Pages

19/10/2008

ఆదివారం

హాస్టల్ రోజుల్నుంచీ సండే అంటే ఏదో పర్వదినంలాగా గడపడం నాకు చాలా ఇష్టం. అన్నిపనులూ.. బట్టలుతకడం, ప్రెస్ చేసుకోవడం, బ్యూటీ పార్లర్ కు వెళ్ళడం, బండి సర్వీసింగ్, ఇలాంటి చెత్త పనులన్నీ శనివారమే ముగించుకుని, ఆదివారం మాత్రం నాకు, కేవలం నాకే కేటాయించుకోవడం, మెహెందీ పెట్టుకోవడం, గుడికి వెళ్ళడం, ఆ వారం న్యూస్ పేపర్లన్నీ ఒకే రోజు చదవడం, వీలయినంత సేపు నిద్ర పోవడం, రాత్రి మాత్రం ఫోన్లు చేసుకుని, కాసేపు ఆడుకుని, గుడ్ నైట్ కల్లా ఈ విశ్రాంతి తీస్కోవడంలో అలిసిపోయిన శరీరానికి ఆరాంగా మంచి మ్యూసిక్ వినిపిస్తూ నిద్రపోవడం అలవాటు.


ఇప్పుడు ఆదివారం అంటే ఏదో బెడద లా వుంది. అసలే ఇక్కడ 6 రోజుల వీక్ లో దొరికిపోయాను. శనివారం అసలు టైం వుండదు. ఆదివారం వంట, తంటా - ఇవన్నీ. అయినా వీలయినంత వరకూ ఆదివారం ఇంట్లోనే ఉండటానికి ప్రయత్నిస్తాను. మా ఆయన కి ఈ తినడం, పడుకోవడం స్కీం అస్సలు నచ్చదు. ఇదే నా పీకలమీదికొచ్చింది. పొద్దున్న లేట్ గా లేస్తానని, తీరిగ్గా బజారుకెళ్దామని, తీరిగ్గా వంట చేసుకుని, సినిమాకో, షికారుకో.. అంటే - నాకు గుండెలో రాయి పడేది. పొద్దున్న లేట్ అంటే నా ప్రోగ్రాం అంతా అప్సెట్ అయిపోతుంది. అస్సలే ఆదివారం అంటే నాకు పరమ పవిత్ర దినం. ఈ రోజు ఏదో కాస్త 'బ్రతకడానికి ' తిని పడుకోరాదా అని నా బాధ. అప్పటికీ ఆదివారం అసలు ఏ పనీ పెట్టుకోను. ఎందుకంటే ఆరోజు ఈయన వుంటే, ఎవర్నన్నా పిలవడం లేదా ఎవరింటికన్నా వెళ్ళడం ప్లాన్ చేస్తాం (నాకు ఇష్టం ఉండదు) ఆదివారం మాత్రం పొద్దున్నే చక చకా పనులు ముగించుకుని, ఇల్లు అద్దంలా సర్దేసుకుని, ఎండ ఫెళ ఫెళ లాడే వేళ అన్నం తినేసి, తలుపులూ, కర్టెన్లూ వేసేసి, కాసేపు పేపరూ చూసేసి నిద్ర పోదామని నా పిచ్చి కల !


కానీ పెళ్ళయ్యాకా.. అందరి కోరికలూ, నా సామాజిక భా ద్యతలూ తీర్చడానికి ఈ ఆదివారమే వచ్చేది. వంటా, వార్పూ, ఇల్లు సర్దుకోవడం, అతిధులూ, నవ్వులూ, కాపీలూ, టిపినీలూ, మళ్ళీ నవ్వులూ... కాసేపటికి 'బైటికి బైల్దేరడాలూ ' ! ఇవే నాకు చాలా చిరాకు. అదేంటో, ఆదివారం హైదరాబాద్ లో మాత్రం ఎక్కడికెళ్ళినా కిక్కిరిసిపోయి ఉంటుంది. అసలు Sunday రోడ్లమీద ట్రాఫిక్ ఉండకూడదు. కానీ ఆరోజే విపరీతమైన ఔటింగ్! బళ్ళూ, కార్లూ.. ఆటోలూ, పట్టుచీరలూ, చర్చికి పోయే వాళ్ళూ, రైతు బజార్ కి వెళ్ళేవాళ్ళూ, సంగీత్ జంక్షన్ లో లేదా క్లాక్ టవర్ దగ్గర చేపల దుకాణానికి వెళ్ళే వాళ్ళూ, గుడికి పోయే భక్తులూ.. వీళ్ళతో రోడ్లు హడావుడి గా వుంటాయి. పొద్దున్న 12ఇంటి దాకా ఇదే హడావుడి. ఆ తరవాత ఇంకో రకం హడావుడి. రెస్టారెంట్లూ, సినిమా హాళ్ళూ - సాయంత్రం అవుతుండగా ఊర్లో ఉన్న రెండే రెండు పార్కులూ, ఒక్కే ఒక్క ఐమాక్సూ - జనం తో గింజుకుపోతూ ఉంటాయి. హైదరాబాద్ లో రెస్టారెంట్ అనుభవాలు కూడా రక రకాలు. భోజన శాలలు కిక్కిరిసిపోవడం. యాత్రీ నివాస్ లో పార్కింగ్ ప్లేస్ దొరకకపోవడం.. ఇలాంటి సిత్రాలన్నీ ఆదివారమే.


నాకీ రోజు బిజీ గా గడిచినా బాధే, లేజీ గా గడిచినా బాధే - ఎందుకని ? లేజీ గా అంటే - అయ్యో ఈ రోజు ఎన్నో పనులు అయి ఉండేవి గా అనిపిస్తూ ఉండటం వల్ల. నాలాంటి కన్ ఫ్యూషన్ ఇంకెవరికైనా ఉంటుందా అని నా సందేహం ! ఇక్కడ శనివారాలు కూడా పనిదినాలు కావడం వల్ల, ఆదివారం బయటికి వెళ్ళాలంటే ఇల్లంతా ఏవో పనులు కనిపిస్తూనే ఉంటాయి. ఏదో ఇన్స్పెక్షన్ టీం వస్తున్నట్టూ, బోల్డంత పని పెండింగ్ ఉన్నట్టూ మనసు బెంబేలెత్తుతుంది. అయినా 'పని తరవాత చెయ్యొచ్చులే - పద బైల్దేరదాం !' అంటారు. ఈ రోజే ఎవరింటికో వెళ్ళాలి. కష్టపడి ఉతికి ఇస్త్రీ చేసిన బట్టలు తీసి కట్టుకోవాలి. వాళ్ళు బయటికెళ్దాం అంటే బయల్దేరాలి. వాళ్ళ పిల్లల అల్లరి భరించాలి. ఇలా పొద్దున్నుంచీ నటించీ నటించీ, అలిసిపోయి, ఆదివారం కూడా ఆఫీసు ఉండుంటే బావుణ్ణు అనేలా అయిపోతూ ఉంటాను.


ఆదివారం ఇల్లు కదల బుద్ది వెయ్యదు సరే ! కానీ సాయంత్రాలు వ్యాహ్యాళి కో ఆడుకోవడానికో వెళ్ళాలనుంటుంది. ఎక్కడా ? నేనేమన్నా ఆర్మీ వాళ్లలాగ అదృష్టవంతురాలినా ? నా వయసు కి ఇక్కడ ఆటలు అయితే కుదరదు. గోల్ఫ్, గిల్లీ డండా, క్రికెట్, బాస్కెట్ బాల్ లాంటి పెద్ద ఆటలు కాకపోయినా షటిల్ ఆడాలనుంటుంది. చుట్టుపక్కల ఎవరూ ఆడేవాళ్ళు లేరు. నేనస్సలు టీవీ చూడను. ఒక్కో సారి వారాల తరబడి అటు వైపు చూడను. ఎప్పుడో బుద్ధి పుడితే చూస్తాను. కానీ ఎక్కువసేపు కూర్చోలేను. పడుకుని చూడాలనుంటుంది. పెద్ద వాళ్ళ ముందు ఎలా ? అందుకే టీవీ బంద్ అయిపోయింది. ఆదివారం ఇంట్లో ఉండుంటే, అమ్మ, నాన్నగార్ల తో కలిసో, మా చెల్లి ఉంటే క్రికెట్ చానెల్ మార్చవే అని గొడవ పడుతూనో టీవీ చూడడంలో ఉన్న మజా ఇప్పుడు రాదు. అంతగా చిరాకేస్తే బీచ్ కి వెళిపోవడమే !


సినిమా హాలు కెళ్ళి సినిమా చూసి ఏడాదిన్నర పైగా అయింది. సినిమా అంటే ఇష్టం లేక కాదు. నాకిష్టమైన / నేను చూడాలనుకునే సినిమాలు ఎక్కడో మాళ్ళ లో చూపిస్తుంటారు. మా నానమ్మ కి భలే ఇంటరెస్ట్ ఉండేది. తను ఒక్కత్తీ రిక్షా కట్టించుకుని సినిమాకి వెళిపోయేది. బన్ను ముడి వేసుకుని, జరీ చీర కట్టుకుని, మెరుస్తూ, చటుక్కున తెరుచుకునే చిల్లర పర్సూ,ఒక రుమాలూ పట్టుకుని, రిక్షా ఎక్కి మేటనీకి చెక్కేసేది. తను అపుడు ఒక్కర్తీ ఉండేది. అయినా కోలనీ అంతా స్నేహితులూ ఉన్న, ఒంటరినన్న బాధ లేకపోవడం - ఎవరో తీస్కెళ్తారని ఎదురు చూడకుండా, తన పని తానే చేసుకునే మనస్తత్వం వల్ల అలా వెళిపోయేది. కానీ నేను ఒక్కర్తినీ వెళ్ళలేను. ఆదివారం ఎవరన్నా తోడు దొరుకుతారు. కానీ ఆదివారం సినిమా చూడటం నా అంతరాత్మని ఖేదపరుస్తుంది. ఆదివారం సినిమా ఏమిటి, తిని బజ్జోకుండా ?! అయినా వైజాగ్ లా కాదు కదా. ఊళ్ళో సినిమా చూడ్డానికీ ఈ మహానగరంలో చూడ్డానికీ చాలా అంతరం ఉంది. ఇది అవస్థ. అది అనుభవం.


జీవితంలో మొనాటనీ విసుగు కలిగిస్తుంది. ఈ మధ్య ఇంట్లో నా సెలెబ్రేషన్స్ కూడా నచ్చట్లేదు. అప్పటికీ చెక్కేస్తూ ఉన్నా మా కజిన్ ఇంటికో, ఫ్రెండ్ ఇంటికో. కానీ వాళ్ళ 'ఆదివారాన్ని ' ఖరాబు చేస్తున్నానేమో అని భయం. వాళ్ళూ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే. వాళ్ళకీ ఏవో ప్లేన్లు ఉంటాయిగా ! ఒంటరితనం నాకు చాలా ఇష్టం. నేనో ఇంట్రావర్ట్ ని. అందుకే నా ఆదివారాలు నా కోసం గడపడం నాకు చాలా ఇష్టం. డాబా మీదికెక్కి, రాత్రి వేళ వెనక రోడ్లో విరగబూచిన నాగమల్లి చెట్టును చూస్తూ, దీపాల కళకళల్తో మెరిసిపోతున్న నగరాన్ని చూడటం చాలా ఇష్టం. ఇంతకు ముందు విమానాలు వచ్చి వాలుతూండేవి. ఇపుడు ఒకటీ అరా మాత్రమే కనిపిస్తూంటాయి.


ఇన్ని ప్లాన్లూ, సిద్ధాంతాలూ ఉన్నా, ఆదివారం చక్కగా నిద్ర పోవడానికుండదు. ఏదో పని, ఎవరిదో పని. ఎందుకో ఒకందుకు ఏదో ఒక చెత్త పని తగుల్తుంది. సాయంత్రం ఆ ప్రమదావనం చాటింగ్ సమయానికే ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది. లేదా ఎవరో అతిధులు వస్తారు. అన్నీ బావుంటే కరెంట్ పోతుంది. లేదా ఇంటర్నెట్ ఉండదు. సరే ! అనుకుంటే ఇంకోటి, ఇంకోటి. చూస్తూండగానే ఆదివారం గడిచిపోతుంది. రేపు ఆఫీసులో చెయ్యాల్సిన పనులు గుర్తొస్తాయి. ఎందుకోలే గానీ నాకు ఆఫీసంటే కొంచెం ఇష్టమే. అయినా ఆదివారం ఎంత తొందరగా ముగిసిపోతుంటే - కాస్త ఆశ్చర్యం కలుగుతుంది. అపుడే చీకటి పడింది - ఇదుగో అయిపోయింది.. అని! ఇంక నా జీవితం అంతా ఆదివారాలంటే ఇలానే ఉంటాయ్యేమో !

20 comments:

జ్ఞాన ప్రసూన said...

nenu udyogam cheyaka poyinaa aadivaaraalante ento ishtam.bahusa intlo vaallantaa intlo vuntaaru kanaka,tifin dabbaalukatti, cheppulu, battalu andinche hadaavudi vundadukanuka.ippatiki ante.iaadivaaram selavu mood inglishu vaari kaanuka.sunday ante goruvechchani endalo aadivaaram haayigaa pepar chaduvukontoo gadapaalanemo? videsiyulu maatram aadivaaraanni aanandamgaa visraantigaa gaduputaaru.manake aasoku teliyadu.

Unknown said...

సుజాత గారు ఆదివారాలు ఆ మాటకొస్తే వారాంతపు సెలవులు అందరికి అలాగే గడిచిపోతయనుకుంట. ఏదో చేసేద్దామని ప్లాన్ వేసుకుంటే ఆ రోజుల్లోమే ఏదో అవాంతరాలు.నాకు కూడా ఆదివారం ఈ రష్ లో బయటకేల్లడం కన్నా ఇంట్లో నెట్ ముందు కూర్చోడం బెటర్ అని పిస్తుంది.హైదరాబాద్ లో ఎక్కదికేల్లలన్న జనం ప్రభంజనం ల వుంటున్నారు. మొన్న బేగుంపేట్ లో పెట్టిన ఎయిర్ షో కి 150 టికెట్ గంటల కొద్ది లైన్ లో నిలబడి మరి కొని దూరం నుంచి డొక్కు విమానాల్ని (అప్పటికి airbus380 శంషాబాద్ వెళ్లిపోయింది)చూసి భయంకరమైన ట్రాఫిక్ జామ్ చేసి మరి ఇళ్ళకి వెళ్లారు.అదేంటో స్టేటస్ symbol ఐ పోయింది టీవీ లో ఏదన్న షో ఫలానా చోట వుందంటే చాలు అది మేం చూసాం అని చెప్పుకునే దాక కొంత మంది నిద్ర పోరు.అయిన ఎక్కడ పడితే అక్కడే జనం నిందాకా మా కజిన్ ఫోనే చేసి అదే అంటున్నాడు ఒకప్పుడు ఈ గొతమికి ఒక రోజు ముందు కూడా టికెట్స్ దొరికేవి ఇప్పుడు కనీసం వారం రోజుల ముందు కూడా దొరకటం లేదు ఈ జనం రోజు హైదరాబాద్ వెళ్లి ఎంచేస్తున్తరబ్బ అని సందేహం వెళ్ళబుచ్చాడు.గుడి లో రష్ సినిమా హల్లోరైల్లల్లో బస్ లో విమానాల్లో హోటల్స్ లో రష్ .అందుకే బెస్ట్ ప్లేస్ ఇన్ ది వరల్డ్ మన ఇల్లే.

సూర్యుడు said...

శనివారాలు పనిదినాలా? హైదరాబాదు లో అన్ని కంపనీల్లో అలాగేనా లేకపోతే కొన్నింట్లో మాత్రమేనా?

Sujata M said...

సుర్యుడు గారు - నేనూ కేంద్ర ప్రభుత్వోద్యోగం వెలగబెడుతున్నా, మాది ఆరు రోజుల ఉద్యోగం ఇక్కడ. ఎరక్కపోయి (ట్రాన్స్ఫర్ కోసం) ఇరుక్కుపోయాను !

Sujata M said...

జ్ఞాన ప్రసూన గారు.

మీరు నా బ్లాగ్ లో వ్యాఖ్యానించడం చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి వ్యాఖ్య రాశారు. థాంక్స్.

Sujata M said...

రవిగారు గారు

అవును. అసలు మన దేశం లో ఎక్కడ చూసినా జనమే - జనం. అందునా ఆదివారం చూసుకోవాలి. ఏర్ షో లో తొక్కిడి పేపర్లో చూసాను. ప్రాణాలతో బయటపడ్డారు. అదే చాలు అనిపించింది ఫోటో చూస్తే.

Purnima said...

అందుకే నేను ఆదివారాలు ఏ ప్లాన్లూ పెట్టుకోను. కనీసం పడుకోవాలి, సినిమాకెళ్ళాలి లాంటివి కూడా! It is the only day, I'm willing to take as it comes and I'm happy with whatever I do.

ఆదివారం కాదు కానీ, "మండే మార్నింగ్ బ్లూస్" గురించో టపా రాయాలసలు నేను. నాకు బొత్తిగా ఎక్కని ఒక్కే ఒక్క పూట అది. అదేమిటో నేనిలా ఎదీ గట్టిగా నమ్మను కానీ నా సెల్ కి, నా కార్‍కీ, నా పిసికీ, వాటిలో పాస్‍వర్డ్స్ కీ అన్నింటికీ మండే మార్నింగ్ బ్లూస్ ఉన్నాయి! :( సో.. నాకూ తప్పటం లేదు.

మీ సంగతో?? ;)

Unknown said...

సుజాతగారు మీరు నా id కి గారు తగిలించడం వల్ల వ్యతిరేకార్డం వచ్చు చునట్లు గోచరించు చున్నది గాన గారు భవిష్యత్తు లో తీసివేయ ప్రార్దన. ఇంకో విషయం ఏంటంటే హైదరాబాద్ లో కూడా కేంద్రప్రబుత్వ వుద్యోగులకి 5 రోజుల వర్కింగ్.పబ్లిక్ సెక్టార్ కి 6 రోజులని govt గజ్జేట్ లో చుసిన జ్ఞాపకం .

Anonymous said...

vedhavadi, eeroju monday ayipoyina inka monday morning blues avvaledu, repu baguntundani asistoo, sodari ivaltiki selavu..

Kathi Mahesh Kumar said...

@sujata:‘ఒరే కడల్’DVD ఇప్పుడే చేతికొచ్చింది. ఇవ్వాళ చూసెయ్యాలి.చూడగానే రాయడం మొదలెడతాను.

Bolloju Baba said...

మీ పోస్టు చూసాకా టైం మేనేజ్ మెంట్ తెలిసింది.

సాధారణంగా సండేలు మేము సినిమాకో పార్కుకో చుట్టలింటికో వెళుతూంటాము.
a good introspection.
fine

bollojubaba

Sujata M said...

పూర్ణిమా..

నాకు మండే బ్లూస్ అస్సలు లేవు. నాకు మా ఆఫీసు కొంచెం ఇష్టమే. ఎందుకో మండే ఇంటినుంచీ రెస్పైట్ దొరికే పెద్ద అవకాశం లా కనిపిస్తుంది. ఇంకో కారణం కూడా వుంది. మా బాస్ చాలా చాలా చాలా మంచాయన. అందుకే - ప్రస్తుతం ఆఫీసు నాకు చాలా ఇష్టం. టచ్ వుడ్ !

Sujata M said...

రవి గారు

సారీ.. కొందరు మాలాంటి దురదృష్టవంతులు కూడా వుంటారు. మేము మిలిటరీ సెట్టింగ్ లో ఉన్నాం. వీళ్ళు పొద్దున్నే మొదలు పెట్టి, మధ్యాహ్నానికి పని చెయ్యడం ముగించేసి, సాయంత్రాలు పార్టీలూ, గోల్ఫ్ లూ ఆడుకుంటూ ఉంటారు. అందుకే మాకీ తిప్పలు ! పని నిజానికి మధ్యాహ్నానికి ముగిసి పోదు. ఎటూ కాని వేళ - ముగిసినా, ఆనందం - సాయంత్రాలు మావే ! మిగతా అంతా శనివారాలు ఎంజాయ్ చేస్తే, మేము సాయంత్రాలు ఎంజాయ్ చేస్తాం. కాకపోతే, ప్రత్యేకంగా పనులు చేసుకోవడానికి మాత్రం వీలుండదు. డిస్పెన్సరీ కి వెళ్ళాలన్నా, సెలవు గానీ అనుమతి గానీ తీసుకోవాలి.

Sujata M said...

రవి గారు

సారీ.. కొందరు మాలాంటి దురదృష్టవంతులు కూడా వుంటారు. మేము మిలిటరీ సెట్టింగ్ లో ఉన్నాం. వీళ్ళు పొద్దున్నే మొదలు పెట్టి, మధ్యాహ్నానికి పని చెయ్యడం ముగించేసి, సాయంత్రాలు పార్టీలూ, గోల్ఫ్ లూ ఆడుకుంటూ ఉంటారు. అందుకే మాకీ తిప్పలు ! పని నిజానికి మధ్యాహ్నానికి ముగిసి పోదు. ఎటూ కాని వేళ - ముగిసినా, ఆనందం, సాయంత్రాలు మావే ! మిగతా అంతా శనివారాలు ఎంజాయ్ చేస్తే, మేము సాయంత్రాలు ఎంజాయ్ చేస్తాం. కాకపోతే, ప్రత్యేకంగా పనులు చేసుకోవడానికి మాత్రం వీలుండదు. డిస్పెన్సరీ కి వెళ్ళాలన్నా, సెలవు గానీ అనుమతి గానీ తీసుకోవాలి.

Sujata M said...

సోదరీ..

చాలా థాంక్స్.. నా పిచ్చి రాతలు చదువుతున్నందుకు.

Sujata M said...

మహేష్ గారూ

ఎదురు చూస్తున్నాను. మీకు ఈ సినిమా నచ్చాలి అని ప్రార్ధిస్తున్నాను. ఎందుకంటే, మీకు నచ్చలేదనుకోండి - చీల్చి చెండాడేస్తారు. అదీ నా భయం.

Sujata M said...

బాబా గారూ..

థాంక్స్ ! మీ కామెంట్ చాలా బావుంది.

Unknown said...

అమ్మో మిలిటరీ సెట్ అప్ లోనా ?హత విధి.సబ్బులు సరుకులు తక్కువ ధరకు వస్తాయని ఇదివరకు త్రుప్తన్న ఉండేదేమో ఇప్పుడు వాట్ వల్ల ఆ సదుపాయం లేదని విన్నా.అయిన మిలిటరీ నుంచి వేరే departments కి కూడా transfer possibility వుందనుకుంటా. అలా ట్రై చెయ్యండి అప్పుడు ఇంచక్కా వారనికు రెండు సార్లు టెన్షన్ పడొచ్చు.

MURALI said...

అయినా వైజాగ్ లో వారాంతం గడిపే సుఖం ఈ హైదరాబాద్ లో అందులోనూ మేముండే పోలీస్ లైన్ దగ్గర ఉండి చావదు. అసలు సాయంత్రం మొత్తం బీచ్ లోనే గడిచిపోతుంది.

MURALI said...

ఇక్కడి వారాంతాలన్నీ పైరసీ జిందాబాద్