Pages

25/04/2017

The Book Thief


ద బుక్ థీఫ్. 



ఇది బాల సాహిత్యం.   ఈ కధ పుస్తకాలెత్తుకుపోయే పదీ పన్నెండేళ్ళ ఏళ్ళ అమ్మాయి  "లీసెల్ మెమింగర్" ది.   గత ఏడు సంవత్సరాలుగా సిరియాలో జరుగుతూన్న అంతర్యుద్ధం కారణం గా దాదాపు ప్రతి రోజూ జరుగుతున్న బాంబు దాడులూ, వాటిల్లో వందల్లో చచ్చిపోతున్న చిన్న పిల్లలూ, -  ఒక కొత్త తరాన్ని అంతరింపజేసేస్తున్న యుద్ధం -  ఇవన్నీ చూస్తూనే ఉన్నాం.  యుద్ధాల్లో అసలైన బాధితులు పిల్లలే.  స్కూళ్ళలో, ఆట స్థలాల్లో ఉగ్రవాద,  అధికారిక దాడుల్లో,   అసలు యుద్ధాల్లో ఎక్కువగా నష్టపోయేదీ, చచ్చిపోయేదీ, తన వాళ్ళని కోల్పోయి అగమ్యగోచరంగా ఎప్పుడు వస్తుందో తెలీని మృత్యు నీడలో భయంగా బ్రతికేదీ చిన్నారులే.    ఇదంతా పెద్ద హోక్స్ అని, పిల్లలెవ్వరూ చచ్చిపోవట్లేదనీ రెజీం చెప్తూన్నా,  కళ్ళ ముందు కనిపించే రక్త పాతం, మొన్నటి UNICEF నివేదిక (2016 సిరియన్ బాలల అత్యంత దారుణమైన సంవత్సరం)  - ఏటికేడూ పెరిగిపోతున్న చిన్నారుల మరణాలు,   దేశం వదిలి పారిపోతున్న చిన్నారులూ,   భవిష్యత్తేమిటో తెలీని పిల్లలూ,   తిండికో,  ఇంకో దేనికో యుద్ధం లో చేరిపోతున్న (ఏడేళ్ళ వయసు  పిల్లల్తో కలిపి)   పిల్లల గురించీ ఇంత స్పష్టమైన వీడియోలూ, గణాంకాలూ మధ్య - యుద్ధం లో తన వాళ్ళ ని కోల్పోయి,  భీభత్సాన్ని, హింస ను,  ఇన్ని కష్టాల్లోనూ, మానవత్వాన్ని  మర్చిపోని  మనుషుల్నీ చూస్తూ పెరిగిన పిల్ల   "లీసెల్" -   ఒక ప్రామాణిక పాత్ర. 

లీసెల్ కధనంతట్నీ మనకి చెప్పేంత పరిజ్ఞానం ఎవరికి ఉంటుంది - మృత్యువు కే. ఎందుకంటే  గాంధీ గారన్నట్టు "మృత్యువు మనల్ని నమ్ముకుని ఎన్నడూ వెంట ఉండే ప్రేయసి".   ఈ ప్రేయసి,  మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టి పోదు.  బుక్ థీఫ్ రాసిన - మార్కస్ జుసాక్ - దీన్ని మృత్యు స్వగతం గానే రాసాడు.  కాబట్టి ఇది మృత్యువు చెప్పిన కధ.

కధాకాలం రెండో ప్రపంచ యుద్ధం నాటిది.   నేపధ్యం - ఆర్య సిద్ధాంతపు కైపులో మునిగి తేలుతున్న జెర్మనీ లో మ్యూనిచ్ కి దగ్గరలో ఉన్న చిన్న గ్రామం -  మోల్ చింగ్ / మోల్ కింగ్.   ఫ్యూరర్ (Fuhrer (Hitler)) గారి ప్రతాపం లోకానికి తెలిసే నాటికి,  మోల్కింగ్ లో ఓ పేదల ఇంటికి పెంపకానికొస్తుంది లీసెల్.   నిజానికి లీసెల్, తన తమ్ముడూ రావాల్సింది,  కానీ ఆ చలి లో నిమోనియా తో  చిన్న తమ్ముడు శ్వాస అందక మార్గ మధ్యంలోనే ప్రాణాలు విడుస్తాడు.   పిల్లల్ని ఈ ఫాస్టర్ పేరెంట్స్ కి అప్పచెప్పడానికొచ్చిన తల్లి, ఎ లానో పిల్లాణ్ణి సమాధి చేసి,  పిల్లని తీసుకుని ఊర్లోకి అడుగుపెడుతుంది.  ఈ లీసెల్ - తమ్ముడ్ని కోల్పోయిన దుఃఖం'  ఏమిటో అర్ధం కాకముందే, శ్మశానంలో పిల్లాణ్ణి పాతిపెడుతున్న దృశ్యాన్ని కళ్ళప్పగించి చూస్తూ.. అక్కడ తడి మట్టి లో పడి ఉన్న ఒక పుస్తకాన్ని చటుక్కున తన స్కర్టు లో దాచేసి, తెచ్చుకుంటుంది. బహుశా తమ్ముడి జ్ఞాపంగా..  అదే మృత్యువు చూసిన మొదటి దొంగతనం.  అందుకే  లీసెల్ ని మృత్యువు" పుస్తకాల దొంగ" అనే పిలుస్తూ ఉంటుంది.   ఆ పుస్తకం   - "A Grave Diggers' Handbook".   గుండెల్నిండా కొడుకుని కోల్పోయిన దుఃఖం,  కూతుర్ని వేరే ఎవరి ఇంటిలోనో వొదిలేసి వెళ్ళాల్సి రావడం వల్ల  తల్లి మొహం లో ఎమోషన్స్ - గుండె నిండా బడబాగ్నిని దాచుకుని ధీర లా కర్తవ్యం వైపు అడుగులేసిన ఆ తల్లి ని చూసి మృత్యువు కూడా అబ్బురపోతుంది..
"How could she walk ?
How could she move ?
That's the sort of thing I 'll never know, or comprehend"..


ఇక్కణ్ణించీ లీసెల్ కధ లో ఓ పెద్ద మలుపు.  పిల్లని "హిమ్మెల్"  వీధి లో" హాన్స్ హబ్బర్  మేన్" అనే పెద్ద మనిషి కుటుంబానికి అప్పగించి,  వచ్చిన దార్లోనే వెళిపోతుంది తల్లి.  హెమ్మెల్ వీధి - ఒక స్వర్గం. పేదవాళ్ళ బస్తీ.  ఆమె ఎందుకు పిల్లల్ని వొదులుకోవాల్సి వస్తుందో అస్పష్టం.  అమె కమ్యూనిస్ట్ నేపధ్యం కారణం కావచ్చు. తండ్రి కుటుంబాన్ని వొదిలి వెళ్ళిపోయాడు. పిల్లల్ని ఫాస్టర్ కేర్ లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇవ్వాలి.    ఆమెకు ఎంత కష్టం - యుద్ధం, ఆర్ధిక మాంద్యం వగైరా ల వల్ల, ఇద్దరు పిల్లలకి తిండి పెట్టే స్తోమత లేదు. .  పిల్లని పెంచుకున్నందుకు గానూ ఫాస్టర్ పేరెంట్స్ కు కొంత అలవెన్సు దొరుకుతుంది. అంతే కాదు. ఈ హబ్బర్  మేన్లు ఒంటరి ప్రాణులు. వాళ్ళ ఒక్కగానొక్క కొడుకు జెర్మనీ తరఫున యుద్ధానికి వెళ్ళి ఉన్నాడు.  హిట్లర్ నూరిపోసిన అతి జాతీయవాదం నర నరానా జీర్ణించుకుపోయి, యుద్ధానికి వెళ్ళని తండ్రి మితవాదాన్ని అసహ్యించుకునే మనస్తత్వం కొడుకుది.     వీధి లో చాలా మంది మగ పిల్లలు యుద్ధం లో నే ఉన్నారు. వాళ్ళలో కొందరు ఇష్టపడి, హిట్లర్ ఉన్మాదత ని ప్రేమించి,  ఆయన కల్ల బొల్లి మాటలు నమ్మి  యుద్ధానికి వెళ్తే,  కొందరు తొందర్లోనే యుద్ధోన్మాదంలో ప్రమాదాన్ని తెలుసుకున్నా.. హిట్లర్ ని నమ్మినా నమ్మక పోయినా - అధికారుల పట్ల భయంతో యుద్ధానికి వెళ్తారు. కాబట్టి, తల్లి కీ తండ్రికీ  తమ శూన్యత ని మరిచిపోవడానికి , కాలక్షేపానికి ఈ పిల్ల ని పెంచడం అవసరం.  ఆ రోజుల్లో యుద్ధాల  వల్ల అనాధలయిన పిల్లల్ని  మిగతా కుటుంబాలు సాకడం సాధారణం.

లీసెల్ కొత్త ఇంట్లో కి వచ్చేసరికీ, తన జీవితంలో ఏర్పడిన ఒడిదుడుకులు, ఒంటరితనం వల్ల,  భయపడి పోయి  ఉంటుంది.  పెంపుడు తల్లి రోసా హబ్బర్ మేన్ ది చెక్క మొహం.  దాన్లో కరుణ అనేది ఏ కోశానా కనిపించదు.  పిల్లని భయపెట్టడం లో సిద్ధ హస్తురాలు.   తండ్రి హాన్స్ హబ్బర్ మేన్ ఎంతో దయ గల వ్యక్తి. అతను ఒకప్పుడు జెర్మనీ తరఫున యుద్ధం లో పాల్గొన్న వాడే.  కానీ సౌమ్యుడు.   యుద్ధంలో అతనికి ఒక యూదు సైనికునితో స్నేహం కుదురుతుంది.  దురదృష్టవశాత్తూ ఆ యూదు సైనికుడు హబ్బర్ మేన్ ను స్థానాన్ని తీసుకోవడం వల్ల మృత్యువు పాలవుతాడు.   యుద్ధానంతరం,  తీవ్రమైన గిల్ట్ తో, హాన్స్ తన యూదు స్నేహితుని కుటుంబాన్ని కలిసి,  క్షమాపణలు వేడుకోవడానికి వెళ్తాడు.   అప్పటికి ఆ యూదు సైనికునికి, ఒక చిన్న పిల్లాడు.  అతని భార్య కి తన ఎడ్రసు ఒక కాగితం మీద రాసి ఇచ్చి - "నీకు ఎటువంటి సాయం కావాలన్నా - నన్ను అడుగు. నా స్నేహితుడు కాపాడిన ఈ ప్రాణాన్ని అతని కుటుంబానికి ఏ చిన్న సాయం చేసైనా ఉపయోగిస్తాను" అని ప్రమాణం చేసి వస్తాడు హాన్స్.  అప్పణ్ణించీ,  హాన్స్ ని యుద్ధపు పిలుపులు  తాకవు.   ఆ రోజుల్లో  ఓటమి వైపు పయనిస్తున్న జెర్మన్ సైన్యం, అసంఖ్యాకంగా చనిపోతున్న తన సేనల స్థానాన్ని,  ప్రజల్లో కాస్త able గా కనిపించే వారితోనూ,  మాజీ సైనికులతోనూ భర్తీ చేసేవి.   'గెస్టపో'  పని ప్రజల్లో  తిరగడం, కనబడిన యూదుని పట్టి బంధించడం,  పనికొస్తాడూ అనుకున్న వాణ్ణల్లా సైన్యంలో తోయడం.. ఇదే.  హాన్స్, కష్ట కాలంలో కొన్నాళ్ళు రెండో ప్రపంచ యుద్ధం లో కూడా కొన్ని నెలలు పాల్గొంటాడనుకోండి.   కానీ అతను మనుషుల్ని చంపే సైనికుడు కాదు. 


యుద్ధపు రోజుల్లో ఉద్యోగాలు ఉండవు.  ఉన్న ఉద్యోగాలన్నీ యుద్ధానికి సంబంధించినవే.  హాన్స్ ఒక పెయింటర్.  యూదు ఇళ్ళ మీద గెస్టపో వేసిన క్రాస్ మార్కుల్ని తన పెయింట్ తో కప్పేసే సాహసం చేసేవాడు కూడానూ.    హాన్స్ దగ్గర ఒక అకార్డియన్ ఉంటుంది.  ఈ వాద్య పరికరం.. హాన్స్ యూ.ఎస్.పీ.   యూదు అన్నాక పనంటూ లేక, తనకి ఇవ్వడానికి డబ్బుల్లేని యూదులకు కూడా పైకి తెలీకుండా సాయం చేసేవాడు.   రోసా ఊర్లో కాస్త పెద్ద వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి బట్టలు తీసుకొచ్చి ఉతికి, ఇస్త్రీ చేసి, కాసిన్ని డబ్బులు సంపాదించ బట్టి గానీ, హాన్స్ కరుణామయ సేవల కి కుటుంబం నడవడం కష్టం అయి ఉండేది.

హాన్స్ ఇంట్లో ఒక చిన్న బేస్మెంట్ - ఓ నాలుగు గదులూ.  కిచెన్ లో ఎప్పుడూ బట్టలు ఉడికించే గంగాళం, ఇస్త్రీ వాసన కొట్టే గాలీ - రోసా ఎలాగో వండి వార్చే పీ-సూపూ, రేషన్ లో దొరికే రొట్టే  తప్ప ఇంకేవీ ఉండేవి కాదు.   బేస్మెంట్  చిన్నదీ అని ఎందుకు అన్నామంటే,  ఊర్ల మీద బాంబింగ్ జరిగితే ఇళ్ళలో జనం తల దాచుకోవడానికి బేస్మెంట్ కాస్త లోతైనది ఉంటే బావుంటుంది.   కధ ప్రారంభం లో మృత్యువు అంటుంది.  "ఈ బేస్మెంట్ చిన్నది. గెస్టపో లెక్కల ప్రకారం పెద్దగా పనికిరానిది. నిండా హాన్స్ పెయింట్ డబ్బాలూ, చెత్తా తో నిండి, చల్లగా, చీకటిగా.. అసహ్యంగా!   కానీ ఈ బేస్మెంట్ రెండు ప్రాణాల్ని కాపాడింది!" అని.

లీసెల్ 'హమ్మల్ వీధి' జీవితం గురించి చెప్పాలి.   కొత్త తనానికి, ఒంటరి తనానికీ బెంగ పడుతూండే దశ.  కొత్త తల్లి  రోసా ముందు స్నానానికి బట్టలు విప్పడానికి భయపడే పిల్ల,   నిద్ర లో ఉలిక్కి పడి లేచేసె పిల్ల,  పక్క తడిపేస్తే, హాన్స్ తనని ఎత్తుకుని వేరే పక్క మీదికి మారిస్తే హాన్స్ చేతినిపట్టుకుని నిశ్చింత ని వెతుక్కునే పిల్ల -  పెద్ద రౌడీ లా.. వీధిలో  ఆడుకుంటూండే పొరుగు పిల్లలతో పోరాటనికి దిగి, ఆ దశ లో ఫుట్ బాల్ ఆట వల్ల తన ప్రాణ స్నేహితుణ్ణి సంపాదించుకుంటుంది.    వాడే మన హీరో - రూడీ స్టీనర్.   వీడు ఒక జ్వాల.   యుద్ధ కాలంలో పిల్లలందరూ చాలీ చాలని తిండి వల్ల ఆకలిగా, బలహీనంగా ఉండేవారు. అందులోనూ, రూడీ ఇంట్లో ఆరుగురిలో ఒకడు. అప్పుడపుడూ తిండి, తోటల్లో పళ్ళూ దొంగతనం  చేస్తూ ఉంటాడు.   రూడీ కి 'హిట్లర్' మోహం అంతగా తలకెక్కదు.   ప్రతీదీ ప్రశ్నించే మనస్తత్వం.     లీసెల్ వీధి లో పొరుగు  అబ్బాయి.   ఈ కొత్త పిల్ల అమాయకత్వం, తెగింపూ వాణ్ణి ఆకర్షిస్తాయి. రూడీ కూడా తక్కువ వాడు కాదు.   1936 లో ఒలింపిక్స్ లో నాలుగు బంగారు పతకాలు గెల్చుకున్న నల్ల జాతి మేలి ముత్యం  జెస్సీ ఓవెన్స్. కానీ  తను తక్కువ జాతి వాడు కావడం వల్ల హిట్లర్ అతనితో కరచాలనం చెయ్యడానికి నిరాకరిస్తాడు.  హిట్లర్ అహాన్ని దెబ్బ తీసిన జెస్సీ ఓవెన్స్ చరిత్ర లో నిల్చిపోయిన అత్భుతమైన అథ్లెట్.

జెస్సీ ఓవెన్స్ గురించి తెలుసుకున్నాక రూడీ కన్నా జెర్మనీ లో ఎవరూ ఇంప్రెస్ అయి ఉండరు.  ఇంట్లో ఎవరూ చూడకుండా,  బొగ్గు మసి మొహానికి రాసుకుని గ్రౌండ్ లో కొన్ని రౌండ్లు పరిగెట్టీ దాకా వాడికి మనసు తీరదు. ఈ నల్ల మసి బాలుణ్ణి చూస్తూ చుట్టూ చేరి కేరింతలు కొడుతున్న జనం, తనే 'జెస్సీ ఓవెన్స్'  అనుకుంటూ స్వాప్నికుడిలా రూడీ పరుగు..  ఆఖరికి పిల్లాణ్ణి వెతుక్కుంటూ వచ్చిన తండ్రి  జెస్సీ ఓవెన్స్ అయినందుకు (హిట్లర్ ని ధిక్కరించిన నల్ల వాడు అయినందుకు - ఆ రోజుల్లో హిట్లర్ మీద అభిమానాన్ని నాజీ జెర్మనీ లో బహిరంగంగా ప్రదర్శించిన వాళ్ళకే బ్రతుకు!   ధిక్కార స్వరం ఏ కోశాన వినిపించినా వాళ్ళ ని పట్టుకుని జైళ్ళలోకి తోయడానికి గూఢచారులు  సిద్ధంగా ఉండేవారు)  చెవి మెలిపెట్టి గట్టిగా తిప్పుతూ తీసుకెళ్ళిపోతుంటే అందరూ ఆ పిల్లాడి గురించే చెప్పుకుంటారు.   ఈ రూడీ చాలా దయ గల వాడు.  వీధుల్లో పెరేడ్ చేయబడుతూండే యూదు ఖైదీల బక్కచిక్కిన మొహాల్ని చూసి, శోషొచ్చి పడిపోతున్న ఏ దీనుడికో రొట్టె ముక్క విసిరి, పోలీసుల కన్ను గప్పకుండా పారిపోవడం, అతను సాధారణంగా చేస్తూండే సాహసం.  ఈ రూడీ కి,  లీసెల్ కన్నా అత్భుతమైన స్నేహితురాలు దొరికే అవకాశం లేదు.

మెల్లగా లీసెల్ కి తల్లి తండృల హృదయం అర్ధం అవుతూంటుంది.  తనని "పంది" (Soukerl) [రూడ్ గా మాటాడే రోసా కి ఇదో ఊతపదం]  అని తిడుతూండే, ఎప్పుడూ రుస రుసలాడుతూండే రోసా మంచితనం నెమ్మది నెమ్మది గా లీసెల్ కు అర్ధం అవుతూంటుంది.   మెలమెల్లగా తమని మమా, పాపా (అమ్మా, నాన్నా) అని పిలిపించుకుని, వాళ్ళ కుటుంబంలోకీ, జీవితంలోకీ ఆహ్వానించిన వాళ్ళిద్దరూ లీసెల్ హృదయం లోకి ప్రవేశించారు.   భర్త "సహృదయంతో" ప్రతి రోజూ డబ్బు ఇంటికి తేకపోయినా - ఎక్కడో రోజంతా వాలంటీరింగ్ చేసి వచ్చినా,  ముగ్గురికీ ఉన్న దాంతోనే వండి వార్చాల్సిన అవసరం రోసాది.  బట్టలు ఉతకడం, ఇంట్లోనే వాట్ని ఎండేయడం,  ఇస్త్రీ చేయడం లాంటి కష్టపడే పనులు చెయ్యడం తో పాటూ, వాట్ని ఇంటికెళ్ళి డెలివరీ చెయ్యడం, మాసిన బట్టలు కలెక్ట్ చెయ్యడం ఇవన్నీ ఈవిడ ఒక్కచేత చెయ్యలేక, నెమ్మదిగా ఈ వాతావరణానికి అలవాటు పడుతున్న లీసెల్ ని తన తో తోడు తీసుకెళ్ళడం మొదలు పెడుతుంది.  నెమ్మదిగా లీసెల్ కే బట్టలు తెచ్చి, తిరిగిచ్చే బాధ్యత నెత్తి మీద పడుతుంది.  అలా కొన్ని కుటుంబాలతో  లీసెల్ కి పరిచయం .  రోసా కస్టమరు ఆ వూరి మేయరు హైంజ్ హెర్మన్.  అతని భార్య ఇల్సా  వాళ్ళింటికి వెళ్ళడం లీసెల్ జీవితం లో పెద్ద సంఘటన. ఎందుకంటే ఈ పుస్తకాల దొంగ కి వాళ్ళింట్లో పెద్ద లైబ్రరీ కనిపిస్తుంది.

నాజీ జెర్మనీ లో ఒక రాసిపెట్టని రూలు ఉండేది. ప్రతీ జెర్మనూ విధి గా హిట్లర్ విధేయుడే అయి వుండాలి.  పార్టీ ఆఫీస్ లో సభ్యత్వం ఉండాలి. దేశ సేవ కోసం ఏఅ క్షణాన పిలుపు వచ్చినా వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. వీధుల్లో యూదులను తీసుకుపోయి కాంపుల్లో పెట్టినా, మానవత్వం తో ఎవర్నీ రక్షించడం అవీ చెయ్యకూడదు.  అలా చేస్తే వాళ్ళు కూడా అవిధేయ ముద్ర తో ఏ కాన్సంట్రేషన్ కాంపు కో, జైలు కో లేదా ఏకంగా పైలోకానికో వెళ్ళాల్సిందే !  గెస్టాపో కళ్ళ బడకూడదంటే,  ఇంట్లో హిట్లరు రాసిన 'మీన్ కాంఫ్' ఉండాల్సిందే.  [హాన్స్ కూడా పార్టీ ఆఫీసుకెళ్ళి ఒక పుస్తకం తెచ్చుకుంటాడు  అంత వరకూ మీన్ కాంఫ్ ని తననీ, కొడుకునీ దూరం చేసిన ఒక దరిద్రపు పుస్తకంగా అసహ్యించుకున్నా కూడా ! ]   లీసెల్ కి చదవడం రాయడం రాకపోయినా పుస్తకాల పట్ల ఆమె కున్న ప్రేమని మెచ్చుకుంటూ, ఇంటిలో మెల్లగా ఆమెకు చదవడం నేర్పిస్తాడు తండ్రి.  ఈ లోగా అడపా దడపా ఎక్కడ్నుంచో పుస్తకాల్ని తెచ్చి, ఆమెకు ఇవ్వడం మొదలుపెడతాడు. వాళ్ళు రాత్రి పూట మెల మెల్లగా ఒక్కో పుస్తకాన్నీ పూర్తి చేస్తుంటారు. ఆ క్షణాలు అపురూపమైనవి లీసెల్ కి.  కానీ ఆమెకు హాన్స్ అంత కన్నా నేర్పలేకపోతాడు.  నట్టుతూ నట్టుతూ, పరమ మెల్లగా పుస్తకల్ని చదువుతుంటారు తండ్రీ కూతురూ.


ఈ లోగా లీసెల్ జీవితంలో ఇంకో పెద్ద సంఘటన !  గెస్టపో వాళ్ళు,  హిట్లర్ ఆదేశాల ప్రకారం, మనసుల్ని పొల్యూట్ చేసే ('మీన్ కాంఫ్'  తప్ప) అన్ని పుస్తకాల్నీ స్క్వేర్ లో వేసి కాల్చేస్తారు ఒక సారి.   ఆ కాల్చేయడం జనం సంబరంగా చూడాలి..   స్వచ్చందంగా ఏమైనా పుస్తకాలు ఇంట్లో ఉంటే తెచ్చి మంటల్లో వెయ్యాలి. హిట్లర్ కి చేయెత్తి జై కొట్టాలి. అదీ కార్యక్రమం.    లీసెల్ ఈ పుస్తకాల కాల్చి వేత చూసి దిమ్మెర పోతుంది.   లీసెల్ ఇంటికొచ్చిన కొత్తలో ఆమె పరుపు కింద దాచుకున్న మొదటి దొంగతనం. 'A Gravedigger's Handbook'.   దాన్ని చూసిన హాన్స్ మెల్లగా,  అపుడపుడే లీసెల్ కు చదవడం నేర్పిస్తున్నాడు కదా.   పెద్ద పెద్ద పుస్తకాలూ కధలూ చదివేయాలని ఆశగా ఉంటూండే ఆ చిన్న పిల్లకు కొత్త ప్రపంచ ద్వారాలు,  అపుడపుడే తెరుచుకుంటున్నాయి.  అందుకే జ్ఞానానికి ప్రతీకలూ , కొత్త లోకాల కీ దారులు చూపించే ఈ పుస్తకాల్ని కాల్చేస్తూండటం భరించలేక,   ఆఖరికి కాలీ కాలకుండా,  ఆ బూడిద కుప్పలో దొరికిన ఒక పుస్తకాన్ని, ఆ కుప్ప మీద ఊసే నెపంతో వెళ్ళి, చటుక్కున కోటు మాట్న దాచి, గెస్టపో వాళ్ళ కళ్ళ పడకుండా  తండ్రి తో కలిసి ఇంటి దారి పడుతుంది.   కోటు లో కాల్తూన్న పుస్తకం చర్మాన్ని కాలుస్తునా, కిక్కురుమనకుండా  ఒక సేఫ్ ప్లేస్ కి వచ్చాకా తన "ట్రోఫీ"  పుస్తకాన్ని హాన్స్ కి చూపిస్తుంది.   ఇది రెండో దొంగతనం.  ఈ రహస్యం వాళ్ళిద్దరికే తెలుసనుకుని ఇద్దరూ చిన్న నవ్వుతో ఇంటికి వెళ్తారు. పుస్తకాలంటే లీసెల్ కి ఉన్న ఇష్టం హాన్స్ కి బాగా తెలుసు కనుక !

కానీ ఎవరూ చూడకపోయినా ఆ రోజు లీసెల్ దొంగతనాన్ని స్క్వేర్ కి ఆనుకున్న తన ఇంట్లోంచీ మేయర్ భార్య  ఇల్సా చూస్తుంది.      ఇల్సా ఒక చదువుకున్న, స్వతంత్ర భావాలున్న మహిళ.   కానీ ఒక్కగానొక్క కొడుకు మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోవడంతో విత్ డ్రాన్ గా ఉంటుంది. కానీ మనసు వెన్న దంపతులది.   తనింట్లో బట్టల కోసం వస్తూండే లీసెల్ ను గుర్తుపట్టి, ఆ పేద పిల్లకు గెస్టపో కళ్ళు కప్పి పుస్తకాన్ని ఎత్తుకుపోయేంత ఇష్టం వుండడం చూసి అబ్బురపడుతుంది.   ఆమెకు లీసెల్ అంటే అభిమానం అప్పణ్ణించే మొదలయ్యి..  లీసెల్ ని బట్టలకోసం వచ్చినపుడల్లా లైబ్రరీ లో పుస్తకాలు చదువుకోవడానికి అనుమతిస్తుంది.   అన్ని పుస్తకాల్ని ఒక్క సారి చూసి, వాటిని తను ఎంత సేపు కావాలంటే అంత సేపు చూడొచ్చనే సంగతి తెలిసి లీసెల్  తెగ సంబరపడిపోతుంది.  ఈ పుస్తకాల్ని కాల్చని మేయర్ హృదయం మంచిదని కూడా  (అప్పటికి జర్మనీ లో మేధా వర్గం హిట్లర్ ని గుడ్డిగా ఆరాధించడం మానడం మొదలయింది) గ్రహిస్తుంది.

అయితే అదే మంచితనం వల్ల గ్రామంలో ప్రజలందరూ కష్టపడి బ్రతుకుతున్నపుడు తన కుటుంబం బట్టల్ని ఉతికించుకోవడం,  luxury ని అనుభవించడం ఇష్టపడక,  మేయరు భార్య రోసా సేవల్ని ఒక సారి ఆపేస్తుంది. లీసెల్ వచ్చినపుడు  "బట్టలు లేవు ఈ కవరు మీ అమ్మకు ఇవ్వు!"   అంటుంది.   " నీకు కావల్సినపుడల్లా మా లైబ్రరీ కి రావచ్చు. నీకు ఎప్పుడూ స్వాగతం "  అని కూడా అంటుంది.    కానీ అప్పటికే యుద్దం వల్ల చుట్టుముట్టిన ఆర్ధిక మాంద్యం వల్ల,  అందరూ పని మానిపించేయడంతో తినడానికి కష్టంగా ఉన్న పరిస్థితి తెలుసు కనుక,   ఎందుకో లీసెల్  నిస్సహాయమైన  కోపంతో మేయర్ భార్యని తిట్టి,  అక్కణ్ణించీ ఏడుస్తూ ఇంటికొచేస్తుంది.   కానీ తిట్టాననే పశ్చాత్తాపం ఆమెని దహించేస్తూ ఉంటుంది.   రోసా ఈ వార్తను కూడా దిగమింగి ఎలానో ఊరుకుంటుంది గానీ లీసెల్ కి  లైబ్రరీ ని మిస్స్ కావడం వల్లా, మేయరు భార్య కి మొహం చూపించలేకా.. చాలా రెస్ట్ లెస్ గా వుంటుంది.

ఇప్పుడు రూడీ సాయంతో పుస్తకాల్ని లైబ్రరీ నుంచీ ఒకటీ, అరా కిటికీ గుండా (ముందు ద్వారం లోంచీ వెళ్ళడానికి మొహం చెల్లక) తీసుకొచ్చేయడం, "దొంగతనం" మళ్ళీ చేస్తుంది. ఈ విషయం మేయర్ బార్య పసిగట్టినా... ఏమీ అనదు.   కొన్నాళ్ళకి లీసెల్ ని 'నువ్వు ఇంక కిటికీ గుండా రావద్దు..  ముందు ద్వారం లోంచీ రా'.. అని చెప్పేంత వరకూ తన దొంగతనం ఎవరూ చూడట్లేదనే అనుకుంటుంది లీసెల్.

వీటన్నిటి మధ్యా - జెర్మనీ రష్యా మీదకి యుద్ధానికి వెళ్ళి ఉంటుంది. జెర్మనీ లో పరిస్థితులు చాలా దిగజారి ఉన్నాయి. ఒక రోజు రాత్రి చీకటి తెరల్లోంచీ హబర్మేన్ ల ఇంటికి ఒక అతిధి శరణు కోరి వస్తాడు.   అతను ఎన్నో బాధలు పడి హాన్స్ హబ్బర్ మేన్ ను వెతుక్కుంటూ వచ్చిన పూర్వపు యూదు  సైనికుడి కొడుకు.  అతన్ని ఇంట్లో దాచి మృత్యువు నుండీ కాపాడటం, హాన్స్ కర్తవ్యం. దీన్ని దంపతులిద్దరూ ఎంతో హృదయపూర్వకంగా స్వాగతిస్తారు.  తమకి ప్రాణాపాయమని తెలిసినా, మానవత్వం తో, కృతజ్ఞత తో మాక్స్ వాండెన్ బర్గ్  ని ఇంట్లో కి ఆహ్వానిస్తారు. అసలే పరిమితంగా దొరికే రేషన్ ని, ఈ నాలుగో వ్యక్తి తో పంచుకోవడం అంటే ఎంత కష్టం, రోసా ని ఈ ప్రశ్న కలవరపెట్టినా, హాన్స్ మొహం చూసి ఊరుకుంటుంది.    మొత్తానికి కుటుంబం అంతా ఏకతాటి మీద నిలబడి ఒక నిర్ణయానికొస్తుంది.  కొత్త స్నేహితుడి విషయం లీసెల్ ఎక్కడా పొక్కనివ్వకూడదు.  రూడీ కి, ఎవ్వరికీ.. ఈ విషయం తెలీకూడదు. తెలిస్తే గెస్టపో చేతిలో [మాక్స్ కి లేదా అందరికీ]  మృత్యువు తధ్యం.

ఈ కొత్త పాత్ర మాక్స్ - నాజీలు ఇంటిమీదికొచ్చాకా, తల్లీ, అప్ప చెల్లెళ్ళూ మృత్యుముఖం లోకి వెళ్తూ కడసారి చూసిన చూపును మర్చిపోలేకపోతూ.. మృత్యు భయంతో వొణికిపోతూ ఉన్న ఒక నవ యువకుడు.  అంత నిరాశ లో నాజీలు యూదుల్ని వెతికి వెతికి ఊచకోత కోస్తున్న రోజుల్లో, మాక్స్ తల్లికి ఎపుడో తనకి సాయం కోరవచ్చంటూ ఎడ్రసు ఇచ్చిన హాన్స్ హబ్బర్ మాన్ గుర్తొచ్చి, హాన్స్ ఎడ్రసు రాసున్న ఆ కాగితం ముక్క ఇన్నాళ్ళకి వెతికి  సంపాదించి, మాక్స్ ని ఎలా అయినా  హాన్స్ దగ్గరకి పారిపొమ్మని చెప్తుంది.  అలా దాక్కుని, కడసారి తల్లి నీ చెల్లెళ్ళనీ వొదిలి, స్నేహితుని సాయంతో ఈ మోల్ కింగ్ చేరి, హాన్స్ ఇంటికి ఓ అర్ధ రాత్రి వేళ చీకటి లో ఓ నీడ లాగా వచ్చి తేల్తాడు.  మానసికంగా, శారీరకంగా అలసిపోయిన మాక్స్ కి హాన్స్ ఇంట్లో చల్లని బేస్మెంట్ రెండు చేతులా స్వాగతం పలుకుతుంది.

మాక్స్ ఈ బేస్మెంట్ లో, హాన్స్ సంరక్షణ లో, లీసెల్ స్నేహపూర్వక ఆసక్తి తో మనిషవుతాడు.  లీసెల్ కి చక్కగా చదవడం రాయడం నేర్పిస్తాడు. అతను చదువుకున్న వాడు. వీళ్ళిద్దరి అనుబంధం బలపడుతుంది.  క్రాస్ వర్డ్ పజిల్స్ పూర్తి చెయ్యడం అంటే మాక్స్ కి ఇష్టం.  అది తెలుసుకున్న లీసెల్.. ఎక్కడన్నా, ఆఖరికి చెత్త బుట్టల్లోనైనా క్రాస్వర్డ్ పజిల్ ఉన్న  News Paper  ముక్క కనపడితే, మాక్స్ కి తెచ్చి ఇస్తూ ఉంటుంది. మాక్స్ కూడా లీసెల్ చేత వాళ్ళింట్లో ఉన్న  పుస్తకాలన్నిటిని చదివించేస్తాడు.  ఇప్పుడు లీసెల్ కి స్వంతంగా చదవడం, రాయడం వచ్చు.  మేక్స్ మధ్య లో జబ్బు పడతాడు. అతను కోలుకునే వరకూ... ఎంతో ఆదుర్దా పడిన ఆ కొత్త కుటుంబం - ముఖ్యంగా లీసెల్.  బయటకు ఎవరికీ అణుమాత్రమైనా అనుమానం రాకుండా ప్రాణాలతో దాచి ఉంచిన ఈ స్నేహితుడు, అనారోగ్యంతోనే కన్ను మూస్తాడేమో అని టెన్షన్ అనుభవిస్తూంటుంది..   లీసెల్ మమ్మూలు గానే స్కూల్ కి వెళ్తూంటుంది, రూడీ తో ఇతర స్నేహితులతో ఆడుకుంటూంటుంది. పొలాల్లో, తోటల్లో, ఆకలికి మిగిల్న పిల్లల తో కలిసి దొంగతనాలు చేస్తూంటుంది.   వీధుల్లో పోలీసు కనబడితే భయంతో బిక్క చచ్చిపోయినా... ధైర్యం తెచ్చుకుని, ఏదో ఒక నెపంతో తల్లి తండృల్ని ఎలర్ట్ చేస్తూ.. వెయ్యి కళ్ళతో మాక్స్ ని కాపాడుతూ వస్తుంది.


నిజానికి  శీతాకాలపు చలి కి,  మంచులో కూరుకుపోయిన ఆ బేస్మెంట్ లో, సరైన తిండీ, నిద్రా లేని మాక్స్  విపరీతంగా జబ్బు పడిపోతాడు.  వళ్ళెరగని మత్తు లో కూరుకుపోతాడు. రోసా ఎలానో పరిచర్యలు చేస్తూంటుంది.  మాక్స్ ని ఉంచిన బేస్మెంట్, మూత్రపు వాసన తో,  ఉక్క పోత తో ఏ మాత్రం ఆరోగ్యంగా లేకపోవడంతో అతన్ని  లీసెల్ గదికి, లీసెల్ బెడ్ మీదికి మారుస్తారు.   మాక్స్ పక్కన కూర్చుని అతను వింటాడేమో అన్నట్టు రక రకాల తన "రహస్య"  పుస్తకాల ని చదువుతూ, అతని లో ఏ మాత్రం కదలిక ఉన్నా.. వొంగి అతని మొహాన్ని పరిశీలిస్తూ.. లీసల్ ఇదే పని లో ఉంటుంది. ఇంట్లో ఉన్నంత సేపూ!  జ్వర తీత్రత లో, తల్లీ చెల్లెళ్ళని మృత్యువు కు వొదిలేసి, తాను మాత్రం బ్రతికి ఉన్నందుకు సిగ్గు పడుతున్న ఈ ప్రాణికి,  మగత లోంచీ మెలకువ వచ్చినప్పుడల్లా, తన పక్క న కూర్చుని, పుస్తకాన్ని బయటకు చదువుతూ, తన మొహంలోకి ఆత్రుతగా చూస్తుండే లీసెల్ ప్రతిబింబం మనసంతా ముద్రించుకుపోతుంది. ఆ కృతజ్ఞత అతన్ని జీవితాంతం అంటిపెట్టుకునే వుంటుంది. 

ఆఖరికి లీసెల్ స్కూల్లో ఉండగా మాక్స్ కి తెలివొస్తుంది. రోసా అప్పటికప్పుడు స్కూల్ కి బయల్దేరి, లీసెల్ ని దేనికో నానా తిట్లూ తిడుతూ (అందరికీ రోసా తిట్ల మోతు, గయ్యాళి  అనే ఇంప్రెషన్ కదా)  దగ్గరికి లాక్కుని మాక్స్ బ్రతికినట్టు చెప్తుంది. అప్పుడు ఇద్దరూ ఎంతో ఎమోషన్ ని గుండెల్లో దాచుకుని, గమనించే వాళ్ళకి ఏ మాత్రమూ  అనుమానం రాకుండా విడిపోతారు.   లీసెల్ అనాసక్తంగా ఇంటికి చేరినట్టు నటించి, లోపలికి వెళ్ళాకా, ఒక్క పాటున మాక్స్ దగ్గరికి పరిగెత్తి... అతన్ని ప్రాణాలతో చూడగలిగినందుకు ఎంతో ఆనందిస్తుంది.  

మాక్స్ కూడా రోసా, హాన్స్, ముఖ్యంగా ఆత్మీయమైన లీసెల్ మంచితనానికి  ముగ్ధుడైపోతాడు.    హన్స్ సాయంతో లీసెల్  కి, పాత కాయితాల మీద తెల్లని పెయింట్  వేసి ఆరాక బొమ్మలతో సహా తన జీవిత  కథ రాసి పుస్తకంలా చేసి ఇస్తాడు. ఆదో అత్భుతమైన గిఫ్ట్ ఆ  పిల్లకి!    అప్పటికి జెర్మన్ నగరాల మీద మిత్ర పక్షాల వైమానిక దాడులు ముమ్మరం అవుతున్నాయి.   వీళ్ళుండే ఊరి మీద కూడా విమానాలు చక్కర్లు కొడుతున్నాయి.  చీకట్లలో సైరన్లు మోగగానే జనం బేస్ మెంట్ల లోకి పరుగులు  తీస్తున్నారు. పోలీసులు ఎవరి ఇళ్ళలో బేస్ మెంట్లు ఎక్కువ మందిని కాపాడగలవో అని ఇంటింటికీ చెకింగ్ కి వస్తారు.  హాన్స్ బేస్మెంట్ లో మాక్స్ ని దాచి, అతని చుట్టూ పెయింట్ డబ్బాల్లు సర్ది... ఎలానో కాపాడతారు. కానీ బాంబింగ్ మొదలయ్యాక, అందరితో పాటూ మాక్స్ షెల్టర్ కి వెళ్ళడానికి లేదు.

మిగిల్న పొరుగు వారికి ఎవరికీ అక్కడ ఆ చీకటి గుహ లో ఒక మానవ మాత్రుడు ఉన్నట్టు తెలియదు.  ఈ యుద్ధ నేపధ్యంలోనే లీసెల్ అక్షరాల్ని వింతగా చూసే స్థాయి నుండీ, వాటి శక్తిని ఆకళింపు చేసుకుని, వాటితో మృత్యుభయాన్ని, నిరాశ నూ పోగొట్టగలగడం  దాకా ఎదుగుతుంది.    బాంబింగ్ జరిగే రాత్రుల్లో అందరూ ఒక పెద్ద బేస్మెంట్ లో తల దాచుకున్నప్పుడు లీసెల్, అక్కడి వారి కోసం ఏదో ఒక పుస్తకం తీస్కెళ్ళి చదవడం, వాళ్ళ మనసుల్ని భయం నుండీ డైవర్ట్ చేయడం అవీ చేస్తూంటుంది.    తరవాత సేఫ్ సైరన్లు మోగాకా ఇంటికొచ్చి మాక్స్ కి ఇవన్నీ చెప్తూ ఉంటుంది.   మాక్స్ సహజంగా సిగ్గరి, భావుకుడు.. ఈ చీకటి గుయ్యారంలో నెలల తరబడి ఉండడం వల్ల బయట ప్రపంచం ఎలా ఉందో తెలియదు.  అతను లీసెల్ చేత ఆ రోజు ఆకాశం ఎలా వుందో, బయట ఎలా గాలి వీస్తోందో, మంచు పడుతోందో చెప్పించుకుంటూ ఉంటాడు.  వాళ్ళిద్దరి మధ్యనా చాలా ఆత్మార్ధమైన స్నేహం బలపడిపోతుంది.  బాంబింగ్ జరిగే రాత్రి,  ఇంటి వారంతా బయట వేరే వారి బేస్మెంట్ కి పారిపోయాక, తన 'గుహ'  లోంచీ బైటికొచ్చి, ఇంటి లో కొచ్చి, కర్టెన్ తొలగించి, చిమ్మ చీకట్లోకి -  బయటి ప్రపంచాన్ని చూడగలగడమే అతనికున్న లక్సరీ.

నాజీ జెర్మనీ లో యుద్ధం లో చేరి భయానకమైన చావులు చనిపోయే మామూలు సైనికులకు  కొదవ లేదు. తన అన్న, రష్యా మీద జర్మనీ చేసిన దాడిలో తీవ్ర గాయాల్తో తన ఎదురుగానే చనిపోవడం చూసిన మరొక సైనికుడి పాత్ర కూడా  వీళ్ళ పొరుగునే  ఉంటుంది.  షెల్ షాక్ కి గురయిన సైనికుడి, సోదరుడి వేదన - లీసెల్ కళ్ళెదురుగా.. ఆత్మహత్య తో - మృత్యువు కౌగిట్లో గానీ తీరని వేదన అది.  వాళ్ళిద్దరి తల్లి,  ఎదిగొచ్చిన కొడుకు మరణాన్ని భరించలేక, బాంబింగ్ సమయంలో షెల్టర్ కి రాకుండా ఇంట్లోనే మృత్యువు కోసం ఎదురు చూస్తూ కూర్చోవడం,  ఒక హృదయ విదారకమైన సంఘటన.

ఆఖరికి మాక్స్ ఇంక ఎన్నాళ్ళూ ఇలా దాగలేనని గ్రహించి,  హాన్స్ సమ్మతి తోనే, ఆ ఇంటిని విడిచిపెడతాడు. కానీ అతనికి ఏమయిందో - ఎలా ఉన్నాడో, పట్టుబడిపోయాడో, మరణించాడో,  తెలీని పరిస్థితుల్లో, వీధుల్లో కేంపులకు తరలించబడే యూదుల పెరేడ్ లో ప్రతి వ్యక్తి మొహాన్నీ పీచు పీచుమనే గుండె తో -  పరిశీలనగా చూడటం అలవాటయింది లీసెల్ కి.    రూడీ తో కలిసి, వాళ్ళు వెళ్తుండే దారిలో చిన్న చిన్న రొట్టెల తుంపుల్ని రోడ్డు మీద పేరుస్తూంటుంది.  పెరేడ్ ఆ రోడ్ కి రాగానే బందీలు రొట్టె ముక్కల కోసం ఆత్రం వా వంగడం,  నాజీలు వాళ్ళపై కొరడాలు చెళ్ళుమనిపించడం జరుగుతుంటాయి.


లీసెల్ కోసం రూడీ ఎంత సాహసాన్నయినా నిర్మొహమాటంగా చేసేస్తాడు. రూడీ కి లీసెల్ అంటే ప్రాణం. ప్రేమ!   లీసెల్ కి కూడా రూడీ అంటే అభిమానమే.  కానీ తనకి రూడీ అంటే ఎంత ప్రేమో లీసెల్ కి ఆఖరి వరకూ తెలియదు.   రిస్క్ చేసి లీసెల్ ని సంతోష పెట్టిన ప్రతి సారీ, రూడీ ఒక్క ముద్దిమ్మంటూ ప్రాధయపడేవాడు.  స్త్రీ సహజమైన సిగ్గు వల్లో, తన అహం  పట్ల అభిమానంతోనో,  ఎప్పుడూ వద్దంటూ  తప్పించుకునేది లీసెల్.   ఆఖరికి వాళ్ళుండే వీధిలోనే జరిగిన బాంబు దాడిలో అమ్మ నీ, నాన్ననీ, రూడీనీ అందర్నీ కోల్పోయిన తరవాత గానీ తనకు రూడీ మీద అంత ప్రేమున్నట్టు తెలీదు మన పుస్తకాల దొంగ కి.   మధ్య లో హాన్స్ ఒక సారి పార్టీ పిలుపు మీద యుద్ధానికెళ్తాడు. కొన్ని నెలల పాటూ..  యుద్ధంలో జెర్మనీ ని ఓటమి నలువైపులా చుట్టుముడుతోంది. మ్యూనిచ్ మీదా ఇతర జెర్మన్ నగరాల మీదా బాంబు దాడులు ఎక్కువవుతున్నాయి.  'మృత్యువు' కి పని ఎక్కువయి ఉక్కిరి బిక్కిరవుతుంది.

మృత్యువు దురదృష్టవశాతూ హెమ్మెల్ వీధికి కూడా రావాల్సి వచ్చింది.  ఏ సైరనూ మోగని ఒక దురదృష్టకరమైన రాత్రి షెల్టర్ కు వెళ్ళకుండా ఎవరిళ్ళలో వాళ్ళు నిద్రపోతుండగా, అకస్మాత్తుగా బాంబింగ్ జరుగుతుంది.   పుస్తకాల మీద ప్రీతి తో, మాక్స్ జ్ఞాపకాల మీద భ్రాంతి తో,  మాక్స్ చేత్తో చేసిచ్చిన పుస్తకాన్ని చదవడానికి  లీసెల్ వెళ్ళి బేస్మెంట్ లో కూర్చున్న క్షణానే వాళ్ళింటి మీద బాంబు  పడుతుంది.  తల్లి తండ్రి, పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే చనిపోతారు.  మర్నాడు శిధిలాల్లోంచీ, షాక్ కి గురైన ఈమె ని బయటకు తీసిన సహాయ బృందాలు లీసెల్ ప్రాణాల్తో ఉండడం ఆశ్చర్య పోతాయి.    శిధిలాల్లోంచీ బయటికొచ్చి, తల్లిన్ నీ తండ్రినీ వెతుక్కుంటూ, వాళ్ళ దేహాల్ని చూసి, నమ్మశక్యం కాని మృత్యువును ఎదిరించలేక,  శకలాల్లో దొరికిన హాన్స్ ఎకార్డియన్ ని జ్ఞాపకంగా తెచ్చుకుంటున్న లీసెల్ కి, రూడీ ఇంటికొచ్చాక, రూడీ దేహం పలకరిస్తుంది.  అప్పుడు గానీ లీసెల్ కళ్ళలో కన్నీరు మొదలవదు.   లీసెల్ రూడీ దేహాన్ని చూసి,  రూడీ ముఖాన్ని ప్రేమగా ముద్దుపెట్టుకోవడం చూసి మృత్యువు  బాధపడుతుంది - 'రూడీ బ్రతికి ఉంటే ఈ క్షణాన్ని ఎంత ఆస్వాదించేవాడో కదా?!' అని.   ఈ బాధనంతా చూసి మృత్యువు బాధపడినా, మరోచోట తన 'అవసరం'  ఉన్న కాలిన గాయాలైన జెర్మన్ సైనికుడికోసం అక్కణ్ణించీ  వెళ్ళాల్సి వస్తుంది  మృత్యువు కు.    ఆఖరికి లీసెల్ రూడీ ఇంట్లో రూడీ తండ్రి ఒక్కడూ, [అప్పటికి అతను వేరే ప్రాంతాలకి వెళ్ళడం వల్ల బ్రతికి బయట పడగా], అతనితో ఉంటూంటుంది.  

యుద్ధం ముగిసాకా, నాజీ జెర్మనీ హిట్లర్ నుండీ విముక్తమయ్యాకా, October, 1945 లో,  మాక్స్,  లీసెల్   ని వెతుక్కుంటూ వస్తాడు.   రెడ్ క్రాస్ వారి సహకారంతో లీసెల్ ఒక్కర్తీ బ్రతికి బయటపడ్డట్టు తెలుసుకుని రూడీ తండ్రి నడుపుతున్న దుకాణానికి వచ్చి లీసెల్ ని అడుగుతున్న ఈ యువకుణ్ణి రూడీ తండ్రి చాలా ఆశ్చర్యంగా చూస్తాడు.   ఒక అన్న లా లీసెల్ బాధ్యత వహించి, ఆమెను తనతో  కొత్త జీవితానికి, సిడ్నీ, ఆస్ట్రేలియా,  తీస్కెళ్ళిపోతాడు.  ఇదీ బుక్ థీఫ్ కధ.  ఇదంతా మృత్యువు చెప్పే కధే.  

రచయిత మృత్యువును ఎంతో లలితంగా వర్ణిస్తాడు.  లేదా మృత్యువే "చావుని"  లలితంగా వర్ణిస్తుందనాలి.  మరణించిన ప్రతి ప్రాణీ మృత్యువు కు ప్రత్యేకమే.  ప్రతి ప్రాణాన్నీ ఎంతో ఆత్మీయంగా చేతుల్లోకి లేవదీస్తుంది.  ఆ ఆత్మ ఐస్క్రీం లా సాఫ్ట్ గా, చల్లగా ఉంటుందంట.  పక్షి ఈక లా తేలిగ్గా.. మృత్యు హస్తాల్లో సేద తీరిన ఆత్మ (!) మెల్లగా కరిగి - మాయమవుతుంది.  మృత్యువు ఓదార్పులు -  బాంబు దాడుల్లో చనిపోయిన వాళ్ళకీ,  నిష్కారణంగా నిండు యవ్వనాన్ని యుద్ధోన్మాదికి  (జెర్మనీ తరఫు)  అంకితం చేసి,   ఛిద్రదేహాలతో చిత్రహింస అనుభవించే సైనికులకీ - రోగాలతో నయం కాని మానసిక వ్యగ్రత తో చనిపోయే సామాన్యులకీ,  హిట్లర్ చంపించేసిన లక్షలాది యూదు ఖైదీలకీ, ఆఖరికి హిట్లర్ కి కూడా ఎంతో ప్రేమ తో చెందుతాయి.  మృత్యువు ఎంత శాంతంగా ఉంటుందో !  మృత్యువుకీ మనసుంటుంది. ఈ భీభత్సాన్నీ, హింసనూ చూసి మృత్యువు కూడా బాధపడుతుంది. మృత్యువు అందరిదీనూ. అందరికీ మృత్యువు చెందినదే !


 కధ ముగిసే సమయానికి,  మృత్యువూ, లీసెల్ కలుసుకుని,  ఈ ముచ్చట్లన్నీ నెమరువేసుకుంటారు.  అదొ మైమరపించే ఫిలసాఫికల్ సీన్.     అందరికీ  మృత్యుముఖాన ఉన్నప్పుడు  జీవిత చక్రం  మొత్తం   స్పష్టంగా కనిపిస్తుందంట.    నీకవన్నీ  గుర్తున్నాయా అంటుంది లీసెల్   మృత్యువు తొ!  ఓ స్నేహితురాలితో మాట్లాడుతున్నట్టు.


[I wanted to tell the book thief many things go,  about beauty and brutality.  But what could I tell her about the things that she didn't already know?  I wanted to explain that I'm constantly overestimating and underestimating the human race - that rarely do I ever simply estimate it.  I wanted to ask her how the same thing could be so ugly and so glorious,  and its  words so damning and brilliant and so glorious,  and its words so damning and brilliant. 

None of those things,  however,  came out of my mouth.]


ఈ పుస్తకానికి దొరికిన ఆదరణ ని చూసి, దీన్నో సినిమా గా కూడా తీసారు.  పుస్తకం చదివే ఓపిక లేనివాళ్ళ కోసం,  ఇంటర్ నెట్ నిండా బోల్డన్ని సినాప్సిస్ లూ, వీడియోలూ ఉన్నాయి.  మృత్యువు చెప్పిన ఈ కధ, పుస్తకాల మీద ప్రేమతో పుస్తకాల సాయంతో బ్రతికి, నాజీ జెర్మనీ లో పుస్తకాలు వొద్దన్న నాజీల నైజానికి వ్యతిరేకంగా తాను దొంగిలించిన పుస్తకాల్ని దాచుకుని చదువుతూ, తన ప్రపంచాన్ని సృష్టించుకున్న లీసెల్ మెమింజర్ కధ.  పుస్తకం గానే చదివితే బావుంటుంది.


Note : This post first appeared in Pustakam.net   http://pustakam.net/?p=19607 

No comments: