Pages

19/08/2008

నేనొచ్చేసా! ఊర్నించి !!




...... వచ్చీ సరికీ.. నా బ్లాగ్ లో అదెప్పుడో యూట్యూబ్ షేర్ ఆప్షన్ లో పోస్ట్ చెయ్యడానికి ప్రయత్నించి విఫలమయిన మూడు పోస్టులు ప్రత్యక్షం అయ్యాయి. ఇదొక ఆశ్చర్యం. దీని సంగతేమిటో తెలియలేదు. పెద్ద బ్లాగర్లు చెప్పాలి.

ఊర్లో ఉండగానే - ఈ విషయం నా మెయిల్ ద్వారా తెలిసి, ఒక పోస్టుని చెరిపేసాను. ఇప్పుడు తిరిగొచ్చి, నా బ్లాగు బాగోగులు చూసుకుంటూ.. సరే నా సెలవు ల సంగతి కూడా చెప్పాలనిపిస్తే - ఈ సోదంతా రాస్తున్నాను.


వెళ్ళేటప్పుడు ఆర్.ఏ.సీ లో కూర్చోవడానికి మాత్రం - సీడు లోయెరు బెర్తు దొరికింది. సుజాత గారే గుర్తొచ్చేరు. మా ఇద్దరికీ తెలిసిన సీక్రెట్లన్నీ గుర్తొచ్చేయి! కొన్ని ఫీలింగ్స్ కలగాపులగం అయిపోతుండగా.. నా సహ-పాంధుడు గారు జేబు లోంచీ సెల్ ఫోను తీసి, దానికి చెవి వాణి తగిలించి (ఇయర్ ఫోన్లు ) ఇక కబుర్లు అందుకున్నారు. కనీసం నాలుగు గంటలపాటు ఆయన ఇప్పటి జన్మ రహస్యాలూ, ఆయనకొచ్చిన ఎప్రైసలు సెనక్కాయలూ, దాని గురించి ఆయన భావనలూ, బలాలూ, బలహీనతలూ, ఉద్యోగం, సామజిక స్థితి అన్నీ - అదీ ఇదీ అని కాకుండా ఏకమొత్తంగా ఏకపాత్రాభినయం తో సినిమా చూపించేసారు! క్లైమాక్స్ లో ఏముండేదో గానీ చాలా అదుర్ష్టవశాత్తూ, నాకు బెర్తు దొరికింది.


ఈ లోగా ఆ దగ్గర్లోనే కూర్చున్న ఇతర పాత్ర ధారులంతా కూడా చాలా మటుకూ జీవితాన్ని పాకెట్ దూరవాణుల్లో శృతించేసుకుని తమ కార్య కలాపాలను చెక్కబెట్టేసుకున్నారు ! ఇందరి మాటల్ని చెవి ఒగ్గి (బలవంతాన) వినవలసి రావడం నా దురదృష్టం - అదేంటో నాకెవరూ ఫోన్ చెయ్యరు ! చేసినా, నీకు బెర్తు దొరికిందా అని ఆందోళనో, హేపీ జర్నీ అని శుభాకాంక్షో విసిరేసి, వెంటనే ఫోను పెట్టేస్తారే కానీ - ''అమ్మాయ్ ! ఏదీ నీ జీవిత కధనం చెప్పు !'' అనరు.



నేను చాలా ప్రైవేటు మనిషిని. నాకు ప్రైవసీ అంటే ప్రాణం! అది ఎవరి ప్రైవసీ అన్నా సరే - దాన్ని అవసరం కన్నా ఎక్కువ గౌరవించేస్తూ ఉంటాను ! వీళ్ళెవరికీ వాళ్ళ ప్రైవసీ అంటే గౌరవం లేకపోతే పోయే - కనీసం నా ప్రైవసీ లోకి చొచ్చుకు వచ్చేసి వాళ్ళ సెల్ సంభాషణల్లోకి నన్ను ఇరికించడానికి ఎందుకా విశ్వప్రయత్నం చేస్తున్నారా అనిపించించింది.



వీళ్ళు ఇలా మాట్లాడి - ఉదా : మీకు విడమరచి చెప్తానుండండి - ఒకాయన లాప్ టాప్ బాగు తీసుకొస్తాడు - తల మీద జీన్స్ టోపీ, దాని మీద అదిరిపొయ్యే స్లోగనూ, ఖాకీ రంగు జీన్ ఫాంటూ, నీలం రంగు కాఫీ షర్టూ వేసుకుని ప్రత్యక్షం అయ్యి, ఫోను తీసి - అయాం ఫలానా అండీ గురువు గారూ - అయాం సో సారీ అండీ - మాది ఒక ఫర్మ్ అండీ - నా పార్ట్నర్ మన రాయశేఖర్ రెడ్డి కొడుకు లేడండీ - జగన్ - అతని క్లోసు ఫ్రెండ్ అండీ - వుయ్ హావ్ టూ ఆఫీసెస్ అండీ! ఒన్ బ్రాంచ్ ఈస్ అట్ బేగంపెట్ అండీ - సెకండ్ ఈస్ అట్ గచ్చిబౌలి అండీ !...... అని ఒక రెండు గంటల సేపూ చెవి కోసిన మేక లాగా పెద్ద గొంతు తో అరుస్తూ ఉంటే ఆ మనిషి మీద ఎటువంటి అభిప్రాయం కలుగుతుంది ? బాబొయ్ ఈయన మాట్లాడ్డం ఎప్పుడు కట్టేస్తాడా అనిపించదూ ? పైగా - అయాం నియర్ అట్ రాజమండ్రి అండీ ! అని హస్కీ - మాచో వాయిస్ తో కనీసం ఒక ముప్పయి మందికి ఫోను చేసి చెప్తుంటే - కొన్ని సార్లు జీవితం మీద విరక్తి కలుగుతుంది!


ఇలా నా రైలు ప్రయాణం రక రకాల ప్రయాణీకులూ - వారి సెల్ మోడెళ్ళూ, వారి జీవితాలనూ స్పృశిస్తూ (లిటరల్ గా కాదు లెండి) సాగిపోయింది. నాకు అత్యవసరమైతే తప్ప సెల్ ఫోన్లో మాట్లాడబుద్ధెయ్యదు ముఖ్యంగా ఎ.సీ. కోచుల్లో! ఎవరైనా నా మాటలు వింటారేమో అనే స్ప్రుహ నాకు ఉంటుంది. విన్నారే పో - అయితే నాకేంటి అనే అలోచన నాకు రాదు. ఎందుకులే నావల్ల వారికి డిస్టర్బన్స్ అనిపిస్తుంది. నా ఈ దృక్పధం తప్పేమో తెలియదు.


ఊరెళ్ళి - అనుకున్నట్టు గానే మా అక్క నూ చెల్లినీ కలుసుకుని - సంపత్ వినాయకుడి గుడికీ, వేంకటేశ్వరాలయానికీ, బీచ్ కీ వెళ్ళొచ్చేసేను. ఋషికొండ వెళ్ళలేకపోయాను. సింహాచలం గ్రహణం సందర్భంగా మూసెయ్యటంతో అది కూడా చూడలేదు. మా చెల్లీ నేనూ కొంచెం ఫోటోలు తీసి - కళాపోషణ కూడా చేసేము ! ఒక సాయంత్రం అక్క, నేనూ కలిసి - ఇంట్లో గాన కచేరీ చేసేము. ఇంతలో అక్క కొడుకు కూడా పాట అందుకున్నాడు ! వీడికి ఎలా అయినా సంగీతం నేర్పించీయాలని అక్క మీద ఒత్తిడి తెచ్చేము! చాలా పెంకితనం, ఇష్టమయినవి తినడం, ఇష్టమయిన కుర్చీ కోసం కొట్టుకోవడం, షాపింగ్ చెయ్యడం, టీవీ లో సినిమాలు చూడటం - ఇలా బోల్డంత సందడి చేసి గప్ చుప్ గా సోమ మంగళ వారాల్లో ఎవరి ఆఫీసులకీ /ఇళ్ళకీ వాళ్ళం ప్రయాణం కట్టేము !


తిరిగొచ్చేటప్పుడూ, సెల్ బాధలు పడ్డాను తోటి ప్రయాణీకులతో - అయితే ఇక్కడ కొంచెం పుస్తకపఠన సౌకర్యం కలిగింది. ఇక్కడ కొంచెం ప్రేమ బాధ కూడా పడ్డాను. ఇద్దరు రొమాంటిక్ కపుల్ - ఒక పెళ్ళయిన జంట, ఒక పెళ్ళి కాని జంట - వాళ్ళ ప్రేమ - రొమాన్సూ చూసే సౌభాగ్యం కలిగింది. At last, మా ఆయన కి ఒక ఎస్.ఎం.ఎస్. చేస్తే ఫోన్ చేసారు ! నేను కూడా ఏదో చించేద్దాం - ఫోను నాకూ ఉన్నట్టు అనుకుని డిసైడ్ అయ్యేసరికీ కాల్ కట్ అయింది. నా మొహం లానే మా రొమాన్సూ ఏడిచిందనుకుని, పుస్తకం చదువుకుని, పదిన్నరకి పడుకున్నాను. తెల్లారేసరికీ సికందరాబాదు - అదే ఆఫీసూ, అదే బాసూ, బాసు చెంచాలూ, ఫోర్కులూ - అదే ఇల్లూ చూసి ఏడుపొచ్చింది !

28 comments:

Anonymous said...

వెలెకమ్ బాక్ సుజాత గారూ..
భలే వాళ్ళేనండీ..They say there is no place like home on this earth..right...వెల్...నాకయితే ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు ఏదో మీరెళ్ళినట్లుగా కొద్ది రోజులకి మా ఊరొస్తే బాగుండేది కాని, సమ్మర్ హాలిడేస్ లో రెండు నెలలు ఉండాలంటే మాత్రం నాకూ ఏడుపొచ్చేది. ఎప్పుడు కాలేజి కి వెళ్ళిపోదామా అని చూసే వాణ్ణి. మీరు కూడా ఓ రెండు నెలలు వెళ్ళి వచ్చి ఉంటే, మీ ఇల్లు(even మీ workplace) అంతా బాగా కనబడేది అని అనుకుంటున్నా. ఎక్కువ మాట్లాడినట్లుగా అనిపిస్తే క్షమించండి .

ఇంతకీ "నీలం రంగు కాఫీ" కలర్...ఎంత కళ్ళముందు గుండ్రాలు తిప్పి కష్టపడ్డా, ఆ కలర్ ఎలా ఉంటుందో కళ్ళముందుకి రావట్లేదు. హెల్ప్.

అలాగే, "హస్కీ..మాచో వాయిస్" అంటే ఎలాగుంటుందో ఊహించుకోవడనికి ప్రయత్నిస్తున్నా.
You mean something like 'Saif Ali Khan's Voice"?

cbrao said...

"అదే ఇల్లూ చూసి ఏడుపొచ్చింది !" -మీ సెలవులు చిన్నగా వుండటం తో కలిగిన అనుభూతి ఇది. ఇంగ్లాండ్ నుంచి భారత దేశం వచ్చినప్పుడు మీకు అట్లా అనిపించి ఉండదు. మీకు బాగా తెలిసిన హైదరాబాదు, మీ ఇల్లు మీకు కొత్తగా అనిపించి ఉంటాయి. జీవితం ఒక పుస్తకం లాంటిది. ప్రయాణం లోని మజా అనుభవించని వారు పుస్తకం లో చదివేది ఒక పేజీ మాత్రమే. గమ్యస్థానాన్ని కాక గమ్యస్థానానికి వెళ్లే ప్రయాణాన్ని అనందించండి. జీవితం ఎంతో మధురంగా ఉంటుంది.

Kathi Mahesh Kumar said...

బాగుంది మీ ప్రయా(స)ణం.

సుజాత వేల్పూరి said...

అయితే మీకు ఈ ట్రిప్పులో నాకు RAC వద్దు అనిపించుండాలే! సరే మీ ఫోన్ నంబర్ ఇవ్వండి, మీరు రైలు ఎప్పుడెక్కుతారో కనుక్కుని 'అమ్మాయ్, ఏదీ అందుకో నీ జీవిత కథ 'అని నేనడుగుతా ఫోన్లో!

నాకైతే ఒక వారం పాటు వెకేషన్లో తిరిగొచ్చినా సరే ఇంటికి రాగానే "హమ్మయ్య, ఇంటికొచ్చేసాం రా బాబూ(ఫిల్టర్ కాఫీ తాగి వారమైంది)" అనిపిస్తుంది. రావు గారు చెప్పినట్టు సెలవులు తక్కువ కావడం వల్ల అల్లా అనిపించిందేమో!

కల said...

welcome back.

ప్రయాణంలోని మజా అనుభవించాలంటే మనం ఏకాంతంగా మారిపోవాలి. నాకు మటుకు A/C కోచ్ అంటేనే చిరాకు. ఏంటో తలుపులేసి మనల్ని బంధించినట్టు అనిపిస్తుంది. అదే స్లీపర్ లో అయితే వెనక్కి వెళ్ళే చెట్లు, అల్లరి పెట్టె గాలి అబ్బో కొద్దిగా రొమాంటిక్ గా ఉంటుంది. కాకపొతే కొద్దిగా గోలగోలగా ఉంటుంది.
కానీ ఒంటరిగా ప్రయాణించాలంటే కొద్దిగా కష్టమే మరి.

Rajendra Devarapalli said...

అయితే సుజాత గారు మీరు నా ఈ http://visakhateeraana.blogspot.com/2008/06/blog-post_19.html
టపా అసలు అంటుకోలేదన్నమాట??వైజాగు వచ్చినప్పుడు ఒక్కచిన్న కాకి పిల్లతో కబురంపిస్తే వచ్చి కలిసేవాళ్ళం కదండీ ఇంటిల్లిపాదీ హయ్యో!!!

MURALI said...

మీరు ఏ ఏ రొజుల్లో ఏ ఏ రైల్లో ప్రయాణించారో చెబితే మేము ఆనందిస్తామండి. అసలే ఇందులో ఉన్న వ్యంగ్యాస్త్రాలు మాకు గాని చెందుతాయా అని భయం పట్టుకుంది. అమ్మతోడు నేను వైజాగ్ బస్సు లోనే వెళ్ళాను. వచ్చేప్పుడు ఈ రోజే విశాఖ లో వచ్చా. నాది జీన్స్ క్యాప్ కాదు బ్లాక్ క్యాప్. ఇంక ల్యాప్టాప్ బ్యాగు, సెల్లు పోను అంటే ఉన్నాయి మరి. కానీ ఫోను ఎక్కువ మాట్లాడటం అంటే మరీ... స్నేహితులు ఎక్కువ కదండీ. మీరు చెప్పినది నా గురించి మాత్రం కాదని మనస్పూర్తిగా అనుమానిస్తున్నా.

Srividya said...

బావున్నాయి మీ ప్రయాణం విశేషాలు. అదేంటో నాక్కూడా అస్సలు ఫోన్లు రావు... మీకుమల్లే :(

కొత్త పాళీ said...

very nice :)

మాలతి said...

అవునండీ ఈ ఏకపాత్ర భాషణలు సెల్లుల్లో నాక్కూడా మహ చిరాకు. మరో సీను నిద్గర్లో మాటాడేవాళ్లు. అవతలివారు స్క్ర్రిప్టు తెలీక మహ చిరాగ్గా వుంటుంది నాకు :)

Sujata M said...

ఇండిపెండెంట్ గారు - థాంక్స్. నీలం రంగు కాఫీ షర్ట్ అంటే మాసిన నీలం రంగు టీ షర్ట్ ! వాయిస్ - దాదాపు అలాంటిదే గానీ కొంచెం కరణ్ జోహార్ లా కూడా ఉంటుంది.


సీ.బీ.రావు గారు - మీరన్నది నిజం. ఎక్కువ రోజులు సెలవులు గడిపి ఉండాల్సింది. అప్పుడు ఇల్లు నచ్చుండేది.

మహేష్ గారు - నా బాధ బాగా అర్ధం చేసుకున్నారు.

సుజాత గారు - ఈ సారి నిజ్జం గానే ఫోన్ నెంబర్ ఇచ్చేస్తాను చూస్కోండి ! మా ఇంట్లోనే(విశాఖ లో) బ్రెమ్మాంఢమైన ఫిల్టర్ కాఫీ దొరుకుతుంది! సికందరాబాద్ లో ఇన్స్టంట్ కాఫీ ! అందుకే నిజానికి ఏడుపొచ్చింది.

కల గారు - మీరన్న మాటా నిజమే. కొంచెం ప్రశాంతం గా ఉంటే చదువుకోవచ్చు - కిటికీ ల్లోంచీ బైటికి చూసుకోవచ్చు !

రాజేంద్ర గారు - ఈ సారి మీ ఇంటి మీద దాడి చేస్తాను తప్పకుండా ! చాలా థాంక్స్.

Sujata M said...

మురళి గారు - నేను ఈ వ్యంగ్య వ్యాఖ్యలు ఆ ఫలానా ఆయన మీదే చేసినా - అల్లాంటి వ్యక్తులు తరచూ మనకు తారసపడుతూ ఉంటారు గాబట్టి కొంచెం ఎక్కువగా వర్ణించేసేను - మీరు ఎంత చక్కగా నీట్ గా ఉన్నారు - పైగా బ్లాగరు ! మిమ్మల్ని అనడానికి నాకు ఎంత ధైర్యం ?! మీ అనుమానం ఖచ్చితంగా నిజమే.


శ్రీ విద్య - నాకు తెలిసి అమ్మాయిలకు సెల్ ఫోన్ దురద తక్కువ - అయితే ఒకటి - సెల్ భాష మీద పట్టు అమ్మాయిలకు ఎక్కువంట - అందుకే ఎస్.ఎం.ఎస్. లు చెక్కగా చేసేది, ఎక్కువ ఎస్.ఎం.ఎస్.లు పంపేదీ అమ్మాయిలేనంట ! అమ్మయిల బలహీనత ఎస్.ఎం.ఎస్. అనుకుంటాను.


కొత్త పాళీ గారు - థాంక్స్.

మాలతి గారు - నా భావన మీకు అందరికన్నా బాగా కన్వే అయిందనిపించింది. చాలా థాంక్స్!

నిషిగంధ said...

welcome back sujAta gAru! ఫోటోలు చాలా బావున్నాయి... అసలు సెల్ ఫోన్ కొనేముందు కనీస మర్యాదల క్లాసొకటి పాసవ్వాలని రూల్ ఉంటే బావుండును!!

మాలతి గారు అన్నట్లు వన్ వే స్క్రిప్ట్ వినడానికి చిరాకనిపించినా కొంతమంది చుట్టుపక్కల వారి సౌకర్యార్ధం అవతలి వారి సొద కూడా మాట్లాడేస్తుంటారు.

"మీరూ రావొచ్చుగా సర్దాగా.. అయ్యో కుదరదా.. సెలవలు లేవంటారా.. ఇంకోసారి ప్రయత్నించొచ్చుగా.. మానేజర్ ఒప్పుకోకపోతే ఇంకేం చేస్తాం.. టూ బాడ్!"

ఇలా!!

Unknown said...

మీ బ్లాగులో మీ గిటారు బొమ్మ చూసాను.బుజ్జి ముండ ఎంత బావుందో.దాని మీద మీరు మీకు బాగా నచ్చిన బాగా వచ్చిన అన్నమయ్య సంకీర్తనను మాకెప్పుడు వినిపిస్తారు.ఆత్రుతతో ఎదురు చూస్తుంటాను.

Sujata M said...

నరసింహ గారు - గిటారు వాయించడం నేర్చుకుంటున్నానింకా.. దానిమీద కీర్తన వినిపించేంత సీను ఇంకా లేదు. మీకు ధైర్య సాహసాలుంటే ఎప్పుడన్నా - పాడేసి వినిపించగలను. (కుంచెం బానే పాడతాను లెండి! ఎక్కువ భయపడొద్దు) అవకాశం ఆ భగవంతుడే కల్పిస్తే, శొభారాజు గారి లాంటి పెద్దల చేత నిర్వహింపబడే క్లాసులు దొరికితే, నేర్చుకోవాలని ఉంది.

Sujata M said...

నిషిగంధ - థాంక్స్. బాగా చెప్పారు. నాకు మీ వ్యాఖ్య చదవగానే రెండు రెండు ఆరు గారు (క్రికెట్ మాచు - ఇండియా - పాకిస్తాను) గుర్తొచ్చారు.

Sujata M said...
This comment has been removed by the author.
Unknown said...

రైలు కబుర్లు భలే !
రైల్లోనే కాదు బయట కూడా ఇరిటేటింగే ఈ బాపతు.

ఉదా: మా ఆఫీసు కాబులో కూడా ఇలాంటి జనాలున్నారు. మొబైలు ఫోను వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళ స్వీటు నథింగ్స్ కూడా వినొచ్చు. :-)

MURALI said...

ఏంటి సుజాత గారు ఈ టైంలో వ్యాఖ్యలు రాసిన వారిని చీల్చి చెండాడుతున్నారా?

Anil Dasari said...

సెల్లోళ్ల తెంగ్లీషు బాగుంది - ఆంగ్ల వాక్యాల వెనక 'అండీ' చేరుస్తూ. పదేళ్ల క్రితమనుకుంటా, సెల్లులొచ్చిన కొంగ్రొత్తలో ఒకతను 'ఫలానా ఆయన రెండ్రోజుల క్రితం డెడ్డయ్యారండీ' అని ఫోన్లో ఎవరితోనో చెబుతుంటే పక్కనుండి విన్న నాకు అదో పట్టాన అర్ధం కాలేదు.

spandana said...

బాగా చెప్పారు. నాకిక్కడ రోజూ ఇలాంటి నసే ఇంకోటి వుంది. సెల్లుఫోన్లు కాదు గానీ మ్యూజిక్ హోరు. మెట్రో రైళ్ళలో "చెవి వాణి"లు లేకుండా పాటలు, రేడియో గట్రా వినడం నిషేధం. అయితేనేం పేరుకయితే చెవికి తగిలించుకొనే వింటూ వుంటారు గానీ రెండు సీట్లవతలికి కూడా వినిపిస్తూ వుంటుంది ఆ హోరు. అవి చెవులా లేక ఇనుప గోళాలా అనిపిస్తుంది నాకు. దానికి తోడు తలలు వూపుతూ వీలయితే కాళ్ళు చేతులూ వూపుతూ బాబోయ్!

--ప్రసాద్
http://blog.charasala.com

Sujata M said...

ప్రవీణ్ గారు - మీ ఉదాహరణ బావుంది. వేరే వాళ్ళ స్వీట్ నథింగ్స్ వినడం కొంచెం ఇబ్బందే! కానీ తప్పించుకోలెము !

మురళి - మీ వ్యాఖ్య అర్ధం కాలేదు. ఏ టైం లో ? చీల్చి చెండాడాడం ఏమిటండోయ్ ?

Sujata M said...

అబ్రకదబ్ర గారు - భలే చెప్పారు - నవ్వలేక నేనూ డెడ్డయ్యాను అండీ !


ప్రసాద్ గారు - థాంక్స్. మీరు చెప్పిన విషయం వింటే - ఒక ఐడియా తట్టింది. దాన్ని త్వరలోనే బ్లాగుతా ! తప్పక చదవండి !!! ('గొప్ప పోస్టు - త్వరలో విడుదల ' అనే లెవెల్లొ చెప్తున్నానా?)

రాధిక said...

ఫోనుల్లో అనే కాదు,అసలు గట్టిగా మాట్లాడేవారంటేనే నాకు అంతగా ఇష్టముండదు.అదీ గాక రైల్లో మనమేదో దొరికిన ఏకాంతాన్ని సద్వినియోగం చేసుకుందామనుకుంటే నిర్దాక్షణ్యం గా భంగం కలిగించేస్తారు.అదేదో తమ హక్కులాగ.
రైల్లో కిటికీ పక్కన కుర్చుని అలా బయటకి చూసేవారన్నా,పుస్తకం పట్టుకుని చదువుకునేవారన్నా నాకు చాలా గౌరవం.కానీ అందరూ పడుకున్నాకా కూడా లైటు చేసుకుని మరీ పుస్తకం చదివేసేవాళ్ళంటే మాత్రం .......

MURALI said...

నిన్న మీ టపాకి వచ్చిన వ్యాఖ్యలకి late night స్పందిస్తూ ఉంటే అడిగా అంతే.

Sujata M said...

రాధిక - మీరు చెప్పింది నిజమే ! కానీ నేను ఆ రోజు కష్టపడి మేలుకునున్నాను - చదువుతూ - ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళెవరూ లైట్ ఆర్పుదామని / బెర్తులు వేసుకుందామనీ ప్రయత్నించనే లేదు ! పదిన్నరకి నేనే లేచాను - అయ్యా నేను నిద్రపోతాను అని చెప్పి !

Sujata M said...

మురళి - నాకు ఖాళీ దొరికేది ఈ దెయ్యాలు తెరిగే వేళలోనే! అందుకే నా బ్లాగు ఇలా ఏడుస్తుంది ! నిద్ర మత్తులో ఏమి రాశానో అని గాభరా పడుతూ ఉంటాను అప్పుడప్పుడూ. చాలా సార్లు తప్పులు చేస్తాను. కొలంబియా బదులు కంబోడియా రాస్తాను ! అది నా బలహీనత !

MURALI said...

నాది కూడా ఇదే సమయం అండి. బ్లాగడానికైనా, వ్యాఖ్యానించడానికైనా.