Pages

14/05/2008

కలం - ప్రేమ



ఈ రోజు మా ఆయన షర్టు పాకెట్ లోంచీ తొంగి చూసిన ఒక పెన్ను నా దృష్టినీ, మనసునూ ఆకర్షించేసింది. పార్కర్ పెన్నులా ఉంది గానీ.. రాసినప్పుడు జెల్ పెన్ లా రాసింది. రాసింది చూస్తే... ఇంకుపెన్ను తో రాసినట్టు అనిపించింది. ఎప్పుడైనా పెన్ను కనిపించగానే టెస్టింగ్ చెయ్యడానికి నా పేరు రక రకాలుగా రాసి, మురిసిపోవడం నా అలవాటు.. ఈ పెన్ను తో రాస్తే.. నా హ్యాండ్ రైటింగ్ అదిరింది! 'ఇంక ఈ పెన్ను నాది'. అని డిక్లేర్ చేశా. పెన్ను కొట్టేసిన ఆనందం లో ఉండగా, నా పోయిన పెన్నులన్నీ గుర్తొచ్చి మనసు మూలిగింది. సరిగ్గా అప్పుడే పెన్నుల మీద నా అభిమానాన్ని... ఇంకోసారి.. నా బ్లాగ్ లో ప్రకటించాలని అయిడియా.. వచ్చింది. నా చేతి లోంచీ జారిపోయిన.. అసంఖ్యాకమైన పెన్నులను తలచుకుంటూ.. మొదలు పెడుతున్నా.



పెన్ను లంటే నాకు చాలా అభిమానం. పెన్ను నా బలహీనత! అయితే అన్ని పెన్నుల కన్న ఇంకు పెన్నులు మేలయా..! అనే ఓల్డ్ ఫేషన్ మనస్తత్వం నాది. చిన్నప్పుడు చేతి వేళ్ళ నిండా ఇంకు అలముకునేదని ఆ రోజుల్లో హేట్ చేసిన ఇంకుపెన్ను, ఇప్పుడు నా ఫస్ట్ లవ్ అయిపోయింది. చిన్నప్పుడు బాల్ పెన్ను కోసం పీకిన మనసు ఇప్పుడు ఇంకు పెన్ను కోసం పీకుతుంది. పెన్నులు పోవటం స్కూలు, కాలేజీ ల లో ఉన్నా.. ఆఫీసులో పోవటం అనేది ఒక విస్తృతమైన విషయం.



ఆఫీసులో ఎన్ని ఇంకుపెన్నులు (వాటితో పాటూ బాల్ పెన్నులు కూడా.. ) పోయాయో తలుచుకుంటే.. హృదయం గింజుకుపోతుంది. నాకు మతిమరుపు.. నిర్లక్షం.. లాంటివేమి లేవు. కానీ ఎలానో పెన్నులు మాయం అవుతుంటాయి. ఎవరికో అవసరం వస్తుంది.. నా డెస్క్ దగ్గర పెన్ను కనిపిస్తుంది.. పనయ్యాక, (మర్చిపోయి..ట!) జేబు లో పెట్టుకుని వెళ్ళిపోతారు. కొందరు ఆరోజు పెన్ను తీసుకుని రాకుండా.. (ఆఫీసుకి పెన్ను తేకుండా ఎలా వస్తారో..) వచ్చి.. ఎపుడైనా పెన్ను అవసరం పడుతుందేమో అని అప్పు / అరువు తీసుకుంటారు. మర్నాడు మనం 'మన పెన్ను' విషయం గుర్తుచేసేదాకా ఆ విషయం గుర్తుండదు. 'ఆ! అవునవును..! నీ పెన్ను తీసుకున్నాకదా ! అయ్యో ఎక్కడో పెట్టాను. ఉండుండు వెతికేసి ఇప్పుడే ఇచ్చేస్తాను..'.. అన్నారా.. ఇంక అంతే!! పెన్నుకి మనసులోనే నివాళులు అర్పించుకోవచ్చు.



ఒక్కో సారి సంతకం చెయ్యడానికి బాసు తీసుకుంటాడు. వాపసు చెయ్యకుండానే వెళిపోతాడు. అడగడానికి కొత్తలో మొహమాటపడేదాన్ని. ఇపుడు మాత్రం... ''నా పెన్ను.. నా పెన్ను..'' అని వెంటపడకపోతే, ఎంత గొప్ప ఆఫీసరైనా వాపసు చెయ్యడని తెలుసుకున్నాను. అసలు ఇలాంటి పెన్ను వాపసు చెయ్యకపోవడాలు - ఉద్దేశ్యపూర్వకంగా జరగకపోయినా, అలవాటుగా మాత్రం జరిగిపోతుంటాయి. అక్కడే నా లాంటి అమాయకులు దెబ్బ తినేస్తుంటారు.



వీటిల్లో ముఖ్యంగా ఇంకు పెన్ను పోయాకా.. నా మనసు నాలుగు రోజుల దాకా కీచు కీచు మని ఏడుస్తుంది. ఆ నాలుగు రోజుల సంతాపం అయిపోయాక.. స్టేషనరీ షాపుకి వెళ్లి ఇంకు పెన్ను అడుగుతాను. ఆ షాపు అబ్బాయి... ఎన్ని సార్లో.. 'ఇపుడు ఇంకు పెన్నులు రావట్లేదు మేడం..!' అంటాడు. నసిగి నసిగి ఆ కామ్లిన్ ఇంకు పెన్నే కొనుక్కుంటాను. ఆ పెన్ను నా చేతి కింద నలిగే దాకా.. ఆ పెన్ను మీద ఒక్కో సరి మనసు రాదు. ఒక్కో సారి చూడగానే..(రాయ గానే) నచ్చుతుంది. అదేంటో..వెంటనే... అందరికీ అదే పెన్ను నచ్చుతుంది. వారం తిరిగే సరికీ పెన్ను మాయం!



నా దృష్టి లో .. పెన్నులు రెండు రకాలు. కొన్ని పెన్నులతో రాస్తే.... నా చేతి రాత ముత్యాల్లా... పొందికగా.. అదిరిపోయేలా ఉంటుంది. కొన్ని పెన్నులు .. నా ఎల్ కే జీ రైటింగ్ ని కళ్ళ ముందు ఉంచి.. బాల్యాన్ని ఆవిష్కరిస్తాయి. ఈ మొదటి రకం పెన్నులను పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేని పని. అవి పొతే.. కొన్ని క్షణాలు నా జీవితం నిలిచిపోతుంది. సముద్రం లో కెరటాలు బండలకు కొట్టుకొకుండా.. అలానే ఆగిపోతాయి. పక్షులు టేక్ఆఫ్ పోసిషన్ లో స్టిల్ అయిపోతాయి. హృదయం మూగగా రోదిస్తుంది.. ఇంకా రకరకాలు జరుగుతాయి. ఈ మొదటి రకం పెన్నులు.. నా జీవితం లో... అమూల్యమైనవి. అవి లేని జీవితం..ఊహించుకోలేను! కానీ నిర్దాక్షిణ్యం అయిన ఆ క్షణాలని దాటి వచ్చాక.. ఇంకో మంచి పెన్ను కొనుక్కున్నాక.. కాస్త శాంతి లభిస్తుంది.



డెస్క్ దగ్గర - ఒక పార్కర్ ఇంకు బాటిలు - నా ట్రేడ్ మార్కు. కానీ ఆ ఇంకు పెన్ను వంక అందరూ మ్యూజియం లో డైనోసార్ని చూసినట్టు చూడటం చూసి నా మనస్సు గాయపడుతూ ఉంటుంది. కాస్త క్లోజ్* (అనుకునే) అయిన కోలీగ్లు.. 'ఈ రోజుల్లో ఇంకు బాటిలు ఏమిటి మేడం..!' అని వెక్కిరిస్తారు. (* నాకు నిజంగా క్లోజ్ అయితె.. నా ఇంకాభిమానాన్ని అర్ధం చేసుకునే వారు..) అలాంటి సమయాల్లోనే మన నిజమైన స్నేహితులేవరో మనకు రూఢిగా తెలుస్తుంది. నిజమైన ఆప్యాయులైతే.. నా నల్లింకు బాటిలు లో ఇంకు ని వాళ్ల ఇంకు పెన్నుల్లోకి కాస్త వొంచుకుంటారు.


ఇప్పుడు కాస్త తెలివి మీరాను. ఇంకుపెన్నులయితే పోతున్నాయని, (అసలు ఇంకు పెన్నుల్ని అందరూ ముచ్చటపడి కొట్టేస్తుంటారు) బాల్ పెన్నులు తెచ్చి, వాటి కేప్ లు తీసి పారేసి, వాటితో ఆఫీసు డెస్క్ ని అలంకరించడం మొదలుపెట్టా. బాల్ పెన్ను అయినా, కేప్ ఉంటే తప్పకుండా పోతుంది. కేప్ లేని పెన్ను పోవడం అరుదు.


అయితె ఇంకో ప్రధాన సమస్య ఏంటంటే, చేత్తో (పెన్ను తో.. కాయితం మీద...) రాయడం నాకు ఎంతొ ఇష్టం. కాని ఈ రోజుల్లో ఆఫీసులో రాసే పని ఏముంది? గవర్నమెంట్ ఆఫీసు కాబట్టి, ఫైళ్ళలో.. డాకేటింగ్ ఉంటుంది. (ఎ ఫైలు లో ఎ కాగితం ఎక్కడుందో, రాసే ఫైల్ ఇండెక్స్) అవి కూడా ప్రింట్ ఔట్ లు తీస్తున్నారు. కానీ (మళ్ళీ మళ్ళీ చెప్తున్నట్టు ..) నాకు రాయటం ఇష్టం. అయితె, ఆ రాసే యోగం నాకు లేదు. అందుకే కసి గా - ఊరికే కూర్చున్నప్పుడూ, ఫోన్ ఆన్సర్ చేస్తున్నప్పుడు, ప్యాడ్ ల మీద పిచ్చి బొమ్మలూ.. వృత్తాలూ.. లతలూ.. తీగలూ.గట్రా.. ఇంకా. మా అప్పచెల్లెళ్ళ పేర్లు రకరకాల డిజైన్ ల లో.. పేటర్న్లలో. నా పెన్నుల తో, రాస్తూంటా! ''చీ! ఈ ఆడోల్లంతా అంతే.. ఆఫీసుల్లో కూడా డిజైన్లూ, ముగ్గులూ..'' అనుకుంటూ ఉంటారు జనం. నేను అప్పటికి ప్రశాంతత మూర్తీభవించేసి ఉంటాను కాబట్టి.. వాళ్ళని చూసి కేవలం జాలి పడతాను.


చిన్నప్పుడు పెన్ను రాయక.. ఇంకు దులిపి.. ఫ్లోర్ అంతా ఇంకు చేసి..చెత్త చేసేదాన్ని. ఇంకు పెన్ను కేప్ లేకుండా కింద పడి, పాళీ విరిగి, కొంచెం ఏడిచి... తరవాత కొత్త (బంగారం రంగు లో మెరిసిపోయే) పాళీ ని (స్టీలు పాళీ ఇష్టం లేదు) వేయించుకోవడం, అప్పుడప్పుడూ ముద్దగా రాసే పాళీలో బ్లేడ్ పెట్టి, గీకి, పీకి పాకం పెట్టి, రిపేర్ చేసుకోవడం, ఇంకు మార్చాలంటే.. ఇంకుపెన్ను మగ్గులో నీళ్ళలో నానపెట్టి, కడగటం.. షాపుకి వెళ్లి, బ్లూ, బ్లాకు, రెడ్, రంగుల ఇంకు బాటిల్లు కొనుక్కోవడం.. ఇలాంటి ఇంకు పెన్ను సేర్వీసింగ్లు నన్ను ఇంకు పెన్నుకు ఎంతగానో దగ్గర చేసాయి. చాల మంది స్కూల్లో బాల్ పెన్ను రీఫ్లిళ్ళు కూడా రిపేర్లు చేసేవాళ్ళు. ఐతే అవి ఇంకుపెన్నంత కష్టం కావు.


ఇప్పుడు ఇంకుపెన్ల హవా తగ్గి, జెల్లు పెన్నులు నడుస్తున్నాయి. రీఫిలు మార్చడం లో సౌలభ్యం.. వీటిలో మంచి ఫీచర్. కొత్త కొత్త పెన్నులూ.. వాటర్ ప్రూఫ్ రీఫిల్లూ... రాసీ రాసీ.. బొటన వేలు, చూపుడువేలూ వాచకుండా... రబ్బరు తొడుగులూ కుషన్లూ ఉన్నా బాల్ పెన్నులూ.. ఇంకా.. అవేవో ఒక సారి చదివాక మాయం అయిపోయే ఇంకులూ.. ఇలా పెన్ను ల లో సాంకేతిక పరిజ్ఞానం పెరిగుతుంది. అయినా.. తరచూ పోస్ట్ ఆఫీస్, రిజర్వేషన్ కౌంటర్.. ల దగ్గర 'పెన్ను మర్చిపోయే వాళ్ల కోసం' exclusive గా దొరికే పెన్నులు కూడా ఒక్కోసారి బ్రేమ్మాండంగా రాస్తాయి. (రాయటం అంతే మామూలు రాయడం కాడు. చక్కగా.. కొన్ని నెలల పాటూ..duracell batteries లా..!!!) కొన్ని పెద్ద పెద్ద కంపెనీల ఖరీదు పెన్నులు కూడా.. సరిగ్గా మనసు గెలుచుకోక ఇబ్బంది పెడతాయి.


పెన్ను గురించి ఏమని చెప్పను.. ఎన్నని చెప్పను..? ఈ అనుభవాలకు అంతు లేదు. అందుకే నా పెన్నోపాఖ్యనం ఇంతటి తో ఆపేస్తున్నా. నా అలౌకికమైన పెన్ను ప్రేమని సానుభూతి తో అర్ధం చేసుకోండి. ఈ టపా.. పోయిన నా బుజ్జితల్లులకూ.. బంగారు ఇంకు పెన్నులకూ.. వజ్రాల బాల్పాయింట్ మరియూ జెల్ పెన్నులకూ.. అంకితం.

14 comments:

సిరిసిరిమువ్వ said...

బాగుంద మీ పెన్నోపాఖ్యానం. మిమ్ములిని కాకా పట్టాలంటే చక్కగా ఒక ఇంకు పెన్ను బహుమానంగా ఇస్తే సరిపోతుందన్నమాట.

ఒక మాట, మీ బ్లాగు background color కొంచం మార్చి, ఫాంటు కొంచం పెద్దది చేస్తే చదవటానికి ఇంకా బాగుంటుంది.

సుజాత వేల్పూరి said...

ఒక్కసారిగా Alice in wonderland లాగా స్కూలు రోజుల్లోకి తోసేసారు నన్ను! స్టేషనరీ షాపులో పెన్నుకి పాళీ వేయించుకోవడం ఒక గొప్ప జ్ఞాపకం! అల్లాగే దాన్ని బ్లేడుతో గీకి రిపేర్ చెయ్యడం కూడా! ఇప్పటికీ నా ఫేవరెట్ ఇంకు పెన్నే! దొరకడం లేదు కాబట్టి, జెల్ పెన్నుతో సరిపెట్టుకుంటున్నా! నా ఫేవరెట్ పెన్ను డిగ్రీ చదివే రోజుల్లో నా దగ్గరున్న (మెరూన్ కలర్ కి బంగారు రంగు కాప్) హీరో పెన్ను.

Sujata M said...

వరూధిని గారు.. Thanks. మీరన్నట్టు బాక్ గ్రౌండ్, ఫాంట్ మార్చేసాను. ఇపుడు ఒకే నా..?
సుజాత గారు. థాంక్స్. నాకు కూడా హీరో పెన్నులు చాలా ఇష్టం. ఒక పెన్ను దాదాపు అయిదేళ్ళు వాడాను. దాన్ని పోకుండా దాచుకోవడానికి చాలా తెలివి వాడాల్సోచ్చింది. ఇపుడు ఆ పెన్ను పనిచేయ్యట్లేదు. అయినా దాచుకున్నాను.

Sujata M said...
This comment has been removed by the author.
Rajendra Devarapalli said...

మీరు ఇంకు పెన్ను అడిగితే షాపువాడు ఏమన్నాడో అలాంటిది నాకు వేరే సందర్భంలో ఎదురయ్యింది నా బ్లాగులోరాస్తున్నా.మంచి హింటు ఇచ్చినండుకు థాంక్స్

రాధిక said...

నాకు ఇంకు పెన్నులతో ఏమీ అనుబధంలేదు కానీ తాతయ్య తన పెన్నులో ఇంకు పోసుకునేటప్పుడు నన్ను సాయం అడిగేవారు.అది చేతులకి అది అంటుకోవడంతో చిరాకొచ్చి నేనే తాతయ్యకి ఒక బాల్ పెన్ను బహుమతిగా ఇచ్చేసాను.కానీ ఎక్కడికన్నా బయటకి వెళ్ళినప్పుడు మాత్రం చొక్క జేబులో ఆ ఇంకు పెన్నే పెట్టుకొనేవారు.బగారు బొత్తల పక్కన బంగారు రంగులో మెరిసిపోయే ఆ పెన్ను తో తాతయ్య చూడడానికి భలేఉండేవారు.
నా బాగా చిన్నప్పుడు రైనాల్డ్స్ పెన్నులు ఇష్టం గా ఉండేది.వాటిని పరీక్షలకి మాత్రం కొనిచ్చేవారు.

Anonymous said...

పెన్నుల క్యాప్ తీసి ఇస్తే అవి పోవటం అరుదన్న మీ మాట చాలా నిజం. నేను బ్యాంకుకుగానీ, రిజర్వేషన్లకు గానీ వెళ్ళినప్పుడు ఎవరికైనా పెన్ను ఇవ్వాల్సివస్తే క్యాప్ తీసే ఇస్తాను. అప్పుడే అది వాపసు వస్తుంది. ఇలా చేయకముందు చాలా పెన్నులు పోగొట్టుకున్నాను. ఇక మా ఆఫీలులో ఎవరూ పెన్నడగరు. ఎందుకంటే ఎవరికైనా పెన్నిస్తే వారి పేరు జిగురు కాగితం (post-it) మీద వ్రాసి, నా పెన్ను వాపసు వచ్చేదాక మానిటర్ మీద అతికించి ఉంచుతాను.

Kathi Mahesh Kumar said...

మీ పెన్ను ప్రహసనం,పెన్ను జ్ఞాపకాలు,పెన్ను పురాణం,పెన్ను కథ,పెన్ను కోలాహలం,పెన్ను విరహం,పెన్నుప్రేమ,పెన్ను బాధా చాలా బాగున్నాయ్. జీవితం లో మీ పెన్నూ, మరెవరి పెన్నూ(మీరిచ్చిన క్యాప్ తీసిచ్చే సలహా పుణ్యమా అని) పోకుండా ఉండాలని ప్రార్థిస్తాను.

మేధ said...

నాకూ పెన్నులంటే చాలా ఇష్టం.. ఎక్కడ క్రొత్త పెన్ను కనపడినా, నా పేరుని రకరకాలు గా రాస్తాను...(మీలాగే!).. అయితే చిన్నప్పటి నుండి కూడా నా పెన్ను ఎవరైనా తీసుకున్న అది తిరిగి ఇచ్చేవరకూ, వళ్ళని వేధించేదాన్ని.. కాబట్టి నేను పెన్నులని పోగొట్టుకోలేదు అంత ఎక్కువగా!!

జ్యోతి said...

నా చిన్నప్పుడూ కూడా మూడో తరగతి నుండి పెన్నుతో రాయాలనేవారు. అంతవరకు పెన్సిలే .. మా పెన్సిల్ రాతలు పిచ్చిగానూ, పెన్ను రాతలు అందంగానూ, అవి రాయడం ఎంతో గొప్ప అనుకుంటు ఎప్పుడు ఆ అదృష్టం వస్తుందో అని ఎదురుచూసేదాన్ని.రీఫిల్ పెన్ను అస్సలు రాయనిచ్చేవారు కాదు స్కూలులో. నేను జాగ్రత్తగా ఉంచుకుంటానని నాకు కాస్త ఖరీదెక్కువ పెన్ను కొనిచ్చేది మా అమ్మ. అందులో బంగారు రంగు పాళి అంటే చాలా ఇష్టం నాకైతే. దాన్ని రిపేర్ చేయడం. ఓహ్! మళ్ళీ స్కూలు రోజులు గుర్తొచ్చాయి.
థాంక్స్ సుజాతగారు...
ఈ బ్లాగుల పుణ్యమా అని జీవిత సమరంలో యాంత్రికంగా మారిపోయిన ఈ సమయంలో చిన్నప్పటి జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ గుర్తుకుతెచ్చుకోవడం ఒక మధురమైన అనుభూతి ...

మాలతి said...

బాగుంది. ఇంకా పెన్నులమీద ప్రేమ వున్నవాళ్లున్నారని నేను అనుకోనేలేదు. :)

Sujata M said...

మేధ, జ్యోతి, రాధిక, మాలతి గార్లు.. చాలా చాలా థాంక్స్.

రాజు గారు మీ ఐడియా బావుంది.

మహేష్ గారు థాంక్స్.

uma said...

మీ పెన్నుల గోల (అదే పెన్నోపాఖ్యనం) బాగుంది... చాలా కొత్త విషయాలు తెల్సుకున్నా ఇంక్ పెన్నుల గురించి.. మీకు ఇంకు పెన్నులంటే ఎలా ఇష్టమో నాకు పెన్సిల్ అంటే అలా ఇష్టం...ఇప్పటికి ఆఫీస్ లో ఎమన్నా నోట్ చేసుకోవాలంటె పెన్సిలె వాడతా..

Narsingrao said...

మీరిచ్చిన క్యాప్ తీసిచ్చే సలహా chala Bagundi