Pages

02/10/2008

15 పార్క్ ఎవెన్యూ

15 పార్క్ ఎవెన్యూ - భూటాన్ లో తీసారు....(అదో .. రెఫ్రెషింగ్ ఫీలింగ్)... నేనప్పటకి ఢిల్లీ కీ గల్లీల్లో ఉండేదాన్ని. ఇప్పట్లాంటి గడ్డు రోజులు కావవి. ప్రగతీ మైదాన్ (Sakuntalam) లో యాభయి రూపాయలు పెడితే మంచి సినిమా టికెట్ దొరుకుతుంది. పార్కింగ్ ఫ్రీ. ఆఫీసు 5.30 కి ముగిసాకా, వేరే వేరే చోట పనిచేసే మా ఫ్రెండ్స్ అందరం మా వాయు భవన్ ముందర కలుసుకుని, పొలోమంటూ ప్రగతీ మైదాన్ కి పోయి, టికెట్ కొన్నాక ఓమాటు బైటికొచ్చి, ఆవనూనె లో వేయించిన పెసలు తింటూ, హాయి హాయి గా గడిపి, 7 / 8 గంటల షో (సినిమా నిడివి బట్టీ) కి తయారయ్యేవాళ్ళం.


అలాంటి రోజుల్లో అపర్ణా సేన్ సినిమా కాబట్టి బోల్డంత ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళి చూసిన సినిమా ఈ '15 పార్క్ ఎవెన్యూ'. కధ - గురించి ముందే తెలుసుకునుండకపోయుంటే, కొంచెం కష్టం అయేది. కానీ స్కీజో ఫ్రీనియా అనే ఒక రకమైన మానసిక రోగం తో బాధపడే ఒక అమ్మాయి కధ అని విని ఉన్నాం కనుక - ఈ మేధోపరమైన సినిమాకి మానసికంగా తయారయి ఉన్నాం. ఈ అమ్మాయి పేరు మీఠీ (కొంకణా సేన్ శర్మ). ఈమె, తన అక్కయ్య షబానా ఆజ్మీ తో కలిసి 15 పార్క్ ఎవెన్యూ అనే ఎడ్రెస్ వెతుకుతూండడంతో సినిమా మొదలవుతుంది.


మీఠీ కి తనకి జయొదీప్ తో పెళ్ళయిందనీ, తనకు 5గురు పిల్లలున్నారనీ, తామంతా పార్క్ ఎవెన్యూ లో 15 వ నెంబరు ఇంట్లో ఉన్నామనీ ఒక భ్రమ. అది భ్రమ మాత్రమే కాదు.. అదే ఆమెకు సంబంధించిన జీవితం, ఆమె అస్థిత్వం. ఇలాంటి భ్రమనే నమ్ముకుని జీవిస్తున్న మీఠీ ని కంటికి రెప్ప లా కాపాడుకుంటూ వస్తున్నారు తన అక్కయ్య (షబాన) మరియూ తల్లి (వహీదా రెహ్మాన్). వీరందరి జీవితాల్తోనూ ఒక నిజమైన జయొదీప్ (రాహుల్ బోస్) తరవాత వచ్చి కలిస్తే, కొన్ని అత్భుతమైన పెర్ఫార్మెన్సులూ, కొన్ని విషాద సంఘటనలూ, అత్యత్భుతమైన స్క్రీన్ ప్లే..ఇవన్నీ కలిసి, గుండె తరుక్కుపోయేలా చేసే జీవిత క్రమాలూ.. కలిస్తే 15 పార్క్ ఎవెన్యూ అవుతుంది.

అందరూ బెంగాలీ లూ (బహుశా వహీదా, kanwaljit తప్ప) కలిసి, ఈ సినిమాని చాలా మంచి హైట్స్ కి తీస్కెళ్ళి వొదిలేసారు. సినిమా ముగిసాకా, పట్టేసిన గుండె సర్దుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. మీఠీ చిన్నప్పట్నించీ హాలూసినేషన్స్ కి గురవుతూ ఉంటుంది. ఆమెకు తండ్రి మానశిక చికిత్సాలయం లో ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తారు. కొన్నేళ్ళకు పరిస్తితి మెరుగు పడినట్టనిపించి సగం, అక్కడ కన్నా, ఇంట్లో అయితే ఆడపిల్లకు సేఫ్ అనీ ఆలోచించీ సగం, పిల్లను ఇంటికి తీసుకొచి కాలేజీ లో చేర్చి మంచి మానసిక ఆలంబన అందిస్తుంది ఆ కుటుంబం. కాలేజీ లో జర్నలిజం లో కోర్స్ చేస్తుంది మీఠీ. అక్కడే జొయొదీప్ (రాహుల్ బోస్) పరిచయం అవుతాడు. రాహుల్ బోస్ అంటే నాకు 'ఇంగ్లీష్ ఆగస్ట్ ' సినిమా నుంచీ కొంచెం ఇష్టం.


జొయొదీప్ అంటే పిచ్చి ప్రేమ పెంచుకుంటుంది మీఠీ. ఒక మంచి ప్రేమికుడిగా, స్నేహితుడిగా, మీఠీ లో ముడుచుకుపోయే తత్వాన్ని పోగొట్టడానికి, ఆమె లో ఆత్మ విశ్వాసం నింపడానికీ జొయొదీప్ ప్రయత్నిస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరి సంగతీ, పెద్దలకు తెలిసి, వారికి ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అవుతుంది. ఈ లోగా జర్నలిస్ట్ గా ఉద్యోగం చేస్తున్న ఈ పిల్లను యాజమాన్యం ఒక చోట అల్లరి మూకలు (ప్రస్తుతం కాంధమాల్ లో జరుగుతున్నట్టు) చేస్తున్న అల్లర్లను కవర్ చేయడానికి పంపబోతుంది. అయితే మొదట బెదిరినా ఆ అమ్మాయి, జొయొదీప్ ముందు తనను తాను నిరూపించుకోవడానికి ఈ ఎసైన్మెంట్ కు ఒప్పుకుని, కుటుంబ సభ్యులకు సరిగ్గా వివరాలు చెప్పకుండానే ఆ భయంకర ప్రదేశాల్లోకి ఒంటరి గా వెళ్తుంది. అక్కడ దారుణంగా గేంగ్ రేప్ కు గురవుతుంది. ఈ షాక్ కి ఆమె ఈ సారి నిజంగానే మానసికంగా బలహీనురాలయిపోతుంది.

ఎలాగో ఈ వార్త తెలిసి, మీఠీని ఇంటికి తీసుకొచ్చాకా, మీఠీ ని కలవడానికి వెళ్ళిన జొయొదీప్ - తన పరిస్థితి చూసి జాలి తో నిండిపోతాడు. తనను తాకిన వెంటనే మీఠీ జొయొదీప్ ను గుర్తించక, కరెంట్ షాక్ కొట్టినట్టు, వెనక్కి తప్పుకుంటుంది. ఆమెకు స్పర్శ అంటేనే ఏదో ఏవగింపు.. భయం. తను చేసుకోబోయే అమ్మాయి మీద ప్రేమతో తప్ప, ఇలా జాలితో పెళ్ళి చేసుకోలేనని చెప్పి, జొయొదీప్ వారి జీవితాల్నుంచీ నిష్క్రమిస్తాడు. తండ్రి ఈ విషాదానికి తట్టుకోలేక, గుండెపోటు తో మరణిస్తాడు.

ఇన్ని విషాదాల తరవాత మీఠీ ని ఆక్రమించుకున్న స్కీజోఫీర్నియా.. ఆమె ను ఆమె గతంలో జొయొదీప్ తో కన్న కలలే నిజం అనేంత గా భ్రమల్లో ముంచుతుంది. జొయొదీప్ తో తనకు నిజంగానే పెళ్ళయినట్టూ, వారికి 5 గురు పిల్లలున్నట్టూ, వారంతా 15 పార్క్ ఎవెన్యూ లో నివాశం ఉంటున్నట్టూ ఊహించుకుంటూ ఆ ఊహల్లోనే బ్రతుకుతూ ఉంటుంది మీఠీ.


ఇన్ని కాంప్లెక్సిటీ ల తరవాత.. కొన్నాళ్ళకి జొయొదీప్ నిజంగానే వీరి జీవితాల్లోకి వస్తాడు. ఈ రావడం యాధ్రుచ్చికంగానె జరిగినా, మీఠీ ప్రస్తుత పరిస్థితి చూసి, ఆమె ఈ పరిస్థితికి కాస్త తనూ కారణమేనేమో అన్న గిల్టీ ఫీలింగ్ తో తను ఆమెకు ఏదోలా సహాయం చేద్దామనే ఉద్దేశ్యంతోనే వస్తాడు. మీఠీ కి 15 పార్క్ ఎవెన్యూ వెతకడానికి సహాయం చేస్తానని చెప్తాడు. కానీ ఆఖరికి, ఈ ఇల్లు వెతకడం లోనే మీఠీ కనిపించకుండా పోతుంది. ఆమె కు తన ఇల్లూ, పిల్లలూ, భర్తా దొరికారా, లేదా అనేది మన ఊహ కే వొదిలేసిన దర్శకురాలు, మీఠీ ని ఇన్నాళ్ళూ పసిపాప లాగా సాకిన తల్లీ, మీఠీ కోసం, ప్రేమనూ, జీవితాన్ని త్యాగం చేసిన అక్కయ్యా, అప్పటికి ఇద్దరు పిల్లల తండ్రి అయినా, మీఠీ కోసం ప్రేమ (!!!) తో, ఆమె మీద జాలితో, ఆమె తప్పిపోయేంత వరకూ ఆమె తో స్నేహించిన జొయొదీప్.. ఇలా అందరూ మీఠీ తప్పిపోయాక పడిన ఆందోళన మన మనసుల్లోనూ కలిగిస్తుంది అపర్ణా సేన్.


మీఠీ కధ ని చెప్తున్నపుడు వాళ్ళింటి దగ్గర రోడ్ మీద చెత్త, గాజు పెంకులూ ఏరుకుంటూ.. అవే అత్బుతమైన వస్తువుల్లా దాచుకునే ఒక పిచ్చిదాన్ని చూపిస్తారు. ఆమె ని చూసి, మీఠీ భయపడుతూ ఉంటుంది. ఆమె ను ఒక రెండు సార్లు మాత్రమే చూపించినా ఆ సీన్ చూస్తే, సాధారణంగా మనకు తారసపడే మానసిక రోగుల పాస్ట్ గురించి ఎందుకో ఆలోచించాలనిపిస్తుంది. వారి పట్ల సమాజపు వివక్ష ని అసహ్యించుకోవాలనిపిస్తుంది.


సినిమా కధ ఇంత సింపుల్ గా చెప్పగలిగినా.. చూడడానికి చాలా బావుంది. సహజంగా విషాదాంతాలు ప్రేక్షకుల మీద చూపించే ప్రబావం ఎక్కువ. 15 పార్క్ ఎవెన్యూ లో తెర ముందు నటించిన ప్రతి ఒక్కరి నటనా - తెర వెనుక ఉన్న ప్రతి ఒక్కరి ప్రతిభ అబ్బురపరుస్తుంది. విదేశాల్లో షూటింగులూ, పాటలూ చిత్రీకరించడం.. ఒక్కోసారి విదేశాల్లోని సబ్జక్టుల తో నే సినిమాలు తీయడం ఎక్కువైన రోజుల్లో, భూటాన్ లో తీసిన, (ఎక్కువ భాగం ఇండియాలోనే) ఈ సినిమా చాలా మంచి ప్రమాణాలతో తీసినది. నేను మొదలు పెట్టడమే ఈ సినిమా భూటాన్ లో తీసారు - అని ఎందుకు చెప్పానంటే, భూటాన్ లో చిత్రీకరించిన భాగం.. చాలా గాఢమైనది; స్వచ్చమైన ప్రతిభ, మనుషుల మనసుల్లోని అందాలను బయటికి తీసుకొచ్చే ఏదో మిస్టిక్ భావజాలం ఆ సీన్ ల లో అల్లుకుపోయి కనిపిస్తుంది. అప్పటికే తడిచిపోయిన ప్రేక్షకుల మనసుల్ని కాస్త ఆహ్లాదపరిచే గాంభీర్యం భూటాన్ ది. అందుకే అది చాలా రిఫ్రెషింగ్ ఫీలింగ్ అన్నాను.


ఇంట్లో స్పెషల్ పిల్లలు ఉంటే ఆ కుంటుంబం చేసే త్యాగాలు.. వారి లో ప్రతి ఒక్కరి జీవితం.. ఒక కధ లాగా - వారి మనసుల్లోకి మనం తొంగిచూడగలిగితే కనిపించే లోతులు.. ఇదంతా, ఈ సినిమా చూస్తే కొంచెం అన్నా అర్ధం అవుతుంది. ముఖ్యంగా షబానా.. సైకియాట్రిస్ట్ గా నటించిన చటర్జీ.. ఈ లోతుల్ని స్పృసించడానికి కాస్త సహాయపడతారు.


ముఖ్యంగా వహీదా రెహ్మాన్ - తల్లి గా ఎంత అత్భుతంగా నటించినంటే, కూతురి గురించి బాధపడే నిస్సహాయురాలైన వృద్ధ, అమాయకురాలైన తల్లి గా ఆవిడ జీవించింది. ఒక సీన్ లో మూఢ నమ్మకాల ఆధారంగా పనిమనిషి చెప్పిన మాట నమ్మి.. అలా చేస్తే పిల్ల బాగుపడుతుందేమో అన్న ఆశ తో మీఠీ కి మంత్రాల ట్రీట్మెంట్ కూడా ఇప్పించబోతుంది. షబానా నటన చెప్పనే అక్కర్లేదు. షెఫాలీ షెట్టి (జొయొదీప్ భార్య) చాలా తక్కువ సేపు కనిపించినా..చాలా బాగా నటించింది. ఇంత మంది విదూషీమణులు, కన్వల్ జీత్, రాహుల్ బోస్, ధ్రితిమాన్ చెటర్జీలు (సైకియాట్రిస్ట్) నటించిన సినిమా ఎలా వుంటుందనుకుంటున్నారు ?


సీరియస్ నటన, ప్రతిభలు నచ్చే వారూ.. సినిమా ఒక కళ అయితే.. ఆ కళ ని ఆరాధించే వారూ, పిపాసులూ.. తప్పకుండా చూడదగిన చిత్రం ఈ '15 పార్క్ ఎవెన్యూ' ! {చూడాలనుంటే, యూ ట్యూబ్ లో చూడొచ్చు}

18 comments:

నిషిగంధ said...

సుజాత గారూ, ఇంత మంచి సినిమా గురించి తెలియచేసినందుకు ధన్యవాదాలు.. నేనైతే ఇప్పటి వరకూ ఈ సినిమా పేరు కూడా వినలేదు.. కధ మాత్రం హృద్యంగా ఉంది.. నటీనటుల గురించి తెల్సిన తర్వాత ఇంక సినిమా ఎలా ఉంటుందో ఊహించనక్కరలేదు!! ముఖ్యంగా కొంకణా ని మీఠీ పాత్రలో తల్చుకుంటుంటేనే కళ్ళు నిండిపోతున్నాయి..

ఇలాంటిదే అప్పుడెప్పుడో తులిప్ జోషి నటించిన మూవీనొకటి(పేరు గుర్తు రావడం లేదు) కూడా పరిచయం చేశారు! చూసినంతసేపూ ఏడుస్తూనే ఉన్నాకానీ ఒక మంచి సినిమా చూసిన అనుభూతి మిగిలింది!

Sujata M said...

నిషిగంధా..

చాలా థేంక్స్. మాతృభూమి - మీరు చూసారా ? బాబొయ్ ! చాలా థేంక్స్ అండీ.

Anonymous said...

మంచి రివ్యూ. "బ్యూటిఫుల్ మైండ్" తరువాత స్కిజోఫ్రీనియా గురించి బాగా తెలియజెప్పిన సినిమా ఇదేనేమో. మీరు మహేష్ గారి బ్లాగులో "ఒరే కడల్" రివ్యూ రాయమని అడగడం చూసాను. మీరే రాస్తే చదవాలని ఉంది.

Sujata M said...

భవాని గరు

చాలా థేంక్స్.


ఒరె కడల్ - గురించి రాయడానికి నాకు భాష రాదు. సబ్ టైటిల్స్ లో సినిమా సగం నుంచీ చూసాను. కానీ చాలా నచ్చింది.


అందుకే ఆయన్ని అడిగాను.

శ్రీ said...

నేను ఈ సినిమా ఒక సంవత్సరం ముందు చూసాను,మంచి సినిమా. వీళ్ళిద్దరూ కలిసి మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్ లో నటించారు.

కొత్త పాళీ said...

Thank you.

కొత్త పాళీ said...

మీరు నవతరంగంలో సభ్యులుగా చేరండి దయచేసి.
http://navatarangam.com

Kathi Mahesh Kumar said...

సుజాత గారూ, ఆల్రెడీ మా మళయాళం మిత్రుడికి ‘ఒరే కడల్’ సినిమా తెప్పించమని పురమాయించాను. చూసిన వెంఠనే పూనుకుంటాను.

మీ సమీక్ష చాలా బాగుంది. ఈ సినిమా నేను చూశాను. చాలామందికి ఈ చిత్రంలోని ముగింపు అర్థం కాకపొతే, నాకు ఈ చిత్రం ఆ ముగింపువల్లే నచ్చింది. కొందరు మిత్రులు బలవంతపెడితే ఈ చిత్రం ముగింపు నేను విడమర్చి చెప్పాల్సొచ్చింది.

మీరు నవతరంగంలో రాయడం మొదలుపెట్టండి. అక్కడ సినిమా అభిమానులూ,ప్రేమికులే సమీక్షకులూ,విశ్లేషకులు కాబట్టి అక్కడ రాయటం మీ హక్కు. ఈ క్రింది మెయిల్ ID లకు మీ ఈ వ్యాసాన్ని పంపుతూ వెంకట్ కి ఒక టపా కొట్టండి. navatarangam@gmail.com, venkat.thedirector@googlemail.com

సిరిసిరిమువ్వ said...

చాలా మంచి రివ్యూ. ఇప్పటికిప్పుడు ఈ సినిమా చూడాలనిపించేటట్లు రాసారు. youtube లో చూసి చెప్తా!!

దైవానిక said...

మంచి సినిమా, నేను చాన్నాళ్ళ క్రితం చూసాను. ఒక్క సవరణ, రాహుల్ బోస్ భార్యగా నటించింది షెఫాలి షా( షెట్టి కాదనుకుంటా!!)
సినిమా నచ్చింది కాని టూ గుడ్ అనిపించలా! నెక్స్ట్ మళ్ళి జపనీస్ వైఫ్ వస్తుందనుకుంటాను సేని ది.

teresa said...

ఎప్పుడూ పేరు కూడా వినని ఈ సినిమాని మీ సమీక్ష చదివాకే చూశాను. చాలా బావుంది.ధన్యవాదాలు.

cbrao said...

చక్కటి పరిచయం.నవతరంగం స్థాయిలో ఉంది. అభినందనలు.

Sujata M said...

వరూధిని గారు - థేంక్స్ ! Watch it. Its a good moovie.

Sujata M said...

మహేష్ గారు & కొత్త పాళీ గారు..

నేను మెయిల్ చేసేసాను. వారు కూడా సభ్యత్వం ఇస్తామన్నారు. ఏమో... ఆవేశంలో ఇంకో సినిమా ఇంట్రో కూడా రాశేసాను. నా పాత మాతృభూమి గురించిన టపా చూసి, ఎన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయో చూసుకుని బాధపడ్డాను. నన్ను 'నవతరంగం కే లాయక్ సమఝ్నే కే లియె ' ధన్యవాదాలు. (నేను హిందీ సినిమాలే ఎక్కువ చూస్తాను)

Sujata M said...

సీ.బీ రావు గారు. చాలా పెద్ద కాంప్లిమెంట్. నేనూ నవతరంగం లో సభ్యత్వం తీసుకుంటున్నాను (నేనూ మార్గదర్శి లో చేరాను .. సైకిలు కొన్నాను..లా.. :D )!!!! చూడాలి. ఎన్ని సినిమాల గురించి రాస్తానో. చాలా థేంక్స్.

Sujata M said...

దైవానిక గారు - థేంక్స్ ! నాకు తెలిసి తన పేరు షెఫాలీ షెట్టీ నే. చెక్ చేస్తాను. థాంక్స్.

Sujata M said...

శ్రీ.. థాంక్స్. Yes. మిస్టెర్ అండ్ మిస్సెస్ అయ్యర్ కూడా వీళ్ళే. అది కూడా చాలా మంచి చిత్రం.

dalitadesam said...

bagundi