Pages

28/07/2011

Keep it Clean, silly

ఈ మధ్యనే మా సంస్థ ఆధ్వర్యాన నడిచే ప్రతిష్ఠాత్మకమైన స్కూళ్ళ గురించి ఈ మధ్యనే చేరిన పిల్లల తండ్రుల నుండీ ఫీడ్బాక్ వచ్చింది. అయ్యా ! మన స్కూళ్ళు మునిసిపల్ బళ్ళ లానే ఉన్నాయి - అని వాపోయారొక పెద్దాయన. మా పెద్దాయన మాత్రం ఏం చేస్తాడు ? వాళ్ళ పిల్లలు కూడా ఇలాంటి బళ్ళలోనే చదివారు. మేమూ చిన్నప్పుడు గవర్నమెంటు బళ్ళలోనే చదూకున్నాం. ఆ రోజులు వేరు ఈ రోజులు వేరూ అని పెదవి విరచొచ్చు. ఇప్పుడు సర్కారు బడి అంటే - అధమాధమ ప్రమాణం.

మొన్నే పేపర్లో చదివి బాధ కలిగింది. పోస్కో కి వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్న ప్రాంతాల్లో పిల్లల బడులు బందు. ఏమయ్యా అంటే అక్కడ పోలీసులు, ప్రభుత్వ సాయుధ బలగాలూ విడిది చేస్తున్నయి ఈ బళ్ళలో. ఇంకెక్కడా వాళ్ళకి ఉండడానికి వసతి లేదు (ట) ! కాబట్టి గవర్నమెంటోడి స్కూలు భవనం లో ఉంటున్నరు. పిల్లల చదువు అటక ఎక్కినట్టే ! ఇదీ సామాన్యంగా మన ప్రభుత్వాలు చదువు కి ఇచ్చే ప్రాధాన్యత !


పోనీ అదేదో ఎక్కడో జరుగుతున్న విషయం. మన దేశంలో ఘనత వహించిన ప్రైవేటు బళ్ళలో కూడా ప్రమాణాలు దారుణంగానే వుంటున్నాయి. చదువు సంగతి పక్కన పెట్టండి. పిల్లలు అంతుచిక్కని జ్వరాలతో, ఇన్ఫెక్షన్లతో బాధపడుతుంటే, అవి స్కూళ్ళలో వాళ్ళు వాడే టోయిలెట్ల వల్ల వ్యాప్తి చెందుతున్న ఎవరికీ లొంగని క్రిముల కారణంగానే అని వైద్యులు తేల్చేస్తున్నారు.


అందరూ ఇంటర్నేషనల్ స్కూళ్ళలో పిల్లని చదివించలేరు. మధ్యతరగతి కేటగిరీ జనాల్లో స్తోమత బట్టీ బళ్ళలో చేర్పిస్తున్నారు. స్కూళ్ళన్నీ సిండికేటు గా మారి ఏటేటా ఫీజులు పెంచేస్తున్నాయి. తల్లితండ్రులు వేరే ఆప్షన్స్ లేక ఆయా ప్రాధాన్యతలని బట్టీ బడులను ఎంచుకుంటున్నారు.

స్కూలు - పిల్లల జీవితాలలో ఒక గర్వపడే ఇన్స్టిట్యూట్. స్కూలు చుట్టూ వాళ్ళ కెన్నో జ్ఞాపకాలు పెనవేసుకుని వుంటాయి. స్కూలు భవనానికొక సెంటిమెంటల్ వాల్యూ వుంటుంది. స్కూలు యూనిఫాం కి ఒక పవిత్రతా వుంటుంది. ఆడపిల్లలకి సల్వార్ కమీజ్ మాత్రమే యూనిఫాం గా నిర్దేశించడం, జడలు ఒక్కోరోజు ఒక్కోలా వేసుకోవాలని (క్రమశిక్షణ పేరుతో) నిర్దేశించడం, వివక్ష కిందే వస్తుంది. ఎవరికి ఎలా సౌకర్యంగా వుంటే అలా డ్రెస్ చేసుకోవచ్చని పిల్లలకి స్వేచ్చ ని ఇవ్వకపోవడం (అంటే ఆడపిల్లలు సల్వార్ కమీజ్ + దుపట్టా వేసుకోవాలనీ, జడలు ఇలానే కట్టుకోవాలనీ - దానికోసం వాళ్ళు జుట్తు పెంచుకోవడం కానీ, ఇష్టం ఉన్నా లేకపోయినా, జడకి చిక్కనంత చిన్నగా కత్తిరించుకోవడం గానీ చేస్తున్నారు) - మనం గీసుకున్న గిరి. ఇది నాకెప్పుడూ అర్ధం కాదు.

అయితే నా ఇతివృత్తం స్కూలు టాయిలెట్ ! ఇది నీట్ గా మెయింటెయిన్ చెయ్యకపోవడం వల్ల పిల్లలు పలు వ్యాధులకు గురి అవుతున్నారు. ముఖ్యంగా పిల్లల్ని మనం మన ఇళ్ళలో ఎంత శుభ్రంగా పెంచినా, పాఠశాలల్లో అశుభ్రతకి అనారోగ్యానికీ గురి కావడం మనం చేసుకున్న దురదృష్టం. అసలు మన దేశం లో ఇప్పుడిప్పుడే పరిశుభ్రంగా మెరిసే టాయిలెట్ల గురించి అవగాహన పెరిగింది. పబ్లిక్ టాయిలెట్లు చెత్తగా వుండటం, మనకి బాగా అలవాటు కదా. అవి పిల్లలకి స్కూలు రోజుల్నించే ఉగ్గుపాలతో రంగరిస్తున్నాం.

టాయిలెట్లు అరకొర గా వుండడం, వాటిల్లో నీళ్ళు లేకపోవడం, గాలీ వెలుతురూ లేని చోట్ల, చాలా తరగతి గదులకు దూరంగా - పిల్లలు వీలయినంత అవాయిడ్ చెయ్యాలనుకునేంత చెత్తగా వుంటున్నాయిట చాలా స్కూళ్ళలో టాయిలెట్లు. పెద్ద పిల్లలు కొంచెం ఓర్చుకున్నా, చిన్న పిల్లల టాయిలెట్లనన్నా మానవతా దృక్పధంతో శుభ్రంగా వుంచడం అవసరం. ఏం లేదు - ప్రిన్సిపాలో, కరస్పాండెంటో - ఆ భవంతి కి చక్రవర్తి కాబట్టి మధ్య మధ్య లో వెళ్ళి ఒక సర్ప్రైస్ చెక్ లాంటివి చేస్తూ ఉంటే, ఇవన్నీ శుభ్రంగానే వుంటాయి. కావల్సింది చిత్తశుద్ధి.

వ్యాపార దృక్పధంతో నడిచే స్కూళ్ళు - ఎన్నని చూసుకోగలవు ? ఈ మధ్య కక్కుర్తి బుద్ధులు ఎక్కువయ్యాయి కదా - కాస్ట్ కటింగ్ అని పేరొకటి పెట్టారు. అది ఇక్కడ కూడా మొదలయింది. శుభ్రతా ప్రమాణాలు చేరడానికి, వివిధ పరికరాలూ, సిబ్బందీ సమకూర్చుకోవడానికీ, ఇంఫ్రాస్ట్రక్చర్ కీ డబ్బు చాలట్లేదుట.

ఏటా వీళ్ళు స్కూలు లో టాయిలెట్ మెయింటెనెన్సె కని కొంత డబ్బు కట్టించుకుని అయినా ఇవి పరిశుభ్రంగా నిర్వహిస్తే బావుంటుందని కొందరు పేరెంట్స్ సూచన. రాబోయే రోజుల్లో టాయిలెట్టు మెయింటెనెన్స్ ఫీస్ కూడా కట్టాసొస్తుందేమో - లేపోతే మీ చిన్నారి ఆరోగ్యం ప్రమాదం లో పడుతుంది.

15 comments:

ఆ.సౌమ్య said...

మంచి విషయం ప్రస్తావించారు. ఇప్పుడు వస్తున్న ప్రైవేటు స్కూళ్లలో చదువు, శ్రమ గురించే అందరూ (నాతో సహా) మాట్లాడుకుంటున్నారు. కానీ మీరు చూపించిన కోణం కొత్తది. నిజమే, ఆలోచించవలసిన విషయం!

పోనీ టాయిలెట్లకి ఫీజులు అంటూ పెంచుకున్నా పరిస్థితి చక్కబడి శుభ్రత ఉంటే చాలు కదా!

Anonymous said...

avunandi Sujatha garu... Idi nijam gaa chaala pedda samasya mana dhaggara.
India gurthu raagaane main nannu bhaya pettedhi Toilets!!!

-Madhurima

Anonymous said...

స్కూల్లో టాయ్లెట్ల గురించి మీరన్నది నిజమే. ఆ మాటకొస్తే వేలకు వేలు రూపాయలు ముక్కు పిండి వసూలు చేసే కార్పరేట్ కాలేజీల్లో కూడా అదే పరిస్థితని నా అనుమానం.

అయితే స్కూలుకి యునిఫారం మాత్రం మంచిదేమోనండి! లేదా పిల్లలు ఆర్ధిక స్థాయిల్లో భేదాలు గుర్తించి చాలా సమస్యలు తలెత్తే ప్రమాదముంది! అలాగే చిన్నప్పుడు హెయిర్ స్టయిల్ వగైరాల మీద శ్రధ్ధ పెరిగి చదువుమీంచి డిస్ట్రాక్ట్ అవకుండా వుండటానికి, సింప్లిసిటీ నేర్పించటనికీ, జుట్టూ ఒళ్ళూ శుభ్రంగా వుంచుకోవటానికీ ఇలాటి నియమాలు పనికొస్తాయి. (అచ్చం స్కూల్ టీచరు గారమ్మాయిలా మాట్లాడుతున్నాను. మరి మా అమ్మ స్కూల్ టీచరుగానే పనిచేసి రిటైరయ్యారు. ఇవన్నీ ఆవిడ నేర్పించిన సంగతులే :) ).
శారద

కొత్తావకాయ said...

టాయిలెట్ల గురించి మామూలుగా మాట్లాడుకుంటే సరిపోదండీ! చిన్న విషయమేం కాదు. రోజూ మనం మాట్లాడుకోనే చాలా విషయాలకంటే మౌలికమైన, ముఖ్యమైన మార్పు రావలసింది ఈ విషయంలోనే. పాఠ శాలల్లో పిల్లలు, టీచర్లు అందునా ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ప్రతీ పదిహేను, ఇరవై రోజులకొకసారి ఇన్ ఫెక్షన్ తో ఇబ్బంది పడే నా స్నేహితురాలు చెప్తూ ఉంటే విని చాలా బాధనిపిస్తుంది. తను ఓ మారుమూల జిల్లా పరిషత్ స్కూల్లో టీచర్. ఇద్దరు పిల్లల తల్లి. ఇంక చెప్పక్కర్లేదుకదా.. పాట్లు.
బెంగుళూరులో సుధామూర్తి ఈ టాయిలెట్ల విషయమై నిర్మల్ ద్వారా చాలా సేవ చేసారు. మరి మన రాష్ట్రానికి ఎప్పుడు తెల్లారుతుందో!

మురళి said...

మీరెప్పుడూ ఊహించని విషయంతో వస్తూ ఉంటారండీ.. చాలా సున్నితమైన సమస్య ఇది.. ఎక్కడో చదివాను, ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించే వాళ్ళు తమ తమ ఉద్యోగాలని మెదడుతో పాటు మనసు పెట్టి చేస్తే ఇప్పుడున్న చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని.. ఇది ప్రిన్సిపాల్స్ కీ వర్తిస్తుంది.. మీర్రాసింది స్కోఉ వాళ్ళు చదివితే నిర్వహణ ఎలా ఉన్నా ఆ పేరు చెప్పి కొత్త ఫీజు వసూలు చేసే అవకాశం మాత్రం పుష్కలం!! అన్నట్టు పోస్కో గురించి సాయినాథ్ ఆర్టికల్ కదూ.. అంతకు ముందు తమలపాకు తోటల గురించి కూడా ఒకటి వచ్చింది..

జయ said...

యూనిఫాం పెట్టటం నేను కూడా ఒప్పుకుంటానండి. సమానత్వం మాత్రమే కాదు, ప్రతి రోజు ఏ డ్రెస్ వేయాలా అని వెతుకులాట, పిల్లల ఇష్ట ప్రకారం డ్రెస్ చేయలేక పడే బాధ తప్పుతుంది. టాయిలెట్ల విషయం లో పేరెంట్స్ గట్టిగా సాధించుకునే అధికారం ఉంది. అందరూ పట్టు పడితే అదేమంత పెద్ద విషయం కాదు. తమ స్కూల్ ప్రెస్టేజ్ కోసమైనా తప్పకుండా చేస్తారు.

కొత్త పాళీ said...

This is very very true.

Sujata M said...

శారద గారు, సౌమ్య గారు,

చాలా థాంక్స్ అండీ. నేను సరిగ్గా రాయలేదు. యూనిఫాం వేసుకోవడం మంచిదే. కానీ అమ్మాయిలకి మాత్రం ప్రత్యేకమైన రూల్స్ (behenjeeish look) పెట్టడం కొంచెం నచ్చదు నాకు. ఎనీవే అది పెద్ద సమస్య కాదనుకోండి.

Toilet ఫీజు అనేది ఒక wild జోక్. అలా ఎప్పటికీ జరగదు. హా హా . కానీ యాజమాన్యాలు సిగ్గు పడాలి ఈ విసయాల్లో. స్కూల్ లో చేర్చే ముందు తల్లితండ్రులు పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయం ఇది. కానీ ఎవ్వరూ పట్టించుకోరు.

Sujata M said...

మధురిమ గారు,

అవును విదేశాల్లో మంచి సౌకర్యం - ఈ నీట్నెస్. ఆ హైజీన్ కి అలవాటు పడితే, కష్టమే.

Sujata M said...

కొత్తావకాయ

అవును. సీరియస్ విషయమే కానీ సెన్సిటివ్ విషయం లేడీస్ విషయం లో ! ప్రయాణాల్లో, రైళ్ళలో - వగైరా పబ్లిక్ ప్లేసుల్లో ఎలానో ఎవాయిడ్ చేస్తారు గానీ, పని చేసే చోట ఎలా ? పాపం మీ స్నేహితురాలు.

Sujata M said...

మురళి గారు

అవునండీ ! సాయినాధ్ దే ! ఒక సారి చూడాలి ఆ మహానుభావుణ్ణి. పులిట్జరూ గట్రా ఇవ్వాలి ఈయనకి. :D

Sujata M said...

జయ గారూ

యూనిఫాం విషయం లో మీరన్నది నిజమే. నేను సరిగ్గా చెప్పలేదు గానీ నా సమస్య - ఆడపిల్లలకీ, మగపిల్లలకీ ఉన్న ఆంక్షలలో తేడాలే ! అది పక్కన పెడితే, పేరెంట్స్ 'పట్టు పడితే' - అన్న మాట నిజమే గానీ, అంత చైతన్యం పేరెంట్స్ లో కూడా ఉందో లేదో అనుమానమే !

కొత్త పాళీ గారు,

అవును. :D

మాలా కుమార్ said...

సుజాత గారు ,
భలే పాయింట్ పట్టారే :) మా చిన్నప్పటి లాగే వున్నాయన్నమాట ఇప్పుడు కూడా .

Mauli said...

:))

విష్ణు said...

మీది మరీ అత్యాశండీ. నేను సంవత్సరాల తరబడి హైదరాబాదు-విజయవాడ రహదారి మధ్యలో ఆడవాళ్ళ కోసం ఐనా ఓ చక్కటి ఆధునిక విశ్రాంతి మందిరం(మూత్రశాలలతో సహా) కడతారేమో అని కలలు కంటున్నా. ఈ రాజకీయనాయకులకీ, వాళ్ళ కుటుంబీకులకీ బయట ప్రయాణాలలో మూత్రం గట్రా వెళ్ళే అవసరం పడిచావదో ఏమిటో మరి, లేకపోతే కనీసం వాళ్ళకోసమన్నా కట్టిచ్చేవాళ్ళేమో కదా.