Pages

16/04/2013

నాణానికింకో వైపు - విశాఖపట్నం

వేసవిలో కష్టపడకుండా చెమట చిందించేయొచ్చు. గాఢ నిద్ర లోంచీ, వొళ్ళంతా, దిండంతా చెమటకి తడిచిన చెమ్మకి మెలకువ రావడం, మా వూరి స్పెషాలిటీ.  ఏసీ లొచ్చి బ్రతికించాయి. డయాబెటీస్ ఉన్నవాళ్ళకి ఈ విపరీతమైన ఉక్క పోత ప్రాణసంకటం.


చండీదాస్ నవలల్లో విశాఖ తీరం అందాల్ని గుర్తు తెచ్చుకుందుకు.. మహరాణీపేట లేడీస్ హాస్టల్ డౌను రోజుల్ని నెమరు వేసుకుందుకూ బీచీకి కారు లో షికారు పోయేరు. అద్దం నిండా ఉప్పుగాలి చెమ్మ. ఇదీ మా సముద్రం. వేడి నుండీ తప్పించుకోవడానికి జనం తండోపతండాలుగా వచ్చి, సముద్రం నుంచీ వీచే ఉక్కిపోయిన గాలి రంధిలో తలనొప్పి తెచ్చుకుని బయల్దేరొచ్చు. కళ్ళజోడుతో స్కూటరు నడపడం కష్టం.  అద్దాల్నిండా మబ్బులు కమ్మేసి వుంటాయి. 


"మురీ మిక్సరు (పిడత కింద పప్పు లాంటి ఒక స్నాక్)  అమ్మేవాడెవడికో ఎయిడ్స్ ఉందిట. ఒకసారి వాడి రక్తం  టొమాటోలు తరిగినపుడో తెగిన రక్తం లోంచీ కలిసి తిన్నవాళ్ళకి కూడా ఎయిడ్స్ వచ్చిందంట ! "  అని ఎవరో మా చిన్నపుడు పుకారు లేవదీసారు.  ఆ ఆనందం కూడా  పెద్దయ్యాకా హైజీను గొడవలో పడి కోల్పోయాం.  బీచి లో గవ్వలన్నీ జనం ఎత్తుకుపోయారు. ఇపుడు నల్లని కుళ్ళిన మట్టీ, నీళ్ళలో కలుస్తున్న ఓపెన్ డ్రైనేజీ ప్రవాహాలూ, ఒక ముసలి గుర్రం, చిక్కిన ఇసుక మేటా తప్ప ఏమీ లేవక్కడ.  అన్నమయ్య విగ్రహం పక్కనా, మాస్టరు 'ఈ.కే' (ఎక్కిరాల కృష్ణమాచార్య) విగ్రహం పక్కనా కూడా ఏదో కోల్పోయినట్టనిపిస్తూంటుందండీ - అని మహేశ్వరి నిట్టూర్చింది.  


పొద్దున్నే తాజా గాలి పీల్చుకుందికి లేదు. తెల్లారే  గాలిలో అదోలాంటి వాసన. ఎవరో ఫాక్టరీ వాళ్ళు ఏవో వాయువుల్నీ, కల్మషాల్నీ వదిలినట్టుంది. సూర్యుడి ప్రతాపానికి చల్లదనం కరుగుతుంటే, ఆ వాసన కూడా విరుగుతూంటుంది. ఈలోగా పనుల తొందర్లో, తాజా గాలి సంగతి మర్చిపోవచ్చు.

ఒకపుడు సిటీ ఆఫ్ డెస్టినీ. ఇపుడు, పిల్లలెగిరిపోయిన ఖాళీ కాకి గూడు లా మిగిలింది.  పిల్లలందరూ, ఈ విశాఖ మెట్టుమీద ఓ కాలుంచి, ఇంకో కాలు ఏ హైదరబాదు మీదో వుంచి, విదేశీ అటక ఎక్కిపోయారు. తల్లితండ్రులు, రైతు బజారులో దేశవాళీ టొమాటోలూ, ఏజెన్సీ నుంచొచ్చిన పచ్చి అల్లం గురించే కబుర్లు చెప్పుకుంటున్నారు. 'రామాయణ కల్పవృక్షాని' కే ప్రైజిచ్చిన విశ్వవిద్యాలయం - తమ మీద తమకే నమ్మకం లేనట్టు మసిబారుతూ రోడ్డుపక్కన నించుంది. 

సింధియా మీంచెళ్ళి గంగవరం వెళ్ళొద్దాం అని ప్లాన్. డాల్ఫిన్ నోస్ పక్కనే ఏదో కొత్త నగరం.  'సబ్బవరం పిల్లా సబ్బు కావాలా ?" అని ఈవ్ టీజరు నోట పాట. మువ్వల వాని పాలెం నిండా రక రకాల రెస్టారెంట్లూ, బ్రహ్మాండమైన స్కూళ్ళూ, మిఠాయి దుకాణాలు. రవీంద్రా టైలర్సు ఎత్తేసి చాలా కాలమైంది.  కైలాసగిరి కొండ మీద గోవింద నామాల్లో సగం లైట్లు వెలగనే వెలగట్లేదు. చుట్టూ చెట్ల పొడవెక్కువయి సరిగ్గా కనిపించడం లేదు కూడాను. చిరంజీవి గారికి ఆలోచన రాలేదు. వస్తే అక్కడ ఎల్.ఈ.డీ.లైట్లు పెట్టిద్దురు.

విజీనారం అమ్మోరి పండగని (విజయనగరం అమ్మవారు - పైడితల్లి) ఓ నాల్రోజులూ, వాళ్ళ వీధి అమ్మోరి 'పరస'ని (విశాఖ లో అమ్మవారి పండగ) ఓ రెండ్రోజులూ సెలవెట్టేసేడు అప్పారావు మా వాచ్మెను.  "నాగేశ్వర రావు గారి కుటుంబం శ్రీకూర్మం వెళ్తున్నారుట. అలా అరసవిల్లి చూసుకుని వస్తారు ! వాళ్ళ పెద మావగారి తద్దినం అక్కడ శ్రీకూర్మం (కూర్మ నాధ స్వామి కోవెల - పితృకార్యాలకి ప్రసిద్ధి) గుళ్ళోనే ట !"  అని చిన్న మణి చెప్పింది.  కార్లో ప్రయాణం బానే వుంటుందిలే. ఇపుడు మంచి రోడ్లు పడ్డాయి. అంది వాళ్ళక్కయ్య !

'తెలంగాణా వస్తే మరి పట్టలేం. మధురవాడలోనో, ఎండాడ లోనో, కొమ్మాది లొనో ఇల్లు కొని పడేద్దాం అని" ప్రతీ ఒక్కడూ అనుకోవడమే ! అని ఇసుకతోట లో నాలుగు ఫ్లాట్లున్న డాక్టరు గారు వాపోయారు. అందుకే చూడండి. పల్లెటూళ్ళు ఊరు ఊరంతా ఎగిరిపోయి ఎపార్టుమెంట్ల నగరాలు లేచేస్తున్నాయి. విజీనారానికీ, విసాపట్నానికీ తేడా మరి ఉండదు లెండి... పూసపాటిరేగ వరకూ మెట్రో వేస్తారు చూడండి - అందుకే రామానాయ్డు ఇక్కడ స్టూడియో కట్టేడు.  అట్చూడండి - ఆ కనపడే కొండా కోనా అన్నీ జగనన్నవే. వైజాగ్ లో గమ్మున ఇల్లు కొనుక్కోవాలండీ. ధరలు పెరిగిపోతాయి మరి ! " -  రియాల్టరు విశ్వేశ్వర రావు ఉవాచ.

కొత్తగా మాళ్ళూ అవీ వచ్చాయనుకోండి. అయినా విశాపట్నం పెద్ద పల్లెటూరే !   అని మా భవాని అత్తయ్య నవ్వింది.

పేపర్లో ప్రకటన చూడండి. హాస్పిటలు వాళ్ళకి ఒరిస్సాలో కమీషన్ ఏజెంట్లు కావాల్ట. ఒరిస్సా నుంచీ పేషెంట్లని తీసుకు రావడానికి. పాపం వాళ్ళ అనారోగ్యానికి వాళ్ళకి ఏ భువనేశ్వరమో వెళ్తేగానీ మంచి ఆస్పత్రనేది ఉండదు.  వాళ్ళకి పరమోగతి ఈ విశాపట్నమే. ఇక్కడి కే.జీ.హెచ్ వీధి నిండా వెలిసిన డాక్టర్ల దుకాణాలూ, చిన్నా పెదా ఆస్పత్రులూ, రాం నగర్లో మెడికల్ షాపులు సైతం, ఒరియా భాషలో లాడ్జీలూ, సగం వేరే రాష్ట్రం వాళ్ళ సేవ లోనే గడిపేయవూ ? ఇపుడీ పీ.ఆర్.వో ఉద్యోగాలు కూడానూ -  అని పీటరు బాధపడిపోయాడు. పోన్లెద్దురూ.. ఎవరి కష్టాలు వాళ్ళవి. అని ఊరుకోబెట్టాం."ఇందులో విపరీతం ఏముంది ? 'విన్ - విన్ సిట్యుయేషన్ !" అన్నడు రమణ.


రైళ్ళన్నీ ఇంక నుండీ దువ్వాడ వెళ్ళే ఎక్కాలి కామోసండీ అని అప్పారావు గారి ఆవేదన. 'అసలెంత మంది వెళిపోతున్నారండీ వెధవ హైదరాబాదుకీ? ప్రతి రోజూ 12 రైళ్ళూ, 60 బస్సులూ ఉన్నా, ఏ పూటకీ రిజర్వేషను ఇదిగో కంఫెర్మూ అని టికెట్టు దొరికి చావదు. ఎప్పుడూ గోదావర్లో వెయిటింగ్ లిస్టు ఏ మూడొందల పాతికోనే. రైలెక్కే వరకూ భరోసా లేదు. అయినా, ఈ డబ్బంతా ఆ ఒరిస్సాకే తరలిపోతూంటుంది !" అని సింహాచలం గారి ఆందోళన. ఆయన కూతురూ అల్లుడూ, హైదరాబాదులోనే ఉండడం.  

లోకల్ న్యూస్ పేపరు కి వార్తలు రాసే విలేఖరి డీఆరెం ఆఫీసులో తెగ తిరిగేస్తున్నడు.  "అదృష్టం ! విశాపట్నం స్టేషన్ కైనా రాంపు (ప్లాట్ఫారాలు మారడానికి మెట్ల దారి తో పాటూ) ఉంది. వీల్ చైర్లు /స్ట్రెచర్లూ, ముఖ్యంగా ఈ చక్రాల పెట్టెలూ బాగులూ లాక్కోడానికి అనువుగా. ఏ హైద్రబాదు సికిందరాబాదుల్లో ఉందండీ ఈ ఫెసిలిటీ ?"  అని ఓ విశాఖా రైలాభిమాని చాతీ ఉప్పొంగించారు.  "మా మాంగారు హార్టు పేషెంటు. అత్యవసరంగా ప్రయాణం కట్టాల్సొచ్చింది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాదు స్టేషన్ లో రైలు దిగి  ఏ బాటరీ కారూ, వీల్ చైరూ దొరక్క, మూడుగంటలు వెయిట్ చేసి, ఆఖరికి మెట్లనీ ఎక్కి ప్లాట్ ఫాం నుంచీ బయటికి వచ్చారు. ఆ తర్వాత నాల్రోజులకే పోయారు" అని రాజీ చెప్పింది.

"ఎంత సేపూ రాజమండ్రీ నుండీ పొలస చేపలూ, కాకినాడ నుండీ చుక్కల పీతలూ - అంటూ రాజులొండిన గొడావరీ ఫిష్ గొప్పలు చెప్పుకోవడమేనా - అలా బీచ్ రోడ్డులో రోడ్డు పక్కన ఎండబెట్టిన చేపల సువాసన చూస్తారా ? "  అనడిగేడు దేవుడు. అబ్బ ! విశాలాక్షి నగర్ వెళ్ళే తోవలో ఆంధ్ర భూమి పక్కన ఎన్ని చేపలో - ఎండ కి వెన్నెల నక్షత్రాల్లా మెరుస్తూ ! అని భావుకత ప్రదర్శిస్తాడు మా సురేషు.  'అబ్బ చీ ! అవి కాదు డెక్కు మీద (చేపలు పట్టే పెద్ద పడవల డెక్) ఎండబెట్టినవి - చూడండి ఇసకన్నది ఉండదు - తీస్కోండి బాబూ - అని రాగాలు తీస్తుంది మా కాంతమ్మ ! 


"(ఫిషింగ్) హార్బరు కెళ్ళి వస్తున్నాం !" - ఆదివారం రోజు నర్మదా వన్ ఫిఫ్టీ (Narmada 150 Scooter) మీద ప్లాస్టిక్ బాగ్ నిండా చేపల 'వాసన'  తో ఎదురొచ్చిన రాజుగారు మనం పలకరించకుండానే చెప్తారు. నేవీ వాళ్ళు బెంగాలీ వాళ్ళు ఆటోల్లో చేపలు తీస్కెళ్తుంటారు - బహుశా వారానికి సరిపడా గ్రాసం కాబోలు.

"విజీనారం మ్యూజిక్ కాలేజీ లో చదూకున్నార్ట ! ఆ సాగర్ ఎపార్ట్మెంటులో కొత్తగా దిగేరు. మ్యూజిక్ నేర్పిస్తార్ట. "మాళవిక" లేదూ - వాళ్ళ వేలు విడిచిన చుట్టాలంట."  - ఆ చెంపనొక్కుల పెద్ద నుదురు, కొత్త పావలా కాసు లాంటి నాజూకు బొట్టూ, బెంగాల్ కాటన్ చీరలు కట్టుకునే పెద్దావిడ గురించే చెప్తున్నారనుకుంటా.  "అవునవును. ఆవిడ బాల్కనీ లో కూర్చుని వీణ వాయిస్తుంటే చూసాను!" అంది రత్న.  (అంటే ఈవిడ బాల్కనీ లోంచీ ఆవిడ హాల్ లోకి చూసిందన్నమాట !)

రత్న కూతురు  రోజూ స్కేటింగ్ కని వుడా పార్కుకి వెళ్తూంటుంది.  "వీళ్ళందర్నీ మొన్న వాకింగ్ లో చూసేం. పాండురంగపురం అప్ కి తీస్కెళ్ళి వొదిలేడు కోచ్. తొడలు నొప్పెట్టేలా పిల్లలు స్కేట్ల కాళ్ళను తొందరగా కిందకి జారిపోకుండా ఆపుకుంటున్నారు. నాకైతే చాలా జాలి వేసిందనుకో !"  అని బాధపడ్డారు.. గొలుసులూ, సూత్రాలూ తీసేసి చుడీదార్ తో వాకింగ్ కి పోయే రాజ్యలక్షి గారు. మ్యూజిక్ టీచరు మాటే మర్చిపోయి.  రత్న కళ్ళూ అరమోడ్పులయ్యాయి - గర్వం తో !


గణేష నవరాత్రుల్లో సంపత్ వినాయకుడి గుడి ముందు డెకరేషన్లు చూడ్డానికిభలే సంబరంగా వుంటుందనుకో ! అని మా స్వప్న అంటూంటుంది. నిజమే ! ఆ రోడ్డంతా మారిపోయింది. కొత్త దుకాణాలూ, కొత్త అలంకరణలూ !  తిరపతి మాడవీధుల్లా అన్ని రోడ్లూ వెడల్పయ్యాయి. దానికి తగ్గట్టే ట్రాఫిక్కూ.. అటు చూడండి పెదవాల్తేరు రోడ్డ్ల పక్కన అశోకుడు నాటించినట్టుండే  చిక్కని నీడనిచ్చే చెట్లని కొట్టిపడేసారు.   బాధపడింది స్వప్న !

"మరీ బాధలు భరించలేనట్టు అనిపిస్తే, ఎన్.హెచ్ ఫైవ్ (NH5)  మీద్నుంచో, మధురవాడ వైపునుంచో సిమ్హాచలం వెళ్ళి సంపెంగ వాసన్లు పీల్చుకుని రండి. సాయంత్రం అయితే సిమ్హాచలం చాలా అందంగా వుంటుంది" - మా మణి పెద్దమ్మ చెప్పింది.  అయితే చాలా మంది సుప్రభాతం వేళ అప్పన్న అందంగా వుంటాడంటారు. నాకైతే లక్షివారం ఆ సిమ్హపు కవచం తో నచ్చుతాడు. 

అడవి సంపెంగలూ, తెలుపు సంపంగలూ, పచ్చ సంపెంగలూ, మల్లెలూ, కనకాంబరాలూ, విరజాజులూ, సన్న జాజులూ, మరువం, జూకా మల్లెలూ, సువర్ణ రేఖలూ, రక రకాల రసాలూ, తియ్యని పనస పళ్ళూ.. బెల్లమూ - కలిసినట్టు - ఏదో దివ్యవైన వాసన కదూ ఆ కనకమాలక్ష్వి కోవెల్లొ ? కొంచెం ఇరుకు వీధి ! తప్పదు మరి. అమ్మోరు - మా వూరి పెద్దమ్మ కదూ.


Disclaimer : ఇందులో విషయాలన్నీ దేన్నో ప్రత్యేకంగా ఉద్దేశ్యించి గానీ, ఎవరన్నా హర్ట్ చేద్దామనీ రాయలేదు. ప్రస్తుత పోకడ / ట్రెండ్ గురించి చాలా మంది స్వగతాన్ని ప్రతిబింబించాలని చిన్న ప్రయత్నం. ఊరు విడిచిపెట్టిన స్నేహితులకి కూడ ఓ పలకరింపు లా అనిపించాలని కోరుతూ ..

21 comments:

శ్రీరామ్ said...

విశాఖపట్టణం గురించి చాల బాగా రాసారు.

Praveen Mandangi said...

House rent in Nakkavanipalem is 9000 and shop rent costs 20000. Even I would shift to Madhuravada or PMPalem after formation of Telangana state.

Mauli said...

నాకు మాత్రం విశాఖపట్నం పెద్ద పెద్ద రోడ్లు , కొండలాగా కనిపించే దారులు బాగా నచ్చాయి. మీరిన్ని నిజాలు వ్రాస్తే అమ్మయ్య వైజాగు రాజధాని అవ్వదులే అని భరోసా వచ్చేస్తుందంటే నమ్మండి :)

( బాబ్బాబు ఎవరూ గుంటూరు, విజయవాడ గురించి ఇన్ని నిజాలు వ్రాయకండే )

వెన్నెల రాజ్యం1 said...

నాణేనికి రెండేపులా చూపించారుగా.

మాధవ్ said...

word to word 100% correct..rishikonda village kanumarugaipothundhi developmentlo padi...

తృష్ణ said...

నాకూ వైజాగ్ ఇష్టమండి. ముఖ్యంగా బీచ్! ఏ.యూ అనుబంధం..:) స్కూలు రోజుల్లో మా మావయ్యవాళ్ళు ఉన్నప్పుడు కాకినాడ వెళ్ళిన ప్రతిసారీ వైజాగ్ కూడా వెళ్ళేవాళ్ళం. అప్పటికీ, యూనివర్సిటీ రోజులకీ బోలెడు తేడా వచ్చేసింది. ఇప్పుడు ఇంకా చాలా మారిపోయిందంటున్నారు.

తృష్ణ said...

నాకూ వైజాగ్ ఇష్టమండి. ముఖ్యంగా బీచ్! ఏ.యూ అనుబంధం..:) స్కూలు రోజుల్లో మా మావయ్యవాళ్ళు ఉన్నప్పుడు కాకినాడ వెళ్ళిన ప్రతిసారీ వైజాగ్ కూడా వెళ్ళేవాళ్ళం. అప్పటికీ, యూనివర్సిటీ రోజులకీ బోలెడు తేడా వచ్చేసింది. ఇప్పుడు ఇంకా చాలా మారిపోయిందంటున్నారు.

వనజ తాతినేని/VanajaTatineni said...

నగరీకరణ లో పల్లెలు మాయం, ఘనమైన ఆనవాళ్ళు ఖతం .
జ్ఞాపకాలలో గుర్తు చేసుకోవడమే! అభివృద్ధి మాటున కోల్పోతున్న వాటిని సున్నితంగా గుర్తు చేసారు బావుంది సుజాత గారు

రాజ్ కుమార్ said...

ప్చ్... మన చేతుల్లో ఏమీ లేదండీ.. ఇలా ఏడవటం తప్ప ;( ;(

Rao S Lakkaraju said...

చదవటానికి కొంచెం బాధగా ఉంది కానీ కాలం ముందుకి పోవటం తప్పదు కదా. బాగా వ్రాశారు.

కే.జీ.హెచ్ వీధి లో ఇన్ గేటు కి ఎదురుకుండా ఒక చిన్న రేస్తోరంట్ ఉండేది. సమోసాలు ఆమ్లేట్లు బెస్ట్. ఇప్పుడుందో లేదో తెలియదు. దాని పేరు మార్చే పోయాను. పావన్ బేకరీ అనుకుంటాను.

పద్మవల్లి said...

హ్మ్ ...వైజాగ్ గురించి ఎన్ని నిజాలు చెప్పారో. ప్రతీ వాక్యం తోనూ నాస్టాల్జియా ఫీలయ్యి, ప్రతీ మార్పుతోనూ ఏకీభవిస్తాను. ప్రతీ మార్పునీ అనుభవించిన దానికి సాక్ష్యం నేనే.

దాదాపు ఇరవైయేళ్ళ క్రితం నాటి జ్ఞాపకాలు ....బీచ్ అందాలూ, ప్రశాంతతా, మూడేళ్ళు లేడీస్ హాస్టల్ జీవితం, ఆ డౌన్లో గడిపిన మరిచిపోలేని సాయంత్రాలు, జనాలు లేని ఏకాంతం అనుభవించడానికి దాదాపు రాత్రి పదివరకూ (హాస్టల్ కర్ఫ్యూ మొదలయ్యేలోగా ) బీచ్ ఒడ్డున బిచాణాలు, సీగల్ ఇరాని చాయ్, ఉదయాన్నే ఇంకా పూర్తిగా తెల్లారక ముందే RK బీచ్ నుంచీ దాదాపు ఋషికొండ వరకూ మోపెడ్ మీద గమ్యం లేని షికార్లు ...ఎన్ని గుర్తుకు తెచ్చారో.

పుట్టిందీ, పెరిగిందీ, చదివిందీ అంతా వైజాగే.చిన్నప్పుడు ప్రతీ ఆదివారం సాయంత్రం పూర్ణామార్కెట్ నుంచీ అల్లిపురం వీధుల గుండా తమ్ముళ్ళతోనూ, స్నేహితులతోనూ కలిసి బీచ్కి పోయి, చీకటి పడే వరకూ ఆడుకుని, పిడత కింద పప్పూ, మొక్క జొన్నకండెలు కొనుక్కుని తింటూ ఆ తడిసిన బట్టలతోనే ఇంటికి వెళ్లటం ఇంకా జ్ఞాపకం. ఒక్కోసారి పాత పోస్టాఫీసు దగ్గర వెంకటేశ్వర స్వామీ గుడి, పెద్దవాళ్ళు లేకుండానే సముద్రం దాటేసి సాగరదుర్గ గుడికి అన్ని మెట్లూ ఎక్కి రావటం, అదే రోడ్డులో నడుస్తూ చేపల బీచ్ ప్రక్కగా ఆ వాసన కి ముక్కు మూసుకుంటూనే, ఇసుకలో మెరిసే చేపలు ఫిషింగ్ బోట్లూ చూస్తూ, వెనక్కి వెనక్కి చూసుకుంటూ RK వరకూ నడుచుకుంటూ వెళ్లటం బాగా జ్ఞాపకం. కాలేజీ రోజుల్లో ఫ్రెండ్స్తో కలిసి చేసిన విహార యాత్రలు యారాడ కొండకీ, దుర్గ గుడికీ, ఋషికొండ లోని సరుగుడు తోటల్లోకీ, కైలాసగిరీ .. ఇదుగో ఇంకా నిన్ననే వూరు వదిలి వచ్చినంత ఫ్రెష్గా జ్ఞాపకం. ఒకప్పుడు అప్పూఘర్ ఓ అద్భుతం, విశాఖ పాలిటి డిస్నీ. ఓ రెండేళ్ళ క్రితం చూస్తే ప్రక్కనే తీర్చిదిద్దిన తెన్నేటి పార్క్ పక్కనా దిష్టి చుక్కలా వెలిసిపోయి. అక్కడ చిన్నప్పుడు ఆడుకున్న జ్ఞాపకాలని గుర్తు తెచ్చేవి ఒకటీ మిగల్లేదు.

అమ్మ టీచర్గా చేసే ఎండాడ అంటే ఆ రోజుల్లో ఏదో ఎడారుల్లోకి వెళ్ళినంత ఫీలింగ్. ఇసుకతోట హనుమాన్ విగ్రహం, రిషీ వేలీ స్కూల్, జూ దాటిన తర్వాత చూద్దామన్నా కనిపించని జనసంచారం, వూరుకి ,మైలు బయట దింపేసి, దుమ్ము మొహం మీద రేపుకుంటూ పోయే 25 నంబర్ బస్సూ. అన్నట్టు మధురవాడ నుండి సింహాచలం వెళ్ళే దారి కూడా దాదాపు సోకులు పూర్తీ చేసుకుందిగా. ఆ దారిలో ఓ పిక్నిక్ స్పాట్ కూడా ఉండాలి. ముడసర్లోవేనా?

RTC కాంప్లెక్స్ నుంచీ, శ్రీనగర్, జగదంబా వరకూ రోడ్లు అసలు గుర్తు పట్టలేనట్టు. ఓ ఐదేళ్ళ క్రితం ఆ దార్లలో వెళ్తుంటే అసలు అది ఏ రోడ్దో ఎటు నుండి ఎటు వెళ్తున్నామో కూడా గుర్తు తెలియలేదు నాకైతే. తమ్ముళ్ళు నవ్వు, నువ్వు కొలిచిన, అడ్వెంచర్ చేసిన రోడ్ల్కే ఇవి అని. లేపాక్షి పక్కనుండే మిర్చీ బజ్జీ, వేడి వేడి జిలేబీల బండి మాయం.

బెంగళూరులో పని చేసేరోజుల్లో దాదాపు నెలకోసారి, ఎప్పుడొస్తుందో, వచ్చినా ఏరోజు రావాల్సింది ఆరోజు వస్తుందో రాదో తెలీని హౌరా-మద్రాస్ మెయిల్ కోసం గంటలు గంటలు రైల్వే స్టేషన్లో ప్లాట్ఫాం మీద గడిపిన రోజులు. ఇప్పుడు ఎటు చూసినా కూడా ఒక్కటీ గుర్తు పట్టలేనంత, కొన్ని నిమిషాలు కూడా వూపిరాడనంత మార్పు.

యూనివర్సిటీ కాంపస్ రోడ్ల మీద, వర్షం కురిసి వెలిసిన చల్లని మధ్యాన్నాలు, దారి పొడుగునా ఉన్నఅగ్నిపూల చెట్ల మీదనుండి ముత్యాల్లా మీద రాలే చినుకుల్లో తడవడం కోసం, దారి ప్రక్కనుండే రకరకాల మొక్కల్నుంచి పూలనుంచీ వచ్చే వింత పరిమళాలు పీలుస్తూ మైమరచిపోవడం కోసం, స్నేహితులతో కలిసి మైళ్ళకి మైళ్ళు మౌనంగా నడుస్తూ కాలం గడపటం అనేది మరిచిపోలేని జ్ఞాపకం. మద్దిలపాలెం బస్ కాంప్లెక్స్ వైపున్న ఇంజనీరింగ్ కాలేజీ ఎంట్రన్స్, అసలు ఆ పరిసరాలే గుర్తుపట్టలేనట్టుగా మారిపోయినది చూసి, పాట జ్ఞాపకాలు తుడిపేసుకోవడం ఇష్టం లేక ఎన్నోసార్లు అటువైపు నుంచే వెళ్ళినా లోపలి వెళ్ళాలన్న ప్రయత్నం కూడా చెయ్యలేదు.

NH5 నుంచీ కొత్తవలస వైపు వెళ్ళే దారంతా మెట్రో రోడ్లని తలపిస్తూ... ఒకప్పుడు కాంప్లెక్స్ నుంచీ ఇంటికి వెళ్ళాలంటే గంటకి పైగా పట్టే ప్రయాణం, ఇపుడు ఇరవై నిమిషాల్లో అయిపోతుందని సంతోషించాలో లేక పుట్టినూరు కొస్తుంటే దారిపొడుగునా పరిచయమైనవేవీ పలకరించడానికి లేవని బాధపడాలో తెలీదు.

అవును, అమ్మా నాన్నా రైతు బజార్లో దొరికే వాటి గురించీ, కొత్తవలసలో దొరికే మామిడి పళ్ళూ, పలాస జీడిపప్పు గురించే ఇంకా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఊరుని ఖాళీ గూడు చెయ్యటంలో నేనూ ఓ భాగస్వామినే.

సారీ, నా జ్ఞాపకాల తుట్టని కదిపారు. మీ పోస్టుకన్నా పెద్ద కామెంట్ తయారయ్యింది. దిగులు వెళ్ళబోసుకోకుండా ఉండలేకపోయాను.

నిషిగంధ said...


మీ పోస్ట్ పుణ్యమా అని "ఏవీ నిరుడు కురిసిన..." చందాన మా ఊరిని కూడా కాస్త తలచుకుని వచ్చానండీ.. :)

విశాఖ అంటే మిగతా పూలకంటే నాకు రకరకాల సంపెంగలే గుర్తొస్తాయి.. ఒక్కసారే వెళ్ళాను కానీ సిటీలో బాగా నచ్చింది మాత్రం విశాలమైన (అప్పట్లో) రోడ్లే..

మీ వర్తమానం.. పద్మవల్లి గారి గతం రెండూ వైజాగ్‌ని పూర్తిగా పరిచయం చేశాయి :)

అయినా అన్నీ అప్పట్లానే ఉండిపోతే ఇంక ఆ జ్ఞాపకాలకి ఇంత విలువ ఎలా ఉండేదండీ! రేపు ఈ జనరేషన్ పిల్లలు 'ఒకానొకప్పుడు కలిసి ఐమాక్స్‌లో సినిమా చూశేవాళ్ళం.. కెఎఫ్‌సి, మెక్‌డోనాల్డ్స్ క్యూలల్లో నలభై నిమిషాలకి తక్కువకాకుండా హాయిగా కబుర్లు చెప్పుకుంటూ నిలబడేవాళ్ళం... " అంటూ చెప్పుకుంటారేమో!? :)

వేణూశ్రీకాంత్ said...

వైజాగ్ తో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలించేసే టపా రాశారండీ.. ప్రస్తుతం ఏం మాట్లాడలేని స్థితిలో ఉన్నాను.

Sujata M said...

@శ్రీ రాం గారు..
థాంక్స్.


@ఫ్రవీన్ నక్కవానిపాలెం..
అదృష్టవంతులు మీరు మరి అయితే. ముందు చూపు కూడా మెండుగా వుందిగా మరి.


@మౌళి - అంటే ?? :D


Sujata M said...

వెన్నెల రాజ్యం గారు
థాంక్స్.


మాధవ్ గారు - మీక్కూడా థాంక్స్.


తృష్ణా జీ - అవును మారిపోయింది, ఇప్పటికీ చాలామందిని ఆకర్షిస్తూంది. ఎంతైనా అందమైన వూరు కదా ! Thanks.

Sujata M said...

వనజ వనమాలి గారూ..
అవునండీ. మీరన్నది నిజం. థాంక్స్.

రాజ్ కుమార్ గారు - భలే చెప్పారు. మరింకో చాయిస్ లేదు.

రావ్ లక్కిరాజు గారు - థాంక్స్

Sujata M said...

పద్మవల్లి గారు - మీకు చాలా థాంక్స్. మంచి (పెద్ద్) కామెంటు రాసినందుకు. మా నో.కా.బ్లా.స. నుండీ మీకో వెండి షీల్డు. చాలా చాలా బావున్నాయి మీ జ్ఞాపకాలు. ఆరోజుల్లో ఎడ్వెంచర్లు, ఇసుక బట్టలూ అవీ.. షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. వైజాగ్ లో ఒక చార్మ్ వుండేది. అది కొంచెం కొంచెం గా తరిగిపోతూంది. అదే బాధ. కానీ, నిషిగంధ గారన్నట్టు కొత్త తరం ఈ మార్పుల్ని ఎంజాయ్ చేస్తున్నట్టే వుంది. Many Thanks for the wonderful comment.

Sujata M said...

నిషిగంధ గారు - నిజమే.. వీళ్ళందరూ ఇంకేం చెప్పుకుని బాధపడ్తారో ! థాంక్స్.

Sujata M said...

వేణూ శ్రీకాంత్ గారు

చాలా థాంక్స్.

Anonymous said...

నేను ఒక్కసారే చూసానండీ వైజాగ్ ని. నాక్కూడా సింహాచలం సంపెంగలే గుర్తు వస్తాయి వైజాగ్ ని తల్చుకుంటే, బీచ్ కన్నా ఎక్కువగా. మార్పు అన్నది సాధారణం అని తెలిసినా, మన ఊరిలో, పరిసరాల్లో, స్నేహితుల్లో మార్పుని గమనిస్తే ఒక్కోసారి దిగులు కమ్మేస్తుంది కదా :(
-విజయ జ్యోతి.

Anonymous said...

Vizag vachinattu anipinchindi.thanksandive.