Pages

26/03/2017

The Wonderful Story of Henry Sugar by Roald Dahl



"ద వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్" - రాల్డ్ డాల్ రాసిన ఎన్నో పెద్ద కధల్లో ఒకటి. అయినా నాకు ఈ " పేద్ధ " కధ చాలా ఇష్టం.

ఇది కధలో కధ, కధలో కధ.. అలా సాగుతుంటుంది. అదీ చాలా ఆసక్తికరంగా !  సో ఆ కధ చెప్తానన్నమాట.  కాసేపు ఇది 'ఒక యోగి ఆత్మకధ' లాగా అనిపిస్తుంది. దానికి మనమేమీ చెయ్యలేం. కథని రచయిత చెప్పడం ప్రారంభిస్తారు.

లండన్ లో ఒకానొక  'హెన్రీ షుగర్'  చాలా డబ్బున్న ఒంటరి యువకుడు. పెద్ద మొత్తపు  ఆస్థి,  ఇటీవలే మరణించిన తండ్రిగారి నుంచీ చిక్కింది.   అందరు డబ్బున్న వాళ్ళలాగే, తన ఆస్థిని గుణించేసుకుని ఎన్నో రెట్లు చేసేయాలన్నంత కుతి,  దురాశ గల,  ఒక వేళ పెళ్ళి చేసుకుంటే, వచ్చే భార్య తో ఆస్థిని పంచుకోవాల్సొస్తుందని  పెళ్ళి మాటే తలపెట్టని 40 ఏళ్ళ బ్రహ్మచారి, లోభి అయిన యువకుడు! !


మరి చెయ్యడానికి ఏమీ లేక జూదం, క్రోకెట్, చెత్త హాస్యాలూ, పనికిమాలిన బెట్ట్ లూ కడుతూ కాలం గడుపుతూ   ఉంటాడు.   ప్రతిదాన్లోనూ లాభం చూసుకునే తత్వం. డబ్బు వస్తుందీ అంటే వొదిలే ప్రశక్తే లేదు.    ఫెరారీ కారు లో సవారీ.  వేసవిలో మాత్రం లండన్ లో ఉండటం!   అక్టోబర్ లో కాస్త చలి మొదలవగానే వెస్ట్ ఇండీస్ గానీ, దక్షిణ ఫ్రాన్స్ కు గానీ వెళ్ళి, అక్కడ తన ధనిక స్నేహితులతో గడిపి వస్తుంటాడు.  

హెన్రీ లాంటి వ్యక్తులు సముద్రపు నాచు లాగా ప్రపంచం అంతా కనిపిస్తూనే ఉంటారు. వారు పెద్ద చెడ్డ వాళ్ళూ అని చెప్పలేం. అలా అని మంచి వాళ్ళూ కారు. అసలు వారికి పెద్ద ప్రాధాన్యం ఇవ్వక్కర్లేదు. వాళ్ళు జస్ట్ ఈ సమాజపు అలంకరణ లో ఒక భాగం. 

ఒక వేసవి వారాంతానికి హెన్రీ, లండన్ నుండీ 'గిల్ఫోర్డ్' లో 'సర్ విలియం విండ్ హాం'  ఇంటికి వస్తాడు. అదో విశాలమయిన విక్టోరియన్ భవంతి.   పెద్ద ఇల్లూ, తోటా.. అంతా.   కానీ ఆ శనివారం మధ్యాన్నం ఆ లాంగ్ డ్రైవ్ ముగించి, కంట్రీ కి ఈ  హెన్రీ వచ్చే వరకూ, పెద్ద వర్షం విసుగుపుట్టించేలా కురుస్తూనే ఉంటుంది.  ఆ దెబ్బకు  అతిధులంతా డ్రాయింగ్ రూంలో నే గడపాల్సి వచ్చింది. ఆ వర్షం లో క్రోకెట్టూ, టెన్నీసు, స్విమ్మింగూ వగైరా ఆటలకు  కుదరక, డబ్బున్న   వాళ్ళు చెప్పుకునే గొప్పలన్నీ చెప్పుకుంటున్నారు అందరూ. మత్తు తలకెక్కి పేక ఎక్కువ మొత్తాలకి మొదలుపెట్టారు, కానీ ఇవన్నీ హెన్రీ కి విసుగు పుట్టించి, మెల్లగా లైబ్రరీ లోకి తప్పుకుంటాడు.   ఇక్కడ హెన్రీ పెద్ద చదువరి కాదు. ఊరికే తోచక, కొన్ని పుస్తకాల్ని పరిశీలిస్తాడు. అక్కడ ఒక విచిత్రమైన పుస్తకం అతన్ని ఆకర్షిస్తుంది. అది ఒక ఎక్సర్సైజు పుస్తకం. చేత్తో రాసింది.  పుస్తకం పైన ఇలా రాసి ఉంది. 

A REPORT ON AN INTERVIEW 
WITH IMHRAT KHAN, THE MAN WHO 
COULD SEE WITHOUT HIS EYES

By
Dr.John F Cartwright, 
Bombay, India, December, 1934. 


ఎందుకో ఆసక్తి  కలిగి హెన్రీ ఈ పుసకాన్ని తిరగేస్తాడు, డాక్టర్ కార్ట్ రైట్ అనే వ్యక్తి, బొంబాయి లో వైద్యునిగా పని చేస్తున్నప్పుడు 'ఇమ్రత్ ఖాన్ ' అనే వ్యక్తి ద్వారా కలిగిన అనుభవాలను ఆ నోట్స్ లో రికార్డ్ చేసి ఉంటాడు.   ఈ ఇమ్రత్ ఖాన్ పొట్టకూటికి సర్కస్ ఫీట్లు చేస్తూ గడిపే ఒక కళాకారుడు.  ఓనాడు అతను ఈ  డాక్టర్ దగ్గరకు, తన సర్కస్    ప్రదర్శన ముందు వచ్చి తన రెండు కళ్ళనూ పిండిముద్ద తో పూర్తిగా సీల్ చేయించుకుని,   మొహానికి పూర్తిగా బాండేజీ కట్టించుకుని, మానవమాతృడికి సాధ్యం కాని రీతిలో మమూలు కళ్ళ తో చూస్తున్నట్టే ఆ బిజీ వీధుల గుండా   సైకిలు తొక్కుకుంటూ వెళిపొతాడు, ఆ ఫీటు, ఆనాటి సాయంత్రం జరిగే షో కు ప్రచారం అన్నమాట.  ఆశ్చర్యం తో నోరు తెరిచిన ఈ  డాక్టర్ ని కూడా ప్రదర్శన కు ఆహ్వానిస్తాడు ఖాన్.


అక్కడ ఆనాటి సాయంత్రం ప్రదర్శన లో అతని ప్రతిభ చూసి ఈ ఇంగ్లీషు వైద్యుడికి మతి పోతుంది. మెల్లగా ఇమ్రత్ ఖాన్ తో పరిచయం పెంచుకుని, అలా కళ్ళు మూసేసి ఉన్నా అంత స్పష్టంగా ఎలా చూడగలుగుతున్నాడో తెలుసుకుంటే, అది ఎందరో గుడ్డి వాళ్ళకి ఉపయోగపడుతుందని డాక్టర్ ఆశ పడతాడు.  మెల్లగా ఖాన్ కథని అతని ద్వారానే తెలుసుకుంటాడు ఆ రాత్రి.

సరే   -   ఇమ్రత్ ఖాన్ తన కధ చెప్తాడు ఈ డాక్టర్ కి.    (కధలో కధ)  ఇమ్రత్ కాశ్మీరు లో అఖ్నూర్ లో పుట్టిన హిందువు.   14 యేళ్ళ వయసులో ఒక ఇంద్రజాలికుడి మోజులో ఇల్లొదిలి పారిపోయాడు. కానీ ఇంద్రజాలికుడి మాయ అంతా కనికట్టు అని తెలుసుకొని, నిరుత్సాహపడతాడు. కానీ పట్టిన పట్టు వొదలక, హరిద్వార్ రుషీకేశ్ లలో పొట్టతిప్పలు పడుతూనే తనకు ఈ మాయల్ని నేర్పే నిజమైన గురువు గురించి అన్వేషిస్తాడు. (ఈ అన్వేషణ ఇంకో పెద్ద కధ)   అదృష్టవశాత్తూ అతనికి ఒక యోగి దొరికి, తీవ్ర సాధనతో కొన్ని మాయలు నేర్చుకుంటాడు. ఇండియాలో సాధువులకు ఒక నియమం వుంటుంది. వాళ్ళు ఈ యోగ మాయల్ని  ధనం కోసం చేసే ప్రదర్శన కోసం నేర్చుకోకూడదు..(డబ్బు కోసం ప్రదర్శిస్తే తల పగిలి చచ్చిపోతారు). ఇదంతా యోగ విద్య లో భాగం.   

అయితే ఇమ్రత్ ఖాన్ మతంతో, సాధు జీవితంతో సంబంధం లేకుండా  కేవలం విద్య కోసం వచ్చిన వాడు.  కాబట్టి,   గురు శుశ్రూష తో,  తీవ్ర సాధన తో నిప్పుల మీద కాళ్ళు కాలకుండా నడవటం వగైరా నేర్చుకుంటాడు.  కొన్నాళ్ళకు,  ఒక కొవ్వొత్తి జ్వాల ని చూస్తూ..[కొన్నేళ్ళకు]  కళ్ళు మూసున్నా ఎదుటి వస్తువుల్ని స్పష్టంగా చూడటం అనే విద్య ను సాధిస్తాడు.   తన ఎదురుగా ఉన్న పేకను తిరగేసి ఉన్నా చదవడం అనే ట్రిక్ ను కూడా సాధిస్తాడు.  ఇప్పుడు ఇలా తలకు పూర్తి బాండేజీ ఉన్నా, సూదిలో దారం ఎక్కించడం, కత్తులు టార్గెట్ కు ఎయిం చేసి విసరడం లాంటి ట్రిక్స్ తో జీవిక నడుస్తోంది.  ఆనాటి ప్రదర్శన లో ఇవే ప్రధానాంశాలు.  ఇదీ ఇమ్రత్ కధ.

కానీ ఆ డాక్టర్ రాత్రి ఇంటికొచ్చి, చూపు కోల్పోయిన వారికి ఇమ్రత్ విద్య ద్వారా ఏమయినా మేలు జరుగుతుందేమో అని మర్నాడు,  వివరాల కోసం, ఆ సాధన గురించి తెలుసుకుందామని తనని కలుసుకునేందుకు  వెళ్ళేసరికీ, ముందు రాత్రి ఇమ్రత్ నిద్ర లోనే మరణిస్తాడు.  దాంతో ఈ డాక్టర్ అభిలాష నెరవేరదు. అలా..  ఈ పుస్తకం అంతా.. ఇండియా లో తను చూసిన ఆ వింత గురించి ఈ ఇంగ్లీషు డాక్టర్ రాసుకున్న ఒక నోట్స్ ఉంటుంది.  

ద్రవ్యాశ అధికంగా ఉన్న వ్యక్తి కి ఇలాంటి మాయ మంత్రాల పుస్తకం సహజంగానే ఆకర్షిస్తుంది. హెన్రీ ఈ పుస్తకాన్ని మెల్లగా కోటు జేబులో పెట్టేసుకుని లండన్ తిరిగి వస్తాడు. [ఈ పుస్తకం హెన్రీ మరణం వరకూ అతని దగ్గరే ఉంటుంది].  హెన్రీ ఆలోచన ఏంటంటే, ఎలానో తంటాలు పడి, ఆ  కళ్ళు మూసుకుని చూడగలిగే విద్య  అభ్యసించేయగలిగితే, జూద గృహాల్లో పేకల్ని వెనక నుంచీ చదివేసి, ప్రతీ ఆటలోనూ గెలిచేయొచ్చు. అధమం,  జూదం తోనే తన ఆస్థి ని  ఎన్ని రెట్లైనా చెయ్యొచ్చు. అదీ ప్లాన్. కాబట్టి, దురాశ తోనే, తనకు తెలీకుండా యోగ సాధన లోకి దిగుతాడు ఈ హెన్రీ షుగర్. 
   
అప్పట్నించీ గదిలో తలుపులు మూసుకుని, చీకటి చేసుకుని,   కేండిల్ వెలుతురును చూస్తూ నాలుగున్నరేళ్ళ పాటూ, బహిశ్చకుషువుల  నుండీ కాక అంతశ్చక్షువులతో  చూడటం సాధన చేస్తాడు.  అన్న పానాలకూ తప్ప గది విడవడు. క్లబ్ లూ, కేసినోలూ వెళ్ళడు. లక్ష్య సాధన కోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు. మొత్తానికి పేక ను వెనక నుండీ ఒక నిముషం లో చదవడం నాలుగేళ్ళకు,  ఒంటబడుతుంది. దాన్ని సెకన్ల (2/4th Second)  వ్యవధిలో చేయడానికి ఇంకొన్ని నెలలు తీవ్ర సాధన  అవసరం అవుతుంది.  

ఆఖరికి నాలుగున్నరేళ్ళ తర్వాత తన విద్య ను పరీక్షించుకోవడానికి తనకు సభ్యత్వం ఉన్న ఒక పెద్దల  క్లబ్ కు వెళ్తాడు. అక్కడకు వెళ్ళాకా, అంతవరకూ తాను వారిలో ఒకడి గా ఉన్నా, వారి ధనం హెన్రీ కి వెగటు కలిగిస్తుంది.  మొత్తానికి ఆట మొదలయ్యాక, హెన్రీ ఒడ్డిన ప్రతీ పేకా గెలుస్తుంది. అన్ని కార్డులనూ కరెక్ట్ గా చదవగలుగుతూ, ఉత్సాహంతో ఆటల్ని గెలుస్తాడు. కానీ క్లబ్ వాళ్ళ అనుమాన దృష్టి లో కూడా తాను పడినట్టు గమనించినా, పెద్ద పట్టించుకోడు.  గెలిచిన ధనం.. 2000 పౌండ్లు - ఒకప్పుడు అయితే  అతనికి అత్యంత ఆనందం కలిగించేది కానీ.. ఇన్నేళ్ళ యోగ సాధన వల్ల అతని హృదయం మారిపోయింది. డబ్బు అంటే విరక్తి కలుగుతుంది.  
   

ఆ డబ్బు మీద విరక్తి, అవసరం ఉన్నవాడికల్లా ఆ ధనాన్ని పంచేయాలన్న కోరిక తో, మర్నాడు తను గెలిచిన డబ్బు లోంచీ 20 పౌండ్ల నోట్లను తానుంటున్న అయిదో అంతస్థు బాల్కనీ లోంచీ కింద తిరుగుతున్న సాధారణ పౌరుల వైపు విసురుతాడు. పెద్ద గలాటా మొదలవుతుంది. అప్పటి కాలంలో మామూలు బ్రిటీషు జనం,  వాళ్ళ జన్మ లో 20 పౌండ్ల నోటు చూసి వుండరు.  ఈ గొడవకు కోపంగా హెన్రీ ఫ్లాట్ కు వచ్చిన ఇన్స్పెక్టర్   "నీకంత డబ్బు ఎక్కువైతే ఏ అనాధాశ్రమానికో ఇవ్వొచ్చుగా ! అనాధాశ్రమాలకూ, వైద్య శాలలకూ ఇవ్వు. ఇలా రోడ్ల మీదకు విసిరి న్యూసెన్స్ చెయ్యకు". అని బుద్ధి చెప్తాడు, ఇదే మలుపు!  హెన్రీ జీవితానికి.    ఆ పోలీసాయన అనాధాశ్రమములో పెరిగిన వాడే. కాబట్టి, అనాధలకి ఈ సొమ్ము ఎంత అవసరమో ఈ పిచ్చివాడికి బోధపడేలా చెప్పగలుగుతాడు. 
   
సో, అప్పుడు,  హెన్రీ షుగర్ కి ఒక ఐడియా వస్తుంది.  తాను జూదం లో సంపాదించి అనాధ లకు ఉపయోగ పడాలని.  అలా అతని జూద సంపాదన మొదలవుతుంది.   అయితే,  కసినోలు సాధారణంగా  ముఠాల ఆధ్వర్యంలో నడుస్తాయి గాబట్టి, సునాయాసంగా ఎక్కువ మొత్తాలు ఖచ్చితంగా గెలుస్తూన్న  హెన్రీకి అపాయం ఉంటుంది.   ఒక సారి అనుభవపూర్వకంగా మారు వేషం వేసి హత్యా యత్నం నుండీ ఆఖరు నిముషాన తప్పించుకో గలుగుతాడు.

దానితో బాగా ఆలోచించి,   స్విట్జర్లాండ్ లో లూసెన్ లో ప్రత్యేకంగా 'జాన్ వాట్సన్'  అనే ఒక అకౌంటెంట్ ని పెట్టుకుంటాడు. 20 ఏళ్ళ పాటూ (తన 63వ ఏట చనిపోయే వరకూ) మొత్తం 21 దేశాల్లో,  దీవుల్లో 3,071 కసినోలూ,  వివిధ మారు రూపాల్లో, వేర్వేరు పాస్పోర్ట్ ల తో, వివిధ ఐడెంటిటీలతో జూదమాడి కోట్లాది (మిలియన్ల కొద్దీ) ఫ్రాంకుల డబ్బును గడిస్తాడు. అతని వివిధ వేష ధారణకు పెట్టుకున్న హలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ మేక్స్ &  ఈ జాన్ వాట్సన్ లకే హెన్రీ షుగర్ అంతరంగం తెలుసు.  హెన్రీ షుగర్ ఫౌండేషన్ ద్వారా, హెన్రీ వెళ్ళిన ప్రతీ దేశం లోనూ ఒక అనాధాశ్రమాన్ని స్థాపించి, దాన్ని బాగోగులకు అవసరమైన ధనాన్ని సంపాదించి పెట్టాడు. వాటి  నిర్వహణ కు హెన్రీ పోయాక కూడా  ఢోకా లేదు అనేంత సొమ్ముని సంపాయించాక, మరణించాడు. 

ఇప్పుడు,   మేక్స్, వాట్సన్లు తమ ప్రియతమ మితృని మరణానికి చింతిస్తున్నారు. అతను తెర వెనుక అజ్ఞాతంగా చేసిన మంచి పన్లనూ, వైద్య రంగానికీ, కేన్సర్ ప్రయోగాలకూ చెస్సిన వితరణనూ, నమ్మశక్యం కాని యోగి లాంటి అతని జీవితాన్నీ లోకానికి చెప్పడం తమ కర్తవ్యం గా భావిస్తారు.  అయితే దానిని సమర్ధవంతంగా చెప్పగలిగే రచయిత కావాలి వారికి.  కాబట్టి, ఇప్పుడు వీరు, ఈ    కధంతా లోకానికి చెప్పడానికి రాల్డ్ ను సంప్రదించారన్న మాట.  సో.. ఇదీ రచయిత ఇంతవరకు చెప్పిన ఈ మహానుభావుడి కథ.

ఇంతకీ, ఈ   'హెన్రీ షుగర్' అనేది, ఆ యోగి నిజమైన పేరు కాదు. ఈ కధనంతా అతని నిజపరిచయాన్ని వొదిలి, అతని మంచి తనాన్నీ, మానవత్వాన్నీ చెప్తుంది (ఎందుకంటే ఎంతైనా అతను ఒక లార్డ్ (ప్రభు వంశస్థుడు) కొడుకు) అతని నిజం పేరేమిటీ అన్నది ఇక్కడ  ప్రశ్న కాదు. అతని జీవితం ఏంటీ అన్నదే, ఈ కధ అంటాడు రచయిత.  

ఈ కధ లో ఇమ్రత్ ఖాన్ పాత్ర ఒక పాకిస్తానీ మిస్టిక్ 'ఖుదా బక్స్'   (కళ్ళు లేకున్నా చూడగలిగే సంత్ గా పేరు గాంచాడాయన)  ని దృష్టిలో పెట్టుకుని అల్లాడు రచయిత.  మొత్తానికి ఒక మంచి  కధ. రాల్డ్ కధా సంకలనాలలో, లేదా ప్రత్యేక పుస్తకం  లా కూడా  దొరుకుతుంది. 


21/03/2017

M U S T A C H E by Guy De Mopassant

మీసం - గై డి మపాసా

                                                                                                                              సొల్ దివాణం
                                                                                                                              జూలై 1883,

మై డియర్ లూసీ..

నా దగ్గర వార్తలేమీ లేవు.  ఈ మధ్య కాలం అంతా మేము  డ్రాయింగ్ రూం లోనే గడుపుతున్నాం. - బయట కురుస్తున్న వానని చూస్తూ.    ఈ భయానక వాతావరణం లో బయటకు వెళ్ళలేం కదా.   కాబట్టి కాలక్షేపానికి భవంతి లోనే చిన్న చిన్న నాటికలు వేస్తున్నాం.    మై డియర్.. ఈ హాస్య నాటికలు ఎంత మొద్దు గా, తెలివి హీనంగా ఉన్నాయో తెలుసా?!    ఈ డ్రాయింగ్ రూం వినోదం - నిజ జీవిత హేళనా  ప్రదర్శనలా !   అన్నీ బలవంతపు పాట్ల లా,  అడ్డదిడ్డంగా,   భారంగా  ఉంటున్నాయి.   జోకులయితే ఫిరంగి గుళ్ళే అనుకో!   వాటి దార్లో వచ్చిన ప్రతీదాన్నీ చెల్లా చెదురు చేస్తూ, ఎగురుతూ,   పేల్తున్నాయి.    కానీ వాటిలో సహజత్వం  ఉండదు.  హుందాతనం, భావ ప్రకటనా కూడా శూన్యమే.  ఈ చదువుకున్న మగవాళ్ళు... నిజానికి, వీళ్ళకి  'సొసైటీ!'  గురించి ఏమీ తెలీదు.   వాళ్ళకి సమాజంలో సాధారణ వ్యక్తులు ఏమి మాట్లాడతారో కూడా తెలీదనుకో!   వాళ్ళకి మన సంస్కృతీ, సాంప్రదాయాల పట్ల పెద్ద ఇష్టం ఉండకపోవచ్చు- దానికి నాకేమీ అభ్యంతరం లేదు.   కానీ వాళ్ళ 'తెలుసుకోకపోవడాన్ని' మాత్రం క్షమించలేను.   వాళ్ళకి నవ్వొచ్చేదేదయినా కావాలనుకో,   ఎలాంటి జోకులు పేలుస్తారంటే, అవి మనకి అర్ధం కావు.    సైనిక పటాలం లోనో, లేదా ఈ "సాహిత్యవేత్తలు"  తచ్చాడే పానశాలల్లోనో పేలాల్సిన జోకులవి.   లేదా విద్యార్ధులు పేల్చే యాభయ్యేళ్ళ నాటి  (తాతల కాలం నాటి) జోకులయి ఉంటాయి.


అందుకే  ఈ నాటికల్ని ఎంచుకున్నాం.  మేము ఇద్దరే ఆడవాళ్ళం ఉన్నాం కాబట్టి ఒక  హాస్యకత్తె వేషాన్ని నా భర్త పోషించాలిసి వచ్చింది.  దానికోసం అతను తన మీసాన్ని షేవ్ చేసేసాడు.  మై డియర్ లూసీ,  నేనసలు తనని గుర్తే పట్టలేకపోయాను తెలుసా ?!    అతను ఒక వేళ,  తన  మీసాన్ని పెంచుకోకపోతే,   నేనతన్ని ఇక జన్మలో ప్రేమించలేను.  మీసం లేకుండా అతను గుబులు కొలిపేలా ఉన్నాడు.


నిజానికి పురుషుడికి మీసం లేకపోతే అతను పురుషుడే కాదు.  నాకు గడ్డం అంటే పెద్ద 'పరవా'  లేదనుకో - (అది మనిషి ని చాలా అపరిశుభ్రంగా కనిపించేలా చేస్తుంది).   కానీ మీసం ?!   మీసం మనిషి మొహాన్ని  నిస్సందేహంగా  ఒక పురుషుడి మొహం లా కనిపించేలా చేస్తుంది.   నువ్వసలు నమ్మవు కానీ ఆ పై పెదవి మీద ఉండే ఆ  చిన్ని వెంట్రుకలు కళ్ళకి ఉపశమనం కలిగిస్తాయి.  చూడడానికి హాయిగా అనిపిస్తాయి.    ఈ సంగతి ఎంతగానో ఆలోచించాను.. కానీ నా భావాల్ని రాయడానికి మాత్రం భయపడను.   అసలు నా మనసులో ఆలోచనల్ని ఇలా కాయితం మీద పెట్టడం చాలా కష్టం.   ఇలాంటి   'పదాలు' ఈ కాగితాల మీద పెడితే చాలా విచిత్రంగా  అనిపిస్తాయనుకో.   ఎందుకంటే ఈ ప్రస్తావన అలాంటిది. చాలా కష్టమైనది, సున్నితమైనది, చాలా ప్రమాదకరమైనది కూడా. దీన్ని  వ్యక్తీకరించాలంటే చాలా నైపుణ్యం కావాలి.

సరే ! ఒక్క సారిగా నా భర్త 'నున్ననైన'  మొహంతో,  'మీసం' లేకండా కనిపించగానే,  నాకర్ధమైంది ఒకటే -    అదేంటంటే నేను ఇలాంటి చేవలేని  "సంచార నటుడిని"  ఎన్నటికీ ప్రేమించలేనని!   నటుడనే కాదు.. అతను మతాధికారి అయినా, ఆఖరికి ఫాధర్ డిడోన్  (గొప్ప అందగాడైన ఫ్రెంచు, డోమినీషియన్ మతాధికారి.. అతనికి ఫ్రెంచు చరిత్ర లో చాలా ప్రాముఖ్యత ఉంది.  మాడర్న్ ఒలింపిక్ మోటో అయిన 'citius altius fortius'  ని సూత్రీకరించిన  వాడు)  అంతటి అత్భుత వ్యక్తి అయినా సరే !!    ఆ తరవాత అతని తో (నా భర్త తో) ఏకాంతంలో ఉన్నప్పుడు మరీ అసహ్యంగా అనిపించింది.    ఓహ్ నా ప్రియ లూసీ,  ఎప్పటికీ మీసం లేని పురుషుని తో ముద్దు పెట్టించుకోకు.  ఆ ముద్దుల్లో రుచి, పచీ , ఏదీ ఉండదు.  ఆ ముద్దుల్లో  ఆకర్షణ, పరిపక్వత,  మోహం,  పెళుసుతనం వుండవు.   పెళుసుదనం - అదే అసలైన ముద్దు.  మీసమే అసలైన మసాలా.

తడిదో పొడిదో ఒక తోలుకాగితపు ముక్క మీద నీ పెదవుల్ని ఆనించినట్టు ఊహించి చూడు.  మీసం లేని పురుషుని ముద్దు అలా వుంటుంది.  దాన్లో పెద్ద విలువలేదు.

మీసానికున్న ఆకర్షణ గురించి చెప్పమంటావా ?  నాకు తెలుసా అనా ?   అది నీ మొహాన్ని చెక్కిలిగిలి పెడుతుంది.  అది నీ నోటి వైపు వస్తూండగానే ,  తెమ్మెర లాంటి చిన్న వొణుకు నీ దేహమంతా పాకుతూ, నీ కాలి వేళ్ళ కొనల వరకూ  చేరడం గమనిస్తావు.


ఇంకా నీ కంఠం !  ఎప్పుడైనా నీ కంఠాన్ని ఒక 'మీసం' తాకడం అనుభూతించావా ?   అది నిన్ను మగత లో ముంచేస్తుంది.  నిన్ను భయానికీ, ఉద్వేగానికీ గురి చేస్తుంది.  తల ని వెనక్కి వాల్చేస్తావు.  నీకక్కణ్ణించి పారిపోవాలనీ అనిపిస్తుంది,  అక్కడే ఉండిపోవాలని కూడా అనిపిస్తుంది. అది చాలా   ఆనందదాయకం,   కాస్త విసుగనిపిస్తుంది కూడా.. కానీ ఎంత బావుంటుందో !! 

మీసం లేని పెదవి ఎలా వుంటుందో తెలుసా... 'దుస్తులు లేని దేహం' లాగా!   ప్రతి ఒక్కరూ దుస్తులు ఎలా ధరించాలో -  ఒక వేళ ఇష్టమైతే, తక్కువ దుస్తులేనా వేసుకొనే తీరాలిగా.   ఎంతో కొంత!   దుస్తులైతే ధరించాల్సిందే.

నాకో వాక్యం గుర్తొస్తోంది (ఒక రాజకీయవేత్త చెప్పినది! )  అది నా మనసులో ఒక మూడు నెలలుగా నలుగుతూనే వుంది.   నా భర్త, వార్తాపత్రికలు చదువుతూ ఉంటాడుగా.. అతను ఒక సాయంత్రం ఒక స్పీచ్ చదివి వినిపించాడు. అది వ్యవసాయ మంత్రి ది - అతని పేరు ఎం.మెలిన్.  ఇప్పుడు అతను పదివిలో ఉన్నాడో లేదో తెలీదు.

నేనసలు మనసు పెట్టి విననేలేదనుకో !   కానీ  ఆ పేరు 'మెలిన్' అన్న పేరు మాత్రం  ఆకట్టుకుంది.  ఎందుకో సరిగ్గా చెప్పలేను.. ఇది Scenes de la Vie de Boheme ( (వివిధ సంఘటనలు అల్లుతూ చెప్పిన కధా సంగ్రహం/అసంధర్భ ప్రేలాపన)  లా  ఉందనుకో..    నేననుకోవడం అది ఏదో పుట్టగొడుగుల గురించనేమో -  సరిగ్గా గుర్తులేదు.  ఈ మెలిన్ ఏమన్నాడో తెలుసా ఆ ప్రసంగంలో ?!   'ఆమీన్స్'  ప్రజలనుద్దేశించి !   అసలతను ఎందుకలా అన్నాడో నాకర్ధం కాలేదు.  "వ్యవసాయం లేకుండా దేశభక్తి లేదు" అన్నాడు.   నాకయితే ఇప్పుడిప్పుడే అతని సందేశం అర్ధం అయింది.  "మీసం లేకుండా ప్రేమ లేదు"  అని !   నీకు నవ్వొస్తోంది కదూ.


" మీసం లేకుండా ప్రేమ లేదు "! 

"వ్యవసాయం లేకుండా దేశభక్తి లేదు"   అన్నాడు ఈ మిస్టర్ మెలన్.  అతను చెప్పింది కరక్టే,  ఇప్పుడే నాకు ఎందుకో అర్ధం అవుతూంది.


ఒక పూర్తి,  వేరే దృక్కోణంలోంచీ చూస్తే మటుకూ,  "మీసం"  ఎంత అవసరమో తెలుస్తుంది.  అది మొహానికి ఒక  "ఆనవాలు' ని,  గుర్తింపు నీ,  ఇస్తుంది.    పురుషుని మోహంలోకి సాధుత్వం, మృదుత్వం, రాక్షసత్వం,  కుటిలత్వం, కరకుతనం,  వ్యాపార ధోరణి,  అన్నిట్నీ -తీసుకొస్తుంది.    జుత్తు ఎక్కువ ఉండే మనిషి తన చెంపల్ని తీసేయకపోతే ఎలా వుంటాడో చూడు.. అతని మొహంలో ఒక నాజూకుతనం అంటూ ఉండదు  - ఎందుకంటే అతని పోలికల్ని అవి కప్పి పెట్టేస్తాయి.  ఇంకా అతని దవడా, గడ్డం,  చూసేవాళ్ళని మోసం చేసేస్తాయి.

మీసం ఉన్న పురుషునికి తన ప్రతేకమైన పరిభాష ఉంటుంది.   ఒక నాజూకు, నాగరికతా ఉంటాయి.

అబ్బ ! ఈ మీసాల్లో ఎన్ని వేరే వేరే రకాలో,  కొన్ని మెలితిరిగినవి, కొన్ని చిలిపిగా ఉండేవి,  కొన్ని వొంపు తిరిగినవి.. ఇవన్నీ స్త్రీ ఆరాధనకే అంకితమైనట్టు ఉంటాయి.

కొన్ని సూదిగా,  సూటిగా,  బుర్ర మీసాల్లా.. భయ పెట్టేటట్టు ఉంటాయి. అవి వైన్ నీ, గుర్రాల్నీ, యుద్ధాల్నీ కోరుకునే రకాలు.

కొన్ని సార్లు అవి అతి పెద్దగా,  గుబురుగా, అతి గా వాలిపోతూ, భయానకంగా వుంటాయి.  ఈ పెద్ద రకాలన్నీ సాధారణంగా దేన్నో దాస్తూ ఉంటాయి.  బలహీనతని కప్పెట్టేసే కరుణ నో లేదా పిరికితనాన్ని కప్పెట్టేసే సాధుత్వాన్నో  అనుకుంటాను.

వీటన్నింటి కన్నా నేను ఆరాధించేవి అసలు సిసలు 'ఫ్రెంచు మీసాల్నే'  తెలుసా.. అవి మన పూర్వీకులనుంచీ వచ్చినవి. 'గాల్స్'  కాలం నుంచీ మన దేశపువ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తూ,   గర్వించదగ్గ  చిహ్నాలలా,  కాలం తో పాటూ మిగిలిపోలేదూ అవి ?

అవి బడాయి గా,  ఘనంగా, ఇంకా,  శూరత్వంతోనూ వుంటాయి.   ఆ మీసాలు వైన్ ని రుచి చూస్తూ ఎంత గర్వంగా పక పకా నవ్వి వుంటాయి.   చెంపలూ,  దవడల్నిండా  చిందర వందరగా గడ్డం పెరిగినా సరే..  ఆ నవ్వుల్లో ఎంత నాజూకుతనం ! ఎంత  నాగరికత !

ఒకసారి నా కళ్లలో కన్నీళ్ళనిటినీ కార్చేసినంతగా ఏడ్చేసిన సంఘటన గుర్తొస్తోంది.   అదే సంఘటన, నాకు పురుషుని మోములో ఆ మీసాల్ని ప్రేమించేలా చేసిందని చెప్పొచ్చు.

అది యుద్ధ సమయం, నేను మా తండ్రితో ఉండేదాన్ని.  అప్పటికి చిన్న పిల్లని. ఒక సారి మా దివాణం దగ్గర చిన్న యుద్ధం జరిగింది.  పగలంతా ఫిరంగి పేలుళ్ళతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.  ఆఖరికి సద్దుమణిగాకా, ఆ సాయంత్రం మా ఇంట్లో ఒక జెర్మన్ కలనెల్  విడిది చేసాడు. పొద్దున్నే వెళిపోయాడులే.

మా తండ్రి గారికి ఆ మర్నాడు, పొలాలనిండా సైనికుల శవాలు చెల్ల చెదురుగా పడి ఉన్నాయని కబురు తెలిసింది.  ఆయన ఆ మృత దేహాలన్నింటినీ మా దివాణానికి తెప్పించాడు.   దివాణపు పైన్ చెట్ల మార్గానికి  రెండు వైపులా ఆ శవాలే వరుసగా పేర్చారు.     అప్పటికే వాటి నుండీ దుర్గంధం వెలువడుతుండటంతో అన్నిట్నీ పాతిపెట్టడానికి వీలుగా పెద్ద గొయ్యి తవ్వే లోపు,   ఈ మృతదేహాలన్నిటి మీద మట్టి కప్పారు. మొహాలు మాత్రమే కనిపిస్తున్నాయి.   ఆ మట్టి నేలలోంచీ పొడుచుకొచ్చినట్టు!  అవి పచ్చగా పాలిపోయాయి.  అన్నిటి కళ్ళూ మూసుకునున్నాయి.

నాకు వాటిని చూడాలనిపించింది.  కానీ చూడగానే రెండు వరుసల్లోనూ కేవలం తలలే కనబడుతూండటం తో  భయంతో మూర్చపోతానేమో అనుకున్నాను.  ఎలాగో మొత్తానికి వాటిని చూడటం మొదలు పెట్టాను.  ఒకదాని తరవాత ఒకటి.  ఆ చనిపోయిన వ్యక్తులు ఎలాంటి వాళ్ళో ఊహించుకోగలగడం కోసం ప్రయత్నించానని చెప్పొచ్చు.


వాళ్ళ యూనిఫారాలు మట్టి తో కప్పబడి ఉన్నాయి.  కానీ వారిని చూడగానే వెంటనే... అవును  'వెంటనే!'  - వాళ్ళలో ఫ్రెంచు వీరుల్ని వెంటనే గురుతు పట్టగలిగాను.   వాళ్ళ మీసాల వల్ల !! 

వాళ్ళలో కొందరు యుద్ధం జరిగే రోజే క్షౌరం చేసుకున్నట్టున్నారు..  ఎందుకో - బహుశా   మరణ సమయం వరకూ సొంపుతో సౌందర్యం తో   ఉండాలనిపించి ఉండొచ్చు!     మరణాన్ని సొగసుగా ఆహ్వానించడానికేమో!  మరి కొందరికి ఒక వారపు 'పెరుగుదల' ఉంది.  కానీ అందరికీ ఫ్రెంచు మీసాలున్నాయి.   ఆ గర్వమైన ఫ్రెంచు మీసాన్ని   చూస్తే ప్రతి మీసమూ ఏదో చెప్తున్నట్టు అనిపించింది. సరిగ్గా... ఇలా - .. "నా తోడుగా  ఉన్న గడ్డం మితృణ్ణి  చూసి మోసపోకు ప్రియమైన పాపాయీ -  నేను నీ సోదరుణ్ణి"  అన్నట్టు !


అప్పుడు నేను కన్నీళ్ళాపుకోలేకపోయాను.  ఆ రోజు నేను అతిగా ఏడ్చేనేమో !   అంత దుఃఖం,  వాళ్ళని  ఫ్రెంచు వారిగా గుర్తించకపోతే కలిగుండేది కాదేమో -  పాపం ! మరణించిన ఫ్రెంచు సైనికులు !

ఇదంతా నీతో చెప్పి ఉండకూడదు,   ఇప్పుడు నేను దుఃఖిస్తున్నాను.  ఇంక మరి కబుర్లేవీ చెప్పలేను.   సరే - గుడ్ బై డియర్ లూసీ.. నా హృదయపూర్వకమైన ముద్దును దీనితో పంపిస్తున్నాను.

" మీసం వర్ధిల్లాలి ".

                                                                                                                                             -నీ జీన్


------------------------------------------------------------------------------------------------------------
Mustache - అనే మొపాసా కధ కు నా అనువాద ప్రయత్నం!   మొపాసా చిన్న చిన్న కధలన్నీ గుటెన్ బర్గ్ లోనూ, ఇతర ఇంగ్లీషు సాహితీ సైట్లలో దొరుకుతాయి.  మాతృక కు తెలుగు రూపం ఇది. [అనువాదం లాంటిది].
-------------------------------------------------------------------------------------------------------------
ఫ్రెంచు మీస కట్టు 
---------------------------------------------------------------------------------------------------------------

















 









'