ళని ఆ 'ఇన్' లో వుండనిస్తారు. అయితే  అక్కడి దళాధికారికి ‘ఫెయిత్’ కి  'బాల్-ఆఫ్-ఫేట్' వచ్చిన సంగతి ఆకర్షిస్తుంది.   ఆమె అసలు పేరు 'ఎలిసబెత్ రౌసెట్'.  ' ఫెయిత్' హోటెలు యజమాని ద్వారా 'మిస్ ఎలిసబెత్ రౌసెట్' ని రమ్మని కబురు చేస్తాడు. ఆమె  సంకోచిస్తూనే వెళ్ళి,  భుగ భుగలాడుతూ వెనక్కి వస్తుంది.  నిజానికి  ఆమె అతన్ని తిరస్కరించి వస్తుంది. 

బండి లో వచ్చిన మిగిల్న వాళ్ళకి కధ అర్ధం అవదు. మర్నాడు వాళ్ళు తీరా అక్కడ్నించీ బైల్దేరబోయే వేళకి గుర్రాలు పూనని  బండి వాడు తనను జెర్మన్లు బండి కట్టొద్దన్నారని చెప్తాడు.  వాళ్ళు ఫెయిత్ దగ్గరకెళ్ళి, అక్కడ్నించీ బైల్దేరడానికి పెర్మిషన్ అడుగుతాడు.  అతను ఒప్పుకోడు.  పిల్లీ ఎలుకా ఆట లా అవుతుంది.

అక్కడ అలా ఓ రెండు మూడ్రోజులు ఆపబడ్డాకా, వాళ్ళకి తాము ఫెయిత్ చేతిలో బందీలమని, రౌసెట్ అతన్ని తృప్తి పరిస్తే గానీ అతను తమని వదల్డనీ స్పష్టంగా అర్ధం అవుతుంది. రోజూ  పొద్దున్న ఫెయిత్ రోసెట్ కోసం కబురు పెట్టడం, ఆమే అతన్ని తిరస్కరించడం జరుగుతూ ఉంటాయి. 

ఆమె ధోరణి మిగిల వాళ్ళని చిరాకు పుట్టిస్తుంది.  ఊరిలో బండి తోలే వాళ్ళను సైతం విడిచిపెట్టక అందరితోనూ సుఖాన్ననుభవించిన వ్యభిచారికి ఈ జెర్మన్ దళాధిపతి తో సమస్య ఏమిటో వాళ్ళకర్ధం కాదు.   విసుక్కుంటారు.  ఆమెను నయానా భయానా ఒప్పిస్తారు. ససేమిరా అన్న ఆ యువతి ని, క్లియో పాత్రా పేరు చెప్పీ, చరిత్ర లో త్యాగధనులైన  ఇతర స్త్రీమూర్తుల్ని గురించి చెప్పీ వొత్తిడి తెస్తారు.

ఆఖరికి  'నన్లు' తాము ఇన్ని రోజులు గా టోటెస్ లో నిలువరింపబడడం వల్ల అవతల యుద్ధం లో గాయపడ్డ సైనికుల్ని రక్షించలేకపోతున్నామనీ, ఇదంతా రోసెట్ తలచుకుంటే ఆపగలదనీ అంటూ తెగ బాధపడిపోతారు. ఆఖరికి  ఎలిసబెత్ రౌసెట్ దళాధికారితో రాత్రి గడపడానికి  ఒప్పుకుంటుంది.  ఆ రోజు ఇంక తౌటెస్ నుండీ బైల్దేరొచ్చని ఈ బూర్జువాలంతా ఆనందిస్తారు. పార్టీ జరుపుకుంటారు.  మర్నాడుదయం రౌసెట్, కమిలిన దేహంతో, భంగపడిన హృదయం తో, వెర్రిదాన్లా వస్తుంది. ఆమె తో ఎవరూ మాట్లాడరు. వాళ్ళ ఓదార్పేమీ లభించదు.   బాల్-ఆఫ్-ఫేట్  నివ్వెర పోతుంది. 

తీరా  'రౌసెట్' చేసిన త్యాగం గురించి ఎవరూ మాట్లాడరు. ఆమె మానాన ఆమెను వదిలేస్తారు.  బండి బైల్దేరాకా, ఎవరి భోజనం వాళ్ళు తెచ్చుకుని ఆరగిస్తారు. 'నన్లు' కూడా తాము తెచ్చుకున్న సాసేజ్ మిగిలిపోతే, కాయితం లో చుట్టుకుని దాచుకుంటారు తప్ప రౌసెట్ కి ఆఫర్ చెయ్యరు.  అసలు ఆకలి కన్నా వాళ్ళు తనని మలినమైన దానిలాగా, దూరంగా ఉంచడం, అవమానించడం కలిగించిన బాధ వల్ల రోసెట్ అనగా ఈ 'బాల్-ఆఫ్-ఫేట్'  వెర్రి గా  మూగబోతుంది. కళ్ళ  లోంచీ  నీళ్ళు కారిపోతుంటాయి.  దళాధిపతి చేతిలో పడి తన మనసుకు విరుద్ధంగా జెర్మను వాడ్ని సుఖపెట్టినందుకు తనని తాను నిందించుకుంటూ, ఈ పరిస్థితి లోకి చాకచెక్యంగా నెట్టిన ఈ నాగరికులు తనను పురుగు లా చూస్తూ, వాళ్ళలో వాళ్ళు మాత్రమే నాగరీకమైన సొగసు మాటలు మాట్లాడుకుంటూంటే, తన బ్రతుకు  మీద తనకే అసహ్యం పుట్టి దారంతా ఆ స్త్రీమూర్తి పొగిలి పొగిలి ఏడుస్తూనే వుంటుంది.  ఇదీ  కధ.

సరిగ్గా ఇలాంటి తెలుగు కధనే చదివిన జ్ఞాపకం రావచ్చు చాలా మందికి. విజయనగరం, బొబ్బిలీ ప్రాంతాల వర్ణనతో ఫ్రెంచు బుస్సీ మూక బొబ్బిల్ని దండెత్తగా అక్కడి వేశ్యామణి ఒకతె, ఇలానే బండి లో కొందరు బ్రాహ్మణులూ, కోమట్లూ.. వగైరా అగ్ర వర్ణాల వారితో కలిసి పారిపోతుండగా, సరిగ్గా ఇలానే మోసగింపబడి ఆఖరికి గుక్కెడు నీళ్ళకు కూడా నోచుకోక అవమానపడుతుంది. నిజానికి  ఆమె దయ తలచడం వల్లనే, మిగిల్న వాళ్ళకి ప్రాణాపాయం తప్పుతుంది.  లేకపోతే, యుద్ధంలో మదమెక్కిన సైనికుల మతి చలించితే, మాన ప్రాణాలు పోవడమెంతసేపు ?  ఈ  తెలుగు కధ ని గుడిపాటి వెంకటాచలం బహుశా ఈ మొపాసా కధ నుండే ప్రేరణ పొంది రాసుండాలి.  






Note : చలం రాసిన తెలుగు కధ పేరు మరచితిని.  తెలిసినట్టైతే, దయచేసి సూచించగలరు.  

    

03/06/2013

Les Miserables (1998)

లెస్ మిసెరబుల్స్ - నిజానికి ఫ్రెంచు పదం - దాన్ని సరిగ్గా 'లే మిసారబ్'  అని పలకాలి. ఈ సినిమా కి చాలా వెర్షన్లు ఉన్నాయి. ప్రముఖ రచయిత విక్టర్ హ్యూగో 1862 లో రాసిన నవల ఇది. దీన్ని ఇదే పేరుతో సినిమాగా తీసారు. కొన్ని సార్లు కొంచెం కొంచెం మార్చారు. ఇలాంటి క్లాసిక్ ని పరిచయం చెయ్యబోయే ముందు 'ఏమైనా తప్పులు ఉంటే మన్నించమని మిమ్మల్ని కోరుకొంటూ, మొదలు పెడతాను. 




ఇపుడు చెప్పబోయేది, 1998 లో తీసిన సినిమా గురించి. అసలు మూల కధ ఇది. అసమానమైన బలవంతుడు - వాన్ షువాన్, ఆకలికి తట్టుకోలేక, రొట్టె దొంగతనం చేసినందుకు గాను 19 ఏళ్ళ పాటూ, భయంకరమైన కారాగార శిక్ష అనుభవించి, పెరోల్ మీద విడుదల అవుతాడు. నిర్దాక్షిణ్యమైన జైలు జీవితం, బాల్య చాంపల్యం వల్ల తరచుగా తప్పించుకునేందుకు చేసే ప్రయత్నాల మూలంగా కూడా, అనుభవించిన శిక్షలూ, అతన్ని జంతువులా మారుస్తాయి. పెరోల్ మీద వచ్చిన నేరస్తుడికి ఎవరూ నిలువ నీడనివ్వరు. ఆకలితో, చలితో దారుణమైన పరిస్థితుల్లో ఒక క్రైస్తవ మత గురువు, అతనికి భోజనం పెట్టి, ఆశ్రయం ఇస్తాడు. 

రాత్రి ఆ ఇంట్లోనే వాన్ షువాన్ కొన్ని వెండి వస్తువులు దొంగిలించి, అడ్డొచ్చిన మత గురువుని కొట్టి పారిపోతాడు. ఆ రాత్రే దొంగని పోలీసులు పట్టుకుంటారు. అతను ఆ వస్తువులు మతగురువు ఇచ్చాడని చెప్పడం వల్ల, అతన్ని తీస్కొచ్చి మతగురువు ముందు నిలబెడతారు. మతగురువు అప్పుడు ఆ దొంగతనాన్ని వెల్లడించకుండా, వాన్ షువాన్ ను క్షమించి, ఆ వెండి ని తనే ఇచ్చినట్టు చెప్పి, మరి రెండు వెండి దీపపు సమ్మెలు ఇచ్చి పంపేస్తాడు. మతగురువు చూపిన కరుణ, అతని క్షమాగుణం, జీవితం లో మొదటిసారి అనుభూతికొచ్చిన మానవత్వం, వాన్ ను మారుస్తాయి. గతాన్ని మరీచి, కొత్త జీవితాన్ని ఆరంభిస్తూ, కొత్త వూరికి పారిపోయి మంచి వాడిగా స్వతంత్రం గా బ్రతుకుతూ, చిన వ్యాపారాన్ని కూడా ప్రారంభించి, అంతలోనే మంచిపేరు సంపాయించి, ఆ వూరికి మేయర్ అవుతాడు కూడా.

అయితే అతని కారాగార వాస శిక్షా సమయం లో, జావెర్ అనే ఓ పోలీసు తో వృత్తిపరమైన  పరిచయం - దొంగా పోలీసు బంధం ఏర్పడుతుంది. వాన్ షువాన్ పెరోల్ మీద విడిదలయి, తిరిగి అంతూ పొంతూ లేని తన శిక్ష ని అనుభవించడం మాని, ఎటో పారిపోవడం ప్రభుత్వానికి, పోలీసులకూ కిట్టదు. అందుకే వాన్ గొంతు మీద కాలం అనే కత్తి వేలాడుతూనే వుంది. అతను ఎప్పటికైనా చట్టానికి పట్టుబడే అవకాశాలున్నాయి. 

ఇలాంటి పరిస్థితుల్లో  వాన్ నెలకొల్పిన ఒక ఫాక్టరీ లో ఫోంటైన్ అనే బీద అమ్మాయి పని చేస్తూ ఉంటుంది.  ఓ రోజు వాన్ ఉండే ఊరికే జావర్ ఇన్స్పెక్టర్ గా రావడం, ఈ మేయర్ గా ఉన్న వాన్ ని కలుసుకోవడం జరుగుతుంది. మేయర్ వాన్ చూస్తూనే జావర్ ని గుర్తుపడతాడు. ఇన్స్పెక్టర్ కూడా ఈ పెద్దమనిషి ని ఎక్కడో చూసినట్టుందే అనుకుంటాడు. ఈ టెన్షన్ లో ఉండడం వల్ల ఓ రోజు ఫోంటైన్ కి గ్రామం లో ఒక కూతురుందని, ఇలాంటి శీలం లేని పెళ్ళి కాని పిల్ల తమ ఫాక్టరీ లో పనిచెయ్యడం  మంచిది కాదనీ, వర్కర్లు కంప్లైంటు చెయ్యడం తొందరపడి ఫోంటైన్  ని ని పని లోంచీ తొలగిస్తాడు.

ఒంటరి తల్లి ఫోంటైన్, తన ఏకైక కుమార్త కోసెట్ గురించి ఎలా గో ఒక లా సంపాదించవలసిందే. ఈ పని పోవడం వల్ల దాదాపు రోడ్డు మీదికొచ్చిన ఆమె బ్రతుకు,  ఆమే ను వ్యభిచారి గా మారుస్తాయి. అందేమైన తన పళ్ళనూ, జుట్టు నూ కూడా అమ్ముకుంటుంది. చలి లో, అనారోగ్యం తో సతమతమవుతూ, విటుల కోసం బజార్లో నిలబడ్డ ఆమెను ఓ  జులాయి అవమానిస్తాడు.  చిన ఘర్షణ జరుగుతుంది. అయితే ఈ బక్కచిక్కిన ఆడది, ఆ మృగం తో పోరాడలేకపోయినా సరే, ఆ అహంకారి, అక్కడే డ్యూటీ లో వున్న జావెర్ కు కంప్లైంట్ చెయ్యడం, జావెర్ ఆమె ను అర్రెస్ట్ చేసి తీసుకుపోవడం జరుగుతాయి. ఈ లోగా అతని మేలు కోరే ఒక వర్కర్ వాన్ షువాన్ కు ఫోంటైన్ దీనత ని చెప్పడంతో చలించిపోయిన  వాన్ షువాన్ ఉన్నపళంగా ఇన్స్పెక్టర్ వద్దకు పోయి, మేయ్హర్ గా  తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి ఆమెను విడుదల చేయిస్తాడు 

 ఫోంటైన్ కూతురు కోసెట్ ఒక ఫ్రెంచు గ్రామం లో ఒక స్వార్ధపరులైన దంపతుల సంరక్షణ లో వుంటుంది.  వాళ్ళు కోసెట్ ని బాగా చూసుకుంటున్నామని తల్లిని నమ్మిస్తూ, డబ్బు కావాలనీ అదనీ ఇదనీ, ఫోంటైన్ కు ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తుంటారు.  నిజానికి వాళ్ళు కోసెట్ ను బానిస లాగా వాడుకుంటూ, తిండి కూడా పెట్టకుండా ఆ చిన పిల్లను నానా కష్టాలకు గురి చేస్తూ ఉంటారు. వాళ్ళకో పూటకూళ్ళిల్లు వుంటుంది. అక్కడ కోసెట్టే పనిమనిషి.  అయితే ఈ విషయాలు తెలీని ఫోంటైన్, సంపాయించి పంపేది. 

 తన మూలంగానే నిర్భాగ్యురాలైన ఫోంటైన్ సంరక్షణ బాధ్యత ను   స్వీకరిస్తాడు వాన్ షువాన్.  అయితే, అనారోగ్యురాలైన ఫోంటైన్, చావు ముంచుకొస్తోందని గ్రహించి, కోసెట్ గురించి బాధపడుతూ ఉంటుంది.  ఈ లోగా జావెర్ 'మేయర్ వాన్' వద్దకు వచ్చి, అసలయిన 'వాన్ షువాన్' దొరికాడనీ, తమర్ని అనుమానించినందుకు మన్నించవలసిందనీ కోరుతాడు.  అయితే, తన స్థానంలో ఎవరో అమాయకుడు జైలు పాలయి, దారుణమైన జీవితం గడపడం ఇష్టం లేని వాన్ షువాన్ ,తిన్నగా కోర్టు కి వెళ్ళి, తన అసలు అస్థిత్వాన్ని వెల్లడిస్తాడు. 


చకితులైన కోర్టు వారినీ, పోలీసులనీ, తనే వాన్ షువాన్ అనీ, ఈ విషయాన్ని చట్టపరంగా ప్రూవ్ చేసి, తనని అరెస్టు చెయ్యొచ్చనీ చెప్పి, అమాయకుణ్ణి విడుదల చేయించి, ఇంటికొస్తాడు.  ఈ సంఘటన తో కుపితుడైన ఇన్స్పెక్టర్ జావెర్,  ఆఘమేఘాల మీద మేయర్ ఇంటికొచ్చి, అతన్నీ, అతను విడుదల చేసిన ఫోంటైన్ నీ అరెస్టు చెయడానికి వస్తాడు. ఆ షాక్ లో ఆ నిర్భాగ్యురాలు ప్రాణాలు విడుస్తుంది. ఆమెకు కోసెట్ ను సొంత తండ్రి లా చూసుకుంటానని వాగ్దానం చేస్తాడు వాన్. అప్పటికి కొన్ని రోజులు గ ఆమె తో గడపడం వల్ల  వాన్ కు ఫోంటైన్ అంటే ప్రేమ కలుగుతుంది.

ఆ తరవాత తన్ను పట్టుకోవడానికొచ్చిన పోలీసుల్ని తప్పించుకుని, కోసెట్ ఉన్న గ్రామానికి వెళ్ళి, అక్కడ్నించీ ఆమెను రక్షించి, పారిస్ తీస్కొచ్చి, తనని ఒక కాన్వెంటు లో సాకి, ఆ తరవాత మెల్లగా వేరే జీవితం ప్రారంభిస్తాడు. ఈ కోసెట్ పెరిగి పెద్దవడం, ఆమె ప్రేమ,  ఫ్రాన్సు లో విప్లవం (ఫ్రెంచు విప్లవం కాదు)  జావెర్ కూ, వాన్ కూ మధ్య ఘర్షణా.. ఇవన్నీ చాలా పెద్ద కధ. 

To be continued...

Note : I invite 'corrections' if any,  from the kind hearted readers, because my memory is poor.

28/05/2013

The Impossible

2004 - డిసెంబర్ 26. ఆరోజు నేను డిల్లీ లో వున్నాను.   కాలింగ్ కార్డు ల రోజులవి. హాస్టల్లో కిందకొచ్చి, క్యూ ప్రకారం, లాండ్ లైన్ దొరికాక, ఓ తొమ్మిది గంటలకి, ఇంటికి ఫోన్ చేసాను. అపుడు నాన్న గారు, 'పొద్దున్న కాఫీ కోసం లేచినపుడు  లైట్ గా భూకంపం వచ్చింది తెలుసా?' అన్నారు.  'అవునా' ! అన్నా.

వైజాగ్ లో బీచీ లో నీళ్ళన్నీ వెనక్కి వెళిపోయాయి. జనం వింతగా బీచ్ రోడ్ కి వెళ్ళి, ఖాళీ అయిపోయిన బీచ్ ని చూసారు కూడా. అపుడే టీవీ లు, సునామీ వికృత రూపాన్ని, చెన్నై బీచ్ లో నీళ్ళలో ఊగుతున్న కార్ల నూ చూపిస్తున్నారు. తరవాత పోలీసులు వచ్చి వైజాగ్ బీచ్ ని ఖాళీ చేయించారంట కూడా. అసలు ఆ మాట కొస్తే, బంగాళా ఖాతం తీర ప్రాంతాన్నంతా భారత ప్రభుత్వం ఖాళీ చేయించింది.


అండమాన్ దీవుల్లో అప్పుడు చాలా మంది వైమానిక దళాధికారులూ, నావికా దళం వాళ్ళూ, వాళ్ళ కుటుంబ సభ్యులూ అలల్లో కొట్టుకుపోయారు. దొరికిన వాళ్ళు దొరికారు, బ్రతికిన వాడు దురదృష్ట వంతుడు.   కృష్ణా జిల్లా లో అనుకుంటాను తీర ప్రాంతం లో ఉన్న ఓ పల్లె లో ఉంటూన్న మా ఎయిర్ మాన్ ఒకాయన తాతయ్యా, నానమ్మలు ఇంట్లో పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే, అలల్లో కొట్టుకుపోయి చనిపోయారు.

సహాయం కోసం, బలగాలూ, ఆహారం వగైరాలతో డిల్లీ నుండీ అండమాన్ కు బైల్దేరిన, అప్పుడే కొన్న ఇల్ల్యూషన్      (IL-76)  విమానం (అతి పెద్ద multi-purpose విమానం) లో ఆయనా, అప్పటికపుడు చెన్నై వచ్చి వాలాడు.       ఎల్ టీ టీ యీ, శ్రీలంక ఉత్తరాన ఏర్పరచుకున్న సీ బేస్ ఆ దెబ్బకి విమానాల తో సహా తుడిచిపెట్టుకుపోవడం తో strategically దాని అంతం ఆరంభమైంది. 





ఇవన్నీ టీవీ లో నీ పేపర్లలోనీ చదివిన గుర్తులు ఈ మధ్యే ఈ సినిమా చూసి గుర్తొచ్చాయి.  అండమాన్ లో అమితవ్ ఘోష్ పర్యటన గుర్తొచ్చింది. ఆనాటికి మన లాంటి 'సునామీ' అన్న పదమే ఎరుగని జనానికి ప్రకృతి విలయ తాండవం నివ్వెరపరచింది.  ఆ రోజున  థాయిలాండ్ లో ఖావోలాక్ అనే పేరుపొందిన ప్రదేశంలో సముద్రతీర రిసార్ట్ లో క్రిస్మస్ సెలవులు గడపడానికి వస్తారు.  ఓ టూరిస్టు కుటుంబం. మారియా డాక్టర్, ఆమె  భర్త, ముగ్గురు మొగ పిల్లలు లూకాస్, థామస్, సైమన్లు.  క్రిస్మస్ నాడు తండ్రి వాళ్ళలో చిన్న పిల్లాడికి ఓ ఎర్ర రంగు బాలు ఇస్తాడు ఫాదర్ క్రిస్మస్ పేరు చెప్పి.  చాలా ప్రశాంతం గా హాయిగా స్విమ్మింగ్ పూల్ లో గడుపుతూన్న ఈ కుటుంబం వైపు భీకర మైన మృత్యు అలలు కొట్టుకొస్తాయి. అందరూ చెల్లా చెదురు అవుతారు.  తల్లి పెద్దబ్బాయి Lucas ని కాపాడగలుగుతుంది. మిగిల్న ముగ్గురి సంగతీ తెలీదు.


ఏదో కొద్ది రోజుల పర్యటనకొచ్చిన వేలాది మంది టూరిస్టులు విషాదం లో మునిగిపోతారు. వాళ్లలో చనిపోయినవారు, తప్పిపోయినవారు - భాష రాక, ఊరు తెలీక, దొరుకుతారేమో అంటూ ఊర్లో పడి, పిచ్చిగా తిరుగుతున్న వేలాది మంది విదేశీయులు.   చాలామంది స్థానికులు తమ వాళ్ళనూ, ఇళ్ళనూ, ఆస్థుల్నీ, పంటల్నీ, జీవనోపాధుల్నీ, అన్నిట్నీ కోల్పోయినా, మానవత్వం తో ఈ విదేశీయుల్ని దొరికిన వాళ్ళని దొరికినట్టుగా, తీస్కెళ్ళి స్థానిక హాస్పిటళ్ళలో చేరుస్తుంటారు. 


రోడ్ల మీద విరిగి పడిన చెట్లూ, పొగిలిన వరి, జొన్న చేళ్ళలో ఇరుక్కున్న శవాలూ, వాట్ని రోడ్డు వార పెట్టి ఏడుస్తున్న వాళ్ళ వాళ్ళూ, హృదయ విదారకం గా వుంటుంది పరిస్థితి.  ఈ తల్లీ కొడుకులు కూడా సునామీ వెనక్కి మళ్ళుతుండగా ఎక్కడికో కొట్టుకుపోయి, ఎలాగో ఒక చెట్టు పైకెక్కి ప్రాణాలు నిలుపుకుంటారు. ఇంతలోగా వాళ్ళకో మూడేళ్ళ బాబు కూడా దొరుకుతాడు, వాడికి మాటలు కూడా సరిగ్గా రావు. వాడిపేరు డేనియెల్ అని మాత్రం చెప్పగలుగుతాడు.  ఆ బాబు ని రక్షించి, వీళ్ళు ముగ్గురూ ఎలాగో ఆ చెట్టు మీద ఆ రాత్రి అంతా గడుపుతారు. 


తెల్లారాకా, ఎప్పుడో ఎవరో ఒక వృద్ధుడు, ఎవరినా బ్రతికి ఉన్నారేమో అని వెతుక్కుంటూ వచ్చి, వీళ్ళని రక్షిస్తాడు.  అప్పటికే తల్లి కాలు ఎముక విరిగి వుంటుంది. ఈ ముసలాయన ఎలాగో ఈమెను ఆ నీళ్ళలోంచీ, బురద లోంచీ,  దారిలో ముళ్ల కంపలలోంచీ, రక రకాల శకలాల్లోంచీ ప్రాణాలతో ఎలానో లాక్కొస్తాడు.  తాను స్వయంగా డాక్టర్ కావడంతో ఆమె, తన కాలు, తీవ్ర గాయాల తో సెప్టిక్ కాబోతున్నదని గ్రహిస్తుంది.  గ్రామం లో కి వచ్చాక, ఒక రవాణా ఆటో లో చెక్క మీద పడుకోబెట్టి, పెద్ద ఆస్పత్రికి తరలిస్తారు. ఈ హడావిడి లో గ్రామం చేరే వరకూ వాళ్ళతో కూడా వున్న డేనియల్ కనిపించకుండాపోతాడు.

మారియా నిస్సహాయ స్థితిలో, భర్తా, మిగిల్న ఇద్దరు చిన్న పిల్లల్నీ తలచుకుని భయపడుతూ, ఆస్పత్రి లో ఇంకా టీనేజ్ కి కూడా రాని లూకాస్, డేనియల్ కనిపించడం లేదని చెప్పినపుడు చాలా బాధపడుతుంది. ఆ ప్రజా ప్రవాహంలో ఎవరు ఎక్కడ తప్పిపోయినా వెతకడం చాలా కష్టం.  తన ని వెన్నండి రోజు అంతా కూర్చుండిపోయిన లూకాస్ ని హాస్పిటల్ లో మిగిల్న వాళ్ళకి ఏదో ఒక సాయం చెయమని చెప్పి పంపిస్తుంది.

లూకాస్ కాస్త బయటికి వచ్చి చూసేసరికి, అతనికి, తమ వాళ్ళని వెతుక్కుంటూ పిచ్చి పట్తినట్తు తిరుగుతున్న వందలాది మంది కనిపిస్తారు. అతను ఓ కాగితం, పెన్ను పట్టుకుని, వీలైనన్ని పేర్లు రాసుకుని, ఆ అయిదంతస్తుల ఆస్పత్రి లో పరుగులు పెడుతూ, అన్ని బెడ్ల దగ్గరకూ వెళ్ళి పేర్లు అడుగుతూ, ఒక తండ్రీ కొడుకుల్ని కలిపిన దృశ్యం అత్భుతం గా వుంటుంది. ఇదే హాస్పిటల్లో లూకస్ కి డేనియల్ కూడా తన తండ్రి తో కనిపిస్తాడు. మూడేళ్ళ పిల్లాడు, ఒక పెద్ద అతనితో చాలా స్వేచ్చగా ఆడుకుంటూండడం, అతను డేనియల్ ని ప్రేమగా గాల్లోకి ఎగరవేస్తూ ముద్దాడడం చూసి, అతనే డేనియల్ తండ్రి అయి ఉంటాడని గ్రహిస్తాడు. డేనియల్ కుటుంబం తో సేఫ్ గా ఉండడం చూసి ఆనందం తో అతని కళ్ళు చిప్పిల్లుతాయి.   అప్పటికి తండ్రినీ, తమ్ముళ్ళనూ మిస్స్ అవుతున్న లూకస్ ఆనందం తోనూ, విషాదం తోనూ ఉక్కిరిబిక్కిరవుతాడు.


ఈ లోగా అదృష్ట వశాత్తూ మారియా భర్తా, పిల్లలూ బ్రతికే వుండి, వీళ్ళని వెతుకుతూ వుంటారు. అంత చిన్నపిల్లల్ని వెంటపట్టుకుని తిప్పలేక, ఎవరికో అప్పగించి వెళ్తాడు భర్త.  అతను, మరి కొందరు, ట్రక్ లలో గుంపులుగా ఆ ప్రాంతం  లో ఉన్న ఆస్పత్రులన్నీ వెతుకుతూ వుంటారు.  చాలా చాలా గ్రిప్ తో రాసుకున్న సంఘటనల పూస గుచ్చితే,  దాదాపు అందరూ అనాధలు కావల్సింది,  లూకాస్ అదృష్టం కొద్దీ తండ్రి కాలునిమాత్రం చూసి గుర్తుపట్టి, తండ్రి వెనుక పరిగెట్టి, చేరలేక, ఈ లోగా తమ్ముళ్ళని కలిసి, దైవ ప్రేరణ లా, అసలు అందరూ కలవడం ఇంక అసాధ్యం అనుకునే వేళ కి  తండ్రి కూడా కొడుకుల్ని చేరడం జరుగుతాయి.  ఇంతలో అరకొర సదుపాయాల్తో ఉన్న ఆ హాస్పటల్లో, రెండోసారి సర్జరీ లోకివెళ్ళిన తల్లి తో సహా అందరూ చాలా అదృష్టవశాత్తూ కలుస్తారు.


మారియా భర్త, సర్వం కోల్పోయిన తోటి టూరిస్ట్ సహాయంతో ఇంటికి ఫోన్ చేసి మాట్లాడగలుగుతాడు. ఆ ఫోన్ కాల్ సీన్ చాలా బావుంటుంది. నిజానికి అతనికి సహాయం చేసిన వాళ్ళు, అతని కంటే దీనమైన స్థితి లో ఉన్న వాళ్ళే.  బానే ఉన్నవాళ్ళు' ఫోన్ మాక్కావాలి, బాటరీ అయిపోతుంది'  అని ఫోన్ ఇవ్వడానికి నిరాకరిస్తారు కూడా.  మొత్తానికి అన్నీ కలిసొచ్చి, వీళ్ళ కుటుంబం, బ్రతుకుతుంది -  బ్రతికాక, కలుస్తుంది.


తరవాత చార్టర్డ్ ఫ్లైట్ లో మారియా ని సింగపూర్ చికిత్స కోసం తీసుకు వస్తారు. అపుడు పూర్తి స్పృహ లో వున్న తల్లికి లూకాస్ డేనియల్ కనిపించిన విషయం చెప్తాడు. మారియా చాలా ఆనందిస్తుంది. అయితే, టేక్ ఆఫ్ జరుగుతున్నపుడు, కిటికీ లోంచీ సునామీ భీభత్సాన్ని చూసి మాత్రం దుఃఖం ఆపుకోలేకపోతుంది. 
ఈ సినిమా కి ఒక నిజ జీవిత గాధ స్పూర్థి.


మారియా గా నియోమీ వాట్స్, 10-12 ఏళ్ళుంటాయేమో అనిపించే లూకాస్ గా టోం హాలండ్ అనే అబ్బాయీ, చాలా బాగా నటించారు. అసలు సినిమా అంతా నిజంగా సునామీ మన కళ్ళెదుటే వచ్చినట్టు అత్భుతంగా తీసారు. సునామీ కొద్ది సేపట్లో  వచ్చి వెళ్ళిపోతుందేమో గానీ, అది మిగిల్చిన భీభత్సం, ఎకరాల కొద్దీ మృత్యువు, కూలిన తాటి చెట్లూ, రక రకాల చెట్లూ, కొట్టుకుపోయిన శవాలూ, ఎక్కడో కొట్టుకెళ్ళి, ఇంకెక్కడో తేలిన శవాల గుట్టలూ - ఇలా వీట్ని సినిమా కోసం పునర్నిర్మించడం ఎంత గ్రాఫిక్స్ వాడినా కూడా అత్యత్భుతమైన ప్రతిభతో చేయడం బావుంతుంది. 

హాలీ డే కి వెళ్ళిన టూరిస్టులు, దిక్కు లేని అనాధల్లా, రోడ్ల మీద, టెంట్ల లోనూ, హాస్పత్రి వరండాల్లోనూ, బొక్కి మంచాల్లో, ఈగల గోల లో, అపరిశుభ్రత లో వందలాదిగా నేల మీద పడుకొనో, షాక్ లో ఎటో చూస్తూనో, కనిపిస్తూంటారు.  ఇలాంటి ఒక హాస్పత్రి టెంట్ లో తన కొడుక్కిచ్చిన ఎర్ర బాల్ తో పిల్లలు ఆడుకుంటూండగా చూసి, తృటిలో బైల్దేరుతున్న ట్రక్ మీద నుండీ దిగి లూకాస్ ని చేరుతాడు తండ్రి. ప్రతి సన్నివేశమూ అవసరంగా, ప్రతీ డీటైలూ నిష్పాక్షికంగా సునామీ నాటి థాయిలాండ్ ని మన కళ్ళముందుంచుతాయి. దీన్ని ఇంత అత్భుతంగా తీసినందుకైనా, ఒంటి చేత్తో సినిమాను తన భుజాలపై నడిపించిన నియోమీ వాట్స్ కోసమైనా చూడాలి.

వాట్స్ కు ఈ సినిమా లో అత్భుత నటన కు గానూ ఆస్కార్ నామినేషన్ లభించింది. సినిమా నిజ జీవిత కధ ని ఆధారం గా చేసుకుని తీసినది కాబట్టి, నిజమైన సునామీ బాధితులు, ఆనాటి పరిసరాల్ని సినిమాలో పునర్నిర్మించడం చూసి, దాని ఆక్యురసీ కి నివ్వెరపోయార్ట.  దాదాపు ఇలాంటి భయంకరమైన సర్వైవల్ కధ నే తెలుగులో మంచు లక్ష్మీ ప్రసన్న 'గుండెల్లో గోదారి' గా తీసారు.  దాని గురించి ఇంకోసారి. 

చావుకు దగ్గరగా వెళ్ళడం అనుభవమైన వాళ్ళకి, ఆ క్షణం లో జీవితపు విలువ తెలిసొస్తుందంట.  జీవిత కాంక్ష గెలిచి, చావును ఎదిరించగలిగిన మనిషి కొద్దో గొప్పో మారతాడంట. బ్రతుకు అర్ధవంతంగా అనిపిస్తుందంట.  ఆ క్షణాన జీవితం మారినట్టు ఉంటుంది. దేవుడు మనకిచ్చిన అవకాశం కదూ ఇది అనిపిస్తుందిట. అలాంటి జీవితానుభవాన్ని చవి చూసిన 'మారియా బెలోన్' అనే మహిళ కధ ఇది.  అదేదొ మనకే జరిగినంతగా ఇన్వాల్వ్ చేసి, ప్రేక్షకులకి కూడా ఇదే అనుభూతిని మిగల్చడం ఈ సినిమా గొప్పతనం.





 

25/04/2013

ప్రయాణించే పుస్తకాలు Book Crossing




పుస్తకాలు - ఒక వ్యామోహం కొందరికి. వ్యసనం మరి కొందరికి. కొందరికి  హస్త భూషణం. ఎవరింటికైనా వెళ్ళినపుడు వాళ్ళింట్లో పుస్తకాల షెల్ఫుల్ని బట్టి ఒక మంచి/చెడ్డ అభిప్రాయం ఏర్పరుచుకోవడం కూడా పరిపాటి. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పుస్తకాల గురించి చర్చలూ, విమర్శలూ, మెచ్చుకోలులూ, ప్రస్తావనలూ, నిరాశలూ, ప్రొమోషన్లూ, కొనుగోళ్ళూ - ఇవన్నీ మనకిపుడిపుడే అందుబాట్లోకి వస్తున్నాయి.  ఏకంగా ప్రచురణకర్తలే వేదికల్ని ఏర్పరిచి పుస్తక ప్రియుల్ని ఒక చోట చేర్చి రక రకాల సాహిత్యాన్ని ప్రజలకి పరిచయం చేస్తున్నారు.  ఘనమైన లిటరేచర్ ఫెస్టివళ్ళు - ప్రచార పటాటోపం తోనూ, పుస్తక ప్రియుల పండగల్లా, అభిమాన విజయం గానూ నిర్వహిస్తున్నాం.


ఇవన్నీ - 'పుస్తకం' అనే ఓ 'వింత వస్తువ' మాయ లో జరుగుతూంటాయి. లోకమంతా ఒక 'మాయ' ఐతే, పుస్తకం ఒక 'విష్ణుమాయ'! చాలా మంది పుస్తక ప్రియులకి పుస్తకాలు వేన వెర్రిగా కొనడం అలవాటు. కొందరు కేవలం 'అలంకరణ కే ' కొంటారు.  కొందరు పుస్తకాల్ని బహుమతులు గా ఇస్తూంటారు.  కొందరు కొన్ని "అత్భుత పుస్తకాల్ని" ఎంతో అపురూపంగా దాచుకుంటారు. కొందరు పుస్తకాల కి పెట్టినంత ఖర్చు ఇంకే వస్తువకీ పెట్టరు. కొందరు పుస్తకాలు అరువివ్వరు. కొందరు (99.9% మంది) అరువు తీసుకున్న వాళ్ళు వాపసు ఇవ్వరు.   పుస్తకం 'పోయిందీ - అనగా వాపసు రాలేదు, రాదు!' అని రియలైస్ అయిన్నాడు అన్నం సహించకపోవడం చాలా మందికి అనుభవం.  కొన్ని అపురూపమైన సెంటిమెంట్లు అతుక్కున్న పుస్తకాలుంటాయి. రచయిత స్వయంగా సంతకం చేసిచ్చినవి, ఫలానా పాండీ బజారులో మండుటెండలో రోడ్డు పక్కన కొన్నవి, ఎవర్నో బ్రతిమలాడి ఎక్కడ్నించో తెప్పించుకున్నవి - ఇలా. ఎవరి లైబ్రరీ వారికి అపురూపమైన గని. పుస్తకం మహా మాయ. ఆ మాయ లోంచీ బైటపడ్డం కష్టం.

ఫలానా 'పుస్తకం మా దగ్గరుంది, ఫలానా 'పుస్తకం' చదివానూ అని చెప్పుకోవడం కొందరికిస్టం.  ఏదో ఒక పుస్తకం చదివి ట్రాన్సు లోకి వెళిపోయి, అదేదో లోకాన్ని సొంతంగా సృష్టించేసుకుని, తీవ్రంగా అభిమానించే జనం కొందరు.  వీటన్నిటిలో, పుస్తకాన్ని పక్క వాడికి పంచడం అనే పెద్ద హృదయం చాలా తక్కువ మందికి వుంటుంది.

ప్రతి  పుస్తకానికీ ఒక చరిత్రుంటుంది. సాధారణం గా మన దగ్గర ఏదైనా పుస్తకం తాలూకూ కాపీ అదనంగా ఉన్నపుడు ఏ స్నేహితులకో గిఫ్ట్ గా ఇస్తాం. కొన్ని చదివినా నచ్చని పుస్తకాలూ ఉంటాయి. కొన్ని చదివి, ఇంకోరితో చదివించేంత మంచి పుస్తకాలూ వుంటాయి. కొందరు పుస్తక ప్రియులకు, ముఖ్యంగా వృద్ధాప్యం లో వున్న వాళ్ళ దగ్గర కుప్పలు గా పేరుకుపోయిన అమూల్య సంపదని పరిరక్షించే స్పూర్థి ఉన్న వారసులు ఉండకపోవచ్చు. పుస్తకం తాలూకూ ధన్యత అది నలుగురు చదివితేనే కదా చిక్కేది.  పుస్తకం షెల్ఫుల్లో పడి ధూళి పేరుకునే బదులూ, దాన్ని నమ్మకంగా చూసుకునే ఏ లైబ్రరీ కో ఇద్దామని చాలా మందికి వుంటుంది.

కొందరు పుస్తకాల్ని ఇష్టం వొచ్చినట్టు పేర్చి, నాశనం చేస్తారు. లైబ్రరీ సైన్సు చదువుకున్న వాళ్ళనడగండి. పుస్తకాన్ని ఎంత భద్రంగా చూసుకోవాలో.  నాకు తెలిసి ఒక పెద్దాయన, అపురూపమైన తెలుగు వాగ్మయాన్ని ట్రంకు పెట్టెల్లో సంవత్సరాలు గా పెట్టి ఆఖరికి చెదల పాలు చేసారు.  ఆయన పోయాకా, పెట్టె తెరిచి చూస్తే, పిండే మిగిలింది.  ఆయన కి ఆ పుస్తక సంపద అంటే తెగ మోహం. ఎవరికీ ఇచ్చేవారు కాదు. అపుడపుడూ రిఫర్ చేసే వారేమో గానీ, ఎందుకనో అవన్నీ పాడైపోయాయి.

కొందరికి ఇంట్లో ఎటు చూసినా పేరుకు పోయిన పుస్తకాల్ని చూస్తే విసుగ్గా వుంటుంది. ఎప్పుడో ఫ్రస్ట్రేషన్ లో అన్నీ తూకానికి వేసినా వెయ్యొచ్చు.  కొందరికి కొన్ని కాలక్షేపం నవలల్ని వొదిలించుకోవాలనుంటుంది. ఇవీ చాలా మటుకూ, తూకానికో, విదేశాల్లోనైతే, రీ సైక్లింగ్ కో పడేస్తారు.

వీటన్నిటికీ పరిష్కారంగా ఒక సోషల్ నెట్ వర్కింగ్ బుక్ క్లబ్ ని ఎవరో పుస్తకప్రియులే కనిపెట్టారు.  దీని పేరు 'బుక్ క్రాసింగ్'. ఈ క్లబ్ లో చేరిన పుస్తకాలు ప్రపంచం అంతా ప్రయాణిస్తాయి.  దీన్లో చేరిన సభ్యులు తమ పుస్తకాల్ని ఒక సైట్ లో రిజిస్టర్ చేసుకుంటారు. చేరిన ప్రతి పుస్తకానికీ ఒక యూనిక్ బుక్ క్రాసింగ్ ఐడీ నెంబరు ఇస్తారు. ఇది పుస్తకానికో గుర్తు అన్న మాట.  మీరు ఇతరులతో షేర్ చేసుకోవాలనుకునే పుస్తకాన్ని ఆ ఐడీ ఒక లేబుల్ పై రాసి, మీ ఇష్టమైన పబ్లిక్ ప్లేస్ - సాధారణంగా పుస్తకం ఏమిటా అని చూసే వ్యక్తులు తారసిల్లొచ్చు అనుకునే ప్రదేశాల్లో, ఉదాహరణ కి - పబ్లిక్ లైబ్రరీల్లో / ఆర్ట్ గాలరీల్లో / కాలేజీ లో / బస్ లో / ట్రైన్ లో / విమానాశ్రయం లో - అలా విడిచిపెట్టొచ్చు.  దీన్ని తరవాత ఎవరో మనం ఎరుగని వ్యక్తి మనం ఎరుగని టైం లో చూడొచ్చు. ఆసక్తి ఉంటే, ఆ పుస్తకాన్ని తీస్కెళ్ళి చదువుతారు. లేదా వొదిలేస్తారు.  అలా చదివిన రీడర్ మళ్ళీ, ఆ పుస్తకాన్ని వేరేఅ చోట విడిచిపెట్టొచ్చు.  పుస్తకం దొరికిన తరవాత, బుక్ క్రాసింగ్ సైట్లో కి వెళ్ళి, పుస్తకం ముందున్న యూనిక్ ఐడీ నెంబర్ ని ఎంటర్ చేస్తే, మనకు పుస్తకం చరిత్రా తెలుస్తుంది, సైటు వాళ్ళకు / పుస్తక దాత కు పుస్తకం జాడా (ఎవరో ఒకరు చదివారన్న తృప్తి) దొరుకుతుంది.  ఇది పూర్తిగా ఉచితం, ఎక్కువ స్వంత సమాచారం ఇవ్వనక్కర్లేదు గాబట్టి క్షేమం కూడా.

సడన్ గా ఏ బస్ లో నో మీకో మంచి పుస్తకం దొరికిందనుకోండి ! ఎంత థ్రిల్ అవుతారు ? అలానే ఆ విషయం దాత కి సైట్లో తెలియజేస్తే, దాత కూడా థ్రిల్ అవుతారు.  పుస్తకం ఒక మంచి నేస్తం. ఈ పుస్తకాల ద్వారా మనం మరిందరు మనుష్యులతో ఒక లాంటి స్నేహమే చేస్తున్నాం.  పుస్తకాన్ని మరో మనిషి తో పంచుకోవడం ద్వారా ఒక లాంటి మానవీయ బంధమేదో ఏర్పరుచుకుంటున్నం. ఈ సైట్ లో చేరడం ద్వారా మన పుస్తకాలకి రెక్కలిస్తాం. (మళ్ళీ మన దగ్గరికి రావనుకోండి.  పుస్తకాలు మనల్ని విడిచి వెళ్ళిపోతాయి).


ఇదో చెత్త కాన్సెప్ట్. మన దేశం లో వర్క్ ఔట్ కాదేమో అని అనిపిస్తూందా ? ఎంత వీలయితే అంత.. చూద్దాం అనే పద్ధతి లో నైనా ఈ పద్దతిని మనం కూడా మొదలు పెట్టొచ్చు.  ఇంటర్నెట్ వాడకం మన దేశం లోనూ ఎక్కువయింది. సోషల్ నెట్ వర్కింగ్ అయితే లెక్కే లేదూ. ఏమో చెప్పలేం. మన దేశం లోనూ హిట్ కావచ్చు.  పైగా పబ్లిక్కు కి మంచి పుస్తకాల్ని దానం చెయ్యడం చాలా మంది వల్ల కాదనుకోండి. ఇలాంటి 'ప్రయాణించే పుస్తకాలూ బహుశా చాలా మంది 'వొదిలించు కుందామనుకునే రకం చెత్త పుస్తకాలేమో ' అని సందేహం కూడా రావచ్చు. ఇవన్నీ తెలుసుకోవాలంతే, ఈ సైట్ ని ఓసారి దర్శించొచ్చు. 


వీళ్ళు చెప్తూన్న లెక్కల ప్రకారం, ప్రపంచ వ్యాప్తం గా ఈ (ప్రపంచ పుస్తక భాండారం అనొచ్చు) 9,667,897 పుస్తకాల్ని 1,807,007 గురు సభ్యులు షేర్ చేసుకుంటున్నారు.  సరే. అన్నిట్నీ గాలికి వొదిలేయక్కర్లేదు. ఇష్టమైన పుస్తకాల్ని సభ్యులతో షేర్ చేసుకోవచ్చు.  సైట్ వాళ్ళు నిర్వహించే పుస్తక సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు.  ఇంకా, ముఖ్యంగా, కొనుక్కో బోయే పుస్తకాల మీద డిస్కౌంటు పొందొచ్చు. 'అరుదైన  పుస్తకాల్ని సేకరించొచ్చు.

ఇలా పుస్తకాల్ని పంచుకోవడం ద్వారా, చాలా సంతోషాన్ని పొందే వాళ్ళు ఎందరో వున్నారు.  ఒక చిన్న అడుగు అటు వేద్దామనుకునే వాళ్ళ కోసం ఈలింకు :  http://www.bookcrossing.com/about

పుస్తకాల్ని షేర్ చేసుకోదలచుకుంటే, వీళ్ళ సహాయంతో మొదట పుస్తకాన్ని లేబుల్ చెయ్యాలి.  ఈ బుక్ క్రాస్ సభ్యులు మన దేశం లో కూడా వున్నారు. (ఓ తొమ్మిది పుస్తకాలనుకుంటాను - ప్రయాణిస్తున్నాయి మన దేశం లో కూడా)  పుస్తకాల పురుగులు పుస్తకాలు కేవలం చదువుతాం అనుకునేవాళ్ళు కూడా స్వాగతం.  అదీ దీని సంగతి.

PS:  నాకెలా తెలిసిందనుకుంటున్నారా ? మొన్న నాకో పుస్తకం మా వూరి మ్యూజియం లో దొరికింది. ఏమిటా అని తెరిచి చూస్తే, ఒక లేబుల్ - దాని మీద, 'మీకిష్టమైతే ఈ పుస్తకాన్ని తీసుకోండి చదవండి, మా సైట్ ని దర్శించండి - అని ఒక నోటూ, పుస్తకం జాతక చక్రం తాలూకూ ఐడీ నెంబరూ కనిపించాయి) పుస్తకం చదవలేదింకా. కానీ సైట్ చాలా ఇంటరెస్టింగ్ గా అనిపించి, టైం కుదరగానే ఇలా బ్లాగుతున్నా. అది విష్యం.


ఆన్లైన్ లో సాఫ్ట్ కాపీల్ని పంచుకోవడం లా కాకుండా,    "నిజ (అంటే ??!) జీవితం" లో నిజం పుస్తకాల్ని పంచుకోవడం - అంత ఎథికల్ విష్యం కాపోవచ్చు వ్యాపారాత్మకం గా. కానీ 'మంచి తనం ', 'మంచి ఉద్ద్యేశ్యం ',  'పుస్తకాల్ని పంచుకోవడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం', 'పుస్తకాల ద్వారా స్నేహితుల్ని సంపాదించుకోవడం',  'మనిషి కి మనిషి  కనెక్ట్ కావడం",  కొంచెం మంచి విషయాలు గా తోచాయి.

ఇలాంటి ఇతర ప్రముఖ పుస్తకాలు పంచుకునే సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు ఎవరికన్నా తెలిస్తే తెలియపరచకలరు. (నాకు తెలీటం ఇదే మొదటి సారి కాబట్టి ఇంకా ఎక్కువ సైట్లు ఏమన్నా ఉన్నాయేమో అనే ఆసక్తి ఉంది.)

22/04/2013

గాంధీ, మై ఫాదర్



గాంధీ గారు - మహాత్ములు. దేశానికి అహింస అనే అజేయమైన ఆయుధాన్ని కనిపెట్టిచ్చిన శాస్త్రవేత్త. 200 సంవత్సరాలు విడదీస్తూ పాలిస్తూ, దేశాన్ని చిధ్రం చేసిన విదేశీ పాలన నుండీ, పేదా గొప్పా, పండిత పామరులనూ, స్త్రీలనూ, పురుషులనూ, వీరూ వారూ అన్న తేడా లేకుండా ప్రభావితం చేసి, స్వాతంత్ర్య పొరాటానికే దిశానిర్దేశం చేసి, జీవితాంతం ప్రజలకు ఆదర్శం గా నిలుస్తూ, మహాత్ముడై, జాతికి పిత యై, ఏకతాటి మీద స్వాతంత్ర్య పోరాటాన్ని ముందుకు నడిపించి, దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించిపెట్టిన మహనీయుడు.


ఇప్పటికీ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 65 ఏళ్ళు గడిచిపోయినా  "గాంధీ" నామం కాంగ్రెస్ కు ఆయువు పట్టు.  గాంధీ టోపీ అన్నా హజారేలకూ, అరవింద్ కేజ్రీవాల్ లకూ బ్రాండ్ ఎంబాసిడర్.  గాంధీ ఎవరో ప్రపంచం అంతా ఎరుగుదురు. ఓ నెల్సన్ మండేలా నూ, మార్టిన్ లూథర్ కింగ్ నూ ప్రభావితం చేయగల మహోన్నత వ్యక్తిత్వం గాంధీది. "గాంధీ గిరీ" సినిమాలకే కాదు ఇతరత్రా ప్రజాభిమానానికీ పనికి వచ్చే దివ్య సాధనం. కానీ ఆయన వ్యక్తిగత జీవితం ? అయోమయం. గాంధీ జీవితం  అంతా అతని ఆదర్శ పోరాటానికి రాలిన సమిధ.  గాంధీ కొడుకు హరిలాల్ మోహందాస్ కరం చంద్ గాంధీ కధ ఈ 'గాంధీ మై ఫాదర్ '.

ఈ సినిమా నా ఫేవరెట్ ఆక్టర్ 'అక్షయ్ ఖన్నా  సినీ జీవితం లో కలికి తురాయి అని చెప్పొచ్చు.  అక్షయ్ ఖన్నా గాంధీ ఓడిపోయిన కుమారుడు హరిలాల్ గా అత్భుతంగా నటించాడిందులో.  ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ని నిర్మించింది బాలీవుడ్ హీరో అనిల్ కపూర్. దీన్ని కూడా అనిల్ కపూర్'s బెస్ట్ అని చెప్పొచ్చు.

చలిలో ఆస్థ్మాతో దీనాతి దీనంగా చనిపోతూ ఉన్న ఓ బిచ్చగాడిని ముంబాయి లో ప్రభుత్వాస్పత్రి వాళ్ళు తీస్కెళ్తారు. ఎవరు నువ్వు అని వాళ్ళు అడిగినపుడు నేను 'బాపూ కొడుకుని !' అని చెప్తాడు హరిలాల్. 'బాపూ ' పేరేంటి అంటే "మోహన్ దాస్ కరం చంద్ గాంధీ" ! అని అస్పస్ఠం గ చెప్తూంటాడు.  నిజానికి ఆ బిచ్చగాడు మహాత్మా గాంధీ మొదటి కొడుకు హరిలాల్ మోహన్ దాస్ కరం చంద్ గాంధీ. జీవితం లో అన్నీ కోల్పోయి, అనీ ఓడిపోయిన వ్యక్తి.  జీవితపు చరమాంకలో ఉన్న అతనికి గుర్తు వస్తున్నట్టు గా ఈ మొత్తం సినిమా అంతా, అతని కౌమార దశ నుండీ మృత్యువు దాగా, గాంధీ కధ అంతా తెర ముదు ప్రత్యక్షం అవుతుంది

మోహన్ దాస్ కరం చంద్ గాంధీ - సౌత్ ఆఫ్రికా లో 'టాల్స్టాయ్ ఫార్మ్' రోజుల్నించీ  కధ మొదలవుతుంది.  పెద్దబ్బాయి హరిలాల్ (హరిలాల్, మనిలాల్, రాం దాస్, దేవదాస్ అనే నలుగురు కొడుకులు)  తన అడుగుజాడల్లో నడవాలని తండ్రి గా గాంధీ కోరుకుంటాడు. అదే అతని జీవితం లో చేసిన పెద్ద తప్పు. కొడుకు ఆశయాలకూ, అభిమతానికీ విరుద్ధంగా తనతో పాటూ జాతీయోద్యమం దిశగా కొడుకు నడవాలని, బారిస్టరు గాంధీ కోరుకుంటూంటాడు. హరిలాల్ చదువు మాతృభాషలో సాగాలని, సౌత్ ఆఫ్రికానుండీ, మెట్రిక్ చదివేందుకు రాజ్ కోట్ పంపేస్తాడు.  అక్కడ గులాబ్  అనే అమ్మాయినే హరిలాల్ కాబోయే భార్య గా కూడా నిర్ణయిస్తారు. కానీ హరిలాల్ చదువు ఆయా కారణాల వల్ల చెడుతుంది. సౌత్ ఆఫ్రికా కీ, ఇండియాకీ మధ్య దాదాపూ ఊగిసలాడుతున్న అతని చదువు, విసిగిపోయి, అతను గులాబ్ ను పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకోవడం, తిరిగి తండ్రి పిలుపు పై గులాబ్ ను వొదిలి, సౌత్ ఆఫ్రికా రావడం జరుగుతుంది.   

హరిలాల్ నిజానికి చిన్నప్పటినించీ తండ్రిలా ఇంగ్లండ్ వెళ్ళి పెద్ద చదువులు చదివి బారిస్టర్ అవ్వాలని కలలు కంటూంటాడు. వీట్ని గురించి తెలిసినా గాంధీ ఒక రకమైన మొండితనంతో హరిలాల్ తన తో పాటూ దేశం కోసం పని చెయ్యాలని కోరుకుంటాడు. ఇది ఎంత తప్పుడు నిర్ణయమో అతనికి తెలియదు.

సౌత్ ఆఫ్రికా లో గాంధీ అపార్థీడ్ (వర్ణ వివక్ష ) కు గురి అవుతూ ఉన్న సమయం. బారిస్టర్ అయి వుండి, ఫస్ట్ క్లాస్ టికట్ ఉన్నా కూడా రైల్ లోంచీ నెట్టివేయబడతాడు. ఫుట్ పాత్ మీద అందరు తెల్ల వారితో సమానంగా నడిచినందుకు 'కూలీ ' అంటూ గద్దింపబడతాడు. అతనితో ఉన్న భారతీయులందరూ, మెల్లగా స్వతంత్ర్య భావనలతో ఉత్తేజితులవుతున్నారు. అపుడే వీళ్ళు ఆయా ప్రాంతాలలోకి వెళ్ళాలంటే వీళ్ళకు పాస్ లు ఉండాలంటూ కొత్త చట్టం తీసుకొస్తారు తెల్ల దొరలు. భారతీయులంతా తమ తమ పాస్ లను తగలబెడతారు. ఆ ఉద్యమం ఊపందుకుంటున్న నేపధ్యంలో హరిలాల్ తండ్రికి చేదోడు వాదోడుగా నిలుస్తాడు. జైలుకు వెళ్తాడు.

సహజంగా మొహమాటస్థుడూ, మిత భాషీ అయిన హరిలాల్ కు తండ్రి కన్నా తల్లి దగ్గరే చనువెక్కువ. తండ్రిగా గాంధీ చాలా క్రమశిక్షణ ని పాటిస్తూ, పిల్లల్ని తననుకున్న పద్ధతుల్లోనే పెంచుతూంటాడు.  భార్య కస్తూర్బా కూడా ఎన్నో త్యాగాలు చేస్తూ,భర్త అడుగుజాడల్లో నడుస్తూ, గాంధీ మార్గాన్ని సులభతరం చేసింది.   కాబట్టి తండ్రి దగ్గర చెప్పుకోలేని తన ఆకాంక్షల్ని తల్లితో పంచుకుంటాడు హరిలాల్. ఇద్దరూ ఎంత ప్రయత్నం చేసినా, మోహన్ దాస్ మనసు మార్చలేకపోతారు.  ఈలోగా ఊపందుకున్న పోరాటంలోకి హరిలాల్ కూడా యువకుడు కావడం వల్ల ఉత్సాహంగా దూకుతాడు. కానీ అతనికి తెలుసు - తన లక్ష్యం బారిస్టరు కావడం.

హరిలాల్ భార్యని వొదిలి తండ్రి తననైమైనా బారిస్టరీ చదివిస్తాడేమో అనే ఆశతోనె సౌత్ ఆఫ్రికా వస్తాడు. అక్కడ పుస్తకం లో దాచుకున్నముగ్ధ లా వున్న అతని భార్య ఫోటోని చూసి, గాంధీ సెక్రటరీ, వెంటనే గాంధీ గదిలోకి వెళ్ళి : "మిస్టర్ గాంధీ - ఈ ఫోటో చూడండి ? వీళ్ళిద్దర్నీ విడదీయడానికి మీకు మనసెలా వొప్పింది?" అని అడుగుతుంది చనువుగా. వెంటనే గులాబ్ (భూమికా చావ్లా) ని సౌత్ ఆఫ్రికా పిలిపిస్తారు. కానీ కొన్నాళ్ళ సంసార జీవనం తరవాత, హరిలాల్ జైలుకి వెళ్ళాక, గులాబ్ నీ, పిల్లల్నీ (హరిలాల్ ఆదర్శ జాతీయోద్యమ జీవితానికి అడ్డురాకుండా వుండేందుకని) తిరిగి ఓడ లో ఇండియా కి పంపేస్తాడు మోహందాస్ గాంధీ.

గాంధీ కుమారుడిగా హరిలాల్ కు ఒక సంపన్న గుజరాతీ 'బారిస్టరీ ' చదవడానికిచ్చిన స్కాలర్ షిప్ ను తమకు తెలిసిన 'సొరాబ్జీ' ల అబ్బాయి కి మళ్ళిస్తాడు తండ్రి. ఇలా రెండు సార్లు చేతి దాకా వచ్చిన అవకాశాన్ని తండ్రి తిప్పికొట్టడం చూసిన హరిలాల్ చాలా హతాశుడైపోతాడు.  

ఇవన్నీ (తన నిర్ణయాలకూ, తన ఇస్టాయిస్టాలకూ సంబంధం లేకుండా) అన్నీ తానై తనకి వ్యతిరేకంగా ఉన్నందుకు తండ్రిని అసహ్యించుకునే పరిస్థితికి హరిలాల్ దిగజారుతాడు. ఇక్కడ ఆయా నటుల నటనా, మోహన్ దాస్ గాంధీ గా చేసిన జరీలాల్ నటనా చాల బావుంటాయి.  ఆ ద్వేషం హద్దులు దాటి, తండ్రినీ, అతని ఆదర్శాల్నీ ధిక్కరించి ఇండియా వచ్చేస్తాడు హరిలాల్. అప్పటికీ తండ్రిని ఎదిరించలేక, మారువేషం తో డర్బన్ లో ఓడ ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుబడి ఇల్లు చేరతాడు. ఆ తరవాత తండ్రీ కొడుకుల మధ్య చినుకులా మొదలైన వాగ్వివాదం ముదిరి, తండ్రి ని తనని రాజ్ కోట్ పంపించేయమని బ్రతిమలాడి ఇండియా వచ్చేస్తాడు హరిలాల్.  ఇక్కడ తండ్రి గా గాంధీ తన తప్పిదాన్ని గుర్తించినా,  ఆదర్శాల కోసం దాన్ని సరిదిద్దలేక, అర్ధం చేసుకోని కొడుకు బాధనీ అర్ధం చేసుకుంటాడు. అక్కడితో ఒక అధ్యాయం ముగుస్తుంది.

రాజ్ కోట్ లో భార్యా, నలుగురు పిల్లతో, అద్దె ఇంట్లో హరిలాల్ ఇబ్బందులు పడుతూ, అటకెక్కిన చదువుని గాడిలో పెట్టే ప్రయ్తంతం చేస్తూంటాడు. మెట్రిక్ మూడు సార్లు తప్పుతాడు. ఈలోగా లోకమాన్య తిలక్ తదితరుల ఆహ్వానం పై గాంధీ భారత్ తిరిగి వస్తాడు. తల్లి తండ్రుల ని కలుసుకుని, వారి ప్రధమపర్యటన పర్యాంతం, కుమారుడిగా తన బాధ్యత గా తోడుంటాడు హరిలాల్. అప్పటికే గాంధీ పేరు భారత దేశం అంతటా మహాత్ముని పేరు మారుమోగుతూంది. కొత్తగా దిగివచ్చిన దేవత లాంటి భావన, ప్రజలందర్లోనూ, తీవ్రమైన ఎక్స్పెక్టేషన్ ! సౌత్ ఆఫ్రికా లో గాంధీ చేసిన పోరాటం, అంత పెద్ద బారిస్టరూ, దేశ పురవీధుల్లో సామాన్యుడిలా పర్యటించడం, ప్రజల్ని విపరీతంగా ఆకట్టుకుంటాయి.  గాంధీ కొడుకుగా హరిలాల్ పతనం కూడా పూర్తి స్థాయికి చేరుకుంటూంటుంది.

హరిలాల్, ఉద్యోగం కోసమో, ఆర్ధిక సహాయం కోసమో తండ్రిని చేసిన అభ్యర్ధనలు నిరాకరించబడతాయి. గాంధీ పేరు, అతనికి ఏ విధం గానూ సహాయపడదు. నలుగురు పిల్లలూ, నిరుద్యోగం, జీవితం లో అపజయం, హరిలాల్ ని కుంగదీస్తాయి. తండ్రి అంటే ద్వేషం పతాక స్థాయికి చేరుకుంటుంది. కొందరు మోసగాళ్ళు గాంధీ పేరును ఉపయోగించుకునేందుకు హరిలాల్ ను వాళ్ళ మిధ్యా వ్యాపారాల్లోకి లాగి, అతన్ని అధో పాతాళానికి చేరుస్తారు. తాగుడు కు బానిస అవుతాడు. అప్పుల వాళ్ళ బెదిరింపులు ఎక్కువవుతాయి. అలాంటి తండ్రికి పుట్టిన కొడుకువా అని నిందలూ మొదలవుతాయి. తండ్రి పేరు కున్న పెద్ద నీడ లో గాంధీ అసమర్ధ కొడుకుగా తనకున్న పేరుతోనూ, అవస్థలు పడుతూ, హరిలాల్ మానసిక, ఎమోషనల్ చిత్రవధ ని అనుభవిస్తాడు. పోషించుకోవడానికి హరిలాల్ భార్య, పిల్లని తీసుకుని కన్నవారింటికి చేరుతుంది.  అక్కడే హరిలాల్ కొడుకు మరణిస్తాడు. ఆ వార్త విని మామ గారింటికి చేరిన హరిలాల్ కి భార్య మృత్యు వార్త కూడా ఎదురయి, నిలువునా దుఃఖ సాగరంలో మునిగిపోతాడు.   హరిలాల్ లో ఉన్న విచక్షణ అంతా అంతరించుకుపోయి మనిషి పూర్తిగా మారిపోతాడు.


ప్రశాంతత కోసం ఇస్లాం స్వీకరిస్తాడు. ఆతరవాత వేశ్యా వాటికల కి వెళ్తాడు, అప్పుల వాళ్ళని తప్పించుకుని తిరుగుతూంటాడు.  వ్యక్తిగా దిగజారుతూంటాడు.  తల్లి కస్తూర్బా వచ్చి అతని పరిస్థితి చూసి బాధపడితే, ఆమె కోసం మళ్ళీ బ్రహ్మ సమాజం లో చేరి, హిందువు గా మారతాడు.  అయితే, జీవితంలో ఓటమి, అతని స్థాయిని దిగజార్చి తాగుడుకు బానిస గా చేస్తుంది.  తండ్రి అంటే ఎలానూ ప్రేమ లేదు. తల్లిని  మాత్రం కలవడానికి అదీ కొద్ది నిముషాలు మాత్రమే ! ప్రయత్నిస్తాడు. ఎక్కడన్నా తల్లీ తండ్రీ, ఏ గృహనిర్బంధం లో ఉన్నపుడో, దేశంలో ఎక్కడికైనా రైల్లో ప్రయాణం చేస్తున్నపుడో తారసపడుతుంటాడు. దాదాపు బిచ్చగాడిలా, జేబులో కాణీ లేక, ఒక్క క్షణం ప్రత్యక్షమై, తల్లిని పరామర్శించి మళ్ళీ అదృశ్యం అవుతుంటాడు. గాంధీ, ఎంతో సాదరంగా కొడుకుని ఇంటికి ఆహ్వానిస్తూనే వుంటాడు. అయినా, తండ్రి కళ్ళలోకి చూడ్డానికి కూడా హరిలాల్ ఇష్టపడడు.


చివరి క్షణాల్లో కస్తూర్ బా, హరిలాల్ ని గురించి తలుచుకుని బాధపడుతూనే కన్ను మూస్తుంది.   భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు ఎవరో రోడ్డు పక్కన దీనాతిదీన స్తితి లో బిచ్చగాడిలా పడున్న హరిలాల్ చేతిలో లడ్డూ పెడతారు. అప్పటికే హరిలాల్ మానసిక సంతులితను కోల్పోయి వుంటాడు. స్వాతంత్ర్యం వచ్చినన్న స్పృహ లేనే లేదు.  గాంధీ కూడా చనిపోయే ముందు రోజు తన సెక్రటరీ ని హరిలాల్ ని ఇపుడు వెతకగలమా ? అతన్ని చూడాలనుంది అని అడుగుతాడు. కానీ హరిలాల్ ని వెతకడం ఎంత కష్టమో తెలిసి నిస్సహాయంగా ఫీల్ అవుతాడు. 

గాంధీ హత్య జరిగినపుడు హరి ఒక చిన్న హోటల్లో ఏదో తినడానికి వెళ్తాడు.  రేడియోలో గాంధీ మరణ వార్త విని సొంత తండ్రి పొయైనట్టే (బాపూ ) అంటూ బాధపడుతూ హరిలాల్ చేతిలో ఏదో తినడానికి పెట్టి, డబ్బులు తీసుకోకుండా కొట్టు మూసేస్తాడా హోటెలు యజమాని. అప్పుడూ, ఆ వార్త రిజిస్టర్ అయినట్టుండదు హరిలాల్ కి. 

అయితే పతనం లోకి జారిపోతున్న హరిలాల్, రోడ్డు పక్కన బిచ్చమెత్తుకునే బీద స్థితిలోకి వెళిపోతాడు. చలిలో, వర్షంలో రోడ్డు మీదే నివాసం. శ్వాస్ కోశ వ్యాధికి గురవుతాడు.  ఆ రోజున తండ్రినీ, తన జీవితాన్నీ తలుచుకుంటూ కళ్ళు మూసిన ఆబిచ్చగాడు   -  ఆ హరిలాల్ - ఆఖరి శ్వాస తీసుకున్నాకా, అతని జేబు లో దొరికిన ఫామిలీ ఫోటోలూ, వగైరాల ద్వారా అతనే హరిలాల్ అని అందరికీ తెలుస్తుంది. అలా.. మహాత్మా గాంధీ కొడుకు అత్యంత దీనమైన పరిస్థితి లో కన్ను మూస్తాడు.

గాంధీ జీవితంలో ఈ చీకటి కోణం,అపారమైన పుత్ర శోకం, చాలా మందికి తెలీదు. ఈ నిజ జీవిత కధను అత్యంత హృద్యంగా తెరకెక్కించిన దర్శకుడికి చాలా పేరు వచ్చింది.  చాలా జాగ్రత్తగా ఎన్నుకున్న తారాగణం, చారిత్రక చిత్రం కాబట్టి నిజాల్ని నిజాలుగానే వుంచుతూ, కల్పనల్ని పక్కన పెట్టి, చక్కగా తీసిన ఈ చిత్రం, ఓ అత్భుతం. యూ ట్యూబ్ లో పూర్తి సినిమా వుంది. గుజరాతీ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే పాట ఒకటి చాలా బావుంటుంది. మంచి సినిమా ఈ "గాంధీ, మై ఫాదర్".








16/04/2013

నాణానికింకో వైపు - విశాఖపట్నం

వేసవిలో కష్టపడకుండా చెమట చిందించేయొచ్చు. గాఢ నిద్ర లోంచీ, వొళ్ళంతా, దిండంతా చెమటకి తడిచిన చెమ్మకి మెలకువ రావడం, మా వూరి స్పెషాలిటీ.  ఏసీ లొచ్చి బ్రతికించాయి. డయాబెటీస్ ఉన్నవాళ్ళకి ఈ విపరీతమైన ఉక్క పోత ప్రాణసంకటం.


చండీదాస్ నవలల్లో విశాఖ తీరం అందాల్ని గుర్తు తెచ్చుకుందుకు.. మహరాణీపేట లేడీస్ హాస్టల్ డౌను రోజుల్ని నెమరు వేసుకుందుకూ బీచీకి కారు లో షికారు పోయేరు. అద్దం నిండా ఉప్పుగాలి చెమ్మ. ఇదీ మా సముద్రం. వేడి నుండీ తప్పించుకోవడానికి జనం తండోపతండాలుగా వచ్చి, సముద్రం నుంచీ వీచే ఉక్కిపోయిన గాలి రంధిలో తలనొప్పి తెచ్చుకుని బయల్దేరొచ్చు. కళ్ళజోడుతో స్కూటరు నడపడం కష్టం.  అద్దాల్నిండా మబ్బులు కమ్మేసి వుంటాయి. 


"మురీ మిక్సరు (పిడత కింద పప్పు లాంటి ఒక స్నాక్)  అమ్మేవాడెవడికో ఎయిడ్స్ ఉందిట. ఒకసారి వాడి రక్తం  టొమాటోలు తరిగినపుడో తెగిన రక్తం లోంచీ కలిసి తిన్నవాళ్ళకి కూడా ఎయిడ్స్ వచ్చిందంట ! "  అని ఎవరో మా చిన్నపుడు పుకారు లేవదీసారు.  ఆ ఆనందం కూడా  పెద్దయ్యాకా హైజీను గొడవలో పడి కోల్పోయాం.  బీచి లో గవ్వలన్నీ జనం ఎత్తుకుపోయారు. ఇపుడు నల్లని కుళ్ళిన మట్టీ, నీళ్ళలో కలుస్తున్న ఓపెన్ డ్రైనేజీ ప్రవాహాలూ, ఒక ముసలి గుర్రం, చిక్కిన ఇసుక మేటా తప్ప ఏమీ లేవక్కడ.  అన్నమయ్య విగ్రహం పక్కనా, మాస్టరు 'ఈ.కే' (ఎక్కిరాల కృష్ణమాచార్య) విగ్రహం పక్కనా కూడా ఏదో కోల్పోయినట్టనిపిస్తూంటుందండీ - అని మహేశ్వరి నిట్టూర్చింది.  


పొద్దున్నే తాజా గాలి పీల్చుకుందికి లేదు. తెల్లారే  గాలిలో అదోలాంటి వాసన. ఎవరో ఫాక్టరీ వాళ్ళు ఏవో వాయువుల్నీ, కల్మషాల్నీ వదిలినట్టుంది. సూర్యుడి ప్రతాపానికి చల్లదనం కరుగుతుంటే, ఆ వాసన కూడా విరుగుతూంటుంది. ఈలోగా పనుల తొందర్లో, తాజా గాలి సంగతి మర్చిపోవచ్చు.

ఒకపుడు సిటీ ఆఫ్ డెస్టినీ. ఇపుడు, పిల్లలెగిరిపోయిన ఖాళీ కాకి గూడు లా మిగిలింది.  పిల్లలందరూ, ఈ విశాఖ మెట్టుమీద ఓ కాలుంచి, ఇంకో కాలు ఏ హైదరబాదు మీదో వుంచి, విదేశీ అటక ఎక్కిపోయారు. తల్లితండ్రులు, రైతు బజారులో దేశవాళీ టొమాటోలూ, ఏజెన్సీ నుంచొచ్చిన పచ్చి అల్లం గురించే కబుర్లు చెప్పుకుంటున్నారు. 'రామాయణ కల్పవృక్షాని' కే ప్రైజిచ్చిన విశ్వవిద్యాలయం - తమ మీద తమకే నమ్మకం లేనట్టు మసిబారుతూ రోడ్డుపక్కన నించుంది. 

సింధియా మీంచెళ్ళి గంగవరం వెళ్ళొద్దాం అని ప్లాన్. డాల్ఫిన్ నోస్ పక్కనే ఏదో కొత్త నగరం.  'సబ్బవరం పిల్లా సబ్బు కావాలా ?" అని ఈవ్ టీజరు నోట పాట. మువ్వల వాని పాలెం నిండా రక రకాల రెస్టారెంట్లూ, బ్రహ్మాండమైన స్కూళ్ళూ, మిఠాయి దుకాణాలు. రవీంద్రా టైలర్సు ఎత్తేసి చాలా కాలమైంది.  కైలాసగిరి కొండ మీద గోవింద నామాల్లో సగం లైట్లు వెలగనే వెలగట్లేదు. చుట్టూ చెట్ల పొడవెక్కువయి సరిగ్గా కనిపించడం లేదు కూడాను. చిరంజీవి గారికి ఆలోచన రాలేదు. వస్తే అక్కడ ఎల్.ఈ.డీ.లైట్లు పెట్టిద్దురు.

విజీనారం అమ్మోరి పండగని (విజయనగరం అమ్మవారు - పైడితల్లి) ఓ నాల్రోజులూ, వాళ్ళ వీధి అమ్మోరి 'పరస'ని (విశాఖ లో అమ్మవారి పండగ) ఓ రెండ్రోజులూ సెలవెట్టేసేడు అప్పారావు మా వాచ్మెను.  "నాగేశ్వర రావు గారి కుటుంబం శ్రీకూర్మం వెళ్తున్నారుట. అలా అరసవిల్లి చూసుకుని వస్తారు ! వాళ్ళ పెద మావగారి తద్దినం అక్కడ శ్రీకూర్మం (కూర్మ నాధ స్వామి కోవెల - పితృకార్యాలకి ప్రసిద్ధి) గుళ్ళోనే ట !"  అని చిన్న మణి చెప్పింది.  కార్లో ప్రయాణం బానే వుంటుందిలే. ఇపుడు మంచి రోడ్లు పడ్డాయి. అంది వాళ్ళక్కయ్య !

'తెలంగాణా వస్తే మరి పట్టలేం. మధురవాడలోనో, ఎండాడ లోనో, కొమ్మాది లొనో ఇల్లు కొని పడేద్దాం అని" ప్రతీ ఒక్కడూ అనుకోవడమే ! అని ఇసుకతోట లో నాలుగు ఫ్లాట్లున్న డాక్టరు గారు వాపోయారు. అందుకే చూడండి. పల్లెటూళ్ళు ఊరు ఊరంతా ఎగిరిపోయి ఎపార్టుమెంట్ల నగరాలు లేచేస్తున్నాయి. విజీనారానికీ, విసాపట్నానికీ తేడా మరి ఉండదు లెండి... పూసపాటిరేగ వరకూ మెట్రో వేస్తారు చూడండి - అందుకే రామానాయ్డు ఇక్కడ స్టూడియో కట్టేడు.  అట్చూడండి - ఆ కనపడే కొండా కోనా అన్నీ జగనన్నవే. వైజాగ్ లో గమ్మున ఇల్లు కొనుక్కోవాలండీ. ధరలు పెరిగిపోతాయి మరి ! " -  రియాల్టరు విశ్వేశ్వర రావు ఉవాచ.

కొత్తగా మాళ్ళూ అవీ వచ్చాయనుకోండి. అయినా విశాపట్నం పెద్ద పల్లెటూరే !   అని మా భవాని అత్తయ్య నవ్వింది.

పేపర్లో ప్రకటన చూడండి. హాస్పిటలు వాళ్ళకి ఒరిస్సాలో కమీషన్ ఏజెంట్లు కావాల్ట. ఒరిస్సా నుంచీ పేషెంట్లని తీసుకు రావడానికి. పాపం వాళ్ళ అనారోగ్యానికి వాళ్ళకి ఏ భువనేశ్వరమో వెళ్తేగానీ మంచి ఆస్పత్రనేది ఉండదు.  వాళ్ళకి పరమోగతి ఈ విశాపట్నమే. ఇక్కడి కే.జీ.హెచ్ వీధి నిండా వెలిసిన డాక్టర్ల దుకాణాలూ, చిన్నా పెదా ఆస్పత్రులూ, రాం నగర్లో మెడికల్ షాపులు సైతం, ఒరియా భాషలో లాడ్జీలూ, సగం వేరే రాష్ట్రం వాళ్ళ సేవ లోనే గడిపేయవూ ? ఇపుడీ పీ.ఆర్.వో ఉద్యోగాలు కూడానూ -  అని పీటరు బాధపడిపోయాడు. పోన్లెద్దురూ.. ఎవరి కష్టాలు వాళ్ళవి. అని ఊరుకోబెట్టాం."ఇందులో విపరీతం ఏముంది ? 'విన్ - విన్ సిట్యుయేషన్ !" అన్నడు రమణ.


రైళ్ళన్నీ ఇంక నుండీ దువ్వాడ వెళ్ళే ఎక్కాలి కామోసండీ అని అప్పారావు గారి ఆవేదన. 'అసలెంత మంది వెళిపోతున్నారండీ వెధవ హైదరాబాదుకీ? ప్రతి రోజూ 12 రైళ్ళూ, 60 బస్సులూ ఉన్నా, ఏ పూటకీ రిజర్వేషను ఇదిగో కంఫెర్మూ అని టికెట్టు దొరికి చావదు. ఎప్పుడూ గోదావర్లో వెయిటింగ్ లిస్టు ఏ మూడొందల పాతికోనే. రైలెక్కే వరకూ భరోసా లేదు. అయినా, ఈ డబ్బంతా ఆ ఒరిస్సాకే తరలిపోతూంటుంది !" అని సింహాచలం గారి ఆందోళన. ఆయన కూతురూ అల్లుడూ, హైదరాబాదులోనే ఉండడం.  

లోకల్ న్యూస్ పేపరు కి వార్తలు రాసే విలేఖరి డీఆరెం ఆఫీసులో తెగ తిరిగేస్తున్నడు.  "అదృష్టం ! విశాపట్నం స్టేషన్ కైనా రాంపు (ప్లాట్ఫారాలు మారడానికి మెట్ల దారి తో పాటూ) ఉంది. వీల్ చైర్లు /స్ట్రెచర్లూ, ముఖ్యంగా ఈ చక్రాల పెట్టెలూ బాగులూ లాక్కోడానికి అనువుగా. ఏ హైద్రబాదు సికిందరాబాదుల్లో ఉందండీ ఈ ఫెసిలిటీ ?"  అని ఓ విశాఖా రైలాభిమాని చాతీ ఉప్పొంగించారు.  "మా మాంగారు హార్టు పేషెంటు. అత్యవసరంగా ప్రయాణం కట్టాల్సొచ్చింది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాదు స్టేషన్ లో రైలు దిగి  ఏ బాటరీ కారూ, వీల్ చైరూ దొరక్క, మూడుగంటలు వెయిట్ చేసి, ఆఖరికి మెట్లనీ ఎక్కి ప్లాట్ ఫాం నుంచీ బయటికి వచ్చారు. ఆ తర్వాత నాల్రోజులకే పోయారు" అని రాజీ చెప్పింది.

"ఎంత సేపూ రాజమండ్రీ నుండీ పొలస చేపలూ, కాకినాడ నుండీ చుక్కల పీతలూ - అంటూ రాజులొండిన గొడావరీ ఫిష్ గొప్పలు చెప్పుకోవడమేనా - అలా బీచ్ రోడ్డులో రోడ్డు పక్కన ఎండబెట్టిన చేపల సువాసన చూస్తారా ? "  అనడిగేడు దేవుడు. అబ్బ ! విశాలాక్షి నగర్ వెళ్ళే తోవలో ఆంధ్ర భూమి పక్కన ఎన్ని చేపలో - ఎండ కి వెన్నెల నక్షత్రాల్లా మెరుస్తూ ! అని భావుకత ప్రదర్శిస్తాడు మా సురేషు.  'అబ్బ చీ ! అవి కాదు డెక్కు మీద (చేపలు పట్టే పెద్ద పడవల డెక్) ఎండబెట్టినవి - చూడండి ఇసకన్నది ఉండదు - తీస్కోండి బాబూ - అని రాగాలు తీస్తుంది మా కాంతమ్మ ! 


"(ఫిషింగ్) హార్బరు కెళ్ళి వస్తున్నాం !" - ఆదివారం రోజు నర్మదా వన్ ఫిఫ్టీ (Narmada 150 Scooter) మీద ప్లాస్టిక్ బాగ్ నిండా చేపల 'వాసన'  తో ఎదురొచ్చిన రాజుగారు మనం పలకరించకుండానే చెప్తారు. నేవీ వాళ్ళు బెంగాలీ వాళ్ళు ఆటోల్లో చేపలు తీస్కెళ్తుంటారు - బహుశా వారానికి సరిపడా గ్రాసం కాబోలు.

"విజీనారం మ్యూజిక్ కాలేజీ లో చదూకున్నార్ట ! ఆ సాగర్ ఎపార్ట్మెంటులో కొత్తగా దిగేరు. మ్యూజిక్ నేర్పిస్తార్ట. "మాళవిక" లేదూ - వాళ్ళ వేలు విడిచిన చుట్టాలంట."  - ఆ చెంపనొక్కుల పెద్ద నుదురు, కొత్త పావలా కాసు లాంటి నాజూకు బొట్టూ, బెంగాల్ కాటన్ చీరలు కట్టుకునే పెద్దావిడ గురించే చెప్తున్నారనుకుంటా.  "అవునవును. ఆవిడ బాల్కనీ లో కూర్చుని వీణ వాయిస్తుంటే చూసాను!" అంది రత్న.  (అంటే ఈవిడ బాల్కనీ లోంచీ ఆవిడ హాల్ లోకి చూసిందన్నమాట !)

రత్న కూతురు  రోజూ స్కేటింగ్ కని వుడా పార్కుకి వెళ్తూంటుంది.  "వీళ్ళందర్నీ మొన్న వాకింగ్ లో చూసేం. పాండురంగపురం అప్ కి తీస్కెళ్ళి వొదిలేడు కోచ్. తొడలు నొప్పెట్టేలా పిల్లలు స్కేట్ల కాళ్ళను తొందరగా కిందకి జారిపోకుండా ఆపుకుంటున్నారు. నాకైతే చాలా జాలి వేసిందనుకో !"  అని బాధపడ్డారు.. గొలుసులూ, సూత్రాలూ తీసేసి చుడీదార్ తో వాకింగ్ కి పోయే రాజ్యలక్షి గారు. మ్యూజిక్ టీచరు మాటే మర్చిపోయి.  రత్న కళ్ళూ అరమోడ్పులయ్యాయి - గర్వం తో !


గణేష నవరాత్రుల్లో సంపత్ వినాయకుడి గుడి ముందు డెకరేషన్లు చూడ్డానికిభలే సంబరంగా వుంటుందనుకో ! అని మా స్వప్న అంటూంటుంది. నిజమే ! ఆ రోడ్డంతా మారిపోయింది. కొత్త దుకాణాలూ, కొత్త అలంకరణలూ !  తిరపతి మాడవీధుల్లా అన్ని రోడ్లూ వెడల్పయ్యాయి. దానికి తగ్గట్టే ట్రాఫిక్కూ.. అటు చూడండి పెదవాల్తేరు రోడ్డ్ల పక్కన అశోకుడు నాటించినట్టుండే  చిక్కని నీడనిచ్చే చెట్లని కొట్టిపడేసారు.   బాధపడింది స్వప్న !

"మరీ బాధలు భరించలేనట్టు అనిపిస్తే, ఎన్.హెచ్ ఫైవ్ (NH5)  మీద్నుంచో, మధురవాడ వైపునుంచో సిమ్హాచలం వెళ్ళి సంపెంగ వాసన్లు పీల్చుకుని రండి. సాయంత్రం అయితే సిమ్హాచలం చాలా అందంగా వుంటుంది" - మా మణి పెద్దమ్మ చెప్పింది.  అయితే చాలా మంది సుప్రభాతం వేళ అప్పన్న అందంగా వుంటాడంటారు. నాకైతే లక్షివారం ఆ సిమ్హపు కవచం తో నచ్చుతాడు. 

అడవి సంపెంగలూ, తెలుపు సంపంగలూ, పచ్చ సంపెంగలూ, మల్లెలూ, కనకాంబరాలూ, విరజాజులూ, సన్న జాజులూ, మరువం, జూకా మల్లెలూ, సువర్ణ రేఖలూ, రక రకాల రసాలూ, తియ్యని పనస పళ్ళూ.. బెల్లమూ - కలిసినట్టు - ఏదో దివ్యవైన వాసన కదూ ఆ కనకమాలక్ష్వి కోవెల్లొ ? కొంచెం ఇరుకు వీధి ! తప్పదు మరి. అమ్మోరు - మా వూరి పెద్దమ్మ కదూ.


Disclaimer : ఇందులో విషయాలన్నీ దేన్నో ప్రత్యేకంగా ఉద్దేశ్యించి గానీ, ఎవరన్నా హర్ట్ చేద్దామనీ రాయలేదు. ప్రస్తుత పోకడ / ట్రెండ్ గురించి చాలా మంది స్వగతాన్ని ప్రతిబింబించాలని చిన్న ప్రయత్నం. ఊరు విడిచిపెట్టిన స్నేహితులకి కూడ ఓ పలకరింపు లా అనిపించాలని కోరుతూ ..

04/04/2013

Random Shots





Pictures taken in Glasgow, Millport Cumbrae and Ferry point at Largs, Scotland.

08/02/2013

బోరింగ్ కబుర్లు



1. కొందరు నిరుద్యోగం భయంతో 'చిరుద్యోగాలు' చేస్తుంటారు.  ఎంత చిరుద్యోగాలయినా పర్లేదు. కాంట్రాక్టు ఉద్యోగాల్లో చేరి 'పెర్మినెంట్ ' ఎప్పటికైనా అవుతామేమో అని ఎదురు చూసే చాలా మంది ఆశావహుల్ని చూస్తుంటాం.  ఇది ఒక రకం అబధ్రత.  ఈ చిన్న ఉద్యోగం కూడా లేపోతే ఏం కాను అనే బెంగ తో కూడా ఆ చిన్న ఉద్యోగాన్ని చేస్తూనే వుంటారు.   కాంప్రమైస్ అయ్యి, ఆ తరవాత పోటీలో నెగ్గలేక, తరవాత అలవాటు పడి, అలా 'ఎక్కడ చేరిన గొంగళి ' ని అక్కడే వొదిలేస్తూంటారు. అది చాలా మటుకూ వ్యక్తిగత & వృత్తిగత నిర్ణయం అనుకోండి. కానీ మరీ ఇలానా ? 1971 - 2001 వరకూ, కేవలం నెలకు 15 రూపాయల కొన్ని పైసల  జీతంతో పని చెయ్యడం సాధ్యమా ?   

అది టీచర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో టాయిలెట్లు కడిగే ఉద్యోగం. కానీ ఇన్నేళ్ళ శ్రమ కి ఇద్దరు మహిళా సఫాయీ వాలీ లకు ఇంతవరకూ అందిన జీతం మొత్తం కలిపి 5400/- ట. అన్యాయం కదా.  విషయం ఇప్పుడు ట్రైబ్యునల్లోనో కోర్టు లోనో ఉంది.  వాళ్ళకి జీతం పెంచే ప్రతిపాదన, ప్రభుత్వ పరిశీలన లో వుంది. గానీ ఈ ఇద్దరు మహిళలూ, గమ్మత్తుగా గెనీస్ బుక్ లో ఎక్కేందుకని దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళ ప్రత్యేకత, 'ప్రపంచం లో అతి తక్కువ జీతం తీసుకున్నవాళ్ళు !' నిజమే ! ఇంతకన్నా తక్కువ జీతం వుంటుందా ?

2.  Delhi లో జ్యోతీ సింగ్ రేప్ కేస్ సృష్టించిన సంచలనం ఇపుడిపుడే ఫేడ్ ఔట్ అవుతూంది.  ఇదో టీ కప్పు లో తుఫాను లా మిగిలిపోకుండా ఇంకా చాలా సంస్థలూ, మహిళా హక్కుల గురించి పోరాడే వాళ్ళూ కృషి చేస్తూనే వున్నారు.  అయితే ఇది అంత ఈజీ గా మర్చిపోగలిగే సంఘటన కాదు.  పరిస్థితి హాలా ఉద్రిక్తంగా ఉన్నప్పుడు కూడా ఎన్నో అత్యాచారాలు జరిగాయి. అంటే ముఖ్యంగా అవన్నీ మహిళల పై తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి చేసే దారుణ ప్రయత్నాలే.  ఇలాంటి అత్యాచారాలు ఎన్నో! ఎన్నెన్నో !  అయితే ఇంత ప్రజాగ్రహం, దానికి ప్రభుత్వ స్పందనా, మిగిలిన ప్రపంచాన్ని కూడా ఆశ్చర్య పరిచింది.   అయితే ఈ బడబాగ్నిని మన తో పాటూ ప్రపంచం మొత్తం పంచుకుంటూంది కాబట్టి ఈ 14th of February, 2013 న  ఇది చేస్తున్నారు.   ప్రపంచం లో వివిధ ప్రాంతాలో మహిళలు వివిధ రకాలు గా లైంగిక అణిచివేత కి గురవుతున్నారు.  కోట్లాది మంది రేప్ సర్వైవర్స్, బాధితులు ఆ ఒక్కరోజు వీధుల్లో చేసే ప్రదర్శన, పెద్ద మార్పు తేలేకపోవచ్చు. కానీ సమస్య ఎంత పెద్దదో, ఎంత హేయమైనదో, తెలియజేస్తుంది.  వాళ్ళలో కొందరికైనా న్యాయం జరుగుతుంది అని ఆశ.  కొడవటిగంటి కుటుంబరావు - 'చదువు' లో ఒక  పాత్ర అంటుంది.  "రామకోటి రాస్తే స్వరాజ్యం వస్తుందంటావా - ఆనందంగా రాస్తాను"  - అని.  (అంటే ఈ లక్ష్యం కోసం నాకు చేతనైనది నేను చేస్తాను' అని)  దీనికి సంబంధించిన వీడియో :

http://www.youtube.com/watch?v=gl2AO-7Vlzk


06/02/2013

హజార్ చౌరాసీ కీ మా

గోవింద్ నిహలానీ, జయా బాధురీ, నందితా దాస్, సీమా బిస్వాస్, అనుపం ఖేర్ లాంటి దిగ్గజాల సినిమా కాబట్టి తప్పకుండా చూడాలనుకుంటూనే ఆ సరైన 'సమయం ' (ఎటువంటి అడ్డూ ఆటంకాలూ లేని, మూడ్ ఉన్నపుడు, వీలున్నప్పుడు, మరీ ముఖ్యంగా ఇవన్నీ కలిసొచ్చినా, మతిమరుపు పరాక్రమించకుండా, టైం కి గుర్తు వచ్చి, వెతికి, దొరికి) వచ్చి, చూసానీ అత్భుతమైన సినిమా. ఆర్ట్ సినిమా అనొచ్చు.

1970 లలో బెంగాల్లో పుంజుకున్న నక్సల్బరీ ఉద్యమం, ఎందరో నవ యువకులని, చదువుకుటున్న విద్యార్ధులనీ, స్కాలర్లనూ, మేధావుల్నీ ప్రభావితం చేసింది. ఎందరో ఉత్తేజితులు, ఈ యజ్ఞం లో సమిధలయ్యారు. మార్క్సిజం, సోషలిజం, అవినీతి వ్యతిరేకత, సమానత్వం, లాంటి భావ విస్ఫోటనం ఎందర్నో అయస్కాంతంలా ఆకర్షించింది.  అయితే ఈ దారి ముళ్ళదారి.  భద్ర సమాజానికి నక్సలిజం ఒక చెంపపెట్టు. భూస్వామ్య వాదానికి నక్సలిజం అంటే పక్కలో బల్లెం.  నక్సలిజం ఒక ఐడియాలజీ.  అయితే సమాజపు వ్యతిరేకత, పోలీసు ఆక్షన్, కఠినమైన అణిచివేతల మధ్య ఇదో నివురు కప్పిన నిప్పులా రగులుకుంటూనే వుంటుంది.  70 వ దశకంలో నక్సలిజం ఇప్పటిలా కొత్త (ఆయుధ సంపత్తి) శక్తులు పుంజుకోలేదు.  కానీ ఎందరినో ఆకర్షించింది.  సాహసులెందరో అజ్ఞాతంగా పని చేసారు.  ఇంకా చేస్తూనే వున్నారు.  అదో భావజాలం.  స్వప్నం.  అలాంటి స్వాప్నికులెందరో అమరులైయ్యారు.  ఆ రోజుల్లో ఎందరో యువత ఇళ్ళలోంచీ అదృశ్యం అయ్యారు. తల్లీ తండ్రీ కళ్ళు తెరుచుకునే సరికే ఏ ఎంకౌంటర్లోనో కళ్ళు మూసారు. కొందరు ఆనవాలు లేకుండా పోయారు.  వాళ్ళు విప్లవ భావాల వైపు మళ్ళారన్న సంగతే తెలియని తలీ తండ్రీ విస్తుపోయలా చేసారు.  అలాంటి ఒక తల్లే ఈ హజార్ చౌరాసీ కీ మా.  'మహా శ్వేతా దేవి ' రచన ఆధారంగా గోవింద్ నిహలానీ తీసిన ఈ సినిమా తో జయా బాధురీ, తన  నట జీవితపు రెండో ఇన్నింగ్స్ ని మొదలు పెట్టడం జరిగింది.

బంగారం లాంటి భవిష్యత్తున్న కొడుకు. కాలేజీ లో గోల్డ్ మెడలిస్ట్. కుటుంబం లో అందరికన్నా భిన్నుడు.  తల్లికి అతనంటే ప్రాణం. తల్లి సుజాత చటర్జీ బాంకు ఉద్యోగిని. సౌమ్య వాది. భర్తనీ పిల్లల్నీ, చూసుకుంటూ, ఉద్యోగం తో పాటూ సంసార భాద్యతలు చూసుకుంటూ, పెద్దగా ఎదిరంచే తత్వం లేని మనిషి. అవమానాల్ని సాధారణ భారతీయ గృహిణి లా సహిస్తూ, చిర్నవ్వుతో 'పోనిద్దూ..' అనుకునే మనిషి.  'అమ్మా ! ఇవన్నీ ఎలా సహిస్తావు ?' అని వయసొచ్చిన కొడుకు ప్రతీక్ అడిగితే, స్నేహితురాలిలా.. 'ఏమో! చిన్నపుడు అలానే పెరిగాను. అదే అలవాటయిపోయింది, కొత్తలో బధ కలిగేది. ఇపుడు ఏమీ అనిపించదు !' అంటుంది సహజంగా.  ప్రతీక్, సుజాత కొడుకు. అమ్మ కూచి. ఇంట్లో మిగిల్న కుటుంబ సభ్యుల కన్నా, తండ్రికన్నా, అక్క చెల్లెళ్ళ కన్నా, అన్న కన్నా ఎక్కువగా 'మనసున్న మనిషి ' లా తల్లిని ప్రేమిస్తూ, గౌరవిస్తూ, స్నేహితుడిలా వుంటాడు.  అయితే ప్రతీక్ కాలేజీ లో కొందరు మితృలతో కలిసి సామ్యవాద భావజాలం వైపు నడవడం, అతని తండ్రికి నచ్చదు. అసలు మరిగే సూర్యుని లా వున్న ప్రతీక్ వ్యక్తిత్వం, అవినీతిపరుడైన తండ్రికి సహించదు. అందుకే తండ్రికీ, కొడుక్కీ దూరం.   'నిజం ' మాట్లాడతాడని, ఇంట్లో ఎవరికీ పడదు.


అయినా ప్రతీక్ చాలా మృదు స్వభావి. ఎప్పుడూ వికసించిన కమలం లా, నవ్వు మొహం విచ్చుకునే వుంటుంది. ప్రతి విషయాన్నీ, చాలా సరదాగా చెప్తూ, తల్లినీ, వొదిన్నీ నవ్విస్తూ ఉండడం, మామూలు ఆ వయసు కుర్రాళ్ళలా ఇంట్లో ఒక చలాకీ వాతావరణాన్ని సృష్టించడం, తల్లి తో అతని ప్రేమాస్పదమైన కమ్మ్యూనికేషన్, వాళ్ళిద్దరి మధ్యా ఉన్న అందమైన బంధాన్ని తెలియజేస్తూ ఉంటుంది.  

అయితే ఒక రాత్రి సుజాత కి ఎందుకో ఇబ్బందిగా అనిపించి లేచి, నొప్పికి మందు వేస్కుని మళ్ళీ మంచం మీదకి చేరేసరికీ, ఫోన్ మోగుతున్న శబ్దం వినిపిస్తుంది.  ఫోన్ తీసేసరికీ - ఒక నిర్లక్షమైన గొంతు - 'ఎవరు మీరు ? ఇంట్లో మొగవాళ్ళెవరూ లేరా ? మీరు వెంటనే కామార్పకూర్ రండి, ప్రతీక్ ని గుర్తించాలి !' అని చెప్పి సుజాత జీవితాన్నే మార్చేసే దుర్వార్త ని చెప్తుంది.   ప్రతీక్ ఒక నక్సలైట్ అని, అతని శవాన్ని గుర్తించడానికి రమ్మంటున్నారనీ, ఆ పిచ్చితల్లికి చాలా సేపటి వరకూ అర్ఢమే కాదు.

ప్రతీక్ శవాన్ని గుర్తించడానికి కుటుంబ సభ్యులెవరూ రానే రారు. ఒక నక్సలైట్ తమ సోదరుడని, కొడుకని చెప్పుకోవడానికే సిగ్గు పడతారు. ప్రతీక్ ని గుర్తించడానికి వెళ్ళిన తల్లి కి - మార్చురీ లో ఒక నెంబర్ ఇస్తారు. అదే హజార్ చౌరాసీ - 1084.  అత్యంత దారుణమైన బాధ అనుభవించి చనిపోయిన అయిదు మృతదేహాల కాళ్ళకున్న నెంబర్ టాగ్ ల ద్వారా, తల్లి తన 1084 నెంబరు మృతదేహాన్ని సమీపిస్తుంది. తోటీ వాడు 'తల మాత్రం మూసేసి - మొహం ఏమి చూస్తారమ్మా ? అంటూ, తెల్లని బట్టని చాతీ దాకా తీసి చూపిస్తాడు. చాతీ మీద రెండు తుపాకీ గుళ్ళ గాయాలు చూసి, సుజాత నిశ్చేష్ట అవుతుంది.  మొహం గుర్తుపట్టలేంతంగా దెబ్బ తింది గాబట్టి, శరీరం పై ఇంకో ఆనవాలు అధారంగా ప్రతీక్ ని గుర్తిస్తుంది.  అంతే ! అతటితో ప్రతీక్ సమాప్తం అవుతాడు.  అతని మృతదేహాన్ని ఇవ్వరు పోలీసులు.  కనీసం దహన సంస్కారం కూడా తల్లిని చేసుకోనివ్వరు. మరుసటి రోజు పేపర్లో ప్రతీక్ చటర్జీ పేరు తప్ప చనిపోయిన మిగిల్న నలుగురి పేర్లూ ప్రచురిస్తారు. ప్రతీక్ తండ్రి ఆ వార్త బయటకి రాకుండా లంచాలిచ్చి ఆపుతాడన్నమాట. 

ఎందుకంటే, ప్రతీక్ నక్సలైట్ అంటే, ఇంటికి పరువు తక్కువ. ప్రతీక్ గదిని పోలీసులు సోదా చేసి, తన సాహిత్యాన్నీ, డైరీనీ, బానర్లనీ అన్నిట్నీ తీసుకుపోతారు.  డైరీ లో కవితలుంటాయి. అసలు ప్రతీక్ అంత చక్కని కవితలు రాస్తాడనే తెలియని సుజాత, డైరీ అన్నా ఇవ్వమని అడుగుతుంది. పోలీసు ఇన్స్పెక్టర్ నిష్కర్ష గా (నిర్దయ గా) అన్నిట్నీ తీస్కెళిపోతాడు.  ప్రతీక్  మృతి, సుజాత ని చాలా గాయపరుస్తుంది. ప్రతీక్, తన కి ప్రాణమైన బిడ్డ.. చనిపోయే ముందు వరకూ ఎలాంటి జీవితం గడిపాడు ? ఎలాంటి ఆలోచనలు చేసాడు ? ఎలా చనిపోయాడు ? తను ఎవరెవరితో తిరిగే వాడు ? .. ఎందుకలా చేసాడు ? ఇలా చాలా ప్రశ్నలు !  కోడలి ద్వారా ఒక సారి మాటల్లో ప్రతీక్ కి నందిని అనే స్నేహితురాలున్నట్టు తెలుసుకుంటుంది తను.  నందిని ని చూడాలని అనుకుంటుంది కూడా.    ఒక రకంగా తనకి అత్యంత సన్నిహితుడూ, స్నేహితుడూ అయిన కొడుకు 'నిజ జీవితాన్ని  గురించి తనకు తెలిసింది ఎంత తక్కువో తెలిసి నివ్వెరపోతుంది.   నొచ్చుకుంటుంది. ప్రతీక్ యాద్ధృచ్చికం గా తన పుట్టిన రోజునే చంపబడతాడు.   ప్రతీక్ కి ఎలాంటి ప్రమాదం వుందో తెలీని తను ఆ రాత్రి తను బయటికి వెళ్ళకుండా ఆపగలిగి వుంటే తన కొడుకు బ్రతికి ఉండేవాడా అని మధనపడుతూ ఉంటుంది.

ఈ అతి సాధారణ గృహిణి, "హజార్ చౌరాసీ కీ మా" అయిన తరవాత, కొడుకు మృతి తో తల్లడిల్లిన తల్లితనం, ఆమె లో ఉదయింపజేసిన వేల ప్రశ్నల కి సమాధానం వెతుక్కుంటూ, కొడుకు మృతి కి దారితీసిన పరిస్థితులని ఆకళింపు చేసుకునేందుకు ప్రయత్నిస్తూ.. పరివర్తనం చెందుతూ వుంటుంది.  ఒక లాంటి షాక్ లో 'ఎవరికీ అక్కర్లేని ' తన కొడుకు ప్రతీక్ తిరిగిన లోగిళ్ళూ, తను మరణించిన స్నేహితుడు సోమూ ఇల్లూ.. అన్నీ చూస్తుంది.  వర్గ 'హింస ' కు బలైన ప్రతీక్, అతని స్నేహితుల కుటుంబాలు చిదరవందర కావడం, అన్ని చూస్తూ, తెలుసుకుంటూ, కొన్నాళ్ళకు నందిని ని కలిసి, ఆమె లో ప్రతీక్ వెలుగుల్ని చూస్తుంది.  ప్రతీక్ కలలూ, అతని ఆశయాలూ, పోరాటం, అన్నీ తెలుసుకుంటూ, పోలీసుల కౄరత ని సమీపం నుంచీ చూసింది కావడం తో ఒక లాంటి మెచ్యూరిటీ... గతం లో నే జీవించకుండా, భవిష్యత్తు వైపు నడవడం, అలా, ప్రతీక్ ఆశయాల కోసం, తన చేతనైన సాయం చేస్తూ, ఆ మార్గాన ప్రతీక్ కు మరింత చేరువవుతూ, వ్యార్ధక్యం లో తన జీవిత సార్ధకతని తెలుసుకుంటుంది.

రిటైర్ అయ్యాక, హ్యూమన్ రైట్స్ సెంటర్ లో పని చేస్తూ, ప్రతీక్ స్నేహితులతో కలుస్తూ, జీవితాన్ని ఒక అర్ధవంతమైన రీతిలో గడుపుతూంటుంది. ఎప్పుడూ ఎవర్నీ దేనినీ ప్రశ్నించని మనిషి - ముసలి వయసులో, ప్రతీక్ స్నేహితుడ్ని దుండగులు పట్టపగలు రోడ్ మీద కాల్చి చంపడం చూసి, రియాక్టయి, వయసునీ, అనారోగ్యాన్నీ లెక్క చెయ్యకుండా, వాళ్ళలో ఒకడ్ని అత్యంత సాహసోపేతంగా పట్టుకుంటుంది.  తను 'హజార్ చౌరాసీ కీ మా ' ! ప్రతీక్ తల్లి.  తను ఒక ఎక్సాంపుల్.

సినిమా లో 'సీమా బిస్వాస్' ది అత్భుత నటన. అత్యంత బీదరాలు. ప్రతీక్ స్నేహితుడు సోమూ తల్లి. ఆమె కళ్ళ ముందే స్నేహితులందరి హత్యా జరుగుతుంది. నందితా దాస్ ది తొలి పరిచయం.  పాటలు ఏమీ లేవు. కేవలం గుండెల్ని తాకే ఒక మధుర ఆలాపన. 70 ల లో కలకత్తా జీవితం, రిక్షాలూ, గలీలూ, బెంగాలీ ల ఫాషన్, సమిష్ఠి  కుటుంబ జీవితం, అన్నీ కాలం తో పాటూ మనల్ని వెనక్కి తీసికెళిపోతాయి.   సుజాత అంతఃసంఘర్షణ, ప్రతీక్ అప్ప చెల్లెళ్ళ, ఇతర కుటుంబ సభ్యుల 'స్వార్ధ చింతన ', ఒక లాంటి 'భోళా తనం ',  ఇన్ని వ్యతిరేక ధ్రువాల మధ్య - అమ్మా ! మీ కోసమే ప్రతీక్ ఇల్లు విడిచి వెళ్ళలేద'ని నందిని చెప్పిన నిజం,  ప్రేక్షకుల్ని కదిలిస్తాయి. 

స్పందించే మనసున్న ప్రతి మనిషినీ తాకే చిన్న కధ ఈ 'హజార్ చౌరాసీ కీ మా !'  చాలా నింపాదిగా చూస్తే గానీ పట్టుబడదు. ప్రస్తుతానికీ, గతానికీ మధ్య అల్లిబిల్లి గా సాగే కధనం - నటీ నటుల అత్భుత ప్రదర్శన, నక్సల్ వాదుల కుటుంబాల జీవితాల్లో కష్టాలని కళ్ళముందు పెడతాయి.  తన కొడుకు నక్సలైట్ అయినందుకు ఆ తల్లి గర్వపడదూ, చింతించదూ.. కేవలం అర్ధం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది.  అర్ధం చేసుకున్నాకా, కొడుకు ఆశయాల కోసం తనదైన దారిలో ముందుకు నడుస్తుంది. అంతే. ఇంత నిష్పాక్షికత సాధించడానికి ఎంత పరిణత కావాలి ? అది ఒక 'బిడ్డ ని  ఓ స్నేహితురాలి లా, మనస్పూర్థి గా' తెలుసుకున్న'  తల్లికే సాధ్యం.  తప్పకుండా చూడాల్సిన మంచి సినిమా. అందరికీ నచ్చకపోవచ్చు, కానీ నచ్చినవాళ్ళకి చాలా ఎక్కువ నచ్చుతుంది.





22/01/2013

'ఖేలేంగే హం జీ జాన్ సే'

అరవై ఏళ్ళకి పైగా మనం నిస్సిగ్గుగా అనుభవిస్తున్న స్వాతంత్ర్యం ఎందరో అమర వీరుల త్యాగాల ఫలితం.  విషయానికొస్తే ,  చరిత్ర లో కొన్ని టర్నింగ్ పాయింట్స్ (చారిత్రాత్మక సంఘటనలు ?!) వుంటాయి.  మొదటి స్వాతంత్ర్య పోరాటం, ఉప్పు సత్యాగ్రహం, జలియన్ వాలా బాగ్ ఉదంతం, భగత్ సింగ్ ఉరితీత వగైరా.  ఇవన్నీ భయంతో అన్నిట్నీ సహిస్తూ పోయే అతి సామాన్య సామాజికుడ్ని కూడా తాకుతాయి. చలింపచేస్తాయి.  అలాంటి కదలికలు అనాదిగా జరుగుతూ ఒక్కసారిగా పెక్కటిల్లి, తీవ్ర నిరసనా జ్వాలలతో దేశ స్వాతంత్ర్య పోరాటం ఊపందుకుంది.  తీవ్ర అణిచివేత కు వ్యతిరేకంగా అహింసా వాదంతో దెబ్బలు తిని, వ్యధలకు గురయ్యి, త్యాగాలు చేసి, జీవితం లో అన్నిట్నీ, ఆఖరికి జీవితాన్నే కోల్పోయిన అనేక మంది త్యాగ ధనులు - మనకిపుడు కేవలం గత చరిత్ర లో ఒక భాగం.  ఇలాంటి ఎన్నో పోరాటాలు ఇప్పటి తరానికి కనీసం తెలియదు (ముఖ్య సంఘటనలైతే తప్ప), తెలిసినా అసలు తలచుకోం . గుర్తుంచుకోం , గౌరవించం .  ఇదే మనం అనుభవిస్తున్న స్వేచ్చ.

అలాంటి ఒక చరిత్ర సృష్టించిన, 'మైండ్ బ్లోయింగ్', 'ఎమేజింగ్', 'స్మాషింగ్' స్టోరీ (.... oops రియల్ స్టోరీ యార్)  చెప్తాడు అశుతోష్ గోవారికర్. లగాన్, జోధా అక్బర్ లాంటి సినిమాలతో పాత ప్రపంచాన్ని మళ్ళీ సృష్టించి, అందులో ఒక కధ గుచ్చి, మనల్ని ఆ కధలో విహరింపచేసాడు ఆశుతోష్. అలా అక్బరు కాలం నాటి కోటల్నీ, ఫైటుల్నీ, తనిష్క్ యేంటిక్ నగల్నీ,  ఐష్వర్యా రాయ్ అందాన్నీ, ఆమీర్ ఖాన్ నమ్మకాన్నీ, పోరాటాన్నీ, షూటింగ్ చూడ్డానికొచ్చిన గ్రామస్థులతో, ప్రేక్షకుల వేషం కట్టించేసి, క్రికెట్టాడేసిన తెలివితేటల్ని ఈ సారి కొంచెం పెద్ద, బాధాకరమైన, బహుశా ఇండియాలో అందరూ మర్చిపోయిన 'చిట్టగాంగ్ విప్లవాన్ని' నేపధ్యంగా తీసికుని 'ఖేలేంగే హం జీ జాన్ సే' అనే గుర్తుంచుకోదగ్గ సినిమా తీసాడు. సినిమాలో అభిషేక్, దీపికా లాంటి స్టార్లూ, లిటిల్ స్టార్లూ వున్నారు. ఈ లిటిల్ స్టార్లే సూపర్ స్టార్లు.  అసలు కధే ఈ వయసులో అతి చిన్న విప్లవ పోరాట వీరుల గురించి.  చిట్టగాంగ్ (ఇపుడు బంగ్లాదేశ్ లో వుంది) లో రాజుకున్న క్రాంతి, విప్లవం గురించి.  చిట్టగాంగ్ లో ఒక బ్రిటీష్ కంటోన్మెంట్ లో ఈ చారిత్రాత్మక విప్లవానికి తెర తీస్తాడు సూర్య సేన్/ మాస్టర్ దా  (అభిషేక్) అనే స్కూల్ మాస్టర్.

సూర్య దా ఒక స్వాతంత్ర్య పోరాట వీరుడు. విప్లవంతో, అతివాదంతో బ్రిటీష్ దాశ్య శృంఖలాలనుంచీ భారత దేశాన్ని విడిపించాలనుకునే దృష్టి వున్నవాడు. అలా అతనికి ఈ విప్లవంలో తోడు గా నిలిచే ఇతర యోధులు - గణేష్ ఘోష్, లోకనాధ్ బాల్, అంబికా చక్రవర్తి, నిర్మల్ సేన్, అనంత సింగ్ ల తో పాటూ ప్రీతిలతా వడ్డేదార్, కల్పనా దత్తా (దీపికా పడుకోన్).    ఇంకా వాళ్ళతో పాటూ ఓ 16 మంది టీనేజ్ పిల్లలు. వీళ్ళలంతా కలిసి ఒకే రోజు,(18 ఏప్రిల్ 1930)  చిట్టగాంగ్ లో తెల్ల దొరల గుండె కాయ లాంటి పోలీసుల ఆయుధాగారం, కంటోన్మెంట్, టెలి గ్రాఫ్ లైన్లు, రైల్వే లైన్ లపై మెరుపు దాడి చేస్తారు. అయితే ఆయుధాగారం దాడిలో ఆయుధాలు దొరుకుతాయి గానీ తూటాలు దొరకవు. దాంతో ఆ ఆయుధాలన్నిట్నీ తగలపెట్టేస్తారు.   టెలిఫోన్ లైన్లనూ, రైల్వే లైన్లనూ ధ్వంసం చేస్తారు. భారత పతాకాన్ని ఎగరేస్తారు.   దాడి తర్వాత చిట్టగాంగ్ వొదిలి పర్వత శ్రేణి వైపు కదులుతారు. అయితే, దాడి విజయవంతం కావడంతో కుపితులైన బ్రిటీష్ దళాలు, బలగాల్ని సమీకరించుకుని, మానవత్వాన్ని మరిచి, మెషీన్ గన్ లతో విప్లవకారులపై తెగబడతారు. ఈ బ్రిటీష్ దాడి లో మొట్ట మొదటిగా 'టేగ్రా' అనే ముద్దుపేరున్న హరగోపాల్ మరణిస్తాడు.  అతని తో పాటూ మరో 12 మంది మరణించగా అంబికా చక్రవర్తి తీవ్రంగా గాయపడతాడు. మిగిల్న విప్లవకారులు అడవుల్లో జట్లు గా విడిపోయి పారిపోతారు.  అయితే వాళ్ళందరూ వాళ్ళకున్న కొద్ది తూటాల్తో ఎన్నాళ్ళని పారిపోగలరు ? నిరంకుశత్వం, అణిచివేత పరమావధి గా వున్న పోలీసు బలగాలు ఎప్పటికప్పుడు ఈ జట్ల పై విడి విడిగా దాడులు చేస్తుంటాయి. వాళ్ళూ ప్రాణమున్నంత వరకూ వీరోచితంగా పోరాడుతూ, హేమా హేమీల్లాంటి అధికారుల్ని హతమారుస్తూ ఉంటారు.

ఆఖర్న 'సూర్య దా' చెల్లెలి ఇంట్లో తలదాచుకునుండగా, అక్కడ కూడా దాడి చేస్తుంది పోలీసు దళం. అయితె ఈ దాడిలో నిర్మల్ సేన్ అనే విప్లవకారుడు తీవ్ర గాయాలతో ఉన్నా కూడా పోరాడుతొ, సూర్య దా ని పారిపోయేందుకు ఒప్పిస్తాడు. సూర్య సేన్, ప్రీతిలతా ఈ దాడి నుంచీ తప్పించుకుంటారు. కానీ నిర్మల్ సేన్ చనిపోతాడు. అతని ప్రియురాలు అయిన ప్రీతిలత కి యూరోపియన్ క్లం దాడి బాధ్యతలు అప్పచెప్తూ ప్రాణాలు విడిస్తాడు నిర్మల్.  ప్రీతిలత నాయకత్వాన ఒక దళం చిట్టగాంగ్ లో యూరోపియన్ క్లబ్ పై విరుచుకుపడి చాలా మంది బ్రిటీష్ ఆఫీసర్లను చంపేస్తుంది.  తప్పించుకున్న వాళ్ళు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పారిపోతారు.

ఈ విప్లవం, అప్పటి దాకా నిరుత్సాహంతో స్తబ్దుగా ఉన్న స్వాతంత్ర్య కాంక్ష ను ప్రజలలో ఒక్క సారిగా కుదిపి ఉత్సాహ పరుస్తుంది.  అంతవరకూ సూర్యసేన్ దళం చేసిన సాహస కార్యాలూ, ఆ దళం లో 14 యేళ్ళ పిల్లలు వుండడం, ఆడవాళ్ళుండడం, వాళ్ళ నిబద్ధతా, సాహసం, అందర్నీ ఉత్తేజితుల్ని చేస్తాయి.  అదే స్థాయిలో ఈ ఉద్యమం, బ్రిటీష్ వాళ్ళకి త్వరలోనే తాము ఈ దేశాన్ని వదలల్సి వస్తుందని సంకేతం లా కనిపిస్తుంది. దీన్ని తుడిచిపెట్టేయకపోతే, ఆ రోజు త్వరలోనే వస్తుందేమో అని భయం, తమ ఆఫీసర్లని చంపేరన్న కక్ష, వీటన్నిటి తో విప్లవాన్ని ఉక్కుపాదంతో అణిచేస్తూ ఎక్కడికక్కడ అరెస్టులూ జరుగుతుంటాయి. ఆకరికి 1933 లో సూర్యదా కూడా పట్టుబడతాడు.  అప్పటికే విప్లవకారుల్లో చాలా మందిని ఎంకౌంటర్లలో తుదముట్టిస్తారు.  మరి కొందరు, పోలీసుల చేతుల్లో పడకుండా వీరోచితంగా ఆత్మహత్యలు చేసుకుంటారు.  కోర్ట్ లో జడ్జ్ ని సూర్యసేన్ ఎదిరిస్తాడు. అతనికి ఉరిసిక్ష విధిస్తారు. మిగిల్న వాళ్ళకి, కల్పనా దత్తా తొ సహా, జీవిత ఖైదు విధిస్తారు.

ఉరి కి ముందు సూర్యసేన్ ని చిత్ర వధ చేస్తారు. అతని మోచేతులూ, మోకాళ్ళనీ, పళ్ళనీ సుత్తి తో పగలగొట్టేస్తారు. గోళ్ళన్నిట్నీ లాగేస్తారు. స్పృహ లో లేని అతని దేహాన్ని ఉరి వేస్తారు. స్పృహ లేని సూర్యదా జైలు మీదున్న జెండా కర్ర మీద భారత పతాకాన్ని దర్శిస్తాడు. అతని మరణం తరవాత సూర్యసేన్ మృతదేహాని నిజంగా ఒక బోను లాంటి దాంట్లో పెట్టి సముద్రం లో పడేశారంట తెల్ల దొరలు. అతని కిరాతక హత్య తరవాత హరిపాదుడనే ఒక యువ  విప్లవకారుడు ఈ అణిచివేత కు నాయకత్వం వహించిన చిట్టగాంగ్ ఎస్.పీ. ని దగ్గరనించీ షూట్ చేసి చంపేస్తాడు.

ఈ సినిమా మొదటి భాగం నెమ్మదిగా సాగినా, రెండో భాగం ఎంతో స్పష్టత తో దూసుకుపోతుంది. క్రెడిట్స్ లో నిజ జీవిత హీరోలను చూపిస్తున్నపుడు చాలా బాధ కలుగుతుంది.  ఇదే కధని చిట్టగాంగ్ పేరుతో మళ్ళా తీసారు. దీన్లో మనోజ్ బాజ్పేయి సూర్య సేన్ గా నటించాట్ట.  'ఖెలేంగే జీ జాన్ సే' చాలా బాగా తీసారనిపించింది. ఆనాటి ట్రెయిన్లూ, తుపాకీలూ, గ్రామాలూ, అన్నీ చాలా మెటిక్యులస్ గా తీసారు.  పైగా దాడుల్ని చిత్రీకరిస్తున్నపుడు మరణిస్తున్న తమ తోటి వాళ్ళ ని చూసుకుంటూ, బాధ తో మూగబోతూనే, విప్లవం కోసం తుపాకుల తో పరుగుత్లు తీసే విప్లవకారుల ఎమోషన్లు అత్భుతం.  వీళ్ళలో 16 మంది చిన్న పిల్లలూ చాలా బాగా నటించారు. వీళ్ళలో చాలా మంది చనిపోతారు.  మిగిలిన వాళ్ళకి జీవిత ఖైదు విధించినపుడు, (అన్ని చావుల్ని చూసిన తరవాత కలిగే బెంగతో)  వాళ్ళు కోర్టు లో ఏడుస్తుంటే, వాళ్ళ తల్లిదండృలు గాలరీ నుంచీ, "ఏడవకండి. మిమ్మల్ని చూస్తూంటే చాలా గర్వం గా ఉంది"... అని అనడం కన్నీరు తెప్పిస్తుంది.

సినిమా బావుంది. ఇంత నిబద్ధత తో మంచి సబ్జెక్ట్ తో సినిమా తీసినపుడు కనీసం మెచ్చుకోవడానికైనా ఈ సినిమా చూడాలి.  దురదృష్టవశాత్తూ ఈ సినిమా పెద్దగా ఆళ్ళేదు.  అసలు నేనే ఈ సినిమా పేరు చూసి ఏదో ఆటల సినిమా ఏమో అనుకున్నాను. చూసాక చాలా నచ్చింది. కొంత సేపటి దాకా గుండెని మెలిపెట్టేసింది. ఇంకోసారి తీరిగ్గ డీటైల్స్ కోసమన్నా చూడాలనిపించింది. అదీ సంగతి.