గత నెల స్విట్జర్లాండ్ వెళ్ళాను. స్విట్జర్లాండ్ చాలా చాలా అందమైన దేశం !!! స్వర్గం మన కోసం పైనుంచీ తెరుచుకున్న అనుభూతి... మంచుకిరీటాలు పెట్టుకున్న పర్వతాలూ.. స్వచ్ఛమైన నీళ్ళతో ఎటు చూసినా లేక్ లూ, పచ్చని ప్రకృతీ, ఆహ్లాదకరమైన వాతావరణం; ఎంతసేపు చూసినా.. ఎన్ని సార్లు చూసినా ఇంకా చూడాలనిపించే మంచి ప్రదేశాలూ -
జీవిత కాలానికీ సరిపోయే హాలీ డే అది.
ముఖ్యమైన పర్యాటక స్థలాలలో ఎక్కడ చూసినా భారతీయులూ, తమిళులూ, తెలుగు వారూ, గుజరాతీ, పంజాబీలు... అసలు విదేశం లో ఉన్నామా.. ఇండియా లో ఉన్నామా అని అనుమానం కలిగింది. స్విట్జర్లాండ్ లో కొన్ని విషయాలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. అందరికీ తెలిసిన ప్రకృతి అందాలూ, స్విస్ బాంకులూ, గడియారాలూ, పాల ఉత్పత్తుల తో పాటూ, అక్కడి జన జీవనం, సంస్కృతీ కూడా ప్రత్యేకంగా అనిపించాయి. ఎవరు వెళ్ళినా ఒకే కబుర్లు చెప్తారో - బోర్ అనుకుంటున్నారా? మరి నాకు నచ్చిన విషయాలు కొన్ని - వినండి.
మొదట - జెనీవా లో ట్రైన్ స్టేషన్ ఎదురుగా, ఓల్డ్ టౌన్ వీధుల్లో కనిపించిన ఈ శిల్పం ఏమిటో తెలియలేదు. దేహం లో ఒక సగం స్త్రీ, మిగతా సగం సింహం - చూడగానే స్ఫింక్స్ లా అనిపించినా.. అసలు ఆ శిల్పం ఎవరిదో, ఏమిటో తెలియలేదు. ఇంటర్నెట్ లో చాలా వెతికినా.. అసలు ఇలాంటి శిల్పం ఎక్కడా కనిపించ లేదు. బహుసా స్విస్ లెజెండ్ ల లో పాత్ర అనిపించింది. ఎవరికైనా తెలిస్తే కాస్త జ్ఞానాన్ని పంచండి.
కళ - వీధుల్లో మాన్యుమెంట్లూ, ఒలింపిక్ క్రీడలు నిర్వహించిన గర్వమైన జాడలూ! క్రీడల పట్ల మక్కువ, ఫ్రెంచ్, ఇటాలియన్, జర్మన్ భాషలు మాత్రమే తెలిసినా.. మనకు హెల్ప్ కావాల్సి వస్తే.. నానా కష్టపడీ, సైగలు చేసీ.. సాయపడాలనుకునే జనం, ఇలా ఎన్నో! భారతీయులం అని మనని గుర్తు పట్టే వాళ్ల మంచితనం, 'కనిపించని రేసిజాన్ని' ఎదుర్కొన్న ఎందరో హృదయాల్ని కదిలిస్తుంది.
ఇంకో ప్రత్యేకత, ఇక్కడి మంచి నీటి ఫౌంటేన్లు. దేశం లో ఎక్కడికి వెళ్ళినా, వీధుల్లో ప్రత్యక్షం అయ్యే ఈ ఫౌంటేన్ల లో పూర్వ కాలం లో, మంచి నీటిని సరఫరా చేసే వారంట. ఈ ఫౌంటేన్లు ఇప్పటికీ నిర్విరామంగా పని చేస్తూనే ఉన్నాయి. రక రకాల డిజైన్ లలో తయారయిన ఈ ఫౌంటెన్లు కొండల్లో కరిగి, చెలమల్లో ప్రవహించే జలాన్ని సాంప్రదాయ పద్ధతులలో ఫిల్టరు చేసి, వీధుల్లో అందరికీ.. మంచి నీటి కుళాయి మాదిరిగా సరఫరా చెయ్యడానికి తయారయింది. ఇప్పటికీ ఈ నీళ్లు తాగడానికి సురక్షితం. ఎందరో మళ్ళీ మళ్ళీ నీళ్లు కొనుక్కోనక్కర్లేకుండా. ఖాళీ అయిన నీళ్ళ బాటిల్లు ఇక్కడే నింపుకుంటున్నారు.
యూరో - 08 ఏర్పాట్లలో, ఆస్ట్రియా - స్విట్జర్లాండ్ దేశాలు బిజీ గా ఉన్నాయి. ఎక్కడ చూసినా యూరో - 08 గురించిన సమాచారం, కోలాహలం, షాపుల లోనూ, రోడ్ ల మీదా.. జెండాలూ, పోస్టర్లూ కనిపించాయి. రైళ్ళూ, ట్రాములూ, బస్సులూ, బోట్లూ, ఇలా అన్ని రవాణా సదుపాయాలూ.. చాలా ఎక్కువగా అందుబాటు లో ఉన్నాయి. వీటి టికెట్లలో రక రకాల ఆఫర్లు కూడా ఉన్నాయి. ఒకే టికెట్ అన్ని రవాణా సాధనాలనూ వాడటానికి ఉపయోగపడేలా.. చాలా సౌకర్యమైన పద్ధతులు.. ప్రజలను పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను ఎన్నుకునేలా చేస్తాయి.
మేము చూసిన ప్రదేశాలూ, తిరిగిన కొండా, కోనా, చరిత్రా, ట్రావేలాగూ రాసే కన్నా.. అందర్నీ.. తప్పకుండా చూడండీ అని చెప్పడం సుళువు. ఎందుకంటే.. ఆ అనుభవాల్ని కవితాత్మకంగా, రసాత్మకంగా.. ఇంకా నానా రకాలుగా అందంగా చెప్పడం నాకు రాదు. (మా తెలుగు అయ్యోరు - ఛందస్సు సరిగా చెప్పలేదు.. పద్యాలల్లడం అసలు చాత కాదు!!) అక్కడ చాలా ప్రదేశాల్లో చూసిన భారతీయుల్ని.. ప్రత్యేకంగా ఇండియా నుంచీ హాలీడే కు వచ్చిన కుటుంబాలనూ చూసి, చాలా ఆనందం కలిగింది. COOP లాంటి డిపార్ట్మెంట్ స్టోర్లలో చాలా మంది తెలుగు వారు తారస పడ్డారు.
మొత్తం మీద చాలా ఆశలు పెట్టుకుని వెళ్ళినందుకు స్విట్జర్లాండ్ మంచి అనుభూతులనే మిగిల్చింది. ఇంకా ఇంకా.. ఇంకా ఇంకా.. ఇంకో సారి వెళ్లి వద్దామని బోల్డన్ని కోరికలు పుట్టించింది. ఇంకో సారి వెళ్ళే అవకాశం వస్తే తప్పకుండా వెళ్లాలని నిర్ణయించుకుని తిరిగి వచ్చాం.
3 comments:
ఈ దిగువ ఇచ్చిన లింక్ లో మీరు చూపిన Lady with Lion body statue యొక్క మరో దృక్కొణాన్ని చూడవచ్చు.
http://www.mushero.com/trips/europe/europe_1003/geneva_town.html
ఒక్క జెనీవా గురించే రాశారు.మిగతా ఊళ్ల గురించి వీలు చేసుకొని రాయండి.మీ యాత్రానుభవం బాగుంది.
CB Rao గారూ..
థాంక్స్. మీరు ఇచ్చిన లింక్ కూడా చూసాను. ఈ శిల్పం చాలా కుతూహలాన్ని కలిగించిందన్నమాట! మిగతా ప్రదేశాల గురించి కూడా రాయటానికి ప్రయత్నిస్తాను. థాంక్స్.
Post a Comment