సాదత్ హసన్ మంటో కధలు రెండు :
1. Mozelle
త్రిలోచన్ నాలుగు సంవత్సరాలుగా బొంబాయిలో ఉంటున్నాడు. అద్వానీ టవర్స్ లో! అతను సాంప్రదాయాన్ని పాటించే సిఖ్. పల్లెలో ప్రైమరీ విద్య పూర్తయ్యాకా, హైస్కూల్ కి పట్నం వచ్చేసాడు. కాలేజీ చదువు పట్నం లోనే. బొంబాయి చేరే ముందు ఉపాధి కోసం ఎక్కడెక్కడో తిరిగాడు. బొంబాయి వచ్చాకా 'యూదులు' ఎక్కువగా నివసిస్తూండే ప్రాంతాల్లో అద్వానీ టవర్స్ లో ఒక చిన్న ఫ్లాట్ లో తలదాచుకుంటున్నాడు. కధ మొదలయ్యేనాటికి బొంబాయి లో అల్లర్లు జరుగుతున్నాయి. త్రిలోచన్ అర్ధ రాత్రి దాటాకా, మూడింటికి టెర్రస్ మీదికొచ్చి దూర దూరాల్లో ఆకాశహర్మ్యాలలో దాక్కున్న మిణుగురుల్లాంటి దీపాల్ని చూస్తున్నాడు.
త్రిలోచన్ ముప్ఫయి ఐదేళ్ళ యువకుడు. ఈ మధ్యనే అతనికి కల్వంత్ కౌర్ తో ప్రేమ కుదిరింది. కల్వంత్ అతని గ్రామానికి చెందిన పిల్లే. కల్వంత్ సోదరుడు నిరంజన్, బొంబాయికి దగ్గర్లోని దేవ్ లాలీ లో ఏవో కాంట్రాక్టులు చేస్తుంటాడు. కల్వంత్ కి పక్షవాతానికి గురయి మంచానికే పరిమితమైన తండ్రి, గుడ్డి తల్లి, ఉన్నారు. త్రిలోచన్ తీవ్ర ఆందోళన లో ఉన్నాడు.
కల్వంత్ ఇల్లు ముస్లింలు ఎక్కువ గా ఉండే ప్రాంతం లో ఉంది. రోజూ వార్తా పత్రికల్లో మతం పేరుతో మనుషుల్ని తెగ నరుకుతున్నారన్న వార్తలు చదువుతున్నాడు. సిక్కుల్నైతే ఊచ కోత కోస్తున్నారు. ఈ సారి నిరంజన్ ని ఎంత బ్రతిమలాడినా పని ఉందని దేవ్ లాలీ వెళ్ళాడు. ఈ అల్లర్ల గురించి, త్రిలోచన్ వ్యక్త పరచిన భయాల్ని తోసి పారేశాడు. పైగా ఇది అమృత్ సరో, లాహోరో కాదని , బొంబాయి అనీ, ఇక్కడ తాను పదేళ్ళు గా ఉంటున్నాడని, చెదురు ముదురుగా తప్ప అక్కడ అల్లర్లు జరగవు అనీ నచ్చ జెప్పి వెళ్తాడు, నిరంజన్.
కానీ వారం గడిచాకా పరిస్థితులు బాగా దిగజారాయి. నిరంజన్ ని, తన కుటుంబాన్ని తన చిన్న ఫ్లాట్ కు తెచ్చేయమని, బ్రతికుంటే ఎలానో సర్దుకుందామనీ చెప్పినా విన్లేదు. ఇప్పుడు త్రిలొచన్ ఉన్న ప్రాంతాల్లో 48 గంటల కర్ఫ్యూ అమల్లో ఉంది. ఇది ఇంకా పొడిగింపబడవచ్చు. ఏమాత్రం అవకాశం చిక్కినా వెంటనే వెళ్ళి కనీసం కల్వంత్ ని రక్షించుకోవాలని త్రిలోచన్ తీవ్ర ఆందోళన లో ఉన్నాడు. కానీ కర్ఫ్యూ వల్ల ఎటూ కదలడానికి లేదు.
ఆ వేళప్పుడు టెర్రస్ మీద ఆలోచనల్లో కూరుకుపోయిన త్రిలోచన్ కు తన ఎదురింటమ్మాయి మోజెల్ గుర్తొస్తుంది. ఒకప్పుడు మోజెల్ ను ఎంత గానో ప్రేమించాడతను. ఆమె ను మర్చిపోవడం అసాధ్యం. ఆ పిల్ల చాలా అందమైనది. ఆ అందంకో అంతులేని 'లెక్కలేని' తనం. త్రిలోచ్ లాంటి కరుడు కట్టిన సిక్కు ని కదిలించిన ఆమె హృదయం. మోజెల్ నిర్లక్షమైన వ్యక్తిత్వం తప్పితే ఆమె కు సంబంధించినది ప్రతీదీ ఇతనికి ఇష్టం. మోజెల్ ఒక యూదు యువతి, కర్ర జోళ్ళు ధరించి టిక్కు టక్కు మంటూ మగవాడిలా నడుస్తుంది.
పల్చని గౌన్లాంటిదేదో వేసుకునుంటుంది. పెద్ద యూదు కళ్ళు. రంగు రాయక పోయినా ఎర్రగా మాంసం లా మెరుస్తూండే పెదవులూ. ఆమె శరీరంలో ప్రధానంగా ఆకర్షించే పెద్ద స్తనాల మీద నీలి రంగులో నరాలు కనిపించేంత 'లో నెక్' గౌన్ లు ధరిస్తుంది. నిర్లక్షమైన వస్త్ర ధారణ, లేశ మాత్రమైనా స్త్రీ సహజమైన సున్నితత్వం అంటూ లేని ఆమె నడక, అడ్డదిడ్డంగా ఉండే జుత్తూ, వెరపు కలిగించే లిప్ స్టిక్ వెనక ఆమె హృదయాన్ని, ఈ సిక్కూ ఎందుకో ఆకర్షించాడు.
త్రిలోచ్, మోజెల్ ని హృదయపూర్వకంగా ప్రేమించాడు. ఆమె కూడా తన అభిమానాన్ని దాచుకునేది కాదు. వారి ఏకాంతం లో మోజెల్ పెద్దగా ఉత్సాహం చూపేది కాదు. ఎంత అభిమానం ఉన్నా పుల్ల విరుపు మాటల్తో, త్రిలోచన్ ని దూరం పెట్టేది. త్రిలోచ్ ని మత పరంగా అవమానిస్తూ మాట్లాడేది. అతని కేశ్, కచ్చా (సిక్కులకు మత పరంగా కేశ్, కృపాణ్, కడా, కంగా, కచ్చా అంటే, కత్తిరించని జుత్తు, కత్తి, నిక్కర్ లాంటి అంగ వస్త్రం, ముంజేతి కడియం, చెక్క దువ్వెన- ముఖ్యమైనవి) లను ఆటపట్టించేది. నీ గరుకు గడ్డంతో నా స్కర్ట్ ఉతుక్కోవచ్చు అని వెక్కిరించేది.
ఆమె తన వేషాన్ని గురించి మాటాడినప్పుడల్లా త్రిలోచ్ కు వళ్ళు మండేది, గానీ పెద్దగా ఆమెను ఏమీ అనలేకపోయేవాడు. ఎందుకంటే మోజెల్ తో వాదించి గెలవడం కష్టం. హిపోక్రసీ గిట్టని మనిషి ఆమె. మతం, మత చిహ్నాలూ అంటే చిన్న చూపు ఆమెకు. అతని గడ్డాన్ని వేళాకోళం చేసేది. పొడుగైన అతని జుత్తుని హాస్యం చేసేది, ఆఖరికి అతని కచ్చా ని కూడా అవమానించేది. ఈ మోజెల్ కి ఏదీ దాయడం రాదు. మధ్యలో ఆమె తిరుగుమోత్తనాన్ని కూడా ఆపేది కాదు. వీధి లో ప్రతీ వాడూ ఆమె ప్రియుడే. ఆ విచ్చలివిడి తనాన్ని త్రిలోచ్ ఒప్పుకోలేకపోయినా, ఆమె వ్యక్తిత్వం మీద గౌరవం ఇంకా పోలేదు అతనిలో.
ఎన్ని సార్లు త్రిలోచ్ పెళ్ళి ప్రతిపాదన తెచ్చినా తెలివిగా తప్పించుకునేది, నాకు, నీలా వొంటి నిండా జుత్తు మోసుకు తిరిగే సిక్కు కీ కుదరదు లెమ్మనేసేది. త్రిలోచ్ పొడుగ్గా పెరిగిన గడ్డాన్ని బన్ లా రోల్ చేసి, క్లిప్పులతో చుబుకానికి దగ్గరగా కట్టుకునేవాడు. ఒక రోజు ఆమె ఆ క్లిప్ లన్నీ ఊడ తీసి..నీ జుత్తు మృదువుగానే ఉందే..అని ప్రేమగా మాటాడింది. త్రిలోచ్ కరిగిపోయాడు. మోజెల్ కళ్ళల్లో తన పెళ్ళి ప్రతిపాదన తో కనిపించిన మెరుపు చూసి అతని మనసు నిండిపోయింది.
'నీకూ నాకూ మధ్య అడ్డంగా ఉన్న ఈ జుత్తుని తీసేసావో అపుడు నిన్ను తప్పకుండా పెళ్ళాడుతా!' అని చెప్తుంది. త్రిలోచ్ మరో మాట లేకుండా ఒప్పేసుకుంటాడు. మర్నాడు బార్బర్ షాప్ కి పోయి శుభ్రంగా క్షవరం చేయించుకుంటాడు. సహజంగా అందగాడు. ఈ క్షవరం తరవాత ఈడొచ్చిన ఆడపిల్లలా మెరిసిపోతాడు. ఇన్నాళ్ళూ మతం పేరు చెప్పి ఇంత బరువు ఎలా మోసానబ్బా అని కూడా అనుకుంటాడు కత్తిరించేసిన తన కేశాల్ని తల్చుకుని. కానీ ఇంత మార్పుకీ కారణమైన మోజెల్ మాత్రం రేపు పెళ్ళాడతాననగా ఎంతో నిర్లక్షంగా, అతని హృదయం మీద నుంచీ నడిచెళ్ళి, ఒక తెలిసిన యువకుడితో కలిసి దేవ్ లాలీ వెళ్ళిపోతుంది. ఈ హార్ట్ బ్రేక్ తరవాత చాన్నాళ్ళు త్రిలోచ్ మనిషి కాలేకపోతాడు. అయితే ఇదంతా జరిగి ఏడాది అయింది. మోజెల్ ఎక్కడుందో తెలీదు.
అఅది జరిగిన కొన్నాళ్ళ తరవాత కల్వంత్ ని కలిసాడు త్రిలోచన్. మర్యాద గల ప్రవర్తన గురించి తాను మోజెల్ కి చెప్తూన్నపుడు..' నీ హృదయాన్నికి దగ్గరగా ఉండే ఏ సిక్కు పిల్ల నో చేసుకోవచ్చు కదా - నాకూ నీకూ పడదు' అంటూ మోజెల్ జవాబు చెప్తూండేది. అలాంటి మర్యాదస్తురాలైన పిల్లే "కల్వంత్"! ఆమె పరిచయం అవ్వగానే, అంత వరకూ తాను కోరుకున్నది అలాంటి పిల్లనే అని త్రిలోచన్ తెలుసుకున్నాడు. మోజెల్ కి పూర్తి గా వ్యతిరేకం ఈ పిల్ల.
కావడానికి పల్లె లో పుట్టి పెరిగీ, ఎండా, వానా తెలిసిన పిల్లే ఐనా ఆమె లో సిక్కు స్త్రీల లో కనిపించే మగ లక్షణాలూ, శ్రమ ని ఓర్చుకునే శారీక ధారుఢ్యం లేవు, తెల్లని, తేనె లాంటి వళ్ళూ, నూలు లాంటి మృదువైన చర్మం, సిగ్గూ, అమాయకత్వం కలగలిపిన సౌందర్యం కల్వంత్ ది. ఆమెలో స్త్రీత్వపు సున్నితత్వం, ఇంకా ఎదిగి నిండుతనాన్ని సంతరించుకోని ఎద, త్వరగా భయపడిపోయే వ్యక్తిత్వం, ఆమె కు ఎటువంటి హానీ జరగ కుండా కాపాడి తీరాలనిపించేలాంటి భావన ని త్రిలొచన్ లో తట్టి లేపింది.
మోజెల్ జ్ఞాపకాల నుండీ తన ఆలోచనల్ని బలవంతంగా తప్పించుకుని, కల్వంత్ గురించి ఆలోచిస్తున్నాడు. ఆమె గుడ్డి తల్లీ, పక్షవాతపు తండ్రినీ కాపాడలేకపోయినా కనీసం ఆమె ను ఊచకోత నుండీ రక్షించాలి. కానీ కింద కర్ఫ్యూ. మోజెల్ దయ వల్ల తన జుత్తుని కత్తిరించినా తన ప్రవర్తన కు సిగ్గు పడి, మళ్ళీ జుత్తు పెంచుకుంటున్నాడు. గడ్డం తెలివిగా ట్రిం చేయించుకుంటున్నాడు. కల్వంత్ కుటుంబానికి మాత్రం తన టర్బన్ కింద పొడుగు కేశాలే ఉన్నట్టు భ్రమ కలిగించేట్టు గుట్టుంగా నెట్టుకొస్తున్నాడు. తాను జుత్తు కత్తిరించినట్టు తెలిస్తే సాంప్రదాయ వాదులైన వారి కుటుంబం తనను నిరాకరించవచ్చు.
అదే సమయానికి ఎక్కణ్ణుంచో మోజెల్ ఊడిపడుతుంది టెర్రస్ మీదికి! ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడినందుకు క్షణం ఇబ్బంది పడినా, మోజెల్ మొదట మాటలు మొదలు పెడుతుంది, ఎగురుతున్న అతని జుత్తు చూసి, 'ఓహ్! నువ్వు మళ్ళీ 'సిక్కు' వవుతున్నావా ? ' అని అడుగుతుంది. 'అవును!' అనంగానే 'మరి ఇంకో అమ్మాయి తో ప్రేమ లో పడ్డావా?!' అని అడుగుతుంది. ఆమె మీద అక్కసు తో ఆమె కు 'కల్వంత్' గురించి చెప్తాడు. తన ఆందోళన గురించి కూడా.
మోజెల్ మరి.. "ఆమె ను రక్షించకుండా ఇక్కడ ఏమి చేస్తున్నావ"ని అడుగుతుంది ఏమత్రం తొణక్కుండా! "కర్ఫ్యూ గురించి నీళ్ళు నముల్తూంటే ఆమె శవమే మిగుల్తుంది. పద వెళ్దాం!" అని బయల్దేరదీస్తుంది. మోజెల్ తనని వొదిలి వెళ్ళిందన్న అక్కసు కొంచెం నెమ్మదించాకా, ఆమె ఎంత తిరుగుబోతయినా, తన తో రెండేళ్ళు దగ్గరగా మెలిగిందన్న సంగతి గుర్తొస్తుంది. ఆమె గురించి తనకు తెలుసు. మొండి ధైర్యం ఈ పిల్లకి. ముందూ వెనకా ఆలోచించదు. మనసుకు ఏమి తోస్తే ఆ మాటనడం, ఆ పని చెయ్యడం ఆమె లక్షణం. ఎవ్వర్నీ లెక్క చెయ్యదు.
కాసేపు వాదించాకా, ఉండు నేను టర్బన్ ధరించి వస్తాను అని అతను వెళ్ళబోతుంటే, 'నీ మతాన్ని కాస్త పక్కన పెడతావా? మనం వేళ్ళేది ముస్లిం ప్రాంతానికి, నీ వేషం చూడగానే, నిన్ను నరికి పోగులు పెడతారు' అని అరుస్తుంది. త్రిలోచన్ వినడు. టర్బన్ లేకుండా తన పొట్టి కేశాలతో కల్వంత్ కౌర్ కు ఎదురుపడడం అతనికి ఇష్టం లేదు. నానా తిట్లూ తిట్టి, ఉన్న ఫళానా బయల్దేరుతుంది మోజెల్. తన కర్ర జోళ్ళు టక టక లాడిస్తూ, పల్చని ఆ గౌన్ లోనే, వీధిలో మొగవాడిలా నడుచుకు పోతుంది. వెనగ్గా త్రిలోచన్.
వీళ్ళు వెళ్తూంటే దార్లో ఒక పోలీసు అటకాయిస్తాడు. అక్కడా , ఇంకా, ఎన్నో ఆపదలు, గండాలూ ఎదురైనా సమయస్పూర్థి తో, తన చిలిపి నవ్వుల్నీ ఎర వేసి, 'పూర్వ' పరిచయాల్ని గుర్తు చేస్తూ, త్రిలోచ్ ను ముందుకు తీసుకెళ్తూంది. కల్వంత్ నివాస పరిసరాల్లో పరిస్థితులు విషమంగానే ఉన్నాయి. వీళ్ళు చేరే సరికీ నిర్మానుష్యమైన బజార్లలో, లూటీలూ, దొమ్మీలూ జరుగుతున్నాయి. త్రిలోచన్ కి అడుగడుక్కీ ధైర్యం చెప్తూ ముందుకు సాగిపోతుంది మోజెల్. ఆమె ధైర్యానికి, తెగువ కూ, ఆమె వ్యవహార కుశలతనూ, ప్రాణాన్ని, శీలాన్నీ లెక్క చెయ్యని ఆమె వ్యక్తిత్వాన్నీ చూస్తూ ఈ మాజీ ప్రేమికుడు విస్తుపోతున్నాడు. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆమె విచ్చలివిడితనమే అతన్ని రక్షిస్తోంది.
త్రిలోచ్ ని పొడవబోయిన ముస్లీము దొంగ ని కూడా, పేరు పెట్టి పిలిచి, స్నేహంగా మాటాడి, కవ్వించ్ని, దృష్టి మళ్ళించి రక్షిస్తుంది. అతను కామం నిండిన కళ్ళతో మోజెల్ ను తాగేసేలా చూసి, మోచేత్తో ఆమె ఎదను నొక్కేసి, వీణ్ణి పొడవకుండా వెళిపోతాడు. మోజెల్ తన గౌన్ సర్దుకుని మామూలుగా ముందుకు సాగుతుంటే, వాడి ప్రవర్తన ని తల్చుకుని "చీ! ఎంత నీచం?!" అని త్రిలోచన్ విసుక్కుంటే .. "ఏమిటి నీచం?! అంతా ఒకటే!! " అనేస్తుంది తేలిక గా.
తీరా వీళ్ళు కల్వంత్ ఇంటికి చేరే సరికీ ఊచ కోత మొదలయ్యి ఉంటుంది. పై అంతస్థు లో దాడి జరుగుతోంది. ఇంట్లో ఒంటరిగా కల్వంత్, తల్లిదండృలు వొణికిపోతున్నారు. మోజెల్ కల్వంత్ ని చూసి, పరిచయాలు చేసుకునే సమయం లేదు. అయినా ఆమె కల్వంత్ ని తన పెద్ద హృదయానికి హత్తుకుని, "భయపడకు.. త్రిలోచన్ వచ్చాడుగా! అతను నిన్ను కాపాడతాడు" అని ఓదారుస్తుంది. ఏమీ చెయ్యడానికీ దిక్కు తోచక నిశ్చేష్ఠ గా నిలబడిపోయిన కల్వంత్ షర్ట్ ని గబ గబా లాగేసి, తాను నిముషాల్లో గౌన్ తీసి, నగ్నంగా మారి, తన గౌన్ ని ఆమె కు తొడిగి, సల్వార్ ని కూడా లాగేస్తుంది. అల్లుకున్న ఆమె కురుల్ని విప్పేస్తుంది. 'కల్వంత్ ని, తల్లి దండ్రుల్ని తీసుకుని పారిపో త్రిలొచన్. కల్వంత్ దుస్తుల్ని చూసి ఎవరూ ఆమె ను సిఖ్ అనుకోరు. నేను మీ వెనకే వస్తా" అంటుంది. జనం అప్పటికి వీళ్ళింటి మీద పడ్డారు. తలుపులు విరిగేలా బాదేస్తున్నారు.
అంత కన్నా ఆలోచించడానికి వ్యవధి లేదు. ఏ క్షణానైనా ఆ తలుపు విరిగిపోవచ్చు. ఆ ఇంట్లో ఉన్న అందరి కన్నా, ఆ క్షణాన ఆలోచించ గలిగేంత మానసిక స్థైర్యం మోజెల్ కే ఉంది. ఆమె వెంటనే 'నేను తలుపు తెరుస్తాను. బయటికి పరిగెడతాను. త్రిలోచ్, నువ్వు నా వెనకే పరిగెట్టు. బయట జనం గందరగోళ పడతారు. ఆ సమయాన కల్వంత్ సహా అందరూ తప్పించుకోవాలి. నువ్వూ ఆ గందరగోళం లో తప్పించుకో ' అని చెప్పేసి, త్రిలోచన్ ఆమె ఆలోచన ను కల్వంత్ కు విడమరచి చెప్పగానే, తలుపు తెరిచి బయటకు పరుగు తీస్తుంది. తెల్లని శిల్పం (తెల్లని బల్లి లాంటి నగ్నత !!! - మంటో వర్ణన ఇది) లాంటి ఆమె నగ్నత చూసి జనం మతి పోయి ఒక్క క్షణం ఆగిపోతారు. ఆమె వెనకే పరుగు తీసిన త్రిలోచన్ (టర్బన్ తీసేసాడు కల్వంత్ ఇంట్లో) కి, అప్రయత్నంగా దారి తొలగుతారు.
తన కర్ర జోళ్ళ ను టక టక లాడిస్తూ మెట్ల మీదుగా పరిగెత్తిన మోజెల్ ఒక అంతస్థు దాటగానే జోళ్ళు తట్టుకునే పడిపోతుంది. ఆమె నగ్న దేహం, మెట్ల మీద నుండీ దొర్లి, రెయిలింగ్ ని రాసుకుంటూ దబ్బున నేల వాలగానే, త్రిలోచన్ ఆందోళన తో ఆమెను చేరి, తలను ఎత్తి పట్టుకుంటాడు. ఆమె వొళ్ళంతా గాయాలు. పెదవి అంచుల్నిండా రక్తం. ఆమె తన పెద్ద యూదు కళ్ళనెత్తి త్రిలోచన్ ని చూస్తుంది. ఆమె కళ్ళు ఎర్రగా రక్తమోడుతున్నట్టు ఉంటాయి. ఆమె అతన్ని చూసి నవ్వుతుంది.
'మోజెల్', 'మోజెల్' అని వెర్రిగా అరుస్తున్న అతన్ని చూసి.. "వెళ్ళు! కింద నా అండర్ వేర్ ఉందో లేదో చూడు..నీ కర్ధం అవుతుందా ? " అని అడుగుతుంది. ఊచకోత కోయడానికొచ్చిన రాక్షస జనం ఆమె దేహం చుట్టూ మూగి ఉన్నారు. ఆమె చెప్పే అండర్వేర్ సంగతి అతనికి అర్ధం అయినా, ఆ పరిస్థితి లో ఆమెను వొదిలి వెళ్ళ లేక, అతను పడే తపన ను చూసి.. "వెళ్ళు సిక్కూ.. వెళ్ళు పోయి చూసి రా" అంటుంది కోపంగా.
అతను అలా వెళ్ళగానే చుట్టూ మూగిన వాళ్ళని చూసి.. "అతను ముస్లిమే. కాకపోతే కొంచెం రౌడీ తరహా. అందుకే అతన్ని నేను సిక్కు అంటూ ఉంటాను" అంటుంది. కిందికి వెళ్ళి వచ్చి త్రిలోచన్, కల్వంత్ కుటుంబం తప్పించుకున్న సంగతి కళ్ళ తోనే చెప్పాక, ఆమె రిలీఫ్ తో ఒక నిట్టూర్పు విడుస్తుంది. ఆ ప్రయత్నంలో ఆమె నోటిలొంచీ రక్తం మరింత కారిపోతుంది. త్రిలోచన్ తన టర్బన్ ని విప్పి ఆమె మీద కప్పుతాడు. ఆమె "సరే.. డార్లింగ్. గుడ్ బై" అని చెప్తుంది.
త్రిలోచన్ ఆమె తో ఏదో చెప్పాలనుంటాడు. కానీ ఉద్వేగంతో అతని గొంతు లోంచీ మాటలు రావు. కళ్ళలోంచీ కన్నీరు తప్ప! ఆమె అతి ప్రయత్నం మీద, తన మీద కప్పిన "తల పాగా" [Turban] వస్త్రాన్ని తీసి అతనికి ఇచ్చి... "ఇంద తీసుకో నీ మతాన్ని" అంటుంది. అన్నాకా..నిర్జీవమైన ఆమె చేతులు ఆమె పెద్ద పెద్ద స్తనాల పై వాలిపోతాయి. ఇదీ మోజెల్ ముగింపు.
మోజెల్ ఒక అందమైన, సిగ్గు ఎగ్గు, భయమూ, ఎరగని విచ్చలి విడి మనిషి. ఆమె కు ఈ కుల మతాలూ, ఉచ్చ నీచాలూ లేవు, అందరూ సమానమే. అయినా ఏ మూలో త్రిలోచన్ అంటే ప్రేమ. అతని మనస్తత్వానికీ, తన మనస్తత్వానికీ కుదరదని తెలుసు. ఆఖర్న దేవత లా అతని కష్ట సమయాన ప్రత్యక్షమై, ప్రాణాలొడ్డి, అతన్ని, అతను ప్రేమించిన అమ్మాయినీ కాపాడుతుంది. కధంతా మంటో వర్ణనల్లో ఆమె స్తనాలూ, ఇతర శరీర భాగాలూ, అసహ్యమైన అలవాట్లూ, నిర్లక్ష ధోరణీ వెనక ఆమెకు ఓ హృదయం ఉందని, దాన్ని పాఠకుల చేత గుర్తింప చేయడం లో మంటో సఫలుడయ్యాడు.
సాదత్ హసన్ మంటో స్త్రీ శరీరాన్ని వర్ణిస్తాడనీ, వ్యభిచారుల గురించి రాస్తాడనీ వగైరా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఆయన ఎవరూ మాట్లాడడానికి సాహసించని విషయాల మీద రాసాడు. మోజెల్ లానే రక రకాల "స్త్రీ" ల కధల్ని రాసాడు. ఇంకో కధ లో ఇంకో స్త్రీ హృదయాన్ని తెలుసుకుందాం. మోజెల్ మిమ్మల్ని వెంటాడడం ముగిసేలోపే ఆ ఇంకో మంటో కధ ను గురించి రాస్తాను.
ఈ కధ బాంబే స్టోరీస్ లోనిది. ఇంకా దీన్ని కుష్వంత్ సింగ్ సెలెక్ట్ చేసిన బెస్ట్ ఇండియన్ షార్ట్ స్టోరీస్ వాల్యూం-II లో కూడా ప్రచురించారు.
No comments:
Post a Comment