Pages

09/09/2010

నగరం మీద ప్రేమగీతం

టాంక్ బండ్ సన్నని నడుంచుట్టూ చెయ్యి చుట్టి
అందమైన నగర ముఖాన్ని దగ్గరగా తీసుకుని
ఆశలతో అలసమైన అబిడ్స్ కళ్ళలోకి చూసి
దీపాల వెలుతురు ప్రతిఫలించే చెక్కిళ్ళపై ముద్దు పెట్టుకో

సిగలో నౌపహాడ్ నాగరం తళుక్కున మెరుస్తుంది
బంజారాహిల్స్ వక్షోజాలుద్రిక్తంగ చలిస్తాయి
అలా అలా నైలాన్ చీరకింద మెత్తని గాగరాలో
సికిందరాబాద్ జఘనోరు సౌందర్యం నిన్ను కవ్విస్తుంది.

వేలవేల బార్లలో కొన్నివేల నిషాగీతాలమధ్య
బాళిగొలిపే జవరాలి నృత్యం పరవశింప చేస్తుంది.
ఓరగా తెరచిన జనానాల తలుపులలోంచి
ఉండి ఉండి నిలవగాలి వస్తుంది
హుసేన్ సాగర్ మీద ఒలికిన వెన్నెల లోంచి
ఒక విరహిణి మధు విషాదగాధ వినిపిస్తుంది.

వాడినపువ్వుల వాసన వేడివేడి పాదాలకు తగులుతుండగా
రోడ్లమీద అజ్ఞాతకామం ప్రతిరోజూ రాత్రి ప్రవహిస్తుంది.
తెలుగువాళ్ళ తెలివిలేనితనం ధోవతి కుచ్చెళ్ళతో పాటు మోటుగా
యం.యల్.ఏ.క్వార్టర్స్ దగ్గర యెబ్బెట్టుగా జీరాడుతుంది.
దర్బారులో సిగ్గుల్నీ, వగల్నీ ఒలకబోసే నెరజాణతనం నుండీ
దాపరికంలేని పారిశ్రామిక నాగరికతా నగ్నత్వంలోకి
ఎదుగుతూన్న నగరసుందరిని ఒదులొదులుగా కౌగలించుకో
మదం, మదం, మృగమద పరిమళం మత్తెక్కిన కన్నుమూతలో
పెట్రోలు వాసన ఫెళ్ళుమని తగిలి ఉలిక్కి పడతావు.

మూసీనది ముతకశృంగారాన్నే, పాపకశ్మలాన్నీ
మౌనంగా, దీనంగా మోసుకుపోతూ వుంటుంది,
ముసలిగద్ద చార్మినార్ మీద గత వైభవాన్ని తలుచుకుని
మూలుగుతూ ''మోసం!'' అని అరుస్తుంది.

అయినా యౌవనం తగ్గలేదు, లావణ్యం తగ్గలేదు
మెహబూబ్ జిందాబాద్ !
ఫ్యూడల్ రహస్యాల్ని నేటికి దాచుకున్న
పుండ్రేక్షు కోదండం హైదరాబాద్ !

-1956
- దేవరకొండ బాలగంగాధర తిలక్
(అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటి నుండీ)


{హైదరాబాద్ మీద కవిత అనేసరికీ ఇంటరెస్టింగ్ అనిపించి..}

9 comments:

Anonymous said...

దుర్భరమైన ట్రాఫిక్,పొల్యూషన్ తో పాటు పాపాలు కూడా భయంకరంగా పెరిగిన అభాగ్యనగరం

శ్రీలలిత said...

బలే బాగుందండీ కవిత.
చెప్పినదెవరు మరి...అంత గొప్పకవి.
ఆ కవితను గుర్తు చేసినందుకు ధన్యవాదలు

సుజాత వేల్పూరి said...

అమృతం కురిసిన రాత్రి నిండా నిజంగా అమృతమే!! ఒక్కో కవితా ఆణిముత్యం..... కాదు, ఇంకేదైనా ఉంటే బావుండు,పోల్చడానికనిపిస్తుంది.

ప్రతి కవితకూ ఎంత struggle అయ్యాడో తిలక్ అనే భావన కచ్చితంగా అనిపిస్తుంది.సైనికుడి ఉత్తరం,దీపం,పోస్టు బంట్రోటు..నగరం మీద ప్రేమగీతం...అన్నీ... అన్నీ కూడా!

ఇప్పటి హైదరబాదుని చూస్తే ఏమంటాడో తిలక్! ఎక్కిడి తొక్కిడిగా ట్రాఫిక్ జామూ,వాన కురిస్తే బురదానదీ ప్రవాహం,కనుచూపు మేరలో లేని పచ్చదనం..

ఏమో,ఇవన్నీ రోజూ చూస్తున్నా కూడా "అయినా యౌవనం తగ్గలేదు, లావణ్యం తగ్గలేదు
మెహబూబ్ జిందాబాద్ ! .."అనుకుంటాను నేనైతే! ఈ హైద్రాబాదు ఒక మాయాజాలం!

దీని మీద ప్రేమ వదిలించుకోవడం అంత వీజీ కాదు! :-))

భావన said...

నేను మొదటి సారి హైదరాబాద్వెళ్ళినప్పుడూఈ కవిత ను స్మరిస్తూ ఆయన చెప్పిన ప్లేసెస్ అన్ని చూసా... అప్పట్లో ఆయన కళ్ళలో ఇలా కనిపించిందికదా అని. మంచి కవిత కదు.

Padmarpita said...

మంచి కవితను గుర్తుచేసినందుకు...ధన్యవాదాలండి!

చందు said...

ennenni adbhuthalo ....!

aa pusthakam oka amrutham madhanam nijam gaa!!!
thanks alot malle gurthuku chesinanduku !!!

Sujata M said...

ఎనానిమస్సు గారు

నేనూ ఏకీభవిస్తాను. కానీ ఒకప్పుడు హైద్రాబాద్ అంటే ఏదో మహానగరం అన్నట్టు, చాలా మంచి ఫీలింగ్ వుండేది అనేది నిజం. ఏ మహానగరం చూసినా ఏమున్నది గర్వ కారణం.. ? ఒకేలాంటి సమస్యలు. ఎక్కడ జనాభా ఎక్కువుంటే వుంటే అక్కడ సమస్యలు తప్పవు.

Sujata M said...

భావన, శ్రీలలిత, సావిరహే, పద్మార్పిత గారు,

థాంక్స్. అంతా తిలక్ మాయ !

Sujata M said...

సుజాత గారు -

బావుంది. కనుచూపు మేరలో పచ్చదనం - మా టెర్రస్ మీదనుంచీ చాలానే పచ్చదనం కనిపిస్తుంటుంది. థాంక్స్ టు.. ఆర్మీ !