Pages

01/08/2023

Victory City - Salman Rushdie



రెండువందల నలభై ఏడు ఏళ్ళ వనిత, కళ్ళు లేని కవయిత్రి, మంత్రగత్తె, సోది చెప్పే "పంప కంపన" ఈ బిస్నగ సామ్రాజ్యం గురించి రాసిన దీర్ఘ కవిత ఈ "విక్టరీ సిటీ". అంటే విజయ నగరం కథ.   కాల పురుషుడు మన హెచ్చు తగ్గుల్నీ, జరామరణాల్నీ నిర్ద్వందంగా చూస్తూ ఏ అనురక్తితో సృష్టి స్థితి లయ విన్యాసాలు చేస్తాడో అలా రష్దీ,  "విజయనగర సామ్రాజ్యాన్ని" సృష్టిస్తాడు.  దాని కర్తా, కర్మ క్రియల్ని దర్శిస్తాడు. ఆఖరికి  దాని వినాశనాన్ని కూడా దర్శింపచేస్తాడు. ఇది  మొదటి విజయనగర రాజుల నుండీ, మలినాటి తుళువ వంశం / ఆఖరికి రామరాయల దాకా,  వాళ్ళు గెలిచిన, ఓడిన రాజ్యాల దాకా,  హంపి వీధుల్లో, శిధిలాల్లో, బండరాళ్ళ గుట్టల్లో, తుంగభద్ర అలల్లో, చరిత్రను  వెతుక్కునే యాత్రీకుడి కళ్ళ ఎదుట ఓ మహా సామ్రాజ్యాన్ని దృశ్యాలుగా నిలబెట్టి, పెద్ద సినిమా చూపించినట్టు చూపిస్తాడు. 

ఈ పుస్తకాన్ని నేను చాలా ఎంజాయ్ చేసాను. రాజుల కథ, చందమామ కథ లాగుంది. అయితే ఓ హైదరాబాదీ గా, హంపి, బీదర్, ఔరంగాబాద్ లాంటి మహరాష్ట్ర లో కొన్ని భాగాలు, గత మూడేళ్ళలోనే కవర్ చెయ్యడంతో రష్దీ వర్ణనలు మరీ బాగా మెదడులోకి ఇంకి, పైగా, ఇలాంటి చందమామ కథల సినిమాలు చూసి ఉండడంతో  ఎక్కువగా ఆనందించగలిగాను.  "పంప కంపన" ఈ నవల్లో హీరోయిను. ఆవిడ తండ్రి ఓ మామూలు బుల్లి రాజు. ఆయన ఆ రోజుల్లో దిల్లీ సుల్తానుల కోసం దక్షిణాదిన  జరిగిన అసంఖ్యాక యుద్ధాలలో,  అంటే, మరీ స్పష్టంగా చెప్పాలంటే, "ఊరూ , పేరులేని" ఒకానొక  యుద్ధంలో ప్రాణాలు కోల్పోతాడు.  తల్లి, నది ఒడ్డున తనలాంటి మిగిలిన   యుద్ధవీరుల విధవలతో కలిసి  మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది.  అప్పటికి బాలిక అయిన పంప (తండ్రి పేరు కంపన)  కళ్ళెదురుగానే,  ఆ నిప్పుల్లోకి మౌనంగా వ్యాహ్యాళికెళ్తున్నట్టు వెళ్ళిన తల్లి, ఇంకా ఆ   స్త్రీల బృందం, మంటలు శరీరాన్ని దహించివేస్తున్నా, మాంసం కాలి నరకయాతన అనుభవిస్తున్నా, చిన్న కేక కూడా బయటికి రానివ్వకుండా ధైర్యంగా సజీవ దహనం అయి చనిపోతారు. తల్లి  ఆ నిప్పుల్లోకి తన చేతిని వొదిలి నడిచెళ్తుంటే, ఇదుగో ఇప్పుడే వచ్చేస్తుందిలే అని ఎదురు చూసిన పంప కి, ఆమె ఎముకల నుండీ కాలిన మాంసం రాలుతుంటే, తల్లి ఇక తిరిగి రాదని అర్ధమయిపోతుంది.   బ్రతికేందుకు దమ్ము లేక, సుగంధ ద్రవ్యాలతో, గంధపు చెక్కలతో చితి పేర్చుకుని ఆ స్త్రీలు చేసిన ఆత్మత్యాగం విలువ ఏమిటో, ఆ చిన్న వయసులో కూడా పంపకేమీ అర్ధం కాదు.   అప్పుడే ఆమెకు చావంటే అయిష్టం కలుగుతుంది. ఎప్పటికీ ఆత్మ హత్య చేసుకోకూడదని, చావు  దేనికీ పరిష్కారం కాదనీ ఆ క్షణాన్నే బాల్యాన్ని కోల్పోయిన ఆ పిల్ల గట్టిగా నిశ్చయించుకుంటుంది.   ఏదో తెలీని గగుర్పాటుతో, తీవ్ర అలజడితో పంపా నది ఒడ్డున నుల్చున్న ఆ అనాధ పిల్లకు అశరీరవాణి  "దీర్ఘాయువు"ను ప్రసాదిస్తున్నట్టు వరం ఇస్తుంది. 

తల్లి  తండ్రీ ఇద్దరూ పోయాక అనాధ అయిన ఆ పిల్ల, ఒంటరిగా ఈ దుష్ట ప్రపంచంలో  ఎలా బ్రతికి బట్టకట్టిందో, ఎలా దోపిడీకి గురయిందో, ఏమి కష్టాలు చూసి బ్రతికిందో చెప్పలేను.  విజయనగర  సామ్రాజ్యాన్ని  స్థాపించడంలో విద్యారణ్యులనే ఓ ఋషి పాత్ర ఉంది కదా.  ఈ కథలో అతను విద్యాసాగరుడు.  పంప  అనాధయేటప్పటికి ఈ విద్యాసాగరుడు  యువ సన్యాసి. ఒక్కడూ గుహలో తపస్సు చేసుకుంటున్నాడు.  ఆధ్యాత్మిక  గ్రంధాలని చదువుకుంటున్నాడు. అతని  ఆశ్రయంలోకి "పంప"ని విడిచిపెడతారు. పగలు  ఎలానో పనిపాటల్లో గడిచిపోయినా , రాత్రి సమయాల్లో ఆ యువకుడూ, ఈ వయసొస్తున్న పిల్లా ఒకే గుహలో పడుకుంటారు. కఠోర బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్న ఆయువ సన్యాసి కాస్తా,  ఆమెను శారీరకంగా వాడుకునేవాడు. 'పంప'  ఎలాగో బ్రతకడం కోసం,  ఇంకో దిక్కు లేక, తనని ఇలా వదిలేసిన తల్లిని నిందించుకుంటూ అతని పంచనే ఉండాల్సి వచ్చింది.  అయితే, అప్పటినించీ పంప 'మాట'లాడలేదు.   ఆమె మౌనం ఎన్ని సంవత్సరాలు  గడిచిందంటే, తనతో అన్నేళ్ళు 'బానిస'లా బ్రతికిన ఆ పిల్ల పేరేంటో  విద్యాసాగరుడికి తెలీదు. 


పంప యౌవనంలోకి వచ్చేసరికి అసమాన సౌందర్యవతి అయింది.  ఆమె సౌందర్యం లో ఎంతో గాంభీర్యం, హుందాతనం ఉండేవి.  అప్పుడే ఆ గుహ దగ్గరకి అప్పటికి చుట్టుపక్కల రకరాలుగా జరుగుతుండే యుద్ధాల్లో సైనికులుగా పనిచేసుకుంటూ, జీవిక చూసుకునే ఇద్దరు అన్నదమ్ములు (హరిహర బుక్క రాయలు) వస్తారు. వాళ్ళకి రాజ్య విస్తరణ (స్థాపనా) కాంక్ష ఉంది. విద్యాసాగరుని ఆశీర్వాదం కోసం వస్తారు వాళ్ళిద్దరూ.   గురువు దగ్గరికి ఒట్టి చేత్తో ఏమొస్తారు ? కొన్ని పళ్ళు, విత్తులూ ఉన్న బుట్ట ని తీస్కొస్తారు.   గురువు అప్పటికి పెద్దవాడయ్యాడు. పంప అతని కూతురో / భార్యో ఎవరికీ తెలీదు.  పంప  అంతవరకూ మూగదనే అనుకుంటున్నారందరూ.  

రాజ్యం మాటొచ్చాక పంప తొలిసారిగా వారితో మాటాడింది. వాళ్ళు తీసుకొచ్చిన విత్తనాల్ని వాళ్ళకే ఇచ్చి,  తుంగభద్ర చుట్టుపక్కలంతా చల్లమంది. ఆ  విత్తనాల్లోంచీ మనుషులు పుడతారు. దేశమంటే మట్టి కాదు కద. దేశమంటే ప్రజలు. ఆ  ప్రజలు అంటూ ఏర్పడ్డాకా, ఒక కోట కట్టి, అందులో రాజ్య స్థాపన చెయ్యమంటుంది. రాళ్ళు, రప్పలతో నిండిన ఆ భూమిలో ఆమె ఏ మంత్రం వేసి ఆ విత్తనాలిచ్చిందో కానీ,  వీళ్ళు ఇలా చల్లాక, తెల్లారేసరికీ ఓ అందమయిన రాజ్యం స్థాపించేయగలిగారు. 'ఖావల్సినంత' మంది  ప్రజలు  ఆ విత్తుల్లోంచీ పుట్టుకొచ్చారు. రకరకాల వృత్తుల వారు. వ్యాపకాలవారు. వ్యాసంగాలవాళ్ళు.. బోల్డుమంది.  మాట వినే ప్రజలు.. వాళ్ళకి గతం లేదు.  ఈ కొత్తజీవితంలో కొత్త ప్రాణులే అయినా, పంప  తన అలౌకిక శక్తులను వాడి, అశరీరంగా మారి,  ప్రతి ఒక్కరి చెవిలోనూ వాళ్ళకో కథ చెప్పేది… ఉదాహరణ కు కుమ్మరి వాడున్నాడనుకోండి.. "నీ పేరు ఫలానా… నువ్వు వృత్తి రీత్యా కుమ్మరివి.. నువ్వు ఎంతో నైపుణ్యంతో కుండలు చేస్తావూ" అని.. అలాగే వడ్రంగి నుంచీ సైనికుడికీ.. అందరికీ తమ తమ పాత్రలు తెలుసు. అదే  పంప పుట్టించిన రాజ్యం. పంప  సృష్టించిన మనుషులు.  పంప  చెప్పిన కథల్నే తమ తమ జీవితాలు చేసేసుకున్న ప్రజలు.  ఆలా విజయనగర సామ్రాజ్యం మొదలయింది. 

బుక్క రాయలు, అతని తమ్ముడు హుక్క రాయలలో మొదట ఈ రాజ్యానికి రాజు ఎవరవ్వాలి? రాజు  అంటూ అయాక, రాణి ఉండాలి కద మరి, పంప ని ఇద్దరూ ఇష్టపడుతున్నారాయె.  వీళ్ళిద్దరిలో పంప ఎవరిని ఎన్నుకుంటుంది?  పంప ఇద్దరినీ పెళ్ళాడుతుంది. మొదటి భర్తతో కొడుకుల్నీ, రెండో భర్తతో కూతుర్లనీ కంటుంది.  భర్త  ఉండగానే  తమ రాజ్యానికి గుర్రాలమ్మేందుకని వచ్చిన పోర్చుగీసు యువకునితో ప్రేమలో పడుతుంది.  అలా రాజు భార్యతో సంబంధం పెట్టుకోవడం పులిబోనులో తల పెట్టడమే అని తెలిసినా ఆమెను వొదులుకోలేని ప్రియుడూ, తన కళ్ళెదురుగానే ప్రియుడితో తిరిగే "ప్రశ్నించే వీలు కాని" భార్య ఉన్న రాజూ..  నిజానికి ఆవిడతో ఇక గడిపేందుకు భయపడో, అలా ఉండలేక బాధపడో, రాజు ఎక్కువగా యుద్ధాలలోనే గడిపేవాడు. అలా దక్షిణాదిన ముసల్మానుల రాజ్య విస్తరణను అడ్డుకుంటాడు. 

అదో  పెద్ద  కథ… పంప కంపన ఆతరవాత రెండు వందల ఇరవైయేళ్ళు బ్రతికింది. "తన వాళ్ళ" చేతే  వెళ్ళగొట్టబడింది.   రాజ్యం ఎన్ని చేతులు మారుతుందో చూస్తుంది. విజయనగరం రకరకాల వంశాల చేతుల్లోకి వెళ్తుంది. తను  సృష్టించిన ప్రజలే ఆమెను అసహ్యించుకుంటారు. కొన్నేళ్ళు అజ్ఞాతవాసం చేసి తిరిగొస్తుంది. భర్తలు, ప్రియులు, పిల్లలు – అందరూ తన కళ్ళెదుటే చనిపోతారు. విద్యాసాగరుడు చాలా సంవత్సరాలు బ్రతుకుతాడు.   అతను మతమౌడ్యం మీద పునాదులేసుకుని, ఒక ఆశ్రమాన్నేర్పరచి, తరవాత రాజ్యవ్యవహారాలో చేయి పెట్టి,  రాజులాగా  దిగ్విజయంగానే బ్రతుకుతాడు.   పంప కంపన రాజ్య బహిష్కరణకి కారణం అవుతాడు.  ఎన్నో ఏళ్ళపాటు అడవుల్లో తలదాచుకుని, కాలంతో ప్రయాణం చేసి,  ఆఖరికి శ్రీ కృష్ణదేవరాయని కాలం లో పంప, తన ముని ముని ముని ముని ముని ముని మనవరాలితో కలిసి, రాజ్యానికి తిరిగొస్తుంది.  

తిమ్మరసు అంతటి "మంత్రిణి" అవుతుంది. ఎన్నో  అత్భుతాలు చేస్తుంది. పుట్టుక నుంచీ, విజయనగరం గతించిపోయే దాకా, దాని చరిత్రను స్వయంగా రచిస్తూ, దానితో పాటూ పుడుతూ, నశిస్తూ, మళ్ళీ జీవిస్తూ, ఎన్నో బాధలు సహిస్తుంది.   అయితే తన జీవితాన్ని అడుగడుగునా డాక్యుమెంట్ చేసి,  ఓ దీర్ఘ కవితలా రాసి, ఆ కాయితాల్ని ఒక మట్టి కుండలో భద్రపరుస్తుంది.  అదే ఈ కావ్యం.  ఈ కావ్యం లో The Woman King సినిమా లో లాగా అత్యంత శక్తివంతులయిన మహిళా సైనికులుంటారు. వాళ్ళకి ఉక్కులాంటి శరీరం, భయం ఎరుగని ప్రవృత్తి, యుద్ధ విద్యల్లో నైపుణ్యమూ, అసామాన్యమైన విశ్వాసమూ ఉంటాయి.  

ఆమె జీవితయానంలో  "ఘన విజయనగర సామ్రాజ్యం"లో ఎందరో విదేశీయులు రాజు తో కలిసి పనిచేస్తారు. "పోర్చుగీసు ప్రేమికుడు" పంపకు ప్రతి తరంలోనూ, ఒకడు ఎదురవుతాడు.  ఆమె వయసు పెరగని, మృత్యువు రాని యవ్వనవతి.  200 ఏళ్ళ వయసుకి 24 ఏళ్ళ పడుచు మనిషిలా కనిపిస్తుంది.  ఆ మొదటి పోర్చుగీసు ప్రేమికుడు ఆమెను ఎంత ప్రేమించాడంటే, ఆమెకోసం మళ్ళీ మళ్ళీ పుడుతూనే వుంటాడు. సముద్రాలు దాటి ఏదో ఒక వంకతో మన దేశానికొస్తాడు. దక్షిణాది కి గోవా నుంచొచ్చి, పంప ఎదుట నిల్చిన ప్రతిసారీ.. "వచ్చావా!" అంటుంది ఆమె నింపాదిగా, ఆపేక్షగా, అతనొస్తాడని ముందే తెలిసినట్టు!    అతనికి పూర్వజన్మవాసనలుండవేమో.. "కొత్త యువకుడు"  ఈమెని చూసి, "ఎన్నో యుగాల పరిచయం ఉన్నట్టుందే, ఎవరీమె?" అనుకుంటూ..  అయోమయపడతాడు.  చాలా సహజంగానే ఆమెతో ప్రేమలోనూ పడతాడు. 

పంప  కూతుర్లలో ఒక ఆమెను విజయనగర రాజుని ఆశ్రయించిన ఒక  చైనీయుడు పెళ్ళాడతాడు. వారిద్దరి  ప్రేమకథ అపురూపం. నిజానికి  వాళ్ళు పెళ్ళి  చేసుకోరు. తరతరాలుగా  కొన్ని జన్మల పాటు, మళ్ళీ మళ్ళీ పుడుతూ, కలుస్తూ, ప్రేమించుకుంటూ, కలిసే ఉంటూ - బ్రతుకుతారు.  వాళ్ళ..."ముని ముని ముని కూతురు" పెద్దయి, తన అమ్మమ్మ తో కలిసి విజయనగరానికొచ్చి శ్రీ కృష్ణదేవరాయని  "ప్రేమిక " అవుతుంది.   అసలు పెళ్ళాడేదేమో కానీ, రాజ్య వ్యవహారాలు చక్కబెట్టాల్సిన తిమ్మరసు సలహా మీద రాయలు ఒక రాజకుమార్తెను పెళ్ళాడాల్సి వస్తుంది. ఆవిడ పట్టమనిషి కాబట్టి, పంప మనుమరాలు "ప్రధాన ప్రేయసి" గానే మిగిలిపోతుంది. 


ఆనాటి రాచరికపు మర్యాదలు, కుట్రలు, కుతంత్రాలు,  అమర్యాదలు, రాజుల స్త్రీలోలత్వమూ, యుద్ధ కాంక్ష, విస్తార భ్రమణమూ అన్నీ వర్ణనలు, ఎలా ప్రతీదీ ఉండేదో, ఎలా జరిగేదో, రాయలు, తిరుపతి నుంచీ సింహాచలం దాకా  వివిధ రాజ్యాలలో క్షేత్ర దర్శనాలు చేయడం, శాసనాలు రాయించడం, బోల్డన్ని గుళ్ళు కట్టించడం, గుళ్ళకు భూరి విరాళాలివ్వడం, రాజ్యాలు గెల్చుకోవడం, అతని భార్యలు కూడా వివిధ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి, సాంస్కృతిక, సాహిత్య రంగాలలో ప్రతిభని చాటడం, అతని రాజ్యంలో పేరెన్నిక  గన్న కవులూ,  రాజు స్వయానా అత్భుతమైన సాహిత్యం రచించడం, దక్షిణ, కళింగ దేశాలని ఏలడం..  వీటన్నిటినీ సల్మాన్ రష్దీ చాలా చక్కగా రాసుకొచ్చాడు.   ఇవన్నీ రష్దీ ఎలా ఒక కథ లో ఇమడ్చగలిగాడో అని చాలా ఆశ్చర్యం కలుగుతుంది. 

చదివే వాళ్ళకి కథంతా చెప్పేసి, అన్యాయం చేస్తానని నా మీద ఒక ప్రథ ఉంది. క్షమించాలి. ముగింపు  చదవడం మాత్రం ఒక అనుభవం. మన కథలు GOT కన్నా ఏం తక్కువ ? ముగింపు చదవడం కోసం ఈ పుస్తకాన్ని కొనుక్కోండి. 


చిన్న సందేహం : 

తల్లి లాంటి పంప కంపన ని అచ్చు మన "మహామంత్రి తిమ్మరసు" సినిమాలో లాగానే 'రాయలే ' కళ్ళు పొడిపించేసి,  గుడ్డిదాన్ని చేసేస్తాడు. అప్పుడు నాకు ఎంటీఆర్ మీద గొప్ప కోపం వచ్చింది. Hee hee !!   నవలంతా నాకు భానుమతీ, ఎంటీ ఆర్, నాగయ్య, వీళ్ళే కనిపించారు.  Is it my Telugu conditioning ???

ఒక సౌత్ ఇండియన్ గా, మిస్టిసిసం తో మెరుస్తూ ఉండే హంపి నగర వర్ణనల మధ్య సరిగ్గా అలాంటి అలౌకిక శక్తి ఉన్న పంప "కళ్ళతో చూసినదీ, జ్ఞానేంద్రియాలతో, మనసుతో చెప్పినదీ" అయిన ఈ "విజయ నగర" కథ ని చదివి ఈవిడ (Rushdie)  - ఈ "విజయనగరా"నికి  "బిస్నగ" (BISNAGA) అని ఎందుకు పేరు పెట్టిందో కాస్త చెప్పండి.   నాకు ఎంత వెతికినా సరిగా తెలీలేదు. "బిస్నగ సామ్రాజ్యం " అనడిగితే, వికీ  "విజయనగర సామ్రాజ్యాని" కి దారి చూపిస్తోంది. దాని వెనకేముందో కథ మరి!! 

***

2 comments:

josyulaspeaks said...

సల్మాన్ రష్డీ నవల నిజంగా అంత గొప్పగా ఉందో లేదో కానీ మీరు మాత్రం అద్బుతంగా రివ్యూ చేసారు...అసలు ఊహిస్తేనే ఆ కథనం ఆశ్చర్యంగా ఉందండీ...

సూర్య ప్రకాష్ జోశ్యుల

Sujata M said...

Thank you sir