Pages

24/04/2008

కికోసు మీకు తెలుసా ?!

ఈ గ్రంధాలయాల బ్లాగ్విషయం ఆశ్చర్యకరంగా చాలా మంది పాఠకుల 'సోవియట్ లాండ్' పరిచయాన్ని తెలియచేసి నన్ను ఉత్తేజ పరిచింది. నేను చిన్నప్పుడు 'విశాలాంధ్ర' స్కూల్ లో చదివాను. స్కూల్ ఫీజు నామ మాత్రం, ఇంగ్లీష్ మీడియం, కాస్త వామ పక్ష భావజాలన్ తో నిండిన ఈ స్కూల్ లో నే (లైబ్రరీ) మొదటిసారి సోవియట్ లాండ్ చదివాను.


సోవియట్ లాండ్ - (రష్యా) సాహిత్యం అనగా బాల సాహిత్యం బాగా గుర్తుంది. ఈ స్కూల్ లైబ్రరీ అంటే వేరే ఏమి కాదు. క్లాస్ రూం కే బోల్డన్ని పుస్తకాలు కేటాయించే వారు. బ్రేక్ ల లో / రీడింగ్ అవర్ లో చదువుకోవటమే. ఆ పుస్తకాల్లో కొన్ని కధలు జ్ఞాపకం (బొమ్మలతో సహా..) వాటిల్లో మొదటిది నా కికోసు కధ!


ఈ కధ ఒక రైతు కూతురిది. ఒక రైతుది. ఒక గ్రామంలో ఒక రైతు వుంటుండేవాడు. అతనికి ఎనిమిది మంది (సంఖ్య ప్రామాణికం కాదు - ఎక్కువ మంది అని అర్ధం) పిల్లలుండే వారు. ఏడుగురు కూతుర్లు, ఒక కొడుకు. ఆ కొడుకు అందరికన్నా చిన్నవాడు. ఈ పిల్లలంతా.. తల్లి పోయాక తండ్రికి చేదోడు వాదోడు గా వుంటారు. అడవి కి వెళ్లి గొర్రెలను మేపుకు రావటం, వంట కు కట్టెలు ఏరుకు రావటం, అడవి లో పళ్ళూ, దుంపలూ సేకరించటం.. లాంటి పనులన్నీ చేస్తుండే వారు. మరీ చిన్న పిల్లలు పొలం లో తండ్రి తోటే, అక్కయ్య ల సంరక్షణ లో వుండే వారు.


ఒక రోజు పెద్ద అమ్మాయి అడవి లోకి వెళ్ళింది కట్టెలు తీసుకొచ్చేందుకు. చాల సేపు తిరిగిందేమో.. అలిసిపోయింది. ఈ పిల్ల కు పొద్దు పోయేందుకు ఏదో ఒకటి బాగా ఆలోచించటం అలవాటు. (మొత్తానికి కుటుంబం అంతా పల్లెటూరి అమాయకత్వం). ఒక ఓక్ చెట్టు కింద ఒక బండ మీద కూర్చుని సేద తీరుతూంది. ఇంతలో ఒక ఆలోచన వస్తుంది. 'కొన్నాళ్ళకు తనకు పెళ్లవుతుంది. ఒక కొడుకు పుట్టుకొస్తాడు. వాడికి తను 'కికోసు' అని పేరు పెట్టుకుంటుంది. ఈ కిసోసును తన వీపుకు కట్టుకుని పనులు చేసుకుంటుంది. కొన్నాళ్ళకు వాడు పెద్దవుతాడు. పెద్దయ్యాక తనూ అడవికోస్తానని మారాం చేస్తాడు. తను వెంట పెట్టుకు రావల్సోస్తుంది. చిన్న వాడు కదా.. ఈ ఓక్ చెట్టు ఎక్కుతానంటాడు. తను వద్దంటుంది.. అయినా అరచి గోల చేసి చెట్టు ఎక్కుతాడు. చిన్న పిల్లవాడు కదా.. పట్టు తప్పి ఇదిగో.. ఈ పెద్ద రాయి మీద పడతాడు (తను కూర్చున్న బండ రాయి) అప్పుడు తల కి తెబ్బ తగిలి, తన చిన్ని కికోసు చనిపోతాడు....'


ఈ ఆలోచన రావటం.. ఇక అంతే ! దుఃఖం ఒర్చుకోలేక ఆ అమ్మాయి ఏడుపు మొదలు పెడుతుంది! ఒక పాట కూడా పాడుతుంది. (ఆ పాట మొత్తం తన కధే.. )

" .......................................................................

........................................................................... (జరిగిన సంఘటనా క్రమం..)

బుజ్జి కికోసు, చిట్టి కికోసు.. మరి ఇక లేవ నా తండ్రీ !"

.... అంటూ ఏడుస్తూ ఆ చెట్టు కిందే కూర్చుని వుండిపోతుంది. కాసేపటికి ఇంట్లో తండ్రి కి కంగారు మొదవుతుంది.. తన కూతురు అడవి కి వెళ్ళింది.. ఇంక రాదేం! అని. ఇంకో అమ్మాయిని అక్కని తీసుకురమ్మని పంపిస్తాడు. తను వెళ్ళాక అక్కయ్య.. తన గాధ చెప్పి - 'అయ్యో చెల్లి! మన కికోసు కి ఇలా అయిందే !' అని బావురుమంటుంది ఆ పిల్ల .. 'అయ్యో ! ఈ పిన్ని కి కనిపించకుండానే పోయావా కికోసూ!' ఏడుస్తుంది. ఇద్దరు మళ్లా ఆ పాట పాడతారు.


ఇలా.. ఇంట్లో అందరూ మిగిలిన వాళ్ళని వెతుక్కుంటూ రావటం, కికోసు కధ విని ఏడుపులు పెడబొబ్బలు పెట్టడం.. జరిగి ఆఖరికి తండ్రి కూడా రావలసి వస్తుంది.. ఆ రైతు కూడా తన మనవడి గురించి విని.. ఎంతొ బాధ పడి, చివరికి చేసేది లేక కేవలం ఊహలో పుట్టిన ఆ కికోసు కి ఆ అడవి లోనే అంత్యక్రియలు నిర్వహిస్తాడు. ఆ తరవాత భారమైన మనసు తో అంతా ఇంటికి చేరతారు.


ఈ పుస్తకం లో ఇలాంటి అమాయక గాధలు బోల్డన్ని ఉంటాయి. సైన్యం లో చేరి ఎప్పటికీ ఇల్లు చేరని ఒక కొడుకు, అతని ముసలి తల్లి ఎదురు చూపులు.......... ఇంకా ఒక గయ్యాళి భార్య కధ, చాల ప్రముఖమైన 'తాతకు ఉత్తరం' కధ.. ఇలా చాలా కధలు ఉన్నాయి!


ఈ కికోసు కధ గురించి ఈ బ్లాగు ప్రపంచం లో ఎందరికి తెలుసో తెలుసుకోవాలనుంది. నాకో కికోసు పుడితే ఈ కధ చెప్పాలని ఉంది. మా అక్కయ్య వాళ్ల అబ్బాయి కి చెప్పింది. (మేమిద్దరం ఎప్పుడూ ఒకటే స్కూల్.. కాలేజి... కాబట్టి తను కూడా ఈ కధ కు అభిమానే! ) ఈ కధ లో ఏముంది గొప్పతనం అంటే.... ఏమి లేదు! ఫక్తు అమాయకత్వం, మంచి తనం, జాలి, కరుణ, ప్రేమ, అభిమానం తప్ప! పిల్లలకు తెలియాల్సిన విషయాలు అవే కదా! కధ చదివాక చిన్నపిల్ల గా నా మనసు బరువెక్కటం గుర్తుంది. కికోసు పుట్టనే లేదు! కానీ అతని మరణం అనే భావన ఆ కుటుంబాన్నంతటినీ కదిలించడం కాస్త తమాషా గా అనిపించినా ఆ కనిపించని కికోస్ నే వాళ్లు ఎంతగా అభిమానిస్తారో అనిపిస్తుంది.


అందుకే.. ఈ కికోసు కధ ఎవరికైనా తెలుసా?!..... అని చిన్న ఆలోచన. ఆ పుస్తకం బహుసా ఇప్పుడు ముద్రణ లో లేక పోవచ్చు. ఈ పుస్తకంలో illustrations అన్నీ Roald Dahl పిల్లల పుస్తకాల లో మాదిరిగా వుంటాయి. ఈ కధ ఎవరు రాసారో తెలుసుకోవాలని ఉంది. సోవియట్ లాండ్ పాఠకులకు తెలుస్తుందేమో అని కొంచం ఆశ!

4 comments:

sujatha said...

పిల్లల్లో ఉండే అమాయకమైన ఊహలు, వాళ్ళ భావావేశం,బాధ ఇవన్నీ కికోసు కథలో ఎంతో బాగా చిత్రించి ఉంటారు కదూ! అదలా ఉంచి, ఆ పాప ఊహను వాళ్ళ నాన్న (ఎనిమిది మంది పిల్లల తండ్రి) అర్థం చేసుకుని, కికోసుకి అంత్యక్రియలు జరిపించడం మనసుని తాకింది.

మా నాన్నగారు కమ్యూనిస్ట్ సానుభూతి పరులు కావడం వల్ల, మా ఇంటికి నా చిన్నప్పుడు సోవియెట్ భూమి, సోవియెట్ సమీక్ష మొదలైన పుస్తకాలు వచ్చేవి. రంగు రంగుల యాపిల్ తోటల ఫొటోలూ అవీ గుర్తున్నాయి కాని ఈ కథ గుర్తు లేదు.

పిల్లల ఊహలు ఎంత deep గా ఉంటాయో అర్థం చేసుకోవడం కష్టం సుమండీ!

sujata said...

సుజాత గారు. Thanx a lot for the comment. కికోసు మీకు తెలియదా.. అయ్యో! నాకు ఇప్పుడు అది సోవియట్ ల్యాండ్ లో కాకుండా ఒక వేరే కదల పుస్తకం లో కధ ఏమో అని అనిపిస్తుంది. మర్చిపోయనేమో. కాని అది ఖచ్చితంగా రష్యన్ కధ.

బొల్లోజు బాబా said...

very nice and good post.

bollojubaba

కొత్త పాళీ said...

Unfortunately don't know Kikosu, but "తాతకు ఉత్తరం" may be Chekov's story Vanka Jukov.