Pages

02/03/2010

డియర్ చీఫ్ జస్టిస్

మన ఇంత పెద్ద భారద్దేశం లో, ధర్మం ఒకప్పుడు నాలుగుపాదాలా నడిచేదంట. ఇపుడు కాలం మారింది. కలి మహిమ ! ఎంత ప్రజారాజ్యమైనా జనం ప్రభువుల పదఘట్టనల మధ్య చిత్తుకాయితాల్లా నలుగుతున్నారు. పుర్రెకో బుద్ధి అన్నట్టు, ప్రస్తుతం మనకో న్యాయం, ఊరందరికీ ఇంకో న్యాయం అమల్లోకి తెచ్చేం.

పుణ్యక్షేత్రాల్లో తీర్ధ ప్రజ, మామూలు గుళ్ళలో కూడా తొక్కిడి, టెలివిజన్లో భక్తి - బాబాలూ, అమ్మలూ - ఇవన్నీ చూసి, మాలతీ చందూర్ ని ఎవరో అడిగారు ; ప్రజల్లో దైవభక్తి ఇంతగా ఎందుకు పెరిగిందీ ? అని. ఆవిడ నిష్కర్షగా చెప్పింది - ప్రజల్లో పెరిగింది భక్తి కాదు - పాప భీతి అని. పాపభీతి సంగతేమో గాని, నేరాలు వివిధ క్షేత్రాల్లో, పరిధుల్లో - ఆయా రేట్లలో పెరుగుతూనే ఉన్నాయి.

మనకో న్యాయ వ్యవస్థ ఏడిచింది గానీ మొదట్నుంచీ ప్రజలకి కోర్టులంటేనే ఏవో పడని పాట్లు గుర్తొస్తాయి. కోర్టులో కేసులు తరతరాలుగా పేరుకు పోవడం, న్యాయం దొరకడం ఆలీశెం అయిపోవడం వల్లనా కోర్టు - గాడిదా సామెతలు పుట్టాయి. తడిసి మోపెడయ్యే వ్యాజ్య ఖర్చులు తలుచుకుని, కేసు గెలిచినవాడు ఇంటికెళ్ళి, గెలవని వాడు కోర్టు బయటా ఏడుస్తారని జోకులు పుట్టాయి.

ఇలా న్యాయం దుర్భరమైపోతే ప్రజలకి దొరికేది, మిగిలేది - అన్యాయమే. కానీ అన్యాయాన్ని ఎదిరించే దమ్మున్న, నిబద్ధత ఉన్న మనిషొకడు నిర్ణయాత్మక, క్రియాశీలక పదవి లో ఉంటే ? రాజకీయాలకు అతీతంగా, అదరక బెదరక - అవినీతితో కుళ్ళిన న్యాయ వ్యవస్థ కి వన్నెను తీసుకొచ్చిన జడ్జి ఒకరు ఉంటే ?

సరిగ్గా ఇలాంటి లక్షణాలున్న నిజంగానే గౌరవనీయులైన ప్రధాన న్యాయ మూర్తి అజయ్ ప్రకాష్, గత అక్టోబర్ లో పదవీ విరమణ చేశారు. పత్రికలలో ఆయన మీద కురిసిన ప్రశంసలు చదివి చాలా ఆశ్చర్య పోయి ఈ మనిషిని గురించి ఇంకొంచెం ఎక్కువ తెలుసుకుందామని ప్రయత్నం చెయ్య బుద్ధయింది. అజయ్ ప్రకాష్ షా సుదీర్ఘ కెరియర్ లో మచ్చుకి కొన్ని మెచ్చు తునకలు :

గోధ్రా అల్లర్ల అనంతరం, గుజరాత్ ప్రభుత్వం - దూరదర్శన్ లో ప్రసారం కానివ్వకుండా అడ్డుకున్న టెర్రరిజం, అయోధ్య ల పై తీసిన డాక్యుమెంటరీలు 'ఇన్ మెమొరీ ఆఫ్ ఫ్రెండ్శ్ & 'రాం కే నాం' లను ప్రసారం చెయ్యాల్సిందిగా గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించడం. ఫ్రీడం ఆఫ్ స్పీచ్ - భారత పౌరుడుకి ఉన్న ప్రాధమిక హక్కు అని ప్రభుత్వానికి గుర్తు చేసారు ఈ న్యాయ మూర్తి.

విదేశాల్లో వికలాంగులను, వారికున్న సదుపాయాలను, పౌర జీవితం, నాగరికతా, వికలాంగుల కోసం పబ్లిక్ ప్లేసులను ప్రత్యేక సదుపాయాలతో సౌకర్య వంతంగా తీర్చిదిద్దడం చూసిన వారికి, మన దేశంలో వికలాంగులు పడే బాధలు చూస్తే ఎలా అనిపిస్తుంది ? మన దేశంలో ఇలాంటి వారికి మనం కల్పించే సౌకర్యాలు తక్కువ. బస్సు ల్లో, రైళ్ళలో, పని చేసే చోట్లలో - మానసిక అవకరం ఉన్నవాళ్ళకి, శారీరక వైకల్యం ఉన్నవాళ్ళకీ, రోజువారీ జీవితమే ఒక కార్గిల్ యుద్ధంలా తయారు చేసి పెట్టేం మనం. మరి వాళ్ళకి ఉన్న హక్కుల్ని ఎవరు గౌరవిస్తారు ? జస్టిస్ అజయ్ ప్రకాష్ మాత్రం ఆ పని చేశారు. ఎన్నో తీర్పుల్లో రవాణా సంస్థలనీ, ప్రభుత్వాల్నీ వికాలాంగుల హక్కుల కోసం కదిలించారు. లొంగని వాళ్ళని లొంగేలా చేసారు. ఈ ఒక్క వ్యక్తి, మానసిక అస్వస్థులు ఎదుర్కొనే వివక్ష ని కూడా ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు. అంతవరకూ మంచి ఆరోగ్యంతో ఉన్న ఉద్యోగులు, ఏ కారణం గానైనా మానసిక అస్వస్థత కు గురి అయితే, ఇలాంటి వారిని వృత్తి ఉద్యోగాల నుండీ బలవంతంగా నిర్మూలించడం, వారి వారి పెన్షన్ బెనిఫిట్లను నొక్కి పెట్టడాన్ని నిరసించి, చట్ట భద్రత కలిపించారు.

మహారాష్ట్ర లో మహాబలేశ్వర్, పంచ్ ఘని లను - ఆయా బీచ్ లనూ - అభివృద్ధి పేరిట వినాశనం చెయడాన్ని తన తీర్పులతో అడ్డుకున్నారు. ఆయా ప్రదేశాల 'ఇకో సిస్టం' ని భగ్న పరిచే ప్రయత్నాలు ఏవయినా తన దృష్టికి వస్తే వొదిలిపెట్టలేదు. హిందూ వివాహ చట్టం ప్రకారం - మొదటి భార్య బ్రతికుండగా, ఆ భర్త రెండో పెళ్ళి చేసుకుంటే, రెండో భార్యకు ఏ హక్కులూ ఉండవు. కానీ ఈ అంశాన్ని అడ్డంగా పెట్టుకుని భర్త విహీన అయిన రెండో భార్యని సమాజం ఎన్నో రకాలుగా వేధించడాన్ని ఈయన ప్రతిష్ఠాత్మకమైన తీర్పుల ద్వారానే నివారించగలిగారు. భారత విమాన యాన సంస్థ 58 సంవత్సరాల వయసు దాటిన మహిళా హొస్టెస్ లను బలవంతంగా రిటైర్ చేయించబోయినపుడూ ఈ అజయహస్తమే ఈ వయో, లింగ వివక్ష కు వ్యతిరేకంగా మహిళా ఏర్ హోస్టెస్ లు రిటైర్మెంట్ వయసు వరకూ పని చేయవచ్చని తీర్పిచ్చి ఆదుకుంది. విమాన యాన సంస్థ మొదట తన పనితీరు మెరుగు పరుచుకొని ప్రైవేటు రంగానికి దీటుగా నిలబడాలిగానీ ఏర్ హోస్టెస్ లను వొదిలించుకుని కాదని హితవు చెప్పింది ఈయన నాయకత్వం వహించిన బెంచ్.

అజయ్ ప్రకాష్ ఇచ్చిన ఎన్నో బెంచ్ మార్క్ తీర్పుల్లో - ప్రస్తుతం ఢిల్లీ హై కోర్టు చీఫ్ జస్టిస్ గా కామన్ వెల్త్ క్రీడల నిర్వహణకు సిద్ధం అవుతున్న ఢిల్లీ లో బిచ్చగాళ్ళను వారి వారి స్వ రాష్ట్రానికి పంపిచడాన్ని కోర్టు తప్పు పట్టడం తాజాది. ఢిల్లీ ఎవరి సొంతం.. బిచ్చగాళ్ళనయినా సరే పొమ్మనడానికి ఢిల్లీ ప్రభుత్వానికి అధికారం ఎవరిచ్చారు ? అనే భావన ని, ఎన్నో ఎన్.జీ.వో. ల మనోకాంక్షలని నిలబెట్టిందీ తీర్పు. అయితే, ఇపుడు అజయ్ పదవీ విరమణ చెయడంతో పరిస్థితి తారుమారు అయింది. ఎముకలు కొరికే నిర్దాక్షిణ్యమైన ఢిల్లీ శీతోష్ణ స్థితి ఏటా కొన్ని వందల మందిని పొట్టన పెట్టుకుంటోంది. ఇది కేవలం రాత్రి ఉండటానికి చోటు లేక పోవడం వల్లనే. చలి కాలంలో రాత్రి పూట రోడ్డు మీద నిద్రించే, ఇల్లు లేని కొన్ని వేల మంది అభాగ్యులకు ఎముకలు కొరికే చలి లో ప్రాణం నిలుపుకోవడానికి తినడానికీ (వొంట్లో వేడిని నిలుపుకోవడానికి), కప్పుకోవడానికీ ఏదయినా కావాలి. తిండి మాట దేవుడెరుగు. రాత్రికి 40 రూపాయల అద్దెకి కుక్కి మంచాన్నీ, కప్పుకునేందుకు రజాయినీ ఈ పేదలకి అందించే వాణిజ్యం కూడా అమలులో ఉందిక్కడ. కూటికి గతి లేక పోయినా, చలికి బ్రతికి బట్టకట్టేందుకు రాత్రికి 40 రూపాయల ఖర్చు కోసం తిండి కూడా తినకుండా పేదలు కటకటలాడుతున్నారు. వారిలో పిల్లలు, ముసలి వారు, వెనుకబడిన ప్రాంతాలనుంచీ పొట్టకూటికి నగరం చేరిన రిక్షా పుల్లర్లు, రక రకాల కూలి పనులు చేసుకునే వారు. వీళ్ళలో ఎందరో చలికాలం నిర్దాక్షిణ్యమైన చావు ని ఎదుర్కొంటున్నారు. కనీసం శీతాకాలం లోనైనా షెల్టర్లు నిర్మించి ఇవ్వమని ఆదేశించిన ఘన హృదయం జస్టిస్ అజయ్ ది.

లెక్కలేనన్ని ఎన్విరాన్ మెంట్ ఇష్యూస్, టెక్నాలజీ అంశాలూ - పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్లూ - ప్రభుత్వ విధాన నిర్ణయాలూ - ఇలా ఎన్నో ప్రజోపయోగ తీర్పులతో ఎందరి జీవితాలనో తాకిన జస్టిస్ అజయ్ ప్రకాష్ లాయర్ల కుటుంబం నుంచీ వచ్చారు.

మన దేశంలో చాలా మందికి రుచించని 'గే' ల చట్టబద్ధతని, హోమో సెక్సువల్ ల హక్కులనూ - జస్టిస్ అజయ్ తీర్పే కల్పించింది.

జస్టిస్ అజయ్ ప్రకాష్ పదవీ విరమణ అనంతరం జాతీయ ప్రింట్ మీడియా ఆయన పనితీరుని ప్రత్యేకంగా శ్లాఘించింది. సాహసం, నిబద్ధతా, నిజాయితీ, మూర్తీభవించిన ఇలాంటి జడ్జి - జస్టిస్ దినకరన్ లాంటి కేసుల వల్ల దెబ్బతిన్న ఇండియన్ జ్యూడీషియల్ సర్వీసుల ప్రతిష్టని పెంచడానికి కావాలి. రాబోయే కాలంలో జస్టిస్ అజయ్ ప్రకాష్ ని ఏదో ఒక కమిటీ కి పెద్దగా చూడవచ్చేమో మనం.

సో.. ఎందరో మహానుభావులు. ఒక్కొక్కరికీ వందనాలు.

6 comments:

కొత్త పాళీ said...

మంచి విషయం.
అదే భారద్దేశపు విచిత్రం. అమెరికాలో ఇటువంటి న్యాయమూర్తుల్ని Activist Judges అంటారు. ఎక్కడన్నా పొరబాట్న ఒక Activist Judge సుప్రీంకోర్టు బెంచెక్కుతారేమోనని జనాలు హడలి ఛస్తుంటారు.

Sujata said...

Many thanks sir.

భావన said...

చాలా బాగుంది సుజాత. మంచి వ్యక్తి ని పరిచయం చేసేరు. ప్రతి ఒక్కరు వందనమర్పించవలసిన వ్యక్తి.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

చాలా విభిన్నమైన వ్యక్తిని,ఆయన విలక్షణవ్యక్తిత్వాన్ని చాలా చక్కగా వివరించారు సుజాత గారు.అభినందనలు.మీరొక అంశం కూడా జోడించిఉంటే ఇంకా బాగుండేది.
జస్టిస్,అజయ్ ప్రకాష్ తన పదవీకాలం ఎక్కువగా బాంబే హైకోర్టులో గడిపారు.తరచూ బందుపిలుపుల వల్ల ముంబై ప్రజానీకం ఇబ్బందుల్లో పడుతున్నారనీ,అలా బందుపిలుపులు ఇవ్వటం ముంబయ్ వాసుల ప్రాధమిక హక్కులను కాలరాయటమేనని తీర్పు చెప్పటమే కాక బందులనీ,మరొకటనీ వేషాలేసే బీజేపీ,శివసేనలతో రూ.20లక్షలు డిపాజిట్ చేయించి ఆ డబ్బును ముంబయ్ పౌరసదుపాయాల కల్పనకు నియోగించమని అదేశించినవాడాయన.

Sujata said...

రాజేంద్ర కుమార్ గారు

థాంక్స్ ఎ లాట్. మంచి సూచన. ఈ విషయాన్ని కూడా పై టపాలో కలుపుతాను.

Sujata said...

భావన గారు

థాంక్స్.