Pages

02/07/2011

Useless Beauty - Guy de Maupassant

ఒక చాలా అందమైన బీద యువతి. తన తల్లిదండృలకు ఆర్ధిక ఇబ్బందులు. ఒక డబ్బున్న రాబందు ఆ తల్లిదండృలను ఇబ్బంది పెట్టేసి, ఈ ఇరవయ్యేళ్ళ అందాల భరిణను బలవంతంగా పెళ్ళాడేసి ఎగరేసుకుపోతాడు. ఈ పిల్ల ఎంత అందగత్తె అంటే, ఆ అందం అంటే అతనికి అసూయ. ఎంత అసూయ అంటే, ఆ పిల్లకి 30 ఏళ్ళు వచ్చీసరికీ వాళ్ళకి 7గురు పిల్లలు!

పిల్లలు పుడితే, అసూయ ఏమిటి ? దీని వెనకో మతలబుంటుంది. పెళ్ళయిన కొత్తలోనే భర్త, బార్య అందం తన సమాజంలో అందర్నీ ఆకర్షిస్తుందని తెలుసుకుంటాడు. డ్రాయింగు రూం లో ఆమె అస్థిత్వం, ఆమె అందంలో గ్రేస్.. - ఈ డబ్బున్న రాబందు జమీందారుకి భార్య అందం మూలకంగా వచ్చే మెప్పుకోళ్ళు జీర్ణం కావు. కడుపు మంట. అందుకే !

తన కాలు కింద ఉండాల్సిన భార్యని అందరూ గుర్తించడం భరించలేడు. అందుకే ఆమెని సంవత్సరాల పాటూ మాతృత్వం లోనే ఉండమన్నట్టు - పద్ధతి ప్రకారం పిల్లల సంఖ్యని పెంచుకుంటూ.... భార్య, గర్భం దాల్చి అసహ్యంగా తయారయి, పిల్లల్ని కని, పాలిచ్చి, ఆమె శరీరాకృతి దెబ్బదిని, నలుగుర్లో తిరగడానికి అడ్డంగా పిల్లలు, వాళ్ళ ఆలనా పాలనా - ఇలా సమాజానికి దూరంగా ఇంట్లోనే కాలం గడపాలి. ఇదీ ప్లాన్.

అలా 7గురు పిల్లని కన్నా ఆ భరిణ అందం లో మార్పు రాదు. పెరిగిన వయసు తెచ్చిన గాంభీర్యం అందానికి తావి అద్ది అతన్ని ఎప్పటికీ చకితుడిని చేస్తుంది. 30 ఏళ్ళ వయసుకే ఆమెలో ఎంతో పరిణత ! ఆమె లో ఆత్మవిశ్వాసం తలెత్తే ప్రతిసారీ, భర్త ఏదో ఒక రకంగా తీయని మాటలతో, వీలుకానపుడు కౄరత తో ఆమెను అణగదొక్కాలని చూస్తుంటాడు. పైగా తన 'విజయాల' గురించి చెల్లెలితో కూడా గొప్పగా చెప్పుకుంటాడు. అయితే ఈ చెల్లెలు వదిన మీద అభిమానంతో, అన్న మనసు గుట్లని వొదిన కి చెప్పేస్తుంది.

అప్పటికి తన ఏడో సంతానం 3 నెలల పసిగుడ్డు ! జమీందారిణి, కుపితురాలవుతుంది. భర్త మీద, తనని బలవంతంగా పెళ్ళాడిన నాటి నుంచీ, తనపై అత్యాచారాలు అధికారికంగా జరుపుతున్నప్పట్నించీ, అన్నాళ్ళుగా పేరుకుపోయిన అసహ్యం, జుగుప్స - కోపం ఇవన్నీ బడబాగ్నిలా బద్ధలవుతాయి. ఎక్కడో పొటమరించిన అనుమానపు నిజ కోణాన్ని, ఆడపడుచు స్వయంగా, ప్రత్యక్షంగా చూపించడంతో ఆమె కోపాగ్నికి అవధులుండవు. ఆమె భర్త మీద తీసుకునే సైకలాజికల్ రివెంజ్ - గురించి ఆపకుండా చదివించే బుల్లి కధే ఈ 'Useless Beauty'.

మానవసంబంధాలూ - వ్యక్తిత్వ వికాసం, సమాజం పోకడల గురించి ఎప్పుడో 18వ శతాబ్దంలో ఒక ఫ్రెంచు రచైత రాస్తే, మనిషి వికృత స్వభావాన్ని, అతని ఆలోచనలకీ, చేష్టలకీ ఉన్న పరిధి నీ - వివరిస్తూంటే - ఈనాటి రోజుల్లో ఇలాంటివి సాధ్యమా అనిపించినా, ఇలాంటివి జరిగే రోజుల్లో ఒక స్త్రీ మనసులో పేలే అగ్నిపర్వతాల వర్ణనని చదివితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. రచయిత 'మపాసా' మానసిక శక్తి ని గౌరవించబుద్ధవుతుంది.

ఈ ఫ్రెంచు కధ లో 'కధానాయకుడూ, ప్రతినాయకుడూ' అయిన మన జమీందారు - పిల్లల్ని తన సామర్ధ్యానికీ, ఆమె స్త్రీత్వం పై తాను సాధించిన విజయం లా భావిస్తూంటాడు. ఇతనిలో తండ్రికి ఆ పిల్లలంటే అమితమైన ప్రేమ ! సరిగ్గా ఈ పాయింటు నుండే ఈ కధ నిజానికి మొదలవుతుంది. పైన చెప్పిన బాక్ గ్రౌండ్ అంతా తరవాత మనకు తెలుస్తుంది. ఆ ప్రేమనే ఆయుధంగా చేసుకుని, మన 'కధానాయకీ, ప్రతినాయకీ' - రెండూ తానే అయిన జమీందారిణి - ఆవేశపు ఊపులో, భర్త అకృత్యాలకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని - ఒక చిన్న పధకం వేస్తుంది. అది 'చర్చిలో భగవంతుని సాక్షి గా, భర్త తో, 'తమ పిల్లల్లో ఒకరు' మాత్రం 'అక్రమ సంతానమని' చెప్పడం' ! ఈ చెప్పడం దగ్గర్నుంచే ఈ కధ మొదలవుతుంది. అంటే ఎత్తుగడే ఆసక్తికరం. కధ అంతా దాదాపూ ఈ రెండు పాత్రల సంభాషణే !

ఈ చెప్పడంలో అన్నేళ్ళుగా భర్త మీద తనకున్న నిజమైన ఫీలింగ్స్ ని వెళ్ళగక్కి - అతని వికృత ఆలోచనల్ని కడిగి పారేసి, కేవలం అతని క్రౌర్యానికి సమాధానంగా, పగ తీర్చుకోవడానికి మాత్రమే ఒక ప్రియునికి తనని సమర్పిచుకున్నట్టు - ఆ ప్రియుడెవడో నీకు తెలిసే అవకాశం లేదనీ చెప్పి - భర్తని షాక్ కి గురిచేస్తుంది.

చెప్పడమైతే చెప్పేస్తుంది గానీ, చర్చ్ నించీ ఇంటికొచ్చాక, అతను ఏక్షణాన తనని చంపడానికో, కొట్టడానికో తన గదిలోకి ఊడిపడతాడో అని బెదిరిపోతుంది. కానీ ఈ షాక్ తగిలాక, జమీందారు నిజంగానే అంతఃసంఘర్షణకు లోనవుతాడు. అలవాటుగా తన చుట్టూ చేరే తన సంతానం - ఆ పిల్లలని ప్రేమ తో అక్కున చేర్చుకునే ప్రతి సారీ అతని మనసులో ముల్లులా అనుమానం పొడుస్తుంది. ఈ సంతానం తనదో కాదో - అని ప్రతి కొడుకునీ, కూతుర్నీ, దగ్గరకు తీసుకోలేక, దూరంగా నెట్టలేక, అతని పితృహృదయం చాలా బాధకు, ఘర్షణకూ గురవుతుంది.

అతన్ని మానసికంగా బాధ పెట్టి, సాధించీ ఈ గెలుపు లో కాస్త ధైర్యంతో ఈ జమీందారిణి - society లో తిరిగి తన జీవితాన్ని ప్రారంభిస్తుంది. పార్టీలకూ, ఓపెరాలకు వెళ్ళడం మొదలవుతుంది. భర్త - భార్యను అనుసరిస్తున్నాడు ! ఇద్దరూ పైకి ఎంతో మర్యాదస్థులైన భార్యా భర్తల్లా మెలుగుతుంటారు ! కానీ ఇద్దరి మధ్యా వేల మైళ్ళ దూరం - వెలితి ! ఈ కధ ఎలా ముగుస్తుంది ?

మగ వాళ్ళూ - ఆడవాళ్ళూ సహజీవనం చేస్తూనే ఒకరి నుంచీ ఒకరు రక్షించుకోవడానికి ఒకరి మనస్తత్వాలని ఒకరు ఔపోసన పడుతూంటారు. కర్ర విరక్కుండా - పాము చావకుండానే అన్న రీతిలో ప్రత్యర్ధుల్లా ఒకరి వీక్ పాయింట్ల మీద ఇంకోరు కొడుతూ ఇలాంటి మానసిక యుద్ధాలు చేస్తూనే వుంటారు. ఆమె ప్రయోగించిన ఆయుధం అతన్ని చిత్రవధ చేసినా, కధ ముగిసే సమయానికి అతనిలో పరిణత కలుగుతుంది. అదీ కధ ! పాఠకుల ఆలోచనల్ని ప్రభావితం చేసి, ఏవో అత్భుత పరివర్తన కలిగించే ఆలోచనా తరంగాల పై సర్ఫింగ్ చేయించడం, పాత్రల మీద సానుభూతి, పాత్రలతో మమైకం చెందేంతలా చిత్రణా -- ఇవన్నీ మాపసా ప్రత్యేకతలు.

ఇలా మెదడు తో హృదయాన్ని కొలిచీ, నిలిచీ మెదడు ని ఎప్పటికప్పుడు సానబెట్టీ, పెట్టీ, చిన్న వయసులోనే మానసిక వ్యాధికి గురయిపోయాడు మపాసా తన నిజ జీవితం లో ! కానీ ఇన్ని సంవత్సరాల తరవాత, ఆయన రచనలు చదువుతుంటే, ఎన్నో ఆలోచనల మీద, అవి మన జీవితాల్లో తెచ్చిన మార్పుల మీదా - సర్ఫింగ్ చేస్తున్న్నట్టు ఉంటుంది.


కధంతా చెప్పీసేను కదా - అని చదవకుండా ఊరుకోకండి. ఆమె బ్యూటీ - పనికిరానిది ఎందుకయింది ? భద్ర మహిళ ల ప్రౌఢత గురించి సమాజం ప్రదర్శించే ధోరణి - సహజమమైన సంభాషణలతో - చదూకోవడానికి ఇష్టంగా అనిపించే ఈ క్లాసిక్ కధని ఎప్పుడైనా దొరితే చదవడం మర్చిపోకండి.

10 comments:

మురళి said...

నిజం! చాలా ఆలోచనలని రేకిత్తించేదిగా ఉందండీ కథ..

కృష్ణప్రియ said...

Interesting! దొరికితే చదవాలి.

Anonymous said...

మొపాసా ప్రపంచంలోని గొప్ప కథకుల్లో ఒకరని నా అభిప్రాయం. ఎప్పుడైనా టైం దొరికితే మూడేళ్ళ కింద నేను విపుల పత్రికకోసం రాసిన పరిచయం చూడండి.


http://sbmurali2007.wordpress.com/2008/05/21/test-7/

కృష్ణప్రియ గారూ
మొపాసావే కాక ఇంకా మంచి కథలు చదవాలంటే కింద సైటు చూడండి.
http://shenews.projo.com/2007/04/155-classic-sho.html

శారద

Sujata said...

శారద గారు..

మంచి లింక్. ఇక్కడే ఈ కధ చదవొచ్చు. చాలా మంచి లింక్ ఇచినందుకు థాంక్స్.

http://www.classicshorts.com/stories/UselessBeauty.html

Sujata said...
This comment has been removed by the author.
Mauli said...

Good Post.

కొత్త పాళీ said...

good show.
అందుకే ఆయన మొపాసా .. మనమేమో ఇలా :)

తృష్ణ said...

interesting story !
@sarada: thanks for the link.

కొత్తావకాయ said...

చదివిన ప్రతీ విదేశీ కథని మనదేశ స్థితిగతులకి అన్వయించి చూసుకోవడం నా అలవాటు. హ్మ్..అలోచిస్తున్నకొద్దీ లోతు పెరిగే కథ ఇది. మొపాసా రుచి చూపించినందుకు మీకు ధన్యవాదాలు.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

మీరిలాంటి టపాలు రాయకుండా ఉండాలంటే యేం పుచ్చుకుంటారు?ఇప్పుడు మీరు మపాసా అన్నారు,మళ్లీ నేను అవి మొదలుపెట్టాలి,తెలుగుబ్లాగర్లలో మపాసా పిచ్చోళ్ళ జాబితా గనుక ఎవరన్నా పెడితే ముందునా పేరుండాలి.పనిలో పని తిలక్ ’దేవుడ్ని చూసిన వాడు’కథకు మూలమైన మపాసా కథేంటొ చెప్పాలిమీరు నాకు గుర్తుకురావటం లేదు.