Pages

30/08/2008

పురుష ప్రపంచం !

ఈ మధ్య నన్ను, కొందరు - నా బ్లాగ్ నూ 'ఆడ వాళ్ళ తరహా ... బ్లాగ్ ' కాదనేసారు ! [ స్త్రీ పక్షపాతం అని ఇంత పొడుగు వ్యాసం రాసినా కూడా.. ] అందుకే ప్రతి-కక్ష తో నాకు వచ్చిన మెయిల్ ను పొస్ట్ చేస్తున్నాను. ఇది ఎవర్నీ హర్ట్ చెయ్యడానికి కాదు. స్పెల్లింగ్ మిస్టేక్ లు 'మెన్ ఆర్ ఎవ్రీ వేర్ ' అనే కాన్సెప్ట్ కోసం పుట్టించేరనుకుంటా! ఈ మధ్య మీకూ ఈ మెయిల్ వచ్చి ఉంటే క్షమించెయ్యండి !

Woman has Man in it
> Mrs has Mr in it
> Female has male in it
> Madam has Adam in it
> She has he in it
>
> Ever notice how all of women's problems start with MEN?
>
> MENtal illness
>
> MENstrual cramps
>
> MENtal breakdown
>
> MENopause
>
> GUYnecologist
>
> AND ..
>
> When we have REAL trouble, it's a
>
> HISterectomy.


ఈ మెయిల్ పంపిన మా ఫ్రెండ్ కు క్షమాపణలతో ..

21/08/2008

టీ వీ లో భక్తి

ఇంట్లో పెద్దవాళ్ళున్న వాళ్ళు ఈ టీవీ భక్తి అనే కాన్సెప్ట్ ను బాగా అర్ధం చేసుకుంటారు. పొద్దున్న లేవగానే ప్రవచనం, కొంత సేపటికి రామాయణం, కాఫీ, టిఫినూ అయ్యాక, కీర్తనలో - ఇంకో భాషలో ఓం నమశ్శివాయ లాంటి ఓ సీరియల్ - క్రైస్తవులైతే వారికి సువార్త సభలో, నిదర్సనాలో.... ఇలా టీ వీ లో ప్రసారమయ్యే భక్తి కార్యక్రమాలు చాలా పెద్ద యెత్తున పెరిగిపోవడం గమనించారా ? భక్తి, సంస్కృతి లాంటి చానెళ్ళే కాక, ప్రతి పాపులర్ చానెల్లోనూ భక్తి ప్రధానమైన సీరియల్ తయారు.


టీవీ భక్తి చాలా సంక్లిష్టమైనది. విశాఖపట్నం లో గురజాడ కళాక్షేత్రం లో ఏదో ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్ళాలనుకోండి - ఆ జన సముద్రంలో బండి ఎక్కడో దిగి, నడుచుకుని వెళ్ళి, లోపల ఆ కాంక్రీటు బెంచి మీద ఆరుబయట కూర్చుని, వర్షం వచ్చినా, చలి గాలి వీచినా, వీపు ఆనడానికి సౌకర్యం లేనందున ఎక్కువ సేపు కూర్చోలేక నానా అవస్థా పడాలి. కార్యక్రమం అయ్యాకా, పుస్తకాలో ఇంకొటో, కొనుక్కోవాలనిపిస్తుంది ! పైగా అంతా తొక్కిడి - శ్రమ!


మొన్న పెరేడ్ గ్రౌండ్స్ లో శ్రీనివాస కళ్యాణం గుర్తుందా - ఇలాంటి బహిరంగ కార్యక్రమాలకు వెళ్ళటం చాలా కష్టమైన పని- ముఖ్యంగా వయసు లో పెద్ద వాళ్ళకు. So, టీవీ పుణ్యమా అని వీళ్ళ పంట పండింది. ఇంట్లో నే రిమోట్ మీటలు నొక్కుతూ రక రకాల భాషల్లో - దేవుళ్ళని కొలిచేస్తున్నారు! శ్రవణం - కీర్తనం - అని ఏవో మార్గాలున్నాయి కదా - ఇప్పుడు వీక్షణం (దర్శనం కాదు) ద్వారా కూడా భక్తి ప్రకటిస్తున్నారు. చిన్న పిల్లలూ, పెద్ద వాళ్ళూ ఉన్న ఇళ్ళలో - గొడవలు వచ్చేస్తున్నయి. పిల్లలకు కార్టూన్ కావాలి. పెద్దలకు భక్తి చానల్ కావాలి.


కానీ పాపులర్ టెలివిజన్ లో భక్తి ప్రసారాలు జ్ఞానాన్ని పెంచుతున్నాయా - పెద్ద వాళ్ళు ఖచ్చితంగా భక్తి చానెలే ఎందుకు చూడాలి ? పుస్తక పఠనం లేదా ఇతర హాబీలు నిషేదమా ? ముసలైపోతే ఇంక జీవితం అంతేనా - అని కొన్ని అనుమానాలు వచ్చినా - సరే వాళ్ళకిష్టమైనది చూడనీలేమ్మని అనిపిస్తుంది.


అయితే పొద్దున్న లేచిన దగ్గర్నించీ భక్తి (టీవీ) మోత భరించగలమా ? పొద్దున్నే వీధి చివర గుళ్ళో అతి రహస్యమైన లలితా సహస్త్ర నామ స్త్రోత్రం - మైకుల్లో వినిపిస్తుంది. అది ఏదో కేసెట్టో, రికార్డో కాక ఎవరో లోకల్ భక్తురాలో, పిల్లలో చదివినది అయితే కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది.


టీవీలో రామాయణం సిద్ధం. అమ్మయ్య రామాయణం serial అయిపోయింది అనుకునేసరికీ 'ఉత్తర రామాయణం' మొదలయింది. ఇదయ్యాక - చర్చీ లో ప్రార్ధనలు - పాటలు - అదయ్యాక తమిళుల అమ్మవారి గుడిలో వారి పాటలు - తరవాత - ఇంకోటి - అయిదుపూటలా నమాజు ! ఇలా ఇంత భక్తి వాతావరణం లో జీవించేస్తే మనం ఎంత పవిత్రులం అయిపోవాలి ?


టీవీలో భక్తి ఒక్క ఇంటికి పరిమితం కాదు. అందరి ఇళ్ళలోనూ ఇదే పరిస్థితి. టీవీ కోసం పోట్లాటలు జరుగుతున్నాయని - రెండు మూడు టీవీలు కూడా మైంటైన్ చేస్తున్న వారున్నారు. నా ముసలితనం లో నేనూ దేవుని కోసం, దేవుని చేరడం కోసం అలమటిస్తానేమో!

ఇలా ఇంటా బయటా భక్తి రెండు వైపులా వాయిస్తుంటే - అయ్య బాబోయ్ ! ఎందులోనూ అతి వొద్దు నాయనోయ్ ! అనిపిస్తుంది.

టీవీలో ప్రసారమయ్యే ఇతర కార్యక్రమాలు (కేవలం వార్తలూ, భక్తీ కాకుండా) పెద్ద వాళ్ళు ఎందుకు చూడరో ఎవరూ వివరించలేరు.

టీవీ భక్తి లో శారీరక శ్రమ ఉండదు. కేబులు వాడికి (వీరి మోనార్క్ భక్తి చానెళ్ళ ప్రసారాలో ప్రస్ఫుటం) ఇవ్వల్సిన డబ్బు మినహా టికెట్టూ, లంచాలూ ఇవ్వనక్కర్లేదు. డైరెక్ట్ టు హోం ప్రసారాలలో భక్తి ప్రసారాలు తక్కువ. అందుకే కేబులు వాళ్ళ రాజ్యం నడుస్తుంది.

ముసలితనాన్ని భక్తి చానెల్తో ఐడెంటిఫై చేసుకోవడం అలవాటయిపోతున్నది. ఈ టీవీ భక్తి కి ఎడిక్ట్ అయిపోకుండా - ఇంట్లో మిగతా వాళ్ళతో కలిసి హాయిగా గడపటమో - వ్యాహ్యాళికో వాకింగ్ కో పోవడం, హాబీలు పెంపొందించుకోవడం - ఇలా ఇతర వ్యాపకాలతో పొద్దు పుచ్చే వారు తక్కువ అయిపోయారనిపిస్తుంది.


మనలో మన మాట - మీలో భక్తి బాధితులెందరు ? మైకు ల్లో భక్తీ, వీధుల్లో భక్తీ - టీవీలో భక్తీ కాకుండా - శ్రద్ధగా పూజో ప్రార్ధనో చేసుకోగల వాళ్ళు ఎంత మంది ? అసలైన ఆధ్యాత్మిక చైతన్యం ధ్యానంలో ఉందా టీవీ ప్రసారాల్లో ఉందా ?

పూర్వకాలంలో పండితులూ, పామరులూ అని రెండు రకాల వారు ఉండే వారుట. పామరులకు (చదువు రాని వారికి) చేరువగా భక్తిని, దేవుణ్ణి తీసుకుపోవడానికి భక్తిని చాలా సులభతరం చేసారుట. సులభమయిన భక్తి మరీ పలుచన అయ్యి మరి ఇప్పుడు పెద్ద వ్యాపారంగా తయారయింది. గుడికి వెళ్తే వ్యాపారం - టీవీ చూసి పెట్టీ బోల్డు వ్యాపారం ఇచ్చేస్తున్నాం ఆయా నిర్మాతలకు.


మానవ సేవే మాధవ సేవ - అదే భక్తి ! అదే దేవుణ్ణి చేరే సులభ మార్గం. అన్నీ తెలిసిన పెద్దలే భక్తి ఎడిక్షన్ చూసి కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది. మూఢ భక్తి - డ్రాయింగ్ రూం లోకి చొచ్చుకు వచ్చినప్పుడు మనలో ఎందరం దాన్ని ఎంత వరకూ ప్రతిఘటించగలం ? టీవీ చూసి మనం తరించిపోతే అంత కన్న జోక్ ఏముంది ?


ఎవరి భావాల్నైనా నేను హర్ట్ చేస్తుంటే క్షమించండి. భక్తి మాత్రమే ముసలి తనాన్ని గడపడానికి సాధనం కాదు. ముసలి తనం లో చేవ ఉన్నంత వరకూ మనం ఏదో పని చెయ్యడానికి ప్రయత్నించడం మంచిది.


ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే - అతి టీవీ భక్తి కూడా ఎడిక్షనే ! దీని బారిన పడకండి.

20/08/2008

కొన్ని ఫోటోలు !













మా చెల్లి తీసిన కొన్ని ఫక్తు ఎమెచ్యూరు ఫోటోలు - మా విశాఖపట్నానివి!

19/08/2008

నేనొచ్చేసా! ఊర్నించి !!




...... వచ్చీ సరికీ.. నా బ్లాగ్ లో అదెప్పుడో యూట్యూబ్ షేర్ ఆప్షన్ లో పోస్ట్ చెయ్యడానికి ప్రయత్నించి విఫలమయిన మూడు పోస్టులు ప్రత్యక్షం అయ్యాయి. ఇదొక ఆశ్చర్యం. దీని సంగతేమిటో తెలియలేదు. పెద్ద బ్లాగర్లు చెప్పాలి.

ఊర్లో ఉండగానే - ఈ విషయం నా మెయిల్ ద్వారా తెలిసి, ఒక పోస్టుని చెరిపేసాను. ఇప్పుడు తిరిగొచ్చి, నా బ్లాగు బాగోగులు చూసుకుంటూ.. సరే నా సెలవు ల సంగతి కూడా చెప్పాలనిపిస్తే - ఈ సోదంతా రాస్తున్నాను.


వెళ్ళేటప్పుడు ఆర్.ఏ.సీ లో కూర్చోవడానికి మాత్రం - సీడు లోయెరు బెర్తు దొరికింది. సుజాత గారే గుర్తొచ్చేరు. మా ఇద్దరికీ తెలిసిన సీక్రెట్లన్నీ గుర్తొచ్చేయి! కొన్ని ఫీలింగ్స్ కలగాపులగం అయిపోతుండగా.. నా సహ-పాంధుడు గారు జేబు లోంచీ సెల్ ఫోను తీసి, దానికి చెవి వాణి తగిలించి (ఇయర్ ఫోన్లు ) ఇక కబుర్లు అందుకున్నారు. కనీసం నాలుగు గంటలపాటు ఆయన ఇప్పటి జన్మ రహస్యాలూ, ఆయనకొచ్చిన ఎప్రైసలు సెనక్కాయలూ, దాని గురించి ఆయన భావనలూ, బలాలూ, బలహీనతలూ, ఉద్యోగం, సామజిక స్థితి అన్నీ - అదీ ఇదీ అని కాకుండా ఏకమొత్తంగా ఏకపాత్రాభినయం తో సినిమా చూపించేసారు! క్లైమాక్స్ లో ఏముండేదో గానీ చాలా అదుర్ష్టవశాత్తూ, నాకు బెర్తు దొరికింది.


ఈ లోగా ఆ దగ్గర్లోనే కూర్చున్న ఇతర పాత్ర ధారులంతా కూడా చాలా మటుకూ జీవితాన్ని పాకెట్ దూరవాణుల్లో శృతించేసుకుని తమ కార్య కలాపాలను చెక్కబెట్టేసుకున్నారు ! ఇందరి మాటల్ని చెవి ఒగ్గి (బలవంతాన) వినవలసి రావడం నా దురదృష్టం - అదేంటో నాకెవరూ ఫోన్ చెయ్యరు ! చేసినా, నీకు బెర్తు దొరికిందా అని ఆందోళనో, హేపీ జర్నీ అని శుభాకాంక్షో విసిరేసి, వెంటనే ఫోను పెట్టేస్తారే కానీ - ''అమ్మాయ్ ! ఏదీ నీ జీవిత కధనం చెప్పు !'' అనరు.



నేను చాలా ప్రైవేటు మనిషిని. నాకు ప్రైవసీ అంటే ప్రాణం! అది ఎవరి ప్రైవసీ అన్నా సరే - దాన్ని అవసరం కన్నా ఎక్కువ గౌరవించేస్తూ ఉంటాను ! వీళ్ళెవరికీ వాళ్ళ ప్రైవసీ అంటే గౌరవం లేకపోతే పోయే - కనీసం నా ప్రైవసీ లోకి చొచ్చుకు వచ్చేసి వాళ్ళ సెల్ సంభాషణల్లోకి నన్ను ఇరికించడానికి ఎందుకా విశ్వప్రయత్నం చేస్తున్నారా అనిపించించింది.



వీళ్ళు ఇలా మాట్లాడి - ఉదా : మీకు విడమరచి చెప్తానుండండి - ఒకాయన లాప్ టాప్ బాగు తీసుకొస్తాడు - తల మీద జీన్స్ టోపీ, దాని మీద అదిరిపొయ్యే స్లోగనూ, ఖాకీ రంగు జీన్ ఫాంటూ, నీలం రంగు కాఫీ షర్టూ వేసుకుని ప్రత్యక్షం అయ్యి, ఫోను తీసి - అయాం ఫలానా అండీ గురువు గారూ - అయాం సో సారీ అండీ - మాది ఒక ఫర్మ్ అండీ - నా పార్ట్నర్ మన రాయశేఖర్ రెడ్డి కొడుకు లేడండీ - జగన్ - అతని క్లోసు ఫ్రెండ్ అండీ - వుయ్ హావ్ టూ ఆఫీసెస్ అండీ! ఒన్ బ్రాంచ్ ఈస్ అట్ బేగంపెట్ అండీ - సెకండ్ ఈస్ అట్ గచ్చిబౌలి అండీ !...... అని ఒక రెండు గంటల సేపూ చెవి కోసిన మేక లాగా పెద్ద గొంతు తో అరుస్తూ ఉంటే ఆ మనిషి మీద ఎటువంటి అభిప్రాయం కలుగుతుంది ? బాబొయ్ ఈయన మాట్లాడ్డం ఎప్పుడు కట్టేస్తాడా అనిపించదూ ? పైగా - అయాం నియర్ అట్ రాజమండ్రి అండీ ! అని హస్కీ - మాచో వాయిస్ తో కనీసం ఒక ముప్పయి మందికి ఫోను చేసి చెప్తుంటే - కొన్ని సార్లు జీవితం మీద విరక్తి కలుగుతుంది!


ఇలా నా రైలు ప్రయాణం రక రకాల ప్రయాణీకులూ - వారి సెల్ మోడెళ్ళూ, వారి జీవితాలనూ స్పృశిస్తూ (లిటరల్ గా కాదు లెండి) సాగిపోయింది. నాకు అత్యవసరమైతే తప్ప సెల్ ఫోన్లో మాట్లాడబుద్ధెయ్యదు ముఖ్యంగా ఎ.సీ. కోచుల్లో! ఎవరైనా నా మాటలు వింటారేమో అనే స్ప్రుహ నాకు ఉంటుంది. విన్నారే పో - అయితే నాకేంటి అనే అలోచన నాకు రాదు. ఎందుకులే నావల్ల వారికి డిస్టర్బన్స్ అనిపిస్తుంది. నా ఈ దృక్పధం తప్పేమో తెలియదు.


ఊరెళ్ళి - అనుకున్నట్టు గానే మా అక్క నూ చెల్లినీ కలుసుకుని - సంపత్ వినాయకుడి గుడికీ, వేంకటేశ్వరాలయానికీ, బీచ్ కీ వెళ్ళొచ్చేసేను. ఋషికొండ వెళ్ళలేకపోయాను. సింహాచలం గ్రహణం సందర్భంగా మూసెయ్యటంతో అది కూడా చూడలేదు. మా చెల్లీ నేనూ కొంచెం ఫోటోలు తీసి - కళాపోషణ కూడా చేసేము ! ఒక సాయంత్రం అక్క, నేనూ కలిసి - ఇంట్లో గాన కచేరీ చేసేము. ఇంతలో అక్క కొడుకు కూడా పాట అందుకున్నాడు ! వీడికి ఎలా అయినా సంగీతం నేర్పించీయాలని అక్క మీద ఒత్తిడి తెచ్చేము! చాలా పెంకితనం, ఇష్టమయినవి తినడం, ఇష్టమయిన కుర్చీ కోసం కొట్టుకోవడం, షాపింగ్ చెయ్యడం, టీవీ లో సినిమాలు చూడటం - ఇలా బోల్డంత సందడి చేసి గప్ చుప్ గా సోమ మంగళ వారాల్లో ఎవరి ఆఫీసులకీ /ఇళ్ళకీ వాళ్ళం ప్రయాణం కట్టేము !


తిరిగొచ్చేటప్పుడూ, సెల్ బాధలు పడ్డాను తోటి ప్రయాణీకులతో - అయితే ఇక్కడ కొంచెం పుస్తకపఠన సౌకర్యం కలిగింది. ఇక్కడ కొంచెం ప్రేమ బాధ కూడా పడ్డాను. ఇద్దరు రొమాంటిక్ కపుల్ - ఒక పెళ్ళయిన జంట, ఒక పెళ్ళి కాని జంట - వాళ్ళ ప్రేమ - రొమాన్సూ చూసే సౌభాగ్యం కలిగింది. At last, మా ఆయన కి ఒక ఎస్.ఎం.ఎస్. చేస్తే ఫోన్ చేసారు ! నేను కూడా ఏదో చించేద్దాం - ఫోను నాకూ ఉన్నట్టు అనుకుని డిసైడ్ అయ్యేసరికీ కాల్ కట్ అయింది. నా మొహం లానే మా రొమాన్సూ ఏడిచిందనుకుని, పుస్తకం చదువుకుని, పదిన్నరకి పడుకున్నాను. తెల్లారేసరికీ సికందరాబాదు - అదే ఆఫీసూ, అదే బాసూ, బాసు చెంచాలూ, ఫోర్కులూ - అదే ఇల్లూ చూసి ఏడుపొచ్చింది !

16/08/2008

అమ్మ !

అమ్మ ! సాయంత్రం బంతి కనబడక పోయేంత వరకూ పొద్దు పోనిచ్చి ఇంటికి చేరినపుడు - మన కోసం ఎదురు చూసుకుంటూ, ఆత్రం కనబరిచే అమ్మ ప్రేమ ను చెక్కగా వ్యక్త పరిచే ఈ పాట - లతా మంగేష్కర్ గొంతులో ! సినిమా దృశ్యాలు పక్కన పెడితే అత్భుతమైన పాట. రెహ్మాన్ కు ఒక ''జై '' కొట్టాలనిపింప జేసే పాట !

స్వాన్ లేక్ - యూ ట్యూబ్ లో !

జీవితంలో మొదటిసారి బాలె చూసాను అదీ బీబీసీ-4 లో ! కళ్ళు చెదిరే నృత్యం, భారీ సెట్లు, అత్భుతమైన సంగీతం, అత్యంత గౌరవంగా ఈ బాలేను చూసే అత్భుతమైన ఆడియన్స్ ; అత్భుతమైన వ్యాఖ్యానం, నన్ను కనీసం మూడు గంటల పాటూ టీవీ కి కట్టి పడేసాయి. అనుకోకుండా ఈ బాలే వీడియో అన్ని భాగాలూ యూట్యూబ్ లో దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

బాలే - నృత్య రూపకం - ప్రధానంగా వ్యాఖ్యాత చెప్పే కధలోకి మనల్ని తీసుకుపోతుంది. మరి ముఖ్యంగా ఈ 'స్వాన్ లేక్' బాలే పూర్తిగా రష్యన్ కాబట్టి - ఇంగ్లీష్ లో కధ చెప్పే ఈ వ్యాఖ్యాత మీద పూర్తిగా ఆధారపడాలి. నేను చూసినది టీ.వీ లోనే అయినా ఎంతో మంచి అనుభవాన్నిచ్చింది ఈ బాలే!

చూడటానికి ఇంటెరెస్ట్ ఉన్నవాళ్ళు చూడొచ్చు. కధ ఇది. ఒక రాజకుమారుడు, వేటకు పోయి దారి తప్పి స్వాన్ లేక్ కు వెళ్తాడు. అక్కడ పగలు స్వాన్ గా, రాత్రి అందమైన అమ్మాయిగా మారిపొయే రాజకుమారి ని చూస్తాడు. అతని గుండెలో ఆ అమ్మాయి ముఖం చిత్రించుకుపోతుంది. అయితే శాపగ్రస్త అయిన ఆ అమ్మాయి పొద్దెక్కే లోగానే, తన సఖులందరితో సహా మళ్ళా హంస లా మారిపోతుంది. ఈ విషయం తెలియని రాజకుమరుడు తిరిగి తన పాలెస్ కు చేరుకున్నా, ఈ అమ్మాయి ఊహల్లోనే గడుపుతూ ఉంటాడు.

ఈ ఊహాసుందరి ని అలా స్వాన్ లేక్ కు బంధించేసిన మాంత్రికుడూ, రాణీ గారూ, రాణీ గారు తీసుకొచ్చిన మాయ లేడీ (ఇంకో రాకుమారి)... అ మాయ లేడీ మాయలో పడిపోయిన మన రాకుమారుడూ, ఆఖరికి నిజం తెలుసుకుని నిజం రాకుమారి దగ్గరకు వెళ్ళటం, మాత్రికుడిని చంపి, రాకుమారిని, ఆమె సఖులనూ రక్షించడం - ఆ తరవాత ఏముందీ - సుఖాంతం.

కధ మధ్య మద్యలో, ఘట్టానికీ ఘట్టానికీ మధ్య చెప్పబడుతుంది. కాబట్టి, సస్పెన్స్ నిలిచే ఉంటుంది. బాలే చూడటం ద్వారా, రష్యన్ కళాకారులు మన ముందు ఆవిష్కృతం చేసిన ఈ అత్భుతాన్ని చూసి మనం చాలా సేపు ఆనందాంబుధిలో ఓలలాడటం ఖాయం. నేను చూసిన బాలే, లండన్ లో ఒక ఠియేటర్ లో, లండనర్ల కోరిక మీద విచ్చేసిన రష్యన్ బృందం ఇచ్చిన ప్రదర్సన. యూట్యూబ్ లో ఉన్నది వారు అమెరికా లో ఇచ్చిన ప్రదర్సన. (పార్టులు గా ఉన్నయి) నేను ఇక్కడ చూపించింది ఫినాలె! దీన్ని బట్టీ ఈ బాలే మీద ఒక అభిప్రాయం ఏర్పరచుకోవచ్చు. ఆసక్తి ఉన్న వాళ్ళు కాస్త వెతుక్కుంటూ, మొత్తం బాలే ను చూడొచ్చు.

13/08/2008

ఒక నాల్రోజులు సెలవులోచ్!

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సెలవులు కలిసి రావడం తో, చాలా రోజుల తరవాత మా వూరు వెళ్తున్నాను. మనసంతా చాలా మంచి ఫీలింగ్స్.. వొద్దు వొద్దులే అనుకుంటున్నా.. ఏవేవో ఎక్స్పెక్టేషన్స్! వుంటూనే వున్నాయి. చాలా హాపీ గా వుంది.

ఎన్నో నెలల తరవాత అప్పచెల్లెళ్ళం కలుసుకోబోతున్నాం. మా అక్క కొడుకు ను కూడా దాదాపు ఏడాదిన్నరతరవాత చూడబోతున్నాను. వైజాగ్ ఎంతగా మారిపోయిందో - కొత్త షాపులూ బోల్డు వచ్చుంటాయి. ఎం.వీ.పీ కాలనీ లో వేంకటేశ్వాలయానికీ, సింహాచలం, బీచ్ వెళ్ళాలని అనుకుంటున్నాను. చూడాలి, పరిస్థితులు ఎంతవరకూ అనుకూలిస్తాయో !


ఈలోపు ముఖాముఖి గా కలుసుకోబోతున్న ప్రమదావనం స్నేహితులందరికీ (ఉడుక్కుంటూ !) అభినందనలు.

అన్నట్టు దేశభక్తులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !
అమ్మవారి భక్తులకు శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు !!
అన్నయ్యలూ చెల్లెళ్ళందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు !!!

నేను వూర్నుంచొచాకా, సుజాత గారి ద్వారానో, జ్యోతి గారి ద్వారానో - విశేషాలు తెలుసుకుంటాను.

అంత వరకూ.......సెలవిప్పించండి !

11/08/2008

ఆనందమానందమాయె!





ఆనందమానందమాయె! మనకు ఒలింపిక్ గోల్డ్ మెడెల్ వచ్చె!


చాలా మంది ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. అని పాడుకుంటూ ఉంటారు కదా! వచ్చేసింది!


జీవితంలో ఒక ఫిలాసఫీ ఉంది. మనుషులు ఏదయినా లేకపొతే, లేదు లేదు అని ఏడుస్తారు. ఉంటే.. ఇంకొంచెం ఎక్కువ కావాలని కోరుకుంటారుట. నేనూ అలానే, ఈ విజయాలు ఇక్కడితో ఆగిపోకుండా - మనం ఇంకొన్ని పతకాలు సాధించాలని కోరుకుంటూ .. మనకి ఈ స్వర్ణపతకం సంపాదించి పెట్టిన మన అభినవ్ భింద్రా కు బోల్డన్ని అభినందనలు !

09/08/2008

ఇంపైన వర్షం...

అందమైన వర్షాన్ని గురించి నిషిగంధ గారి కవిత , (& also the first lines of this) చదివాకా.. గుర్తొచ్చిన మంచి పాట.


వర్షాన్ని చూసి, అమ్మాయి మనసు లో ఎగసిపడే భావాలు - పాటగా వింటారా ? గిటార్ ఇష్టపడే వాళ్ళకి అంకితం.



06/08/2008

మీ చిరునామా ఏమిటి ?

ఎవరైనా గొప్పవాళ్ళ గురించి చెప్పేటప్పుడు - వారెంత గొప్పవారో వారి చిరునామా బట్టీ చెప్పేవారు. నీకు తెలుసా.. ఆయన ఎంత గొప్పవాడంటే, ఉత్తరం మీద ఆయన పేరు రాస్తే చాలు - తపాలా శాఖ వాళ్ళు తిన్నగా ఆయనకే ఆ ఉత్తరం డెలివర్ చేసేవాళ్ళు... అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనుషులు పెద్ద వాళ్ళయిపోయి - గొప్ప వాళ్ళు అవటం కూడా ఎక్కువ అయిపోతుంది. ఫలానా గొప్ప మనిషి అంటే తెలియట్లేదు. ఎడ్రెస్స్ తిన్నగా రాసినా ఉత్తరాలు మిస్ అవుతుంటాయి. ఎవరిదీ తప్పు లేదు... జనం ఎక్కువ అయిపోయారు గా మరి.


ఇప్పుడు అంతా మేయిళ్ళూ, ఫేక్స్ లూ.. టెలిఫోన్లూ అయిపోయాకా చిరునామా అంటే ఏమిటో ఎవరికీ తెలియట్లేదు. అయితె గ్రామాల్లో ఫలానా వాళ్ళ ఇల్లు ఎక్కడా అంటే.. చూపిస్తారు. మేమొకసారి హర్యాణా లో ఒక గ్రామం లో పెళ్ళికి వెళ్ళాం. పేరు పెట్టి అడిగితే తెలియలేదు. కులం ఏమిటి అని అడిగారు. పెళ్ళికొడుకు మా కొలీగ్! తన కులం ఏమిటో మాకూ తెలియదు. చచ్చేము రా భగవంతుడా ! అనుకున్నాము. ఆ గ్రామం ఆగ్రా-మథురా రోడ్ లో ఉంది. లైట్లు లేవు. రాత్రి కావస్తూంది. కులం తెలిస్తే గానీ ఇల్లు తెలీదు. ఎలాగో నానా కులాల పేర్లు ఆలోచించి.. జాట్ల పెళ్ళి ఎక్కడ జరుగుతుందని అడిగాం. ఆ ఇలాకా లో జాట్ లు ఉన్నారు గానీ వాళ్ళ పిల్లలు చిన్న వాళ్ళుట ! పెళ్ళి కెదిగిన పిల్లలు కారుట ! మాకు మిగతా కులాల పేర్లు తెలియదు. మొత్తానికి మాతో వచ్చిన ఒక నార్త్ ఇండియన్ కొలీగ్ మమ్మల్ని గట్టెక్కించింది. ఆవిడ రకరకాల ఆలోచనలూ, విశ్లేషణలూ చేసి, ఆ అబ్బాయి కులం గెస్ చేసి, చిరునామా సంపాయించుకొచ్చారు.


ఆఫీసులో ఒక సర్దార్జీ ఉండే వాడు. మేము ఎప్పుడూ లంచ్ టైం లోనో, కాఫీ టైం లోనో మాత్రమే కలిసే వాళ్ళం. ఇతను ఎంత ఔట్ స్పోకెన్ అంటే.. మేడం! మీ అడ్డ్రెస్స్ కేంటీనే! మీరు కావాలంటే కేంటీన్ లోనే దొరుకుతారు! అనే వాడు. అదీ - అందరి ముందూ! నేను 'బరువు బాధ్యతలు ' ఎక్కువయిన మనిషిని. కాబట్టి చాలా ఎంబరాస్ అయిపోయే దాన్ని.


ఇలా మన లక్షణాలో, కులాలో మన చిరునామా పట్టిస్తే సరే ! మరి ఎవరో తెలీని వ్యక్తిని చిరునామా లేకుండా పట్టుకోవడం ఎలా ? ఒక చిన్న సంఘటన చెప్తాను.


ఉత్తరాల విషయానికొస్తే, కొందరు ఎంత అమాయకంగా రాస్తారో వాటి మీద చిరునామాలు - ముఖ్యంగా ఆర్మీ లో కొందరు అమాయక సిపాయిలు ! వీళ్ళు సాధారణంగా గ్రామీణ ప్రాంతాలనుంచీ వచ్చిన వాళ్ళయి ఉంటారు. ఇప్పటి జెనెరేషన్ లో చదువుకున్న వాళ్ళూ, ఎమ్మే లూ ఎంబీయే లూ ఆర్మీ లో చేరినా... పూర్వ కాలంలో మాత్రం అంతగా చదువుకోని పేద యువకులు ఆర్మీ నౌఖరీ లో చేరే వాళ్ళు ! సాధారణంగా ఆర్మీ వాళ్ళ చిరునామాలు కోడ్ అయి ఉంటాయి. దేశం మొత్తం మీద ఎవరు ఎక్కడ ఉన్నారో పట్టుకోవడం - ఈ కోడ్ల ఆధారంగా మొత్తం ఉత్తరాలు చక్కగా బట్వాడా ఔతాయి. మరి ఆ కోడ్ గుర్తు లేదనుకోండి - ఎలా ?


ఈమధ్య నా చేతికి ఒక ఉత్తరం వచ్చింది. దీన్ని అసాం వెల్తున్న ఒక కొలీగ్ కి పొస్ట్ చెయమని రెక్వెస్ట్ తో అందజేయాలి. అది ఎవరు రాసారో తెలియదు. ఎవరికి వెళ్తుందో కూడా (వ్యక్తిగతంగా) నాకు తెలియదు. దాని మీద అడ్రెస్స్ చూసాకా, నవ్వొచ్చింది.
నేను పైన చెప్పిన అమ్మయకపు సిపాయి ఎవరో రాశారు దీన్ని !

దాని మీద చిరునామా ఇలా రాసి ఉంది. (ఇది మామూలు పోస్ట్ మేన్ కోసం రాసినది) (in Hindi script)

['Dehradun Railway Station me utar kar Ghadi Cantt wali bus me baith kar, Clement Town me x x x batallion me 'B' company me Sepoy x x x x x ko de dena..']

డెహ్రాడూన్ రైల్వే స్టేషన్ లో దిగి ఘడీ కేంట్ బస్సెక్కి, క్లెమెంట్ రోడ్ లో దిగి, అక్కడ ఫలానా బెటాలియన్ లో ఫలానా సిపాయికి ఈ ఉత్తరం ఇవ్వండి ! అని రాసి ఉంది.

ఎంత వివరంగా రాసారో కదా సిపాయి గారి చిరునామా అనుకున్నాను. ఇంతకీ అసలు విషయం ఏంటంటే ఆ ఉత్తరం నిక్షేపంగా చేరిపోయింది. భారతీయ పోస్ట్ వాళ్ళే బట్వాడా చేసారు. ఇక్కడ నిజంగా చిరునామా గొప్పదా, పోస్టలు వాళ్ళు గొప్పోళ్ళా తెలియట్లేదు. అంత బాగా చిరునామా రాస్తే ఎందుకు చేరవెయ్యరు అనుకుంటున్నారా ?

మరి మీ చిరునామా ఏమిటి ?

04/08/2008

స్త్రీ పక్షపాతం

స్త్రీ పక్షపాతం మీద పొద్దున్నే పెద్ద చర్చ లో ఆవేశంగా వాదించేసాను. ఎందుకో వాదించాలనిపించింది. అందరికీ అన్ని విషయాలమీదా బోల్డన్ని 'చెరపలేని అభిప్రాయాలు ' ఉంటాయి. బహుశా నాకూ కొన్ని గట్టి భావనలున్నాయి. వీటికి విరుద్ధమైన వాటి మీద అభిప్రాయాల్ని మనసుకి పట్టించుకోవాలంటే కష్టమే.

నేను 'ఫెమినిస్ట్ - హార్డ్ కోర్ ' తరహా ఏమీ కాదు. కానీ నేను pucca స్త్రీ పక్షపాతినే అనుకుంటాను.

అదేంటో.. కానీ పిల్లలని స్కూలుకి పంపి, వంటా, వార్పూ కానిచ్చి, ఇంటిపనులు చెక్కబెట్టుకుని, సిటీ బస్సులెక్కి పరుగులు తీస్తూ ఉద్యోగాలు చేస్తూ, ఆఫీసుకి అయిదు నిముషాలు లేట్ అయితే పనిష్మెంట్ కింద జీతాలు లేదా సెలవులూ కోల్పోయే ఆడవాళ్ళంటే నాకు కొంచెం సాఫ్ట్ కార్నర్.

మొగుళ్ళ అప్పులు తీర్చడానికి, వారి కుటుంబ బాధ్యతలని షేర్ చేసుకోవడానికీ, వారికి సాయం చేయడానికీ అని - పాలిచ్చే పసి పిల్లలని ఇళ్ళలో, క్రెష్ లలో వొదిలి ఆఫీసుకి వెళ్ళే ఆడవాళ్ళంటే, కొంచెం దయ.

వైధవ్యంలో చుట్ట పక్కాల ఆలంబన లేకుండా ఏదో చిన్నదో, పెద్దదో ఉద్యోగం ఉద్ధరించి, పిల్లలని పెంచి, ఒక స్థాయికి తీసుకొచ్చే తల్లులంటే కొంచెం గౌరవం.

ఆర్మెడ్ ఫోర్సెస్ లో నిర్దాక్షిణ్యమైన డిసిప్లిన్ నీ, కొంచెం వేధింపులని కేవలం 'ఈక్వాలిటీ' అనే ఒక విలువ ని నిరూపించడానికి కష్టపడే అమ్మాయిలని చూస్తే కాస్త గర్వం.

రాత్రిళ్ళు ఆఫీసు కెళ్ళే కాల్ సెంటర్ అమ్మయిలూ, పిల్లల గురించి బెంగపడే తల్లులూ, పిల్లల కోసం ప్రతిభ ని కొంచెం బజ్జోబెట్టి, కెరీర్ ని త్యాగం చేసే తల్లులూ.. వీళ్ళన్నా కాస్త ఇష్టమే.

కట్నం వేధింపులూ, ఆఫీసుల్లో ఆడవాళ్ళ లిప్స్టిక్ ని చూసి చెవులు కొర్రుక్కునే కొలీగ్లూ, వీళ్ళ సాధారణ బిహేవియర్ ని కూడా భూతద్దాల్లో వెతికే కొలీగ్లూ.. ఇంకా ఇంటి దగ్గర బయటా, ఈగో ప్రోబ్లెంలూ - ఇవన్నీ ఒంటిచేత్తో నెట్టుకొస్తూ, ఏదో సాహసంతో బ్రతికే ఆడపిల్లల్ని చూస్తే కొంచెం అభిమానం .


ఎంత చేసినా ఆడోళ్ళు 'ఇంకాంపిటెంటే !' ఆడవాళ్ళు అందంగా ఉన్నా కష్టమే, లేకపోయినా కష్టమే.

మంచిగా మట్లాడితే - అర్ధాలు తీయబడతాయి.
మాట్లాడకపోతే - లేబుళ్ళు అతికించబడతాయి.

శుభ్రంగా ముస్తాబు అయితే - అదేంటో వాళ్ళకోసమే అనుకుంటారు సహోద్యోగులు.
మొహం వేలడేసుకుని వెళ్తే - పెంటమ్మ అనుకుంటారు.

ఆడవాళ్ళు - కొంచెం వ్యతిరేకతనూ భరించాలి, కొంచెం 'ఎటెన్షన్ 'నూ ఫేస్ చెయ్యాలి.

మంచి ఎక్సెక్యూటివ్ స్థాయి ఉద్యోగిని - నిర్ణయాలు తీసుకునే ఉద్యోగిని కీ - మగ వాళ్ళతో సమానంగా గౌరవం లభిస్తుందా ? కొంచెం కష్టమే. పైపైకి అంతా బానే కనిపిస్తుంది. కానీ అంతర్లీనమైన వివక్ష వారిని బాధిస్తుంది.


ప్రతీ స్త్రీ - అనర్ఘ స్త్రీ రత్నమే - కానక్కర్లేదు కదా ! కానీ ఎవరికి మటుకూ వారికి ఎన్ని చాలెంజెస్ ఉంటాయో కూడా కొంచెం ఊహించాలి !

ఈ మధ్య ఇంకో ధోరణి కూడా ప్రస్ఫుటం ఔతుంది. ఈ ఎలుకల పందెం లో ప్రతీ వారూ పెర్సనాలిటీ అని - ఒకటుంటుందని అని ఒక విషయానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అది బయటికి కనిపించేది కూడా ! దీని వల్ల ఇతరులకు మన మీద ఒక ఇంప్రెషన్ పడుతుంది.

దీనిలో భాగంగా, చెక్కని చిరునవ్వు, స్నేహపూర్వక సంభాషణ, చెక్కని డ్రెస్ సెన్స్, కొంచెం మేక్ అప్ - అందరూ తమ వ్యక్తిత్వానికి ఆపాదించుకుంటున్నారు.

ఆడవాళ్ళు తమ గురించి తాము ఈ విధంగా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇది లౌడ్ అండ్ క్లియర్ అయిపోయి, స్త్రీ పక్షపాతులు కానివారు కొంచెం తట్టుకోలేకపోతున్నారు.


ఆడవాళ్ళ మేక్ అప్ బిల్లులు - బట్టలకయ్యే ఖర్చూ - భర్త బేచ్ ని ఆందోళనపరుస్తుంది. కానీ వారికి వెంటనే, మగ వాళ్ళ వస్త్రాలు కూడా ఎంత ఖరీదయ్యాయో గుర్తు రావు.


అమ్మా - స్త్రీ రత్నాలారా - ఏమీ పట్టించుకోవద్దు. మీ పని మీరు కానివ్వండి. ఆడవాళ్ళని ఎప్పటికైనా ఆదుకునేవి, విద్య, ఆర్ధిక స్వాతంత్ర్యమే.


ఫెమినిసం - అంతా స్త్రీ విద్య, స్త్రీల వృత్తి ఉద్యోగాల పెంపు చుట్టూనే తిరగాలి. కెరీర్ లో చిన్న చిన్న గుసగుసలూ, దగ్గులూ, చెణుకులూ కామన్. మనం మన అంతరాత్మకు సమాధానం చెప్పుకోగల పరిస్థితిలో ఉంటే అదే పదివేలు !

03/08/2008

గీతాంజలి

అవును. నాకు తెలుసు. హృదయేశ్వరా, ఇదంతా నీ ప్రేమే, ఇంకేమీ కాదు. చెట్ల ఆకులపైన చిందులు తొక్కే ఈ బంగారు కాంతి, ఆకాశంపైని తేలిపోయే సోమరి మబ్బులు, నా నుదుటి మీద తన చల్లని స్పర్శని వొదిలిపోయే గాలి, ఇదంతా నీ ప్రేమే కాక, ఇంకేమీ కాదు.

ఉదయకాంతి నా కళ్ళను ముంచెత్తింది. ఇదే నా హృదయానికి నీ సందేశం, నీ ముఖాన్ని పైనుంచి వొంచావు. నా కళ్ళల్లోకి చూస్తున్నాయి నీ కళ్ళు, నా హృదయం నీ పాదాల్ని తాకింది.


- రబీంద్ర నాధ్ ఠాగోర్ (గీతాంజలి) [చలం]

02/08/2008

విషాదం !

ఈ వార్త తెలియగానే చాలా బాధ కలిగింది. గౌతమీ ఎక్స్ ప్రెస్ లో జరిగిన ఘోర ప్రమాదం - భయంకరమైన మరణాలూ, అత్యంత విషాదం.. ఇవన్నీ ఎప్పట్లాగే జనం మర్చిపోతారు ఇంకో వారానికల్లా !


నేనూ మర్చిపోయాను. ఈరోజు ఆఫీసు కి లేట్ అయిపోతాననే తొందర్లో జుట్టు ఆరబెట్టుకుంటూంటే, హేర్ డ్రయెర్ వేడి కి చటాక్ తగిలినపుడు.. వెంటనే ఈ ప్రమాదం గుర్తొచ్చి బాధ కలిగింది. ఇంత చిన్న వేడికే.. లేదా అగరొత్తి చివర నిప్పు తునక పడినప్పుడే మనం ఓర్చుకోలేము ! మరి మనిషినే దగ్ధం చేసేంత వేడి - ఆ నిస్సహాయత తలచుకుంటే ప్రాణం కొట్టుకుపోయింది.


ఈ రైలు ప్రమాదం అత్యంత విషాద కరమైన సంఘటనగా పేర్కొంటున్నారు. అయితే దీనికి షార్ట్ సర్క్యూట్ కారణం అని వార్తలు రావడం, రైళ్ళ మైంటెనన్స్ గురించి ప్రశ్నలు ఉదయించడం - చాలా హేయమైన సంగతి అనిపించింది.


దీనికి కారణం అయిన వాళ్ళని - మరి ఇంకో సారి ఇలాంటి తప్పులు మరొకరు చెయ్యకుండా - కఠినంగా ఎందుకని శిక్షించరు ? మనకి మంత్రి పుంగవులు ఉండేది ఇలాంటివి జరిగితే ఎక్స్ గ్రేషియా ప్రకటించడానికే అనిపిస్తుంది. అంతకన్నా కొరడా ఝుళిపించి పాడైన వ్యవస్థలని పని చేయించగలిగే మంత్రులు ఉండడం అసాధ్యమా?


రైల్వే ఉద్యోగుల సంఘాలూ, యూనియన్లూ, రాజకీయాలూ ఈ నిర్లక్షాలని కప్పి పుచ్చుకుంటూ సంస్థాగత ప్రక్షాళనలకు ఎప్పటికీ దిగవు. గోధ్రా లో సబర్మతీ రైలు లో ప్రయాణీకులు కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగానే మృతి చెందారని రైల్వే వర్గాలు నివేదిక ఇచ్చాయి. అసలు ఇలాంటివి ఎందుకు జరుగుతాయి ? రైళ్ళలో భద్రత అనే ఫీచరే లేదా ?!


మన దేశంలో ఎవరూ దేనికీ బాధ్యత వహించరు. రైళ్ళలో అగ్ని నిరోధక ఎక్స్ టింగ్విషర్లు ఉండుంటే, ఇన్ని చావులు ఉండేవి కావు కదా ! ఓకె.. అవి ఎవరన్న ఎత్తుకుపోతారని పెట్టుండరు! మన దేశంలో ప్రాణాలకు పెద్ద విలువ లేదు. కానీ మరీ ఇంత ఘోరాలు జరిగేంతగానా ?!


అందరూ ఇది మనకి సంబంధించినది కానే కాదని చేతులకంటిన దుమ్ముని చెక్కగా దులుపుకుని వెళ్ళిపోతారు! ఇలాంటివి మరి జరగకుండా ఎక్కడా ఎవరూ చర్యలు తీసుకుంటారా ? లేదు!


ఇలా కాకుండా ఉండుంటే బావుండేది. ఇన్ని అన్యాయమైన చావుల్ని దేవుడే నిశ్చయించి ఉంటే అది చాలా పెద్ద విషాదం.