Pages

22/09/2010

తప్పక చదవండి - విజయా వారి 'మాయా బజార్'


మాయాబజార్ - అశేష తెలుగు సినీ అభిమానులకు కొంగుబంగారం. వీళ్ళూ, వాళ్ళూ, పెద్దలూ, బడుగులూ, పిల్లలూ, పిడుగులూ అని లేదు. ఎవర్ని కదిలించినా మాయాబజార్ వాళ్ళ అభిమాన చిత్ర రాజం అని చెప్పక తప్పరు. ఎన్నో సన్నివేశాలూ, మనసుకు హత్తుకుపోయే సంభాషణలూ, మన బాల్య జ్ఞాపకాలతో పెనవేసుకుపోయిన అబ్బురపరిచే నృత్య సగీత మాయా విశేషాలు.

నేను స్కూల్లో ఉన్నపుడు చూసాను, సినిమాలో రాక్షసుల ఎటెండెన్సు తీసుకోవడం. 'పేర్ల పట్టిక' తీసి చిన్నమయ వాళ్ళ హాజరీ తీసుకోవడం. బాకా ఊదగానే funny రాక్షసుల ఫాలిన్ కావడం (వరుసలో నించోడం).
చిన్నమయ పేరు పేరునా పిలుస్తాడు.

''దుంధుభీ''
'అయ్యా !' - (ఎస్స్ సార్)

''ధుంధువా ''
''హై గురూ ''

'ఉగ్రా - పగ్రా - గగ్గోలకా - గంద్రగోళకా' - అందరూ పలుకుతారు 'వై గురొ' , 'జియా' - అంటూ !.. ఆఖర్ని 'లబూ జంబూ - అని రెండుసారులు పిలిస్తే గానీ రారు ఆవలించుకుంటూ ఈ లంబూ జంబూ !


'బాగా చౌవుకున్నారో మీకు వాక్శుద్ధి చేస్తాను. లేదా ఘటోత్కచుల వారు వచ్చి మీకు దేహ శుద్ధి చేస్తారు' - అంటాడు చిన్నమయ ! ఈ సన్నివేశమనే కాదు.. వివాహ భోజనంబు నుంచి, లాహిరి లాహిరి దాకా, మధురమైన నేపధ్య గానాలు - (నేను ఇప్పటికీ మా బుల్లెమ్మ అన్నం తినకపోతే అటు తంతాం, ఇటు తంతాం తంతాం తంతాం తంతాం అంటే ఏమర్ధం అవుతుందో భలే నవ్వుతుంది) - ఎన్నని నెమరు వేసుకోగలం? అన్నీ పసందైనవే !

ఈ డైలాగులు - ఈ సినిమా సృజించిన బోల్డన్ని కొత్త తెలుగు పదాలు - ప్రస్తుతం మన పత్రికల వాళ్ళు ఎక్కువగా ఎత్తుకుపోయినా, చాలా మటుకూ మన జీవితాల్లోకీ 'పరవేశించాయి'.

ఉదాహరణ కి - 'అసమదీయులు', 'తసమదీయులు', 'వీర తాడు' - మొదలయినవి.


ఈ సినిమాని చదివితే ఎలా వుంటుందో అని అవిడియా తట్టినట్టుంది ! 2007 లో మాయాబజార్ స్వర్ణోత్సవ సంవత్సరం సందర్భంగా రావికొండలరావు రచించగా ఆర్కే బుక్స్ వారు అచ్చొత్తారు. వెల : నూర్రూపాయలు. విశాలాంధ్రా లో దొరుకుతాయి. చాలా పాత న్యూస్ ! బ్లాగర్లు అంటే చాలోటి మంది పుస్తకప్రియులు కాబట్టి, అందునా మాయాబజార్ కున్న అపారమైన జనాకర్షణా సామర్ధ్యం తెలిసిందే కాబట్టి, పుస్తకం (Subject) గురించి పెద్దగా పరిచయం చెయ్యక్కర్లేదు.


మాయాబజార్ గురించి, చాల సమాచారం అందుబాటు లో ఉంది. ముఖ్యంగా కలర్ మాయాబజార్ విడుదల కు ముందు ప్రచార సాధనాల్లో హోరెత్తిన సమాచారం ఇంకా పచ్చిగానే వుంది. ఒక 'చందమామ' లా - 'మాయాబజార్' - ఓల్డ్ వైన్ లా పాతబడే కొద్దీ రుచి గా, వయసు పెరిగిన కొద్దీ గ్లామరస్ గా, క్రేజ్ పెంచుకుంటూ వస్తూంది.

కాబట్టి - ఈ పుస్తకం లో ప్రస్తావించదగిన అంశాల గురించి టూకీ గా :


సినిమాని నవల రూపంగా చదవడం కొత్త పద్ధతి కాపోయినా, ఇదో కొత్త (శాస్త్రీయమైన) అనుభవం. ముందుమాట నాటకీయంగా లేకుండా చాలా ఇంఫర్మేటివ్ గా, సౌకర్యవంతంగా మొదలయింది. సినిమా గురించిన సమాచారంలో - ఈ కధను ఆధారంగా చేసుకుని వివిధ భాషల్లో, మూకీల కాలంలో తయారయిన రక రకాల సినిమాల గురించి ప్రస్తావించారు.

సినిమా స్క్రీంప్లే - పాటలు, పద్యాలు - ఫోటోలు, స్కెచ్చులూ, తెర వెనుక కబుర్లూ - డీటైల్స్ తో సహా - రమ్యంగా అల్లారు. స్కెచ్చులు - సినిమా ని మన కళ్ళ ముందు వుంచడానికి దాని ప్రస్థానంలో ఉన్న రక రకాల నిచ్చెన మెట్లను - వాటి వెనుక దాగున్న నిబద్ధత, నిజాయితీ, శ్రమను, తెర మీదికిసన్నివేశాల్ని స్పాట్ లెస్ గా తీసుకు రావడానికి నటీ నటుల ప్రతిభ, సాంకేతిక నిపుణుల ప్రతిభ - ఇలా అన్నిట్ని, కళ్ళ ముందు వుంచుతాయి.


మూస పోసిన సినిమా ఫార్మ్యులా లు, సినిమా కీ, సమాజానికీ ఉన్న బాదరాయణ సంబధం, సినిమా ని చూసి సమాజం పాడవుతుందా, సమాజం సినిమాని చూసి తగలడిందా అంటూ సాగే జీడిపాకం చర్చలూ - పెరిగిన సాంకేతిక విలువల నేపధ్యంలో నీరసించిపోయిన కధ నీ - చూసి చూసి విసిగెత్తిన ఈ తరం కూడా కలర్ మాయా బజార్ ని ఆదరించడానికి సినిమా నిస్సందేహంగా లో వినోదాత్మకత, ఎప్పటికపుడు ఫ్రెష్ గా అనిపించే కధా ముఖ్య కారణం కావచ్చు.

ముగించే ముందు -

ఎస్.వీ.రంగారావు ఇంట్రడక్షన్ సీన్ - (ఇప్పటి దర్శకులైతే, మొదట చెప్పులో, బెల్టో దగ్గర్నుంచీ మొదలు పెట్టి - గాలీ, తుఫాను ల్లో సారు వారు పెట్టే అడుగు మీద కేమెరా ఫోకస్ చేసే వాళ్ళెమో) - సినిమాలో నేను ఇప్పటికీ చాలా ఇష్టపడే సీన్ - కధలో ట్విస్టు ఇక్కడే కదా మొదలయ్యేది !

ఆ పద్యం -

అష్ట దిక్కుంభి కుంభాగ్రాలపై మన
శుంభ ధ్వజము గ్రాల చూడవలదె !
గగన పాతాళ లోకాలలోని సమస్త
భూత కోటులు నాకె మ్రొక్కవలదె !
ఏ దేశమైన నా ఆదేశముద్ర పడి
సంభ్రమాశ్చర్యాల జరుగవలదే
'హై హై ఘటోత్కచ' 'జైహే ఘటోత్కచ'
అని దేవగురుడె కొండాడవలదె !

ఏనె ఈయుర్వినెల్ల శాసించవలదె
ఏనె ఐశ్వర్యమెల్ల సాధించవలదె
ఏనె మన బంధు హితులకు ఘనతలన్ని
కట్ట పెట్టిన ఘనకీర్తి కొట్టవలదె !

- ఏమో - నాకీ పద్యం 'మాయా బజార్' సినిమాకి కూడా సూట్ అయినట్టు అనిపిస్తుంది. ఇలాంటి పద్యాల (పాటలయితే పాపులరే !) కోసమైనా ఈ 'మాయా బజార్ ' సినిమా నవల్ని చదవాలి.

దీన్ని మాయా బజార్ అభిమానులయితే తప్పకుండా లైబ్రరీ లో వుంచుకోవాలి. ఎందుకంటే 'వివాహ భోజనంబు !' పాట పూర్వాపరాలు - దీని 'మెక్సికన్ మెర్రీ గో రౌండ్' మూలం కధా కమామీషూ, ఇతర రసవత్తర విషయాలూ తెల్సుకోవద్దూ ?! పాత పాత పోస్టర్లు చూడొద్దూ ? 'రాజ్యాలు పోతేనేం ? ప్రతాపాలెక్కడికి పోతాయ్?' అని నిష్ఠూరాలాడొద్దూ ? సున్నిత హాస్యం, లలితమైన దృశ్యం, మధుర సంభాషణలు - తరచి తరచి గుర్తు చేసుకోవడానికి ఇదో గ్రేట్ ఐడియా !

3 comments:

Anonymous said...

Baga vrasaru. Kani yedo cheppalani, inkedo vrasaranemo anipistunnadi/...

తృష్ణ said...

thats what is "ever green.." !!
Hats off to S.V.rangarao garu and savitri.

ఆ.సౌమ్య said...

అబ్బా ఎంత తియ్యటి వార్త చెప్పారండీ. మాయాబజార్ మీద వ్యామోహంతో నేను నవతరంగంలో ఆర్టికల్ కూడా రాసాను.
http://navatarangam.com/2010/02/mayabazar_mahabharat-without-pandavas/

వెంటనే ఆ పుస్తకం చదవాలి అయితే.