Pages

28/09/2010

నో కా బ్లా స Season 2

'నో కా బ్లా స' సూపరు హిట్టు పోస్టు అయింది. ఎడారిలో ఒయాసిస్సులా - బీటలు వారిన భూమి మీద లేలేత వాన చినుకుల్లా, ఆకలితో అలమటిస్తున్న పేదవాడికి పంచభక్ష్య పరమాన్నం లా (అ..క్ష..రా..లా..) 40 కామెంట్లు ఇప్పటివరకూ ! గడ్డిపూలు కళకళ్ళాడాయి. అయితే, నేనింత దాకా రిప్లయి సమాధానం ఇవ్వనందుకు సభ్యులు క్షమించాలి. బుల్లెమ్మ కి కుంచెం అనీజీగా వుంటేనూ, రెండ్రోజులు ఇటు తొంగి చూళ్ళేదు. కానీ, ఆఫీసులో ఎపుడైనా కామెంట్లు వచ్చేయో లేదో చూడటం, ప్రచురించుకుని మూడొందల ముప్పయి నాలుగోసారి మురిసిపోవడం వగైరా బాగా జరిగాయి.

మొదటగా - వ్యాఖ్యానించిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. నేనస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. మొదటి వ్యాఖ్య భాస్కర రామిరెడ్డి గారికి చాలా వినమ్ర నమస్కారాలు. సత్యం వచించారు.

సభ్యత్వం కోసం చాలా మంది బ్లాగర్లు పోటీ పడ్డారని చెప్పడానికి పట్టలేనంత ఆనందిస్తున్నాను.

కానీ, నా నో.కా.బ్లా.స పోస్టు కే చాలా వ్యాఖ్యలు వచ్చినందుకు దీని 'వెరీ స్పిరిట్' కి అన్యాయం జరిగిందని కూడా పలువురు అభిప్రాయపడ్డారు.

నేనే, ఎవరి బ్లాగు లోనూ కామెంటనని కూడా చీవాట్లేసేరు.

నా బ్లాగు లోనే కామెంట్లకి సమాధానం ఇవ్వానని కూడా మిత్రులు తలంటారు.

శరత్ గారు పదవి ఇమ్మన్నారు.

పద్మ గారు 'కామెంట్లొస్తేనే బాధ ! రిప్లయి ఇవ్వాలి !' అని Absolute Truth వచించారు.

కొన్ని అర్ధం కాని అభిప్రాయాలు (ఆడవాళ్ళకి ఎక్కువ కామెంట్లు వస్తాయి-ఆకాశ రామన్న) వగైరాలు కూడా ఉన్నట్టు తెలుసుకున్నాను.

టెంప్లేట్ గురించిన సూచనలు స్వీకరించాను. పూర్తిగా అమలు చెయ్యడానికి కుస్తీ పట్టాలి వీలును బట్టీ.

మొత్తానికి అసలు మొదలంటూ పెట్టాను కాబట్టి, దీన్లో సభ్యత్వం కోరుకున్న వాళ్ళందిరికీ, విత్ డ్యూ వెరిఫికేషన్, ఫ్రీ సభ్యత్వం ఇచ్చేస్తున్నా. ఇచ్చేస్తున్నా. సభ్యత్వ రుసుము ఏమీ లేదు.

సుజాత గారి లాంటి సానపెట్టిన వజ్రాలకు (పాప్యులర్ బ్లాగర్లకు) గౌరవ సభ్యత్వం ఇద్దామనుకుంటున్నా. వీళ్ళ దగ్గర మనం ట్యూషన్ లో చేరొచ్చు. ఆస్పత్రిలో చేరి, బాగుపడి ఇంటికొచ్చేసే రోగుల్లాగా, మనం ఈ సంఘంలో చేరి, అధ్వాన్నత నుంచి, ధన్యత కి ప్రయాణం చేసి, ఇంకా, బ్లాగ్ లోకంలో పైకి, పైపైకి చేరి, బోల్డన్ని పేరు ప్రఖ్యాతులు గడించేద్దాం. కామెంట్లే ప్రమాణం కాదని కూడా ఒట్టేసుకుందాం. (ఓథ్ / OATH అన్నమాట) శరత్ గారి పదవి సంగతి కేబినెట్ తో చర్చించి నిర్ణయిస్తా. మితృలు బులుసు సుబ్రమణ్యం గారు మాంచి పేరు (కాలే బ్లాస) సూచించారు. దీన్నీ కేబినెట్ కమిటీ కి పంపించా. చూద్దాం. (ఇంతకీ కాబినెట్టులో ఏమీ లేదు. ఖాళీ!) సరే ! ఇంక ఆపుతా !

నిజాయితీగా, నాకేం కార్యాచరణ గురించి ఐడియాలు లేవు. ఏదో సరదాకి టపాయించేను. అందరూ సరదాగా వ్యాఖ్యానించడం కూడా చాలా బాగా అనిపించింది. బుల్లెమ్మ ఫిట్ అయ్యాక, తప్పకుండా దీని గురించి కొంచెం సమయం, ఎనర్జీ, (శాయశక్తులా) ప్రయత్నిస్తాను.
నో.కా.బ్లా.స. కు సంఘీభావం తెలియచేసిన అందరు మితృలకూ, హృదయపూర్వక ధన్యవాదాలు.

24/09/2010

'నో కామెంట్ల' బ్లాగర్ల సంఘం

హలో ఎవ్రీబడీ ! బ్లాగుల్లో ఈ మధ్య ఎక్కువగా నడుస్తున్న ట్రెండ్ ని చూసి నాకూ ఓ పెద్దగా పనికిరాని ఆలోచన వచ్చింది.

ఈమధ్య బ్లాగర్లు జట్ట్లు జట్ట్లుగా, ఊర్ల వారీగా, ప్రాంతాల వారీగా, రక రకాల భావసారూప్యాల వారీగా,వృత్తుల వారీగా, వ్యాపకాల వారీగా, కామెంట్ల వారీగా బ్లాగర్ల సంఘాలు తెరవడం, (ఆ తరవాత ఏమి జరుగుతుందో నాకూ తెలీదు - with few exceptions though) - ఫాలో అప్ చేసుకోవడం వగైరా బాగా నడుస్తోంది కాబట్టి నేనూ ఒక బ్లాగర్ల సంఘం తెరుద్దామని మధ్యాన్నం పగటి కల తర్వాత నిశ్చయించుకున్నాను. అదే ఈ 'నో.కా.బ్లా.స.' అనగా - నో కామెంట్ల బ్లాగర్ల సంఘం. అంటే ఈ బ్లాగర్లు ఎక్కడా ఏమీ కామెంటరని కాదు. అస్సలు కామెంట్లు రాలని టపాలు రాయటమే వీళ్ళ ప్రత్యేకత ! అనగా కామెంటు పెట్టే అవకాశం తమ తమ బ్లాగుల్లో ఇచ్చినా కూడా పెద్దగా వ్యాఖ్యలు రానివాళ్ళు ఈ సంఘం లో వీజీ గా చేరొచ్చు.

బ్లాగు మొదలు పెట్టిన కొత్తలో ఉండే ఉత్సాహం ఇప్పుడు లేదు. ముఖ్యంగా, ఈరోజే ఎవరో బ్లాగులో చదివినట్టు - కొట్టు తెరిచిపెట్టి బేరాల కోసం ఎదురుచూసే టైపులో - పోస్టు రాయడం, ఆ వచ్చే ఒకటీ, అరా లేదా సున్నా వ్యాఖ్యల కోసం కళ్ళల్లో వొత్తులు వేసుకొని ఎదురు చూడటం - వగైరాలు నా ఒక్కరికే సొంతాలు కావేమో అనిపించింది.

ముఖ్యంగా నేను ఎంతో మనసు పెట్టి రాసిన కొన్ని టపాలకు (నా సొంత రేటింగు ప్రకారం - కొన్ని పుస్తక పరిచయాలు) రాలని చెప్పట్లు, కొన్నాళ్ళకి నాకే స్టుపిడ్ అనిపించే ఇంకో రకం టపాలకు భలే వినిపిస్తాయి. ఒక సారి సుజాత గారిని టిప్స్ కూడా అడిగినట్టు గుర్తు. కానీ సలహాలని కేష్ (వ్యాఖల / పాపులారిటీ రూపంలో) చేసుకోవడంలో ఘోరంగా విఫలం అయ్యాను.


కారణాలేమైనా కానీ, చాన్నాళ్ళ నుంచీ బ్లాగు రాసినా, అందులో సంగతి లేక సగం, ఇంకో సగం నాకు తెలీని కారణాల వల్లనూ, నా సేల్స్ గ్రాఫ్ (Comments) ఇన్ని సంవత్సరాలనుంచీ, దారిద్ర్య రేఖ కు (కనాకష్టం గా 3-4 వ్యాఖ్యలకు) దిగువునే ఉంది గాబట్టి, నానూ ఒక ఐ.కా.స పెడతాను.


చేరబోయే వాళ్ళు కామెంటు చెయ్యక్కర్లేదు. ఇంతకీ నా 'నో.కా.బ్లా.స.' / 'ఐ.కా.స' నియమాలు ఏమిటంటే, ఏమి రాసినా కామెంట్లు రాని బ్లాగర్లకు దీన్లో సభ్యత్వం ఇస్తాం. (ను!) అదేంటో, మనం పోస్టు పెట్టిన్రోజే, కూడల్లో ట్రాఫిక్ ఎక్కువయి, మనం అట్టడుక్కి తరవాత పేజీ నుంచీ బైటికీ - అయిపోయి బహుసా కామెంట్లు రావట్లేదు అనుకునే వాళ్ళకు కూడా సాదర ఆహ్వానం.

ఇతరుల దృష్టి లో పడాలని ఎంతగా ప్రయత్నించినా, కొన్ని రకాల వ్యక్తిగత, వృత్తి పరమైన కారణాల మూలంగా బ్లాగ్లోకంలో ఒంటరి గా ఫీలయిన వాళ్ళకు గౌరవ సభ్యత్వం అందచేస్తాము (ను!). సెక్స్, రాజకీయాలు, కుట్రలు, తవిక, గాసిప్, వార్తలూ, సినీమా, మతం - ఇలా జనాల్ని ఆకర్షించే అత్భుత విషయాల మీద అనర్గళంగా రాసే ప్రతిభ లేని వాళ్ళకు ప్రాముఖ్యత ఇవ్వొచ్చు. ఈ సంఘం లో ఎవరు & ఎందరు చేరబోతున్నారో చూసి, దానిబట్టి మిగతా కార్యాచరణ అంటే మీటింగులూ వగైరా ప్లాన్ చెయ్యబడుతుంది.

ఈ టపా చదివి విచిత్రంగా పెట్టిన మీ మొహాల మీదుగా జూం చేసిన క్లోసప్ షాట్ మీద భయంకరమైన రాంసే బ్రదర్స్ తరహా నేపధ్య సంగీతంతో -బ్రేక్.


----


-------------- {మళ్ళీ కలుద్దామా.. ప్లీజ్ ? }

22/09/2010

తప్పక చదవండి - విజయా వారి 'మాయా బజార్'


మాయాబజార్ - అశేష తెలుగు సినీ అభిమానులకు కొంగుబంగారం. వీళ్ళూ, వాళ్ళూ, పెద్దలూ, బడుగులూ, పిల్లలూ, పిడుగులూ అని లేదు. ఎవర్ని కదిలించినా మాయాబజార్ వాళ్ళ అభిమాన చిత్ర రాజం అని చెప్పక తప్పరు. ఎన్నో సన్నివేశాలూ, మనసుకు హత్తుకుపోయే సంభాషణలూ, మన బాల్య జ్ఞాపకాలతో పెనవేసుకుపోయిన అబ్బురపరిచే నృత్య సగీత మాయా విశేషాలు.

నేను స్కూల్లో ఉన్నపుడు చూసాను, సినిమాలో రాక్షసుల ఎటెండెన్సు తీసుకోవడం. 'పేర్ల పట్టిక' తీసి చిన్నమయ వాళ్ళ హాజరీ తీసుకోవడం. బాకా ఊదగానే funny రాక్షసుల ఫాలిన్ కావడం (వరుసలో నించోడం).
చిన్నమయ పేరు పేరునా పిలుస్తాడు.

''దుంధుభీ''
'అయ్యా !' - (ఎస్స్ సార్)

''ధుంధువా ''
''హై గురూ ''

'ఉగ్రా - పగ్రా - గగ్గోలకా - గంద్రగోళకా' - అందరూ పలుకుతారు 'వై గురొ' , 'జియా' - అంటూ !.. ఆఖర్ని 'లబూ జంబూ - అని రెండుసారులు పిలిస్తే గానీ రారు ఆవలించుకుంటూ ఈ లంబూ జంబూ !


'బాగా చౌవుకున్నారో మీకు వాక్శుద్ధి చేస్తాను. లేదా ఘటోత్కచుల వారు వచ్చి మీకు దేహ శుద్ధి చేస్తారు' - అంటాడు చిన్నమయ ! ఈ సన్నివేశమనే కాదు.. వివాహ భోజనంబు నుంచి, లాహిరి లాహిరి దాకా, మధురమైన నేపధ్య గానాలు - (నేను ఇప్పటికీ మా బుల్లెమ్మ అన్నం తినకపోతే అటు తంతాం, ఇటు తంతాం తంతాం తంతాం తంతాం అంటే ఏమర్ధం అవుతుందో భలే నవ్వుతుంది) - ఎన్నని నెమరు వేసుకోగలం? అన్నీ పసందైనవే !

ఈ డైలాగులు - ఈ సినిమా సృజించిన బోల్డన్ని కొత్త తెలుగు పదాలు - ప్రస్తుతం మన పత్రికల వాళ్ళు ఎక్కువగా ఎత్తుకుపోయినా, చాలా మటుకూ మన జీవితాల్లోకీ 'పరవేశించాయి'.

ఉదాహరణ కి - 'అసమదీయులు', 'తసమదీయులు', 'వీర తాడు' - మొదలయినవి.


ఈ సినిమాని చదివితే ఎలా వుంటుందో అని అవిడియా తట్టినట్టుంది ! 2007 లో మాయాబజార్ స్వర్ణోత్సవ సంవత్సరం సందర్భంగా రావికొండలరావు రచించగా ఆర్కే బుక్స్ వారు అచ్చొత్తారు. వెల : నూర్రూపాయలు. విశాలాంధ్రా లో దొరుకుతాయి. చాలా పాత న్యూస్ ! బ్లాగర్లు అంటే చాలోటి మంది పుస్తకప్రియులు కాబట్టి, అందునా మాయాబజార్ కున్న అపారమైన జనాకర్షణా సామర్ధ్యం తెలిసిందే కాబట్టి, పుస్తకం (Subject) గురించి పెద్దగా పరిచయం చెయ్యక్కర్లేదు.


మాయాబజార్ గురించి, చాల సమాచారం అందుబాటు లో ఉంది. ముఖ్యంగా కలర్ మాయాబజార్ విడుదల కు ముందు ప్రచార సాధనాల్లో హోరెత్తిన సమాచారం ఇంకా పచ్చిగానే వుంది. ఒక 'చందమామ' లా - 'మాయాబజార్' - ఓల్డ్ వైన్ లా పాతబడే కొద్దీ రుచి గా, వయసు పెరిగిన కొద్దీ గ్లామరస్ గా, క్రేజ్ పెంచుకుంటూ వస్తూంది.

కాబట్టి - ఈ పుస్తకం లో ప్రస్తావించదగిన అంశాల గురించి టూకీ గా :


సినిమాని నవల రూపంగా చదవడం కొత్త పద్ధతి కాపోయినా, ఇదో కొత్త (శాస్త్రీయమైన) అనుభవం. ముందుమాట నాటకీయంగా లేకుండా చాలా ఇంఫర్మేటివ్ గా, సౌకర్యవంతంగా మొదలయింది. సినిమా గురించిన సమాచారంలో - ఈ కధను ఆధారంగా చేసుకుని వివిధ భాషల్లో, మూకీల కాలంలో తయారయిన రక రకాల సినిమాల గురించి ప్రస్తావించారు.

సినిమా స్క్రీంప్లే - పాటలు, పద్యాలు - ఫోటోలు, స్కెచ్చులూ, తెర వెనుక కబుర్లూ - డీటైల్స్ తో సహా - రమ్యంగా అల్లారు. స్కెచ్చులు - సినిమా ని మన కళ్ళ ముందు వుంచడానికి దాని ప్రస్థానంలో ఉన్న రక రకాల నిచ్చెన మెట్లను - వాటి వెనుక దాగున్న నిబద్ధత, నిజాయితీ, శ్రమను, తెర మీదికిసన్నివేశాల్ని స్పాట్ లెస్ గా తీసుకు రావడానికి నటీ నటుల ప్రతిభ, సాంకేతిక నిపుణుల ప్రతిభ - ఇలా అన్నిట్ని, కళ్ళ ముందు వుంచుతాయి.


మూస పోసిన సినిమా ఫార్మ్యులా లు, సినిమా కీ, సమాజానికీ ఉన్న బాదరాయణ సంబధం, సినిమా ని చూసి సమాజం పాడవుతుందా, సమాజం సినిమాని చూసి తగలడిందా అంటూ సాగే జీడిపాకం చర్చలూ - పెరిగిన సాంకేతిక విలువల నేపధ్యంలో నీరసించిపోయిన కధ నీ - చూసి చూసి విసిగెత్తిన ఈ తరం కూడా కలర్ మాయా బజార్ ని ఆదరించడానికి సినిమా నిస్సందేహంగా లో వినోదాత్మకత, ఎప్పటికపుడు ఫ్రెష్ గా అనిపించే కధా ముఖ్య కారణం కావచ్చు.

ముగించే ముందు -

ఎస్.వీ.రంగారావు ఇంట్రడక్షన్ సీన్ - (ఇప్పటి దర్శకులైతే, మొదట చెప్పులో, బెల్టో దగ్గర్నుంచీ మొదలు పెట్టి - గాలీ, తుఫాను ల్లో సారు వారు పెట్టే అడుగు మీద కేమెరా ఫోకస్ చేసే వాళ్ళెమో) - సినిమాలో నేను ఇప్పటికీ చాలా ఇష్టపడే సీన్ - కధలో ట్విస్టు ఇక్కడే కదా మొదలయ్యేది !

ఆ పద్యం -

అష్ట దిక్కుంభి కుంభాగ్రాలపై మన
శుంభ ధ్వజము గ్రాల చూడవలదె !
గగన పాతాళ లోకాలలోని సమస్త
భూత కోటులు నాకె మ్రొక్కవలదె !
ఏ దేశమైన నా ఆదేశముద్ర పడి
సంభ్రమాశ్చర్యాల జరుగవలదే
'హై హై ఘటోత్కచ' 'జైహే ఘటోత్కచ'
అని దేవగురుడె కొండాడవలదె !

ఏనె ఈయుర్వినెల్ల శాసించవలదె
ఏనె ఐశ్వర్యమెల్ల సాధించవలదె
ఏనె మన బంధు హితులకు ఘనతలన్ని
కట్ట పెట్టిన ఘనకీర్తి కొట్టవలదె !

- ఏమో - నాకీ పద్యం 'మాయా బజార్' సినిమాకి కూడా సూట్ అయినట్టు అనిపిస్తుంది. ఇలాంటి పద్యాల (పాటలయితే పాపులరే !) కోసమైనా ఈ 'మాయా బజార్ ' సినిమా నవల్ని చదవాలి.

దీన్ని మాయా బజార్ అభిమానులయితే తప్పకుండా లైబ్రరీ లో వుంచుకోవాలి. ఎందుకంటే 'వివాహ భోజనంబు !' పాట పూర్వాపరాలు - దీని 'మెక్సికన్ మెర్రీ గో రౌండ్' మూలం కధా కమామీషూ, ఇతర రసవత్తర విషయాలూ తెల్సుకోవద్దూ ?! పాత పాత పోస్టర్లు చూడొద్దూ ? 'రాజ్యాలు పోతేనేం ? ప్రతాపాలెక్కడికి పోతాయ్?' అని నిష్ఠూరాలాడొద్దూ ? సున్నిత హాస్యం, లలితమైన దృశ్యం, మధుర సంభాషణలు - తరచి తరచి గుర్తు చేసుకోవడానికి ఇదో గ్రేట్ ఐడియా !

15/09/2010

వెటకారం డాట్ కాం

నిజానికి వెతుకుతున్న వీడియో దొరకలేదు. 'యెటకారం.కాం' అని ఒక చిన్న స్పూఫ్ తరహా వీడియో - ఏ టీవీలోనో గుర్తులేదు.. చూసి చాలా ఇష్టపడ్డాను. ప్రధానంగా తెలుగు టీవీ పాలిటి చెత్తెస్ట్ యాంకరు కం ప్రొడ్యూసర్ - ఓంకార్ మీద స్పూఫ్లు ప్రత్యేకంగా చెయ్యడం ఈ యెటకారం.కాం ఎజెండా. ఇక్కడ ఆ 'సృజనాత్మకత' ని మెచ్చుకోవాలి.

''ఆట'' అనే రియాలిటీ డాన్స్ ప్రోగ్రాం కి యాంకరింగ్ చేసి, అంతకు ముందు ఆదిత్య టీవీ లో మ్యూజిక్ వీ.జే గా అపార అనుభవం, టీనేజి అమ్మాయిలూ, అబ్బాయిల్లో భయంగరమా ఫాలోయింగూ సంపాయించిన ఓంకార్, తెలుగు టెలివిజన్ కోసం చాలా కార్యక్రమాలు స్వయంగా నిర్మించారు, యాంకరింగ్ చేసారు. ఇలాంటి టెలివిజన్ సెలిబ్రిటీ ని టార్గెట్ చెయ్యడం కొద్దో గొప్పో సాహసమే !

యెటకారం.కాం నిర్మించిన వీడియో/టీవీ బైట్ లలో ప్రముఖంగా చెప్పుకోదగ్గది, ఆట పై వెటకారంగా చేసిన వీడియో ! 'ఆట-n' అనే కార్యక్రమం, దాన్లో పాల్గొన్న డాన్సర్లూ, మెంటర్లూ, వాళ్ళ పనికిమాలిన పోట్లాటలూ, (మరి అది రియాలిటీ షో - రియల్ అనిపించేలా కార్యక్రమం మొదలు నుంచీ చివరి దాకా కావాలని ఒకర్నొకరు తిట్టుకు చచ్చే జడ్జీలూ, మెంటర్లూ !), వీటి మీద చాలా వెటకారం గా స్పూఫ్ ఈ స్పూఫ్ వీడియో సాగుతుంది. నిజానికి ఆ వీడియోని ఇక్కడ పెట్టుంటే, చాలా మందికి నచ్చి వుండేది.

ఈ వీడియో ఆ 'ఆట' ఆణిముత్యం కాదు గానీ, just, యెటకారం.కాం గొప్పదనాన్ని తెలియచెప్పడానికి పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో లో(/ల్లో ) ఓంకార్ లా నటించిన అబ్బాయికి నా బ్లాగ్ ముఖంగా అభినందనలు. తొణక కుండా, బెణకకుండా ఓంకార్ లాంటి వ్యక్తిని ఇమిటేట్ చెయ్యడం చాలా కష్టం అని నా ఫీలింగ్. ఆట మీద 'యెటకారం.కాం' వీడియో దొరికితే ఇంకో సారి పంచుకుంటాను.
ఈ రోజుకి మాత్రం ఈ వీడియో ని చూసి నవ్వుకోండి.

11/09/2010

విశాఖా హరిగానం !

ఈద్ కా చాంద్ చాలా బావుంటుంది అని ఒక ప్రధ ! ఈ రోజు ఆకాశం కేసి చూద్దామంటే, భయం. ఆకాశానికి కావాలని మొహం చాటెయ్యడం, నాలాంటి వినాయకుడి కధ నమ్మేవాళ్ళకి బాహా అలవాటు. అలా అని రోజూ చుక్కలు లెక్కెడతామని కాదు.. కానీ, ఈద్ రోజూ, కార్తీక పౌర్ణమికీ, శరన్నవరాతృలప్పుడూ, ఆకాశం, చందమామా, వాళ్ళ వైఫులూ అంటే, కుంచెం ఉబలాటం కలుగుతుంది.

కానీ ఈ సారి వాళ్ళకి ఈద్ ముబారక్ అయితే, మనకి 'డాం డమారుక్' అయింది. చందృణ్ణి చూడ్డానికి కుదరదు. మనసు లాగుతుంది. కాబట్టి కాలక్షేపానికి ఇంకో సోర్సు వెతుక్కోక తప్పదు. టీ.వీ. బోరు కాబట్టి, చక్కగా ఇంటర్నెట్ పై పడ్డాను.

ఎప్పుడో జయా టీవీ లో అనుకుంటాను శ్రీమతి విశాఖా హరిజి గారి హరికధ విన్నానేమో - ఒక్క ముక్ఖ అర్ధం కాకపోయినా, చాలా ఎంజాయ్ చేయటం మంచి అనుభూతి. అసలు తామిళ్ వాళ్ళ హరి కధ ఎంత బావుంటుందో ! అనిపించింది.

మన టెల్గూ హరికధ కొంచెం ఎక్కువ గా జనాల్లోకి చొచ్చుకుపోవడానికనుకుంటాను.. పిట్టకధలూ, గెంతులాటలూ - ఇలా క్లాసికల్ చిత్రాన్నుంచీ, పక్కకు జరిగినట్టు నా అనుమానం. హరికధా పితామహులు చాలా మంది ఎన్నో రకాలుగా ఈ కళ ను ప్రభవిల్లజేస్తూ ఉండొచ్చు గాక. కానీ విశాఖా హరి లాంటి 'కొత్త తరాల్ని ' కూడా కలుపుకు పోతూనే, స్వచ్చంగా, మోడ్రన్ గా, క్లాసికల్ గా, గౌరవనీయంగా, ఒక పాప్ కచేరీలా ఆడియన్స్ ను మంత్ర ముగ్ధుల్ని చేసేది మాత్రం కొందరే !ఈ వీడియో చూడండి.ఈ హరికధల్ని 'సంగీత ఉపన్యాసం అని అంటారంట. ఎప్పుడైనా టీవీలో కనపడితే మాత్రం, ఈ హరికధల్ని వినబుద్ధవుతుంది. ఈవిడకున్న అభిమాన గణంలో విశేషంగా బ్లాగర్లూ, యువతా వున్నారుట.

'విశాఖా హరి' కార్యక్రమాల గురించి, ప్రత్యేకంగా బ్లాగులూ నడుస్తున్నాయి. ఈ వీడియోల్లో ఎందరు స్పెల్ బౌండ్ అయిపోయి వింటున్నారో చూడండి ! కచేరీ ల కన్నా విశాఖా హరి ప్రసంగాలు ఎక్కువ మంది ప్రక్షకులను ఆకర్షించడానికి తను చెప్తున్న / పాడుతున్న విషయం మీద ఆమెకున్న పాండిత్య ప్రతిభ, ఆ వ్యాఖ్యానం కారణం కావచ్చు. మనకూ ఏదయినా కచేరీ లో ఏ బాలమురళీనో పాటల్ని విడమర్చి చెప్తూ పాడుతూ మనల్నీ ఆ ఉత్కృష్ఠ భావ జలధిలో ఓలలాడిస్తుంటే ఎలా వుంటుంది ?

తెలుగు హరికధ కూడా ఈ టమిళుల హరికధ లాగా స్టాండర్డ్ ని పెంచుకుని, కొంచెం రూపాంతరం చెంది, ఎక్కువ మంది ప్రేక్షకులని ఆకర్షించేలా మారితే బావుంటుందేమో అని నా General (పామర) అభిప్రాయం.

పాండిత్యం ప్రతిభా ఇప్పటికే తెలుగు పండితులకు భక్తీ చానెళ్ళలో, ప్రవచనాల్లో, కావ్య విమర్శల్లో బాగా పనికొచ్చింది. అసలు ఏ చాగంటి వారో సౌందర్య లహరి (అరటి పండు వొలిచినట్టు) చెప్తుంటే, వినే వాళ్ళు మామూలు హరికధా కాలక్షేపం టీవీలో వస్తే ఎందుకు ఇష్టపడరు ? తెలుగు వాళ్ళకి మ్యూజిక్ మీద అంతగా ప్రేమ లేకనా ? కధ అనే ప్రక్రియ ఇష్టపడకా ? ఏమో ! ఏమో ! మీరే చెప్పాలి.

గణేశ ప్రార్ధనతొండము నేకదంతమును
దోరపు బొజ్జయు వామహస్తమున్,
మెండుగ మ్రోయు గజ్జెలును
మెల్లని చూపులు మందహాసమున్,
కొండొక గుజ్జు రూపమున
కోరిన విద్యల కెల్ల నొజ్జవై,
యుండెడి పార్వతీ తనయ!
ఓయీ గణాధిప ! నీకు మ్రొక్కెదన్.

తొలుత నవిఘ్నమనుచు
ధూర్జటినందన ! నీకు మ్రొక్కెదన్
ఫలితము సెయుమయ్య నిను
ప్రార్ధన చేసెదనేకదంత! నా
వలపటి చేతిఘంటమున
వాక్కున నెప్పుడు బాయకుమీ
తలపున నిన్ను వేడెదను
దైవ గణాధిప! లోకనాయకా !!

09/09/2010

నగరం మీద ప్రేమగీతం

టాంక్ బండ్ సన్నని నడుంచుట్టూ చెయ్యి చుట్టి
అందమైన నగర ముఖాన్ని దగ్గరగా తీసుకుని
ఆశలతో అలసమైన అబిడ్స్ కళ్ళలోకి చూసి
దీపాల వెలుతురు ప్రతిఫలించే చెక్కిళ్ళపై ముద్దు పెట్టుకో

సిగలో నౌపహాడ్ నాగరం తళుక్కున మెరుస్తుంది
బంజారాహిల్స్ వక్షోజాలుద్రిక్తంగ చలిస్తాయి
అలా అలా నైలాన్ చీరకింద మెత్తని గాగరాలో
సికిందరాబాద్ జఘనోరు సౌందర్యం నిన్ను కవ్విస్తుంది.

వేలవేల బార్లలో కొన్నివేల నిషాగీతాలమధ్య
బాళిగొలిపే జవరాలి నృత్యం పరవశింప చేస్తుంది.
ఓరగా తెరచిన జనానాల తలుపులలోంచి
ఉండి ఉండి నిలవగాలి వస్తుంది
హుసేన్ సాగర్ మీద ఒలికిన వెన్నెల లోంచి
ఒక విరహిణి మధు విషాదగాధ వినిపిస్తుంది.

వాడినపువ్వుల వాసన వేడివేడి పాదాలకు తగులుతుండగా
రోడ్లమీద అజ్ఞాతకామం ప్రతిరోజూ రాత్రి ప్రవహిస్తుంది.
తెలుగువాళ్ళ తెలివిలేనితనం ధోవతి కుచ్చెళ్ళతో పాటు మోటుగా
యం.యల్.ఏ.క్వార్టర్స్ దగ్గర యెబ్బెట్టుగా జీరాడుతుంది.
దర్బారులో సిగ్గుల్నీ, వగల్నీ ఒలకబోసే నెరజాణతనం నుండీ
దాపరికంలేని పారిశ్రామిక నాగరికతా నగ్నత్వంలోకి
ఎదుగుతూన్న నగరసుందరిని ఒదులొదులుగా కౌగలించుకో
మదం, మదం, మృగమద పరిమళం మత్తెక్కిన కన్నుమూతలో
పెట్రోలు వాసన ఫెళ్ళుమని తగిలి ఉలిక్కి పడతావు.

మూసీనది ముతకశృంగారాన్నే, పాపకశ్మలాన్నీ
మౌనంగా, దీనంగా మోసుకుపోతూ వుంటుంది,
ముసలిగద్ద చార్మినార్ మీద గత వైభవాన్ని తలుచుకుని
మూలుగుతూ ''మోసం!'' అని అరుస్తుంది.

అయినా యౌవనం తగ్గలేదు, లావణ్యం తగ్గలేదు
మెహబూబ్ జిందాబాద్ !
ఫ్యూడల్ రహస్యాల్ని నేటికి దాచుకున్న
పుండ్రేక్షు కోదండం హైదరాబాద్ !

-1956
- దేవరకొండ బాలగంగాధర తిలక్
(అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటి నుండీ)


{హైదరాబాద్ మీద కవిత అనేసరికీ ఇంటరెస్టింగ్ అనిపించి..}

08/09/2010

Id - Munshi Premchand

Note : This is my older post ! [Just remembering the olden days. ]

ఇది మున్షీ ప్రేంచంద్ రచించిన చిన్ని కధ. హమీద్ అనే నాలుగేళ్ళ బీద పిల్ల వాడు - తన అమ్మమ్మ తో కలిసి ఉంటూ ఉంటాడు. 30 రోజుల పవిత్ర రోజా పాటించిన తరవాత తరవాత ఈద్ పర్వదినం వచ్చింది. వీధి లో అందరు పిల్లలూ బొమ్మలూ, మిఠాయిలూ కొనుక్కుంటున్నారు. పెద్దలు కొత్త బట్టలు కుట్టించుకుంటున్నారు. ఇంట్లో చిన్న చితకా వస్తువులూ కొనుక్కుంటున్నారు. చంకీలు ఉన్న తమ టోపీల చిరుగులు కుట్టుకుంటున్నారు. పండగ కాబట్టి చిన్న పిల్లలందరికీ వారి పెద్దలు ఈదీ (బహుమానంగా కొంచెం డబ్బు) ఇచ్చేరు. ఆ డబ్బుతో పిల్లలంతా బజారులో / ఈద్ సంత లో ఎంజాయ్ చేస్తున్నారు. హమీద్ అమ్మమ్మ కడు బీదది, నిస్సహాయురాలైన వృద్ధురాలు! ఆవిడ పాపం హమీద్ కు 3 నయా పైసలు మాత్రం ఇవ్వ గలుగుతుంది.ఈద్ కోసం నిజానికి ఈ పిల్లల బేచ్ లో చాలా రోజుల నుండీ ప్లానింగ్ నడుస్తూ ఉంది. వీళ్ళంతా ఈదీ తో ఫలానా బొమ్మలు కొనుక్కుంటామనీ, ఇంకేదో చిరుతిండి కొనుక్కుంటామనీ కలలు కంటున్నారు. హమీద్ కు ఇవన్నీ కొనుక్కునే స్థోమత లేదు. మిగతా పిల్లల ముందు చిన్నబుచ్చుకుంటాడని అమ్మమ్మ ఎలానో మూడు పైసలు ఇచ్చింది.


వీటితో ఏమి కొనుక్కోగలడు ? ఏదీ మూడు పైసలకు రాదు. మిగతా పిల్లలు కొనుక్కున్న రక రకాల బొమ్మలు చూస్తూ, నిరుత్సాహ పడుతూ సంత లో ప్రతీ ఆట వస్తువ విలువా అడుగుతూ తిరుగుతూ ఉంటాడు హమీద్. ఉన్నట్టుండి వాడికి చిమ్మ్ టా (పట్టకారు / Tong ) అమ్మేవాడు కనపడ్డాడు. వెంటనే హమీద్ కు అమ్మమ్మ గుర్తొచ్చింది. హమీద్ కు ఈ ప్రపంచంలో ఉన్నదల్లా ఆ ముసలి అమ్మమ్మే. ఆవిడ వంట చేసే టప్పుడు / రోటీలు చేసేటప్పుడూ, చేతితోనే రొట్టెలు పట్టుకు కాలుస్తూ ఉంటుంది. ఆవిడకు రొట్టెను పట్టుకునే ఆ పట్టకారు లాంటి చింటా లేదు మరి.


వెంటనే బేరం జరుగుతుంది. మూడు నయాపైసలకు చింటా ఇవ్వనంటాడు దుకాణదారు. అయితే, అంతకన్నా ఎక్కువ డబ్బు హమీద్ దగ్గర లేదు. నిరుత్సాహ పడి వెనుతిరిగి పోతున్న పిల్లవాడిని పిలిచి, ఎలాగో ఆ మూడు పైసలకే చింటా ఇచ్చేస్తాడు దుకాణదారు !

సంత నుండీ తిరిగి వస్తున్న హమీద్ ను మిగిలిన స్నేహితులు ఆటపట్టిస్తారు. బొమ్మలు కొనుక్కోమని డబ్బు ఇస్తే, చింటా కొంటావా అని ఏడిపిస్తారు. ఆ నాలుగేళ్ళ బుడ్డోడు మాత్రం ఈ వేళాకోళాలకు అదరడు - బెదరడు. పైగా తన చింటా అందరికన్నా గొప్ప ఆటవస్తువ అని, భుజం మీద పెట్టుకుంటే, గద అవుతుందనీ, విల్లు లా సంధిస్తే, విల్లు అవుతుందనీ.. ఇలా ఎలా కావాలంటే అలా దానితో ఆడుకోవచ్చని వాదిస్తాడు.


పిల్లలు - అమాయకులు. మొదట కాసేపు హమీద్ మాటలు నమ్మక పోయినా, కొంత సేపటికి తమ తమ బొమ్మలతో ఆడి, బోరు కొట్టి, వాళ్ళకి హమీద్ దగ్గరున్న చింటా ఆకర్షణీయంగా కనపడుతుంది. ఒక్కొక్కరూ.. 'ఒరే, నీకు నా బొమ్మ ఇస్తాను - కాసేపు నీ చింటా నాకివ్వరా..!' అని అడుగుతూ.. ఎక్స్చేంజ్ చేసుకుని చింటాతో ఆడుకుంటారు. మొదట టాం సాయర్ చచ్చిన ఎలకని ఇవ్వడానికి బెట్టు చేసినట్టు కాసేపు బెట్టు చేసినా... చింటా ఇచ్చి, తను ముచ్చట పడిన స్నేహితుల బొమ్మలతో తనూ కాసేపు ఆడుకుని తన సరదా తీర్చుకుంటాడు హమీద్.


ఇలా... సాయంత్రం ఇల్లు చేరేసరికీ, హమీద్ తన స్నేహితులందరి బొమ్మలతోనూ ఆడేసుకునుంటాడు. సరదాగా.. ఉల్లాసంగా ఇంటి సావిట్లోకి అడుగుపెట్టీసరికీ, తన కోసం ఆందోళన తో ఎదురుచూసిన అమ్మమ్మ..'ఇంత ఆలస్యమైందేమిరా.. ఈదీ తో కొన్న బొమ్మ ఏదీ ?' అని అరుస్తుంది. ఆవిడకి చింటా చూపిస్తే.. మొదట కోపగించుకుంటుంది. 'నీకు బొమ్మ కొనుక్కోమని డబ్బులిస్తే, ఇలంటి వస్తువ కొన్నావేమి రా?' అని విరుచుకుపడుతుంది. ఆవిడకి పాపం తల్లీ తండ్రీ లేని తన మనవడంటే, చాలా ముద్దు. ఎన్నడూ వాడి సరదాలు తీర్చగలిగే శక్తి ఆమెకు లేకపోయింది. ఈ ఈద్ కి ఎలా అయినా వాడికి ఏదో ఒకటి కొనిపెట్టాలని ఆమె తాపత్రయం.


వెంటనే.. 'నీకు చింటా లేదు కదా అమ్మమ్మా.. రొట్టెలు చేస్తున్నప్పుడు నీ చేతులు కాలడం నాకు తెలుసు. అందుకే ఈ చింటా నీ కోసం తీసుకొచ్చాను !' అని హమీద్ అనగానే, తన పట్ల మనవడికున్న ప్రేమకూ, అభిమానానికి నోట మాట రాక మ్రాన్ పడిపోయి, కొంత సేపటికి కన్నీళ్ళపర్యంతం అవుతుంది ఆ అమ్మమ్మ.


కధ నాకు గుర్తున్న మటుకూ స్థూలంగా ఇది. ఈ కధ నాకు మామూలుగా తెలియక పోను. నాకు హిందీ సాహిత్యం తో (లోగ్ లుగాయీ తరహా..) తో పరిచయం అంతంత మాత్రం. అయితే ఈ కధ ను ఎన్నో సంవత్సరాలు స్కూల్ టీచర్ గా పని చేసి రిటైర్ అయిన ఒక స్నేహితురాలు చెప్పారు. ఇది ఎప్పుడో 5 ఏళ్ళ క్రితం సంగతి. ఆవిడ, స్వతహాగా టీచర్ మరియూ మంచి పాఠకురాలు గాబట్టి ఈ కధను చిన్న పిల్లలకు చెప్పినట్టు, రసరమ్యంగా చెప్పారు.మున్షీ ప్రేంచంద్ రచించిన ఈ కధ (ఈద్ వస్తున్నది గాబట్టి గుర్తొచ్చింది. తప్పులు / మరచిపోవడాలూ ఉండొచ్చు ! కానీ హృద్యమైన ఈ కధని అందరితో పంచుకుందామని చెప్పానిక్కడ) ఎన్నో సంవత్సరాలుగా ఉపవాచకంగా స్కూలు పిల్లల కు చెప్పబడుతూంది. అసలు మంచి కధలు కావాలంటే, పిల్లల ఉపవాచకాలు వెదకడం మంచిది.

02/09/2010

అప్రస్తుతం !

జీవితంలో తెరలు తెరలుగా ప్రత్యక్షమవుతున్న భయాలను ఒక్కొటిగా ఛేదిద్దామని – నిర్వికారమైన మనస్తత్వాన్ని సాధిద్దామని, బుల్లెమ్మ తో కలిసి ఇంట్లోనే ఉండిపోదామనీ ఏవేవో కోరికలు !

ఒకటి కావాలంటే ఇంకోటి కోల్పోవడం అనే ఆటలో బాధ పడుతున్న మనసును జోకొట్టి, ధైర్యం సమీకరించుకుందామని లాలస ! ఈ ఆట బాగా ఆడాలనే కోరిక లో నన్ను నేనే ఓడించేసుకుంటానేమో అనే సందేహం !

ప్రస్తుతం ఇదీ నేను.