Pages

21/08/2008

టీ వీ లో భక్తి

ఇంట్లో పెద్దవాళ్ళున్న వాళ్ళు ఈ టీవీ భక్తి అనే కాన్సెప్ట్ ను బాగా అర్ధం చేసుకుంటారు. పొద్దున్న లేవగానే ప్రవచనం, కొంత సేపటికి రామాయణం, కాఫీ, టిఫినూ అయ్యాక, కీర్తనలో - ఇంకో భాషలో ఓం నమశ్శివాయ లాంటి ఓ సీరియల్ - క్రైస్తవులైతే వారికి సువార్త సభలో, నిదర్సనాలో.... ఇలా టీ వీ లో ప్రసారమయ్యే భక్తి కార్యక్రమాలు చాలా పెద్ద యెత్తున పెరిగిపోవడం గమనించారా ? భక్తి, సంస్కృతి లాంటి చానెళ్ళే కాక, ప్రతి పాపులర్ చానెల్లోనూ భక్తి ప్రధానమైన సీరియల్ తయారు.


టీవీ భక్తి చాలా సంక్లిష్టమైనది. విశాఖపట్నం లో గురజాడ కళాక్షేత్రం లో ఏదో ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్ళాలనుకోండి - ఆ జన సముద్రంలో బండి ఎక్కడో దిగి, నడుచుకుని వెళ్ళి, లోపల ఆ కాంక్రీటు బెంచి మీద ఆరుబయట కూర్చుని, వర్షం వచ్చినా, చలి గాలి వీచినా, వీపు ఆనడానికి సౌకర్యం లేనందున ఎక్కువ సేపు కూర్చోలేక నానా అవస్థా పడాలి. కార్యక్రమం అయ్యాకా, పుస్తకాలో ఇంకొటో, కొనుక్కోవాలనిపిస్తుంది ! పైగా అంతా తొక్కిడి - శ్రమ!


మొన్న పెరేడ్ గ్రౌండ్స్ లో శ్రీనివాస కళ్యాణం గుర్తుందా - ఇలాంటి బహిరంగ కార్యక్రమాలకు వెళ్ళటం చాలా కష్టమైన పని- ముఖ్యంగా వయసు లో పెద్ద వాళ్ళకు. So, టీవీ పుణ్యమా అని వీళ్ళ పంట పండింది. ఇంట్లో నే రిమోట్ మీటలు నొక్కుతూ రక రకాల భాషల్లో - దేవుళ్ళని కొలిచేస్తున్నారు! శ్రవణం - కీర్తనం - అని ఏవో మార్గాలున్నాయి కదా - ఇప్పుడు వీక్షణం (దర్శనం కాదు) ద్వారా కూడా భక్తి ప్రకటిస్తున్నారు. చిన్న పిల్లలూ, పెద్ద వాళ్ళూ ఉన్న ఇళ్ళలో - గొడవలు వచ్చేస్తున్నయి. పిల్లలకు కార్టూన్ కావాలి. పెద్దలకు భక్తి చానల్ కావాలి.


కానీ పాపులర్ టెలివిజన్ లో భక్తి ప్రసారాలు జ్ఞానాన్ని పెంచుతున్నాయా - పెద్ద వాళ్ళు ఖచ్చితంగా భక్తి చానెలే ఎందుకు చూడాలి ? పుస్తక పఠనం లేదా ఇతర హాబీలు నిషేదమా ? ముసలైపోతే ఇంక జీవితం అంతేనా - అని కొన్ని అనుమానాలు వచ్చినా - సరే వాళ్ళకిష్టమైనది చూడనీలేమ్మని అనిపిస్తుంది.


అయితే పొద్దున్న లేచిన దగ్గర్నించీ భక్తి (టీవీ) మోత భరించగలమా ? పొద్దున్నే వీధి చివర గుళ్ళో అతి రహస్యమైన లలితా సహస్త్ర నామ స్త్రోత్రం - మైకుల్లో వినిపిస్తుంది. అది ఏదో కేసెట్టో, రికార్డో కాక ఎవరో లోకల్ భక్తురాలో, పిల్లలో చదివినది అయితే కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది.


టీవీలో రామాయణం సిద్ధం. అమ్మయ్య రామాయణం serial అయిపోయింది అనుకునేసరికీ 'ఉత్తర రామాయణం' మొదలయింది. ఇదయ్యాక - చర్చీ లో ప్రార్ధనలు - పాటలు - అదయ్యాక తమిళుల అమ్మవారి గుడిలో వారి పాటలు - తరవాత - ఇంకోటి - అయిదుపూటలా నమాజు ! ఇలా ఇంత భక్తి వాతావరణం లో జీవించేస్తే మనం ఎంత పవిత్రులం అయిపోవాలి ?


టీవీలో భక్తి ఒక్క ఇంటికి పరిమితం కాదు. అందరి ఇళ్ళలోనూ ఇదే పరిస్థితి. టీవీ కోసం పోట్లాటలు జరుగుతున్నాయని - రెండు మూడు టీవీలు కూడా మైంటైన్ చేస్తున్న వారున్నారు. నా ముసలితనం లో నేనూ దేవుని కోసం, దేవుని చేరడం కోసం అలమటిస్తానేమో!

ఇలా ఇంటా బయటా భక్తి రెండు వైపులా వాయిస్తుంటే - అయ్య బాబోయ్ ! ఎందులోనూ అతి వొద్దు నాయనోయ్ ! అనిపిస్తుంది.

టీవీలో ప్రసారమయ్యే ఇతర కార్యక్రమాలు (కేవలం వార్తలూ, భక్తీ కాకుండా) పెద్ద వాళ్ళు ఎందుకు చూడరో ఎవరూ వివరించలేరు.

టీవీ భక్తి లో శారీరక శ్రమ ఉండదు. కేబులు వాడికి (వీరి మోనార్క్ భక్తి చానెళ్ళ ప్రసారాలో ప్రస్ఫుటం) ఇవ్వల్సిన డబ్బు మినహా టికెట్టూ, లంచాలూ ఇవ్వనక్కర్లేదు. డైరెక్ట్ టు హోం ప్రసారాలలో భక్తి ప్రసారాలు తక్కువ. అందుకే కేబులు వాళ్ళ రాజ్యం నడుస్తుంది.

ముసలితనాన్ని భక్తి చానెల్తో ఐడెంటిఫై చేసుకోవడం అలవాటయిపోతున్నది. ఈ టీవీ భక్తి కి ఎడిక్ట్ అయిపోకుండా - ఇంట్లో మిగతా వాళ్ళతో కలిసి హాయిగా గడపటమో - వ్యాహ్యాళికో వాకింగ్ కో పోవడం, హాబీలు పెంపొందించుకోవడం - ఇలా ఇతర వ్యాపకాలతో పొద్దు పుచ్చే వారు తక్కువ అయిపోయారనిపిస్తుంది.


మనలో మన మాట - మీలో భక్తి బాధితులెందరు ? మైకు ల్లో భక్తీ, వీధుల్లో భక్తీ - టీవీలో భక్తీ కాకుండా - శ్రద్ధగా పూజో ప్రార్ధనో చేసుకోగల వాళ్ళు ఎంత మంది ? అసలైన ఆధ్యాత్మిక చైతన్యం ధ్యానంలో ఉందా టీవీ ప్రసారాల్లో ఉందా ?

పూర్వకాలంలో పండితులూ, పామరులూ అని రెండు రకాల వారు ఉండే వారుట. పామరులకు (చదువు రాని వారికి) చేరువగా భక్తిని, దేవుణ్ణి తీసుకుపోవడానికి భక్తిని చాలా సులభతరం చేసారుట. సులభమయిన భక్తి మరీ పలుచన అయ్యి మరి ఇప్పుడు పెద్ద వ్యాపారంగా తయారయింది. గుడికి వెళ్తే వ్యాపారం - టీవీ చూసి పెట్టీ బోల్డు వ్యాపారం ఇచ్చేస్తున్నాం ఆయా నిర్మాతలకు.


మానవ సేవే మాధవ సేవ - అదే భక్తి ! అదే దేవుణ్ణి చేరే సులభ మార్గం. అన్నీ తెలిసిన పెద్దలే భక్తి ఎడిక్షన్ చూసి కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది. మూఢ భక్తి - డ్రాయింగ్ రూం లోకి చొచ్చుకు వచ్చినప్పుడు మనలో ఎందరం దాన్ని ఎంత వరకూ ప్రతిఘటించగలం ? టీవీ చూసి మనం తరించిపోతే అంత కన్న జోక్ ఏముంది ?


ఎవరి భావాల్నైనా నేను హర్ట్ చేస్తుంటే క్షమించండి. భక్తి మాత్రమే ముసలి తనాన్ని గడపడానికి సాధనం కాదు. ముసలి తనం లో చేవ ఉన్నంత వరకూ మనం ఏదో పని చెయ్యడానికి ప్రయత్నించడం మంచిది.


ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే - అతి టీవీ భక్తి కూడా ఎడిక్షనే ! దీని బారిన పడకండి.

13 comments:

విరజాజి said...

సుజాత గారూ,
మీ నిశిత దృష్టి ఎంతో అభినందనీయం. కానీ, కొన్ని కార్యక్రమాలు మంచివీ ఉన్నాయి. ఈ రోజుల్లో దూరంగా ఉండే ఏ ఒక్క పుణ్య క్షేత్రం దర్శించాలన్నా మనకి సాధ్యం అయ్యే పని కాదు. దాని కంటే ప్రశాంతం గా ఇంట్లో పుణ్య క్షేత్రాలని, తీర్ధాలని చూసి, కనీసం అలా అయినా పెద్దవాళ్ళు తృప్తి పడడం లో తప్పు లేదు. కాకుంటే, ఎటొచ్చీ, ఈ సా.....గ తీసే సీరియల్స్ తోనే తల నొప్పి. కాస్తో కూస్తో పురాణ కదల మీద ఉన్న అభిలాషా, జిజ్ఞాసా, ఆ సీరియల్స్ తో నశించి పోతాయి. నా మటుకు నాకు గురు పౌర్ణమి రోజు షిరిడి నించి వచ్చే ప్రత్యక్ష ప్రసారం చాలా ఇష్టం. మనం కనీసం వీక్షిస్తూ, స్మరించుకుంటాము కదా... !! మనం అంతర్జాలం లో ఇలా కనబడకుండా... వినబడకుండా పలకరించుకోవడం లేదూ, అలాగే టీవీ కూడాను....!!

cbrao said...

"మానవ సేవే మాధవ సేవ - అదే భక్తి ! అదే దేవుణ్ణి చేరే సులభ మార్గం." -దేవుడి కి దూరమవుతున్న బీదా బిక్కీ, మధ్య తరగతి వారిని ఆకట్టుకోవటినికి మానవ సేవే మాధవ సేవ అని చెప్పి, స్వామి వివేకానంద, దూరంగా ఉన్న మఠాన్ని ప్రజలకు దగ్గర చేశాడు.

"తిరుపతి వెంకన్నకు ఆరు కోట్ల రూపాయల వజ్ర కిరీటం బహుకరణ - ఒక బెంగలూరు భక్తుడి చేత. " - ఇలాంటి వార్తలు చదువుతుంటే ఏమనిపిస్తుంది? ఆ డబ్బుని మానవసేవ కు ఉపయోగిస్తే! అన్న ఆలోచన కలుగుతుంది, మానవతావాదులకు. సమాజంలో అసమానతలు ఎక్కువున్న సమయంలో, ఆ డబ్బు ఇంకా ఉపయుక్తంగా ఖర్చు పెట్టే మార్గం లేదా? -అని మనసు ఘోషిస్తుంది.

పెద్ద వారు తమ శక్తి, ధన బలాన్ని మానవ సేవకు ఎందుకు వినియోగించరు?

te.thulika said...

సుజాతగారూ, బాగా చెప్పారు. అమెరికాలో మరోరకం కూడా. ఇంట్లోంచి కదలకుండా, గుడికి ఓచెక్కు పంపేస్తారు తమపేరుమీద అర్చన చేయించమని. నేను 3 గంటలు డ్రైవ్ చేసుకుని గుడికి వెళ్తే, అక్కడ కూర్చుని, ఇలా చెక్కులు పంపినవారి వందన్నర పేర్లు వినాలి గోత్రనామాలతో :(
cbrao గారూ, తిరపతి వెంకన్న పుచ్చుకున్న ధనం మళ్లీ స్కూళ్లకీ కాలేజీలకి ఖర్చు పెడుతున్నారు కదండీ..

సుజాత said...

బాగా చెప్పారు రావు గారు!
కోట్లు పెట్టి షిరిడీ సాయికి బంగారు సిమ్హాసనం, పద్మావతి అమ్మవారి భక్తుడి వజ్రకిరీటం బహూకరణ! ఇలాంటి వార్తలు చూసినపుడు బాధ కలుగుతుంది. చిరిగిన కఫ్నీ, చేతిలో డొక్కు తప్ప ఏమీ లేకుండా జీవించిన షిరిడీ సాయికి బంగారు సిం హాసనం లేకపోతే ఏమి? దాని వల్ల బోలెడంత సెక్యూరిటీ, దొంగల భయం! దాన్ని చూడ్డానికే బోలెడంత మంది మన్మాడ్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణం చేస్తున్నారు ఇవాళ హై..నించి! తీవ్రవాదుల భయం! ఆ డబ్బు సక్రమంగా వినియోగించాలంటే బోలెడు మార్గాలు! తిండి, నీడ, చదువు లేక అలమటించే వాళ్ళు బోలెడు మంది మన చుట్టూ! వాళ్ళ కోసం ఒక్క పైసా కూడా వినియోగించాలనే ఆలోచన రాదా వీళ్లకి!

సుజాతా,
ఈ భక్తి చానెళ్ల వల్ల కనీ వినీ ఎరగని బాబాలు, అమ్మలు ఏదో ఒక దేవుడి పేరు పట్టుకుని రోజూ మన ముందు ప్రత్యక్షం! ఒకావిడ అమ్మవారి ఉపాసన గురించి చెప్తుంది. మేకప్ లో ముంచి తీసిన మొహంతో! చీరెకు మాచ్ అయ్యే లిప్ స్టిక్ లేకపోతే ఆమెకు అంబ పలకదు. నగలు....! జనం తమను గమనిస్తుంటారేమో అన్న ఆలోచన కూడా రాదు!

ఈ భక్తి చానెళ్ళ వల్ల బాధ్యతలు మర్చిపోయి బాధలు వచ్చినపుడు కర్తవ్యాన్ని మర్చి ఈ బోధలు వింటూ కూచోవడం ఎక్కువైంది. ఈ చానెళ్ళు మా టీవీలో ఎక్కడున్నాయో కూడా నాకు తెలియదు. అందువల్ల నేను వీటి బాధితురాలిని కాదు. వీటి కంటే జీ సినిమాలో C క్లాసు సినిమా చూడ్డానికి ఇష్టపడతాను నేను!

నా ముసలి తనంలో ఈ భక్తి దేవుడి కోసం అలమటించను. ఎందుకంటే దేవుడు గుళ్లలోనూ, బాబాల చేతుల్లోంచి జారిపడే విభూదుల్లోనూ ఉండడని నమ్మేవాళ్లలో నేనొకరిని! దేవుడికి రెండు వేలు పెట్టి లక్ష మల్లెల పూజ చేయించడానికన్నా, ఒక విద్యార్థికి ఫీజు కట్టడానికి ప్రాముఖ్యం ఇస్తాను నేను! 5 వేలు కట్టి కళ్యాణం చేయించడం కన్నా, అనాధ శరణాలయంలో పిల్లలకు పుస్తకాలు కొనివ్వడంలో సంతోషం నాకు!

చ, ఏంటేంటో రాసేసాను, ఆవేశంలో! మంచి టపా రాశారు.

అశ్విన్ బూదరాజు said...

కొండ దగరకు మహమ్మద్ రాకపోతే,, కొండే మహమ్మద్ దగ్గ్రకు వస్తుంది అన్న సామెత గుర్తొచింది మీ టపా చూస్తే

Falling Angel said...

టాటా స్కై Ad చూశారా!!! నాకు సింపుల్‍గా పిచ్చెక్కింది!!

Is that intentional comedy or is it just me??

sujata said...

విరజాజి - మీరన్న మాట నిజమే ! కానీ ఎంతసేపూ దానికే అతుక్కుపోకుండా నలుగురికీ పనికొచ్చే పని చెయ్యడం మంచిది అని నేను అనుకున్నాను.

సీ.బీ. రావు గారు - చాలా చక్కగా చెప్పారు !

మాలతి గారు - థాంక్స్.

sujata said...

సుజాత గారు - బాబోయ్ ! ఎంత నిజం ! ఎంత ఆవేశం ?! హైదరాబాద్ లో వాలంటీరింగ్ చేస్తారా 'సు ' ?!

అమ్మలు, బాబాలూ - రాత్రికి రాత్రే ధనవంతులయిపోతున్నారు. నాలుగు మంచి ముక్కలు చెప్తున్నారు కదా, ఇంత బాగా చెప్తున్నారు కదా అని అందరూ భక్తి టీవీ కార్యక్రమాలకు అతుక్కుపోతున్నారు. వీటిల్లో నిజమైన ఆధ్యాత్మిక సాధనలు మరుగైపోతున్నాయి. రెండు - శ్రావణ మాసం లో చూడండి - ఆ పూజలూ అవీ ఏవో సర్కస్ లాగా అన్ని రకాల అలంకరణలూ, ప్రదర్శనా, ఆర్భాటం - సాంప్రదాయం పేరిట జరిగే ఒక పెద్ద తంతు. కొన్ని సాంప్రదాయాలు ముచ్చటగానే ఉన్నా, వీటికి మించిన జీవిత సత్యాలను తెలుసుకోవడానికి కొంచెం ప్రయత్నిస్తే, మనం కొంచెం ఎదిగినట్టు !


అశ్విన్ గారు - మీరన్నదీ నిజమే. దేవుడు మన డ్రాయింగ్ రూంకే వచ్చేస్తున్నాడు. ఇంతకన్నా కావల్సిందేముంది ?

sujata said...

ఫాలింగ్ ఏంజెల్ గారు - టాటా స్కయ్ ఏడ్ జోక్ కాదు ! 100% సీరియస్! అవన్నీ ఇప్పుడు కాసులు కురిపిస్తాయి అని వాళ్ళు గ్రహించేరు! భక్తి ఇప్పుడు పెద్ద వ్యాపారం.

sujata said...

మాలతి గారు - తిరుపతి లో మనం ఖర్చు పెట్టే డబ్బు అంతా ధర్మ ప్రచారానికీ, సంఘ సేవకూ, భక్తులకూ, పేదలకు - దేవస్థానం చేపట్టిన వివిధ కార్యక్రమాల ద్వారా చేరుతుంది. అయితే రాను రాను తిరుమల రెవెన్యూ జెనెరేషన్ మీదే దృష్టి పెట్టడం, రాజకీయ వేదిక కావడం, ఇంకా జటిలమౌతున్న అవినీతిపరత్వం... ఇవన్నీ ప్రజల బలహీనత (అతి భక్తి) ను సొమ్ము చేసుకోవడానికే జరుగుతున్నాయి. అదృష్టవశాత్తూ దేవస్థానం 'అన్న దానానికీ, వృక్ష, పశు సంపద అభివృద్ధికీ..' ఇలా స్పెసిఫిక్ గా విరళాలు వసూలు చేస్తోంది. ఇది నిజమైన మాధవ సేవ అనగా -మానవ సేవ చేద్దామనుకొనే వారికి కొంచెం అవకాశం కలిగించింది.

Purnima said...

హద్దుల్లేని సంగీతం కోసం యుద్ధాలు!! చెప్పాల్సిన వార్తలను కథలల్లే అల్లి మభ్యపెట్టడం!! బంధాలను, బంధనాలను "మెలోడ్రమాటిక్" గా లాగి లాగి ఉరితీయడాలు!! భక్తి, రక్తి, భుక్తి ఏదైనా టి,ఆర్,పీ కోసమే!! టి.వీ జగత్తంతా "టి.ఆర్.పీ"ల మయం!!

@falling angel: i'm with u!! It just drives you crazy!!

కత్తి మహేష్ కుమార్ said...

...ఎప్పుడూ మాసిన జీన్సులో తిరిగే కుర్రాడు హఠాత్తుగా తెల్లటి జుబ్బా తొడుక్కుని దేవుని ఎదుట చేతులు జోడిస్తాడు...ఎప్పుడూ కనీసం పట్టించుకోని టీచర్ కి ఒకమ్మాయి సడన్ గా నమస్కారం పెడుతుంది...ఎప్పుడూ నల్లడబ్బుని ఎలా తెల్లగా చెయ్యాలో చప్పే ఫైనాన్సియల్ కంసల్టెన్ట్ తన క్లయింటుకి, మోసం తప్పు అని చెబుతాడు...ఎప్పుడూ పిల్లలపై చిరాకుపడే అమ్మ ప్రేమని, సహనాన్నీ కురిపిస్తుంది....

కట్ చేస్తే...అదొక భక్తిఛానల్ ప్రకటన. వీళ్ళందరూ ఈ ఛానల్ చూస్తుండటం వలన, మంచి అలవాట్లు, సాంప్రదాయాలూ అలవడ్డాయన్నమాట.

భగవంతుడికి పెద్ద ‘మార్కెట్’ ఉంది. భక్తికి చాలా ‘సేలబిలిటీ’ ఉంది. వెంకటేశ్వర సుప్రభాతాన్ని ఏదోఒక కూల్ డ్రింక్ కంపెనీవాళ్ళు త్వరలో స్పాంసర్ చేస్తారు చూడండి.

siri said...

నమస్తే సుజాత గారు,

ఇంతక్రితం మీ బ్లాగ్స్, కామెంట్స్ అడపా దడపా చూశాను కాని అప్పటికి నాకు తెలుగులో కామెంటడం రాదు. ఈరోజు నెమలికన్ను మురళిగారి పుణ్యమా అని అన్నీ ఒక్కసారే చదవగలిగాను. ఎక్కడా టాపిక్ డీవియేట్ కానివ్వకుండా భలే రాస్తున్నారండీ. ఇంటెరెస్టింగ్.

మీరన్నట్లుగానే ఈమధ్య భక్తి వెర్రి తలలు వేస్తోంది. ఇంట్లో పిల్లల కంటే పెద్దవాళ్ళే టీవి కి ఎక్కువ ఎడిక్ట్ అయ్యారనిపిస్తోంది. వాళ్ళు చూడటం కాకుండా అలాంటి కార్యక్రమాలు చూడనందుకు మనకి విమర్శలూ, పిల్లలకి అంత గొప్ప భక్తి సన్స్కారాలు అలవరచటం లేదని తిట్లూ. అలా అని ఈ ప్రవచనాలు, ధర్మసూక్ష్మాలూ తెలుసుకుని ఏమన్నా మారతారా అంటే అది శూన్యం, ఎవరిలోనూ క్రోధ, మోహాది గుణాలేమీ తగ్గిన ఆనవాళ్ళు లేవు. ఏదయితేనేమి చానెళ్ళు బాగు పడుతున్నాయి.

శ్రీరాగ