1994 లో గుజరాత్ లో ప్లేగ్ మహమ్మారి విజృంభించినపుడు ఎపుడో నలభయి ఏళ్ళనాడు మన తెలుగాయన ఎల్లాప్రగడ సుబ్బారావు కనిపెట్టిన టెట్రాసైక్లిన్ కాప్స్యూళ్ళని నాలుగు రోజుల్లో అయిదులక్షల దాకా ఉచితంగా వీధుల్లో పంచిపెట్టారు. ప్లేగు ఎంత వేగంగా వ్యాప్తి చెందిందో, అంతే వేగంగా పారిపోయింది.
అదెప్పుడో ఈ సుబ్బారావు కనిపెట్టిన మందునే, ఫైలేరియా కి, Q ఫీవరు కీ, కండ్లకలక కీ, కొన్ని రకాల గుండె సంబంధ వ్యాధులకూ, కేన్సరు కూ, టీ.బీ. కీ వాడుతున్నాం. తల్లి కడుపులో రూపుదిద్దుకుంటున్న పిల్లల వెన్నుపూస సరిగ్గా ఎటువంటి సమస్యలూ లేకుండా పుట్టడానికీ, రక్తహీనత కూ, మనసు వ్యాధులకూ, సంతాన సాఫల్యానికీ వాడే ఫోలిక్ యాసిడ్ సుబ్బారావుగారు ఏనాడో కనిపెట్టినదే.
ఎక్కడో భీమవరంలో పుట్టి, రక రకాల వ్యాధులకు, తండ్రినీ, సోదరులనీ, కన్న కొడుకునీ కోల్పోయి, తల్లి పట్టుదలతో చదివి, మామగారు/భార్య ఇచ్చిన సొమ్ముతో అమెరికా యాత్ర చేపట్టిన సేవా తత్పరుడూ, జిజ్ఞాసి ఈ సుబ్బారావు. తన ఆప్తులను కబళించిన అన్ని రోగాలకూ మందులు కనుక్కొన అగణిత జీవ శాస్త్రవేత్త. ఈ మహానుభావుని జీవిత చరిత్ర A Life in Quest of Panacia కి పురాణపండ రంగనాధ్ గారు చేసిన సరళ అనువాదం ఈ 'ఎల్లాప్రగడ సుబ్బారావు' .
ఆయన బాల్యం, కుటుంబ నేపధ్యం, చదువూ, బాధలూ, వివాహం ఇలా ఒడిదుడుకుల మధ్య ఒక జాతీయ వాది చేసిన ప్రయాణం, అమెరికా లో ముగిసి, మానవాళి మనుగడ కి ఓ కొత్త అధ్యాయానికి తెరతీస్తుంది. ఒకప్పుడు చిన్న చిన్న వ్యాధుల బారిన పడి, ప్రాణాలు పోగొట్టుకొనే నిస్సహాయతకు వ్యతిరేకంగా, రోగకారక క్రిములపై యుద్ధాన్ని ప్రకటించిన యోధుడు సుబ్బారావు. ఆయనకి పెన్సిలిన్ కనిపెట్టిన ఫ్లెమింగ్ అంత పేరు రాకపోవచ్చు. సొంత దేశం లో పెద్దగా గుర్తింపు దొరకక పోవచ్చు. కానీ ఒక లక్ష్యం కోసం పరితపించి, అవమానాల్నీ, అభిమానానీ ఒకేలా పరిగణించి, అర్జునుళ్ళా దూసుకుపోయి, ఆదర్శవంతమైన జీవితం గడిపిన ఈ శాస్త్రవేత్త గురించి తెలుసుకోవడం ఓ అత్భుత అనుభవం. ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు. శతకోటి వందనాలు.
ఎంత ప్రతిభా వ్యుత్పత్తులున్నప్పటికీ, మన మేధ పరదేశపు బాట పట్టడానికి బోల్డన్ని కారణాలు. వలస పాలన లో మగ్గుతున్న మన దేశస్థులకు, విదేశీ చదువు అంటే కేవలం ఇంగ్లండే లక్ష్యం గా వుండే కాలంలో, అమెరికా బాటపట్టిన బహుదూరపు బాటసారి. 25 ఏళ్ళ పాటు, వర్ణ వివక్షనూ, ఒంటరితనాన్నీ అనుభవిస్తూ, చనిపోయే వరకూ అమెరికాలోనే ఉన్నా, జీవ శాస్త్రంలో అసమానమైన విజయాలను సాధించినా, అత్భుత ఆవిష్కరణలు చసినా, అమెరికా పౌరసత్వం పొందలేకపోయాడు.
ఆయన చేసిన పరిశోధనల గొప్పతనం, ఆయన మరణానంతరం ప్రపంచానికి తెలిసింది. ఇప్పటికీ, కేన్సర్ కి ఇచ్చే కీమోథెరపీ లో చికిత్స లో సుబ్బారావు మందులే వాడుతున్నాం. ఇప్పటి ఫైసర్ (Pfizer), ఒకప్పటి లెడర్లీ లో పనిచేసిన సుబ్బారావు రెండో ప్రపంచ యుద్ధ కాలంలో సైనికుల ప్రాణాల్ని కాపాడ్డానికి ఎక్కువ పెన్సిలిన్ ని ఉత్పత్తి చేసి, రెడ్ క్రాస్ కి సరఫరా చేయగలగడంలో ప్రధాన భూమిక నిర్వర్తించాడు. తన అన్ని ఆవిష్కరణల కూ తనొక్కడి కే పేరు దొరకాలని ఏనాడూ కోరుకోలేదు. పేటెంటుకో, పేరుకో ఆయన ఆశించి ఉన్నట్టయితే, తన విజయాలకు గానూ ఎంతో ప్రఖ్యాతి చెంది ఉండేవాడు.
యువకుడి గా ఉన్నపుడు, మద్రాసు హిందూ కాలేజీ లో ఇంటరు చదివి, రామకృష్ణ మిషన్ లో సన్యాసి గా చేరాలని ప్రయత్నించి, తల్లి ఒప్పుకోకపోవడంతో విఫలం అయ్యాడు. సేవ చెయ్యాలనే అతని తపనను చూసిన మిషన్ సన్యాసులు ఆయన్ని వైద్య శాస్త్రం అభ్యసిస్తే, ఎందరో రోగులకు సేవ చేయగలవు, మిషన్ లోనూ సేవలందించగలవు అని నచ్చచెప్పడంతో వైద్యం లో చేరాడు. జాతీయోద్యమ ప్రభావంతో ఖద్దరు ఏప్రాన్ నే ధరించి, బ్రిటీషు ప్రిన్సిపాలు కోపానికి గురి అయి పూర్తి ఎం.బీ.బీ.ఎస్ కాకుండా, అంత కన్నా చిన్నదైన ఎల్.ఎం.ఎస్ డిగ్రీ మాత్రమే పొందగలుగుతాడు.
ఆయుర్వేదం అంటే, ఆసక్తి, తనకు తాను స్వయంగా తీవ్రంగా జబ్బుపడినపుడు దాన్ని నయం చేసిన లక్ష్మీపతి అనే ఆయుర్వేద వైద్యుని వల్ల కలుగుతుంది. ఆయుర్వేదపు ప్రాధమిక సూత్రమైన 'వాత, పిత్త, కఫ' దోషాల గురంచి క్షుణ్ణంగా అభ్యసించి, తన వైద్య విద్య ముగియగానే ఈ లక్ష్మీపతి గారి ఆయుర్వేద కళాశాల లో అధ్యాపకునిగా చేరాడు. అప్పుడే భారత దేశానికి వచ్చిన ఒక అమెరికన్ శావేత్త ఇచ్చిన ప్రేరణతో హార్వర్డు లో డిప్లొమా చెయ్యడానికి ప్రణాళికలు ఏర్పరచుకున్నాక, కాకినాడ లో ఓ సేవా సంస్థ చదువుకి ఆర్ధిక సహాయాన్ని కొంత అందివ్వగా, పిల్లనిచ్చిన మామగారి ఆర్ధిక సహాయంతో 1922 లో బోస్టన్ చేరుకున్నడాయన.
హార్వర్డు లో చదువూ, ఉద్యోగం, వివక్షా, బీదరికం, స్నేహితులూ, భార్య తో లేఖల ద్వారా అనుబంధం, అపుడే ఆయన భార్య స్వదేశంలో మొగపిల్లవాణ్ణి కనగా ఆ శిశువు తొమ్మిది నెల్లకే వ్యాధి బారిన పడి కనుమూయడం, హార్వర్డు రాజకీయాలూ ఇత్యాది ఒడిదుడుకుల మధ్య లెడెర్లీ లో జీవ రసాయన శాస్త్రవేత్త గా ఉద్యోగం లో చేరి, మానవాళి కి రక రకాల సూక్ష్మ జీవుల ద్వారా ఎదురయ్యే వ్యాధుల్ని ఎదుర్కొనే వివిధ రకాలైన ఔషధాల్ని తయారుచేసి, తన జీవన పర్యంతం, పరిశోధన లోనే గడిపాడు.
తన వ్యక్తిగత జీవితాన్ని, తల్లినీ, భార్యనూ, స్నేహితుల్నీ అన్నిట్నీ వొదిలి, ఒంటరిగానే జీవించాడు. ఒకవేళ అర్ధాంతరంగా ఆయన హృదయ సంబంధ వ్యాధితో మరణించకపోయి ఉండినట్టయితే, కేన్సరు కి తిరుగులేని దివ్యౌషధం తప్పకుండా తయారయి ఉండేది. ఆయన్ని తీర్చిదిద్దిన తల్లి వ్యక్తిత్వమూ, మౌనంగా, ఎంతో అభిమానంగా అతని కి వెన్నుదన్నుగా నిలిచిన భార్య వ్యక్తిత్వమూ చదువుతున్నపుడు, వీళ్ళు చేసిన త్యాగ ఫలితం ఎందరో అనుభవిస్తున్నామిపుడు కదూ అనిపిస్తూంటుంది.
ఇపుడైతే డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా - ఆంటీ బయోటిక్ ఔషధాల విచ్చల విడి వాడకం, అజ్ఞానం, ఔషధ పరిశ్రమల లాభార్జనా లక్ష్యాలూ ఈ గొప్ప ఆవిష్కరణలకు మసి పులిమే ప్రయత్నం చెయ్యొచ్చు. కానీ చావే శరణ్యం గా ఉన్న ఎన్నో మహమ్మారి వ్యాధులను అదుపు చేయ గలిగిన ఔషధులను కనిపెట్టిన సుబ్బారావు చిరస్మరణీయుడు. ఆయన మరణించిన ఎన్నో ఏళ్ళకు మన వైద్య ప్రపంచమూ, మేధా సమాజమూ ఆయన్ని స్మరిస్తూ ఎన్నో కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉండగా మన ప్రభుత్వం కూడా ఒక స్మారక పోస్టల్ స్టాంపు ని ముద్రించింది.
ఈ 'జీవిత చరిత్ర' పాఠకులకు ఒక అందివొచ్చిన అవకాశం. పూర్వ కాలపు విలువలూ, ఆ రోజుల్నాటి సైన్సు ఆవిష్కరణలూ, పద్ధతులూ, విజ్ఞానం, కృషీ, పట్టుదలా, పోటీ తత్వం, అమెరికను సమాజపు వర్ణనలూ ఆద్యంతం కట్టిపడేసినట్టు రచించిన ఈ ఆత్మ కధ అధ్భుతంగా ఉందని చెప్పొచ్చు. సైన్సు గురించి ఏ మాత్రం ఆసక్తి ఉన్నా తప్పక చేత పుచ్చుకోవచ్చు.
ఈ పుస్తకాన్ని చదువుతున్నపుడు పూర్తి నిమగ్నతతో, ఉద్విగ్నంగా చదివింపజేసిన రచియిత్రి రాజీ నరసిమ్హన్ అభినందనీయురాలు. సైన్సు గురించి, పరిశోధనల గురించీ ఆసక్తి కరంగా రచించిన (లేదా అనువదించిన) పురాణపండ రంగనాధ్ గారు ఒక చక్కని పుస్తకాన్ని తెలుగు పాఠకులకు అందుబాటులోకి తెచ్చి మంచి పని చేసారు. లేకపోతే ఈ మహానుభావుణ్ణి గురించి తెలుసుకోవడం ఇంత ఆసక్తినీ, గౌరవాన్ని రేకెత్తించేవి కావేమో. ఎంతో కాలానికి నన్ను కీబోర్డు దాకా లాక్కొచ్చి తప్పకుండా పరిచయం చెయ్యాలన్న కోరిక నాలో కలిగించిన ఈ చిన్ని పుస్తకం ఈ బుక్ ఫెయిర్ లో దొరికితే కొనుక్కోండి.
3 comments:
మానవాళి ప్రాతఃకాల వేళ స్మరించుకోవలసిన గొప్ప శాస్త్రజ్ఞుడు. అమెరికాలో డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గారు రిసెర్చ్ డైరెక్టర్ గా పనిచేసిన లెడర్లె లాబ్స్ లో ఆయన శిలాఫలకంతో పాటు వాళ్ళ ఆవరణలోని లైబ్రరీకి Subbarow Memorial Library అని ఆయన పేరే పెట్టారు. కాని ఆయనకి రావలసినంత ప్రఖ్యాతి దక్కలేదనిపిస్తుంది.
మంచి పుస్తక పరిచయం చేసారు మీరు. (మీ బ్లాగు పోస్ట్ లో ఒకచోట పెనిసిలిన్ కనిపెట్టినది పాస్చర్ అని వ్రాసారు. అది కనిపెట్టిన శాస్త్రజ్ఞుడి పేరు అలెక్జాండర్ ఫ్లెమింగ్.)
అయ్యయ్యో ! క్షమించండి. సరిదిద్దినందుకు ధన్యవాదాలు. అసలు ఈ పరిచయం ఇంకా బాగా కొటేషన్స్ కలిపి రాద్దామనుకున్నాను.. కానీ కొన్ని సమస్యల వల్ల రాయలేకపోయాను. అయినా మీ లాంటి పెద్దవారు దీన్ని చదివినందుకు చాలా ఆనంద పడుతున్నాను.
www.4job.in
Post a Comment