Pages

11/05/2008

అబ్బాయిల నృత్యం !
ఈ పిల్లలందరూ అబ్బాయిలు. అమ్మాయిల వేషం లో నృత్య ప్రదర్సన ఇస్తున్నారు. ఈ నృత్య రీతి పేరు 'గోటిపువ'. ఇది ఒరిస్సా లో పూరీ కి చెందిన జానపద నృత్యం. ఒరియా లో.. 'గోటి' అంటే ..'ఒక' లేదా 'ఒంటరి', 'పువ' అంటే 'అబ్బాయి' అని అర్ధం. అంటే.. పేరుని బట్టే ఇది అబ్బాయిల నృత్యం అని చెప్పొచ్చు అన్నమాట. మొదటి సారి 'గోటిపువ' ప్రదర్సన ఢిల్లీ లో చూసాను. గణతంత్రదినం సందర్భంగా.. Talkatora Indoor Stadium' లో.. జానపద నృత్య పండగ(Folk Dance Festival) జరుగుతుంటే, ఫ్రెండ్స్ తో కలిసి నోరెళ్ళబెట్టి చూసాను. ఈ పండగ లో.. వివిధ రాష్ట్రాల జానపద నృత్యరీతుల ప్రదర్సన జరిగింది. గోటిపువ సంగతీ కనీ వినీ ఉండక పోవడం వల్ల, మొదటి సారి చాల Thrill కలిగింది.


గోటిపువ చాలా acrobatic గా ఉంటుంది. ట్రూప్ లో కనీసం ౨౦ మంది చిన్నపిల్లలు.. రక రకాల పిరమిడ్ ఆకారాలూ.. మత్స్య, కూర్మ..అవతారాల లా అన్ని రకాల ఆసనాలూ. పక్షులనూ, జంతువులనూ అనుకరిస్తూ భంగిమలూ.... చేస్తూనే వుంటారు. ఒడిస్సీ కాస్ట్యుములలో ఉన్న ఈ పిల్ల లందరూ ఆడపిల్లలే అనుకుని.. అయ్యబాబోయ్ ఎన్ని ఫీట్లు చేస్తున్నారో అని.. ఎవరైనా పడిపోతారేమో అని...భయపడుతూ చూసాను. అంత చక్కగా.. సుకుమారంగా వున్నారు ఆ పిల్లలు. వాళ్ల కదలికల్లో, మేకప్ లో.. ఎక్కడా.. అబ్బాయిలని తెలియలేదు. ఆ తరువాత.. వ్యాఖ్యాత గోటిపువ నృత్యాన్ని గురించి కాస్త జ్ఞానబోధ చేసారు. ఈ డాన్స్ అబ్బాయిలకే పరిమితం. పూరీ లో పుట్టిన ఈ కళ, దేవదాసీ లకు ప్రత్యామ్నాయంగా, ఒక హిందూ మత విశ్వాసానికి ఆధారంగా జరిగింది.


ఒరిస్సా రాష్ట్రం లో ప్రధానమైన మతం.. వైష్ణవం. 'గోటిపువా' కళా కారులు, వైష్ణవ గాధలూ, పురాణాలూ, గాదలను, ముఖ్యంగా దసావతారాలనూ, రాసలీల నూ ప్రదర్శిస్తారు. అప్పట్లో పూరి మహారాజు ఆదేశాల మీదను ఈ 'గోటిపువ' కోసం బోల్డన్ని స్కూళ్ళూ వెలిసాయి, ఎందరో కళాకారులు తయారయ్యారు. అయితె, ఒకప్పుడు రాజులూ, జమీన్దారులూ ప్రోత్సహించిన ఈ నృత్య రూపం ఇపుడు రాజపోషణ లేక దాదాపూ అంతరించిపోయింది. ఇప్పుడు ఎవరో కొందరు మహానుభావుల వలన.. ఈ కళ గత పదేళ్ళ నుంచే వెలుగులోకి వచ్చింది. మగపిల్లలు - ఈ చిన్నపిల్లలు, ఎంత కష్టపడి ఎన్నాళ్ళు సాధన చేస్తే ఈ రకం నృత్యం చెయ్యగలరా.. అని అబ్బురం కలిగింది.


విశ్వ విఖ్యాతి చెందిన ఒడిస్సి కళాకారుడు గురు కేలూచరణ్ మహాపాత్ర, చిన్నప్పుడు ఈ గోటిపువ బృందం లోని సభ్యుడే.. జయదేవుని అష్టపదులను అభినయిస్తున్నప్పుడు ఆయన ఒక పురుషుడి లా అస్సలు అనిపించరు. మధుర భక్తి రసం ప్రధానంగా సాగే అభినయాల్లో.. ఆయనకు పెద్దపీట వెయ్యొచ్చు. యూట్యూబ్ లో 'గోటిపువ' వీడియోలు దాదాపు లేవు. చాలా ఇతర వెబ్సైట్ లలో ఉన్నాయి. వాటిని ఇక్కడ ఎలా అప్లోడ్ చెయ్యాలో నాకు తెలియలేదు.


(ఈ Folk Dance Festival లో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ''జడకోలాటం'' కూడా చూసాను. వేదిక మీద కోలాటం ఆడుతూ ఒక దూలానికి మధ్యలో వేలాడేలా కట్టిన తాళ్ల కింది కొసలని, తమ ముంచేతికి కట్టుకుని, వాటితో ఒక పెద్ద జడ ను అల్లే కళాకారులు.. అలానే.. రివర్స్ ఆక్షన్ లో.. చాలా రిధమిక్ గా.. చాలా వేగంగా డాన్స్ చేస్తూ సరైన సింక్రనైసేషన్ తో.. ఆ జడను విప్పేస్తారు.. .... ఢిల్లీ నుంచీ వచ్చాక.. అయ్యో! అవన్నీ మిస్ అవుతున్నాను)

7 comments:

sujatha said...

చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది సుజాత గారు!గోటిపువ గురించి ఇంతకు ముందెప్పుడో విన్న జ్ఞాపకం ఉంది. ఈ ఫోటో చూసాక, ఈ పిల్లల dedication కి చాలా ఆశ్చర్యం కలిగింది.మీరే నయం. నేను జడకోలాటం గురించి వినడమే కానీ చూడ లేదు. అంటే ఆంధ్ర రాష్ట్ర సంప్రదాయాల గురించి తెలుసుకోవాలంటే ఢిల్లీ లోనో మరో దేశంలోనో ఉండాలన్న మాట.

కొత్త పాళీ said...

ఈ టపా చదివి చాలా సంతోషం వేసింది.
"ఆ బట్టథల, ముడథలు పడిన మొహంతో ఉన్న ఆ వృద్ధునిలో ఒక పదహారేళ్ళ ముగ్ధ గోపిక ప్రత్యక్షమైంది. అతి లలితమైన, లాస్య పూరితమైన సాత్వికాభినయాన్ని ఆ రోజే చూశాను." అన్నారు మా నాట్యాచార్యిణి, గురు కేలూబాభు గురించి.
ఈ విడియోలు గానీ, ఇతర వివరాలు గానీ ఉన్న సైట్లు మీకు తెలిస్తే, వాటి లంకెలు ఇస్తూ ఇక్కడ రాయండి. అప్లోడ్ చెయక్కర్లేదు.

sujata said...

సుజాత గారు, కొత్త పాళీ గారు.. థాంక్స్. సుజాత గారు.. హైదరాబాద్ లో.. తెలుగు కల్చర్ దొరకడం చాల కష్టం.. ఇంకా ఎక్కడ ఉన్నా.. రక రకాల కార్యక్రమాలకు వెళ్లి చూడొచ్చు. కొత్త పాళీ గారు, మీ సూచన బాగుంది. ఈసారి అలానే చేస్తాను.

కొత్త పాళీ said...

పొరబాటు. హైదరాబాదులో తెలుగు కల్చరే కాదు, ఇంకా చాలా కల్చరే దొరుకుతుంది గానీ .. ట్రాఫిక్కులో బోలెడు దూరం పోయి చూడ్డం పెద్ద తలకాయనొప్పి.
తీరా చేసి వెళ్ళినా ఇంచుమించు ప్రతీ సభకీ A-B-C-D మైకాసురుల బెడద .. అదీ ప్రాబ్లం.

sujatha said...

కొత్తపాళీ గారు,
మీరూ ఈ A-B-C-D ల పాలిట పడ్డారా! త్యాగరాయ గానసభకి, రవీంద్ర భారతి కీ వెళ్ళే ప్రతి వాళ్ళు వీళ్ళ పాలిట పడి తీరాల్సిందే! ఇక ఆగలేను, చెప్పెస్తా వాళ్ళ పేర్లు.

A అక్కినేని నాగేశ్వరరావు

B (సభా సామ్రాట్) భాస్కర రావు

C సినారె

D దైవజ్ఞ శర్మ

వీళ్ళేనా లేక ఈ మధ్య మరో కొత్త ABCD లేమైనా పుట్టుకొచ్చారా? ముఖ్యంగా D ని భరించడం చాలా కష్టం సుమండీ! చిరంజీవి కూతురి పెళ్ళికీ వస్తాడు, శోభన్ బాబు పోయినపుడు వస్తాడు.

వీళ్ళ బెడదతో మేము కనీసం ఏదైనా మంచి పుస్తకావిష్కరణ సభకెళ్లాలన్నా భయపడి పోయామంటె నమ్మండి.

sujata said...

అవునా ?! ABCD ల సంగతీ నాకు తెలియదు కాని.. కొత్త పాళీ గారితో ట్రాఫిక్ విషయం లో ఏకీభవిస్తాను. నేను కొన్నాళ్ళ క్రితం 'ది హిందూ థియేటర్ ఫెస్టివల్' జరిగినపుడు నా ఫ్రెండ్ తో కలిసి, ఒక రోజు రవీంద్ర భారతి వెతుక్కుంటూ వెళ్ళాను.. ఎక్కడా.. ఒక్క సైన్ బోర్డు కనిపించక.. దారి తెలియక, ఆఖరికి అదృష్టం బావుండి, ఎవరో దారిన పోయే మంచివాళ్లు సరైన దారి చూపెడితే.. వెళ్ళాను. ఆ తరవాత.. ఆ నాటకం నాకు నచ్చలేదు. అంత డబ్బు, టైం, ఎఫ్ఫర్ట్ వేస్ట్ చేసుకుని వెళ్లి, తిరుగు బాట లో ట్రాఫిక్ తో చాలా ఇబ్బంది పడి.. ఇంకెప్పుడూ ఎక్కడికీ వెళ్ళకూడదని ఒట్టు వేసుకున్నాను.

కృష్ణుడు said...

గోటిపువ గురించి తెలుసుకున్నదుకు చాలా ఆనందంగా వుంది.
ఆ లింకులు పంపిస్తే ఆనందిస్తాము.
ఔను మరి ఆంధ్రులు అమెరికాలో సిలికాన్ వాలిలో ,సియాటిల్లో దొరుకుతారుగాని హైదరాబాదులో దొరుకుతారా మరీ విడ్డూరంగా..ఇంక కల్చరు సంగతి చెప్పనక్కరేలేదు.
ABCDల గురుంచి warning ఇచ్చినందుకు thanks.