Pages

09/11/2008

నా వీర గాధ పార్ట్ - 2

నిద్ర లేచేసరికీ, అదేదో తెలియని నొప్పి శరీరం అణువణువునా నిండిపోయి పిచ్చి కోపం వచ్చేసింది. ఆపరేషన్ ఒక ఆరు గంటలు పట్టిందంట. అమ్మా నాన్నా, సినిమాల్లో లాగా బయట కారిడార్లో పచారాలు కొంచెం సేపు చేసి తర్వాత తిరగలేక, కూర్చున్నారు. వైజాగ్ లో ఉంటూన్న మావయ్యలూ, అత్తయ్యలూ, పెద్దమ్మ, పెదనాన్నలూ, కసిన్లూ - అందరూ వచ్చేరు. మధ్యాన్నం వెళ్ళాను లోపలికి. రాత్రి వచ్చేను. ముందు రోజు ఏమి తిన్నానో గానీ, ఆ రోజు ఏమీ తిన్లేదు. ఆపరేషన్ అయ్యాకా స్ప్రైట్ కూల్ డ్రింక్ (లేదా మౌంటైన్ డ్యూ) ఇస్తానని అమ్మ ప్రామిస్ చేసింది. కాబట్టి ఏమీ తాగలేదు కూడా.


నన్ను తిరగేసి పడుకోబెట్టి, వెన్ను మీదంతా ఇన్సిషన్ చేసి, చీల్చి, చేతులు పెట్టి - (ఓపెన్ సర్జరీ) చేసారు. మళ్ళా ఎంత అత్భుతమో తెలుసా, ఇన్స్ట్రుమెంటేషన్ అయ్యాకా, కోసిన చర్మాన్ని కలిపి కుట్టేసి, ఏదో టేప్ వేసి అతికించేసి, నన్ను మళ్ళీ వెన్ను మీదే పడుకోబెట్టేఅసి, స్ట్రెచర్ మీద తీస్కొచ్చి పోస్ట్ - ఓప్ రూం లో వేసేసారు. నాకు ఓపెన్ సర్జరీ చేస్తారు కాబట్టి, నా మట్టి బుర్ర, కుట్లు హీల్ అయ్యేదాకా పక్కకు తిరిగి పడుకోవాలేమో అనుకుంది. కానీ, నన్ను ఆ కుట్ల మీదే పడుకోబెట్టేసారు. చాలా ఆశ్ఛర్యం వేసింది. ఏమి మెడికల్ సైన్సు రా బాబూ.. ఏమి టెక్నాలజీ - అబ్బ సూపరు - అనుకున్నా.


ఆ పోస్ట్ ఆప్ లో స్ట్రెచెర్ నుంచీ మంచం మీదికి షిఫ్ట్ చేస్తున్నపుడు వాళ్ళు చేస్తున్న గోలకి తెలివొచ్చింది. నా వెయిట్ కి కనీసం ఆరుగురు ఆ దుప్పటిని పట్టుకునుంటారు. నొప్పి - మంటా, నీర్సం, దాహం, కోపం - అన్నీ నన్ను కమ్మేశాయి. వీటన్నిట్లోంచీ తేరుకుని ఇపుడేమి చెయ్యాలి అని ఆలోచించి 'ఊహ్ ఆహ్ - అమ్మా.. అమ్మా..' అని గోల మొదలు పెట్టాను. నాకు నిజంగానే నొప్పి. శరీరం అంతా నొప్పి. ఎవరన్నా నా దుప్పటి ముట్టుకుంటే, నొప్పి.


అమ్మ పాపం నన్ను చూడ్డానికొచ్చింది. నాకు కోపం వచ్చ్చింది - స్ప్రైట్ తేలేదు. ఇంకా కోపం వచ్చింది. (నొప్పి వల్లే అన్నమాట - విచక్షణ లేదు) మొహం తిప్పేసుకున్నాను. అమ్మకి బాధ అనిపించినా, నా దుప్పటి సర్దడానికో, కొప్పరి నూనె, జండూబాం, ఏదన్నా రాయడానికో నన్ను తాకబోతే నాకు టెన్షన్. ఎందుకో నా కాలి వేళ్ళు ఎవరు తాకినా నొప్పి. పెలివిస్ నుండీ, పాదం వరకూ మాత్రం స్పర్శ లేదు. నర్సులు నా కాళ్ళ కి హాట్ వాటర్ బేగ్ పెట్టారు - రాత్రంతా - చర్మం కాలి మాడిపోయింది. అయినా నాకు తెలియలేదు.


ఆ రోజు - దాహం దాహం.. ఎవరూ నీళ్ళివ్వలేదు. రాత్రంతా గోల గోల చేసుంటాను. ముక్కుతూ, మూలుగుతూ, ఎ.సి గది అయినా చెమటలు ధారాపాతంగా కారిపోయాయి. ఆ రాత్రి ఎలానో గడిస్తే చాలానిపించింది. నా ఆపరేషన్ మాత్రం గ్రాండ్ సక్సెస్. కాకపోతే, హై బీ పీ కంట్రోల్ కాలేదు 5 రోజుల దాకా. ఈ అయిదు రోజులూ పోస్ట్-ఓప్ లో నా (నాలుగు రాత్రులు) మాత్రం సూపర్. నాకోసం మా అమ్మా, నాన్నా, ప్రే చేసారు. పిన్ని ప్రేయర్ మౌంట్ లో ప్రేయర్ చేయించింది. మావయ్య - యోగదా సత్సంగ మిషన్ లో ప్రార్ధన చేయించారు. కసిన్ లూ, ఆంటీ లూ రేకీ ఇచ్చారు. నేనూ దేవుణ్ణి ప్రార్ధించాను. దేవుడి కి చాలా థాంక్ ఫుల్ అయిపోయాను. ఆ మరుసటి రోజు అమ్మ, నా కాలు కాలిపోయిన విషయం చూసుకుని, బాధపడి, నాన్న తో చెప్పి నాకో చిన్న మౌంటెన్ డ్యూ బోటిల్ కొనిపెట్టింది.


మొత్తానికి నా జీవితం లో ఒక ఎపిసోడ్ ముగిసింది. వెన్ను లో తాళ్ళు బిగిసాయి. ఇక వెన్ను పాము (స్పైనల్ కార్డ్) ని ఎవరూ నొక్కి పచ్చడి చెయ్యరు. నా బ్రతుకు నేను బ్రతకొచ్చు. అయితే ఇక్కడో తమాషా జరిగింది. నేను పూర్తి గా స్పృహ లో కి వచ్చాకా, నా ఎడమ కాలు అస్సలు నా మాట విన్లేదు. డాక్టర్ వచ్చి ఈ కాలు ఊపమ్మా, ఆ కాలు కదుపమ్మా - అంటే, కుడి కాలు కొంచెం అన్నా కదిలింది. గానీ ఎడమ కాలు మాత్రం కదల్లేదు. నా మెదడంతా ఎన్ని సారులు చెప్పినా నా మాట విన్లేదు. అయినా కాలు పోలేదు అనడానికి గుర్తుగా, వేళ్ళ లో భయంకరమైన నొప్పి. కానీ ఒక్క సెంటీ / మిల్లీ మీటరు కూడా కదలదు.


క్రాంప్స్ మాత్రం వచ్చాయి - రాత్రంతా నిద్ర పట్టనీకుండా! వీట్ని స్పాసం లు అంటారు. ఇవి మన మెదడు కు చెప్పకుండా - అసంకల్పితంగా వెన్ను నరాలు చేసే డిస్కో అన్న మాట. అంటే వరుస పెట్టి - నిముషానికొకటి చొప్పున కాలు మొదలు నుంచీ చివరి దాకా లోపల ఒక జెర్క్ లా - (కాలు విదిలించి నట్టు) వస్తూంది. నేను నా బ్రెయిన్ తో చెప్పాను - 'స్టోప్ దిస్ నాన్సెన్స్-నాకు నిద్రొస్తుంది' అన్నా. బ్రెయిన్ నా ఎడమ కాలితో చాలా నెగోషియేట్ చేసింది. మళ్ళీ నా దగ్గరకొచ్చి, లాభం లేదు, తను నా మాట వినట్లేదు అని చెప్పింది. తెల్లారనీ.. డాక్టర్ వస్తే నీ పని చెప్తాను - అని కోప్పడి ఇంక నిద్ర రాదు కనుక జపం చేసాను. ఆ రాత్రంతా! స్పాసం లు (Spasm) నాకు ఒక సంవత్సరం దాకా వచ్చాయి రాత్రి నిద్ర పోతున్నపుడు. బాగా అలసిపోయిన రోజు నిద్ర లో మరీ ఎక్కువగా వచ్చేవి.


ఆ రాత్రే కాదు. అక్కడ ఉన్నన్ని రాత్రులూ నాకు నిద్ర వచ్చేది కాదు. ఆ రూం లో కనీసం పది మంది పేషెంట్లు రక రకాల సీరియస్ కండిషన్ లో ఉండే వారు. ఒక ముసలాయన ఆక్సిడెంట్ లో మల్టిపుల్ ఫ్రాక్చర్స్ తో చేరారు. నా పక్క బెడ్ మీదింకో ముసలావిడ. ఇంకొంత దూరంలో ఒక నౌ జవాన్ అబ్బాయి... మిగతా బెడ్ ల మీద కూడా వస్తూ పోతూ ఉండే వారు. వీళ్ళతో రాత్రి పెద్ద గొడవ అయిపోయేది. నొప్పి తో వాళ్ళు చేసే ఆర్త నాదాల తో నిద్ర పట్టేది కాదు.


ఏ తెల్లారుతూండగానో నిద్ర పట్టిందా అంటే - 4:30 అయే సరికీ స్క్రబ్, టూత్ బ్రెష్షూ పట్టుకుని నర్సమ్మాయి తయార్. నిద్ర లేపేశేది. బ్రెష్ చేయించి, స్పాంజ్ బాత్ ఇచ్చి, మందులేసేసి, జడేసేసి, బెడ్ షీట్ మార్చేసి, బీపీ - అదీ - ఇదీ రికార్డ్ చేసేసి టిప్పు టాపు గా తయారు చేసేసేది. నాకు ఈ స్పాంజ్ బాత్ అంటే భయం అయిపోయేది. నా వొంటి మీద ఎక్కడ చెయ్యేసినా నొప్పే ! ఆమె మాత్రం వొదల్దూ.. ''యూ మష్ట్ కూబెరేట్ - బ్లీస్ '' అనేది. నాకు అపుడు అమ్మ పియర్స్ సోప్ ఇచ్చింది. వొళ్ళంతా పియర్స్ వాసనా.. ఆమ్మాయి రాగానే పియర్సు వాసన, ఆ వాసన తో పాటూ ఎసోసియేట్ అయిన నొప్పి - నా మెదడు లో పాతుకు పోయి, పియర్స్ అంటేనే కోపం, చిరాకు - అసహ్యం ఒక రెండు ఏళ్ళకు గానీ పోలేదు.


ఇలా లైన్ గా అందరికీ స్పాంజ్ బాత్ ఇచ్చేది. ఆ నౌ జవాన్ అబ్బాయి పాపం ఈ 17 - 18 ఏళ్ళ నర్సింగ్ స్టూడెంట్ ఎంతో ప్రొఫెషనల్ గా స్పాంజ్ బాత్ ఇస్తూంటే ఫీల్ అయిపోయే వాడు. నాకు చాలా బాధ కలిగేది. నేనేవో అనుభూతించిన రోజులు అవి. ఆ స్టూడెంటమ్మయిల మీదా, ఆ హాస్పెటల్ వాతావరణం మీదా గౌరవం కలిగించిన రోజులు.


మరుసటి రోజు డాక్టర్ గారు వచ్చి నా ఎడమ కాలు తోనూ కుడి కాలు తోనూ మాట్లాడారు. అవి ఆయన మాట కూడా విన్లేదు. ఆయన వెంటనే మా నా కేస్ షీట్ మీద 'ఫిసియో థెరపీ' అని రాశేసారు. ఆ సాయంత్రం వినోద్ అనే అబ్బాయి నన్ను చూడటానికి వచ్చాడు. ఆ అబ్బాయి కళ్ళూ, జుట్టూ బావున్నాయి. నాకన్నా చిన్న వయసే ఉండొచ్చు. తను నా ఫిసియో థెరపిస్ట్ !


అప్పటి దాకా ఫిసియో థెరపిస్టు గురించి నానమ్మ దగ్గర విన్నాను గానీ ఎపుడూ చూడలేదు. నానమ్మ కి మోకాళ్ళ నొప్పి. తనకి ఇంటికొచ్చి ఫిసియో థెరాపీ ఇప్పించే వాళ్ళు. అందుకే డా.వినోద్ ని కొంచెం జాగ్రత్త గా చూశాను. ఈ అబ్బాయి మీద నాకు పెద్ద ఆశలేమీ లేవు అప్పటికి. తను నా కాలి వేళ్ళు పట్టుకుని వాటి స్పర్శని చెక్ చేసినపుడు ప్లీస్ ప్లీస్ వాటిని ముట్టుకోవద్దు - అని ఏడిచాను. నిజానికి తనే ఆ వేళ్ళని రక రకాలు గా కదిపి, వాట్లో రక్త ప్రసరణ సరిగ్గా అయ్యేలా చేసి, నా కాళ్ళతో చిన్న సర్కస్ చేసి, ఒక మూడు వారాలకు ఆ నొప్పిని ఆశాంతం తగ్గించారు. నా కాళ్ళతో సర్కస్ అని ఎందుకు చెప్తున్నానంటే, నా కాళ్ళు నా మాట వినేవి కాదు. అస్సలు కదిలేవి కావు. తనే ఆ కాళ్ళతో కుస్తీలు పడి, ఎక్సర్ సైసులు చేయించి, వాటిని నేనే లేపగలిగేలా చేయించారు. దీనికి సరిగ్గా 1.5 నెలలు పట్టింది.


డిస్చార్జ్ అయి ఇంటికి వచ్చాకా - నెల రోజులకి నా కాళ్ళు నేను చెప్పిన మాట విన్నాయి. అపుడే లండన్ ట్యూబ్ లో బాంబులు పేలాయి. నేను బెడ్ మీదినుంచే టీవీ చూస్తూ కాలక్షేపం చేశాను ఈ నెల రోజులూ. కూర్చోవడం అప్పటికి ఊహకందని విషయం. నొప్పుట్టినా, నొప్పుట్టక పోయినా, నా కుట్ల మీదే, నా వెన్ను మేదే పడి నిద్ర పోయేదాన్ని. బెడ్ మీదే నా జీవితం నడిచింది. అమ్మ మీదే ఆదారం. అసలు అమ్మ ఎవరి క్రైసిస్ లో నైనా ముందు వచ్చి నిలిచే వ్యక్తి. అయితే నేనే పెద్ద క్రైసిస్ అయిపోయాను అమ్మకి. అయినా మా అమ్మ మంచిది. నెల రోజుల పాటూ నాకన్నీ చేసింది. రోజూ ఇంజక్షన్ ఇచ్చేది, కుట్లు క్లీన్ చేసి, డ్రెస్సింగ్ చేసేది, మందూ, మాకూ చూసుకునేది, ప్రోటీన్ రిచ్ డైటూ - దాంతో పాటూ మంచం మీదే ఉంటాం కాబట్టి లావయిపోకుండా బాలన్సెడ్ డైటూ ఇచ్చేది. నా ఫిసియో థెరపిస్ట్ మాత్రం నన్ను చాలా బాగా ట్రీట్ చేశారు.


అది మరిచిపోలేని కృతజ్ఞతా భావన. కాళ్ళ ఎక్సర్సైసులు లిటరల్ గా తనే చేసేవాడు (నేను స్వంతంగా చేయలేను కాబట్టి) కొన్నాళ్ళకు బరువు కట్టి, కాళ్ళూ, చేతులూ లేపడం, మోకాళ్ళ నొప్పికి ఇంకొన్ని సూచనలూ - ఇలా.. నడుస్తూనే ఉండేది. మంచం మీంచీలేచి, ఎలా కూర్చోవాలో నేర్చుకున్నాను. ఆనక నడవటం నేర్చుకోవాల్సి వచ్చింది. అపుడే, నానమ్మ నాకు తన వాకర్ పంపించింది. ఆ రోజు నా కాళ్ళ మీద వాకర్ సాయంతో ఒక్క నిముషం నించున్నాను.


నేను నా సర్కస్ చేస్తూ ఉంటే, చిన్నాన్న గానీ మావయ్య గానీ, చెల్లి గానీ, అమ్మ గానీ, 'కర్తవ్యం లో విజయ శాంతి లా.. ఉన్నావే!' -'విజయశాంతి లా నడువు - విజయశాంతి లా స్పిరిట్ తెచ్చుకుని చెయ్యాలి - లాంటి డైలాగులేసి ధైర్యాన్ని ఇస్తూనే నవ్వు తెప్పించెసే వారు.


నాతో పాటూ నా ఫిసియో థెరాపిస్ట్ కూడా నవ్వేవాడు. రోజుకి ఒక 12 అడుగులూ - తరవాత 20 అడుగులూ, తరవాత్ 40 - ఇలా నా నడకోద్యమం మొదలయింది. అయితే, అపుడు నా వెన్నంతా కవర్ చేస్తూ ఒక పెద్ద బెల్ట్ ఉండేది. అది పెట్టుకుని గానీ మంచం మీంచీ లేచి కూర్చోకూడదు. వెన్ను నిటారుగా నిలపడానికి అది అవసరం.


సో - నా నడకోద్యమం లో ఈ బెల్టు ఒక భాగం. చిన్న మావయ్య ఈ బెల్టు పెట్టుకున్న నన్ను చూసి, అబ్బ - ఇదేదో కవచం లా ఉందే - అంటూ - ఎప్పుడూ ఇది వేసుకోమని చెప్తూ, మాయా బజార్ సినిమా లో 'కవచ మితి కవచ మితి సుభగం సుచిత్రం - రక్ష ఇతి రక్ష ఇతి పరమం పవిత్రం' అనే డైలాగ్ చెప్పే వాడు [ ఉత్తర కుమారుడికి భయం కలిగితే అల్లు రామలింగయ్యా, ఇంకో ఆయనా - రక్ష కడుతూ చెప్పే డైలాగు ] నేను ఇంక డిప్రెస్ అవుదామంటే ఎలా అవుతాను చెప్పండి ?


ఈ చిన్న మావయ్య ఎన్ని డైలాగులో చెప్పలేం. నా నడుము ముసలమ్మ లెవెల్లో వొంగి పోయింది కదా అప్పటికే - బెల్టు పెట్టుకున్నా, వెన్ను లో బలం లేక, కనీసం 30 డిగ్రీల కోణం లో వొంగిపోయే ఉండే దాన్ని - నిటారుగా నించోమని ఎవరైనా హెచ్చరిస్తే తప్ప ఆ విషయమే నాకు తెలిసేది కాదు. అపుడు ఈ మావయ్య - చూడు - ఇపుడు నువ్వు సావిత్రి వి అనుకో - నిన్ను ఘటోత్కచుడు పూనేశాడు - అపుడు సావిత్రి చూడు - ఎలా రొమ్ము విరుచుకుని నించుంటుందో - అలా నించో - ఠీవి గా.. అలా నడవ్వే - నీకు తిన్నగా నడవటం వచ్చేస్తుంది ' అని నవ్వొచ్చే సూచనలు ఇచ్చే వాడు.


నడక మొత్తానికి ఎలానో పడుతూ, లేస్తూ నేర్చేసుకున్నాను. అమ్మకి ఇంక ధైర్యం వచ్చి - గుళ్ళ కి వెళ్ళి మొక్కులు తీర్చడం మొదలు పెట్టింది. నాన్న పెళ్ళి సంబంధం గురించే రాత్రీ పగలూ టెన్షన్ పడే వారు. వినోద్ తన ఇంకో పేషెంట్ గురించి ఉదాహరణ చెప్పి (రెండు కాళ్ళూ ఫ్రేక్చర్ అయిన ఒక అమ్మాయి - ఆరు నెలల్లో మేరేజ్ చేసుకుందని..) కొంత ధైర్యం ఇచ్చారు. ఇంకా పెద్దమ్మ వేలు విడిచిన ఎవరో చుట్టాలమ్మాయి కూడా ఇలానే వెన్ను లో ఫ్యూషన్ చేయించుకుని, పెళ్ళాడిందనీ - ఆమెకిప్పుడు పిల్లలు కూడాననీ - చాలా ధైర్యం చెప్పింది.


మొత్తానికి ఈ గోలంతా ముగిసే సరికీ నాకు ఎంగేజ్మెంట్ అయింది. డాక్టర్ గారు చాలా ఆనందించారు. ఎంగేజ్మెంట్ రోజు మా హీరో ని కొంచెం శ్రద్ధగా చూశాను. నాకు నచ్చలేదు. - నేనూ తనకి పెద్ద నచ్చలేదనీ అర్ధం అయిపోయింది. నాకు అంత సేపు కూర్చోడానికి నొప్పి అడ్డం వచ్చింది. పెద్ద ఆర్భాటాలేమీ లేకుండా (కింద కూర్చోలేను - అందుకని సోఫా మీదే కూర్చో బెట్టారు) ఫంక్షన్ జరిగింది. ఫోటోల్లో నా నొప్పి కనిపిస్తోంది. మా అత్త గారు వరుసగా నా చేతి కి రక రకాల ద్రవ్యాల తో కూడిన పళ్ళాలు అందిస్తున్నారు. ఆ బరువు నిజానికి నా వల్ల కాట్లేదు. నేను ఏడుపు మొహం పెట్టుకుని నించున్నాను.ఎంత ఆనందమే అయినా మా ఇంట్లో అందరికీ నేనెక్కడ పడిపోతానో అని భయానికి మొహం టెన్షన్ గా ఉంది. అపుడు లడ్డూల పళ్ళెం వచ్చింది. చిన్న మావయ్య 'సుజాతా - ఇంక నవ్వు!' అని వెనక నుంచీ కేకేసాడు. అన్ని ఫోటోల్లోకీ ఈ లడ్డూ ల పళ్ళెం తో నేనున్న ఫోటోనే బాగా వచ్చింది. నేను - నాన్నా, అమ్మా, చెల్లీ , అక్క, మా హీరో - అందరూ ఆ ఫోటో లో మాత్రమే నవ్వుతూ కనిపిస్తాం.

పొడిగించినట్టు ఉంటుందనీ, ఎవరైనా భయపడతారనీ - నా నొప్పి గురించి మరీ చెప్పట్లేదు.

నా నొప్పి, ప్రస్తుతం కేన్సర్ తో, కీమో థెరాపీ వల్ల కలిగే నొప్పి తో బాధపడుతున్న మా పెద్ద మావయ్య నొప్పికన్నా ఎక్కువ కాదు.

ఈ సోదంతా 'నొప్పి' మీద కాదు 'సెల్ఫ్-పిటీ' మీద కూడా నేను సాధించిన విజయం గురించి -

నిజానికి నేను చాలా చాలా లక్కీ - పేరా ప్లీజియా బాధితుల నిస్ప్రుహ ల కన్నా నా 6 నెలల సర్కస్ ఎక్కువ కాదు. ఈ ఆరు నెలల్లో నా కజిన్స్, నా ఫ్రెండ్స్ - అందించిన మానసిక ఆలంబనా - అమ్మా, నాన్న ల సపోర్ట్ ! అక్క, చెల్లీ లిటరల్ గా నన్ను చిన్న పిల్ల లా చూసుకోవడం ! మా చుట్టాల రోజు వారీ విజిట్లూ, నా చుట్టూ చేరి, నా పొట్ట మీద జంతికల పళ్ళెం పెట్టి మాట్లాడుకోవడం, జోకులూ, నా పెళ్ళి ప్లానింగులూ - ఇవన్నీ ఏదో సూరజ్ బర్జాత్యా సినిమాలాగా అనిపించేవి.

అయితే - కహానీ ఖతం నహీ హుయీ.

నా సర్కస్ ఇంకా మిగిలుంది. నేను నా మెడికల్ లీవు ముగించుకుని, డిల్లీ ప్రయాణం కట్టాలి. ఆ కవచం కట్టుకుని రైసీనా హిల్ మీద ఫోటో తీయించుకోవాలి. అదీ కల ! ఆ తర్వాత తిరిగొచ్చి హీరో ని పెళ్ళి చేసుకోవాలి. ఇంకొన్ని ఫీట్లు మిగిలున్నాయి.

25 comments:

ramya said...

కష్టాన్ని ఇంతందంగా చెప్పవచ్చా, అనిపించింది చదువుతూ ఉంటే. హాట్సాఫ్.
నా కజిన్‌ సరిగ్గా ఇదే విధమైన నెప్పి తో బాధ పడుతోంది, మీరు రాసింది చూస్తే నాకు భయంగా ఉంది, ఇదంతా తనెలా భరిస్తుందో. దానికి ఆపరేషన్‌ చేయాలని చెప్పారు కానీ వీళ్ళు ఆయుర్వేదం ప్రయత్నిస్తున్నారు.
తను ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్,బెడ్ రెస్ట్ లో ఉంది. మనసులో ఒక వైపు చదువు గురించిన బాధ, మరొక వైపు ఈ నెప్పి. బరువు సమస్య తనకీ ఎదురైయ్యింది, తను 5.8 హైటు దానికి తగ్గట్టే కాస్త బరువూ ఎక్కువే.

sujata said...

రమ్య గారూ,

నేను ఈ డైలమా లో నే రోజులు నెట్టుకొచ్చాను. డా.సుబ్బారావు గారు న్యూరాలజిస్ట్. ఆయన సలహా ప్రకారం, ఆపరేషన్ మంచి ఆప్షన్ అని నిర్ణయానికి వచ్చాం. ఎందుకంటే, ఆడపిల్ల, రీప్రోడక్టివ్ ఏజ్ లో ఉన్నది, రేప్పొద్దున్న ప్రెగ్నెన్సీ, ఆ తరవాత నడుం పూర్తిగా పడిపోతే బ్రతుకు దుర్భరం. ఆమె ఇంకొన్నేళ్ళు హాయిగా బ్రతకాలంటే, ఆపరేషన్ తప్పని సరి. బెడ్ రెస్ట్ వల్ల కూడా ఫలితం ఉండొచ్చు, కానీ దాని బలం కేవలం గెట్ ఆన్ అయిపోవడానికే కానీ ఒక మహిళ తట్టుకునేందుకు పనికి రాక పోవచ్చు.

మీ కసిన్ ను తప్పకుండా మంచి ఆర్థోపెడీషియన్ కు చూపించండి. ఎం.ఆర్.ఐ. స్కాన్ ద్వారా మంచి నిర్ధారణ జరగొచ్చు. డాక్టర్ల సలహా (నన్నూ కంఫ్యూస్ చేసి పడేసారు - చాలా మంది డాక్టర్లు) మంచిది.

వాళ్ళు చెప్పిన ఇంకో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే - అమెరికా లాంటి దేశాల్లో పేషెంట్లు ఆపరేషన్ ద్వారా త్వరగా కోలుకోవడానికే ప్రయత్నిస్తారనీ - ఇండియాలో పేషెంట్ లు ఆయుర్వేదం, యునానీ, హోమియో పథీ అంటూ - బెడ్ రెస్ట్ కే ప్రాధాన్యం ఇస్తారనీ.

పెళ్ళి కాని అమ్మాయి కి ఆపరేషన్ అంటే తల్లీ తండ్రీ నేచురల్ గా వెనుకడుగు వేస్తారు. కానీ ఆలశ్యం చేస్తే ప్రమాదకరం కావచ్చు. పైగా, స్త్రీ ల వయసు పెరిగే కొద్దీ పాటూ ఎముకల పటుత్వం సహజంగానే తగ్గుతుంది. ఇండియా లో నడుము నొప్పితో బాధ పడే వాళ్ళలో స్త్రీ ల సంఖ్య ఎక్కువ. 20-30 వయసులో నిజానికి వాళ్ళ శరీరం ధృఢంగా ఉండాలి.

భయపెడుతున్నట్టు గా అనిపించకూడదని ఇలా రాశాను. నేను చాలా భాధ అనుభవించాను గానీ, 'ఆల్ ఈస్ వెల్ దట్ ఎండ్స్ వెల్ ' కదా.

మీరు తనను మంచి డాక్టర్ కు చూపించండి. ఐ విష్ హెర్ రెలీఫ్.

సుజాత said...

ముందు మీ మనోబలం అద్భుతం ! కుటుంబ సభ్యుల సహకారం(మామయ్యలతో సహా) అపూర్వం!

మీ కథ చదువుతుంటే క్రిస్టఫర్ రీవ్స్ (సూపర్ మాన్) రాసిన "Still me.." గుర్తొస్తోంది సుజాత గారూ! దొరికితే చదవండి తప్పకుండా!తప్పకుండా చదవాలి మీరు.

ఇది నిజంగానే వీరగాధే! అంత నొప్పిని ఎలా భరించారో, అంత బాధని, నిరాశని ఎలా తట్టుకున్నారో ఊహించలేకపోతున్నాను.

యూ ఆర్ రియల్లీ గ్రేట్! నిజంగా గ్రేటంటే గ్రేటే!

భాస్కర రామి రెడ్డి said...

సుజాత గారు,
నేను వేరే వళ్ళ బ్లాగు కు సలహాలు వ్రాయడము బహు తక్కువ. కాని మీ రచనలో మీరు అనుభవించిన కష్టం తో పాటి మీ ఆత్మ స్థైర్యం, జీవితము మీద మీకున్న నమ్మకము అభినందించకుండ వుండ లేక ఈ కామెంట్. మీ జీవితము నిస్పృహ తో ఏమి చెయాలో తెలియక వున్న యువత అందరికి ఆదర్శ ప్రాయం.

సత్యసాయి కొవ్వలి said...

great spirit

sujata said...

సుజాత గారు -

ఈ సర్జరీ సమయంలోనే రీవ్స్ - గురించి ఎందుకనో పేపర్లో విస్తృతంగా రాశారు. అతనికి స్పైన్ ఇంజురీ అయింది. స్టెం సెల్ టెక్నాలజీ ని అభివృద్ధి పరచమని ఆయన అప్పట్లో చాలా విజ్ఞప్తులు చేశారు. అందుకే సూపర్ మేన్ కష్టాన్ని నేను అపుడు బాగా అర్ధం చేసుకున్నాను.

అలానే ఒక ఒలంపియన్ సైక్లిస్ట్ గురించి కూడా చదివాను. వీరందరి ముందూ నేనెంత ?

Thanks for referring 'Still me..'. Thanks for ur comment too.

sujata said...

భాస్కర రామి రెడ్డి గారు

అంత పెద్ద పదాలు ఏమో గానీ - నేను మాత్రం ఆ టైం లో స్వర్గాన్నే చూసాను. నేను కలిసిన ప్రతి మనిషీ, ప్రతి క్షణం - నాతో మంచి గా ప్రవర్తించారు. కరుణ తో హెల్ప్ చేసారు. నేను చేసిన లాస్ట్ ట్రైన్ జర్నీ లో మాత్రం కొంచెం మనుషుల ప్రవర్తన చూసి బాధ పడినా, వైజాగ్ లో మాత్రం, హాస్పిటల్ నుంచీ ఇంటి దాకా, చుట్టాల నుంచీ, మా వారి చుట్టాల దాకా అందరూ నాకు చాల హెల్ప్ (మానసికంగా) చేసారు. దీనికి థాంక్స్ చెప్పడానికే ఇదంతా రాశాను. ఇక్కడ వ్యాఖ్యానించినందుకు థాంక్స్.

sujata said...

సత్య సాయి కొవ్వలి గారు

థాంక్స్. ఇది కేవలం నా అనుభవం కాదు. మా ఇంట్లో వాళ్ళందరి పాత్ర దీనిలో చాలా ఉంది. వీళ్ళంతా నాతో పాటూ బాధా పడ్డారు, పోరాడనూ పోరాడారు. కాబట్టి మొదట మా అమ్మగారు గ్రేట్ ! తరవాత మా నాన్న గారు గ్రేట్ ! మా డాక్టరు గారు ఇంకా గ్రేట్ ! మా వినోద్ కూడా గ్రేట్ ! Thanks for your comment sir.

sujata said...

సుజాత గారు -

నిరాశ ఒక స్టేట్ ఆఫ్ మైండ్ ! ఒక వైపు చికిత్స అందుబాటు లో ఉందని తెలిసాకా, నిరాశ మాయమయి, ఆశ పుట్టింది. దీని ఫలితాలు ఎంత బావుంటాయో తెలియక పోయినా, బావుంటాయనుకోవడంతో నే ధైర్యం వచ్చింది.

కొందరి విషయం లో అలాంటి అదృష్టం ఉండదు. అయినా వాళ్ళు ఆ పరిస్థితులని ఎదుర్కొంటారు - వాళ్ళు గ్రేటంటే గ్రేట్ ! నేను కాదు !!

:D

ravigaru said...

సుజాత గారు మీటి చూడు నీ హృదయాన్ని పలుకుతుంది ఒక రోగం అని ఈ రోజుల్లో ప్రతి బ్లాగేర్ వెనక ఒక రోగ గాధ వుందని అర్ధం అయ్యింది. ఈ సందర్బంగా ఎప్పుడు చీది కూడా ఎరగని నాకు చిన్న వయసులోనే గుందేమిడ కొత పెట్టించు కోవలసి వస్తుందని కలలో కూడా అనుకోలేదు.సెప్టెంబర్ 05 లో నాకు కేర్ లో బై పాస్ అయిన నాటి పరిస్థితులు particulerly పోస్ట్ ఆపరేటివ్ కేర్ వి గుర్తు కొచ్చాయి మీ వ్యధ చదివాకా.అక్కడంతా మలయాళీ నుర్సులే వాళ్ళు పేషెంట్ బెడ్ మీదున్న monitors లో readings రాసుకోవడమే గాని పేషెంట్ కేసి చూడరు.నాకేమో పిచ్చ దాహం వేసి నీళ్ళు అందామంటే గొంతు పెగిలేది కాదు అప్పటి దాక వెంటిలేటర్ మిద పెడతారు కాబట్టి ఆ tubes తీసేసిన మాట వెంటనే రాదు సో ఆ నర్సు పాప కళ్లు మన కళ్లు కలుసుకునే దాక వేచి చూసి ఆ ఫై కళ్ళతోనే రమ్మని సౌన్జ్న చేస్తే ఆమె కాస్త అపార్ధం చేసుకుని వీసా వీసా వెళ్లి పోయెడి ఆ భాధ వర్ణన తీతం , ఒక పక్క మన దాహం తీరక మనం ఏడుస్తుంటే ఆ నుర్సులు నీ దాహం తీరనిది నా హృదయం karaganidy అంటునట్టు గ వెళ్లి పోయేవారు.ఒక పక్క icu లో పక్క బెడ్ మీద వాళ్ళు పైకి పోయే వాళ్ళు అయిన అ మలయాళీ నర్సులు పట్టించు కునే వాళ్ళు కాదు అల శవం పక్కనే గొంతు ఎండి పాయి మనం,అబ్బ అదో నరకమే.కానీ ఇప్పుడు తల్చుకుంటే అదో తీపి జ్ఞాపకం ల అని పిస్తుంది. ఈ సందర్భంగా నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు అంతంత డబ్బులు తీసుకోవడం తో పాటు , అంతకు ముందు ఆపరేషన్ చేయించుకుని కోలుకున్న patients తో కోన్సుల్లింగ్ ఇప్పిస్తే చాల ఎఫ్ఫెక్టివే గ వుంటుంది వాళ్ళిచ్చే ఆ స్పూర్తి కోలుకోడానికి చాల ఉపయోగ పడుతుంది, ఏమైనా మీకు thx నిద్రపోఇన జ్ఞాపకాల్ని తట్టి లేపినందుకు.

teresa said...

sujata,
Your hero truly deserves to be called a HERO and you are a good match for him :)

cbrao said...

మీ వీరగాధ చదువుతూ ఆ నొప్పినీ, సున్నితమైన హాస్యాన్ని అనుభవించాను. నొప్పిని నొప్పిగా మాత్రమేకాక, హస్యం మేళయించటం తో, మీ కథనం కొత్తపుంతలు తొక్కింది. ఈ కథతో మీరు పాఠకులకు బాగా దగ్గరయ్యారు. మీ ఆరోగ్య స్థితి గురించి, పెళ్లికాక ముందు, మీ హీరో ఏమనుకున్నారు? మీరే తన నాయకి అని హీరో ఎలా తలిచారు? ఎంతైనా, ఆయన ధీరోదాత్తుడే.

laxmi said...

Sujatagaru, probably it's possible only for you to make fun out of such a pathetic situation. KUDOS!!!

Anonymous said...

sujatha gaaru
mee katha choostunte aa madya one year back andhra jyothi lo vacchina sujatha ane ammayi shirdi ki velutoo accedent lo nadum poguttukoni mancham meeda vuntoo share business cheyyadam gurthukostondi

కత్తి మహేష్ కుమార్ said...

Courage is not the absence of fear, but rather the judgment that something else is more important than fear. ~Ambrose Redmoon

మీ కథ చదివినప్పుడల్లా పైన చెప్పిన quote లాంటివి గుర్తొస్తున్నాయి.ఏంరాయాలో తెలియడం లేదు. Best of Luck.

నిషిగంధ said...

సుజాత గారూ, YOU ARE MY HERO!! ఇందాకటినించీ ఆలోచిస్తున్నాను మీ మనోబలాన్ని ఎలా ప్రశంసించాలా అని.. మాటలు దొరకడంలేదు!! అంత నొప్ప్పితో 30 గంటలు కూర్చుని ప్రయాణం చేయడం మాటలు కాదు!! కానీ ఇది చదివాక అనిపిస్తుంది ఇక జీవితంలో ఏ కష్టమూ మిమ్మల్ని భయపెట్టలేదని.. హేట్సాఫ్ టు యూ!!

sujata said...

రవి గారు

మీ వ్యాఖ్య చాలా బావుంది. పోస్ట్-ఓప్ విషయాలు ఇపుడు స్వీట్ మెమొరీస్ లా అనిపిస్తున్నాయంటే మీదీ విజయమే ! నా విషయంలో కూడా నర్సులు నేను కోపరేట్ చెయ్యట్లేదని తిట్టుకునే వారు. కానీ మూడో రోజుకి కాస్త కరుణించారు. కానీ వీళ్ళ ప్రొఫెషన్ ఎంత గొప్పదో - అపుడే నాకు తెలిసింది. ముఖ్యంగా రోగి కి సేవ చెయ్యడంలో - వీరి పాత్ర గొప్పది. నాకైతే కొంచెం కోపం కలిగినా - ఆ తరవాత ఈ పిల్లలు నాతో కలిసిపోయాక, వాళ్ళంటే చాలా ఇష్టం కలిగింది. వాళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు !

మీ ఆరోగ్యం బావుందని ఆశిస్తాను. ఏది ఏమయినా, మనకు ఇది ఒక అనుభవం. మంచిదో - చెడ్డదో మనమే నిర్ణయించుకోవాలి.

sujata said...

తెరెసా గారు

మా హీరో పాపం - నిజంగానే హీరో నే ! Thanks.

sujata said...

సీ.బీ.రావు గారు

నా కధ చదువుతూనే, మీ బ్లాగు లో రెండు సార్లు రిఫర్ చేసినందుకు చాలా థాంక్స్. హీరోకే కాదు - నాకూ మా పెళ్ళి కుదిరే నాటికి నా ముందున్న చాలెంజెస్ పూర్తిగా తెలియలేదు. సర్జరీ తరవాత బానే ఉంటుందనుకున్నాను. కానీ నా కాళ్ళను స్వాధీనం లోకి తెచ్చుకోవడంలో టైం పట్టింది. అప్పటికే విషయం నిశ్చయం అయిపోయింది. మాది పూర్తి కన్సర్వేటివ్ పెళ్ళే ! కాబట్టి ఈ విషయంలో నేను ఏమీ చెప్పలేను.

కానీ - పెళ్ళి లోనూ, తరువాతా కూడా ఆ అబ్బాయి ఇచ్చిన సహకారం చెప్పుకోదగ్గది. అందుకే హీరో అని పేరు పెట్టాను. :D

sujata said...

Lakshmi garu

thaanks a lot

sujata said...

Anonymous గారూ

ఈ స్టోరీ నేనూ చదివాను. సుజాత గారు ఇపుడు చాలా చక్కగా నిలదొక్కుకున్నారు. ఆవిడ పూర్తిగా పేరా ప్లీజిక్ ! అంటే తన రోజువారీ కార్యకలాపాలకు కూడా సహాయం కావాలి. ఈ పరిస్థితుల్లో కూడా తను అంత చక్కగా ఆర్ధికంగా, సామాజికంగా, మానసికంగా నిలదొక్కుకున్నందుకు ఆవిడ నిజంగా చాలా చాలా అభినందనీయురాలు. అది కూడా ఆక్సిడెంట్ వల్ల జీవితం తల్ల క్రిందులయ్యే పరిస్థితి - (సడన్ షాక్) ! అందుకే ఆవిడ నిజంగా హీరోయిన్ !

sujata said...

మహేష్ గారు

నేనూ స్పీచ్ లెస్ ! అంత సీన్ లేదు నాకు. ఆ పరిస్థితిలో ఎవరున్నా ఇంకేమి చేస్తారు ? మొదట ఏమి ఖర్మ రా బాబూ - అనుకున్నా తరవాత దాని అంతు చూసాను. ఇది కేవలం నా లక్. అంతే !

sujata said...

నిషిగంధా

థాంక్స్. ఆ టైం అలాంటిది. అది గడిచిపోయింది. ఇపుడు అది మర్చిపోవచ్చు - కానీ అదో టర్నింగ్ పాయింట్ కాబట్టే చెప్పాల్సొచ్చింది. మొత్తానికి ఇపుడు పెద్ద 'హమ్మయ్య !' లెండి. అయిపోయాయి - అవన్నీ !

krishna rao jallipalli said...

నమస్తే... కష్టాలని, బాధలని, నేప్పిని ఇంత ఈజీగా ఎలా తీసుకోగాలుగుతోన్నారో .. ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ బరువు తగ్గారా లేక...

ప్రతాప్ said...

Bravo..
No words to explain my feelings..