Pages

10/05/2008

చందనోత్సవం - సింహాచలం జ్ఞాపకాలు



ప్రకృతి కి, మనిషి కీ దూరం పెరిగిపోయి, 'ఆర్గానిక్', 'ఫ్రీ రేంజ్' అనేవి కాస్ట్లీ అయిపోయి, పెరటి లో పూల తోట, వెన్నెల్లో ఆటలూ, డాబా మీద/ఆరుబయట నిద్రపోవటం... ఏవో పూర్వ కాలపు విషయాలయిపోతున్న ఈ రోజుల్లో కూడా, మా ఊర్లో (విశాఖపట్నం) లో ప్రతీ ఏడూ చందనోత్సవం జరుగుతుంది. దీనికీ ప్రకృతికీ ఏమిటి సంబంధం అంటే.. ఇక్కడ అచ్చంగా అడవి దేవర అయిన సింహాచలం వరాహ నరసింహ స్వామికి 'చందన తదియ' నాడు నైవేద్యం పెట్టి కానీ, మామిడి పళ్ళు తినని ఒక ముచ్చటైన సాంప్రదాయం ఉంది. ప్రకృతి కీ, దేవుడికీ సంబంధం ఎప్పుడూ ఉంది. దేవుడికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం ? ఆయనిచ్చిన దాంట్లో ఏదో కొంత ఆయనకే ఇచ్చి, ఆయనకు దగ్గరవటానికి ప్రయత్నిస్తాం.


మొన్న సింహాచలం లో అప్పన్న కు చందనోత్సవం జరిగింది. ఇంట్లో ఆ రోజు అప్పన్న కు మామిడి పళ్ల నైవేద్యం జరిగి ఉంటుంది. ఇంక అఫీషియల్ గా మనం (మేము) అంతా మామిడి పళ్ళు తినడం మొదలు పెట్టొచ్చు అన్నమాట! చందనోత్సవం దాకా మామిడి పళ్ళు, కాయలూ, పిందెలూ తినటం ఒక అపరాధం! 'ఎందుకూ ?' అని చిన్నపుడు పోట్లాడినా, పెద్దయ్యాక, దేవుడు మనకు అంత మంచి ఫలాన్ని ఇచ్చినందుకు ఇదో రకమైన Thanks చెప్పడం అన్న మాట అని అర్ధం అయింది. అప్పుడే ఈ ప్రకృతి ఇచ్చిన వరాలను మనం ఎంతగా cherish చేస్తామో అర్ధమవుతుంది.
విశాఖపట్నం నుండీ సాధారణంగా సాయంత్రం కొండ కు వెళితే.. ఒక్కోసారి ముసురు పట్టేది. కొండ మీద తేలి వస్తున్న నల్లని మేఘాలూ, పచ్చని అడవులూ.. గోపురం వెనుక నల్లని ఆకాశం, చెట్లూ..వీటన్నిటి తో కలిసిన సింహాచలం చాలా అందమైన ప్రదేశం. అప్పన్న అడవి మనుషుల దేవుడు. సంపెంగలూ, తులసీ, మామిడి పళ్ళూ, కొండ మీది పనస పళ్ళూ..సపోటాలూ, తేనె, సీతాఫలాలూ, అన్నీ ఆయన ప్రసాదాలే.. ఆయనకు ప్రీతి పాత్రాలే ! విశాఖపట్నం నిజంగా అందమైన ఊరు. కొండ మీద, దగ్గర ఉండే ఊర్లలోనూ కోయజాతి ప్రజలు.. చెంచులూ.. అప్పన్న దేవస్థానం, గోసాలలూ, ఒక పదేళ్ళ క్రితం ఆయితే ఇంకా బావుండేది ఈ 'మరీ ప్రకృతి ఒడి లో ఉన్నట్టుండే గుడి'!


ఇప్పుడు కూడా మరీ పెద్ద మార్పులు లేవు. మరీ బ్రహ్మర్ల పీడింపు ఉండదు-అన్నవరం లా! దక్షిణలు లెక్క కట్టి (అన్నదానం, బ్రాహ్మణుల కు వస్త్రదానం అంటూ ఎవరూ మిమ్మల్ని అడగరు) స్వీకరించడం ఉండదు. ఒక మంచి దేవస్థానం ఉంది. తిరుపతి లా, అన్ని దానాలూ దేవస్తాననికే చెయ్యొచ్చు. అన్నిటికీ ఒక ఎకౌంటు ఉంటుంది. అడవి దేవుడే అయినా చాల నాగరికంగా ఉంటాడు అప్పన్న. డబ్బు పీడింపు ఉండదు. ఊరి వాళ్లు 'అది కొనండి' - 'ఇది కొనండి' అని వెంటపడరు. అప్పన్న దేవస్థానం బావుంటుంది. భేషజాలు లేకుండా ప్రశాంతంగా, మామూలుగా ఉంటుంది. పొద్దున్న సుప్రభాతం వేళకు కొండ మీద చిరు చలి, పవిత్రత.. పొద్దున్న ఏమి చెప్పనా అప్పన్న వింటాడు. పొద్దున్నే ఎందుకు బ్రహ్మముహూర్తమో ఏమో కానీ.. పొద్దున్నమాత్రం స్వర్గమే.. సింహాచలం. స్వర్గం లో దేవుడూ కూల్ గా ఉండి మన గోడు వింటాడుగా మరి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ గొడవలు ఎక్కువయిపోయి, విశాఖపట్నం లో అందమైన కొండల నిండా ఇళ్ళూ, కాలనీలూ వెలిసినా, సింహాచలం ఇంకా సింహాచలం గానే ఉంది.


ఎందుకో, సింహాచలం అంటే నాకు చాల ఇష్టం. గాంగులు నిర్మించిన రమణీయమైన శిల్పం, కళ - ఒరియా, తెలుగు భాషల లో రక రకాల ఫలకాలూ. శతాబ్దాల నాటి శిల్పం - రాళ్ళు మాట్లాడుతున్నట్టు! సంవత్సరాలుగా బోల్డన్ని కధలు... అప్పన్న గుడి లో ఎప్పుడో ఒక సారి దొంగలు పడితే, ఎక్కడ నుంచో, తుమ్మెదలూ, తెనేటీగలూ వారి మీద దాడి చేసి తరిమేసాయంట. లల్లా దేవి నవల కూడా ఎపుడో ఆంధ్రప్రభ లో చదివిన గుర్తు. అప్పన్న ఆభరణాలు శతాబ్దాల నాటివి. ఆయన్ని గర్భగుడి లో చాలా దగ్గర నుంచీ చూడొచ్చు. చందనం అలమిన దేహం.. పట్టు బట్టలూ, వజ్రాల నగలూ, తులసి మాలలూ! ఆయన ఆకారం పెద్ద లింగం లా.. ఉంటుంది. కాని ఆ చందనపు పొరల క్రింద, చిన్న నిజ విగ్రహం ఉంటుంది.. వరాహ - నరసింహుని విగ్రహం. దాన్ని నిజరూపం అంటారు. దర్శనం సంవత్సరం లో కేవలం ఒక్క వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే! ఆ రోజే చందనోత్సవం.


చందనోత్సవం రోజున ప్రతీ ఏడూ.. ఆయన విగ్రహానికున్న చందనాన్ని వొలిచి, కొత్తగా నూరిన మంచి గంధం (చందనం) పూస్తారు. ఆ రోజు నిజ రూప దర్శనం. (వరాహం ముఖం - మనిషి మొండెం - సింహం తోక !) ఆ రోజున మాత్రం, ఊరంతా వేడి, భగ భగ లాడే ఎండా..! అదంతా 'అప్పన్న వేడి వల్లనే' అంటారు. స్వామి ఉగ్ర నరసింహుడు కదా! ఇదంతా ఒక Legend. నమ్మే వారు నమ్ముతారు. కానీ ప్రహ్లాదవరదుడు.. అంటే పిల్లలకు చాలా ఇష్టం కదా! అందుకే చిన్నప్పుడే అప్పన్న అంటే నాకు ఒక హీరో వర్షిప్. ఆయన ఉగ్ర రూపాన్ని చూసి ప్రపంచమే వొణుకుతుంటే, ప్రహ్లాదుడు మాత్రం ఆయన్ని శాంతపరిచాట్ట ! 'మరి ప్రహ్లాదుడి కి భయం వేయలేదా?' అని అడిగితే, మా అమ్మ మాత్రం 'మరి దేవుడికి చిన్న పిల్లలంటే ఇష్టం కదా.. అందుకే ప్రహ్లాదుడిని చూసి దేవుడు ఏమి అనలేదు. నెమ్మదిగా శాంతించాడు!' అని చెప్పింది. ఆయన ఎంత శాంతించినా, మరి కోపంతో 'వొళ్ళు మండుతూ ఉంటే !' (మన వాడుక లో) చందనం పూసి ఆయన ఒంటిని చల్ల పరచే ప్రయత్నం జరిగింది. అందుకే చందనోత్సవం.


ఇంట్లో అందరం...సింహాచలం ఒక పిక్నిక్ లా వెళ్ళే వస్తూండే వాళ్ళం. ఆ కంపనీ మహిమో ఏమో.. మళ్ళీ అలాంటి ఫీలింగ్స్ వేరే వాళ్ళతో చప్పున కలగవు. తిరుగు ప్రయాణం లో, అన్నమయ్య కీర్తనలూ, వైజాగ్ అందాల వర్ణనలూ.. (అక్క అసలే భావుకురాలు), మాలో మేము మైమరిచిపోవడాలూ లాంటివి బోలెడు. ఆ జ్ఞాపకాలు ముసిరినప్పుడు.. మాత్రం.. 'ఈ సారి వెళ్ళాలి!' అని గట్టిగా నిర్ణయించుకున్నా, మా అందరం ఒకే సారి వెళ్ళేది మాత్రం అనుమానమే. నాకు వీలయినపుడు అక్క కు వీలవదు, ఒకవేళ అందరికీ సెలవులు దొరికినా.. చెల్లికి కుదరదు. దేవుడు మా అందరికీ ఒకే సారి, సెలవులూ, వైజాగ్ వెళ్ళే అవకాశం కనుక కల్పిస్తే, తప్పకుండా సింహాచలం. ఒక సాయంత్రం వేళ వెళ్ళాలని నా కోరిక. రద్దీ - రద్దీ హైదరాబాద్ నుంచీ విశాఖ వెళ్ళడమే పెద్ద రిలీఫ్. అందులో.. సింహాచలం లో ఒక సాయంత్రం.. ఇంకా హాయి. ఎందుకు హాయి అంటే..సిటీ కి దగ్గర్లోనే, ఆ కొండ సంపెంగల గాలీ, పట్టు తేనెగూళ్ళు ఎటు చూసినా కనిపించే ఆకుపచ్చని ఆవరణ.. ఇంకెక్కడా దొరకవు కాబట్టి.

6 comments:

సూర్యుడు said...

బాగుంది, ఈ సారి విశాఖపట్నం వెళ్తే తప్పకుండా సింహాచలం వెళ్లాలి, నేను కూడా :-)

నమస్కారములతో,
సూర్యుడు :-)

కొత్త పాళీ said...

Beautiful.

రాఘవ said...

ఏమైనా (నా ఫేవరెట్ సిటీ) వైజాగ్ అంటే వైజాగే.
అన్నట్టు చిన్న అనుమానం... నిజరూప దర్శనం జరిగేది వైశాఖ శుద్ధ ౩య (అదే అక్షయ తృతీయ)రోజున కదండీ.

సుజాత వేల్పూరి said...

సుజాత గారు,

చందనోస్తవం గురించి ఆ మర్నాడొ ముందు రోజో వార్తల్లో చూడటం తప్ప, ఇంత వివరంగా నాకు తెలియదు.(కావాలంటె మంగళగిరి పానకాల స్వామికి పానకం పోసే సంగతి చెప్తాను) ముఖ్యంగా మామిడి పళ్ల సంగతి ఇంతకుముందెవరో చెప్తే విన్నాను. సిమ్హాచలం అందాలు బాగ వర్ణించారు.

ముఖ్యంగా బ్రాహ్మలు వేధించరని తెలిసి సంతోషంగా ఉంది. తప్పకుండా చూడాల్సిందే!

Sujata M said...

సూర్యుడు,
కొత్త పాళీ,
రాఘవ,
సుజాత గార్లకు Thanks.
రాఘవ గారు. సారీ. నిజమే. విశాఖ శుద్ద తదియ నాడు చందనోత్సవం జరుగుతుంది. తప్పు దిద్దినందుకు Thanks again.

Anonymous said...

ఎప్పుడో పదేళ్ళ క్రితం వెళ్ళాం. కానీ ఈ మధ్య యమదొంగ సినిమాలో కీరవాణి గారు సినిమా ప్రారంభంలో స్వామివారి స్తోత్రానికి కూర్చిన సంగీతం విన్నాక మళ్ళీ దర్శించాలన్న కోరిక కలుగుతోంది.