Pages

24/07/2023

రంగురంగుల కవిత్వం - సంపాదకుడు : అనిల్ బత్తుల (Part I)





ఒకే కవిత.. దానికి కొన్ని అనువాదాలు ! ఒక్కో అనువాదం ఒక్కోలా వుంటుంది. కొన్ని ఒకందుకు నచ్చుతాయి.. కొన్ని ఇంకోకందుకు! ఇదే కాన్సెప్ట్ ! 

"ఎవరి అనువాదం మనకు నచ్చింది ? ఎందుకు నచ్చింది ? ఆ అనువాదం పాఠకుడికి లేదా పాఠకురాలికి నచ్చడానికి వారు పెరిగిన వాతావరణం, చదువు, సాహిత్య పఠన జాబితా ఇలా ఎన్నో కారణాలుండవచ్చు. ఒక్క అనువాదం ఒక్కో రంగులో మన హృదయాన్ని తాకుతుంది. నాకు ఈ కవిత్వ అనువాదాలు సంక్రాంతికి పిల్లలు గాల్లో ఎగరేసే రంగుల గాలిపటాల్లా కనిపించాయి.  మనుష్య నీడలు తాకని రహస్య అడవుల్లో ఎగిరే పేరుతెలియని రంగుల పక్షుల్లా ఈ అనువాదాలు నాకు కలలో కనిపించాయి".

- అనిల్ బత్తుల 

Content :   79 కవితలకు 206 అనువాదాలు. ఒక్కో కవితకు, గరిష్టంగా అయిదు అనువాదాలు. కవితలంటే పెద్దగా పడని నాకు ఈ పుస్తకంలో కవితలు బహుశా లబ్దప్రతిష్టులవి కాబట్టి చాలా నచ్చాయి.   వీటిని "కవిత్వ ప్రేమికులకు" చాలా శ్రద్ధతో, కమిట్మెంట్  తో సమర్పించారు అనిల్. ఎప్పట్లాగే ఆయన టేస్ట్ - అత్భుతం. ఈ పుస్తకాన్ని   నాకు దయతో పంపించిన నౌడూరి మూర్తి గారికి వేల వేల ధన్యవాదాలు. నూటికి తొంభయ్యారు శాతం నా అంతట నేను ఈ పుస్తకం (కేవలం కవిత్వం అంచెప్పి) కొనేదాన్నయితే కాదు. మొదట ఆలా తిరగేస్తూ 'బనలతా సేన్' చదివాను. అసలే చుట్టూ బెంగాలీలు. జీవనానంద మాట ఎత్తేసరికీ 'బనలతాసేన్' ను తల్చుకున్నారు. ఇదో మంచి అనుభవమే. ఎంత బావున్నాయో 'బనలతా సేన్' కి ఉన్న వెర్షన్లు... 


మచ్చుకు ఓ చిన్న కవిత : 

---------------------------

గాధ  (1)

అనువాదం : రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ (శ్రీ శాలివాహన గాథాసతశతీసారము, 1951) 


కల(గవు కమలంబులు : హం

సలు గదలవు; చూడవత్త  చక్కగ నెవరో 

వెలికిలగా నాకాశము

నిలిపినవా రూరిచెఱువునీళులలోనన్ !


----------------------------


గాథ (2)

అనువాదం : వాసిరెడ్డి వేంకటసుబ్బయ్య (గాథాసప్తసతి, 1968) 


తాఱుమాఱుగావు తమ్మిపూ లెగసిపో

నైనబోవు హంస లచటినుండి

తెలియ దెవరోగాని తలక్రిందుగా నభం

బూరి చెఱువునందు నుంచిరత్త !


-------------------------------


గాథ (3)

అనువాదం : తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి (ఆంధ్ర ప్రభ 1993) 


ఊరి చెరువులో ఆకాశం పడింది

ఒక్క తామర తెగలేదు

ఒక్క కొంగ తగ్గలేదు

-----------------------------

గాథ (4)

అనువాదం : నరాల రామారెడ్డి (గాథా త్రిశతి, 201)


చిత్రమగునత్త ! మనయూరి చెఱువునందు 

ఎత్తిపడవేసెరెవ్వరో ఇంత నింగి

నలినషండమ్ము లిసుమంత నలుగలేదు

ప్రాణభయమున నెగురదు హంసగణము.

----------------------


గాథ (5)

అనువాదం : దీవి సుబ్బారావు (ప్రాకృత గాథాసప్తసతి 2012)


తామరలు చెదరవు

హంసలు కదలవు, చూడు అత్తా !

ఆకాశాన్ని ఎవరో 

వెల్లకిలగా వూరి చెరువునీళ్ళలో 

పడుకోబెట్టినారు

----------------------------------------------------------------------------------

బనలతాసేన్ లో కొన్ని లైన్లు 



దివసాంతాన మంచురాలే మెత్తటి శబ్దంతో

సంధ్య ప్రవేశిస్తుంది; సూర్యగంధాన్ని దులుపుకుంటుంది డేగ        - ఇస్మాయిల్


సాయంకాలపు మంచురాలుతున్నవేళ

మహాశకుంతం తన రెక్కనుండి 

సూర్యబింబసుగంధాన్ని తుడిచేసుకుంటున్నవేళ     -   - వాడ్రేవు చినవీరభద్రుడు 


సాయమ్రశ్మి కప్పుకొన్న చెట్ల కొమ్మల సందుల నడుమ

కాకి తన రెక్కలమీద 

కమ్ముకొన్న సూర్య సౌరభాన్ని దులుపుకుంటున్న సమయాన   -  కుప్పిలి పద్మ


పవలంతా కడచినాక మంచుతుంపర పచ్చికపై మెలమెల్లన రాలినట్లు

విచ్చేస్తుంది మలిసంజ, రెక్కలపై ఎండతావి తుడుస్తాయి చీకట్లు.  -  ఆలూరి బైరాగి


సాయంగోధూళి కప్పిన చెట్ల కొమ్మల సందుల మధ్య 

అపశకునాల రేవెన్ పక్షి 

రెక్కల మీద వాలిన సూర్యకిరణాల సువాసనలు తుడిచేసుకుంటుంది.   - కుందుర్తి

---------------------

At the end of the day, with the soft sound of dew,
Night falls; the kite wipes the sun's smells from its wings; - Fakrul Alam


(ఇంకా వుంది)


No comments: