Pages

24/06/2008

మా అమ్మ



సాగర తరంగాలు, సువర్ణ సైకతాలు, యాత్రీకుల విశ్వాసాలు
రామేశ్వరం మసీదు వీధి, అన్నీ కలిసి ఒక్కటైతే
మా అమ్మ !

అమ్మా ! నన్ను స్వర్గ వాత్సల్యంతో చేరవచ్చావు
జీవితం ఒక సవాలుగా ఒక శ్రమగా గడచిన ఆ యుద్ధ కాలం
మైళ్ళకొద్దీ నడక, సూర్యోదయానికి ముందే లేవడం,
గుడి దగ్గర అయ్యవారు చెప్పిన పాఠాలు
అరబ్బు పాఠశాలకు మైళ్ళ నడక
రైల్వే స్టెషన్ రోడ్డుకి ఇసుకదారుల్లో ఎదురీత
ఆ దేవాలయ వీధులూఅ వార్తాపత్రికలు సేకరించడం, పంచడం
మళ్ళా పాఠశాలకిసాయంకాలం, రాత్రి చదువుకి ముందు దుకాణంలొ పనిపాట్లు,
ఇది ఒక బాలుని వేదన

అమ్మా ! రొజుకి ఐదు సార్లు నీ వందన నమస్కారాలు
సర్వేశ్వరుని క్రుపావీక్షణాలతొ జీవితాన్ని పవిత్రంగా బలపర్చావు.
ఆ పవిత్రతే నీ పిల్లలకు శ్రీరామ రక్ష.
నువ్వెప్పుడూ నీకున్నదాంట్లొ మంచిదేదో ఎవరికి ఏది అవసరమో చూసి ఇచ్చావు.
నీకు ఇవ్వడమే తెలుసు, ఇస్తూనే ఉంటావు.

నా పదేళ్ళప్పటి ఆ రోజు నాకింకా గుర్తే
నన్ను నీ వళ్ళొ పడుకోబెట్టుకున్నావు.
నా అన్నలూ, చెల్లెళ్ళూ ఉడుక్కుంటున్నారు
నిండు పున్నమి రాత్రి, అప్పుడు, నాకు తెలిసిందల్లా నువ్వే,
అమ్మా, నా అమ్మా !
నేను కన్నీళ్ళతొ ఉలిక్కిపడి లేచాను
నీకు నీ బిడ్డ బాధ తెలుసు నీ లాలించే చేతుల ద్వారా మ్రుదువుగా తొలుగుతున్న బాధ
నీ ప్రేమ, నీ లాలన, నీ నమ్మకం, నాకు బలాన్నిచ్చేయి.
ప్రపంచాన్ని నిర్భయంగా ఎదుర్కోవడం నేర్పాయి.
సర్వేశ్వరుని శక్తిని నిలిపాయి.


అమ్మా, అంతిమ తీర్పు రోజున కలుస్తాం కదా మళ్ళా !

- ఎ.పి.జె. అబ్దుల్ కలాం
[చిన వీరభద్రుడు]
(వింగ్స్ ఆఫ్ ఫైర్ - నుంచి)
తెలుగు అనువాదం - ఒక విజేత ఆత్మ కధ

No comments: