Pages

23/03/2010

విచిత్ర వ్యక్తి (The Mysterious Stranger)

మనిషి - ధర్మా ధర్మ విచక్షణ ఉన్న జంతువు. జంతు లోకానికెల్ల సాధువు. అనంత సృష్టి లో అన్ని ప్రాణుల్లోకీ తెలివయిన వాడు. నాగరికుడు. పుణ్య పాపాల ఖాతరున్నవాడు. సంఘ జీవి. ధార్మికుడు. మార్మికుడు. దేవుణ్ణి ప్లీస్ చేసి, స్వర్గం లో ప్లేస్ కొట్టేసి, ఏ రంభ తోనో ఫ్రీ గా మదిరా సేవనం చేస్తూ పరలోకంలో కాలం గడిపెయ్యలని స్థూలంగా ఏ మతానికి చెందిన మనిషయినా ఇహలోకంలో తెగ తాపత్రయయపడుతూ ఉంటాడు. దేవుణ్ణి మెప్పించేది ధర్మ మార్గమే. అయితే ధర్మానికి ఒక్కో కాలంలో ఒక్కో నిర్వచనం ఉంది. హిందూత్వం లో (హిందూ మతం లో) - త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, .. అలా ఒక్కో యుగంలో ధర్మం నీరసిస్తూ వచ్చి, కలియుగం వచ్చేసరికి, నీరసించి కళ్ళు తేలేస్తుంది. అందుకే ఏవైనా ఘోరం జరిగితే, మనవాళ్ళు 'కలిధర్మం.. కలియుగం నాయనా !' అని గునుస్తుంటారు.

ధర్మం అంటే ఒక రూల్. ఇది మంచిది, ఇది కాదు అంటూ చెప్పే ఒక ఇది. అయితే ఈ ధర్మాన్నంటుకునే న్యాయం, అన్యాయం అంటూ కూడా ఉన్నాయి. ఒకపుడు బిచ్చమెత్తుకోవడం నేరం. బిచ్చగాళ్ళు, కడుపేదలు, అన్ననికి బిచ్చమెత్తుకుంటే, వాళ్ళని తీస్కెళ్ళి న్యాయం పేరిట వధించడం జరిగేది. పాశ్చాత్య లోకంలో మధ్య యుగాలలో నేరాలకి ఘోర శిక్షలుండేవి. మంత్రగత్తెలని అనుమానం వచ్చినాళ్ళని నిట్టనిలువునా సజీవంగా చంపేసేవారు. అసలు ఏ నేరానికైనా అమానవీయ, రాక్షస శిక్షలు ఉండేవి. నిలువునా, ప్రాణమున్న మనుషుల్ని చీరడం, ఫిరంగులకి కట్టి పేల్చడం.. ఇలా శిక్ష అమలుచేసే విధానాల్లో ఇప్పటికీ ప్రపంచంలో అన్ని ప్రదేశాల్లోనూ కౄరత్వం - కొనసాగుతూనే ఉంది.

దైత్యులంటే భయపడే మనల్ని (మానవులని)చూసి దైత్యులేమనుకుంటారో ఎవరైనా ఊహిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇప్పటికీ యుద్ధాలూ, టెర్రరిజం, ఇంకేదో ఇజం.. ఇంకేదో రొచ్చు అనుకుంటూ, నిత్యం వేలాది మంది మన సాటి మానవుల్ని శారీరకంగా, మానసికంగా చిత్రవధ చేస్తున్నదీ, అమానుషంగా చంపుతున్నదీ ''మనిషే''. ఇందులో 'అ-మానుషం' అంటూ ఏమీ లేదనీ.. మనిషి నైజమే అమానుషత్వమనీ ఒక సైతాను తేల్చిచెప్తే ఎలా వుంటుంది ?


మార్క్ ట్వెయిన్ రాసిన ఈ క్లాసిక్ ని ఇంతకుముందు (మూలం) చదవలేదు. మొన్నామధ్య హీరో వచ్చి నండూరి రామ్మోహన్ రావు గారి అనువాదం 'విచిత్ర వ్యక్తి తెచ్చి ఇచ్చాకా, ఇన్నాళ్ళకి కుదిరింది. చదివాకా, అబ్బురం .. ఆశ్చర్యం, ఆనందం లాంటి ఫీలింగ్స్ అన్నీ ఒక్కసారి కమ్ముకున్నాయి. ఇంతోటి సాటిస్ఫేక్షన్ కలిగించిన ఈ బుల్లి పుస్తకాన్నీ దాచుకుని, మా బుజ్జాయికి ఈ కధ అర్ధం చేసుకునే వయసు వచ్చాకా చదివించాలని నిశ్చయించుకున్నాను. ఎందుకంటే, కావడానికి ఇది పిల్లల కధే అయినా, సారాంశంలో ఎంతో డెప్త్ ఉంది.

పిల్లల కధ కదా, పిల్లలే హీరోలు. వీళ్ళు ముచ్చు ముగ్గురు. దయ్యాలంటే భయపడని ఈ పిలకాయల దగ్గరకు సైతాను (ఒకప్పుడు దేవత అయిన సైతాను దేవునితో విభేధించి, నరకంలోకి తోయబడతాడు - అప్పణ్ణించీ మనుషుల ను సైతాను వశపరచుకుని, వాళ్ళని దేవుని దారి నుంచీ తప్పించి నరకంలో పాపులేషన్ పెంచాలని ప్లాన్లో ఉంటాడు. కాబట్టి సైతాను అంటే మనుషులకి భయం) అన్న కొడుకొకడు (ఇతని ఇంటిపేరూ సైతానే కదా మరి) పరిచయం అవుతాడు. ఈ సైతాను అపుడపుడూ కనిపిస్తూంటాడు. వింతలు చేస్తుంటాడు - మిగతా వారికి అదృశ్యంగా ఉండి, ఈ ముగ్గురు పిలకాయలకు మాత్రమే కనిపిస్తూ, వీళ్ళతో స్నేహిస్తూ, తానూ వినోదిస్తూ, జీవితం అంటే విపులంగా ఏవేవో చెప్తూ ఉంటాడు.


సైతాను అంటే అభిమానం పిల్లలకి. కానీ సైతాను అభిప్రాయాలు చూసి భయపడుతుంటారు. సైతానుకు మానవత్వం లేదు. మనుషులంటే పురుగులుగానో, కీటకాలుగానో భావన. నయా పైసా అభిమానం వుండదు. అసలు ధర్మాధర్మ విచకషణ వున్న ఏ ప్రాణి అన్నా సైతానుకు మంట. సైతాను తన ఆనందంకోసం మనుషుల్ని ఘోరాలకు గురిచేస్తుంటాడు. తనే ఒక చిన్న లోకం సృష్టించి, పిల్లలు చూస్తుండగానే ఆలోకంలో భూకంపం పుట్టిస్తాడు, తను సృష్టించిన మానవుల్ని తానె కౄరంగా చంపి వినోదిస్తాడు. అయితే, సైతాను చేతలకి ఒక అర్ధం ఉంటుంది.

ఎందుకంటే, ధర్మం అనే ఒక బ్రహ్మపదార్ధాన్ని పట్టుకుని, దాని ముసుగులో సాటి మానవుల్ని చంపుకు సాధించే మానవజాతి అంటే సైతానుకు కోపం. ఈ ముగ్గురు పిల్లలూ సైతాను స్పెల్ లో ఉండినా, సైతాను ఆలోచనలతో కొద్దో గొప్పో విభేధిస్తున్నారు. అయినా వాళ్ళ ఊళ్ళో, వాళ్ళ కళ్ళముందు జరిగిన కొన్ని సంఘటనలు మనుషుల దారుణ మనస్తత్వాల గురించి తెలిసేలా చేసి, పిల్లల కళ్ళు తెరుచుకుంటాయి. అయితే మనుషులకి మేలు చెయ్యాలంటే, సైతాను ఎంచుకునే మార్గం విచిత్రంగా వుంటుంది. ఒకసారి ఈ మువ్వురిలోనే నికాలాస్ అనే కుర్రాడికి మేలు చేసేందుకు నికోలాస్ ని మృత్యువుకు అప్పగిస్తాడు. మృత్యువు మనిషి బాధలకీ, కష్టాలకీ ఆఖరి మజిలీ అని సైతాను వాదన.


'విచిత్ర వ్యక్తీ' మిస్ కాకూడని పుస్తకం. నండూరి వారి అనువాదం కట్టిపడేసే సమ్మోహకత్వంతో - సైతాను వాదనను పిల్లల సంఘర్షణనూ - హేతుబద్ధంగా మన ముందుచుతుంది. వివిధ సంఘటనల అల్లిక, సైతాను కొంటె చేష్టలు, సైతాను నిరంకుశత్వం - హేతువాదం - ఇవన్నీ నమ్మశక్యం కాని ఏదో లోకంలోకి - యాలీస్ లాగా మన చేతులు పట్టుకుని లాక్కుపోయి చివరి పేజీ కొచ్చేసేరికీ సైతాను సిద్ధాంతంతో అంగీకరించేలా చేస్తాయి.


సైతానుకు వచ్చిన సందేహాలే చిన్నపుడో, పెద్దపుడో, మనకూ వచ్చుంటాయి. దేవుడు కొందర్ని మంచిగా, కొందర్ని బీదగా, కొందర్నే ఆరోగ్యంగా, కొందర్ని ఆయుక్షీణంగా ఇలా ఎందుకు చేస్తాడు ? మనమంతా దేముని బిడ్డలే అయినపుడు ఆయన ఎందుకిలా కొందరికి తీరని కష్టాల్నిచ్చేడు ? .. ఇలా! ముఖ్యంగా భారతీయ/హిందూ కర్మ సిద్ధాంతంతో మన పెద్ద వాళ్ళు సాధారణంగా సర్ది చెప్పేరు.


హేతువాదులు - దేవుడా - అచ్చి చ్చీ - వొట్టిదే ! అంటారు. విచిత్ర వ్యక్తి లో సైతాను ప్రసంగాలు ఈనాటి మన విశ్వానికీ వర్తిస్తాయి. మానవుడు తప్పులు చేస్తూ, ఆ తప్పుల్ని జస్టిఫై చేసుకోవడానికి ఎదుటి వ్యక్తిదే తప్పు అంటూ ఎలా రంకెలు వేస్తూడో, యుద్ధాలు ఎలా చేస్తాడో - మనుష్యుల మంద (మోబ్ మెంటాలిటీ) మనస్తత్వం ఎలా ఉంటుందో సైతాను గొంతులో వింటే మనిషెంత భయంకర ప్రాణో అర్ధం అవుతుంది.


అమెరికన్ పాఠకులకు (మూలం) మార్క్ ట్వెయిన్ ఇంకోసారి ప్రత్యక్షమై బుద్ధి చెప్పినట్టుంటాయి కొన్ని పేరాలు. ఇపుడు జరుగుతున్న ఇరాక్ యుద్ధం, దీని లో యూ.ఎన్.వో పాత్ర, ఇప్పటి రాజకీయ వాతావరణం..అన్నిట్నీ ఏదో దివ్యదృష్టి తో చూసినట్టు, అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్టు రామ్మోహన్ రావుగారి అందమైన తెలుగు నుడికారంలో వింటూంటే, పాప పుణ్యాల రంధి లో పడి ధార్మిక ప్రేలాపనలతో ఇదే ధర్మం అంటూ విరచుకు పడే మన లో ఉన్న ఫెనాటిసిజాన్ని, చాందసత్వాన్ని, మేనర్స్ లేని జంతు గుణాన్నీ చూసి సిగ్గుపడతాం.

అందుకే మనిసికి మనిషి జడ్జ్ ఏమిటి ? ఖర్మ కాకపోతే ! మనిషి ఇంకో మనిషి చంపేడని, మూడో మనిషి నిర్ణయించి, నాలుగో మనిషి చేత చంపించడం న్యాయం కదూ ! ఎవడో ఎవణ్ణో చంపుతాడేమో అని ఇంకోడు ఆ మొదటి వాణ్ణి ఆనవాలు లేకుండా చంపి పెట్టడం దౌత్యం ! జార్జి బుష్ నీ, ఒసామా బిన్ లాడెన్ నీ పట్టుకుని బంధించి ఈ పుస్తకం చదివంచాలి అనిపిస్తుందెవరికైనా!!

పనిలో పనిగా, ఈ పుస్తకం లో ముందుమాటల్లో ప్రస్తావించిన నండూరి వారి అన్ని అనువాదాలూ చదవాలని తీవ్రమైన ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాను. గోపీచంద్ కలెక్షన్ లాగా పబ్లిషర్లు ఈ తరం 'తెలుగు చదివే' పిలకాయలకోసం అవన్నీ ఒక సెట్టులాగా తీసుకొస్తే భలే కమ్మగా గడిచిపోగలదు ఈ ఎండాకాలం.

5 comments:

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

బావుందండి,నేనూ ఈ రెంటిల్లో ఒక్కటీ చదవలేదు.కనీసం వాటి గురించి వినలేదు కూడా.మీ టపా ద్వారా తెలుసుకున్నా.
"ఈ బుల్లి పుస్తకాన్నీ దాచుకుని, మా బుజ్జాయికి ఈ కధ అర్ధం చేసుకునే వయసు వచ్చాకా చదివించాలని నిశ్చయించుకున్నాను"- మంచిప్లాను మీదే ఉన్నారు మొత్తం మీద. కానీ..."గోపీచంద్ కలెక్షన్ లాగా పబ్లిషర్లు ఈ తరం 'తెలుగు చదివే' పిలకాయలకోసం అవన్నీ ఒక సెట్టులాగా తీసుకొస్తే భలే కమ్మగా గడిచిపోగలదు ఈ ఎండాకాలం" మీ ఈ కల నెరవెరాలంటే ఎన్ని ఎండాకాలాలు మండిపోవాలో మరి ? :)

Sujata said...

థాంక్ యూ. ఎన్ని ఎండాకాలాలో అన్న మాట నిజమే. మా చిన్నపుడు ఎండాకాలం సెలవల్లో ఎలానో ఓలా పుస్తకాలు పోగు పడేవి, పిల్లల కోసం. కనీసం వచ్చే సంవత్సరం క్లాసు లోని ఇంగ్లీషో/తెలుగో పుస్తకాలు తెచ్చీసుకుని వాటిలో కధలు చదివేసేవాళ్ళం. ముందుచూపు లేకపోయింది. వచ్చే యేడు సిలబస్ లో లెక్కలు చేసుంటే, జీవితం బాగుపడేది.

cbrao said...

"ఆడవాళ్లు - చేతి సంచులు" అనే వ్యాసం పై వ్యాఖ్య వ్రాసినది మీరేనా? ఈ వ్యాఖ్య మీ శైలిలో లేదు. ఈ మధ్య Identity theft తరచుగా అవుతుంది. నిర్ధారణకోసం ఈ జాబు వ్రాస్తున్నా.

తుంటరి said...

nice one.I will also try to find this book and read it.

కొత్త పాళీ said...

విచిత్రవ్యక్తి చాలా మంచి రచన. నండూరి అనువాదాలు టాం సాయర్, కాంచన ద్వీపం ఇప్పుడు మళ్ళీ పునర్ముద్రణాలో దొరుకుతున్నాయి.