Pages

31/03/2011

సింపుల్ కబుర్లు

చాలా రోజులయింది బ్లాగు దుమ్ము దులిపి. నిన్న ఇండియా గెలిచాకా ఏదో రాసాను. పోస్ట్ చెయ్యకముందే నిద్రపోవాల్సొచ్చింది. ఈ రోజు మేలుకుని ఉండి బ్లాగులు చదివి, నన్ను నేను ఉత్తేజపరచుకుని, ఏదో ఒకటి రాయాలని నిర్ణయించుకున్నాను. తొందరపడి ఏదో ఒకటి రాసేయకుండా, ఆలోచించుకుని, ఏమి రాస్తే బావుంటుందా అని ఆలోచించుకునే లోగా బోల్డన్ని అవాంతరాలు రావడం వల్ల, చాల్రోజులుగా రాయలేకపోయాను. దీనివల్ల ప్రజలంతా సుఖ సంతోషాలతో హేపీ గా వుండటం అస్సలు బాలేదు. అందుకే చేతికొచ్చింది (గుర్తొచ్చినట్టు) రాస్తాను.

ఇంతకీ మొన్నో రోజు హీరో మా ఇంట్లో ఎర్థ్ అవర్ అని ఒకటి జరిపారు. ఆ మర్నాడు హైద్ లో చాలా మందీ, ఢిలీ లో, ఇంకా మిగతా దేశం లో - చాలా మంది ఈ దీపాలార్పు గంట ని పాటించారని తెలిసింది. ఇంతకీ మా ఇంటి గంట లో, టైముకి వంటింట్లో తప్పా, అన్ని గదుల్లోనూ దీపాలార్పబడ్డాయి. పిల్లకి బువ్వెట్టాలి - ఇది ఏం టైం ? అన్నా కూడా వినకుండా ! టీవీ మూసేసి, రేడియో తియ్యడమూ, బుల్లెమ్మ ట్యూనర్ని చీల్చి చెండాడుతూండడం వల్ల - ఒక పాట, ఒక మాటా వినిపించి దాన్ని కూడా ఆర్పడం జరిగింది. కొంచెం సేపటికి అందరికీ అదే టైంకి ఏదో కావాల్సి రావడం, లైట్లు వెయ్యడం, ఉక్క పోసి ఫాన్లు వెయ్యడం, దోమల భయానికి ఆల్ ఔట్ వెయ్యడం జరిగాయి. ఇంతా చేసి ఇంటి గుమ్మాన పెద్ద ట్యూబు వెలుగుతూనే వుంది. ఆపీ వేసీ - లైట్లకి విసుగొచ్చింది. మొత్తానికి ఎర్త్ అవర్ మా ఇంట్లో ఫ్లాప్ అయింది. శ్రీజ కి ఫన్నీ గా అనిపించి ఉండాలి.

ఆ సంబడం గడిచాకా.. ఈ మధ్యే పారడైస్ సెంటర్లో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రకటన నన్ను ఆకర్షించింది. ఒబేసిటీ కి శాశ్వత పరిష్కారంట ! మా ఇంటి కాడ ఫుల్లు దా ట్రాఫిక్కు జోన్ లో పెట్టిన ఇంకో సూపర్ స్పెషాల్టీ కూడా అదే అంటూంది. ట్రాఫిక్ అక్కడ అతుక్కుపోయి మన బండి ఖచ్చితంగా ఇరుక్కునే చోట ఫాట్ ని తగ్గిస్తాం అంటూ ఆకర్షణీయమైన ప్రకటన. ఎన్ని లక్షలు కక్కమంటారో గానీ మైకం లాంటిదీ కొంచెం మోహం లాంటివీ కలిగిస్తున్నాయి ఈ ప్రకటనలు. ఎప్పుడైనా - ఒక వేళ - అలా అయితే - కాష్ - అంటూ నిట్టూర్పులు వినిపిస్తున్నాయి ! సక్సస్ కి షార్ట్ కట్టులు లేవు. హార్డ్ వర్క్ కి ఆల్టర్నేటివ్ లు లేవు. ఇవన్నీ తెలుసు - కానీ, ఆరోగ్య వ్యాపారం లో ఇదో కొత్త ట్రెండ్ ! నిజంగా సొల్యూషన్ దొరుకుతుందా ? అని రెపరెపలాడే ఆశ ! చూడాలి !


ఈ మధ్య బ్లాగరు వాడు నోటు పెట్టి చూడమన్న బ్లాగులు చూస్తూండడం వల్ల భలే ఫన్నీ ఫోటో బ్లాగులు నన్ను ఆకర్షించాయి. నన్ను చాలా విషయాలు ఆకర్షిస్తూ వుంటాయి. నేను అయస్కాంతం. వాటిల్లో ఫన్నీ సైన్స్ (నవ్వించే సైన్ బోర్డులు) కొన్ని. వీట్లో డైరెక్షన్ చూపించే బోర్డులు మరీ నవ్వించేవి గా ఉన్నాయి. నేను హైద్ వచ్చిన కొత్తలో నగర పాలక సంస్థ వారి పబ్లిక్ టాయిలెట్లు (కాదు) ఎక్కడున్నాయో చూపించే సైన్ బోర్డులు ఆకర్షించేవి. చిన్న బోర్డు మీద 'Toilets - 10 mins away' అని చూసి భలే నవ్వొచేది. అంత దాకా ఓపిక పట్టండి అని ఆ బోర్డులు బ్రతిమలాడుతున్నట్టుంటాయి. ఇప్పటికీ ఉన్నాయి.


వచ్చే సంవత్సరం (తెలుగూ న్యూ ఇయర్) లో నా ఫేట్ అస్సలు బాలేదు. రాజపూజ్యం 'నిల్', అవమాణం 'జాస్తీ' గా ఉండబోతుందంట. పోన్లే - నాకలవాటే గా అనుకున్నానా - డబ్బుల్స్ కూడా నిల్లేనంట. ఇక్కడే ఐ హర్ట్ ! కానీ ఈ కఠోర నిజాన్ని ఇంకో కంపెనీ పంచాంగంలో క్రాస్ వెరిఫై చేసుకోవాలి. మా హీరోదీ నాదీ ఒకటే రాశి కాబట్టి ఏది అఘోరించినా ఇద్దరికీ ఖర్మ ఒకలానే కాల్తుంది. ఇక్కడా ఐయాం హర్ట్. ఇద్దరిదీ వేరే వేరే రాశి అయితే,ఇలాంటి క్లిష్ఠ సమయాల్లో ఇద్దరి ఖర్మా బాలన్స్ అవుతుంది కదా ! ఆ సౌకర్యం లేదు మాకు. చూడాలి ! మరీ విసుగేసి - జాతకం ప్రిడిక్షను ఈ సంవత్సరానికి మాకు కన్వీనియెంటు గా లేప్పోతే ఇంక వెధవ ప్రిడిక్షన్ లని నమ్మకూడదంతే !

అన్నమయ్య జయంతి - 'శ్రీనివాసం' లో ఏదో ఒకటి చేసి సెలెబ్రేట్ చేసుకుందామనుకున్నాను. కుదర్లేదు. అందరి Birthays లాగే, అన్ని సార్ల లాగానే గుర్తుంచుకోవాల్సింది మర్చిపోయాను. వయసు తో పాటూ మతిమరుపూ పెరిగిపోతుంది. ఈ మధ్య చాలా విషయాలు మర్చిపోతున్నాను. నా సిగ్నేచర్ ఏంటంటే - చిన్నప్పట్నించీ, నా పుట్టిన్రోజూ, మా చెల్లెలి పుట్టిన్రోజూ తప్ప (తను మర్చిపోనివ్వదు, పైగా సంక్రాంతి రోజు పుట్టింది) ఇంకెవ్వరి పుట్టిన్రోజూ గుర్తుండదు. ఇప్పుడు నా కడుపున పుట్టింది గనుక శ్రీజది గుర్తుంటుంది. పెళ్ళి రోజులయితే ఇంక చెప్పక్కర్లేదు. నా పెళ్ళి రోజు కూడా లైట్ గానే తీసుకుంటున్నా. ఆ రోజు ఎవరైనా విష్ చేసినా, మొహమాటంగానే వుంటుంది. ఇది ఎందుకిలా అవుతుందో తెలీదు. నా లో బిగ్గెస్ట్ మైనస్ ఇదే ! అయితే మతిమరుపు నన్ను మింగేయకుండా చూసుకోవాలని, ఒక నోట్ బుక్ లో అన్నీ రాసుకోవడం మొదలుపెట్టాను.

ఇంక చాలు ఈ కబుర్లు. నాకు కొంచెం హాపీ గా వుంది. ఇంటి నుంచీ పచ్చళ్ళు వచ్చాయి. ఆకుపచ్చ పుచ్చకాయలు కూడా అక్కడక్కడా దొరుకుతున్నాయి. సమ్మర్ ని అనుభవించడం మొదలు పెట్టాను. మంచం పక్కనే కిటికీ లోంచీ, ఆకాశం, చుక్కలూ, మబ్బులూ, చంద్రుడూ, నాకు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తున్నారో ! ఇంక నిద్రపోతా !