Pages

22/12/2008

వార్తలా ? వ్యాపారమా ?

ఈ మధ్య అస్సలు టైం చిక్కట్లేదు - ప్రపంచకం ఏమయిపోతుందో తెలుసుకోవడానికి! టీవీ అస్సలు చూడకపోవడం ఒక కారణం. టీవీ లో వార్తలు చూద్దామన్నా - 'ఏమున్నది గర్వ కారణం ?' అనుకుని కొంతా, ఈ టీవీ రాజకీయాలకి మొహం మొత్తి కొంతా చూడక, వార్తల తో టచ్ పోయింది. అయితే అదృష్ట వశాత్తూ మీడియా మేటర్స్ మీద కొంచెం ఆసక్తి, ఆలోచనా కలిగింపచేసే సంగతులు పత్రికల్లో చదివి - చిన్న టపా పేలుస్తున్నా.


'ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే ఎవరో ఒక ఆడమనిషి గురించి, ఇద్దరు మగవాళ్ళు కలిసినా ఒక ఆడ మనిషి గురించి మాట్లాడుకుంటారనీ' -నవ్వులాటకి సగం, నిజానికి సగం అనుకుంటారు. ఇక్కడ పాయింట్ ఎవరిగురించి ఏమి మాటాడుకుంటున్నారని కాదు. ఎవరు ఎంత నిర్మాణాత్మకంగా తమ జీవితాలు గడుపుతున్నారో ఆలోచించుకోవాలని చెప్పాను. అలానే ఇతరుల జీవితాల్లో నానా భారతాలూ మాల్ మసాలా దట్టించి వినడం, పైశాచిక ఆనందంతో వినడం ఇచ్చే కిక్ అందరికీ తెలిసిందే. వీధుల్లో, అరుగుల్లో, క్లబ్బుల్లో, ఆఫీసుల్లో ఇద్దరు నాగరికులు కలిస్తే మాటాడుకునేవి ఇవే కదా.. మన భారతాన్ని ఎవరో విని నోళ్ళు నొక్కుకుంటే 'లోకులు పలు కాకులు ' అనుకుంటాం కదా. అలానే మనమూ కాకులమే !


మనం కాకులమయితే, మీడియా వాళ్ళో ? వీళ్ళు రాబందులే ! మీడియా అంటే ప్రింట్ మీడియా సంగతి పక్కన పెడితే, ఎలక్ట్రానిక్ మీడియా మీద వచ్చిన విమర్శలు చదివి ఈ మధ్య నేనూ తరించాను. చిన్న ఉదాహరణ గా - టీవీ సీరియళ్ళ నే తీసుకోండి ! ఈ ఇతరుల ప్రైవేట్ జీవితాల గురించిన ఆసక్తి లో కూడా కొన్ని రకాలున్నాయి. బీదవాళ్ళ జీవితాల్లో ఏముంది ? చూస్తే డబ్బున్నోళ్ళ కథలు చూడాలి ! కోట్ల మధ్య బ్రతికే కుటుంబాల మీదే సీరియళ్ళన్నీ ! పెయింటు పూతలూ, పట్టు చీరల రెప రెపలూ, ఖరీదయిన ఆభరణాలూ, అంతకన్నా ఖరీదయిన సెట్లూ, కార్లూ - విలాసాల మధ్య అగర్వాల్ కుటుంబమో, వీరానీల కుటుంబమో పడే అగచాట్లూ సంవత్సరాల తరబడి చూస్తాం. ఉడాన్ లాంటి సీరియల్ ఇపుడు ఏ చానెల్ లో నయినా వస్తుందా !


పోనీలే పాపం సీరియళ్ళు ఆడవాళ్ళ సెక్షన్ అనుకోవడానికి లేదు. ఈ సీరియళ్ళ లో కూడా వర్గ విభేధాలూ - పురాతన భావాలూ (అభ్యుదయ వాదం పేరుకే - సీరియళ్ళ లో భారతీయ సాంప్రదాయం పేరిట, తలా తోకా లేని పురాతన భావాలకే పెద్ద పీట) ఈ సీరియళ్ళు ప్రసారం అవుతున్న సమయం లో చానెళ్ళు చేసుకునే వ్యాపారం కోట్ల లోనే ! అయితే ఈ సీరియళ్ళ కన్నా బలమయిన వ్యాపారం ఇంకోటుంది. అది - వార్తలు ! ఇప్పుడు మన దేశంలో ప్రసారమవుతున్న వార్తా చానళ్ళు - వివిధ భాషల్లో కలిపి, 150 దాకా ఉన్నాయి. వీటిల్లో విపరీతమయిన పోటీ ! టీ ఆర్ పీ రేటింగుల బట్టే వీటిల్లో వ్యాపార ప్రకటనల రెవెన్యూ. ప్రజల కు కేవలం వార్తలు అందించడం, నిష్పాక్షికతా, పారదర్శకతా ఇపుడు అంతరించిపోయిన విలువలు ! అందుకే టీవీ వార్తలు ఒక అడ్డూ అదుపూ లేని వ్యాపార ప్రపంచం.

టీవీ వార్తలు - ఆరుషీ తల్వార్ కేసును భ్రష్టు పట్టించడానికీ, నిర్దాక్షిణ్యంగా ఆరుషీ తల్లితండృలను క్షోభ పెట్టడానికీ పోటీపడ్డాయి. మన దేశంలో వీటి మీద అడ్డూ అదుపూ లేకా, మన న్యాయ వ్యవస్థ లో లోపాల కారణం గా పరువునష్టం దావాలు వేసో, దానికి తగినంత నష్టపరిహారం అడిగో - వీళ్ళను రోడ్డు కీడ్చే సౌకర్యం లేక, టీవీ వార్తల భాధితులు అలానే అవస్థలు పడుతున్నారు.

అయితే వార్తల్లో ఇంకో ట్రెండ్ ఉంది. ఆరుషీ తల్వార్ హత్య కేసు లో - ఆరుషీ తో పాటూ ఒక నౌఖరు కూడా హత్య కు గురయ్యాడు. ఈయన ప్రస్తావన మాత్రం ఉద్దేశ్య పూర్వకంగా తప్పించి నగరంలో ప్రముఖులన్న కారణంగా తల్వార్ల కుటుంబానికి మచ్చలు అంటించి, అక్రమ సంబంధాలు అంటగట్టి, కేవలం మార్కెట్ లో రెవెన్యూ కోసమే - చానెళ్ళన్నీ కట్ట కట్టుకుని ఈ వార్తలు ఎలా ప్రసారం చేసేయంటే, కేవలం ఆరుషీ మాత్రమే హత్యకు గురి అయినట్టు, నౌఖరు హత్య ఒక హత్య కానట్టు, అసలు నౌఖరే లేనట్టు, మీడియా ప్రవర్తించింది!

దీన్నే సినిమా భాష లో క్లాస్ - మాస్ సిద్ధాంతం గా పరిగణిస్తారు. మొన్నటికి మొన్న ముంబయ్ ఆటవిక దాడుల్లో - చూడండి. చత్రపతి శివాజీ టెర్మినస్ లో అమానుషంగా చనిపోయిన అనేకమంది బీదా, బిక్కీ, మధ్య తరగతి జనం - టీవీ వాళ్ళ దృష్టి లో అల్పులయిపోయారు. మంటల్లో చిక్కుకున్న తాజ్ పేలస్ హోటల్ ను మాత్రం చూపిస్తూ మీడియా 60 గంటల పాటూ పేజ్ 3 పెర్సనాలిటీల ఆగ్రహావేశాల మధ్య - మేం పన్నులు కట్టం, మేము ఊరుకోం అని - ఆవేశపడిపోయిన ప్రముఖుల మధ్య మైకులూ కేమెరాలూ పెట్టి - దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే డబ్బున్న మనుషులోయ్ ! అన్నట్టు నిరవధిక ప్రసారం జరిపింది.


ఇంకో ముఖ్యమయిన ట్రెండ్ - రాజకీయ నాయకులే విలన్లు అన్నట్టు మాట్లాడటం! మీడియా వాళ్ళూ విలన్లే ! వీళ్ళ విచక్షణా రాహిత్యం వల్లనే ఎందరో అమాయకులు బలయ్యారు. ముఖ్యంగా భారతీయ మీడియా నిష్పాక్షికమయినది కాదు. ఏ పత్రిక ఎవరిని సపోర్ట్ చేస్తుందో - ఏ చానెల్ ఏ రాజకీయ పార్టీకి సలాములు చేస్తుందో అందరికీ తెలుసు ! ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా అయినా, పత్రికలు అయినా, కొందరు ప్రముఖ రాజకీయ నాయకులే స్థాపించుకుంటున్నారు. మన రాష్ట్రం లో నే ఏ పత్రిక ఎవరికి బాకా కొడుతుందో అందరికీ తెలుసు.

ఈ కాకి గోల ఏమిటా అని విసుక్కోకండి ! కొన్ని సత్యాలు కటువుగానే ఉంటాయి. అందరి జీవితాలూ మనకు కిక్ ఇవ్వవు. పి సాయినాథ్ యజ్ఞం లా ప్రచురించిన విధర్భ రైతుల గాధలో, మన రాష్ట్రంలో కట్ట కట్టుకు చనిపోతున్న రైతులా, చేనేత కార్మికుల గాధలూ మనకు అంత ఇంటరెస్టింగ్ గా అనిపించవు. ఐపీయెల్ మేచో, ఫలానా క్రికెటర్ కీ, సౌథ్ ఇండియన్ హీరోయిన్ కూ ఉన్న ప్రేమ వ్యవహారమో, మళ్ళా ఏ దాడిలోనో మరణించిన ప్రముఖుడో - ఇంటరెస్టింగ్ !


వార్తలంటే ఏమిటి ? గత అయిదు సంవత్సరాల్లో 1.5 లక్షల మంది రైతులు మన భారతావనిలో పూట గడవక, అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్నారు ! గ్లోబల్ హంగర్ రిపోర్ట్ లో - మన భారతావని నేపాల్ కన్నా కనాకష్టం గా 66 వ (66th of 88) స్థానంలో ఉంది ! మన దేశంలో రెండు రూపాయలు కట్టలేక, ఒక తండ్రీ కొడుకుల్ని బస్సు లోంచీ తోసేస్తే, వాళ్ళు అదే బస్సు కింద పడి పచ్చడయి నిర్దాక్షిణ్యంగా చనిపోయారు ! ఇదే ముంబాయి లో మరాఠీ మాట్లాడని వాళ్ళని, మనుషులు కానట్టు తరిమి తరిమి కొట్టారు. ఇదే దేశంలో క్రిస్టియన్ నన్ లని ముళ్ళ మీదా, గాజు పెంకుల మీదా వేసి తొక్కి గేంగ్ రేప్ చేశారు. ఇదే దేశంలో వేలాది ముస్లిం లను గోధ్రా అల్లర్లలో భయంకరంగా చంపేరు.

మీడియాలో వార్తలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. బులెట్ గాయాలకో, బాంబు దాడిలో షార్ప్ నెల్ గుచ్చుకునో బాధపడే క్షతగాత్రులను వీడియో షూట్ చేసి, అమ్ముకునే పాత్రికేయులు (టెలివిజనేయులు అనాలా?) మనుషులేనా ? వీళ్ళు క్షతగాత్రులను ఆస్పత్రికి తీస్కెళ్ళడానికి సాయం చెయ్యరా ?

ఎన్.డీ.టీ.వీ. లో 'వి ద పీపుల్' లో శోభా డే, నెస్ వాడియా, కునాల్ కోహ్లీలే మాటాడతారు ! రైల్వే ప్లాట్ ఫాం మీద సర్వం కోల్పోయిన ఏ బీహారీ కుటుంబమో 'వి ద పీపుల్ ' కాదేమో ! ఇది స్పష్టం గా క్లాస్ కోసమే ప్రసారం అవుతున్న టెలివిజన్ వార్త ! ఇరవయి నాలుగు గంటలూ వార్తలూ, బ్రేకింగ్ న్యూసులూ అమ్ముకు బ్రతికే మీడియా - రాజకీయ నాయకులే విలన్లు అన్నట్టు, తాము మాత్రం సత్య సంధులం అన్నట్టు మాట్లాడటం తగదు !


మన టెలివిజన్ వార్తలు అంత నిష్పాక్షికమయినవయితే, మన వ్యవస్థలో పాతుకుపోయిన అవినీతి, మన బ్యూరోక్రాట్ల రెడ్ టేప్ నుంచీ, మన దేశాన్ని పట్టి పీడిస్తున్న బీదరికం, అవిద్య, జనాభా, పారిశుధ్యం, కాలుష్యం - ఇలాంటి బర్నింగ్ పాయింట్స్ మీద ఎంత శాతం సమయాన్ని వెచ్చిస్తుంది ?


రాజకీయాల్లో కుళ్ళు నో, ప్రాజెక్టుల్లో కుంభకోణాన్నో ఎందుకు బయటపెట్టవీ చానెళ్ళు ? ఎంత సేపూ నేరాలూ, ఘోరాలూ అంటూ క్రైం ను అమ్ముకునో, ఇష్టం వచ్చినట్టు రక్తపాతాన్నీ, శవాల్నీ చూపిస్తూ భీభత్సాన్ని ఇంటరెస్టింగ్ గా చూప్సితూ పబ్బం గడుపుకున్న మీడియా వార్తా వ్యాపారాన్ని గురించి తెలుసుకుందాం.


ఈ వ్యాపారాత్మకత లో అమాయకంగా మనం కొట్టుకుపోయి, మనల్ని మనం మోసపుచ్చుకోకూడదు. ముంబయి దాడుల్లో ప్రముఖులూ, ఫస్ట్ క్లాస్ ప్రజలూ మరణించి ఉండకపోతే, ప్రభుత్వమో, మీడియానో జంప్ చేసి, ఎవరి లైన్లు వాళ్ళు సినిమాల్లో లా మాటాడేలా చెయ్యడానికి ఏ మాత్రం ఉపకరించకపోను.


డబ్బున్న ఫస్ట్ క్లాస్ జనాలే - మనుషులు కారు. ఆం ఆద్మీ - ట్రైన్లోనూ, బస్సుల్లోనూ వేలాడుతూ ప్రయాణిస్తూ, ఏ బాంబు దాడిలోనో పుటుక్కున మరణిస్తున్నాడు - కొన్ని వేల లక్షల భారతీయులు పురుగుల్లా-బ్రతికేస్తున్నారు. వార్తలంటే -వీళ్ళ గురించి రాయండి. వీళ్ళని చూపించండి. సామాన్యుడి గురించి కార్టూన్లు గీసే ఆర్కే లక్ష్మణ్ లా మీ వార్తల్లో ఈ దిక్కు లేని సామాన్యుణ్ణి కరుణించి చూపించండి ! వీడు -టెలివిజన్ చూడ్డానికి టైం లేని నికృష్టుడు ! అధముడు ! కనాకష్టం గా రోజు గడవడానికే ప్రాణాలకు తెగించి ఏదో చిన్న పని చేసుకుంటూ, వార్త చదవడానికి చదువు కూడా బహుశా వచ్చి ఉండని దరిదృడు. వీడ్ణి గురించి ఏదో ఒకటి చెయ్యండి.


బాలికా వధూ - లాంటి సీరియల్ని అమ్ముకోవడం కాదు ! నిజంగా బాల్య వివాహాలు అవుతున్నాయే - వీట్ని గురించి జనంలో అవేర్నెస్ తీసుకుని రండి. ఏ సాయినాథ్ లాగానో, కెవిన్ కార్టర్ లాగానో కొంచెం మనసు పెట్టి పనిచెయ్యండి.

13 comments:

Anonymous said...

Here You go ... Very good Suggestions .. but who is listening ...

శివ - teluguratna.com said...

చాలా చాలా చాలా బాగా చెప్పారు

నల్లమోతు శ్రీధర్ said...

సుజాత గారు, మీడియా స్పృశించవలసిన అతి ముఖ్యమైన కోణం సగటు మనిషి జీవితం. మీ పోస్ట్ లోని అక్షరాక్షరం నగ్నసత్యం. ఆ చైతన్యం ఎలక్ట్రానిక్ మీడియాలో ఎప్పుడు వస్తుందో..!! మంచి పోస్ట్ అందించినందుకు ధన్యవాదాలు.

అబ్రకదబ్ర said...

గోద్రాలో, మెట్రో రైళ్లలో, గుళ్లలో, మసీదుల్లో, చాట్ అంగళ్లలో .. బాంబులు పేలటం, వందలకొద్దీ అభాగ్యులు మృత్యువాత పడటం మనకెప్పుడో అలవాటైపోయింది. అప్పుడెప్పుడూ రాని స్పందన తాజా బొంబాయి దాడితో రావటం చూసి నాకు ఆశ్చర్యమేసింది. దాని వెనక మతలబేమిటో చర్చించే ఈ మీ టపా బాగుంది.

చిలమకూరు విజయమోహన్ said...

చాలా బాగా చెప్పారు.

Sravya said...

చాలా చాలా చాలా బాగా చెప్పారు

సుజాత said...

సుజాత గారు,
మీరు ఒక టపాతో ముగించడం ఏమీ బాగా లేదు. సీరియల్స్, నేర గాథలు, వార్తలు, వ్యాపార ప్రకటనలు, సినిమాలు అంటూ విభాగాలుగా కనీసం ఒక ఐదారు భాగాలన్నా రాయవలసింది. కానీ నా మనసులో ఉన్న భావాలన్నీ మీ బ్లాగులో చదువుతున్న ఫీలింగ్ కలిగింది. చాలా బాగుంది. సగటు మనిషి టీవీ కి మహరాజ పోషకుడైనా, అతడికి మాత్రం ఇక్కడ చోటు లేదు.

laxmi said...

ఎంత బాగా చెప్పారండీ, ప్రతి మనసులోని వేదననూ కళ్ళకు కట్టినట్టుగా హృద్యంగా...

కత్తి మహేష్ కుమార్ said...

జర్నలిజంలో human interest stories అనే అంశం ఉంటుంది. అలాగే development communication అని ఒక విభాగమే మానవాభివృద్ధికి చెందిన అంశాల గురించి మీడియాలో స్థానం కల్పించడానికి విద్యార్థుల్ని తయారు చేస్తుంది. నేను యూనివర్సిటీ(HCU) లో చదివింది అదే!

కానీ ప్రింట్ మరియూ ఎలక్ట్రానిక్ మీడియాలో క్షీణిస్తున్న space లో ఈ తరహా (ఉపయోగకరమైన) వార్తలకి స్థానం లేదు. వాటివలన TRP లు పెరగవు.

మీరన్నట్లు ఒక ప్రముఖుడి హత్యకున్న విలువ వందమంది పత్తి రైతుల ఆత్మహత్యకుండదు. ఒక పెద్దమనిషిని అక్రమసంబంధానికున్న విలువ వైద్యసహాయం అందక అనునిత్యం చనిపోయే లక్షలాది శిశువుల వార్త కుండదు.పాప్ కార్న్ కున్న విలువ సంగటిముద్దకుండదు. కానీ ఆరోగ్యానికి సంగటి ముద్ద బేషైనదని మీలాంటి నాలాంటి వాళ్ళు చెప్పినా..పాప్ కార్న్ కే మనవాళ్ళ ఓటు...

బ్లాగాగ్ని said...

టపా చాలాబాగుందండీ. కత్తిగారి కామెంటు కూడా.

Purnima said...

సహేతుకమైన ఆవేశం. న్యూస్ ఛానల్స్ కి టి.ఆర్.పీలు ముఖ్యోద్దేశ్యం అని మనం గుర్తుపెట్టుకోవాలి. The sell news, they are into business.

Lakme Fashion show gets more coverage in print or electronic, than hundreds of farmers' suicide. This is also known. Because the former can be sold.

Sometime back I'd attended a seminar related to role of media, and there was quite an interesting point.

The "Prince" episode was on the front page (actually scheduled on the third page corner) of a newspaper, because the electronic media has given it so much hype. All the day long when people have followed something so keenly and if that's not highlighted in the same tone the next day in newspaper, it as if these are missing the point. Hence that news moved to front page.

This is how things work.

A very good post!

వేణూ శ్రీకాంత్ said...

అద్భుతమైన పోస్ట్ సుజాత గారు, ప్రతి మాటా అక్షరసత్యమే...

Anonymous said...

wonderful...