ఇరుకుగా ముళ్ళతో నిండిపోయి నడవటానికి వీల్లేని అడవి బాటలో నడుస్తున్నాడు ఆ బాటసారి. ఉన్నట్టుండి తనమీద కోట్లాది చూపులు పాకుతున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూశాడు. ఆ చూపులు దివ్యమైన ఉత్సాహంతో వెలిగిపోతున్నాయి. ఆ చూపులు అతని హృదయాన్ని చెప్పలేనంత గర్వంతో నింపేసాయి. ఎంతో తృప్తిగా అనిపించింది. చిరునవ్వు చిందిస్తూ చాలా ఒద్దికగా అడిగాడు "భాయీ, మీకంత శక్తివంతమైన చూపు ఎక్కడనించి వచ్చింది?"
కోట్లాది నక్షత్రాల్లా వెలిగిపోతున్న ఆ కళ్ళు "ఓ ధైర్యశాలీ, నీవు నడిచి వచ్చిన దీర్ఘమైన దారినంతా అలా చూడగా, చూడగా అబ్బిన శక్తే మా చూపుది!" సమాధానమిచ్చాయి.
అప్పుడు మృదువైన వెచ్చని చూపు మాత్రం ఆతనికి ఒక సందేశాన్నిచ్చింది. "ఇదిగో! ఈ అష్ట కష్టాల బాట ఇంతకుముందు ఇటుగా నడిచిన యువ బాటసారులెవరూ తప్పించుకోలేనటువంటి మృత్యువుకే దారితీసింది!!" అని. అదివినీ వినంగానే, కోట్లాది గొంతులు అరిచాయి… "నోరుముయ్యవోయి పిరికివాడా… ఇది అనంతమైన, నిజమైన మానవత్వపు ఆత్మ వైపు చేసే పయనానికి దారి"
ఆ బాటసారి తన రెండు కళ్ళనూ విప్పార్చుకుని పరోపకారతత్వం తొణికిసలాడే ఆ కోట్లాది చూపులను తృప్తిగా తాగాడు. సరిగ్గా శృతిచేసిన వీణ ఎలాగైతే ఒక వేలు మీటగానే నిద్రాణ స్థితినుండి లేచి ప్రాణధ్వని వినిపిస్తుందో సరిగ్గా అలాగే అతనూ చటుక్కున మేల్కొన్నవాడిలా 'పద ఇక ముందుకు ' అని తనని తాను ఉత్తేజపరచుకున్నాడు.
చెట్లతో నీండిన ఆ అనంతమైన విస్తీర్ణం, బాటసారికి హఠాత్ యవ్వనం ప్రసాదించేసి ఒక ప్రకటన చేసింది - "నీ నుదుట్న యవ్వనపు సార్వభౌమత్వాన్ని ఒక ముద్రలా వేసిస్తానుండు. ఇది నిన్ను నిత్య యవ్వనునిగా, చిరంజీవిగా చేస్తుంది!!" అల్లంత దూరంలోనున్న క్షితిజరేఖ ఇతని వైపుకు వంగి ఆశీర్వదిస్తూ తలను ముద్దాడింది. బాట పక్కనున్న చెట్లు తమ కొమ్మల్ని ఆడిస్తూ శుభాకాంక్షలు తెలిపాయి. ఆ సుదూరపు క్షితిజరేఖ అతనికి అస్పష్టంగానే అయినా, స్వతంత్ర దేశపు ఆనవాలను చూపించింది. ఆ స్వతంత్ర దేశపు ముఖద్వారంలో భయానకమైన వేకువ పాట ఒకటి వేణునాదమై బాటసారిని, ఆ వనంలోని ఒక హిరణ్యాన్ని మైమరిపించేసినంతగా కట్టిపడేసింది. ఆ గాన మోహం లో పడి, అతను స్వాతంత్రం వెంట పరుగులు పెడుతున్నాడు. "అహో! నీ స్వతంత్రపు ప్రధాన ద్వారం ఎక్కడ? తెరువు ఆ తలుపుల్ని… తెరువు… నాకు వెలుతురిని చూపించు. దారిని చూపించు!"
విశ్వపు మార్మిక దివ్యత్వం అతన్ని కమ్మేసి చెప్పింది "ఇంకా చాలా దూరం ఉంది. నడు". అతను హతాశుడై, 'హేయ్! నేను వెతుకుతున్నది నిన్నే!" అని అన్నాడు.
అప్పుడే పరిచయం అయిన ఆ సహ పాంధుని గొంతు ఇలా అంది, "నన్ను పొందేందుకు నువ్వు చాలా దుర్గమ మార్గాన్ని దాటాల్సుంటుంది."
అలుపెరగని బాటసారి తన గమనాన్ని తొందర చేసాడు. "అవును భాయీ ! అదే నా లక్ష్యం". ఈ హడావిడికి, హద్దుల్లేని ఆకాశం క్షణమాగి ఒక చిన్న సందు చూసుకుని కిందున్న 'అంతులేని ఆ అడవి' కేసి తొంగి చూసింది. వెనకున్న కోట్లాది యువ గొంతుకలతని మాట విని.. "మాదీ అదే లక్ష్యం.. పద భాయీ… ముందుకు పద. నువ్వు ముందుకెళ్ళు - మేము నీ అడుగుల్ని అనుసరిస్తాం" అంటున్నాయి.
గర్వాన్నీ, సంతృప్తినీ బయట పడనీయకుండా తొక్కిపట్టలేకపోయినప్పటికీ బాటసారి వారికో మాట గుర్తు చేసాడు 'కానీ ఈ పయనం మృత్యువు వైపు కదా!'
కోపాన్నణుచుకోలేని ఆ యువ గళ కోటి అతని హెచ్చరికను తిప్పికొడుతూ అరిచింది. "మేము దాన్ని పట్టించుకోము. ఇది చావు కాదు. ఇది అసలైన బ్రతుకుకి, ఒక కొత్త మొదలు!"
కొంచెం వెనగ్గా బలహీనమైన గుండె గల ఒక వృద్ధుల గుంపు చావు భయంతో వణుకుతూ ఉంది. వాళ్ళ భుజాల మీద నొక్కిపట్టి కూచుని వికృతమైన నవ్వుతో వాళ్ళని హేళన చేస్తూ… "చూడండి. నేనే మృత్యువును. ఇక్కడే ఉన్నాను" అంటోంది ఒక స్వరం.
అక్కడికి దగ్గరలో, ముదిమితో చీకటి చిమ్మిన కళ్ళకు 'వెలుగు తాలూకూ అనుభూతిని' ఇచ్చేందుకని సువాసనలు వెదజల్లుతున్న ఒక చితి మంట మండుతూ ఉంది. పొట్ట చెక్కలు చేసేటంతటి నవ్వుని ఎలానో ఆపుకుంటూ, వాళ్ళను ఆ చితి వైపు నడిపించి "ఇదిగో చూడండి ఇదే మీ మోక్ష మార్గం!! ఎందుకిలా మీ వృద్ధాప్యంలో ఈ దీర్ఘమైన కఠిన మార్గాన్ని ఎన్నుకుంటున్నారు? ఎప్పటికైనా ఆ బాటసారి గానీ, అతని అనుచరులు గానీ చేరుకునేది మృత్యువు ఒడికేగా?!" అన్నదో గొంతు.
వారిలో కురువృద్దుడొకడు ఒకడు రెండు చేతులూ పైకి చాచి "అవును.. నిజమే!" అని అన్నాడు.
ఒక కొంటె గొంతు హెచ్చరికగా అంది. "మూర్ఖులారా ! ఎవరినీ ఎప్పుడూ దేనికోసమూ అడుక్కోమాకండి. వాళ్ళు మెల్లగా మిమ్మల్ని ఆ చితిలో వేసి చచ్చేవరకూ కాలుస్తారు."
వారి నాయకుడొకడు ఇంకో ఉప్పెన వంటి నవ్వును బలవంతంగా అణుచుకుంటూ "కాదు కాదు వాళ్ళ మాటలు వినొద్దు. వాళ్ళ దారి ప్రమాదాలతో నిండినదీ, దీర్ఘమైనదీనూ. పైగా దారంతా కష్టాలు, ఆటంకాలు, దుఃఖాలు… మీ విడుదల దగ్గర్లోనే ఉంది" అన్నాడు.
అలుపెరగని బాటసారి మాత్రం, స్వాతంత్రపు ముఖద్వారపు వేణుగానం మాయలో పడి కొట్టుకుపోతున్నాడు. స్వతంత్రం వైపు అడుగులు వేస్తూనే ఉన్నాడు. దారి బాధల పిశాచాలు ఇపుడతన్ని హింసలపాలు చెయ్యబూనాయి. అతనికి తడబడిన పాదముద్రలు కనిపిస్తున్నాయి… అవి ఇంకా వెళ్ళాల్సిన దారి చాలానే ఉన్నట్టు సూచిస్తున్నాయి. కష్టాల ముళ్ళ బాట కి రాణైనటువంటి ఒక పిశాచం, ఒక కపాలాన్ని అరచేత పట్టుకుని బాటసారికెదురుగా నిలబడి… 'చూడు. నీ ముందు వెళ్ళిన వాళ్ళ పని ఇక్కడితో ఇలా సమాప్తం అయింది!!' అంది.
ఆ కపాలాన్ని తన నెత్తిన పెట్టుకుని ఆ బాటసారి ఇలా అన్నాడు "ఆహా! వీళ్ళే కదా నన్ను ఈ దారిలోకి పిలిచింది. నేను కోరుకునేది కూడా ఇదే. ఇలాంటి అంతమే నాకూ కావాలి. నా దారి ననుసరించి రాబోయే ఇలాంటి లెక్కలేనందరు యువతతో కలిసి నేనెప్పుడూ ఉంటాను'.
పిశాచి 'ఎవరు నీవు?' అనడిగినపుడు బాటసారి ఇలా అన్నాడు. "నేను స్వతంత్రాన్ని కోరుకునే నిత్యాన్వేషిని. ఇలా ఇక్కడ పరుచుకున్న కపాలాలలోని వాళ్ళందరూ మృతులూ కారు, జీవితులూ కారు. వీళ్ళందరూ నా వంటి అన్వేషకులను ఈ దారెమ్మట వచ్చేందుకు ప్రోద్బలమిచ్చినవారు. వీళ్ళు నాలో నూతన యవ్వనాన్నీ, శక్తినీ, ఉత్సాహాన్నీ, మెరుపునీ ఇస్తూ వచ్చారు. మేమంతా స్వతంత్ర సాధకులం. మేము చిరంజీవులము".
పిశాచి వణుకుతూ, తెగువ తెచ్చుకుని ఇలా అరిచింది. "నేను నీకు తెలియదా? నేను మూర్తీభవించిన బానిసత్వాన్ని. నువ్వేమన్నా సరే ,నా లక్ష్యం నిన్ను ఉనికి లేకుండా చేయడం. నిన్ను బంధించడం, నీ స్వతంత్రాన్ని శృంఖలాలతో బంధించడమే నా నెలవు . నువ్వు నా చేతిలో చావాల్సిందే".
బాటసారి క్షణమాగి సమాధానం ఇచ్చాడు. "సరే. చంపు. బంధించు. కానీ నిజంగా నువ్వు నన్ను పూర్తిగా నిర్బంధించలేవు. చావు నన్ను సర్వనాశనమేమీ చెయ్యలేదు. నేను ఎప్పటికప్పుడు తిరిగి వస్తూనే ఉంటాను."
ఆ పిశాచం అతని దారికెదురుగా మళ్ళీ నించుని ప్రకటించింది. "నాలో ఏ మాత్రం శక్తి మిగిలున్నా సరే… నువ్వు తిరిగొచ్చిన ప్రతిసారీ నిన్ను చంపక మానను. నీలో శక్తి ఉంటే నన్ను చంపు. లేదా నేను పెట్టే హింసను భరించు!"
దూరాన బారుగా తెరిచి ఉన్న స్వతంత్రపు ఉత్థానం పైన అప్పటికే ప్రాణత్యాగం చేసిన ఇతర బాటసారులంతా పూర్తి యవ్వనంతో ప్రకాశించుతూ ఉత్సాహంతో గుమిగూడి, చిరునవ్వులతో అతన్ని తమ వైపుకు చేతులు జాచి ఆహ్వానిస్తున్నారు. బాటసారి వాళ్ళనడిగాడు "జీవితపు పరమార్ధం దాన్ని పరిత్యాగంలోనే ఉందా ?"
ఒక స్వతంత్ర ఆత్మ, స్వతంత్ర ఉత్థానం పైనుండీ బదులిచ్చింది - దాని గొంతు చాలా లేతగా, మృదువుగా ఉంది. "అవును భాయీ! తరతరాలుగా జీవితం ఇలాంటి కీర్తనల్నే పాడుతూ వచ్చింది. నువ్వెలా బ్రతికావన్నది, నువ్వెలా పోయావన్నది, నీ నడత ఇతరుల జీవితాల్ని ఎలా ప్రభావితం చేసిందన్నది ముఖ్యం. నీ బ్రతుకు గాని, చావు గాని, అందరి స్మృతుల్లో అమరత్వాన్ని పొందేందుకు, ఇతరుల్లో నిత్య చైతన్యాన్ని, వికాశాన్నీ రగిలించేందుకూ ఉపయోగపడాలి."
ఇది వింటూనే యువ బాటసారి పరాక్రమవంతంగా పిశాచానికి తన చాతీని ఎదురొడ్డి "ఝుళిపించు నీ ఆయుధాన్ని!" అంటూ ముందుకు ఉరికాడు. అతనిని అందాకా అనుసరించిన యువత అతని ప్రాణంలేని దేహాన్ని తమ తలల మీదుగా మోసుకెళ్తూ "మళ్ళీ నీవు తిరిగి రావాలి" అని అరిచింది.
సుదూరాన క్షితిజం వెనక నుండీ ఇంకొన్ని గొంతుకలు ఇంకో వాద్య గోష్టి వినిపించాయి.
"నీవు మ్రోగించిన ఢంకా దరువులు ఇక్కడి దివ్య ఆత్మలను తమ లయబద్ధ విన్యాసాలతో తాకాయి. నిను అనుసరించేందుకు, నీ స్థానాన్ని భర్తీ చేసేందుకు నీవంటి ధీరులు ఇంకొందరు తరలి వస్తున్నారిదిగో!"
***
English Title : The Restless Traveller : A Vignette
Written by : Kazi Nazrul Islam
Translated from Bangla to English : Dhrubajyoti Sarkar
Frontline Magazine Short Story, Nov 2024
(Free Test Translation, need a lot of improvement, suggestions welcome pl) * Permissions not taken.
Context : revolution, freedom fight.
4 comments:
Revised translation version బాగా వచ్చింది.
కథ బావుంది ఇందులో నిబిడీకృతమై వున్న సూఫీ పంథా కి దర్పణం చక్కగా కుదిరింది.
Thank you so much Andi. Means a lot to me, because I always failed @ translations.
విపుల మేగజైన్ కి పంపించండి
ఇప్పుడు విపుల లేదండీ. మూసేసారు. అయినా నావి ప్రాక్టీసు / కాలక్షేపం రాతలు. ప్రచురణ కి చెల్లవు. థాంకులు.
Post a Comment