Pages

15/12/2008

విజయ్ దివస్ 2008మన వీర సైనికులు 1971 లో పాకిస్తాన్ పై యుద్ధం లో సాధించిన విజయాన్ని పురస్కరించుకుని, ఒక ఉత్సవం లా, 'సలామే శస్త్ర్', 'సలామే శోక్'ల, దేహాన్ని పులకింపచేసే సైనిక లాంచనాల నడుమ దేశవ్యాప్తం గా ప్రతీ యేడూ, డిసెంబర్ 16 న 'విజయ్ దివస్' జరుగుతుంది. భారత రక్షక దళాల స్మృత్యర్ధం, ముఖ్యంగా మన సార్వభౌమత్వాన్ని కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన అమర వీరులెందరికో నివాళులర్పించే కార్యక్రమం ఇది.


ఈ మధ్య ముంబయి దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వీర సైనికుల నుంచీ, ఎక్కడో జమ్మూ కాశ్మీరులోనో, అసోం లోనో తీవ్రవాదాన్ని ఎదురుకొంటూ అసువులు బాసిన బారత మాత ముద్దు బిడ్డలందరికీ వందనాలు చెల్లించుకోవడానికి, ఈ విజయ్ దివస్ ఉత్సవాలు ఉపకరిస్తాయి.


అయితే, ఇది కేవలం స్టేట్ ఫంక్షన్ గా మాత్రమే ఇంత వరకూ నిర్వహిస్తున్నారు. దీనికి పటాటోపం లేదు. బేనర్లు ఉండవు. ప్రకటనలు ఉండనే ఉండవు. అయితే ఈ సారి ఈ సంవత్సరం ఈ ఫంక్షన్ ని కాస్త ఘనంగా నిర్వహిస్తున్నారు. టీవీ కవరేజ్, ఉత్తేజ పరిచే ప్రసంగాలూ, గారిసన్ చర్చుల్లో ప్రత్యేక రెమెంబరెన్స్ సర్వీసులూ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహకారంతో మన హైదరాబాద్ లో రేప్పొద్దున్న పెరేడ్ గ్రౌండ్స్ లో స్టేట్ ఫంక్షన్ ఉంది. సాధారణంగా వీటిల్లో - రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులూ, కంటోన్మెంట్ లో సీనియర్ సైనికాధికారులూ పుష్పగుచ్చాలు సమర్పించడం (రీథ్ లేయింగ్) ఒక ముఖ్య కార్యక్రమం. కేవలం పుష్పగుచ్చాలు ఉంచడమే కాదు, ఈ సారి ఈ అమర వీరుల జ్ఞాపకార్ధం ప్రత్యేక ప్రార్ధనలూ, సమావేశాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా కార్గిల్ లాంటి ప్రదేశాల్లో దేశ భక్తీ, భావావేశాల మధ్య జరిగే విజయ్ దివస్ ని మీరూ కొంచెం ఎంజాయ్ చెయ్యండి.


ఈ విజయ్ దివస్ కి ఒక ప్రత్యేకత ఉంది. కార్గిల్ తరవాత, ఈ వీరుల్ని మనస్పూర్తి గా గౌరవించుకోదగిన సందర్భం మనకు, నవంబరు 26 కలిగించింది. ప్రభుత్వమూ, వ్యవస్థా విఫలం అయి, హీన దీన పరిస్థితిలో పడిపోయిన దేశ ప్రతిష్ఠ ని నిలబెట్టడం కోసం, కొన్ని వందల మంది ప్రాణాల్ని కాపాడడం కోసమూ తమ ప్రాణాలు ఒడ్డి పోరాడిన మన రక్షక దళాలని, మనలో ఒక జాతి-స్తైర్యాన్ని నిలిపిన ఈ మంచి ముత్యాల్ని, ఘనులనీ, కొంచెం గౌరవించుకునే అవకాశం ఈ విజయ్ దివస్. [కార్గిల్ విజయం సందర్భంగా ఇంకో విజయ్ దివస్ ను జూలై 26 న జరుపుకుంటారు. అయితే ఇది ముఖ్యంగా కార్గిల్, సొనామార్గ్ లాంటి మిలిటరీ లొకేషన్ లలో ఘనంగా నిర్వహిస్తారు]


దురదృష్ట వశాత్తూ, మనం థాంక్ లెస్ ప్రజలం. పోలిటీషియన్ ల,సినిమా వాళ్ళ సభలకు లారీల్లోనూ, ట్రక్కుల్లోనూ హాజరయ్యే జనంలో ఒక్క పావు వంతయినా ఈ విజయ్ దివస్ కు హాజరు కాము. మనలో క్రైసిస్ తరవాత కలిగే సంఘీభావం ఒక వారం పది రోజులు దాటగానే శ్మశాన వైరాగ్యం మాదిరి, కరిగి నీరయిపోతుంది. హైదరాబాద్ రన్లూ, వైజాగు రన్ లూ అంటూ పరుగులు తీసే యువత కొందరయినా ఈ విజయ్ దివస్ నాడు ఈ వీరుల్ని కొంచెం తలచుకోండి. కనీసం వార్తల్లో ఈ ప్రస్తావన వస్తే ఒక్క నిముషం, వీళ్ళ కోసం ప్రార్ధన చెయ్యండి. కనీసం ఈ రోజు ఈ అమర వీరులకు హృదయ పూర్వకంగా థాంక్స్ చెప్పండి.

3 comments:

సిరిసిరిమువ్వ said...

ప్రతిరోజూ కాకపోయినా కనీసం ఈ రోజైనా మన సైనికులని గుర్తుకు చేసుకుందాం. మనం ఈ మాత్రమన్నా భయం లేకుండా నిశ్చింతగా ఉంటున్నామంటే దానికి కారణం మన సైన్యమే. మన జండా తరువాత మనం అంత విలువ ఇవ్వవలిసింది వాళ్లకే. అమర జవాన్లకి మన నివాళి ప్రకటిద్దాం.

నరసింహ said...

సిరిసిరిమువ్వ గారి అభిప్రాయమే నా అభిప్రాయం కూడా.
గుర్తు చేసిన మీకు అనేకానేక ధన్యవాదములు.

Sravya said...

Thanks for remembrance of good info !

My sincere tributes to all these real heros who lost their lives to save our national pride !