Pages

18/10/2010

Untouchable - Mulk Raj Anand






సత్యవతి గారి టపా చదివాక ఇది గుర్తు వచ్చింది. పాకీపని వాళ్ళమీద జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పద్యం కూడా గుర్తు వచ్చింది. కానీ ఇక్కడ చాలా లోతుగా హృదయాన్ని స్పృశించే అంశం - మన పాత కాలం నాటి అమానుష ఆచారాలు, కులం, వర్ణ వివక్ష! చిన్నప్పట్నించీ 'అంటరానితనం మహా పాపం అని నోటు పుస్తకాల అట్టల మీద చదువుతూ వచ్చి మడి కట్టుకున్న నానమ్మని సతాయించే మూర్ఖపు అమాయకత్వం నుంచీ ఎప్పుడు బైటికి వచ్చామో గుర్తు తెచ్చుకోవాలి. 

ఇప్పటికీ, భారత దేశంలో చాలా చోట్ల పారిశుధ్ధ పనివారు సత్యవతి గారు చెప్పిన విధానంలోనే మానవ వ్యర్ధాల్ని ఇంటింటి నుంచీ సేకరించి, తలలపై మోసి, శుభ్రపరిచే పనిలోనే జీవిస్తున్నారు. చీ ! అలాంటి వాళ్ళని ఎలా ముట్టుకోవడం ? ఈ ప్రాక్టీస్ - మనలాంటి ఇంకో మానవమాత్రుడు / స్త్రీ, మన నైర్మల్యాన్ని తాకడం, శుభ్రం చేయడం, అమానుషమని కొన్ని తరాల ముందు మాత్రమే, ఆలోచించడం జరిగింది. ఇప్పుడైతే, ఇది చట్ట ప్రకారం (కాయితాల మీద) అన్యాయం. ఈ రోజుల్లో, శౌచాలయాల సాంకేతికత పెరిగినా కూడా ఇలాంటి పద్ధతినొకటి మన దేశం ఇంకా వొదులుకోకపోవడం అన్యాయం. 

 అయితే, మనలో ఎందరు సత్యవతి గారిలా, మనసుతో ఆ భావాన్ని అనుభూతిస్తారు ? ఎవరు ఒక పారిశుద్ధ కార్మికుని మనోగతాన్ని అర్ధం చేసుకుంటారు ? హీనాతి హీనమైన ఆ బ్రతుకుని ఎవరు దగ్గరగా చూడగలరు ? ఎవరు ఆ బాధని అర్ధం చేసుకుంటారు ? సరిగ్గా ఇదే భావనతో ముల్క్ రాజ్ ఆనంద్ 'అన్ టచబుల్' అనే ఒక నవల ని 1935 లో రాసారు. దీనికి ముందుమాట ఈ.ఎం.ఫోర్స్టర్ (EM Forster) ది. 

ఈ కధ 18 ఏళ్ళ బాఖా ది. ఈ బాఖా, పెద్ద పాకీ మేస్త్రీ లాఖా కొడుకు. ఊరికి దూరంగా విసిరివేయబడిన అంటరానివారి కాలనీలో నివాసం. లాఖా కి కంటోన్మెంటు (Soldier's Barrack)  లో పని. బాఖా కి ఒక తమ్ముడు, ఒక చెల్లెలు. ప్రతి ఉదయం, వరుసగా కట్టిన లావెట్రీ లలో ఊరి వారు విసర్జించిన అశుద్ధాన్ని, వొంచిన తల ఎత్తకుండా, ఇసుకా, గడ్డీ కలిపి ఎత్తడం, వాళ్ళు తిట్టిన బూతుల్ని నోరెత్తకుండా వినడం, వేడి నీటిలాంటి 'చా' (Chai) తప్ప ఏమీ తీసుకోకుండా కాలే కడుపుతో మధ్యాహ్నం దాకా పని చేయడం - ప్రతిఫలంగా ఎంగిలివీ, అంటువీ, మిగిలిన రొట్టెలు ఎవరైనా ఇస్తే తినడం. ఇదే బాఖా జీవితం. 

బాఖా చెల్లెలు, యవ్వనంలో ఉన్న అందగత్తె. అంటరాని కులానికి చెందినదే అయినా, ఆమె సౌందర్యాన్ని అగ్రకులాల వాళ్ళు కూడా వక్ర దృష్టి తో చూడటం పరిపాటి. మంచినీళ్ళ బావి దగ్గర స్వయంగా నీరు తోడుకోవడానికి లేదు. ఈమె బాధ్యత, ఇంటి లొ వంట చేసి, తండ్రికీ, సోదరులకూ వడ్దించడం. వంట చేయడానికి ఏమీ ఉండదు కాబట్టి, కనీసం కడుపునిండా నీళ్ళయినా తాగడానికి మంచినీళ్ళకు వెళ్ళీ, బావికి కాస్త దూరంలో మిగిలిన నిమ్న జాతి స్త్రీల తో, వారికి కూడా కాస్త ఎడంగా కూర్చుని, ఏ పుణ్యాత్ముడో, దయతలచి, ఒక కడివెడు నీళ్ళు తోడి వీళ్ళకు పోస్తే సరి. లేకపోతే, ఆ నీళ్ళు కూడా దక్కవు. బావిని వీరు తాకడానికి లేదు. మౌనంగా ఎండలో ఎదురుచూడటమే వీరి పని. 

బాఖా తమ్ముడు కొంచెం పనిదొంగ. అందుకే, బాఖా, తండ్రి పని తలకెత్తుకుని వొళ్ళు చూసుకోకుండా ఈ పారిశుద్ధ్యపు పని చేస్తూనే, తన తోటివాళ్ళతో హాకీ ఆడటం కోసం మనసులోనే కలలు కంటూంటాడు. బాఖా కంటోన్మెంటు లో జవాల్న లెట్రిన్లు తుడుస్తూన్నప్పుడు అతనికో మంచి సిపాయితో పరిచయం కలుగుతుంది. బాఖా కు ఒక హాకీ కర్ర ని ఇస్తానని ఆ సిపాయి ప్రమాణం చేస్తాడు. బాఖా లాంటి అంటరానివాడు, ఈ సిపాయి ఏ పాత హాకీ కర్రనొ ఇస్తాడని భావిస్తాడు, తీరా ఆ సిపాయి సరికొత్త హాకీ కర్ర ని ఇచ్చేసరికి, బాఖ కు నమ్మశక్యం కాక, కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. ఆశ్చర్యంతో మాట రాదు. మనుషుల్లో ని ఆ మాత్రం కరుణ ని ఏనాడు ఎరిగి ఉండని అతని హృదయం ఆ ఆప్యాయ బహుమతి ని చూసి ఆనందంతో తన్మయమవుతుంది. 

Untouchable అంతా బాఖా జీవితంలో ఒక రోజు గురించి వివరిస్తుంది. ఈ ఒక్క రోజు చాలు. అంటరానితనం ఎంత హేయమైనదో పాఠకుడు అర్ధంచేసుకోవడానికి. బాఖా కళ్ళతో ప్రపంచాన్ని చూడటం, ఆ జీవితాన్ని జీవించడం - ఎంత కష్టమో తెలుసుకోవడానికి. అద్దంలో మన సమాజాన్ని చూసుకోవడానికి, సిగ్గుపడటానికి, ఈ పద్ధతులను నిరశించి, గాంధీ సృజించిన హరిజన పదం - ఎంత గొప్పదో అర్ధం చేసుకోవడానికి. 

కధలో హరిజనుల గురించి, అంటరాని, వెనుకబడిన కులాల వారిని ఆకర్షించడానికి చూసే ఇతర మత ప్రచారకులను, కొత్త (కధా కాలం నాటికి) శౌచ్య విధానాల (శుభ్రపరచేందుకు మనుష్యుల ప్రమేయం లేని) ప్రచారం గురించి యోచనా - ఇవన్నీ ఆసక్తికలిగిస్తాయి. వివిధం గా బాఖా లాంటి హరిజనుల జీవితాల్ని పరిచయం చేస్తూ, మానవత్వ భావనను విరజిమ్మే అన్ టచబుల్ ని తప్పకుండా చదవండి. టపా ఇన్నాళ్ళకి రాయడానికి స్ఫూర్తినిచ్చిన సత్యవతి గారికి ధన్యవాదాలు.





3 comments:

ఆత్రేయ said...

During 80's i had this book with me. i remember my dad bought and i added it to my collection. Unfortunate i lost it when i left home for job in 1989. u made me to recall my olden days where i read this book in my den(room). now u may ask me why i tell all these things ..to skip u from NO CO BLO SA ... yes u got a comment now ... go and tell the world proudly that a celebrity(?) commented on ur post .. go .. go.. go ( mee bujjamma chalaakee ayinda ?)

స్కైబాబ said...

mee ammaayi baagundi
skybaaba.blogspot.com

Sujata M said...

Oh wow. Thx andi. Chala late reply.. I'm so happy. Hope u will see this..