Pages

04/06/2013

Ball of Fat - Guy de Maupaassant

 ‘బౌల్ డి సూఫ్’  ప్రెంచు పేరు. దాన్ని  ఇంగ్లీష్ లోకి అనువదిస్తే బాల్ ఆఫ్ ఫాట్ (Ball-of-Fat) –  ఈమె చిక్కగా, లావుగా, ఆకర్షణీయమైన వొంటి  రంగూ,  నిండైన అవయవ సంపద తో  దొండపండు లాంటి  పెదవులు ఎపుడూ, తడితో మెరుస్తూ ముద్దుపెట్టుకోవాలనిపించేలా వుంటాయంట.  అయితే దురదృష్టవశాత్తూ ఈ అందగత్తె, ఒక వేశ్య!     వేశ్య కు మానాభిమానాలూ, ఆలోచించే విచక్షణా, దేశభక్తీ లాంటివి ఉంటాయని చెప్పే కధే ఇది. మోపాసా  కధల్లో అత్యుత్తమ కధ గా పేరెన్నిక పొందినది.

అవి ప్రష్యా, ఫ్రాన్సు ల మధ్య యుద్ధం జరుగుతున్న కాలం.  బాల్ ఆఫ్ ఫేట్ ఉన్న రోవెన్ అనే ఫ్రెంచు గ్రామం ప్రష్యా (జెర్మనీ) ఆక్రమణ లోకి వెళ్ళిపోయింది.  తలుపులు మూసుకుని, ఎవరి ఇళ్ళలో వారు బందీలయిన ప్రజలకు వీధుల్లో జెర్మన్ సైనికుల వీరత్వ ప్రదర్శన, వాళ్ళ రణగొణ ధ్వని,  ‘ఎపుడేమవుతుందో తెలీని’ అభద్రతా భావం,  కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి.  గ్రామం శత్రు సైనికుల ఆక్రమణ లో వుంది. ఆ  మాటకొస్తే, చుట్టు పక్కల గ్రామాలన్నిట్లోనూ ఇదే పరిస్థితి.   ధనవంతులు శేర్ల కొద్దీ బంగారు, వెండి నాణాల్ని  దురాశాపరులైన శత్రు సైనికుల జోలెల్లో పోసి, స్వాతంత్ర్యాన్ని  ఘడియల లెక్కన కొనుక్కుంటున్నారు.  బీద వాళ్ళు కోళ్ళనూ, మేకల్నీ, ఆఖరికి ఆహార ధాన్యాల్ని కూడా దాచుకోవల్సిన పరిస్థితి. ఇలాంటి దీనమైన  యుద్ధపు రోజుల్లో వేశ్యల బ్రతుకు ఎంత దుర్భరం ?

బాల్- ఆఫ్-ఫాట్ వేశ్యే కావచ్చు. ఆమెకు  తానూ ఓ మొగవాడినయి ఉంటే, యుద్ధంలో చేరి జర్మన్లను చంపేసి వుందునే అనే నిస్సహాయపూర్వకమైన ఆవేశం కలుగుతూ ఉంటుంది. వేశ్యే అయినప్పటికీ, ఆమెలో దేశభక్తి కేమీ తక్కువ లేదు. జెర్మన్ సైనికుల విలాసాలు తీర్చేందుకు ఒప్పుకోదు. వాళ్ళతో ఆమెకు చచ్చే చావైంది.  వాళ్ళని ప్రతిఘటించడం వల్ల కాక, ఈ లోగా ఆవేశంతో ఒక సైనికుణ్ణి దేంతోనో మోది, చంపినంత పని చేసి, గత్యంతరం లేక, ఊరి నుండీ ఫ్రెంచు సేన్ల ఆధీనం లో ఉన్న ప్రాంతానికి పారిపోవాలని నిశ్చయించుకుంటుంది.

ఆమె లానే కొందరు పౌరులు  – ఒక బండి మాట్లాడుకుని, తెల్లవారకముందే ఊరు విడిచి పోయేందుకని సిద్ధం అవుతారు. వాళ్ళలో ఇద్దరు క్రైస్తవ సన్యాసినులు (నన్ లు), ఒక వ్యాపారస్థుడూ, అతని భార్య, ఒక విద్యా వేత్త – ఒక చిన్న సైజు జమీందారూ (కౌంటు), అతని భార్యా,  వగైరాల మినీ ఫ్రెంచు బూర్జువా సమాజం, ఈ వేశ్య తో కలిసి ఒక మంచు కురుస్తున్న చల్లని శుభోదయాన ఆరు గుర్రాలు పూనిన బండి లో ఆవల ఫ్రెంచు సేనల అదుపులో ఉన్న ప్రాంతానికీ, ఇంకా వీలైతే ఇంగ్లండ్  కీ పారిపోదామని బైల్దేరతారు.


నిజానికి  వీళ్ళు తమ పలుకుబడిని ఉప్యోగించి  ఆ ప్రాంతానికి రాజు లాంటి జెర్మన్ సైనికాధికారి దగ్గర ప్రయాణానుమతి పత్రం తీసుకుని వుంటారు. అయినా ఏదో భయం, టెన్షన్!   తెల్లారి బయల్దేరిన వీళ్ళ బండి, రాత్రంతా కురిసిన మంచు గడ్డగట్టడం వల్లా,  దూదిలా ఇంకా జల జలా రాలే మంచు, అది  కలిగించిన బురద, జారుడూ, వల్ల నెమ్మదిగా సాగి,  బ్రేక్ ఫాస్ట్ టయానికి చేరాల్సింది కాస్తా అనుకున్న గ్రామం చేరుకోవడానికి రాత్రి అవుతుంది. అంత  వరకూ,  తినడానికి గానీ, తాగడానికి గానీ ఏమీ తెచ్చుకోని ఈ బూర్జువా ప్రాణుల్ని ఈ           వేశ్యే తను దారి కాపు కని తెచ్చుకున్న ఆహార పదార్ధాలిచ్చి, వైను,  ఇచ్చి నిలబెడ్తుంది.  


బండి లో కూర్చుని, తము వొదిలి వచ్చిన గ్రామ వాసుల దేశభక్తిని పొగుడుకుంటారు.  తాము స్వయంగా యుద్ధం నుండీ పారిపోతున్నా కూడా !  ఓ వేళ  పరిస్థితులు ఇంతకన్నా దారుణమౌతాయేమో చెప్పలేం అని తమ  చర్యల్ని తామే సమర్ధించుకుంటారు.   Ball-of-Fat  తన అనుభవాల్నీ చెప్తుంది.   'నన్లు'  తాము గాయపడిన ఫ్రెంచు సైనికుల సేవ చెయడానికి వెళ్తున్నామని చెప్తారు.  ఇలా  తమ తమ కారణాలు చెప్పుకుని, తాము  గ్రామం నుంచీ కదలాల్సిన అవసరాన్ని సమర్ధించుకుంటారు. 


మొదట బండి బైల్దేరగానే,  తమ తోటి ప్రయాణీకురాలు గ్రమం లో పేరు పొందిన వేశ్య అని తెలవగానే,  ఆ భద్ర మహిళలూ, మర్యాదా పురుషోత్తములైన పురుషులూ, గుసగుసలు పోతారు. మహిళల గుస గుసలు కాస్తా అవమాన కరంగా, పెద్దగానే వినిపిస్తాయి.  అవమానం  భరిస్తూ, చిర్నవ్వుతో నిర్లక్షమైన చూపుల్ని విసిరి, బాల్ ఆఫ్ ఫేట్ తన సహజ ప్రవృత్తి తో నిలకడ గా కూర్చుంటుంది.      రోజు  కొంత గడిచీ సరికీ గొంతెండిపోయి, ఆకలికి కరకర లాడిపోతున్న  వాళ్ళకి మొహమాటంగా తన తో తెచ్చుకున్న ఆహారాన్ని  ఆఫర్ చేస్తుంది. మొదట ‘మర్యాద’, ‘సంస్కారం వగైరాలు అడ్దొచ్చినా, ఆకలి భరించలేక, అందరూ వాట్ని తీసుకుంటారు, నిర్లజ్జగా లాగిస్తారు. వాళ్ళ కడుపులు నిండేసరికీ, బాల్- ఆఫ్- ఫేట్  కూడా సంత్రుప్తి చెందుతుంది.


వాళ్ళు ఆఖరికి 'టౌటస్' అనే ఆ ఫ్రెంచు గ్రామం చేరి అక్కడ రాత్రి బస చెయ్యడానికో విడిది (హోటలు/Inn) ముందు ఆగుతారు. వాళ్ళకి బయట జెర్మను భాషలో సైనికుల బూట్ల టక టకలు స్వాగతం చెప్తాయి. నిజానికి  ఈ విడిది ని జర్మన్లు  పట్టుకుని, అక్కడ బస చేసి వుంటారు.  సరిహద్దుల్లో పారిపోతున్న పౌరుల్ని నిలువరించేదుకే ఈ ఎత్తుగడ.


వాళ్ళని ఆ 'ఇన్' లో వుండనిస్తారు. అయితే  అక్కడి దళాధికారికి ‘ఫెయిత్’ కి  'బాల్-ఆఫ్-ఫేట్' వచ్చిన సంగతి ఆకర్షిస్తుంది.   ఆమె అసలు పేరు 'ఎలిసబెత్ రౌసెట్'.  ' ఫెయిత్' హోటెలు యజమాని ద్వారా 'మిస్ ఎలిసబెత్ రౌసెట్' ని రమ్మని కబురు చేస్తాడు. ఆమె  సంకోచిస్తూనే వెళ్ళి,  భుగ భుగలాడుతూ వెనక్కి వస్తుంది.  నిజానికి  ఆమె అతన్ని తిరస్కరించి వస్తుంది. 

బండి లో వచ్చిన మిగిల్న వాళ్ళకి కధ అర్ధం అవదు. మర్నాడు వాళ్ళు తీరా అక్కడ్నించీ బైల్దేరబోయే వేళకి గుర్రాలు పూనని  బండి వాడు తనను జెర్మన్లు బండి కట్టొద్దన్నారని చెప్తాడు.  వాళ్ళు ఫెయిత్ దగ్గరకెళ్ళి, అక్కడ్నించీ బైల్దేరడానికి పెర్మిషన్ అడుగుతాడు.  అతను ఒప్పుకోడు.  పిల్లీ ఎలుకా ఆట లా అవుతుంది.

అక్కడ అలా ఓ రెండు మూడ్రోజులు ఆపబడ్డాకా, వాళ్ళకి తాము ఫెయిత్ చేతిలో బందీలమని, రౌసెట్ అతన్ని తృప్తి పరిస్తే గానీ అతను తమని వదల్డనీ స్పష్టంగా అర్ధం అవుతుంది. రోజూ  పొద్దున్న ఫెయిత్ రోసెట్ కోసం కబురు పెట్టడం, ఆమే అతన్ని తిరస్కరించడం జరుగుతూ ఉంటాయి. 

ఆమె ధోరణి మిగిల వాళ్ళని చిరాకు పుట్టిస్తుంది.  ఊరిలో బండి తోలే వాళ్ళను సైతం విడిచిపెట్టక అందరితోనూ సుఖాన్ననుభవించిన వ్యభిచారికి ఈ జెర్మన్ దళాధిపతి తో సమస్య ఏమిటో వాళ్ళకర్ధం కాదు.   విసుక్కుంటారు.  ఆమెను నయానా భయానా ఒప్పిస్తారు. ససేమిరా అన్న ఆ యువతి ని, క్లియో పాత్రా పేరు చెప్పీ, చరిత్ర లో త్యాగధనులైన  ఇతర స్త్రీమూర్తుల్ని గురించి చెప్పీ వొత్తిడి తెస్తారు.

ఆఖరికి  'నన్లు' తాము ఇన్ని రోజులు గా టోటెస్ లో నిలువరింపబడడం వల్ల అవతల యుద్ధం లో గాయపడ్డ సైనికుల్ని రక్షించలేకపోతున్నామనీ, ఇదంతా రోసెట్ తలచుకుంటే ఆపగలదనీ అంటూ తెగ బాధపడిపోతారు. ఆఖరికి  ఎలిసబెత్ రౌసెట్ దళాధికారితో రాత్రి గడపడానికి  ఒప్పుకుంటుంది.  ఆ రోజు ఇంక తౌటెస్ నుండీ బైల్దేరొచ్చని ఈ బూర్జువాలంతా ఆనందిస్తారు. పార్టీ జరుపుకుంటారు.  మర్నాడుదయం రౌసెట్, కమిలిన దేహంతో, భంగపడిన హృదయం తో, వెర్రిదాన్లా వస్తుంది. ఆమె తో ఎవరూ మాట్లాడరు. వాళ్ళ ఓదార్పేమీ లభించదు.   బాల్-ఆఫ్-ఫేట్  నివ్వెర పోతుంది. 

తీరా  'రౌసెట్' చేసిన త్యాగం గురించి ఎవరూ మాట్లాడరు. ఆమె మానాన ఆమెను వదిలేస్తారు.  బండి బైల్దేరాకా, ఎవరి భోజనం వాళ్ళు తెచ్చుకుని ఆరగిస్తారు. 'నన్లు' కూడా తాము తెచ్చుకున్న సాసేజ్ మిగిలిపోతే, కాయితం లో చుట్టుకుని దాచుకుంటారు తప్ప రౌసెట్ కి ఆఫర్ చెయ్యరు.  అసలు ఆకలి కన్నా వాళ్ళు తనని మలినమైన దానిలాగా, దూరంగా ఉంచడం, అవమానించడం కలిగించిన బాధ వల్ల రోసెట్ అనగా ఈ 'బాల్-ఆఫ్-ఫేట్'  వెర్రి గా  మూగబోతుంది. కళ్ళ  లోంచీ  నీళ్ళు కారిపోతుంటాయి.  దళాధిపతి చేతిలో పడి తన మనసుకు విరుద్ధంగా జెర్మను వాడ్ని సుఖపెట్టినందుకు తనని తాను నిందించుకుంటూ, ఈ పరిస్థితి లోకి చాకచెక్యంగా నెట్టిన ఈ నాగరికులు తనను పురుగు లా చూస్తూ, వాళ్ళలో వాళ్ళు మాత్రమే నాగరీకమైన సొగసు మాటలు మాట్లాడుకుంటూంటే, తన బ్రతుకు  మీద తనకే అసహ్యం పుట్టి దారంతా ఆ స్త్రీమూర్తి పొగిలి పొగిలి ఏడుస్తూనే వుంటుంది.  ఇదీ  కధ.

సరిగ్గా ఇలాంటి తెలుగు కధనే చదివిన జ్ఞాపకం రావచ్చు చాలా మందికి. విజయనగరం, బొబ్బిలీ ప్రాంతాల వర్ణనతో ఫ్రెంచు బుస్సీ మూక బొబ్బిల్ని దండెత్తగా అక్కడి వేశ్యామణి ఒకతె, ఇలానే బండి లో కొందరు బ్రాహ్మణులూ, కోమట్లూ.. వగైరా అగ్ర వర్ణాల వారితో కలిసి పారిపోతుండగా, సరిగ్గా ఇలానే మోసగింపబడి ఆఖరికి గుక్కెడు నీళ్ళకు కూడా నోచుకోక అవమానపడుతుంది. నిజానికి  ఆమె దయ తలచడం వల్లనే, మిగిల్న వాళ్ళకి ప్రాణాపాయం తప్పుతుంది.  లేకపోతే, యుద్ధంలో మదమెక్కిన సైనికుల మతి చలించితే, మాన ప్రాణాలు పోవడమెంతసేపు ?  ఈ  తెలుగు కధ ని గుడిపాటి వెంకటాచలం బహుశా ఈ మొపాసా కధ నుండే ప్రేరణ పొంది రాసుండాలి.  


Note : చలం రాసిన తెలుగు కధ పేరు మరచితిని.  తెలిసినట్టైతే, దయచేసి సూచించగలరు.  

    

10 comments:

పద్మవల్లి said...

సుజాతా, మంచి కధ ని పరిచయం చేసారు. ఈ కధని కొన్ని నెలల క్రితమే చదివాను, కానీ తెలుగు లోనా, ఇంగ్లీష్ లోనా, ఎక్కడ చదివానో కూడా అనేది గుర్తు రావటం లేదు. మోపాసా కధలు అప్పుడప్పుడూ ఒకటో రెండో తప్ప ఎక్కువగా ఏమీ చదవలేదు నేను. మిగిలినవి కూడా నెమ్మదిగా పరిచయం చెయ్యండి.

Sujata said...
This comment has been removed by the author.
Sujata said...

థాంక్స్ ఫద్మ గారూ.. నేను కధ ని ఇంగ్లీష్ లోనే చదివాను. తెలుగు లో చలం గారు రాసిన కధ ని కూడా ఎక్కడో చదివాను. ఇన్నాళ్ళకి ఈ కధ చదివేసరికీ ఆ కధ, రెండింటి మధ్యా పోలికా చూసి, అది గుర్తొచ్చింది. ఆ తెలుగు కధ ఎవరికైనా గుర్తొస్తుందా అని ఎదురు చూస్తున్నాను. వ్యాఖ్య కు చాలా థాంక్స్.

విజయ జ్యోతి said...

కథ బాగుంది సుజాత గారు. మంచి కథని పరిచయం చేసారు. ఈసారి లైబ్రరీ కి వెళ్ళినప్పుడు దొరుకుతుందేమో చూస్తాను.

తృష్ణ said...

పరిచయం బాగుందండి. ఈ కథ గురించి విన్నాను..పేరు నాకూ గుర్తురావట్లేదండి. ఎవరినైనా అడిగాలి..

శారద said...

ఈ కథకి నా తెలుగు అనువాదం ఈ మాట లో వచ్చింది.
శారద
http://www.eemaata.com/em/issues/201203/1921.html

సిరిసిరిమువ్వ said...

ఈ కథని శారద గారు అనువదించారు..ఈమాట వెబ్ పత్రిక లో వచ్చింది. పద్మా మీరు ఆ అనువాదం చదివి ఉంటారేమో!

"కొవ్వుపుంజి"..శారద గారు పేరు భలే పెట్టారనిపించింది.

http://www.eemaata.com/em/issues/201203/1921.html?allinonepage=1

Suresh Kolichala said...

ఈ కథను నీలాంబరి శారద గారు కొవ్వుపుంజి అన్న పేరుతో చేసిన అనువాదం ఈమాటలో ప్రచురితమయ్యింది.

ఈమాట » కొవ్వుపుంజి

Sujata said...

Sarada garu, Good Job. Very elaborate translation.. waow. Enta opika ga rasaro meeru.

Varoodhini garu, Thx
Suresh garu, Thx

BTW,


అయ్యో ! నేను కధని ఇంగ్లీష్ లో చదివాను. మొపాసా కధల కలక్షన్ లో - కానీ నా సందేహం చలం గారు రాసిన విజయనగరం, బొబ్బిలీ నేపధ్యంలో రాసిన ఇదే కధ (తెలుగు లో !) పేరు గురించి. క్విజ్జు కాదు. నిజంగానే చలం రాసారు. నేను చదివిన ఏకైక చలం కధ కాబట్టి, చలం పేరు గుర్తు ఉండిపోయింది. కానీ కధ ఎక్కడో ఎవరికీ అందకుండా పోయి వుండొచ్చు. అన్వయం కాబట్టి, చలం/publishers కూడా దాన్ని ప్రమోట్ చేసుకుని వుండరు.

Mauli said...

సగం చదవగానే ముందు కధ తెలిసిపోయింది. ఎక్కడో చదివాను కాని అది చలం కధ అవునా కాదా అని తెలీదు . పొతే మీ వ్యాసం లో కొన్ని చమక్కులు (మీవో, రచయితవో మరి )

--> ఇలాంటి దీనమైన యుద్ధపు రోజుల్లో వేశ్యల బ్రతుకు ఎంత దుర్భరం ? -- హహ
-->అంత వరకూ, తినడానికి గానీ, తాగడానికి గానీ ఏమీ తెచ్చుకోని ఈ బూర్జువా ప్రాణుల్ని ఈ వేశ్యే తను దారి కాపు కని తెచ్చుకున్న -- :)

మళ్ళీ ఇప్పుడు వివాహేతర సంబంధాలపై వ్యతిరేకత తగ్గుతున్న ఈ కాలం లో ఇటువంటి కధలు అందుబాటులో ఉండటం చాలా అవసరం