Pages

16/09/2009

సిల్లీ కబుర్లు

1) ఏ వయసు కి ఆ ముచ్చటా - అంటూ ముఖ్యంగా ఆడపిల్లల ప్రాణాలు తీసే వాళ్ళెందరో కనిపిస్తారు. పాతికేళ్ళు దాటిన ఆడపిల్లలు, ఎందుకు చెల్లట్లేదో అని తెగ కంగారు పడిపోయి, వాళ్ళ తల్లీ తండ్రుల బుర్ర తినేసి.. వేయించుకు తినే ప్రాణులు ఎక్కువ. అందరూ సోనియా గాంధీ లాగా ఆచీ తూచీ అడుగులు వేస్తే సమస్య ఏముంది ? పెళ్ళి కాని పిల్లల్ని అమ్మో ముప్ఫయి వచ్చేస్తోందనో - దాటిపోతుందనో - కంగారు పెట్టేసి, ఒత్తిడి చేసేస్తే, వాళ్ళూ, నిజమేనేమో - అని భయపడిపోయి, చాలా మటుకూ నష్టపోతున్నారు. ఇంతా డబ్బులిచ్చుకుని, (కట్న కానుకలు), డబ్బు వెదజల్లి - చేసుకున్న ఐశ్వర్యా రాయ్ లకు (అలా లేకపోయినా, ప్రొఫెషనల్ కోర్సు చేయకపోయినా, మంచి ఉద్యోగం లేకపోయినా .. పెళ్ళి కావడం కష్టం) తరవాత తగిలే షాక్ లు ఎలా ఉన్నాయంటే - గుండెలవిసిపోతున్నాయి.

తమిళ నటి మనోరమ - సాంప్రదాయ వాదులని ధిక్కరించి పెళ్ళికి ముందు 'ఆరోగ్య పరీక్ష లు చేయించుకోవాలని, అది చట్టం చేయాలని' పోరాడుతున్నారంట. ఎందుకు పోరాడకూడదు ? పెళ్ళయ్యాక, నపుంశకుడయిన భర్త, సమాజానికి ఏదో నిరూపించుకోవడానికే కట్న కానుకలూ, ఆర్భాటాల మధ్య పెళ్ళాడి, ఆనక 'నీకు విడాకులిస్తాను, ఇంకోర్ని పెళ్ళీ చేసుకో!' - అని సినిమాలో నాగేశ్వర రావు లాగా ఉత్తమమయిన డైలాగు కొడుతున్నాడు. లేదా, తమిళ నాడు లో అత్యధిక శాతం భర్తల లాగా, అమాయక భార్యలకు 'హెచ్. ఐ. వీ.' ని బహుమతి గా ఇస్తున్నారు. పెళ్ళి కాకపోతే, ఆడదాని జీవితం ఏమవునో అని తల్లి తండ్రులే, పెద్దగా అబ్బాయిల గురించి విచారించకుండానే పెళ్ళిళ్ళు చేస్తున్నారు. అదీ చింతించాల్సిన విషయం.


పూర్వం లాగా అటు అన్ని తరాలూ.. ఇటు ఇన్ని తరాలూ తెలిసి ఉన్న సంబంధాలు రావడం ఈ ఫాస్టు యుగం లో కష్టం కాబట్టి, ఇంజనీరు అల్లుడు ఇంటరు కూడా పాసవ్వలేదన్న విషయం పెళ్ళయ్యాక తెలుసుకుని నోరెళ్ళబెట్టడం లాంటి చిలిపి పనులకు తల్లి తండ్రులు ఒడికట్టడం మానాలి. అన్నీ బావుంటే, సాడిస్టిక్ లక్షణాలున్న పెళ్ళి కొడుకులు. మానసిక రోగులూ, అనుమానపు పక్షులూ - వీరి బారిన అమ్మాయిని పడేయటం ఎంతవరకూ సబబు ? ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు - మోసగాళ్ళ కు ఆడపిల్లల ను ఇచ్చి పెళ్ళి చేయడం - సగం, సమాజపు ఒత్తిడి కి లొంగిపోవడం మూలంగానే జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి సమాజంలో చూస్తున్నాం కాబట్టి - ఎపుడన్నా తెలిసిన సర్కిల్లో వయసు మీరిన కన్నె పిల్ల కనిపిస్తే - ఎపుడు పెళ్ళి అని ఏడిపించడమో, అయ్యో పెళ్ళి కాలేదా అని విచారించడమో చేయకూడనిపిస్తూ ఉంది. ఏమో బాబూ ! అది తప్పు ! రోజులు మారాయి.

(నేను ఏకపక్షంగా రాసినా, ఇంతటి బాధ అబ్బాయిలకి ఉండదా అని ఎవరికన్నా కోపం వచ్చినా - ఆ పరిస్థితి ని ఎదుర్కొనే మహిళ కి జరిగినంత అన్యాయం శాతం 'ఎక్కువ' అనిపించే రాశాను)


2) నయీ దిల్లీ రోజుల్లో, కిరన్ బేడీ - బంగ్లా పక్క నుంచీ తాల్ కటోరా ఉద్యానవనానికి (పొద్దున్న వాకింగు కి మాత్రమే !) వెళ్ళేటపుడు -అంత సింపుల్ ఇంట్లో ఉంటూందా ఆవిడా ? అని ఆశ్చర్య పోయేవాళ్ళం. బిర్లా మందిర్ కి సింపుల్ గా వచ్చేస్తూ ఉండేది ఆవిడ - పెద్ద స్కార్పియో లో ! చిన్నప్పట్నించీ ఆవిడ ఒక యూథ్ ఐకాన్! తొలి మహిళా ఐ.పీ.ఎస్. అధికారి. ఢిల్లీ ట్రాఫిక్ ని ఒక దారికి తెచ్చిన స్మార్ట్ పోలీస్. యునైటెడ్ నేషన్స్ లో భారత దేశం తరపున పని చేసిన వ్యక్తి. ఇపుడు - సెలెబ్రిటీ జడ్జ్ ! ఆప్ కీ కచేరీ లో ! అది సరే ! ఈవిడ - ఒక వాణిజ్య ప్రకటన లో కనిపిస్తున్నారు ఈ మధ్య ! అదీ స్త్రీ ల సౌందర్య సాధనం, మచ్చలు లేని ముఖ వర్చస్సు కోసం... నో మార్క్స్ క్రీం ను కిరణ్ బేడీ సిఫారసు చేస్తున్నారు.

ముచ్చట కలిగింది. ఆత్మ స్థైర్యానికీ, సాహసానికీ, తెలివితేటలకూ - ప్రతీక అయిన ఒక మాజీ పోలీస్ అధికారిణి - నో మార్క్స్ - రహో అంటూన్నారు. అయితే, మెచ్చుకోవాల్సిన విషయం - ఆ ప్రకటన రూపకర్తలు - ఈ ఐకాన్ ను ప్రకటనకు ఎంచుకోవడం. నేటి మహిళ ను ఆకర్షించడానికి ఉపయోగిస్తున్నారంటే, మన స్టాండర్డ్ పెరిగిందనే అనుకోవాలి. పిచ్చి పిచ్చి గా - ఆత్మ విశ్వాసానికి - చర్మం రంగుకూ - లింకులు పెట్టే, మార్కెట్ రంగం, 'బే దాగ్' (మచ్చలు లేని) సౌందర్యం కోసం, మచ్చ లేని వ్యక్తిత్వాన్ని - ప్రతీకాత్మకంగా చూపించడం, సంతోషించదగ్గ పరిణామం.




3) పనిలో పని గా ఇంకో వాణిజ్య ప్రకటన ని కూడా ప్రస్తావిస్తాను. ఒక చిన్న పాప, కార్పెట్ మీద పడుకుని పుస్తకం చదువుతూ ఉంటుంది. ఆ పాప తండ్రి పక్కనే సోఫాలో పేపరు చదువుతూ ఉంటాడు. తల్లి లాప్ టాప్ లో ఏదో చేస్తూ ఉంటుంది. పాప అపుడే చదువుతున్న పుస్తకం మూసేసి, అందులో రాకెట్ బొమ్మని చూపించి - నాన్నా నేను పెద్దయ్యాక ' ఇది ' (వ్యోమగామి) అవుతానూ అంటుంది. ఇందులో నాకు చాలా నచ్చింది.. ఆ పాప ను ఎన్నుకోవడం. భారత సమాజం లో ఆడ పిల్లల ఏంబిషన్ కి ప్రాధాన్యం ఇస్తున్నారూ అంటూ ఏదో భరోసా ఇస్తున్నట్టు ఉంటుంది ఆ ప్రకటన.

ఆ పాప ముఖ్యంగా పుస్తకం చదువుతూ ఉండటం ముచ్చట గొలిపే అంశం. ఎందుకంటే, ఈ రోజుల్లో ఎంత మంది పిల్లలు - టీ.వీ కి అతుక్కోకుండా పుస్తకాలు చదువుతున్నారు ? అలాంటి వాతావరణం ఏదీ ఇళ్ళలో ? పైగా, ఆ అమ్మాయి లక్ష్యం, లక్ష్యం పట్ల ఆమె కున్న సందేహాలూ, తండ్రి ఇచ్చే భరోశా - ఇవన్నీ భవిష్యత్తు ని ఎంతో ఆశావహం గా చూసేలా చేస్తాయి.

You can watch the video here : http://www.youtube.com/watch?v=4y6uigiQ5EE