31/07/2008
కధలు - ఆర్ కే నారాయణ్
ఈ రెండూ కధలూ Super funny గా ఉన్నాయి. వీటిలో మొదటిది - Woman in the Window
ఈ కధ భలే ఉంది. దీనిలో మన హీరో ఒక ఆడిటరు. సివిల్ / ప్రొడక్షన్ సైట్ కి డెప్యూట్ అయి, వెళుతూ, చిన్న ఆడిట్ పనులు చూసుకుంటూ వస్తూ ఉంటాడు. ఈ సైట్లు ఎక్కడో కారు అడవుల్లో లేదా కుగ్రామాల్లో ఉంటాయి. ఈయన మరీ పిరికి వాడు కాకపోయినా - సైట్ లో తన దగ్గరికి వచ్చే బిల్లుల్లో దేన్నీ ప్రశ్నిచేంత ధైర్యం లేనివాడు. ఎప్పటికప్పుడు పని ముగించుకుని వెళదాం లే అనుకునే సాధారణ యువకుడు ! ఇతనికి, సైట్ లో ఒక ఇల్లు ప్రొవైడ్ చెయ్యబడుతుంది ! ఆ ఇంట్లో అంబీ అనే ఒక వంట వాడు -కం- నౌఖరు ఉంటాడు.
ఈ అంభీ ఒక వాగుడు కాయ ! సినిమా పత్రికలు చదువుతూ సినిమా హీరోయిన్ ల గురించి భలే గాసిప్ చెప్తూ ఉంటాడు ! రాజకీయ నాయకులూ - ఊర్లో ఏనుగు దాడి చేస్తే తను చేసిన హీరో పన్లూ.. ఒకటి కాదు. ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. ఈ చెప్పడం కూడా ఎంత రసరమ్య శ్రవణానందకరంగా చెప్తాడంటే - మన హీరో గారికి అదొక్కటే టైం పాస్. ఆ అరణ్యంలో బయటికి వ్యాహ్యాళికి పోదామన్నా ఏ పాములో కుట్టేస్తాయని భయం ! ఏ పుస్తకమో పట్టుకుందామంటే, అంభీ మాటలు దాన్ని డామినేట్ చేసేస్తాయి. So, ప్రపంచం లో తనకు తెలియని వింతలూ విశేషాలూ అంభీ గొంతులో వింటూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు మన హీరో.
అయితే ఆఖరికి ఒక నాడు ఈ అంభీ - కబుర్లు దెయ్యాల మీదికి మళ్ళుతాయి. దెయ్యాలంటే నమ్మకం లేని హీరో - అంభీ వర్ణనలకూ, తను చెప్పే కబుర్లకి తీసుకొచ్చే ప్రమాణాలూ మాత్రం ఎక్కడో హీరో ని ఇరుకుని పెడతాయి. వాళ్ళు ఉంటూ ఉన్న ఇల్లు శ్మసానంలో కట్టినదనీ - చనిపోయిన వాళ్ళ అంతిమ సంస్కారాలు జరగక పోతే వాళ్ళు దెయ్యాలవుతారనీ - అలాంటి దెయ్యాన్ని - ఒక స్త్రీ దెయ్యాన్ని తను చూసేడనీ - చాలా నమ్మకంగా చెప్తాడు ! ఆ చెప్పడం కూడా ఎంత వివరంగా చెప్తాడంటే, హీరో కి వొళ్ళు గగుర్పొడుస్తుంది. ఆ ఫలానా స్త్రీ దెయ్యం బహుసా గర్భవతి అయుంటుందనీ, ఎందుకంటే ఆవిడ నడుము కి ఒక చిన్న పిల్ల వాని (Foetus) అస్పష్ట రూపం చేతుల్తో చుట్టుకుని వేలాడుతూ ఉంటుందనీ - తల పండిన హారర్ రచయిత లాగా చెప్తాడు అంభీ !
బాబోయ్! ఈ Description కి ఝడుసుకు చచ్చినా, బయట పడకుండా ఎలానో నెట్టుకొస్తాడు హీరో. పైగా తన అధైర్యాన్ని బయటపెట్టకుండా పెద్ద జోక్ చెప్పినట్టు విరగబడి నవ్వుతాడు ! అది ఒక నదీ పరీవాహక ప్రాంతం. ఒకప్పుడెప్పుడో వరదలకి అక్కడి శ్మశానం కొట్టుకుపోయిందిట ! ఈ దెయ్యాల గొడవ నాకెందుకులే అనుకుని ఎంత త్వరగా ఆ ప్రాంతం నుండీ బయట పడదామా అని ఉంటుంది అతనికి ! ఈ లోగా అదృష్టవత్తూ అతనికి బదిలీ అవుతుంది. వెళ్ళాల్సిన తారీఖు కూడా తెలుస్తుంది. కానీ దెయ్యం ఆలోచెనల తో భయపడిన వాడు - ఎలానో నెమ్మదిగా అంభీ కబుర్లతో కాలక్షేపం చేస్తూ ఆ దెయ్యం ప్రస్తావనే రాకుండా చివరి రోజు దాకా నెట్టుకొస్తాడు. ఈ రోజుల్లో అంభీ అతని బెడ్ రూం పక్కనే నేల మీద పడుకుంటూ ఉంటాడు. దెయ్యం భయానికి హీరో గది తలుపులు క్రాస్ వెంటిలేషన్ కోసం అంటూ Bedroom Doors తెరిచే పెట్టుకుని నిద్రిస్తూ ఉంటాడు.
ఆఖరికి రేప్పొద్దున్నే బయల్దేరాలనగా - రాత్రి నిద్ర పోతున్నవాడికి హఠాత్తుగా మెలకువ వస్తుంది. టైం ఎంతైందో చూసుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఒక స్త్రీ ఆకారం ఆ మసక చీకట్లో తన బెడ్ పక్కగా కనిపిస్తుంది. వీడికి పై ప్రాణాలు పైకి పోతాయి. ఆ స్త్రీ నడుముకి వేలాడుతున్న ఫీటస్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. నాలుగు కళ్ళూ అతన్ని చూస్తుంటే, ఆ దెయ్యం దెబ్బకి కళ్ళు గాట్టిగా మూసుకుని దుప్పటి కప్పుకుని పడుకుంటాడు. తెల్లారి ఎప్పుడో నిద్ర పడుతుంది.
అయితే, లేచాక మాత్రం - అపనమ్మకం, పిరికితనాల మధ్య ఊగుతున్న మనసుని అదుపు లోకి పెట్టేందుకు నానా రకాల ఆలోచనలు చేస్తాడు హీరో ! ''ఒకె ! ఇన్నాళ్ళూ అంభి గాడి వర్ణనలు విన్నాను కాబట్టి, అన్నం సరిపోక పోబట్టి, మగత నిద్ర లో ఏదో పిచ్చి కల కని ఉంటాను లే'' అని అనుకుంటూ ఉంటాడు.
స్నానించి, పక్కా బట్టలూ సర్దుకుని స్టేషన్ కు వెళ్ళేందుకు జీపు ఎక్కబోతుండగా అంభీ - అంటాడు 'ఇప్పటికైనా నమ్ముతారా సారు - దెయ్యాల్ని ?' అని ! హీరో కి మతి పోతుంది. 'అదేంటి' - అని అడిగితే, అంభి చెప్తాడు - 'రాత్రి మీరు ఆ ఆడ మనిషి దెయ్యాన్ని చూసారు సార్ ! నేనూ చూసాను !' అని! ఇంక అంతే!! సామాన్లు జీపు లోకి విసిరి, హీరో జీపు తో ఆ ప్రాంతం నుంచీ పరార్ !
ఇంకో కధ - The Gold Frame.
ఇదో ఫోటోలకు ఫ్రేములు కట్టే 'దాస్ ' కధ! దాస్ పనితనం పేరెన్నిక గన్నది. ఇతని షాపు కి రక రకాల ఫోటోలు ఫ్రేములు కట్టించడానికి వస్తూ ఉంటాయి. వీటిల్లో పెద్దవాళ్ళ ఫోటోలూ, దేవీ దేవతల ఫోటోలూ ఎక్కువ !
ఒక రోజు ఒక కస్టమర్ ఒక ఫోటో ఫ్రేం కట్టించేందుకు తీసుకొస్తాడు. ఆ ఫోటోలోని పెద్దాయన మీద ఇతనికి ఎంత ప్రేమో, అభిమానమో వ్యక్తపరిచేందుకు అతనికి చాలా మంచి ఫ్రేం కావాలిట ! ఆ కస్టమరు మహా డిమాండింగ్ టైపు. నానా హంగామా చేసి ఒక ఫ్రేం - 'ద బెస్ట్ క్వాలిటీ' ది కావాలని గొడవ పెడతాడు ! ఆఖరికి దాస్ చెప్పగా గుండ్రని కటింగ్ ఉన్న గోల్డెన్ ఫ్రేం ఎంచుకుంటాడు ! దాస్ కూడా కొంచెం స్టైల్ కొడుతూనే ఉంటాడు. మొత్తానికి - ఫ్రేం కట్టడానికి రెండు వారాల వ్యవధి కి బేరం కుదురుతుంది.
అయితే, దురదృష్టవశాత్తూ ఆ ఫ్రేం కట్టబోయేంతలో పెద్దయన ఫోటో మీద ప్రమాదవశాత్తూ ఎనామిల్ చిందుతుంది. దాస్ ఆ షాక్ నుంచీ తేరుకుని చెరపబోయేంతలో ఫోటో కి చాలా డేమేజీ జరుగుతుంది. ఇలా ఫోటో తన చేతిలో నాశనం అవడం దాస్ జీవితంలో మొదటిసారి ! కాబట్టి తను చేసిన పనికి దాస్ కొద్ది క్షణాలు నిస్చేష్టుడౌతాడు ! అసలే ఈ కస్టమరు మహా ధనవంతుడు ! ఎంత డబ్బైనా పర్లేదు 'ద బెస్ట్' కావాలని డిమేండ్ చేసేడు. ఈ ఫోటో ని అతను చూస్తే ఏమయినా ఉందా! అని బెంగ పడతాడు.
అయితే అతని దగ్గర కొన్ని పాత ఫోటోలున్నాయి. వాటితో ఎలాగో ఒకలా మానేజ్ చేసి ఫోటొ ని ఎలానో ఒక రూపు కి తెస్తాడు. అయినా మారిన పెద్దాయన మొహానికి జరిగిన డేమేజ్ పూర్తిగా దిద్ద బడదు. ఎలానో దానికి అదిరే గుండె తో గోల్డెన్ ఫ్రేం కట్టి పేపర్ చుట్టి పెడతాడు కస్టమరు మహాశయుని కోసం ఎదురు చూస్తూ !
సరిగ్గా రెండు వారాలకి కస్టమరు గారు వస్తారు. దేవుడికి దణ్ణం పెట్టుకుని, గుండె చిక్కబెట్టుకుని పేపరు రాప్ ను విప్పి చూపిస్తాడు దాస్ ఆ ఫోటో ని అతనికి ! అంతవరకూ ఇంపేషంట్ గా ఎదురు చూసిన ఆ కస్టమరు దాస్ ఆ రేప్ ని వెప్పేందుకు చేస్తున్న ఆలస్యానికే విసుక్కుంటాడు ! తీరా ఫోటో ని చూసి ఏమంటాడో ఏమిటో అని బెంగ పెట్టుకున్న దాస్ కి రెలీఫ్ గా ఆ కస్టమరు ఒక్క మాటంటాడు - ఏం చేసేవబ్బా ఈ ఫోటోని ? నేను ఒవల్ షేప్ అంటే నువ్వు గుండ్రని షేప్ లో చేసేవేంటి ? అని!
ఈ రెండు కధలూ భలే ఉన్నాయనిపించింది. తెగే దాకా టెన్షన్ పెట్టి చంపి, నవ్వించేసాడు రచయిత మనల్ని. కధలు ఎలా రాయాలీ అంటే.. మంచి ఎఫ్ఫెక్ట్ కోసం వాటికి ఒక ముగింపు ఉండకూడదు ! వాళ్ళు ఇలా ఎందుకన్నారు, వీళ్ళు అలా ఎందుకు ప్రవర్తించేరు అని మనం విస్లేషించుకునీలా, గమ్మత్తుగా విడిపోవాలి. దటీస్ ఆర్.కే !
28/07/2008
గీతాంజలి నుంచీ ..
అతని సామీప్యాన్నుంచి తప్పుకోవాలని దూరంగా జరుగుతాను. కానీ అతన్నుంచీ తప్పించుకోలేను.
తన డంబాచారంతో భూమినుంచీ దుమ్ము రేపుతాడు. నేను పలికే ప్రతి మాటకీ తన అరపుల్ని జత చేస్తాడు.
ప్రభూ ! అతనే. అతనే నా అహం. వాడికి సిగ్గులేదు. వాడితో కలసి, నీ ద్వారాన్ని సమీపించాలంటే నాకు సిగ్గు.
27/07/2008
బాంబు దాడి సూచనలు
ఈరోజు రేడియోలో వాతావరణ సూచనలు వింటూంటే, పనిలో పని గా.. దేశంలో ఎక్కడెక్కడ బాంబు పేలుళ్ళు జరగొచ్చో చెప్పేస్తే బావుణ్ణనిపించింది. విశాఖ లో తుఫాను హెచ్చరికల సమయంలో అప్పటికే సముద్రం లోకి వెళ్ళిన జాలర్ల సంగతి వొదిలేస్తే, రేడియో లో ఎంతో మంచి గొంతు ఒక్కటి మాత్రం - సముద్రం లోకి చేపలు పట్టడానికి వెళ్ళొద్దు నాయనలారా.. ఫలానా చోట 'అల్ప పీడన ద్రోణి ' ఉందంట బాబూ - అని చెప్పేస్తుంది. ఈ హెచ్చరికలు విన్నారా సరే ! లేదా పాపం జాలర్లు చాలా మంది ప్రతీ సారీ గల్లంతు అయిపోయే అవకాశాలుంటాయి !
అలానే, నిన్న అక్కయ్య, చెల్లెలూ, అమ్మా, నాన్నా, ఇతర బంధు గణాలూ.. ''అమ్మాయీ.. బోనాలూ బోనాలూ అంటూ వీధి లోకి వెళ్ళొద్దు తల్లీ.. హైదరాబాదు లో కూడా బాంబులు పేలొచ్చుట !'' అని హెచ్చరికలు జారీ చేసేరు.
భారత దేశం - అండర్ ఎటాక్ అంటూ టీవీ వాళ్ళూ ఫ్లాష్ వార్తలు ప్రకటిస్తున్నారు. కాబట్టి, ప్రజలారా, ఒక రెండు మూడు రోజులు జాగర్తగా ఉండండి.
.. ఈ అప్రమత్తత ఒకట్రెండు రోజులకో, ఒకరిద్దరో పాటించడం కాదు ! చెత్త ఏరుకునే పిల్లలు కూడా బాంబు అంటే ఏమిటో, ఎలా ఉంటుందో తెలుసుకుని, ప్రాణాలు రక్షించేలా అందరూ అప్రమత్తంగా ఉండాలి. తీవ్రవాదుల మీద మనమూ అప్రమత్తత పోరాటం మొదలు పెట్టాలి. నిర్లక్షం ఎంత మాత్రం వొద్దు !
ఇది ఈ యుగ ధర్మమేమో ! రోజూ వానొస్తుందా / ఎండ ఉంటుందా అని మాత్రమే కాకుండా.. బాంబు లూ, పేలుళ్ళూ కూడా మీ ఊర్లిలో లేదా మీరు రోజూ ఆఫీసుకెళ్ళే దారిలోనో ఉన్నయ్యేమో చూసుకోవాలి మరి ఇంక నుంచీ ! అందుకే మరి దీనికి 'బాంబు దాడి సూచనలు ' అంటూ ఏదో ఒక కార్యక్రమం ఉంటే బావుణ్ణు.
23/07/2008
కధా స్రవంతి
అనుకోకుండా శ్రుతించి, ఈ కార్యక్రమం చూసాకా, నాకు ఈ కార్యక్రమ దర్శక నిర్మాతల మీదా, దూరదర్శన్ మీదా చాలా గౌరవం పెరిగింది. ఎందుకంటే, ఈ కధను చక్కగా బుల్లి తెరకనుగుణంగా మలిచి, ఒక పల్లె లో చిత్రీకరించి, గుండెకు హత్తుకునేలా చక్కగా తీసారు.
ఈ కధ ఎప్పట్లోనో, ధర్మవడ్డీ అనే ఒక అప్పు ఇచ్చే పద్ధతి గురించి శ్రీ గోపీచంద్ రాసినది. అప్పట్లో బాంకులు లేవు. అప్పు ఇవ్వటానికి గ్రామంలోనే ఎవరో వడ్డీ వ్యాపారం చేసేవారు. ఇష్టం వచ్చిన లెక్కలతో వడ్డీ పాపంలా పెరుగుతూ.. అసలు కన్నా మించిపోయి, అప్పు తీసుకున్న వాళ్ళ బ్రతుకులు చిందర వందర చేసే ఈ పద్ధతి మీద ప్రభుత్వానికి గానీ, సమాజానికి గానీ ఎటువంటి అదుపు లేని పరిస్థితుల్లోంచీ ఈ కధ పుట్టుకొచ్చింది.
ఈ కధ లో మన Protagonist - సూరయ్య (/సూరన్న) ఒక వడ్డీ వ్యాపారంలోకి దూకిన మోతుబరి. ఇతని తండ్రి 100 ఎకరాల మాగాణికి యజమాని గా ఉండి, చేతికి ఎముక లేనట్టు దాన ధర్మాలు చేసి, తను పోయేవేళకి కొడుక్కి కేవలం నాలుగు ఎకరాలు మాత్రం విడిచి పోతాడు. అందుకే సూరన్నకు దాన ధర్మాలు అంటే చిరాకు. అతనికున్న ఒక్కగానొక్క కూతురు పెళ్ళి చేసాడు. ఆ రోజుల్లో వడ్డీ వ్యాపారం అంటే.. ఎందరో పేదల ఇళ్ళు గుల్ల చేసి, పెళ్ళాల పుస్తెలు తెంచి, గొడ్డూ, గోదా పొట్టన పెట్టుకునే వ్యాపారం అనీ.. పాపం అనీ ఒక సెంటిమెంట్ వ్యాప్తి లో ఉండేది. అయినా సూరన్న, తన ఆస్తి ని ఇబ్బడి ముబ్బడి చేద్దామని ఉన్న పొలం అమ్మి, ఆ డబ్బు తో ఊర్లో వడ్డీ వ్యాపారం మొదలు పెట్టాడు.
అయితే, ఈ వ్యాపారం కారణంగా.. వసూళ్ళలో అతని నిక్కచ్చితనం, కౄరత్వం వల్ల గ్రామంలోనే అతనికి శత్రువులు తయారయ్యారు. ఇంతలో అతని దగ్గర రెండొందలు అప్పు తీసుకున్న ఒకానొకడు, వడ్డీ ఇవ్వనంటూ తిరగబడతాడు. ఎక్కువ మాటాడితే, అసలు కూడా ఇవ్వనని పట్టు బట్టాడు. ఇది అన్యాయం! సూరన్న కూడా ఆర్ధిక ఇబ్బందుల లో ఉన్నాడు. అతని చేతి లో డబ్బు అంతా వ్యాపారం మీద అప్పులు ఇవ్వబట్టి.. అంతా బయటే ఉంది. ఈ ఎదురుతిరగటం ఎక్కువ అయ్యాకా, సూరన్న డబ్బు అతనికి వాపసు రావట్లేదు. సూరన్న కోర్టుకు వెళ్తానని భీష్మించుకున్నా, పట్టించుకున్న నాధుడు లేడు.
సూరన్న ఈ బాధలో, దుగ్ధ లో పట్నానికి వెళ్ళి లాయరు తో మాట్లాడతాడు. అప్పు తీర్చని వాని మీద కేసు వేసి, వకీలు కి ఒక యాభయి సమర్పించుకుని, రాత్రి పూట ఇంటికి వస్తున్న అతన్ని దారి కాసి, అతని ప్రతివాది (అప్పు తీర్చని వ్యక్తి), మరికొందరు యువకులతో దాడి చేసి, డబ్బు దోచి, తీవ్రంగా కొట్టి పడేస్తారు. సూరన్న ఇంటికి ఎలాగో చేరతాడు. బయట అతనికి రక్షణ లేదు.
ఇలా సూరన్న ఊరివారి వ్యతిరేకత ఊబిలో చిక్కుకుపోయాకా, అతని అల్లుడు కూడా.. ఇంక ఆస్తి రాదని గ్రహించి, కూతుర్ని ఇంటికి పంపేస్తాడు. సూరన్న వడ్డీ వ్యాపారాన్ని ఆదినుంచీ వ్యతిరేకిస్తున్న అతని భార్య కూడా అతనిని ఆ వ్యాపారం పాపం అనీ.. ఎంతగానో నచ్చ చెప్పినా, సూరన్న మాత్రం డబ్బు - డబ్బే లోకం అనే గట్టిగా వాదిస్తున్నడు. ఇలాంటి పరిస్తితుల్లో ఏడుస్తూ ఇంటికి వచ్చిన కూతుర్ని అల్లుడింటికి పంపే ఉపాయం లేక, చేతిలో చిల్లిగవ్వ లేక, నిశ్చేష్టుడై, చెరువు గట్టున కూర్చుండిపోతాడు.
ఈలోగా, కూతురు కూడా ఒంటరిగా పొలంలో రోదిస్తుండగా.. ఊరి యువకులే కొందరు దుండగులు, సూరన్న మీద కసి తో ఆ పిల్ల మీద అత్యాచారం చేస్తారు. ఆ పిల్ల పాపం ఇంటికి తిరిగి వచ్చి, పెరటి బావిలో దూకి చనిపోతుంది. అప్పుడు విషయం తెలిసి పరిగెట్టుకుంటూ ఇంటికి వచ్చిన సూరన్న కళ్ళ ముందే, కోపావేశంతో అతని భార్య నిప్పంటించుకుని, సూరన్న ఎంత బతిమలాడినా వినకుండా ఆత్మ హత్య చేసుకుంటుంది.
ఈ అకస్మాత్తు సంఘటనలూ, అతని మనసుకు తగిలిన తీవ్ర గాయాల కారణంగా సూరన్న పిచ్చివాడైపోతాడు. అతని ఇల్లు అప్పు కింద ఇంకెవరో రాయించుకుని, అతను రోడ్డు మీద పడతాడు. రోడ్డు మీద రాళ్ళను ఒక మూటలో కట్టి, తెలిసిన వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి, ఆ రాళ్ళనే డబ్బు గా అప్పు ఇచ్చి, మళ్ళీ, ఆ రాళ్ళనే, లెక్క పెట్టుకుని, మరిన్ని రాళ్ళనే వడ్డీ (ధర్మ వడ్డీ) గా వసూలు చేసుకుంటూ.. చాలా దీన స్థితిలో బ్రతుకుతూ ఉంటాడు. ఈ కధ చూసిన తరువాత, సూరన్న పరిస్థితి మీద ఎంత జాలి కలిగిందంటే, ఇటువంటి నిజ సంఘటన జరిగి, నేను ఆపలేని నష్టం జరిగిందే అని చాలా బాధ కలిగింది.
ఈలోగా, సూరన్న కూడా ఊర్లోని పిల్లలు పిచ్చి వాడంటూ రాళ్ళతో కొట్టి తరుముతూ ఉంటే, తన ఇంటికే వెళ్ళి, తన కూతురు చనిపోయిన బావిలోనే ఒక్క గెంతు గెంతి చనిపోతాడు. అతని శవాన్ని బయటికి తీసాకా.. ఊరివారంతా అతని జీవితాన్ని తలచుకుని చాలా బాధ పడతారు.
ఈ కధ లో తండి విచ్చలవిడి దానధర్మాల వల్ల విసిగి, డబ్బు మీద ఒక అభద్రతాభావాన్ని పెంచుకున్న సూరన్న అమాయకత్వం - ఆఖరికి డబ్బు చేతే నాశనం అయిన అతని జీవితం, ఆడబ్బు (రాళ్ళూ -రప్పలే) చేతే తరమి కొట్టబడి అతను చనిపోవటం చాలా సింబాలిక్ గా రాసారు రచయిత. ఇందులో సూరన్న మీద కోపం రాదు. తన మీద ప్రజల్లో కలిగిన వ్యతిరేకతను అర్ధం చేసుకున్నా, డబ్బు మీది అభద్రత తోనే, తన వైఖరిని మార్చుకోలేకపోయిన సూరన్న ని చూసి జాలి కలుగుతుంది.
ఈ కధ, ఇద్దరు స్నేహితులు చెప్పుకున్న కధ. టీవీ లో నేను చూసిన ఒక మంచి కార్యక్రమం. వచ్చే సోమవారం కోసం తప్పకుండా ఎదురు చూస్తాను. ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు సప్తగిరి చానెల్ని అభినందించాలి.
అయితే, ఒక కధ చదివితే వచ్చే ఆనందాన్ని టీవీ ధారావాహిక ఇవ్వక పోవచ్చు. కానీ మనం చదవకుండా మిస్ అయిన మంచి కధలు ఇంత హాయిగా నాటక రూపంలో దొరుకుతుంటే.. చూసేందుకు సమస్య ఏముంది ?
22/07/2008
So Happy to Get there!
బోల్డన్ని విమర్శలు - డమ్మీ ప్రధాన మంత్రి అంటూ తీసి పారేయడాలు జరిగినా, అప్పట్లో పీ.వీ, ఇప్పుడు సోనియా గాంధీ, మన్మోహనుడికి అధికారం ఇచ్చి (కేవలం పదవి కాదు) దేశానికి మేలు చేసారు.
రాజకీయాల లో - తను ఒక విషయాన్ని నిజాయితీ గా నమ్మడ, ఆ నమ్మినదానికోసం పని చెయ్యడం, కొందరికే సాధ్యం.
ఈరోజు మారిన ప్రధాని వైఖరి చాలా మందికి నచ్చకపోవచ్చు గాక. కానీ మన్మోహన్ గెలిచినందుకు ఎందుకో దేశాన్ని ఒకసారి అభినందించాలనిపిస్తూ ఉంది.
దేశానికి మంచి రోజులు రానున్నయి. కొంత లో కొంత అయినా మేలే జరగనుంది!
18/07/2008
రోమన్ హాలీ డే !
రోమన్ హాలీ డే - మొత్తం సినిమా యూ ట్యూబ్ లో చూడొచ్చు. హేపీ గా చూడండి. మంచి సినిమా.
తెలుగు లో వెంకటెష్, కట్రినా కైఫ్ తో 'మల్లేశ్వరి ' గా తీసేరు - కాస్త మార్పు చేర్పుల తో ! కానీ ఒరిజినల్ ఇచ్చే కిక్కు వేరు కదా.
నాకు ఆడ్రీ హేప్ బర్న్ ఎంత నచ్చిందంటే, ఆ తరవాత, నా రూం లో పెట్టుకోవడానికి ఆవిడ ఫొటొ ఒకటి కొనుక్కుందామనుకుని, కానీ, తరవాత ఎవరన్నా నవ్వుతారని, ఆగిపోయాను. అంతగా నేను ఏ హీరోయిన్నూ అభిమానించ లేదు.
తీవ్రవాదం - IEDs-5
ఈ బాంబులను తయారు చేయడానికి పెద్ద యెత్తున రక్షణ అవసరాలకు వాడే ఆర్.డీ.ఎస్, టీ.ఎన్.టీ వంటి పదార్ధాలను వివిధ కాంబినేషన్ ల లో వాడతారు. అంతే కాకుండా, గృహ, నిర్మాణ అవసరాలకు వాడే జెలిటెన్ స్టిక్స్, ఇళ్ళలొ తయారయ్యే మందుగుండు సామాగ్రి ఇంకా మార్కెట్ లో సులువు గా దొరికే అమ్మోనియం నైట్రేట్, సోడియం / పొటాషియం క్లోరైడ్, సల్ఫర్, అమ్మోనియం పఔడర్, షుగర్ పొటషియం / సోడియం నైట్రట్ మొదలైనవి కూడా వివిధ కాంబినేషన్ & నిష్పత్తు ల లో వాడ తారు.
నక్సలైట్లు ముఖ్యంగా కమర్షియల్ పేలుడు పదార్ధాలు వాడతారు - అవి ప్రధానంగా జిలెటన్ లేదా ఎ.ఎన్.ఎఫ్.ఒ (అమ్మొనియం నైట్రేట్ ఫ్యుఎల్ ఆయిల్) (ఫెర్టిలైసెర్ గ్రేడ్ అమ్మొనియం నైట్రేట్ మరియు డీసిల్ లేదా ఫ్యుఎల్ ఆయిల్ నుంచీ తీసిన పేలుడు పదార్ధం)
ఇప్పటి వరకు పేలిన బాంబులు లేదా దొరికిన పేలని బాంబులు (లైవ్ ఎక్స్ప్లోసివ్ లు) నుంచీ సేకరించిన సమాచారం ప్రకారం, తీవ్రవాదులు వాడే రసాయనాలు ఈ క్రింది విధంగా ఉంటాయి. (Combinations)
(1) ఆర్.డీ.ఎక్స్ & టి.ఎన్.టీ (సైక్లొటోల్)
(2) కేవలం ఆర్.డీ.ఎక్స్
(3) అమ్మోనియం నైట్రేట్ తో చేసే జిలెటెన్
(4) ఎ.ఎన్.ఎఫ్.ఓ (అమ్మొనియం నైట్రేట్ ఫ్యుఎల్ ఆయిల్)
(5) అమ్మొనియం నైట్రేట్ & అమ్మొనియం పౌడెర్
(6) పొటషియం క్లోరైడ్ & అమ్మొనియం పౌడెర్ + సల్ఫర్
మన రక్షణ కోసం మనం ఏమి చెయ్యగలం ?
ఇప్పటి వరకూ జరిగిన బాంబు దాడుల బట్టీ, తీవ్ర వాదులు ఎప్పటికప్పుడు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ వస్తున్నారన్నది తెలుస్తున్నది.
అయితే, కేవలం సాంకేతికత మాత్రమే కాకుండా, వారి ఎక్సిక్యూషన్ కూడా కొత్త పుంతలు తొక్కుతున్నది. ఇంతకు ముందు వరకూ కేవలం కొందరు రాజకీయ నాయకులూ, దేశాధినేతలూ, పోలీసు, మిలిటరీ సిబ్బంది ని లక్ష్యంగా చేసుకుని జరిగిన పోరటం, మన వీధుల లోకీ, మన రైళ్ళ లోకీ చొచ్చుకు వచ్చింది. సాధారణ ప్రజలను, అదీ ఎక్కువ సంఖ్య లో పొట్టనపెట్టుకోవడం కొత్త లక్ష్యం గా మారింది.
ఈ ఐ.ఈ.డీ ల తయారీ, వాడకం ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ అయ్యే సోఫిస్టికేషన్ తో ఇబ్బడి ముబ్బడి గా తయారవటం మన ముందున్న ప్రధాన సమస్య.
అమెరికా లో సెప్తెంబర్ తొమ్మిది తరవాత ప్రజల్లో కలిగిన భయం.. వారి ని ప్రతీదీ అనుమానించేలా చేసి, సాధారణ జీవితాన్ని కాస్త ఇబ్బంది పెట్టిందంట. కానీ పెరిగిన సెక్యూరిటీ మీది అవగాహన, అప్పటి నుంచీ చాలా ప్రాణాలను కాపాడిందన్న సంగతి మర్చిపోకూడదు. ఒక తీవ్రవాది షూ బాంబు ద్వరా విమానాన్ని పేల్చి వెయ్యబోవడాన్ని ప్రయాణికులు అడ్డుకోవడం ఇందుకు మంచి ఉదాహరణ.
ఈ మధ్య కాలంలో కాబూల్ లో భారత రాయబార కార్యాలయం మీద జరిగిన అతి పెద్ద తీవ్రవాద దాడి కూడా ఒక సారి గుర్తు చేసుకోవాలి.
అప్పటి వరకూ అందిన ఇంటెలిజెన్స్ నివేదికల కారణంగా తీవ్ర వాద దాడి ని ఎదుర్కోవడానికి ఈ రాయబార కార్యాలయం చేపట్టిన చర్యల కారణంగా ఆ నిర్మాణానికి 100 కిలోల ఆర్.డీ.ఎక్స్ పేలుడు కు కూడా పెద్ద నష్టం జరగలేదు. పైగా, బ్రిగేడియర్, ఐ.ఎఫ్.ఎస్. అధికారి ప్రయాణిస్తున్న కారుని లోపలికి రానివ్వడానికి గేట్ ను తెరుస్తున్న సిబ్బంది, ఎలర్ట్ గా పని చెయ్యకపోతే, రాయబార కార్యాలయం మొత్తం ఈ పేలుడు కు కూలిపోయి ఉండేది. మన లో కూడా ఎలర్ట్ నెస్ ఉండాలి. ఈ ఆత్మాహుతి దాడి లో 54గురు ఆఫ్గన్లు, నలుగురు భారతీయులూ మరణించారు. కానీ తీవ్రవాదుల అసలు లక్ష్యం (సంఖ్యా పరంగా) ఇంకా చాలా ఎక్కువ.
కేవలం సమర్ధవంతమైన కట్టడి, విజిలెన్స్, ప్రజల్లో ఈ తీవ్రవాద పోకడలు, దాని వల్ల కలిగే ప్రమాదాల గురించి కాస్త సాధారణ పరిజ్ఞానం మాత్రమే మన పోరాట పద్ధతి. అనుమాస్పదమైన విషయాల్ని నిర్లక్ష్యం చెయ్యకపోవడం, నిర్లక్ష్య ధోరణి తగ్గించుకోవటం, సెక్యూరిటీ లాప్సెస్ కనిపిస్తే, అధికారులకు కంప్లైంట్ చెయ్యడం సెక్యూరిటీ చెక్ లకు సహకరించడం, సెక్యూరిటీ అంటే విసుక్కోకపోవటం, పోలీసు తో సహకరించడం మొదలయినవి మాత్రమే మన ప్రాణాలను కాపాడతాయి.
16/07/2008
మీ ఇంటెర్నెట్ ప్రొవైడెర్ ఎవరు ?
అంతకు ముందు సిఫీ ఉండేది. అది కూడా ఏమంత తృప్తి ని ఇవ్వలేదు. యూ.కె లో వర్జిన్ బ్రాడ్ బాండ్ ఉండేది. అది.. మహాతల్లి. నిజంగా ఆ స్పీడ్, సీరియస్ నెస్స్, మా బీ.ఎస్.ఎన్.ఎల్ కు ఎప్పటికి వస్తాయో ? ఎన్ని సార్లు కంప్లైంట్ చేసినా సదరు అయ్యోరు ఫోన్ చసి, కంప్లైంట్ చేసేరా ? ప్రాబ్లెం ఏంటి ? చూస్తాం లెండి ! (అంత మర్యాదగా కాదు - తెలంగాణా యాస లో) కూసి, పెట్టేస్తారు. మా సిఫీ ఆయనే మంచోడు ! కనీసం ఒక ఇంజినీరు ఇంటికి వచ్చి చూసి వెళ్ళేవాడు.
ఇదంతా చూసి, ఒక ధర్మ సందేహం వచ్చి, తెలిసిన వాళ్ళందర్నీ ఇదే ప్రశ్న అడిగాను.. (వాళ్ళు పాపం ఏమన్న అనుకోనీ అని!) ఒకరు వీ.ఎస్.ఎన్.ఎల్. సూపరు గానీ కాస్త ఖర్చెక్కువ అన్నారు. ఇంకోరు రిలయన్సు సూపరు డూపరే గానీ, నెలకో వారం రోజులు పని చెయ్యదు అన్నారు. ఏర్ - టెల్ గురించీ ఎవరో (సుజాత గారు) విసుగ్గా ఒకట్రెండు సార్లు ప్రమదావనం లో కోప్పడ్డారు కాబట్టి దాని మీదా డౌటే! మరి కనీసం యూ.ట్యూబు వీడియోను ఎంజాయ్ చేసే ప్రాప్తం ఏ కంపెనీ వారు అందుబాటు ధరలలో అందిస్తారో, నాకు ఈ జన్మ కు ఆ యోగం ఉందో లేదో ! అని అనుమానంగా ఉంది.
బ్లాగరులు ఈ విషయం లో ఏవైనా మంచి సూచనలు అందిస్తారేమో అని ఇక్కడ ప్రస్తావిస్తున్నా ! అసలు ఏ కంపెనీ మన దేశం లో మంచి సర్వీస్ ఇస్తుందంటారు ? నేను ఈ పోస్టు రాస్తున్నానే గానీ గుండె పీచు పీచు మంటుంది. ఎప్పుడన్నా కనెక్షన్ పోవచ్చు. ఈ రాత్రంతా / లేదా రేపు మధ్యాన్నం దాకా వెయ్యిన్నొక్క దేవుళ్ళకు మొక్కుకుంటే గానే పని చెయ్యకుండా మొరాయించొచ్చు. నిజంగా ఈ కనెక్షన్ తో 'ఏ నిముషానికి ఏమి జరుగునో..' ఎవరూ ఊహించలేరు !
దయచేసి మంచి ప్రొవైడెర్ ను సూచించండి. ఎక్కడైతే 2 ఎం.బీ.పీ.ఎస్ అంటే 2 ఎం.బీ.పీ.ఎస్ ఇస్తారో, ఎక్కడైతే పుటుక్కుమని ఇంటెర్నెట్ కనెక్షన్ తెగిపోయి, రాసినదంతా గాల్లో కలిసిపోదో, ఎక్కడైతే, కనీసం యూ ట్యూబు వీడియో పూర్తి గా వస్తుందో, ఎక్కడైతే, బఫరింగ్ బఫరింగ్ అంటూ నా లాప్ టాప్ కొట్టుకు చావదో, బ్లాగర్లారా.. అ దివ్య లోకానికి దారి చూపండి.
ఈ రోజు ఆ దేవుడి దయ వల్ల ఈ పోస్ట్ రాసి, పబ్లిష్ అనే బటన్ మీద నొక్కితే, ఆ పోస్టు నా బ్లాగు లో ప్రత్యక్షం అయితే, ఫలనా గుడి ముందు ఒక అర డజను కొబ్బరి కాయలు కొడతానని మొక్కుకుంటున్నాను.
15/07/2008
తీవ్రవాదం - IEDs - 4
ఐ.ఈ.డీ లను తయారు చేయడంతో పాటూ, వాటి వాడకం లో కూడా సింపుల్ టెక్నాలజీ నే వాడతారు. ఈ ట్రిగ్గెరింగ్ మెకానిజం లలో కొన్ని రకాలుంటాయి.
1) టార్గెట్ చేతే ఆక్టివెట్ చెయ్యబడే బాంబులు /Anti-Handling
ప్రెషర్ రెలీస్ ట్రాప్ స్విచ్చు లను వీటిలో వాడతారు. అంటే, పోలీసులో, బాంబ్ స్క్వాడ్ వారో, బాంబు ను తెరవగానే, పెద్ద విస్ఫోటనం జరిగేలా వీటిని తయారు చేస్తారు. ఇలాంటి దాడులు జార్ఖండ్ లో జరిగాయి. పోలీసులు ఒక అనుమాస్పదమైన కేష్ బాక్స్ ను తెరవగానే, దానికున్న ట్రాప్ స్విచ్చు అందులో అమర్చిన బాంబ్ ను ఆక్టివేట్ చేసింది. అలానే, పస్చిమ బెంగాల్ లో కూడా ఒక పాల కేన్ (బాంబు, పాపం బాంబు స్క్వాడ్ సభుడు ఆ కేన్ మూత తెరవగానే పేలిపోయింది.
2) Timer mechanism
దీన్లో కూడా రకాలున్నాయి.
ప్రోగ్రాం చెయ్యగల టైమింగ్ డివైస్ లేదా ఎ.బీ.సీ.డీ టైమర్ ఒక రకం. ఇవి 1995 నుంచీ అందుబాటు లోకి వచ్చాయి. ఇవి ఎంత ఇంప్రూవ్ అయాయంటే, వీటిని దాడి కి 194 రోజుల, 11 గంటల 15 నిముషాల ముందు ఫిక్స్ చేసినా పని చేస్తాయి. (అంటే, అంత ముందే, టైం ను సెట్ చేసి, బాంబును సేఫ్ గా అమర్చి, వాడుకోవచ్చన్నమాట)
క్వార్జ్ లేదా డిజిటల్ అలార్మ్ క్లాక్ టైమెర్ ఇంకో రకం ! ఇవి బాంబు పేల వలసిన టైంకు అలార్మ్ బజర్ మోగడం ద్వారా బాంబులోని పేలుడు పదార్ధాన్ని పేల్చడానికి వాడతారు. సంఝౌతా ఎక్స్ ప్రెస్ లో ఇలాంటి టైమర్ ఉన్న ఐ.ఈ.డీ నే వాడారు.
సెల్ ఫోన్ టైమర్ : సెల్ ఫోన్ లో మోగే అలార్మ్ బజర్ ద్వారా కూడా ఐ.ఈ.డీ లోని డిటొనేటర్ ను ఆక్టివేట్ చేస్తారు. హైదరాబాద్ లోని మక్కా మసీదు, అజ్మీర్ షరీఫ్ దర్గా, హుబ్లీ కోర్టు లలో దీన్నే వాడారు.
3) రిమోట్ / రేడియో ద్వారా కంట్రోల్ చెయ్యగల మెకానిజం
నక్సలైట్ అన్నలు బాగా వాడే ఒక రకం వైర్ కంట్రోల్. లాండ్ మైన్ అమర్చిన తరవాత, లాండ్ మైన్ కు బాగా దూరంగా (సేఫ్ డిస్టెన్స్) కూర్చుని, ఒక కనిపించకుండా పాతిపెట్టిన వైర్ ద్వారా ఆ లాండ్ మైన్ కు పవర్ ను పంపించి, టార్గెట్ దాని మీదుగా పాస్ అవుతున్నపుడు పేలుస్తారు. ఈ వైరు పేల్చడానికి ఒక హెవీ డ్యూటీ కారు బేటరీ కావల్సొస్తుంది.
ఇంకో రకం వైర్ లెస్ లేదా రేడియో తరంగాల ద్వారా పేల్చడం : ఈ పద్ధతి జమ్మూ కాష్మీరు లో బాగా వాడుక లో ఉంది. వీటికి 3 DTMF కోడెడ్ రెసీవర్లూ, ఒక VHS ట్రాన్స్ మీటరూ వాడతారు. ఈ మధ్యే, సెల్ ఫోన్ల సహాయంతో ఇంకా దూరం నుంచీ ఈ లాండ్ మైన్లను వైర్ లెస్ తరంగాల ద్వారా ఆక్టివేట్ చేసి పేల్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తీవ్ర వాదం - IEDs - 3
3) కంటైనెర్ ఐ.ఈ.డీలు
సినిమా హాళ్ళ లో, రద్దీ గా ఉండే మార్కెట్ లలో, టూరిస్ట్ స్పాట్ లలో, రైళ్ళ లో (public transport systems) కామన్ పీపుల్ (సామాన్య జనాన్ని) టార్గెట్ చెయ్యడానికి వాడతారు. ఈ బాంబులు సాధారణంగా ఆయా పరిసరాల్లోకి సరిపోయే విధంగా ఉండే కంటైనర్ ల (ప్రెషర్ కుక్కర్ లూ, సూట్ కేసులూ, ఏర్ బాగ్లూ లాంటివి) లో ఒక ఐరెన్ కేసింగ్ తో తీసుకుని వెళ్తారు. ఈ పద్ధతిని లక్నో లోని కోర్టు భవనం లోనూ, లాయర్ల చాంబర్ లోనూ ప్రయోగించారు. మన కళ్ళ ముందు ముంబాయి లోకల్ ట్రైన్ ల సీరియల్ దాడుల జ్ఞాపకం చెదిరిపోనేలేదు కదా ! ఈ దాడుల్లో ఈ ప్రెషర్ కుక్కర్ లనే వాడారు.
కంటైనర్ లంటే, కుక్కర్ లే కాకుండా, పాల కేన్లూ, టిఫిన్ బాక్సు లూ, కేరియర్లూ, ఘీ (నెయ్యి) డబ్బాలు, ట్రంక్ పెట్టెలు, ఆఖరికి ఎల్.పీ.జీ.సిలిండర్లు కూడా కావచ్చు.
కాబట్టి, ఎక్కడన్నా, అసాధారణంగా ఏదయినా బాగ్, బాక్స్ లేదా కనీసం టిఫిన్ బాక్స్ దొరికినా, కనిపించినా ప్రమాదమే అని తెలుసుకోవాలి.
4) మానవ బాంబు
మానవ బాంబు / ఆత్మాహుతి దాడి చాలా పోటెంట్ మెథడ్ గా పేరొందింది. పేలుడు పదార్ధాలను, (ఐ.ఈ.డీ లను) వొంటికి ధరించి, లేదా పోర్టబుల్ పేలుడు పదార్ధాలను వాహనం లో అమర్చి, ఆ వాహనాన్ని టార్గెట్ ను చేరేందుకు వాడుతూ టార్గెట్ దగ్గరకు పోయి, వాటిని పేల్చడం ద్వారా, టార్గెట్ కు ప్రాణ నష్టం కలిగించడం దీని ప్రధాన లక్షణం. వాయు మార్గం గుండా దాడి చెయ్యడం - (ఏరియల్ దాడి) కూడా ఆత్మ హత్యా సదృశ్యమే !
ఉదా : ఎల్.టీ.టీ.ఈ దాడులు
రాజీవ్ గాంధీ హత్య, బియాంత్ సింగ్ హత్య, మనకు మానవ బాంబులను పరిచయం చేసాయి. హైదరాబాదు లో ఎస్.టీ.ఎఫ్. ఆఫీసు మీద మానవ బాంబు దాడి గుర్తుందిగా. ఇలానే, మన పార్లమెంట్ మీద దాడి కూడా ఆత్మాహుతి దాడే ! ఈ దాడి లో తీవ్రవాదులు ప్రాణాలకు తెగించి పాల్గొన్నారు.
5) పార్సెల్ బాంబులు / లెటర్ బాంబులు
పార్సెల్ / లెటర్ లో టార్గెట్ కు బాంబు ను పంపాలంటే, సాధారణంగా ఐ.ఈ.డీ చాలా చిన్నదీ మరియూ శక్తి వంతమైనదీ అయి ఉండాలి. ఈ రకం బాంబులు ఐ.ఈ.డీ రకాన్ని బట్టీ నష్టాన్ని కలిగిస్తాయి. కేరళ లో 2006 లో ఇలాంటి బాంబులు కూడా పేలాయి. వీటిని సాధారణంగా లో ఇంటెన్సిటీ బాంబు దాడులు గా పరిగణిస్తారు.
14/07/2008
తీవ్రవాదం - IEDs - 2
ఇంకో భయంకరమైన విషయం ఏమిటంటే, పోలీసుల / దర్యాప్తు సంస్థల వద్ద, ఎప్పటి కప్పుడు మారిపోతుండే కొత్త ఐ.ఈ.డీ ల సాంకేతిక పరిజ్ఞానం గురించి ముందస్తు సమాచారం ఏమీ వుండదు. పైగా, పేలుడు జరిగాకా.. పేలుడు ఏ పదార్ధం తో జరిగిందో తెలుసుకునేసరికే తాతలు తిరిగి వస్తారు. ఇది పెద్ద టైం వేస్ట్ వ్యవహారం. కానీ ఇదే పోలీసులకు దొరికే ముఖ్యమైన నోట్స్. ఎందుకంటే, దీని ద్వారానే, తీవ్రవాదుల పేలుడు కు ఉపయోగించే పద్దతి మీద అవగాహన వస్తుంది. అంతే.
అందుకే, ఇప్పటి దాకా జరిగిన పేలుళ్ళూ, దాడుల ఆధారంగా పేలుడు కు ఉపయోగించిన పద్దతులూ, పరికరాలూ - అంటూ ఒక సామాన్య పరిజ్ఞానం అందుబాటు లో ఉంది. ముఖ్యంగా ఐ.ఈ.డీ లలో రకాలూ ఈ కింది విధంగా ఉంటాయి.
1) లాండ్ మైన్లు / భూమి లో పాతి పెట్ట బడ్డ ఐ.ఈ.డీ లు
ఈ లాండ్ మైన్లు నక్సలైట్ల హాట్ ఫేవరేట్ బాంబులు. వీటి ద్వారా, పోలీసులూ, వీ.ఐ.పీలను తుదముట్టించడం చాలా విరివిగా జరిగింది. ఇవి ప్రాధమికంగా, వైర్ లెస్ పరిజ్ఞానంతో తయారవుతాయి. కేమెరా ఫ్లాష్ ద్వారా ట్రిగ్గెర్ చెయ్యబడతాయి. వీటిని, సాధారణంగా, వాహనం లో ప్రయాణిస్తున్న వారి మీద దాడి చెయ్యడానికి వాడతారు. సెమీ-మెటల్ రోడ్లు, కచ్చా రోడ్లు, కల్వర్టులు, రైల్ రోడ్ క్రాసింగ్లూ, నదీ తీరాలు, రోడ్డు మలుపులు లాంటి, ఎక్కడ వాహనం వేగం బాగా తగ్గించి నడపాలో అక్కడ, అమర్చుతారు. వాహనం వేగం తక్కువ గా ఉన్నప్పుడు, ఖచ్చితంగా పేలుడు జరపొచ్చు, ఎక్కువ ప్రాణ నష్టం కలిగించ వచ్చు. అయితే, ఈ పద్ధతి లో, ఇలా, దాడి చెయ్యడానికి ఎంచుకునే ప్రదేశానికి ఒక ఫీచర్ ఉండి, కొంత లో కొంత అయినా మనం అప్రమత్తం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే, జనార్ధన రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి అదృష్టవంతులు, వెంట్రుక వాశిలో మృత్యువు ను మోసం చేసేసారు.
అయితే, అందరూ అదృష్టవంతులు కాలేరు గా. అందుకే, చాలా మంది పోలీసు అధికారులూ, వారితో పాటూ ప్రయాణిస్తున్న సివిలియన్లు (పౌరులు) కూడా ఎన్నో సార్లు మృత్యువాత పడ్డారు. ఉదా : చత్తీస్ గడ్ లోని దంతేవాడా లో 100 కిలోల పేలుడు పదార్ధాలు అమర్చి, పేల్చిన లాండ్ మైన్, (2005 లో) పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని తునాతునకలు చేసింది. ఈ దాడిలో వాహనం లో ఉన్న 27 మంది లో 24గురు అక్కడి కక్కడే చనిపోయారు.
2) వాహనం లేదా సైకిలుకు అమర్చిన ఐ.ఈ.డీ లు.
వాహనాలను బాంబులనూ, పేలుడు పదార్ధాలను ఒక ప్రదేశాన్నించీ, వేరొక ప్రదేశానికి రవాణా చెయ్యడానికి వాడటం ముందు నుంచీ ఉన్నదే. కానీ ఈ వాహనాలనే, పేలుడు కు ఉపయోగించడం, ఇంకొక పద్ధతి. బొంబాయి పేలుళ్ళు వీటికి ఉదాహరణ. అసలు ఈ ట్రెండ్ 1920 లో ఒక ఇటాలియన్ తీవ్రవాది న్యూయార్క్ లో వాల్ స్ట్రీట్ లో జె.పీ. మోర్గన్ వాళ్ళ ఆఫీసు దగ్గరకి ఒక పేలుడు పదార్ధాలు నింపిన గుర్రపు బగ్గీ ని తోలుకు వచ్చి, పేల్చెయ్యడం తో మొదలయ్యింది. ఈ దాడి లో, 40 మంది మరణించారు.
ఇరాక్, ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్ లలో కూడా ఈ పద్ధతి చాలా వాడబడుతుంది. రక్షక బలగాల కాన్వాయ్ కి దగ్గరగా ఒక బాంబ్ లు నింపిన వాహనాన్ని పార్క్ చేసి, కాన్వాయ్ సమీపిస్తుండగా పేల్చడం (రోడ్ సైడ్ పార్క్ చేసిన కారు బాంబులు), తద్వారా, సైనికులకు ఎక్కువ హాని కలిగించడం, దీని ముఖ్య ఉద్దేశ్యం.
వీటిల్లో, మన దేశంలో, ఎంతమాత్రం అనుమానం కలిగించని వాహనం సైకిలు. ఈ సైకిలు కే, బాంబులను ఏ బాగ్ లోనో ఉంచి, అమర్చి, రద్దీ గా ఉండే మార్కెట్ ఏరియాల్లో, గుళ్ళలో, ప్రార్ధనా స్థలాల దగ్గరా పార్క్ చేసి ఉంచడం; అదను చూసుకుని పేల్చడం కూడా ఈ మధ్య చాలా సక్సెస్ ఫుల్ గా తేలింది.
ఈ పద్ధతి / సైకిళ్ళ లో అమర్చ గల ఐ.ఈ.డీ లనే, ఈ మధ్య లక్నో, ఫైసాబాద్, వారణాసి ల సీరియల్ దాడులలో వాడారు. ఇలానే, గోరక్ పూర్ లో బాంబు దాడి కూడా నిర్వహించారు. 2008 లో జైపూర్ దాడుల లో వాడినవి కూడా, సైకిలు ఐ.ఈ.డీ లే.
తీవ్ర వాదం - IEDs - 1
మరి తీవ్ర వాదం అంటే ఏమిటి ? దీన్ని నిలువరించడానికి ఏమి చెయ్యాలి ? మనం మన ప్రశాంత మైన జీవితం లో మునిగి ఉండగా.. ఏదో ఒక దురదృష్టకరమైన క్షణం లో ముంచు కొచ్చే మృత్యువు తీవ్రవాదం ! ముఖ్యంగా మనలని భయోత్పాతానికి గురి చెయ్యడానికి దారుణ మారణ హేల ని రచించే ఉన్మాదమే తీవ్ర వాదం.
దీన్ని నిలువరించడానికి, ఈ సైద్ధాంతిక వైపరీత్యాన్ని తట్టుకోవడానికి, అసలు మన రక్షణ బలగాలకు దీని లోని లేటెస్ట్ పోకడ లు (ట్రెండ్ లు) తెలియాలి. సైద్దాంతిక వైరుధ్యాలని వెంటనే సరిదిద్దలేము. కానీ మన శత్రువుల (తీవ్ర వాదుల) బలా బలాలేమిటో, వారు అనుసరించే విధానాలేమిటో తెలుసుకుంటేనే కదా మనం వారిని ఎదుర్కోగలం !
రిపబ్లిక్ డే, స్వాతంత్ర్య దినోత్సవం లాంటి జాతీయ పర్వ దినాలు దగ్గర పడుతూండగా, డిల్లీ లో ప్రభుత్వ యంత్రాంగం ఎంత హడావుడి చేస్తుందో తెలుసా ? వార్తా పత్రికలలో, రోడ్ ల మైకు ల లోనూ.. అనుమానాస్పదమెదైనా, వ్యక్తి అయినా, బాగ్ అయినా వెంటనే పోలిసుల దృష్టి లోకి తీసుకు రమ్మని విజ్ఞప్తులూ, ఇంటికి అద్దెకి వచ్చే యువకుల, ఇంట్లోకి పనికి పెట్టుకునే వ్యక్తుల మీదా పోలీసు వెరిఫికెషన్ చేయించండంటూ ప్రకటనలూ, వెల్లువెత్తుతాయి. రైల్ స్తెషన్ లోనూ, రోడ్ ల మీదా అదనపు బలగాలు మోహరించి ఉంటాయి. హఠాత్తుగా ఇండియా గేట్ చుట్టూ రక్షణ వలయాలు ఏర్పడిపోతాయి. ఏదో సాయంత్రం ఐస్క్రీం తినడాంకి వెల్టే, నల్ల పిల్లి కమాండోలు జీప్ లో కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ కనిపిస్తారు. ఇవన్నీ మనల్ని కాపాడడానికి ప్రభుత్వం చేసే ప్రయత్నాలు.
ఈ భయం దేనికి ? ఎవరి నుంచీ.. లాంటివన్నీ మనల్ని తీవ్రవాదాన్ని గురించి ఆలోచింప చేస్తాయి. తద్వారా, వారి సైద్ధంతిక వాదాల్ని బహిర్గతం చేస్తాయి. తీవ్రవాదం మామూలుగా మనల్ని భయపెట్టకపోను. కానీ బాంబులూ, ఐ.ఈ.డీ (Improvised Explosive Devices) లు లేకపోయి ఉంటే, మనం తీవ్రవాదాన్ని పెద్ద లెక్క చేసే వాళ్ళం కాదు. తీవ్రవాదం అంటే పోలీసులూ, తీవ్రవాదులకూ మధ్య ఏదో యుద్దం లే అనుకుని ఉండేవాళ్ళం. అందుకే, ఈ ఐ.ఈ.డీ లు ఇప్పటి తీవ్రవాదులకు మురిపెమైన ఆయుధాలు.
ఇప్పటి తీవ్రవాదులంతా, తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లూ.. రక రకాల సాంకేతిక రంగాలలో అత్భుత ప్రతిభ కలవాళ్ళూ కావడం ఈ ఐ.ఈ.డీ ల సృష్టి కీ, విస్తృత వాడకానికీ దారితీసింది. చవగ్గా, తేలికగా దొరికే రశాయనాలు, విడి భాగాలతో సులభంగా తయారయ్యే ఐ.ఈ.డీ లూ / బాంబులు అందుకే ఇప్పటి ఫేవరెట్ ట్రెండ్.
పైగా, ఈ కొత్త బాంబులతో నిక్కచ్చి గా దొరికే అత్భుత ఫలితాలు (ఎక్కువ సంఖ్య లో ప్రాణ నష్టం) రక్షణ బలగాలను తీవ్ర నిరాశ లోకి నెట్టేస్తాయి. (మొరేల్ దెబ్బ తీయడానికి బాగా ఉపయోగ పడుతుంది) వేరే వేరే తీవ్రవాద సంస్థలు ఈ విభాగంలో తమ తమ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటాయి. (Like.. you have one Idea and I have one Idea, when we share them, we both will have two ideas each!)
ఇలా ఎప్పటికప్పుడు మంచి పరిజ్ఞానం తో ఐ.ఈ.డీలు విజృంభిస్తున్నాయి. అందుకే, వీటిలో కొన్ని రకాల గురించి నాకు తెలిసిన కాస్త జ్ఞానాన్ని పంచుదామని ఈ ప్రయత్నం.
12/07/2008
అణు ఒప్పందం - చిన్న వ్యాసం
అణు ఒప్పందం గురించి .. ఈనాడు లో ఒక చిన్న వ్యాసం. ఇంటరెస్ట్ ఉన్న వాళ్ళు, మిస్ అయిన వాళ్ళు, చదవొచ్చు.
11/07/2008
కొయ్య గుర్రం... పాట
నిన్న బాగా మూడ్ పాడైతే, ఈ పాట విన్నాను. మూడ్ రిఫ్రెష్ అయింది. పైగా.. ఈ పాట పిల్లల కోసం తీసింది కాబట్టి, పిల్లలకి (మన లోని పిల్లలకి) నచ్చాలి న్యాయంగా!
04/07/2008
అంతర్జాతీయం - కొలంబియా లో అద్భుతం
రాంబో సినిమా మా టైం లో సూపర్ డూపర్ హిట్। అలాంటి సినిమా ఇంకోటి రాలేదు। ఈ రోజు న్యూస్ లో అలాంటి వొళ్ళు గగుర్పొడిచే వార్త ఉంది। కొలంబియా లో గత ఏడు సంవత్సరాలుగా గెరిల్లా ల (ఫార్క్ - రివల్యూషనరీ అర్మెడ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా ) బందీ గా ఉన్న నలభయ్యారెళ్ళ ఇంగ్రిడ్ బెంటాకోర్ట్ అనే ఆవిణ్ణి మరో పధ్నాలుగురు ముఖ్యమైన బందీల తో సహా ఆర్మీ విడిపించింది। ఈ ఆపరేషన్ లొ ఒక్క తుపాకీ గుండు పేలలేదు. ఒక్క రక్తపు బొట్టు చిందలేదు. ఇంగ్రిడ్ కొలంబియా అధ్యక్ష పదవికి పోటీ చేస్తుండగా ఆవిడని ఫిబ్రవరి 2002 లో ఫార్క్ కిడ్నాప్ చేసేసింది। అప్పణ్ణించీ బందీ గానే ఉన్న ఆమెను ఇతర బందీలు (అమెరికన్ కాంట్రాక్టర్లూ, కొలంబియా సైనికులూ, పోలీసులూ॥ )తొ సహా ఒక హెలికాప్టెర్ లో సినిమా లొ లాగా తీసుకుని వచ్చేసారుట। కొలంబియా అడవుల్లో ఈ బందీలందర్నీ ఎప్పటికప్పుడు షిఫ్ట్ చేస్తూ ఉండేవారు। ఇలా ఈ రోజు కూడా షిఫ్ట్ చేసే నెపంతో ఒక హెలికాప్టెర్ లో వచ్చిన కొందరు గొరిల్లాలు॥ (గొరిల్లాల వేషం లో ఉన్న యూ. ఎస్. సైనికులు) బందీలందర్నీ జనారణ్యం లోకి తీసుకు వచ్చేసారు. కొన్ని సంవత్సరాల పాటూ॥ తీవ్రవాదులలొ కలిసిపొయి, వారి కదలికలను కనిపెడుతూ।, సరైన ప్రణాళిక తో, సరైన సమయం లో సరైన నిర్ణయాలు తీసుకుంటూ॥ ప్రాణాలకు తెగించి చేసిన ఈ ఆపరేషన్ లో కొన్ని వందల మంది సైనికులూ, పోలీసులూ పాల్గొన్నారు। తీవ్రవాదులను మోసం చేసి, తీవ్రవాదుల వేషాల్లో ఉన్న సైనికులు తెలివి తేటల తో ఈ ఆపరేషన్ ను నిర్వహించారు.
ఇంగ్రిడ్ కిడ్నాప్ చాలా సంచలనం సృష్టించింది। వెనిజుయెలన్ ప్రెసిడెంట్ ఆమె విడుదల కై చాలా ప్రయత్నాలు చెస్తూండే వాడు। ఆయన చొరవ కారణంగా గత ఆరు నేలలలో ఫార్క్ ముఖ్యమైన కొందరు బందీలను విడుదల చేసింది। ఇంగ్రిడ్ మాత్రం విడుదల కాలేదు. ఇంగ్రిడ్ ను బలమైన పావుగా ఇన్నాళ్ళూ వాడుకున్న ఫార్క్ కు నడుము విరిగినట్టయింది. నిర్దాక్షిణ్యమైన కిడ్నాపులూ, హత్యలూ చేసే ఫార్క్ కు అచ్చం సినిమాల్లొ లాగా దెబ్బ తగిలింది.
హెలికాప్టెర్ లోకి బందీలు ఎక్కగా నేల మీద మిగిలిపొయిన నలభయి మంది తీవ్రవాదులను మాత్రం వొదిలేసారు. హెలికాప్టెర్ లో బందీలతో పాటూ ప్రయాణించిన ఇద్దరు గొరిల్లాలను కోర్టు ముందు ప్రవేశ పెడతారు. ప్రభుత్వం, అధ్యక్షుడు యురైబ్, సమర్ధవంతమైన అధికారులూ కలిసి అత్భుతంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ చరిత్ర లో మిగిలిపోతుంది. తీవ్రవాదం తో నలిగిపోతున్న దేశం ఇలాంటి అహింసాత్మకమైన దాడి నిర్వహించడం, ఇప్పటి చరిత్రకు చెందని కరుణ చూపించడం ; గొరిల్లలను గొరిల్లా వ్యూహలతోనే ఎదుర్కోగలగడం, ఈ విజయానికున్న గొప్ప విషయాలు। క్షేమంగా బందీలను విడిపించడం తో పాటు, ఈ అత్భుతాన్ని సాధించాకా, నలభై ఏళ్ళ చరిత్ర గల ఫార్క్ కు అంత గట్టి దెబ్బ (బ్లో) ఇచ్చి, బలహీన పరిచి, ప్రభుత్వం వారిని చర్చలకు రమ్మంటుంది। మోత్తానికి ఏదో హాలీవుడ్ సినిమా చూసినట్టు అనిపించిందా ? కొలంబియా లో శాంతి అంత అకస్మాత్తుగా రాకపోవచ్చు! కానీ హింసకు హింసే సమాధానం అనుకునే ప్రపంచం దీన్నుంచీ కొంచెం ఏదైనా నేర్చుకుంటే బావుంటుంది.
న్యుక్లియర్ డీల్ కు పట్టిన గ్రహణం
అదృష్టవశాత్తూ సమాజ్ వాదీ పార్టీ సహాయం తొ, ఒక వేళ కారత్ తిక్క వేషాలు వేసి ప్రభుత్వానికి మద్దతు ఉపసం హరించుకుంటే తట్టుకుని నిలబడి, ఈ డీల్ అసలు అమలు లోకి వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని విని, చెవుల్లో అమృతం పోసినట్టనిపించింది. నిజంగా.. రాజకీయ నాయకులు దేశానికోసం, దేశ ప్రయోజనాల కోసం ఇలా కూటములు ఏర్పాటు చెసె అసలు ఆలోచనంటూ చెసారంటేనే, ఏదో.. దివ్యానుభూతి కలిగినట్టయింది. ఇది ఎంతవరకూ పోతుందో తెలియదు గానీ.. అసలు కారత్ కి నోరు మూయించే ఆయుధం మన్మోహన్ కు దొరకడం.. మన అదృష్టం. ఒకవేళ ఈ రోజు ప్రభుత్వం పడిపోతే, ఈ ఖరీదు రోజుల్లో, ఇంకో సాధారణ ఎన్నికల డ్రామా కి జనం తట్టుకోగలరా ?
ఆలోచించగలిగే శక్తి ఉన్న ప్రతీ వారూ.. ప్రత్నామ్యాయ ఇంధన వనరుల ప్రయోజనాన్ని గుర్తిస్తున్నప్పుడు, భా.జ.పా.కూడా ఈ డీల్ కు వ్యతిరేకం కానప్పుడూ.. ఎవరో తిక్క పార్టీలు తప్ప దీన్ని అందరూ సమర్ధిస్తున్నప్పుడూ.. ఎందుకు ఈ వ్యతిరేకత ? మన ఖర్మ కాక పొతే !
అబ్దుల్ కలాం కూడా ఈ deal దేశ ప్రయోజనాలకు అవసరం అని చెప్పినా.. తలకెక్కని ఈ లెఫ్టిస్టు రాహు కేతువుల ఆట ఎప్పటికైనా కట్టి, న్యూక్లియర్ డీల్ ఒక గట్టున పడాలని ఆ శత కోటి దేవతలకు మొక్కుకుంటూ. .
02/07/2008
Charlie bit my finger - again !
ఈ వీడియోని నేను గమ్మత్తుగా కనుక్కున్నా ! ఇది అనుకోకుండా తీసిన హోం వీడియో. చూసాకా చాలా నచ్చింది. ఈ వీడియోకి చాలా వ్యంగ్యానుకరణలు కూడా వచ్చాయి. మీరు కూడా చూడండి. ఈ వీడియో కి వచ్చిన రెస్పాన్స్ చూసి, ఉబ్బి తబ్బిబ్బయ్యి, ఈ పిల్లల తండ్రి ఈ ఇద్దరు పిల్లల మీదా తీసిన తీసిన ఇంకొన్ని వీడియోలను కూడా తన చానెల్ లో పెట్టారు. అసలు ఈ వీడియోని ఇంతవరకూ ఎంత మంది చూసారో చూడండి. బాగా పాపులర్ అయిన 'చార్లీ బిట్ మై ఫింగెర్ - అగైన్!!' ని చూసి.. ఎంజాయ్ చెయ్యండి.
01/07/2008
ప్రేమ గీతం
ప్రేమ ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది.
ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమచే ప్రేమించబడిన ప్రేమను ప్రేమిస్తుంది.
నర్సు కొత్త డాక్టరును ప్రేమిస్తుంది.
14 నం. కనిష్టీబు మేరీ కెల్లీని ప్రేమిస్తాడు.
హంటర్ వాలా హంటర్ వాలీ ని ప్రేమిస్తాడు.
నాయకులు నాయికలను ప్రేమిస్తారు.
మనవాళ్ళయ్య వాళ్ళ వాళ్ళమ్మను ప్రేమిస్తాడు.
సరోజాబాయి సైకిలు మీద వచ్చిన కుర్రాణ్ణి ప్రేమిస్తుంది.
వీధి కొసను అమ్మాయి గోడ చాటున అబ్బాయిని ప్రేమిస్తుంది.
చీ చీ చీ చీనావాడు చౌ చౌ చౌ చీనీ దాన్ని ప్రేమిస్తాడు.
ముసుగు మనిషి చచ్చిపొయిన మనిషిని ప్రేమిస్తుంది.
మహారాజుగారు మహారాణీ గారిని ప్రేమిస్తారు.
మహిషం మహిషి ని ప్రేమిస్తుంది.
నువ్వు ఒకానొకర్తెను ప్రేమిస్తావు.
ఆ ఒకానొకర్తె ఇంకొకా నొకర్ని ప్రేమిస్తుంది.
భగవంతుడు అందరినీ ప్రేమిస్తాడు.
- శ్రీ శ్రీ
''ఖడ్గ సృష్టి'' నుంచి
ఇంటెర్ ప్రెటెర్ ఆఫ్ మాలడీస్ - మిసెస్.సేన్
లాహిరి బెంగాలీ. లండన్ లొ పుట్టారు. అమెరికా లో స్థిరపడ్డారు. దేశానికి దూరంగా ఉన్న భారతీయుల ఆత్మలను తాకుతూ రాసిన కధలు.. వాటిల్లో, కొత్త జీవన విధానాలకూ, తాము నమ్మిన భారతీయ విలువలకూ మధ్య నలిగిపొయె పాత్రల చిత్రణ, ఆమె కధలను అంతర్జాతీయ స్థాయిలొ నిలబెట్టాయి.
ఈ కధలన్నిట్లొ, నాకు బాగా నచ్చిన కధ, మిస్సెస్.సేన్. ఇలియట్ అనే ఒక అమెరికన్ పదకొండేళ్ళ పిల్ల వాడు.. వాడి ఒంటరి తల్లి ; మిస్సెస్.సేన్, మిస్టర్ సేన్ లు, మొత్తం పాత్రధారులు. (అనొచ్చా...?!) ఈ ఎలియట్ తల్లి, పిల్లవాడి స్కూల్ ముగిసాక, వాడిని చూసుకొవడానికి అంతవరకూ కుదుర్చుకున్న బేబీ సిట్టింగ్ చెస్తూ ఉండిన అమ్మాయికి వేరే యూనివెర్సిటీ లొ సీట్ వచ్చి, తను వేరే ఊరికి వెళ్ళిపొతుంది. సరిగ్గా అదే సమయంలొ, మిస్సెస్.సేన్ '' ప్రొఫెస్సర్ భార్య.. పిల్లలను, మా ఇంట్లోనే చూసుకుంటాను' అని ఇచ్చిన ప్రకటన చూసి, వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఇలియట్ ని ప్రతి రోజూ, స్కూల్ తరవాత, మిస్సెస్.సేన్ చూసుకునె విధంగా, ఇలియట్ తల్లి ఏర్పాటు చేస్తుంది.
అప్పుడే మిస్సెస్. సేన్ పాత్ర చిత్రీకరణ జరుగుతుంది. మిస్సెస్ సేన్, ఒక సాధారణ బెంగాలీ గృహిణి. భర్త, యూనివెర్సిటీ లో మాథెమెటిక్స్ బోధిస్తుంటాడు. ప్రతీ రోజూ, ఇలియట్ కోసం రోడ్ చివర వరకూ వచ్చి, బస్సు లొ వచ్చే పిల్లాడికి, ఏదో ఒకటి తినడానికి ఇవ్వటం, ఇంటికి జాగర్తగా తీసుకుని రావటం, సాయంత్రం వరకూ వాణ్ణి కనిపెట్టుకుని ఉండి, తల్లి పికప్ చేసుకోవటానికి వచ్చినప్పుడు, ఆమె కు కూడా, ఏవో తినటానికి ఇవ్వటం.. ఇలా ఎంతో, జాగర్తగా, సహృదయత తొ మెలుగుతూ ఉండే మిస్సెస్.సేన్ అంటే ఇలియట్ కు ఎంతో అభిమానం, ప్రేమా కలుగుతాయి. తల్లి కన్నా, నిజానికి మిస్సెస్.సెన్ దగ్గరె వాడికి ఎక్కువ వాత్సల్యం దొరుకుతుంది.
ఇలియట్ కు మిస్సెస్.సేన్ చేసే పనులన్నీ విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి. ఆవిడ పాపిట్లో సింధూరం చూసి, ఆవిడ తలకి దెబ్బ తగిలిందేమో అనుకుంటాడు. ఆవిడ చాకుతో కూరగాయలు తరిగే విధానం.. ఆవిడ తో చేపల దుకాణానికి వెళ్ళడం.. ఇలా.. ఆవిడ భారతీయత అంతా.. వింతగా, ఇష్టంగా గమనిస్తూ ఉంటాడు ఇలియట్. కానీ అతని తల్లికి ఈ విచిత్రమైన భారతీయ గృహిణి పెద్దగా నచ్చదు. ఏదో తప్పక ఈ ఏర్పాటు కు ఒప్పుకుంటుంది గానీ.. మిస్సెస్.సేన్ ప్రతీ సాయంత్రం ఇలియట్ ను తీసుకెళ్ళడానికి వెళ్ళేప్పుడు - తనకు చేసే అతిధి సత్కారం కూడా ఆవిడకు నచ్చదు.
మిస్సెస్.సేన్.. తన హృదయన్నంతటినీ.. ఈ పిల్లవాడి ముందు స్వచ్చంగా బయటపెడుతూ.. తన మంచితనం తో.. మనల్ని కూడా మురిపిస్తుంది. ఉదా.. తను నేల మీద పేపర్ పరుచుకుని రోజూ కూరగాయలు తరిగేటప్పుడు, పిల్లవాణ్ణి, సోఫా దిగనివ్వదు. తనకు డ్రైవింగ్ అంటే, అయిష్టం, భయం. అందుకే.. ఏది ఏమైనా.. మిస్టర్ సేన్ ఎంత ఒత్తిడి చేసినా... ఇలియట్ కూడా ఉన్నప్పుడు డ్రైవ్ చెయ్యదు. ఇలా.. తన మీద ఆవిడ చూపించే కన్సెర్న్ ని ఇలియట్ హృదయం ఎప్పటికప్పుడు గమనిస్తూ.. అర్ధం చేసుకొవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.
ఇలాంటి రోజుల్లోనే.. ఒక సారి మిస్టెర్ మరియూ మిస్సెస్ సేన్, ఇలియట్ కలిసి బీచ్ కు వెల్తారు. హాయిగా సమయం గడిపిన తరవాత, ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు, మిస్టెర్ సేన్ ఒత్తిడి మీద (ఆవిడకు డ్రైవింగ్ లైసెన్స్ కోసం పరీక్ష ఉంది మరి!) డ్రైవ్ చేస్తుంది. అయితె, ఆ భయంలో ఒక చిన్న ఆక్సిడెంట్ చేసేస్తుంది. అదృష్టవశాత్తూ .. ఇలియట్ కు దెబ్బలు ఎవీ తగలవు. మిస్సెస్.సేన్ కు కాస్త దెబ్బలు తగులుతాయి. పొలీసులూ.. నచ్చజెప్పడాలూ అవుతాయి. దంపతులిద్దరూ.. పిల్లాణ్ణి ఇంటికి తీసుకొచ్చాక, తల్లికి ఫొన్ చెస్తారు. ఆక్సిడెంట్ గురించి చెప్పడానికి.
ఇంక ఆ రోజంతా, దంపతులిద్దరూ ముభావంగా ఉంటారు. తల్లి పిల్లాణ్ణి తీసుకెళ్ళడానికి వచ్చే ముందు, మిస్సెస్.సేన్, ఇలియట్ కొసం, తినడానికి ఏదో తయారుచేసి పెడుతుంది.. తరవాత, మిస్టెర్ సేన్ కు పిల్లాణ్ణి అప్పచెప్పి, గది లొకి వెళ్ళి, తలుపు వేసుకుంటుంది. తల్లి వచ్చాకా.. మిస్టెర్ సేన్, ఆమెకు క్షమాపణ చెప్తాడు. ఇంక ఆ రోజు నుంచీ మిస్సెస్.సేన్ పిల్లాణ్ణి చూసుకునెది లేదు అని నిర్ణయించుకుంటారు. తన సామాన్లు తీసుకెళ్ళటానికి లోపలికి వెళ్ళిన ఇలియట్ కు, మూసి ఉన్న బెడ్ రూం తలుపుల లొంచీ.. మిస్సెస్.సేన్ ఏడుపూ, వెక్కిళ్ళూ వినపడతాయి.
తల్లీ, ఇలియట్, ఇంటికి వెళ్ళిపొతారు. దార్లో.. తల్లి ''తనకి ఈ ఏర్పాటు తప్పిపొవడం ఒక రిలీఫ్ అనీ.. ఆవిడకు ఎప్పుడూ.. మిస్సెస్.సేన్ నచ్చలేదనీ..'' చెబుతుంది. ఇంక నుండీ.. ఇలియట్ పెద్ద వాడు అయ్యడు కాబట్టి... ఇంక ఒంటరిగానే ఇంట్లొ ఉండాలని నిర్ణయిస్తుంది. అప్పుడు వాడికి తనని కంటికి రెప్పలా చూసుకున్న మిస్సెస్.సేన్.. గుర్తొచ్చి, చాలా బాధ కలుగుతుంది. ఆ తరవాత, వాడు ఎప్పుడూ మిస్సెస్.సేన్ ను కలుసుకోడు.
ఆ అమెరికన్ పిల్లవాడు, భారతీయ సాంప్రదాయాన్ని గురించి సెన్సిటైస్ అవ్వడం, జోళ్ళు బయట విడిచి పెట్టి ఇంట్లొ కి రావడం, మిస్సెస్.సేన్ తన ఇంటి గురించీ.. భారత దేశం గురించీ చెప్పడం వినడం.. అసలు అదేంటో తెలియని దేశం తాలూకూ స్వాభావికత ను అంచనా వెయ్యడానికి ప్రయత్నించడం.. ఇలా.. ఈ కధ లొ సున్నిత పార్స్వాలు అమోఘం.
ఈ కధ నాకు అందుకే బాగా నచ్చింది.