ఈ పుస్తకాన్ని పరిచయం చెయ్యాలనుకోవడం ఓ సాహసం. అయినా ఇది నేను చదివాను అని చెప్పుకోవడం కోసం కొన్ని ప్రయత్నాలు చెయ్యొచ్చు. ఈ పుస్తకం గురించి స్వాతి లో మాలతీ చందూర్ ఏ ఇరవయ్యేళ్ళ క్రితమో రాసింది చదివి, [కథ పరిచయం చేసారు - కాబట్టి సస్పెన్స్ లేదు] ఎంతో ఇంప్రెస్ అయి కొనుక్కున్న పుస్తకం. విశ్వనాథ ని చదివేటంత స్థాయి లేకపోయినా, నేను చదివిన రెండు మూడు పుస్తకాలలో ఇది నాకు చాలా నచ్చింది.
ఇది అన్ని పుస్తకాలకీ వర్తిస్తుందో లేదో తెలీదు. ఇంతకు ముందు కూడా ఎవరో చెప్పారు. ఆయన ఏకధాటి గా కథ ను చెప్తూ పోతూంటే ఆయన అల్లుడు గబ గబా రాసే వారని. ఈ డిక్టేషన్ ఆయా కథల్లో రక రకాల దృశ్య చిత్ర, పాత్ర వర్ణనలతో పాటు, ఏ విడతలోనూ కంటిన్యుటీ చెడకుండా ఆశువు గా చెప్తూ ఉండే వారని విన్నాను. ఈ పుస్తకాన్నయితే ఆయన చెప్తూ ఉండగా వ్యాసుడికి వినాయకుడు భారతం రాసి పెట్టినట్టు శ్రీ గుంటూరు సుబ్బారావు గారు రాసారు. ఆ విధంగా చూస్తే, ఈ యజ్ఞానికి బాధ్యులు ఇద్దరు. ఇద్దరూ అభినందనీయులే.
కథ చెప్పొచ్చు - ఒక సముద్రపొడ్డు పల్లె లో బీద బ్రాహ్మణ కుటుంబం. కుటుంబ పెద్ద సీతా రామయ్య పెద్ద భార్య చనిపోతే, రెండో భార్య టీనేజ్ అమ్మాయి రత్నావళిని పెళ్ళి చేసుకుంటాడు. ఆ అమ్మాయి అందగత్తె. అత్త ఇంట్లో కొత్త కోడలి ముద్దు ఇంకా తీరనే లేదు. చద్దన్నం తింటుంది కాబట్టి మడి కట్టుకోదు. వంట చెయ్యదు. (చిన్న పిల్ల కాబట్టి పొద్దున్న చద్దన్నం తింటుంది) భర్త అప్పుల్లో, బాధల్లో సంసారాన్ని ఈదుతూ ఉండగా, మరిది, 24 ఏళ్ళ రంగా రావు పట్నంలో చదువుకుంటున్నాడు. అతన్ని ఎలాగో అప్పో సొప్పో చేసి చదివిస్తే, సీతారామయ్యకు, అతని, తల్లి, విధవ చెల్లెలు సరస్వతి కీ అతను భవిష్యత్తు లో ఆదుకుంటాడని ఆశ. సీతారామయ్య కు మొదటి భార్య వలన కలిగిన పిల్లవాడు, మేన మామ ఇంట్లో పెరుగుతున్నాడు. సరస్వతి కి వైధవ్యం, ఒక మొగ బిడ్డ తో అన్న ఇంటిలో అరవ చాకిరీ చేస్తూ, కుటుంబాన్ని గౌరవంగా నడుపుకొస్తుంది. ఇదీ ఈ కుటుంబ నేపధ్యం. ఆ పల్లెలో వీరికి మంచి పేరు ఉంది. కాబట్టే ఆస్తి కరిగిపోయినా అప్పు పుడుతూంది.
ఆ పేద కుటుంబం, రంగారావు చదువు కోసం నానా కష్టాలు పడి, డబ్బు పంపిస్తుంటే అతని చదువు సాగుతుంటూంది. పట్నంలో చదువు ఇతనికి మాయా ప్రపంచం. అతని స్నేహితులూ, అతని యువక రక్తం, పట్నపు పోకడలు, నాగరికత్వమూ, ఇంట్లో మిగతా వారి పల్లెటూరి అమయకత్వం, అనాగరికత, వీరి శ్రమ, అతని నాజూకు, ఇలా ఎన్నో అంతరాలు కుటుంబానికి, రంగనికి మధ్య. కానీ అతనో స్వాప్నికుడు. భావుకుడు. అన్న అష్టకష్టాలు పడి భాద్యత గా చదివిస్తుంటే, ఆ కష్టాన్ని లెక్కించని తెలిసీ తెలీని స్వార్ధ పరుడు. అతి ఆత్మ విశ్వాసం, పరిణత లేని వ్యక్తిత్వమూ ఉన్నవాడు. సెలవులకి ఇంటికొచ్చే ఈ ఆధునికుడు - ఇతను రత్నావళి కి ఆకర్షణీయంగా కనపడడం సహజం.
ఈ సంసారానికి రంగని చదువు ఆసరా కావల్సింది కాస్తా, అతని అపరిపక్వ ఆలోచనల్లో, పట్నపు చదువు ప్రసాదించిన అమాయకత్వపు విచార ధారల్లో మండిపోవాల్సి రావడం పెద్ద శరాఘాతం. రంగనికి కొత్త వదిన, అమాయకురాలు, చిన్న పిల్ల రత్నావళి, విద్యకు దూరమయి, ప్రగతి లేక, ఒక ముసలి వాని రెండో భార్యగా ఈ పల్లె లో పడుండడం అన్యాయమనిపిస్తుంది. ఇదే చట్రంలో నానా బాధలనుభవిస్తున్న విధవలయిన తన తల్లి, చెల్లెలు కాకుండా వదినే ఎందుకు అతని ఊహల్లో నిలుస్తుందో తెలీదు.
ఆమెను ఉద్ధరించే ప్రయత్నం లో ఇద్దరి మధ్యా, తెలియని దగ్గరతనం, చనువు, తరవాత శారీరక సంబంధం ఏర్పడతాయి. రంగడి కి రత్నావళి మీద ప్రేమ ఉందో లేదో తెలీదు. ఆమె ను ఏదో కాపాడాలనుకున్న యౌవనపు అమాయకత్వం అతనిది. అతని ఆలోచనల్లో - తప్పొప్పులు, సంఘం సృష్టించినవి. అవి స్త్రీ స్వేచ్చ కు లంకెలు. సంకెళ్ళు. తప్పంటూ ఏదయినా ఉంటే, ఆ పదిహే డేళ్ళ అమ్మాయిని ఆ వయసుడిగిన అన్నకు (సీతారామయ్యకు 35-40 ఏళ్ళుంటాయి) ఇచ్చి పెళ్ళి చెయ్యడం తప్పు. వయసులో చిన్నదయిన రత్నావళి, ఈ మరిది భావజాలపు చట్రంలో పడి, అన్ని హద్దుల్నీ చెరిపేసుకుని ముందుకు వెళిపోయి, రంగనితో ప్రేమ లో పడిపోతుంది.
విషయం తెలిసి, అన్న వీళ్ళిద్దర్నీ పట్నం పంపేస్తే, తెలిసీ తెలియని అజ్ఞానం, పొగరు, ఒకరిమీద మరొకరికి ఉన్న ఆకర్షణ, కన్నూ మిన్నూ కానరాని సిద్ధాంత ప్రభావం వల్ల, తాము ఆ కుటుంబానికి మిగిల్చిన క్లేశాన్ని అస్సలు తెలుసుకోకుండా, నిస్సిగ్గుగా, నిర్లక్షంగా ఆ పల్లె నుండీ బండి లో తరలి వెళ్తారీ రతీ మన్మధులు. సీతారామయ్య మనిషే. తనని గుండెల మీద తన్ని పోతున్న తమ్ముణ్ణీ, ప్రేమించిన భార్యనూ ఊరి వారందరూ చూస్తుండగా బండి లో సాగనంపినప్పుడు, వల వలా ఏడుస్తాడు. తామేమి చేస్తున్నామో తెలీని వ్యర్ధ వినాశనాని వైపు వెళ్తున్న జంట ని చూసి, ఎంతో బాధపడతాడు.
తీరా మద్రాసు చేరాక, అసలయిన జీవితం కనిపిస్తుంది. రత్నావళి కి, రంగనికి, మొదట్లో చేతిలో డబ్బున్నంత వరకూ బానే వుంటుంది. "ఏదో చేసాము", "ఏదో సాధించాము" అనుకుంటూ తృప్తి గా ఉంటారు. రత్నావళి వ్యక్తపరిచే ప్రేమ ను రంగడు తీసిపారేసి, ఇప్పటి దాకా నీకు వేరే ఎవరూ పురుషులు తెలీక నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నీకు అందర్నీ పరిచయం చేస్తాను. వారిలో నచ్చిన వానిని నువ్వు ఎన్నుకుందువు గాని అంటాడు. ఇది రత్నావళి కి తగిలిన మొదటి దెబ్బ. స్వేచ్చ అంటే స్వేచ్చే. ఒకరికే కట్టు పడాల్సిన అవసరం లేదు కద.
కానీ ఈ స్వేచ్చను వెతికే, బ్రతుకు పోరాటంలో వీరిద్దరి ప్రయాణం చూడాలి. ఇద్దరిలోనూ, వయసు, అనుభవాలు తీసుకొచ్చిన మార్పులు. కాల పరీక్షకు తట్టుకోలేక విలవిల లాడిన బ్రతుకులు. ఎందరో స్నేహితులు, ఎందరో సన్నిహితులు, మేలుకోరే వారు, గోముఖ వ్యాఘ్రాలు, కుల రాజకీయాలు, చదువూలు, ఉద్యోగాలు, కూడబెట్టిన డబ్బు, ఆస్తి, వికసించుకున్న వ్యక్తిత్వము. పట్నపు రొద, న్యాయాన్యాయ విచక్షణా శక్తి, మానవత్వం. ఇదీ ఈ మామూలు అసాధారణ కథ లో అంశం.
రత్నావళి, మొదట్లో హోరుగాలికి కొట్టుకుపోయిన ఒక ఆకు లాంటిదయినా, పోను పోను, జీవితం అంటే ఏమిటో తెలుసుకుంటుంది. తను చేసిన తప్పు, తన చేతులారా చేసిన మానని గాయాలు, సంఘంలో తన స్థానము తెలుసుకుంటుంది. కానీ అత్యంత సాహసోపేతంగా ఆవిడ చదువుకుని, పండితురాలై, టీచరయి ఉద్యోగం చేసి, వయసు మీద పడ్డాక, మాతృ ప్రేమతో, అప్పటికి చదువుకోసం పట్నం చేరిన సరస్వతి కొడుకుని చేరదీసి, సాయం చేస్తుంది.
రత్నావళీ, రంగారావు, ప్రేమతో దోబూచులాడతారు. రత్నావళి మొదట రంగారావుని గాఢంగా ప్రేమిస్తుంది. కానీ అతను కాదంటాడు. కాలం గడిచాక, వారిద్దరి అనుబంధం ఓ స్థాయికి చేరాక, రంగడు, రత్నావళి ని ప్రేమిస్తాడు. ఆవిడ అప్పటికే నిర్వాణ స్థితికి చేరుకుంటుంది. కాబట్టి, ఇద్దరూ మానసికంగా, శారీరకంగా, దూరం గా నే మసిలినా ఆత్మ పరంగా ఇద్దరూ ఒక్కరే. అన్నాళ్ళు కలిసి చేసిన తప్పు, నడిచిన అడుగులు, ఒకరికొకరు సాయంగా, చేయూతగా నిలవాల్సి రావడం, వయసు తెచ్చిన అనుబంధం తో ఇద్దరూ కలిసే ఉంటారు చివరి దాకా.
జీవితంలో అర్ధం వెతుక్కుంటూ, తమ శూన్యతని ద్వేషిస్తూ, పశ్చాత్తాప భావనలతో సతమతమయిపోతూన్న రత్నావళి అనుకోకుండా సీతారామయ్య మూడో భార్య ని చూసి, ఆమె వొళ్ళో సీతారామయ్య కుమారుడిని చూసి, తానేమి చెయ్యాలో నిశ్చయించుకుంటుంది. మొదట్లో రత్నావళి, రంగడి ప్రణయం ఆ పల్లెటూళ్ళో రెక్కలు తొడుక్కుంటున్నప్పుడే, సీతారామయ్య మొదటి భార్య కొడుకు అనారోగ్యంతో చనిపోతాడు. ఆ దెబ్బ కి సీతారామయ్య ఘోరంగా బలహీనపడతాడు. ఆ తరవాతే, ఈ జంట ప్రణయం బయటపడి, వారిని ఇంటిలోంచీ పంపేస్తాడు. ఇలా దెబ్బ మీద దెబ్బ పడి కోలుకోలేని ఈయన మూడో పెళ్ళి చేసుకోవడం, పిల్లాడిని కనడం - రత్నావళికి చాలా శాంతిని కలిగిస్తుంది. విధి ఏదో తప్పు సరిదిద్దినట్టు, తాను తన తప్పుని కూడా సరిదిద్దుకోవాలన్నట్టు భావించుకుంటుంది.
ఓ నిర్ణయానికొచ్చి, రంగనికి మాటమాత్రంగా వెళ్తున్నానని చెప్పి, తన బాంకు పుస్తకమూ వగైరాలు తీసికెళ్ళి సీతారామయ్య చేతిలో పెట్టి, తను చనిపోతే ఎవరో అనాధ అనుకుని తనకు కొడుకు చేత తద్దినాలు పెట్టించమని అడిగి, పెద్ద ఉప్పెన వచ్చే వేళ సముద్రానికభిముఖంగా చెలియలి కట్ట లోకి వెళిపోతుంది. ఇంతే.
ఈ అత్భుతమయిన సజీవ నిర్మలత్వం లో - అత్యత్భుత పాత్రలు, మానవత్వం, గిల్ట్ నిలువెల్లా కాల్చేస్తున్న మనుషులకి క్షమ ఇచ్చే ఊరట, రక రకాల మనుషుల వ్యక్తిత్వాలు, చనిపోవడానికొచ్చిన రత్నావళి వెంట నానా పాట్లు పడి చేరే రంగడు,అతని నిష్కల్మషమైన నవ్వు.. వివిధ పాత్ర ల మధ్య విస్తృత సంభాషణలు, రక రకాల భావాల విస్తృతి, ఒకప్పటి ప్రేమ వ్యవహారాలు, వాటి వెనకున్న సాధక బాధకాలు. లేచి పోయెళ్ళిన జంటల బాధలు, కనువిప్పు కలిగినా ఏమీ చెయ్యలేని జీవితాలు. ఇవన్నీ ఈ చెలియలి కట్ట చర్చించే విస్తారమయిన పాయింట్లు.
ఆత్మహత్య కు ముందురోజు రత్నావళి తమ పాత పల్లెటూరి ఇంటికి పడుతూ లేస్తూ వెళ్ళగలుగుతుంది. అప్పటికి ప్రభుత్వం ఆ తీరప్రాంతపు ఊరిని ఖాళీ చేయిస్తూంటుంది. అందరూ బళ్ళు కట్టుకుని ఊరు విడిచి పోతుంటారు. ఉప్పెన ప్రళయమై రాబోతూంది. తుఫాను వాతావరణం. మద్రాసు నుండి రైళ్ళు రద్దవుతాయి. ఆమె అక్కడికే వెళ్తుందని భావించి, రంగడు కూడా ఎలాగో ఊరు చేరతాడు. సీతారామయ్య కుటుంబం ఊరు విడిచాక, రత్నావళి వారి ఇంటిలోనే రాత్రి గడిపేందుకు వస్తుంది. అప్పుడు రంగడు కూడా వస్తాడక్కడికి.
ఆ చీకట్లో వారిద్దరి పరిస్థితి.. ఇద్దరూ పశ్చాత్తాపం తో రగులుతున్నవారే. ఇద్దరూ విద్యాధికులే, సంపాదనాపరులే. సమానులే. ఉద్దండులే. వారి వారి బలహీనతల ముందు మూఢులే. కానీ ప్రేమో మరేదో కారణాన ఇద్దరూ ఒకే నావలో ప్రయాణికులు. అప్పటి పేరా ఒకటి :
ఆకాశము మేఘావృతమై యుండెను. ధాత్రి యంతయు జలమయమై ఉండెను. ఊరిలో వీధులన్నియు బురదగా నుండెను. అతడు పడుతు లేచుచు తన ఇంటికి పోయెను. ఊరిలో నొక్క పురుగు లేదు. ఆ యింటిలో నొక దీపము వెలుగుచుండెను. బయట తాళము వేసి యుండెను. లోపల దీపమెవరు పెట్టిరి ? అతను దొడ్డిగుమ్మము వైపునకు పోయి తలుపు తట్టెను. ఆ తలుపు పాతది. దానిని తేలికగా బ్రద్దలు కొట్టవచ్చును. గాలిచే కాబోలు. నాతలుపిదివరకే బ్రద్దలు కొట్టబడి యుండెను. అతడు తలుపు చెక్కల నటునిటు త్రోసి లోనికి పోయెను. గదిలోనుండి "ఎవరు వారు?" అని ప్రశ్న వచ్చెను. అతడును "ఎవరు వారు?" అనెను.
రంగనికెదురుగా నన్నగారిగది ముందఱ రత్నావళి నిలుచుండెను. ఆమె దీపపు వెలుతురులో రంగని చూచి యానవాలు పట్టెను. ఆమె ఆశ్చర్యపోయెను. రంగడు నవ్వుతు నిలుచుండెను.
వారి ప్రయాణాన్ని ముందు నుండీ చదువుతూండడం వల్ల రత్నావళి ఎదుట ఈ రంగడు నిలబడడం, అదీ నవ్వుతూ... ఆ మనస్థితి కి కొలతలేవీ లేవు. తామిద్దరూ తప్పు చేసారు. తెలిసీ తెలియక, తెలిసాక దిద్దుకోలేక, ఏమీ చెయ్యలేక కొట్టు మిట్టాడడానికి, తామిద్దరూ బాధ్యులే. ఆమె ఒక్కతే ఎందుకు 'ఒక్కతై'పోవాలి ? తానూ ఆమె నేరాలన్నిటిలోనూ భాగస్వామే. ఆమె స్నేహితుడే, తోడే అన్నట్టు రంగడు ఆ క్షణాన రావడం చాలా బాధ, ఆనందం కలిగిస్తాయి.
రత్నావళి అదే విధంగా చదువుకోవడానికి ప్రయత్నించినపుడు ఆమె మీద లేచిపోయి వచ్చిన అపవాదు వల్ల, ఆమెను కామ దృష్టి తో చూసిన ముకుంద రావు, ఆయన టీచింగ్, ఆయన లో మార్పు, ఆయన వ్యక్తిత్వం, ఈ జంటకు అండగా నిలబడడం, హృద్యంగా వుంటాయి. ఆయన ఒక మంచి టీచర్. అతనితో స్పష్టంగా సూటిగా తన అభిప్రాయాన్ని చెప్పిన రత్నావళి అపుడే ఎదిగిపోయినట్టనిపిస్తుంది.
తెలుగు భాష మీద అతని మొదటి పాఠం (ఇంటిలో ట్యూషన్, ఏకాంతంలో) చెప్పినప్పుడు, అంతకు ముందు అతని చూపులో, నడవడిలో రత్నావళి మీద కోరిక స్పష్టమవుతూ ఉంటుంది. అతని ధోరణి చూసి ఆమె అతని దగ్గర చదువుకోకూడదనుకుంటుంది. కానీ పాఠం చెప్పాక వచ్చే పేరా :
ఇట్లు పద్యమంతయు నగువరకు గంటసేపు పట్టెను. చెప్పిన విషయములే మరలమరల చెప్పి రత్నావళి యేసంగతియు మరచిపోకుండజేసెను. ఆనాటికి పాఠమై పోయెను. పాఠమైన తరవాత నతనియొద్దనే చదువుకొనవలెననిపించెను. పాఠము చెప్పినంతసేపు ముకుందరావు కన్నులు తమ ప్రయత్నము మానలేదు. అతని చేతులా ప్రయత్నం మరికొంత కొనసాగించ లేక పోవను లేదు. రత్నావళి మనసులో చాల భయపడెను. పాఠమైనంతనే ముకుందరావు నవ్వెను. రత్నావళి నవ్వలేదు. అతడు "భయపడుచుంటివేమి?" అనెను. రత్నావళి "భయము కాదు. మీరు నావంకనట్లు చూడవద్దు. నాతోనట్లు మాట్లాడవద్దు. నేను చెడిపోయితినని మీకు చులకనగా నున్నదేమో? నేనేదో దారితప్పి ఇట్లు వచ్చింతిని. నేను పడిన దారి తప్పని నాకు తెలిసినది. ఆ తప్పు సవరించుకొనుటకు చదువుకొనవలెననితలచుచున్నాను. ఆతప్పును మరింత వృద్ధి చేయుటకు కాదు. నేనిట్లంటినని కోపగించుకూనకుడు. నాకు తొందరగా చదువు రావలెననిన తమవంటి వారియొద్దనే చదువుకొనవలయును. మీరు కోపగించుకుని వెడలిపోయినచో నాకు చదువు రాదు. మేరెంత బాగుగా చదువు చెప్పగలరో నాకీ కొంచెము సేపటిలోనే తెలిసినది. నన్ను దయతో చూచి చెల్లెలుగా భావించి చదువు చెప్పుటకు మీ కనుగ్రహము కలిగెనా చెప్పుడు. లేనిచో మీవంటి మంచిగురువుల వద్ద చదువుకొనలేకపోయితినని జీవితాంతము దూఃఖించెదను." అని తలవంచుకొనెను. ముకుందరావు దృష్టి ఆమె పాపట పై బడుచుండెను. అతని దృష్టిలో క్రమముగా మార్పు కలిగెను. ఆమె మాటలలో కాలుష్యము లేదు. కొంత దాచి చెప్పుటయు లేదు. మనోభావమును మళ్ళించుకొని యన్యాసక్త హృదయ చెప్పినట్టును లేదు. పండితుడు, వాగ్లక్షణములు తెలిసినవాడునైన ముకుందరావు రత్నావళి మాటలను, జూపులను, వైఖరిని యథార్ధముగ తెలిసికొనెను. అతని కన్నులలో నున్న కామ తైక్ష్ణ్యము , కొంచెము విరక్తి, కొంచెము కోపము, కొంచెము నిస్పృహ, కొంచెము జాలి యన్నియు పెనవేసుకొని క్రమముగా జాఱి కన్నులు చల్లబడెను. అతని కన్నులు ప్రసన్నము లయ్యెను. అట్లగుటకు నైదునిముషములు పట్టెను. అతని కన్నులతో బాటు వాని కూర్చున్న వైఖరిలో పూర్వపు తైక్ష్ణ్యము, నౌద్ధత్యమును పోయి, సౌకుమార్యము, ప్రసన్నత్వము గోచరించెను. ఆ కూర్చున్న వైఖరి మాఱుట రత్నావళి చూచెను. ఆమె తలయెత్తెను. ముకుందరావు కన్నులొక పురుషుడు ఒక స్త్రీ ని సామాన్యముగా జూచుచున్నట్లయ్యెను.
ఇది ఒక క్లాసిక్ ఇవ్వగల అనుభవం. కొన్ని పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. పెళ్ళి బయట సంబంధాలు ఆడవాళ్ళకు చాలా క్లాసిక్ లలో అవమాన పూరితంగా ముగింపునిస్తాయి. అన్నా కెరనీనా ప్రియుడి నిర్లక్షానికి గురవుతుంది. పిల్లాడికి దూరమవుతుంది. ఆఖరికి ఒంటరి అయిపోయి ఆత్మహత్య చేసుకుంటుంది. రత్నావళి కి ఆ చింత లేదు. ఆమె చివరి వరకూ ఒంటరి కాదు. ఎవరూ ఆమెను అవమానించరు. తృణీకరించరు. ఆమె కథ తప్పొప్పుల గురించే అయినా, కేవలం ఆమెదే తప్పనో, అదో ఘోరమైన తప్పనో చూపించదు. మొదట్లో ఆడబడుచు తిరగబడి, వదినను కొట్టినా అన్న వదినని ఏమీ చెయ్యకుండా రక్షిస్తుంది. ఈరోజుల్లాగా ఆమె ఒక ఆస్థి అని, ఆబ్జెక్టనీ ఎవ్వరూ అనుకోరు. ఇది చాలా ప్రోగ్రెసివ్ ఆలోచన. పూర్వపు "ఎవరి పాపానికి వారిని వొదిలేయడం' ఈనాటి పరువు హత్యల రోజుల్లో చాలా మానవత్వం ఉన్న ఆలోచన కిందే లెక్క. అందులో హిపోక్రసీ లేదు. దాయటం, రంగులు పూయటం లేదు.
ఈ పుస్తకానికి చెలియలి కట్ట పేరు ఎందుకు పెట్టారో, ఉప్పెన, సముద్రం, ఉప్పునీరు, మంచి నీరు, చవుడు పట్టిన ఇళ్ళు, పంటలు పెద్దగా పండని పొలాలు, కటిక పల్లెటూళ్ళు, ఇవన్నీ ఎందుకు సృష్టించారో వివిధ రివ్యూలలో విస్తారంగా చర్చించారు. కాబట్టి ఆ జోలికి పోవట్లేదు. కొన్ని ఎమోషన్ లకి విలువిస్తాం కాబట్టి, ఇది అర్ధం అవుతుంది. అది ఏమిటో తెలియాలంటే చదవాలి ఈ చెలియలికట్ట ని. మచ్చుకు ముగింపు లో ఓ పేరా.
అది యెట్టిదో ? - కడలితరగలలోన
కలిసిపోవుట యన్న - దెట్టిదో? అది యెట్టిదో ?
వట్టి యిసుకలపైన - మెట్టనే లనుకొని
మెట్టపడి పోవుచును మట్టిలో గలియు టది - యెట్టిదో ? అది యెట్టిదో ?
అట్టె సంద్రమునడుమ - పుట్టినది హాలాహల
మిట్టె చెలియలికట్ట నెట్టుకొనివచ్చుటది - యెట్టిదో ? అది యెట్టిదో ?
నెట్టుకొని ధర్మములు - గిట్టి చెలియలికట్ట
పట్టువిడిజాఱి జల - మట్టుగా పొంగు టది - యెట్టిదో ? అది యెట్టిదో ?
ముగించేముందు చదివేందుకు ఫ్లో గురించి ఒక సలహా. పుస్తకం మొదలు పెట్టేందుకు ఇబ్బంది లేదు. మధ్యలో వచ్చే సుధీర్ఘమయిన సంభాషణలు ఇప్పటి పాఠకులకు బోర్ కొట్టించ వచ్చు. కానీ మాటలు, కమ్మ్యూనికేషన్ తక్కువయిపోతున్న ఈ రోజుల్లో, సిద్ధాంత చర్చ కేవలం యూనివర్సిటీ లాంజ్ లో నో, టీవీ డిబేట్ లోనో కాకుండా ఇంటి వరండాలో చెయ్యడం కూడా చాలా ఇంపార్టెంట్. మనుషులు మాట్లాడుకోవడం, తమ తమ భావాల్ని వ్యక్తపరచడం, సరైన చర్చ లో పాల్గోవడం, తమను తాము మార్చుకోవడానికి ముందుకు రావడం కూడా అవసరం. తాను పట్టిన కుందేలు, తాను ఈదే బావి అంటూ గిరి గీసుకోకుండా అన్నిటినీ స్వాగతించడం, ముఖ్యంగా చదవడం - ఇవీ మనల్ని ఒక జాతిగా, ముందుకు తీసుకెళ్ళేవి. కాబట్టి అలా ముందుకుపోదాం. 😃
11 comments:
నేను చిన్నప్పుడు చదివిన విశ్వనాధ వారి మొదట నవల ఇది. పూర్తిగా అర్ధం కాలేదు. ఆ తరువాత వారి పుస్తకాలు చాలానే చదివాను. వేయి పడగలు మూడు మాట్లు చదివాను పూర్తిగా అర్ధం చేసుకోవటానికి.ఇంకా అనుమానమే.
>>>విశ్వనాథ ని చదివేటంత స్థాయి లేకపోయినా,.........
ఇది నిజం. ఆషామాషీగా కాలక్షేపం కోసం చదివితే కుదరదు. ........... మహా
నేటితరం...నెచ్చెలిలకి చాలా అవసరమైన విశ్లేషణ మరియు వివరణ. నిజమే మనం వరండాలో కూర్చొని మాట్లాడాల్సిన సందర్భాలు ఉన్నాయి. కానీ చాలామంది చేయటలేదు. ఎందుకంటే గిరి అంతటా గీయలేరు గనుక....ధన్యవాదాలు... సుజాతగారు... మీ తెలుగోడు...🙏.
సాక్షాత్తు ప్రద్యుమ్నుడు!!! నాకెంత ఆనందం గా ఉందో చెప్పలేను. చాలా థాంక్స్ సర్.
అవును కొంచెం వళ్ళు దగ్గర పెట్టుకుని చదవాలి. కాలక్షేపం కాదు. నిజమే.
ఒహ్!! ఏమి నా భాగ్యము. ధన్యవాదాలు అండీ. అలా మాటాడుకోవడానికి like minded వ్యక్తులు కలవాలి. ఇప్పుడు ఇద్దరు స్నేహితులు గా ఉండాలంటే ఒకరు చెప్తుంటారు. ఇంకోరు ఒప్పుకోవాలి. స్పర్ధ ని ఎవ్వరూ సహించట్లేదు. కొంచెం వ్యతిరేకించినా, వారి శత్రువు తో సఖ్యంగా ఉన్నా విడిపోతున్నారు. Dominance rules ఇప్పుడు.
శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి "చెలియలి కట్ట'నవల విశ్లేషణ అద్భుతంగా చేశారు! నవలలోని వర్ణనలు అలానే నీలి రంగుతో పెట్టారు. ఈ మద్యనే వారి గురించిన 35 ఆడియోలు, "వేయిపడగల" గ్రంథం గురించి 10 ఆడియోలు విన్నాను. విశ్వరూపము ధరించిన విశ్వనాథులే వారు. వారి పుస్తకాలు ,అందులో వచ్చే వర్ణనలు వింటున్నాను. ఆశ్చర్యం, అద్భుతం!దైవత్వంతో జన్మించిన విశ్వనాథుడా!!మీకు మనఃపూర్వక అభినందనలు మంచి విశ్లేషణను అందించినందుకు!!C.Suseela
Thank you so much andi
Namaskaramandi..mee visleshana chadivaaka pustakam chadavalani chala chotla vetikanu..kani dorakaledu..meeku ekkada dorukutundi ani telisthe daya chesi chepthara..konukkuntanu..akhariki Viswanatha Satyanarayana valla publications ni adiganu..akkada kuda dorakaledu...
Thank you. నేను ప్రయత్నిస్తానండీ.
చాలా బాగా వివరించారు ఈ నవళను 👌🏻
https://www.telugubooks.in/te/products/cheliyalikatta
మీరు అడిగిన పుస్తకము ఇక్కడ దొరుకుతుంది అండి
Post a Comment